ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 47
అధ్యాయం : 47
పడమటికి నా తిరుగు ప్రయాణం
“నేను భారతదేశంలోనూ అమెరికాలోనూ యోగశాస్త్ర పాఠాలు చాలా చెప్పాను; కాని ఒక హిందువుగా, ఇంగ్లీషు విద్యార్థులకు క్లాసులు నడుపుతున్నందుకు అపూర్వమైన ఆనందం కలుగుతోందని చెప్పాలి.”
నా లండన్ క్లాసు విద్యార్థులు ప్రశంసాసూచకంగా నవ్వారు; రాజకీయ సంక్షోభాలేవీ మా యోగశాంతిని భంగపరచలేదు.
భారతదేశం ఇప్పుడు పవిత్ర స్మృతి మాత్రమే అయింది. అది 1936 లో సెప్టెంబరు నెల; లండన్‌లో ఉపన్యాసమిస్తానని పదహారు నెలల కిందట ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికని ఇప్పుడు నేను లండన్ వచ్చాను.
ఇంగ్లండు కూడా, అమరమైన యోగ సందేశాన్ని అందుకోవాలన్న ఉత్సుకతతో ఉంది. పత్రికావిలేఖరులూ న్యూస్ రీల్ కెమెరామెన్, గ్రాన్‌వెనార్ హౌస్‌లో నా బసకు వచ్చి ముసిరేశారు. వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ ఫెయిల్స్ తాలూకు బ్రిటిష్ జాతీయ మండలివాళ్ళు, వైట్‌ఫీల్డ్ కాంగ్రిగేషన్ చర్చిలో సెప్టెంబరు 29 న ఒక సమావేశం ఏర్పాటుచేశారు. ఆ సమావేశంలో నేను, “మైత్రీభావం మీద విశ్వాసం నాగరికతను ఎలా రక్షిస్తుంది?” అన్న బరువైన విషయం మీద మాట్లాడాను. కాక్స్‌టన్ హాలులో రాత్రి 8 గంటలకు జరిగిన ఉపన్యాసాలు శ్రోతల్ని ఎంత అధిక సంఖ్యలో ఆకర్షించాయంటే, వాళ్ళలో బయట మిగిలిపోయినవాళ్ళు, విండ్‌సార్ హౌస్ ఆడిటోరియంలో తొమ్మిదిన్నర గంటలకు జరిగే నా రెండో ఉపన్యాసం కోసం రెండు రాత్రిళ్ళు కాసుకుని ఉన్నారు. ఆ తరవాత జరిగిన యోగవిద్యా తరగతుల్ని శ్రీరైట్, మరో హాలుకు మార్చవలసినంత పెద్దగా పెరిగింది సంఖ్య.
ఇంగ్లీషువాళ్ళ పట్టుదల ఆధ్యాత్మిక బంధుత్వంలో ప్రశంసనీయంగా వ్యక్తమయింది. నేను ఆ దేశాన్ని విడిచి వచ్చిన తరవాత, లండన్ యోగ విద్యార్థులు నిష్ఠగా సెల్ఫ్ రియలై జేషన్ ఫెలోషిప్ కేంద్రాన్ని ఏర్పరచుకొని, ఘోరయుద్ధం జరుగుతున్న సంవత్సరాల్లో కూడా నియమ ప్రకారంగా వారానికోసారి ధ్యాన సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు.
ఇంగ్లండులో మరుపురాని రోజులు; కొన్నాళ్ళు లండన్‌లో నగర విహారం, తరవాత సుందరమైన పల్లెప్రాంతాల సందర్శన. బ్రిటిష్ చరిత్రలో నిలిచిపోయిన మహాకవులవీ వీరులవీ జన్మస్థలాలూ సమాధులూ చూడ్డానికి నేనూ, శ్రీరైట్ నమ్మకంగా పనిచేసే ఫోర్డుకారునే ఉపయోగించాం.
