ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 24
అధ్యాయం : 24
నేను సన్యాసం తీసుకోడం
“గురుదేవా, నేను బెంగాల్ - నాగపూర్ రైల్వేలో నిర్వాహక ఉద్యోగానికి ఒప్పుకుంటే బాగుంటుందని నాన్న గారు ఆత్రంగా ఉన్నారు. కాని నేను, వద్దని కచ్చితంగా చెప్పేశాను,” అంటూ నేను, “స్వామీ, మీరు నాకు సన్యాసదీక్ష ఇయ్యరా?” అని ఆశగా అర్థిస్తూ, మా గురుదేవులవేపు చూశాను. వెనకటి సంవత్సరాల్లో నేను ఇదే కోరిక కోరినప్పుడు ఆయన, నా నిశ్చయం ఎంత దృఢమైందో పరీక్షించడానికి, దాన్ని నిరాకరించారు. అయితే ఈనాడు, కరుణార్ద్ర దృష్టితో చిరునవ్వు నవ్వారు.
“మంచిది, రేపే నీకు సన్యాసదీక్ష ఇస్తాను,” అంటూ ప్రశాంతంగా ఇంకా ఇలా అన్నారు, “నువ్వు సన్యాసం తీసుకోవాలన్న కోరిక విడవకుండా ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. నువ్వు దేవుణ్ణి నీ వేసవి (పడుచుతనం) అతిథిగా ఉండమని ఆహ్వానించకపోతే, నీ జీవితపు చలికాలం (ముసలితనం)లో ఆయన నీ దగ్గరికి రాడు,” అని తరచుగా అనేవారు లాహిరీ మహాశయులు.
“ప్రియ గురుదేవా, పూజనీయులైన మీ మాదిరిగానే నేను కూడా సన్యాసిగా ఉండాలన్న కోరికను ఎన్నడూ విడిచిపెట్టలేను.” అపారమైన అభిమానంతో ఆయనవేపు చూసి చిరునవ్వు నవ్వాను.
“పెళ్ళికానివాడు దైవసంబంధమయినవాటికోసం ఆరాటపడుతాడు; ఆయన్ని ఎలా సంతోషపెట్టాలా అని చూస్తాడు; కాని పెళ్ళయిన వాడు ప్రాపంచిక విషయాలగురించి ఆరాటపడతాడు; తన పెళ్ళాన్ని ఎలా సంతోషపెట్టాలా అని చూస్తాడు.”[1] ఒక రకమైన ఆధ్యాత్మిక శిక్షణ పొందిన తరవాత పెళ్ళి చేసుకున్న మా స్నేహితుల్లో చాలామంది జీవితాల్ని నేను విడమరిచి చూశాను. వాళ్ళు లౌకిక బాధ్యతల సముద్రంలో ప్రయాణం మొదలుపెట్టి, గాఢంగా ధ్యానం చెయ్యాలని చేసుకున్న తీర్మానాల్ని మరిచేపోయారు.
జీవితంలో, దేవుడికి రెండోస్థానం[2] (అప్రధానమైన స్థానం) కేటాయించడమన్నది నా ఊహకు అందని విషయం. చడీ చప్పుడూ లేకుండా, జన్మజన్మాంతరాల్లో మనిషికి తన కానుకలు కురిపిస్తూ బ్రహ్మాండాని కంతకూ ఏకైకస్వామి అయినవాడు ఆయనే. ఆ కానుకలకు ప్రతిగా మానవుడు, ఆయనకి ఇవ్వదగిన కానుక ఒకే ఒకటి- అది తన ప్రేమ; దాన్ని ఇవ్వడానికయినా మానడానికయినా అతనికి అధికారం ఉంది.
సృష్టిలో అణువణువునా ఉన్న తన ఉనికిని గోప్యంగా కప్పి ఉంచడానికి అంతులేని శ్రమ తీసుకోడంలో సృష్టికర్తకు ఒకే ఒక ఉద్దేశ్యం, ఒకే సున్నితమైన కోరిక, ఉండి ఉంటుంది- మానవుడు స్వతంత్ర సంకల్పంతో మాత్రమే తనను అన్వేషించాలని. సర్వశక్తి మత్వమనే ఉక్కు పిడికిలిని నమ్రత అనే ఏ ముఖమల్ తొడుగులో మరుగుపరచలేదాయన!
