ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 21

వికీసోర్స్ నుండి

అధ్యాయం : 21

మేము కాశ్మీరు వెళ్ళాం

“ఇప్పడు నీకు ప్రయాణం చెయ్యడానికి తగ్గంత బలం వచ్చింది. నేను నీతో కాశ్మీరు వస్తాను,” అన్నాడు శ్రీయుక్తేశ్వర్‌గారు; ఏషియాటిక్ కలరా అద్భుతంగా నయమై నేను కోలుకున్న రెండు రోజుల తరవాత.

ఆ రోజు సాయంత్రం మా జట్టు ఆరుగురం కలిసి ఉత్తరదేశానికి వెళ్ళే బండి ఎక్కాం. మేము తీరుబాటుగా ఆగిన మొట్టమొదటి ఊరు సిమ్లా; హిమాలయ పర్వతాలనే సింహాసనం మీద కుదురుగా కూర్చున్న నగరరాణి ఇది. అద్భుతమైన దృశ్యాల్ని చూసి ఆనందిస్తూ ఏటవాలు వీధుల్లో సంచరించాం.

“ఇంగ్లీషు స్ట్రాబెరీలున్నాయి,” అని అరుస్తూ ఒక ముసలామె, అందమైన ఆరుబయటి అంగడి వీథిలో కూర్చుని ఉంది.

చిత్రమైన ఆ చిన్నచిన్న ఎర్రటి పళ్ళమీద గురుదేవులకు ఆసక్తి కలిగింది. ఆయన ఒక బుట్టెడు పళ్ళు కొని, పక్కనున్న నాకూ కనాయికీ పెట్టారు. ఒక పండు రుచి చూసి వెంటనే తుపుక్కున నేలమీద ఉమ్మేశాను.

“పులుపు రొడ్డండి సార్! స్ట్రాబెరీలు నాకు ఒక్కనాటికి నచ్చవు?”

మా గురుదేవులు నవ్వారు. “ఆఁహాఁ, నీకు నచ్చుతాయవి - అమెరికాలో. అక్కడొకరి ఇంటికి నువ్వు భోజనానికి వెళ్ళినప్పుడు, నీకు ఆతిథ్యమిచ్చే ఆవిడ, వాటిలో పంచదారా మీగడావేసి ఇస్తుంది. ఆ పళ్ళని ఆవిడ ఫోర్కుతో బాగా ఎనిపిన తరవాత నువ్వు రుచి చూసి, ‘ఎంత రుచిగల స్ట్రాబెరీలు!’ అంటావు. అప్పుడు నీకు గుర్తు వస్తుంది, సిమ్లాలో ఈ రోజు.

(శ్రీయుక్తేశ్వర్‌గారు చెప్పిన జోస్యం నా మనస్సులోంచి తొలగిపోయింది. కాని మూడేళ్ళ తరవాత, నేను అమెరికాలో అడుగుపెట్టిన కొత్తల్లో మళ్ళీ మనస్సులో మెదిలింది. మెసాచుసెట్స్‌లోని వెస్ట్ సోమర్విల్ లో మిసెస్ ఆలిస్ టి. హేసీ అనే ఆవిడ ఇంట్లో భోజనానికి పిలిస్తే వెళ్ళాను. భోజనాల బల్లమీద స్ట్రాబెరీల డిసర్ట్ పెట్టినప్పుడు, మా ఆతిథేయిని ఒక ఫోర్కు తీసుకొని, బెరీపండ్లకు మీగడా పంచదారా కలిపి, వాటిని బాగా ఎనిపింది. “ఈ పండు కాస్త పుల్లగా ఉంటుంది; దీన్నిలా చేస్తే మీకు నచ్చుతుందనుకుంటాను,” అన్నదామె. నేను నోరుపట్టినంత తీసి పెట్టుకున్నాను. “ఎంత రుచిగల స్ట్రాబెరీలు!” అంటూ ఆశ్చర్యం ప్రకటించాను. వెంటనే, సిమ్లాలో మా గురుదేవులు చెప్పిన జోస్యం, ఆగాఢమైన నా స్మృతిగహ్వరంలోంచి బయల్పడింది. దైవానుసంధాన శీలకమైన ఆయన మనస్సు చాలాకాలం కిందటే, భవిష్యదాకాశంలో సంచరించే కర్మ సంబంధమైన కార్యక్రమాన్ని కనిపెట్టినందుకు నేను అప్రతిభుణ్ణయాను).

త్వరలోనే మా బృందం సిమ్లా విడిచి, రావల్పిండి బండి ఎక్కింది. అక్కడ మేము జోడుగుర్రాలు పూన్చిన గూడుబండి ఒకటి అద్దెకు తీసుకుని శ్రీనగర్‌కు ప్రయాణమయాం; శ్రీనగర్ కాశ్మీరుకు రాజధాని. మేము ఉత్తరదిశకు ప్రయాణం సాగించిన రెండోనాడు హిమాలయాల నిజమైన విస్తారం మా కంటబడింది. మా బండికున్న ఇనప చక్రాలు, మలమల మాడుతున్న రాతిగొట్టు బాటల్లో కీచుమని రొదచేస్తూ సాగుతూ ఉండగా, ఆ పర్వతశోభలో మారుతున్న తరుశ్రేణుల రామణీయకతకు మేమంతా ముగ్ధులమయిపోయాం. “గురుదేవా, మీ పావన సాహచర్యంలో ఈ మనోహరదృశ్యాలు చూస్తూ ఎంతో ఆనందిస్తున్నానండి,” అంటూ గురుదేవులతో అన్నాడు ఆడీ. ఆ ప్రయాణానికి నేను ఆతిథేయిగా వ్యవహరిస్తున్నందువల్ల, ఆడీ మెప్పుకి నాలో రవ్వంత ఉల్లాసం పెల్లుబికింది. శ్రీయుక్తేశ్వర్‌గారు నా ఆలోచన పసిగట్టారు; నావేపు తిరిగి గుసగుసలాడారు:

“నిన్ను నువ్వు ఉబ్బేసుకోకు; ఆడీ, మనని విడిచిపెట్టి పోయి ఒక సిగరెట్టు కాల్చుకురావడానికి దొరికే అవకాశాన్ని తలుచుకుని ముగ్ధుడవుతున్నంతగా ఈ ప్రకృతి దృశ్యానికి ముగ్ధుడవడం లేదు,” అన్నారాయన.

