ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 30

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అధ్యాయం : 30

అలౌకిక ఘటనల నియమం

ప్రసిద్ధ నవలా రచయిత లియో టాల్‌స్టాయ్‌[1] ‘ముగ్గురు సాధువులు’ అనే ఆహ్లాదకరమైన జానపద కథ ఒకటి రాశాడు. ఆయన స్నేహితుడు నికొలాస్ రోరిక్, దాన్ని ఈ ప్రకారం సంక్షేపించి చెప్పాడు:

“ఒక ద్వీపంలో ముగ్గురు ముసలి సాధువులు నివసిస్తూ ఉండేవారు. వాళ్ళు ఎంత నిరాడంబరులంటే, వాళ్ళు చేసే ఏకైక ప్రార్థన ఇలా ఉండేది: “మేము ముగ్గురం, నువ్వు ముగ్గురివి- మా మీద దయ ఉంచు!” ఈ అకృత్రిమమయిన ప్రార్థన సమయంలో గొప్ప అలౌకిక ఘటనలు జరిగాయి.

“స్థానిక మతగురువు[2] ఒకడు, ఈ ముగ్గురు సాధువులగురించి, అంగీకారయోగ్యంకాని వాళ్ళ ప్రార్థననుగురించి విన్నాడు; విధివిహిత మైన ప్రార్థనలు వాళ్ళకి నేర్పడంకోసం వాళ్ళని కలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ దీవికి చేరి, వాళ్ళ దైవప్రార్థన హుందాగా లేదని చెప్పి ఆచారప్రకారంగా చేసే ప్రార్థనలు వాళ్ళకి చాలా నేర్పాడు. తరవాత ఆ బిషప్పు ఒక నావ ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ నావ వెనకాల ఉజ్జ్వల కాంతి ఒకటి వెంబడించి వస్తూండడం గమనించాడు. ఆ కాంతి దగ్గరపడేసరికి ముగ్గురు సాధువుల్నీ పోల్చాడాయన; ఆ ముగ్గురూ నావను అందుకొనే ప్రయత్నంలో, ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని కెరటాల మీద పరిగెత్తుతూ వస్తున్నారు.

“ ‘మీరు మాకు నేర్పిన ప్రార్థనలు మరచిపోయాం, మళ్ళీ చెప్పమని మిమ్మల్ని అడగడానికి గబగబా వచ్చేశాం,’ అని అరిచారు వాళ్ళు, మత గురువు దగ్గరికి చేరగానే.

“ఆశ్చర్యచకితుడయిన మతగురువు, తల అడ్డంగా తిప్పాడు ‘ప్రియతములారా,’ అంటూ వాళ్ళని సవినయంగా సంబోధిస్తూ, “మీ పాత ప్రార్థనతోనే జీవితం కొనసాగించండి!’ అని జవాబిచ్చాడు.”

ఆ ముగ్గురు సాధువులూ నీటిమీద ఎలా నడిచారు?

క్రీస్తు, శిలువచేసిన తన శరీరాన్ని ఎలా పునరుత్థానం చేశాడు?

లాహిరీ మహాశయులూ శ్రీయుక్తేశ్వర్‌గారూ అలౌకిక చర్యలు ఎలా చేశారు?

అణుయుగావిర్భావంతో ప్రపంచ మానసపరిధి ఆకస్మికంగా విస్తరించినప్పటికీ, ఆధునిక విజ్ఞానశాస్త్రంలో ఇప్పటికి కూడా దీనికి సమాధానం లేదు. “అసంభవం” అనే పదానికి మానవ శబ్దజాలంలో ప్రాముఖ్యం తగ్గుతోంది.

ఈ భౌతిక ప్రపంచం, సాపేక్షతాద్వంద్వతల సూత్రమనే ఒకే ఒక మాయా మౌలిక నియమం మీద నడుస్తోందని వైదిక ధర్మగ్రంథాలు ఘోషిస్తున్నాయి. ఏకైక జీవుడయిన భగవంతుడు కేవల అద్వితీయుడు. సృష్టిలో వేరుగానూ నానా రూపాలలోనూ ప్రత్యక్షం కావడానికి ఆయన మిథ్యావరణాన్ని లేదా అవాస్తవమైన ముసుగును ధరిస్తాడు. భ్రాంతి జనకమైన ఈ ద్వంద్వ ఆవరణమే మాయ.[3] ఆధునిక కాలంలోని గొప్ప వైజ్ఞానిక ఆవిష్కరణలు అనేకం. సనాతన ఋషుల ఈ సులభ ప్రకటనను ధ్రువపరిచాయి.

న్యూటన్ గమన నియమం, “మాయ తాలూకు నియమమే.” ప్రతి ఒక్క చర్యకూ సమానమూ విరుద్ధమూ అయిన ప్రతిచర్య ఎప్పుడూ ఉంటుంది; ఏ రెండు వస్తువుల పరస్పర చర్యలయినా ఎప్పుడూ సమానంగా, ఒకదానికొకటి వ్యతిరేక దిశలో సాగుతూంటాయి.” ఈ ప్రకారంగా చర్యా, ప్రతిచర్యా సరిగ్గా సమానంగా ఉంటాయి. “ఒకేఒక బలం ఉండడం అసంభవం; సమానంగానూ వ్యతిరేకంగానూ రెండు బలాలు ఉండాలి; అలా ఎప్పుడూ ఉంటున్నాయి కూడా.”

ఆధారభూతమైన ప్రాకృతిక కార్యకలాపాలు, అవి మాయలోంచి పుట్టినవేనన్న సంగతిని బయలుపరుస్తున్నాయి. ఉదాహరణకు, విద్యుత్తు, ఆకర్షణ వికర్షణల దృగ్విషయం, దాని ఎలక్ట్రాన్‌లూ ప్రోటాన్లూ (ఋణ విద్యుదణువులూ ధనవిద్యుదణువులూ) పరస్పర విరుద్ధమైన విద్యుత్ శక్తులు. మరో ఉదాహరణ: భౌతిక పదార్థంలో పరమ సూక్ష్మకణమైన అణువు (ఆటం) భూమి మాదిరిదే; ధన, ఋణ ధ్రువాలుగల అయస్కాంతం. ఈ భౌతిక ప్రపంచం యావత్తూ ధ్రువత్వ నిరంకుశాధికారానికి లోబడి ఉన్నది; భౌతికశాస్త్రానికి కాని, రసాయనశాస్త్రానికికాని, మరే శాస్త్రానికికాని సంబంధించిన ఏ నియమమూ, స్వతసిద్ధమైన వ్యతిరేక సూత్రాలు లేదా విరుద్ధ సూత్రాలు లేకుండా లేదు.