ఆ మర్నాడు, నా జీవితంలో ఎన్నటికీ మరుపురాని రోజు. నాకు బాగా గుర్తు: ఆహ్లాదకరమైన ఆ రోజు గురువారం. 1915 జూలై నెల - కాలేజీలో నేను పట్టభద్రుణ్ణి అయిన కొద్దివారాలకే శ్రీరాంపూర్ ఆశ్రమం లోతట్టు బాల్కనీలో గురుదేవులు, తెల్లటి ఒక కొత్త పట్టుబట్టను కాషాయ వన్నె అద్దకం రంగులో ముంచారు; సన్యాసులు కట్టుకొనే బట్టలకు సాంప్రదాయికంగా వాడే వన్నె ఇది. బట్ట ఆరిన తరవాత, సన్యాసి పరిధానంగా, గురుదేవులు దాన్ని నాకు కప్పారు.
“ఒకనాటికి నువ్వు పడమటి దేశాలకి వెళ్తావు, అక్కడి వాళ్ళు పట్టును పసందు చేస్తారు,” అన్నారాయన. “అందువల్ల మామూలుగా అందరూ కట్టుకొనే నూలుబట్టకు బదులు, ఒక గుర్తుగా, నీకోసం పట్టుబట్ట ఎంపిక చేశాను.”
భారతదేశంలో సన్యాసులు పేదరికాన్ని ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి పట్టుబట్ట కట్టుకున్న స్వామి అవుపించడం అరుదు. అయితే చాలా మంది యోగులు పట్టుబట్టలు కట్టుకోడానికి కారణం, అది నూలుబట్టకన్న ఎక్కువగా, శరీరంలోని కొన్ని సూక్ష్మ (విద్యుత్) ప్రవాహాల్ని సంరక్షించగలిగి ఉండడమే.
“తతంగాలు నాకు కిట్టవు,” అన్నారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “విద్వత్ (కర్మకాండలేని) రీతిలో నీకు సన్యాసదీక్ష ఇస్తాను.”
‘వివిదిష’ అనే సాంగోపాంగ సన్యాసదీక్షలో అగ్ని కార్యం కూడా ఒకటి ఉంటుంది. ఈ ప్రక్రియలో ప్రతీకాత్మకంగా అంత్యక్రియలు జరుగుతాయి. శిష్యుడి భౌతికకాయం మరణించినట్టూ దాన్ని జ్ఞానజ్వాలలో దహనం చేసినట్టూ పరిగణిస్తారు. కొత్తగా దీక్ష ఇచ్చిన సన్యాసికి ఒక మంత్రం ఉపదేశిస్తారు; ఉదాహరణకు: “ఈ ఆత్మ బ్రహ్మ” [అయ మాత్మా బ్రహ్మ][3] అనికాని, “నువ్వే అది” [తత్త్వమసి] అనికాని, “నేనే ఆయన” (సో౽హం) అని కాని. అయితే శ్రీయుక్తేశ్వర్‌గారు నిరాడంబరతాప్రియులు కనక, లాంఛనప్రాయమైన కర్మకాండలన్నీ కట్టిపెట్టి, నన్నొక కొత్తపేరు ఎన్నుకోమని మాత్రమే అన్నారు.
“నీకు నువ్వే ఎన్నిక చేసుకునే హక్కు ఇస్తాను,” అన్నారు చిన్నగా నవ్వుతూ.
“యోగానంద,”[4] అని చెప్పాను, ఒక్క క్షణం ఆలోచించి. ఈ పేరుకు అర్థం, “యోగం ద్వారా పొందే ఆనందం” అని.
“తథాస్తు, ముకుందలాల్ ఘోష్ అనే కుటుంబ వ్యవహార నామం విడిచిపెట్టేసి, ఇకనుంచి నిన్ను, సన్యాసాశ్రమ సంప్రదాయంలో ‘గిరి’ శాఖకు చెందిన యోగానందుడిగా పిలుస్తారు.”
శ్రీయుక్తేశ్వర్‌గారి ముందు నేను మోకరిల్లి, ఆయన నా కొత్త పేరు పలకడం మొట్టమొదటిసారిగా వింటున్నప్పుడు, నా హృదయం కృతజ్ఞతతో పెల్లుబికిపోయింది. ఆనాటి కుర్రముకుందుడు ఒకనాటి కెప్పటికో స్వామి యోగానందగా పరివర్తన చెందాలని ఎంత ప్రేమగా, ఎంత శ్రమకోర్చి హైరాణపడ్డారు! ఆనందభరితుణ్ణయి నేను, స్వామి శంకరుల (శంకరాచార్యులవారు) సుదీర్ఘ సంస్కృత స్తోత్రం [నిర్వాణ షట్కం] లోంచి కొన్ని శ్లోకాలు చదివాను[5]: “మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే
న చ వ్యోమ భూమి ర్నతేజో న వాయుః
చిదానందరూపః శివో౽హం శివో౽హం.
