ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 13

వికీసోర్స్ నుండి

అధ్యాయం : 13

నిద్రపోని సాధువు

“హిమాలయాలకు వెళ్ళడానికి నన్ను అనుమతించండి. ఎడతెగని ఏకాంతంలో సంతత దైవానుసంధానం సాధించాలని ఆశిస్తున్నాను.”

ఒకసారి మా గురుదేవులతో నేను కృతఘ్నతాపూర్వకమైన ఈ మాటలు నిజంగానే అన్నాను. అప్పుడప్పుడు భక్తుడికి కలిగే అనూహ్యమైన భ్రాంతి ఒకటి నన్ను లోబరుచుకున్న మీదట, ఆశ్రమ విధులన్నా కాలేజీ చదువులన్నా నాలో ఓరిమి తగ్గుతూ వచ్చింది. నేను ఈ ప్రతిపాదన చేసే నాటికి శ్రీయుక్తేశ్వర్‌గారితో పరిచయమై ఆరునెలలే కావడం, నా తప్పుకు ఒక్క రవ్వ పరిహారం అయిఉండవచ్చు. అప్పటికింకా నేను ఆయన మహోన్నత మూర్తిమత్వాన్ని పరిశీలించనే లేదు.

“హిమాలయాలో చాలామంది కొండవాళ్ళుంటారు; అయినా వాళ్ళకి దైవదర్శనానుభవం ఉండదు.” మా గురుదేవుల సమాధానం మెల్లగా, సరళంగా వినవచ్చింది. “నిశ్చేతనమైన కొండకన్న దైవసిద్ధి పొందిన మనిషిదగ్గర జ్ఞానం ఆర్జించడం ఉత్తమం.”

నా గురువు తామే కాని కొండ కాదన్న విషయం గురుదేవులు స్పష్టంగా సూచించినప్పటికీ కూడా నేను మళ్ళీమళ్ళీ నా కోరిక వెల్లడించాను. గురుదేవులు నాకు సమాధానం అనుగ్రహించలేదు. ఆయన మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నాను. అది ప్రమాదకరమైనదే కాని, దానికి నాకు అనుకూలమైన అర్థం చెప్పుకున్నాను. ఆ రోజు సాయంత్రం కలకత్తాలో మా ఇంట్లో ప్రయాణానికి చేసుకోవలసిన ఏర్పాట్లలో మునిగిపోయాను. ఒక గొంగడిలో కొన్ని వస్తువులు మూట గడుతూ ఉండగా, కొన్నేళ్ళ కిందట నా అటకమీది కిటికీలోంచి బయటికి జారవిడిచిన, అదే మాదిరి మూట నాకు గుర్తుకు వచ్చింది. హిమాలయాలకు వెళ్దామని నేను చేసిన పలాయనం, గ్రహస్థితి బాగాలేక విఫలమయినట్టుగా ఈసారి కూడా విఫలం కాదుకదా అనిపించింది. మొదటిసారి నాలో ఆధ్యాత్మిక ఉత్సాహం పరవళ్ళు తొక్కింది; కాని ఈ రోజు రాత్రి, మా గురుదేవుల్ని విడిచి వెళ్తున్న సంగతి తలుచుకుంటే నా మనస్సు పీకుతోంది.

మర్నాడు పొద్దున, స్కాటిష్ చర్చి కాలేజిలో మా సంస్కృతం ప్రొఫెసర్ గారు బిహారి పండిత్‌గారిని పట్టుకున్నాను.

“ఏమండీ, లాహిరీ మహాశయుల శిష్యుల్లో ఒక గొప్పాయనతో మీకు స్నేహం ఉందని చెప్పారు. దయఉంచి నాకు ఆయన ఎడ్రసు ఇయ్యండి,” అని అడిగాను.

