ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 28

వికీసోర్స్ నుండి

అధ్యాయం : 28

కాశీ పునర్జన్మ, వెల్లడి

“నీళ్ళలోకి దిక్కండి. బకెట్లు ముంచుకుని స్నానాలు చేద్దాం.”

నేను మా రాంచీ కుర్రవాళ్ళకు చెప్పిన మాటలివి; దగ్గరలో ఉన్న కొండకు వెళ్ళడానికి నాతోబాటు ఎనిమిదిమైళ్ళు నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు. ఎదురుగా ఉన్న నీటి మడుగును చూస్తుంటే మమ్మల్ని రమ్మని పిలుస్తున్నట్లే ఉంది అది; కాని నా మనస్సులో దానిమీద ఒక రకం విరక్తి కలిగింది. చాలామంది పిల్లలు బకెట్లు ముంచుకోడం మొదలుపెట్టారు; కాని కొందరు కుర్రవాళ్ళు చల్లటినీళ్ళు కలిగిస్తున్న వ్యామోహానికి లోబడిపోయారు. వాళ్ళలా నీళ్ళలో మునిగారో లేదో, పెద్ద పెద్ద నీటి పాములు వాళ్ళ చుట్టూ అల్లల్లాడాయి, ఏం అరుపులు! ఏం చిందులు! మడుగులోంచి బయటపడ్డానికి వాళ్ళు చూపిన ఆత్రం ఎంత వినోదం కలిగించిందో!

చేరవలసిన చోటికి చేరిన తరవాత మేము ఆనందంగా వనభోజనం చేశాం. నేను ఒక చెట్టుకింద కూర్చున్నాను; కుర్రవాళ్ళు నా చుట్టూ కూర్చున్నారు. నేను ఉత్తేజకరమైన మనఃస్థితిలో ఉండడం చూసి వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపించారు.

“ఏమండీ, నేను ఎప్పటికీ వైరాగ్య మార్గంలో మీతోనే ఉంటానా? చెప్పండి స్వామీజీ?” అని అడిగాడు ఒక కుర్రవాడు. “అఁ హఁ! ఉండవు,” అన్నాను, “నిన్ను బలవంతంగా ఇంటికి లాక్కెళ్ళిపోతారు; తరవాత నువ్వు పెళ్ళి చేసుకుంటావు.”

నమ్మశక్యం కాక, అతను నే నన్నదానికి తీవ్రంగా అభ్యంతరం చెప్పాడు: “నేను చచ్చిపోతేనే, వాళ్ళు నన్ను ఇంటికి తీసుకుపోయేది,” అన్నాడు. (కాని కొద్ది మాసాల్లోనే అతని తల్లిదండ్రులు వచ్చి, అతను ఏడ్చి మొరాయించినా లెక్కచెయ్యకుండా లాక్కెళ్ళి పోయారు. కొన్నేళ్ళ తరవాత పెళ్ళికూడా చేసుకున్నాడతను).

చాలా ప్రశ్నలకి నేను జవాబులు ఇచ్చిన తరవాత, కాశీ అనే కుర్రవాడు ప్రశ్న అడిగాడు. అతను పన్నెండేళ్ళవాడు; చాలా తెలివయిన విద్యార్థి; అతనంటే అందరికీ ఇష్టం.

“స్వామీజీ, నా అదృష్టం ఎలా ఉంటుందండి?” అని అడిగాడు.

“త్వరలో చనిపోతావు నువ్వు,” పట్ట శక్యంకాని శక్తి ఏదో పట్టుపట్టి నా నోటినించి ఈ మాటలు అనిపించినట్టు తోచింది.

ఈ ప్రకటనకు, నాతోబాటు ప్రతి ఒక్కరూ విస్మయం చెంది దుఃఖపడ్డారు. అసందర్భ ప్రలాపం చేసే కుర్రవాడిలా నన్ను నేను తిట్టుకుని, మరే ప్రశ్నలకూ జవాబు లియ్యనని చెప్పేశాను.

