ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 19

వికీసోర్స్ నుండి

అధ్యాయం : 19

కలకత్తాలో ఉన్న గురుదేవులు

శ్రీరాంపూర్‌లో కనిపించడం

“నాస్తిక శంకలు నన్ను తరచుగా చుట్టుముడుతుంటాయి. అయినా ఆత్మకు సంభావ్యమైన విషయాల్లో మనం ఇంతవరకు అనుభూతం చేసుకోనివి ఉండే అవకాశం ఉందా లేదా అన్న ఆలోచన అప్పుడప్పుడు తలఎత్తి నన్ను వేధిస్తూ ఉంటుంది. మానవుడు వాటిని కనుక్కోకపోయినట్లయితే తన వాస్తవ భవితవ్యానికి దూరం కాడా?”

ఈ మాటలు అన్నవాడు దిజేన్‌బాబు. ‘పాంథీ’ వసతి గృహంలో అతను నాతోబాటు ఒకే గదిలో ఉండేవాడు. మా గురుదేవుల్ని దర్శించడానికి రమ్మని నేను ఆహ్వానించినప్పుడు అతనన్న మాటలవి.

“శ్రీయుక్తేశ్వర్‌గారు నీకు క్రియాయోగ దీక్ష ఇస్తారు,” అంటూ నేను, “అది, దివ్యమైన అంతరిక విశ్వాసంద్వారా ద్వంద్వప్రకృతివల్ల కలిగే సంక్షోభాన్ని అణచివేస్తుంది.” అన్నాను.

ఆవేళ సాయంత్రం దిజేన్, నాతోబాటు ఆశ్రమానికి వచ్చాడు. గురుదేవుల సన్నిధిలో మా స్నేహితుడికి ఎంత ఆధ్యాత్మిక ప్రశాంతి లభించిందంటే, అప్పటినుంచి అతను తరచుగా ఆశ్రమానికి రావడం మొదలైంది.

నిత్యజీవితంలో చేసుకొంటూ ఉండే చిల్లరమల్లర పనులు, మన గాఢమైన అవసరాల్ని తీర్చలేవు; ఎందువల్లనంటే, మనిషికి సహజంగా జ్ఞానం సంపాదించాలన్న తృష్ణ కూడా ఉంటుంది. శ్రీయుక్తేశ్వర్‌గారి మాటలవల్ల దిజేన్‌కు, అశాశ్వతమైన జన్మలో ఉన్న క్షుద్రమైన అహంకారం కన్న మరింత సత్యమైన ఆత్మను తనలో అన్వేషించాలన్న ప్రేరణ కలిగింది.

నేనూ దిజేన్, ఇద్దరమూ శ్రీరాంపూర్ కాలేజిలో బి. ఏ. కోర్సు చదువుతున్నందువల్ల క్లాసులు అయిపోయిన వెంటనే ఆశ్రమానికి నడుచుకుంటూ కలిసివెళ్ళే అలవాటు అయింది మాకు. మేము ఆశ్రమానికి దగ్గర పడుతూ ఉండగా శ్రీయుక్తేశ్వర్‌గారు ఆశ్రమం రెండో అంతస్తు బాల్కనీలో నిలబడి చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండడం తరచు చూసే వాళ్ళం.

ఒకనాడు మధ్యాహ్నం మేము గుమ్మంలోకి వెళ్ళేటప్పటికి, ఆశ్రమవాసుల్లో కనాయి అనే విద్యార్థి మాకు ఎదురుపడి, నిరుత్సాహం కలిగించే వార్త చెప్పాడు.

“గురుదేవులు ఇక్కడ లేరు; అర్జంటుగా కలకత్తా రమ్మని కబురొచ్చింది.”

మర్నాడు గురుదేవుల దగ్గర్నించి నాకో పోస్టుకార్డు వచ్చింది. “నేను బుధవారం పొద్దున కలకత్తాలో బయల్దేరుతున్నాను. నువ్వూ దిజేనూ పొద్దున తొమ్మిది గంటల బండికి శ్రీరాంపూర్ స్టేషన్‌కి వచ్చి కలుసుకోండి,” అని రాశారు.

