ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 31

వికీసోర్స్ నుండి

అధ్యాయం : 31

పూజ్యమాతతో

సమావేశం

“పూజ్యమాతాజీ, పసితనంలో నన్ను దీవెనతో అనుగ్రహించిన వారు అవతారపురుషులైన మీ పతిదేవులు. వారు మా తల్లిదండ్రులకీ, నా గురుదేవులైన శ్రీయుక్తేశ్వర్‌గారికి కూడా గురువులు. కనక, మీ పావన జీవనంలోని సంఘటనలు కొన్ని వినే మహదావకాశం నాకు ఇస్తారా?”

లాహిరీ మహాశయుల జీవిత సహధర్మచారిణి అయిన శ్రీమతి కాశీమణిగారిని ఇలా అడిగాను. కొద్దికాలం కాశీలో ఉండే అవకాశాన్ని వినియోగించుకుని ఈ పూజ్యురాలిని దర్శించాలని ఎంత కాలంగానో ఉన్న కోరిక ఇప్పుడు తీర్చుకుంటున్నాను.

లాహిరీ కుటుంబంవారి నివాసగృహంలో, ఆవిడ నాకు ఆదరపూర్వకంగా స్వాగతమిచ్చారు; ఆ ఇల్లు కాశీలో గురుడేశ్వర మొహల్లా అనే పేటలో ఉంది. వయస్సు పైబడినప్పటికీ ఆవిడ, ఆధ్యాత్మిక సుగంధాన్ని వెదజల్లే పద్మంలా ఉన్నారు. ఆవిడది మధ్యరకం శరీరం; పసిమి చాయ, సన్నని మెడ, కాంతిమంతమైన విశాల నేత్రాలు.

“రా నాయనా, నువ్వు రావడం చాలా సంతోషం. మేడమీదికి రా.”

కాశీమణిగారు తమ పతిదేవులతో కొంతకాలం కాపురమున్న ఒక చిన్న గదిలోకి దారి తీశారు. సాటిలేని ఆ మహానుభావులు, దాంపత్యమనే మానవ నాటకంలో తమ పాత్ర నిర్వహించడానికి దిగివచ్చి పావనంచేసిన మందిరాన్ని దర్శించడం నా భాగ్యంగా భావించాను. ఆ దయామయి నన్ను తమ పక్కనే ఒక మెత్తమీద కూర్చోబెట్టుకున్నారు.

“నేను మావారి దివ్యమహత్వాన్ని గ్రహించడానికి చాలా ఏళ్ళు పట్టింది,” అంటూ ప్రారంభించా రావిడ. “ఒకనాడు రాత్రి, ఈ గదిలోనే నాకు స్పష్టమైన కల ఒకటి వచ్చింది. వెలుగులు విరజిమ్మే దేవదూతలు, ఊహకు అందనంత సుకుమారంగా, నాకు పైన, గాలిలో తేలుతున్నారు. ఆ దృశ్యం ఎంత వాస్తవికంగా ఉందంటే, నాకు వెంటనే మెలుకువ వచ్చింది; చిత్రంగా, గది అంతా కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో నిండిపోయింది.

“మావారు పద్మాసనంలో ఉండి, గది మధ్యలో గాలిలో తేలుతున్నారు; దేవదూతలు ఆయన్ని చుట్టి ఉన్నారు. వారు వినయ విధేయతలతో చేతులు జోడించి మావారికి మొక్కుతున్నారు.

“అపరిమితంగా ఆశ్చర్యచకితురాల్ని అయి, నే నింకా కల గంటూనే ఉన్నానని సమాధాన పడ్డాను.

“ ‘నువ్వు కలగనడం లేదు. నీ నిద్ర విడిచిపెట్టు - ఎప్పటికీ, ఎల్లప్పటికీ.’ అంటూ వారు మెల్లగా నేలకు దిగివస్తూ ఉండగా, వారి పాదాల దగ్గర మోకరిల్లాను.”

" ‘గురుదేవా,’ అంటూ అరిచాను. ‘మీకు మరీమరీ మొక్కుతాను! ఇంతకాలం మిమ్మల్ని నా భర్తగా భావించినందుకు క్షమిస్తారా నన్ను? నే నింతకాలం, దివ్యజాగృతి పొందినవారి పక్కనే ఉంటూ, అజ్ఞానంతో నిద్రలో ఉండిపోయానని తెలుసుకుని సిగ్గుతో చచ్చిపోతున్నాను. ఈ పూటనుంచి మీరు నాకు భర్త కారు, నా గురుదేవులు. ఈ అల్పాత్మురాలిని మీ శిష్యురాలిగా స్వీకరిస్తారా?”[1]

“గురుదేవులు నన్ను మృదువుగా స్పృశించారు. పవిత్రాత్మా, లే! నిన్ను స్వీకరించడమైంది.’ వారు దేవదూతలవేపు చూపించారు. ‘ఈ పావన సాధుపుంగవు లొక్కొక్కరికే ప్రణామం చెయ్యి.’

“నేను ప్రణామాంజలులు అర్పించడం పూర్తి అయిన తరవాత, ఆ దేవదూతల కంఠస్వరాలన్నీ కలిసి సామవేదగానంలా ధ్వనించాయి.

“ ‘దివ్యపురుష సహధర్మచారిణీ, నువ్వు ధన్యజీవివి. నీ కివే మా నమస్సులు’ అంటూ వారు నా పాదాలకు నమస్కరించారు. కాని ఆశ్చర్యం! వారి తేజోరూపాలు చటుక్కున మాయమయాయి. గది చీకటి అయిపోయింది.

“గురుదేవులు నన్ను క్రియాయోగ దీక్ష తీసుకోమన్నారు.”