మేము విద్యాలయానికి తిరిగి వెళ్ళిన తరవాత కాశీ నా గదికి వచ్చాడు.

“నేను చచ్చిపోతే, తిరిగి నేను పుట్టినప్పుడు నన్ను మీరు కనుక్కుని మళ్ళీ ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకువస్తారాండీ?” అంటూ ఏడుస్తూ అడిగాడు.

కష్టమైన ఈ అసాధారణ బాధ్యతను నేను నిరాకరించక తప్పలేదు. కాని ఆ తరవాత కొన్ని వారాలపాటు కాశీ, నన్ను గట్టిగా ఒత్తిడిచేశాడు. అతను ఆశ వదులుకునేటంతగా అధైర్యపడడం చూసి, చివరికి ఓదార్చాను.

“సరే,” నని మాట ఇచ్చాను. “పరమాత్ముడు నాకు సహాయపడితే, నిన్ను కనుక్కోడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను.”

వేసంగి సెలవుల్లో నేను చిన్న ప్రయాణం మీద బయలుదేరాను. కాశీని నాతోబాటు తీసుకు వెళ్ళలేకపోతున్నందుకు విచారించి, నేను బయలుదేరే ముందు కాశీని నా గదికి పిల్చి, ఎవరు ఎంతగా ఒప్పించడానికి పూనుకున్నా సరే, ఈ విద్యాలయ ఆధ్యాత్మిక స్పందనల వాతావరణంలోనే ఉండమని జాగ్రత్తగా చెప్పాను. అతను కనక ఇంటికి వెళ్ళక పోయినట్లయితే రాగల ప్రమాదాన్ని తప్పించుకోవచ్చునని ఎందుకో నాకు అనిపించింది.

నేను ఇలా వెళ్ళానో లేదో, కాశీ తండ్రి రాంచీలో దిగాడు. ఆయన తన కొడుకు సంకల్పాన్ని భగ్నంచెయ్యడానికి పదిహేను రోజుల పాటు ప్రయత్నించాడు; కాశీ, వాళ్ళమ్మని చూడ్డానికి ఒక్కసారి కలకత్తా వచ్చి నాలుగు రోజులు ఉంటే చాలు, మళ్ళీ తిరిగి రావచ్చునని చెప్పాడు. కాశీ ఒకే పట్టు మీద తిరస్కరిస్తూ వచ్చాడు. చివరికి ఆ తండ్రి, పోలీసుల సహాయంతో తన కొడుకును తీసుకుపోతానని చెప్పాడు. ఈ బెదిరింపుతో కాశీ ఆందోళన పడ్డాడు; విద్యాలయాన్ని గురించి ఏ దుష్ప్రచారం జరగడానికయినా తాను కారకుడు కావడం అతనికి ఇష్టం లేదు. వెళ్ళడం తప్ప అతనికి గత్యంతరం కనిపించలేదు.

కొన్నాళ్ళ తరవాత నేను రాంచీకి తిరిగి వచ్చాను. కాశీని ఏ రకంగా తీసుకుపోయిందీ వినగానే నేను కలకత్తా వెళ్ళే బండి ఎక్కాను. అక్కడ ఒక గుర్రబ్బండి కట్టించుకున్నాను. ఆశ్చర్యమేమిటంటే, ఆ బండి, గంగానది మీద ఉన్న హౌరాబ్రిడ్జిని దాటిపోతూ ఉండగా నేను చూసిన మొదటి వ్యక్తులు కాశీ తండ్రి, ఇతర బంధువులూ; వాళ్ళు సంతాపసూచకమైన బట్టలు కట్టుకొని ఉన్నారు. మా బండివాణ్ణి ఆపమని అరిచి, గబుక్కున బండిలోంచి ఉరికి, అభాగ్యుడైన ఆ తండ్రివేపు తేరిపార చూశాను.

