ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 32

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అధ్యాయం : 32

చనిపోయిన రాముణ్ణి

బతికించడం

“ఇప్పుడు లాజరు అనే ఆయన జబ్బుగా ఉన్నాడు. ఆ సంగతి ఏసు విన్నప్పుడు, ‘ఈ జబ్బు చావు కోసం వచ్చింది కాదు; దేవుడి మహిమ కోసం, దానివల్ల దేవుని కుమారుడు కూడా మహిమాన్వితుడు కావడం కోసం వచ్చింది’, అన్నాడు.”[1]

శ్రీయుక్తేశ్వర్‌ గారు ఒకనాడు వెచ్చటి పొద్దుటి వేళ , శ్రీరాంపూర్ ఆశ్రమం బాల్కనీలో, క్రైస్తవ పవిత్ర గ్రంథాల్ని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. గురుదేవుల ఇతర శిష్యులు కొందరితో బాటు నేను కూడా, కొద్దిమంది మా రాంచీ విద్యార్థులతో అక్కడున్నాను.

“ఈ సందర్భంలో ఏసు, తనను దేవుడి కుమారుడుగా చెప్పుకున్నాడు. ఆయన నిజంగా దేవుడితో ఏకాత్ముడయి ఉన్నప్పటికీ, ఇక్కడ ఆయన ప్రస్తావనకు వ్యక్తి పరంకాని గంభీరమైన ప్రాముఖ్యం ఉంది.” అని వివరించారు. మా గురుదేవులు. “దేవుడి కుమారుడంటే, మనిషిలో ఉన్న కూటస్థ చైతన్యం లేదా దివ్యచైతన్యం. ‘మర్త్యు’ డెవడూ దేవుణ్ణి మాహిమాన్వితుణ్ణి చెయ్యలేడు. మానవుడు తన సృష్టికర్తకు ఇయ్యగల ఒకే ఒక గౌరవమల్లా, ఆయన్ని అన్వేషించడం; మానవుడు తనకి తెలియని అమూర్తత్వాన్ని మహిమాన్వితం చెయ్యలేడు. ఋషుల తలల చుట్టూ ఉండే ‘దివ్యప్రభ’ లేదా కాంతి పరివేషం, దైవారాధన చెయ్యడానికి వారికి గల శక్తికి ప్రతీకాత్మక సాక్ష్యం.

చనిపోయిన లాజరు తిరిగి లేవడానికి సంబంధించిన అద్భుతకథను చదవడం శ్రీయుక్తేశ్వర్‌గారు కొనసాగించారు. కథ ముగిసిన తరవాత చాలాసేపు మౌనం వహించారు; పరిశుద్ధ గ్రంథం ఆయన మోకాలిమీద, తెరిచే ఉంది.

“నాకు కూడా అలాటి అలౌకిక ఘటన ఒకటి చూసే భాగ్యం కలిగింది,” అన్నారు మా గురుదేవులు చివరికి, గంభీర భావయుక్తంగా. “లాహిరీ మహాశయులు, నా స్నేహితుణ్ణి ఒకణ్ణి, చచ్చిపోయిన తరవాత మళ్ళీ బతికించారు.”

నా పక్కనున్న కుర్రవాళ్ళు గాఢమైన ఆసక్తి తో చిరునవ్వు నవ్వారు. ప్రత్యేకంగా గురుదేవుల వేదాంతం ఒకటే కాకుండా, ఆయన తమ గురువుగారి దగ్గర పొందిన అద్భుతమైన అనుభవాల్ని గురించిన ఏ కథ అయినా సరే, శ్రీయుక్తేశ్వర్ గారి చేత చెప్పించుకుని, విని ఆనందించడానికి నాలో కూడా కుర్రతనపు కోరిక ఇంకా తొంగి చూస్తూనే ఉంది.

“నా స్నేహితుడు రాముడూ, నేనూ ఒకరిని విడిచి ఒకరం ఉండే వాళ్ళం కాము,” అంటూ మొదలుపెట్టారు గురుదేవులు. “అతను సిగ్గరీ, ఒంటరితనం కోరేవాడు కావడంవల్ల, పగటి శిష్యబృందం ఉండని నడిరాత్రికి వేకువకూ మధ్య మా సమయంలోనే గురువుగారు - లాహిరీ మహాశయుల్ని దర్శించడానికి వస్తూండేవాడు. నేమ రాముడికి ప్రాణ స్నేహితుణ్ణి కావడంచేత, తన గాఢమైన ఆధ్యాత్మికానుభవాల్ని చాలామట్టుకు నాకు చెబుతూ ఉండేవాడు. ఆదర్శవంతమైన అతని సాంగత్యంలో నాకు ఉత్తేజం కలిగింది.” మా గురుదేవుల ముఖం పాత జ్ఞాపకాలతో మార్దవమయింది.

