ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 12

వికీసోర్స్ నుండి

అధ్యాయం : 12

గురుదేవుల ఆశ్రమంలో

గడిచిన కాలం

“వచ్చేశావు.” బాల్కనీ ఉన్న గదిలో నేలమీద పులిచర్మం మీద కూర్చున్న శ్రీయుక్తేశ్వర్‌గారు నన్ను పలకరించారు. ఆయన కంఠస్వరం ముక్తసరిగా ఉంది. ఆయన తీరు భావోద్రేకరహితంగా ఉంది.

“ఔను గురుదేవా, మిమ్మల్ని అనుసరించడానికి వచ్చాను.” మోకరిల్లి ఆయన పాదాలు ముట్టుకున్నాను.

“అదెలా సాధ్యం! నా కోరికల్ని నువ్వు ఉపేక్షిస్తావు.”

“ఇకముందు అలా జరగదు గురూజీ! మీ కోరికే నాకు శాసనం!”

“బాగుంది! అలా అయితే నీ జీవితానికి బాధ్యత వహించగలను.”

“మనః పూర్తిగా ఆ భారం మీ మీదే పెడుతున్నాను గురుదేవా!”

“అయితే నా మొదటి కోరికగా, నువ్వు మీ వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళు. నువ్వు కలకత్తాలో కాలేజీలో చేరి చదువు కొనసాగించాలని నేను కోరుతున్నాను.”

“మంచిది గురుదేవా!” నా గాభరాని మరుగుపరిచాను. ఈ పుస్తకాల బెడద ఏళ్ళ తరబడి నాకు తప్పదా? మొదట్లో నాన్నగారూ ఇప్పుడు శ్రీయుక్తేశ్వర్‌గారూ! “ఎప్పుడో ఒకనాడు నువ్వు పడమటి దేశాలకు వెడతావు. అపరిచితుడైన హిందూ బోధకుడికి విశ్వవిద్యాలయం పట్టం ఒకటి ఉన్నట్లయితే అక్కడి ప్రజలు, భారతదేశపు సనాతన విజ్ఞానాన్ని ఆకళించుకోడానికి మరింత సుముఖంగా ఉంటారు.”

“ఈ విషయం మీకే బాగా తెలుసు గురూజీ!”

నా విచారం తొలగిపోయింది. పడమటి దేశాలగురించి ఆయన చేసిన ప్రస్తావన, నాకు గజిబిజిగా, ఊహకు అందకుండా ఉంది. కాని అణకువగా ఉండి గురువుగారిని సంతోషపెట్టడం నాకు చాలా ముఖ్యమైన తక్షణ కర్తవ్యం.

“దగ్గరగా కలకత్తాలో ఉంటావు, నీకు సమయం చిక్కినప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు.”

“వీలుంటే, ప్రతిరోజూ వస్తాను స్వామీ! నా జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ మీ అధికారాన్ని కృతజ్ఞతతో అంగీకరిస్తాను – కాని ఒక్క షరతు.”

“చెప్పు.”

“దైవసాక్షాత్కారం కలిగిస్తానని మీరు నాకు మాట ఇయ్యాలి!”

ఆ తరవాత ఒక గంట సేపు వాగ్యుద్ధం జరిగింది. గురువుగారు ఇచ్చిన మాట బోటుకాగూడదు; అదంత తేలిగ్గా ఇచ్చేది కాదు. ఇలాటి వాగ్దానంలో, విస్తారమైన ఆధ్యాత్మిక మార్గాల్ని ఆవిష్కరిస్తానన్న గూడార్థం ఇమిడి ఉంటుంది. ఏ గురువయినా, సృష్టికర్తను సాక్షాత్కరించమని అడిగేటట్టయితే, అంతకుముందు అతడు ఆయనతో అంత చనువు ఏర్పరుచుకొని ఉండాలి! శ్రీయుక్తేశ్వర్‌గారికి భగవంతుడితో ఉన్న తాదాత్మ్యాన్ని నేను పసిగట్టాను; ఆయన శిష్యుడిగా ఈ లాభం కోసం పట్టుబట్టాలని నిశ్చయించుకొని ఉన్నాను.

“బలవంతంగా రాబట్టుకొనే స్వభావం నీది!” ఆ తరవాత, దయతో కూడిన తుదిమాటగా, గురువుగారి సమ్మతి వచ్చింది.

“నీ కోరికే నా కోరిక; కానియ్యి.”

నా హృదయం మీద, జీవిత పర్యంతం కమ్ముకొని ఉన్న మబ్బును తొలగించినట్టయింది. ఇహపరాల్లో ఒక దారీ తెన్నూ లేకుండా నేను చేస్తున్న అన్వేషణ అంతటితో అయిపోయింది. ఇప్పుడు నాకు ఒక సద్గురువు సన్నిధిలో శాశ్వతమైన ఆశ్రయం దొరికింది.

“రా, ఆశ్రమం చూపిస్తాను నీకు.” గురుదేవులు వ్యాఘ్రాసనం మీంచి లేచారు. చుట్టుపక్కల పరకాయిస్తూ, ఒక గోడమీద, మల్లెపూల దండ వేసిన పటం ఒకటి చూశాను.

“లాహిరీ మహాశయులు!” ఆశ్చర్యపోయి అన్నాను.

“ఔను, నా గురుదేవులు!” శ్రీయుక్తేశ్వర్‌గారి గొంతులో భక్తి భావం ఉట్టిపడింది. “మనిషిగానూ, యోగిగానూ ఆయన చాలా గొప్ప వారు. నేను చేసిన జీవిత పరిశీలనల పరిధిలోకి వచ్చిన గురువులందరి కన్న ఆయన మహనీయులు.”

సుపరిచితమైన ఆ పటం ముందు నేను నిశ్శబ్దంగా తల వంచాను. పసితనంలోనే నన్ను దీవించి, ఈ క్షణం వరకు నన్ను ముందుకు నడిపిస్తూ వచ్చిన ఆ అద్వితీయ పరమ గురుదేవులకు నా ఆత్మ జోహార్లు అర్పించింది.

గురువుగారు ముందు నడుస్తూ దారి చూపిస్తుండగా, ఇంట్లోనూ బయట దొడ్లోనూ తిరిగాను. మంచి విశాలంగా, ఎప్పుడో చాలాకాలం కిందట కట్టుదిట్టంగా, భారీ ఎత్తు స్తంభాలతో పెద్దగా కట్టిన ఆశ్రమ భవనం, దొడ్డికి చుట్టూ ఉంది. బయటి గోడలు నాచుపట్టి ఉన్నాయి; మర్యాదలేకుండా ఆశ్రమంలోకి వచ్చి మకాం పెట్టిన పావురాలు, బూడిదరంగు మిద్దెమీద రెక్కలు ఆడిస్తున్నాయి. పనసచెట్లు, మామిడిచెట్లు, అరటిచెట్లు ఉన్న పెరటిదొడ్డి చూడముచ్చటగా ఉంది. ఈ రెండంతస్తుల భవనంలో పైనున్న గదులకు, చిన్న పిట్టగోడలతో ఉన్న బాల్కనీలు, దొడ్డికి మూడు వైపులా కనిపించేట్టు ఉన్నాయి. కింది అంతస్తులో, వరసగా ఉన్న స్తంభాల మీద ఎత్తుగా పైకప్పు ఉన్న విశాలమయిన హాలు ఉంది; దీన్ని ముఖ్యంగా, ఏటేటా వచ్చే దుర్గాపూజ ఉత్సవాలకు వాడతారని గురువుగారు అన్నారు. శ్రీయుక్తేశ్వర్‌గారు కూర్చునే గదికి వెళ్ళడానికి సన్నటి మేడమెట్లు ఉన్నాయి; వారి గది బాల్కనీ వీధివేపు ఉంది. ఆశ్రమంలో అమర్చిన సామానంతా నిరాడంబరంగా ఉంది. అన్నీ పరిశుభ్రంగా, ఉపయోగకరంగా ఉన్నవే. పాశ్చాత్య ఫక్కీలో కుర్చీలు, బెంచీలు, మేజాలు కూడా కనిపించాయి.

ఆ రాత్రికి నన్నక్కడ ఉండిపొమ్మని కోరారు గురువుగారు. కాయగూరలతో వండిన కూరతో భోజనం పెట్టారు. ఆశ్రమంలో శిక్షణ పొందుతున్న శిష్యులిద్దరు వడ్డన చేశారు.

“గురూజీ, మీ జీవితాన్ని గురించి కొంచెం చెప్పండి.” ఆయన కూర్చున్న పులిచర్మానికి దగ్గరగా, ఒక తుంగచాపమీద కూర్చున్నాను. బాల్కనీకి బయట ఉన్న నక్షత్రాలు స్నేహితుల్లా, దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి.

“నా సంసార నామం ప్రియనాథ్ కరార్. నే నిక్కడే, శ్రీరాం పూర్‌లో పుట్టాను.[1] నాన్నగారు సిరిసంపదలున్న వ్యాపారి. ఇప్పుడు నా ఆశ్రమంగా ఉన్న, తాతలనాటి ఈ భవనాన్ని ఆయన నా కిచ్చారు. యథావిధిగా నేను బడికి వెళ్ళింది తక్కువ. నా కది మందగొడిగాను, లోతులేనట్టుగాను అనిపించేది. యౌవనంలో అడుగు పెట్టిన తొలినాళ్ళలోనే నేను సంసార బాధ్యతలు పైన వేసుకున్నాను. నాకో కూతురుంది; పెళ్ళయింది. మధ్యజీవితంలో నాకు లాహిరీ మహాశయుల మార్గదర్శిత్వ భాగ్యం కలిగింది. నా భార్య చనిపోయిన తరవాత సన్యాసం తీసుకున్నాను. శ్రీయుక్తేశ్వర్‌గిరి[2] అనే కొత్త పేరు వచ్చింది. ఇంతింత మాత్రమే నా జీవిత వృత్తాంతాలు.”

ఆత్రంతో చూస్తున్న నా ముఖంలోకి చూసి నవ్వారు గురువుగారు. జీవిత కథాసంగ్రహాలన్నిటి లాగే, ఆయన మాటలు నాకు, బాహ్య యథార్థాల్ని తెలిపాయి కాని, లోపలి మనిషిని బయలుపరచలేదు.

“గురూజీ, మీ చిన్నప్పటి కథలు కొన్ని వినాలని ఉంది.”

“కొన్ని చెబుతాను – ప్రతిదానికి ఒక నీతి ఉంది!” శ్రీ యుక్తేశ్వర్‌గారి కళ్ళు హెచ్చరికతో మిలమిల్లాడాయి. “మా అమ్మ ఒకసారి నన్ను బెదిరించడానికి, ఒక చీకటి గదిలో దెయ్యముందని భయపెట్టింది. నేను వెంటనే అక్కడికి వెళ్ళి చూసి, దెయ్యం కనిపించలేదని నిరాశగా చెప్పాను. మరెన్నడూ అమ్మ నాకు దెయ్యాల కథ చెప్పి భయపెట్ట లేదు. ఇందులో నీతి: నీ భయానికి కారణమైనదానికి ఎదుటపడి చూడు; అది నిన్నింక ఇబ్బంది పెట్టదు.” “నా జ్ఞాపకాల్లో మరొకటి ఏమిటంటే – మా పక్కింటివాళ్ళ గజ్జి కుక్క నాకు కావాలన్న కోరిక. ఆ కుక్క కోసం కొన్ని వారాలపాటు ఇంట్లో గందరగోళం చేసిపారేశాను. అంతకన్న కంటికి ఇంపుగా ఉండే కుక్కల్ని ఇస్తామన్నా నేమ వినిపించుకోలేదు. ఇందులో నీతి: మోహం మనుషుల్ని గుడ్డివాళ్ళని చేస్తుంది. మనం కోరుకునే వస్తువు చుట్టూ అది, ఊహాకల్పితమైన అందమైన ఆకర్షణ ఒకటి ఏర్పరుస్తుంది.

“మూడో కథ, కుర్రవాడి మనస్సు, మలచడానికి ఎలా వీలుగా ఉంటుందో తెలిపేది. మాటవరసకు, మా అమ్మ చేసిన వ్యాఖ్య ఒకటి విన్నాను: ‘ఒకడి కింద నౌకరీకి కుదిరినవాడు బానిస’ అని. ఆ సంగతి నా మనస్సులో ఎంత గాఢంగా నాటుకుందంటే, నాకు పెళ్ళయిన తరవాత కూడా ఉద్యోగాలన్నిటినీ నిరాకరించాను. కుటుంబానికి ఉన్న డబ్బు, భూమి మీద పెట్టుబడి పెట్టి ఖర్చులు గడుపుకొనేవాణ్ణి. ఇందులో నీతి: సూక్ష్మగ్రహణశక్తిగల, పిల్లలకు మంచివీ అనుకూలమైనవీ అయిన సూచనలు చెవులకు ఎక్కేటట్టు చెయ్యాలి. వాళ్ళకు చిన్నప్పుడు ఏర్పడే అభిప్రాయాలు లోతుగా నాటుకొని చాలాకాలం ఉంటాయి.”

గురుదేవులు ప్రశాంత మౌనంలో నిమగ్నులయారు. దాదాపు నడిరాత్రివేళ నన్నొక సన్నటి మంచం దగ్గరికి తీసుకువెళ్ళారు. గురుదేవులు, ఆశ్రమంలో ఆ మొట్టమొదటి రాత్రి నాకు గాఢంగా, మధురంగా నిద్ర పట్టింది.

మర్నాడు పొద్దునే నాకు క్రియాయోగ దీక్ష ప్రసాదించడానికి శ్రీయుక్తేశ్వర్‌గారు నిశ్చయించారు. అంతకు పూర్వమే నేను, లాహిరీ మహాశయుల శిష్యులిద్దరి దగ్గర క్రియాయోగ దీక్ష పొందాను; వారిలో ఒకరు మా నాన్నగారు, రెండో వారు నాకు సంస్కృతం నేర్పిన స్వామి కేవలానందగారు. అయితే గురుదేవులకు పరివర్తక శక్తి ఉంది; వారి స్పర్శతోనే, లెక్కలేనన్ని సూర్యబింబాలు కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ ఒక్కుమ్మడిగా జ్వాజ్వల్యమాన మవుతున్నట్టుగా, ఒకనొక మహాతేజస్సు నా మీద ప్రసరించింది. అనిర్వచనీయమైన ఆనందపు వెల్లువ ఒకటి నా హృదయాన్ని నింపేసి అంతరాంతరాల్లోకి వ్యాపించింది.

ఆ మర్నాడు నేను ఆశ్రమం నుంచి బయలుదేరేందుకు సిద్ధం కాగలిగే సమయానికి అపరాహ్ణం దాటింది.

“నువ్వు ముప్పై రోజుల్లో తిరిగి వెడతావు.” నేను కలకత్తాలో మా ఇంటి గుమ్మంలో అడుగుపెడుతూ ఉండగా, గురుదేవుల జోస్యం ఫలించిన సంగతి మనస్సులో మెదిలింది. ఆకాశంలో “ఎగిరే పక్షి” మళ్ళీ గూటికి చేరడం గురించి మా చుట్టాలు సూటిపోటి మాటలంటారేమోనని నేను భయపడ్డాను గాని, అటువంటి దేమీ జరగలేదు.

నేను నా అటకమీదికి ఎక్కి, ఒక సజీవ వ్యక్తిని చూస్తున్నట్టుగా ఆప్యాయంగా చూసుకున్నాను. “నా ధ్యానాలకూ, సాధనలో నాకు ఎదురయిన తుఫానులకూ సాక్షివి నువ్వే. ఇప్పుడు నేను గురుదేవులు అనే ఓడ రేవుకు చేరుకున్నాను.”

“బాబూ, మనకు ఉభయతారకంగా జరిగిందానికి సంతోషంగా ఉంది.” ప్రశాంతమైన సాయంసంధ్య వేళ నేనూ నాన్నగారూ కలిసి కూర్చున్నాం. “ఒకప్పుడు నేను మా గురుదేవుల్ని అత్యద్భుతంగా దర్శించినట్టుగానే నువ్వూ మీ గురువుగారిని దర్శించావు. లాహిరీ మహాశయుల పవిత్ర హస్తం మన జీవితాల్ని కాపాడుతూంది. మీ గురువుగారు, మనకి అందుబాటులో లేకుండా, హిమాలయాల్లో ఉండే సాధువు కారని, మనకి దగ్గరలోనే ఉన్నవారని రుజువయింది. నా ప్రార్థనలు ఫలించాయి; దేవుడికోసం చేసే అన్వేషణలో నువ్వు నా కంటికి శాశ్వతంగా దూరం కాలేదు.” నేను మళ్ళీ చదువుకొనసాగిస్తానని నాన్న గారు సంతోషించారు. దానికి తగిన ఏర్పాట్లు చేశారాయన. ఆ మర్నాడు నేను, కలకత్తాలో ఉన్న స్కాటిష్ చర్చ్ కాలేజిలో ప్రవేశించాను.

నెలలకు నెలలు సంతోషదాయకంగా వడివడిగా గడిచాయి. నేను కాలేజి తరగతి గదుల్లో బొత్తిగా కనిపించి ఉండనని సూక్ష్మగ్రాహులైన పాఠకులు ఈపాటికి అనుమానించి ఉంటారనడంలో సందేహం లేదు. శ్రీరాంపూర్ ఆశ్రమం ఆకర్షణ నాకు నిగ్రహించుకోజాలని దయింది. నేమ నిరంతరం అక్కడే ఉంటున్నందుకు గురుదేవులు ఏమీ వ్యాఖ్య చెయ్యకుండా నా ఉనికిని అంగీకరించారు. ఆయన విద్యాలయాలగురించి ప్రస్తావించడం సకృతు కావడంవల్ల నా మనస్సు తేలికపడింది. నేను విద్వాంసుడిగా తయారవడానికి మలిచినవాణ్ణి కానన్న సంగతి స్పష్టమే అయినప్పటికీ సమయానుగుణంగా కనీసపు పాస్ మార్కులు తెచ్చుకోగలుగుతూ ఉండేవాణ్ణి.

ఆశ్రమంలో నిత్యజీవితం సాఫీగా సాగిపోయింది; దాంట్లో మార్పు ఎప్పుడోకాని వచ్చేది కాదు. మా గురుదేవులు వేకువవేళకు ముందే నిద్ర లేచేవారు. పక్క మీద పడుక్కొని ఉండిగాని, ఒక్కొక్కప్పుడు కూర్చొని ఉండిగాని సమాధి[3] స్థితిలోకి వెళ్ళేవారు. గురుదేవులు మేల్కొన్నారన్న సంగతి ఇట్టే తెలిసిపోయేది; పెద్దగా ఆయన పెట్టే గుర్రు[4]- చటుక్కున ఆగిపోయేది. ఒకటి రెండు నిట్టూర్పులు; బహుశా శారీరకమైన కదలిక. కావచ్చు. ఆ తరవాత నిశ్శబ్దమైన శ్వాసరహిత స్థితి; ఆయన గాఢమైన యోగానందంలో నిమగ్నులయి ఉండేవారు.