న మృత్యు ర్నశంకా న మే జాతిభేదః
పితానైవ మే నైవ మాతా న జన్మ
న బంధు ర్నమిత్రం గురుర్నైవ శిష్యః
చిదానందరూపః శివో౽హం శివో౽హం.
అహం నిర్వికల్పో నిరాకారరూపో
విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రి యాణాం
న చాసంగతం నైవ ముక్తి ర్నమేయః
చిదానందరూపః శివో౽హం శివో౽హం.”
ప్రతి స్వామీ, భారతదేశంలో చిరంతన కాలంగా మన్ననలందుకుంటూ వస్తున్న సన్యాస మఠామ్నాయానికి చెంది ఉంటాడు. కొన్ని శతాబ్దాల కిందట శంకరాచార్యులవారు దీన్ని పునర్వ్యవస్థీకరించి [మఠామ్నాయ మహానుశాసనం] ఇప్పుడున్న రీతిలోకి మార్చారు. ఆనాటినించి ఋషితుల్యులైన మఠాథిపతుల అవిచ్ఛిన్న పరంపర (వారిలో ప్రతి ఒక్కరికీ పరంపరాగతంగా ‘జగద్గురు శంకరాచార్య’ అనే బిరుదు ఉంటుంది)[6] దీనికి ఆధిపత్యం వహిస్తూ వస్తోంది. ఈ సన్యాస మఠామ్నా యంలో చాలామంది ― బహుశా పదిలక్షల మంది - స్వాములు ఉన్నారు; అందులో ప్రవేశించడానికి వారు పాటించవలసిన నియమం, సన్యాసులైన వారి దగ్గరే దీక్ష తీసుకోడం. ఈ ప్రకారంగా, సన్యాస మఠామ్నాయంలోని స్వాములందరూ, గురుసార్వభౌములైన ఆది (“మొట్టమొదటి”) శంకరాచార్యులవారి నుంచే తమ ఆధ్యాత్మిక పరంపర మొదలైనట్టు భావిస్తారు. వీరు పేదరికాన్ని (వస్తు సంపదపట్ల నిర్మమత్వం), బ్రహ్మచర్యాన్నీ, మఠాధిపతిపట్ల విధేయతనూ పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. కేథలిక్ క్రైస్తవుల సన్యాసాశ్రమ విధులు కూడా చాలా విధాల, అంతకన్న ప్రాచీనమైన మఠామ్నాయ విధుల్ని పోలి ఉంటాయి. ప్రతి స్వామీ తన కొత్త పేరుకు చివర, మఠామ్నాయంలోని పది ఉపవిభాగాల్లోనూ ఒకదానితో తనకున్న ఔపచారిక సంబంధాన్ని సూచించే పదం ఒకటి చేర్చుకుంటాడు. ఈ ‘దశనామి’ విభాగాల్లో ఒకటి ‘గిరి’ (కొండ) శాఖ; శ్రీయుక్తేశ్వర్‌గారూ వారివల్ల నేనూ, ఈ శాఖకు చెందినవాళ్ళం. తక్కిన శాఖల్లో కొన్ని: ‘సాగర’ (సముద్రం), ‘భారతి’ (భూమి), ‘పురి’ (ప్రదేశం), ‘సరస్వతి’ ( ప్రకృతి జ్ఞానం), ‘అరణ్య’ (అడవి), ‘తీర్థ’ (పుణ్యస్థలం) శాఖలు.
సాధారణంగా స్వాముల సన్యాసాశ్రమం చివర ఉండే ‘ఆనంద’ శబ్దం, ఒకానొక నిర్దిష్ట మార్గంలో, స్థితిలో, లేదా దివ్యవిశిష్టత ద్వారా మోక్షం సాధించాలన్న ఆశయాన్ని సూచిస్తుంది; ప్రేమ, జ్ఞానం, వివేకం, భక్తి, సేవ, యోగం అన్నవాటిలో ఏదైనా అందుకు ఉపకరించవచ్చు.
