ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 22
అధ్యాయం : 22
రాతిబొమ్మ గుండె
“పతివ్రత అయిన హిందూ స్త్రీగా, నేను మా ఆయన్ని గురించి ఫిర్యాదు చేసుకోదలచలేదు. కాని భౌతికవాదపరమైన ఆయన అభిప్రాయాలు మార్చుకోగా చూడాలని తపిస్తున్నాను. నా ధ్యానంగదిలో ఉన్న సాధువుల పటాలు చూసి వెక్కిరించడం ఆయన కో సరదా. ఒరే తమ్ముడూ, నువ్వాయన విషయంలో సాయం చెయ్యగలవని నాకు గాఢమైన విశ్వాసం ఉంది. చేస్తావా మరి?”
మా పెద్దక్క రమ, బతిమాలుకుంటూ నావేపు చూసింది. కలకత్తాలో గిరీశ్ విద్యారత్న సందులో ఉన్న వాళ్ళింటికి వెళ్ళి నేను కాసేపు కూర్చున్నప్పుడు జరిగిందిది. ఆమె వెల్లడించిన కోరిక నా మనస్సు కరిగించింది: ఎంచేతంటే నా చిన్నతనంలో ఆమె నా మీద గాఢమైన ఆధ్యాత్మిక ప్రభావాన్ని ప్రసరింపజేసింది; అంతే కాకుండా, అమ్మ పోవడంతో మా కుటుంబంలో ఏర్పడ్డ వెలితి పూరించడానికి ఆమె ఎంతో ఆప్యాయంగా ప్రయత్నించింది.
“అక్కయ్యా, నేను చెయ్యగలిగిందల్లా చేస్తాను,” అంటూ నేను చిరునవ్వు నవ్వాను; మామూలుగా ఆమె ముఖంలో కనిపించే ప్రశాంతతకూ ఉల్లాసానికి భిన్నంగా ఇప్పుడు స్పష్టంగా అవుపిస్తున్న విషాదాన్ని తొలగించాలని నా ఆతురత.
దీనికొక దారి చూపించమని నేనూ రమా కాసేపు మౌనంగా ప్రార్థన చేశాం. అప్పటికి ఒక ఏడాదికిందట మా అక్క రమకి ‘క్రియా యోగ’ దీక్ష ఇమ్మని నన్ను అడిగింది; దాంట్లో ఆమె చెప్పుకోదగినంత ప్రగతి సాధించింది.
లోపలినుంచి ఒక ప్రేరణ నన్ను వశపరుచుకుంది. “రేపు నేను దక్షిణేశ్వరంలో కాళికాదేవి గుడికి వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో రా. మీ ఆయన్ని కూడా మనతో రావడానికి ఒప్పించు. ఆ పవిత్ర క్షేత్రంలోని స్పందనల్లో జగన్మాత ఆయన హృదయాన్ని స్పృశిస్తుందని నా కనిపిస్తోంది. కాని ఆయన్ని మనం రమ్మనడానికి కారణం మట్టుకు బయటపెట్టకు,” అన్నాను.
అక్కయ్య ఆశపడుతూ ఒప్పుకుంది. మర్నాడు పొద్దున, రమా, వాళ్ళాయనా నాతో రావడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసి సంతోషించాను. మా గుర్రబ్బండి అప్పర్ సర్క్యులర్ రోడ్డునుంచి దక్షిణేశ్వర్‌కు సాగిపోతూ ఉండగా మా బావగారు సతీశ్ చంద్రబోసుగారు, ఆధ్యాత్మిక గురువుల యోగ్యతను అపహాస్యం చేస్తూ కులికిపోయారు. రమ లోప ల్లోపల ఏడుస్తోందని గమనించాను.
“అక్కయ్యా, హుషారుగా ఉండాలి నువ్వు!” అంటూ ఆమె చెవిలో గొణిగాను. “తన వెక్కిరింతకు మనం ఉడుక్కుంటామన్న నమ్మకంతో తృప్తిపడే అవకాశం మీ ఆయనకి ఇయ్యకు.”
