ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 18

వికీసోర్స్ నుండి

అధ్యాయం : 18

ముస్లిం గారడివాడు

‘కొన్నేళ్ళ క్రితం, నువ్విప్పుడుంటున్న ఈ గదిలోనే ఒక ముస్లిం గారడివాడు నా ఎదుట నాలుగు అలౌకిక ఘటనలు ప్రదర్శించాడు!’

మా గురుదేవులు శ్రీయుక్తేశ్వర్‌గారు మొట్ట మొదటిసారి నా కొత్త బసకు వచ్చినప్పుడు చెప్పిన సంగతి ఇది. శ్రీరాంపూర్ కాలేజీలో చేరీ చేరగానే నేను దగ్గరలో ఉన్న ‘పాంథీ’[1] అనే వసతిగృహంలో ఒక గది తీసుకున్నాను. అది పాతకాలపు పద్ధతిలో కట్టిన ఇటిక కట్టుబడి భవనం; గంగానదికి అభిముఖంగా ఉంది.

“గురుదేవా, ఎంత చిత్రంగా కలిసింది! కొత్తగా అలంకారాలు దిద్దుకున్న ఈ గోడలు పాత జ్ఞాపకాలతో అంత ప్రాచీనమైనవా?” కొద్దిపాటి ఉపకరణ సామగ్రితో సాదాగా ఏర్పాటయి ఉన్న నా గది చుట్టూ, కొత్తగా రేకెత్తిన ఆసక్తితో కలయజూశాను.

“అది చాలా పెద్దకథ.” అంటూ పాత జ్ఞాపకాలతో చిరునవ్వు నవ్వారు గురుదేవులు. ఆ ఫకీరు[2] పేరు అఫ్జల్ ఖాను. అనుకోకుండా తారస పడ్డ ఒక హిందూ యోగి ద్వారా అసాధారణమైన శక్తులు సంపాదించా డతను.

“ ‘నాయనా, దాహంగా ఉంది; కాసిని మంచినీళ్ళు తెచ్చి పెట్టు.’ దుమ్ముకొట్టుకుపోయి ఉన్న ఓ సన్యాసి ఒకనాడు అప్జల్‌ను ఇలా కోరాడు. తూర్పు బెంగాలులో ఒక కుగ్రామంలో జరిగిందిది. అప్పటికి అప్జల్ చిన్న కుర్రవాడు.

“ ‘స్వామీ, నేను ముస్లిమును. మీరు హిందువులై ఉండి, నా చేత్తో ఇచ్చే నీళ్ళు ఎలా తాగుతారు?’ ”

“ ‘నీ సత్యసంధత నన్ను ముగ్ధుణ్ణి చేస్తోంది నాయనా! అంటరాని తనం లాంటి పాపిష్ఠి సంకుచిత నియమాల్ని నేను పాటించను. వెళ్ళు, తొందరగా నీళ్ళు తీసుకురా.’ ”

“అప్జల్ భక్తి శ్రద్ధలకు ఆ యోగి వాత్సల్య దృక్కులు కానుక లయాయి.

“ ‘వెనకటి జన్మల్లో నువ్వు సత్కర్మలు చేశావు.’ అన్నాడాయన గంభీరంగా. ‘నీకు నే నొక యోగప్రక్రియ నేర్పుతాను. దాని ద్వారా నీకు, అగోచర మండలాల్లో ఒకదాని మీద అధికారం చిక్కుతుంది. ఆ మహత్తర శక్తుల్ని నువ్వు సదుద్దేశ్యాలకే వినియోగించాలి, స్వార్థ బుద్ధితో మాత్రం ఎన్నడూ వినియోగించకు సుమా! విచారకరమైన విషయం ఒకటి ఏమిటంటే, పూర్వజన్మల నుంచి నువ్వు విధ్వంసక ధోరణులనే విత్తనాలు కొన్ని వెంట తెచ్చుకున్నావు. సరికొత్త పాడు పనులనే నీళ్ళు పోసి ఆ విత్తనాలు మొలకెత్తేలా మాత్రం చెయ్యకు. జటిలమైన నీ పూర్వకర్మానుసారంగా, నువ్వీ జన్మలో యోగసాధన ఫలితాల్ని శ్రేష్ఠమైన మానవాభ్యుదయ లక్ష్యాలకే వినియోగించవలసి ఉంది.’ “బిత్తరపోయిన ఆ కుర్రవాడికి జటిలమైన యోగప్రక్రియ ఒకటి ఉపదేశించి, ఆ గురువు అంతర్ధానమయాడు.”

