Jump to content

ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 14

వికీసోర్స్ నుండి

అధ్యాయం : 14

విశ్వచేతనానుభవం

“వచ్చేశాను గురూజీ” నా మాటలకన్న సిగ్గుతో చిన్నబోయిన నా ముఖమే ఎక్కువ చెబుతోంది.

“వంటింట్లోకి వెళ్ళి ఏమైనా తినడానికి చూసుకుందాం పద.” మాకు ఎడబాటు కలిగించినవి కేవలం కొన్ని గంటలేకాని రోజులు కావన్నంత మామూలుగా ఉంది శ్రీయుక్తేశ్వర్‌గారి ధోరణి.

“గురుదేవా, నావిధులు విడిచిపెట్టి ఇక్కణ్ణించి అకస్మాత్తుగా వెళ్ళిపోయి మీకు నిరాశకలిగించి ఉంటాను; నా మీద మీకు కోపం వస్తుందేమో అనుకున్నాను.”

“లేదు, లేనేలేదు! కోపమన్నది తీరని కోరికలవల్లే పుడుతుంది. నేను ఎవరిదగ్గర్నించీ ఏమీ ఆశించను; అంచేత వాళ్ళు చేసే పనులు నా ఆశలకు వ్యతిరేకంగా ఉండలేవు. నిన్ను నా అవసరాలకెన్నడూ వాడుకోను; నీ నిజమైన సంతోషమే నాకు సంతోషం.”

“గురుదేవా, దివ్య ప్రేమగురించి అస్పష్టంగానే వింటాం; కాని ఈ నాడు మీ దివ్యస్వరూపంలోనే దానికి వాస్తవమైన నిదర్శన కనిపిస్తోంది నాకు! ఈ లోకంలో, తండ్రి కూడా, తాను అప్పగించిన పనిని కొడుకు చెప్పా చెయ్యకుండా వదిలిపెట్టిపోయినట్లయితే ఆ కొడుకును సులువుగా క్షమించడు. కాని మీరు, నేను అరగొరగా విడిచి వెళ్ళిపోయిన అనేక పనులవల్ల ఎంతో అసౌకర్యానికి గురిఅయి కూడా రవ్వంత విసుగయినా చూపించలేదు.”

మేము ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకున్నాం; వాటిలో కన్నీళ్ళు మెరుస్తున్నాయి. ఒకానొక ఆనంద తరంగం నన్ను ముంచెత్తింది. ఈశ్వరుడు నా గురుదేవుల రూపంలో, నా హృదయంలోని స్వల్పమైన ఉత్సాహాల్ని అవధులులేని విశ్వప్రేమ సీమలుగా విస్తరింపజేస్తున్నా డన్న సంగతి నాకు స్పృహలోకి వచ్చింది.

కొన్నాళ్ళ తరవాత ఒకరోజు పొద్దున నేను మా గురుదేవులు మామూలుగా కూర్చునే గదికి దారి తీశాను. ఖాళీగా ఉన్న ఆ గదిలో ధ్యానం చేసుకోవాలని నా ఉద్దేశం; కాని చెప్పుచేతుల్లో లేని నా ఆలోచనలు, మెచ్చుకోదగ్గ నా ఉద్దేశంతో సహకరించడం లేదు. వేటగాణ్ణి చూసిన పక్షుల్లా చెల్లాచెదరవుతున్నాయవి.

“ముకుందా!” దూరంగా ఉన్న బాల్కనీనుంచి శ్రీ యుక్తేశ్వర్ గారి గొంతు వినిపించింది.

నా ఆలోచనల్లాగే నాలో కూడా తిరుగుబాటు ధోరణి తలెత్తింది. “గురువుగారెప్పుడూ నన్ను ధ్యానం చెయ్యమని చెబుతూంటారు. తీరా నేను తమ గదిలోకి ఎందుకువచ్చానో తెలిసి కూడా ఆయన చెడగొట్టగూడదు,” అని గొణుక్కున్నాను.

ఆయన మళ్ళీ పిలిచారు నన్ను; నేను మొండికేసి, చప్పుడు చెయ్యకుండా ఊరుకున్నాను. మూడోసారి ఆయన గొంతులో మందలింపు కూడా మిళితమై ఉంది.

“నేను ధ్యానం చేసుకుంటున్నానండి,” అభ్యంతరం చెబుతున్న ధోరణిలో అరిచాను. “నాకు తెలుసులే, నువ్వెలా ధ్యానం చేస్తున్నావో; తుఫానులో అల్లల్లాడిపోతున్న ఆకుల్లా చెదిరిపోతోంది నీ మనస్సు,” అంటూ కేక వేశారు గురుదేవులు.