బుధవారం పొద్దున సుమారు ఎనిమిదిన్నరకు శ్రీయుక్తేశ్వర్‌గారి దగ్గర్నించి మానసిక సందేశం ఒకటి నా మనస్సులో పదేపదే మెరిసింది; “నా కిక్కడ ఆలస్యమయింది; తొమ్మిదిగంటల బండికి రాకండి.” అప్పటికే బయల్దేరడానికి బట్టలు వేసుకుని సిద్ధంగా ఉన్న దిజేన్‌కు ఈ తాజా కబురు చెప్పాను.

“నువ్వూ నీ అంతఃప్రేరణా!” అంటున్న మా స్నేహితుడి గొంతులో కొద్దిగా చీదరింపు ధ్వనించింది. “గురువుగారు రాసిందాన్నే నమ్ముతాను నేను.”

నేను భుజాలు ఎగరేసి నిశ్చింతగా కూర్చున్నాను. దిజేన్ కోపంగా గొణుక్కుంటూ గుమ్మందాటి దభీమని తలుపు వేశాడు.

గది కొద్దిగా చీకటిగా ఉండడంవల్ల నేను వీధివేపు కిటికీకి దగ్గరగా జరిగాను. కిటికీలోంచి వస్తున్న కొద్దిపాటి సూర్యకాంతీ హఠాత్తుగా పెరిగిపోయి తీక్ష్ణంగా ప్రకాశించింది; కిటికీ ఇనప చువ్వలు పూర్తిగా మాయమైపోయాయి. మిరుమిట్లు గొలుపుతున్న ఈ నేపథ్యంలో, శ్రీయుక్తేశ్వర్ గారి భౌతికరూపం స్పష్టంగా ప్రత్యక్షమైంది!

ఆశ్చర్యంతో అదిరిపడి, కూర్చున్న కుర్చీలోంచి లేచి ఆయన ముందు మోకరిల్లాను. సాంప్రదాయిక పద్ధతిలో నేను, గురుదేవుల పాదాలకు గౌరవపురస్సరంగా నమస్కరిస్తూ ఆయన పాదరక్షలు ముట్టుకున్నాను. ఈ జత నాకు తెలిసినదే; కాషాయంరంగు అద్దిన కేన్వాసుతో చేసినది; దాని అడుగుభాగం తాళ్ళతో చేసింది. ఆయన వేసుకున్న కాషాయంరంగు బట్ట నా ఒంటికి రాసుకుంది. ఆ బట్ట స్పర్శ మాత్రమే కాకుండా, ఆయన బూట్లమీది గరుకుదనం, వాటిలో ఆయన కాలివేళ్ళ ఒత్తిడి కూడా స్పష్టంగా నా చేతులకు తగిలింది. ఒక్క మాట నోట పెగలడానికి కూడా వీలుకానంతగా కొయ్యబారి, లేచి నించుని ప్రశ్నార్థకంగా ఆయనవేపు తేరిపారి చూశాను.

“నువ్వు నా మానసిక సందేశం అందుకున్నందుకు సంతోషిం చాను.” గురుదేవుల కంఠస్వరం ప్రశాంతంగా, చాలా స్వాభావికంగా ఉంది. “ఇప్పుడు కలకత్తాలో నా పని పూర్తి అయింది; పదిగంటల బండిలో శ్రీరాంపూర్‌లో దిగుతాను,” అన్నాడు.

నే నింకా మూగబోయి తేరిపారిచూస్తుంటే, శ్రీయుక్తేశ్వర్‌గారు ఇంకా ఇలా అన్నారు: “ఇది నా ఛాయారూపం కాదు; నా రక్త మాంసాలతో నిండి ఉన్న నిజరూపం. లోకంలో చాలా అరుదైన ఈ అనుభవం నీకు కలిగించమని ఈశ్వరాజ్ఞ. నన్ను స్టేషన్‌లో కలుసుకో; ఇప్పుడు నేను వేసుకున్న దుస్తుల్లోనే మీకు ఎదురురావడం, నువ్వూ దిజేనూ చూస్తారు. నా ముందుండే తోటి ప్రయాణికుడు - వెండి మరచెంబు పట్టుకువచ్చే చిన్న కుర్రవాడు.”