అటువంటప్పుడు భౌతికశాస్త్రం, సృష్టికి స్వరూపమైన మాయకు అతీతంగా నియమాలు రూపొందించలేదు. ప్రకృతే మాయ; కాబట్టి ప్రకృతిశాస్త్రం, దాని అనివార్య సహజగుణంతో వ్యవహరించక తప్పదు. దాని పరిధిలో అది, శాశ్వతమూ అక్షయమూ; భవిష్యత్ విజ్ఞానశాస్త్రవేత్తలు, అసంఖ్యాక మైన దాని వివిధాకృతుల్లో ఏదో ఒకదాన్ని అన్వేషించడానికి మించి మరేమీ చెయ్యలేరు. ఆ విధంగా విజ్ఞానశాస్త్రం, చరమ తత్త్వాన్ని చేరుకోలేక ఎప్పటికీ ప్రవాహస్థితిలోనే ఉండిపోతుంది; నిజానికది, అప్పటికే సిద్ధంగా ఉండి పనిచేస్తున్న విశ్వానికి సంబంధించిన నియమాల్ని ఆవిష్కరించడానికి తగినదే కాని, నియమ నిర్ణేతా ఏకైక సూత్రధారీ అయిన పరమాత్మను కనుక్కోడానికి అశక్తమయినది. గురుత్వాకర్షణ, విద్యుత్తుల ఘనమైన అభివ్యక్తులయితే తెలియవచ్చాయి కాని అసలు గురుత్వాకర్షణ, విద్యుత్తు అన్నవి ఏమిటో ఏ మర్త్యుడూ ఎరగడు.[4]

అనేక వేలమంది ప్రవక్తలు, మానవజాతికి అప్పగించిన పని, మాయను అధిగమించాలన్నదే. సృష్టిలోని ద్వంద్వానికి అతీతుడై సృష్టికర్త ఏకత్వాన్ని దర్శించడమే మానవుడి సర్వోన్నత లక్ష్యంగా భావిం చడం జరిగింది. విశ్వభ్రాంతిని పట్టుకుని పాకులాడేవాళ్ళు దాని ధ్రువత్వ నియమాన్ని - అంటే ఆటూ పోటూ, లేవడమూ పడడమూ, పగలు రాత్రీ, సుఖమూ దుఃఖమూ, మంచీ చెడూ, పుట్టుకా చావూ అన్న వాటిని అంగీకరించక తప్పదు. మనిషికి కొన్ని వేల మానవజన్మలు గడిచి వచ్చిన తరవాత ఈ చక్రగతిక్రమం, వేదనాభరితమైన ఒక రకం విసుగుదలను కలిగిస్తుంది; అప్పుడతను, మాయామయ నిర్బంధాల వెలుపలికి ఆశగా దృష్టి సారించడం మొదలుపెడతాడు.

మాయ అనే ముసుగును తొలగించడమంటే, సృష్టి రహస్యాన్ని భేదించడమన్న మాట. ఈ విధంగా విశ్వాన్ని నగ్నీకరించేవాడే నిజమైన ఏకేశ్వరోపాసకుడు. తక్కినవాళ్ళందరూ ధర్మవిరుద్ధమైన విగ్రహాల్ని ఆరాధిస్తున్నవాళ్ళే. మనిషి, ప్రకృతి తాలూకు ద్వంద్వతామాయలకు అధీనుడై ఉన్నంతకాలం, ద్వంద్వముఖాలు గల మాయే అతనికి ఆరాధ్య దేవత; ఏకైక సత్యదైవాన్ని అతను తెలుసుకోడు.

మాయ అనే ప్రపంచ భ్రాంతి, మనుషుల్లో అవిద్యగా పొడచూపుతుంది; అవిద్య అంటే, “జ్ఞానం కానిది,” అజ్ఞానం, మాయ. ఈ ‘మాయ’ లేదా ‘అవిద్య’ తార్కిక దృఢవిశ్వాసంవల్లకాని విశ్లేషణవల్లకాని ఎన్నడూ నాశనం కాజాలదు; కేవలం నిర్వికల్ప సమాధి అనే ఆంతరిక స్థితిని సారించడం ద్వారా మాత్రమే నాశనమవుతుంది. బైబిలు పాత నిబంధన గ్రంథ ప్రవక్తలూ అన్ని దేశాల ద్రష్టలూ మునులూ ఆ చైతన్య స్థితిలో ఉండే పలికారు.

ఎజెకీల్ ఇలా అన్నాడు: “తరవాత ఆయన నన్ను గుమ్మం దగ్గరికి తీసుకువచ్చాడు. ఆ గుమ్మం సైతం తూర్పువేపు ఉంది: ఇజ్రాయల్ దేవుడి శోభ తూర్పుదిక్కు నుంచి ప్రసరించింది: ఆయన స్వరం సముద్ర ఘోషలా ఉంది: ఆయన శోభతో ప్రకాశించింది భూమి” (ఎజెకీల్ 43 : 1-2 బైబిలు). నుదుటిమీద (తూర్పు) ఉన్న దివ్యనేత్రం ద్వారా, యోగి, “అనేక సముద్రాల” దివ్యఘోష అనే శబ్దాన్ని లేదా ఓంకారాన్ని వింటూ చైతన్యం నుంచి సర్వవ్యాపకత్వానికి ప్రయాణిస్తాడు; ఈ ఓంకారం, సృష్టిలోని ఏకైక సత్తకు కారకమైన కాంతి స్పందనలే.

విశ్వంలోని అనేక కోట్ల నిగూఢ రహస్యాలలో ఇంద్రియ గోచర మైనది కాంతి. కాంతితరంగాలు, శబ్దతరంగాల మాదిరిగా కాకుండా, అంతర్నక్షత్ర రోదసిలోని శూన్యంగుండా స్వేచ్ఛగా సంచారణ అవుతాయి; శబ్దతరంగాల సంచారణకు షూత్రం గాలికాని ఇతర భౌతిక వాహకాలు కాని అవసరమవుతాయి. తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతికి అంతర్గ్రహ వాహకంగా పనిచేస్తుందని చెప్పే, పరికల్పితమైన ఈథర్‌ను కూడా ఐన్‌స్టైన్ చెప్పిన కారణాలవల్ల పరిహరించవచ్చు; రోదసికున్న జ్యామితీయ గుణధర్మాలు, ఈథర్ సిద్ధాంతం అనవసరమయేటట్టు చేస్తాయని అన్నాడాయన. వీటిలో ఏ ఒక్క పరికల్పన ప్రకారమైనా కూడా కాంతి, ప్రాకృతిక దృశ్యమానరూపాల్లో ఏ ఒక్కదానికన్న అయినా అత్యంత సూక్ష్మంగానూ భౌతిక ఆలంబన రహితంగానూ ఉంటుంది.

ఐన్‌స్టైన్ బృహత్తర - భావనల్లో సాపేక్షతా సిద్ధాంతంలో ప్రాముఖ్యం వహించేది కాంతివేగం - సెకనుకు 1,86,300 మైళ్ళు, మానవుడి పరిమిత మనస్సుకు సంబంధించినంతవరకు, ప్రవాహశీలకమైన విశ్వంలో ఏకైక స్థిరరాశి కాంతివేగమేనని ఆయన గణితశాస్త్రపరంగా నిరూపించారు. మానవుల దేశ, కాల ప్రమాణాలన్నీ ఏకైక “నిరపేక్షం” అయిన కాంతివేగం మీదే ఆధారపడి ఉంటాయి. ఇంతకు పూర్వం అనుకుంటూ వచ్చినట్టుగా, దేశకాలాలు వేరు వేరు. శాశ్వత కారకాలు కావున అవి సాపేక్షమైన, పరిమితి కారకాలు. వాటికి నియత మాపన మాన్యతలు కాంతివేగ ప్రమాణాన్ని బట్టే లభిస్తాయి.

కాలం, పరిమాణాత్మక సాపేక్షతగా రోదసితో చేరడంవల్ల దాని సరైన స్వభావం ఇప్పుడు వెల్లడి అయింది; సరళమైన సందిగ్ధతాసారమే అది. ఐన్‌స్టైన్, కొన్ని సమీకరణాల కలంపోట్లతో, ఒక్క కాంతిని మినహాయించి, తక్కిన ప్రతి స్థిరసత్యాన్ని విశ్వంనుంచి బహిష్కరించేశాడు.