భంగపడి, బయటపడి, విచారంగా ఆయన దగ్గరికి వెళ్ళాను.

“వెర్రినాయనా, నీకు కావలసింది కొండలు ఇయ్యలేవు.” గురుదేవులు బుజ్జగింపుగా, ఓదార్పుగా పలికారు. ఆయన చల్లని చూపు అంతు తెలియనంత లోతుగా ఉంది. “నీ హృదయాభిలాష నెరవేరుతుంది.”

శ్రీయుక్తేశ్వర్‌గారు గూఢంగా మాట్లాడడం అరుదు; నేను కలవరపడ్డాను. ఆయన నా గుండెకు పై భాగంలో సుతారంగా చేత్తో తట్టారు.

నా శరీరం కదలకుండా పాతుకుపోయింది; నా ఊపిరితిత్తుల్లోంచి నా శ్వాస, ఏదో ఒక పెద్ద అయస్కాంతంతో బయటికి లాగేసినట్లయింది. నా ఆత్మా, మనస్సూ తక్షణమే వాటి భౌతికబంధాన్ని కోల్పోయి, ద్రవరూప కాంతికిరణాల మాదిరిగా నాలో ప్రతి రంధ్రంలోంచి బయటికి ప్రసరించాయి. నాలో ఉన్న కండ నిర్జీవమైపోయినట్టు ఉన్నా, అంతకు ముందెన్నడూ నేను అంతటి సంపూర్ణ చైతన్యంతో తొణికిసలాడలేదని నాకు కలిగిన ప్రగాఢ స్పృహవల్ల తెలుసుకున్నాను. నా తాదాత్మ్యబోధ, ఒక శరీరానికి సంకుచితంగా కట్టుబడి ఉండకుండా చక్రగతిలో సంచలించే అణువులకు కూడా విస్తరించింది. దూరాన వీథుల్లో ఉన్న జనం, నా దూరపరిధి మీదే మెల్లగా కదులుతున్నట్టు అనిపించింది. మట్టికున్న మంద పారదర్శకత వల్ల మొక్కలవేళ్ళూ చెట్లవేళ్ళూ భూమిలోంచి స్పష్టంగా కనిపించాయి; వాటి జీవరస ప్రవాహాన్ని కూడా గమనించాను.

చుట్టుపక్కల ప్రదేశమంతా నా ముందు బట్టబయలుగా ఉంది. మామూలుగా ఎదుటఉన్న వాటిని మాత్రమే చూడగల నా చూపు ఇప్పుడు అన్నిటినీ చూడగలిగేట్టుగా, విస్తృత వలయాకార దృష్టిగా మారింది. నా తలకు వెనకభాగం ద్వారా, రాయ్‌ఘాట్ సందుకు దిగువున దూరంగా నడుస్తున్న మనుషుల్ని చూశాను , తెల్లటి ఆవు ఒకటి తాపీగా నడిచి వస్తూండడం కూడా గమనించాను. అది, తెరిచిపెట్టిన ఆశ్రమం గేటును చేరినప్పుడు, భౌతికమైన నా రెండు కళ్ళతోనూ చూస్తున్నట్టుగానే దాన్ని పరిశీలించాను. అది ముంగిలి బయటి ఇటిక గోడ వెనక్కి సాగిపోయిన తరవాత కూడా స్పష్టంగానే చూశాను.

అన్ని వైపులా కనిపిస్తున్న నా సర్వదిగ్దర్శక దృష్టికి సోకిన వస్తువులన్నీ కంపిస్తూ చురుకుగా సాగే చలనచిత్రాల మాదిరిగా స్పందించాయి. నా శరీరం, గురుదేవులది, స్తంభాలుగల ముంగిలి, ఉపకరణ సామగ్రి, చెట్లు, ఎండ, అప్పుడప్పుడు తీవ్రంగా అల్లల్లాడి చివరికి కరిగి పోయి ఓ కాంతి సముద్రమయిపోయాయి; గ్లాసుడు నీళ్ళలో వేసిన పంచదార గడ్డలు, గ్లాసు కుదిపినప్పుడు కరిగిపోయినట్లుగా! అన్నిటినీ ఏకంచేసే కాంతి, పర్యాయక్రమంలో స్థూలరూపంలోకి మారుతోంది. ఈ రూపాంతరణ క్రియలు సృష్టిలోని కార్యకారణ సూత్రాన్ని వెల్లడి చేస్తున్నాయి.