నేను అదిరిపడ్డాను. గొంతు తగ్గించి గురుదేవులతో ఇలా అన్నాను. “గురుదేవా, మీరు దయచేసి ఇలాటి వెగటు మాటలతో మా పొత్తు చెడ గొట్టకండి. ఆడీ ఒక దమ్ముకోసం ఆరాటపడుతున్నాడంటే నేను ఒక్కనాటికి నమ్మను.” మామూలుగా, ఎవరూ అదుపుచెయ్యడానికి లొంగని మా గురుదేవుల వేపు అనుమానంగా చూశాను నేను.

“సరేలే, నేను ఆడీతో ఏమీ అనను,” అంటూ గురుదేవులు ముసి ముసిగా నవ్వారు. “కాని నువ్వే కాసేపట్లో చూస్తావు; మన బండి ఆగినప్పుడు అతను ఆ అవకాశం జారనివ్వడు.”

మా బండి ఒక చిన్న కారవాన్‌సెరాయి దగ్గిరికి చేరుకుంది. మా గుర్రాల్ని నీళ్ళు పట్టడానికి తోలుకువెళ్తూ ఉండగా, ఆడీ అడిగాడు, “గురుదేవా, నేను బండివాడితో బాటు కాసేపు అలా స్వారి చేసివస్తే మీకు అభ్యంతరమాండి? నాకు కొంచెం బయటిగాలి పీల్చుకోవాలని ఉంది.”

శ్రీయుక్తేశ్వర్‌గారు అనుమతి ఇచ్చారు. కాని, “అతనికి కావలసింది స్వచ్ఛమైన గాలి కాదు, స్వచ్ఛమైన దమ్ము,” అన్నారాయన నాతో. బండి మళ్ళీ బయల్దేరి, దుమ్ము రోడ్లమీద రొదచేసుకుంటూ ముందుకు సాగింది. గురుదేవుని కళ్ళు మిలమిల మెరుస్తున్నాయి; ఆయన నాతో అన్నారు:

“బండి తలుపులోంచి మెడ సారించి స్వచ్ఛమైన గాలితో ఆడీ చేస్తున్న వేమిటో చూడు.”

ఆయన చెప్పినట్లు చేశాను. ఆడీ, రింగులు రింగులుగా సిగరెట్టు పొగ వదిలే కార్యక్రమంలో ఉండగా చూసి దిగ్ర్భాంతి చెందాను. క్షమార్పణ కోరుతున్నట్టుగా శ్రీయుక్తేశ్వర్‌గారి వేపు చూశాను.

“మీరే రైటండి; ఎప్పటిలాగే. ఆడీ ప్రకృతి దృశ్యంతో బాటు దమ్ముకొడుతూ ఆనందిస్తున్నాడు.” మా స్నేహితుడు దాన్ని బండివాడి దగ్గర తీసుకుని ఉంటాడు; ఆడీ కలకత్తానుంచి సిగరెట్లేమీ తీసుకురాలేదని నాకు ముందే తెలుసు.

నదులూ, లోయలూ, నిటారుగా నిలిచిన కొండ కొమ్ములూ, అసంఖ్యాకమైన పర్వతశ్రేణులూ గల దృశ్యాలు చూసి ఆనందిస్తూ గజిబిజి దారిగుండా ప్రయాణం సాగించాం. ప్రతి రాత్రీ మే మొక నాటు సత్రం దగ్గర ఆగి అన్నాలు వండుకునేవాళ్ళం. నేను భోంచేసినప్పుడల్లా నిమ్మరసం తీసుకోవాలని పట్టుబడుతూ శ్రీయుక్తేశ్వర్‌గారు, నా పథ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అప్పటికింకా నీరసంగానే ఉన్నాను. బరబరలాడే ఆ బండి కచ్చితంగా మా అసౌకర్యంకోసమే తయారై ఉన్నప్పటికీ, అప్పటికింకా నేను నీరసంగానే ఉన్నా- రోజూ రోజూకీ ఆరోగ్యం మెరుగవుతోంది.

మేము మధ్య కాశ్మీరుకు చేరువవుతూ ఉండగా, పద్మసరోవరాల దివ్యలోకం, నీటిమీద తేలే తోటలు, అందాల గుడ్డపందిళ్ళు వేసిన నావ ఇళ్ళు, అనేక వంతెనలుగల జీలంనది, పూలు పరిచినట్టున్న గడ్డి మైదానాలు, వీటన్నిటినీ చుట్టిఉన్న హిమాలయాలూ చూడబోతున్నామన్న ఆనందం మా హృదయాల్లో నిండింది.

మేము శ్రీనగర్‌కు వెళ్ళే దారికి ఇటూఅటూ ఉన్న పొడుగాటి చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. ఎత్తయిన కొండల నేపథ్యంలో ఉన్న రెండతస్తుల సత్రంలో మేము గదులు తీసుకున్నాం. అక్కడ నీటి కుళాయిల సౌకర్యం లేదు; దగ్గరలో ఉన్న నూతిలోంచి నీళ్ళు తోడుకునే వాళ్ళం. వేసవి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది: వెచ్చటి పగళ్ళూ చిరుచలి రాత్రులూ.

శ్రీనగర్‌లో శంకరాచార్య స్వామివారి ప్రాచీన ఆలయానికి యాత్ర చేశాం. ఆకాశంలో ఉవ్వెత్తుగా నిలిచిన ఆ గిరిశిఖరాశ్రమం మీదికి చూపు సారించి తదేకంగా చూస్తున్నప్పుడు నేను సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను. ఎక్కడో ఒక దూరదేశంలో కొండమీద నెలకొన్న ఒక భవనం తాలూకు దృశ్యం నాకు గోచరమయింది; శ్రీనగర్‌లో మహోన్నతంగా నెలకొన్న ఆ శంకరాచార్య ఆలయం రూపాంతరం చెందుతూ, అనేక సంవత్సరాల అనంతరం నేను అమెరికాలో స్థాపించిన సెల్ఫ్ రియలై జేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యస్థాన భవనంగా మారినట్టు దర్శనమయింది (నేను మొట్టమొదట కాలిఫోర్నియాలో లాస్‌ఏంజిలిస్‌ను సందర్శించి మౌంట్ వాషింగ్టన్ కొండ కొమ్మునున్న పెద్ద భవనాన్ని చూసినప్పుడు, అంతకుపూర్వం ఎప్పుడెప్పుడో, కాశ్మీరులోనూ ఇతర చోట్లా నాకు కలిగిన అంతర్దర్శనాన్ని బట్టి వెంటనే దాన్ని గుర్తుపట్టాను).

