ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అధ్యాయం : 29

రవీంద్రనాథ్ టాగూరు, నేను

విద్యాలయాల్ని పోల్చిచూడడం

“ఆత్మాభివ్యక్తికి సహజమైన రూపంలో, పక్షులు పాడినంత అవలీలగా పాడడం రవీంద్రనాథ్ టాగూరుగారు నేర్పారు మాకు.”

మా రాంచీ విద్యాలయంలో చదివే పధ్నాలుగేళ్ళ కుర్రవాడు భోలానాథ్ చెప్పిన సంగతి ఇది. ఒకనాడు పొద్దున, అతను పాడిన శ్రావ్యమైన పాటలకు నేను అభినందించినప్పుడు చెప్పాడిది. ప్రేరణ ఉన్నా లేకపోయినా కూడా, ఆ అబ్బాయి రాగయుక్తంగా గానం చేశాడు. అంతకుముందు ఆతను బోల్పూరులో టాగూరుగారి “శాంతి నికేతనం” అనే ప్రసిద్ధ విద్యాలయంలో చదివాడు.

“రవీంద్రుల పాటలు చిన్నప్పటినించీ నా పెదవులమీద ఆడుతూనే ఉన్నాయి,” అన్నాను అతనితో. “అక్షరాలు రాని రైతులతో సహా, బెంగాలీ లందరూ ఆయన మహోన్నత కవిత్వానికి ముచ్చటపడతారు.”

బోలా, నేనూ కలిసి టాగూరు పాటలు కొన్ని కలిసి పాడుతున్నాం. ఆయన కొన్ని వేల భారతీయ కవితలకు స్వరకల్పన చేశారు; వాటిలో కొన్ని ఆయన రాసినవీ, కొన్ని పూర్వకవులవీ.

“రవీంద్రనాథ్‌గారు సాహిత్యానికి నోబెల్ బహుమానం తీసుకున్న క్రొత్తలో నేను ఆయన్ని కలుసుకున్నాను.” అన్నాను నేను, పాటలు పాడడం అయిన తరవాత. “ఆయన్ని కలుసుకోవాలన్న ఆసక్తి నాకు కలగడానికి కారణమేమిటంటే, సాహిత్య విమర్శకులకు బుద్ధిచెప్పి పంపడంలో ఆయనకున్న నిష్కపటమైన సాహసం నాకు నచ్చింది,” అంటూ ముసిముసిగా నవ్వుకున్నాను.

బోలాకు ఆసక్తి కలిగి, ఆ వృత్తాంతం చెప్పమన్నాడు నన్ను.

“బెంగాలీ కవిత్వంలో కొత్తశైలి ప్రవేశపెట్టినందుకు, టాగూరును పండితులు తీవ్రంగా విమర్శించారు,” అంటూ ప్రారంభించాను. “ఆయన, పండితుల హృదయాలకు ప్రీతిపాత్రమైన లాక్షణిక నియమాల్ని పట్టించుకోకుండా, వాడుక భాషాప్రయోగాలూ ప్రాచీన కావ్యభాషా ప్రయోగాలూ కలిపి రాసేశారు. పూర్వులు అంగీకరించిన సాహిత్య రూపాల్ని లెక్క చెయ్యకుండా, ఆయన పాటలు, గాఢమైన దార్శనిక సత్యాన్ని హృదయానికి హత్తుకునే మాటల్లో పొందుపరుస్తాయి.

పలుకుబడి గల ఒక విమర్శకుడు రవీంద్రనాథ్‌ను కించపరిచే ధోరణిలో, ‘తన కూతల్ని అచ్చులో రూపాయికి అమ్మిన పిట్టకవి’ అని ఆయన్ని అన్నాడు; కాని టాగూరుకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం త్వరలోనే వచ్చింది; ఆయన తమ గీతాంజలి (ప్రార్థన గీతాలు) ని తామే ఇంగ్లీషులోకి అనువాదంచేసిన వెంటనే పాశ్చాత్య సాహితీలోకం ఆయనకు నివాళు లర్పించింది. ఒకప్పుడు ఆయన్ని విమర్శించినవాళ్ళతో సహా, ఒక రైలుబండి పట్టేటంతమంది పండితులు ఆయనకి అభినందనలు అందించడానికి శాంతి నికేతనం వెళ్ళారు.