తరవాత, ఫలహారాల కార్యక్రమం ఉండేది కాదు; మొదట గంగ ఒడ్డున చాలా దూరం నడవాలి. మా గురువుగారితో పొద్దుటిపూట నడిచిన ఈ నడకలు ఇప్పటికీ ఎంత వాస్తవంగా, ఎంత స్పష్టంగా మనసులో ఉన్నాయో! జ్ఞాపకాల్ని అలవోకగా నెమరువేసుకుంటే చాలు; నేను గురుదేవుల పక్కనే ఉన్నట్టు తరచు అనిపిస్తూ ఉంటుంది. ఉదయ భానుడు ఏటికి వెచ్చదనం కలిగిస్తున్నాడు; జ్ఞానాధికారంతో నిండిన ఆయన కంఠస్వరం ఖంగుమని మోగుతున్నది.

స్నానం; ఆ తరవాత మధ్యాహ్న భోజనం. గురుదేవులు ఏరోజు కారోజు ఇచ్చే సూచనల ప్రకారం జాగ్రత్తగా వంట చేయడమన్నది శిష్యుల్లో కుర్రవాళ్ళ బాధ్యత. మా గురుదేవులు శాకాహారి. అయితే, సన్యాసం తీసుకోకముందు ఆయన గుడ్లు, చేపలు తినేవారు. ఎవరి శరీర తత్త్వానికి పడే సాదా భోజనం వారు చెయ్యండన్నదే ఆయన శిష్యులకు ఇచ్చిన సలహా.

గురువుగారు చాలా మితంగా తినేవారు; తరచుగా ఆయన, అన్నంలో పసుపు కలిపిగాని, బీటుదుంపల రసంగాని, పాలకూరగాని వేసుకొని, పైన గేదెనెయ్యి చిలకరించుకొని తినేవారు. మరోనాడు, చిక్కుడు గింజలో సెనగలో కలిపి వండిన కూరలు తినేవారు. భోజనానికి చివర, పాయసంతోబాటు మామిడిపళ్ళుగాని, నారింజపళ్ళుగాని తినేవారు; లేదా పనసతొనల రసం తాగేవారు.

ఆయన దర్శనం చేసుకోదలిచినవాళ్ళు మధ్యాహ్నంపూట వచ్చేవారు. ప్రశాంతమైన ఆశ్రమంలోకి ప్రాపంచిక జనులు అదే పనిగా వస్తూ ఉండేవారు. మా గురుదేవులు వచ్చినవాళ్ళనందరినీ మర్యాదగా, దయతో ఆదరించేవారు. తాను ఈ దేహమనికాని, అహంకారమనికాని భావించుకోకుండా సర్వవ్యాప్తమయిన ఆత్మగా సాక్షాత్కారం పొందిన సద్గురువు, మానవులందరిలోనూ స్పష్టమైన సమరూపతను దర్శిస్తాడు.

సాధువుల నిష్పక్షపాతానికి మూలకందం జ్ఞానం. మాయాముఖాకృతుల మార్పిడివల్ల ఇకెన్నడూ ప్రభావితులు కారు; అజ్ఞానుల న్యాయ నిర్ణయ శక్తిని గందరగోళపరిచే రాగద్వేషాలకు వారిక అధీనులు కారు. శ్రీయుక్తేశ్వర్‌గారు అధికార ప్రాబల్యంగలవాళ్ళకూ డబ్బుగలవాళ్ళకూ గుణసంపన్నులకూ ప్రత్యేక ప్రాముఖ్యం ఇయ్యనూ లేదు; ఇతరులను పేదరికంవల్లకాని చదువుకోకపోవడంవల్లకాని చిన్న చూపు చూడనూ లేదు. సత్యవాక్కులు ఒక పిల్లవాడి నోటినించి వచ్చినా గౌరవభావంతో వింటారు; ఒక్కొక్కప్పుడు డాంభిక పండితుణ్ణి బహిరంగంగా ఉపేక్షిస్తారు.

రాత్రి భోజనం ఎనిమిది గంటలకి. అప్పుడప్పుడు ఆతిథులక్కడ తచ్చాడుతూ ఉండేవారు. మా గురుదేవులు అతిథుల్ని వదిలి ఒంటరిగా భోంచేసే ప్రయత్నం ఎన్నడూ చెయ్యలేదు; ఆయన ఆశ్రమానికి వచ్చినవాళ్ళెవరూ ఆకలితోకాని అసంతృప్తితోకాని తిరిగి వెళ్ళడం ఎన్నడూ జరగలేదు. అనుకోని అతిథులు వచ్చినందుకు శ్రీయుక్తేశ్వర్‌గారు ఎన్నడూ గాభరాపడనూ లేదు; నిరుత్సాహంచెందనూ లేదు. సద్యఃస్ఫూర్తితో ఆయన శిష్యులకు ఇచ్చే సూచనలవల్ల కొద్దిపాటి ఆహార పదార్థాలతో సమృద్ధిగా విందు జరిగేది. అయినా ఆయన పొదుపరి; ఆయన దగ్గరున్న కొద్దిపాటి డబ్బు చాలావాటికి సరిపడేది. “నీకున్న దాంట్లోనే సుఖంగా ఉండు,” అంటూండేవారు తరచు. “విచ్చలవిడిగా ఖర్చు చేస్తే తరవాత దుఃఖపడతావు.” ఆశ్రమంలో జరిగే వేడుకల విషయంలో నయితేనేం, భవన నిర్మాణ విషయంలో నయితేనేం, మరమ్మ తుల విషయంలో నయితేనేం, మరే పనుల విషయంలో నయినా గురుదేవుల సృజనాత్మక ప్రతిభలో మౌలికత వ్యక్తమవుతూ ఉండేది.

ప్రశాంత సాయంసమయాల్లో తరచుగా, గురుదేవుల ప్రసంగాలు జరుగుతూ ఉండేవి; అవి అక్షయ సంపదలు. ఆయన పలికిన ప్రతి పలుకూ జ్ఞానంతో చికిలిచేసినట్టుండేది. ఆయన చెప్పే తీరులో మహోదాత్తమైన ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటమవుతూ ఉండేది. ఇది అద్వితీయమైనది. నా అనుభవంలోకి వచ్చినంతవరకు, ఎవ్వరూ ఎన్నడూ మాట్లాడని తీరులో మాట్లాడేవారాయన. తమ ఆలోచనల్ని, మాటలనే బాహ్యమైన దుస్తులు ధరించడానికి అనుమతించేముందు ఆయన, విచక్షణ అనే సున్నితపు త్రాసులో తూచేవారు. భౌతికరూపంలో సైతం సర్వవ్యాపకమైన సత్యసారం, ఆయనలోంచి ఆత్మ ప్రసరింపజేసే సుగంధంలా వెలువడుతూ ఉండేది. సజీవంగా ఆవిర్భవించిన పరమేశ్వర సన్నిధానంలో ఉన్నానన్న స్పృహ నాకు ఎప్పుడూ ఉండేది. ఆయన దివ్యత్వపు భారం, ఆయన ఎదుట ఎప్పుడూ నా తల వంగేటట్టు చేసేది.

శ్రీయుక్తేశ్వర్‌గారు సమాధిమగ్నులవుతున్నారన్న సంగతి అతిథులు పసిగట్టినట్లయితే, ఆయన వెంటనే వాళ్ళతో ఇష్టాగోష్ఠి జరిపేవారు. ఏదో ఒక భంగిమ ప్రదర్శించడంకాని, అంతర్ముఖత్వాన్ని చాటు కోడంకాని ఆయనకు చేతకావు. ఎప్పుడూ బ్రహ్మానందస్థితిలో మగ్నులై ఉన్నందువల్ల, సమాధికి ప్రత్యేకంగా సమయమేమీ ఆయనకు అక్కర్లేదు. ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగి, ధ్యానమనే మెట్టు ఏనాడో దాటేసి ఉంటాడు. “కాయ కాసినప్పుడు పువ్వు రాలిపోతుంది.” కాని శిష్యులు ఒక ఆదర్శంగా తీసుకోడం కోసమని సాధువులు, ఆధ్యాత్మిక సాధన ప్రక్రియల్ని పాటిస్తూ ఉంటారు.

అర్ధరాత్రి కావస్తోందంటే, మా గురువుగారు చిన్న పిల్లవాడికి సహజమైన మాదిరిగా మగత నిద్రలోకి వెళ్తూండడం కద్దు. పక్క విషయంలో పట్టింపులేవీ లేవు. ఆయనకు తరచుగా, తలగడ లేకుండా కూడా, ఒక- సన్నటి బల్లమీద పడుక్కొనేవారు. ఆయన మామూలుగా వేసుకొనే పులిచర్మం దాని మీద పరుచుకునేవారు.

రాత్రి తెల్లవార్లూ తాత్త్విక చర్చ జరగడం అరుదైన విషయమేమీ కాదు; ఏ శిష్యుడయినా గాఢమైన ఆసక్తితో ఆ అవకాశం కల్పించవచ్చు. అప్పుడు నాకు అలసటే అనిపించేది కాదు; నిద్రపోవాలన్న కోరికే ఉండేది కాదు. గురుదేవుల ఉజ్జ్వల వాక్కులే చాలు. “ఓహో, తెల్లవారుతున్నదే! గంగ ఒడ్డున నడక సాగిద్దాం పదండి.” రాత్రిపూట జరిగే ఆధ్యాత్మిక బోధన కాలాలు అనేకం ఇలా ముగిశాయి.

శ్రీ యుక్తేశ్వర్‌గారి దగ్గరి అంతేవాసిత్వంలో తొలికాలపు నెలలు ఉపయోగకరమైన పాఠం ఒకటి నేర్పాయి: “దోమను జయించడం ఎలా?” మా ఇంట్లో అయితే మా వాళ్ళు రాత్రిపూట దోమతెరలు కట్టుకుంటూ ఉండేవారు. జాగ్రత కోసం ఏర్పడ్డ ఈ ఆచారాన్ని శ్రీరాంపూర్ ఆశ్రమంలో పాటించకపోవడం చూసి నేను నిరుత్సాహపడ్డాను. ఆశ్రమంలో ఈ కీటకాలు లేక కాదు; సమృద్ధిగా నివాసం చేసేవి; తలనుంచి పాదాల దాకా నన్ను ఒళ్ళంతా కుట్టేసేవి. గురువుగారు నా మీద జాలి పడ్డారు.

“నువ్వో దోమతెర కొనుక్కో; అలాగే నాక్కూడా ఒకటి కొను.” ఆయన నవ్వుతూ ఇంకా ఇలా అన్నారు: “నువ్వు నీ ఒక్కడికోసమే కొనుక్కునేటట్టయితే దోమలన్నీ నా మీదికి వచ్చి పడతాయి!”

నేను అత్యంత కృతజ్ఞతతో ఆయన మాట పాటించాను. నేను శ్రీరాంపూర్ లో గడిపిన ప్రతి రాత్రీ, మా గురువుగారు, దోమతెరలు కట్టమని చెబుతూ ఉండేవారు. ఒకనాడు దోమలు ఇక మబ్బులా మా మీదికి కమ్ముకొచ్చాయి. అయినా గురువుగారు రోజులా, తెరలు కట్టమని చెప్పలేదు. ఉత్సాహంగా ఆ కీటకాలు చేస్తున్న రొద వింటూంటే బెదురుపుట్టింది. నా పక్కమీదికి వెళ్ళి, వాటిని మంచి చేసుకోడానికి ఒక ప్రార్థన విన్నవించుకున్నాను. ఇలా ఒక అరగంట గడిచిన తరవాత, గురుదేవుల దృష్టిని ఆకర్షించడానికని చిన్నగా దొంగదగ్గు దగ్గాను. దోమకాట్లతో, ముఖ్యంగా రక్తదాహం తీర్చుకొంటూ గాయకమక్షికం చేసే రొదతో, నాకు పిచ్చెత్తిపోతుందేమో అనుకున్నాను.

నా దగ్గుకు జవాబుగా గురువుగారిలో కదలిక ఏమీ కనిపించలేదు. నేను జాగ్రత్తగా ఆయన దగ్గరికి చేరాను. ఆయన ఊపిరి తీసుకోడం లేదు. ఆయన యోగసమాధిలో ఉండగా దగ్గరినుంచి గమనించడం నాకు ఇదే మొదటిసారి; దాంతో నాకు భయం పట్టుకొంది.

“ఆయన గుండె ఆగిపోయి ఉండాలి!” నేను ఆయన ముక్కు కింద ఒక అడ్డం పెట్టాను. శ్వాస తాలూకు ఆవిరి ఏదీ కనిపించలేదు. నా అభిప్రాయాన్ని మరోసారి రూఢి చేసుకోడానికి, ఆయన నోరూ ముక్కురంధ్రాలూ కొన్ని నిమిషాలపాటు నా వ్రేళ్ళతో మూసి ఉంచాను. ఆయన ఒళ్ళు చల్లగా, నిశ్చలంగా ఉంది. అప్పుడు ఏం చెయ్యాలో తెలియక, ఎవరినయినా సహాయానికి పిలుద్దామని గుమ్మం వేపు తిరిగాను.

“ఓహో! కుర్రపరిశోధకుడివా! అయ్యో, నా ముక్కు!” గురువుగారి కంఠస్వరం నవ్వుతో కంపిస్తోంది. “వెళ్ళి పడుకోవేం? ప్రపంచమంతా నీ కోసం మారాలా? నువ్వే మారు; దోమల్ని గురించిన స్పృహ వదుల్చుకో.”

నేను పిల్లిలా నా పక్కదగ్గరికి తిరిగి వెళ్ళాను. ఒక్క కీటకం కూడా నా దగ్గరికి రావడానికి సాహసించలేదు. పూర్వం దోమతెరల వాడ కానికి గురువుగారు అంగీకరించింది నన్ను సంతోష పెట్టడానికే నన్నసంగతి గ్రహించాను; ఆయనకు దోమల భయం లేదు. యోగశక్తి వల్ల ఆయన, దోమలు తమను కుట్టకుండా ఆపగలరు, లేకపోతే, ఆయన తలుచుకుంటే, అంతరికంగా అభేద్యులై ఉండగలరు.

“ఆయన నాకోసం ఇది ప్రదర్శించారు. నేను కృషిచేసి సాధించవలసిన యోగస్థితి అది,” అనుకున్నాను. నిజమైన యోగి, అధిచేతన స్థితిలోకి ప్రవేశించి, దాన్ని నిలుపుకొనే సామర్థ్యం కలవాడు. కీటకాల రొద, కళ్ళు మిరుమిట్లు గొలిపే పగటి వెలుతురు వంటివి అసంఖ్యాకంగా మన మనస్సును చికాకుపరుస్తాయి; ఈ భూమి మీద - అవి లేకపోవడ మన్నది ఎన్నడూ లేదు. నిజమైన యోగి, వాటిని లెక్క పెట్టడు. సమాధిలోని ప్రథమావస్థలో (సవికల్పస్థితి) యోగి, బాహ్య ప్రపంచపు ఇంద్రియ బోధలన్నిటినీ అటకాయించేస్తాడు. అప్పుడు ఆయనకు బహూకృతిగా, తొలుతటి ఈడెన్ స్వర్గం[5] కంటె కూడా సుందరమైన అంతర్లోకాల నాదాలు వినిపిస్తాయి; దృశ్యాలు కనిపిస్తాయి.

గుణపాఠం నేర్పగల ఈ దోమలు, నేను ఆశ్రమంలో మరో ఆరంభపాఠం నేర్చుకోడానికి ఉపకరించాయి. అది ప్రశాంతమైన సాయం సంధ్య వేళ. మా గురుదేవులు ప్రాచీన పవిత్ర గ్రంథాల్ని గురించి సాటిలేని రీతిగా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆయన పాద సన్నిధిలో పరిపూర్ణమైన ప్రశాంతిని అనుభవిస్తున్నాను నేను. మొరటు దోమ ఒకటి, రమణీయ మైన ఈ వాతావరణంలోకి ప్రవేశించి నా దృష్టి మళ్ళించడానికి పాల్పడింది. విషపూరితమైన సూదిలాంటి తన తొండాన్ని కసుక్కున నా తొడలోకి గుచ్చేసరికి, దానిమీద కసి తీర్చుకోడానికి నేను చటుక్కున చెయ్యి ఎత్తాను. కాని దానికి మరణదండన విధించకుండా ఆపేశాను. సరిగా ఆ సమయానికి నాకు, అహింసనుగురించి పతంజలి చెప్పిన సూత్రం గుర్తుకు వచ్చింది.[6]

“పని పూర్తి చెయ్యలేదేం?”

“గురుదేవా! జీవహింసను సమర్థిస్తారా?”

“లేదు. కాని ఇప్పటికే నువ్వు, నీ మనస్సులో చావుదెబ్బ కొట్టావు.”

“నాకు అర్థం కాలేదు.”

“అహింస అని చెప్పడంలో పతంజలి ఉద్దేశం, చంపాలన్న ‘కోరిక’ను తొలగించడం.” నా మనస్సులోని ఆలోచనల్ని, తెరిచిపెట్టిన పుస్తకం చదివినట్టే గ్రహించేవారు శ్రీ యుక్తేశ్వర్‌గారు. “అహింసను అక్షరాలా పాటించడానికి అసౌకర్యంగా ఉండేలా ఏర్పాటయింది ఈ ప్రపంచం. మనిషి హానికరమైన జీవుల్ని నాశనం చెయ్యక తప్పని స్థితి వస్తే రావచ్చు. కాని అదే మాదిరిగా, కోపం, ద్వేషం తెచ్చుకోక తప్పని స్థితి మట్టుకు రాదు. ఈ మాయా ప్రపంచపు గాలి పీల్చుకునే హక్కు జీవరాశులన్నిటికీ ఉంది. సృష్టిరహస్యాన్ని బహిర్గతంచేసే యోగి, ప్రకృతిలో ఉన్న, దిగ్భ్రమ కలిగించే అసంఖ్యాకమైన అభివ్యక్తులతో సామరస్యం ఏర్పరచుకొని ఉంటాడు. హింసాభిలాషను కనక జయించి నట్లయితే అందరూ ఈ సత్యాన్ని అవగాహన చేసుకోవచ్చు.” “గురూజీ, క్రూర జంతువును చంపడానికి బదులు, తాను బలికావడానికి సిద్ధం కావాలా?”

“అక్కర్లేదు. మానవదేహం అమూల్యమైనది. విలక్షణమైన మెదడూ వెన్నులో షట్చక్రాలూ ఉన్న కారణంగా దానికి, పరిణామాత్మక మైన విలువ అన్నిటికన్న ఎక్కువ ఉంది. ఉన్నత స్థితి నందుకొన్న భక్తుడు పరమేశ్వరుడి సర్వోన్నత స్వరూప రీతులను సంపూర్ణంగా అవగాహన చేసుకోడానికి అభివ్యక్తీకరించడానికి సామర్థ్యం కలిగిస్తాయి ఇవి. అంతకన్న తక్కువరకం జీవికి దేనికీ అటువంటి సదుపాయం సమకూరలేదు. ఒక వ్యక్తి ఒక జంతువునుకాని, మరే జీవినయినాకాని తప్పనిసరిగా చంపవలసి వచ్చినట్లయితే అతడు స్వల్పమైన పాపానికి ఒడిగట్టవలసి వస్తుందన్నది నిజమే. కాని నిష్ప్రయోజనంగా మానవదేహ నాశం కావించడం కర్మసిద్ధాంత నియమాన్ని తీవ్రంగా ఉల్లంఘించినట్లేనని ధర్మశాస్త్రాలు ఘోషిస్తాయి.”

