ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 20

వికీసోర్స్ నుండి

అధ్యాయం : 20

మేము కాశ్మీరు వెళ్ళలేదు.

“నాన్నగారూ, వేసవి సెలవుల్లో హిమాలయాల దిగువ కొండలకు నాతోబాటు రమ్మని, గురువుగారినీ మరో నలుగురు స్నేహితుల్నీ పిలుద్దామనుకుంటున్నాను. కాశ్మీరుకు ఆరు ట్రెయిను పాస్‌లూ, మా ప్రయాణం ఖర్చులకు సరిపడే డబ్బూ ఇస్తారా?”

నే ననుకున్నట్టుగానే, నాన్నగారు మనసారా నవ్వారు. “నువ్వీ కాకమ్మకథ చెప్పడం ఇది మూడోసారి. కిందటి వేసంగుల్లోనూ అంతకు ముందు వేసంగుల్లోనూ, ఇలాగే అడగలేదూ నువ్వు? చివరి క్షణంలో శ్రీయుక్తేశ్వర్‌గారు రామంటారు.”

“నిజమే నాన్నగారూ, కాశ్మీరు విషయంలో మా గురువుగారు ఖచ్చితంగా మాట ఎందుకివ్వడంలేదో నాకు అర్థంకాకుండా ఉంది.[1] కాని, నే నప్పుడే మీ దగ్గర పాస్‌లు తీసేసుకున్నానని చెబితే, ప్రయాణానికి ఆయన ఒప్పుకుంటారని ఎందుకో అనిపిస్తోంది నాకు.”

అప్పటికయితే నాన్న గారికి నమ్మకం కలగలేదు. కాని ఆ మర్నాడు ఆయనే, కొన్ని పరిహాసాలతో నన్ను ఆటపట్టించిన తరవాత ఆరు పాస్‌లూ ఒక పదిరూపాయల నోట్ల కట్టా నా చేతి కిచ్చారు.

“నీ ఉత్తుత్తి ప్రయాణానికి ఇలాంటి ఆధరువులేవీ అక్కర్లేదనుకుంటాను; అయినా ఇవిగో!” అని వ్యాఖ్యానించారు నాన్న గారు.

ఆరోజు మధ్యాహ్నం నేను దండుకున్నవి తెచ్చి శ్రీయుక్తేశ్వర్ గారి ముందు ప్రదర్శించాను. నా ఉత్సాహం చూసి ఆయన చిరునవ్వు చిందించారే కాని, ఆయన మాటలు మట్టుకు ఎటూ తేల్చలేదు: “నాకూ రావాలనే ఉంది; చూద్దాం.” వారి ఆశ్రమ విద్యార్థి అయిన కనాయిని కూడా తీసుకువెళ్దామని అన్నప్పుడు ఆయన ఏమీ వ్యాఖ్యానించలేదు. మరో ముగ్గురు స్నేహితుల్ని కూడా మాతో రమ్మని చెప్పాను.-- రాజేంద్రనాథ్ మిత్రా, జోతిన్ ఆడీ, మరో అబ్బాయి. మరుసటి సోమవారంనాడు బయల్దేరాలని నిర్ణయమైంది.

శని, ఆదివారాలు రెండు రోజులూ కలకత్తాలో ఉండిపోయాను; మా చుట్టాలబ్బాయి పెళ్ళి తతంగమంతా కలకత్తాలో మా ఇంట్లోనే జరుగుతోంది. నా సామాను తీసుకుని, సోమవారం పొద్దుట శ్రీరాంపూర్‌లో దిగాను. రాజేంద్ర ఆశ్రమ ద్వారం దగ్గర నన్ను కలుసుకున్నాడు.

“గురుదేవులు బయటికి షికారుకువెళ్ళారు. ఆయన రామంటున్నారు”

ఆ మాటకు నాకు ఎంత విచారం కలిగిందో అంత పట్టుదల కూడా పెరిగింది. “కాశ్మీరు వెళ్ళడానికి నేను భ్రమతో వేసిన పథకాలను నాన్నగారు మూడోసారి కూడా పరిహాసం చేసే అవకాశం నే నివ్వను. మిగిలిన వాళ్ళమే వెళ్ళాలి.”