“అఫ్జల్ ఇరవై ఏళ్ళపాటు ఆ యోగప్రక్రియను చిత్తశుద్ధితో సాధన చేశాడు. అతని అద్భుత చర్యలు ఎక్కడెక్కడివాళ్ళనీ ఆకర్షించడం మొదలు పెట్టాయి. అతని వెంట ఎప్పుడూ ఒక అశరీరాత్మ తోడు ఉండేదనుకుంటాను. దాన్ని అతను ‘హజరత్’ అని పిలిచేవాడు. ఈ అశరీరాత్మ అతను కోరిన ఏ చిన్న కోరికనయినా సరే నెరవేరుస్తూ ఉండేది.

“గురువు చేసిన హెచ్చరికను విస్మరించి, అఫ్జల్ తన శక్తుల్ని దుర్వినియోగం చెయ్యడం ప్రారంభించాడు. అతడు ఏ వస్తువునయినా ఒకసారి ముట్టుకుని మళ్ళీ అక్కడ పెట్టేస్తే చాలు, కాసేపట్లో ఆ వస్తువు అయిపులేకుండా అదృశ్యమయిపోయేది. జనాన్ని గాభరాపెట్టే ఈ పర్యవసానం వల్ల అతను ప్రతి చోటికీ, రాకూడని అతిథి అయాడు!

“అతను కలకత్తాలో పెద్ద పెద్ద నగల దుకాణాలకు అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడు , ఏదో కొనడానికి వచ్చినవాడిలా కనిపించేవాడు, అతను ఏదైనా ఒక నగ పట్టుకున్నాడంటే, అతను దుకాణంలోంచి బయటికి రాగానే ఆ నగ మాయమయిపోయేది.

“అఫ్జల్ వెంట తరచుగా వందలకొద్దీ విద్యార్థులు చుట్టుముట్టి ఉండేవారు. అతని రహస్యాలేవయినా నేర్చుకోవచ్చునన్న ఆశ వాళ్ళని అలా ఆకర్షించేది. అప్పుడప్పుడా ఫకీరు, వాళ్ళని తనతోపాటు ప్రయాణానికి రమ్మని పిలుస్తుండేవాడు. రైల్వే స్టేషనులో ఎలాగో ఒక టిక్కెట్ల బొత్తి ముట్టుకొనే అవకాశం కల్పించుకునేవాడు. దాన్ని మళ్ళీ గుమాస్తా దగ్గరికి నెట్టేసి, ‘నా మనస్సు మార్చుకున్నాను. అవి ఇప్పుడు కొనను’ అనే వాడు. కాని అఫ్జల్ సపరివారంగా బండి ఎక్కగానే కావలసిన టిక్కెట్లు అతనికి చిక్కేవి.[3]

“ఈ దోపిడీలవల్ల క్రోధావేశాలు చెలరేగేవి; బెంగాలీ నగల వ్యాపారులూ, టిక్కెట్ల అమ్మకందార్లూ గుండె పగిలి బేజారెత్తిపోయేవారు! అఫ్జల్‌ను అరెస్టు చెయ్యాలని చూసిన పోలీసులు కూడా నిస్సహాయులయారు; తన నేరం పట్టుబడే సాక్ష్యాధారం ఏదైనా ఉంటే, ‘హజరత్, దీన్ని తీసెయ్’ అని అఫ్జల్ అంటే చాలు, అది కాస్తా అదృశ్యమయి పోయేది.”