నా ఆత్మ తాలూకు ప్రశాంత అనంత తీరాల మీదికి ఒకానొక ఆనందసాగరం వెల్లువలా పొంగి వచ్చింది. పరమాత్మ స్వరూపం అక్షయ ఆనందమన్న అనుభవం పొందాను; ఆయన దేహం అసంఖ్యాకమైన కాంతికణజాలాలు. నాలో పెల్లుబుకుతున్న దివ్యప్రధ పట్నాల్నీ, ప్రపంచ ఖండాల్నీ భూమినీ, సూర్యమండలాన్నీ, నక్షత్ర మండలాన్నీ, సూక్ష్మ నీహారికల్నీ తేలి ఆడే ఆ బ్రహ్మాండాల్నీ చుట్టుముట్టడం మొదలు పెట్టింది. రాత్రివేళ దూరాన కనిపించే నగరంలా, మందకాంతితో వెలుగొందే సమస్త జగత్తూ నా అస్తిత్వపు అనంతత్వంలోనే మిణుకుమిణుకు మంటున్నది. స్ఫుటంగా చెక్కినట్టున్న గోళాకార పరిరేఖలకు అవతల మిరుమిట్లు గొలుపుతున్న కాంతి, దూరపు అంచులదగ్గర కొద్దిగా మందగించింది. అక్కడ నేను, ఎన్నటికీ తరగని పరిపూర్ణ ప్రభను దర్శించాను. మాటల్లో చెప్పలేనంత సుసూక్ష్మమైనదది; గ్రహరూపాలు అంతకన్న స్థూలమైన కాంతితో ఏర్పడ్డవి.[1]

శాశ్వత ఆకరమయిన పరమాత్మనుంచి ప్రసారితమైన కిరణాల దివ్యనిక్షేపం, నక్షత్ర వీధులుగా ప్రజ్వలిస్తూ వర్ణించనలవిగాని ప్రభలుగా రూపాంతరితమవుతోంది. సృజనశీలక కిరణాలు నక్షత్రమండలాలుగా ఘనీభవించి, ఆ తరవాత పారదర్శక జ్వాలలుగా కరిగిపోవడం మళ్ళీ మళ్ళీ చూశాను. లయబద్ధమైన విపర్యయంవల్ల కోటానుకోట్ల లోకాలు నిర్మల కాంతిలోకి ప్రవేశించాయి. అటు మీదట అగ్ని, ఆకాశంగా మారింది.

తేజోమండల కేంద్రాన్ని నా గుండెలో సహజావబోధ గ్రహణ బిందువుగా గుర్తించారు. నాలోని కేంద్రకం నుంచి వెలువడుతున్న ఉద్దీప్త ప్రథ విశ్వనిర్మితిలో ప్రతి భాగానికి ప్రసరిస్తోంది. అమరత్వాన్ని ప్రసాదించే ఆనందమయ అమృతం, పాదరసంలా ప్రవహిస్తూ నాలో అణు వణువునా స్పందించింది. పరమేశ్వరుడి సృజనాత్మక స్వరం విశ్వ చలన యంత్ర స్పందమయిన ఓంకారం[2]గా ప్రతిధ్వనిస్తూ ఉండడం విన్నాను.

హఠాత్తుగా నా ఊపిరితిత్తుల్లోకి శ్వాస తిరిగి వచ్చింది. నా అనంత అపరిమితత్వాన్ని కోల్పోయానని గ్రహించి, దాదాపు భరించలేనంతగా నిస్పృహ చెందాను. చిచ్ఛక్తికి సులువుగా వసతి కల్పించలేని, అవమానకరమయిన శరీరపంజరానికి నేను మళ్ళీ బందీనయాను.

వ్యర్థజీవితం గడిపే కుర్రవాడిలా నేను బ్రహ్మాండ గృహంనుంచి పారిపోయి సంకుచితమైన ఒక సూక్ష్మ పరిధిలో నన్ను నేను బందీని చేసుకున్నాను.