రాజేంద్ర ఒప్పుకున్నాడు; ఒక నౌకరును సంపాదించడానికి నేను ఆశ్రమం నుంచి వెళ్ళాను. గురుదేవులు లేకుండా, కనాయి ప్రయాణం కట్టడని నాకు తెలుసు; పైగా మా సామాను కాపలా కాయడానికి ఎవరో ఒకరు అవసరం. బిహారి నా మనస్సులో మెదిలాడు. అతను వెనక మా ఇంట్లో నౌకరు. ఇప్పుడు శ్రీరాంపూర్‌లో ఒక ఉపాధ్యాయుడి దగ్గర పని చేస్తున్నాడు. నేను వడివడిగా నడుస్తూ పోతుండగా, శ్రీరాంపూర్ కోర్ట్ హౌస్ దగ్గరున్న క్రిస్టియన్ చర్చి కి ఎదురుగా గురుదేవులు తారసపడ్డారు.

“ఎక్కడికెళ్తున్నా వోయ్?” శ్రీయుక్తేశ్వర్‌గారి ముఖంలో చిరునవ్వన్నమాటే లేదు.

“గురుదేవా, మనమనుకున్న ప్రకారం ప్రయాణం చెయ్యడానికి మీరు, కనాయీ రావడంలేదని విన్నాను. బిహారికోసం వెతుకుతున్నాను. కిందటేడు, కాశ్మీరు చూడ్డానికి అతనెంతో మనసుపడ్డాడనీ, జీతంలేకుండా పనిచేస్తానని కూడా అన్నాడనీ మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది.”

“ఔను, జ్ఞాపకముంది. అయినా బిహారి, రావటానికి ఒప్పుకుంటాడని అనుకోను.”

దాంతో నా సహసం సన్నగిలింది. “సరిగా ఈ అవకాశం కోసమే అతను ఆత్రంగా ఎదురు చూస్తున్నాడండి!” అన్నాను.

మా గురుదేవులు మౌనంగా మళ్ళీ నడక సాగించారు. నేను కాసేపట్లోనే స్కూలు మాస్టరుగారి ఇల్లు చేరుకున్నాను. బిహారి ముంగిట్లోనే ఉన్నాడు; ఆప్యాయంగా నవ్వుతూ పలకరించినవాడల్లా, నేను కాశ్మీరు మాట ఎత్తేసరికి చటుక్కున మాయమయాడు. క్షమార్పణ చెప్పుకుంటున్నట్టుగా ఏదో గొణిగి యజమాని ఇంట్లోకి దూరాడు. నేను అరగంట సేపు అక్కడే పడిగాపులు పడి ఉన్నాను; బిహారి ఆలస్యానికి కారణం, ప్రయాణం ఏర్పాట్లు చేసుకుంటూ ఉండడమేకాని మరేం కాదని అంతసేపూ నన్ను నేను సమాధానపరుచుకుంటున్నాను. చివరికి వీథి తలుపు తట్టాను. “బిహారి దాదాపు అరగంట క్రితం, వెనకవేపు మేడమెట్లు దిగి వెళ్ళిపోయాడు,” అని చెప్పా డొకాయన. రవ్వంత చిరునవ్వు ఆయన పెదవులమీద తొణికిసలాడింది.

అక్కణ్ణించి దిగాలుపడి వస్తూ, బిహారిని మాతో రమ్మని పిలవడంలో ఏమైనా బలవంతం చేస్తున్నట్లు ఉందా, లేకపోతే గురుదేవులు అదృశ్య ప్రభావం ఏమైనా పనిచేస్తుందా అని తర్కించుకున్నాను. క్రిస్టియన్ చర్చి దాటి వెళ్తూ మళ్ళీ మా గురుదేవుల్ని కలిశాను; ఆయన నావేపే మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. నేనేం చెప్తానో వినకుండానే ఆయన ఇలా అన్నారు:

“అయితే బిహారి రాడన్నమాట! మరిప్పుడు నీ ప్రయత్న మేమిటి?” అదుపాజ్ఞలు పెట్టే తండ్రిని ధిక్కరించడానికి నిశ్చయించుకున్న మొండి పిల్లవాడిలా మొరాయించింది నా మనస్సు. “మా బాబయ్యని, తన దగ్గర పనిచేసే లాల్‌ధారి అనే నౌకర్ని పంపించమని అడుగుతానండి.”

“కావాలంటే మీ బాబయ్యని కలుసుకో,” అన్నారు శ్రీయుక్తేశ్వర్ గారు, ముసిముసిగా నవ్వుతూ. “కాని వెళ్ళినందుకు నువ్వు సంతోషిస్తావని మాత్రం నా కనిపించడం లేదు.”