“రామగోపాల్ మజుందార్ సంగతే కదూ నువ్వంటున్నది! ఆయన్ని నేను ‘నిద్రపోని సాధువు’ అంటుంటాను. ఆయనెప్పుడూ పరమానందానుభూతిలో మెలుకువగానే ఉంటారు. ఆయన ఇల్లు తారకేశ్వర్ దగ్గర రణబాజ్ పూర్ లో ఉంది.”

ఆ పండితులకు కృతజ్ఞతలు చెప్పి వెంటనే తారకేశ్వర్‌కు బయలుదేరి రైలెక్కాను. హిమాలయాల్లో ఏకాంతంగా ధ్యానం చేయడానికి ‘నిద్రపోని సాధువు’గారి దగ్గర అనుమతి తీసుకుని నా శంకలను నివృత్తి చేసుకోవాలనుకున్నాను. రామగోపాల్ మజుందార్ గారు బెంగాలులో మారుమూల గుహల్లో అనేక సంవత్సరాలపాటు క్రియాయోగ సాధన చేసిన తరవాత ఆత్మ సాక్షాత్కారం కలిగిందని బిహారి పండితులు చెప్పారు.
స్వామి శ్రీయుక్తేశ్వర్‌గారు, శ్రీ యోగానందగారు, కలకత్తా, 1935
జ్ఞానప్రభా ఘోష్ (1868-1904) శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి తల్లి శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల - భగవతీచరణ ఘోష్ (1852-1942) శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి తండ్రి శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల
శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల గురువులు
ఆరేళ్ళ వయస్సులో శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు
స్వామి ప్రణవానంద. కాశీనివాసి "రెండు శరీరాలున్న సాధువు" - స్వామి కేవలానంద శ్రీ యోగానందగారి ప్రియమైన సంస్కృత అధ్యాపకులు
యోగానందగారు భారతరాయబారికి స్వాగతమియ్యటం.


అమెరికాలోని భారత రాయబారి శ్రీ వినయ రంజన్ సేన్, లాస్ ఏంజిలస్‌లోని సెల్ఫ్ రియలైజేషన్ కేంద్ర కార్యస్థానంలో శ్రీ యోగానందగారితో, 1952 మార్చి 4 న-మహాయోగి మహాసమాధికి మూడు రోజులముందు.

మార్చి 11 న అంత్యక్రియల సందర్భంగా రాయబారి సేన్ ఇలా ప్రశంసించారు: “ఐక్యరాజ్య సమితిలో ఈనాడు పరమహంస యోగానందగారి వంటి వ్యక్తి ఒకరు ఉండి ఉంటే ప్రపంచం బహుశా ఇప్పటికంటె బాగా ఉండేదనుకుంటాను. నాకు తెలిసినంతవరకు భారత, అమెరికా ప్రజల్ని కలపటానికి వీరి కంటె ఎక్కువగా కృషిచేసినవారు, ఎక్కువగా తమను అర్పించుకొన్నవారు మరొకరు లేరు.
శ్రీ శ్రీ పరమహంస యోగానంద - "చివరి చిరునవ్వు"

వీరి మహాసమాధికి ఒక గంట ముందు తీసిన ఫోటోగ్రాఫు; భారత రాయబారి వినయ రంజన్ సేన్ గౌరవార్థం కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిలస్‌లో 1952 మార్చి 7 న ఏర్పాటయిన విందులో తీసింది. ప్రేమమయమైన ఒక చిరునవ్వును ఫోటోగ్రాఫరు ఇక్కడ పట్టుకున్నాడు. ఈ చిరునవ్వు శ్రీ యోగానందగారి లక్షలాది స్నేహితుల్లో, విద్యార్థుల్లో, శిష్యుల్లో ప్రతి ఒక్కరికీ వీడుకోలు దీవెనలా కనిపిస్తుంది. అప్పటికే అనంతలోకి చూపు సారిస్తున్న కళ్ళలో మానవ అనురక్తి అవగాహన నిండిఉన్నాయి.