ఉత్తరోత్తరా రూపొందించిన ఏకీకృత క్షేత్ర సిద్ధాంతం (యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ) లో ఆ మహనీయ భౌతికశాస్త్రవేత్త, గురుత్వాకర్షణ, విద్యుదయస్కాంతత్వాల నియమాల్ని కేవలం ఒకే ఒక్క గణిత సూత్రంలో పొందిపరిచాడు. బ్రహ్మాండ స్వరూపాన్ని, ఒకే నియమం మీద ఆధారపడ్డ వివిధ రూపాంతరాలుగా సంక్షేపించిన ఐన్‌స్టైన్, అనేక యుగాల్ని అడ్డంగా దాటిపోయి, సృష్టికి గల ఏకైక స్వరూపం, బహురూపధారణ చేసే మాయ అవి ప్రకటించిన ఋషుల సరసకు చేరాడు.

నవశకానికి నాంది పలికిన సాపేక్షతా సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొనే, పరమాణువును అన్వేషించగల అవకాశాలు గణితశాస్త్రపరంగా బయలుపడ్డాయి. అణువనేది శక్తేకాని పదార్థంకాదని చెప్పడమేకాక, ఆ అణుశక్తి మూలతః మనోద్రవ్యమని ఈనాడు గొప్పగొప్ప శాస్త్రవేత్తలు ధైర్యంగా నొక్కి చెబుతున్నారు.

“భౌతికశాస్త్రం ఛాయాలోకానికి సంబంధించినదన్న యథార్థమైన గ్రహింపు, అత్యంత గణనీయంగా పేర్కొదగ్గ అభివృద్ధులలో ఒకటి,” అని రాశాడు. సర్ ఆర్థర్ స్టాన్లీ ఎడింగ్టన్, ‘ది నేచర్ ఆఫ్ ది ఫిజికల్ వరల్డ్‌’[5] (భౌతిక ప్రపంచ స్వభావం) అనే గ్రంథంలో. “భౌతికశాస్త్ర ప్రపంచంలో మనం, పరిచిత జీవిత నాటకం తాలూకు ఛాయాచిత్ర ప్రదర్శనను గమనిస్తాం. ఛాయారూపమైన నా చేతిముడుసు, ఛాయారూపమైన టేబిలు మీద ఆనుకుని ఉండగా, ఛాయారూపమైన సిరా, ఛాయారూపమైన కాయితం మీద ప్రవహిస్తూ ఉంటుంది. ఇదంతా ప్రతీకాత్మకం; ప్రతీకగానే విడిచిపెడతాడు దాన్ని, భౌతికశాస్త్రజ్ఞుడు. తరవాత వస్తాడు, మనస్సనే రసవాది; ఈ ప్రతీకల్ని అతను రూపాంతరణ చేస్తాడు. ...చివరికి స్థూలంగా చెప్పాలంటే, “ప్రపంచ మూలద్రవ్యం మనోద్రవ్యమే!”

ఇటీవల ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ (ఋణవిద్యుదణు సూక్ష్మదర్శిని) రూపొందించిన మీదట, అణువులకు సారభూతమయిన కాంతికీ ప్రకృతికి అనివార్యమైన ద్వంద్వతకూ నిశ్చితమైన నిదర్శనం లభించింది. 1937లో, అమెరికన్ ఎసోసియేషన్ ఫర్ ది ఎడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్ అన్న సంస్థవారి సమావేశంలో జరిగిన, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ప్రయోగ ప్రదర్శనను గురించి ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ఇలా రాసింది:

“ఇంతవరకు పరోక్షంగా ఎక్స్‌రేలనే కిరణాల ద్వారా మాత్రమే తెలిసిన, టంగ్‌స్టన్ స్ఫటికాకృతి, ఒక ఫ్లోరసెంట్ స్క్రీన్ (వెల్తురు తెర) మీద స్ఫుటంగా నిలిచింది. ఘనాకారం గల అంతరజాలకం (స్పేస్ లాటిస్) లో తొమ్మిది అణువులు వాటివాటి సరైన స్థానాల్లో ఉన్నాయి; అంటే, ఒక్కొక్క మూల ఒక్కొక్క అణువు చొప్పున, మధ్య మరొకటి, టాగ్‌స్టన్ స్ఫటిక జాలకంలోని అణువులు వెల్తురు తెరమీద, జ్యామితీయమైన నమూనాలో అమర్చిన కాంతి బిందువులుగా పొడగట్టాయి. స్ఫటిక ఘనరూపమైన కాంతిలో తాడనంచేస్తున్న గాలి సూక్ష్మ కణాల్ని, నర్తిస్తున్న కాంతి బిందువులుగా గమనించవచ్చు, కదులుతున్న నీటిమీద మిలమిల మెరిసే సూర్యకాంతి బిందువుల్ని పోలి ఉంటాయి ఇవి. “ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని సూత్రాన్ని మొట్టమొదట 1927 లో, న్యూయార్కు నగరంలోని బెల్ టెలిఫోన్ ప్రయోగశాలల్లో పనిచేసే డా॥ క్లింటన్ డేవిన్‌సన్, డా॥ లెస్టర్ హెచ్. జెర్మర్ కనిపెట్టారు. ఎలక్ట్రాన్‌కు ద్వంద్వ ప్రకృతి ఉందనీ, కణగుణాన్ని తరంగగుణాన్నీ కూడా కనబరుస్తుందనీ వారు కనుక్కొన్నారు.[6] తరంగగుణం, ఎలక్ట్రాన్‌కు కాంతిగుణాన్నిచ్చింది. కటకం (లెన్స్) ద్వారా కాంతిని కేంద్రీకరింప జేసిన మాదిరిగానే ఎలక్ట్రాన్‌లను కూడా కేంద్రీకరింపజేసే సాధనంకోసం అన్వేషణ మొదలయింది.

“భౌతిక ప్రకృతి పరిధికంతకూ ద్వంద్వ వ్యక్తిత్వముందని నిరూపించిన, ఎలక్ట్రాన్ కున్న జెకిల్ - హైడ్ లక్షణాన్ని (ద్వంద్వ ప్రవృత్తిని) కనిపెట్టినందుకుగాను డా॥ డేవిస్‌సన్, భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమానం అందుకున్నాడు.”

‘ది మిస్టీరియస్ యూనివర్స్’[7] (అంతుబట్టని అనంత విశ్వం) అన్న గ్రంథంలో సర్ జేమ్స్ జీన్స్, “జ్ఞాన ప్రవాహం, యాంత్రికంకాని వాస్తవంవేపు ప్రయాణిస్తోంది; ఇప్పుడు విశ్వం, ఒక గొప్ప యంత్రంలా కాక, ఒక గొప్ప భావనలా గోచరించడం మొదలవుతోంది,” అని రాశాడు.

ఈ విధంగా ఇరవయ్యో శతాబ్ది విజ్ఞానశాస్త్రం, అనాది వేదపాఠంలా ధ్వనిస్తోంది.

కనక, తప్పనిసరిగా అవసరమైతే మానవుడు, భౌతిక విశ్వమనేది ఏదీ లేదనీ దాని పడుగుపేకలే మాయ అనీ తెలిపే దార్శనిక సత్యాన్ని విజ్ఞానశాస్త్రం ద్వారా తెలుసుకోవాలి. వాస్తవమనే భ్రాంతి కలిగించే, దాని ఎండమావులన్నీ విశ్లేషణలో కరిగిపోతాయి. తనకు భరోసా ఇచ్చే, భౌతిక జగత్పరమయిన ఆధారాలు ఒకదాని తరవాత ఒకటిగా తనకింద కుప్పగూలి పోతూ ఉంటే మానవుడు, తన విగ్రహారాధక ఆలంబనను- అంటే, “నేను తప్ప మరే దేవుళ్ళూ నీకు ఉండగూడదు,”[8] అన్న దైవాజ్ఞను తాను ఉల్లంఘించానన్న విషయాన్ని - అస్పష్టంగా గ్రహిస్తాడు.