శ్రీయుక్తేశ్వర్‌గారు తమ ఆసనం మీదనుంచి లేచి, గంగానదికి ఎదురుగా ఉన్న నా గది బాల్కనీలోకి నడిచారు. అంతమందిని గాభరా పెట్టిన ఆ ముస్లిం ఫకీరునుగురించి ఇంకా వినాలన్న కుతూహలంతో నేను కూడా ఆయన వెనకాల వెళ్ళాను.

“ఈ పాంథీ భవనం ఒకప్పుడు మా స్నేహితుడిది. అప్జల్ తో అతనికి పరిచయమైంది. ఒకసారి ఇక్కడికి తీసుకువచ్చాడు. మా స్నేహతుడు నాతోబాటు మరో ఇరవై మంది ఇరుగుపొరుగువాళ్ళని రమ్మని పిలిచాడు. నే నప్పుడు బాగా కుర్రవాణ్ణి. ఆ ఫకీరు చేసే అద్భుతచర్యలు చూడాలని ఆసక్తి కలిగింది.” గురుదేవులు నవ్వారు. “నేను విలువైనదేదీ ఒంటిమీద లేకుండా ముందే జాగ్రత్త పడ్డాను! అఫ్జల్ నావేపు కుతూహలంగా చూశాడు. ఆ తరవాత ఇలా అన్నాడు:

“ ‘నీ చేతులు మంచి బలంగా ఉన్నాయి. మెట్లు దిగి తోటలోకి వెళ్ళు; అక్కడో నున్నటిరాయి తీసుకుని, దానిమీద సుద్దముక్కతో నీ పేరు రాయి, తరవాత దాన్ని నీ సత్తువకొద్దీ గంగలోకి దూరంగా విసిరెయ్యి.’ ”

“అలాగే చేశాను. ఆ రాయి, దూరంగా ఉన్న నీటి అలల్లో అదృశ్యమయిన తరవాత, ఆ ముస్లిం మళ్ళీ ఇలా చెప్పాడు:”

“ ‘ఈ ఇంటి ముంగిలి దగ్గర ఒక కుండనిండా గంగాజలం పొయ్యి.’ ”

“నేను నీళ్ళకుండతో తిరిగి వచ్చిన తరవాత ఆ ఫకీరు, ‘హజరత్, ఆ రాతిని ఈ కుండలో పెట్టు!’ అన్నాడు.”

‘‘వెంటనే రాయి కనిపించింది. దాన్ని పైకి తీశాను. దానిమీద నా సంతకం, నేను రాసినప్పుడు ఎంత స్పష్టంగా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది.

“గదిలో ఉన్న వాళ్ళలో బాబు[4] అని నా స్నేహితుడొకడు ఉన్నాడు. అతను బరువైన పాతకాలపు బంగారపు గడియారం గొలుసుతో సహా చేతికి పెట్టుకొని ఉన్నాడు. ఫకీరు వాటిని వాపిరిగొట్టులా తడిమిచూశాడు. అంతే; చటుక్కున అవి మాయమయాయి!”

బాబుకు కళ్ళనీళ్ళ పర్యంతం అయింది. “అఫ్జల్, దయచేసి మా పెద్దలనాటి అమూల్య వస్తువు మళ్ళీ నాకు తిరిగి ఇచ్చెయ్యి!”

“ఆ ముస్లిం కొంచెంసేపు ఉలుకూ పలుకూ లేకుండా కూర్చున్నాడు. ఆ తరవాత అన్నాడు: ‘ఇనప్పెట్టెలో నీకు ఐదువందల రూపాయలు ఉన్నాయి. అవి తెచ్చి నా కియ్యి; నీ గడియారం ఎక్కడ దొరుకుతుందో అప్పుడు చెబుతాను.’ ” “వెంటనే బాబు వెర్రెత్తినవాడిలా ఇంటికి పరిగెత్తాడు. కాసేపట్లో తిరిగివచ్చి అఫ్జల్‌కు కావలసిన డబ్బు చేతిలో పెట్టాడు.”