సాటిలేని ఈ దైవభక్తులను నాశనం చేసే శక్తి మృత్యువుకు లేకపోయింది. వీరి దేహంలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. ఇదొక అత్యద్భుత విషయం. తారకేశ్వర్‌లో ప్రఖ్యాతమైన ఒక గుడికి దారి తీశాను. క్రైస్తవుల్లో కేథలిక్కులు, ఫ్రాన్సులో లూర్ద్ అన్న పవిత్రస్థలమంటే ఎంత శ్రద్ధా భక్తులు చూపిస్తారో హిందువులు ఈ గుడి అంటే అంతటి భక్తిభావం చూపిస్తారు. తారకేశ్వర్‌లో జబ్బుల్ని నయంచేసే అలౌకిక ఘటనలు అసంఖ్యాకంగా జరిగాయి. వాటిలో ఒకటి మా కుటుంబంలోవాళ్ళలోనే ఒకరికి అనుభవమయింది.

మా పెద్ద పినతల్లి ఒకసారి ఇలా చెప్పింది: “ఆ గుళ్ళో ఒక వారం రోజులు కూర్చుని, కటిక ఉపవాసం చేస్తూ, మీ శారద బాబయ్య గారి మొండి జబ్బు ఒకటి నయంకావాలని కోరుతూ ప్రార్థన చేశాను. ఏడో రోజున నా చేతిలో ఒక మొక్క ప్రత్యక్ష మైంది! దాని ఆకులతో కషాయం కాచి మీ బాబయ్యగారికి ఇచ్చాను. తక్షణమే ఆయన జబ్బు మాయమయిపోయింది. మళ్ళీ ఎన్నడూ రాలేదు.”

పవిత్రమైన తారకేశ్వర మందిరంలోకి ప్రవేశించాను. అక్కడ వేదిక మీద ఒక గుండ్రాయి తప్ప మరేమీలేదు. అంతంలేని దాని పరిధి అనంతుడైన ఆ పరమేశ్వరుణ్ణి సముచితంగా సూచిస్తోంది. భారతదేశంలో చదువుకోని రైతుకు కూడా అనంత విశ్వానికి సంబంధించిన అమూర్త కల్పనలు అర్థమవుతాయి; నిజానికి, అతను అమూర్తకల్పనల్లోనే జీవిస్తున్నాడని అప్పుడప్పుడు పాశ్చాత్యులు అతన్ని నిందించారు!

ఆ సమయంలో నా మనస్సు ఎంత మొండికి వేసిందంటే, ఆ శిలా చిహ్నం ముందు తలవంచడానికి కూడా విముఖుణ్ణి అయాను. దేవుణ్ణి అన్వేషించవలసింది ఆత్మలోనే అని అనుకున్నాను.

దేవుడిముందు మోకరిల్లకుండానే ఆ గుళ్ళోంచి బయటికి వచ్చి దగ్గరలో ఉన్న రణబాజ్‌పూర్ గ్రామంవేపు విసవిసా నడుచుకుంటూ వెళ్ళాను. దారి సరయినదేనన్న నమ్మకం లేదు. దారినిపోయే బాటసారిని అడిగేసరికి అతను చాలా సేపు ఆలోచనలో పడ్డాడు.

“నాలుగు దారుల కూడలి వచ్చినప్పుడు కుడివేపు తిరిగి ముందుకు సాగు,” అన్నాడు చివరికి, తన మాటకి తిరుగులేదన్నట్టు.

అతని మాట పట్టుకుని, కాలవగట్ల వెంబడే దారితీశాను. చీకటి పడింది; అడవిలో ఉన్న పల్లెశివార్లలో మిణుగురు పురుగుల మెరుపులతోను, దగ్గరలో ఉన్న గుంటనక్కల అరుపులతోనూ సంచలనం కనిపిస్తోంది. వెన్నెల పలచగా, నా కేమీ కొరగాకుండా ఉంది; రెండు గంటల సేపు తడబడుతూ నడిచాను.