మా గురుదేవులు నా ఎదురుగా నిశ్చలంగా నించుని ఉన్నారు; చాలాకాలం గాఢమైన ఆకాంక్షతో నేను అన్వేషిస్తూ వచ్చిన విశ్వచేతనానుభవాన్ని (సమాధి స్థితిని) నాకు ప్రసాదించినందుకు ఆయన పాదాల ముందు కృతజ్ఞతతో సాష్టాంగదండ ప్రణామం చెయ్యబోయాను. అప్పు డాయన నన్ను నిటారుగా నిలబెట్టి ప్రశాంతంగా ఇలా అన్నారు;

“నువ్వు పరమానందంతో మరీ అంత మితిమించి మత్తెక్కి పోగూడదు. ప్రపంచంలో నీ కోసం ఇంకా చాలాపని ఉండిపోయింది. రా, బాల్కనీ తుడుద్దాం; ఆ తరవాత అలా గంగ ఒడ్డున తిరిగి వద్దాం.”

నే నొక చీపురుకట్ట తెచ్చాను. గురుదేవులు నాకు సంతులిత జీవన రహస్యం బోధిస్తున్నారని తెలుసుకున్నాను. శరీరం తన దైనందిన విధులు నిర్వర్తిస్తూ ఉండగా ఆత్మ, విశ్వసృష్టిలోని అగాధాల్ని గురించి చింతన చేస్తూ తరిచి చూస్తూ ఉండాలి.

తరవాత శ్రీ యుక్తేశ్వర్‌గారూ నేనూ బయట తిరగడానికి బయలు దేరేటప్పటికి ఇంకా నేను, మాటల్లో చెప్పజాలని ఆనందంలో తన్మయుణ్ణయి ఉన్నాను. మా ఇద్దరి శరీరాల్నీ, కేవలం వెలుతురే మూలభూతంగా గల నదీ తీరంలో రోడ్డుమీద నడుస్తున్న రెండు సూక్ష్మచిత్రాలుగా దర్శించాను.

“జగత్తులో ప్రతి రూపాన్ని ప్రతి శక్తినీ క్రియాశీలకంగా నిలిపేది పరమేశ్వరుడి దివ్యశక్తి; అయినప్పటికీ ఆయన, స్పందనశీలమైన భౌతిక లోకాలకు ఆవల, ఆనందమయమైన అకల్పితశూన్యంలో సర్వోత్కృష్టంగా నిస్సంగుడై ఉంటాడు,"[3] అని వివరించారు. గురుదేవులు,

భూమి మీద ఆత్మసిద్ధి సాధించినవాళ్ళు అదే మాదిరి రెండు విధాల జీవనం గడుపుతారు. ప్రపంచంలో తమ పనిని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూనే లోలోపలి పరమానందంలో నిమగ్నులై ఉంటారు.

“ఈశ్వరుడు మానవులందరినీ తన ఉనికికున్న అపరిమితానందం లోంచి సృష్టించాడు. మానవులు, బాధాకరంగా శరీరం కలిగించే అడ్డంకుల్ని ఎదుర్కొంటున్నప్పటికీ భగవంతుడు, తన రూపంలో తయారయిన మానవులు చివరికి ఇంద్రియావరోధాలన్నింటికీ అతీతంగా నిలబడి తనలో ఐక్యం కావాలని ఆశిస్తాడు.

ఈ విశ్వచేతనాదృశ్యం నాకు శాశ్వత గుణపాఠాలు నేర్పింది. నా ఆలోచనల్ని ప్రతిరోజూ నిశ్చలంచేస్తూ, నా శరీరం భౌతికపదార్థమైన భూమిపైన సంచరించే మాంసాస్థికల ముద్ద అనే భ్రాంతిపూర్వకమైన దృఢవిశ్వాసంలోంచి బయటపడ్డాను. ఊపిరి, నిలకడలేని మనస్సూ కాంతి సముద్రాన్ని కల్లోలపరిచి భూమి, ఆకాశం, మనుషులు, జంతువులు, పక్షులు, చెట్లూ వంటి భౌతికపదార్థ రూపాలనే కెరటాల్ని పుట్టించే తుఫానుల వంటివన్న సంగతి గమనించాను. ఆ తుఫానుల్ని శాంతింపజేస్తే తప్ప అనంత సత్తను ఒకే కాంతిగా దర్శించగలగడం జరగదు.

ఈ రెండు సహజ సంక్షోభాల్నీ నేను ఎంత తరచుగా శాంతపరిస్తే అంత తరచుగా, తుఫాను అణిగిపోయిన తరవాత స్థిమితంగా ఒకటిగా కలిసిపోయే సముద్ర తరంగాల మాదిరిగా అసంఖ్యాకమైన సృష్టితరంగాలు తేజస్సాగర రూపంలోకి మారిపోవడం గమనిస్తూ వచ్చాను.

