ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 11

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అధ్యాయం : 11

చేతిలో పైసలేని కుర్రవాళ్ళిద్దరు

బృందావనంలో

“నాన్నగారు నీకు వారసత్వం సంక్రమించకుండా చేస్తే సరిపోతుంది ముకుందా! జీవితాన్ని ఎంత తెలివి తక్కువగా వృథా చేసుకుంటున్నావు!” అన్నయ్య హితోపదేశం నా చెవుల్ని ఊదరగొడుతోంది.

జితేంద్రుడూ నేనూ అప్పుడే తాజూగా రైలుదిగి (మాట వరసకి ఇలా అంటున్నానే కాని, ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాం) అనంతన్నయ్య ఇంటికి వచ్చాం. అతను కలకత్తానించి బదిలీ అయి, పురాతన నగరమైన ఆగ్రాకి ఈమధ్యే వచ్చాడు. అతను ప్రభుత్వంవారి పబ్లిక్ వర్క్స్ శాఖలో సూపర్వయిజింగ్ ఎకౌంటెంటు.

“అన్నయ్యా, నేను వారసత్వం భగవంతుడి దగ్గర్నించి కోరుతున్నానని నీకు బాగా తెలుసు.”

“ముందు డబ్బు; ఆ తరవాతే దేవుడు! ఏమో, ఎవరికి తెలుసు? జీవితం చాలాకాలం సాగవచ్చు.”

“దేవుడే ముందు; డబ్బు ఆయన బానిస! ఏమో, ఎవరు చెప్పగలరు? జీవితం స్వల్పకాలంలోనే ముగిసిపోవచ్చు.”

టకీమని నే నిచ్చిన ఎదురు జవాబు, అప్పటి అవసరాన్నిబట్టి అలా వచ్చిందే కాని, జరగబోయేది ముందే మనస్సుకు తోచి అన్నది కాదు (పాపం, అనంతన్నయ్య జీవితం నిజంగా స్వల్పకాలంలోనే ముగిసిపోయింది).[1]

“ఇదంతా ఆశ్రమంలో ఒంటబట్టిన తెలివి కాబోలు! అయినా, నువ్వు కాశీ విడిచి వచ్చేసినట్టు కనిపిస్తోంది,” అనంతుడి కళ్ళు తృప్తితో మిలమిలా మెరిశాయి. నా రెక్కలు, సంసారమనే గూటిలో భద్రంగా ముడుచుకొని ఉండేలా చెయ్యాలని అతను ఇంకా ఆశపడుతున్నాడు.

“కాశీలో నా మజిలీ వృథా కాలేదు! నా మనస్సు ఆశించినది నా కక్కడ దొరికింది! కాని నీ పండితుడివల్లా, ఆయన కొడుకువల్లా మాత్రం కాదని నిశ్చయంగా తెలుసుకో!”

అనంతుడు వెనకటి సంగతి గుర్తు చేసుకుంటూ నాతోబాటు నవ్వాడు. తాను ఎంపికచేసిన, “దివ్యదృష్టిగల” కాశీ పండితుడు ఒట్టి హ్రస్వదృష్టి గలవాడన్న సంగతి ఎప్పుడో ఒప్పుకోవలసి వచ్చింది.

“మరి నీ ముందాలోచన లేమిటి, తిరుగుడుమారి తమ్ముడూ?”

“జితేంద్ర నన్ను ఆగ్రా రావడానికి ప్రోత్సహించాడు. ఇక్కడున్న తాజమహల్ అందాలు చూద్దాం,” అని చెప్పాను. ఆ తరవాత, కొత్తగా నాకు కనిపించిన గురువుగారి దగ్గరికి వెళ్తాం, ఆయనకి శ్రీరాం పూర్‌లో ఆశ్రమం ఉంది.”

అనంతుడు, మాకు సుఖంగా ఉండేలా ఆతిథ్యం ఏర్పాటు చేశాడు. అతని కళ్ళు సాలోచనగా నా మీద నిల్చి ఉండడం, సాయంత్రం నాలుగుసార్లు గమనించాను.

“ఆ చూపు నాకు తెలుసు!” అనుకున్నాను. “ఏదో కుట్ర పన్నడం మొదలయింది!” పొద్దుట మా ఫలహారాల సమయంలో అది బయట పడింది.