ఆవు మెడలో గంట ఒకటి నాకు స్వాగతం పలికింది. పదే పదే నేను వేసిన కేకలకు చివరికి ఒక రైతు నా దగ్గరికి వచ్చాడు.

“నేను, రామగోపాల్ బాబుగారికోసం వెతుకుతున్నాను.”

“అటువంటాయనెవరూ మా పల్లెలో లేడు,” అంటున్న అతని గొంతులో చిరాకు కనిపించింది. “నువ్వు అబద్ధాలాడే పత్తేదారువయి ఉంటావు.”

రాజకీయమైన గొడవలతో ఇబ్బందిపడ్డ అతని మనస్సులో అనుమానం లేకుండా చెయ్యాలన్న ఆశతో, అతని మనస్సుకు హత్తుకునేలా నేను నా దీనావస్థను వివరించాను. ఆయన తనింటికి తీసుకువెళ్ళాడు నన్ను; ఆదరపురస్సరంగా ఆతిథ్యమిచ్చాడు. .

“రణబాజ్‌పూర్ ఇక్కడికి చాలా దూరం,” అన్నా డాయన, “నాలుగు వీథుల మొగలో, నువ్వు ఎడమవేపు తిరగవలసింది; కుడివేపు కాదు.” ఇంతకు ముందుకు దారి చెప్పినవాడు నిజంగా బాటసారుల కొక పీడే, అనుకున్నాను దిగులుగా. ముతక బియ్యపు అన్నం, పప్పుదినుసు, బంగాళాదుంపలూ అరటికాయలూ కలిపి వండిన కూరలతో భోజనంచేసి, పక్క దొడ్లో ఉన్న చిన్న గుడిసెలో పడుక్కోడానికి వెళ్ళాను. దూరాన పల్లె ప్రజలు, గట్టిగా మద్దెళ్ళూ[1] తాళాలు వాయిస్తూ పాటలు పాడుతున్నారు. ఆ రాత్రి నిద్ర అన్న మాటే లేదు. ఏకాంతవాసం చేసే రామగోపాల్ యోగిగారి దగ్గరికి నాకు దారి చూపించమని గాఢంగా ప్రార్థన చేశాను.

తొలిసంజె వెలుగురేకలు గుడిసె కంతలగుండా పొడుచుకు వస్తున్న సమయంలో రణబాజ్‌పూర్ కు బయలుదేరాను. వరిచేలకు అడ్డబడి, సూదుల్లా గుచ్చుకునే ఎండుమోళ్ళు తొక్కుకుంటూ, ఎండిపోయిన బంకమట్టి గుట్టలకు ప్రదక్షిణలుచేస్తూ నడక సాగించాను. అక్కడక్కడ దారిని పోయే రైతు ఒకడు కనబడడం, నేను చేరవలసిన చోటు ఇంక “ఒక్క కోసెడు మాత్రమే (రెండు మైళ్ళు)” ఉందని చెప్పడం జరుగుతుండేది. ఆరు గంటల్లో సూర్యుడు విజయోత్సాహంతో నడినెత్తికి వచ్చాడు కాని, నేను రణబాజ్ పూరుకు ఎప్పటికీ ఒక కోసెడు దూరంలోనే ఉంటాననిపించడం మొదలయింది.

మిట్టమధ్యాహ్నానికి నా లోకమింకా అంతులేని వరిచేనే. ఎండ వేడికి నేను దాదాపు వడగొట్టి పడిపోయే స్థితికి వచ్చాను. ఇంతలో ఒకాయన నిదానంగా అడుగుతీసి అడుగువేస్తూ నా దగ్గరికి వస్తూండడం గమనించాను. నా మామూలు ప్రశ్న మళ్ళీ వెయ్యడానికి పూనుకోలేదు; “ఒక్క కోసెడు మాత్రమే” అన్న జవాబు వినివిని విసుగెత్తి, మళ్ళీ అదే వినవలసి వస్తుందేమోనని.

