ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 23

వికీసోర్స్ నుండి

అధ్యాయం : 23

విశ్వవిద్యాలయపట్టప్రాప్తి

“నువ్వు నీ తత్త్వశాస్త్ర పాఠ్యగ్రంథాలు చదవడం నిర్లక్ష్యం చేస్తున్నావు. పరీక్షల్లో గట్టెక్కడానికి అనాయాసమయిన అంతఃప్రేరణ మీద ఆధారపడుతున్నట్టుంది. కాని నువ్వు కనక, ఒక విద్యార్థిమాదిరిగా కష్టపడి చదవకపోయినట్లయితే నువ్వు పాస్ కాకుండా ఉండేలా చూస్తాను.”

శ్రీరాంపూర్ కాలేజిలో ప్రొఫెసర్ డి. పి. ఘోషాల్‌గారు నాతో కఠినంగా మాట్లాడుతూ అన్న మాటలివి. ఆయన, తరగతిలో పెట్టే చివరి రాత పరీక్షలో కనక నేను తప్పినట్లయితే చిట్టచివరి పరీక్షలకు కూర్చోడానికి నేను అనర్హుణ్ణి అవుతాను. ఈ నియమాలు ఏర్పరచింది కలకత్తా విశ్వవిద్యాలయ విద్యావిభాగం; దాని అనుబంధ శాఖల్లో శ్రీరాంపూర్ కాలేజి ఒకటి. భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఒక విద్యార్థి బి. ఏ. చివరి పరీక్షల్లో ఏ ఒక్క సబ్జెక్టులో పాసవకపోయినా, ఆ మరుసటి సంవత్సరం మొత్తం ‘అన్ని’ సబ్జెక్టుల్లోనూ పరీక్షకు కూర్చోవాలి.

శ్రీరాంపూర్ కాలేజీలో మా అధ్యాపకులు మామూలుగా నన్ను దయతో చూసేవారు; అయితే దాంట్లో రవంత పరిహాసం కూడా లేకపోలేదు, “ముకుందుడు మత విషయంలో కాస్త మితిమించి మత్తెక్కి ఉన్నాడు.” అని తేల్చి పారేస్తూ, తరగతి గదిలో వాళ్ళు వేసే ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి ప్రయత్నించే ఇబ్బంది కూడా నాకు లేకుండా చేసేవారు. చివరి రాతపరీక్షలు నన్ను బి. ఏ. పరీక్షార్థుల పట్టికలోంచి తప్పిస్తాయని నమ్ముకున్నారు. నా తోటి విద్యార్థులు నా గురించి ఇచ్చిన తీర్పు, “పిచ్చి సన్యాసి” అని వాళ్ళు నాకు పెట్టిన మారుపేరులోనే వెల్లడి అయింది.

తత్త్వశాస్త్రంలో నేను తప్పుతానన్న ప్రొఫెసర్ ఘోషాల్‌గారి బెదిరింపును వమ్ముచెయ్యడానికి నేను తెలివిగా ఒక ఎత్తు వేశాను. ఇక చివరి పరీక్ష ఫలితాలు బహిరంగంగా ప్రకటిస్తారనగా, ప్రొఫెసర్ గదిలోకి వెళ్ళేటప్పుడు నాతోబాటు ఒక సహాధ్యాయిని కూడా రమ్మన్నాను.

“నువ్వు కూడా రా; నాకో సాక్షి కావాలి,” అన్నాను మా వాడితో. “ఆ ప్రొఫెసరుగారి నమ్మకాన్ని వమ్ము చేయడంలో నేను విఫలుణ్ణయితే నాకెంతో నిరాశ కలుగుతుంది.”

నా పేపరుకు ఆయనిచ్చిన మార్కులెన్నో చెప్పమని నేను అడిగినప్పుడు ప్రొఫెసర్ ఘోషాల్‌గారు తల ఆడించాడు.

“పాసయిన వాళ్ళలో లేవు నువ్వు,” అన్నారాయన ఏదో సాధించానన్న గర్వంతో. తమ బల్లమీదున్న పెద్ద కాయితాల బొత్తి కెలికి చూశారు. “పేపరు లేనే లేదిక్కడ: ఏమయినా, పరీక్షకి గైర్‌హాజరు కావడంవల్ల నువ్వు ఫెయిలయావు.”

నేను ముసిముసిగా నవ్వాను. “సార్, నేను హాజరయానండి! పోనీ, ఆ కట్టలో నేను వెతుక్కోనాండీ?”