“రాముడికి అకస్మాత్తుగా తీవ్రమైన పరీక్ష పెట్టడం జరిగింది,” అంటూ చెప్పారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “అతనికి ఏషియాటిక్ కలరా జబ్బు వచ్చింది. జబ్బు తీవ్రంగా ఉన్న సమయాల్లో వైద్యుల సేవ పొందడానికి మా గురువుగారు ఎన్నడూ అభ్యంతర పెట్టలేదు కాబట్టి, ఇద్దరు ప్రత్యేక వైద్యనిపుణులను పిలవడం జరిగింది. జబ్బు మనిషికి ఆదరా బాదరాగా ఉపచారం చేస్తున్న సమయంలో, లాహిరీ మహాశయుల్ని సహాయం చెయ్యమని గాఢంగా ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి. ఆయన ఇంటికి ఉరికి, ఏడుస్తూ పరిస్థితి విన్నవించాను.

“ ‘రాముణ్ణి డాక్టర్లు చూస్తున్నారు గదా, బాగవుతాడు.’ అంటూ మా గురువుగారు కులాసాగా చిరునవ్వు నవ్వారు.”

“గుండె తేలికపడి, నేను తిరిగి మా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి చూసేసరికి, అతను కొనఊపిరితో ఉన్నాడు.”

“ ‘గంటా రెండుగంటలకన్న బతకడు’ అన్నాడొక వైద్యుడు నాతో, నిస్పృహ వ్యక్తం చేస్తూ. మళ్ళీ లాహిరీ మహాశయుల దగ్గరికి పరిగెత్తాను.

“ ‘వైద్యులు చిత్తశుద్ధితో పనిచేసేవాళ్ళు, రాముడు బాగవుతాడని నా నమ్మకం.’ గురువుగారు కులాసాగా పంపించేశారు నన్ను.

“నేను రాముడిదగ్గరికి తిరిగి వెళ్ళేసరికి, అప్పటికే డాక్టర్లు వెళ్ళి పోయారు. వాళ్ళలో ఒకాయన నా కో చీటి రాసి పెట్టాడు: ‘మాకు చేత నయినంతా చేశాం; కాని ఇతని పరిస్థితి ఆశాజనకంగా లేదు.’ ” “మా స్నేహితుడిలో నిజంగా చావుకళ కనిపిస్తోంది. లాహిరీ మహాశయుల మాటలు నిజం కాకుండా ఎలా పోగలవో నాకు అర్థంకాలేదు. అయినా, త్వరత్వరగా కడబడుతున్న రాముడి ప్రాణం, ‘అంతా అయిపోయింది,’ అంటూ మనస్సుకు సూచిస్తూనే ఉంది. ఆ విధంగా నేను, విశ్వాస శంకలనే ఆటుపోటు కెరటాలమధ్య అల్లాడిపోతూ, నేను చెయ్యగలిగినంత బాగా, అతనికి ఉపచారం చేశాను. అతను ఉద్రేకపడి ఇలా అరిచాడు:

“ ‘యుక్తేశ్వర్, గురువుగారి దగ్గరికి వెళ్ళి, నేను పోయానని చెప్పు. అంత్యక్రియలు జరిగేలోగా నా దేహాన్ని దీవించమని అడుగు.’ ఈ మాటలతో రాముడు బరువుగా నిట్టూర్చి ప్రాణం విడిచాడు.”

“నేను ఒక గంటసేపు అతని మంచం దగ్గర ఏడ్చాను. ఎప్పుడూ ప్రశాంతిని కోరుకునే అతడు, ఇప్పుడు చావులో పూర్తి చిరశాంతి పొందాడు. ఇంకో సహాధ్యాయి లోపలికి వచ్చాడు; నేను తిరిగి వచ్చేదాకా అతన్ని ఇంట్లో ఉండమని చెప్పాను. సగం దిమ్మెరపోయి, కాళ్ళీడ్చు కుంటూ గురుదేవుల నివాసానికి మళ్ళీ వెళ్ళాను.

“ ‘రాముడెలా ఉన్నా డిప్పుడు?’ లాహిరీ మహాశయుల ముఖంలో చిరునవ్వులు విరుస్తున్నాయి.

“ ‘మహాశయా, ఎలా ఉన్నాడో మీరే కాస్సేపట్లో చూస్తారు,’ అంటూ ఆవేశం వెళ్ళగక్కాను. ‘ఇంకొన్ని గంటల్లో, స్మశానానికి తీసికెళ్ళే ముందు అతని కట్టెను చూద్దురుగాని,’ అంటూ వలవలా ఏడ్చేశాను.