విశాలమైన దృశ్యాలు తనను తబ్బిబ్బు చెయ్యనంతటి స్థాయివరకు శిష్యుడు ధ్యానంవల్ల మనస్సును గట్టిపరుచుకున్నప్పుడు గురువు తన శిష్యుడికి విశ్వచేతనానుభవం ప్రసాదిస్తాడు. కేవలం ప్రాజ్ఞ సంబంధమైన సంకల్పంకాని నిష్కాపట్యంకాని చాలవు. యోగసాధనవల్లా భక్తివల్లా తగినంతగా విస్తృతిచెందిన చైతన్య మొక్కటే, సర్వవ్యాపకత్వంవల్ల కలిగే ముక్తిప్రదమైన అఘాతానికి తట్టుకొనేటట్టుగా మనిషిని తయారు చెయ్యగలదు.

చిత్తశుద్ధిగల భక్తుడికి దివ్యానుభూతి సహజంగానే తప్పనిసరిగా వస్తుంది. అతని గాఢమైన ప్రార్థన, ఆపడానికి వీలులేనంత శక్తితో దేవుణ్ణి ఆకర్షించడం మొదలుపెడుతుంది. ఆ ఆకర్షణ తీవ్రతవల్ల ఈశ్వరుడు అన్వేషకుడి చైతన్యపరిధిలోకి విశ్వదర్శనంగా ఆకృష్టుడవుతాడు.

తరవాత కొంత కాలానికి, “సమాధి” అన్న పేరుతో నేను ఈ కింది పద్యం రాశాను; దాని శోభను ఇలా అభివర్ణించడానికి ప్రయత్నించాను;

మటుమాయమయినాయి వెలుగు నీడల తెరలు,
హరించిపోయింది ప్రతి దుఃఖబాష్పం,
గతించి పోయాయి క్షణికానంద ఉషోదయాలు,
తొలగిపోయింది ఇంద్రియాల క్షీణ మరీచిక.
రాగద్వేషాలూ సుఖాసుఖాలూ జీవన్మరణాలూ అనే మిథ్యాఛాయలు
నశించిపోయాయి ద్వైతమనే వెండితెరమీద.
నిలిచిపోయింది మాయాఝంఝ
గాఢ సహజావరోధ మంత్రదండ చాలనంతో,
లేవు నాకిక వర్తమాన భూతభవిష్యత్తులు,
అయినా నిత్యుణ్ణయి, సర్వవ్యాపకుణ్ణయి, నేనే, నేనే, ప్రతిచోటా
గ్రహాలు, నక్షత్రాలు, నీహారికాపుంజం, భూమి,
ప్రళయకాల ఉత్పాతాల అగ్నిపర్వత ఉజ్జృంభాలు
సృష్టికి ఉపకరించే మండుతున్న కొలుములు.

చప్పుడులేని ఎక్స్-రేల మంచుదిబ్బలు, మండుతున్న ఎలక్ట్రాన్ వరదలు,
మనుషులందరి ఆలోచనలూ, వెనక, ఇప్పుడు, ఇకముందటి వాళ్ళవీ,
ప్రతి గడ్డిపోచా, నేనూ, మానవజాతీ,
విశ్వధూళిలో ప్రతి ఒక్క కణం,
కోపం, పేరాస, మంచి, చెడు, మోక్షం, కామం,
మింగేశానన్నిటినీ, మార్చేశానన్నిటినీ
నా ఏకైక అస్తిత్వంలో ప్రసరించే ఒక సువిశాల రక్త మహా సముద్రంగా.
రగులుతున్న ఆనందం, ధ్యానంవల్ల తరచు పెల్లుబికి
నీళ్ళు నిండిన నా కళ్ళను మిరుమిట్లుగొలుపుతూ
పేలి పరమానంద అమరజ్వాలలయి,
హరించింది నా కన్నీళ్ళని, నా దేహాన్ని, నావాటి నన్నిటినీ.
నువ్వే నేను, నేనే నువ్వు.
జ్ఞానం, జ్ఞాత, జ్ఞేయం అన్నీ ఒక్కటే.
కుదుటబడ్డ, ఎడతెగని పులకింత, శాశ్వతమై, జీవంతమై, నిత్య నూత్నమైన శాంతి.
ప్రతీక్ష ఊహకు అందనంతగా ఆనందించదగ్గది, ‘సమాధి’ పరమానందం!
కాదిది అచేతనావస్థ
కానేకాదు మనసుకు మత్తుమందు, ఇచ్ఛానుసారం తిరోగమించే వీలులేకుండా,
విస్తరిస్తుంది నా చేతనాసీమను సమాధి
నశ్వర దేహ పరిమితులకు అతీతంగా

