ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 15

వికీసోర్స్ నుండి

అధ్యాయం : 15

గోబిపువ్వు దొంగతనం

“గురుదేవా, మీకో బహుమతి! ఈ పెద్ద గోబిపూలు (కాలీఫ్లవర్లు) ఆరూ నా చేతులలో నేను నాటినవండి; చంటిబిడ్డని సాకే తల్లిలా జాగ్రత్తగా చూసుకుంటూ వాటి పెరుగుదలని గమనిస్తూ వచ్చాను.” నేను సలక్షణమైన ఆడంబరంతో ఆ కూరగాయల బుట్టని గురుదేవులకు బహూకరించాను.

“చాలా సంతోషం!” శ్రీయుక్తేశ్వర్‌గారి చిరునవ్వులో మెప్పుతో కూడిన ఆత్మీయత ఉంది. “వాటిని నీ గదిలో ఉంచు; రేపు ప్రత్యేకమైన విందుకు నాకు అవసరమవుతాయవి.”

కాలేజి వేసంగి సెలవులు, గురుదేవులకు సముద్రపు ఒడ్డున గల ఆశ్రమంలో ఆయన దగ్గర గడుపుదామని అప్పుడే నేను పూరీకి వచ్చాను. మా గురుదేవులూ వారి శిష్యులూ కలిసి కట్టిన, ఆహ్లాదకరమైన ఆ చిన్న రెండతస్తుల ఆశ్రమం బంగాళాఖాతానికి ఎదురుగా ఉంది.

మర్నాడు పొద్దున, ఉప్పటి సముద్రపు గాలులతోటి ప్రశాంతమైన ఆశ్రమ ఆకర్షణతోటి సేద దీర్చుకుని, పెందలాడే నిద్ర లేచాను. మా గురుదేవుల మధుర స్వరం పిలుస్తోంది; నాకు ప్రీతిపాత్రమైన గోబిపూల వేపు ఒకసారి చూసుకొని, వాటిని నా మంచంకింద పొందికగా పేర్చి పెట్టాను.

“రా, సముద్రపొడ్డుకు పోదాం.” గురుదేవులు దారి తీశారు; చాలామంది యువశిష్యులూ నేనూ చెదిరిపోయిన గుంపులా ఆయన వెంట నడిచాం. మా గురుదేవులు సున్నితమైన విమర్శా ధోరణిలో మమ్మల్ని పరిశీలించారు.

“మన పాశ్చాత్య సోదరులు, నడిచేటప్పుడు మూమూలుగా ఒక క్రమపద్ధతి ననుసరించడం గర్వకారణంగా భావిస్తారు. మీరుకూడా ఇప్పుడు రెండు వరసల్లో కవాతు చెయ్యండి; ఒకరితో ఒకరు లయబద్ధంగా అడుగు వేస్తూ ఉండండి.” మేము ఆ ప్రకారం చేస్తూ ఉండగా శ్రీ యుక్తేశ్వర్‌గారు మా మీదే కన్నుంచి, “బాబులూ నడవండి ముందుకీ వెనక్కీ, అందంగా వరసకట్టి అడుగడుక్కీ,” అంటూ పాడడం ప్రారంభించారాయన. గురుదేవులు తమ యువ శిష్యులతో సమానంగా చకచకా సునాయాసంగా అంగవెయ్యడం చూస్తుంటే ముగ్ధుణ్ణికాక మానలేదు.

“ఆగండి!” మా గురువుగారి కళ్ళు నా కళ్ళలోకి చూశాయి. “ఆశ్రమం దొడ్డి తలుపు మరిచిపోకుండా తాళం వేశావా?”

“వేశాననుకుంటానండి.”

శ్రీయుక్తేశ్వర్‌గారు కొన్ని నిమిషాల సేపు మౌనంగా ఉన్నారు. ఆయన పెదవులమీద చిరునవ్వు కొంతమట్టుకు బిగబట్టి ఉంది. “లేదు, నువ్వు మరిచిపోయావు,” అన్నారాయన చివరికి. “భౌతిక విషయాల్లో అజాగ్రత్తకి దైవచింతనని సాకుగా తీసుకోకూడదు. ఆశ్రమాన్ని భద్రపరచడంలో నీ విధిని ఉపేక్షించావు. నిన్ను శిక్షించాలి.”

ఆ తరవాత, “నీ గోబిపువ్వులు ఆరూ త్వరలో అయిదయిపోతాయి.” అని ఆయన అన్నప్పుడు అస్పష్టంగా, పరాచకమాడుతున్నా రనుకున్నాను.

గురుదేవుల ఉత్తరువుల మేరకు మేము వెనక్కి తిరిగి నడక సాగించాం; ఆశ్రమం దగ్గరికి వచ్చాం. “కాస్సేపు విశ్రాంతి తీసుకోండి. ముకుందా, మనకి ఎడంవేపున ప్రహరీ వేపు చూడు, దానికి అవతలున్న రోడ్డు గమనించు. ఇప్పుడు ఒకతను అక్కడికి వస్తాడు; నిన్ను దండించడానికి ఉపయోగపడే సాధనం అతను.”

అర్థంకాని ఈ వ్యాఖ్యానాలకి నాకు కలిగిన విసుగును మరుగుపరుచుకున్నాను. కాస్సేపట్లో రోడ్డుమీద ఒక రైతు కనిపించాడు; అర్థంలేని చేష్టలతో చేతులు విసురుగా తిప్పుతూ వికారంగా తైతక్కలాడుతున్నాడు. కుతూహలంతో, దాదాపు చేష్టలుడిగినట్టయిపోయి ఆ వినోదకరమైన దృశ్యానికే కళ్ళప్పగించేశాను. ఆ మనిషి రోడ్డుమీద నడుస్తూ మాకు కనుమరుగయిపోయే చోటికి వచ్చేటప్పటికి, యుక్తేశ్వర్‌గారు అన్నారు, “ఇప్పుడతను వెనక్కి తిరుగుతాడు” అని.

వెంటనే ఆ రైతు తన దిశ మార్చి ఆశ్రమం వెనక వేపుకి దారి తీశాడు. ఇసకదారికి అడ్డబడివచ్చి, దొడ్డి గుమ్మంవేపునుంచి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. మా గురుదేవులు అన్నట్టే, నేను దానికి తాళం వెయ్యలేదు. కాస్సేపట్లో అతను నేను ఎంతో అపురూపంగా చూసుకునే గోబిపువ్వుల్లో ఒకటి పట్టుకుని బయటికి వచ్చాడు. చేజిక్కిన దానివల్ల వచ్చిన దర్జాతో పెద్దమనిషి తరహాగా నడుచుకుంటూ పోయాడు.

బయల్పడుతున్న ఈ ప్రహసనంలో నా పాత్ర, తబ్బిబ్బయిన వంచితుడి పాత్రలా కనిపించినప్పటికీ ఆగ్రహంగా అతన్ని వెంబడించ లేనంతగా మాత్రం నన్ను కలవరపరచలేదు. రోడ్డు చేరడానికి నేను సగం దూరం వెళ్ళానో లేదో, గురుదేవులు నన్ను వెనక్కి పిలిచారు. ఆయన విరగబడి నవ్వుతూ ఆపాదమస్తకం ఊగిపోతున్నారు.