“ ‘తప్పకుండా. ఆ అదృష్టం ఇంతదాకా పొందకపోయినందుకు విచారిస్తున్నాను.’ ”

“ ‘అప్పటి కింకా కాలం పరిపక్వం కాలేదు,’ అంటూ లాహిరీ మహాశయులు, ఓదార్పుగా చిరునవ్వు నవ్వారు. ‘నీ కర్మను నువ్వు చాలా మట్టుకు నశింపజేసుకోడానికి నేను గోప్యంగా సాయపడ్డాను. నువ్విప్పుడు సుముఖంగా, సిద్ధంగా ఉన్నావు’

“వారు నా నుదుటిని తాకారు. సుళ్ళు తిరిగే వెలుతురు ముద్దలు కనిపించాయి; ఆ వెలుతురు క్రమక్రమంగా నీలోపల వర్ణంగల ఆధ్యాత్మిక నేత్రంగా మారింది; దాని చుట్టూ బంగారు కడియం, మధ్యలో తెల్లటి ఐదు మొనల నక్షత్రం ఏర్పడ్డాయి. “ ‘నీ చైతన్యం ఈ నక్షత్రం గుండా అనంత సామ్రాజ్యంలోకి చొచ్చుకుపోయేటట్టు చెయ్యి.’ నా గురుదేవుల గొంతులో ఒక కొత్త స్వరం ధ్వనించింది, దూరంనుంచి వినవచ్చే సంగీత మార్దవంలా.

“అనేక అంతర్దృశ్యాలు - ఒకదాని తరవాత మరొకటి, నా ఆత్మ సాగర తీరాల మీద విరిగిపడే సముద్రపు నురగలా కనిపించాయి. ఆ సర్వదిగ్దర్శక గోళాలన్నీ చివరికి ఆనంద సాగరంలో కరిగిపోయాయి. అంతులేకుండా అలలు అలలుగా ఉప్పొంగుతున్న ఆ ఆనందసాగరంలో నన్ను నేను మరిచిపోయాను. కొన్ని గంటల తరవాత నాకు బాహ్య స్పృహ వచ్చినప్పుడు, గురుదేవులు నాకు క్రియాయోగ దీక్ష ఇచ్చారు.

“ఆ రాత్రి మొదలు లాహిరీ మహాశయులు, మరెన్నడూ నా గదిలో నిద్రపోలేదు; ఆ తరవాత వారు, అసలు నిద్రపోలేదు. రాత్రీ పగలూ కూడా మేడ కింది ముందరి గదిలోనే శిష్యులతోబాటు ఉండిపోయారు.”

ఇంతమట్టుకు చెప్పి ఆ పుణ్యశీల మౌనం వహించారు. ఆ మహా యోగితో ఆవిడకుగల సంబంధానికి ఉన్న విశిష్టతను గ్రహించి, మరికొన్ని జ్ఞాపకాలు చెప్పమని ఆవిణ్ణి అడగడానికి సాహసించాను.

“అబ్బాయి, నువ్వు ఆబగా ఉన్నావు. అయినా ఇంకొక్క కథ చెబుతాను,” అంటూ సిగ్గుగా చిరునవ్వు నవ్వారావిడ, “నా గురు-పతిదేవుల విషయంలో నేను చేసిన పాపం ఒకటి నీ దగ్గిర చెప్పుకుంటాను. నాకు దీక్ష ఇచ్చిన కొన్ని నెల్లకి, నేను ఏకాకినై పోయినట్టూ నా సంగతి ఎవరూ పట్టించుకోనట్టూ బాధపడడం మొదలుపెట్టాను. ఒకనాడు పొద్దున లాహిరీ మహాశయులు, ఏదో వస్తువు తీసుకువెళ్ళడంకోసం ఈ చిన్న గదిలోకి వచ్చారు. నేనూ గబగబా వారి వెనకాలే వచ్చాను. నన్ను మాయ, కమ్మేసినందువల్ల ఆయనతో కఠినంగా మాట్లాడాను. “ ‘ఎంతసేపూ మీరు మీ శిష్యులతోనే కాలక్షేపం చేస్తూంటారు. పెళ్ళాం పిల్లల గురించి మీ బాధ్యతల మాట ఏమిటి? ఇంట్లోవాళ్ళకోసం ఇంకొంచెం డబ్బు సంపాయించాలన్న ధ్యాసే మీకు లేకుండాపోయిందని నా విచారం.’ ”

“గురుదేవులు ఒక్క క్షణం నావేపు చూశారు; అంతే! అప్పుడే అదృశ్యమయారు. భయాశ్చర్యాలు పెనవేసుకొని పోగా, గదిలో అన్ని వేపులనుంచి ప్రతిధ్వనిస్తున్న స్వరం ఒకటి విన్నాను:

“ ‘అంతా శూన్యం; కనబడ్డం లేదూ? నాలాంటి శూన్యం నీకోసం సంపద లెలా సంపాయించగలదు?’ ”

“ ‘గురూజీ,’ అని పిలిచాను. ‘లక్షమాట్లు క్షమాపణ చెప్పుకుంటాను మీకు! నా పాపిష్టి కళ్ళు మిమ్మల్ని చూడలేకపోతున్నాయి; మీ పావన రూపంలో నాకు దర్శన మియ్యండి.’ ”

“ ‘ఇక్కడున్నాను.’ ఈ జవాబు పైనించి వచ్చింది. కళ్ళు పైకెత్తి చూద్దును కదా, గురుదేవులు గాలిలో సాక్షాత్కరించి ఉన్నారు; వారి తల గది కప్పును తాకుతోంది. చూసేవాళ్ళ కళ్ళు పోయేటంత తీవ్రమైన మంటల్లా ఉన్నాయి వారి కళ్ళు. భయంతో వజవజ వణుకుతూ, వారు ప్రశాంతంగా నేలకు దిగివచ్చిన తరవాత ఏడుస్తూ, వారి పాదాలమీద పడిపోయాను.

“ ‘దివ్యసంపత్తిని అన్వేషించు; పనికిమాలిన ముచ్చిబంగారాన్ని కాదు. లోపలి నిధిని కూర్చుకున్నాక, బయటి సంపత్తులు ఎప్పుడూ వస్తూ ఉండడం నువ్వే చూస్తావు,” అన్నారు వారు. ఆ తరవాత, ‘నా ఆధ్యాత్మిక సంతానంలో ఒకడు, నీ పోషణకోసం కొంత సమకూరుస్తాడు.’ ” “నా గురుదేవుల మాటలు సహజంగా నిజమయాయి; ఒక శిష్యుడు చెప్పుకోదగినంత మొత్తం మా కుటుంబం కోసం ఏర్పాటుచేశాడు.”