మనస్సు తేలికపడి నిట్టూర్చాను; మనిషికి పుట్టుకతో వచ్చిన సహజాతాల్ని ధర్మశాస్త్రాలు అన్ని సమయాల్లోనూ బలపరచవు.

నాకు తెలిసినంతవరకు గురువుగారు, చిరుతపులికికాని పులికికాని ఎన్నడూ ఎదురుపడలేదు. అయితే ఒకసారి, భయంకరమైన నాగుబాము ఒకటి ఆయన ఎదుటికి వచ్చిందికాని, ఆయన ప్రేమకు వశమైపోయిందది. ఈ సంఘటన పూరీలో, సముద్రపు ఒడ్డున మా గురువుగారికున్న ఆశ్రమం దగ్గర జరిగింది. శ్రీ యుక్తేశ్వర్‌గారి దగ్గర కడపటి కాలంలో శిష్యరికం చేసిన ప్రపుల్లుడనే కుర్రవాడు ఆ సమయంలో ఆయన దగ్గర ఉన్నాడు.

“మేము ఆశ్రమం దగ్గర ఆరుబయట కూర్చుని ఉన్నాం,” అంటూ చెప్పాడు ప్రఫుల్లుడు. “దగ్గరిలో ఒక నాగుబాము కనిపించింది. చూస్తేనే వణుకు పుట్టేటంత భయంకరమైన ఆ పాము నాలుగడుగుల పొడుగుంది. అది మా వేపు వడివడిగా వస్తూ కోపంగా పడగ విప్పింది. గురువుగారు దాన్ని చూసి, ఒక పసిపిల్ల వాణ్ణి చేరబిలుస్తున్నట్టుగా నవ్వారు. ఆయన తాళబద్ధంగా చప్పట్లు కొడుతూండడం చూసి నేను గాభరా పడిపోయాను.[7] భయంకరమైన ఆ పాముకు వినోదం కలిగిస్తున్నారు! నేను మనస్సులో తీవ్రంగా ప్రార్థనలు చేస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాను. గురువుగారికి చాలా చేరువగా వచ్చిన తరవాత ఆ పాము నిశ్చలంగా నిలిచిపోయింది; ఆయన లాలింపు వైఖరికి ఆకృష్టమయినట్టుంది. భీతావహంగా ఉన్న పడగ క్రమంగా ముడుచుకుపోయింది. అది శ్రీ యుక్తేశ్వర్‌గారి కాళ్ళ సందులోకి దూరి, అక్కణ్ణించి పొదల్లోకి పోయి అదృశ్యమయింది.

“గురువుగారు చేతులెందుకు ఆడించారో, పాము కాటెందుకు వెయ్య లేదో అప్పట్లో నాకు అర్థం కాలేదు.” అంటూ ముగించాడు ప్రపుల్లుడు.

“మన గురుదేవులు, ఏ ప్రాణివల్ల కలిగే ప్రమాద భయానికయినా సరే అతీతులని అప్పుడు గ్రహించాను.”

నేను ఆశ్రమంలో ఉన్న తొలి నెలల్లో ఒకనాటి మధ్యాహ్నం, శ్రీ యుక్తేశ్వర్‌గారి కళ్ళు నా మీద నిల్చి, గుచ్చిగుచ్చి చూస్తూండడం గమనించాను.

“నువ్వు చాలా బక్కగా ఉన్నావు ముకుందా.”

ఆయన చేసిన వ్యాఖ్య నా మనస్సుకు గుచ్చుకుంది; గుంటలు పడ్డ నా కళ్ళు, ఆర్చుకుపోతున్న శరీరమూ నాకు నచ్చవు. కాని అవి చాలా కాలంగా పీడిస్తున్న అజీర్ణవ్యాధివల్ల చిన్నప్పటినించి వెంటాడుతున్నాయి. ఎన్నో టానిక్కుల సీసాలు మా ఇంట్లో నా గదిలో షెల్ఫు మీద అలాగే పడిఉన్నాయి; వాటిలో ఒక్కటీ నాకు సాయపడలేదు. అస్వస్థమైన శరీరంతో బతికి లాభమేమిటని, విచారగ్రస్తుణ్ణయి నాలో నేను అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూ ఉంటాను.

“మందులకు పరిమితులున్నాయి; దివ్యమైన సృజనాత్మక శక్తికి అటువంటిది ఏదీ లేదు. ఇది నమ్ము. నువ్వు ఆరోగ్యంగా, బలంగా తయారవుతావు.”

గురుదేవుల మాటల మీద నాకు తక్షణమే విశ్వాసం కలిగింది; వాటిలోని సత్యాన్ని నా జీవితానికి వర్తింపజేసి విజయం సాధించగలనన్న నమ్మకం నాకు కలిగించాయి. (జబ్బులు నయంచేసే వాళ్ళలో చాలామంది దగ్గరికి నేను వెళ్ళాను కాని) మరొకరెవరూ నాలో అంత గాఢమైన విశ్వాసం కలిగించలేదు.

రోజురోజుకూ నాకు బాగా ఒళ్ళు వచ్చింది; ఆరోగ్యం, బలం పెరిగాయి. శ్రీ యుక్తేశ్వర్‌గారి గుప్తమైన ఆశీస్సు ద్వారా, ఒక్క రెండు వారాల్లో, అంతకుముందు నే నెంత ప్రయత్నించినప్పటికీ సాధించలేనంత బరువు పెరిగింది. నా ఉదరవ్యాధులు శాశ్వతంగా మటుమాయ మయాయి.

ఆ తరవాత మరికొన్ని సందర్భాల్లో మా గురుదేవులు, మధుమేహం, మూర్ఛ, క్షయ, పక్షవాతం వంటి జబ్బులతో బాధపడే వాళ్ళకు దివ్య శక్తితో నయం చెయ్యడం కళ్ళారా చూసే భాగ్యం కలిగింది.

“చాలా ఏళ్ళ కిందట నేను కూడా బరువు పెరగాలని ఉవ్విళ్ళూరుతూ ఉండేవాణ్ణి.” నన్ను నయంచేసిన కొన్నాళ్ళకి గురువుగారు నాకు చెప్పారు : “ఒకసారి తీవ్రంగా జబ్బుచేసి కోలుకుంటున్న సమయంలో, కాశీలో లాహిరీ మహాశయుల్ని దర్శించాను.” “గురుదేవా, నాకు చాలా జబ్బుగా ఉంటోందండి; బరువు చాలా పౌన్లు తగ్గిపోయాను.”

“యుక్తేశ్వర్,[8] నీకు నువ్వే జబ్బు తెచ్చుకున్నావన్న సంగతి కనిపిస్తూనే ఉంది; ఇప్పుడు నువ్వు బక్కగా ఉన్నాననుకుంటున్నావు.”

“నే నాశించిన దానికి చాలా విరుద్ధమైన సమాధాన మిది; అయితే ఆ తరవాత మా గురుదేవులు ప్రోత్సాహకరంగా ఇలా అన్నారు:

“ ‘చూస్తాను; రేపటికి నీకు మెరుగనిపించాలని నా విశ్వాసం.’

“ఆయన నాకు రహస్యంగా నయం చేస్తున్నారన్న సంగతికి సూచనగా ఆయన మాటల్ని గ్రహించింది, సూక్ష్మగ్రాహకమైన నా మనస్సు. మర్నాడు పొద్దున ఆయన దర్శనానికి వెళ్ళి, ‘గురుదేవా, ఈ రోజు ఒంట్లో బాగా మెరుగ్గా ఉందండి,’ అంటూ సంబరపడుతూ చెప్పాను.

“ ‘నిజమే! ఈ రోజు నువ్వు సత్తువ పుంజుకున్నావు.’

“ ‘కాదు గురుదేవా! నాకు సాయంచేసినవారు మీరు. కొన్ని వారాల తరవాత నాకు ఏమాత్రమయినా సత్తువ రావడం ఇదే మొదలు.’

“ ‘నిజమే. నీ జబ్బు చాలా తీవ్రంగానే ఉండేది. నీ శరీరం ఇంకా బలహీనంగానే ఉంది; అది రేవు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు?”

"ఆ బలహీనత మళ్ళీ వచ్చే అవకాశం ఉందన్న ఆలోచనే నాలో వణుకు, భయం పుట్టించింది. మర్నాడు పొద్దున, ఈ శరీరాన్ని లాహిరీ మహాశయుల ఇంటికి చేరవెయ్యడమే అసాధ్యమనిపించింది.

“ ‘గురుదేవా, మళ్ళీ జబ్బుగా ఉందండి.’ ”

“మా గురుదేవుల చూపు దురవగాహంగా ఉంది. ‘అంటే, మళ్ళీ జబ్బు తెచ్చుకున్నావన్నమాట.’ ”

“నాలో ఓర్పు నశించింది. ‘గురుదేవా, రోజు రోజుకూ మీరు నన్ను హేళన చేస్తూ వస్తున్నారని ఇప్పుడు గ్రహించాను. నేను చెప్పిన నిజమైన సంగతులు మీ రెందుకు నమ్మరో అర్థం కావడం లేదు,’ అన్నాను.”

“ ‘నిన్ను మార్చి మార్చి ఒకసారి బలహీనంగానూ మరోసారి బలంగానూ చేస్తున్నవి నిజంగా నీ ఆలోచనలే.’ గురువుగారు నావేపు ఆప్యాయంగా చూశారు. నీ ఆరోగ్యం, నీ అవచేతన మనస్సులో సాగే ఆలోచనల్ని కచ్చితంగా ఎలా అనుసరిస్తోందో నువ్వే చూశావు. ఆలోచన అనేది విద్యుత్తులాగా, భూమ్యాకర్షణ లాగానే ఒకానొక శక్తి. మానవుడి మనస్సు పరమేశ్వరుడి సర్వశక్తిమంతమైన చైతన్యంలో ఒక విస్ఫు లింగం. శక్తి యుక్తమైన నీ మనస్సు అత్యంత గాఢంగా దేన్ని విశ్వసిస్తే అది జరిగి తీరుతుందని నీకు నిరూపించగలను.

“లాహిరీ మహాశయులు వ్యర్థంగా ఏదీ మాట్లాడరని తెలిసి నేను, అత్యంత శ్రద్ధాభక్తులతో, కృతజ్ఞతతో ఆయనతో ఇలా అన్నాను ‘గురుదేవా, ఇప్పుడు నేను బాగా ఉన్నాననీ, నా వెనకటి బరువు నాకు వచ్చిందనీ అనుకుంటే అవి కూడా జరుగుతాయా?’ ”

“ ‘అలాగే జరుగుతాయి; ఈ క్షణంలోనయినా సరే.’ గురుదేవులు గంభీరంగా అన్నారు; ఆయన చూపు నా కళ్ళమీదే కేంద్రీకరించి ఉంది.

“తక్షణమే నాలో బలమే కాకుండా బరువు కూడా పెరిగినట్టు అనిపించింది. లాహిరీ మహాశయులు మౌనం వహించారు. మరికొన్ని గంటల సేపు ఆయన పాద సన్నిధిలో కూర్చొని, మా అమ్మ ఉంటున్న ఇంటికి వెళ్ళాను; నేను కాశీవెళ్ళినప్పుడల్లా అక్కడే ఉంటుంటాను.

“ ‘నాయనా, ఏమయిందిరా నీకు? ఒంటికి నీరు పట్టి ఉబ్బిందా ఏమిటి?’ అంటూ అమ్మ తన కళ్ళని తాను నమ్మలేకపోయింది. నా ఒళ్ళు. జబ్బు చెయ్యకముందు ఎంత నిండుగా, దృఢంగా ఉండేదో ఇప్పుడూ అలా ఉంది.

“నా బరువు తూచుకుని చూస్తే, ఒక్క రోజులోనే యాభై పౌన్లు పెరిగిన సంగతి గమనించాను; అది ఎప్పటికీ అలానే ఉండిపోయింది. నా బక్కపలచటి శరీరాన్ని చూసిన స్నేహితులూ పరిచయస్థులూ ఒక్కసారి తెల్లబోయారు. వాళ్ళలో కొందరు, ఈ అలౌకిక ఘటన ఫలితంగా తమ జీవిత విధానాన్ని మార్చుకుని లాహిరీ మహాశయులకు శిష్యులయారు.

“బ్రహ్మజ్ఞులైన మా గురుదేవులు, ఈ ప్రపంచం, సృష్టికర్త ఘనీభూతస్వప్నం తప్ప మరేమీ కాదని ఎరుగుదురు. దివ్య స్వాప్నికుడైన పరమేశ్వరుడితో తమకున్న ఏకత్వం స్పృహలో ఉన్నందువల్ల ఆయన భౌతిక ప్రపంచపు స్వప్నాణువుల్ని తమ ఇచ్ఛానుసారంగా ప్రకటితం చెయ్యడంకాని, లుప్తం చెయ్యడంకాని, లేదా తాము కోరిన మార్పు ఏదైనా తీసుకురావడంకాని చెయ్యగలుగుతున్నారు.”[9]

“సృష్టి అంతా నియమబద్ధమైనది. లాహ్య జగత్తులో పనిచేసే, విజ్ఞానశాస్త్రవేత్తలు కనిపెట్టగల సూత్రాల్ని ప్రకృతి నియమాలని అంటున్నారు. కాని గుప్తమైన ఆధ్యాత్మికస్థాయిల్నీ గూఢమైన, అంతశ్చేతననూ పాలించే సూక్ష్మనియమాలు కూడా ఉన్నాయి; ఈ సూత్రాలు యోగశాస్త్రం ద్వారానే తెలుసుకోగలిగినవి. పదార్థం నిజస్వభావం తెలుసుకోగలవాడు ఆత్మ సాక్షాత్కారం పొందిన సద్గురువే కాని భౌతికశాస్త్రజ్ఞుడు కాడు. అటువంటి జ్ఞానంవల్లనే క్రీస్తు, ఒక సేవకుడికి, తన శిష్యుడు తెగ్గోసిన చెవిని మళ్ళీ ఇప్పించాడు.”[10]

మా గురువుగారు పవిత్ర గ్రంథాల్ని వ్యాఖ్యానించడంలో సాటిలేని వారు. నాకు అత్యంత సంతోషకరమైన జ్ఞాపకాలు అనేకం ఆయన ప్రసంగాలకు సంబంధించినవే. రత్నాలు పొదిగిన ఆభరణాలవంటి ఆయన ఆలోచనలు, అశ్రద్ధ లేదా మూఢత్వం అనే బూడిదపాలు కాలేదు. నాలో కుదురులేక శరీరంలో కొద్దిగా కదిలిక కనిపించినా, కొద్దిగా పరధ్యానంగా ఉన్నా చాలు, మా గురుదేవుల వ్యాఖ్యానం తక్షణమే ఆగిపోయేది.

“నువ్విక్కడ లేవు.” అన్నారు శ్రీ యుక్తేశ్వర్‌గారు, ఒకనాటి మధ్యాహ్నం తాము చెబుతున్నది ఆపేసి. ఆయన ఎప్పటిలాగానే నా మనోగతిని నిర్దాక్షిణ్యంగా గమనిస్తూ వస్తున్నారు.

“గురూజీ!” నా స్వరంలో అభ్యంతరం ధ్వనించింది. “నేను కదలలేదు; నా కనురెప్పలు ఆడలేదు; మీరు చెప్పిన ప్రతి మాటా మళ్ళీ వినిపించగలను!”

“అయినా పూర్తిగా నా దగ్గర లేవు. నువ్వు చెప్పిన అభ్యంతరం వల్ల, నీ మనోవీథిలో నువ్వు మూడు సంస్థల్ని సృష్టిస్తున్నావన్న సంగతి చెప్పక తప్పడం లేదు. ఒకటి సమతల ప్రదేశంలో వనస్థల ఆశ్రమం; ఇంకొకటి ఒక కొండమీద; మరొకటి సముద్రపు ఒడ్డున.”

నిజానికి అస్పష్టంగా రూపొందిన ఆ ఆలోచనలు నా అవచేతన మనస్సులో లేకపోలేదు. క్షమార్పణ వేడుకొంటున్నట్టుగా ఆయన వేపు చూశాను.

“అలవోకగా చేసే ఆలోచనల్ని కూడా ఆకళించుకొనే గురువుగారి దగ్గర నేను చెయ్యగలిగేది ఏముంది?”

“నువ్వు నా కా హక్కు ఇచ్చావు. నీకు సంపూర్ణమైన ఏకాగ్రత లేకపోతే నేను వ్యాఖ్యానిస్తున్న సూక్ష్మసత్యాల్ని అవగాహన చేసుకోడం కష్టం. అవసరమయితే తప్ప నేను ఇతరుల మనసుల్లోని ఏకాంతతకు భంగం కలిగించను. మనిషికి తన ఆలోచనల్లో రహస్యంగా సంచరించే సహజమైన హక్కు ఉంది. పిలవనిదే పరమేశ్వరుడూ అందులోకి ప్రవేశించడు; నేను చొరబడ్డానికి సాహసించను.”

“మీకు ఎప్పటికీ స్వాగతమే, గురుదేవా!”

“వాస్తుకళా సంబంధమైన నీ కలలు తరవాత ఫలిస్తాయి, ఇది అధ్యయనానికి సమయం!”

ఈ విధంగా మా గురుదేవులు, సందర్భవశాత్తు, నా జీవితంలో మూడు ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయని తమకు తెలిసిన విషయం, తమకు సహజమైన నిరాడంబర పద్ధతిలో వెల్లడించారు. కిశోర ప్రాయం నుంచి నాకు, వివిధ దృశ్యాల్లో మూడు భవనాల ఆకృతులు అస్పష్టంగా అవుపిస్తూ ఉండేవి. ఈ మూడు దర్శనాలూ శ్రీ యుక్తేశ్వర్ గారు సూచించిన వరసలోనే భౌతికరూపం ధరించాయి. మొదట, రాంచీలో ఒక సమతల ప్రదేశంలో మగపిల్లలకోసం యోగవిద్యాలయం స్థాపించడం జరిగింది; తరవాత లాస్ ఏంజిలస్‌లో ఒక కొండమీద అమెరికా ప్రధాన కార్యాలయం నెలకొల్పడం జరిగింది; ఆ తరవాత కాలిఫోర్నియాలోని ఎన్సినిటాస్‌లో పసిఫిక్ మహాసముద్రానికి ఎదురుగా ఆశ్రమం స్థాపించడం జరిగింది.