“ ‘మీ ఇంటి దగ్గరున్న చిన్నవంతెన దగ్గరికి వెళ్ళు,’ అని పురమాయించాడు ఫకీరు. ‘హజరత్‌ను పిలిచి, గడియారమూ గొలుసూ తెచ్చి ఇమ్మని అడుగు.”

“బాబు అక్కణ్ణించి ఉరికాడు. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం, ఒంటిమీద విలువైన వస్తువేది లేకుండా నిశ్చింతగా నవ్వుకుంటూ వచ్చాడు.”

“ ‘చెప్పిన ప్రకారం నేను హజరత్‌ను పిలిచాను’ అని చెప్పాడతను. ‘నా గడియారం గాలిలో దొర్లుకుంటూ వచ్చి నా కుడి చేతిలో పడింది! మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ కలుసుకోడానికి వచ్చేముందు దాన్ని ఇనప్పెట్టెలో పెట్టి తాళంవేసి మరీ వచ్చాను!’ ”

“గడియారానికి బదులుగా జబర్దస్తీగా డబ్బు వసూలు చేసుకున్న ఈ సుఖాంత - విషాదాంత నాటకానికి సాక్షులైన బాబు స్నేహితులు, అఫ్జల్‌ను చీదరించుకుంటూ చూశారు. అప్పుడతను బుజ్జగింపు ధోరణిలో ఇలా అన్నాడు:

“ ‘మీకు కావలసిన పానీయం ఏదైనా ఒకటి చెప్పండి; హజరత్ దాన్ని తెచ్చి ఇస్తాడు.”

“కొందరు పాలు అడిగారు, తక్కినవాళ్ళు పళ్ళరసాలు అడిగారు. డీలాపడ్డ బాబు, విస్కీ కావాలని అడిగినప్పుడు నేను ఏమంత ఆశ్చర్య పోలేదు! ఫకీరు వెంటనే పురమాయింపు చేశాడు. ఆజ్ఞాబద్ధుడైన హజరత్, సీలువేసిన పెట్టెల్ని వెంటనే దిగుమతి చేశాడు; అవి కిందికి దిగివచ్చి దబ్బున నేలకు తగిలాయి. ప్రతి ఒక్కరికీ తమకు కావలసిన పానీయం దొరికింది. “నాలుగో అద్భుత ప్రదర్శనావకాశం మా ఆతిథేయికి ఆహ్లాదం కలిగించిందనడంలో సందేహం లేదు; అఫ్జల్ అప్పటికప్పుడు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చెయ్యడానికి సంసిద్ధత ప్రకటించాడు!”

“ ‘చాలా ఖరీదైన వంటకాలు పురమాయిద్దాం,’ అన్నాడు బాబు, దిగులుగా. ‘నా ఐదువందల రూపాయలకీ సరిపోయేటట్టు అనేక రకాల వంటకాలు కావాలి. ప్రతి పదార్థం బంగారపు పళ్ళాల్లో వడ్డించాలి!’

‘ప్రతివాడూ తనకు కావలసినవేవో చెప్పగానే ఆ ఫకీరు హజరత్‌ను మళ్ళీ పిలిచాడు. గలగలా చప్పుడు మొదలయింది; బంగారపు పళ్ళాలు శూన్యంలోంచి మా కాళ్ళ దగ్గిరికి దిగివచ్చాయి. వాటినిండా, రకరకాల దినుసులతో జాగ్రత్తగా వండిన కూరలు, వేడివేడి రొట్టెలు (లూచీలు), ఆ ఋతువులో ఎక్కడా కనిపించని రకరకాల పళ్ళు అమిర్చి ఉన్నాయి. పదార్థాలన్నీ మంచి రుచిగా ఉన్నాయి. ఒక గంటసేపు తృప్తిగా విందు ఆరగించిన తరవాత మేము గదిలోంచి బయటికి రావడం మొదలు పెట్టాం. పళ్ళాలు దొంతర పెడుతున్నట్లుగా బ్రహ్మాండమైన చప్పుడు వినిపించడంతో మేము వెనక్కి తిరిగి చూశాం. తళతళడాడే బంగారపు పళ్ళాల జాడ కూడా లేదక్కడ; ఎంగిళ్ళు కూడా లేవు.”