“పాపం! ఆ వెర్రివాడు. ఒక్క గోబిపువ్వు కోసం ఊ, ఉవ్విళ్ళూరుతున్నాడు.” అని వివరించారాయన, నవ్వు మధ్యలో. “అంత అజాగ్రత్తగా ఉంచిన నీవాటిలో అతనికొకటి దక్కితే బాగుంటుందనుకున్నాను!”

వెంటనే నా గదికి ఉరికాను, కూరగాయల మీదే చూపు నిలిపిన ఆ దొంగ, గొంగడిమీద బట్టబయలుగా పడిఉన్న నా బంగారపు ఉంగరాల్ని, వాచీని, డబ్బును తాకనైనా తాకలేదని గమనించాను. దాని బదులు, అలవోకగా చూస్తే కంటబడకుండా ఉండేట్టు పూర్తిగా మరుగున ఉన్న గోబిపూల బుట్ట దగ్గరికి మంచం కిందినంచి పాకుతూ వెళ్ళాడు; మనసులో ఉన్న ఒకేఒక కోరికను దాంతో తీర్చుకున్నాడు.

ఆనాడు సాయంత్రం, ఈ సంఘటనను గురించి విప్పిచెప్పమని శ్రీయుక్తేశ్వర్‌గారిని అడిగాను (ఇందులో గాభరా పెట్టే సంగతులుకొన్ని ఉన్నాయని నాకు అనిపించింది).

మా గురుదేవులు మెల్లగా తల ఊపారు. ఎప్పుడో ఒకనాడు నువ్వు అర్థం చేసుకుంటావు. మరుగునపడిఉన్న ఈ నియమాల్ని కొన్నిటిని విజ్ఞానశాస్త్రం త్వరలోనే కనిపెడుతుంది.

కొన్నేళ్ళ తరవాత రేడియో వింతలు హఠాత్తుగా బయల్పడి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తినప్పుడు, గురుదేవుల జోస్యం నా మనస్సులో మెదిలింది. దేశ కాలాల్ని గురించిన పాతకాలపు భావాలు తుడిచిపెట్టుకు పోయాయి. ఎవ్వరి ఇల్లూ కూడా, లండనో కలకత్తాయో ప్రవేశించలేనంత ఇరుకు ఏమీ కాదు! మానవుడి సర్వవ్యాపకత్వం తాలూకు ఒక అంశానికి నిర్వివాదమైన నిదర్శనం ముందు అత్యంత మందబుద్ధి కూడా వికాసం చెందింది.

గోబిపువ్వు ప్రహసనం “ఇతివృత్తాన్ని” రేడియో సామ్యంతో[1] బాగా అర్థం చేసుకోవచ్చు. మా గురుదేవులు మానవరూపంలో ఉన్న పరిపూర్ణమైన రేడియో. ఆలోచనలన్నవి ఆకాశంలో సంచరించే అత్యంత సూక్ష్మ స్పందనలకు మించి మరేమీ కావు. ప్రతివేపు నుంచీ వెలువడుతుండే వేలాది కార్యక్రమాల్లోంచి మనకి కావలసిన సంగీత కార్యక్రమాన్ని సరిగా ట్యూన్ చేసిన రేడియో అందుకునేటట్టుగా, శ్రీయుక్తేశ్వర్‌గారు, లోకంలో మానవ మనస్సులు ప్రసారంచేసే లెక్కలేనన్ని ఆలోచనల్లోంచి ఒకానొక (ఒక గోబిపువ్వు కోసం వెంపరలాడుతున్న ఆ వెర్రి బాగులవాడి) సుసంగతమైన ఆలోచనను సూక్ష్మగ్రహణశక్తితో కనిపెట్టారు. సముద్రపు ఒడ్డున షికారుకు వెళ్తున్న సమయంలో ఆ రైతుకున్న చిన్న కోరిక తెలుసుకోగానే దాన్ని తీర్చాలని సంకల్పించారు. రోడ్డుమీద తైతక్కలాడుతూ వస్తున్న మనిషిని, అతను శిష్యుల కనుచూపు మేరలోకి రాకముందే, శ్రీయుక్తేశ్వర్‌గారి దివ్యచక్షువు కనిపెట్టింది. ఆశ్రమం తలుపుకి తాళం వెయ్యడం విషయంలో నా మతిమరుపు, నా విలువైన శాకాల్లో ఒకటి నాకు దక్కకుండా చెయ్యడానికి గురుదేవులకు సదుపాయమైన మిష కల్పించింది.

ఆ విధంగా గ్రాహక పరికరంలా పనిచేసిన తరవాత శ్రీయుక్తేశ్వర్‌గారు, ప్రబలమైన తమ సంకల్పశక్తిద్వారా, బ్రాడ్ కాస్టర్‌గా – అంటే ప్రేషక, పరికరంగా పనిచేశారు.[2] ఆ ప్రకారంగా తమ పాత్ర నిర్వహిస్తూ ఆయన, ఆ రైతు వెనక్కి తిరిగి వెళ్ళి ఒకేఒక కాలీఫ్లవర్ కోసం ఒకానొక గదిలోకి ప్రవేశించేటట్లు నిర్దేశించడంలో కృతకృత్యులయారు.

సహజావబోధం (అంతర్జ్ఞానం, లేదా అంతఃస్ఫురణ) ఆత్మ చూపించే ముందు దారి; ఇది, మనిషి మనస్సు ప్రశాంతంగా ఉన్న క్షణాల్లో అతనిలో సహజంగానే కనిపిస్తుంది. దాదాపు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో, వివరించడానికి శక్యంకాని విధంగా, జరగ బోయేది ముందుగానే సరిగా “స్ఫురించడం,” తమ ఆలోచనల్ని మరో మనిషికి కచ్చితంగా బదిలీచెయ్యడం లాంటి అనుభవం కలిగే ఉంటుంది.

అలజడులు లేని, లేదా అశాంతి, ఒత్తిడి నుంచి విముక్తమయిన మానవ మనస్సుకు, సహజావబోధమనే యాంటినా ద్వారా, జటిలమైన రేడియో యంత్రాలు చేసే పనులన్నిటినీ చేసే శక్తి ఉంటుంది; అంటే, ఆలోచనారూప సందేశాలు పంపడం, అందుకోడం, అక్కర్లేనివాటిని రానివ్వకపోవడం చెయ్యగలుగుతుందన్న మాట. రేడియో ప్రసార కేంద్ర శక్తి అది వినియోగించుకోగలిగిన విద్యుచ్ఛక్తి పరిమాణంచేత నియంత్రితమైనట్టుగానే మానవరూపంలో ఉన్న రేడియో సామర్థ్యం, ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్న సంకల్పశక్తి ప్రమాణంమీద ఆధారపడి ఉంటుంది.