“ఫలానా ఫలానా సంఘటనలు జరుగుతాయని నేను జోస్యం చెబుతున్నాను.” అంటూ గురుదేవులు ఎన్నడూ దంభాలు పలక లేదు. అలా కాకుండా, “ఇది జరగవచ్చునేమో కదూ?” అంటూ సూచన చేసేవారు. ఆయన నిరాడంబర వాక్కు, భవిష్యాన్ని జోస్యంగా చెప్పే శక్తిని మరుగు పరిచేది. అన్న దాన్ని వెనక్కి తీసుకోడమన్నది లేదు; కొద్దిగా తెరమరుగుగా ఆయన చెప్పిన జోస్యాలు తప్పుగా ఎన్నడూ రుజువు కాలేదు.

శ్రీ యుక్తేశ్వర్‌గారు మితభాషులు; వైఖరిలో యథార్థత ఉండేది. అస్పష్టతకాని, కలలుకనే స్వభావంకాని ఆయనలో ఏ కోశానా లేదు. ఆయన కాళ్ళు నేలమీదే నిలదొక్కుకుని ఉండేవి; ఆయన తల స్వర్గధామంలోనే కుదురుకొని ఉండేది. వ్యవహారదక్షులైన వాళ్ళు ఆయన ప్రశంసకు పాత్రులయేవారు. “సాధుత్వమంటే మూగతనం కాదు! దివ్యానుభూతులు అశక్తుణ్ణి చేసే వేమీ కావు!” అంటారాయన. “క్రియాశీలకమైన సద్గుణాభివ్యక్తి తీవ్రమైన బుద్ధికి ప్రేరకమవుతుంది.”

మా గురుదేవులు అధిభౌతిక క్షేత్రాల్ని గురించి చర్చించడానికి విముఖులు. ఆయన ప్రసరించే ఒకేఒక “అద్భుత” ప్రభ పరిపూర్ణమైన సరళత్వం. సంభాషణ చేసేటప్పుడాయన, ఆశ్చర్యం కలిగించే ప్రస్తావన లేవీ రాకుండా చూసేవారు; పనిలో ఆయన విలక్షణత స్వేచ్ఛగా అభివ్యక్తమయేది. చాలామంది బోధకులు అలౌకిక ఘటనల గురించి మాట్లాడేవారే కాని చేసి చూపించగలిగింది శూన్యం; శ్రీయుక్తేశ్వర్‌గారు సూక్ష్మ నియమాలగురించి చెప్పడం అరుదు; కాని వాటిచేత తమ సంకల్పానుసారంగా రహస్యంగా పని చేయించేవారు.

“ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు ఆంతరిక ప్రేరణ పొందితేనే కాని అలౌకిక అద్భుత చర్య ఏదీ చెయ్యడు,” అని వివరించారు గురుదేవులు. “దేవుడు తన సృష్టి రహస్యాలు విచక్షణ రహితంగా వెల్లడి కావాలని ఆశించడు.[11] అలాగే ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తన స్వతంత్రేచ్ఛ మీద, పరాధీనం చెయ్యరాని హక్కు ఉంది. ఏ సాధువూ ఆ స్వాతంత్ర్యానికి భంగం కలిగించడు.

శ్రీ యుక్తేశ్వర్‌గారిలో అలవాటుగా కనిపించే మౌనం, ఆయన పొందిన గాఢమైన ఈశ్వరానుభూతులవల్ల కలిగినది. ఆత్మసాక్షాత్కారం పొందని బోధకుల దినాలను ఆక్రమించుకొనే అంతులేని “అలౌకిక దర్శనాలు” ప్రదర్శించడానికి ఆయనకు టైము లేదు. హిందూ పవిత్ర గ్రంథాల్లో ఇలా చెప్తారు: “మెరక నీటివంటి మందబుద్ధుల్లో చిన్న చిన్న ఆలోచనలనే చేపలే మహాసంక్షోభం కలిగిస్తాయి. మహాసముద్రాలవంటి మనస్సుల్లో దివ్యప్రేరణలనే తిమింగిలాలు ఏ సంచలనమూ కలిగించవు.”

మా గురుదేవుల నిరాడంబరత అనే ఆచ్ఛాదన కారణంగా, ఆయన సమకాలికుల్లో చాలా కొద్దిమందే, ఆయనను మానవాతీతులుగా గుర్తించారు. “తన జ్ఞానాన్ని మరుగుపరచలేనివాడు మూర్ఖుడు” అన్న నానుడి, పరమ జ్ఞానులు, శాంతమూర్తులు అయిన మా గురుదేవులకు ఎన్నడూ వర్తించదు.

శ్రీ యుక్తేశ్వర్‌గారు, తక్కిన వాళ్ళందరిలాగే మానవ మాత్రు లుగా జన్మించినప్పటికీ దేశకాలాలకు నియంత అయిన పరమేశ్వరుడితో తాదాత్మ్యం సాధించారు. నరుడు నారాయణుడు కావడానికి దాటరాని అడ్డంకి ఏదీ ఆయనకు అవుపించలేదు. మనిషిలో ఆధ్యాత్మిక సాహసికత లేకపోవడం తప్ప, వేరే అడ్డంకి ఏది లేదని నేను క్రమంగా గ్రహించాను.

శ్రీ యుక్తేశ్వర్‌గారి పవిత్ర పాదస్పర్శ తగిలినప్పుడల్లా నాకు ఒళ్ళు పులకిస్తుండేది. గురువుతో భక్తిపూర్వకమైన స్పర్శ కలగడంవల్ల శిష్యుడు ఆధ్యాత్మిక ఆకర్షణశక్తి పొందుతాడు; సూక్ష్మ విద్యుత్ప్రవాహం ఒకటి జనిస్తుంది. భక్తుడి మెదడులో ఉండే అవాంఛనీయమైన అభ్యాస సంస్కారాలు విద్యుదాఘాతం పొందుతాయి. అతని ప్రాపంచిక ప్రవృత్తుల గాళ్ళు చెదిరి లాభకరమవుతాయి. కనీసం క్షణికంగానయినా, మాయను కప్పి ఉన్న రహస్య ఆచ్ఛాదనం తొలగడం, పరమానందమనే వాస్తవికత తళుక్కుమనడం జరగవచ్చు. నేను భారతీయపద్ధతిలో మా గురుదేవులకు ఎప్పుడు ప్రణామం చేసినా, నా శరీరమంతటా మోక్షప్రదమైన కాంతి ప్రసరించేది.

“లాహిరీ మహాశయులు మౌనంగా ఉన్నప్పుడు సైతం, లేదా కచ్చితంగా మతానికి సంబంధించని విషయాలు ముచ్చటించేటప్పుడు కూడా వారు అనిర్వచనీయమైన విజ్ఞానం అందిస్తున్నారని కనిపెట్టేవాణ్ణి,” అన్నారు గురువుగారు నాతో.

ఆ విధంగానే శ్రీ యుక్తేశ్వర్‌గారు నన్ను ప్రభావితుణ్ణి చేశారు. నేను దిగులుగాగాని ఉదాసీనమైన మనస్సుతోకాని ఆశ్రమంలోకి ప్రవేశిస్తే నా వైఖరి తెలియకుండానే మారిపోయేది. కేవలం మా గురుదేవుల దర్శనంతోనే ఉపశమనం కలిగించే ప్రశాంతత నాకు లభించేది. ఆయన సన్నిధిలో ప్రతిరోజూ ఆనందంతో, శాంతిలో, జ్ఞానంలో ఒక్కొక్క కొత్త అనుభవం కలుగుతుండేది. దురాశవల్లనో కోపంవల్లనో మానవిక మైన అనుబంధంవల్లనో భ్రాంతిలో పడ్డట్టుగాని భావోద్రేకంతో ఉత్తేజితులై ఉన్నట్టుగాని ఆయన నా కెన్నడూ కనిపించలేదు.

“మాయ అనే చీకటి చప్పుడు చెయ్యకుండా దగ్గరికి వస్తోంది. లోపలింటికి త్వరగా పోదాం, పద!” హెచ్చరికగా చెప్పే ఈ మాటలతో గురుదేవులు, క్రియాయోగ సాధన చెయ్యవలసిన అవసరాన్ని తమ శిష్యులకు నిరంతరం గుర్తు చేసేవారు. అప్పుడప్పుడు ఒక్కొక్క కొత్త విద్యార్థి, యోగసాధన చెయ్యడానికి తనకున్న అర్హత విషయంలో సందేహాలు వెలిబుచ్చేవాడు.

“గతాన్ని మరిచిపో,” అంటూ శ్రీ యుక్తేశ్వర్‌గారు అతన్ని సముదాయించేవారు. “మనుష్యులందరి గతజీవితాలు అనేక అవమానాలతో చీకటి ముసురుకొని ఉన్నవే. మనిషి దైవీభావనలో దృఢంగా నెలకొనే వరకు మానవ ప్రవర్తనను ఎన్నటికీ నమ్మడానికి వీలులేదు. నువ్వు కనక ఇప్పుడు ఆధ్యాత్మిక కృషి చేస్తున్నట్లయితే ఇకముందు ప్రతిదీ మెరుగవుతుంది.”

ఆశ్రమంలో గురువుగారిదగ్గర చిన్నచిన్న శిష్యులు ఎప్పుడూ ఉంటుండేవారు. వాళ్ళ బౌద్ధిక, ఆధ్యాత్మిక శిక్షణ ఆయన యావజ్జీవితాసక్తి. ఆయన గతించడానికి కొద్దికాలం ముందుకూడా, ఆరేళ్ళ వయస్సు గల కుర్రవాళ్ళ నిద్దరినీ, పదహారేళ్ళ వయస్సుగల కుర్రవాణ్ణి ఒకణ్ణి ఆశ్రమవాసానికి స్వీకరించారు. ఆయన వర్దీలో ఉన్న వాళ్ళందరికీ జాగ్రత్తగా శిక్షణ ఇచ్చారు; ఈ విధంగా ‘శిష్య’, ‘శాసన’ (శిక్షణ) శబ్దాలు రెంటికీ వ్యుత్పత్తిలోనే కాకుండా ఆచరణరీత్యా కూడా పరస్పర సంబంధ మేర్పరచడం జరిగింది.

ఆశ్రమవాసులు గురుదేవులను అభిమానించేవారు; గౌరవించేవారు; ఒక్కసారి చిన్నగా చప్పట్లు చరిస్తే చాలు, ఆత్రంగా వచ్చి, ఆయన పక్కన నిలబడేవారు. ఆయన మనఃస్థితి గంభీరమై అంతర్ముఖు లయినప్పుడు, మాట్లాడడానికి ఎవ్వరూ సాహసించేవారు కాదు; ఆయన నవ్వు ఉల్లాసంగా ధ్వనించినప్పుడు మాత్రం ఆయన తమ సొంతమే అన్నట్టు చూసేవారు పిల్లలు.

శ్రీ యుక్తేశ్వర్‌గారు తమకోసం ఏదయినా పని చేసిపెట్టమని ఇతరుల్ని అడగడం అరుదు; ఏ శిష్యుడు చేసే సహాయమైనా సంతోషంగా చెయ్యకపోతే స్వీకరించేవాడు కాడు. శిష్యు లెప్పుడయినా, ఆయన బట్టలు ఉతికే అవకాశ భాగ్యాన్ని కనక మరిచిపోతే గురుదేవులే స్వయంగా ఉతుక్కొనే వారు.

ఆయన మామూలుగా వేసుకొనే బట్టలు, సాంప్రదాయికంగా సన్యాసులు ధరించే కాషాయవస్త్రాలు. ఆశ్రమంలో ఉన్నప్పుడాయన, యోగుల సంప్రదాయాన్ని అనుసరించి, పులి చర్మంతోనో జింక చర్మంతోనో కుట్టిన, తాళ్ళులేని బూట్లు వేసుకొనేవారు.

శ్రీ యుక్తేశ్వర్‌గారు ఇంగ్లీషు, ఫ్రెంచి, బెంగాలీ, హిందీ ధారాళంగా మాట్లాడేవారు; సంస్కృతంలో మంచి పరిజ్ఞానముంది. ఇంగ్లీషు, సంస్కృతం నేర్చుకోడానికి తాము నేర్పుగా రూపొందించిన సులభ పద్దతులు కొన్ని చిన్న విద్యార్థులకు మంచి ఓపికగా నేర్పేవారు.

గురుదేవులకు తమ శరీరం మీద అపేక్ష ఉండేది కాదు కాని, దాని విషయంలో జాగ్రత్తగా ఉండేవారు. దేవుడు శారీరక మానసిక స్వస్థతల ద్వారానే సరిగా అభివ్యక్తమవుతాడని చెప్పేవారు. అతిగా ఉన్నవన్నీ నిరాకరించేవారు. దీర్ఘ కాలం ఉపవాసం చెయ్యదలచిన ఒక శిష్యుణ్ణి చూసి నవ్వుతూ మా గురుదేవులు, “కుక్కకి ఒక ఎముక వెయ్యగూడదూ?”[12] అన్నారొకసారి.

శ్రీ యుక్తేశ్వర్‌గారి ఆరోగ్యం అద్భుతంగా ఉండేది. ఆయనకు సుస్తీ చెయ్యగా ఎన్నడూ చూడలేదు నేను.[13] తమ శిష్యులు వైద్యుల్ని సంప్రదించదలిస్తే, లౌకికాచారాన్ని మన్నించడం కోసం ఆయన, వాళ్ళకు అందుకు అనుమతి ఇచ్చేవారు. “భౌతిక పదార్థానికి వర్తించే విధంగా దేవుడు ఏర్పరిచిన నియమాల ద్వారా వైద్యులు తాము చేసే వైద్యం సాగించాలి,” అనే వారాయన. అయితే మానసిన వైద్యానికున్న ఘనతను ప్రశంసిస్తూ ఆయన, తరచుగా ఇలా అనేవారు: “అన్నిటికన్న గొప్పగా క్షాళన చేసేది జ్ఞానం.” ఆయన శిష్యులకు ఇలా చెప్పారు:

“విశ్వాసఘాతుకుడైన స్నేహితుడిలాంటిది శరీరం. దానికి ఇయ్యవలసినంత మట్టుకే ఇయ్యండి; అంతకు మించి వద్దు. కష్టం, సుఖం అనేవి అస్థిరమైనవి. ఈ ద్వంద్వాల ప్రాబల్యం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూనే వాటి నన్నిటినీ నిబ్బరంగా ఓర్చుకోండి. జబ్బూ స్వస్థతా కూడా ప్రవేశించే ద్వారం ఊహ. మీకు జబ్బుగా ఉన్నప్పుడయినా సరే, జబ్బు అనే వాస్తవాన్ని నమ్మకండి; గుర్తింపు పొందని ఆ సందర్శకుడు పలాయనం చిత్తగిస్తాడు!”

మా గురువుగారి శిష్యుల్లో వైద్యులు చాలామంది ఉన్నారు. “శరీర ధర్మశాస్త్రం చదివినవాళ్ళు ఇంకా ముందుకు సాగి ఆత్మజ్ఞానాన్ని శోధిం చాలి,” అవి వాళ్ళకు చెప్పేవారాయన. “శరీర యంత్రానికి సరిగా వెనకాల సూక్ష్మమైన ఆధ్యాత్మిక తంత్రం ఒకటి దాక్కొని ఉంది.[14]

శ్రీ యుక్తేశ్వర్‌గారు తమ శిష్యుల్ని, ప్రాచ్య పాశ్చాత్యదేశాల సుగుణాల్ని ఇముడ్చుకొన్న జీవంతమైన మేళనకర్తలుగా నడుచుకోమని సలహా ఇచ్చేవారు. ఆయనయితే బాహ్యమైన అలవాట్లతో పాశ్చాత్యఫక్కి నిర్వాహకులు; అంతరంగంలో ప్రాచ్యఫక్కి ఆధ్యాత్మిక వాది. పాశ్చాత్యుల అభ్యుదయశీలక, ప్రతిభాసంపన్న, ఆరోగ్యప్రదమైన పంథాలనూ అనేక శతాబ్దుల కాలంగా ప్రాచ్యదేశాల ఘనత నిలిపిన ధార్మిక ఆదర్శాలనూ ప్రశంసించేవారాయన.

క్రమశిక్షణ నాకు తెలియనిది కాదు; ఇంటి దగ్గర నాన్న గారు కచ్చితమైన క్రమశిక్షణ పాటింపచేసే వారు; అనంతుడు తరచు కఠినంగా వ్యవహరించేవాడు. కాని శ్రీ యుక్తేశ్వర్‌గారి శిక్షణ పటిష్ఠమైనదనాలే కాని మరోరకంగా చెప్పడానికి వీలులేదు. క్షణికమైన విషయాల్లో నయితే నేం, మామూలు నడవడి తాలూకు సూక్ష్మ వైవిద్యాల విషయంలో నయితే నేం, పరిపూర్ణతాప్రియులైన మా గురుదేవులు తమ శిష్యుల్ని తీవ్రంగా విమర్శించేవారు.

“చిత్తశుద్ధి లేని సభ్యత నిర్జీవమైన సుందరాంగి వంటిది,” అన్నా రొకసారి సందర్భవశాత్తు, ఆయన. “సభ్యతలేని ఋజుత్వం, వైద్యుడి కత్తిలాగ, పనికివచ్చేదే కాని అప్రియమైనది. మర్యాదతో కూడిన నిష్కాపట్యం సహాయకరమైనదే కాక, ప్రశంసనీయమైనది కూడా.”

గురుదేవులు నా ఆధ్యాత్మిక ప్రగతి విషయంలో తృప్తిపడ్డట్టే కనిపించేవారు; ఎప్పుడోకాని దాన్ని ప్రస్తావించకపోవడమే నేనలా అనుకోడానికి కారణం. ఇతర విషయాల్లో మట్టుకు ఆయన చివాట్లు నా చెవులకు కొత్త కావు. పరధ్యానం, అప్పుడప్పుడు దిగాలుపడి ఉండడం, మర్యాదకు సంబంధించిన నియమాలు కొన్ని పాటించకపోవడం, తీరువు లేకుండా అప్పుడప్పుడు పనిచెయ్యడం- ఇవే నా పెద్ద అపరాధాలు.

“మీ నాన్న భగవతిగారి కార్యకలాపాలు ఎంత కట్టుదిట్టంగా, ఎంత తీరువుగా ఉంటాయో చూడు,” అని మా గురువుగా రన్నారొకనాడు. లాహిరీ మహాశయుల శిష్యులయిన వీరిద్దరూ, నేను మొదటిసారి శ్రీరాంపూర్ ఆశ్రమానికి వెళ్ళిన కొద్ది రోజులకే కలుసుకొన్నారు. మా నాన్నగారూ, మా గురువుగారూ ఒకరినొకరు గాఢంగా అభిమానించారు. వీళిద్దరూ యుగయుగాంతరాలకు కూడా క్షయంకాని ఆధ్యాత్మిక ఆధార శిలల పునాదుల మీద రమ్యమైన అంతర్జీవిత హర్మ్యాన్ని నిర్మించుకున్నారు. నా చిన్నప్పుడు , కొద్దికాలం నాకు చదువుచెప్పిన ఒక మాస్టరుగారి దగ్గర తప్పుడు పాఠాలు కొన్ని ఒంటబట్టించుకున్నాను. శిష్యుడయిన వాడు లౌకిక విధుల నిర్వహణ కోసం ఎక్కువగా శ్రమపడవలసిన అవసరం లేదని నాకు చెప్పడం జరిగింది. నేను నా పనుల్ని ఉపేక్షించడం గాని, అజాగ్రత్తగా చెయ్యడంగాని జరిగినప్పుడు నన్ను మందలించలేదు. మానవ ప్రకృతికి, అల్లాటి బోధలు ఒంట బట్టించుకోడం చాలా సులువుగా కనిపిస్తుంది. అయితే గురుదేవుల కఠిన శిక్షణలో, బాధ్యతారహితమైన మనోజ్ఞమైన భ్రమల్లోంచి త్వరగానే బయటపడ్డాను.