“గురుదేవా,” అంటూ, ఆయన మాటకి అడ్డు తగిలాను. “ఆ అఫ్జల్, బంగారపు పళ్ళాలవంటి వస్తువులు అంత సులువుగా సంపాదించ గలిగినప్పుడు పరాయివాళ్ళ ఆస్తికోసం వెంపర్లాడడం ఎందుకండి?”

“ఆ ఫకీరు ఆధ్యాత్మికంగా ఎక్కువ అభివృద్ధి సాధించలేదు.” అంటూ వివరించారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “ఒకానొక యోగప్రక్రియ వల్ల అతనికి ఒక సూక్ష్మమండలంలోకి ప్రవేశం కలిగింది. అందులో ఏ కోరిక అయినా తక్షణం నెరవేరుతుంది. హజరత్ అనే ఒక సూక్ష్మ మండల జీవి సహాయంతో అతడు, బలిష్ఠమైన తన సంకల్పశక్తితో చేసే ఒకానొక చర్యవల్ల ఆకాశశక్తి (ఈథరిక్ ఎనర్జీ) నుంచి ఏ వస్తువుకు సంబంధించిన అణువుల నయినా సరే ఆకర్షించగలిగేవాడు. అయితే ఆ విధంగా సూక్ష్మశక్తి తో రూపొందించిన వస్తువులు నిర్మాణపరంగా క్షణభంగురమైనవి; వాటిని అట్టేకాలం నిలిపి ఉంచలేము.[5] అఫ్జల్ అప్పటికీ లౌకిక సంపదకోసం వెంపరలాడేవాడు; ఎంతో కష్టపడి సంపాదించవలసి వచ్చినా, ఎక్కువగా భరోసా పెట్టుకోదగినంత మన్నిక ఉన్నదది.

నేను నవ్వాను. “అది కూడా ఎప్పుడో, తెలియరాకుండానే మాయమవుతుంది లెండి!”

“అఫ్జల్ దైవసాక్షాత్కారం పొందినవాడు కాడు.” గురుదేవులు ఇంకా చెప్పారు. “చిరస్థాయిగాను, శ్రేయస్కరంగాను ఉండే అలౌకిక అద్భుత చర్యలు నిజమైన సాధువులే చెయ్యగలరు. వారు, సర్వశక్తి సంపన్నుడైన సృష్టికర్తతో ఐక్యానుసంధానం పొంది ఉండడమే దానికి కారణం. అఫ్జల్ చాలా మామూలు మనిషి; కాని మర్త్యులైన మానవులు సాధారణంగా చనిపోయిన తరువాత కాని ప్రవేశించలేని సూక్ష్మ మండలంలోకి చొచ్చుకుపోయే అసాధారణ శక్తి మాత్రం అతనికి ఉంది.”

“పరలోకానికి, మనల్ని ఆకట్టుకొనే లక్షణాలు కొన్ని ఉన్నాయన్న సంగతి ఇప్పుడు అర్థమవుతోంది. గురుదేవా!”

గురుదేవులు అంగీకరించారు. “ఆనాటి తరవాత మరెన్నడూ అఫ్జల్ ని నేను చూడలేదు. కాని కొన్నేళ్ళకి బాబు మా ఇంటికి వచ్చాడు. ఆ ముస్లిం తన తప్పు ఒప్పుకొంటూ చేసిన బహిరంగ ప్రకటన ఒక పత్రికలో అచ్చయింది; నాకది చూపిద్దామని తీసుకువచ్చాడు. అఫ్జల్ చిన్నతనంలో ఒక హిందూ గురువుదగ్గర ఉపదేశం పొందాడని చెప్పానే, ఆ విషయాలు దాంట్లోనే తెలిశాయి.