“ ‘యుక్తేశ్వర్, మనసు బిక్కబట్టుకో, ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చెయ్యి.’ గురుదేవులు సమాధిలోకి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం, రాత్రి ఎడతెగని మౌనంలోనే గడిచిపోయాయి; నేను మనస్సు కుదుటబరుచుకోడానికి ఎంత గింజుకున్నా ఫలితం లేకపోయింది. తెల్ల వారగట్ల లాహిరీ మహాశయులు ఓదార్పుగా నావేపు చూశారు. ‘నువ్వింకా ఆందోళనగానే ఉన్నట్టు చూస్తున్నాను. రాముడికి ఏదో ఒక మందురూపంలో ప్రత్యక్ష సాధనం ఒకటి నా నుంచి ఆశిస్తున్నట్టు నిన్ననే ఎందుకు చెప్పలేదూ?’ అంటూ గురువుగారు, ముడి ఆముదం పోసిఉన్న దీపం ప్రమిదెవేపు చూపించారు. ‘ఆ ప్రమిదెలో ఉన్న చమురుతో ఒక చిన్న సీసా నింపుకో; ఏడు చుక్కలు రాముడి నోట్లో వెయ్యి.’ ”

“ ‘గురుదేవా! అతను నిన్న మధ్యాహ్నమనగా చచ్చిపోయాడు. ఇప్పుడీ చమురు తీసికెళ్ళి లాభమేమిటి?’ అంటూ అభ్యంతరం చెప్పాను.”

“ ‘పరవాలేదు, నేను చెప్పినట్టు చెయ్యి,’ మా గురువుగారి ఉల్లాసం నాకు అర్థంకాకుండా ఉంది. అప్పటికింకా నేను, సంతాపంనుంచి తేరుకోలేదు. కొంచెం చమురు పోసుకుని రాముడి బసకు వెళ్ళాను.”

“నా స్నేహితుడి శరీరం మృత్యువు పిడికిలిలో, బిర్రబిగిసి ఉండడం చూశాను. అతని భయంకర స్థితిని పట్టించుకోకుండా, నా కుడి చేతి చూపుడు వేలితో అతని పెదవులు తెరిచి, ఎడం చేత్తో ఒక బిరడా తీసుకుని గిట్టగరుచుకున్న పళ్ళమీద ఒక్కొక్క చుక్కే చమురు వేశాను. చల్లటి పెదవులకు ఏడో చుక్క తగిలేసరికి, రాముడు గజగజా వణికి పోయాడు. అతను విడ్డూరంగా లేచి కూర్చుంటూ ఉండగా అరికాళ్ళనుంచి తలదాకా ఉన్న కండరాలన్నీ ఒక్కసారి కదలబారిపోయాయి.

“ ‘ఒక ప్రచండ కాంతిలో లాహిరీ మహాశయుల్ని చూశాను,’ అని అరిచాడతను. ‘ఆయన సూర్యుడిలా వెలిగిపోతున్నారు. “లే, నీ నిద్ర కట్టిపెట్టు, అని నన్ను ఆజ్ఞాపించారు.” యుక్తేశ్వర్‌తో బాటు వచ్చి నన్ను కలుసుకో.”

“రాముడు బట్టలు కట్టుకోడం, ప్రాణం తీసిన జబ్బు తరవాత కూడా గురువుగారింటికి నడిచిరావడానికి తగినంత బలంగా ఉండడం చూసి నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. అక్కడతను, కృతజ్ఞతా పూర్వకంగా కన్నీళ్ళు విడుస్తూ, లాహిరీ మహాశయుల ముందు సాగిల బడ్డాడు.

“గురువుగారు ఉల్లాసంతో తన్మయులయారు. ఆయన కళ్ళు నావేపు కొంటెగా చూస్తూ మిలమిల మెరిశాయి.

“ ‘యుక్తేశ్వర్, ఇకనుంచి నువ్వు ఎక్కడికెళ్ళినా, ఓ ఆముదం సీసా తప్పకుండా తీసుకువెళ్ళడం మానవుగదా! నువ్వు శవాన్ని చూసినప్పుడల్లా ఈ చమురు వేసెయ్యి. ఏడు చుక్కల ఆ దీపం చమురు యముడి బలాన్ని తప్పకుండా భగ్నం చెయ్యవలసిందే!’ ”

“ ‘గురూజీ, నన్ను వేళాకోళం చేస్తున్నారు. నా కర్థం కావడం లేదు; నా పొరపాటు ఎక్కడ ఉందో చూపించండి.’ ”