ద్రవ్యరాశికీ శక్తికీ గల సమానత్వాన్ని, తన ప్రఖ్యాత సమీకరణంలో సమీక్షిస్తూ ఐన్‌స్టైన్, పదార్థంలోని ఏ ఒక్క కణంలోని శక్తి అయినా, దాని ద్రవ్యరాశిని - అంటే బరువును - కాంతివేగ వర్గంతో గుణిస్తే వచ్చే ఫలితానికి సమానమని నిరూపించాడు. పదార్థ కణాల నాశనం ద్వారానే అణుశక్తుల్ని విడుదలచెయ్యడం జరిగింది. పదార్థం “మృతి” అణుయుగానికి జన్మ ఇచ్చింది.

కాంతివేగం గణితశాస్త్రీయమైన ఒక ప్రమాణం లేదా స్థిరరాశి కావడానికి కారణం, సెకనుకు 1,86,300 మైళ్ళ వేగంలో నిరపేక్షమైన విలువ ఒకటి ఉందని కాదు; వేగంతోబాటు ద్రవ్యరాశి కూడా పెరుగుతూ ఉండే భౌతిక వస్తువు ఏదీ కూడా కాంతివేగానికి చేరుకోలేకపోవడమే దానికి కారణం. మరోరకంగా చెప్పాలంటే: ద్రవ్యరాశి అనంతంగా ఉన్న భౌతిక వస్తువు మాత్రమే కాంతి వేగానికి సమానవేగం పొందగలదు.

ఈ భావన మనల్ని, అలౌకిక ఘటనల నియమం దగ్గరికి చేరుస్తుంది.

ఇచ్చానుసారంగా తమ శరీరాల్నీ ఇతర వస్తువుల్నీ దృశ్యమానం కాని అదృశ్యంకాని చెయ్యగలిగి, కాంతివేగంతో సంచరించగలిగి, ఏ భౌతిక రూపాన్నయినా సరే తక్షణమే ప్రత్యక్షం కావించడానికి సృజ నాత్మక కాంతి కిరణాల్ని ఉపయోగించగలిగిన సిద్ధపురుషులు విస్మయకరమైన నిబంధనను నెరవేర్చి ఉంటారు: వారి ద్రవ్యరాశి అనంతం.

పరిపూర్ణ యోగి చైతన్యం సంకుచిత శరీరంతో కాకుండా, విశ్వ స్వరూపంతోనే అప్రయత్నంగా ఏకాత్మకమయి ఉంటుంది. గురుత్వాకర్షణ అన్నదీ, న్యూటన్ చెప్పిన “బలం” (ఫోర్స్) అయినా, ఐన్‌స్టైన్ చెప్పిన “జడత్వ ఆవిర్భావం” (మానిఫెస్టేషన్ ఆఫ్ ఇనర్షియా) అయినా భార ధర్మాన్ని ప్రదర్శించాలన్న నిర్బంధం యోగులకు విధించజాలనిది; ఇక్కడ భారదర్మమంటే, భౌతిక వస్తువులన్నిటికీ భేదాన్ని సూచించే గురుత్వాకర్షణ స్థితి. తనను తాను సర్వవ్యాపకమయిన ఆత్మగా ఎరిగిన వాడు దేశకాలాల్లోని దేహపరిమితులకు బద్ధుడై ఉండడు. ‘సో౽హం’ శక్తి ముందు బంధనాలు పటాపంచలయి పోతాయి.

“వెలుతురు ఉండుగాక! వెంటనే వెలుతురు వచ్చింది.”[9] విశ్వాన్ని సృష్టించడానికి దేవుడిచ్చిన మొదటి ఆదేశం, నిర్మాణపరంగా ఆవశ్యకమయిన కాంతిని ఆవిర్భవింపజేసింది. ఈ పదార్థేతర వాహకల తాలూకు కిరణాల మీదనే దైవసాక్షాత్కారాలన్నీ ఆవిర్భవిస్తాయి. దేవుడు జ్వాలగానూ కాంతిగానూ సాక్షాత్కరిస్తాడన్న విషయాన్ని ప్రతి యుగంలోని భక్తులూ ధ్రువపరుస్తారు. “ఆయన కళ్ళు అగ్నిజ్వాలల మాదిరిగా ఉన్నాయి,” అంటాడు సెంట్ జాన్. “...అంతే కాకుండా, ఆయన ముఖాకృతి ప్రచండ భానుతేజంలా ఉంది.”[10]

పూర్ణధ్యానం ద్వారా తన చైతన్యాన్ని సృష్టికర్తలో లయం చేసిన యోగి, జగత్సారాన్ని కాంతిగా (ప్రాణశక్తి స్పందనలుగా) దర్శి స్తాడు. అతని దృష్టిలో, జలకల్పన కారకమైన కాంతి కిరణాలకీ భూకల్పన కారకమైన కాంతి కిరణాలకీ భేదం ఉండదు. పదార్థ స్పృహనుంచీ, దేశం (స్పేస్) తాలూకు మూడు పరిమాణాల నుంచీ నాలుగో పరిమాణమైన కాలం నుంచీ విముక్తుడైన యోగి తన కాంతిరూప దేహాన్ని, భూమి, నీరు, అగ్ని, వాయువుల కాంతి కిరణాలమీదగా గాని, వాటిగుండా గాని సమాన సౌలభ్యంతో మరో చోటికి బదిలీ చేస్తాడు.

“కాబట్టి నీది ఒక్కటే కన్ను అయినట్లయితే, నీ దేహమంతా ‘కాంతితో నిండి’ ఉంటుంది”[11] ముక్తిప్రదమైన దివ్యచక్షువుమీద దీర్ఘకాలం నిలిపిన ఏకాగ్రత, పదార్థానికీ దాని గురుత్వాకర్షణ భారానికి సంబంధించిన భ్రాంతులన్నిటినీ, యోగి నశింపజేసేటట్లు చేసింది. విశ్వాన్ని అతను, ఈశ్వరుడు సృష్టించినట్టే మూలతః అభేదమైన కాంతిపుంజంలాగే- చూస్తాడు.

“దృశాబింబాలు (ఆప్టికల్ ఇమేజెస్), మామూలు హాఫ్‌టోన్ (అర్ధబిందు) చికిలిపని చిత్రాలు రూపొందే సూత్రం మీద ఏర్పడతాయి; అంటే, కంటికి కనిపించనంత చాలా చిన్నచిన్న చుక్కలతో ఏర్పడతాయి. .. నేత్రపటలం (రెటీనా) సూక్ష్మగ్రాహ్యత ఎంత గొప్పదంటే, సరైన తీరు కాంతిని అతిస్వల్ప పరిమాణాల్లో ఉపయోగించుకుని దర్శన సంవేదనను కలిగిస్తుంది.” అంటాడు, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పనిచేసే డా॥ ఎల్. టి. ట్రోలాండ్.

సృష్టి సారాన్ని కాంతిగా అనుభూతం చేసుకున్న ఏ వ్యక్తికయినా సరే అలౌకిక ఘటనల నియమం పనిచేస్తుంది. సర్వవ్యాపక కాంతి అణువుల్ని ఇంద్రియగోచర రూపంగా తక్షణమే ప్రక్షేపించడానికి యోగి, కాంతి దృగ్విషయాల గురించి తనకు గల దివ్యజ్ఞానాన్ని ఉపయోగించ గలుగుతాడు. ప్రక్షేపణ వాస్తవరూపం (ఒక చెట్టు, ఒక మండు, ఒక మానవదేహం; ఏదైనా సరే) యోగి అభిలాషనుబట్టి, అతని సంకల్ప శక్తినిబట్టి, మానస దర్శనశక్తిబట్టి నిర్ణయమవుతుంది.