“హంతక మహాశయా, నా కుర్రవాణ్ణి చంపేశారు మీరు!” అంటూ కొంతమట్టుకు అనుచితంగానే అరిచాను.

కాశీని బలవంతంగా కలకత్తాకు తీసుకువచ్చి తప్పు చేశానని అప్పటికే గ్రహించాడు ఆ తండ్రి. అక్కడున్న కొద్ది రోజుల్లోనూ ఆ అబ్బాయి, కలుషితమైన ఆహారం తిని, కలరా వచ్చి చనిపోయాడు.

కాశీ మీద నాకున్న వాత్సల్యమూ, పోయిన తరవాత మళ్ళీ అతన్ని కనుక్కుంటానని చేసిన వాగ్దానమూ నన్ను రాత్రింబగళ్ళు వెంటాడుతున్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, అతని ముఖం నా కళ్ళముందు ఆడుతూనే ఉంది. పోయిన మా అమ్మకోసం, చాలాకాలం కిందట ఎలా అన్వేషించానో అలాగే అతని కోసంకూడా చిరస్మరణీయమైన అన్వేషణ మొదలుపెట్టాను.

భగవంతుడు నాకు వివేచన శక్తి ఇచ్చినందుకు దాన్ని నేను తప్పకుండా వినియోగించాలనీ, ఆ అబ్బాయి సూక్ష్మశరీరం ఉనికిని తెలుసుకోడానికి వీలైన సూక్ష్మ నియమాల్ని కనిపెట్టడానికి నాకుగల శక్తుల్ని సంపూర్ణంగా కూడగట్టుకొని అందుకు శ్రమించాలని అనిపించింది. అతను తీరని కోరికలతో స్పందిస్తున్న ఆత్మ; సూక్ష్మ మండలాల్లో అనేక లక్షల ప్రకాశమానమైన ఆత్మల మధ్య ఎక్కడో ఒక కాంతిపుంజంగా తేలుతున్నాడని గ్రహించాను. స్పందనశీల కాంతుల రూపంలో ఉన్న అనేక ఇతర ఆత్మలతో కూడి ఉన్న అతనితో సంపర్కం పెట్టుకోడం ఎలాగ? ఒక రహస్య యోగప్రక్రియను ఉపయోగించి, నా కనుబొమల మధ్య అంతర్బిందువయిన ఆధ్యాత్మిక నేత్రమనే “మైక్రోఫోన్” ద్వారా, కాశీ ఆత్మకు నా ప్రేమను ప్రసారం చేశాను. అతను ఈపాటికి ఏ తల్లి గర్భంలోనో పిండంగా శరీరధారణ చేసి ఉంటాడన్న నమ్మకం నాకు కలిగింది; అందుచేత అతనున్న స్థలం ఏ దిశగా ఉందో గుర్తించడానికని, పైకెత్తిన నా చేతుల్నీ వేళ్ళనీ గ్రాహకాలు (ఆంటినాలు)గా ఉపయోగిస్తూ తరచు నేను, గుండ్రంగా తిరుగుతూ ఉండేవాణ్ణి. ఏకాగ్రతా సంధానితమైన నా హృదయమనే[1] రేడియోలో, అతనినుంచి వచ్చే ప్రతిస్పందనను అందుకోవాలని ఆశించాను.

కాశీ త్వరలోనే భూమికి తిరిగివస్తాడనీ, నేను కనక అవిచ్ఛిన్నంగా అతనికి నా పిలుపును ప్రసారం చేసినట్లయితే అతని ఆత్మ జవాబు ఇస్తుందనీ సహజావబోధాత్మకమయిన అనుభూతి పొందాను. కాశీ పంపించే అత్యల్ప ఆవేగాన్ని నా వేళ్ళలోనూ ముంజేతుల్లోనూ చేతుల్లోనూ వెన్నులోనూ నరాల్లోనూ అనుభూతం చేసుకోవచ్చునని నాకు తెలుసు.