ఆ అపరిచితులు నా పక్కన ఆగారు. పొట్టిగా, సన్నగా ఉన్నారు. సూదుల్లా గుచ్చిగుచ్చి చూసే, అసాధారణమైన రెండు నల్లటి కళ్ళు మినహాగా ఆయన రూపంలో ఆకట్టుకునేది ఏదీ లేదు.

“నేను రణబాజ్‌పూర్ విడిచి వెళ్ళాలనుకున్నాను. నువ్వు ఉద్దేశించిన ప్రయోజనం మంచిది. అంచేత నీకోసం కాసుకొని ఉన్నాను.” నేను కొయ్యబారి చూస్తుంటే, ఆయన నా ముఖంలోకి వేలు ఆడిస్తూ అన్నారు. “గడుసుగా, చెప్పా పెట్టాకుండా నా మీదికి వచ్చిపడొచ్చుననుకున్నావు.కదూ? అయినా ఆ ప్రొఫెసరు బిహారికి, నా ఎడ్రస్ నీకు ఇచ్చే హక్కు లేదు.”

ఈ మహాపురుషుల ముందు నన్ను నేను పరిచయం చేసుకోడం కేవలం అధిక ప్రసంగం కిందికి వస్తుందని, నాకు లభించిన ఇటువంటి ఆదరానికి కొద్దిగా నొచ్చుకుంటూ మాటా పలుకూ లేకుండా నిలబడి పోయాను. ఆ తరవాత అకస్మాత్తుగా ఆయన వ్యాఖ్య వెలువడింది.

“చెప్పు, దేవుడు ఎక్కడున్నాడనుకుంటున్నావు?”

“అదేమిటండి, నాలోనూ అంతటానూ ఉన్నాడు!” నా కెంత గాభరా కలిగిందో నన్ను చూస్తేనే తెలుస్తుందనడంలో సందేహం లేదు.

“అంతటా వ్యాపించి ఉన్నవాడు, కదూ?” ఆ సాధువు ముసి ముసిగా నవ్వారు. “అయితే చిన్నబాబూ, నిన్న నువ్వు తారకేశ్వర ఆలయంలో అనంతుడైన సర్వేశ్వరుడికి చిహ్నమైన రాతి లింగానికి ఎందుకు మొక్కలేదు మరి?[2] నీ గర్వమే నీ శిక్షకు కారణమయి, కుడి ఎడమల తేడా పట్టించుకోని బాటసారిచేత నిన్ను తప్పుదారి పట్టించింది. ఈరోజు కూడా నీకు ఇబ్బంది తప్పలేదు!”

నేను మనఃపూర్తిగా ఒప్పుకున్నాను; నా ఎదురుగా కనిపిస్తున్న అతిసామర్థ్య శరీరంలో సర్వవ్యాపకమయిన కన్ను మరుగుపడి ఉన్నందుకు ఆశ్చర్యపోయాను. ఆ యోగి శరీరం నుంచి ఆరోగ్యప్రదమైన శక్తి ఒకటి వెలువడింది; ఎండ మలమలమాడుస్తున్న పొలంలో అప్పటికప్పుడు నాకు సేదదీరింది.

“దేవుణ్ణి తెలుసుకోడానికి తను పట్టిన దారి ఒక్కటి తప్ప మరేదీ లేదని అనుకోడానికే భక్తుడు మొగ్గు చూపిస్తాడు,” అన్నా రాయన. “మనకు లాహిరీ మహాశయులు చెప్పినట్టుగా, దివ్యత్వాన్ని లోపలే కనుక్కోగలిగేటట్టు చేసే యోగవిద్య అన్నిటికన్న ఉత్తమమైన మార్గమనడంలో సందేహం లేదు. కాని ఈశ్వరుణ్ణి లోపల కనిపెట్టిన తరవాత, త్వరలోనే బయట కూడా దర్శిస్తాం. తారకేశ్వర్‌లోనూ ఇతర చోట్లా ఉన్న పవిత్ర మందిరాల్ని ఆధ్యాత్మిక శక్తికి కేంద్రస్థానాలుగా మన్నిస్తూండడం సముచితమైన పని.”