కాశీమణిగారు అద్భుతమైన తమ అనుభవాలు నాకు చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపాను.[2] ఆ మర్నాడు నేను మళ్ళీ ఆవిడ ఇంటికి వెళ్ళి తిన్‌కౌడి, దుకౌడి లాహిరీలతో దార్శనిక చర్చ చేస్తూ చాలా గంటలసేపు ఆనందంగా గడిపాను. సాధుస్వభావులయిన వీరిద్దరూ, భారతదేశపు మహా యోగులయిన లాహిరీ మహాశయుల పుత్రులు; వీరు తండ్రిగారి ఆదర్శాల అడుగు జాడల్లోనే నడిచారు. ఇద్దరిదీ పసిమి చాయ; ఎత్తరులు, దృఢ కాయులు; బవిరి గడ్డాలూ మృదుస్వరాలూ, ఆచారవిచారాల్లో పాతకాలపు పద్ధతులూ కనిపిస్తాయి.

లాహిరీ మహాశయుల భార్య ఒక్కరే ఆయనకు శిష్యురాలు కారు; మా అమ్మతో సహా, ఇంకా కొన్ని వందలమంది ఉన్నారు. ఒకసారి ఒక శిష్యురాలు ఆయన ఫోటో ఒకటి కావాలని గురువుగారిని అడిగింది. ఆవిడకు ఒక కాపీ ఇస్తూ, ఆయన ఇలా అన్నారు: “దీన్ని నువ్వు రక్షగా తలిస్తే అలాగే ఉంటుంది; లేకపోతే ఉత్తి బొమ్మే.”

ఆ తరవాత కొన్నాళ్ళకి, ఈవిడా, లాహిరీ మహాశయుల కోడలూ కలిసి భగవద్గీత చదువుతూ ఉండడం తటస్థించింది. భగవద్గీత బల్ల మీద పెట్టుకున్నారు. బల్ల వెనకాల గురువుగారి ఫొటో గోడకు వేలాడుతూ ఉంది. ఇంతలో మహా ప్రచండమైన ఉరుములూ మెరుపులతో గాలి వాన మొదలయింది; పిడుగులు పడుతున్నాయి.

“లాహిరీ మహాశయా, మమ్మల్ని రక్షించండి!” - అంటూ, ఆ ఆడవాళ్ళిద్దరూ పటం ముందు తలవాల్చి మొక్కారు. బల్ల మీదున్న పుస్తకం మీద పిడుగు వచ్చి పడింది; కాని భక్తురాళ్ళిద్దరూ చెక్కు చెదరలేదు.

“మలమలమాడ్చే ఆ వేడి నుంచి కాపాడ్డానికి, నా చుట్టూ మంచు గడ్డలు పేర్చినట్టు అనిపించింది,” అని చెప్పింది శిష్యురాలు.

అభయ అనే శిష్యురాలి విషయంలో లాహిరీ మహాశయులు రెండు అలౌకిక అద్భుతాలు చేశారు. ఆవిడా, ఆవిడ భర్తా - ఈయన కలకత్తాలో లాయరు - కలిసి గురువుగారి దర్శనం కోసం ఒకనాడు కాశీకి బయలుదేరారు. రోడ్డు మీద రద్దీ ఎక్కువగా ఉండడంవల్ల, వాళ్ళ బండి ఆలస్యమయింది; వాళ్ళు కలకత్తాలో హౌరా మెయిన్ స్టేషన్‌కు చేరేసరికి, కాశీకి వెళ్ళే రైలు బయలుదేరడానికి సిద్ధంగా కూత వేస్తోంది.

టిక్కెట్ ఆఫీసు దగ్గిర అభయ ప్రశాంతంగా నించుంది.

“లాహిరీ మహాశయా, ఈ రైలు ఆపమని మిమ్మల్ని వేడుకుంటున్నాను!” అంటూ నిశ్శబ్దంగా ప్రార్థించింది. “మిమ్మల్ని చూడ్డానికి ఇంకో రోజు ఆలస్యమయితే కాచుకోడానికి పడే బాధ నేను భరించలేను.”

బుసలు కొడుతున్న ఆ ట్రెయినుకు, చక్రాలు గిరగిరా తిరుగుతూనే ఉన్నాయి కాని, ముందుకు సాగడమే లేదు. ఈ చిత్రం చూడడం కోసం, ఇంజినీరూ ప్రయాణికులూ ప్లాట్‌ఫారం మీదికి దిగారు. ఇంతలో, ఇంగ్లీషు రైల్వేగార్డు ఒకడు, అభయా వాళ్ళాయనా ఉన్నచోటికి వచ్చాడు. ఆచారానికి విరుద్ధంగా ఆ గార్డు, వాళ్ళకి సాయం చెయ్యడానికి ముందుకు వచ్చాడు. “బాబూ, డబ్బు నా కివ్వండి. మీరు రైలెక్కుతూ ఉంటే నేను మీ టిక్కెట్లు కొని తెస్తాను” అన్నాడతను.

ఈ దంపతులు బండిలో కూర్చుని టిక్కెట్లు ఇలా అందుకున్నారో లేదో, బండి మెల్లగా ముందుకు సాగడం మొదలయింది. ఇంజినీరూ ప్రయాణికులూ హడావిడిగా బండిలోకి ఎగబడి, వాళ్ళవాళ్ళ స్థానాల్లోకి వచ్చి పడ్డారు. బండి ఎలా బయలుదేరిందో తెలియకపోవడం అటుంచి, అసలు మొదట ఎందుకు ఆగిందో కూడా తెలియలేదు.

కాశీలో లాహిరీ మహాశయుల ఇంటికి చేరి, నిశ్శబ్దంగా గురువుగారి ముందు మోకరిల్లి, ఆయన పాదాలు పట్టుకోడానికి ప్రయత్నించింది అభయ.