శ్రీనగర్‌లో కొన్నాళ్ళు ఉన్నాం; ఆ తరవాత ఎనభై ఐదు వందల అడుగుల ఎత్తున ఉన్న గుల్మార్గ్ (పూలకొండ దారులు) కు బయలుదేరాం. నేను మొట్టమొదటిసారిగా భారీ గుర్రం మీద స్వారి చేసింది అక్కడే. రాజేంద్ర చిన్న గుర్రం ఎక్కాడు; కాని దానికి వడివడిగా పోవాలన్న ఆరాటం ఎక్కువ. చాలా నిటారుగా ఉండే ఖిలన్ మార్గ్‌లోనే పైకి పోవడానికి సాహసించాం మేము; అయితే ఆ దారి పుట్టగొడుగుచెట్లు దండిగా ఉండే దట్టమైన అడవిగుండా సాగింది; అక్కడ మంచుకప్పిన దారులు తరచు ప్రమాదకరంగా ఉంటాయి. కాని రాజేంద్రుడి చిట్టిగుర్రం, నా భారీ గుర్రానికి చాలా ప్రమాదకరమైన మలుపుల్లో కూడా, ఒక్క చిటికె సేపు విశ్రాంతి నివ్వలేదు. పోటీలో కలిగే సంబరం తప్ప మరేమీ ఎరగని రాజేంద్రుడి గుర్రం, అలుపూ సొలుపూ లేకుండా మునుముందుకు సాగుతూనే ఉంది.

హైరాణ పెట్టిన మా పందేనికి మనోహరమైన దృశ్యరూపంలో బహుమానం దొరికింది. ఈ జన్మలో మొట్టమొదటిసారిగా, హిమాచ్ఛాదిత మైన ఉత్తుంగ హిమాలయాల్ని అన్ని వేపులనుంచీ చూశాను; ధ్రువప్రాంతపు పెద్ద పెద్ద ఎలుగుబంట్ల స్థూలాకృతుల మాదిరిగా దొంతులు పేర్చినట్లు ఉన్నాయి ఆ కొండలు. సూర్యకాంతి ప్రసరించిన నీలాకాశ నేపథ్యంలో అనంతదూరాలకు వ్యాపించి ఉన్న మంచు కొండల్ని అవలోకిస్తూ ఆనందాతిరేకంతో విందులు చేసుకున్నాయి నా కళ్ళు.

తళతళలాడే మంచుకొండ వాలుల్లో, కుర్రకారు సావాసగాళ్ళతో కలిసి నేనూ ఆనందంగా దొర్లాను. మా దిగుదల ప్రయాణంలో, దూరాన విశాలమైన ఒక పసుప్పచ్చ పూల తివాసీ చూశాం; వెలవెలబోయిన కొండల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తోందది.

మా విహారయాత్రల్లో ఆ తరవాత సందర్శించినవి షాజహాను చక్రవర్తి, షాలిమార్ లోనూ నిశాత్‌లోనూ నిర్మించిన ప్రఖ్యాత “విలాస ఉద్యానవనాలు.” నిశాత్ బాగ్‌లోని పురాతన భవనం, సూటిగా సహజమైన ఒక జలపాతం మీద నిర్మించినది. కొండల మీంచి ఉరకలు వేస్తూ వచ్చి పడుతున్న ఉద్ధృత ప్రవాహాన్ని, ఉపాయంగా పన్నిన యంత్ర సాధనాలతో క్రమబద్ధం చేసి, వన్నె వన్నెల డాబాలమీంచి పారేటట్టూ, కళ్ళు మిరుమిట్లు గొలిపే పూలమళ్ళ మధ్య కారంజీలోకి నీళ్ళు చిమ్మేటట్టూ చేశారు. నీటి ప్రవాహం ఆ భవనంలో చాలా గదుల్లోకి కూడా ప్రవేశిస్తుంది. చివరికొక వనదేవతలా, దిగువనున్న సరస్సులోకి దిగివచ్చి పడుతుంది. గులాబీలు, మల్లెలు, కలవలు, శ్నాప్ డ్రాగన్లు, పాన్సీలు, లావెండర్లు, గసగసాలు- ఒకటేమిటి, రకరకాల పూలు స్వేచ్ఛగా వన్నెలు వెదజల్లుతూ ఉంటాయి విశాలమైన ఉద్యానవనాల్లో. చినార్, సైప్రస్, చెరీ చెట్లు తీర్చిదిద్దినట్టున్న వరసల్లో పచ్చల ఒడ్డాణం పెట్టినట్టుంటాయి; వాటి కవతల హిమాలయోత్తుంగ శిఖరాలు కఠోర తపస్సులో ఉన్నట్టుంటాయి.

కాశ్మీరు ద్రాక్షలనే పళ్ళు కలకత్తా వాళ్ళకి అపురూపం. కాశ్మీరులో మాకోసం ద్రాక్షపళ్ళ విందు ఎదురుచూస్తూ ఉంటుందని చెబుతూవచ్చిన రాజేంద్రుడు, అక్కడ పెద్ద ద్రాక్షతోటలేవీ అవుపడక, నిరాశ చెందాడు. వాడి నిరాధారమైన ఆశకు నేను ఆడపాతడపా వాణ్ణి దెప్పిపొడుస్తూనే వచ్చాను.

“ఓహ్, పీకలముయ్యా ద్రాక్షపళ్ళు తినేసి నేను నడవలేకపోతున్నాను!” అనేవాణ్ణి. కంటికి కనబడని ద్రాక్షపళ్ళు నాలో సారా కాచేస్తున్నాయి!” ఆ తరవాత విన్నాం, తియ్య ద్రాక్షలు కాశ్మీరుకు పడమట, కాబూలులో సమృద్ధిగా పండుతాయని. చివరికి ‘రబ్డీ’ (బాగా గడ్డ కట్టించిన పాలు) తో తయారుచేసి, పిస్తాపప్పు గుండ్లతో పరిమళం తెప్పించిన ఐస్‌క్రీమ్‌తోనే మేము సరిపెట్టుకున్నాం.