ఆ మాటకు నేను కీడు శంకించినా, నాలో తిరుగుబాటుతనం తలఎత్తింది; గురువుగారిని విడిచిపెట్టి శ్రీరాంపూర్ కోర్ట్ హౌస్‌లో అడుగు పెట్టాను. మా బాబయ్య శారదా ఘోష్ అక్కడ గవర్నమెంటు ప్లీడరు. ఆయన నన్ను ఆప్యాయంగా చేరదీశాడు.

“ఈవేళ నేను కొంతమంది స్నేహితులతో కలిసి కాశ్మీరుకు బయల్దేరుతున్నాను.” అని చెప్పాను. “ఈ హిమాలయ యాత్రకోసం ఎన్నో ఏళ్ళనుంచి ఎదురు చూస్తున్నాను.” అన్నాను. “చాలా సంతోషం ముకుందా. నీ ప్రయాణం మరింత సుఖంగా జరగడానికి నేను చెయ్యగలిగింది ఏమన్నా ఉందా?”

ఆదరపూర్వకమైన ఈ మాటలలో నాలో ఉత్సాహం పెల్లుబికింది. “బాబయ్యా, నువ్వు మీ నౌకరు లాల్‌ధారీని పంపించగలవా?”

నా ఈ చిన్న విన్నపం భూకంపం పుట్టించినంత పని చేసింది. మా బాబయ్య కుర్చీలోంచి విసురుగా లేచేసరికి, కుర్చీ తిరగబడి, బల్లమీది కాయితాలు అన్ని వేపులకీ చెల్లాచెదరుగా ఎగిరిపోయి, కొబ్బరి చిప్పతో చేసిన, ఆయన పొడుగాటి హుక్కాగొట్టం చటుక్కున కిందపడి పెద్ద రణగొణధ్వని అయింది.

“ఓరి స్వార్థపరుడా! ఎంత విపరీతపు ఆలోచన! నా నౌకర్ని కాస్తా నువ్వు నీ విలాసయాత్రకి తీసుకుపోతే, ఇక్కడ నా అవసరాలు చూసేవాళ్ళెవర్రా?” అంటూ కోపంతో ఊగిపోతూ అరిచాడాయన.

నా ఆశ్చర్యాన్ని బయటపడనివ్వకుండా, సౌమ్యుడైన మా బాబయ్యలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు, ఈవేళంతా జరిగిన అగమ్యగోచరమైన సంఘటనలకు మరొకటి తోడయినట్టు భావించాను. కోర్ట్ హౌస్ నుంచి నేను తిరుగుమొగం పట్టడంలో హుందాతనం కంటె కంగారే ఎక్కువగా ఉంది.

నేను ఆశ్రమానికి తిరిగి వచ్చేశాను. అక్కడ మా స్నేహితులు నా కోసం ఆశతో ఎదురుచూస్తూ గుమిగూడి ఉన్నారు. గురుదేవుల ధోరణి ఏ మాత్రం అంతుబట్టకపోయినా, తగినంత గుప్తమైన కారణం ఏదో ఉండి ఉంటుందన్న నమ్మకం నాలో పెరుగుతూ వచ్చింది. గురుదేవుల సంకల్పాన్ని ఉల్లంఘించినందుకు నాలో పశ్చాత్తాపం నిండింది.

“ముకుందా, మరి కాసేపు నా దగ్గిర ఉండవా?” అని అడిగారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “రాజేంద్రానూ తక్కినవాళ్ళు వెంటనే బయల్దేరవచ్చు; వాళ్ళు కలకత్తాలో నీ కోసం కనిపెట్టుకుని ఉంటారు. కలకత్తా నుంచి కాశ్మీరుకు సాయంత్రం బయల్దేరే ఆఖరిబండి అందుకోడానికి చాలా వ్యవధి ఉంటుంది.”

“గురుదేవా, మీరు లేకుండా వెళ్ళడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదండి,” అన్నాను దిగులుగా.

నేనన్న మాట రవ్వంత కూడా పట్టించుకోలేదు మా స్నేహితులు. ఒక గుర్రబ్బండి తీసుకువచ్చి సామానంతో వేసుకుని వెళ్ళిపోయారు. నేనూ కనాయీ గురుదేవుల పాదసన్నిధిలో ప్రశాంతంగా కూర్చున్నాం. ఒక్క అరగంటసేపు మౌనం దాల్చిన తరవాత గురుదేవులు లేచి, రెండో అంతస్తు భోజనాల గదివేపు వెళ్ళారు.

“కనాయీ, ముకుందుడికి అన్నం వడ్డించు. అతని బండి కాసేపట్లో బయల్దేరుతుంది.”