“ముకుందా, పనికిమాలిన బడాయికోరుల్ని ఎలా మెచ్చుకుంటావు నువ్వు?” అంటూ అడుగుతున్నాడు సతీశ్. “సాధువు కంటబడ్డమే నాకు వెంపరంగా ఉంటుంది. ఉంటే ఎముకలపోగు లాగయినా ఉండాడు, లేక పోతే ఏనుగ్గున్నలా బలిసిపోయయినా ఉంటాడు!”
నేను విరగబడి నవ్వాను– దీనికి సతీశ్ చిరాకుపడ్డారు. మొహం ముడుచుకుని గమ్మున కూర్చున్నాడు. మా బండి దక్షిణేశ్వర ఆలయం ఆవరణలోకి ప్రవేశించేసరికి ఆయన వెటకారంగా పళ్ళు ఇకిలించాడు.
“ఈ విహారయాత్ర, బహుశా నన్ను మార్చడానికి వేసిన పథకమనుకుంటాను.”
నేను దానికి జవాబు చెప్పకుండా పక్కకి తిరిగేసరికి, ఆయన నా చెయ్యి పట్టుకున్నాడు.
“ఇదుగో, కుర్ర సన్యాసిగారూ, దేవాలయం అధికారులతో మాట్లాడి మన మధ్యాహ్న భోజనాలకి తగ్గ ఏర్పాట్లు చెయ్యడంమాత్రం మరిచిపోకండి!” గుడి పూజారులతో ఎటువంటి సంభాషణా చేసే అవసరం తనకు లేకుండా చేసుకోవాలనుకున్నారు సతీశ్‌గారు.
“నే నిప్పుడు ధ్యానం చేసుకోబోతున్నాను. మీ భోజనంగురించి దిగులు పడకండి,” అని కరుకుగా జవాబిచ్చాను. “ఆ సంగతి అమ్మవారు చూసుకుంటుంది.”
“నా కోసం అమ్మవారు ఒక్క పని కూడా చేస్తుందన్న నమ్మకం నాకు లేదు, కాని నా భోజనానికి నిన్నే బాధ్యుణ్ణి చేస్తున్నాను.” సతీశ్ గారి మాటల్లో బెదిరింపు ఉంది.
కాళికాదేవి (ప్రకృతిమాత రూపంలో ఉన్న దేవుడు) విశాలమైన ఆలయానికి ముందు భాగంలోని ముఖమంటపంలోకి నే నొక్కణ్ణీ సాగాను. ఒక స్తంభం దగ్గిర నీడపట్టు చూసుకుని పద్మాసనం వేసుకుని కూర్చున్నాను. అప్పటికే సుమారు ఏడుగంటలయి ఉంటుంది కాని, మరి కాస్సేపట్లో బాగా పొద్దెక్కి ఎండ మాడ్చేస్తుంది.
నేను భక్తితత్పరుణ్ణయి సమాధి స్థితిలోకి వెళ్తూ ఉన్న కొద్దీ బాహ్య స్పృహ తగ్గుతూ వచ్చింది. నా మనస్సు కాళికాదేవి మీద ఏకాగ్రంగా నిలిచింది. దక్షిణేశ్వర ఆలయంలో ఉన్న ఆ అమ్మవారి విగ్రహం, రామకృష్ణ పరమహంస అనే మహాగురువుల ఆరాధనమూర్తిగా ప్రత్యేకత సంతరించుకొన్నది. సంతప్త హృదయంతో ఆయన చేసే విన్నపాలకు సమాధానంగా ఆ శిలావిగ్రహం, తరచు సజీవరూపం దాల్చి ఆయనతో మాట్లాడుతూ ఉండేది.