మా చిన్న బృందం అక్టోబరు చివరిలో, “బ్రేమన్” ఓడలో సౌదాంప్టన్ నుంచి అమెరికాకు బయలుదేరింది. న్యూయార్కు రేవులో ఉన్న గంభీరమైన శ్టాచూ ఆఫ్ లిబర్టీ కంటబడేసరికి మా గుండెలు ఆనందంతో ఎగిసిపడ్డాయి.
మా ఫోర్డుకారు, సనాతన భూముల్లో పడ్డ అవస్థలవల్ల ఒక రవ్వ దెబ్బతిన్నప్పటికీ దృఢంగానే ఉంది; ఇప్పుడది కాలిఫోర్నియాకు ఖండాంతరయానం చేస్తూ చురుకుగా ముందుకు సాగింది. 1936 ముగుస్తుందనగా, మౌంట్ వాషింగ్టన్ కేంద్రానికి చేరాం. లాస్ ఏంజిలస్‌లో ప్రతిఏటా సంవత్సరాంతం సెలవుల్లో ఉత్సవాలు జరుపుతారు. డిసెంబరు 24 (ఆధ్యాత్మిక క్రిస్మస్)[1] నాడు వరసగా ఎనిమిది గంటలపాటు సామూహిక ధ్యానం జరుగుతుంది. ఆ మర్నాడు విందు (సామాజిక క్రిస్మస్). ఈ ముగ్గురు ప్రపంచ యాత్రికులకూ పునరాగమన సందర్భంగా స్వాగతం చెప్పడానికి దూరదూరాల్లో ఉన్న నగరాల్నించి ప్రియమిత్రులూ విద్యార్థులూ రావడంవల్ల ఈ సంవత్సరం ఉత్సవాలు ఇతోధికంగా జరిగాయి.
క్రిస్మస్‌నాటి విందులో, ఆ శుభసందర్భం కోసం పదిహేను వేల మైళ్ళ నుంచి తెచ్చిన నాజూకు వస్తువులు ఎన్నో ఉన్నాయి: కాశ్మీరు నుంచి గుచ్చీ పుట్టగొడుగులు, డబ్బాల్లో పెట్టిన రసగుల్లాలు, మామిడి తాండ్ర, అప్పడాలు, ఐస్‌క్రీం గుబాళింపుకోసం వెయ్యడానికి తెచ్చిన తెచ్చిన కేవడా పూలనూనె. ఆనాటి సాయంత్రం మేము, కళ్ళు మిరుమిట్లు గొలిపే పెద్ద క్రిస్మస్ చెట్టు చుట్టూ చేరాం; దానికి దగ్గరిలోనే సుగంధం వెదజల్లే సైప్రస్ కొయ్యదుంగలతో మండుతున్న నిప్పుగూడు ఉంది.
ఇక కానుకలందించే సమయం! నేల నాలుగు చెరగులనుంచీ తెచ్చిన కానుకలు - పాలస్తీనా, ఈజిప్టు, భారతదేశం, ఇంగ్లండు, ఫ్రాన్సు, ఇటలీ దేశాలనుంచి తెచ్చినవి. అమెరికాలోని ప్రేమాస్పదులకోసం ఉద్దేశించిన ఈ నిధుల్ని, ఏ దొంగ చేతికి చిక్కకుండా కాపాడ్డం కోసం, వాటిని భద్రపరిచిన పెట్టెల్ని ప్రతి విదేశపు కూడలిలోనూ శ్రీరైట్ ఎంత శ్రమతీసుకుని లెక్క పెడుతూ ఉండేవాడో! పుణ్యభూమి పాలస్తీనా నుంచి పవిత్రమైన ఆలివ్ ధాతుఫలకాలు, బెల్జియం హాలండ్‌ల నుంచి నాజూకు లేసులూ కసీదాలూ, పెర్షియన్ తివాసీలూ సున్నితంగా నేసిన కాశ్మీరు శాలువలూ, మైసూరు నుంచి తెచ్చిన గంధపుచెక్క పళ్ళాలు, మధ్య పరగణాల నుంచి “నంది కంటి” రాళ్ళు, ఏనాడో