అన్ని ఆలోచనలూ విశ్వంలో శాశ్వతంగా స్పందిస్తూ ఉంటాయి. సిద్ధపురుషుడైనవాడు గాఢమైన ఏకాగ్రతతో, బతికున్న వాడివయినా చనిపోయినవాడినయినా సరే - ఏ మనిషి ఆలోచనలనయినా సరే- పసిగట్ట గలుగుతాడు. ఆలోచనలన్నవి వైయక్తికంగా కాక, విశ్వవ్యాప్తంగా వేరూనినవి. సత్యాన్ని దర్శించడమే కాని సృష్టించడం శక్యం కాదు. మనిషికి కలిగే తప్పుడు ఆలోచన ఏదయినా అతని వివేకంలో ఉన్న లోపానికి ఫలితం; ఆ లోపం పెద్దదయినా కావచ్చు. చిన్నదయినా కావచ్చు. అంతర్వాణి ఇచ్చే అమోఘమైన సలహా విరూపం చెందకుండా వినగలిగేటందుకు మనస్సును శాంతపరచడమే యోగశాస్త్రం లక్ష్యం.

రేడియో, టెలివిజనూ, దూరంగా ఉన్న మనుషుల ధ్వనినీ ఆకారాన్ని తక్షణమే లక్షోపలక్షల ఇళ్ళలోకి తెస్తున్నాయి: మానవుడు సర్వవ్యాపకమైన ఆత్మ అన్నదానికి ఇది, వైజ్ఞానికమైన మొట్టమొదటి అస్పష్ట సూచన. అహంకారం మనిషిని బానిసని చేసుకోడానికి అత్యంత పాశవిక పద్ధతుల్లో, కుట్ర పన్నుతున్నప్పటికీ అతడు ప్రధానంగా సర్వ వ్యాపకమైన ఆత్మేకాని ఎక్కడో ఒక చోటికి కట్టుబడ్డ శరీరం మాత్రం కాదు.

“అత్యంత అపూర్వమైన, అత్యద్భుతమైన, అత్యంత అసంభావ్యంగా పైకి కనిపించే దృగ్విషయాలు ఇకముందు వెల్లడి కావచ్చు. అవి ఒకసారి స్థిరపడ్డ తరవాత, వాటిని చూసి, గడిచిన శతాబ్దిలో విజ్ఞానశాస్త్రం మనకి నేర్పినదంతా చూసి మనమిప్పుడు ఎంత ఆశ్చర్యపోతున్నామో అంతకుమించి మాత్రం ఆశ్చర్యపోము,” అని ఉద్ఘాటించాడు, శరీరశాస్త్రంలో నోబెల్ బహుమానం అందుకున్న చార్లెస్ రాబర్ రిషే.[3] “మన మీనాడు ఆశ్చర్యపడకుండా అంగీకరించే దృగ్విషయాలు మనలో ఆశ్చర్యం రేకెత్తించకపోవడానికి కారణం అవి మనికి అర్థమై ఉండడమే నని భావించడం జరిగింది. కాని అసలు సంగతి ఇది కాదు. అవి మనకి ఆశ్చర్యం కలిగించకపోవడానికి కారణం, అవి మనకి అర్థమై ఉండడంకాదు; అవి మనకి పరిచితమై ఉండడం. అలా కాకపోతే, మనకి అర్థం కానిదల్లా ఆశ్చర్యం కలిగించాలంటే ప్రతిదీ ఆశ్చర్యమే కలిగించాలి -- గాలిలోకి విసిరిన రాయి కిందికి పడడం, సిందూరపు కాయ సిందూరపు చెట్టు కావడం, వేడిచేసినప్పుడు పాదరసం వ్యాకోచించడం, అయస్కాంతం ఆకర్షించిన ఇనుము, రాపాడించినప్పుడు రగులుకొనే భాస్వరం, ఇలాటి వన్నీ.

“ఈనాటి విజ్ఞానశాస్త్రం తేలికయిన విషయం” మన సంతతివాళ్ళు కనుక్కోబోయే అత్యద్భుత సత్యాలు ఇప్పుడు కూడా మన చుట్టూ ఉన్నాయి; మన కళ్ళలోకి తేరిపారి చూస్తున్నాయని చెప్పొచ్చు. అయినా మనం వాటిని చూడం. మనం వాటిని చూడమని చెబితే చాలదు; వాటిని చూడాలని ఆశించం. దానికి కారణమేమిటంటే, అనుకోని, అపరిచితమైన యథార్థమేదయినా అవుపడితే వెంటనే దాన్ని మనం, గడించిన జ్ఞానంలో సర్వసామాన్యాల చట్రాల్లో ఇమడ్చడానికి పూనుకుంటాం. ఎవరయినా ఇంకా పరిశోధన చెయ్యడానికి సాహసిస్తారంటే ఈసడిస్తాం.”

నమ్మశక్యంకాని విధంగా నా గోబిపువ్వు ఒకటి దొంగతనమయిన కొన్నాళ్ళకి నవ్వొచ్చే సంఘటన ఒకటి జరిగింది. కావలసిన కిరసనాయిలు దీపం ఒకటి కనిపించలేదు. అంతకుముందే గురుదేవుల సర్వజ్ఞ యోగ దృష్టిని ప్రత్యక్షంగా చూసిన తరువాత, ఈ దీపాన్ని కనిపెట్టడం చిన్న పిల్లల ఆటకింద ఆయన చూపిస్తారని అనుకున్నాను.

గురుదేవులు నేను ఆశించినదాన్ని గమనించారు. తెచ్చి పెట్టుకున్న అతిగాంభీర్యంతో ఆశ్రమవాసులందరినీ నిగ్గదీసి అడిగారు. శిష్యుల్లో ఒక కుర్రవాడు, దొడ్లో నూతి దగ్గరికి వెళ్ళడానికి దీపం తీసుకువెళ్ళానని చెప్పాడు.

శ్రీయుక్తేశ్వర్‌గారు, “దీపంకోసం నూతి దగ్గర చూడండి,” అని గంభీరంగా సలహా ఇచ్చారు.

చటుక్కున అక్కడికి ఉరికాను; దీపం లేదు. మొహం వేలాడేసుకుని మా గురువుగారి దగ్గరికి తిరిగి వచ్చాను. ఇప్పుడాయన పగలబడి నవ్వుతున్నారు. నా భ్రమ తొలగిపోయినందుకు అనుతాపమేమీ లేకుండా.

“ఇదేం బాగాలేదు; మాయమైన దీపం దగ్గరికి నిన్ను పంపించలేకపోయాను; నేను సోది చెప్పేవాణ్ణి కాకపోతిని!” మిలమిల్లాడుతున్న కళ్ళతో, ఆయన ఇంకా అన్నారు. “కనీసం సరయిన షెర్లాక్ హోమ్స్ నయినా కాను!” గురుదేవులు తమ శక్తుల్ని, ఎవరయినా సవాలు చేసినప్పుడుకాని, స్వల్ప విషయంలో కాని ఎన్నడూ ప్రదర్శించరని గ్రహించాను.

కొన్ని వారాలు ఆనందంగా చకచకా గడిచిపోయాయి. శ్రీ యుక్తేశ్వర్‌గారు మతసంబంధమైన ఊరేగింపు ఒకటి జరపాలని పథకం వేస్తున్నారు. ఊళ్ళోనూ పూరీ సముద్రపు ఒడ్డునా శిష్యుల్ని తీసుకువెళ్ళి ఊరేగింపు నడిపించమని ఆయన నన్ను అడిగారు. పండుగ రోజున (కర్కాటక సంక్రమణం) తెల్లవారినప్పటినించే ఎండ మలమలమాడుస్తూ వచ్చింది.