ఆ పత్రికాప్రకటనలో చివరి భాగం సారాంశం, శ్రీయుక్తేశ్వర్ గారికి గుర్తుకు వచ్చిన ప్రకారం ఇలా ఉంది: "అఫ్జల్‌ఖాన్ అనే నేను, పశ్చాత్తాప ప్రకటనగానూ, అలౌకికమైన అద్భుత చర్యలు చేసే శక్తులు సంపాదించాలని చూసేవాళ్ళకి ఒక హెచ్చరికగానూ ఈ ముక్కలు రాస్తున్నాను. దేవుడి దయవల్లా, మా గురుదేవుల దయవల్లా నాకు సంక్రమించిన అద్భుత శక్తుల్ని చాలా ఏళ్ళపాటు నేను దుర్వినియోగం చేస్తూ వచ్చాను. అహంకారంతో మదించాను; సాధారణ నీతినియమాలకు నేను అతీతుణ్ణని భావించాను, కాని చివరికి నా అంతిమ న్యాయనిర్ధారణ రోజు దగ్గరపడింది.

“ఈమధ్య కలకత్తా అవతల ఒక రోడ్డుమీద ఒక ముసలాయన తారసపడ్డాడు. ఆయన బాధగా కుంటుతూ నడుస్తున్నాడు; ఆయన చేతిలో బంగారంలాంటి దేదో మిలమిలా మెరుస్తోంది. నా మనస్సులో లోభం తల ఎత్తింది; ఆయనతో ఇలా అన్నాను:

“ ‘నేను అఫ్జల్‌ఖాన్ అనే గొప్ప ఫకీర్ని. నీ చేతిలో ఉన్నదేమిటి?’ ”

“నాకున్న వస్తుసంపద అల్లా ఈ బంగారం గుండు ఒక్కటే; ఇది ఫకీరు కెందుకూ పనికి రాదు. అయ్యా, నా కుంటితనం పోగొట్టమని మిమ్మల్ని వేడుకుంటున్నాను.’ ”

“నేను ఆ గుండు తాకి, జవాబు చెప్పకుండా వెళ్ళిపోయాను. ఆ ముసలాయన కుంటుకుంటూ నా వెంట పడ్డాడు. కాసేపట్లో, ‘నా బంగారం పోయింది బాబోయ్!’ అంటూ అరవడం మొదలు పెట్టాడు. “నే నదేమీ పట్టించుకోకపోవడంవల్ల, ఆయన హఠాత్తుగా గట్టిగా ఉరిమాడు; దుర్బల శరీరుడు అంత గట్టిగా అరవడం విడ్డూరమే అనిపించింది.”

“ ‘గుర్తు పట్టలేదా నన్ను?’ ”

“నోట మాటలేకుండా నిలబడిపోయాను. దుర్బలుడైన ఈ ముసలి కుంటివాడు, చాలా చాలా సంవత్సరాల కిందట నాకు యోగవిద్య ఉపదేశించిన మహాయోగే కాని మరొకడు కాడని, తరుణం మించిపోయాక గుర్తించినందుకు నిశ్చేష్టుణ్ణి అయాను. ఆయన నిటారుగా నిలబడ్డారు. తక్షణమే ఆయన శరీరం మంచి దృఢంగా, పడుచుతనంతో నిండినట్టు పొడగట్టింది.