మానవజాతి కంతకీ నిస్స్వార్థంగా సేవ చెయ్యాలనీ వ్యక్తిగత సంబంధాల్నీ ఆకాంక్షల్నీ విడిచిపెట్టాలనీ ఏర్పరచుకొన్న ఆదర్శంవల్ల స్వాముల్లో చాలామంది, భారతదేశంలోకాని అప్పుడప్పుడు విదేశాల్లోకాని, మానవసేవలోనూ విద్యాసంబంధమైన కార్యకలాపాల్లోనూ చురుకుగా పాల్గొంటూ ఉంటారు. కుల, మత, వర్గ, వర్ణ, లింగ, జాతి విద్వేష దురభిమానాలన్నిటినీ విడిచిపెట్టి స్వామి, మానవ సౌభ్రాత్ర నియమాల్ని పాటిస్తాడు. కేవల పరబ్రహ్మైక్యమే అతని లక్ష్యం. “నేనే ఆయన” (సో౽హం) అన్న భావనతో జాగృత, సుప్తచైతన్యాన్ని మథిస్తూ సంతుష్ట మనస్కుడయి ప్రపంచంలో విహరిస్తాడు కాని, ప్రపంచానికి చెందడు. అప్పుడే అతనికి ‘స్వామి’ - ‘స్వ’ అంటే ఆత్మ; దాంతో ఐక్యం కావడానికి యత్నించేవాడు స్వామి - అన్న బిరుదు సార్థక మవుతుంది.
శ్రీయుక్తేశ్వర్‌గారు సన్యాస మఠామ్నాయంలో సంబంధమున్న కారణంగా, స్వామి అయినవాడల్లా యోగి కానక్కరలేదు. దైవసాక్షాత్కారం కోసం శాస్త్రీయమైన ఒక పద్ధతిని సాధన చేసేవారు ఎవరయినా యోగే. ఆయన పెళ్ళయినవాడు కావచ్చు, పెళ్ళి కానివాడు కావచ్చు; లౌకిక బాధ్యతలు గలవాడు కావచ్చు, ఔపచారికమయిన మతసంబంధాలు గలవాడు కావచ్చు.
ఒక స్వామి కేవలం కఠోర త్యాగంతో కూడిన శుష్కమైన జ్ఞాన మార్గాన్ని అనుసరించడం సంభవమే; కాని యోగి కచ్చితమైన నియమానుసార సాధనలో నిమగ్నుడై, దాని ద్వారా మనస్సునూ శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకొని క్రమంగా ఆత్మవిముక్తి సాధిస్తాడు. ఆవేళ హేతువుల వల్లనో విశ్వాసంవల్లనో దేన్నీ గుడ్డిగా నమ్మకుండా యోగి, సనాతన ఋషులు ప్రప్రథమంగా గుర్తించి సాకల్యంగా పరీక్షించి చెప్పిన ఆధ్యాత్మిక అభ్యాసాల్ని సాధనచేస్తాడు. భారతదేశంలో ప్రతియుగంలోనూ యోగవిద్య, నిజంగా విముక్తి సాధించిన, క్రీస్తువంటి నిజమయిన యోగీశ్వరుల్ని తయారుచేసింది.
ప్రతి శాస్త్రం మాదిరిగానే యోగవిద్య, ప్రతి దేశం ప్రజలూ, ప్రతి కాలం ప్రజలూ సాధన చేయ్యదగ్గది. యోగవిద్య పాశ్చాత్యులకు “ప్రమాదకరమైనది” లేదా “నప్పనిది” అంటూ అజ్ఞానులైన రచయితలు కొందరు ప్రతిపాదించిన సిద్ధాంతం పూర్తిగా అసత్యమేకాక, చిత్తశుద్ధి గల విద్యార్థు లనేకమంది యోగవిద్యవల్ల అనేక లాభాలు పొందడానికి వీలు లేకుండా ఘోరంగా నిరోధించినది.
యోగవిద్య, ఆలోచనల సహజ సంక్షోభాన్ని అదుపులోపెట్టే ఒకానొక పద్ధతి; లేకపోతే ఆ సంక్షోభం సత్యమైన తను ఆత్మస్వరూపాన్ని దర్శించనివ్వకుండా, మానవులందరినీ అన్ని దేశాలవాళ్ళనీ నిష్పక్షపాతంగా నిరోధిస్తుంది. రోగనివారకమైన సూర్యకాంతి మాదిరిగా, యోగవిద్య, తూర్పుదేశాలవాళ్ళకీ పడమటిదేశాలవాళ్ళకీ కూడా సమానంగా లాభం కలిగిస్తుంది. చాలామంది ఆలోచనలు నిర్విరామమైనవీ నిలకడ లేనివీ; కనక, మనస్సును అదుపులోపెట్టే యోగశాస్త్రం ఆవశ్యకత సుస్పష్టమవుతోంది.