“ఈ లోకానికి అతిమంచిగా ఉండేవాళ్ళు వేరొక లోకానికి శోభ చేకూరుస్తున్నవాళ్ళు,” అన్నారు శ్రీ యుక్తేశ్వర్ గారొకనాడు. “ఈ భూమిమీద ఉచితంగా లభించే గాలి పీలుస్తున్నంతకాలం, కృతజ్ఞతా పూర్వకమైన సేవ చెయ్యవలసిన బాధ్యత మనమీద ఉంటుంది. ఊపిరి ఆడని సమాధిస్థితి[15]ని పూర్తిగా సాధించినవాడు మాత్రమే ప్రాపంచిక విధుల నుంచి విముక్తి పొందుతాడు.” అని చెబుతూ ఆయన, “నువ్వు అంతిమ పరిపూర్ణత్వం సాధించినప్పుడు ఆ విషయం నీకు తెలియజెయ్య కుండా ఉండను,” అన్నారు పొడిగా.

ప్రేమతో నయినా సరే, మా గురువుగారిని ఆశపెట్టి అనుకూలంగా మార్చుకోలేము. నాలాగ, ఆయనదగ్గిర శిష్యరికం చేయ్యడానికి మనఃపూర్వకంగా అంగీకరించినవారెవరి విషయంలోనూ ఆయన మెతకతనం చూపించలేదు. గురువుగారికీ నాకూ చుట్టూ ఆయన విద్యార్థులుకాని పరిచయంలేని పరాయివాళ్ళు కాని ఉన్నా సరే, మేము ఏకాంతంగా ఉన్నా సరే ఆయన ఎప్పుడూ దాపరికంలేకుండా మాట్లాడుతూ చెడామడా చివాట్లు పెట్టేవారు. తెలివితక్కువతనంవల్ల కాని, అసందర్భంగాగాని చిన్న పొరపాటు జరిగితే చాలు, ఆయన చివాట్లు తప్పేవి కావు. అహంకారాన్ని అణగ్గొట్టే ఈ మాదిరి వ్యవహారవిధానం సహించడం కష్టమే అయినప్పటికీ, నాలో ఉన్న మానసికమైన ఎగుడుదిగుళ్ళను చదునుచెయ్యడానికి శ్రీ యుక్తేశ్వర్‌గారిని అనుమతించాలన్నదే మార్చరాని నా తీర్మానం.

“నా మాటలు నీకు నచ్చకపోతే నువ్వు ఎప్పుడయినాసరే స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు,” అని హామీ ఇచ్చారు గురుదేవులు. “నీ అభివృద్ధి తప్ప నేను నీ దగ్గర మరేమీ కోరను. నీకు లాభం కలుగుతోందనిపిస్తేనే ఉండు.”

నా దురహంకారాన్ని సమ్మెట దెబ్బలతో అణిచేసినందుకు నే నాయనకి ఎంతో కృతజ్ఞుణ్ణి. ఆలంకారికంగా చెప్పాలంటే, నా దవడకున్న పలువరసలో ప్రతి పుప్పిపన్నూ కనిపెట్టి పీకేస్తున్నారాయన, అని ఒక్కొక్కప్పుడు అనిపించేది నాకు. అహంభావాన్ని తొలగించాలంటే మొరటుగా తప్ప మరే విధంగా నయినా కష్టమే. అది పోయిన తరవాతనే ఈశ్వరానుభూతికి, చివరికి నిర్నిరుద్ధమైన దారి దొరుకుతుంది. స్వార్థంతో బండబారిన గుండెల్లోకి చొరబారడానికి అది చేసే ప్రయత్నం వృథాయే అవుతుంది.

శ్రీ యుక్తేశ్వర్‌గారి సహజావబోధం తీక్ష్ణంగా ఉండేది. ఆయన తరచు, అవతలి వ్యక్తి చెప్పిన మాటలతో నిమిత్తంలేకుండా, అతను బయటపెట్టని ఆలోచనలకు జవాబు ఇస్తూ ఉండేవారు. ఒక మనిషి వాడిన మాటలూ వాటి వెనకఉన్న వాస్తవమైన ఆలోచనలూ భిన్న ధ్రువాలు అయి ఉండవచ్చు. “మనుషుల పదాడంబరంవల్ల కలిగే గందరగోళానికి వెనకఉన్న ఆలోచనల్ని ప్రశాంతతద్వారా అనుభూతం చేసుకోడానికి ప్రయత్నం చెయ్యి,” అన్నారు మా గురుదేవులు.

దివ్యమైన అంతర్దృష్టివల్ల బయల్పడే విషయాలు ప్రాపంచిక జీవుల చెవులకు తరచు కటువుగా ఉంటాయి. పైపై మెరుగులతో సరిపెట్టుకొనే విద్యార్థుల అభిమానాన్ని ఆయన చూరగొనలేదు. ఎప్పుడూ కొద్ది సంఖ్యలోనే ఉండే తెలివైన విద్యార్థులు మాత్రం ఆయన్ని ప్రగాఢమైన భక్తితో ఆరాధించేవారు.

ఆయన మాట అంత కటువుగానూ నిందాత్మకంగానూ ఉండి ఉండకపోతే భారతదేశంలో ఎక్కువమంది శిష్యులు వెతుక్కుంటూ ఏరి కోరి వచ్చేది శ్రీ యుక్తేశ్వర్‌గారి దగ్గరికేనని నొక్కి చెప్పగలను.

“నా దగ్గరికి తర్ఫీదుకు వచ్చిన వాళ్ళ విషయంలో నేను కఠినంగా ఉంటాను,” అని నా దగ్గర ఒప్పుకొన్నారాయన. “అది నా పద్ధతి. దాన్ని, ఒప్పుకో, మానుకో; అందులో నేను రాజీపడను. కాని నువ్వు నీ శిష్యులతో ఇంతకంటె దయగా ఉంటావు. అది నీ పద్ధతి. కాఠిన్యమనే నిప్పుల్లోనే కాల్చి శుద్ధి చెయ్యడానికి ప్రయత్నిస్తాను నేను! ఇవి, సగటు సహనశక్తి కి మించి మలమల మాడుస్తాయి. ప్రేమతో కూడిన సౌమ్య మార్గం కూడా మార్పు తీసుకువస్తుంది. విజ్ఞతతో ప్రయోగించినట్టయితే కఠోర పద్ధతులూ కోమల పద్ధతులు కూడా సమంగా ఫలప్రదమైనవే.” ఆయన ఇంకా ఇలా అన్నారు, “నువ్వు పై దేశాలకి వెళ్తావు; అక్కడ అహంకారం మీద మొరటుగా తీసే దెబ్బల్ని హర్షించరు. రాజీపడడానికి అనుకూలమైన నిధానం, ఓరిమి సమృద్ధిగా లేనిదే ఏ గురువూ భారతదేశ సందేశాన్ని పాశ్చాత్యదేశాల్లో వ్యాప్తి చెయ్యలేడు.” (గురుదేవుల మాటల్ని నేను అమెరికాలో ఎంత తరచుగా గుర్తు చేసుకున్నానో చెప్పనుగాక చెప్పను!). వాస్తవాన్ని బయల్పరిచే మా గురుదేవుల వాక్కు, ఆయన భూమిమీద ఉన్న కాలంలో అధిక సంఖ్యలో శిష్యులు ఏర్పడకుండా ఆటంకపరిచినప్పటికీ, నానాటికీ అధికమవుతున్న, చిత్తశుద్ధిగల శిష్యుల మూలంగా ఆయన ఆత్మ ఈనాటికీ ప్రపంచంలో జీవిస్తోంది. అలెగ్జాండరు వంటి యోధులు భూమిమీద సార్వభౌమాధికారం కోసం పాకులాడుతారు; శ్రీ యుక్తేశ్వర్‌గారి వంటి గురువులు అంతకన్న విశాలమైన సామ్రాజ్యాన్ని - మానవ హృదయాల్లో జయిస్తారు.

తమ శిష్యుల లోపాల్లో చిన్నవాటినీ పట్టించుకోనవసరం లేనివాటినీ ఉత్పాతాన్ని సూచించేటంత తీవ్రంగా ఎత్తిచూపడం గురుదేవుల అలవాటు. ఒకనాడు మా నాన్నగారు శ్రీ యుక్తేశ్వర్‌గారి దర్శనం కోసం శ్రీరాంపూర్ వచ్చారు. నాన్నగారు నా గురించి మెప్పుగా నాలుగు మాటలు విందామని ఆశించి ఉండవచ్చు. కాని నాలోఉన్న లోపాల్ని వరసపెట్టడం వినేసరికి అదిరిపోయారు. వెంటనే నా దగ్గరికి వచ్చారు.

“మీ గురువుగారి మాటల్ని బట్టి నువ్వు పూర్తిగా ధ్వంసమయావని అనుకోవలసి వస్తోంది!” కన్నీళ్ళకీ నవ్వుకీ మధ్య అవస్థలో ఉన్నారు నాన్నగారు.

ఆ సమయంలో శ్రీ యుక్తేశ్వర్‌గారి అసంతుష్టికి కారణం ఒక్కటే - ఒకతన్ని ఆధ్యాత్మిక మార్గంలోకి మార్చే విషయమై, గురువుగారు ఆ పని వద్దని సౌమ్యంగా సూచించినప్పటికీ నేను అందుకు ప్రయత్నిస్తూ ఉండడమే. నేను రోషంగా గబగబా గురువుగారి దగ్గరికి వెళ్ళాను. చేసిన తప్పు తెలిసినవారిలా, నన్ను చూసి కళ్ళు కిందికి వాల్చుకున్నారు. ఆ దివ్య సింహం నా ఎదుట అంత సౌమ్యంగా ఉండగా చూడడం అదొక్క సారే, ఆ ఏకైక క్షణాన్ని పూర్తిగా ఆనందించాను.

“స్వామీ, మా నాన్న గారిదగ్గర నా గురించి అంత నిర్దయగా మాట్లాడి ఆయన విస్తుపోయేటట్టు ఎందుకు చేశారు? అది న్యాయమేనా?”

“ఇంకెప్పుడూ అలా చెయ్యను.” శ్రీయుక్తేశ్వర్‌గారి కంఠస్వరం క్షమాపణ చెప్పుకొంటున్నట్టుగా ఉంది.

చటుక్కున నేమ నిరాయుధుణ్ణి అయిపోయాను. ఆ మహాను భావులు తప్పు ఎంత వెంటనే ఒప్పుకున్నారు! అయితే గురుదేవులు మళ్ళీ ఎన్నడూ నాన్నగారి మనశ్శాంతిని పోగొట్టలేదు కాని ఆయన ఎప్పుడనుకుంటే అప్పుడు, ఎక్కడనుకుంటే అక్కడ, నన్ను నిర్దాక్షిణ్యంగా చీల్చి చెండాడుతూ ఉండేవారు.

శ్రీయుక్తేశ్వర్‌గారు ఆమూలాగ్రంగా ఇతరుల్ని విమర్శిస్తూ ఉండేటప్పుడు తరచుగా కొత్త శిష్యులు కూడా ఆయనతో కలుస్తూ ఉండేవారు. గురువుగారంతటి జ్ఞానులు మరి! దోషంలేని వివేకమూర్తులు మరి! కాని ఒకరిమీద దెబ్బతియ్యాలని చూసేవాడు తాను కాపుదల లేకుండా ఉండగూడదు. ఒకరిలో తప్పులు పట్టే ఈ శిష్యులే, విమర్శ అనే తమ అమ్ముల పొదిలోంచి గురుదేవులు కొన్ని బాణాలు వాళ్ళవేపు దూసుకువెళ్ళేలా బహిరంగంగా వదిలిన వెంటనే ఆయన దగ్గర్నించి అనాలోచితంగా పలాయనం చిత్తగించారు.

“మెత్తని మందలింపులకే ఎదురుతిరిగే సున్నితమైన మానసిక బలహీనతలు, సున్నితంగా తాకేలోగానే ఎదురుతిరిగే, రుజాగ్రస్తమైన శరీరావయవాల వంటివి.” పలాయనంచేసే వాళ్ళగురించి శ్రీయుక్తేశ్వర్‌గారు సరదాగా చేసిన వ్యాఖ్య ఇది.

చాలామంది శిష్యులకు గురువుగారి గురించి ముందుగా ఊహించుకొన్న అభిప్రాయాలు కొన్ని ఉండడంతో, వాటినిబట్టి వాళ్ళు ఆయన మాటల్ని చేతల్నీ నిర్ణయిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు, శ్రీయుక్తేశ్వర్‌గారిని తాము అర్థంచేసుకోలేదనీ తరచుగా ఫిర్యాదు చేస్తూ ఉంటారు.

“మీరు దేవుణ్ణి అర్థంచేసుకోరు!” అంటూ ఒక సందర్భంలో నేను మాటకు మాట తిప్పికొట్టాను. “ఒక సాధువు మీకు అర్థం కావడమే జరిగితే మీరే ఒక సాధువవుతారు!” సృష్టిలో కోటానుకోట్ల రహస్యాలు దురవగాహంగా ఉండగా సాధువుల అగాధమైన ప్రకృతి ఒక్కటి తక్షణమే అర్థంకావాలని అడగడానికి సాహసించవచ్చా?

శిష్యులు వచ్చేవారు; సాధారణంగా వెళ్ళిపోయేవారు. సులువైన దారికోసం – అంటే, తక్షణ సానుభూతికోసం, తన యోగ్యతలకు ఆహ్లాదకరమైన గుర్తింపుకోసం – తపించిపోయే వాళ్ళకి ఈ ఆశ్రమంలో అది కనిపించేది కాదు. గురుదేవులు తమ శిష్యులకు ఆశ్రయం, అనేక యుగాల పాటు సంరక్షణ ఇస్తూండేవారు. కాని చాలామంది శిష్యులు లోభుల మాదిరిగా తమ అహంకారానికి తృప్తి కూడా కావాలని కోరేవారు. వినయం అలవరచుకోడానికి బదులుగా జీవితంలో ఎదురయే లెక్కలేనన్ని అవమానాలకే ప్రాముఖ్యమిచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. శ్రీయుక్తేశ్వర్‌గారి తీక్ష్ణకిరణాలు – అంటే, బహిరంగంగా లోపలికి చొచ్చుకు వెళ్ళే ఆయన జ్ఞాన సూర్యరశ్మి – వాళ్ళ ఆధ్యాత్మిక రుగ్మతకు భరించజాలనంత శక్తిమంతమైనవి. వాళ్ళు తమను పొగడ్తతో మరుగుపరుస్తూ అజ్ఞానమనే కలతనిద్రలో ఉండనిచ్చే తక్కువస్థాయి గురువును చూసుకునేవారు.

గురుదేవుల దగ్గర నేనున్న తొలినాళ్ళలో, పదిమంది ముందు ఆయన పెట్టే చివాట్లంటే ఒక రకం భయం పట్టుకుంది. అయితే ఆయన, మాటల రూపంలో చేసే ఆ శస్త్రచికిత్సలు, తర్ఫీదు ఇమ్మని నా మాదిరిగా తమను కోరిన వ్యక్తులమీదే ప్రయోగించేవారని త్వరలోనే గ్రహించాను. అందుకు గింజుకునే విద్యార్థి ఎవరయినా అభ్యంతరం చెబితే మట్టుకు శ్రీయుక్తేశ్వర్‌గారు, మనస్సులో ఏమీ నొచ్చుకోకుండా మౌనం వహించేవారు. ఆయన మాటలెన్నడూ, వ్యక్తిగతంగా వర్తించేటట్లు, కాకుండా జ్ఞానసంపన్నమై ఉండేవికాని, ఆగ్రహోదగ్రంగా ఉండేవి కావు.

గురుదేవుల చివాట్లు ఉత్తిపుణ్యానికి వచ్చినవాళ్ళకి ఎన్నడూ తగి లేవి కాదు; వాళ్ళ లోపాలు కొట్టవచ్చినట్టు ఉన్నప్పటికీ వాటిని గురించి ఆయన వ్యాఖ్యానించడం అరుదు. కాని తను సలహాకోసం వచ్చిన విద్యార్థుల విషయంలో మట్టుకు శ్రీ యుక్తేశ్వర్‌గారు తమమీద గురుతరమైన బాధ్యత ఉందని భావించేవారు. అహంకారం చొరబారిన మానవులు అనే ముడిఖనిజాన్ని మార్చడానికి పూనుకొన్న గురువే నిజంగా ధైర్యశాలి! సాధువు సాహసం, మాయాజాలంలో ఇరుక్కొని కలవరపడే ప్రజలమీద అంటే, తడుములాడుకొనే గుడ్డివాళ్ళ లాటి ప్రాపంచిక జనులమీద- కలిగిన కరుణలో పాదుకొని ఉంటుంది.

నేను నాలో ఉన్న ఉడుకుబోతుతనాన్ని పోగొట్టుకున్న తరవాత నా మీద పడే తిట్లలో స్పష్టంగా తగ్గుదల కనిపించింది. గురుదేవులు అత్యంత సూక్ష్మరీతిలో కరిగి కరుణాన్వితులయారు. కొంతకాలానికి నేను మామూలుగా మానవ మూర్తిమత్వం తన కాపుదలకోసం అడ్డుపెట్టుకొనే హేతువాద విధేయత, అవచేతన[16] మనస్సులోని మినహాయింపు అనే ప్రతి గోడనూ కూలగొట్టాను. దానికి ఫలితంగా నాకు లభించిన బహుమానం, అప్రయత్నంగానే మా గురుదేవులతో సామరస్యం ఏర్పడడం. అప్పుడు నేను, ఆయన, మనిషిమీద నమ్మకముంచినవారని, మంచిచెడ్డలు ఆలోచించే వారని, గుప్తంగా ప్రేమించేవారని కనిపెట్టారు. అయితే, బయటికి కనబరిచే స్వభావం లేనివారవడంవల్ల ఆప్యాయమైన మాట ఒక్కటీ అనేవారు కారు.

నా మట్టుకు నా తత్త్వం ప్రధానంగా భక్తిపరమయినది. జ్ఞానపూర్ణులయిన మా గురుదేవులు భక్తిలేనివారి మాదిరిగా పైకి కనిపించినప్పటికీ, ముఖ్యంగా నిరుత్సాహజనకమైన ఆధ్యాత్మిక గణితరీతిలో ఆయన తమ భావాల్ని వ్యక్తం చేస్తూండడం నన్ను కలవరపెట్టేది. కాని నేను ఆయన స్వభావానికి తగినట్టుగా ఉంటూ వచ్చినకొద్దీ దేవుడిమీద నాకున్న భక్తి[17] తత్పరత తగ్గకపోగా, మరింత పెరిగిందని కనిపెట్టాను. ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువుకు తన దగ్గరున్న రకరకాల శిష్యుల్లో వారివారి ప్రధానమైన మొగ్గునుబట్టి సహజ మార్గాల్ని అనుసరించి వాళ్ళకు మార్గదర్శకత్వం వహించే సామర్థ్యం పూర్తిగా ఉంటుంది.