మేము ‘షికారా’లనే చిన్న పడవల్లో తిరిగాం; ఈ పడవల్లో నీడ ఇవ్వడానికి, ఎరుపు కసీదాలు కుట్టిన గుడ్డ పందిళ్ళున్నాయి. దాల్ సర స్సుకు, జలమయమైన సాలెగూడు వంటి కాలవలు అల్లుకొని ఉన్నాయి. వాటిలో చాలాసార్లు తిరిగాం. ఇక్కడ నీటిమీద తేలే తోటలు లెక్కలేనన్ని ఉన్నాయి. కొయ్యబాదులూ మట్టీ పెట్టి నాటురకంగా తయారుచేసిన ఈ తోటలు చూసి దిగ్భ్రమ చెందుతాం; నీళ్ళమధ్య కూరగాయలూ, పుచ్చ కాయలూ పెరుగుతూ కనిపించడమే పెద్ద విడ్డూరం. అప్పుడప్పుడు ఒక్కొక్క రైతు కనిపిస్తూ ఉంటాడు; ‘నేలకు పాతుకుపోయి ఉండడ’ మంటే రోత పుట్టి కాబోలు, తన నల్చదరం “భూమి”ని, అనేక శాఖలు గల ఆ సరస్సులో మరో కొత్తచోటికి లాక్కుపోతూ ఉంటాడు.

ఈ అంతస్తుల లోయలో ప్రపంచం అందాలన్నీ సూక్ష్మరూపంలో ఆవిర్భవించినట్టు అవుపిస్తాయి. కాశ్మీర పట్టమహిషికి కొండలే కిరీటం, సరస్సులు పుష్పహారాలు, పూలు పాదరక్షలు. తరవాత కొన్నేళ్ళకు నేను అనేక దేశాల్లో పర్యటించిన తరవాత, కాశ్మీరును ప్రపంచంలోకల్లా అందమైన ప్రకృతి దృశ్యాలుగల ప్రదేశంగా తరచు ఎందుకంటూ ఉంటారో అవగాహన చేసుకున్నాను. స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వతాలకు, స్కాట్లండ్‌లోని లాచ్ లోమండ్‌కు, అద్భుతమైన ఇంగ్లీషు సరస్సులకు ఉన్న అందాలు కొన్ని దానికి ఉన్నాయి. కాశ్మీరువచ్చే అమెరికా యాత్రికుడికి, అలాస్కాలోని ఎగుడుదిగుడు కొండల శోభనూ డెన్వర్ సమీపంలో ఉన్న పైక్ శిఖరాన్నీ గుర్తుకు తెచ్చేవి చాలా ఉన్నాయి.

ప్రకృతి దృశ్యాల అందాల పోటీలో ప్రథమ బహుమతికి నేను, మెక్సికోలోని జోఖిమిల్కో అద్భుత దృశ్యాన్ని కానీ, కాశ్మీరులోని సరస్సుల్ని కాని పోటీకి నిలబెడతాను. జోఖిమిల్కోలోని అనేక జలదారులలో ఉల్లాసంగా తిరిగే చేపల నడుమ మబ్బులూ, కొండలూ, పాప్లర్‌చెట్లూ ప్రతిఫలిస్తూ ఉంటాయి. కాశ్మీరు సరస్సులు అందాల కన్నెలయితే, వాటిని తీవ్రంగా ఒక కంట కనిపెట్టి వాటికి కాపుదల కల్పించేవి హిమాలయాలు. ఈ ప్రదేశాలు రెండూ భూమిమీదున్న మనోహర ప్రదేశాలన్నిటిలోకి అత్యుత్తమంగా నా మనస్సులో ప్రముఖంగా నిలిచిపోతాయి.

అయినప్పటికి యెలోస్టన్ జాతీయోద్యానం, కొలరడోలోని గ్రాండ్ కాన్యాన్, అలాస్కా ప్రదర్శించే అద్భుతాలు దర్శించినప్పుడు నేను అప్రతిభుణ్ణి అయాను. లెక్కలేనన్ని ఉడుకునీటి బుగ్గలూ, దాదాపు గడియారం పనిచేసేటంట క్రమబద్ధతతో, గాలిలో ఉవ్వెత్తుగా ఎగజిమ్ముతూ ఉండడం భూమిమీద, బహుశా ఒక్క యెలోస్టన్ ప్రాంతంలో తప్ప మరెక్కడా చూడమనుకుంటాను. ఈ అగ్ని పర్వత ప్రాంతంలో ప్రకృతి, పూర్వసృష్టి తాలూకు నమూనా ఒకటి నిలిపి ఉంచింది: ఉష్ణగంధకం ఊటలూ, విమలక, నీలమణి వర్ణాల మడుగులూ, ఉద్ధృతమైన నీటి బుగ్గలూ, స్వేచ్ఛగా తిరుగుతుండే ఎలుగుబంట్లూ, తోడేళ్ళూ, అడవి దున్నలూ, ఇతర వన్యప్రాణులూ అవుపిస్తాయి. వ్యోమింగ్ రోడ్ల వెంబడి మోటారుకారులో ప్రయాణంచేస్తూ “డెవిల్స్ పెయింట్ పాట్” (రాకాసి రంగుల దాన) అనే, బుడగలు వచ్చే ఉడుకుడుకు బురదనేల వరకు సాగుతూ, గలగలలాడే నీటి ఊటల్నీ, ఎగిసిపడే నీటి బుగ్గల్ని, ఆవిరి కారంజీల్నీ గమనిస్తూ ఉన్నప్పుడు, యెలోస్టన్‌కున్న విశిష్టతనుబట్టి, అది ప్రత్యేక బహుమతి పొందడానికి అర్హమైందని చెప్పాలనిపించేది.