కాశీ చనిపోయిన తరవాత ఆరు నెలలపాటు నే నీ యోగ ప్రక్రియను తరగని ఉత్సాహంతో నిలకడగా సాధన చేశాను. ఒకనాడు పొద్దున, కలకత్తాలో జనసమ్మర్దంగా ఉన్న బౌ బజార్ అనే పేటలో కొంతమంది స్నేహితులతోబాటు నడుస్తూ, మామూలు పద్ధతిలో చేతులు పైకి ఎత్తాను. మొట్టమొదటి సారిగా ప్రతిస్పందన వచ్చింది. నా వేళ్ళ లోంచీ అరిచేతుల్లోంచీ విద్యుదావేగాలు లోపలికి ప్రసరిస్తూ ఉండడం కనిపెట్టి పులకించి పోయాను. ఆ విద్యుత్ ప్రవాహాలు నా చైతన్యంలోని ఒకానొక గహనాంతర స్థానం నుంచి అత్యంత ప్రబలమైన ఆలోచనగా రూపాంతరం చెందాయి. “నేను కాశీని, నేను కాశీని; నా దగ్గరకి రండి!”

నేను హృదయమనే వీడియో మీద ఏకాగ్రత నిలిపినప్పుడు, ఆ ఆలోచన దాదాపుగా నా చెవికి వినవచ్చింది. కాశీకి[2] సహజ లక్షణమైన కొద్దిపాటి బొంగురు గొంతుతో గుసగుసలాడుతున్నట్టుగా పిలిచిన పిలుపును మళ్ళీ మళ్ళీ విన్నాను. నా స్నేహితుడొకడి చెయ్యి గుంజి పట్టుకుని ఆనందంగా చిరునవ్వు నవ్వాను.

“కాశీ ఎక్కడున్నది నేను తెలుసుకున్నట్టు అనిపిస్తోంది!”

నేను గిరగిరా తిరగడం ప్రారంభించాను; నా స్నేహితులూ దారిని పోయే జనమూ చోద్యంగా చూస్తున్నారు. నేను దగ్గరిలో ఉన్న ఒక సందు వేపు తిరిగి ఉన్నప్పుడు మాత్రమే నా వేళ్ళలో విద్యుత్తరంగాలు జల్లుమనిపిస్తున్నాయి; ఆ సందుకు ‘సర్పెంటైన్ లేన్’ (పాము సందు) అన్న పేరు సరిగానే సరిపోయింది. నేను తక్కిన వేపులకు తిరిగినప్పుడు ఆ సూక్ష్మ విద్యుత్ ప్రవాహాలు అంతరించాయి.

“ఆఁహాఁ! కాశీ ఆత్మ. ఈ సందులో ఒక ఇంట్లో, ఒక తల్లి కడుపులో ఉందన్న మాట!” అనుకున్నాను. నేనూ నా స్నేహితులూ సర్పెంటైన్ లేన్‌లోకి నడిచాం; పైకెత్తి ఉన్న నా చేతుల్లో స్పందనలు బలమయి, వెనకటికన్న స్పష్టమయాయి. ఏదో ఒక అయాస్కాంత శక్తి పనిచేసి నన్ను రోడ్డుకు కుడిపక్కకు లాగేసింది. ఒక ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి నా కాళ్ళు స్తంభించి పోవడం చూసి ఆశ్చర్యపోయాను. ఊపిరి కూడా బిగబట్టేసి గాఢమైన ఉద్రేకంతో తలుపు తట్టాను.