“ ‘మనసు కుదుట బరుచుకో, అభయా,’ అన్నారాయన. ‘నన్ను ఇబ్బంది పెట్టడం నీ కెంత ఇష్టం! తరవాతి బండిలో రాలేకపోదువనా!’ ”

అభయ, చిరస్మరణీయమైన మరో సందర్భంలో లాహిరీ మహాశయుల్ని దర్శించింది. ఈసారి ఆయన సహాయం కావలసింది ట్రెయిను గురించి కాదు, సంతానం గురించి.

“నా తొమ్మిదో సంతానం బతికి బట్టకట్టేలా మీరు దీవించాలని నా ప్రార్థన. ఎనమండుగురు పిల్లలు పుట్టారు నాకు; అందరూ పుట్టగానే జారి పోయారు.” అన్నదామె.

గురువుగారు సానుభూతితో చిన్నగా నవ్వారు. “ఈసారి పుట్టబోయే సంతానం బతుకుతుంది. నేను చేసే సూచనలు శ్రద్ధగా పాటించు. ఆడపిల్ల పుడుతుంది, రాత్రిపూట. తెల్లారేదాకా చమురుదీపం వెలుగుతూండేలా చూసుకో, నిద్రపోతూ దీపాన్ని కొండెక్క నివ్వకు.”

అభయకు ఆడపిల్ల పుట్టింది; రాత్రిపూటే; సర్వద్రష్టలైన గురుదేవులు ముందుగా గ్రహించి చెప్పినట్టే, కచ్చితంగా, దీపంలో చమురు నింపుతూ ఉండమని ఆ తల్లి దాదికి పురమాయించింది. ఆ ఆడవాళ్ళిద్దరూ కంటికి కునుకురాకుండా తెల్లారగట్ల దాకా మేలుకునే ఉన్నారు; కాని చివరికి నిద్రపోయారు. దీపం దాదాపు కొండెక్కే స్థితికి వచ్చింది; వెలుగు సన్నగా అల్లల్లాడుతోంది. ఇంతలో, పడగ్గది తలుపు పెద్ద చప్పుడు చేస్తూ గభాలున తెరుచుకుంది. ఆడవాళ్ళు అదిరిపడి మేలుకున్నారు. ఎదురుగా లాహిరీ మహాశయుల రూపం చూసి ఆశ్చర్యపోయారు.

“అభయా, చూడు, కొంచెం ఉంటే దీపం కొండెక్కేదే!” అంటూ ఆయన దీపం వేపు చూపించేసరికి, చమురు పొయ్యడానికి దాదీ చటుక్కున లేచింది. దీపం మళ్ళీ నిండుగా వెలిగిన తరవాత గురుదేవులు అదృశ్యమయారు. తలుపు మూసుకుంది. కంటి కవుపడే సాధనం ఏదీ లేకుండానే గడియ పడింది.

అభయ తొమ్మిదో సంతానం బతికింది; 1935 లో నేను వాకబు చేసేనాటికి ఆమె కులాసాగానే ఉంది.

లాహిరీ మహాశయుల శిష్యుల్లో, పూజ్యులు కాశీకుమార్ రాయ్‌గారు, గురుదేవుల సన్నిధిలో తాము గడిపిన జీవితాన్ని గురించి మనోహరమైన వివరాలు నాకు అనేకం చెప్పారు.

“కాశీలో, వారింట్లో నేను తరచు, వరసగా వారాల తరబడి అతిథిగా ఉండేవాణ్ణి,” అన్నారు రాయ్‌గారు. “చాలామంది. సాధు సజ్జనులూ దండిస్వాములూ[3] మా గురుదేవుల పాదసన్నిధిని కూర్చోడానికి ప్రశాంతమైన రాత్రివేళ వస్తూండేవారు. ఒక్కొక్కప్పుడు వారు, ధ్యానానికి వేదాంతానికి సంబంధించిన విషయాలు ముచ్చటించుకుంటూ ఉండేవారు. తెల్లారగట్ల మళ్ళీ వెళ్ళిపోయేవారు, ఈ మాన్య అతిథులు. నేను అన్ని సార్లు వారింటికి వెళ్ళానుకాని, ఒక్కసారి కూడా వారు నడుము వాల్చడం చూడలేదు.” “గురుదేవుల సాంగత్యం ఏర్పడ్డ తొలి రోజుల్లో ఒకసారి, మా యజమాని ప్రతిఘటనను నేను ఎదుర్కోవలసి వచ్చింది,” అంటూ ఇంకా చెప్పారు రాయ్‌గారు. “ఆయన భౌతికవాదంలో పాతుకుపోయిన మనిషి.”

“ ‘మత పిచ్చగాళ్ళు నా దగ్గిర పని చెయ్యక్కర్లేదు,’ అంటూ ఎగతాళి చేసేవాడు. ‘ఎప్పుడయినా నీ దంభాచారి గురువును కలుసుకోడమే జరిగితే ఆయన జ్ఞాపకం ఉంచుకొనేలా కొన్ని మాటలు చెబుతాను,’ అన్నాడాయన.

“ఈ బెదిరింపు నా నిర్ణీత కార్యక్రమాన్ని ఆపలేకపోయింది; నేను దాదాపు ప్రతి సాయంత్రమూ నా గురుదేవుల సన్నిధిలో గడిపాను. ఒకనాడు రాత్రి మా యజమాని నా వెంబడి వచ్చి గురుదేవులు కూర్చునే గదిలోకి మొరటుగా చొరబడ్డాడు. అతను చెబుతానన్న మాటలు అనేసెయ్యడానికే తలపెట్టాడనడంలో సందేహం లేదు. అతను కూర్చోగానే లాహిరీ మహాశయులు, అక్కడున్న సుమారు పన్నెండుమంది శిష్యుల్ని చూసి ఇలా అడిగారు:

“ ‘మీ రో బొమ్మ చూస్తారా?’ ”

“మేము తల ఊపిన తరవాత వారు, గదిని చీకటి చెయ్యమన్నారు. ఒకరి వెనకాల ఒకరు గుండ్రంగా కూర్చుని, మీకు ముందున్న వ్యక్తి కళ్ళమీద చేతులు పెట్టండి,’ అన్నారు వారు.