ఆ సాధువుగారి మందలింపు ధోరణి మాయమైంది; ఆయన కళ్ళు కరుణతో ఆర్ద్రమయినాయి. ఆయన నా భుజం తట్టారు.

“యువకయోగీ, నువ్వు మీ గురువుగారి దగ్గిర్నించి పారిపోతున్నా వన్నది స్పష్టమవుతోంది. నీకు అవసరమయిందల్లా ఆయన దగ్గర ఉంది; నువ్వు తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి,” అని చెప్పి, “కొండలు నీకు గురువు కాలేవు,” అంటూ రెండు రోజుల కిందట శ్రీయుక్తేశ్వర్‌గారు వెల్లడించిన అభిప్రాయాన్నే ఈయనా వెల్లడించారు.

“కొండల మీదే ఉండాలన్న నిర్బంధం, విశ్వవిధానం ప్రకారం, దూరమనిపించాయి. ఆ కుటీరం గది ఒక చల్లని వెలుగుతో చిత్రంగా ప్రకాశిస్తున్నది. రామగోపాల్‌గారు చిరిగిన కంబళ్ళు నేలమీద పరిచి నాకు పక్కవేశారు. తాము మాత్రం ఒక తుంగ చాపమీద కూర్చున్నారు. ఆయన ఆధ్యాత్మిక ఆకర్షణకు ముగ్ధుణ్ణిఅయి, ఒక కోరిక విన్నవించడానికి సాహసించాను.

“అయ్యా, మీరు నాకు సమాధిస్థితి ఎందుకు ప్రసాదించరు?”

“నాయనా, దివ్యానుసంధానం కలిగించడం నాకూ సంతోషమే; కాని అది జరగవలసింది ఇక్కడ కాదు.” ఆ సాధువు, అరమోడ్చిన కన్నులతో నావేపు చూశారు. “మీ గురువుగారు త్వరలో నీ కా అనుభవం ప్రసాదిస్తారు. నీ శరీరం దానికింకా తయారు కాలేదు. ఎక్కువ విద్యుద్భలం (ఎలక్ట్రికల్ వోల్టేజి) వల్ల చిన్న బల్బు ఎలా పేలిపోతుందో, అలాగే నీ నరాలు కూడా విశ్వవిద్యుత్ప్రవాహాన్ని భరించడానికి సిద్ధంగా లేవు. ఇప్పటికిప్పుడే నేను నీకు బ్రహ్మానందానుభవాన్ని కలిగించినట్లయితే, నీలో కణకణం నిప్పులమీద ఉన్నట్టుగా అయి మాడిపోతావు.”

ఆ యోగివర్యులు సాలోచనగా ఇంకా ఇలా అన్నారు: “లెక్కలోకి రాదగనివాణ్ణి, ఏదో కాస్తంత ధ్యానం చేసినవాణ్ణి - దేవుణ్ణి సంతోష పెట్టడంలో కృతార్థుణ్ణి అయానో లేదో, కడపటి తీర్పునాటికి ఆయన దృష్టిలో నాకు ఏపాటి విలువ ఉంటుందోనని నేను అనుకుంటూంటే, నువ్వు నా దగ్గిర బ్రహ్మజ్ఞానం కోరుతున్నావు.”

“అయ్యా , మీరు చాలా కాలంగా దేవుణ్ణి అనన్యభక్తితో అన్వేషించడం లేదా?”