రాత్రివేళ మనిషి, స్వప్న చేతన స్థితిలోకి ప్రవేశించి, పగటిపూట తన చుట్టూ ఆవరించి ఉండే, అహంభావపరమైన తప్పుడు పరిమితుల నుంచి తప్పించుకుపోతాడు. నిద్రలో అతనికి, అతని మనస్సుకున్న సర్వ శక్తిమత్త్వం ఎప్పటికీ పునరావర్తనమయే విధంగా ప్రదర్శితమవుతూ ఉంటుంది. కలలో, ఏనాడో చనిపోయిన అతని స్నేహితులూ బహుదూరపు ఖండాలు చిన్ననాటి పునరుత్థిత దృశ్యాలూ అన్నీ అపుపిస్తాయి.

మనుషులందరికీ స్వప్న దృగ్విషయాల్లో సంగ్రహంగా తెలిసిన స్వతంత్ర, అనిబద్ధ చైతన్యమే, దైవానుసంధానం కావించిన సాధువుకుండే శాశ్వత, పరిపూర్ణ మనఃస్థితి. దేశకాలాలకు అధిపతి అయి, వ్యక్తిగత ఉద్దేశాలేవీ పెట్టుకోకుండా, సృష్టికర్త తనకు ప్రసాదించిన సృజనాత్మక ఇచ్ఛాశక్తిని ఉపయోగించుకొంటూ యోగి, భక్తుడు చిత్తశుద్ధితో చేసిన ఏ ప్రార్థననైనా సరే ఫలింపజేయడానికి, విశ్వంలోని కాంతి అణువుల్ని పునర్వ్యవస్థితంచేస్తాడు.

“మానవుణ్ణి మన రూపంలో, మన లక్షణాలతో తయారుచేద్దాం. సముద్రంలో ఉన్న చేపలమీద, గాలిలో పక్షులమీద, పశువులమీద, సమస్త భూమిమీద, నేలమీద పాకే ప్రతి జీవిమీదా వాళ్ళకు అధికారం ఇద్దాం, అనుకొన్నాడు దేవుడు.”[12]

ఈ ప్రయోజనం కోసమే మనిషినీ సృష్టినీ చెయ్యడం జరిగింది: ఈ విశ్వంమీద తన ఆధిపత్యాన్ని తెలుసుకొని మాయకు అధికారిగా అతడు పెరగాలని.

1915 లో, నేను సన్యాసం తీసుకున్న కొత్తలో, పరస్పర వైరుద్ధ్యాలుగల అంతర్దర్శనం ఒకటి అనుభూతమయింది. అందులో, మానవ చేతన సాపేక్షత స్పష్టంగా రూఢి అయింది; మాయా సంబంధమైన బాధాకరమైన ద్వంద్వాలకు వెనక ఉన్న శాశ్వత కాంతి అఖండతను స్పష్టంగా దర్శించాను. ఒకనాడు పొద్దున, గుర్పార్ రోడ్డులో ఉన్న నాన్నగారి ఇంట్లో, నా చిన్న అటకగదిలో కూర్చుని ఉండగా నాకు ఈ దర్శనం కలిగింది. అప్పటికి కొన్ని నెలలుగా, మొదటి ప్రపంచయుద్ధం యూరప్‌లో చెలరేగుతూ ఉంది; అధిక సంఖ్యలో సంభవిస్తున్న మరణాల్ని గురించి నేను దిగులుగా ఆలోచిస్తూ ఉన్నాను.

నేను ధ్యానంలో కళ్ళు మూసుకునే సరికి, నా చైతన్యం హఠాత్తుగా, ఒక యుద్ధనౌకమీద ఆధిపత్యంవహించి ఉన్న ఒక కెప్టెన్ శరీరంలోకి బదిలీ అయింది. అటు ఒడ్డున ఉన్న ఫిరంగులూ ఇటు ఓడ ఫిరంగులూ ఒకదానిమీద ఒకటి కాల్పులు జరుపుతూ ఉండగా ఆకాశం దద్దరిల్లి పోతోంది. ఒక పెద్ద ఫిరంగిగుండు వచ్చి మా మందుగుండు కొట్టుకు తగిలి, నా ఓడను బద్దలు చేసింది. ఈ పేలుడులో బతికిన కొద్దిమంది నావికులతోబాటు నేను కూడా నీళ్ళలోకి దూకాను.

గుండె దడదడలాడుతూ ఉండగా, నేను సురక్షితంగా ఒడ్డుకు చేరాను. కాని దురదృష్టం! చెదురుపాటుగా వచ్చిపడ్డ గుండు ఒకటి నా ఛాతీలోకి దూసుకుపోయింది. నేను మూలుగుతూ నేలమీద పడ్డాను. నా శరీరమంతా పక్షవాతం వచ్చినట్టుగా అయింది. అయినా తిమ్మిరెక్కిన కాలు తెలుస్తూనే ఉన్నట్టుగా, నాకు శరీరం మీద స్పృహ తెలుస్తూనే ఉంది. “చివరికి, మృత్యుదేవత రహస్య పదవిన్యాసం నన్ను అందుకొంది,” అనుకున్నాను. కడపటి నిట్టూరుపుతో నేను అచేతన స్థితిలోకి జారిపోబోతూ ఉండగా, ఆశ్చర్యం! నేను గుర్పార్ రోడ్డులోని ఇంటి గదిలో పద్మాసనంలో కూర్చుని ఉన్నానని గమనించాను.

ఛాతీలో తుపాకిగుండు లేని శరీరాన్ని తిరిగి పొందినందుకు నేను ఆనందభరితుణ్ణయి, దాన్ని చేతులతో తట్టి, గిల్లి చూసుకుంటూ ఉంటే, నా కళ్ళలోంచి ఆనంద బాష్పాలు ధారగా స్రవించాయి. నేను బతికే ఉన్నానని రూఢి చేసుకోడానికి ముందుకూ వెనక్కూ ఉయ్యాల ఊగాను; ఊపిరి పీలుస్తూ విడుస్తూ చూసుకున్నాను. నన్ను నే నిలా అభినందించుకుంటూ ఉండగా, నా చైతన్యం మళ్ళీ, రక్తసిక్తమైన సముద్ర తటాన పడిఉన్న కెప్టెన్ శవంలోకి బదిలీ అయిపోయింది. అంతా గందరగోళమయి పోయింది నా మనస్సు.

“ప్రభూ, నేను చనిపోయానా బతికున్నానా?” అంటూ ప్రార్థించాను.

కళ్ళు మిరుమిట్లు గొలిపే మహోజ్వలకాంతి ఒకటి క్షితిజమంతటా నిండింది. మృదువైన మర్మరధ్వని స్పందన ఒకటి మాటలుగా మారింది:

“బతుక్కయినా చావుకయినా కాంతితో ప్రమేయమేమిటి? నా కాంతిబింబంలో నిన్ను సృష్టించాను. చావుపుట్టుకల సాపేక్షతలు విశ్వ స్వప్నానికి చెందినవి. నీ స్వప్నాతీత సత్తను దర్శించు! మేలుకో నాయనా, మేలుకో!”