“అయితే, నాన్నగారి ఆస్తితో ప్రమేయం లేకుండా నువ్వు స్వతంత్రంగా ఉండగలవన్న మాట!” నిన్నటి సంభాషణ మళ్ళీ కొనసాగిస్తున్నప్పుడు, అనంతుడి చూపులో అమాయకత ఉంది.

“నేను దేవుడిమీదే ఆధారపడి ఉన్న సంగతి నాకు స్పృహలో ఉంది.”

“మాటలు తేలికే! జీవితం నిన్ను ఇంతవరకు కాపాడింది. నీ కూటికీ గూటికీ, ఆ భగవంతుడి అదృశ్య హస్తం మీద ఆధారపడవలసిన పరిస్థితే వస్తే - ఎంత దురదృష్టం! త్వరలోనే నువ్వు వీధుల్లో బిచ్చమెత్తుకోవలసి వస్తుంది.”

“ఎన్నడూ జరగదు! దేవుణ్ణి కాదని, దారిని పోయేవాళ్ళ మీద విశ్వాసముంచను! తన భక్తుడికోసం ఆయన, భిక్షాపాత్ర ఒక్కటే కాదు, వెయ్యి వనరులు కల్పించగలడు.”

“కవిత్వం వెలగబెడుతున్నావే! ఒకవేళ నేను, నీ డాబుసరి వేదాంతాన్ని ఈ భౌతిక ప్రపంచంలో పరీక్షకి పెడతానంటా ననుకో!”

“ఒప్పుకుంటాను! దేవుణ్ణి ఆలోచనాజగత్తుకే పరిమితం చేస్తావా?”

“సరే, చూద్దాం; నా దృక్పథాన్ని విశాలం చెయ్యడానికో ధ్రువపరచడానికో మీ కీవేళ అవకాశం వస్తుంది.” నాటక ఫక్కిలో ఒక్క క్షణం ఆగి, తరవాత మెల్లగా, గంభీరంగా మాట్లాడాడు.

“ఈ పూట నిన్నూ, నీ తోటి విద్యార్థి జితేంద్రనీ దగ్గర్లో ఉన్న బృందావనమనే ఊరు పంపాలనుకుంటున్నాను. మీరు ఒక్క రూపాయి కూడా వెంట తీసుకెళ్ళకూడదు; అన్నంకాని, డబ్బుకాని ఎవర్నీ అడుక్కో కూడదు; మీ ఇబ్బంది ఎవ్వరికీ చెప్పకూడదు; తిండి తినకుండా ఉండా కూడదు, బృందావనంలో చిక్కుబడిపోనూ కూడదు. ఈ పరీక్షలో ఏ ఒక్క నియమాన్ని మీరకుండా, మీరు కనక ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోగా ఇక్కడ నా బంగళాకి తిరిగివస్తే, నా కంటె ఆశ్చర్యపోయే వాడు ఆగ్రా మొత్తంలో మరొకడు ఉండడు!”

“నీ సవాలుకు ఒప్పుకుంటున్నాను.” నా మాటల్లోకాని, గుండెలో కాని జంకన్నది ఏ కోశానా లేదు. భగవంతుడు అప్పటికప్పుడు చూపించే కృప తాలూకు జ్ఞాపకాలు కృతజ్ఞతా భరితంగా నా మనస్సులో మెదిలాయి; లాహిరీ మహాశయుల చిత్రానికి చేసుకొన్న విన్నపంతో ప్రాణాంతకమైన కలరా జబ్బు నాకు నయమవడం, లాహోర్‌లో ఇంటి కప్పుమీద రెండు గాలి పడగలు నాకు బహుమతిగా చిక్కడం, బెరైలీలో ఉన్నప్పుడు నేను నిరుత్సాహంగా ఉన్న సమయంలో, సరిగా సమయానికి రక్షరేకు దొరకడం, కాశీలో పండితుడి ఇంటి ఆవరణకు బయట ఒక సాధువుద్వారా నిశ్చయాత్మకమైన సందేశం ఒకటి రావడం, జగన్మాత దివ్యదర్శనం, ఆవిడ ప్రియవాక్కులు, నా హైస్కూలు డిప్లమా సంపాయించడానికి వీలుగా చివరి క్షణంలో నాకు దారి కొరకడం, జీవితమంతా కంటున్న కలల పొగమంచులోంచి నా గురుదేవుల దర్శనభాగ్యమనే పరమోత్కృష్టమైన వరం లభించడం- ఇవన్నీ గుర్తుకు వచ్చాయి. ఈ ప్రపంచపు భీకర సంగ్రామ రంగాల్లో నా “వేదాంతం”, ఏ ఒక్క పోరాటాన్ని ఎదుర్కో జాలదని అన్నా, ఒక్కటికి ఒప్పుకోను!