నేను కూర్చున్న కంబళి ఆసనంమీంచి లేస్తూ, హఠాత్తుగా వికారం పుట్టి కడుపులో దారుణంగా దేవేస్తూ ఉండడంవల్ల తూలిపోయాను. కత్తితో పొడుస్తున్నట్టుగా కడుపులో తీవ్రంగా పోట్లు రావడంతో, నన్నెవరో దారుణమైన నరకకూపంలోకి హఠాత్తుగా విసిరిపారేసినట్టు అనిపించింది. గుడ్డిగా తడుముకుంటూ వెళ్ళి గురువుగారి ముందు కుప్పగూలిపోయాను. నాలో భయంకరమైన ఏషియాటిక్ కలరా లక్షణాలన్నీ కనిపించాయి. శ్రీయుక్తేశ్వర్‌గారూ, కనాయీ నన్ను, కూర్చునే గదిలోకి మోసుకు వెళ్ళారు.

“గురుదేవా, నా ప్రాణాన్ని మీ ఆధీనం చేస్తున్నాను. అంటూ బాధగా అరిచాను; నా శరీరంలోంచి ప్రాణం తొందరగా పోతున్నట్లు అనిపించడమే దానికి కారణం. శ్రీయుక్తేశ్వర్‌గారు నా తలను తమ ఒళ్ళో పెట్టుకుని దివ్య కారుణ్యంలో నా నుదుటి మీద నిమురుతూ ఇలా అన్నారు:

“చూశావా, ఇప్పుడు నీ స్నేహితులతోబాటు స్టేషనులో ఉండి ఉంటే ఏమయ్యేది? సరిగా ఈ సమయంలో ప్రయాణం పెట్టుకోడం విషయంలో నువ్వు నా నిర్ణయాన్ని శంకించబట్టే విచిత్రమైన ఈ విధంగా నిన్ను ఆదుకోవలసి వచ్చింది,” అన్నారాయన.

చివరికి నేను అర్థం చేసుకున్నాను. మహాపురుషులు తమ శక్తుల్ని బహిరంగంగా ప్రదర్శించడం సముచితం కాదని భావించబట్టే, ఈనాటి సంఘటనల్ని సామాన్య ప్రేక్షకుడు చాలా స్వాభావికంగా పరిగణిస్తాడు. మా గురుదేవుల జోక్యం, కనిపెట్టడానికి వీలులేనంత సూక్ష్మమైనది. ఆయన బిహారిద్వారాను, మా బాబయ్యద్వారాను, రాజేంద్రద్వారాను, తదితరుల ద్వారాను తమ సంకల్పాన్ని అగోచరంగా నెరవేర్చారు. బహుశా నేను మినహా ప్రతి ఒక్కరూ, ఈ సంఘటనల్ని తర్కసంగతంగాను, సామాన్యంగాను భావించారనుకుంటాను.

శ్రీయుక్తేశ్వర్‌గారు సామాజిక కర్తవ్యపాలనలో ఎన్నడూ విఫలురు కానందువల్ల, ఆయన కనాయిని పంపి ఒక డాక్టర్ని పిలిపించి, మా బాబయ్యకి కూడా కబురుచేశారు.

“గురుదేవా, మీరే నాకు నయం చేయ్యగలరు. ఇప్పుడు ఏ డాక్టరు వల్లా నయంకాని పరిస్థితిలో ఉన్నాను,” అన్నాను.

“బాబూ, ఈశ్వరకృప నిన్ను కాపాడుతోంది. డాక్టర్ని గురించి నువ్వేమీ దిగులుపడకు; నిన్నీ పరిస్థితిలో చూడడాయన. నీకు ఇప్పటికే నయమైపోయిందిలే.”

గురుదేవుల పలుకులతో ఆ తీవ్రమైన బాధ విరగడయిపోయింది. నేను లేచి కూర్చున్నాను. త్వరలోనే డాక్టరుగారు వచ్చారు. నన్ను జాగ్రత్తగా పరీక్ష చేశారు.

“నువ్వు చాలా దారుణమయిన బాధ అనుభవించి ఉంటావని అనిపిస్తోంది. ప్రయోగశాలలో పరీక్ష చెయ్యడానికి నేను కొన్ని మచ్చులు తీసుకువెళ్తాను,” అన్నారాయన.

మర్నాడు పొద్దున హడావిడిగా వచ్చారు డాక్టరుగారు. నేను ఉత్సాహంగా లేచి కూర్చున్నా ను.