“మా యజమాని కూడా, అయిష్టంగానే అయినా, గురుదేవుల సూచనల్ని పాటిస్తూ ఉండడం చూసి నేనేమీ ఆశ్చర్యపోలేదు. కొన్ని నిమిషాల తరవాత, మేము చూస్తున్నది ఏమిటో చెప్పమన్నారు, లాహిరీ మహాశయులు.”

“గురుదేవా, అందమైన ఒక స్త్రీ కనిపించిందండి. ఆవిడ ఎర్రరంగు చీర కట్టుకుని ‘ఏనుగు చెవి’ మొక్కదగ్గిర నించుని ఉంది అన్నాను. తక్కిన శిష్యులందరూ కూడా అలాగే వర్ణించారు. గురుదేవులు మా యజమాని వేపు తిరిగారు. ‘ఆమెను గుర్తు పట్టారా?’ అన్నారు.

“ ‘గుర్తు పట్టానండి,’ అన్నాడతను. అతని స్వభావానికి అలవాటు లేని కొత్త ఉద్రేకాలతో పెనుగులాడుతున్నట్టు స్పష్టమవుతోంది. ‘నాకు మంచి భార్య ఉన్నా కూడా, ఈ మనిషికోసం తెలివితక్కువగా డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాను. నే నిక్కడికి వేరే ఉద్దేశాలతో వచ్చినందుకు సిగ్గు పడుతున్నాను. నన్ను క్షమించి మీ శిష్యుడిగా స్వీకరిస్తారా?’ అని అడిగాడు.”

“ ‘ఆరు నెల్లపాటు నువ్వు మంచి నైతిక జీవనం గడిపేటట్టయితే నిన్ను స్వీకరిస్తాను,’ అని, ఇంకో ముక్క కూడా అన్నారు. ‘లేకపోతే నీకు దీక్ష ఇవ్వడం పడదు నాకు.’

“మూడు నెల్లదాకా వ్యామోహాన్ని నిగ్రహించుకున్నాడు మా యజమాని. ఆ తరవాత ఆవిడతో మళ్ళీ సంపర్కం కొనసాగించాడు. తరవాత రెండు నెల్లకు చనిపోయాడు. అతనికి దీక్ష ఇవ్వడం అసంభవమని గురుదేవులు గోప్యంగా చెప్పిన జోస్యాన్ని అప్పుడర్థంచేసుకున్నాను.”

లాహిరీ మహాశయులకు త్రైలింగస్వామి అనే సుప్రసిద్ధులైన స్నేహితులు ఉండేవారు; ఆయన వయస్సు మూడువందల ఏళ్ళకి పైబడి ఉండేదని ప్రతీతి. ఈ యోగులిద్దరూ తరచుగా ఒకచోట కూర్చుని ధ్యానం చేస్తూ ఉండేవారు. త్రైలింగ స్వాముల ప్రతిష్ఠ ఎంతగా వ్యాపించిందంటే, ఆయన చేసిన ఆశ్చర్యజనకమైన అలౌకిక చర్యలకు సంబంధించిన ఏ కథ అయినా సత్యదూరమని ఏ హిందువూ శంకించడు. ఏసుక్రీస్తే కనక ఈ లోకానికి తిరిగివచ్చి తన దివ్యశక్తులు ప్రదర్శిస్తూ న్యూయార్కు వీథుల్లో తిరుగుతూ ఉంటే, కొన్ని దశాబ్దుల కిందట త్రైలింగస్వాములు కాశీలో జనసమ్మర్థంగల సందుల్లో నడుస్తూ జనంలో ఎంత ఆశ్చర్యం కలిగించారో అంత ఆశ్చర్యమూ ఇప్పుడు కలుగుతుంది. కాల (ప్రవాహం) కోతలకు గురికాకుండా భారత (తీర) దేశాన్ని సురక్షితం చేసిన సిద్ధుల్లో ఆయన ఒకరు.

ఈ స్వామి అనేక సందర్భాల్లో ఎంతో ప్రాణాంతకమైన విషాలు తాగడం, అయినా దుష్ఫలితాలు కలక్కపోవడం చూశారు జనం. ఆయన గంగానది మీద తేలుతూ ఉండడం వేలాది జనం చూశారు; వాళ్ళలో కొందరు ఇప్పటికీ బతికున్నారు. ఆయన వరసగా కొన్ని రోజులపాటు నీటిమీద కూర్చుని ఉండేవారట; లేకపోతే, ఏటి కెరటాల్లో మునిగి అతి దీర్ఘ కాలం మరుగున ఉండేవారట. మలమలమాడే రాతి పలకలమీద, నిర్దయుడైన భారతీయ సూర్యుడి ధాటికి పూర్తిగా వెల్లడి అయిన స్వామివారి నిశ్చలదేహం, మణికర్ణికాఘట్టంలో ఒక సామాన్య దృశ్యం.

ఈ అసాధారణ కృత్యాల ద్వారా త్రైలింగస్వామి, మానవ జీవితం, ఆక్సిజన్ మీదకాని నిశ్చిత పరిస్థితులమీదా ముందు జాగ్రత్తల మీదా కాని ఆధారపడవలసిన అవసరం లేదని మానవులకు బోధించదలిచారు. ఆయన నీళ్ళపైన ఉన్నా లోపల ఉన్నా, ఆయన శరీరం ప్రచండ సూర్యకిరణాల్ని సవాలు చేసినా, చెయ్యకపోయినా, తాము జీవించింది దివ్యచైతన్యం వల్లనే నని నిరూపించారాయన. మృత్యుదేవత ఆయన్ని తాకలేకపోయింది.