శ్రీయుక్తేశ్వర్‌గారితో నా సంబంధం కొంతవరకు, మాటల్లో వ్యక్తంకాని విధంగా ఉన్నప్పటికీ దానికి గుప్తమైన ధారాళత ఉండేది. నోటి మాటకు ఉపయోగం లేకుండా చేస్తూ ఆయన మౌనంగానే నాలో ఆలోచన రేకెత్తింపజేసేవారు. మౌనంగా ఆయన పక్కన కూర్చుని ఉండగా ఆయన అనుగ్రహం నా మీద వర్షించడం తరచు నాకు అనుభవంలోకి వచ్చేది.

గురుదేవుల నిష్పక్షపాతమైన న్యాయం, నేను కాలేజిలో చదివేటప్పుడు మొదటి సంవత్సరం వేసవి సెలవుల్లో నాకు స్పష్టంగా కనబడింది. నేను శ్రీరాంపూర్‌లో గురుదేవుని సన్నిధిలో అవిచ్ఛిన్నంగా కొన్ని నెలలు గడిపే అవకాశం కోసం ఎదురుచూస్తున్న రోజులవి. నేను ఉత్సాహంగా ఆశ్రమానికి వచ్చినందుకు సంతోషిస్తూ శ్రీయుక్తేశ్వర్‌గారు, “ఆశ్రమం వ్యవహారాలన్నీ నువ్వు నడపవచ్చు” అన్నారు. “అతిథి మర్యాదలు చెయ్యడం, ఇతర శిష్యుల పని అజమాయిషీ చెయ్యడం నీ విధులు.”

ఒక పక్షం రోజుల తరవాత, తూర్పు బెంగాలునుంచి వచ్చిన కుమార్ అనే పల్లెటూరి పిల్లవాణ్ణి ఆశ్రమ శిక్షణకు స్వీకరించడం జరిగింది. మంచి తెలివైన ఆ కుర్రవాడు త్వరలోనే గురుదేవుల అభిమానాన్ని చూరగొన్నాడు. కారణమేమిటో ఎవరికీ అంతుబట్టలేదుగాని, శ్రీయుక్తేశ్వర్‌గారు ఆ కొత్త శిష్యుడి విషయంలో విమర్శారహితమైన వైఖరి అవలంబించారు.

“ముకుందా, నీ పనులు కుమార్‌ని చెయ్యనియ్యి. తుడవడం, వంట చెయ్యడం నువ్వు చెయ్యి.” కొత్త కుర్రవాడు వచ్చిన నెల్లాళ్ళకి గురుదేవులు నాకీ ఆదేశాలు ఇచ్చారు. తనను నాయకత్వపు హోదాకు పెంచే సరికి కుమార్, నిరంకుశమైన పెత్తనం చలాయించడం మొదలుపెట్టాడు. తక్కిన శిష్యులు మనసులో తిరుగుబాటు వైఖరి అవలంబించింది, రోజూ వారీ విషయాల్లో సలహాకు, నా దగ్గరికి వచ్చేవారు. ఈ పరిస్థితి మూడు వారాలపాటు సాగింది; అప్పుడు కుమార్‌కూ గురుదేవులకూ మధ్య జరిగిన సంభాషణ నాకు చాటునుంచి వినబడింది.

“ముకుందుడు అసాధ్యుడు!” అన్నాడా కుర్రవాడు. “మీరు నన్ను అజమాయిషీదారును చేశారు. అయినా తక్కినవాళ్ళందరూ అతని దగ్గరికే వెళ్ళి, అతను చెప్పిన మాటే వింటున్నారు.”

“అందుకే అతనికి వంటింటిపనీ నీకు కచేరీ సావడిపనీ ఆప్పజెప్పాను. కాబట్టి యోగ్యుడైన నాయకుడికి సేవ చెయ్యాలన్న కోరికేకాని అధికారం చలాయించాలన్న కోరిక ఉండదని నువ్వు గ్రహించవచ్చు.” శ్రీయుక్తేశ్వర్‌గారి పొడిమాటలు కుమార్‌కి కొత్త. “నువ్వు ముకుందుడి స్థానం నీకు కావాలని కోరావు. కాని యోగ్యతద్వారా దాన్ని నిలుపుకోలేక పోయావు. వంటవాడికి సహాయకుడిగా నువ్వు మొదటచేసిన పనిలోకే తిరిగి వెళ్ళు.

గర్వాన్ని అణిచే ఈ సంఘటన జరిగిన తరవాత గురుదేవులు కుమార్ విషయంలో అకారణమైన అనురాగంతో వెనకటి వైఖరి అవలంబించారు. ఆకర్షణలోని మర్మాన్ని ఎవరు ఛేదించగలరు? మా గురుదేవులు కుమార్ లో, మనోహరంగా పైకి చిమ్మే ఉత్సాహ జలనిధిని కనిపెట్టారు కాని తోటి శిష్యుల విషయంలో కనబరచడానికి మాత్రం ఆ ఉత్సాహం పెల్లుబకదు మరి! కొత్త కుర్రవాడు సహజంగా గురుదేవులకు ఇష్టుడయి నప్పటికీ నాకేమీ నిరుత్సాహం కలగలేదు. మహాపురుషులకు సైతం ఉండే వ్యక్తిగతమైన విపరీత లక్షణాలు జీవన విధానాన్ని సంకీర్ణం చేస్తున్నాయి. నా స్వభావం చిన్న చిన్న విషయాలచేత ప్రభావితం కాదు. నేను శ్రీయుక్తేశ్వర్‌ గారి దగ్గర పొందగోరినది, పై పై పొగడ్తలకన్న గొప్ప లాభం.

ఒకనాడు కుమార్ నాతో నిష్కారణంగా విషం కక్కుతూ మాట్లాడాడు; నేను చాలా నొచ్చుకున్నాను.

“నీ తల పేలిపోయేటంతగా పొగరెక్కిపోతోంది!” అంటూ, నే నొక హెచ్చరిక కూడా చేశాను, దాంట్లో సత్యం నా అంతఃకరణకు స్ఫురించింది: “నువ్వు కనక నీ పద్ధతులు మార్చుకోకపోతే, ఎప్పుడో ఒకనాడు నిన్ను ఆశ్రమంనుంచి వెళ్ళిపొమ్మని చెబుతారు.”

కుమార్ హేళనగా నవ్వుతూ, నే నన్నమాటలు, అప్పుడే గదిలో అడుగు పెట్టిన గురుదేవుల దగ్గర వల్లించాడు. ఇక తిట్లు తినవలసివస్తుందని అనుకుంటూ నేను ఒక మూల నక్కాను. “ముకుందుడు చెప్పింది నిజమే కావచ్చు.” గురుదేవులు ఆ అబ్బాయికి ఇచ్చిన జవాబు, ఎన్నడూలేనంత నిరుత్సాహంగా ఉంది.

ఒక ఏడాది తరవాత కుమార్, తన ఊరికి బయలుదేరి వెళ్ళాడు. గురుదేవులు మౌనంగా తెలిపిన అసమ్మతిని అతను ఉపేక్షించాడు; శ్రీయుక్తేశ్వర్‌గారు తమ శిష్యుల రాకపోకలను ఎన్నడూ అధికారం చూపించి అదుపులో పెట్టలేదు. కొద్ది నెలల్లో తిరిగి శ్రీరాంపూర్ వచ్చే నాటికి ఆ అబ్బాయిలో కొట్టవచ్చినట్టు మార్పు కనిపించింది. ప్రశాంతంగా ప్రకాశించే ముఖంతో రాజసం ఉట్టిపడే కుమార్ లేడిక; ఉత్తరోత్తరా చెడ్డ అలవాట్లు చేసుకున్న మామూలు పల్లెటూరి పడుచువాడొకడు మా ముందు నిలబడ్డాడు.

గురుదేవులు నన్ను పిలిచారు; ఆ కుర్రవాడు ఇప్పుడు ఆశ్రమ జీవితానికి తగ్గవాడు కాడన్న యథార్థాన్ని భగ్నహృదయంతో చెబుతూ నాతో చర్చించారు.

“ముకుందా, రేపే ఆశ్రమం విడిచి వెళ్ళమని కుమార్‌కు చెప్పే పని నీకు అప్పగిస్తున్నాను; నే నది చెయ్యలేను!” శ్రీయుక్తేశ్వర్‌గారి కళ్ళలో నీళ్ళు నిలిచాయి. కాని వాటిని త్వరగానే ఆపుకొన్నారు. “ఆ అబ్బాయి నా మాట విని, ఊరికి వెళ్ళకుండా, చెడుసావాసాలు చెయ్యకుండా ఉంటే ఇంత అధోగతికి పోయేవాడు కాడు. నా రక్షణ తిరస్కరించాడు. ఇప్పుడిక కఠిన ప్రపంచమే అతనికి గురువుగా ఉండాలి.”

కుమార్ వెళ్ళిపోవడం నా కేమీ సంతోషం కలిగించలేదు; గురుదేవుల అభిమానాన్ని సంపాదించే శక్తి గలవాడు ప్రాపంచిక ప్రలోభాలకు అంత సులువుగా ఎలా లోబడిపోయాడా అని విచారించాను. మద్యంవల్లా మగువవల్లా సుఖానుభవం పొందడమన్నది ప్రకృతిసిద్ధంగా జీవించే మనిషిలో పాదుకొని ఉన్నది. వాటిని మెచ్చుకోడానికి సూక్ష్మజ్ఞాన మేమీ అక్కరలేదు. ఇంద్రియ ప్రలోభాలు, ఎప్పటికీ పచ్చగా ఉండే గన్నేరు మొక్క లాంటివి; సువాసన వెదజల్లుతూ, గులాబి వన్నెపూలు గల ఆ మొక్కలో ప్రతి భాగమూ విషపూరితమైనది.[18] స్వస్థత చేకూర్చే లోకం లోలోపల ఉంటుంది; ఏ సుఖంకోసం బయట వెయ్యి వైపుల మనం గుడ్డిగా వెతుకుతూ ఉంటామో ఆ సుఖం, ఆ లోకంలో ప్రకాశిస్తూ ఉంటుంది.

“తీక్ష్ణమైన బుద్ధి రెండు వేపులా పదునున్న కత్తిలాంటిది;” అని వ్యాఖ్యానించారు గురుదేవు లొకసారి, కుమార్ ఉజ్జ్వల ప్రతిభనుగురించి ప్రస్తావిస్తూ. దాన్ని కత్తిలా, నిర్మాణాత్మకంగానో విధ్వంసాత్మకంగానో అజ్ఞానమనే కురుపు కొయ్యడానికి కాని, తల తెగ్గోసుకోడానికికాని ఉపయోగించవచ్చు. ఆధ్యాత్మిక నియమం తప్పించుకోడానికి వీలులేనిదన్న సంగతిని మనస్సు అంగీకరించిన తరవాత మాత్రమే బుద్ధి సరయిన మార్గంలో సాగుతుంది.”

మా గురుదేవులు అందరినీ తమ పిల్లల మాదిరిగానే ఆదరిస్తూ, శిష్యులతోటీ శిష్యురాళ్ళతోటీ కూడా స్వేచ్ఛగా కలిసిమెలిసి ఉండేవారు. ఆత్మపరంగా వాళ్ళలో సహనత్వాన్ని గ్రహించి వాళ్ళమధ్య విచక్షణ చూపించడంకాని, పక్షపాతం చూపించడంకాని చేసేవారు కాదు.

“నిద్రలో, నువ్వు ఆడో మొగో నీకు తెలియదు,” అన్నారాయన. “స్త్రీ రూపం ధరించిన పురుషుడు స్త్రీ కానట్టే, స్త్రీ పురుషు లుభయులుగానూ రూపధారణ చేసే ఆత్మ, మార్పు లేకుండానే ఉండిపోతుంది. ఆత్మ భగవంతుడి నిర్వికార, నిర్గుణ ప్రతిరూపం.

శ్రీయుక్తేశ్వర్‌గారు స్త్రీలను ఎన్నడూ పరిహరించనూ లేదు, వాళ్ళను “పురుషుడి పతనానికి” కారకులుగా నిందించనూ లేదు. స్త్రీలు కూడా పురుషుల ఆకర్షణను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రాచీనకాలపు మహాభక్తుడు, ఒకాయన స్త్రీలను “నరకానికి ద్వారం”గా చెప్పడానికి కారణమేమిటని నేనొకసారి గురుదేవుల్ని అడిగాను.

“చిన్నప్పుడు ఒకమ్మాయి ఆయన మనశ్శాంతికి చాలా భంగకరంగా ఉండి ఉండాలి,” అని జవాబిచ్చారు మా గురుదేవులు, ఘాటుగా. “లేకపోతే ఆయన, స్త్రీని కాకుండా, తనలోని ఆత్మ నిగ్రహంలోని లోపాలన్ని గర్హించి ఉండేవాడు.”

చూడ్డానికి వచ్చిన వ్యక్తి ఎవరయినా మనోవికార ద్యోతకమైన కథ ఏదైనా చెప్పడానికి సాహసించేటట్లయితే గురుదేవులు గంభీరంగా మౌనం వహించేవారు. “అందమైన ముఖం రెచ్చగొట్టే కొరడాలాంటిది; దాంతో దెబ్బలు తినే స్థితి తెచ్చుకోకండి,” అని శిష్యులకు చెప్పారాయన. “ఇంద్రియాలకు బానిసలయిన వాళ్ళు ప్రపంచంలో ఆనందం ఎలా పొందగలరు? అసహ్యమైన బురదలో పొర్లాడుతున్నప్పుడు, ప్రపంచపు సూక్ష్మ సుగంధాలు వాళ్ళకు సోకవు. పాంచభౌతిక సుఖాలకు లోబడ్డ మనిషికి సున్నితమైన విచక్షణలన్నీ నశిస్తాయి,”

మాయాప్రేరితమైన కామలాలసనుంచి బయటపడడానికి ప్రయత్నించే విద్యార్థులకు శ్రీయుక్తేశ్వర్‌గారు వాళ్ళని సరిగా అర్థం చేసుకొని తగిన సలహా ఇచ్చేవారు. “ఆబకు కాకుండా, ఆకలికి న్యాయమైన ప్రయోజనం ఉన్నట్టే! తృప్తిపరచజాలని కోరికల్ని రేపడానికి కాకుండా, కేవలం వంశాభివృద్ధి కోసమే ప్రకృతి, కామప్రవృత్తిని నెలకొల్పింది,” అన్నారాయన. “చెడ్డకోరికల్ని ఇప్పుడు నాశనం చెయ్యి, లేకపోతే అవి, నీ సూక్ష్మ శరీరం భౌతికకోశం నుంచి విడివడ్డ తరవాత కూడా నీతోనే ఉంటాయి. శరీరం, వాటిని నిగ్రహించలేనంత బలహీనంగా ఉన్నప్పటికీ మనస్సు ఎప్పుడూ నిరోధిస్తూ ఉండాలి. వాటి ఆకర్షణ కనక, క్రూరమైన శక్తితో నీ మీద దాడి చేస్తున్నట్లయితే నిష్పాక్షిక విశ్లేషణతోనూ అజేయమైన సంకల్పబలంతోనూ దాన్ని జయించాలి. ప్రకృతి సహజమైన ప్రతి వాంఛనూ జయించవచ్చు.

“మీ శక్తుల్ని పదిలపరుచుకోండి. ఇంద్రియాలనే ఉపనమలన్నింటినీ తనలో కలుపుకొనే విశాలమైన మహాసముద్రంలా ఉండండి. రోజురోజూ తలఎత్తే ఇంద్రియవాంఛలు మీ అంతరంగంలో ఉన్న శాంతిని తొలిచేస్తాయి; అవి జలాశయానికున్న బెజ్జాలలాంటివి; దానిలోని అమృతతుల్యమైన జలాన్ని భౌతికవాదమనే ఎడారి నేలలో వ్యర్థమయ్యేట్టు చేస్తాయవి. చెడ్డకోరిక అనే శక్తిమంతమైన ప్రచోదక ఆవేగం మానవుడి సుఖానికి మహాశత్రువు. ఆత్మనిగ్రహ సింహంలా ప్రపంచంలో తిరగండి; ఇంద్రియ దౌర్బల్యాలనే కప్పలు, చుట్టూ చేరి మిమ్మల్ని తన్నకుండా చూసుకోండి!”

నిజమైన భక్తుడు సహజాత నిర్బంధాలన్నిటి నుంచి చివరికి విముక్తి పొందుతాడు. మానవ ప్రేమకోసం తనకుగల అవసరాన్ని కేవలం పరమేశ్వరుడి కోసం ఆకాంక్షగా -- అది సర్వవ్యాప్తమయినందువల్ల ఏకమాత్ర ప్రేమగా- పరివర్తన చేస్తాడు.

శ్రీ యుక్తేశ్వర్‌గారి తల్లిగారు కాశీలో రాణామహల్ బస్తీలో ఉంటుండేవారు. నాకు మొట్టమొదట శ్రీయుక్తేశ్వర్‌గారి దర్శనం అయింది కాశీలోనే. ఆవిడ సౌమ్యురాలు, దయామయి అయినప్పటికీ కూడా దృఢమైన నిశ్చితాభిప్రాయాలు ఏర్పరచుకొన్న వ్యక్తి. ఒకనాడు నేను, ఆ తల్లి కొడుకూ మాట్లాడుకొంటూ ఉండగా, ఆవిడ ఇంటి బాల్కనీలో నించుని గమనించాను. గురుదేవులు తమకు స్వాభావికమైన పద్ధతిలో శాంతంగా, యుక్తి యుక్తంగా మాట్లాడుతూ ఏ విషయమో ఆమెకు నచ్చ జెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆవిడ విసురుగా తల తిప్పడాన్నిబట్టి, ఆయన ఆవిడకి నచ్చజెప్పలేకపోయారని స్పష్టమైంది.

“వద్దు, వద్దు నాయనా; ఇక వెళ్ళిపో! నీ జ్ఞానోపదేశాలు నాకు కాదు! నేను నీ శిష్యురాల్ని కాను!”

శ్రీయుక్తేశ్వర్‌గారు మరింక వాదించకుండా, తిట్లు తిన్న పిల్లవాడిలా వెనక్కి తగ్గారు. ఆవిడ యుక్తి యుక్తంకాని మనస్థ్సితుల్లో ఉన్నప్పుడు కూడా తల్లిమీద ఆయనకున్న గొప్ప గౌరవాన్ని చూసి ముగ్ధుణ్ణి అయాను. ఆవిడ దృష్టిలో తన కొడుకు, చిన్నపిల్లవాడేకాని ఋషి కాడు. ఈ చిన్న సంఘటనకు ఒక ఆకర్షణ ఉంది; లోపల వినయంగాను, బయట వంచరాని విధంగాను ఉండే మా గురుదేవుల అసాధారణ స్వభావం మీద ఇది ఒక పక్కనుంచి వెలుగు ప్రసరింపజేసింది.