“గురూజీ, కాళ్ళకి చెప్పులులేని విద్యార్థుల్ని నిప్పులా కాలుతున్న ఇసకలో ఎలా నడిపించమంటారు?” అని అడిగాను నిరాశగా.

“నీకో రహస్యం చెబుతాను,” అన్నారు గురుదేవులు. “ఈశ్వరుడు ఆకాశంలోకి మబ్బుల గొడుగు ఒకటి పంపిస్తాడు, మీరంతా సుఖంగా నడవచ్చు.” నేను సంతోషంగా ఊరేగింపు ఏర్పాటుచేశాను; మా బృందం సత్సంగ[4]పతాకంతో ఆశ్రమంనుంచి బయలుదేరింది. శ్రీయుక్తేశ్వర్‌గారు రూపకల్పనచేసిన ఈ పతాకంలో ఏకైక[5]నేత్రం చిహ్నం ఉంది; అదే సహజావబోధం తాలూకు దూరదర్శక దృష్టి. మేము ఆశ్రమం విడిచి బయటికి వచ్చామో లేదో, ఏదో ఇంద్రజాలం చేసినట్టుగా, ఆకాశమంతా మేఘాలతో నిండిపోతూ వచ్చింది. అన్నివైపులవాళ్ళూ ప్రకటించే ఆశ్చర్యానికి తోడు, నగర వీధుల్నీ మల మల మాడుతున్న సముద్రతీరాన్ని చల్లబరుస్తూ సన్న సన్నటి తుంపర పడింది.

రెండు గంటల ఊరేగింపు సమయంలో సేద దీర్చేటట్టుగా జల్లులు పడుతూనే ఉన్నాయి. మా బృందం ఆశ్రమానికి తిరిగివచ్చిన తక్షణమే మబ్బులూ వానా మటుమాయమయాయి.

“దేవుడు మనకోసం ఎంత ఇదవుతాడో చూడు!” అన్నారు గురుదేవులు, నేను కృతజ్ఞత తెలియజేసిన తరవాత. “ఈశ్వరుడు అందరికీ పలుకుతాడు; అందరికీ పనిచేస్తాడు. నా ప్రార్థననుబట్టి వాన కురిపించినట్టుగానే ఆయన, ఏ భక్తుడి హృదయాభిలాషనయినా సరే తీరుస్తాడు. దేవుడు తమ ప్రార్థనల్ని ఎంత తరచుగా మన్నిస్తాడో చాలా అరుదుగా గ్రహిస్తారు మనుషులు. ఆయన ఏ కొద్దిమంది మీదో పక్షపాతం చూపించడు; సంపూర్ణ విశ్వాసంతో తనని ఆశ్రయించిన వాళ్ళందరి ప్రార్థనలూ ఆలకిస్తాడు. సర్వాంతర్యామి అయిన తమ తండ్రి[6]కి గల ప్రేమతో కూడిన దయమీద ఆయన బిడ్డలకు అచంచల విశ్వాసం ఉండాలి.

శ్రీ యుక్తేశ్వర్‌గారు ఏడాదికి నాలుగు ఉత్సవాలు జరిపేవారు. విషువత్తులకూ సంక్రమణాలకూ. దూరంలోనూ దగ్గరలోనూ ఎక్కడెక్క డున్న విద్యార్థులూ అప్పుడు ఆయనదగ్గరికి చేరేవారు. మకర సంక్రాంతి ఉత్సవం శ్రీరాంపూర్ లో జరిగింది; నేను హాజరయిన ఆ మొట్టమొదటి ఉత్సవం నాకు శాశ్వతమైన దీవన అందించింది.

కాళ్ళకి చెప్పులు లేకుండా వీధుల్లో పొద్దుటిపూట ఉరేగింపుతో ఉత్సవం ఆరంభమయింది. వందమంది విద్యార్థుల కంఠస్వరాలు మధురమైన సంకీర్తనలతో ఖంగున మోగాయి. సంగీతజ్ఞులు కొందరు పిల్లంగోవి, ఖోల్ కర్తాల్ (మద్దెలలూ తాళాలూ) వాయించారు. భగవంతుడి పావన నామ సంకీర్తనంతో మారుమోగేటట్టుగా మేముచేసే భజన తమకు పిలుపుగా ఎంచుకొని, నిస్సారమైన పనులన్నీ విడిచిపెట్టి సంతోషంగా బయటికి వచ్చిన ఉత్సాహవంతులైన ఊరి జనం, దారి పొడుగునా పూలు చల్లారు, ఆ దీర్ఘ పర్యటన ఆశ్రమం ముంగిట్లో సమాప్తమయింది. అక్కడ మేము, మా గురుదేవుల చుట్టూ నిలబడ్డాం; మేడమీది బాల్కనీల్లో ఉన్న విద్యార్థులు మా మీద బంతిపూలు కురిపించారు.

చాలామంది అతిథులు, సెనగలూ నారింజ తొనలూ కలిపిచేసిన ఫలహారం తీసుకోడానికి మేడమీదికి వెళ్ళారు. నేను మాత్రం, ఆ రోజు వంటపని చేస్తున్న సోదరశిష్యుల బృందం దగ్గరికి దారితీశాను. అటువంటి పెద్ద సమారాధనలకీ అన్నం, ఆరుబయట పెద్ద పెద్ద గుండిగలతో వండాలి. తాత్కాలికంగా వేసిన ఇటిక పొయ్యిల్లోంచి పొగ కమ్ముకొస్తోంది; కళ్ళు నీళ్ళు కారిపోతున్నాయి; కాని మా పనికి మేము కులాసాగా నవ్వుకున్నాం. భారతదేశంలో మతసంబంధమైన ఉత్సవాల్ని ఒక బెడదగా ఎన్నడూ భావించరు; ప్రతి భక్తుడూ తన వంతుకు తను సంతోషంగా చేస్తాడు.-- డబ్బిచ్చిగాని, బియ్యమూ కాయగూరలూ ఇచ్చిగాని, స్వయంగా నడుంకట్టి పనిచేసిగాని,

కాస్సేపట్లో గురువుగారు మా దగ్గరికి వచ్చారు, సంతర్పణకి సంబంధించిన వివరాలు అజమాయిషీ చేస్తూ ప్రతిక్షణం ఏదో ఒక పనిలో మునిగి ఉంటారు ఆయన; అయినా అత్యంత శక్తిమంతుడైన పడుచు శిష్యుడితో సమానంగా పనిచేస్తారు.

రెండో అంతస్తులో సంకీర్తనం (బృందగానం) జరుగుతోంది; పక్కన హార్మణీ, మద్దెలా వాయిస్తున్నారు. దాన్ని మెచ్చుకుంటూ విన్నారు శ్రీయుక్తేశ్వర్‌గారు; ఆయన సంగీతజ్ఞానం సునిశిత పరిపూర్ణమైనది.

“వాళ్ళ శ్రుతి తప్పింది” గురుదేవులు వంటవాళ్ళని వదిలేసి సంకీర్తన బృందంలో చేరారు. మళ్ళీ శ్రావ్యత ధ్వనించింది; ఈసారి సరిగా వాయించారు.