ఆ యోగి, ఆధ్యాత్మికంగానే కాకుండా, శారీరకంగా కూడా ఘనులే. ఆయన బరువు మూడువందల పౌన్లనుమించి ఉండేది: ఆయన జీవితంలో పానుకో ఏడాది! ఆయన తినడం అరుదు కావడంతో ఇది మరింత ఆశ్చర్యం కలిగించింది. అయితే సిద్ధపురుషుడు, మామూలు ఆరోగ్య సూత్రల్ని అన్నిటినీ తాను కోరుకున్నప్పుడు సులువుగా ఉపేక్షిస్తాడు; . దానికి ఏదో ఒక ప్రత్యేక కారణం ఉంటుంది; ఆ కారణం, అతనికే తప్ప మరొకరికి తెలియనంత సూక్ష్మంగా ఉంటుంది.

విశ్వ మాయాస్వప్నం నుంచి మేలుకొని, ఈ ప్రపంచాన్ని దివ్య మానసంలోని ఒక భావంగా అనుభూతి కావించుకొన్న మహాయోగులు, శరీరంతో ఏం కోరుకుంటే అది చెయ్యగలరు; దాన్ని వారు, ఘనీభూతశక్తికి కార్యసాధక రూపంగా తెలుసుకొని ఉంటారు. పదార్థమనేది ఘనీభూతమైన శక్తి తప్ప మరేమీ కాదని భౌతికశాస్త్రవేత్తలు ఇప్పుడయితే అవగాహన చేసుకుంటున్నారుకాని, పూర్ణసిద్ధి పొందిన యోగులు, పదార్థ నియంత్రణ విషయంలో, సిద్ధాంతం నుంచి ఆచరణకు విజయవంతంగా సాగారు.

త్త్రైలింగస్వామి ఎప్పుడూ పూర్తిగా దిసిమొలతో ఉండేవారు. విసుగెత్తిన కాశీ పోలీసులు ఆయన్ని, ఇబ్బందుల్లో పెట్టే పిల్ల వాడిగా పరిగణించేవారు. ఈడెన్ తోటలో ఉన్న వెనకటి ఆదాము మాదిరిగానే ఈ ‘సహజస్వామి’కి తమ నగ్నత స్పృహలో ఉండేది కాదు. కాని పోలీసుల కది స్పృహలో ఉండేది. అందువల్ల ఆయన్ని అమర్యాదగా జైలుకు తీసుకు వెళ్ళారు. దాంతో కలవరం పుట్టింది; కాసేపట్లోనే, త్త్రైలింగస్వామివారి భారీ శరీరం, దాని సహజ పరిమాణమంతతో, జైలు పై కప్పులమీద కాన వచ్చింది. అప్పటికీ భద్రంగానే తాళంపెట్టి ఉన్న ఖైదుకొట్టు, అందులోంచి ఆయన తప్పించుకున్న విధానానికి ఆధారమేదీ చూపించలేదు.

నిరుత్సాహపడ్డ న్యాయాధికారులు మళ్ళీ మరోసారి తమ విధి నిర్వర్తించారు. ఈసారి స్వామివారి ఖైదుకొట్టు దగ్గర ఒక కావలివాణ్ణి నియమించారు. ధర్మం ముందునుంచి బలం మళ్ళీ మరోసారి నిష్క్రమించింది; కాసేపట్లోనే ఆ మహాయోగి, పై కప్పుమీద నిశ్చింతగా పచార్లుచేస్తూ కనిపించారు. న్యాయదేవత కళ్ళకు గంతలుంటాయి; త్త్రైలింగస్వామి విషయంలో, ఓటమిని ఎదుర్కొన్న పోలీసులు, ఆమె ఆదర్శాన్నే అనుసరించదలిచారు.

ఆ మహాయోగి, మౌనాన్ని ఒక అభ్యాసంగా నిలుపుకుంటూ వచ్చారు. గుండ్రటి మొహం, పెద్ద పీపాలాంటి పొట్ట ఉన్నప్పటికీ త్రైలింగస్వామి, ఎప్పుడో అరుదుగా తినేవారు. వారాల తరబడి తిండి లేకుండానే ఉండి తరవాత, భక్తులు తమకు సమర్పించిన పెరుగు, కుండల కొద్దీ తాగేవారు. ఒకసారి ఒక సందేహశీలుడు, త్రైలింగస్వామిని ధాంభికుడిగా బయటపెడదామని నిర్ణయించుకున్నాడు. గోడలకు వెల్ల వేసే సున్నపునీళ్ళు ఒక పెద్ద బాల్చీనిండా తెచ్చి స్వామి ముందర పెట్టాడు

“స్వామీ,” అంటూ దొంగభక్తి చూపిస్తూ ఆ భౌతికవాది, “మీ కోసం కొంచెం పెరుగు తెచ్చాను. దయచేసి సేవించండి” అన్నాడు.

త్రైలింగస్వామి ఏ మాత్రం వెనకాడకుండా, సలసల మరుగుతున్న సున్నపు నీటిని కడబొట్టువరకు, గేలన్ల కొద్దీ తాగేశారు. మరికొద్ది నిమిషాల్లో ఆ దుష్కర్ముడు విలవిల్లాడుతూ నేలమీద పడ్డాడు.

“రక్షించండి స్వామీ, రక్షించండి. నేను నిప్పులమీదున్నాను. నా కుటిలపరీక్షకు క్షమించండి,” అంటూ అరిచాడు.

మహాయోగి మౌనం చాలించారు. “దుర్మార్గుడా, నీ ప్రాణం, నా ప్రాణం ఒక్కటేనని, నాకు విషమిచ్చినప్పుడు గ్రహించలేదు నువ్వు. సృష్టిలో ప్రతి అణువులో ఉన్నట్టే భగవంతుడు నా పొట్టలో కూడా ఉన్నాడన్న జ్ఞానమే నాకు లేకపోయి ఉంటే, ఆ సున్నం నన్ను చంపేసి ఉండేది. ఎవరు చేసింది వారికే బెడిసికొడుతుందనే దాని దివ్యార్థం ఇప్పుడు తెలుసుకున్నావు కనక, ఇంకెప్పుడూ ఇల్లాటి పన్నాగాలు ఎవరి మీదా పన్నకు.” త్రైలింగస్వామి మాటలతో స్వస్థుడై ఆ పాపి చల్లగా జారుకున్నాడు.