కాలిఫోర్నియాలో యోస్‌మైట్‌లో ఉన్న పురాతన సతత హరిత శంక్వాకార వృక్షాలు రాచఠీవితో, భారీ స్తంభాలు ఆకాశంలో పై పైకి చొచ్చుకుపోతున్నట్టుగా సాగిపోతూ, దివ్యనైపుణ్యంతో రూపకల్పన చేసిన సహజమైన ఆకుపచ్చ గుడిగోపురాలు. ప్రాచ్య ప్రపంచంలో అద్భుతమైన జలపాతాలు ఉన్నప్పటికీ, కెనడా సరిహద్దు దగ్గర న్యూయార్కులో ఉన్న నయాగరా ఉద్ధృత సౌందర్యానికి వాటిలో ఏది ధీటురాదు. కెంటకీలో ఉన్న బ్రహ్మాండమైన గుహ, న్యూ మెక్సికోలో ఉన్న కార్ల్స్‌బాడ్ కొండ గుహలూ చిత్రమైన గంధర్వ లోకాలు. గుహల పై కప్పులనుంచి కిందికి వేలాడుతూ కింది నీళ్ళలో ప్రతిబింబించే పొడుగాటి సున్నపురాతి స్తంభాలు, మానవుడు ఊహించిన పరలోక సౌందర్యాన్ని ప్రకాశింప చేస్తాయి.

కాశ్మీరులో, అందానికి ప్రపంచ ప్రఖ్యాతిపొందిన ప్రజలు చాలామంది, యూరోపియన్లంత తెల్లగానూ ఉంటారు; వాళ్ళలాగే మొక్కట్లు, అస్థినిర్మాణమూ ఉంటాయి; చాలామందికి నీలికళ్ళూ లేతవన్నె జుట్టూ ఉంటాయి. పాశ్చాత్య దుస్తులు ధరించినప్పుడు వాళ్ళు అమెరికన్లలా కనిపిస్తారు. హిమాలయాల చల్ల దనం కాశ్మీరీలకు, ఎండ ఉడుకుకు ఉపశమనం కలిగించి శరీరచ్ఛాయ లేతవన్నెలో, ఉండేటట్టు చేస్తుంది. భారతదేశపు ఉష్ణమండల అక్షాంశరేఖల వెంబడి దక్షిణాన దిగవకు ప్రయాణం చేసేవాళ్ళు, రానురాను మరింత నలుపుదేరినవాళ్ళను చూస్తారు.

కాశ్మీరులో కొన్ని వారాలపాటు ఆనందంగా గడిపిన తరవాత, శ్రీరాంపూర్ కాలేజిలో శీతాకాలపు టెండకు అందుకోడానికని బెంగాలుకు తిరిగి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోవలసి వచ్చింది. శ్రీయుక్తేశ్వర్‌గారు, కనాయి, ఆడీ శ్రీనగర్‌లో మరికొన్నాళ్ళపాటు ఉండిపోవలసి వచ్చింది. నేను బయలుదేరడానికి కొద్దిగా ముందు గురుదేవులు, తమ దేహం కాశ్మీరులో బాధకు గురికావలసి వస్తుందని సూచనగా తెలియజేశారు.

“గురుదేవా, మీ ఆరోగ్యం నిక్షేపంలా ఉంది,” అన్నాను నేను అభ్యంతరం తెలుపుతూ.

“నేను ఈ లోకాన్ని వదిలేసే అవకాశం కూడా లేకపోలేదు,” అన్నారాయన.

“గురూజీ! ఇప్పుడప్పుడే ఈ దేహాన్ని విడిచిపెట్టనని మాట ఇవ్వండి. మీరు లేకుండా గడుపుకోడానికి నేను బొత్తిగా సిద్ధపడలేదు.” అంటూ ప్రాధేయపూర్వకంగా ఆయన పాదాల మీద పడ్డాను.

శ్రీయుక్తేశ్వర్‌గారు మౌనం వహించారు; కాని దయార్ద్రదృష్టితో ఆయన నవ్విన చిరునవ్వువల్ల ఆయన నాకు భరోసా ఇచ్చినట్టనిపించింది. మనస్సు ఒప్పకపోయినా ఆయన్ని విడిచి వెళ్ళిపోయాను.

“గురుదేవులు ప్రమాదకరమైన జబ్బులో ఉన్నారు.” ఆడీ ఇచ్చిన ఈ తంతి, నేను శ్రీరాంపూర్‌కు తిరిగివచ్చిన కొన్నాళ్ళకు నాకు అందింది.

“గురుదేవా, మీరు నన్ను విడిచి వెళ్ళనని మాట ఇమ్మని మిమ్మల్నికోరుకున్నాను. మీరు దయచేసి దేహాన్ని నిలుపుకోండి; లేకపోతే నేను కూడా చచ్చిపోతాను,” అంటూ నేను వ్యగ్రంగా మా గురుదేవులకు ఒక తంతి ఇచ్చాను.

“నీ కోరికే నెరవేరనియ్యి.” కాశ్మీరు నుంచి గురుదేవుల సమాధాన మిది.

కొన్నాళ్ళలో ఆడీ దగ్గర్నించి ఉత్తరం వచ్చింది; అందులో, గురుదేవులు కోలుకున్నారని రాశాడు. ఆ మరుసటి పక్షంలో శ్రీరాంపూర్ కు తిరిగి రాగానే గురుదేవుల దేహాన్ని చూద్దునుకదా, బరువుతగ్గి చిక్కి సగమయారు. నా కెంతో దుఃఖం కలిగింది.

శ్రీయుక్తేశ్వర్‌గారు, శిష్యుల అదృష్టంవల్ల, వాళ్ళ పాపాల్లో చాలా మట్టుకు కాశ్మీరులో ఆయనకు వచ్చిన తీవ్రజ్వరాగ్నిలో దగ్ధం చేసేశారు. జబ్బును భౌతికంగా బదలాయింపు చేసే ఆధ్యాత్మిక పద్ధతి, బాగా ఉన్నత స్థితికి చేరుకున్న యోగులకు తెలుసు. బలహీనుడు పెద్ద బరువు మోసుకోడానికి బలమయినవాడు సాయపడవచ్చు; ఆధ్యాత్మికంగా ఉత్కృష్టస్థితి నందుకున్న అతీత మానవుడు, కర్మ సంబంధమైన భారాల్లో కొంతభాగం తాను వహించి తన శిష్యుల శారీరక మానసిక బాధల్ని కనీస స్థాయికి తగ్గిస్తాడు. ధనవంతుడొకడు, వ్యర్థుడైన తన కొడుకు చేసిన పెద్ద అప్పు తాను తీర్చేసి దానివల్ల కలిగే విపత్కర పరిణామాలనుంచి అతన్ని ఎలా రక్షిస్తాడో, అదే విధంగా గురువు, తన శిష్యుల దైన్యాన్ని తగ్గించడానికి తన శారీరక సంపదలో కొంత భాగాన్ని ఇచ్ఛాపూర్వకంగా త్యాగం చేస్తాడు.