“ ‘రాముడు బాగవుతాడని నేను నీకు రెండుసార్లు చెప్పాను; అయినా నువ్వు నన్ను పూర్తిగా నమ్మలేకపోయావు,’ అని విప్పి చెప్పారు లాహిరీ మహాశయులు. ‘డాక్టర్లు ఆతనికి నయం చెయ్యగలుగుతారని నా ఉద్దేశం కాదు. వాళ్ళు హాజరుగా ఉన్నారనే నేను చెప్పింది. నేను డాక్టర్లతో జోక్యం చేసుకోదలుచుకోలేదు; వాళ్ళుకూడా బతకాలి కదా మరి.’ ఆనందం ప్రతిధ్వనించే స్వరంలో మా గురువుగారు ఇంకా ఇలా అన్నారు, ‘ఎప్పటికీ ఇది తెలుసుకో; డాక్టరు ఉండుగాక, లేకపోవుగాక, సర్వశక్తిమంతుడైన పరమాత్మ ఎవ్వరికయినా నయం చెయ్యగలడు.’ ”

“ ‘నా పొరపాటు తెలిసి వచ్చిందండి,’ అని పశ్చాత్తాపంతో నా తప్పు ఒప్పుకున్నాను. ‘మీ రనె చిన్న మాటకు బ్రహ్మాండం యావత్తు కట్టుబడి ఉంటుందని ఇప్పుడు తెలిసింది.’ ” శ్రీయుక్తేశ్వర్‌గారు ఈ అద్భుతకథ ముగించగానే, రాంచీ కుర్రవాళ్ళలో ఒకడు, ఒక ప్రశ్న అడగడానికి సాహసించాడు. పైగా, ఒక పిల్లవాడు ఆ ప్రశ్న వెయ్యడం ఇంకా సహజం.

“మహాశయా, మీ గురువుగారు ఆముదం ఎందుకు పంపారండి?” అని అడిగాడు.

“అబ్బాయ్, ఆ చమురు ఇవ్వడానికి ప్రత్యేకమైన అర్థం ఏమీ లేదు. నేను వారి దగ్గరనుంచి భౌతిక మైనదేదో ఆశించినందువల్ల లాహిరీ మహాశయులు, నాలో ఇంకా ఎక్కువ విశ్వాసాన్ని మేలుకొలపడానికి, వస్తురూపమైన చిహ్నంగా, దగ్గరిలో ఉన్న చమురును ఎన్నుకున్నారు. నేను కొంతవరకు శంకించినందువల్ల, ఆయన రాముణ్ణి చనిపోనిచ్చారు. కాని, మామూలుగా చివర వచ్చే మరణమనే జబ్బును రాముడికి నయం చెయ్యవలసి వచ్చినా కూడా, గురువుగారు తమ శిష్యుడు బాగవుతాడని చెప్పారు కాబట్టి అతడు బాగయి తీరాలని ఆయనకు తెలుసు!”

శ్రీయుక్తేశ్వర్‌గారు పిల్లకాయల్ని పంపేసి, నాకు తమ పాదాల దగ్గర ఉన్న గొంగడి ఆసనం చూపించారు.

అసాధారణమైన గాంభీర్యంతో ఆయన ఇలా అన్నారు, “యోగానందా, పుట్టినప్పటినించి నీ చుట్టూ, లాహిరీ మహాశయుల ప్రత్యక్ష శిష్యులు ఉంటూ ఉన్నారు. ఆ మహాగురువులు, మహిమాన్వితమైన తమ జీవితం కొంతవరకు ఏకాంతంలో గడిపారు; పైగా, తమ ఉపదేశాల ప్రచారం కోసం ఎటువంటి సంస్థ నెలకొల్పడానికయినా ఆయన గట్టిగా అనుమతి నిరాకరిస్తూ వచ్చారు. అయినా విశిష్టమైన జోస్యం ఒకటి చెప్పారు.

“నేను పోయిన తరవాత సుమారు ఏభై ఏళ్ళకి, పడమటిదేశాల్లో యోగవిద్య పట్ల కలగబోయే గాఢమైన ఆసక్తి కారణంగా, నా జీవిత వృత్తాంతం ఒకటి రాయడం జరుగుతుంది. యోగవిద్యా సందేశం భూగోళాన్ని చుట్టేస్తుంది. సర్వమానవ సోదరత్వాన్ని - అంటే, మానవజాతి ఏకైక పరమపిత ప్రత్యక్షదర్శనం మీద ఆధారపడ్డ ఐకమత్యాన్ని- నెలకొల్పడానికి తోడ్పడుతుందది,’ అని చెప్పారు.

“నాయనా, యోగానందా, ఆ సందేశాన్ని వ్యాప్తి చెయ్యడంలోనూ ఆయన పవిత్ర జీవితాన్ని గురించి రాయడంలోనూ నీ వంతు పని నువ్వు చెయ్యాలి,” అన్నారు.