ఆ ప్రొఫెసరుగారు ఇరకాటంలో పడి, నాకు అనుమతి ఇచ్చారు. నా హాజరుపట్టి నంబరు తప్ప, మరే గుర్తూ లేకుండా నేను జాగ్రత్తపడ్డ పేపరును తొందరగానే పట్టుకున్నాను.

“ఎర్ర జెండా” లాంటి నా పేరు ఆయన్ని హెచ్చరిస్తూ అక్కడ లేకపోవడంవల్ల ఆ ప్రొఫెసరుగారు, పాఠ్యపుస్తకాల్లోంచి ఉదాహరించిన ముక్కలతో నా సమాధానాల్ని అందంగా అలంకరించకపోయినప్పటికీ, వాటికి ఆయన ఎక్కువ మార్కులే ఇచ్చారు.[1]

నేను ప్రయోగించిన యుక్తి కనిపెట్టి, “ఇది వట్టి, సిగ్గుచేటు అదృష్టం!” అంటూ ఉరిమారాయన. అయినా, “బి. ఏ. ఫైనల్స్‌లో నువ్వు ఫెయిలవడం ఖాయం!” అంటూ తమ ఆశాభావం వెలిబుచ్చారు.

నేను ఇతర విషయాల్లో జరిగే పరీక్షలకోసం కొంత స్నేహితుల చేత చెప్పించుకున్నాను. ముఖ్యంగా, నాకు ప్రియమిత్రుడయిన మా శారద బాబయ్యగారబ్బాయి ప్రభాస్ చంద్రఘోష్ నాకు చాలా చెప్పాడు. అవస్థపడుతూ కాస్త ఊగిసలాడినా, మొత్తం మీద నేను చివరి పరీక్ష లన్నింటిలోనూ పాసవడానికి రావలసిన కనీసపు మార్కులు తెచ్చుకుని ఎలాగో బయటపడ్డాను.

నాలుగేళ్ళు కాలేజి చదువు పూర్తయిన తరవాత, ఇక నేను బి. ఏ. పరీక్షలకు కూర్చోడానికి అర్హుణ్ణి అయాను. అయినప్పటికీ ఆ అవకాశాన్ని వినియోగించుకోగలనని కలలో కూడా అనుకోలేదు. బి. ఏ. డిగ్రీకి కలకత్తా విశ్వవిద్యాలయం పెట్టే కఠిన పరీక్షలముందు, శ్రీరాంపూర్ కాలేజి చివరి పరీక్షలు చిన్న పిల్లల ఆటల్లాంటివి. దాదాపు ప్రతి రోజూ నేను శ్రీయుక్తేశ్వర్‌గారి దర్శనానికి వెళ్తూండడంవల్ల కాలేజి హాళ్ళలోకి ప్రవేశించడానికి నాకు టైమే మిగలలేదు. అక్కడ నా సహాధ్యాయులు, నేను గైర్హాజరయినప్పటి కంటె హాజరయినప్పుడే ఆశ్చర్యం ప్రకటించేవారు.

పొద్దున తొమ్మిదిన్నరకి సైకిలెక్కి బయల్దేరడంతోనే దాదాపు ప్రతిరోజూ నా దినచర్య మొదలయేది. ఒక చేత్తో, గురుదేవులకు అర్పించడానికి, మా ‘పాంథీ’ వసతిగృహంలోని తోటలో పూసిన పూలు కొన్ని పట్టుకువెళ్ళే వాణ్ణి. గురుదేవులు నన్ను ఆప్యాయంగా పలకరిస్తూ మధ్యాహ్న భోజనానికి ఉండిపొమ్మనేవారు. ఇక ఆ రోజుకు కాలేజీకి వెళ్ళడమనే బెడద తప్పినందుకు సంతోషిస్తూ, ఆయన ఆహ్వానాన్ని తప్పకుండా హుషారుగా అంగీకరించేవాణ్ణి. శ్రీయుక్తేశ్వర్‌గారి సాటిలేని జ్ఞానోపదేశాలు ఆలకిస్తూనో, ఆశ్రమ విధుల్లో సాయపడుతూనో ఆయనతో గంటల తరబడి గడిపిన తరవాత, మనస్సు ఒప్పకపోయినా ఏ నడిరాత్రి వేళకో బయల్దేరి ‘పాంథీ’ వసతిగృహానికి వెళ్తూ ఉండేవాణ్ణి. ఒక్కొక్కప్పుడు, రాత్రి అంతా గురుదేవుల దగ్గరే ఉండిపోయేవాణ్ణి; ఆనందంగా ఆయన సంభాషణలో ఎలా మునిగిపోయేవాణ్ణంటే, చీకటి వేకువగా మారిందెప్పుడో కూడా గమనించేవాణ్ణి కాదు.