ఒకానొక రహస్య యోగపద్ధతి ద్వారా సాధువు తన మనస్సునూ సూక్ష్మదేహాన్నీ పీడిత వ్యక్తి మనస్సుతోనూ సూక్ష్మదేహంతోనూ అనుసంధానం చేస్తాడు. ఆ జబ్బు పూర్తిగాగాని కొంతమట్టుకుగాని యోగి భౌతికరూపానికి సంక్రమించడం జరుగుతుంది. అయితే యోగి, దేహమనే పొలంలో దేవుడనే పంటను కోసి కుప్పవేసుకున్నందువల్ల ఇక ఆ దేహంతో ఆయనకి ప్రమేయం ఉండదు. ఇతరుల బాధలు తొలగించడానికి ఆయన దాన్ని జబ్బుపడనిచ్చినా, కాలుష్యానికి లోనుకాజాలని ఆయన మనస్సు, ఎటువంటి ప్రభావానికి లోనుకాదు. అటువంటి సహాయం చెయ్య గలుగుతున్నందుకు తాము అదృష్టవంతులమని అనుకుంటారు. చివరికి మోక్షం పొంది ఈశ్వరసాయుజ్యం సాధించడమంటే, నిజానికి, మానవ శరీరం దాని ప్రయోజనాన్ని పూర్తిగా నెరవేర్చేటట్టు చూడడమే; అప్పుడు యోగి దాన్ని, తనకు ఉచితమని తోచిన విధంగా చేస్తాడు.

ఆధ్యాత్మిక సాధనాల ద్వారా నయితేనేమి, జ్ఞానోపదేశం ద్వారా నయితేనేమి, సంకల్పశక్తి వల్ల నయితేనేమి, ఒకరికున్న జబ్బును శారీరకంగా బదలాయించడంవల్ల నయితేనేమి మానవజాతి దుఃఖాల్ని నివృత్తి చెయ్యడమే లోకంలో గురువు చేసే పని. గురువు, తాను కోరుకున్నప్పుడల్లా అధిచేతన స్థితికి వెళ్ళిపోయి శారీరక రుగ్మతను విస్మరించగలుగుతాడు; ఒక్కొక్కప్పుడు తన శిష్యులకొక ఆదర్శం నిరూపించడంకోసం శారీరక బాధను గంభీరంగా ఓర్చుకోదలుస్తాడు. ఇతరుల జబ్బుల్ని తాను వహించడంవల్ల యోగి, వాళ్ళకోసం, కర్మసంబంధమైన కార్యకారణ నియమాన్ని పాటిస్తాడు. ఈ నియమం యాంత్రికంగా లేదా గణితశాస్త్రీయంగా పనిచేస్తుంది; దివ్యజ్ఞానం కలిగిన వ్యక్తులు, అది పనిచేసే తీరు తెన్నులను శాస్త్రీయంగా నిర్దేశించగలరు.

ఒక యోగి మరొక వ్యక్తికి ఉన్న జబ్బు నయంచేసినప్పుడల్లా తాను జబ్బుపడవలసిన అవసరం, ఆధ్యాత్మిక నియమాన్ని బట్టి ఏమీ ఉండదు. ఆధ్యాత్మికంగా స్వస్థత చేకూర్చే వ్యక్తికి ఏ హానీ కలక్కుండా ఉండే విధంగా తక్షణ నివారణ కలిగించే వివిధ పద్ధతులు సాధువుకు తెలిసి ఉండడంవల్ల ఆ పరిజ్ఞానం ద్వారానే సాధారణంగా జబ్బులు నయం చెయ్యడం జరుగుతుంది. అయితే ఎప్పుడో ఒక్కొక్క సందర్భంలో మాత్రం గురువు, తన శిష్యుల్లో ప్రగతి పరిణామాన్ని అతిత్వరితంగా రప్పించాలని ఆశించినప్పుడు, వాళ్ళ అవాంఛనీయ కర్మఫలంలో చాలా భాగం తన శరీరానికి సంక్రమింపజేసుకొని స్వచ్ఛందంగా అనుభవిస్తాడు.

అనేకమంది చేసిన పాపాలకు ఏసుక్రీస్తు, తనను పరిహారంగా నిరూపించుకున్నాడు. తనకున్న దివ్యశక్తులకు[1] క్రీస్తు, కార్యకారణ సంబంధమైన సూక్ష్మ విశ్వనియమంతో ఇచ్ఛాపూర్వకంగా సహకరించి ఉండకపోయినట్లయితే శిలువ వెయ్యడంవల్ల చనిపోవలసిన స్థితికి ఒక్క నాటికి లోనయ్యేవాడు కాడు. ఆ ప్రకారంగా ఆయన ఇతరుల కర్మ ఫలాల్ని, ముఖ్యంగా తన శిష్యుల కర్మఫలాల్ని, తనమీద వేసుకొన్నాడు. ఈ విధంగా వాళ్ళు అత్యంతపరిశుద్ధులై, ఉత్తరోత్తరా తమకు సిద్ధించే సర్వవ్యాపక చైతన్యాన్ని లేదా హోలీ ఘోస్ట్‌ను (పరిశుద్ధాత్మను) ధరించడానికి అర్హత పొందారు.[2]

కేవలం ఆత్మసాక్షాత్కారం పొందిన గురువు మాత్రమే తన ప్రాణశక్తిని బదిలీ చెయ్యడంకాని, ఇతరుల జబ్బుల్ని తన శరీరంలోకి రప్పించుకోడం కాని చెయ్యగలడు. మామూలు మనిషి, రోగనివారణ చేసే ఈ యోగపద్ధతిని అవలంబించలేడు; అతనలా చెయ్యడం ఆశించదగ్గది కూడా కాదు. ఎంచేతంటే, అనారోగ్యమైన శరీర సాధనం, గాఢమైన ధ్యానానికి అవరోధం. మానవుడు తన శరీరాన్ని మంచి స్థితిలో ఉంచుకోడం అతని విద్యుక్తధర్మంగా హైందవ పవిత్ర గ్రంథాలు ఘోషిస్తాయి; లేకపోతే అతని మనస్సు భక్తితత్పరమైన ఏకాగ్రతలో కుదురుగా నిలబడ లేదు.