మానవుడి జాగృతిలో క్రమాభివృద్ధిగా, ఈశ్వరుడు తన సృష్టిలోని రహస్యాల్ని, సరైన సమయంలో, సరైన చోట ఆవిష్కరించడానికి విజ్ఞానశాస్త్రవేత్తల్ని ఉత్తేజపరుస్తూ ఉంటాడు. ఈ విశ్వాన్ని, దైవ ప్రజ్ఞతో సంచాలితమయ్యే కాంతి అనే ఏకైక శక్తికి వివిధరూపాల అభివ్యక్తిగా గ్రహించడానికి అనేక ఆధునిక ఆవిష్కరణలు మానవుడికి తోడ్పడతాయి. చలనచిత్రం, రేడియో, టెలివిజన్, రేడార్, కాంతి విద్యుద్ఘటం (ఫొటో ఎలక్ట్రిక్ సెల్)- ఆశ్చర్యకరమైన “విద్యున్నేత్రం” (ఎలక్ట్రిక్ ఐ), పరమాణు శక్తులు అనే అద్భుతాలన్నీ కాంతికున్న విద్యుదయస్కాంత దృగ్విషయం మీద ఆధారపడ్డవే.

చలన చిత్రకళ ఏ అలౌకిక ఘటననయినా చిత్రీకరించగలదు. ప్రభావోత్పాదక దృశ్య దృక్కోణం నుంచి, ట్రిక్ ఫొటోగ్రఫీకి వశం కాని అద్భుతమంటూ ఏదీ లేదు. మానవుణ్ణి, స్థూలమైన భౌతికకాయం నుంచి లేస్తున్న పారదర్శక సూక్ష్మ శరీరంగా చూడవచ్చు; అతను నీళ్ళ మీద నడవగలడు, చనిపోయినవాళ్ళను తిరిగి బతికించవచ్చు, వికాసాల్లోని సహజక్రమాన్ని ముందు వెనకలు చెయ్యవచ్చు, దేశకాలాల్ని అస్తవ్యస్తం చేసి పారెయ్యవచ్చు. నేర్పరి అయినవాడు ఛాయాచిత్ర బింబాల్ని తన ఇష్టం వచ్చినట్టు కూర్చవచ్చు; నిజమైన సిద్ధపురుషుడు వాస్తవమైన కాంతి కిరణాలతో చేసే మాదిరిగానే దృష్టి విభ్రమాలు సాధించవచ్చు.

సజీవ సాదృశ్యంగల బింబాల్ని ప్రదర్శించే చలన చిత్రాలు, సృష్టికి సంబంధించిన అనేక సత్యాల్ని కళ్ళకు కట్టిస్తాయి. విశ్వ (చలన చిత్ర) దర్శకుడు తన నాటకాలు తనే రాసుకుంటాడు; అనేక శతాబ్దాల వేడుక కోసం, భారీ సంఖ్యలో పాత్రల్ని సమకూరుస్తాడు. అనంతత్వమనే అంధకార శిబిరంలోంచి ఆయన, యుగయుగాంతరాల ఫిల్ములగుండా తన కాంతి కిరణాల్ని ప్రసరింపజేస్తాడు; మహాకాశమనే తెరమీద బొమ్మలు పడుతూ ఉంటాయి.

సినిమా బొమ్మలు వాస్తవాలుగా కనిపించినప్పటికీ, అవి కేవలం వెలుగునీడల కలయికలు మాత్రం అయినట్టు విశ్వసంబంధమైన రూపాలు కూడా వాస్తవికతా భ్రాంతి కలిగిస్తాయి. అసంఖ్యాక జీవరాశులు గల గ్రహగోళాలు, ఒకానొక విశ్వచలనచిత్రంలోని ఆకృతులే తప్ప మరేమీ కావు. మానవుడి జ్ఞానేంద్రియా లైదింటికీ తాత్కాలికంగా నిజమనిపించే ఈ అనిత్య దృశ్యాలు, మానవ చైతన్యమనే తెరమీద, అనంత సృజనాత్మక కిరణం ప్రసరింపజేసినవే.

సినిమా ప్రేక్షకుడు తలపైకి ఎత్తి, తెరమీది బొమ్మలన్నీ నిరాకారమైన ఒక కాంతి కిరణం ద్వారానే కనిపిస్తున్నట్టు చూడవచ్చు. వన్నె వన్నెల జగన్నాటకం కూడా అదే మాదిరిగా, ఒక విశ్వమూలం తాలూకు ఏకైక శ్వేతకాంతినుంచే వెలువడుతోంది. దేవుడు తన పిల్లలకోసం, అనూహ్యమైన చాతుర్యంతో తన గ్రహప్రదర్శనశాలలో “అధికతమ బ్రహ్మాండ” వినోదాన్ని ప్రదర్శిస్తున్నాడు; వాళ్ళనే నటీనటుల్నీ ప్రేక్షకుల్నీ చేస్తున్నాడు.

ఒకనాడు నేను, యూరప్ యుద్ధరంగాలకు సంబంధించిన న్యూస్ రీల్ చూడ్డానికి ఒక సినిమా హాల్లోకి ప్రవేశించాను. పాశ్చాత్యంలో మొదటి ప్రపంచ యుద్ధం ఇంకా చెలరేగుతూనే ఉంది; మారణ కాండను ఆ న్యూస్ రీల్ ఎంత వాస్తవికంగా చూపించిందంటే, నేను హృదయ వ్యథతో హాల్లోంచి బయటికి వచ్చేశాను.

“ప్రభూ, అటువంటి బాధను నువ్వెందుకు అనుమతిస్తావు?” అని ప్రార్థించాను.

నాకు అత్యంత ఆశ్చర్యం కలిగే విధంగా, నిజమైన యూరప్ యుద్ధరంగాల అంతర్దర్శన రూపంలో, తక్షణమే నాకు సమాధానం వచ్చింది. చచ్చిపోయిన వాళ్ళతోటి, పోతూఉన్న వాళ్ళతోటి నిండిఉన్న దృశ్యాలు, ఏ న్యూస్‌రీల్ ప్రదర్శనకయినా ఎంతో మించి ఉండేటంత భయంకరంగా ఉన్నాయి. “పట్టిపట్టి చూడు!” అంటూ ఒక మృదుస్వరం, నా అంతశ్చేతనతో పలికింది. “ఇప్పుడు ఫ్రాన్సులో నటిస్తున్న ఈ దృశ్యాలు, వెలుగు నీడల సయ్యాటలు తప్ప మరేమీ కావని గమనిస్తావు. ఇవి విశ్వచలనచిత్ర దృశ్యాలు; ఒక నాటకంలో అంతర్నాటకంలా- ఇంతకుముందు సువ్వు చూసిన సినిమా న్యూస్ రీల్ ఎంత నిజమైనదో ఇవి అంత నిజమైనవి, లేదా అది ఎంత అబద్ధమైనదో ఇవి అంత అబద్ధమైనవి.”

నా గుండె ఇంకా కుదుటబడలేదు. దివ్యవాణి ఇంకా చెప్పింది: “సృష్టి, వెలుగు నీడా - రెండూను; లేకపోతే బొమ్మ రావడం అసంభవం. మాయాపరమయిన మంచిచెడ్డలు, ఒకదాని తరవాత మరొకటి ఎప్పటికీ ప్రాబల్యం పొందుతూనే ఉంటాయి. ఈ లోకంలో, ఆనందం అనంతంగానే కనక ఉండి ఉంటే, మానవుడు ఎన్నడయినా మరొకదాన్ని కోరుకుంటాడా? బాధ లేనిదే, తాను తన నిత్యనివాసాన్ని విడిచిపెట్టానన్న సంగతి గుర్తు చేసుకోడానికి ఒక్కనాటికి ప్రయత్నించడు. బాధ అనేది జ్ఞాపకానికి ములుగర్ర. దీన్ని తప్పించుకొనే ఉపాయం జ్ఞానం. మరణమనే విషాదం అవాస్తవం; దాన్ని తలుచుకొని గడగడలాడేవాళ్ళు, రంగస్థలం మీద జరుగుతున్న నాటకంలో తన మీదికి పేల్చింది ఖాళీ తూటాయే అయినా జడుసుకొని ప్రాణంవిడిచే అవివేకపు నటుడిలాంటి వాళ్ళు. నా పిల్లలు వెలుతురు మొలకలు; వాళ్ళు ఎల్లకాలం మాయలోనే నిద్రపోతూ ఉండరు.”