ఒకనాడు రాత్రి పదకొండు గంటలవేళ నేను నా గదికి తిరుగు ప్రయాణం కట్టే ప్రయత్నంలో బూట్లు తొడుక్కుంటూ ఉండగా, గురుదేవులు గంభీరంగా ఇలా అడిగారు:

“నీ బి. ఏ. పరీక్ష లెప్పుడు మొదలవుతాయి?”

“ఇంక ఐదు రోజుల్లోనండి.”

“నువ్వు వాటికి తయారుగానే ఉన్నావనుకుంటాను.”

భయంతో కొయ్యబారిపోయి, ఒక బూటు గాలిలోకి ఎత్తి పట్టుకున్నాను. “గురుదేవా, ఇన్నాళ్ళూ నాకు అధ్యాపకుల దగ్గరకంటె మీ దగ్గరే గడిచిపోయాయని మీకు తెలుసు. అలాంటప్పుడు, ఆ కఠినమైన పరీక్షలకి వెళ్ళి నాటకం ఆడడానికి నే నెలా సిద్ధపడతాను?” అంటూ అభ్యంతరం చెప్పాను.

శ్రీయుక్తేశ్వర్‌గారి కళ్ళు నా కళ్ళలోకి గుచ్చిగుచ్చి చూశాయి. “నువ్వు వెళ్ళి తీరవలసిందే.” ఆయన కంఠస్వరం నిష్ఠురంగా, అనుల్లంఘనీయమైన శాసనంలా ధ్వనించింది. “మీ నాన్న గారికీ తక్కిన చుట్టాలకీ, ఆశ్రమజీవితానికి నువ్విచ్చే ప్రాముఖ్యాన్ని విమర్శించడానికి మనం కారణం కల్పించగూడదు. నువ్వు పరీక్షలకి హాజరవుతానని నాకు మాట ఇయ్యి చాలు; నువ్వు రాయగలిగినంత బాగా సమాధానాలు రాయి.”

కన్నీళ్ళు, ఆపుకోడానికి వీలుకాకుండా నా మొహం మీద ధారకట్టి కారుతున్నాయి. గురుదేవుల ఆజ్ఞ సబబుగా లేదనీ, ఆయన ఆసక్తిటూకీగా చెప్పాలంటే- కాలదోషం పట్టినటువంటిదనీ అనిపించింది నాకు.

“మీకు కావాలంటే నేను తప్పకుండా హాజరవుతాను” అన్నాను వెక్కి వెక్కి ఏడుస్తూ. “కాని సరిగా తయారుకావడానికి వ్యవధి లేదండి” అని చెబుతూ, “ప్రశ్నలకు రాయవలసిన సమాధానాల్లో, మీ ఉపదేశాలతోనే కాయితాలు నింపేస్తాను!” అని నాలో నేను గొణుక్కున్నాను.

ఆ మర్నాడు నేను మామూలు వేళకి ఆశ్రమంలో అడుగుపెట్టినప్పుడు, నే నిచ్చే పూలగుత్తి విచార గ్రస్తుణ్ణయి శ్రీయుక్తేశ్వర్‌గారికి సమర్పించాను. నా విషాదరూపం చూసి నవ్వారాయన.

“ముకుందా, పరీక్షలోకానీ, మరోచోటకానీ దేవుడు నిన్నెప్పుడయినా తప్పించాడా?”

“లేదండి,” అన్నాను నేను ఉత్సాహంగా. కృతజ్ఞతాపూర్వకమైన స్మృతులు నాలో మళ్ళీ ఉత్సాహం కలిగిస్తూ వెల్లువలా పెల్లుబికాయి. “కాలేజి గౌరవాలకోసం పాకులాడకుండా, నిన్ను అడ్డుకున్నది దైవాన్వేషణపరమైన తపనేకాని సోమరితనం కాదు” అన్నారు గురుదేవులు కనికరంతో. కాసేపు మౌనం వహించిన తరవాత ఇలా ఉదాహరించారు. “మీరు మొట్టమొదట దేవుడి రాజ్యాన్నీ ఆయన ధర్మాన్నీ అన్వేషించండి; అటుమీదట ఇవన్నీ మీకు అదనంగా సమకూర్చడం జరుగుతుంది.”[2]

గురుదేవుల సన్నిధిలో నా బరువులన్నీ తేలిపోవడం వెయ్యోసారి నాకు అనుభవమయింది. ఆ పూట పగటి భోజనం మేము పెందలాడే ముగించుకున్న తరవాత నన్ను ‘పాంథీ’కి తిరిగి వెళ్ళమని సలహా ఇచ్చారు ఆయన.