బాధ తిరుగుముఖం పట్టడం, ఆ యోగి సంకల్పంవల్ల కాక, సృష్టి సుదూరతమ గోళాన్ని సైతం పరిచాలనం చేసే ధర్మసిద్ధాంతం[4] పని చెయ్యబట్టి జరిగింది. త్రైలింగస్వామి మాదిరిగా దైవసాక్షాత్కారం పొందిన వ్యక్తుల విషయంలో దైవనియమం పనిచేయడం తక్షణమే జరుగుతుంది; ఆ వ్యక్తులు అవరోధాలు కలిగించే అహంకార ప్రతికూల ప్రవాహాలన్నిటినీ శాశ్వతంగా బహిష్కరించి ఉంటారు.

ధార్మికత కుండే స్వయంచాలితమైన సర్దుబాట్ల మీద విశ్వాసం ఉంచితే (త్రైలింగస్వామిని చంపబోయినవాడి విషయంలో మాదిరిగా, తరచుగా అనుకోని విధంగా ప్రతిఫలమిస్తూ) మానవ అన్యాయంపట్ల మనకు కలిగే తొందరపాటు ఆగ్రహాన్ని అది ఉపశమింపజేస్తుంది. “ప్రతీకారం నాది; నేను తీర్చుకుంటాను, అంటాడు ప్రభువు,”[5] మానవుడి క్షుద్ర సాధనాల అవసర మేమిటి? తిరుగుదెబ్బ తియ్యడానికి విశ్వమే సరిగా పన్నాగం పన్నుతుంది.

దైవన్యాయం, ప్రేమ, సర్వజ్ఞత్వం, అమరత్వం అన్న వాటికి గల అవకాశాన్ని మందబుద్ధులు నమ్మరు. “ధార్మిక గ్రంథాల నిరాధార కల్పనలు!” ఇలాటి అవివేక దృష్టిగల మనుషులు, బ్రహ్మాండదృశ్యాన్ని చూసి విస్మయం చెందకుండా, తమ జీవితాల్లో విషమఘటనా పరంపరను నడిపిస్తారు; చివరికది వాళ్ళని, జ్ఞానాన్వేషణకు నిర్భంద పెడుతుంది.

ఆధ్యాత్మిక నియమానికున్న సర్వశక్తిమత్వాన్ని ఏసుక్రీస్తు, తాను జెరూసలెంలో విజయవంతంగా అడుగుపెట్టే సందర్భంలో ప్రస్తావించాడు. ఆయన శిష్యులూ జనబాహుళ్యమూ ఆనందనినాదం చేస్తూ, “స్వర్గానికి శాంతి, సర్వోన్నతుడికి శోభ” అంటూ అరిచినప్పుడు కొందరు ఫారిసీలు (ఛాందస పురోహితులు), హుందాతనం లేని ఆ దృశ్యాన్ని గురించి ఫిర్యాదు చేశారు. “స్వామీ, మీ శిష్యులికి చివాట్లు పెట్టండి,” అన్నారు.

కాని ఏసుక్రీస్తు జవాబిస్తూ, తన శిష్యుల నోళ్ళు నొక్కేటట్లయితే, “తక్షణమే రాళ్ళు అరుస్తాయి”[6] అన్నాడు.

ఫారిసీల్ని ఇలా మందలించడంలో ఏసుక్రీస్తు, దైవీన్యాయం కేవలం ఒక ఆలంకారిక కల్పనకాదనీ, సాధుప్రవృత్తిగల వ్యక్తి నాలికని మొదలంటా చీల్చేసినప్పటికీ, సృష్టికి ఆధారభూతమైన విశ్వవ్యవస్థలోనే ఆయన మాట వినవస్తుందని ఆయనకు రక్ష లభిస్తుందని సూచిస్తున్నాడు.

ఏసుక్రీస్తు ఇలా అన్నాడు: “సాధువర్తనుల నోళ్ళు మూయించాలనుకుంటున్నారా? అంతకన్న, ఎవరి మహిమనూ సర్వవ్యాపకత్వాన్నీ రాళ్ళు సైతం కీర్తిస్తున్నాయో ఆ దేవుడి గొంతు కూడా నులిమెయ్యాలని ఆశించండి మీరు. స్వర్గంలో, శాంతిని కీర్తిస్తూ జనం వేడుక చేసుకో గూడదంటారా ? భూమి మీద యుద్ధాలు జరిగినప్పుడే వాళ్ళు అసంఖ్యాకులుగా కూడి తమ సమైక్యాన్ని వ్యక్తంచేసుకోవాలని వాళ్ళకి సలహా ఇస్తారా? అయితే ఓ ఫారిసిల్లారా, భూమి పునాదులు పడగొట్టడానికి మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి; ఏమంటే, సృష్టిలోని దివ్యసామరస్యాన్ని నిరూపించడానికి సాధుసజ్జనులేకాక రాళ్ళూ భూమీ నీరూ నిప్పూ గాలీ, మీ మీదికి విజృంభిస్తాయి.”