సనాతన ఋషిపుంగవుడు పతంజలి,[7] యోగశాస్త్రాన్ని నిర్వచిస్తూ “ఒకటి విడిచి ఒకటి చొప్పున చైతన్యంలో లేచే తరంగాల్ని శమింప జేయడం”అన్నాడు.[8] ‘యోగసూత్రాలు’ అనే పేరుతో ఆయన సంగ్రహంగా రాసిన మహాగ్రంథం హిందూషడ్దర్శనాల్లో ఒకటి. పాశ్చాత్య తత్త్వశాస్త్రాలకు భిన్నంగా, హిందూ షడ్దర్శనాల్లో, కేవలం సిద్ధాంతపరమైన బోధలే కాకుండా ఆచరణ సాధ్యమైనవి కూడా పొందుపరిచి ఉన్నాయి. హిందూ దర్శనాలు, ఊహకు అందే సత్త్వమీమాంసాపరమైన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు అన్వేషించిన మీదట, శాశ్వత బాధానివృత్తినీ అక్షయ ఆనందాన్ని కలిగించడానికి తోడ్పడే నిర్దిష్టమైన ఆరు శాస్త్రాల్ని రూపొందించాయి.
ఆరు దర్శన శాస్త్రాల్లోకీ[9] యోగసూత్రాల్లో, ప్రత్యక్ష సత్యదర్శన సాధనకు ఉపకరించే అత్యంత సమర్థమైన పద్ధతులున్నాయని, తరవాతి కాలపు ‘ఉపనిషత్తులు’ ఉద్ఘోషించాయి. ఆచరణ సాధ్యమైన యోగ ప్రక్రియల ద్వారా మానవుడు, ఊహాపోహాల ఊసరక్షేత్రాల్ని శాశ్వతంగా విడిచిపెట్టి సత్యసారాన్ని అనుభవంలో ప్రత్యక్షీకరించుకుంటాడు.
పతంజలి యోగశాస్త్రాన్ని ‘అష్టాంగయోగ’ మంటారు. అందులో మొదటి మెట్లు: (1) యమం : నైతికవర్తన, (2) నియమం : మత ధర్మానుష్ఠానం, ఇతరుల్ని బాధ పెట్టకపోవడం (అహింస), ఎప్పుడూ సత్యాన్ని పాటించడం (సత్యం), దొంగతనం చెయ్యకపోవడం (అస్తేయం), ఇంద్రియాల్ని నిగ్రహించుకోడం (బ్రహ్మచర్యం), దేనికీ ఆశపడకపోవడం (అపరిగ్రహం) అన్నవాటితో ‘యమం’ నెరవేరుతుంది. శారీరక మానసిక పరిశుద్ధత (శౌచం), తృప్తి (సంతోషం), స్వయం శిక్షణ (తపం), పవిత్ర గ్రంథాల్ని అధ్యయనం చెయ్యడం (స్వాధ్యాయం), దేవుడి మీద భక్తి (ఈశ్వర ప్రణిధానం) ‘నియమం’ కిందికి వస్తాయి.
తరవాతి మెట్లు ఏవంటే: (3) ఆసనం (సరయిన భంగిమ): వెన్నెముకను నిటారుగా నిలిపి శరీరాన్ని నిలకడగా, ధ్యానానికి అనువైన సుఖాసనంలో ఉంచాలి; (4) ప్రాణాయామం (సూక్ష్మమైన ప్రాణ ప్రవాహాలను అదుపులో ఉంచుకోడం); (5) ప్రత్యాహారం (జ్ఞానేంద్రియాల్ని బయటి వస్తువుల మీంచి వెనక్కి మళ్ళించుకోడం).
చివరి మెట్లు అసలు యోగం కిందికివచ్చే అంగాలు: (6) ధారణ (ఏకాగ్రత), మనస్సును ఒకే ఆలోచనమీద నిలిపి ఉంచడం; (7) ధ్యానం (దైవచింతన), (8) సమాధి (అధిచేతనానుభవం). ఈ అష్టాంగ యోగ మార్గం,[10] అంతిమ లక్ష్యమైన కైవల్యానికి చేరుస్తుంది; అందులో యోగి, బుద్ధిగ్రాహ్యతకు అతీతంగా ఉండే సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకుంటాడు.