“నీ స్నేహితుడు రమేశ్ చంద్ర దత్తు ఇంకా మీ వసతి గృహంలోనే ఉంటున్నాడా?”

“ఉంటున్నాడండి.”

“అతన్ని కలుసుకో. పరీక్షల్లో నీకు సాయపడ్డానికి ఈశ్వరుడు అతనికి ప్రేరణ ఇస్తాడు.”

“మంచిదండి; కాని రమేశ్ మామూలప్పటికంటే ఎక్కువగా చదువులో మునిగి ఉన్నాడు. మా క్లాసుకు గౌరవకారకుడతను; పైగా అతని కోర్సు, తక్కినవాళ్ళందరి దానికన్న ఎక్కువ భారమైనది.”

గురుదేవులు నా అభ్యంతరాలన్నీ తోసి పారేశారు. “రమేశ్ నీ కోసం వెసులుబాటు చేసుకుంటాడు. ఇంక వెళ్ళు.”

నేను సైకిలు తొక్కుకుంటూ ‘పాంథీ’కి వెళ్ళాను. వసతిగృహం ఆవరణలో నేను కలిసిన మొట్టమొదటి వ్యక్తి, విద్వాంసుడైన రమేశే అన్ని రోజులూ అతనికి తీరికే అన్నట్టు, నేను వెనకాడుతూ కోరిన కోరికను అతను సౌహార్దంతో అంగీకరించాడు.

“తప్పకుండా! నీకు కావలసిన సాయం చెయ్యడానికి నేను సిద్ధం,” అంటూ అతను, ఆ రోజూ, ఆ తరవాత మరికొన్ని రోజులు, గంటల తరబడి నాకు రకరకాల సబ్జెక్ట్‌లు చెప్పాడు.

“ఇంగ్లీషు సాహిత్య పరీక్షలో చాలా ప్రశ్నలు, చైల్డ్ హారాల్డ్ ప్రయాణం చేసిన దారికి సంబంధించి ఉంటాయని నా నమ్మకం,” అన్నాడు నాతో. “మనం వెంటనే అట్లాస్ ఒకటి సంపాయించాలి.”

నేను వెంటనే మా శారద బాబయ్యగారింటికి ఉరికి అట్లాసొకటి ఎరువు తెచ్చాను. బైరన్ సృష్టించిన కల్పిత కథానాయకుడు యాత్రలో సందర్శించిన ప్రదేశాల్ని యూరప్ మాప్‌లో గుర్తు పెట్టాడు రమేశ్.

అతను నాకు చదువు చెప్పగా వినడంకోసం మా సహాధ్యాయులు కొందరు చుట్టూ మూగారు. “రమేశ్ నీకు తప్పుడు సలహా ఇస్తున్నాడు,” అంటూ వ్యాఖ్యానించాడు వాళ్ళలో ఒకడు. ఒక తడవ మా చదువు పూర్తి కాగానే. “మామూలుగా, ప్రశ్నల్లో సగం మాత్రమే పుస్తకాల మీద వస్తాయి; తక్కిన సగం రచయితల జీవితాలకు సంబంధించి వస్తాయి.”

నేను ఇంగ్లీషు సాహిత్య పరీక్షకి కూర్చున్నప్పుడు, మొదటిసారిగా ప్రశ్నల మీద నా చూపు పడగానే, కృతజ్ఞతతో వెలువడ్డ కన్నీళ్ళు నా చెక్కిళ్ళ మీంచి జారిపడుతూ నా పేపరును తడిపేశాయి. క్లాస్ రూమ్ మానిటర్ నా బల్ల దగ్గరికి వచ్చి సానుభూతిగా పలకరించాడు.

“రమేశ్ నాకు సాయపడతాడని మా గురుదేవులు ముందుగానే నాకు జోస్యం చెప్పారు,” అని వివరించాను. “చూడు, రమేశ్ నాకు సూచించిన ప్రశ్నలే ఇక్కడ పరీక్షా పత్రం మీద ఉన్నాయి!” అంటూ ఇంకా ఇలా అన్నాను. “నా అదృష్టంవల్ల, ఈ సంవత్సరం బ్రిటిష్ రచయితల మీద చాలా తక్కువ ప్రశ్నలున్నాయి; వాళ్ళ జీవితాలు, నాకు సంబంధించినంతవరకు, అతిగహనంగా రహస్యపు ముసుగులో మరుగుపడి ఉన్నాయి.”