గతించిన భారతీయ రాజవంశాల వాళ్ళ నాణేలూ, రత్నఖచితమైన పూల కూజాలూ కప్పులూ సూక్ష్మచిత్రాలూ, గోడలకు వేలాడదీసే పటచిత్రాలూ, పూజా పరిమళద్రవ్యాలూ, డిజైన్లు అద్దిన స్వదేశీ నూలు అద్దకంబట్టలూ, లక్క సామగ్రీ, మైసూరు దంతం నగిషీ సామగ్రీ, మొనదేలిన పొడుగాటి పెర్షియన్ చెప్పులూ, అపురూప చిత్రరచనగల రాతప్రతులూ, ముఖమల్‌బట్టలూ, బ్రాకేడ్లూ, గాంధీ టోపీలూ, పింగాణి పాత్రలూ, ఇత్తడి సామానూ, ప్రార్థనకు కూర్చోడానికి వేసుకొనే గొంగళ్ళూ- ఒక టేమిటి, మూడు ఖండాలనుంచి కొల్లగొట్టుకు వచ్చిన సామగ్రి వాటిలో ఉంది.
చెట్టుకింద పేర్చిన పెద్ద గుట్టలోంచి అందంగా ఆచ్ఛాదన చేసి, పెట్టిన పెట్టెలు తీసి ఒకదాని తరవాత ఒకటి పంచిపెట్టాను.
“సిస్టర్ జ్ఞానమాతా!” మృదుస్వభావమూ గౌరమైన ఆత్మ దర్శనమూ కలిగిన సాధువర్తనురా లీమె; నేను దేశంలో లేని సమయంలో మౌంట్ వాషింగ్టన్ కేంద్రం నిర్వహణ భారం వహించిన ఈ అమెరికా మహిళకు పొడుగాటి పెట్టె ఒకటి అందించాను. ఉల్లిపొర కాయితాలు విప్పి, బంగారు జరీగల బనారసు పట్టుచీర ఒకటి పెట్టెలోంచి పైకి తీసిందావిడ.
“థాంక్యూ సార్; ఇది భారతదేశం కళా వైభవాన్ని కళ్ళకు కట్టిస్తోంది.”
“మిస్టర్ డికిన్సన్!” తరవాతి కానుక, నేను కలకత్తా బజారులో కొన్నది. “డికిన్సన్‌గారి కిది బాగా నచ్చుతుంది,” అనిపించింది నాకు, కొంటున్నప్పుడు. ప్రియశిష్యుడైన శ్రీ ఇ. ఇ. డికిన్సన్ 1925 లో మౌంట్ హషింగ్టన్ కేంద్రాన్ని స్థాపించినప్పటినించి ప్రతి క్రిస్మస్ మహోత్సవానికీ హాజరవుతున్నాడు.
ఈ పదకొండో వార్షికోత్సవంలో, ఆయన నా ఎదుట నిలబడి పొడుగాటి ఒక పెట్టెకు కట్టిఉన్న రిబ్బన్లు విప్పుతున్నాడు.
“వెండికప్పు!” భావోద్రేకంతో పెనుగులాడుతూ ఆయన, పొడుగాటి వెండికప్పు కేసి తేరిపారి చూశాడు. దిమ్మెర పోయినట్టు అయి దూరంగా ఒక కుర్చీలో కూర్చున్నాడు. శాంటా క్లాస్‌గా నేను నిర్వహిస్తున్న పాత్రను కొనసాగించేముందు, నేను ఆయనవేపు చూసి ఆప్యాయంగా చిరునవ్వు నవ్వాను.
కానుకలన్నీ ప్రసాదించే దేవుణ్ణి తలుచుకుని కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన జరపడంతో సాయంకాల కార్యక్రమం ముగిసింది; ఆ తరవాత సామూహికంగా క్రిస్మస్ గీతాల బృందగానం జరిగింది.