మా గురుదేవులు మర్మర స్వరంతో దీవిస్తూ నా తలమీద రెండు చేతులు పెట్టారు. “తబే ఆసి”,[1] అన్న మాటలలో ఆయన ముగిస్తూ ఉండగా, చిత్రమైన ఒక దుర్మరధ్వని విన్నాను.[2] ఆయన శరీరం క్రమంగా మిరుమిట్లు గొలిపే కాంతిలో కరిగిపోవడం మొదలయింది. చుట్ట చుడుతున్న ఒక కాయితంలాగ, మొదట ఆయన పాదాలూ, కాళ్ళూ అదృశ్యమయాయి; ఆ తరవాత మొండెమూ, తలా. ఆయన నా జుట్టు మీద సుతారంగా ఉంచిన వేళ్ళ స్పర్శ చిట్టచివరిదాకా నాకు తెలుస్తూనే ఉంది. ఆ ఉజ్జ్వలకాంతి కరిగిపోయింది; నా ఎదురుగా చువ్వల కిటికీ, పలచని ఎండపొడా మినహా మరేమీ మిగలలేదు.

ఒకవేళ నేను భ్రమకు గురికాలేదు కదా, అని వితర్కించుకుంటూ సగం మగతలో ఉండిపోయాను. కాసేపట్లో, ముఖం వేలాడేసుకుని, దిజేన్ గదిలోకీ చక్కా వచ్చాడు.

“గురువుగారు తొమ్మిదిగంటల బండిలోనూ రాలేదు, తొమ్మిదిన్నర బండిలోనూ రాలేదు,” అంటూ మా స్నేహితుడు, ముఖం కొంచెం చిన్నబుచ్చుకుని చెప్పాడు.

“రా! ఆయన పదిగంటల బండిలో వస్తారని నాకు తెలుసు,” అంటూ నేను దిజేన్ చెయ్యి పుచ్చుకుని, రానని ఎంత మొరాయించినా పట్టించుకోకుండా, నాతో లాక్కెళ్ళాను. పదినిమిషాల్లో స్టేషన్‌లో అడుగు పెట్టాం; అప్పుడే బండి వచ్చి ఆగబోతోంది.

“బండి మొత్తమంతా గురుదేవుల దివ్యప్రభతో నిండిపోయింది! అరుగో, అక్కడున్నారు!” అంటూ ఆనందంగా గొంతెత్తి పలికాను.

“నువ్వలా కలగంటున్నావు!” దిజేన్ వెటకారంగా నవ్వాడు.

“మన మిక్కడే కాసుకొని ఉందాం.” మా గురుదేవులు అక్కడికి ఎలా వస్తారో, ఆ వివరాలన్నీ మా స్నేహితుడికి చెప్పాను. నా వర్ణన పూర్తిచేసేసరికి, శ్రీయుక్తేశ్వర్‌గారు కంటబడ్డారు; కొద్దిసేపటి క్రితం నేను చూసిన బట్టలే వేసుకొని ఉన్నారు. వెండి మరచెంబు పట్టుకొని వస్తున్న ఒక చిన్న కుర్రవాడి వెనకాల మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు.

నా కళ్ళను నేను నమ్మలేనంత విచిత్రమైన ఈ అనుభవంతో, ఒక్క క్షణం సేపు నాలో భయం పట్టుకుంది. భౌతిక వాదంతో నిండిన ఇరవయ్యో శతాబ్దం నాకు దూరమై దిగజారిపోతున్నట్టు అనిపించింది;అలనాడు ఏసుక్రీస్తు సముద్రం మీద పీటర్‌కు ప్రత్యక్షమైన సనాతన కాలంలోకి నేను తిరిగి వెళ్ళిపోతున్నానా అనిపించింది. ఆధునిక యోగి - క్రీస్తు శ్రీయుక్తేశ్వర్ గారు, దిజేనూ నేనూ నోట మాటలేకుండా నిలబడి ఉన్న చోటికి వస్తూ, మా స్నేహితుడి వేపు చూసి చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నారు:

“నీక్కూడా ఒక వర్తమానం పంపాను; కాని నువ్వు దాన్ని గ్రహించుకోలేకపోయావు.”