“రవీంద్రులు, కావాలనే చాలాసేపు జాప్యంచేసి మరీ కలునుకున్నారు అతిథుల్ని. తరవాత, వాళ్ళు చేసి పొగడ్తల్ని, నిర్వికారంగా మౌనం వహించి విన్నారు. చివరికి, వాళ్ళు అలవాటుగా ఉపయోగించే విమర్శాయుధాల్ని వాళ్ళమీదికే ఎదురు తిప్పారు. “ ‘మహాశయులారా, మీ రిక్కడ నా మీద కురిపిస్తున్న ప్రశంసల సుగంధ వర్షమూ, వెనకటి మీ తృణీకార దుర్గంధమూ పొందికలేకుండా కలిశాయి. నాకు నోబెల్ బహుమానం రావడానికీ మీలో ప్రశంసాశక్తులు సునిశితంకావడానికి ఏమైనా సంబంధం ఉండి ఉంటుందా? నే నిప్పటికీ - వంగదేవాలయంలో మొదట నా వినయ పుష్పాలు అర్పించినప్పుడు మీకు ఆగ్రహం కలిగించిన కవినే.’ ”

“టాగూరుగారి నిర్భయమైన మందలింపు వృత్తాంతాన్ని వార్తా పత్రికలు ప్రకటించాయి. పొగడ్తకు లొంగిపోని ఆ వ్యక్తి నిష్కపటంగా అన్న ఆ మాటలు నాకు బాగా నచ్చాయి,” అంటూ ఇంకా చెప్పాను. “రవీంద్రుల కార్యదర్శి సి. ఎఫ్. ఆండ్రూస్[1]గారు నన్ను కలకత్తాలో ఆయనకు పరిచయంచేశారు; ఆండ్రూస్‌ గారు సాదాగా బెంగాలీ పంచె కట్టుకునేవారు. టాగూరుగారిని ఆయన ప్రేమ పురస్సరంగా ‘గురు దేవులు’ అని పిలిచేవారు.

“రవీంద్రులు నన్ను ఆదరపూర్వకంగా పలకరించారు. ఆయన వ్యక్తిత్వంలో ఆకర్షణ, సంస్కారం, నాగరికత తొణికిసలాడుతున్నాయి. ఆయన సాహిత్య పరిచయాన్ని గురించి నే నడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ ఆయన, తాము ప్రధానంగా ప్రభావితులైనది మన పురాణేతిహాసాల వల్లా, పద్నాలుగో శతాబ్ది నాటి విద్యాపతి అనే కవి రచనలవల్లా అని చెప్పారు.”

ఈ జ్ఞాపకాలతో ఉత్తేజితుణ్ణి అయి, ప్రాచీన వంగగీతానికి టాగూరుగారు రూపకల్పన చేసిన, “అమారే ఏ ఘరే, అప్నార్ కరే గృహదీపథానీ జాలో” [నా ఇంట్లో నీ చేత్తో గృహదీపం వెలిగించు; అంటే, నీ ప్రేమదీపాన్ని వెలిగించు! అంటూ పాడడం మొదలు పెట్టాను. భోలా నేనూ ఆనందంగా పాడుకుంటూ విద్యాలయ రూముల్లో విహరించాం.