అయితే అత్యంత దృఢమైన మనస్సు మాత్రం శరీర బాధలన్నిటినీ అధిగమించి ఆత్మసాక్షాత్కారం సిద్ధింపజేసుకో గలదు, అనేకమంది సాధువులు అనారోగ్యాన్ని ఖాతరు చెయ్యకుండా దైవాన్వేషణలో విజయం పొందారు. సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసీ తాను జబ్బులతో తీవ్రంగా బాధపడుతూ ఉండి కూడా ఇతరులకు నయం చేశాడు; అంతే కాదు, చచ్చిపోయిన వాళ్ళను బతికించాడు కూడా.

వెనక నాకు తెలిసిన భారతీయ సాధువు కొకాయనకు తొలినాళ్ళలో ఒంట్లో సగభాగంవరకు పుండ్లతో నిండిపోయి ఉండేది. ఆయనకు మధుమేహవ్యాధి ఎంత తీవ్రంగా ఉండేదంటే, పట్టుమని పదిహేను నిమిషాలపాటు నిలకడగా ఒక చోట కూర్చోలేకపోయేవాడు. కాని ఆయన ఆధ్యాత్మిక ఆకాంక్ష మాత్రం దుర్నిరోధమైనది. “ప్రభూ, నా శిథిలాలయంలోకి వస్తావా నువ్వు!” అంటూ ప్రార్థించేవాడు. అనంతమైన సంకల్పశక్తి పాటవంతో ఆ సాధువు క్రమక్రమంగా, రోజుకు పద్దెనిమిది గంటలపాటు పద్మాసనంలో కూర్చుని సమాధిలో తన్మయుడై ఉండే స్థితికి వచ్చాడు. “మూడేళ్ళు గడిచేసరికి, ఆ అనంతజ్యోతి నాలో మహోజ్జ్వలంగా ప్రకాశించడం గమనించాను. ఆ తేజస్సుకు ఆనందిస్తూ మైమరిచిపోయాను. దైవకృపవల్లనే నా శరీరం సంపూర్ణారోగ్యం పొందిందని, ఆ తరవాత గమనించాను,” అని నాకు చెప్పారాయన.

భారతదేశంలో మొగలు సామ్రాజ్య స్థాపకుడైన బాబరు చక్రవర్తి (1483-1530) కి సంబంధించి చరిత్ర ప్రసిద్ధమైన రోగనివారణ సంఘటన ఒకటి ఉంది. ఆయన కొడుకు హుమాయూన్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. ఆ జబ్బు తనకు వచ్చి, తన కొడుకు బతికి బయటపడాలన్న దృఢ నిశ్చయంతో సంతప్తహృదయుడై ప్రార్థించా డా తండ్రి. హుమాయూన్[3] కోలుకున్నాడు; బాబరు వెంటనే జబ్బు పడ్డాడు; తన కొడుక్కి వచ్చిన జబ్బుతోనే ఆయన చనిపోయాడు. మహాపురుషులకు శాండో [4]మాదిరి ఆరోగ్యం, బలం ఉండాలని చాలామంది నమ్మకం. ఈ ఊహ నిరాధారమైనది. జీవితకాలమంతా చెక్కు చెదరకుండా ఉన్న ఆరోగ్యం అంతరిక జాగృతిని సూచిస్తుందనడానికి ఎలా వీలు లేదో, అలాగే రోగిష్టి శరీరం ఉన్న మాత్రన ఒక సద్గురువుకు దివ్యశక్తులు లేవని చెప్పడానికి కూడా వీలులేదు. సద్గురువును గుర్తు పట్టడానికి వీలయిన అర్హతలు ఆధ్యాత్మికమైనవే కాని, శారీరకమైనవి కావు.

ఆధ్యాత్మిక విషయాలమీద ధారాళంగా మాట్లాడడం కాని, రాయడం కాని చేసేవాడు సద్గురువై ఉంటాడని, తబ్బిబ్బయిన సాధకులు అనేకమంది పొరపాటున అనుకుంటూ ఉంటారు. అయితే ఎవరయినా సద్గురువని చెప్పడానికి నిదర్శనం, తన సంకల్పానుసారంగా ఊపిరిలేకుండా ఉండే స్థితికి (సవికల్ప సమాధి) వెళ్ళే సామర్థ్యంలోనూ, నిర్వికారమైన ఆనందాన్ని (నిర్వికల్ప సమాధి) సాధించడంలోనూ కనిపిస్తుంది. కేవలం ఈ ఉపలబ్ధులవల్ల మాత్రమే మానవుడు, ‘మాయ’ అనే ద్వంద్వోపేతమైన విశ్వభ్రాంతిని తాను జయించినట్టు నిరూపించుకోవచ్చునని ఋషులు చెప్పారు. “ఏకం సత్” (“ఉండేది ఒకే ఒకటి”) అంటూ, అనుభూతి అగాధాల్లోంచి గొంతెత్తి చెప్పేవాడు అతనొక్కడే.

“అజ్ఞానం కారణంగా ద్వంద్వ భావం ఉన్నప్పుడే సమస్త వస్తువుల్నీ ఆత్మకు భిన్నంగా చూస్తాడు,” అని రాశారు, అద్వైత మహాప్రవక్త ఆచార్య శంకరులు. “ప్రతిదీ ఆత్మగానే అవగతమైనప్పుడు, ఒక్క అణువును కూడా ఆత్మకు భిన్నంగా దర్శించడం జరగదు... మేలుకున్న తరవాత కల ఎలా ఉండదో అచ్చం అలాగే, సత్యాన్ని గురించిన జ్ఞానం ఉదయించినప్పుడు, శరీరానికున్న మిథ్యాత్వంవల్ల అనుభవించవలసిన పూర్వకర్మ ఫలాలన్న వేవీ ఉండవు.”