నేను తిరిగి వెళ్ళేటప్పటికి మా బోర్డింగ్ హౌస్ అరుపులతో దద్దరిల్లి పోయింది. రమేశ్ చెప్పే చదువుమీద నమ్మకం పెట్టుకున్నందుకు నన్ను హేళనచేస్తూ వచ్చిన కుర్రాళ్ళు ఇప్పుడు అభినందనలతో నా చెవులు దాదాపు దద్దరిల్లి పోయేటట్టు చేశారు. పరీక్షల వారం రోజులు నేను వీలున్నంత ఎక్కువసేపు రమేశ్ తోనే గడిపాను; ప్రొఫెసర్లు పరీక్షలో ఇస్తారని తన కనిపించిన ప్రశ్నలు తయారుచేసి పెట్టాడతను. రోజు రోజుకూ రమేశ్ ప్రశ్నలు, దాదాపు అవే మాటల్లో పరీక్షాపత్రాల్లో ప్రత్యక్షమవుతూ వచ్చాయి.

అద్భుత అలౌకిక చర్యలాంటిదేదో జరుగుతోందనీ, పరధ్యానపు “పిచ్చి సన్యాసి” పరీక్షలో గట్టెక్కేసే అవకాశం కనిపిస్తోందనే ఒక వార్త విస్తృతంగా ప్రచారమయింది. ఇందులో యథార్థాలు కప్పిపుచ్చడానికి నే నే ప్రయత్నమూ చెయ్యలేదు. కలకత్తా విశ్వవిద్యాలయం విద్వాంసులు తయారుచేయించిన ప్రశ్నల్ని మార్చడానికి అధికారం, ఇక్కడి అధ్యాపకులకు లేదు.

ఆంగ్లభాషాసాహిత్య పరీక్షనుగురించి ఆలోచిస్తూ ఒకనాడు పొద్దున, నేనో ఘోరమైన తప్పు చేశానని గ్రహించాను. కొన్ని ప్రశ్నలు రెండు భాగాలుగా ఇచ్చారు: ‘ఎ’ కాని ‘బి’ కాని; ‘సి’ కాని ‘డి’ కాని. నేను ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క ప్రశ్న ఎన్నుకోడానికి బదులు, మొదటి భాగంలోనే రెండు ప్రశ్నలకు జవాబులు రాసి, అజాగ్రత్తవల్ల రెండో భాగాన్ని పట్టించుకోలేదు. ఆ పేపరులో నేను తెచ్చుకోగల ఎక్కువ మార్కులు 33-పాస్ కావడానికి రావలసిన 36 మార్కులకన్న మూడు మార్కులు తక్కువ.

వెంటనే గురుదేవుల దగ్గరికి పరిగెత్తి, నా బాధలు వెళ్ళబోసుకున్నాను.

“గురుదేవా, నేను క్షమించరాని తప్పు చేశాను. రమేశ్ ద్వారా దేవుడి ఆశీస్సులు పొందడానికి నేను అర్హుణ్ణి కాను; నేను పూర్తిగా పనికి మాలినవాణ్ణి.”

“హుషారుగా ఉండు, ముకుందా,” అన్నారు గురుదేవులు. శ్రీయుక్తేశ్వర్‌గారి స్వరంలో మార్దవం, నిశ్చింత కనిపిస్తున్నాయి. ఆయన నీలాకాశం వేపు వేలు చూపించారు. “అంతరిక్షంలో సూర్యచంద్రులు తమ స్థానాలు మార్చుకోడమయినా జరగొచ్చుకాని, డిగ్రీ సంపాదించడంలో నువ్వు ఫెయిల్ కావడం జరగదు!”

ప్రశాంత మనఃస్థితిలో నేను ఆశ్రమంనుంచి బయటికి వచ్చాను; అయితే నేను పాస్ కాగలగడం గణితశాస్త్రీయంగా అనూహ్యంగానే కనిపిస్తోంది. ఒకటి రెండుసార్లు బెదురుబెదురుగా ఆకాశంలోకి చూశాను. దినరాజు తన మామూలు కక్ష్యలో సురక్షితంగానే కనిపించాడు.

నేను ‘పాంథీ’ చేరేసరికి, మా సహాధ్యాయి ఒకడు అన్న మాట నా చెవిని పడింది: “ఇంగ్లీషు సాహిత్యంలో పాస్ కావడానికి రావలసిన మార్కు మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం తగ్గించారని నా కిప్పుడే తెలిసింది.”