రాంచీ విద్యాలయాన్ని స్థాపించిన రెండేళ్ళకి, రవీంద్రుల దగ్గర్నించి నాకొక ఆహ్వానం వచ్చింది; మా విద్యాబోధనాదర్శాల్ని కలిసి ముచ్చటించుకోడానికి నన్ను శాంతినికేతనానికి వచ్చి కలుసుకోమని కోరారు. నేను సంతోషంగా వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆ మహాకవి తమ పఠన మందిరంలో కూర్చుని ఉన్నారు. మేము మొట్టమొదట కలుసుకున్నప్పుడు అనిపించినట్టే ఇప్పుడు కూడా, ఆయన రూపం, ఏ చిత్రకారుడయినా ఉత్తమ పురుషాకృతిని చిత్రించడానికి ఆదర్శంగా కోరేటంత ప్రస్ఫుటంగా ఉందని అనిపించింది. కులీనత ఉట్టిపడే విధంగా, శిల్పకారుడు తీర్చి దిద్ది నట్టున్న ముఖానికి చుట్టూ పొడుగాటి జుట్టు, వంకులు వంకుల గడ్డమూ ఉన్నాయి. విశాలమైన దయార్ద్రనేత్రాలూ, దివ్యదరహాసమూ; అక్షరాలా సమ్మోహపరచే వేణునాదం వంటి కంఠస్వరమూ. దృఢంగాను, నిటారుగాను, గంభీరంగాను ఉండే ఆయన రూపం, దాదాపు స్త్రీసహజమైన మార్దవాన్నీ శిశుసహజమైన ఆనందమయ స్వచ్ఛందతనూ మేళవించినట్టు ఉంది. కవిని గురించిన ఏ ఆదర్శభావనా, ఈ సౌమ్య గాయకునిలో కంటె మరెవరిలోనూ సముచితంగా రూపుగట్టలేదు.

కాస్సేపట్లో టాగూరుగారూ నేనూ, ఛాందసానికి తావులేని ఆదర్శాలతో స్థాపించిన మా విద్యాలయాల్ని ఒక దాంతో ఒకటి పోల్చి పరిశీలించడంలో మునిగిపోయాం. ఆరుబయట చదువు చెప్పడం, నిరాడంబరత, కుర్రవాడి సృజనశీలతకు సమృద్ధిగా అవకాశం కల్పించడం వంటి సమాన లక్షణాలు చాలా ఉన్నట్టు కనిపెట్టాం. అయితే రవీంద్రులు, సాహిత్య, కవిత్వ అధ్యయనానికి, భోలా విషయంలో వెనక నేను గమనించినట్టుగా సంగీతంద్వారానూ గానంద్వారానూ ఆత్మాభివ్యక్తికి చెప్పుకోదగినంత ప్రాముఖ్యం ఇచ్చారు. శాంతినికేతన విద్యార్థులు మౌనకాలాలు పాటించడం మట్టుకు జరుగుతోంది కాని, వాళ్ళకి ప్రత్యేక యోగాభ్యాసం ఏదీ నేర్పడం లేదు.

రాంచీలో విద్యార్థులందరికీ నేర్పే శక్తిసంవర్ధక “యోగదా” అభ్యాసాలగురించి, యోగధారణ పద్ధతుల గురించి నేను వివరిస్తుంటే ఆ మహాకవి, ప్రశంసాసూచకమైన శ్రద్ధతో విన్నారు.

టాగూరుగారు, చిన్నప్పటి తమ చదువులో ఎదురైన సంఘర్షణను గురించి నాకు చెప్పారు. “ఐదో తరగతి తరవాత నేను బళ్ళోంచి పారిపోయాను,” అంటూ నవ్వుతూ చెప్పారు. ఈయనకు జన్మసిద్ధంగా వచ్చిన, కవిసహజమైన కోమలత్వానికీ, నిస్సారమూ నిరంకుశమూ అయిన పాఠశాల వాతావరణానికి ఎలాగూ సరిపడదన్న సంగతి వెంటనే అర్థంచేసుకున్నాను.

“అంచేతే నేను, నీడనిచ్చే చెట్లకింద, విశాలాకాశం కింద శాంతి నికేతనం స్థాపించాను.” అందమైన తోటలో చదువుకుంటున్న చిన్న పిల్లలగుంపు వేపు చూపించారాయన.