నే నంతకుముందు, మాయను గురించి ధార్మిక గ్రంథాల్లో రాసినవి చదివే ఉన్నప్పటికీ, సొంతగా కలిగిన అంతర్దర్శనానుభవంతోనూ దాంతోబాటు వినవచ్చిన అనునయ వాక్యాలతోనూ కలిగినంత గాఢమైన అంతర్దృష్టి ఆ గ్రంథాలవల్ల కలగలేదు. సృష్టి అనేది కేవలం, బృహత్తరమైన ఒక చలన చిత్రమేననీ తన సత్త (ఉనికి) దాంట్లో కాకుండా, దానికి అతీతమైనదాంట్లో ఉందనీ చివరికి నమ్మకం కుదుర్చుకొన్న నాడు, ఎవరి విలువలయినా సమూలంగా మారిపోతాయి.

నేను ఈ అధ్యాయం రాయడం పూర్తిచేసిన తరవాత, నా పక్క మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నాను. నా గదిలో,[13] షేడ్లుగల రెండు దీపాలనుంచి వెలుతురు పలచగా పడుతోంది. నా చూపు పైకి లేపుతూ గది కప్పువేపు చూశాను; అక్కడ చుక్కలు తీర్చినట్టు, సన్న సన్నని ఆవాల వన్నె వెలుగులు కానవచ్చాయి; అవి రేడియం మాదిరి కాంతితో, మిణుకుమిణుకుమంటూ వణుకుతూ ఉండడం గమనించాను. వానజల్లులాంటి అసంఖ్యాకమైన కాంతి శలాకలు, ఒకచోట కూడి పారదర్శక స్తంభాకృతి పొంది మెల్లగా నా మీద పడుతున్నాయి.

వెంటనే నా భౌతికదేహం తన స్థూలత్వాన్ని కోల్పోయి సూక్ష్మ దేహంగా మారిపోయింది. పక్కను అంటీ అంటకుండా, బరువులేని నా దేహం, ఒకోసారి ఎడమవేపుకి ఒకోసారి కుడివేపుకి కొద్దికొద్దిగా కదులుతూ తేలుతున్నట్టు అనిపించింది. గది చుట్టూ కలియజూశాను; ఫర్నిచరూ గోడలూ మామూలుగానే ఉన్నాయి; కాని ఆ చిన్న కాంతిపుంజం ఎన్ని రెట్లు పెరిగిపోయిందంటే, గదిలో కప్పు అవుపడకుండా పోయింది. నేను ఆశ్చర్యచకితుణ్ణి అయాను.

“ఇదే బ్రహ్మాండ చలనచిత్ర యంత్రాంగం.” కాంతిలోంచే వెలువడుతున్నట్టుగా, ఒక స్వరం పలికింది. “నీ పక్కబట్టల తెల్లటి తెరమీద తన కిరణాన్ని ప్రసరింపజేస్తూ నీ దేహచిత్రాన్ని రచిస్తోంది. చూడు, నీ రూపం, కాంతి తప్ప మరేం కాదు!” నేను నా చేతులవేపు చూసుకుని ముందుకూ వెనక్కూ ఆడించాను. అయినా వాటి బరువు నాకు తెలియలేదు. ఒకానొక ఆనంద పారవశ్యం నన్ను ముంచెత్తేసింది. నా శరీరంగా రూపు గడుపుతున్న విశ్వకాంతి స్తంభం, సినిమా హాల్లో ప్రొజెక్షన్ బూత్ లోంచి పారుతూ తెర మీద బొమ్మల్ని రూపు గట్టించే కాంతి కిరణాలకు దివ్యప్రత్యుత్పాదనలా పొడగట్టింది.

నా శరీర చలనచిత్రానుభవం, మసక వెలుతురుగల ప్రదర్శనశాలవంటి నా పడగ్గదిలో, చాలాసేపు పొందాను. అంతకు పూర్వం నాకు అనేక అంతర్దర్శనాలు కలక్కపోలేదు; కాని ఇది వాటన్నిటికన్న విశిష్టమైనది. స్థూల శరీర భ్రాంతి పూర్తిగా తొలగిపోవడంతోను, సమస్త వస్తువుల సత్త్వమూ కాంతేనన్న అనుభూతి గాఢంకావడంతోను నేను పైకి, స్పందనశీలమైన ప్రాణాణువుల (లైఫ్ ట్రాన్‌ల) వేపు చూసి:

“దివ్యజ్యోతీ, నా ఈ వినమ్ర దేహ చిత్రాన్ని దయచేసి నీలో కలిపేసుకో; ఎలిజాని జ్వాలారథంలో స్వర్గానికి తీసుకుపోయినట్టు,”[14] అని వినయపూర్వకంగా అన్నాను. ఈ ప్రార్థన ఎవరినయినా చకితుల్ని చేస్తుందన్నది స్పష్టం; కిరణం అదృశ్యమయింది. నా శరీరానికి మళ్ళీ మామూలు బరువు వచ్చి పక్కలో కూలబడింది. మిరుమిట్లు గొలిపే గది కప్పు నన్ను దీపసమూహాలు అల్లల్లాడి ఆరిపోయాయి. బహుశా నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే సమయం ఇంకా ఆసన్నం కానట్టుంది.

“పైగా, నా అహంకారానికి ఎలిజాకి రవ్వంత కోపం కూడా రావచ్చు!” అనుకున్నాను తాత్త్విక దృష్టితో.

 1. టాల్‌స్టాయ్‌కీ మహాత్మాగాంధీకి అనేక ఆదర్శాల్లో పోలిక ఉంది. వీరిద్దిరూ అహింసావిషయంమీద ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుకున్నారు. “హింసను (హింసతో) ఎదుర్కోకండి” (మత్తయి 5 : 39) అన్నదాన్నే క్రీస్తు ప్రధాన బోధగా పరిగణించాడు టాల్‌స్టాయ్; హింసను, దానికి తార్కికంగా ఉపయుక్తమైన మంచితో లేదా ప్రేమతోనే “ఎదుర్కో”వాలి.
 2. ఈ కథకు చారిత్రక ఆధారం ఒకటి ఉన్నట్టు కనిపిస్తోంది; మత గురువు ఆ ముగ్గురు సాధువుల్నీ, ఆర్కేంజల్ నుంచి స్లావెట్‌స్కీ మఠానికి వెళ్ళడానికి నౌకలో ప్రయాణం చేస్తూ డ్వీయన్ నది ముఖద్వారం దగ్గర కలుసుకున్నాడని సంపాదకీయ గమనిక వల్ల తెలుస్తోంది.
 3. 10 పుటలో అధోజ్ఞాపిక చూడండి.
 4. గొప్ప ఆవిష్కర్త అయిన మార్కొనీ, చరమతత్త్వాలముందు శాస్త్ర అసమగ్రతను అంగీకరిస్తూ ఇలా చెప్పాడు; “జీవితాన్ని పరిష్కరించడం విషయంలో విజ్ఞానశాస్త్రానికి గల అసమర్థత అద్వితీయమైనది. విశ్వాసమే కనక లేకపోయినట్లయితే ఈ యథార్థం నిజంగా భయంకరంగా ఉండేది. మనిషి ఆలోచనకు ఎదురయే సమస్యల్లో అన్నిటికన్న ఎక్కువగా ఎప్పుడూ వేధించే సమస్య జీవిత రహస్యమేనన్నది నిశ్చయం.”
 5. మాక్మిలన్ కంపెనీ,
 6. అంటే, పదార్థమూ శక్తి రెండూ అన్నమాట.
 7. కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్.
 8. ఎక్సోడస్ 20 : 3 (బైబిలు).
 9. జెనిసిస్ 1-3 (బైబిలు)
 10. రివలేషన్ 1 : 14-16,
 11. మత్తయి 6-23.
 12. జెనిసిన్ 1 : 26 (బైబిలు)
 13. కాలిఫోర్నియా, ఎన్సినిటాన్‌లోని సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఆశ్రమంలో (ప్రచురణకర్త గమనిక).
 14. II కింగ్స్ 2 : 11 (బైబిలు).