నేను ఆ అబ్బాయి గదిలోకి జోరుగా పరిగెత్తేసరికి, అతను కంగారుపడిపోతూ చూశాడు. నే నతన్ని ఆత్రంగా ప్రశ్నించాను.

“జెడదారి సన్యాసి,” అని నన్ను చూసి నవ్వుతూ, “చదువు సంధ్యల మీద ఇంత హఠాత్తుగా ఆసక్తి పుట్టుకొచ్చిందేం నాయనా? చివరి క్షణంలో ఇలా గోలపెట్టడం దేనికి? కాని పరీక్ష పాసవడానికి రావలసిన మార్కు ఇప్పుడే 33 కు తగ్గించడం మాత్రం నిజం,” అన్నాడతను.

ఆనందంగా నాలుగు ఉరుకుల్లో నా గదిలోకి వచ్చి పడ్డాను. మోకాళ్ళ మీదికి వాలి, ఆ పరమేశ్వరుడి గణితశాస్త్ర పరిపూర్ణతలకు జోహారు లర్పించాను.

రమేశ్ ద్వారా నాకు దారి చూపిస్తున్నట్టు స్పష్టంగా అనుభూతమవుతున్న ఒకానొక ఆధ్యాత్మిక శక్తి ఉనికి స్పృహలో ఉండడంతో ప్రతి రోజు నేను ఆనందంతో పులకితుణ్ణయాను. బెంగాలీ భాష కోర్సుకు సంబంధించిన పరీక్ష విషయంలో చెప్పుకోదగ్గ సంఘటన ఒకటి జరిగింది. ఒకనాడు పొద్దున, ఆ కోర్సులో నాకు చదువుచెప్పిన రమేశ్, పరీక్ష హాలుకు వెళ్ళడానికి బోర్డింగ్ హౌస్ నుంచి బయలుదేరుతూ ఉండగా నన్ను పిలిచాడు.

“రమేశ్ నీ కోసం అరుస్తున్నాడు,” అన్నాడొక క్లాస్‌మేటు చిరాకుగా. “వెనక్కి వెళ్ళకు; పరీక్ష హాలుకు వెళ్ళడానికి ఆలస్యమయిపోతుంది.”

అతని సలహా పట్టించుకోకుండా, బోర్డింగ్ హౌస్‌కు పరిగెత్తాను.

“మామూలుగా మన బెంగాలీ కుర్రాళ్ళు బెంగాలీ పరీక్షలో సులువుగా పాసయిపోతారు,” అన్నాడు రమేశ్ . “కాని ఈ ఏడాది ప్రొఫెసర్లు, పాఠ్యపుస్తకాలమీద ప్రశ్నలడిగి విద్యార్థుల్ని “ఊచకోత” కొయ్యాలని ఎత్తు వేసినట్టుగా ఇప్పుడే నా మనస్సుకు తట్టింది.” ఆ తరవాత అతను, పందొమ్మిదో శతాబ్దం తొలికాలంలో ప్రసిద్ధుడైన విద్యాసాగర్ అనే బెంగాలీ ప్రజాహితకారుడి జీవితంలోంచి రెండు కథలు టూకీగా చెప్పాడు. నేను రమేశ్‌కు ధన్యవాదాలు చెప్పి సైకిలెక్కేసి గబగబా పరీక్ష హాలుకు వెళ్లాను. అక్కడ బెంగాలీ పరీక్షాపత్రంలో రెండుభాగా లుండడం గమనించాను. మొదటి ప్రశ్న ఏమిటంటే: “విద్యాసాగరుల దానధర్మాలకు రెండు ఉదాహరణలు రాయండి.”[3] అని. అంతకుముందే గడించిన జ్ఞానాన్ని నేను సమాధాన పత్రం మీదికి బదలాయింపు చేస్తూ, రమేశ్ చివరి క్షణం పిలుపును ఖాతరు చేసినందుకు దేవుడికి చిన్నగా ధన్యవాదాలు చెప్పుకున్నాను. విద్యాసాగరుల ఉపకారాలు (ఇప్పుడు నాకు చేసింది కూడా కలుపుకొని) కనక నాకు తెలిసి ఉండకపోతే నేను బెంగాలీ పరీక్షలో పాసయి ఉండేవాణ్ణి కాదు.