“శిలారూపిణివైన మౌన మాతృమూర్తి, నీ ప్రియభక్తులు రామకృష్ణుల విన్నపాన్ని మన్నించి అప్పుడు జీవన్మూర్తి వయావు. నీ కోసం పరితపించే ఈ కొడుకు ఆక్రందనల్ని ఎందుకు ఆలించవమ్మా?” అంటూ ప్రార్థించాను.
దివ్య ప్రశాంతితోబాటు నాలో ఉత్సాహం అపరిమితంగా పెరిగింది. అయినా ఐదుగంటలు గడిచిపోయాయి; నేను అంతర్‌దృష్టితో దర్శిస్తున్న కాళీమాత నాకు సమాధానమివ్వలేదు, నేను ఒక్కరవ్వ నిరాశపడ్డాను. ఒక్కొక్కప్పుడు, ప్రార్థనలు ఫలించడంలో ఆలస్యం చెయ్యడం దేవుడు పెట్టే పరీక్ష. కాని చివరికి, తదేక నిష్ఠగల భక్తుడు ఇష్టదేవతగా తనను ఏ రూపంలో కొలుస్తాడో ఆ రూపంలోనే దర్శన మిస్తాడాయన. భక్తి తత్పరుడైన క్రైస్తవుడు ఏసును చూస్తాడు; హిందువు కృష్ణుణ్ణో, కాళికా దేవినో చూస్తాడు; ఒకవేళ అతని ఆరాధన నిరాకారుడివేపు తిరిగితే విరాట్ జ్యోతిని దర్శిస్తాడు.
నేను అనిష్టంగానే కళ్ళు తెరిచి చూశాను; మధ్యాహ్న కాలనియమాన్ని అనుసరించి ఒక పూజారి ఆలయ ద్వారాలు మూసేస్తున్నాడు. ముఖమంటపంలో ఉన్న నా ఏకాంత స్థల నుంచి లేచి ముంగిట్లో అడుగు పెట్టాను. అక్కడ నేలమీద పరిచిఉన్న రాయి మిట్టమధ్యాహ్నం ఎండకు మలమల మాడుతోంది; నా అరికాళ్ళ మంటెత్తిపోతున్నాయి.
“జగన్మాతా,” అంటూ నేను మౌనంగా ఆక్షేపణ తెలిపాను. “నువ్వు ఇంతవరకు నాకు దర్శనమిచ్చావు కావు; ఇప్పుడు మూసిన తలుపుల వెనక దాక్కుని ఉన్నావు. ఈ రోజు నేను మా బావగారి తరఫున నీకు ప్రత్యేక ప్రార్థన చెయ్యాలని అనుకున్నాను.”
మనస్సులో నేను చేసిన విన్నపానికి వెంటనే స్వీకృతి లభించింది. మొదట, నా బాధను మటుమాయం చేస్తూ వెన్ను వెంబడి, పాదాలకింద ఆహ్లాదకరమైన చలవ అల ఒకటి పాకి వచ్చింది. ఆ తరవాత, ఆ ఆలయం పరిమాణం బ్రహ్మాండంగా పెరిగిపోయి నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. దాని విశాల ద్వారం మెల్లిగా తెరుచుకొని కాళికాదేవి శిలావిగ్రహాన్ని ఆవిష్కరించింది. క్రమంగా ఆ విగ్రహం సజీవరూపంగా మారింది; చిరునవ్వు చిందిస్తూ ఆ తల్లి పలకరింపుగా తల ఊపింది; చెప్పనలవికాని ఆనందంతో నన్ను పులకరింపజేసింది. కంటికి కనిపించని ఒక పిచికారీతో లాగేసినట్టుగా నా ఊపిరితిత్తుల్లోంచి శ్వాస బయటికి వచ్చేసింది; నా శరీరం జడప్రాయం కాకపోయినా అతినిశ్చలమయిపోయింది.