తరవాత ఒకసారి శ్రీ డికిన్సనూ నేనూ ఇష్టాగోష్టిగా ముచ్చటించుకున్నాం.
“సార్, నాకు వెండికప్పు ఇచ్చినందుకు మీ కిప్పుడు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను,” అన్నాడాయన. “ఆ కానుక మీ కోసం ప్రత్యేకంగా తెచ్చాను.”
“ఆ వెండికప్పు కోసం నేను నలభైమూడేళ్ళుగా ఎదురుచూస్తున్నానండి! అదో పెద్ద కథ; ఇంతకాలం దాన్ని నా గుండెల్లోనే దాచిపెట్టుకున్నాను.” శ్రీ డికిన్సన్ సిగ్గుపడుతూ నావేపు చూశాడు. ఈ కథ నాటకీయంగా మొదలవుతుంది: నేను మునిగిపోతున్నాను, మా అన్నయ్య తమాషాకి నన్ను ఒక నీళ్ళ మడుగులోకి నెట్టేశాడు. అది పదిహేనడుగుల లోతుంది. నెబ్రాస్కా పట్నంలో ఉందది. అప్పటికి నాకు ఐదేళ్ళే. నేను రెండోసారి నీళ్ళలో మునిగిపోతూండగా, కళ్ళు మిరుమిట్లు గొలిపే వన్నెవన్నెల వెలుతురు ఒకటి కనిపించింది; చుట్టుపక్కలంతా ఆ వెలుతురుతో నిండిపోయింది. దాని మధ్యలో ఒక మనిషి ఆకారం కనిపించింది; ఆయన కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి; ఆయన చిరునవ్వు నాకు అభయమిస్తున్నట్టు ఉంది. నా శరీరం మళ్ళీ మూడోసారి మునకవేస్తూ ఉండగా మా అన్నయ్య స్నేహితుల్లో ఒకతను, సన్నగా పొడుగ్గా ఉన్న విలో చెట్టుకొమ్మ ఒకటి అందుకుని బాగా కిందికి వంచాడు; నిస్సహాయస్థితిలో ఉన్న నేను, దాన్ని వేళ్ళతో గట్టిగా పట్టేసుకున్నాను. పిల్లలందరూ కలిసి నన్ను ఒడ్డుకెక్కించి ప్రథమచికిత్స చేశారు.
“పన్నెండేళ్ళ తరవాత – పదిహేడేళ్ళ వయస్సులో - నేను మా అమ్మతో కలిసి షికాగో వెళ్ళాను. 1893 సెప్టెంబరు నెల అది. వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్ (ప్రపంచ మత మహాసభ) అన్న మహాసభలు జరుగుతున్న రోజులవి. ఒక పెద్ద వీధిలో నేనూ మా అమ్మా కలిసి వెళ్తూ ఉండగా నేను మళ్ళీ ఉజ్వలమైన ఒక పెద్ద మెరుపు చూశాను. మాకు కొన్ని అడుగులముందు, నింపాదిగా నడుచుకుంటూ వెళ్తున్నాయన ఒకరు కనిపించారు. కొన్నాళ్ళ కిందట నాకు అంతర్దర్శనంలో కనిపించిన వారు ఆయనే. ఒక పెద్ద సభామందిరానికి చేరి, గుమ్మం దాటి ఆదృశ్యమయారు.
“ ‘అమ్మా, అమ్మా! నేను మునిగిపోతున్న సమయంలో కనిపించినాయన ఆయనే నమ్మా” అని అరిచాను.