అనంతకాలపు దూరాతిదూర చరమావధిదాకా.
విశ్వసాగరాన్ని నేను,
గమనిస్తున్నాను నాలో తేలుతూపోతున్న చిన్నారి అహాన్ని.
వినిపించాయి అణువుల సచల మర్మరధ్వనులు;
నల్లని నేల, పర్వతాలు, లోయలు, అదుగో, వాటిని కరిగించి పోసిన ద్రవం!
మారుతున్నాయి పారే సముద్రాలు నీహారికాబాష్పాలుగా.
ధ్వనిస్తోంది ఓంకారం ఆ ఆవిరులమీద, అద్భుతంగా తెరుస్తూ వాటి ముసుగుల్ని.
బయల్పడిఉన్నాయి మహాసాగరాలు, మెరిసే ఎలక్ట్రాన్లు ,
విశ్వమృదంగం[4] చివరి ముక్తా యింపుతో,
అదృశ్యమై స్థూలకాంతులు
సర్వవ్యాపకానందపు శాశ్వతకిరణాలుగా మారేదాకా.
వచ్చాను ఆనందంనుంచి, జీవిస్తాను ఆనందంకోసమే, కరిగిపోతాను పవిత్రానందంలోనే.
పానం చేస్తాను మహామనస్సాగరంగా, సృష్టితరంగా లన్నిటినీ,
ఘనం, ద్రవం, ఆవిరి, వెల్తురు, తెరలు నాలుగూ
లేచిపోయాయి పైపైకి.
అన్నిటిలో నేను, ప్రవేశించాను మహిమాన్వితమైన నేనులోకి,
తొలగిపోయాయి శాశ్వతంగా, మర్త్యస్మృతి క్షణిక క్షీణ ఛాయలు,
నిష్కళంకంగా ఉంది నా మానసాకాశం, కిందా ముందూ పైపైనా
నిత్యత్వమూ నేనూ, సమైక్యమైన ఒక్క కిరణం.

ఒక్క చిన్ని నవ్వులబుడగని, నేను
అయిపోయాను ఆనందసాగరంగా.

శ్రీయుక్తేశ్వర్‌గారు నాకు, పరమానందకరమైన ఆ అనుభవాన్ని ఇచ్ఛానుసారంగా ఆవాహనచెయ్యడం ఎలాగో, ఇతరులకు,[5] వాళ్ళ సహజావబోధ మార్గాలు తగిన విధంగా అభివృద్ధి చెందినప్పుడు, ఆ అనుభవం కలిగించడం ఎలాగో నాకు నేర్పారు.

మొదటిసారి అనుభవమయిన తరవాత నేను, ఉపనిషత్తులు దేవుణ్ణి “అత్యంత ఆస్వాదయోగ్యం” అనే అర్థంలో ‘రస’మని (“రసోవై సః” తై తిరీయం) - ఎందుకు చెబుతాయో ప్రతిరోజూ గ్రహిస్తూ కొన్ని నెలల పాటు తాదాత్మ్యస్థితిని పొందుతూ ఉండేవాణ్ణి. అయినప్పటికీ ఒకనాడు పొద్దున గురుదేవుల్ని ఇలా అడిగాను:

“నేను దేవుణ్ణి ఎప్పుడు చూస్తానో తెలుసుకోవాలని ఉందండి.”

“నువ్వు చూశావు.”

“లేదు లేదండి. నేనలా అనుకోడం లేదు!”

మా గురుదేవులు చిన్నగా నవ్వుతున్నారు. “ఈ విశ్వంలో పరిశుభ్రమైన ఒక మూల, ఒక సింహాసనాన్ని అలంకరించిన పూజనీయుడైన ఒక వ్యక్తిని చూడాలనిమట్టుకు నువ్వు ఆశించడంలేదనే నమ్ముతున్నాను! అయితే, ఎవరయినా భగవంతుడి సాక్షాత్కారం పొందినందుకు రుజువుగా అద్భుతశక్తులు కలగాలని నువ్వు ఊహిస్తున్నట్టు కనిపిస్తోంది. అలా కాదు. ఒకడు విశ్వాన్ని అంతనీ అదుపుచెయ్యగల శక్తి సంపాదించి ఉండ వచ్చు– అయినప్పటికీ ఈశ్వరుడు చిక్కకుండానే ఉండవచ్చు. ఆధ్యాత్మిక ప్రగతిని బాహ్యశక్తుల ప్రదర్శననిబట్టి కాకుండా, కేవలం ధ్యానంలో కలిగే ఆనందగాఢతనుబట్టి మాత్రమే గణించాలి.