ఆ తరవాత నా చైతన్యం ఆనంద తన్మయత్వంతో విస్తార మయింది. నా ఎడమవేపు గంగానది మీద అనేక మైళ్ళదురం స్పష్టంగా చూడగలిగాను, అంతే కాకుండా గుడి వెలుపల దక్షిణేశ్వర క్షేత్రమంతా కళ్ళకు కట్టింది. భవనాలన్నిటి గోడలూ పారదర్శకంగా ప్రకాశించాయి; వాటిగుండా నేను, దూరభూముల్లో సంచరిస్తున్న జనాన్ని గమనించాను.
నేను ఊపిరి లేకుండా ఉన్నప్పటికీ, నా శరీరం చిత్రంగా ప్రశాంత స్థితిలో ఉండిపోయినప్పటికీ, నేను చేతులూ కాళ్ళూ స్వేచ్ఛగా కదపగలిగాను. కొన్ని నిమిషాలసేపు నేను కళ్ళు మూస్తూ తెరుస్తూ ప్రయోగం చేశాను: మూసినా తెరిచినా కూడా దక్షిణేశ్వర దృశ్యాన్ని యావత్తు స్పష్టంగా చూశాను.
ఎక్స్-రే లనే కిరణాల మాదిరిగా, ఆధ్యాత్మిక దృష్టి అన్ని రకాల పదార్థాల్లోకీ చొచ్చుకుపోతుంది; ప్రతి చోటా దివ్యనేత్రమే కేంద్రం; దాని కెక్కడా పరిధి ఉండదు. ఎండకు మాడుతున్న ఈ ముంగిట్లో నించుని ఉండగా నే నొక విషయం కొత్తగా గ్రహించాను; వాస్తవానికి స్వప్నమై, నీటి బుడగ మాదిరిగా నిరాధారమై ఉన్న భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోయి దేవుడి భ్రష్టసంతానంగా జీవించడం మానేసిన మానవుడు తన అనంత సామ్రాజ్యాన్ని మళ్ళీ పొందుతాడు. సంకుచిత మూర్తిమత్వంలో కుదించుకుపోయిన మానవుడికి పలాయన వాదమే శరణ్యమయినట్లయితే, సర్వవ్యాపకత్వంతో పోల్చదగ్గ పలాయనం మరొకటి ఉండే అవకాశం ఉందా?
దక్షిణేశ్వరంలో నాకు కలిగిన పవిత్రానుభవంలో అసాధారణంగా విస్తరిల్లిన వస్తువులల్లా ఆలయమూ అమ్మవారి విగ్రహమూ, తక్కిన వాటిలో ప్రతి ఒక్కటీ తెలుపూ నీలమూ ఇంద్ర ధనుస్సులోని రంగులూ గల స్నిగ్ధ కాంతి పరివేషంతో కూడి ఉన్నప్పటికీ వాటి మామూలు పరిమాణాల్లోనే కనిపించాయి. నా శరీరం గాలిలో తేలిపోవడానికి సిద్ధంగా వాయుపదార్థంతో ఏర్పడినట్టు అనిపించింది. నా భౌతిక పరిసరాల సంపూర్ణ స్పృహతోనే నా చుట్టూ చూసుకుంటూ, ఆనందమయమైన దివ్య దర్శనానికి వ్యాఘాతం కలిగించకుండా కొన్ని అడుగులు వేశాను.
గుడి గోడల వెనక పవిత్రమైన మారేడుచెట్టు ముండ్ల కొమ్మల కింద కూర్చుని ఉన్న మా బావగారిని చటుక్కున చూశాను. ఆయన ఆలోచనల ధోరణిని అప్రయత్నంగానే తెలుసుకోగలిగాను. ఆయన మనస్సులో, దక్షిణశ్వర పవిత్ర వాతావరణ ప్రభావంవల్ల కొంతమట్టుకు ఉదాత్తస్థితి నందుకున్నప్పటికీ నా గురించి నిర్ధాక్షిణ్యమైన ఆలోచనలే సాగుతున్నాయి. నేను సూటిగా, ఆ అమ్మవారి దివ్యమంగళ విగ్రహం వేపు తిరిగాను. “జగన్మాతా, మా అక్కయ్య భర్తలో ఆధ్యాత్మికంగా పరివర్తన తీసుకువస్తావా నువ్వు?” అని ప్రార్థించాను.