సామవేదంలో సంగీతశాస్త్రాన్ని గురించిన, ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన విషయాలు ఉన్నాయి. భారతదేశంలో సంగీతాన్నీ, చిత్ర కళనూ నాటకాన్నీ దివ్యకళలుగా పరిగణిస్తారు. శాశ్వత త్రిమూర్తులయిన బ్రహ్మవిష్ణుమహేశ్వరులు మొట్టమొదటి సంగీతకారులు. విశ్వనర్తకుడయిన నటరాజ రూపంలో శివుడు, విశ్వసృష్టి స్థితిలయాల ప్రక్రియల్లో అనంత ప్రకారాల తాళలయల్ని సృష్టించినట్టూ, బ్రహ్మ తాళాలు వాయించినట్టూ విష్ణువు మృదంగం వాయించినట్టు పవిత్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది.

జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతి, తంత్రీ వాద్యాలన్నిటికీ తల్లి అయిన వీణను చేతబట్టి వాయిస్తున్నట్టుగా చిత్రించడం జరిగింది. విష్ణువు అవతారాల్లో ఒకడయిన కృష్ణుడు పిల్లంగోవి ఊదుతున్నట్టు హిందూ కళలో చిత్రించారు, దానిమీద అతడు, మాయాజాలంలో సంచరించే మానవాత్మల్ని తమ నిజమైన నివాసానికి తిరిగిరమ్మని పిలుస్తున్నట్టుగా ఆనంద పారవశ్యం కలిగించే పాట వాయిస్తాడు. హిందూ సంగీతానికి ఆధారభూతమయినవి రాగాలు లేదా సంగీత స్వరగ్రామాలు. ఆరు మూలరాగాలూ 126 జన్యరాగాలుగా విడివడ్డాయి. వాటిని రాగిణులూ (భార్యలు) పుత్రులు అంటారు. ప్రతి రాగానికి కనీసం ఐదు స్వరాలుంటాయి: ప్రధాన స్వరం (వాది లేదా రాజు), ఆనుషంగిక స్వరం (సమవాది లేదా మహామంత్రి), సహాయక (అనువాది, సేవక) స్వరాలు, విరుద్ధ (వివాది, శత్రు) స్వరం.

మూలరాగాలు ఆరింటిలో ప్రతి ఒక్క దానికి రోజులో ఒక నిశ్చిత సమయానికీ, సంవత్సరంలో ఒక నిశ్చిత ఋతువుకూ, ఒకానొక విశిష్ట శక్తిని చేకూర్చే అధిదేవతకూ పొసగుదల ఉంటుంది. ఆ విధంగా, (1) హిందోళరాగం - విశ్వప్రేమ భావాన్ని కలిగించడానికి వసంతకాలంలో తెల్లారగట్ల వినిపిస్తూంటుంది; (2) దీపకరాగం - దయాభావాన్ని మేల్కొల్పడానికి వేసవికాలంలో సాయంత్రంపూట ఆలాపించడం జరుగుతుంది; (3) మేఘరాగం - ధైర్యం కలిగించడానికి వానాకాలంలో మిట్ట మధ్యాహ్నం ఆలాపించవలసినది; (4) భైరవరాగం - ప్రశాంతత సాధించడానికి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో పొద్దుటిపూట వినిపించేది; (5) శ్రీరాగం - పరిశుద్ధ ప్రేమను పొందడానికి శరదృతువులో మునిమాపు వేళల్లో గానం చెయ్యడానికి నిర్దిష్టమైంది; (6) మాల్కోసు రాగం - శౌర్యం రేకెత్తించడానికి చలికాలం అర్ధరాత్రివేళల్లో వినిపిస్తుంది.

ప్రకృతికీ మనిషికీ మధ్యగల నాదమైత్రి తాలూకు ఈ నియమాల్ని సనాతన ఋషులు కనిపెట్టారు. ప్రకృతి ‘ఆదినాదం’ లేదా ‘స్పందనశీల శబ్దం’ అయిన ఓంకారానికి ఘనీభూత రూపకల్పన కావడంచేత మానవుడు కొన్ని నిర్దిష్ట మంత్రాల్ని[7] ప్రయోగించి ప్రాకృతిక ప్రత్యక్ష విషయా లన్నిటి మీదా నియంత్రణాధికారం సంపాదించగలుగుతాడు. పదహారోశతాబ్దంలో అక్బరు చక్రవర్తిదగ్గర ఆస్థాన సంగీత విద్వాంసుడుగా ఉన్న మీయాఁ తాన్‌సేన్‌కుగల అద్భుత శక్తుల్ని గురించి చారిత్రక పత్రాలు మనకు తెలియజేస్తాయి. సూర్యుడు నడినెత్తిని ఉన్న సమయంలో, రాత్రిపూట ఆలపించే రాగం ఒకటి వినిపించమని చక్రవర్తి ఆదేశించినప్పుడు తాన్ సేన్ , ఉదాత్త స్వరంలో ఒక మంత్రం జపించాడు; దానివల్ల తక్షణమే రాజప్రాసాద పరిసరాలన్నిటా చీకటి అలుముకు పోయింది.

భారతీయ సంగీతం, స్వరశ్రేణిని (ఆక్టేవ్ ) ఇరవై రెండు శ్రుతులుగా లేదా అర్ధస్వరాంశాలుగా విభజించింది. ఈ సూక్ష్మ స్వర విరామాలు, సంగీతాభివ్యక్తిలో సునిశితమైన ఛాయలు ఏర్పడ్డానికి అవకాశమిస్తాయి. పన్నెండు అర్ధస్వరాలుగల పాశ్చాత్య వర్ణ స్వరగ్రామం (క్రొమాటిక్ స్కేల్) తో వీటిని సాధించడానికి వీలులేదు. స్వరశ్రేణిలోని ఏడు మూల స్వరాల్లో ప్రతి ఒక్కదానికి హిందూ పురాణాల్లో, ఒక రంగుతోనూ, ఒక పక్షికూతతోనూ లేదా జంతువు అరుపులోనూ సంబంధం నిరూపించడం జరిగింది- ‘స’ కి ఆకుపచ్చ వన్నె తోనూ నెమలితోనూ; ‘రి’ కి ఎరుపు తోనూ చాతకపక్షితోనూ; ‘గ’ కి బంగారు వన్నెతోనూ మేకతోనూ; ‘మ’ కి పసుప్పచ్చ కత్తుకలిసిన తెలుపుతోనూ క్రౌంచపక్షితోనూ; ‘ప’ కి నలుపుతోనూ కోకిలతోనూ; ‘ద’ కి పసుప్పుచ్చ వన్నెతోనూ గుర్రంతోనూ; ‘ని’ కి అన్ని వన్నెల కలగలుపుతోనూ ఏనుగుతోనూ సంబంధం నిరూపించారు.