సన్యాసం తీసుకొన్న వ్యక్తి విధ్యుక్తంగా లౌకికబంధాలనుంచి విడివడ్డ తరవాత వాటిని నిలుపుకోడానికి సన్యాసధర్మనియమాలు అనుమతించవు. గృహస్థుకు విధ్యుక్తమైన పూజాపురస్కారాలవంటి కర్మకాండ నిర్వర్తించగూడదు. అయినప్పటికీ, సనాతన సన్యాసాశ్రమాన్ని పునర్వ్యవస్త్రీకరించిన శంకరులు, ఈ నియమాన్ని పట్టించుకోలేదు. ప్రేమాస్పదురాలైన తమ తల్లి గారు కాలంచేసినప్పుడు ఆయన, పైకెత్తిన తమ చేతిలో దివ్యాగ్ని పుట్టేటట్టుచేసి దాంతో ఆవిడ దేహాన్ని దహనంచేశారు. శ్రీ యుక్తేశ్వర్‌గారు కూడా నిర్బంధాల్ని ఉపేక్షించడం, అంత ఘనంగా కాకపోయినా అంతకన్న తక్కువ స్థాయిలో వెల్లడిఅయింది. తల్లిగారు గతించిన తరవాత ఆయన, కాశీలో పవిత్రమైన గంగానది ఒడ్డున దహనకాండ ఏర్పాటుచేయించి, గృహస్థ ధర్మం ప్రకారం అనేక మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయించారు. సంకుచితమైన అనుబంధాల్ని అధిగమించడానికి సన్యాసులకు తోడ్పడ్డంకోసం ఉద్దేశించినవి శాస్త్రీయమైన నిషేధాలు. శంకరులు, శ్రీ యుక్తేశ్వర్‌గారు తమ అస్తిత్వాల్ని వైయక్తికతారహితమైన చిచ్ఛక్తిలో సంపూర్ణంగా విలీనం చేసుకొన్నారు; నియమాన్ని ఆశ్రయించుకొని రక్షణ పొందవలసిన అవసరం వారికి లేదు. ఒక్కొక్కప్పుడు ఒకానొక గురువు, విధికి ఏర్పడ్డ రూపం కన్న, దాని నియమం ఘనమైనదని నిరూపించడం కోసం, కావాలని దాన్ని ఉపేక్షిస్తాడు. ఆ విధంగా ఏసుక్రీస్తు, విశ్రాంతి రోజున ధాన్యంకంకులు కోశాడు. అనివార్య విమర్శకులకు ఆయన ఇలా చెప్పాడు: “విశ్రాంతి రోజు (సబ్బత్) ఏర్పడ్డది మనిషికోసంకాని, మనిషి విశ్రాంతిరోజుకోసం కాదు.”[19]

పవిత్ర గ్రంథాలు తప్పించి, శ్రీ యుక్తేశ్వర్‌గారు చదివింది స్వల్పం. అయినప్పటికీ ఆయనకు అత్యంత అర్వాచీనమైన వైజ్ఞానిక ఆవిష్కరణలు, జ్ఞానపరమైన ఇతర ప్రగతులు తప్పనిసరిగా పరిచయమై ఉండేవి.[20] అద్భుత సంభాషణా చతురులైన ఆయన, తమ అతిథులతో అనేక విషయాలగురించి కులాసాగా చర్చలు జరిపేవారు. మా గురుదేవుల సద్యఃస్ఫూర్తి, నోరారా నవ్వేనవ్వు ప్రతి చర్చకు జీవం పోసేవి. తరచు గంభీరంగా ఉన్నప్పటికీ, గురుదేవులు విషాదంగా ఎన్నడూ ఉండేవారు కారు. బైబిలు[21]నుంచి ఉదాహరిస్తూ ఆయన, “ఈశ్వరాన్వేషణ చెయ్యడానికి మనుషులు తమ ముఖాల్ని వికృతం చేసుకోనక్కరలేదు.” అన్నారాయన. “దైవ సాక్షాత్కారం పొందడమంటే అన్ని దుఃఖాలకి అంత్యక్రియ జరిపించడమే నన్న సంగతి గుర్తుంచుకోండి.”

ఆశ్రమానికి వచ్చిన తాత్త్వికులు, ఆచార్యులు, న్యాయవాదులు, విజ్ఞానశాస్త్రవేత్తల్లో కొందరు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు, తామొక చాదస్తపు మతాభిమానిని కలుసుకోబోతున్నామనే భావించేవారు. అప్పుడప్పుడు, అహంకారంతో కూడిన ఒక చిరునవ్వువల్లకాని, తెచ్చి పెట్టుకున్న ఓర్పుతో చూసిన ఒక చూపువల్లకాని, ఆ కొత్తగా వచ్చినవాళ్ళు ఆయన దగ్గిర ఆశించినదల్లా రుచీపచీలేని నాలుగు ఉపదేశవాక్యాలకు మించి మరేమీ లేదన్న సంగతి వెల్లడి అయేది. కాని శ్రీ యుక్తేశ్వర్‌గారితో మాట్లాడిన తరవాత, తాము కృషిచేసిన తమతమ ప్రత్యేకరంగాల్లో ఆయనకు సునిశితమైన పరిజ్ఞానం ఉన్న సంగతి కనిపెట్టిన ఆ ఆగంతకులకు, అక్కణ్ణించి వెళ్ళాలంటే మనసు ఒప్పేది కాదు.

మామూలుగా మా గురుదేవులు, అతిథులతో సౌమ్యంగా, స్నేహ పూర్వకంగా వ్యవహరించేవారు; ఆయన ఇచ్చే స్వాగతం సౌహార్దంతో ముగ్ధుల్ని చేసేది. కాని దురహంకారమనే మొండి జబ్బుగలవాళ్ళకు మాత్రం బలవర్ధకమైన అఘాతాలు తగులుతూ ఉండేవి. వాళ్ళకు గురుదేవుల్లో కనిపించేది నిరుత్సాహజనకమైన ఉపేక్ష లేదా బలీయమైన వ్యతిరేకత; అయితే మంచు, లేకపోతే ఇనుము! ఒకమాటు ప్రఖ్యాత రసాయనశాస్త్రవేత్త ఒకరు శ్రీయుక్తేశ్వర్ గారితో హోరాహోరీగా తర్కవితర్కాలు చేశారు. దేవుణ్ణి పసిగట్టడానికి విజ్ఞానశాస్త్రం ఏ సాధనాన్నీ తయారుచెయ్యలేదు కాబట్టి దేవుడు ఉన్నాడన్న సంగతి తాము ఒప్పుకోమని చెప్పారు.

“అంటే, పరమాత్మను మీ శోధననాళికల్లో పట్టి పరీక్షించడంలో, కారణం చెప్పలేనంతగా విఫలమయ్యారన్నమాట!” గురుదేవుల చూపు తీవ్రంగా ఉంది. “నేను ఒక కొత్త ప్రయోగం సిఫార్సు చేస్తాను; ఎడతెరిపి లేకుండా మీ ఆలోచనల్ని ఇరవైనాలుగు గంటలపాటు పరీక్షించండి. ఆ తరవాత దేవుడు లేకపోవడం గురించి మీరు ఆశ్చర్యపోరు.”

ఒక ప్రసిద్ధ విద్వాంసుడు కూడా ఇలాగే దెబ్బతిన్నాడు. ఆయన ఆశ్రమానికి మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు జరిగిందిది. ఆయన మహాభారతంలోంచి, ఉపనిషత్తులలోంచి, శంకరాచార్యులవారి భాష్యాల లోంచి అనేక భాగాలు వినిపిస్తూంటే ఇంటివాసాలు కూడా మారుమోగాయి.

“మీ మాటలు వినడానికి ఎదురుచూస్తున్నాను.” అంతవరకు నిశ్శబ్దమే ఆవరించి ఉందన్నట్టుగా ఉంది, శ్రీయుక్తేశ్వర్‌గారి కంఠస్వరంలో వెల్లడి అయిన జిజ్ఞాస. ఆ విద్వాంసుడు తికమకపడ్డాడు.

“ఇతరులు చెప్పినవి కోకొల్లలుగా ఉన్నాయి.” ఆ వచ్చినాయనకు కాస్త దూరంలో, మామూలుగా నేను కూర్చునే మూలనే కూర్చున్నాను; గురుదేవుల మాటలకు సంతోషం పట్టలేక వంకరలు తిరిగిపోయాను. “కాని ప్రత్యేకించి మీ జీవిత విశిష్టతనుబట్టి మీరు అందించే మౌలిక వ్యాఖ్య ఏమిటి? మీరు ఏ పవిత్రగ్రంథాన్ని ఒంటబట్టించుకొని మీ సొంతం చేసుకున్నారు? ఈ చిరంతన సత్యాలు మీ స్వభావాన్ని ఏయే రకాలుగా పునరుద్ధరించాయి? ఇతరుల మాటల్నే యాంత్రికంగా మారుపలుకుతూ గ్రామఫోన్‌లా ఉంటే చాలనుకుంటున్నారా?” “ఓడిపోయాను!” చిన్నబోయిన ఆయన ముఖం నవ్వు పుట్టించేలా ఉంది. “నాకు ఆంతరికానుభవం ఏమీ లేదు.” ఆధ్యాత్మిక అపస్మారానికి (Coma) బదులు వివేచనాయుతంగా పెట్టే కామా (Comma); (పుస్తక పరిజ్ఞానం) పరిహారంగా పనికిరాదన్న సంగతి, బహుశా ఆయన, మొట్టమొదటిసారిగా గ్రహించారు.

శిక్షితుడయిన ఆ విద్వాంసుడు వెళ్ళిపోయిన తరవాత మా గురుదేవులు ఇలా వ్యాఖ్యానించారు: “అనుభవశూన్యులైన ఈ పండితమ్మన్యులు దీపందగ్గర చదివి చదివి చమురు కంపుకొడుతుంటారు. వేదాంతమంటే కేవలం బుద్ధివికాసంకోసం అనాయాసంగా చేసే వ్యాయామం లాంటిదనుకుంటారు. వాళ్ళు తమ ఉదాత్తభావనలను, బాహ్యచర్య తాలూకు మొరటుతనానికి కాని, మందలిస్తూ ఉండే ఏ ఆంతరిక శిక్షణకుకాని సంబంధంలేని విధంగా జాగ్రత్తగా ఏర్పరచుకొంటారు!”

కేవల పుస్తక పరిజ్ఞానానికున్న నిష్పలతగురించి గురుదేవులు ఇతర సందర్భాల్లో నొక్కి వక్కాణించేవారు.

“పెద్ద పెద్ద మాటలతో అవగాహనను తికమక చెయ్యకండి,” అని వ్యాఖ్యానించారాయన. “ఒక్కొక్క శ్లోకమే మెల్లగా ఒంటబట్టించుకుంటూ చదివేటట్లయితే, ఆంతరిక అనుభవ సాధనపట్ల కోరిక రగుల్కొల్పడానికి పవిత్ర గ్రంథాలు బాగా సాయపడతాయి. లేకపోతే, కేవలం మెదడుకు పనిచెప్పేటట్లు నిరంతరం సాగే అధ్యయనానికి ఫలితంగా అహంభావం, కృత్రిమ సంతృప్తి, ఒంటబట్టని తెలివి ఏర్పడవచ్చు.”

శ్రీయుక్తేశ్వర్‌గారు, పవిత్రగ్రంథాల పరిజ్ఞానం పెంపొందించుకునే విషయంలో తమకు కలిగిన అనుభవం ఒకటి చెప్పారు. ఇది జరిగింది, తూర్పు బెంగాలులో అడవిలో ఒక ఆశ్రమంలో; అక్కడ ఆయన, దబ్రూ వల్లబ్ అనే ప్రసిద్ధ గురువు అనుసరించే శిక్షణ విధానాన్ని గమనించారు. ఒక రకంగా సులువుగా, మరోరకంగా కష్టంగాను ఉండే ఆయన పద్ధతి సనాతన భారతదేశంలో సామాన్యమైనదే.

దబ్రూ వల్లభ్‌గారు ఏకాంత వనప్రదేశంలో తమ శిష్యుల్ని చుట్టూ కూర్చోపెట్టుకున్నారు. పవిత్రగ్రంథమైన భగవద్గీత వాళ్ళ ముందు తెరిచిపెట్టి ఉంది. వాళ్ళు ఒక శ్లోకంమీద అరగంటసేపు నిలకడగా చూపు నిలిపి ఉంచి ఆ తరవాత కళ్ళు మూసుకున్నారు. మరో అరగంట గడిచి పోయింది. గురువుగారు దానిమీద టూకీగా వ్యాఖ్యానం చేశారు. ఒక గంట సేపు వాళ్ళు నిశ్చలంగా ధ్యానంచేశారు. చివరికి గురువుగారు మాట్లాడారు.

“శ్లోకం అర్థం చేసుకున్నారా?”

“చేసుకున్నానండి.” ఆ శిష్య బృందంలో ఒకడు నొక్కి చెప్పడానికి సాహసించాడు.

“లేదు; పూర్తిగా కాదు. శతాబ్దుల తరబడిగా భారతదేశానికి పునర్యౌవనం ప్రసాదించడానికి ఈ మాటలకు శక్తి నిచ్చిన ఆధ్యాత్మిక జీవశక్తిని అన్వేషించు.” మౌనంలో మరోగంట గడిచిపోయింది. గురువుగారు శిష్యుల్ని పంపేసి శ్రీయుక్తేశ్వర్‌గారి వేపు తిరిగారు.

“మీకు భగవద్గీత తెలుసా?”

“తెలియదండి; నా కళ్ళు నా మనస్సూ ఆ పుస్తకం పుటల్లో చాలాసార్లు పరిగెత్తాయే కాని, నిజంగా తెలియదండి.”

“వందలకొద్దీ జనం, దీనికి వేరుగా సమాధానం ఇచ్చారు!” ఆ మహాసాధువు ఆశీఃపురస్సరంగా మా గురుదేవుల వేపు చిరునవ్వు నవ్వారు. “పవిత్రగ్రంథ సంబంధమైన సంపదను బయటికి ప్రదర్శించడంలో నిమగ్నులై నవాడికి, అమూల్యమైన ముత్యాలకోసం మౌనంగా లోపలికి మునగడానికి సమయం ఏముంటుంది?”

శ్రీయుక్తేశ్వర్‌గారు తమ శిష్యుల అధ్యయనాన్ని కూడా ఏకాగ్ర చిత్తంతో కూడిన అదే తీవ్రపద్ధతిలో సాగేటట్టు నడిపించేవారు. “జ్ఞానాన్ని ఒంటబట్టించుకునేది తనలో ఉన్న అణువణువుద్వారానే కాని కళ్ళతో కాదు,” అన్నారాయన. “ఒకానొక సత్యాన్ని గురించి నీలో ఉన్న ప్రగాఢ విశ్వాసం కేవలం నీ మెదడులో మాత్రమే కాక నీ అస్తిత్వమంతటా వ్యాప్తమై ఉన్ననాడు నువ్వు దాని అర్థాన్ని రూఢిపరచడానికి సంకోచిస్తావు.” ఆధ్యాత్మికసిద్ధికి పుస్తకపరిజ్ఞానాన్ని అవసరమైన ఒక మెట్టుగా పరిగణించవలసిన ధోరణి ఏది విద్యార్థిలో పొడగట్టకుండా నిరుత్సాహపరిచేవారు.

“ఋషులు ప్రగాఢమైన జ్ఞానాన్ని ఒక్కొక్క వాక్యంలో ఇమిడ్చి రాస్తే, విద్వాంసులు వాటిని వ్యాఖ్యానించడంలో తరతరాలుగా పూర్తిగా నిమగ్నులైఉన్నారు," అన్నారాయన. “అంతులేని సాహిత్య వివాదం మందబుద్ధులకే. ‘దేవుడున్నాడు’ అన్న చింతనకన్న కాదు, ‘దేవుడు’ గురించిన చింతనకన్న శీఘ్రంగా ముక్తిని ప్రసాదించేది మరొకటి ఏముంది?

కాని మానవుడు సరళతవేవు అంత సులభంగా మళ్ళడు. బుద్ధివాది “దేవుణ్ణి” ధ్యేయంగా పెట్టుకోడం అరుదు; అంతకన్న విద్యా సంబంధమైన ఆడంబరాల మీదే దృష్టి నిలుపుతాడు. తాను అటువంటి పాండిత్యం గడించగలిగినందుకు అతని అహం సంతుష్టి చెందుతుంది.

లౌకికమైన తమ హోదానుకాని సంపత్తినికాని సగర్వంగా, స్పృహలో ఉంచుకొన్నవాళ్ళు, మా గురుదేవుల సాన్నిధ్యంలో, తమకు ఉన్న వాటికితోడు వినయాన్ని కూడా చేర్చుకోడం సంభవం. ఒకసారి, స్థానికంగా ఉండే మేజిస్ట్రేటుగారు ఒకరు, పూరీలో సముద్రతీరాన ఉన్న ఆశ్రమంలో ఇంటర్వ్యూ కావాలని కోరారు. పరమ కర్కోటకుడని పేరు పొందిన ఆయనగారు, తలుచుకుంటే మా ఆశ్రమాన్ని మాకు కాకుండా చెయ్యగల అధికారం ఉన్నవాడు. ఈ యథార్థాన్ని నేను మా గురుదేవులకు చెప్పాను. కాని ఆయన నిశ్చలంగా కూర్చున్నారు; వచ్చినాయన్ని పలకరించడానికి లేవనైనా లేవలేదు.

నేను కొద్దిగా గాభరాపడుతూ తలుపుదగ్గర కూర్చున్నాను. శ్రీయుక్తేశ్వర్‌గారు, మేజిస్ట్రేటుగారికోసం కుర్చీ తెమ్మని కూడా నాకు చెప్పలేదు; ఆయనగారు కూర్చోడానికి ఒక కొయ్యపెట్టెతోనే సరిపెట్టు కోవలసి వచ్చింది. తన ప్రాముఖ్యాన్ని ఇక్కడ యథావిధిగా గుర్తిస్తారన్న సహజమైన ఆశకూడా సఫలం కాలేదు.

తరవాత ఆధ్యాత్మిక చర్చ ఒకటి జరిగింది. ఆ అతిథి అడుగడుగునా, పవిత్ర గ్రంథాలకు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చాడు. ఆయన చెప్పేవాటిలో, తప్పులు పెరిగేకొద్దీ కోపం కూడా పెరుగుతూ వచ్చింది.

“నేను ఎం. ఏ. పరీక్షలో మొదటిస్థానం సంపాదించానని తెలుసా మీకు?” అని అడిగాడు. హేతుబుద్ధి ఆయన్ని విడిచిపెట్టింది; అయినప్పటికీ ఆయన ఇంకా అరవగలుగుతున్నాడు.