ఇంతవరకు మౌనంగానే ఉన్న ఆ సౌందర్య రూపిణి చివరికి నోరువిప్పి మాట్లాడింది. “నీ కోరిక నెరవేరుతుంది!”
సతీశ్ వేపు సంతోషంగా చూశాను నేను. ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి పని చేస్తోందని సహజ ప్రవృత్తివల్ల తెలిసి ఉన్నట్టుగా ఆయన, నేలమీద కూర్చున్న చోటునుంచి రోషంగా లేచాడు. ఆయన గుడివెనక నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు; తన పిడికిలి ఎత్తి చూపిస్తూ నన్ను సమీపిస్తున్నాడు.
సర్వగ్రాహకమైన దృశ్యం అదృశ్యమయింది. అమ్మవారి దివ్య మంగళమూర్తి అవుపించడం మానేసింది; ఆ ఆలయం పారదర్శకత పోగొట్టుకొని తిరిగి మామూలు పరిమాణాన్ని పొందింది. మళ్ళీ నా ఒళ్ళు, సూర్యుడి ప్రచండ కిరణాలకు మలమల మాడుతోంది. ముఖ మంటపం నీడలోకి ఒక్క గంతు వేశాను; సతీశ్ మండిపడుతూ నన్నక్కడికి వెంబడించాడు. నా గడియారం చూసుకున్నాను. ఒంటిగంటయింది; దివ్య దర్శనం గంటసేపు ఉందన్నమాట.
“ఓయి తెలివితక్కువ నాయనా, కాళ్ళు మెలివేసుకుని కళ్ళు తేల వేసుకుని గంటలగ్గంటలు కూర్చున్నావక్కడ. నిన్ను గమనిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాను. మన భోజన మెక్కడోయ్? ఇప్పుడు గుడి మూసేశారు; గుడి అధికారులికి నువ్వు మన సంగతి చెప్పకపోతివి; మన భోజనాల ఏర్పాటుకు టైము చాలా మించిపోయింది!”
అమ్మవారి సాక్షాత్కారంతో కలిగిన ఉత్కృష్టస్థితి నాలో ఇంకా ఉంది. “జగన్మాతే మన కడుపు నింపుతుంది!” అన్నాను. “ఇదుగో, ఇదే చెబుతున్నాను; ముందు ఏర్పాట్లేమీ లేకుండా, నీ జగన్మాత మనకిక్కడ భోజనం పెడుతుందేమో నేనూ చూస్తా!” అంటూ అరిచాడు సతీశ్.
ఆయన ఆ మాట లింకా అన్నాడోలేదో, గుడి పూజారి ఒకాయన ముంగిలికి అడ్డుబడి మా దగ్గరికి వచ్చాడు.
“బాబూ,” అంటూ నా కేసి చూసి అన్నాడు: “గంటల తరబడి మీరు ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ ముఖం ప్రశాంతంగా ప్రకాశిస్తూ ఉండడం గమనిస్తూ వచ్చాను. ఈ రోజు పొద్దున మీరు రావడం చూసి మీ అందరి భోజనానికి సమృద్ధిగా సరిపడే పదార్థాలు తీసి పక్కకి పెట్టాలన్న కోరిక కలిగింది నాకు. ముందుగా అడగనివాళ్ళకి అన్నం పెట్టడం మా ఆలయ నియమాలకి విరుద్ధం; అయినా మీ విషయంలో దానికి మినహాయింపు ఇచ్చాను.”