‘‘ఎవరు గొప్ప? స్వామా, యోగా?” అని ఎవరయినా అడగవచ్చు. దేవుడితో ఐక్యాన్ని సాధిస్తే, వివిధ మార్గవిభేదాలు వెంటనే అదృశ్యమవుతాయి. అయితే ‘భగవద్గీత’ మాత్రం, యోగంలోని పద్ధతులు సర్వాంగీణమైనవని చెబుతుంది. వీటి ప్రక్రియలు, సన్యాసజీవితం వేపు మొగ్గుచూపే ఏ కొద్దిమంది మాదిరిగానో కేవలం కొన్ని తరహాల మనుషుల కోసం, కొన్ని మనస్తత్వాల మనుషులకోసం ఉద్దేశించినవి కావు; సాధకుడు ఏదో ఒక విశిష్ట సంప్రదాయానికి బద్ధుడై ఉండవలసిన ఆవశ్యకత యోగంలో లేదు. యోగశాస్త్రం విశ్వజనీనమైన ఆవశ్యకతను నెరవేరుస్తుంది కాబట్టి దానికి సహజమైన విశ్వజనీన ఆకర్షణ ఉంది. నిజమైన యోగి ప్రపంచంలో విధివిధేయుడయి ఉండిపోవచ్చు; అక్కడ అతను నీటిమీద వెన్నముద్ద లాంటివాడు; అంతేకాని, క్రమశిక్షణలేని మానవ సముదాయం మాదిరిగా, గిలకొట్టకుండా ఉంచిన, ఇట్టే నీళ్ళు కలపడానికి వీలయిన పాలవంటివాడు కాదు. మానవుడు, అహంకార జన్యమైన వాంఛల పట్ల మానసికమైన అనాసక్తిని నిలుపుకొంటూ, దైవనిర్ణీతమైన ఉపకరణంగా సౌముఖ్యంతో, జీవితంలో తన పాత్రను తాను నిర్వహిస్తూ ఉన్నట్లయితే, లౌకిక బాధ్యతలు నెరవేర్చడమన్నది మనిషిని దేవుణ్ణించి దూరం చెయ్యనక్కరలేదు. అయితే అందుకు మనిషి మానసికంగా, అహంకార జనితమైన కోరికల్లో చిక్కుకొని ఉండకుండా, తనను దేవుడి ఉపకరణంగా మనసారా భావించుకొంటూ జీవితంలో తన పాత్ర నిర్వహించాలి.
ఈనాడు అమెరికన్, యూరోపియన్, లేదా హైందవేతర దేశాల్లో జీవిస్తున్న మహాపురుషులు ఎందరో ఉన్నారు; వీరు ‘యోగి’, ‘స్వామి’ అన్న మాటలు సైతం ఎన్నడూ విని ఉండకపోయినప్పటికీ, ఆ పదాలకు నిదర్శనంగా నిలిచే ఆదర్శప్రాయులు. మానవజాతికి తాము చేసిన నిస్స్వార్థ సేవవల్లనయితే నేమి, కామవాసనల్నీ ఆలోచనల్నీ అదుపులో ఉంచుకోడంవల్లనయితే నేమి, ఏకోన్ముఖమైన దైవప్రేమవల్ల నయితే నేమి, మహత్తరమైన ఏకాగ్రతాసాధనశక్తులవల్లనయితేనేమి, వీరంతా ఒక విధంగా యోగులే; యోగలక్ష్యాన్ని - ఆత్మనిగ్రహాన్ని నిలుపుకొన్నవారు. వీరికి కనక, మనస్సునూ జీవితాన్నీ ఇప్పటికన్న ఉద్దిష్టమార్గంలో నడిపించగల యోగమనే నిర్దిష్ట శాస్త్రాన్ని బోధించినట్లయితే ఇంకా ఉన్నత స్థితుల్ని అందుకోగలుగుతారు.