“అమ్మా నేనూ గబగబా ఆ భవనంలోకి చొరబడ్డాం; ఆయన ఉపన్యాసవేదిక మీద కూర్చుని ఉన్నారు. ఆయన భారతదేశం నుంచి వచ్చిన స్వామి వివేకానందగారు[2] అని త్వరలోనే తెలుసుకున్నాం. ఆయన ఆత్మోత్తేజం కలిగించే ప్రసంగం చేసిన తరవాత, ఆయన్ని కలుసుకోడానికి నేను ముందుకు వెళ్ళాను. అప్పటికే మేము పాతస్నేహితులమయినట్టు, ఆయన నావేపు చూసి మృదువుగా చిరునవ్వు నవ్వాడు. నేను చిన్నవాణ్ణి అవడంవల్ల నా మనస్సులో ఉన్న భావాల్ని ఎలా చెప్పాలో తెలియలేదు; కాని ఆయన నాకు గురువుగా ఉంటానని ఆయనే చెబుతారేమోనని ఆశపడ్డాను. ఆయన నా ఆలోచన పసిగట్టారు.
“ ‘కాదు నాయనా, నేను నీ గురువును కాను.’ అందమైన కళ్ళతో నా కళ్ళలోకి గుచ్చిగుచ్చి చూశారు వివేకానందగారు. ‘నీ గురువు తరవాత వస్తాడు. ఆయన నీకో వెండికప్పు ఇస్తాడు.’ అన్నారు. తరవాత కొంతసేపు ఆగి చిరునవ్వు నవ్వుతూ, ‘నువ్విప్పుడు భరించగలవాటికన్న అధికంగా ఆశీస్సులు కురిపిస్తాడాయన,’ అన్నారు.
“మరి కొద్దిరోజుల్లో నేను షికాగో నుంచి వచ్చేశాను,” అంటూ చెప్పసాగాడు శ్రీ డికిన్సన్. వివేకానంద అనే ఆ మహావ్యక్తిని నేను మళ్ళీ ఎన్నడూ చూడలేదు. కాని ఆయన పలికిన ప్రతి పలుకూ నా అంతశ్చేతనలో చెరగని అక్షరాల్లా ముద్ర పడిపోయింది. ఏళ్ళు గడిచిపోయాయి; కాని నా గురువెవరూ కనిపించలేదు. 1925 లో ఒకనాటి రాత్రి నా గురువును పంపమని ప్రభువును గాఢంగా ప్రార్థించాను. కొన్ని గంటల తరవాత, శ్రావ్యమైన మృదుసంగీత ధ్వనులతో నాకు మెలకువ వచ్చింది. పిల్లంగోవులూ ఇతర వాద్యపరికరాలూ పట్టుకున్న దేవతల బృందం ఒకటి నా కంటికి అవుపడింది. గాలిలో దివ్యసంగీతం నింపుతూ ఆ దేవతలు మెల్లగా అదృశ్యమయారు.
“మర్నాటి సాయంత్రం, మొట్టమొదటిసారిగా, ఇక్కడ లాస్ ఏంజిలస్‌లో మీ ఉపన్యాసం ఒకటి విన్నాను, దేవుడు నా ప్రార్థనను మన్నించాడని అప్పుడు తెలుసుకున్నాను.”
ఇద్దరం ఒకరివేపు ఒకరు చూస్తూ మౌనంగా చిరునవ్వు నవ్వు కున్నాం.
“ఇప్పటికి పదకొండేళ్ళబట్టి నేను మీ క్రియాయోగ శిష్యుణ్ణి,” అంటూ కొనసాగించాడు శ్రీ డికిన్సన్. “అప్పుడప్పుడు ఆ వెండికప్పు సంగతి తలుచుకునేవాణ్ణి; వివేకానందగారి మాటలు కేవలం అలంకారికంగా అన్నవేమోనని నన్ను నేను సమాధానపరుచుకుంటూ ఉండేవాణ్ణి.”