“మేజిస్ట్రేటుగారూ, ఇది మీ కోర్టుగది కాదన్న సంగతి మరిచిపోతున్నారు,” అని జవాబిచ్చారు గురుదేవులు శాంతంగా. “మీ కుర్రతనపు మాటల్నిబట్టి, మీ కాలేజి చదువు చెప్పుకోదగ్గదేమీ కాదని అనిపిస్తుంది. ఏమయినప్పటికీ యూనివర్సిటీ డిగ్రీకి వైదిక సాక్షాత్కారానికీ ఏమీ సంబంధం లేదు. సాధువుల్ని ఎకౌంటెట్ల మాదిరిగా ప్రతి సెమిస్టర్ లోనూ జట్లు జట్లుగా తయారుచెయ్యడం జరగదు.” కొంతసేపు మాటా పలుకూ లేకుండా కొయ్యబారి ఉన్న తరవాత ఆయన కులాసాగా నవ్వాడు.

“స్వర్గలోకపు మేజిస్ట్రేటుకు ఎదురుపడడం ఇదే నాకు మొదలు,” అన్నాడాయన. తరవాత ఆయన, తనలో అంతర్భాగమై పోయిన న్యాయశాస్త్ర పరిభాషను గుప్పిస్తూ, తనను “పరివీక్షార్థక” (ప్రొబేషనరీ) శిష్యుడిగా స్వీకరించచుని లాంఛన పూర్వకంగా అభ్యర్థించాడు.

లాహిరీ మహాశయులలాగే శ్రీయుక్తేశ్వర్‌గారు కూడా అనేక సందర్భాల్లో, సన్యాసం తీసుకోదలిచిన “అపరిపక్వ” శిష్యుల్ని నిరుత్సాహపరిచేవారు. “దైవ సాక్షాత్కారం పొందినవాడు కాషాయవస్త్రం ధరించడం సమాజాన్ని తప్పుదారి పట్టిస్తుంది,” అన్నారు గురుదేవులిద్దరూ. “సన్యాసానికి బాహ్యమైన చిహ్నాల్ని మరిచిపొండి; అవి మీలో మిథ్యాహంకారం కలిగించి హాని చెయ్యవచ్చు. మీరు నిబ్బరంగా ప్రతిరోజూ సాధించే ఆధ్యాత్మిక ప్రగతికన్న ముఖ్యమైంది మరొకటి లేదు; అందుకు క్రియా యోగాన్ని ఉపయోగించండి.”

మనిషి విలువను గణించడానికి సాధువు ఒక నిశ్చితమైన ప్రమాణాన్ని ఉపయోగిస్తాడు; ఒకచోటికీ మరొకచోటికీ మారుతుండే ప్రపంచపు కొలబద్దలకు అది భిన్నమైనది. మానవులు, వాళ్ళ దృష్టిలో వాళ్ళకే చిత్రచిత్రమైన వన్నెల్లో గోచరిస్తారు; వాళ్ళని గురువు రెండే రెండు తరగతులుగా విభజిస్తాడు: దేవుణ్ణి అన్వేషించని అజ్ఞానులూ, అన్వేషించే జ్ఞానులూ అని.

మా గురుదేవులు తమ ఆస్తి వ్యవహారాల నిర్వహణకు సంబంధించిన వివరాల్ని స్వయంగానే చూసుకునేవారు. అన్యాయానికి వెనకాడని వ్యక్తులు కొందరు, ఆయనకు పెద్దలనుంచి సంక్రమించిన భూమిని స్వాధీనంచేసుకోడానికి అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు. దృఢ నిశ్చయంతోనూ న్యాయస్థానంలో దావాల ద్వారా శ్రీయుక్తేశ్వర్‌గారు ప్రతి ప్రత్యర్థినీ ఓడించారు. బిచ్చమెత్తుకొనే గురువుగాగాని, తమ శిష్యులకు భారంగాగాని ఎన్నడూ బతకడం ఇష్టంలేక ఆయన బాధాకరమైన ఈ అనుభవాలకు తల ఒగ్గవలసి వచ్చింది.

భయావహమైన నిష్కాపట్యం గల మా గురుదేవులు లౌక్యసంబంధమైన కపటాలు ఎరక్కపోవడానికి ఒక కారణం, ఆయనకుగల ఆర్థిక స్వాతంత్ర్యం. తమను పోషించేవాళ్ళని పొగడవలసి ఉన్న గురువుల మాదిరిగా కాకుండా మా గురుదేవులు, ఇతరుల సంపద తాలూకు బాహ్య ప్రభావాలుకాని, సూక్ష్మప్రభావాలుకాని తమ మీద పనిచెయ్యనివారు. ఏ అవసరానికైనా సరే ఆయన ఒకర్ని డబ్బు అడగడంగాని, సూచనగా చెప్పడంగాని నేను ఎన్నడూ వినలేదు.

ఒకనాడు కోర్టు సమన్లు అందించడానికి కోర్టు ఉద్యోగి ఒకడు శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చాడు. కనాయి అనే శిష్యుడూ నేనూ అతన్ని గురుదేవుల సన్నిధికి తీసుకువెళ్ళాం.

శ్రీ యుక్తేశ్వర్‌గారి పట్ల ఆ ఉద్యోగి చూపిన ధోరణి దారుణంగా ఉంది. “మీరు ఈ ఆశ్రమం నీడలోంచి వచ్చి కోర్టు గదిలో న్యాయమైన గాలి పీల్చుకునేటట్లయితే మీ ఒంటికి మంచిది,” అన్నాడతను తిరస్కార భావంతో.

నేను ఓర్చుకోలేకపోయాను. “అమర్యాదగా మరొక్కమాట బయటికి వచ్చిందా, నువ్వు మట్టి కరుస్తావు!” అంటూ అతన్ని ఎదిరిస్తూ ముందుకు వెళ్ళాను.

కనాయి కూడా ఆ ఉద్యోగిమీద అరిచాడు. “నీచుడా! ఈ పవిత్రమైన ఆశ్రమంలోకి వచ్చి అవాకులు చెవాకులూ పేల్తావా?” కాని గురుదేవులు, తనను తిట్టేవాణ్ణి కాయడానికి ఎదురుగా వచ్చి నిలబడ్డారు. “ఏమీ లేనిదానికి అలా ఆవేశపడకండి. ఇతను తన న్యాయమైన విధి నిర్వర్తిస్తున్నాడు.”

ఆ ఉద్యోగి తనకు ఎదురైన విభిన్న ఆదరాలకు చకితుడై , గౌరవ పురస్సరంగా క్షమాపణ చెప్పుకొని అక్కణ్ణించి ఉడాయించాడు.

అంత ఉగ్రమైన సంకల్ప శక్తిగల గురువులు, లోపల ఎంత శాంతవంతులో గ్రహించినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ‘వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి’- అంటే. “దయ చూపించే సందర్భంలో పువ్వుకన్న మెత్తన, నియమాలకు ముప్పు వాటిల్లే సందర్భంలో పిడుగు కన్న కఠినం” అన్న ఆర్యోక్తి ఆయనకు బాగా నప్పింది.

బ్రౌనింగ్ కవి చెప్పినట్టుగా, “తాము చీకట్లో ఉన్నందువల్ల వెల్తురును ఓపలేనివాళ్ళు ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు. అప్పుడప్పుడు బయటివాడొకడు, తాను ఊహించుకొన్న ఏదో ఒక ఇబ్బందికి ఉద్రేకపడి శ్రీయుక్తేశ్వర్‌గారిని నిందించేవాడు. మనస్సు చెదరని మా గురుదేవులు, అతని ఆరోపణలో సత్యలేశమేదైనా ఉందేమో చూడడానికి ఆత్మవిమర్శ చేసుకొంటూ అతను చెప్పేది వినమ్రంగా వినేవారు. ఇటువంటి సంఘటనలు, గురుదేవుల అద్వితీయమైన సూక్తులు ఒకదాన్ని నాకు గుర్తుకు తెస్తాయి : “కొందరు ఇతరుల తలలు తెగ్గోసి తాము ఎత్తుగా కనబడాలని చూస్తారు!”

సాధువులో వ్యక్తమయే అమోఘమైన ప్రశాంతత, ఏ ఉపదేశమూ కలిగించలేని ప్రభావం కలిగిస్తుంది. “కోపం నిదానంగా వచ్చేవాడు బలవంతుడికన్నా బలిష్ఠుడు; తన ఆత్మను తాను పాలించుకొనేవాడు. ఒక పట్నాన్ని పట్టుకున్న వాడికన్నా గొప్పవాడు.”[22] రాజతేజో విరాజమానులైన మా గురుదేవుల మనస్సు కీర్తిమీద కాని, లౌకిక లబ్ధిమీద కేంద్రీకరించి ఉండి ఉంటే ఆయన సులువుగా ఒక రాజాధిరాజో, ప్రపంచాన్ని గడగడలాడించే యోధుడో అయి ఉండేవాడని తరచు అనుకుంటూ ఉండేవాణ్ణి. వాటి బదులు ఆయన, కోపం, అహంభావం అనే ఆంతరిక దుర్గాల్ని కూలగొట్టడానికి పూనుకొన్నారు; వాటి పతనమే మానవుడి ఔన్నత్యానికి నిదర్శనం.

  1. శ్రీ యుక్తేశ్వర్‌గారు 1855 మే 10 తారీఖున పుట్టారు.
  2. ‘యుక్తేశ్వర్’ అంటే, “ఈశ్వరుడితో ఐక్యమైనవాడు” అని అర్థం. ‘గిరి’ అన్నది, సనాతనమైన పది సన్యాసాశ్రమ శాఖల్లో ఒకదాని పేరు; ‘శ్రీ’ అంటే పవిత్రమైన; ఇది పేరుకాదు కాని గౌరవవాచకం.
  3. వాచ్యార్థం, “కలపడం; మనస్సును ధ్యేయ వస్తువులో లయం చేయడం” అని. ‘సమాధి’ అనేది పరమానందమయమైన అధిచేతన స్థితి. ఈ స్థితిలో యోగి, జీవాత్మపరమాత్మల ఐక్యానుభూతి పొందుతాడు.
  4. గుర్రుపెట్టడమన్నది, సంపూర్ణమైన విశ్రాంతి పొందినట్టుగా సూచన అని శరీరధర్మ శాస్త్రజ్ఞుల అభిప్రాయం
  5. యోగి తన జ్ఞానేంద్రియాల్ని ఉపయోగించకుండానే చూడడం, రుచి చూడటం, వాసన గ్రహించడం, తాకడం, వినడం అన్నవి చెయ్యడానికి అతనికి సామర్థ్యం కలిగించే సర్వవ్యాపక శక్తుల్ని గురించి “తైత్తిరీయ అరణ్యకం” లో ఇలా వర్ణించటం జరిగింది: “గుడ్డివాడు ముత్యానికి చిల్లి పొడిచాడు; వేళ్ళు లేనివాడు దాంట్లోకి దారం ఎక్కించాడు; మెడలేనివాడు దాన్ని ధరించాడు; నాలికలేని వాడు దాన్ని పొగిడాడు.”
  6. “అహింసలో పరిపూర్ణత సాధించినవాడి సమక్షంలో [ఏ జీవిలోనూ] శత్రుభావం కలగదు.” (‘అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగః’) - యోగసూత్రాలు, II : 35.
  7. తాచుపాము తన పరిధిలో కదులుతున్నదాన్ని, దేన్నయినా టక్కున కొట్టగలదు. చాలా సందర్భాల్లో, పూర్తిగా కదలకుండా ఉండడం, ఒక్కటే క్షేమకరం.
  8. నిజానికి లాహిరీ మహాశయులు ఆయన్ని సంబోధించింది “ప్రియా” (మా గురువుగారి పేరులో మొదటి భాగం). అనేకాని “యుక్తేశ్వర్” (సన్యాసం తీసుకొన్న తరవాత పెట్టిన పేరు; మా గురువుగారు లాహిరీ మహాశయుల జీవితకాలంలో ఈ పేరు పెట్టుకోలేదు) అని కాదు, ఈ పుస్తకంలో ఇక్కడా, మరికొన్ని ఇతర చోట్లా, రెండు పేర్లుంటే పాఠకులకు గందరగోళంగా ఉంటుందని, “యుక్తేశ్వర్” అన్న పేరే వాడడం జరిగింది.
  9. “నువ్వు ప్రార్థించేటప్పుడు వేటిని కోరతావో అవి నీకు వస్తాయనీ, వాటిని నువ్వు పొందుతావనీ నమ్ము” - మార్కు, 11 : 24. బ్రహ్మైక్యం పొందిన యోగులు తాము పొందిన దివ్యోపలబ్ధుల్ని, ప్రగతి సాధించిన శిష్యులకు పూర్తిగా బదిలీ చెయ్యగలవారు; ఈ సందర్భంలో లాహిరి మహాశయులు శ్రీ యుక్తేశ్వర్ గారికి అలాగే బదిలీ చేశారు.
  10. వాళ్ళలో ఒకడు ప్రధాన యాజకుని సేవకుణ్ణి కొట్టి వాడి కుడిచెవి తెగ్గోశాడు. అయితే ఏసు, వాళ్ళను తాళమని చెప్పి, వాడి చెవి ముట్టుకొని నయం చేశాడు.” – లూకా, 22 : 50-51 (బైబిలు)
  11. ” పవిత్రమైనదాన్ని కుక్కలకు వెయ్యకు, నీ ముత్యాల్ని, పందుల ముందుకు విసరకు; అలా కనక విసిరితే, వాటినవి కాళ్ళతో తొక్కేసి, మళ్ళీ నీ మీదికి ఎదురు తిరిగి, నిన్ను చీల్చేస్తాయి.” మత్తయి 7: 6 (బైబిలు).
  12. ఉపవాసమనేది ఆదర్శవంతమైన సహజ క్షాళన పద్ధతి అని మా గురుదేవులు ఆమోదించారు; కాని ప్రత్యేకించి ఈ శిష్యుడికి మాత్రం ఒంటిమీద ధ్యాస ఎక్కువ.
  13. నేను ఆయన దగ్గర లేనప్పుడు ఒకసారి కాశ్మీరులో ఆయన జబ్బు పడ్డారు (21 అధ్యాయం చివర చూడండి).
  14. శరీర ధర్మశాస్త్రంలో నోబెల్ బహుమానం పొందిన, సాహసవంతుడైన వైద్యశాస్త్రజ్ఞుడు ఛార్లెస్ రాబర్ట్ రిషే ఇలా రాశాడు: “అధిభౌతికశాస్త్రం ఇంతవరకు ఒక శాస్త్రంగా అధికారికంగా గుర్తింపు పొందలేదు. అయినా ఇక ముందు పొందుతుంది... మనకు ఇంద్రియ జ్ఞానమిచ్చేవి కేవలం ఐదు జ్ఞానేంద్రియాలు మట్టుకే కాదనీ, ఇతర మార్గాల్లో కూడా ఒక్కొక్కప్పుడు, వాస్తవికతా శకలం ఒకటి తెలివిని చేరుతూ ఉంటుందనీ నేను, ఎడిన్‌బర్గ్‌లో 100 మంది శరీర ధర్మశాస్త్రజ్ఞుల ఎదుట నొక్కి చెప్పగలిగాను. ...ఒక యథార్ధం అరుదు అయినంత మాత్రాన అది ఉండదని చెప్పడం ఒక హేతువు కాదు. ఒక విషయాన్ని అధ్యయనం చెయ్యడం కష్టమయినంత మాత్రాన, దాన్ని అర్థంచేసుకోకపోవడాని కది కారణమవుతుందా?... చింతామణి కోసం వెతకడం భ్రాంతి మూలకమన్న హేతువుతో రసాయనశాస్త్రాన్ని ఈసడించే వాళ్ళ మాదిరిగానే అధిభౌతికశాస్త్రాన్ని గుహ్యవిద్యగా ఈసడించేవాళ్ళు కూడా తమ తెలివితక్కువ తనానికి తాము సిగ్గుపడతారు... శాస్త్రనియమాల విషయంలో లావోజియర్, క్లాడ్ బెర్నార్డ్, పాశ్చర్ అన్న వాళ్ళవే ఉన్నాయి; వాళ్ళు సర్వత్ర, సర్వదా ‘ప్రయోగశీలులు’. అందుచేత మానవ చింతనలో పరివర్తన తీసుకురాబోయే ఈ నవీన శాస్త్రానికి స్వాగతం పలుకుతున్నాను. "
  15. సమాధి, ఆధిచేతనత్వం.
  16. రబ్బీ ఇజ్రాయల్ హెచ్. లెవింథాల్ న్యూయార్కులో ఇచ్చిన ఒక ఉపన్యాసంలో, “మన చేతనకూ అవచేతనకూ కిరీటం వంటిది అధిచేతన,” అన్నాడు. మనలో లోలోపల ఒక చెత్తకుప్ప, ఒక కోశాగారం కూడా మరుగుపడి ఉన్నాయని ఎఫ్. డబ్ల్యు. హెచ్. మేయర్స్ అనే ఇంగ్లీషు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త చాలా ఏళ్ళకిందట అన్నాడు. అధిచేతనకు సంబంధించిన నవ్య మనోవిజ్ఞానశాస్త్రం, మానవ స్వభావంలోని అవచేతననే కేంద్రంగా చేసుకొని పరిశోధనలన్నీ సాగించే మనోవిజ్ఞానశాస్త్రానికి భిన్నంగా, కోశాగారం మీద, అంటే, మానవుల మహనీయ, నిస్వార్థ వీరోచిత కృత్యాన్ని వివరించగల ఏకైక మండలం మీద దృష్టి కేంద్రీకరిస్తుంది.
  17. దేవుణ్ణి చేరే ప్రధాన మార్గాల్లో రెండు: జ్ఞానం, భక్తి.
  18. “మానవుడు జాగ్రదవస్థలో ఇంద్రియసుఖాలు అనుభవించడానికి లెక్కలేనన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇంద్రియాలన్నీ అలసిపోయినప్పుడు చేతికందిన సుఖాన్ని కూడా మరిచిపోయి, తన స్వభావమయిన ఆత్మలో విశ్రాంతి అనుభవించడానికి నిద్రపోతాడు.” అని రాశారు. మహావేదాంతి శంకరాచార్యులవారు, “ఆ విధంగా, అతీంద్రియానందం సాధించడం చాలా సులువు; ఎప్పుడూ రోతతోనే అంతమయే ఇంద్రియ సుఖాలకంటె అది చాలా శ్రేష్ఠమైనది.”
  19. మార్కు 2 : 27.
  20. గురుదేవులు కోరుకున్న తక్షణం, ఏ వ్యక్తి మనస్సుతోనయినా శ్రుతి మేళవించుకొనేవారు. (పతంజలి యోగసూత్రాలు || : 19 శ్లోకంలో చెప్పిన ఒకానొక యోగశక్తి “ప్రత్యయస్య పరచిత్త జ్ఞానం”). మానవరూపంలో ఉన్న రేడియోగా ఆయనకుగల శక్తుల్ని, ఆలోచనా స్వభావాన్ని 15 అధ్యాయంలో వివరించడం జరిగింది.
  21. మత్తయి 6 : 16 (బైబిలు).
  22. సామెతలు 16 : 32 (బైబిలు).