“నీ ఒప్పుదల మెచ్చుకోదగ్గది. ఇప్పుడే మిమ్మల్ని రైలెక్కించడానికి వస్తాను,” అన్నాడు అనంతుడు.

జితేంద్రుడు నోరు వెళ్ళబెట్టాడు. అన్నయ్య వాడివేపు తిరిగి ఇలా అన్నాడు: “నువ్వుకూడా తోడు వెళ్ళాలి – ఇందుకు సాక్షిగానూ, బహుశా తోడుగా బాధలకు గురికావడానికినూ!”

తరవాత ఒక అరగంటలో నాకూ జితేంద్రకీ, ఒకవైపు ప్రయాణానికి టిక్కెట్లు చేతికి వచ్చాయి. స్టేషనులో ఒక మూల మమ్మల్ని తనిఖీ చేసుకోడానికి అవకాశం ఇచ్చాం. మే మెక్కడా దాపరికంగా డబ్బు తీసుకువెళ్ళడం లేదని తొందరగానే తృప్తిపడ్డాడు అనంతుడు; మా సాదా పంచెలు అవసరమైన వాటిని తప్ప మరేమీ మరుగుపరచలేదు.

దేవుడి మీది విశ్వాసం, డబ్బులాంటి గంభీరమైన విషయాల మీద దాడి చేసేసరికి మా స్నేహితుడు ఆక్షేపణ తెలుపుతూ ఇలా అన్నాడు. “అనంతా, కాపుదల కోసం ఒకటి రెండు రూపాయలియ్యి నాకు. దురదృష్టం ఎదురయితే అప్పుడు నీకు టెలిగ్రాం ఇయ్యగలుగుతాను.”

“జితేంద్రా!” నా నోట్లోంచి వచ్చిన మాట, కటువుగా మందలింపులా ఉంది.

“చివరి కాపుదలకోసం నువ్వేమయినా డబ్బు తీసుకునేటట్టయితే ఈ పరీక్షకు నేను రాను!”

“డబ్బుల గలగలలో ఏదో భరోసా ఉంటుంది.” నేను కఠినంగా హెచ్చరించేసరికి జితేంద్రుడు ఇంతకుమీంచి ఏమీ అనలేదు.

“ముకుందా, నేను హృదయంలేనివాణ్ణి కాను.” అనంతుడి గొంతులోకి మార్దవం చొరబడింది. అతన్ని బహుశా అంతరాత్మ మందలిస్తున్నట్టుంది – చేతిలో పైసలేని కుర్రవాళ్ళ నిద్దరిని పరిచయంలేని పట్నానికి పంపుతున్నందువల్ల కావచ్చు; మతపరంగా తనకున్న సంశయశీలతవల్ల నైనా కావచ్చు. “అదృష్టవశాత్తు నువ్వు ఈ బృందావన పరీక్షలో కనక నెగ్గితే నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి ఉపదేశమిమ్మని అడుగుతాను.” ఈ వాగ్దానంలో ఒక అసందర్భం ఉంది. అయితే సంప్రదాయ విరుద్ధమైన ఆ సందర్భానికి తగ్గట్టుగానే ఉంది. పెద్దన్న చిన్నవాళ్ళకి తలవంచడమన్నది భారతీయ కుటుంబంలో అరుదు; చిన్నవాళ్ళు తండ్రి తరవాత అంత గౌరవమూ విధేయతా అతనికే చూపిస్తారు. కాని నే నేమీ వ్యాఖ్యానించడానికి వ్యవధి లేదు; మా బండి బయల్దేరబోతోంది.