మహాగురువులు మాత్రమే శిష్యుల కర్మను తాము వహించగలరు. శ్రీయుక్తేశ్వర్‌గారు, తమ శిష్యులకు ఆ విచిత్రరీతిలో సహాయపడడానికి తమలోని చిచ్ఛక్తి నుంచి అనుమతిపొంది ఉంటేనే కాని శ్రీనగర్[5]లో జబ్బుపడి ఉండేవారు కారు. దైవాజ్ఞల్ని పాలించడానికి సమకూరిన సునిశితమైన జ్ఞానంలో దైవానుసంధాన పరాయణులైన మా గురుదేవుల్ని మించినవాళ్ళు సకృతు.

బాగా చిక్కిపోయిన ఆయన శరీరాన్ని చూసి సానుభూతితో నాలుగు ముక్కలు అనడానికి నేను సాహసించినప్పుడు, మా గురుదేవులు ఉల్లాసంగా ఇలా అన్నారు:

“దీని లాభాలు దీని కున్నాయి; కొన్నేళ్ళుగా నేను వేసుకోని కొన్ని చిన్న ‘గంజీ’ (లోపలి చొక్కా) ల్లోకి ఇప్పుడు దూరగలుగుతున్నాను!”

గురుదేవుల చమత్కారం వింటూ ఉంటే సెంట్ ఫ్రాన్సిస్ డి సేల్స్ అన్న మాటలు నాకు గుర్తు వచ్చాయి: “దుఃఖించే సాధువు సాధువేకాడు.”

  1. ఇక శిలువ వెయ్యడానికి తీసుకువెళ్తారనగా క్రీస్తు ఇలా అన్నాడు: “నేను నా తండ్రిని ఇప్పుడు ప్రార్థించలేననీ, ఆయన ఇప్పటికిప్పుడు నాకు పన్నెండు సైనికదళాలకు మించి దేవదూతల్ని ఇవ్వడనీ అనుకుంటున్నారా? కాని అలా జరిగినట్లయితే పవిత్రగ్రంథాల్లో చెప్పింది నెరవేరడం ఎలా? అది నెరవేర కుండా ఉండడం ఎలా?” మత్తయి 26 : 53- 4 (బైబిలు).
  2. యాక్ట్స్ 1 : 8, 2 : 1-4 (బైబిలు).
  3. హుమాయూన్ అక్బరు చక్రవర్తికి తండ్రి. మొదట్లో అక్బరు చక్రవర్తి ఇస్లాం మతోన్మాదంతో హిందువుల్ని హింసించాడు. ఆ తరవాత ఆయన, ‘నాలో జ్ఞానం పెరిగేకొద్దీ, నేను అవమానంతో కుంగిపోయాను,’ అన్నాడు. “దివ్యలీలలు ప్రతి మతంవాళ్ళ మందిరాల్లోనూ సంభవిస్తాయి.” భగవద్గీతను పారశీక భాషలోకి అనువదించే ఏర్పాటు చేశాడతను. అంతే కాకుండా, రోమ్ నుంచి అనేకమంది జెసూయిట్ ఫాదరీలను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. అక్బరు, ఈ కింద పేర్కొన్న సూక్తి క్రీస్తు చెప్పినట్టుగా పొరపాటు పడ్డాకూడా, అభిమాన పురస్సరంగా ఉదాహరించాడు. (అక్బరు కొత్తగా నిర్మించిన ఫతేపూర్ సిక్రీ నగరంలో విజయతోరణం మీద చెక్కించినది); “మేరీ కుమారుడు ఏసు (ఆయన ఆత్మకు శాంతి లభించుగాక!) ఇలా అన్నాడు: “ఈ ప్రపంచం ఒక వంతెన; దానిమీంచి సాగిపో; కాని దానిమీద ఇల్లు కట్టకు.”
  4. “ప్రపంచంలో అందరికన్న బలిష్ఠు”డిగా పేరుగన్న ఒక జర్మన్ క్రీడాకారుడు (మరణం 1955).
  5. కాశ్మీర రాజధాని శ్రీనగర్‌ను అశోక చక్రవర్తి క్రీ. పూ. మూడో శతాబ్దిలో నిర్మించాడు. అక్కడాయన 500 మఠాలు కట్టించాడు. తరవాత వెయ్యి సంవత్సరాలకు హ్యూయెన్ త్సాంగ్ అనే చైనా యాత్రికుడు కాశ్మీరు దర్శించిన నాటికి వాటిలో ఇంకా 100 మఠాలు నిలిచి ఉన్నాయి. ఫాహియాన్ (ఐదో శతాబ్ది) అనే మరో చైనా రచయిత, పాటలీపుత్రం (ఇప్పటి పాట్నా) లో ఆశోకుడు నిర్మించిన విశాల రాజప్రసాదం శిథిలాలు చూసి, వాస్తుకళలోనూ అలంకరణ శిల్పకళలోనూ ఆ నిర్మాణానికిగల అద్భుత సౌందర్యాన్ని బట్టి అది, “మానవమాత్రుల చేతుల్లో తయారయింది కాదు” అనిపిస్తుందని రాశాడు.

పాటలీపుత్ర నగరానికి ఆకర్షకమైన చరిత్ర ఉంది. బుద్ధ భగవానుడు క్రీ. పూ. ఆరో శతాబ్దిలో దర్శించిననాటికి ఈ ప్రదేశంలో అనామకమైన ఒక చిన్నకోట ఉండేది. ఆయన దీని భవిష్యత్తునుగురించి జోస్యం చెబుతూ, “ఆర్యజాతి జనులు ఏయే దూరప్రాంతాల్లో నివసిస్తారో, వర్తకులు ఏయే దూరప్రాంతాలకు ప్రయాణిస్తారో అక్కడివరకు ఈ పాటలీపుత్రమే ప్రధాన నగరమవుతుంది; అన్ని రకాల వస్తువుల క్రయవిక్రయాలకూ కేంద్రమవుతుంది,” (మహాపరినిర్వాణ సూత్రం) అన్నాడు. రెండు శతాబ్దుల తరవాత ఈ పాటలీపుత్రం చంద్రగుప్త మౌర్యుడి విశాల సామ్రాజ్యానికి రాజధాని అయింది; ఆయన మనమడు అశోకుడు ఈ నగరానికి ఇతోధిక వైభవాన్నీ శోభను చేకూర్చాడు.