“నేను అట్టే చెయ్యలేదు. బిహారి నా జీవితాన్ని గురించి నీకు కొంచెం చెప్పి ఉంటాడు. ఇరవై ఏళ్ళపాటు నేను ఒక రహస్యగుహలో రోజుకు పద్దెనిమిది గంటల చొప్పున ధ్యానం చేశాను. ఆ తరవాత అంత కన్న దుర్గమమైన గుహకి మారి, అక్కడ ఇరవైఅయిదేళ్ళు ఉన్నాను; రోజుకు ఇరవైగంటలు యోగసమాధిలో ఉండేవాణ్ణి. ఎప్పుడూ ఈశ్వరసాన్నిధ్యంలోనే ఉన్నందువల్ల నాకు నిద్ర అవసరమయేది కాదు. నా శరీరం, మామూలు అవచేతనస్థితిలో వచ్చే అసంపూర్ణ ప్రశాంతికన్న, అధిచేతనస్థితిలో వచ్చే సంపూర్ణ ప్రశాంతితోనే ఎక్కువ విశ్రాంతి పొందేది.

“కండరాలు నిద్రలో విశ్రాంతి పొందుతాయి; కాని గుండె, ఊపిరితిత్తులు, రక్తప్రసరణ మండలం ఎడతెరపిలేకుండా పనిచేస్తూనే ఉంటాయి; వాటికి విశ్రాంతి దొరకదు. అధిచేతనస్థితిలో ఉన్నప్పుడు అంతరింద్రియాలన్నీ విశ్వశక్తిచేత విద్యుత్ప్రేరితాలయి, తాత్కాలికంగా నిశ్చలస్థితిలో ఉండిపోతాయి. ఈ పరిస్థితుల్లో నాకు ఏళ్ళతరబడిగా నిద్రే అవసరం లేకపోయింది.” ఆయన ఇంకా ఇలా అన్నారు, “నువ్వు కూడా నిద్రకు స్వస్తిచెప్పే కాలం వస్తుంది.”

“అమ్మయ్యో! అంత ఎక్కువకాలం ధ్యానం చేసికూడా మీరు, ఈశ్వరానుగ్రహాన్ని గురించి నమ్మకం పెట్టుకోలేకపోతున్నారన్న మాట!” అని వ్యాఖ్యానించాను, ఆశ్చర్యపోతూ. “అటువంటప్పుడు మాలాంటి దుర్బల మానవుల మాట ఏం కావాలి?”

“ఇదుగో బాబూ, దేవుడంటే అనంతత్వమేనని తెలియడం లేదూ? నలభై ఐదేళ్ళ ధ్యానంతోనే ఆయన్ని సంపూర్ణంగా తెలుసుకోగలమనుకోడం దురాశే అని చెప్పొచ్చు. అయితే, కొద్దిపాటి ధ్యానం చేసినా కూడా అది మనని ఘోరమైన మృత్యుభయంనుంచీ, మరణానంతరస్థితుల భయం నుంచీ రక్షిస్తుందని బాబాజీ మనకి హామీ ఇస్తారు. నీ ఆధ్యాత్మిక ఆదర్శాన్ని చిన్న చిన్న గుట్టలమీద నిలపకు; నిర్నిబద్ధమైన భగవత్ప్రాప్తి అనే లక్ష్య నక్షత్రంమీదే లగ్నం చెయ్యి. నువ్వు కష్టపడి కృషిచేస్తే దాన్ని అందుకుంటావు.”

భావి అవకాశానికి ముగ్ధుణ్ణి అయి, ప్రబోధాత్మకమయిన మరికొన్ని విషయాలు చెప్పమని ఆయన్ని కోరాను. ఆయన, లాహిరీ మహాశయుల గురువర్యులైన బాబాజీని మొట్టమొదటిసారి కలుసుకోడాన్ని గురించిన అద్భుతమైన కథ చెప్పారు నాకు.[3] ఇంచుమించు అర్ధరాత్రివేళ రామగోపాల్‌గారు మౌనంలోకి వెళ్ళిపోయారు; నేను నా కంబళ్ళమీద పడుకున్నాను. కళ్ళు మూసుకున్నప్పుడు తళతళలాడే మెరుపులు కనిపించాయి; నాలో ఉన్న విశాలాకాశం కాంతిని కరిగిపోసిన గదిలా ఉంది. కళ్ళు తెరిచాను; కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ కాంతినే అప్పుడు కూడా గమనించాను. ఆ కుటీరం గది, అంతర్దృష్టితో నేను చూస్తున్న అనంత బ్రహ్మాండంలో అంతర్భాగమై పోయింది.