“నా గురుదేవుల చూపులు నిప్పులు కక్కుతున్నాయి. ‘నువ్వు నీ శక్తుల్ని పీడిత ప్రజలకు సాయపడ్డానికి కాకుండా, మామూలు దొంగలా వాటిమీద బతుకుతూ దుర్వినియోగం చెయ్యడం నా కళ్ళతోనే చూశాను! ఇక నీ శక్తులన్నిటినీ ఉపసంహరిస్తున్నాను; హజరత్ ఇప్పుడు నీ దగ్గర్నించి విడుదలయిపోయాడు. ఇంక నువ్వంటే బెంగాలుకు భయం ఉండదు.”

“నేను ఉద్విగ్న స్వరంతో హజరత్‌ను పిలిచాను; మొట్టమొదటి సారిగా, అతడు నా అంతర్దృష్టికి గోచరించడం మానేశాడు. కాని హఠాత్తుగా ఒక నల్లటి ముసుగు తొలగిపోయింది; నా పాపిష్టి జీవితం స్పష్టంగా కళ్ళకు కట్టింది.

“ ‘గురుదేవా, చాలా కాలంగా నాలో ఉన్న భ్రాంతిని తొలగించడానికి ఇలా వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకొంటున్నాను.’ ఆయన, కాళ్ళమీద పడి ఏడ్చేశాను. ‘లౌకికమైన నా అభిలాషలన్నీ విడిచిపెట్టేస్తా నని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా వెనకటి పాపాల పరిహారానికి, ఏ కొండల్లోకో పోయి ఏకాంతంగా దైవధ్యానం చేసుకుంటాను.’

“మా గురుదేవులు నన్ను దయతో చూశారు. ‘నీ చిత్తశుద్ధి నా మనస్సుకు తెలుస్తోంది.’ అన్నారు చివరికి. ‘నీ తొలుతటి ఏళ్ళ నిశ్చల విధేయతవల్లా ఇప్పటి నీ పశ్చాత్తాపంవల్లా నీ కొక వరం ఇస్తాను. నీ ఇతర శక్తులన్నీ ఇప్పుడు పోయాయి కాని, నీకు తిండి గుడ్డా కావలసినప్పుడు మాత్రం హజరత్‌ను పిలిచి ఇమ్మంటే ఇప్పటికీ ఇస్తాడు. ఏకాంత పర్వత ప్రాంతాలకు పోయి, దివ్యజ్ఞానం పొందడానికి నిండు మనస్సుతో సాధన చెయ్యి.’ ”

“మా గురుదేవులు అంతర్ధానమయారు. కన్నీళ్ళతో, ఆలోచనలతో ఒంటరిగా మిగిలిపోయాను. ఓ ప్రపంచచూ, ఇక సెలవు! ఆ విశ్వప్రేమమయుడి క్షమాభిక్ష అన్వేషించడానికి వెళ్ళిపోతున్నాను.

  1. విద్యార్థుల వసతి గృహం: బాటసారి, జ్ఞానాన్వేషకుడు అనే అర్థంగల ‘పాంథ’ శబ్దం నుంచి వచ్చింది.
  2. ముస్లింయోగి; అరబ్బీ భాషలో, దరిద్రుడనే అర్థంగల ‘ఫకీర్’ శబ్దం నుంచి వచ్చింది. దీని మూలార్థం దారిద్ర్యవ్రతనిష్ఠుడని,
  3. అఫ్జల్‌ఖాన్ దోపిడికి గురిఅయిన వ్యాపార సంస్థల్లో తమ కంపెనీ, బెంగాల్ - నాగపూర్ రైల్వే కూడా ఒకటని, తరవాత ఒకసారి మా నాన్నగారు నాకు చెప్పారు.
  4. శ్రీయుక్తేశ్వర్‌గారి స్నేహితుడి పేరు నాకు గుర్తురావడం లేదు; అంచేత ఉత్తినే “బాబు” అని రాస్తున్నాను.
  5. సూక్ష్మశక్తితో సృష్టించిన నా వెండి రక్షరేకు, చివరికి ఈ లోకం నుంచి అదృశ్యమయినట్టుగానే (అధ్యాయం : 42 లో సూక్ష్మలోకాన్ని వర్ణించడం జరిగింది).