“నిత్య నూతనానందమే దేవుడు. ఆయన అక్షరుడు; ఇకముందు సంవత్సరాల్లో నువ్వు ధ్యానసాధన కొనసాగిస్తూ పోయినకొద్దీ ఆయన అనంతమైన చాతుర్యంతో నిన్ను మాయచేస్తూ ఉంటాడు. దైవసాక్షాత్కారం పొందే మార్గం కనుక్కున్న నీలాంటి భక్తుడు మరే సుఖంకోసమూ దేవుణ్ణి వదులుకోడు; ఆయన, పోటీనిగురించిన ఆలోచనకే అతీతంగా, మోహంలో పడేస్తాడు.

“ప్రాపంచిక సుఖాలతో ఎంత తొందరగా విసిగిపోతామో! భౌతిక వస్తువులకోసం కలిగే కోరికకు అంతులేదు; మనిషి ఎన్నడూ పూర్తిగా తృప్తిపడలేడు; ఒక గమ్యం తరవాత మరో గమ్యానికి పాకులాడతాడు. అతడు అన్వేషించే “ఆ మరొకటి” ఈశ్వరుడే; శాశ్వతానందాన్ని ప్రసాదించగలవాడు ఆయనొక్కడే.

“బాహ్య కామనలు మనని లోపలున్న, ‘స్వర్గం’ నుంచి తరిమేస్తాయి; అవి కేవలం ఆత్మానందపాత్రను అభినయించే మిథ్యాసుఖాల్ని మాత్రమే చేకూరుస్తాయి. పోయిన స్వర్గాన్ని దైవధ్యానం ద్వారా తొందరగా తిరిగి పొందడం జరుగుతుంది. దేవుడు, ముందుగా ఊహించడానికి వీలులేని నిత్యనూతనత్వం కావడంవల్ల ఆయనంటే మనకెన్నడూ విసుగుపుట్టదు. అనంత కాలమంతటా సంతోషభరితంగా వైవిధ్యం చూపించే పరమానందం మనకు ఎక్కసం కావడం సాధ్యమా?”

“ఈశ్వరుడు అవగాహనకు అతీతుడని సాధువులు ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకున్నానండి. ఆయన్ని అంచనా వెయ్యడానికి చిరంతన జీవితం కూడా చాలదు.” “అది నిజం; కాని ఆయన సన్నిహితుడూ ప్రియుడూ కూడా. క్రియాయోగంవల్ల మనస్సు ఇంద్రియావరోధాల్ని తొలగించేసిన తరవాత ధ్యానం, దేవుణ్ణి రెండు విధాల నిదర్శనంతో నిరూపిస్తుంది. మనలో అణు వణువుకూ నమ్మకం కలిగించే విధంగా అనుభూతమయే నిత్యనూతనానందం ఆయన ఉనికికి నిదర్శనం. అంతే కాకుండా, కలిగిన ప్రతి కష్టానికీ ఆయన దగ్గర్నించి, అవసరమైన సమాధానం, తక్షణ మార్గనిర్దేశ రూపంలో ధ్యానంలో లభిస్తుంది.”

“గురూజీ, మీరు నా చిక్కు విప్పేశారన్నది స్పష్టమయింది.” కృతజ్ఞతాభరితంగా చిరునవ్వు నవ్వాను. “నేను దేవుణ్ణి దర్శించానని ఇప్పుడు తెలుసుకున్నాను; ఎలాగంటే, మామూలుగా నా పనులు నేను చేసుకునే సమయాల్లో, ధ్యానంలో కలిగినప్పటి ఆనందం, అవచేతనా రూపంగా మళ్ళీ నాకు కలిగినప్పుడల్లా ప్రతి విషయంలోనూ, చిన్నచిన్న వివరాలతో సహా, నేను సరయిన దారి పట్టేటందుకు, సూక్ష్మపద్ధతిలో, నన్ను ముందుకు నడిపించడం జరుగుతోంది.”

“దైవసంకల్పంతో ఐక్యానుసంధానం చెయ్యడమెలాగో తెలుసుకునే వరకు మానవజీవితం దుఃఖభూయిష్ఠంగానే ఉంటుంది; ఆయన నిర్ణయించిన ‘సరయిన దారి’. అహంభావపూరితమైన తెలివిని తరచుగా గాభరాపెడుతూ ఉంటుంది,” అన్నారు గురుదేవులు.