1895 లో లాహిరీ మహాశయులు పోయిన తరవాత, ఈ పుస్తకం పూర్తి అయిన 1945 సంవత్సరానికి ఏభై ఏళ్ళు గతించాయి. పైగా ఈ 1945 సంవత్సరమే యాదృచ్ఛికంగా, విప్లవాత్మకమైన అణుశక్తుల నూతన యుగాన్ని ప్రవేశపెట్టడం గమనించి చకితుణ్ణి కాకుండా ఉండలేను. ఆలోచనాశీలమైన మనస్సులన్నీ ఇప్పుడు, ముందెన్నడూ లేనంతగా శాంతిసోదరత్వాల తక్షణ సమస్యలవేపు మళ్ళుతున్నాయి; అది జరగని నాడు, భౌతిక బలాన్ని వినియోగించడం ఇంకా కొనసాగిస్తూనే ఉంటే, సమస్యలతోబాటు మనుషులందరినీ కూడా తుడిచిపెట్టేస్తుందది.

కాల ప్రభావంవల్లనో బాంబువల్లనో, మానవజాతి దాని నిర్మాణాలూ నామరూపాలు లేకుండా మాయమయినప్పటికీ సూర్యుడు తన గతి తప్పడు; చుక్కలు యథావిధిగా మింటిని కావలికాస్తూనే ఉంటాయి. విశ్వ నియమాన్ని తాత్కాలికంగా, నిలుపుదల చెయ్యడంకాని, మార్చడంకాని సాధ్యం కాదు; మానవుడు దాంతో సామరస్యం పొందితే మంచిది. ఈ బ్రహ్మాండం, బలానికి వ్యతిరేకమయితే, సూర్యుడు అంతరిక్షంలో ఇతర గోళాలతో యుద్ధానికి తలపడకుండా, నక్షత్రాలు తమ చిన్నారి ఏలుబడి సాగించడానికి అవకాశ మివ్వడం కోసం విధివిధేయంగా శ్రమిస్తుంటే మనం ఆయుధాన్ని పిడికిట బట్టడంవల్ల లాభమేమిటి? దాంట్లోంచి నిజంగా శాంతి ఏమయినా వస్తుందా? విశ్వస్నాయువులకు బలం చేకూర్చేది సుహృద్భావమే కాని క్రౌర్యం కాదు; శాంతిగా జీవించే మానవజాతి అనంతమైన విజయఫలాల్ని తెలుసుకుంటుంది; ఈ ఫలాలు, నెత్తుటి నేలలో పెంచి పోషించిన వేటికన్నయినా మధురంగానే ఉంటాయి.

కార్యసాధకమైన ఐక్యరాజ్య సమితి, మానవ హృదయాల సహజ, అనామిక సమితిగా ఉంటుంది. ప్రాపంచిక వేదన ఉపశమనానికి అవసరమైన ఔదార్య సానుభూతులూ సునిశిత అంతర్దృష్టీ మానవుల గాఢతమమైన ఏకత్వాన్ని - అంటే, దేవుడితోగల సంబంధాన్ని గురించిన పరిజ్ఞానంవల్లనే కాని, కేవలం భిన్నత్వాలగురించి జరిపే బుద్ధిపరమైన పర్యాలోచనలవల్ల సిద్ధించవు. సోదరత్వం ద్వారా శాంతి స్థాపన అనే ప్రపంచ పరమోన్నత ఆదర్మాన్ని సారించడానికి, పరమాత్మతో జీవాత్మకు ఐక్యానుసంధానం చేకూర్చే యోగశాస్త్రం కాలక్రమాన అన్ని దేశాల్లోనూ అందరు జనులకూ వ్యాపిస్తుంది.

భారతదేశానికి మరే ఇతరదేశం కన్నా ప్రాచీనమైన నాగరికత ఉన్నప్పటికీ దాని మనుగడలోని అద్భుతలీల, ఏ విధంగా చూసినా యాదృచ్ఛిక మేమీ కాదనీ, భారతదేశం ప్రతి తరంలోనూ తానుకన్న మహాపురుషుల ద్వారా అందించిన శాశ్వత సత్యాలమీద భక్తివల్ల చేకూరిన విజయాల్లోని తార్కికమైన ఒక సంఘటనేననీ గమనించిన చారిత్రకులు మృగ్యం. కేవలం మనుగడ కొనసాగుతూండడంద్వారాను, యుగాలు (ఎన్ని యుగాలో, తలమాసిన పండితులు, మనకి నిజంగా చెప్పగలరా?) గతించినా తాను గతించకపోవడం ద్వారాను భారతదేశం, కాలం సవాలుకు ఏ దేశప్రజలూ ఇయ్యజాలని సరైన సమాధానం ఇచ్చింది. బైబిలులోని ఒక కథలో అబ్రహాం, ప్రభువును[2] ప్రార్థిస్తూ, సోడోమ్ నగరంలో పదిమంది ధర్మపరులు కనిపించినట్లయితే ఆ నగరాన్ని నాశనం చెయ్యకుండా విడిచిపెట్టమని విన్నపం చేశాడు. దానికి సమాధానంగా ప్రభువు “ఆ పదిమంది గురించి నేను దాన్ని నాశనం చెయ్యను,” అన్నాడు. ఈ కథకు, భారతదేశం కాలగర్భంలో కలిసి విస్మృతమైపోకుండా తప్పించుకోడాన్నిబట్టి, కొత్త అర్థం వస్తుంది. యుద్ధతంత్రాల్లో నైపుణ్యం కలిగి, ఒకప్పుడు భారతదేశానికి సమకాలికంగా వర్ధిల్లిన ప్రాచీన ఈజిప్టు, బాబిలోనియా, గ్రీసు, రోముల బలిష్ఠ సామ్రాజ్యాలు గతించిపోయాయి.