దిజేన్ మౌనం వహించాడు; కాని నావేపు అనుమానంగా, వాడిగా చూశాడు. మేము గురుదేవుల్ని ఆశ్రమందాకా దిగబెట్టిన తరవాత నేనూ మా స్నేహితుడు శ్రీరాంపూర్ కాలేజికి వెళ్ళిపోయాం. దిజేన్ వీధిలో ఆగిపోయాడు; అతనిలో అణువణువు నుంచీ నామీద ద్వేషం పెల్లుబుకుతోంది.

“అయితే, గురువుగారు నాకు వర్తమానం పంపారు! అయినా నువ్వు దాన్ని దాచిపెట్టావు! దీనికి నువ్వు సంజాయిషీ చెప్పుకోవాలి!”

“నీ మనస్సనే అద్దం, గురుదేవుల సూచనల్ని నువ్వు గ్రహించ లేనంత చంచలంగా ఊగిసలాడుతూంటే నే నేమైనా చెయ్యగలనా?" అంటూ ఎదురు ప్రశ్న వేశాను.

దిజేన్ మొహంలో కోపం ఎగిరిపోయింది. “నువ్వు చెప్పేది అర్థమైంది,” అంటూ పశ్చాత్తాపంతో అన్నాడు. “కాని, దయతలిచి ఒక్క సంగతి వివరంగా చెప్పు; వెండి చెంబు పట్టుకొచ్చిన కుర్రాడి సంగతి నీకు ఎలా తెలిసింది?”

ఆరోజు పొద్దున బోర్డింగ్ హౌస్‌లో గురుదేవులు అద్భుతంగా ప్రత్యక్షమైన విషయం మా స్నేహితుడికి చెప్పాను; నేను ఆ కథ పూర్తి చేసేసరికి శ్రీరాంపూర్ కాలేజి వచ్చేసింది.

“మన గురువుగారి శక్తుల్ని గురించి నే నిప్పుడు విన్న వృత్తాం తాన్ని బట్టి చూస్తే , ప్రపంచంలో ఏ యూనివర్సిటీ అయినా ఒట్టి చిన్న పిల్లకాయల బడే అనిపిస్తోంది,”[3] అన్నాడు దిజేన్ .

  1. “వెళ్ళొస్తా” నని బెంగాలీలో చెప్పే తీరు. దీనికి వాఖ్యార్థం, “అప్పటికి వస్తా” నని; ఇందులో ఆశావహమైన వైరుధ్యం ఉంది.
  2. శరీర కోశాణువులు విఘటనం చెందినప్పుడు వచ్చే విలక్షణమైన శబ్దం.
  3. “నే నింతవరకు రాసిందంతా గడ్డిపరకకన్న విలువైందేమీ కాదని నాకు వెల్లడి అయిన విషయాలు తెలియబరిచాయి,” అన్నాడు. “ప్రిన్స్ ఆఫ్ స్కొలాస్టిక్స్" (తత్త్వశాస్త్రాధిపతి) గా ప్రసిద్ధులైన సెంట్ థామస్ ఎర్వనాస్. ‘సమ్మా థియొలాజియే’ అన్న గ్రంథం పూర్తి చెయ్యమంటూ తన అంతరంగిక కార్యదర్శి, మనసుపడుతూ చేసిన విన్నపాలకు ఆయన ఇచ్చిన సమాధానమిది.

1273 లో ఒకనాడు నేపుల్స్ చర్చిలో సామూహిక ప్రార్థన జరుగుతూ ఉండగా, సెంట్ థామస్‌కు గాఢమైన ఆత్మజ్ఞానం అనుభూతమైంది. ఆ దివ్యజ్ఞాన మహిమ ఆయన్ని ఎంత ఆనందభరితుణ్ణి చేసిందంటే, అప్పటినుంచి ఆయన బౌద్ధికమైన తర్కవితర్కాలమీది ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు.

ఇలాగే సోక్రటీస్ (ప్లేటో ‘ఫేడ్రన్’లో) మాటలు గమనించండి: “నా మట్టుకు నాకు తెలిసిందల్లా, నా కేమీ తెలియదనే.”