నే నాయనకి ధన్యవాదాలు చెప్పి సతీశ్ కళ్ళలోకి సూటిగా చూశాను. ఆయన లోపల్లోపల పశ్చాత్తాప పడుతూ కళ్ళుదించుకుని భావోద్రేకంతో సిగ్గుపడిపోయాడు. ఆ కాలంలో రాని మామిడిపళ్ళతో సహా, మాకు మృష్టాన్న భోజన పదార్థాలు వడ్డించినప్పుడు, మా బావగారి ఆకలి అతిస్వల్పమేనని గమనించాను. ఆలోచనా సముద్రంలో లోతుగా మునుగుతూ ఆయన తబ్బిబ్బు అయిపోయాడు.
కలకత్తాకి మా తిరుగు ప్రయాణంలో, సతీశ్ ముఖంలో బింకం సడలిపోయింది; అప్పుడప్పు డాయన నావేపు బుజ్జగింపు ధోరణిలో చూస్తూ వచ్చాడు. అయితే ఆ గుడి పూజారి, సతీశ్ చేసిన సవాలుకు జవాబు ఇవ్వడానికే అన్నట్లుగా, మమ్మల్ని భోజనానికి రమ్మన్న క్షణం నుంచి మళ్ళీ ఒక్క మాట కూడా మాట్లాడలేదాయన. ఆ మర్నాడు మా అక్కయ్యగారింటికి వెళ్ళి కలుసుకున్నాను. నన్ను ఆప్యాయంగా పలకరించింది.
“ఒరే తమ్ముడూ! ఎంత అద్భుతం జరిగిందిరా! నిన్న సాయంత్రం మా ఆయన నా ఎదుట పైకి ఏడ్చేశారు.
“ ‘ప్రియదేవీ,’ నన్ను మార్చడానికి మీ తమ్ముడు చేసిన పథకం నాలో పరివర్తన తీసుకువచ్చినందుకు ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి మాటలు చాలవు. నేను నీకు చేసిన అన్యాయాలన్నిటినీ ఇప్పుడు చక్కదిద్దుకుంటాను. ఈ రోజు రాత్రినించి మన పెద్ద పడగ్గదిని పూజా మందిరంగానే వాడుకుందాం; నువ్వు ధ్యానంచేసుకునే చిన్నగది మనకు పడకటిల్లవుతుంది. మీ తమ్ముణ్ణి వెక్కిరించినందుకు నేను నిజంగా విచారిస్తున్నాను. ఇంతకాలమూ నేను అవమానకరంగా ప్రవర్తిస్తూ వచ్చినందుకు నేను ఆధ్యాత్మికమార్గంలో అభివృద్ధి సాధించేదాకా ముకుందుడితో మాట్లాడ్డం మానేసి నన్ను నేను శిక్షించుకుంటాను. ఇప్పటినించి నేను జగన్మాతను గాఢంగా ధ్యానిస్తూ అన్వేషిస్తాను; ఎప్పుడో ఒకనాడు నేను తప్పకుండా ఆవిడ సాక్షాత్కారం పొందాలి!”
చాలా ఏళ్ళ తరవాత (1936 లో) ఢిల్లీలో, మా బావగారిని చూడడానికి వెళ్ళాను. ఆత్మసాక్షాత్కార సాధనలో గొప్ప అభివృద్ధిసాధించడం, జగన్మాత ఆయనకి దర్శనం ప్రసాదించడం తెలిసి నేను అపరిమితంగా ఆనందించాను. సతీశ్ తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఉన్నా, పగలంతా ఆఫీసు పనితోనే సరిపోతున్నా, ప్రతిరాత్రీ ఎక్కువభాగం గాఢమైన ధ్యానంలోనే రహస్యంగా గడుపుతూ ఉండడం గమనించాను, నేను ఆయన దగ్గర బసచేసినప్పుడు.
మా బావగారి ఆయుర్దాయం ఎక్కువగా ఉండదన్న ఆలోచన ఒకటి వచ్చింది నాకు. నా మనస్సులో ఉన్నది గ్రహించింది రమ. “తమ్ముడూ, నేను బాగున్నాను, మా ఆయన జబ్బులో ఉన్నారు. అయినప్పటికీ, హిందూ పతివ్రతగా, మొట్టమొదట పోయేదాన్ని నేనేనని నీకు తెలియాలి.[1] నేను పోవడానికి ఇక అటేకాలం పట్టదు.”