దేశం బతికేది తన భౌతిక ఉపలబ్ధులవల్ల కాక, అక్కడి మహా పురుషులవల్లనే నన్న సంగతి ప్రభువిచ్చిన సమాధానంలో స్పష్టమవుతోంది.

అర్ధభాగం ముగియకముందే రెండుసార్లు రక్తరంజితమైన ఈ ఇరవయ్యో శతాబ్దంలో ఆ దివ్యవాక్కులు మళ్ళీ వినిపించుగాక: లంచానికి లోబడని న్యాయమూర్తి - ఆ భగవంతుడి దృష్టిలో గొప్పవాళ్ళనిపించుకోదగ్గ పదిమందిని కన్న ఏ దేశమూ నశింపు ఎరగదు.

అటువంటి ప్రేరణల్ని మన్నిస్తూ భారతదేశం, కాలం కౌటిల్యాల్ని అనేకం ఎదుర్కోడంలో తానేమీ తెలివితక్కువది కాదని నిరూపించుకుంది. ఆత్మసాక్షాత్కారసిద్ధి పొందిన ప్రతిదేశపు మహానుభావులూ ఇక్కడి నేలను పావనం చేశారు. లాహిరీ మహాశయులు, శ్రీయుక్తేశ్వర్‌గారి వంటి ఆధునిక ఋషీశ్వరులు, మానవుడి సుఖానికీ దేశం దీర్ఘాయుష్యానికి ఆత్మసాక్షాత్కార సాధక శాస్త్రమయిన యోగవిద్యాపరిజ్ఞానం ప్రాణావశ్యకమైనదని ఎలుగెత్తి చాటుతారు. లాహిరీ మహాశయుల జీవితాన్ని గురించీ ఆయన విశ్వజనీన సిద్ధాంతం గురించి ఇంతవరకు అచ్చులో వచ్చిన సమాచారం చాలా స్వల్పం. మూడు దశాబ్దాలుగా నేను, భారతదేశంలోనూ అమెరికాలోనూ యూరప్‌ లోనూ, వారిచ్చిన ముక్తి ప్రదమైన యోగసందేశం పట్ల గాఢమైన, హృదయపూర్వకమైన ఆసక్తి ఉండడం గమనిస్తూ వచ్చాను. ఈనాడు, ముందే ఆయన జోస్యం పలికినట్టు, ఆ యోగీశ్వరుల జీవితాన్ని గురించిన లిఖిత వృత్తాంతం ఒకటి అవసరముంది.[3]

లాహిరీ మహాశయులు 1828 సెప్టెంబరు 30 తేదీన, సనాతన పారంపర్యం గల ధర్మనిష్ఠాపరమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన జన్మస్థలం ఘుర్ణీ గ్రామం; ఇది బెంగాలులో, కృష్ణనగర్‌కు దగ్గర నదియా జిల్లాలో ఉంది. ఈయన, శ్రీమతి ముక్తకాశిగారి ఏకైక పుత్రులు. ఈ ఇల్లాలు, పూజ్యులయిన గౌర్ మోహన్ లాహిరీగారి రెండో భార్య (మొదటి భార్య, ముగ్గురు కొడుకుల్ని కన్న తరవాత ఒక యాత్రలో మరణించారు). పిల్లవాడి చిన్నతనంలోనే తల్లి కన్నుమూసింది; ఆవిడ, “యోగరాజు”గా పవిత్ర గ్రంథాల్లో పేర్కొనే శివుడి పరమభక్తురాలన్న అర్థవంతమైన యథార్థానికి మించి, ఆవిడగురించి మరేమీ తెలియదు.

లాహిరీ మహాశయుల పూర్తి పేరు శ్యామాచరణ్ లాహిరీ. చిన్న తనంలో ఈయన ఘుర్ణీలో పెద్దలు కట్టిన ఇంట్లోనే గడిపారు. మూడు నాలుగేళ్ళ వయస్సప్పుడు ఈయన ఇసకలోకి దూరి ఒక విధమైన యోగాసనంలో కూర్చుని ఉండడం, తల తప్ప తక్కిన శరీరమంతా ఇసకలో కప్పబడి ఉండడం తరచు కనిపించేది.