పాశ్చాత్య రచయితలు కొందరు, యోగశాస్త్రాన్ని పైపైని తడిమి తప్పుగా అర్థం చేసుకున్నారు. కాని అటువంటి విమర్శకులెన్నడూ దాన్ని సాధన చేసినవాళ్ళు కారు. యోగశాస్త్రానికి వివేకవంతమయిన నివాళులర్పించినవాళ్ళలో, స్విట్జర్లాండ్ దేశపు ప్రఖ్యాత మనస్తత్త్వవేత్త డా॥ సి. జి. యూంగ్ చేసిన ప్రశంసలు చెప్పుకోదగ్గవి. ఏ మతపద్ధతి అయినా ‘శాస్త్రీయ’ మైనదని చెప్పుకోగలిగినప్పుడు, పశ్చిమదేశాల్లో కూడా దానికి ప్రజల ఆదరం లభిస్తుందని కచ్చితంగా నమ్మవచ్చు. యోగం, ఈ ఆశ నెరవేరుస్తుంది,” అంటాడు డా॥ యూంగ్. “కొత్తమీద కలిగే మోజు, తెలిసితెలియనివాళ్ళ వ్యామోహం సంగతి అలా ఉంచి, యోగవిద్యకు చాలామంది అనుయాయు లేర్పడడానికి మంచి కారణం ఉంది. అదుపులో ఉంచుకోదగ్గ అనుభవాన్ని ఇస్తుందిది; ఈ విధంగా, శాస్త్రప్రమాణానికి కావలసిన “యథార్థాల అవసరాన్ని తీరుస్తుంది; ఇంతే కాకుండా, జీవితంలో ప్రతి దశకూ వర్తించే విధంగా దీనికి గల వ్యాప్తి గాఢతలవల్లా, ప్రాచీనతవల్లా, సిద్ధాంత పద్ధతులవల్లా, ఎన్నడూ కలలో కూడా అనుకోని వాటిని ఇది సాధ్యంచేసి నిరూపించవచ్చు.
“మతపరంగాగాని, తాత్త్వికంగాగాని చేసే ప్రతి సాధనకూ, మనోవైజ్ఞానిక క్రమశిక్షణ అనేదే అర్థం; అంటే అది మానసికారోగ్యశాస్త్ర పద్ధతి అన్నమాట. యోగం[11]లో చెప్పే బహువిధాలైన కేవల శరీర వ్యాయామ పద్ధతులకు కూడా శరీరారోగ్యశాస్త్రమనే అర్థం; మామూలు కసరత్తుకన్న శ్వాస ప్రశ్వాస అభ్యాసాలకన్న గొప్పదిది; ఇది కేవలం యాంత్రికం, శాస్త్రీయం మాత్రమే కాకుండా తాత్త్వికం కూడా కావడమే దానికి కారణం. శరీర, భాగాల శిక్షణలో ఇది, వాటిని సంపూర్ణాత్మతో అనుసంధానం చేస్తుందన్నది సుస్పష్టమే; ఉదాహరణకు, ప్రాణాయామ సాధనలో, ప్రాణమన్నది ఊపిరే కాకుండా బ్రహ్మాండంలోని విశ్వసంచాలకశక్తి కూడా.
“యోగానికి ఆధారభూతమైన భావనల్ని గ్రహించుకోకుండా చేసే యోగసాధన వ్యర్థం. శారీరక, ఆధ్యాత్మిక భావనల్ని రెంటినీ ఇది, అసాధారణ రీతిలో, ఒకదాంతో ఒకటి సంపూర్ణంగా మిళితం చేస్తుంది.
“ఈ భావాల్నీ ప్రక్రియల్ని రూపొందించిన, అనేక వేల సంవత్సరాల అవిచ్ఛిన్న సంప్రదాయ ఫలంగా అవసరమైన ఆధ్యాత్మిక పునాదులు ఏర్పడ్డ తూర్పుదేశాల్లో, యోగశాస్త్రం, శరీరాన్నీ మనస్సునూ సమైక్యం చేసే సంపూర్ణ, సముచిత పద్ధతి అని, వాటి సమైక్యాన్ని ప్రశ్నించే తావు లేదని నేను నిస్సంకోచంగా విశ్వసించగలను. ఈ సమైక్యం, చైతన్యాన్ని అధిగమించే అతీంద్రియ సహజావబోధాల్ని సాధ్యంచేసే మానసికావస్థను కల్పిస్తుంది.”
భగవత్స్వరూపమైన ప్రకృతిని బాహ్యంగా జయించడం ఎంత అవసరమో ఆత్మసంయమమనే అంతర్విజ్ఞానం కూడా అంత అవసరమని గ్రహించే రోజు పడమటిదేశాలకు దగ్గరపడుతోంది. పదార్థమనేది వాస్తవానికి ఘనీభూతశక్తి అని శాస్త్రీయంగా ప్రస్తుతం నిర్వివాదమైన సత్యం వల్ల మానవుల మనస్సులు శాంతపడి, విశాలమయే రోజు అణుయుగంలో వస్తుంది. రాళ్ళూ లోహాలవంటి పదార్థాలలోని శక్తులకన్న మహత్తరమైన శక్తుల్ని మానవమనస్సు తనలోంచే విడుదల చెయ్యగలదు; చేసితీరాలి కూడా; లేకపోతే కొత్తగా బంధవిముక్తి పొందిన భౌతిక అణు (రాక్షస) శక్తి ప్రపంచంమీద విరుచుకుపడి పిచ్చిగా నాశనం చేస్తుంది. ఆటం బాంబులగురించి మానవజాతికి గల ఆందోళనవల్ల కలిగే పరోక్షలాభం, బహుశా, యోగశాస్త్రం[12]పట్ల ప్రయోజనాత్మకమైన ఆసక్తి కావచ్చు; ఇది నిజంగా, “బాంబు దెబ్బకు ధ్వంసంకాని గూడు.”