[“షడ్జం మయూరో వదతి, గానస్త్వృషభభాషిణః,
   అజావికంతు గాంధారం, క్రౌంచః క్వణతి మధ్యమం
   పుష్ప సాధారణే కాలే పికఃకూజిత పంచమం,
   ధైవతం హేషతే వాజీ, నిషాదం బృంహతే గజః.”
                                                - ‘అమరకోశః’, నాట్యవర్గః -1 : 184, 185]

భారతీయ సంగీతంలో డెబ్భైరెండు ‘తాట’ల్ని లేదా మేళకర్త రాగాల్ని పేర్కొన్నారు. స్థిరమైన సాంప్రదాయిక రాగాల్ని ఒకదాన్ని ఆశ్రయించుకొని దానిచుట్టూ అనంతంగా అనేకమైన స్వరాలు కల్పించడానికి సంగీత విద్వాంసుడికి సృజనాత్మకమైన అవకాశం ఉంటుంది; అతను ఒకానొక విషయవస్తువు తాలూకు స్థాయీభావం మీద మనస్సును కేంద్రీకరింపజేసి, తన మౌలిక ప్రతిభకుగల పరిమితులవరకూ దానికి అలంకారాలు తీర్చి దిద్దుతాడు. హిందూ సంగీత విద్వాంసుడు, అమిర్చి పెట్టిన స్వరసంగతుల్ని చదవడు. ప్రతి వాద్యకచేరీలోనూ అతను, స్థూలమైన రాగస్వరూపానికి కొత్త దుస్తులు అలంకరిస్తాడు; తరచుగా ఒకేఒక సంగతికి కట్టుబడి ఉంటూ దాని సునిశిత సూక్ష్మ స్వరవైవిధ్యాల్ని తాళ వైవిధ్యాల్నీ అన్నిటినీ పునశ్చరణచేసి వాటికి బలం చేకూరుస్తాడు. పాశ్చాత్య సంగీత రచయితల్లో బాహ్ (Bach) కు, వంద సంకీర్ణ పద్ధతుల్లో విభిన్నతలు చూపే పునరుక్త నాదానికిగల అందమూ శక్తీ తెలుసు.

సంస్కృత సాహిత్యం 120 తాళాల్ని, అంటేకాల ప్రమాణాల్ని, వివరించింది. హైందవ సంగీతానికి సాంప్రదాయిక మూలపురుషుడయిన భరతుడు ఏట్రింతపక్షి పాటలో ముప్ఫైరెండు రకాల తాళాల్ని విడమరిచి చెప్పాడు. తాళానికి మూలం, మానవుడి ఒంటి కదలికల్లో ఉన్నది- నడకలో రెండింతలు, నిద్రలో శ్వాసించేటప్పుడు మూడింతలు - అంటే, ఊపిరి తీసుకునేటప్పుడు విడిచేటప్పటికన్న రెండింతల కాలం పడుతుంది.

భారతదేశం సనాతన కాలం నుంచీ, మానవ కంఠస్వరాన్ని పరిపూర్ణమైన ధ్వని పరికరంగా గుర్తిస్తోంది. అందువల్ల హైందవ సంగీతం, చాలావరకు మూడు స్వరస్థాయిల శ్రేణికి (మంద్ర, మధ్య, తారస్థాయిలు) పరిమితం చేసుకుంది. ఆ కారణంవల్లనే స్వరసంగతి (ఏకకాలంలో వెలువడే స్వరాల మధ్య సంబంధం) కన్న స్వరమాధుర్యానికి (అనుక్రమ స్వరాల మధ్య సంబంధానికి) ప్రాముఖ్యమివ్వడం జరిగింది.

హిందూ సంగీతం ఆత్మాశ్రయమైన, ఆధ్యాత్మికమైన, వైయక్తిక కళ; స్వరమేళన విభవం కన్న పరమాత్మతో వైయక్తిక సామరస్యం సాధించడం దాని లక్ష్యం. భారతదేశంలో, ప్రఖ్యాత గీతాలన్నీ దైవభక్తులు కూర్చినవే. సంగీత విద్వాంసుణ్ణి సంస్కృతంలో “భాగవతుడు” అంటారు; అంటే “భగవంతుణ్ణి కీర్తించేవాడు” అని అర్థం.

సంకీర్తనలు లేదా సంగీత సభలు, యోగవిద్యకు లేదా ఆధ్యాత్మిక శిక్షణకు స్ఫూర్తిమంతమైన రూపాలు; వీటికి గాఢమైన ఏకాగ్రతా, బీజ ప్రాయమైన ఆలోచనలోనూ నాదంలోనూ మనస్సును లగ్నం చెయ్యడం ఈ రెండూ అవసరమవుతాయి. మానవుడు స్వయానా ‘నాదబ్రహ్మ’ (‘సృజనాత్మక శబ్దం’) కు అభివ్యక్తి కాబట్టి, ధ్వని అతనిమీద ప్రబలమైన సద్యఃప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. ప్రాచ్య పాశ్చాత్యదేశాల మహనీయమైన ధార్మిక సంగీతం మానవుడికి ఆనందాన్ని ప్రసాదిస్తుంది; అతని షట్చక్రాల్లో[8] ఒకదాన్ని అది తాత్కాలికంగా స్పందనశీలంగా జాగృతం చేస్తుంది. ఆనందభరితమైన ఆ క్షణాల్లో అతనికి, తనకు మూలమైన దివ్యస్వరూపం లీలగా స్మృతికి వస్తుంది.

పండుగ రోజున శ్రీ యుక్తేశ్వర్‌గారి రెండో అంతస్తులో జరుగుతున్న సంకీర్తనం, కింద ఆవిర్లు కక్కుతున్న గుండిగల మధ్య పని చేస్తున్న వంటవాళ్ళకి కూడా ఉత్తేజం కలిగిస్తోంది. తోటి శిష్యులూ నేనూ ఆనందాతిశయంతో, చేతులతో తాళం వేస్తూ కీర్తనలు పాడాం.

పొద్దుగూకే వేళకి కొన్ని వందల మందికి కిచిడీ, కూర, పరమాన్నాలతో సంతర్పణ పూర్తిచేశాం. ముంగిట్లో ఆరుబయట జంబుఖానాలు పరిచాం; కొద్ది సేపట్లో, శ్రీయుక్తేశ్వర్‌గారి నోటినించి వెలువడే జ్ఞానోపదేశాల్ని ప్రశాంతంగా ఆలకించడానికి, చుక్కలు మెరిసే ఆకాశం కింద అందరూ ఆసీనులయారు. ఆయన బహిరంగోపన్యాసాలు క్రియా యోగానికి ఆత్మ గౌరం, ప్రశాంతత, దృఢనిశ్చయం, సాదా భోజనం, క్రమబద్ధమైన వ్యాయామంగల జీవితానికిఉన్న విలువను నొక్కి చెబుతాయి.

ఆ తరవాత శిష్యుల్లో కొందరు కొన్ని దైవస్తోత్రాలు గానం చేశారు; గాఢతత్పరత కలిగించే సంకీర్తనంతో సమావేశం సమాప్త మయింది. పది గంటలనుంచి అర్ధరాత్రి వరకూ ఆశ్రమవాసులు వంట పాత్రలన్నీ తోమి, ముంగిలి ఖాళీచేశారు. గురుదేవులు నన్ను దగ్గరికి పిలిచారు.

“ఈరోజూ, ఉత్సవసన్నాహాల్లో వారం రోజులపాటూ నువ్వు ఆనందంగా చేసిన శ్రమకు నాకు సంతోషంగా ఉంది. నువ్వు నా దగ్గర ఉండాలని ఉంది; ఈ రాత్రి నువ్వు నా పక్కలో పడుకోవచ్చు.”