1833 చలికాలంలో, పక్కనున్న జలంగీ నదీ ప్రవాహమార్గం మళ్ళడంవల్ల లాహిరీ కుటుంబం వారి ఆస్తి ధ్వంసమై గంగానదీ గర్భంలో కలిసిపోయింది. లాహిరీ వంశంవారు కట్టించిన శివాలయం ఒకటి, వారి ఇంటితో బాటుగా, ఏట్లో కలిసిపోయింది. శివలింగాన్ని మాత్రం భక్తు డొకడు, సుళ్ళు తిరుగుతున్న నీళ్ళలోంచి బయటికి తెచ్చి కొత్త ఆలయంలో ప్రతిష్ఠించాడు; ఆ చోటు నిప్పుడు ఘుర్ణీ శివస్థలమని అంటారు.

గౌర్ మోహన్ లాహిరీగారూ వారి కుటుంబమూ ఘుర్ణీ విడిచి పెట్టేసి కాశీవాసులయారు. తండ్రిగారు, వెంటనే అక్కడొక శివాలయం నిర్మించారు. వారు వైదికనిష్ఠానుసారంగా గృహస్థ ధర్మం నిర్వర్తించే వారు; దేవతార్చన, దానం, స్వాధ్యాయం యథావిధిగా చేసేవారు. ధర్మ పరాయణులూ విశాల హృదయులూ వారు. అయితే, ఉపయోగకరమైన ఆధునిక భావప్రవాహాన్ని వారు ఉపేక్షించలేదు.

బాల లాహిరీ, కాశీ అధ్యయన బృందాల్లో హిందీ, ఉర్దూ పాఠాలు నేర్చుకున్నాడు. జయనారాయణ ఘోషాల్‌గారు నడిపిన బడికి వెళ్ళి సంస్కృతం, బెంగాలీ, ఫ్రెంచి, ఇంగ్లీషు నేర్చుకున్నాడు. ఈ బాలయోగి నిశిత వేదాధ్యయనానికి పూనుకొని, నాగభట్టు అనే మహారాష్ట్ర పండితుడితో సహా అనేకమంది బ్రాహ్మణ పండితుల పరిషత్తులకు హాజరయి పవిత్ర గ్రంథాలగురించి వాళ్ళు చేసే చర్చలు వింటూండేవాడు.

శ్యామాచరణుడు దయాశీలుడు; సాధు స్వభావుడు, సాహస యువకుడు; సహచరులందరికీ ఇష్టుడు. మంచి ఆరోగ్యంగా, బలిష్టంగా ఉన్న శరీరానికి ఒడ్డూ పొడుగూ ఒకదానికొకటి సరిపడేటట్టు ఉండేవి; ఈతలోనూ శరీర వ్యాయామంలోనూ అందరినీ మించినవాడు. శ్యామాచరణ్ లాహిరీగారికి 1846లో శ్రీమతి కాశీమణితో వివాహమయింది. ఈవిడ దేవ్ నారాయణ్ సన్యాల్‌గారి కూతురు. ఆదర్శ భారత గృహిణి కాశీమణిగారు, తమ ఇంటి పనులన్నీ సంతోషంగా చేసుకుంటూ అతిథుల్ని ఆదరించడం, బీదవాళ్ళకి సేవ చెయ్యడం వంటి గృహస్థ ధర్మాలు నిర్వహించేవారు. వీరి దాంపత్యఫలాలుగా సౌమ్య మూర్తులయిన ఇద్దరు కొడుకులూ-- తిన్‌కౌడీ, దుకౌడీ - ఇద్దరు కూతుళ్ళూ పుట్టారు. ఇరవై మూడో ఏట, 1851 లో, లాహిరీ మహాశయులు బ్రిటిష్ గవర్నమెంటువారి మిలిటరీ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంటులో ఎకౌంటెంట్ పోస్టు చేబట్టారు. ఉద్యోగకాలంలో ఆయన చాలా పదోన్నతులు పొందారు. ఈ ప్రకారంగా ఆయన, భగవంతుడి దృష్టిలో మహాపురుషులు కావడమే కాకుండా, ప్రపంచంలో ఒక ఆఫీసు ఉద్యోగిగా సామాన్య పాత్ర నిర్వహించిన చిన్న మానవ నాటకంలో కూడా కృతార్థులయారు.

ఆ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంటు వారు లాహిరీ మహాశయుల్ని వివిధ సమయాల్లో, గాజీపూర్, మీర్జాపూర్, నైనిటాల్, దానాపూర్, కాశీల్లో ఉన్న తమ ఆఫీసులకు బదిలీ చేశారు. తండ్రిగారు చనిపోయిన తరవాత ఆయనే మొత్తం కుటుంబ సభ్యుల బాధ్యత వహించారు. వాళ్ళకోసం ఆయన, కాశీకి సమీపంలో, వేరుపాటుగా ఉన్న గరుడేశ్వర్ మొహల్లాలో ఒక ఇల్లు కొన్నారు.