“పిల్లవాడు పువ్వుల మధ్యా పాటలు పాడే పక్షుల మధ్యా తన సహజ వాతావరణంలో ఉంటాడు. అక్కడే వాడు తన వ్యక్తిగత ప్రతిభ తాలూకు గుప్త సంపదను మరింత సులువుగా వ్యక్తం చెయ్యవచ్చు. నిజమైన విద్యాబోధన, లోపల ఉన్న అనంత జ్ఞాననిధిని బయటికి తీసుకు రావడానికి సాయపడుతుందే కాని, బయటి వనరుల నుంచి లోపలికి ఎక్కించి దట్టించడం జరగదు.”

దాంతో నేను ఏకీభవిస్తూ, “మామూలు బళ్ళలో, గణాంక వివరాలూ చారిత్రకయుగాలు వంటి ప్రత్యేక సత్యాలవల్ల, కుర్రవాళ్ళకుండే ఆదర్శా త్మక, వీరపూజా సంబంధమైన సహజాతాలు శుష్కించిపోతున్నాయి.” అన్నాను.

ఆ మహాకవి, తమ తండ్రిగారు దేవేంద్రనాథ్‌గారి గురించి ప్రేమ పురస్సరంగా చెప్పారు; శాంతినికేతన స్థాపనకు స్ఫూర్తినిచ్చినవారు ఆయన.

“నాన్నగారు, సారవంతమైన ఈ భూమిని నాకు బహూకరించారు; దీంట్లో అంతకు పూర్వమే ఆయన ఒక అతిథి గృహం, దేవాలయం నిర్మించారు,” అని చెప్పారు రవీంద్రులు. “ఇక్కడ నా విద్యాబోధన ప్రయోగాన్ని 1901 లో, ఒక్క పదిమంది కుర్రవాళ్ళతో ప్రారంభించాను. నోబెల్ బహుమానంతో వచ్చిన ఎనిమిదివేల పౌన్ల డబ్బూ ఈ విద్యాలయ నిర్వహణకే ఖర్చయింది.”

“మహాఋషి”గా పేరొందిన దేవేంద్రనాథ్ టాగూరుగారు, అత్యంత గణనీయులైన వ్యక్తి; ఈ సంగతి ఆయన ‘ఆత్మకథ’ చదివి గ్రహించవచ్చు. మంచి పడుచు వయస్సులో ఆయన రెండేళ్ళపాటు హిమాలయాల్లో ధ్యానంలో గడిపారు. ఆయన తండ్రి ద్వారకానాథ్ టాగూరుగారు, ప్రజా హితంగా చేసిన దానధర్మాలవల్ల వంగదేశమంతకూ మాన్యులయారు. ఈ ఆదర్శ వంశవృక్షం నుంచి మేధావి కుటుంబం ఉద్భవించింది. రవీంద్రులు ఒక్కరే కాదు; ఆయన బంధువులందరూ కూడా సృజనాత్మక అభివ్యక్తికి వన్నెకెక్కిన వారు. ఆయన సోదరుల కుమారులు, గగనేంద్రులూ అవనీంద్రులూ, భారతదేశపు అగ్రశ్రేణి చిత్రకారులుగా చెప్పుకోదగ్గవారు. రవీంద్రుల సోదరులు ద్విజేంద్రులు, గాఢద్రష్ట అయిన దార్శనికులు; పక్షులూ వన్యప్రాణులూ కూడా ఆయన్ని అభిమానించేవి.

ఆ రోజు రాత్రికి నన్ను అతిథిగృహంలో ఉండిపొమ్మని కోరారు రవీంద్రులు. ఆ సాయంత్రం మొగసాలలో కవీంద్రులూ తదితరుల బృందమూ ఉన్న దృశ్యాన్ని చూసి ముగ్ధుణ్ణి అయాను. కాలచక్రం వెనక్కి తిరిగింది; నా ఎదుట ఉన్న దృశ్యం ప్రాచీనమైన ఒక ఆశ్రమంలా ఉంది - ఆనందమయుడైన ఆ గాయకుడి చుట్టూ ఆయన భక్తులు పరివేష్టించి ఉన్నారు; వారి చుట్టూ దివ్య ప్రేమ పరివేషం ప్రకాశిస్తోంది. ప్రతి స్నేహగ్రంథినీ టాగూరుగారు, సామరస్య తంతువులతో అల్లారు. ఎన్నడూ ఒత్తిచెప్పే తత్త్వంలేని ఆయన, ఒకానొక అనివార్య ఆకర్షణతో హృదయాన్ని లోబరుచుకున్నారు. ఈశ్వరుడి ఉద్యానంలో కుసుమిస్తున్న అరుదైన కవితాప్రసూనం సహజ పరిమళంతో ఇతరుల్ని ఆకర్షిస్తోంది!