- ↑ కోరింథియన్లు 7 : 32-33 (బైబిలు).
- ↑ “దేవుడికి రెండోస్థానం ఇచ్చేవాడు. ఆయనకు ఏ స్థానమూ ఇవ్వని వాడే”– రస్కిన్.
- ↑ అంటే, “ఈ ఆత్మ పరబ్రహ్మ” అని అర్థం. ఈ పరబ్రహ్మ ఒకరు సృష్టించినది కాదు; పూర్తిగా నిర్విశేషమైనది. (‘నేతి, నేతి’: ఇదికాదు, ఇదికాదు). కాని వేదాంతంలో దీన్ని తరచుగా, ‘సత్ - చిత్ - ఆనందం’గా పేర్కొంటారు.
- ↑ “యోగానంద” అన్నది స్వాముల్లో బాగా వినిపించే పేరే.
- ↑ శంకరుల్ని తరచుగా శంకరాచార్యులవారని అంటారు; ఆచార్యులంటే ‘మత గురువులు’, శంకరుల కాలాన్ని గురించి పండితుల్లో వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ అద్వితీయ అద్వైతి క్రీ. పూ. ఆరో శతాబ్దిలో జీవించారని కొన్ని లిఖిత ఆధారాలు సూచిస్తాయి: ఆనందగిరి అనే ముని క్రీ. పూ. 44-12 అన్న తేదీలు ఇస్తున్నాడు; శంకరులు క్రీ. శ. ఎనిమిదో శతాబ్దంవారని పాశ్చాత్య చారిత్రకులు అంటారు. ఎన్నో యుగాల సంబంధం!
- ↑ పూరీలో ఉన్న సనాతనమైన గోవర్ధన మఠానికి అధిపతులు, కీ. శే. జగద్గురు శంకరాచార్యులవారు, పూజ్యపాదులు భారతీకృష్ణ తీర్థులు 1958 లో మూడు నెల్లపాటు అమెరికా సందర్శించారు. శంకరాచార్యులలో ఒకరు పాశ్చాత్య దేశాల్లో సంచారం చెయ్యడమన్నది ఇదే మొదలు. చారిత్రక ప్రాముఖ్యం వహించే ఆయన యాత్రను ప్రోత్సహించిన సంస్థలు పరమహంస యోగానందులు స్థాపించిన సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా. జగద్గురువులు అమెరికాలో ప్రముఖమైన విశ్వవిద్యాలయాల్లో ప్రసంగాలు చేశారు. ప్రఖ్యాత చారిత్రకుడు, డా॥ ఆర్నాల్డ్ టాయిన్బీతో ప్రపంచశాంతిని గురించి ఏర్పాటు చేసిన చర్చలో పాల్గొన్నారు.
1959 లో పూరీ శంకరాచార్యులు, యోగదా సత్సంగ స్వాములిద్దరికి సన్యాసదీక్ష ఇవ్వడంలో, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ గురువుల ప్రతినిధిగా వ్యవహరించమని కోరుతూ అధ్యక్షురాలు శ్రీ శ్రీ దయామాత పంపిన ఆహ్వానాన్ని అంగీకరించారు. పూరీలో యోగదా సత్సంగ ఆశ్రమంలో ఉన్న శ్రీయుక్తేశ్వర మందిరంలో ఈ దీక్ష నిర్వహించారు. (ప్రచురణకర్త గమనిక).
యోగి తన అనంత లక్ష్యాన్ని చేరినప్పుడు విభూతులు ప్రదర్శించవచ్చు, ప్రదర్శించకపోవచ్చు; అది అతని ఇచ్ఛానుసారం. అప్పుడతని చర్యలు, అలౌకిక ఘటనాపరమయినా కాకపోయినా, కర్మబంధం లేకుండానే జరుగుతాయి. వ్యక్తిపరమైన అహంకారమనే అయస్కాంతం ఇంకా ఉన్నచోటే, కర్మఅనే ఇనప రజనును ఆకర్షించడం జరుగుతుంది.