తాము ఈ భూమి మీద మళ్ళీ అవతరించడానికి గల ప్రయోజనం నెరవేరడం లాహిరీ మహాశయులు చూసింది, ముప్పైమూడో ఏట. హిమాలయాల్లో రాణిఖేత్ సమీపంలో తమ మహాగురువులు - బాబాజీని కలుసుకొని, వారి దగ్గర క్రియాయోగ దీక్ష పొందారు.

ఈ శుభ సంఘటన జరిగింది. లాహిరీ మహాశయుల కొక్కరికే కాదు; మానవజాతి కంతకీ సౌభాగ్య సమయమది. వాడుకలో లోపించి లేదా చిరకాలంగా అదృశ్యమై ఉన్న సర్వోన్నత యోగవిద్యను మళ్ళీ వెలుగులోకి తెచ్చిన శుభ తరుణమది.

పురాణ కథలో దాహాతురుడైన భగీరథుడనే భక్తుడికోసం గంగ,[4] ఆకాశం నుంచి భూమికి దిగివచ్చి దివ్యజలాలందించినట్టు, 1861 లో క్రియాయోగమనే స్వర్గంగ, హిమాలయ రహస్య గహ్వరం నుంచి సామాన్య జనపదాలకు ప్రవహించడం మొదలు పెట్టింది.

  1. యోహాను 11 : 1-4 (బైబిలు).
  2. జెనిసిన్ 18 : 23-32.
  3. శ్రీశ్రీ శ్యామాచరణ్ లాహిరీ మహాశయ అన్న పేరుతో స్వామి సత్యానంద బెంగాలీలో రాసిన చిన్న జీవిత చరిత్ర 1941 లో వెలువడింది.

ఈ అధ్యాయంలో లాహిరీ మహాశయుల్ని గురించి రాయడానికి అందులోంచి కొన్ని భాగాలు అనువాదం చేశాను.

  • హిందువులకు పవిత్ర నది అయిన గంగామాత జలాలు, ఎప్పటికీ హిమాచ్చాదితమై ఉండి నిశ్శబ్దం ఆవరించిన హిమాలయాల్లోని ఒక మంచు గుహలో నుంచి పుడతాయి. అనేక శతాబ్దుల కాలంలో వేలాది సాధుసత్పురుషులు గంగకు సమీపంలో ఉండి ఆనందించారు; ఆ నదీ తీరాల వెంబడి వారు, శుభాశీస్సుల దివ్యప్రభ ఒకటి విడిచి వెళ్ళారు. గంగానది కున్న ఒకానొక అసాధారణ గుణం - బహుశా దాని కొక్కదానికే ఉన్న విలక్షణత. నిష్కల్మషత్వం, క్రిముల్ని బతకనివ్వకపోవడ మనే మార్పులేని లక్షణంవల్ల, దాంట్లో ఏ సూక్ష్మక్రిములూ బతకవు. అనేక లక్షల మంది హిందువులు, స్నానానికీ తాగడానికీ ఆ ఏటి నీళ్ళు వాడుతూనే ఉంటారు కాని, దానివల్ల వాళ్ళకి ఎటువంటి హానీ కలగదు. ఈ యథార్థం ఆధునిక శాస్త్రవేత్తలకు విస్మయం కలిగిస్తూ ఉంటుంది. వాళ్ళలో ఒకడు, డా. జాన్ హోవర్డ్ నార్త్రావ్ - 1946 లో రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన వారిలో ఒకడు- ఇలా చెప్పాడు: “గంగానదిలో కాలుష్యాలు చాలా కలుస్తాయని మనకి తెలుసు. అయినా భారతీయులు దాంట్లో నీళ్ళు తాగుతారు; దాంట్లో ఈతలాడతారు; అయినా జబ్బుపడ్డం కనిపించదు.” అంటూ ఆయన, “బహుళా, జీవాణుభుక్కు (బాక్టీరియోఫేజ్ ) ఆ నదిని పరిశుద్ధం చేస్తూ ఉండొచ్చు,” నని ఆశాభావం వెలిబుచ్చాడు.

    ప్రాకృతిక దృగ్విషయాలన్నిటిపట్లా వేదాలు పూజ్యభావం పాదుకొలుపుతాయి. సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసీ, “ఎంతో ఉపయోగకరంగా, వినయంగా, పవిత్రంగా, అమూల్యంగా ఉన్న మన ‘సోదరి నీటి’ని సృష్టించినందుకు, ప్రభువుకు జయమవుగాక!” అంటూ కీర్తించడాన్ని భక్తినిరతుడై హిందువు చక్కగా అర్థం చేసుకుంటాడు.