నాకు వస్తుందని ఎన్నడూ అనుకోని మహదవకాశమిది. మేము కొంతసేపు గాఢమైన దివ్య ప్రశాంతస్థితిలో కూర్చున్నాం. ఇక నిద్రకు ఉపక్రమిస్తూ మేము పడుకున్న సుమారు పది నిమిషాలకి గురుదేవులు లేచి మామూలు దుస్తులు వేసుకోడం ప్రారంభించారు.

“ఏమిటి గురుదేవా?” గురుదేవుల పక్కన పడుకుని నిద్రపోవడంలో గల ఆనందం, హఠాత్తుగా అవాస్తవికంగా పొడగట్టింది. “సరైన రైలుబండి తప్పిపోయిన విద్యార్థులు కొందరు కాస్సేపట్లో ఇక్కడికి వస్తారనుకుంటాను. భోజనం సిద్ధంచేసి పెట్టుకుందాం.”

“గురూజీ, అర్ధరాత్రి ఒంటిగంటకి ఎవ్వరూ రారండీ!”

“నువ్వు పడుకో; ఇంతవరకు చాలా కష్టపడి పనిచేశావు. నేను మట్టుకు వంట చెయ్యడానికి వెడుతున్నాను.”

శ్రీయుక్తేశ్వర్‌గారి కంఠంలో స్థిరనిశ్చయం పొడగట్టేసరికి నేను చటుక్కున పైకి గెంతి, ఆయన వెనకాలే వంటగదికి వెళ్ళాను; రోజూ వాడుకునే ఆ చిన్న వంటగది, రెండో అంతస్తులో లోపలి బాల్కనీని ఆనుకుని ఉంది. కాస్సేపట్లో బియ్యం, పప్పూ ఉడుకు పట్టాయి.

మా గురుదేవులు ఆప్యాయంగా చిరునవ్వు నవ్వారు. “ఈ వేళ రాత్రి నువ్వు అలసటనీ, కష్టతర కార్యభయాన్నీ జయించావు; ఇక ముందెన్నడూ వాటివల్ల నువ్వు ఇబ్బంది పడవు.”

ఇలా ఆయన, యావజ్జీవిత ఆశీర్వచనాలు పలుకుతూ ఉండగానే ముంగిట్లో అడుగుల అలికిడి వినిపించింది. నేను పరిగెత్తుకుంటూ కిందికి వెళ్ళి, వచ్చిన విద్యార్థి బృందాన్ని లోపలికి ప్రవేశపెట్టాను.

“తమ్ముడూ, ఈ సమయంలో గురువుగారిని ఇబ్బంది పెట్టాలంటే మనస్సు ఎంత పీకుతోందో తెలుసా! రైలు వేళల విషయంలో మీము పొరపాటు చేశాం; కాని గురుదేవుల దర్శనం చేసుకోకుండా తిరిగి ఇంటికి వెళ్ళలేమనిపించింది,” అన్నారాయన.

“మీ కోసమే చూస్తున్నారాయన; మీ కోసం వంట కూడా చేస్తున్నారు.”

శ్రీ యుక్తేశ్వర్‌గారి స్వాగత స్వరం ఖంగున మోగింది. దిమ్మెర పోయిన అతిథుల్ని వంటింట్లోకి తీసుకు వెళ్ళాను. మిలమిలా మెరుస్తున్న కళ్ళతో గురుదేవులు నావేపు తిరిగారు.

“ఇప్పుడు నువ్వు ఇద్దరు చెప్పినవీ తై పారు చేశావు కనక, మన అతిథులకి నిజంగానే బండి తప్పిపోయినందుకు తృప్తిపడుతున్నావనడంలో సందేహం లేదు!”

ఒక అరగంట తరువాత నేను, దేవుడిలాటి గురువుగారి పక్కన నిద్రపోయే భాగ్యానికి ఆనందంగా ఎదురుచూస్తూ ఆయన వెంబడే, ఆయన పడగ్గదికి వెళ్ళాను.