“దేవుడొక్కడే తప్పులేని సలహా ఇస్తాడు; ఆయన తప్ప మరెవ్వరు మొయ్యగలరు ఈ బ్రహ్మాండభారాన్ని?”

  1. సృష్టికి సారభూతమయిన కాంతినిగురించి 30 అధ్యాయంలో వివరించడం జరిగింది.
  2. “ఆదిలో శబ్దం ఉండేది , ఆ శబ్దం ఈశ్వరుడివద్ద ఉండేది; ఆ శబ్దమే ఈశ్వరుడు.” యోహాను 1: 1 (బైబిలు),
  3. తండ్రి అయిన పరమాత్మ ఎవ్వరిగురించీ తీర్పు ఇవ్వడు; కాని తీర్పు ఇచ్చే పని అంతా తన ‘కుమారు’డికి అప్పగించాడు. – యోహాను 5 : 22. “మానవుడెవడూ ఏనాడూ దేవుణ్ణి చూడలేదు; కేవలం, జగత్పిత హృదయంలో ఉండే, ఆయన ఏకైక పుత్రుడు మాత్రం ఆయన్ని గురించి చాటి చెప్పాడు.” – యోహాను 1 : 16. “దేవుడు ఏసుక్రీస్తు ద్వారా అన్నిటినీ సృష్టించాడు.” – ఇఫేషియన్స్ 3 : 9. “నన్ను నమ్ముకొన్నవాడు కూడా నేను చేసే పనులన్నీ చేస్తాడు , నేను మా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను కాబట్టి అతడు ఇంతకన్న గొప్ప పనులు చేస్తాడు.” – యోహాను 14 : 12. “జగత్పిత నా పేరున పంపే సుఖప్రదుడైన పరిశుద్ధాత్మ మీకు అన్నిటినీ బోధిస్తాడు, నేను మీకు చెప్పినవాటి నన్నిటినీ ఆయన మీకు జ్ఞాపకం చేస్తాడు.” – యోహాను 14 : 36 (బైబిలు).

బైబిలులో చెప్పిన ఈ మాటలు దేవుడి - త్రిరూపాత్మక ప్రకృతి అయిన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ (హిందువుల పవిత్ర గ్రంథంలో చెప్పిన సత్, తత్, ఓం) అన్న మూడింటినీ సూచిస్తాయి. జగత్పిత అయిన దేవుడు స్పందన శీలమయిన సృష్టికి అతీతంగా కేవల అవ్యక్తుడు. కుమారరూపుడైన దేవుడు స్పందన శీలమైన సృష్టికి ‘లోపల’ ఉండే క్రీస్తు చైతన్యం (బ్రహ్మ లేదా కూటస్థ చైతన్యం). ఈ క్రీస్తు చైతన్యమే ఎవరూ సృష్టించని అనంతస్వరూపుడి “ఏకైక సృష్టి” లేదా ఏకైక ప్రతిబింబం. సర్వవ్యాపకమైన క్రీస్తు చైతన్యం తాలూకు బాహ్యాభివ్యక్తి, దానికి “సాక్షి” (ప్రకటన 3 : 14) అయిన ఓంకారం, అంటే ‘శబ్దం’, లేదా ‘పరిశుద్ధాత్మ’ : ఇది అదృశ్య దివ్యశక్తి, ఏకైక కర్త, స్పందన ద్వారా సృష్టినంతనూ నిలిపే ఏకైక కారణశక్తి చాలనశక్తి. ఆనందమయమై సంప్రదాయమైన ఓంకారం ధ్యానంలో వినిపిస్తుంది; భక్తుడికి “అన్ని విషయాల్నీ జ్ఞాపకం” చేస్తూ, చరమ సత్యాన్ని వెల్లడిచేస్తుంది.

  • సృష్టినంతనూ బహిర్ముఖంచేసే, ‘శబ్దం’ లేదా సృజనాత్మక స్పందమనే ఓంకారం.
  • ప్రాచ్య పాశ్చాత్యదేశాల్లో కొంతమంది క్రియాయోగులకు నేను ఈ విశ్వదర్శనానుభవం కలిగించాను. వాళ్ళలో ఒకరు శ్రీ జేమ్స్ జె. లిన్; ఆయన సమాధిలో ఉన్న దృశ్యం ఈ పుస్తకంలోనే ఒక ఫొటోలో ఉంది.