“కాని క్రిస్మస్‌నాటి రాత్రి మీరు ఆ చెట్టుదగ్గర, నా చేతికి పెట్టె అందిస్తూ ఉండగా, నా జీవితంలో మూడోసారి, కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ కాంతిపుంజాన్ని మళ్ళీ చూశాను. మరుక్షణంలో, నా గురువుగారు ఇచ్చిన కానుక - నలభై మూడు సంవత్సరాల కిందటే వివేకానందగారు భవిష్యత్ దర్శనం చేసిన కానుక - వెండికప్పు నా కంటబడింది!”[3]
- ↑ డిసెంబరు 23 న రోజుంతా ధ్యానం చేసే పద్ధతి 1950 నుంచి అమలులో ఉంది. ఈ విధంగా ప్రపంచమంతటా ఉన్న సభ్యులు ఈ ప్రత్యేక దినాన తమ ఇళ్ళలోనూ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాల్లోనూ ఆలయాల్లోనూ క్రిస్మస్ పండుగ చేసుకోడమే కాకుండా, ప్రధాన కార్యాలయంలో ధ్యానానికి సమావేశమయిన భక్తులతో ఏర్పడే ఆధ్యాత్మిక అనుసంధానంవల్ల గొప్ప ఆధ్యాత్మిక ఉపకారం, ఆశీస్సులు పొందుతున్నారు. ఏదైనా ఒక ప్రత్యేక సమస్య పరిష్కరించుకోవాలని కాని, తొలగించుకోవాలని కాని కోరేవాళ్ళకోసం ప్రతి రోజూ, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రధాన కేంద్రంతోనూ ప్రార్థన మండలితోనూ అనుసంధానం ఏర్పరుచుకున్నవాళ్ళు ఏ సమయంలోనయినా సరే, అదే మాదిరి దివ్యోద్ధరణ లాభం పొందవచ్చు. (ప్రచురణకర్త గమనిక).
- ↑ క్రీస్తువంటి మహామహులైన రామకృష్ణ పరమహంస ముఖ్య శిష్యులు.
- ↑ శ్రీ డికిన్సన్ స్వామి వివేకానందగారిని 1893 సెప్టెంబరులో కలుసుకున్నారు. పరమహంస యోగానందగారు పుట్టింది అదే సంవత్సరం (జనవరి 5న). యోగానందగారు మళ్ళీ పుట్టినట్టూ, భారతీయ దర్శనశాస్త్రాన్ని బోధించడానికి ఆయన అమెరికా వెళ్ళబోతున్నట్టూ వివేకానందగారికి తెలుసునని దీనివల్ల స్పష్టమవుతున్నది.
శ్రీ డికిన్సన్ 89 ఏళ్ళ వయస్సులో కూడా మంచి ఆరోగ్యంగా, చురుకుగా ఉంటూ 1965 లో ‘యోగాచార్య’ అనే బిరుదు పొందారు; లాస్ ఏంజిలస్‌లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటయిన ఉత్సవంలో ఈ బిరుదు ప్రదానం జరిగింది. ఈయన తరచుగా పరమహంసగారితో కలిసి చాలాసేపు ధ్యానం చేస్తూ ఉండేవారు; క్రియాయోగ సాధన ఎన్నడూ మానకుండా, రోజుకు మూడుసార్లు చేస్తూండేవారు. యోగాచార్య డికన్సన్ 1967 జూన్ 30 న పోయారు. ఇంకో రెండేళ్ళకు పోతారనగా ఈయన, ఎన్. ఆర్. ఎఫ్. సన్యాసుల సమావేశంలో ప్రసంగించారు. ఆ సందర్భంలో, పరమహంసగారికి చెప్పడం మరిచిపోయిన ఆసక్తికరమైన అంశం ఒకటి శ్రోతలకు చెప్పారాయన. యోగాచార్య డికిన్సన్ ఇలా అన్నారు: “స్వామి వివేకానందగారితో మాట్లాడ్డానికి నేను ఉపన్యాసవేదిక ఎక్కి వెళ్ళినప్పుడు, నేను ఆయనకు సమస్కరించేలోగానే ఆయన ఇలా అన్నారు: “ ‘అబ్బాయ్, నువ్వు నీళ్ళకి దూరంగా ఉండాలి.’ ”
(ప్రచురణకర్త గమనిక )