ఒక పనిమనిషి వచ్చి తలుపు తీసింది; అయ్యగారు ఇంట్లోనే ఉన్నారని చెప్పింది. ఆయన రెండో అంతస్తు నుంచి మెట్లు దిగివచ్చి సంగతి ఏమిటన్నట్టుగా నావేపు చిరునవ్వు నవ్వారు. నేను అడగదలచుకున్న ప్రశ్న ఎలా ఉండాలో మనస్సులో ఇంకా అనుకోనే లేదు; అది ఒక రకంగా సంగతమూ మరో రకంగా అసంగతమూ కూడా.

“ఏమండీ, మీరూ మీ భార్యా, సంతానం కలుగుతుందని సుమారు ఆరు నెలల నుంచి ఎదురుచూస్తున్నారా? దయచేసి చెప్పండి.”[3] “ఔనండి, నిజమే.” నేను సాంప్రదాయికమైన కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసినని గమనించి ఆయన మర్యాదగా, “మా సంగతులు మీకు ఎలా తెలిశాయో దయచేసి చెబుతారా?” అని అడిగారు.

కాశీని గురించీ, నే నిచ్చిన వాగ్దానం గురించి విన్న మీదట ఆయన ఆశ్చర్యచకితుడై, నా వృత్తాంతం నమ్మాడు.

“పసిమి చాయగల అబ్బాయి పుడతాడు మీకు,” అని చెప్పాను. అతని ముఖం వెడల్పుగా ఉంటుంది, నుదుటికి పైన ఒక సుడి ఉంటుంది. అతని ప్రవృత్తి ఆధ్యాత్మికతవేపు మొగ్గి ఉంటుంది,” అని చెప్పాను. పుట్టబోయే బిడ్డకు కాశీ పోలికలు ఉంటాయని నాకు నిశ్చయంగా అనిపించింది.

తరవాత పసివాణ్ణి చూడ్డానికి వెళ్ళాను. అతనికి ‘కాశీ’ అన్న పాత పేరే పెట్టారు తల్లిదండ్రులు. ఆ పసితనంలో కూడా ఆతనిలో, నా రాంచీ ప్రియశిష్యుడి పోలికలు కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. పిల్లవాడు నన్ను చూస్తూనే ఆప్యాయత కనబరిచాడు; గతంలోని ఆకర్షణ ఇప్పుడు రెండింతలుగా పెల్లుబికింది.

చాలా ఏళ్ళ తరవాత, కిశోరావస్థలో ఉన్న ఆ పిల్లవాడు, నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు ఉత్తరం రాశాడు. సన్యాస మార్గంలో సాగాలని తాను గాఢంగా అభిలషిస్తున్నట్టు వివరించాడు. నే నతన్ని, హిమాలయాల్లో ఉన్న ఒక గురువుదగ్గరికి పంపించాను; పునర్జన్మ ఎత్తిన కాశీని శిష్యుడిగా స్వీకరించారాయన.