రవీంద్రులు, తాము కొత్తగా రచించిన ఉత్కృష్ట కవితలు కొన్ని, శ్రావ్యమైన స్వరంతో పాడి వినిపించారు. చాలామట్టుకు ఆయన పాటలూ, నాటికలూ, విద్యార్థుల ఆహ్లాదంకోసం రాసినవి; వాటిని శాంతినికేతనం లోనే రచించారు. ఆయన పద్యాల్లో నాకు కనిపించిన సొగసు ఏమిటంటే, దాదాపు ప్రతి పంక్తిలోనూ దేవుణ్ణి ప్రస్తావిస్తూ ఉన్నప్పటికీ ఆయన పవిత్ర నామాన్ని చాలా అరుదుగా పలకడం. “గానం చేసేటప్పుడు కలిగే ఆనందంలో మత్తెక్కి, నన్ను నేనే మరిచిపోయిు, నాకు ప్రభువులైన నిన్ను, మిత్రమా అని పిలుస్తుంటాను” [సురేర్ ఘోరే ఆప్నా కే జాఈ భూలే, బంధూ బలే డాకి మోర్ ప్రభూకే] అని రాశారాయన.

ఆ మర్నాడు మధ్యాహ్న భోజనం అయిన తరవాత మహాకవిగారి దగ్గర, తప్పనిసరిగా సెలవు తీసుకున్నాను. అప్పటి ఆయన చిన్న విద్యాలయం ఇప్పుడు విశ్వభారతి[2] పేరుతో ఒక అంతర్జాతీయ విశ్వ విద్యాలయంగా వృద్ధిచెంది, అనేక దేశాల విద్యార్థులకు ఇక్కడ ఆదర్శవంతమైన వాతావరణం లభిస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది.

“ఎక్కడ నిర్భయంగా ఉంటుందో మనస్సు, ఎక్కడ ఎత్తున నిలుస్తుందో శిరస్సు;
ఎక్కడ స్వేచ్ఛ ననుభవిస్తుందో జ్ఞానం;
ఇరుకిరుకు గదులపెట్టె మాదిరి అడ్డుగోడలతో ఎక్కడ ముక్కలుకాక ఉంటుందో ప్రపంచం;
మాటలు సత్యగర్భంలోంచి వెలువడేది ఎక్కడో;
అలుపెరగని పరిశ్రమ పరిపూర్ణతవేపు చేతులు చాపేది ఎక్కడో;
వివేక నిర్మల స్రవంతి, తుచ్ఛ ఆచారాల నిస్సార మరు భూమిలో దారి తప్పకుండా ఉండేది ఎక్కడో;
ఎప్పటికీ విస్తరిస్తూనే ఉండే ఆలోచనగా, చర్యగా, మనస్సును నువ్వెక్కడ నడిపిస్తూ ఉంటావో;
ఆ స్వాతంత్ర్య స్వర్గసీమలో, తండ్రీ, మేల్కొనేలా చెయ్యి నా దేశాన్ని![3]
                                                                                   - రవీంద్రనాథ్ టాగూరు

  1. మహాత్మాగాంధీ సన్నిహితుడైన ఆంగ్ల రచయిత, ప్రకాశకుడు.
  2. 1950 జనవరిలో, ‘విశ్వభారతి’ అధ్యాపకులు, విద్యార్థులూ అరవై ఐదు మంది రాంచీ వచ్చి యోగదా సత్సంగ విద్యాలయంలో పది రోజులు ఉన్నారు.
  3. గీతాంజలి (మాక్మిలన్ కంపెనీ).