పత్రంలో రెండో ప్రశ్న ఇది: “నిన్ను ఎక్కువగా ఉత్తేజపరిచిన ఒక వ్యక్తి జీవితాన్ని గురించి బెంగాలీలో ఒక వ్యాసం రాయండి.” పాఠక మహాశయా, నా కథావస్తువుకు నేను ఎన్నుకున్న వ్యక్తి ఎవరో మీకు వేరే చెప్పక్కర్లేదు. పేజి వెంబడి పేజిగా నేను మా గురుదేవుల స్తుతితో నింపేస్తూ ఉంటే, మీ ఉపదేశాలతోనే కాయితాలు నింపేస్తానని గొణుక్కుంటూ చెప్పిన జోస్యం నిజమవుతున్నదని గ్రహించి చిన్నగా నవ్వుకున్నాను.”

తత్త్వశాస్త్రంలో నా కోర్సు గురించి రమేశ్ ను అడగబుద్ధి కాలేదు. శ్రీయుక్తేశ్వర్‌గారి సన్నిధిలో చాలాకాలం పొందిన శిక్షణ మీద విశ్వాస ముంచి పాఠ్యపుస్తక వివరణల్ని ఉపేక్ష చేసేశాను. నా పేపర్లలో అన్నిటికన్న ఎక్కువ మార్కులు వచ్చింది తత్త్వశాస్త్రం పేపరులోనే. మిగిలిన సబ్జెక్ట్ లన్నిటిలలో అత్తెసరు మార్కులే వచ్చాయి.

స్వార్థరహితుడైన మా స్నేహితుడు రమేశ్, ప్రశంసనీయమైన శ్రేణిలో పట్టం పొందాడని రాయడం నాకు ఆహ్లాదకరమైన విషయం.

నేను పట్టభద్రుణ్ణి అయినందుకు నాన్నగారు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. “నువ్వు పాసవుతావని అనుకోనేలేదు, ముకుందా,” అని ఉన్నమాట చెప్పేశారు. “మీ గురువుగారి దగ్గరే ఎక్కువకాలం గడిపేస్తుంటావు.” మా నాన్న గారు పైకి చెయ్యని విమర్శను నిజానికి గురుదేవులు సరిగానే కనిపెట్టారు.

నా పేరు వెనక బి.ఏ. డిగ్రీ చూసుకునే రోజు ఎప్పటికయినా వస్తుందన్న నమ్మకం చాలా ఏళ్ళపాటు లేదు నాకు. అది భగవత్ప్రసాధంగా వచ్చిందన్న ఆలోచనలేకుండా నేను ఆ డిగ్రీని ఉపయోగించడం అరుదు; ఏదో నిగూఢమైన కారణాలవల్ల నా కా డిగ్రీ ప్రసాదించడం జరిగింది. కాలేజిలో చదువుకున్నవాళ్ళు, తాము దిగమింగిన జ్ఞానంలో చాలా కొద్దిగా మాత్రమే, పట్టభద్రులైన తరవాత తమకు మిగిలిందని అంటూండడం అప్పుడప్పుడు వింటూంటాను. వాళ్ళు ఆ విధంగా ఒప్పుకోడం, విద్యా విషయంలో నిస్సందేహంగా నాకున్న లోపాలకు ఒక్కరవ్వ ఊరట కలిగిస్తుంది.

1915 జూన్ నెలలో నేను కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ తీసుకున్ననాడు మా గురుదేవుల పాదాలమీద వాలి, ఆయన ప్రాణశక్తి[4] లోంచి నా ప్రాణశక్తిలోకి ప్రసరించిన ఆశీస్సులన్నింటికీ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొన్నాను. “లే ముకుందా,” అన్నారాయన అనునయంగా, “సూర్యచంద్రుల స్థానాల్ని మరో విధంగా మార్చడం కంటె నిన్ను పట్టభద్రుణ్ణి చెయ్యడమే ఎక్కువ సౌకర్యంగా కనిపించి ఉంటుంది. ఈశ్వరుడికి!”