  1. 1939 లో రూపొందించిన రేడియో సూక్ష్మదర్శిని, అప్పటివరకు అజ్ఞాతంగా ఉన్న కిరణాల కొత్తలోకాన్ని ఆవిష్కరించింది. “స్వతహాగా మానవుడూ, జడపదార్థమని చెప్పే రకరకాల ద్రవ్యాలూ కూడా ఎడతెరపిలేకుండా కిరణాల్ని ప్రసారం చెయ్యడం జరుగుతుంది; వాటిని ఈ పరికరం “చూస్తుంది” అని రాసింది ‘అసోసియేటెడ్ ప్రెస్’ పత్రిక . “మానసిక ప్రసారాన్నీ (టెలిపతీ), రెండో చూపునూ, యోగదృష్టినీ నమ్మేవాళ్ళకు, ఒక వ్యక్తినుంచి మరో వ్యక్తికి నిజంగా ప్రసరించే అదృశ్యకిరణాల ఉనికికి మొట్టమొదటి శాస్త్రీయ నిదర్శనం ఈ ప్రకటనలో కనిపిస్తుంది. ఈ రేడియో పరికరం వాస్తవానికి, రేడియో స్పందన వర్ణపటదర్శిని. మామూలు వర్ణపటదర్శిని (స్పెక్ట్రోస్కోప్) నక్షత్రాలు ఏర్పడ్డానికి కారణభూతమైన రకరకాల అణువుల్ని కళ్ళకి కట్టించినట్టుగానే ఈ పరికరం, చల్లని నిస్తేజ పదార్థాన్ని కళ్ళకి కట్టిస్తుంది. ........మనిషి దగ్గర నుంచీ జీవపదార్థాలన్నిటినుంచీ వచ్చే అటువంటి కిరణాల ఉనికిని శాస్త్రజ్ఞులు చాలా ఏళ్ళుగా అనుమానిస్తూనే వచ్చారు. వాటి ఉనికికి ఈనాడు మొట్టమొదటి ప్రయోగాత్మక నిదర్శనం కనిపించింది. ప్రకృతిలో ప్రతి అణువూ ప్రతి పరమాణువూ ఎడతెరపిలేని ఒక రేడియో ప్రసారకేంద్రం అని ఈ ఆవిష్కరణవల్ల తెలుస్తోంది. ఆ ప్రకారంగా, ఒకప్పుడు మనిషిగా ఉన్న పదార్థం, చచ్చిపోయిన తరవాత కూడా తన సూక్ష్మకిరణాల్ని విడుదలచెయ్యడం కొనసాగిస్తూనే ఉంటుంది. ఆ కిరణాల అలపొడవులు, ఇప్పుడు ప్రసారంలో ఉపయోగించే చిన్న రేడియో తరంగాలకున్న చిన్న వాటి మొదలుకొని పెద్దతరంగాలకన్న పెద్దవాటి వరకు ఉంటూంటాయి. ఈ తరంగాల కలగలుపు దాదాపు ఊహించలేనిది. ఇలాటివి లక్షోపలక్షలు ఉన్నాయి. చాలా పెద్ద పరమాణువు ఒక్కటి, ఒకే సమయంలో 10,00,000 వేరువేరు అలపొడవుల్ని విడుదల చెయ్యవచ్చు. ఈ రకమైన నిడువైన అలపొడవులు, రేడియో తరంగాలంత సులువుగానూ వడిగానూ ప్రయాణం చేస్తాయి. ......మనకి పరిచయమైన వెలుతురులాంటి కిరణాలకి ఈ కొత్త రేడియో కిరణాలకీ, ఆశ్చర్యం కలిగించే భేదం ఒకటుంది. అదేమిటంటే, నిశ్చలమైన పదార్థంనుంచి వెలువడుతుండే ఈ రేడియో తరంగాలు వేలాది సంవత్సరాల పాటు అలా వెలువడుతూనే ఉంటాయి.”
  2. అధ్యాయం : 28 లో మొదటి అధోజ్ఞాపిక చూడండి.
  3. ‘అవర్ సిక్త్స్ సెన్స్’ అన్న పుస్తకం రాసినాయన (లండన్ : రెడర్ అండ్ కంపెనీ)
  4. ‘సత్’ అన్నదానికి వాచ్యార్థం, “అస్తిత్వం”; కాబట్టి “సారం, సత్యం”: ‘సంగ’ శబ్దానికి అర్థం- “కూటమి”. శ్రీ యుక్తేశ్వర్‌గారు తమ ఆశ్రమ వ్యవస్థను సత్సంగమని పిలిచేవారు; అంటే “సత్యంతో సాంగత్యం" అన్నమాట.
  5. “కాబట్టి నీది ఒక్కటే కన్ను అయినట్లయితే (నీ దృష్టి ఏకాగ్రమయి నట్లయితే) నీ ఒళ్ళంతా వెలుగుతోనే నిండి ఉండాలి.” - మత్తయి 6:22. గాఢంగా ధ్యానం చేసే సమయంలో నుదుటికి నడుమ ఒంటికన్ను లేదా జ్ఞాననేత్రం అవుపడుతుంది. సర్వదర్శకమైన ఈ కంటినిగురించి పవిత్ర గ్రంథాల్లో మూడోకన్ను అనీ, తూర్పుచుక్క అనీ, లోపలికన్ను అనీ, స్వర్గంనుంచి దిగివస్తున్న పావుర మనీ, శివుడికన్ను అనీ, సహజావబోధ (అంతర్జ్ఞాన) నేత్రమనీ ఇంకా ఇలా రకకాలుగా ప్రస్తావించారు.
  6. “చెవి నిచ్చినవాడు వినడా? కన్ను కల్పించినవాడు చూడడా ?.... మనిషికి జ్ఞానం నేర్పేవాడు. తాను తెలుసుకోడా?” - సామ్స్ 94 : 9-10.
  7. ప్రకృతిమీద అధికారంగల మంత్రోచ్చారణల్ని గురించిన ప్రస్తావనలు అన్నిదేశాల ప్రజల జానపద వాఙ్మయంలోనూ ఉన్నాయి. వానకోసం, నీటికోసం అమెరికన్, ఇండియన్‌లు శాబ్దిక క్రతువులు కనిపెట్టిన సంగతి బాగా తెలిసిందే. హైందవ సంగీత విద్వాంసుల్లో మహనీయుడైన తాన్ సేన్, తన గాన శక్తితో మంటను ఆర్పగలిగినవాడు. కాలిఫోర్నియా ప్రకృతి శాస్త్రజ్ఞుడు చార్లెస్ కెలాగ్, 1926 లో నిప్పుమీద నాద స్పందనకు గల ప్రభావాన్ని, న్యూయార్క్ అగ్నిమాపక దళం వాళ్ళముందు ప్రదర్శించాడు. (“పరిమాణాన్ని విస్తృతంగా పెంచి చేసిన ఫిడేలుకమానులాంటిదాన్ని ఒక అల్యూమినియం ట్యూనింగ్ ఫోర్క్‌కి అడ్డంగా ఇటూఅటూ గబగబా ఆడించి, తీవ్రమయిన రేడియో స్థాయీ ధ్వనిలాంటి కీచుస్వరాన్ని పలికించాడు. గుల్లగా ఉన్న ఒక గాజు గొట్టంలో ఎగిరెగిరి పడుతున్న రెండడుగుల ఎత్తుగల పసుప్పచ్చటి గ్యాస్‌మంట, ఆరంగుళాల ఎత్తుకు తగ్గి గిలగిలకొట్టుకుంటూ నీలిమంటగా మారింది. అలాగే ఆ కమానుతో మళ్ళీ మరోసారి చేసేటప్పటికి కీచుస్వరంతో మరోసారి స్పందన వెలువడి మంటని ఆర్పేసింది."
  8. నిగూఢమైన సుషుమ్ననాడీ కేంద్రాల్ని (చక్రాలు, సూక్ష్మరూపమైన పద్మాలు) మేల్కొల్పడమే యోగి పవిత్ర లక్ష్యం. బైబిలు కొత్త నిబంధన గ్రంథంలో “ప్రకటన” అనే అధ్యాయంలో, ఏసుప్రభువు యోహానుకూ సన్నిహితులైన ఇతర శిష్యులకూ బోధించిన ఒకానొక యోగశాస్త్రానికి ప్రతీకాత్మకమైన నిరూపణ ఉందన్న సంగతి పాశ్చాత్య భాష్యకారులు అర్థం చేసుకోలేదు. యోహాను (ప్రకటన 1 : 20) “ఏడు నక్షత్రాల మర్మం”, “ఏడు సంఘాలు” పేర్కొన్నాడు; ఈ ప్రతీకలు, మేధోమేరు దండాక్షంలో ఏడు “బోను తలుపులు”గా యోగశాస్త్ర గ్రంథాల్లో వర్ణించిన ఏడు తేజఃపద్మాల్నీ సూచిస్తాయి. దైవనియోజిత మైన ఈ “నిర్గమన ద్వారాల” గుండా యోగి, శాస్త్రీయమైన ధ్యానంవల్ల శరీర మనే బందిఖానా నుంచి తప్పించుకుని తిరిగి చిదాత్మగా తన నిజస్వరూపాన్ని తాలుస్తాడు (అధ్యాయం 26 చూడండి). మెదడులో “వెయ్యి రేకుల తామరపువ్వు” అని చెప్పే ఏడో కేంద్రం, అనంత చైతన్య రూపుడైన పరమాత్మ సింహాసనం. ఆధ్యాత్మిక జ్ఞానానుభవ స్థితిలో యోగి, బ్రహ్మను లేదా దేవుణ్ణి పద్మజుడిగా దర్శిస్తాడు; పద్మజుడంటే, “తామరపువ్వులో పుట్టినవాడని అర్థం.” “పద్మాసనం” అని అనడానికి కారణం, సాంప్రదాయికమైన ఆ ఆసనంలో యోగి, మేధోమేరుదండ కేంద్రం తాలూకు వివిధ వర్ణభాసితమైన పద్మాల్ని చూస్తాడు. ఒక్కొక్క పద్మానికి ఒక్కొక్క సంఖ్యలో, ప్రాణశక్తితో రూపొందిన రేకులు లేదా కిరణాలు ఉంటాయి. ఈ పద్మాల్ని చక్రాలు అని కూడా అంటారు.