అలౌకిక ఘటన ( “మిరకిల్”) అనేది సామాన్యంగా, నియమరహితంగా గాని నియమానికి అతీతంగాగాని వచ్చే ఫలితంగా లేదా జరిగే ఘటనగా భావిస్తారు. కాని సునిశితంగా వ్యవస్థితమై ఉన్న విశ్వంలో సంభవించే ఘటనలన్నీ నియమాను సారంగా జరిగేవీ, నియమానుసారంగా వివరించగలిగినవీను. మహాసిద్ధపురుషుని అలౌకిక శక్తులనేవి, అతని ఆంతరిక చైతన్య జగత్తులో పనిచేసే సూక్ష్మనియమాల యథార్థావగాహన ననుసరించి సహజంగా సహచరించేవే. ప్రతిదీ అలౌకిక ఘటనేనన్న గంభీరమైన అర్థంలో తప్పితే, దేన్నీ “అలౌకిక ఘటన”గా చెప్పగూడదు. మనలో ప్రతి ఒక్కరూ సంక్లిష్టంగా వ్యవస్థితమైన శరీరంతో రూపొంది ఉండడమూ నక్షత్రాల మధ్య రోదసిలో గుడిమళ్ళు తిరుగుతూండే భూమిమీద మనని ఉంచడమూ. ఏమైనా అతిసామాన్యమైన విషయాలా? లేకపోతే, ఆత్మలౌకిక ఘటనలా? ఏసుక్రీస్తూ, లాహిరీ మహాశయుల వంటి మహాప్రవక్తలు సాధారణంగా చాలా అలౌకిక ఘటనలు ప్రదర్శిస్తారు. అటువంటి మహానుభావులు మానవ జాతి కళ్యాణం కోసం, విస్తృతమూ కఠినమూ అయిన ఆధ్యాత్మిక లక్ష్యసాధనకు కృషి చెయ్యవలసి ఉంటుంది; కష్టాల్లో ఉన్నవారికి అలౌకిక శక్తితో సాయపడ్డం, దాంట్లో ఒక భాగంగా కనిపిస్తుంది. కుదర్చడానికి వీలుకాని జబ్బులకూ పరిష్కరించడానికి వీలుకాని మానవ సమస్యలకూ దైవాజ్ఞలు అక్కరపడతాయి. కపెర్న హూమ్‌లో ఒక పెద్దమనిషి, చావుబతుకుల్లో ఉన్న తన కొడుక్కి నయం చెయ్యమని కోరినప్పుడు ఏసుక్రీస్తు, ఇలా అన్నాడు: “మీరు సూచిక క్రియలనూ అద్భుతాలను చూస్తే కాని నమ్మరు,” అని తరవాత అన్నాడు: “నీ దారిన నువ్వు వెళ్ళు; నీ కొడుకు బతుకుతాడు”. యోహాను 4 : 46-54 (బైబిలు). ఈ అధ్యాయంలో నేను, భౌతిక లోకాలకు ఆధారభూతమైన భ్రాంతిజనక ఇంద్రజాల శక్తి అయిన మాయకు వేదాల్లో ఇచ్చిన వ్యాఖ్యను వివరించాను. అణు ‘‘పదార్థం”లో అసత్తు అనే ‘ఇంద్రజాలం’ వ్యాపించి ఉంటుందని పాశ్చాత్మ విజ్ఞానశాస్త్రం ఇప్పటికే కనిపెట్టింది. అయితే, ప్రకృతి మట్టుకే కాకుండా, మనిషి కూడా (తన మర్త్యత్వపరంగా) మాయకు లోబడి ఉంటాడు; అంటే, సాపేక్షతా సిద్ధాంతం, పరస్పర వైరుధ్యం, ద్వంద్వత, విలోమం, వ్యతిరేక స్థితులు అన్న వాటికి లోబడి ఉంటారు. మాయను గురించిన సత్యం మనుషులొక్కరికే అర్థమయిందని ఊహించుకో గూడదు. బైబిలు పాతనిబంధన గ్రంథం ప్రవక్తలు మాయను సాతాను (హిబ్రూలో, “శత్రువు”) అన్న పేరుతో వ్యవహరించారు. గ్రీకు టెస్టమెంటులో సాతానుకు సమానార్థకంగా డయబోలస్ లేదా డెవిల్ (దయ్యం) అన్న పదం వాడారు. సాతాను లేదా మాయ, ఏకైక నిరాకార సత్యాన్ని, మరుగుపరచడానికి అనేకానేక రూపాలు కల్పించే బ్రహ్మాండ ఇంద్రజాలకుడు. భగవంతుడి ప్రణాళికలోనూ ఆట (లీల) లోనూ సాతాను లేదా మాయకున్న ఏకైక ప్రయోజనం మానవుణ్ణి, పరమాత్మనుంచి పదార్థానికి సత్తునుంచి అసత్తుకూ మళ్ళించడానికి ప్రయత్నించడం. మాయను క్రీస్తు, దయ్యమనీ, హంతకుడనీ, అబద్ధాలకోరు అనీ కళ్ళకు కట్టించే విధంగా వర్ణిస్తాడు. “దయ్యం... ఆదినుంచీ హంతకుడే; అతని నివాసం సత్యంలో లేదు; అతనిలో సత్యం లేకపోవడమే దానికి కారణం. అతను ఏదైనా అబద్ధం చెబితే, తనంతట తానే చెబుతాడు: ఎంచేతంటే అతను అబద్ధాలకోరు! అతనే దాన్ని కల్పిస్తాడు.” (యోహాను : 8 : 44).

“దయ్యం ఆది నుంచీ పాపం చేస్తూనే ఉంది. ఈ కారణంగా దేవుడి కుమారుడి ఆవిర్భావం జరిగింది. అతడు దయ్యం చేసే పనులు నాశనం చేయ్యడానికి.” (V యోహాను 3 : 8), అంటే, స్వయంగా మానవుడి సత్తలోనే ఉన్న కూటస్థ చైతన్యం (అంటే, క్రీస్తు చైతన్యం) ఆవిర్భావం, భ్రాంతుల్ని లేదా “దయ్యం పనుల్ని” అలవోకగానే నాశనం చేస్తుంది. మాయ “ఆది నుంచీ” ఉండడానికి కారణం, భౌతిక ప్రపంచాల్లో అది నిర్మాణాత్మకంగా అంతర్గతమై ఉండడమే. ఇవి ఎప్పటికి మార్పుకు లోనవుతూనే ఉంటాయి, ఈ పరివర్తనశీలక దైవ పరివర్తనరాహిత్యానికి విరుద్ధమైనది.