  1. ప్రొఫెసర్ ఘోషాల్ గారికి నాకూ గల సంబంధం సజావుగా లేకపోవడానికి కారణం ఆయన తప్పేమీ కాదనీ, కేవలం క్లాసుల్లో నా గైర్‌హాజరీలేననీ నా తప్పు ఒప్పుకొని ఆయనకు న్యాయం చెయ్యక తప్పదు. ప్రొఫెసర్ ఘోషాల్ గారు అపారమైన తత్త్వశాస్త్ర జ్ఞానంగల గొప్ప వక్త. అనంతర కాలంలో మేము సౌహార్దపూర్వకమైన పరస్పరావగాహనకు వచ్చాం.
  2. మత్తయి 6 : 33 (బైబిలు).
  3. ఆ ప్రశ్నలో వాక్యనిర్మాణం ఎలా ఉందో నాకు కచ్చితంగా గుర్తు లేదు; కాని నాకు విద్యాసాగరుల గురించి రమేశ్ చెప్పిన రెండు కథలకూ సంబంధించిందేనని గుర్తు ఉంది. పండిత ఈశ్వరచంద్రగారికి ఉన్న విద్వత్తువల్ల, ‘విద్యాసాగర్’ (విద్యలో సముద్రంవంటివారు) అన్న బిరుదుతోనే ఆయన బెంగాలులో విఖ్యాతులయారు.
  4. ఇతరుల మనసుల్నీ, సంఘటన ఘటననూ ప్రభావితం చేసే శక్తి, ఒక ‘విభూతి’ (యోగశక్తి); పతంజలి యోగసూత్రాల్లో మూడో అధ్యాయంలో 24 శ్లోకంలో దీన్ని వివరించాడు. ఈ శక్తి, “సార్వజనీన సానుభూతి”కి ఫలితమని తెలియజేస్తుంది అది.

ఈశ్వరుడు మానవుణ్ణి తన సర్వశక్తిమంతమైన రూపంలో సృష్టించాడని పవిత్ర గ్రంథాలన్నీ ఘోషిస్తాయి. విశ్వంమీద నియంత్రణ ప్రకృతికి అతీతమైన దన్నట్టు కనిపిస్తుంది, కాని నిజానికి తన పుట్టుకకు మూలం భగవంతుడనే “సరయిన స్పృహ ”(సమ్యక్ స్మరణ) సాధించిన ప్రతి ఒక్కరిలోనూ అటువంటి శక్తి సహజంగా ఉంటుంది. అహంకారమూ, వ్యక్తిగత వాంఛల రూపంలో అది తల ఎత్తడమూ శ్రీయుక్తేశ్వర్‌గారి మాదిరిగా భగవత్సాక్షాత్కారం పొందిన వాళ్ళలో ఉండవు. నిజమైన గురువుల కార్యకలాపాలు ‘ఋదం’ అనే సహజ ధార్మికతకు అప్రయత్నంగానే అనురూపంగా ఉంటాయి. ఎమర్సన్ మాటల్లో చెప్పాలంటే, మహాపురుషులందరూ, “ధర్మపరాయణులు కావడం కాదు, వారే ‘ధర్మస్వరూపు’ లవుతారు; అప్పుడు సృష్టి లక్ష్యం నెరవేరుతుంది. ఈశ్వరుడు బాగా ప్రసన్నుడవుతాడు. దైవసాక్షాత్కారం పొందిన మనిషి ఎవరయినా సరే, అలౌకిక ఘటనలు ప్రదర్శించగలడు; సూక్ష్మమైన సృష్టి నియమాల్ని అతడు అర్థంచేసుకోడమే దానికి కారణం. కాని సద్గురువులందరూ అద్భుత శక్తుల్ని ప్రయోగించాలని తలపెట్టరు. ప్రతి సాధువూ తన రీతిలో తాను దేవుణ్ణి ప్రతిబింబింపజేస్తూ ఉంటాడు: ఏ రెండు ఇసక రేణువులూ కచ్చితంగా ఒకదాన్నొకటి పోలకుండా ఉండే ఈ ప్రపంచంలో ఈ మాదిరి వ్యక్తిత్వాభివ్యక్తి మౌలికమైనది.

దైవజ్ఞానం పొందిన సాధువుల్ని గురించి అపవాదంలేని సూత్రాలు రూపొందించడం కుదరదు; కొందరు అద్భుత అలౌకిక చర్యలు ప్రదర్శిస్తారు, కొందరు ప్రదర్శించరు; కొందరు నిష్క్రియులుగా ఉంటే మరికొందరు (ప్రాచీన భారతదేశంలోని జనకమహారాజు, సెంట్ తెరీసా ఆఫ్ ఆవిలా లాంటివాళ్ళు) బృహత్ కార్యకలాపాల్లో తలమునకలై ఉంటారు; కొందరు ఉద్బోధిస్తారు, సంచారం చేస్తారు. శిష్యుల్ని స్వీకరిస్తారు. కాని మరికొందరు నీడమాదిరిగా నిశ్శబ్దంగానూ వినమ్రంగానూ జీవితాలు గడుపుతారు. ప్రతి సాధువుకు వేరువేరు లిపితో రాసిపెట్టిఉన్న రహస్యమైన కర్మలిఖితాన్ని లౌకిక విమర్శకుడెవడూ చదవలేడు.