“నిద్రపోవేం?” అని అడిగారు యోగివర్యులు.

“అయ్యా, నేను కళ్ళు మూసినా తెరిచినా కూడా నా చుట్టూ మెరుపులు తళ తళ లాడుతూంటే ఎలా నిద్రపోగలను?”

“ఈ అనుభవం కలగడం నీకు ఆశీఃప్రసాదం. ఆధ్యాత్మిక తేజఃప్రసరణలు సులువుగా కనిపించవు. ఆ సాధువు ఆప్యాయంగా మరికొన్ని మాటలు చెప్పారు.

తెల్లారగట్ల రామగోపాల్‌గారు నాకు పటికబెల్లం ముక్కలు పెట్టి, నన్నింక బయలుదేరమని చెప్పారు. నా చెంపలమీదగా కన్నీళ్ళు కారుతూ ఉండగా ఆయనదగ్గర సెలవు తీసుకోడానికి కూడా నాకు మనస్సు ఒప్పలేదు. “నిన్ను ఉత్తి చేతులలో వెళ్ళనియ్యను.” ఆ యోగి మార్దవం ఉట్టిపడేలా అన్నారు. “నీకు ఏదో ఒకటి చేస్తాను.”

ఆయన చిరునవ్వు నవ్వి నావేపు నిలకడగా చూశారు. నేలకు పాతుకుపోయినట్టుగా నేను కదలికలేకుండా అయిపోయాను; ఆ సాధు పుంగవుల దగ్గరినుంచి ప్రసరించే శాంతి స్పందాలు నా అస్తిత్వాన్ని ముంచెత్తాయి. ఏళ్ళతరబడి అడపాతడపా నన్ను బాధపెడుతూ ఉన్న వెన్ను నొప్పి తక్షణమే మటుమాయమయింది.

పునరుజ్జీవితుణ్ణి అయి, తేజోమయమైన ఆనందసాగరంలో స్నానం చేసి, మరింక ఏడవలేదు. రామగోపాల్‌గారి పాదాలు తాకి, అడవిలో అడుగుపెట్టాను. తారకేశ్వర్ చేరేదాకా, చెట్ల గుబురుల్లోంచి ఎన్నో వరి పొలాల మధ్యనుంచీ దారి చేసుకుంటూ ముందుకు సాగాను.

అక్కడ ప్రఖ్యాతమైన ఆలయాన్ని రెండోసారి దర్శించి, లింగం ముందు సంపూర్ణంగా సాష్టాంగ ప్రణామం చేశాను. ఆ గుండ్రటిరాయి నా అంతర్దృష్టిలో పెరిగిపెరిగి బ్రహ్మాండ గోళాలుగా విస్తరించింది: వలయంలో వలయం, మండలంలో మండలం- అన్నిటా దైవత్వం తొణికిసలాడుతున్నది.

మరో గంటకి నేను సంతోషంగా, కలకత్తా వెళ్ళడానికి రైలు ఎక్కాను. ఇక నా ప్రయాణాలు ముగిసిపోయాయి; ఉన్నత పర్వతాల్లో కాదు, మహోత్తుంగ హిమవన్నగం వంటి మా గురుదేవుల సన్నిధితో.

  1. మత సంబంధమైన ఉత్సవాలు జరిగినప్పుడు, ఊరేగింపులప్పుడు, భక్తిపరమైన కీర్తనలు పాడేటప్పుడు మద్దెళ్ళు ఉపయోగించడం మామూలు.
  2. "దేనికీ తలవంచనివాడు తన బరువు తాను మోసుకోలేడు.” -డాస్టావ్‌స్కి, ‘ది పొసెస్డ్’ అన్న నవలలో.
  3. 33 ఆధ్యాయం చివరి పుటలు కొన్ని చూడండి.