క్రీస్తువంటి యోగిపుంగవులైన త్రైలింగస్వామివారి దయ, ఒకసారి మా మేనమామ మీద ప్రసరించింది. ఒకనాడు పొద్దున మా మామయ్య, కాశీలో ఒక రేవులో భక్తబృందం మధ్య ఉన్న స్వామిని చూశాడు. ఎలాగో దారి చేసుకుని గుంపులోకి చొరబడి త్రైలింగస్వామికి చాలాదగ్గరగా వెళ్ళి, సవినయంగా ఆయన పాదాలు ముట్టుకోగలిగాడు. బాధాకరమైన తన మొండిరోగం నుంచి తక్షణమే విముక్తి కలగడం చూసి ఆశ్చర్య పోయాడు.[7]

ఈ మహాయోగి శిష్యుల్లో సజీవులై ఉన్నట్టు తెలిసిన ఏకైక శిష్యురాలు, శాంకరీమాయి జీవ్. త్రైలింగస్వామి శిష్యుల్లో ఒకరి కుమార్తె అయిన ఈవిడ, బాగా చిన్నప్పటినించి స్వామివారి తర్ఫీదు పొందారు. ఈవిడ నలభై ఏళ్ళ పాటు, వరసగా బదరీనాథ్, కేదారనాథ్, అమరనాథ్, పశుపతినాథ్ క్షేత్రాల దగ్గరి హిమాలయ గుహల్లో ఏకాంతంగా నివసించారు. 1826 లో పుట్టిన ఈ బ్రహ్మచారిణికి ఇప్పుడు నూరేళ్ళకి మించి ఉంటాయి. అయినా ఈవిడ, వయస్సు పైబడినట్టు కనిపించరు; నల్లటి జుట్టూ ముత్యాలవంటి పలువరసా ఆశ్చర్యకరమైన దార్ఢ్యమూ నిలుపు కొన్నారు. కొన్నేళ్ళకోసారి ఈవిడ, నియతకాలికంగా జరిగే పుష్కరాల్లో పాల్గొనడానికని, ఏకాంతవాసం నుంచి బయటికి వస్తూ ఉంటారు.

ఈ సాధ్వి లాహిరీ మహాశయుల దర్శనానికి తరచు వెళ్తూ ఉండేవారు. ఒకనాడు ఈవిడ, కలకత్తాకు దగ్గరలో ఉన్న బారక్‌పూర్ పేటలో లాహిరీ మహాశయుల పక్కన కూర్చుని ఉండగా, మహాగురువులైన బాబాజీ, మెల్లగా గదిలోకి వచ్చి తామిద్దరితోటీ ముచ్చటించారని ఆవిడ చెప్పారు. “అమరులైన ఆ మహాగురువులు అప్పుడొక తడిబట్ట కట్టుకుని ఉన్నారు. ఏట్లో ఒక మునక వేసి అప్పుడే వచ్చినట్టు,” అంటూ జ్ఞాపకం చేసుకున్నారు. “ఆధ్యాత్మికోపదేశం ఒకటి చేసి నన్ను దీవించారు వారు.”

ఒకానొక సందర్భంలో త్రైలింగస్వామి కాశీలో, లాహిరీ మహాశయులకు ఒక బహిరంగ సమావేశంలో గౌరవాభినందనలు తెలపడం కోసం తమ మౌనవ్రతాన్ని విరమించారు. త్రైలింగస్వామి శిష్యుల్లో ఒకరు దీనికి అభ్యంతరం తెలిపారు.

“గురుదేవా, తాము స్వాములూ సన్యాసులూ అయి ఉండి, ఒక గృహస్థుకు అంత గౌరవం ఎందుకివ్వాలి?”

దానికి త్రైలింగస్వామి జవాబు ఇచ్బారు, “నాయనా, లాహిరీ మహాశయులు దివ్యమార్జాల కిశోరం లాంటివారు: ఆ జగన్మాత తనని ఎక్కడ ఉంచితే అక్కడే ఉంటున్నారు. దేని కోసం నేను - నా గోచీగుడ్డతో సహా - ప్రతిదీ విడిచి పెట్టేశానో, ఆ పరిపూర్ణ సాక్షాత్కారాన్ని ఆయన సంసారిగా తమ పాత్ర తాము విధ్యుక్తంగా నిర్వహిస్తూనే సిద్ధింప జేసుకున్నారు.

  1. “అతడు దేవుడి కోసమే, ఆమె అతనిలోని దేవుడికోసమే.’ ” – మిల్టన్
  2. ఈ పూజ్య మాతృశ్రీ 1930 మార్చి 25 న కాశీలో గతించారు.
  3. బ్రహ్మదండ సూచకంగా చేతిలో ఒక వెదురు కర్రను సాంప్రదాయికంగా తీసుకువెళ్ళే ఒక సాధువర్గంతో సభ్యులు, మనిషిలోని వెనుబామును బ్రహ్మదండంగా భావిస్తారు. నిద్రాణమైన ఏడు మేదోకశేరు కేంద్రాల్ని మేల్కొలిపి ఉత్తేజితపరచటాన్నే, భగవంతుని చేరే నిజమైన మార్గంగా పరిగణిస్తారు.
  4. పోల్చి చూడండి, || కింగ్స్ 2 : 19-24 (బైబిలు). జెరీఖోలో ఎలిషా, “జలశోధన” (హీలింగ్ ది వాటర్స్) అనే అలౌకిక అద్భుత చర్య ప్రదర్శించిన తరవాత కొందరు పిల్లలు ఆయన్ని హేళనచేశారు. “అప్పుడు అడవిలోంచి రెండు ఆడ ఎలుగుబంట్లు - చొరబడి వచ్చి (వాళ్ళలో) నలభై (మీద) ఇద్దరు పిల్లల్ని చీల్చేశాయి.”
  5. రోమన్స్ 12 : 19 (బైబిలు),
  6. లూకా 19 : 37-40.
  7. త్రైలింగస్వామి, తదితర సిద్ధపురుషుల జీవితాలు మనకు ఏసుక్రీస్తు మాటల్ని జ్ఞాపకం చేస్తాయి. “నమ్మేవాళ్ళనే ఈ సూచనలు అనుసరించి వస్తాయి: నా పేరు [కూటస్థ చైతన్యం] మీద వాళ్ళు దెయ్యాల్ని విడిపిస్తారు, వాళ్ళు కొత్త భాషలో మాట్లాడతారు: పాముల్ని ఎత్తి పట్టుకుంటారు, వాళ్ళు ప్రాణాంతకమైనది ఏది తాగినా, అది వాళ్ళకి హాని చెయ్యదు: వాళ్ళు జబ్బు మనుషుల మీద చేతులు వేస్తారు, వాళ్ళు కోలుకుంటారు.” మార్కు 16 : 17-18 (బైబిలు).