“బాగుంది, బాగుంది. ప్రాణంమీదికి రానివాడిలాగే, చిరునవ్వు చిందిస్తూ బాతాఖానీ కొడుతున్నావు,” అంటూ నా చేతిమీద తట్టారాయన. “నేను తీసుకు వెళ్ళిన మచ్చులు పరీక్షించి నీకు వచ్చిన జబ్బు ఏషియాటిక్ కలరా అని కనిపెట్టిన తరవాత నిన్ను ప్రాణాలతో చూస్తానని అనుకోలేదు. నువ్వు అదృష్టవంతుడివి నాయనా! రోగనివారణ చేసే దివ్యశక్తులు గల గురువుగారు నీ కున్నారు! ఆ విషయం నాకు రూఢి అయింది!”

నేను మనసారా అంగీకరించాను. ఆ డాక్టరుగారు వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉండగా, రాజేంద్రా, ఆడీ గుమ్మంలో కనిపించారు. గదిలో డాక్టర్నీ, ఒక్కరవ్వ నీరసపడ్డట్టు కనిపిస్తున్న నా ముఖాన్నీ చూసిన తరవాత, వాళ్ళ ముఖాల్లో ఉన్న కోపం కాస్తా సానుభూతిగా మారిపోయింది.

“మన మనుకున్న ప్రకారం నువ్వు కలకత్తా బండికి రాకపోయేసరికి మాకు కోపం వచ్చింది. ఏమైనా జబ్బు చేసిందా?”

“ఔను.” మా స్నేహితులు తెచ్చిన సామాను, నిన్నటి యథా స్థానంలో పెడుతూ ఉంటే నేను నవ్వు ఆపుకోలేక పోయాను.

“బయల్దేరిం దో ఓడ స్పెయిన్‌కు చేరాలని
 తిరిగొచ్చింది వెంటనే అడంగుకు చేరకుండానే!”

అన్న పద్యం [“సింగి అద్దంకి పోనేపోయింది, రానే వచ్చింది” అన్నట్టు] చదివాను.

గురుదేవులు గదిలోకి వచ్చారు. ఖాయిలాచేసి కోలుకుంటున్నవాడు తీసుకునే చొరవతో, ఆయన చెయ్యి ఆప్యాయంగా పట్టేసుకున్నాను.

“గురూజీ, నా పన్నెండో ఏట మొదలు, చాలాసార్లు హిమాలయాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేశాను. కాని సాగలేదు. చివరికి, మీ దీవెనలు లేనిదే పార్వతీదేవి[2] నను చేరనివ్వదని నమ్మకం కుదిరింది!”

  1. అంతకుముందు రెండు వేసంగుల్లోనూ కాశ్మీరు రావడానికి ఇష్టంలేక పోవడానికి కారణం గురుదేవులు చెప్పకపోయినప్పటికీ, అక్కడ తాము జబ్బు పడ్డానికి సమయం ఇంకా ఆసన్నం కాలేదన్న సంగతి ముందుగా ఆయనకు తెలిసి ఉండడమే కావచ్చు.
  2. “పర్వత సంబంధమైనది” అన్నది శబ్దార్థం. పురాణాల్లో, పార్వతీదేవిని హిమాలయ పర్వతరాజు (హిమవంతుడు) కూతురిగా వర్ణించడం జరిగింది. ఆయన నివాసం, టిబెట్టు సరిహద్దులో ఉన్న ఒకానొక శిఖరం. చేరడానికి శక్యంకాని ఆ శిఖరానికి దిగువున సాగే ప్రయాణికులు, దూరంగా మంచుతో ఏర్పడ్డ గుమ్మటాలూ బురుజులతో ఒక పెద్ద రాజప్రసాదం మాదిరిగా కనిపించే మంచు కొండలూ చూసి విస్మయానందభరితులవుతారు.