  1. కనుబొమల మధ్య ఉండే బిందువునుంచి ప్రతిక్షేపించిన సంకల్పశక్తి, ఆలోచనను ప్రసారంచేసే పరికరమన్న సంగతి యోగులకు తెలుసు. అనుభూతి హృదయంమీద ప్రశాంతంగా కేంద్రీకృతమైనప్పుడు, అది మానసికమైన రేడియోగా పని చేస్తుంది; అంతే కాకుండా, దూరంలోకాని దగ్గరలోకాని ఉన్న వాళ్ళ సందేశాల్ని అందుకోగలుగుతుంది. మానసిక ప్రసారంలో (టెలిపతీ), ఒక వ్యక్తి మనస్సులో ఉన్న సున్నితమైన ఆలోచనాస్పందనలు మొదట, మహాకాశ సూక్ష్మ స్పందనల ద్వారానూ ఆ తరవాత స్థూలతరమైన భౌతికాకాశం ద్వారానూ, విద్యుత్ తరంగాల్ని సృష్టిస్తూ పరిచాలితమవుతాయి; ఆ విద్యుత్ తరంగాలు, వాటంతట అవి, మరో వ్యక్తి మనస్సులో ఆలోచనగా రూపాంతరంచెందుతాయి.
  2. ప్రతి ఆత్మా పరిశుద్ధ స్థితిలో, సర్వజ్ఞత్వ మున్నదే. కాశీ ఆత్మ, కాశీ అనే పిల్లవాడి సహజ లక్షణాలన్నీ గుర్తుంచుకుంది; కనక నే నతన్ని గుర్తు పట్టేలా చెయ్యడానికని అతని బొంగురు గొంతను అనుకరించింది.
  3. చాలామంది మానవులు భౌతికంగా మరణించిన తరవాత, సూక్ష్మ లోకంలో 500 నుంచి 1000 సంవత్సరాల వరకు ఉంటుంటారు కాని, జన్మకూ జన్మకూ మధ్య ఇంత వ్యవధి ఉండాలన్న నిశ్చిత నియమం ఏదీ లేదు (45 ఆధ్యాయం చూడండి). భౌతిక శరీరంలోకాని, సూక్ష్మ శరీరంలోకాని ఒక మనిషికి కేటాయించిన జీవితకాలం, అతని కర్మానుసారంగా పూర్వనిర్ధారితమై ఉంటుంది.

చావూ, “చిన్న చావు” అనిపించుకునే నిద్రా కూడా మర్త్యులకు ఆవశ్యకమైనవే; ఆత్మసాక్షాత్కారం పొందని జీవిని ఇవి, ఇంద్రియ బంధనాల నుంచి తాత్కాలికంగా విముక్తంచేస్తాయి. మానవుడి మౌలిక ప్రకృతి ఆత్మ కనక, అతడు నిద్రలోనూ చావులోనూ తన అశరీరత్వాన్ని పునరుజ్జీవింప జేసే జ్ఞాపికలు కొన్ని పొందుతాడు.

హిందూ పవిత్ర గ్రంథాల్లో చెప్పిన ప్రకారం, సమతులన కర్మనియమం, చర్యా ప్రతిచర్యలకూ, కార్యకారణాలకూ, బీజావాప ఫలోపలబ్ధులకూ సంబంధించినది. ప్రతి మనిషి తన నైసర్గిక ధర్మ(ఋతం)వర్తనలో, తన ఆలోచనల ద్వారానూ చేతల ద్వారానూ తన భవితవ్యాన్ని తానే మలుచుకుంటాడు. తెలివిగానో తెలివితక్కువగానో అతడు చాలనంచేసిన విశ్వశక్తులు, ఒక బిందువు దగ్గర మొదలైన వృత్తపరిధి తప్పనిసరిగా ఆ బిందువు దగ్గరికే తిరిగి వచ్చి వృత్తం పూర్తి అయినట్టుగా, ఆరంభ కేంద్రమయిన అతని దగ్గరికి తప్పనిసరిగా తిరిగి రావాలి. “ఈ ప్రపంచం ఒక గణిత సమీకరణంలా కనిపిస్తుంది, నువ్వు దాన్ని ఎలా తిప్పు- దానంతట అది సమతులనం చేసుకుంటుంది. నిశ్శబ్దంగానూ నిశ్చయంగానూ, ప్రతి రహస్యమూ వెల్లడి అవుతుంది, ప్రతి నేరానికి శిక్ష పడుతుంది; ప్రతి సుగుణానికి బహుమతి వస్తుంది; ప్రతి అన్యాయానికీ పరిహారం లభిస్తుంది.” (ఎమర్సన్ , ‘కాంపెన్సేషన్’ లో). జీవిత అసమానతల వెనక ఉన్న కర్మను న్యాయసూత్రంగా అవగాహన చేసుకున్నప్పుడు, మానవ మనస్సులో దేవుడిమీదా మానవుడిమీదా ఉన్న ఆగ్రహం తొలగిపోవడానికి అది తోడ్పడుతుంది.