ఆమె అశుభం పలికినందుకు నేను అదిరిపడినప్పటికీ ఆ మాటల్లో చేదునిజం ఉందని గ్రహించాను. తాను ఈ జోస్యం చెప్పిన సుమారు పద్దెనిమిది నెల్లకి ఆమె కన్ను మూసినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. మా చివరి తమ్ముడు విష్ణు, ఆ తరవాత నాకు వివరాలు తెలియజేశాడు.
“రమ చనిపోయేనాటికి ఆమే, సతీశ్ బావగారూ కలకత్తాలో ఉన్నారు. ఆ రోజు పొద్దున తను పెళ్ళికూతురి ముస్తాబు చేసుకుంది.”
“ ‘ఈ ప్రత్యేకమైన ముస్తాబు దేనికి?’ అని సతీశ్‌గారు అడిగారు.
“ ‘ఈ భూమిమీద మీకు సేవ చెయ్యడానికి ఇదే నాకు చివరి రోజు,’ అని రమ సమాధానం, తరవాత కాస్సేపటికి తనకి గుండెపోటు వచ్చింది. వైద్య సహాయం కోసం కొడుకు బయటికి పరిగెడుతుంటే తను ఇలా చెప్పింది:
“ ‘బాబూ, నన్ను వదిలి వెళ్ళకు. దానివల్ల లాభం లేదు. డాక్టరు రాకముందే నేను వెళ్ళిపోతాను.’ తరవాత పదినిమిషాలకి రమ, భక్తి పూర్వకంగా భర్త పాదాలు పట్టుకొని, బాధ లేకుండా, హాయిగా, పూర్తి స్పృహతో దేహాన్ని విడిచింది.
“భార్య గతించిన తరవాత సతీశ్‌లో ఇలా వైరాగ్యం వచ్చింది,” అంటూ ఇంకా చెప్పాడు విష్ణు. “ఒకనాడు ఆయనా నేనూ, చిరునవ్వు చిందిస్తున్న రమ ఫోటోగ్రాఫు కేసి చూస్తున్నాం.”
“ ‘ఎందు కా చిరునవ్వు?’ అంటూ చటుక్కున పైకి అనేశారు సతీశ్‌గారు, భార్య ఎదురుగానే ఉందన్నట్టు. ‘నా కన్న ముందుగా వెళ్ళిపోయే ఏర్పాటు చేసుకున్నందుకు నువ్వు తెలివైన దాన్ననుకుంటున్నావు. నువ్వు నాకు దూరంగా అట్టేకాలం ఉండలేవని నిరూపిస్తాను; త్వరలోనే నిన్ను కలుసుకుంటాను.”
“ఇది జరిగేనాటికి సతీశ్‌గారు జబ్బునుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ, ఆయన ఆరోగ్యం అద్భుతంగానే ఉన్నప్పటికీ, ఈ ఫొటోముందు ఆ విచిత్ర వ్యాఖ్య చేసిన కొన్నాళ్ళకే ఆయన చనిపోయారు; కారణమేదీ పైకి కనిపించలేదు.”
ఈ విధంగా మా అక్కయ్య రమా, ఆవిడ భర్తా- సాధారణ ప్రాపంచిక వ్యక్తిగా ఉండి, దక్షిణేశ్వరంలో మౌన సాధువుగా మారిపోయిన సతీశుగారూ - ఇద్దరూ ముందుగా చెప్పి గతించారు.
- ↑ భర్తకు తాను చిత్తశుద్ధితో సేవ చేసినందుకు నిదర్శనంగా భర్తకన్న భార్యే ముందు పోవడం, లేదా “సేవావిధులు నిర్వహిస్తూ కన్ను ముయ్యడం” ఆధ్యాత్మిక ప్రగతికి చిహ్నమని విశ్వసిస్తుంది హిందూ ధర్మపత్ని.