పార్వతి, కాళి, దుర్గ, ఉమ, తదితర దేవతలు జగన్మాత భిన్న స్వరూపాలు; ఒక్కొక్క ప్రయోజనాన్ని అనుసరించి ఒక్కొక్క నామసంకేతం ఏర్పడింది. దేవుడు లేదా శివుడు తన పరా ప్రకృతి అయిన అతీతస్థితి కారణంగా సృష్టికార్య విషయంలో క్రియారహితుడయి ఉంటాడు. ఆయన తన శక్తి (క్రియాశీల శక్తి)ని తన “సతు”లకు అప్పగించడం జరిగింది; బ్రహ్మాండంలో అనంతమైన వివరాలు అభివ్యక్తమయేటట్టు చేసేవారు. ఈ సృజనాత్మక “నారీ” శక్తులే. హిమాలయాలు శివుడికి నివాసస్థానమని చెబుతాయి పురాణ గాథలు. హిమాలయాల్లో పుట్టిన నదులకు అధిష్ఠాత్రిగా, గంగాదేవి దివినుంచి భువికి దిగింది. అందువల్లే గంగ స్వర్గంనుంచి దిగివచ్చి, “యోగీశ్వరేశ్వరుడు” త్రిమూర్తుల్లో సృష్టి సంహార స్థితికర్త అయిన శివుడి జటాజూటం ద్వారా భూమికి అవతరించిందని కావ్యాల్లో చెబుతారు. “భారతీయులకు షేక్‌స్పియర్” వంటి మహాకవి కాళిదాసు, హిమాలయాల్ని “పరమశివుడి అట్టహాసరూపం”గా అభివర్ణించాడు. ‘ది లెగసీ ఆఫ్ ఇండియా’ (భారతదేశ వారసత్వం; ఆక్స్‌ఫర్డ్స్) అనే గ్రంథంలో ఎఫ్. డబ్ల్యు. థామస్ ఇలా రాస్తాడు: “శివుడి తెల్లటి పలువరసను పాఠకుడు ఎలాగో ఊహించుకోగలగవచ్చు; కాని, అతడు, ఉత్తుంగ శిఖరాయమానమైన పర్వతలోకాన్ని అధిష్టించిన పరమేశ్వర స్వరూపాన్నీ, దివినుంచి దిగివచ్చిన గంగ ఉరకలువేస్తున్న శివజటాజూటాన్నీ, ఆపైనున్న సిగపువ్వు మాదిరి చంద్రబింబాన్ని అనుభూతం చేసుకుంటేనే తప్ప ఆయన్ని సంపూర్ణంగా అవగాహనచేసుకోలేడు.” హిందూ చిత్రకళలో తరచుగా, నల్లటి జింకచర్మం కట్టుకున్నట్టుగా శివుణ్ణి చిత్రిస్తూండడం కద్దు. రాత్రిపూట చీకటికి, అగోచరతకూ అది ప్రతీక. ఆ ‘దిగంబరుడు’ ధరించే ఏకైక వస్త్రం అదే. తనకున్నది ఏదీ లేకుండా, అన్నీ తనవే అయిన ఈశ్వరుడి గౌరవార్థం, శైవశాఖీయుల్లో కొందరు ఒంటిమీద ఏమీ ధరించకుండానే ఉంటారు.

కాశ్మీరులో విలసిల్లిన సాధుకోటిలో, 14వ శతాబ్దిలో జీవించిన లల్లా యోగీశ్వరి ఒకతె. ఆ శివభక్తురాలు దిగంబరి. ఆవిడ సమకాలికుల్లో సంశయాళు వొకడు, ఆవిడ దిగంబరిగా ఉండడానికి కారణమేమిటని అడిగాడు. ‘ఎందుకుండగూడదు? నా కిక్కడ మగవాళ్ళెవళ్ళూ కనిపించడం లేదు,’ అంటూ వాడిగా జవాబిచ్చిందావిడ. కొద్దిగా తీవ్రమైన ఆవిడ ఆలోచనాదృష్టిలో, ఈశ్వరానుభూతి లేనివాడు “మగవాడు” అని అనిపించుకోడానికి అర్హుడు కాదన్నమాట. ఆవిడ క్రియాయోగానికి సన్నిహితమైన యోగవిద్య ఒకటి సాధనచేసింది. ముక్తిని ప్రసాదించడంలో దానికి గల శక్తిని ఆవిడ అనేక పద్యాల్లో ప్రస్తుతించింది... వాటిలో ఒకదాన్ని ఇక్కడ అనువదిస్తాను.

ఏ దుఃఖహాలాహలం తాగలేదు నేను?
చావుపుట్టుకల చక్రగతులెన్నెన్నో నావి.
అహో, అమృతంతో నిండింది నా పాత్ర
శ్వాసప్రక్రియా సాధన ఫలాన్ని పొంది.

ఆవిడ మానవసహజమైన మరణానికి గురికాకుండా, తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసింది. తరవాత, శోకతప్తులైన పురజనుల ముందు బంగారు దుస్తులు ధరించి సజీవంగా ప్రత్యక్షమైంది. చిట్టచివరికి ఒంటినిండా బట్టకట్టుకొని!