రైలుబండి మైళ్ళకు మైళ్ళు సాగిపోతూంటే జితేంద్రుడు, దిగులు మొహం పెట్టుకొని మాటా పలుకూ లేకుండా కూర్చుని ఉన్నాడు. చివరికి కదిలాడు. ముందుకు వాలి, సున్నితమైన ఒకచోట, బాగా నొప్పి పుట్టేలా నన్ను గిల్లాడు.

“భగవంతుడు మనకి తరవాతి భోజనం ఏర్పాటుచేస్తాడన్న సూచన ఏదీ నాకు కనిపించడం లేదు!”

“ఓయి అనుమానం మనిషీ, నిబ్బరంగా ఉండు. దేవుడు మనతోటే పనిచేస్తున్నాడు.”

“అదేదో ఆయన త్వరగా చేసేటట్టు ఏర్పాటు చెయ్యగలవా! ముందు పరిస్థితి తలుచుకునే సరికే కరకరా ఆకలి వేస్తోంది. నేను కాశీ విడిచి పెట్టి వచ్చింది తాజ్ సమాధి చూడ్డానికే కాని నేను సమాధి కావడానికి కాదు!”

“ధైర్యం తెచ్చుకో జితేంద్రా! మొట్టమొదటి సారిగా మనం బృందావనంలో దైవసంబంధమైన అద్భుతాలు చూడనక్కర్లేదూ? కృష్ణ భగవానుడి పాదస్పర్శతో పవిత్రమైన ప్రదేశంలో – మనం నడవబోతున్నామన్న ఆలోచనతోనే నేను గాఢమైన ఆనందంలో మునిగి ఉన్నాను.”

మా రైలు పెట్టె తలుపు తెరుచుకుంది. ఇద్దరు మగవాళ్ళు వచ్చి కూర్చున్నారు. దీని తరవాత రైలు ఆగబోయే చోటే చివరిది. “అబ్బాయిలూ, బృందావనంలో మీ కెవరయినా స్నేహితులున్నారా?” నా ఎదురుగా కూర్చున్న అపరిచితవ్యక్తి, మా విషయంలో ఆసక్తి తీసుకుని మమ్మల్ని ఆశ్చర్యపరిచాడు.

“మీ కనవసరం!” మొరటుగా నా కళ్ళు తిప్పేశాను.

“బహుశా మీరు, ఆ చిత్తచోరుడి[2] మోహంలో పడి ఇళ్ళనుంచి పారిపోతున్నారనుకుంటాను. నా మట్టుకు నేనూ భక్తిభావం గలవాణ్ణే. అంచేత మీకు భోజనమూ ఎండకు మలమల మాడకుండా వసతీ సమకూరేటట్టు చూడడం నా అనివార్య కర్తవ్యంగా భావిస్తాను.”

“వద్దండి. మమ్మల్ని వదిలెయ్యండి; మీరు చాలా దయగలవారు కాని మేము ఆగమ్మకాకులమని అనుకోడంలో మట్టుకు పొరపడ్డారు.”

అటుతరవాత సంభాషణ ఏమీ జరగలేదు; బండి అడంగుకు చేరి ఆగింది. నేనూ జితేంద్రా ప్లాట్‌ఫారం మీదికి దిగేసరికి మా తోటి ప్రయాణికులు మా ఇద్దరి చేతులు పట్టుకొని ఒక గుర్రబ్బండిని పిలిచారు.

మేము ఒక పెద్ద ఆశ్రమం ముందు బండి దిగాం. ఆ ఆశ్రమం, చక్కగా తీర్చిదిద్దిన ఆవరణలో పచ్చని చెట్లమధ్య అలరారుతోంది. మా ఉపకారులు ఇక్కడివారికి తెలిసినవాళ్ళేనని స్పష్టమయింది; చిరునవ్వు చిందిస్తున్న కుర్రవాడొకడు ఏమీ వ్యాఖ్యానించకుండా మమ్మల్ని ఒక సావిట్లోకి తీసుకువెళ్ళాడు. కాసేపట్లో, హుందాతనం ఉట్టిపడుతున్న ఒక వృద్ధురాలు వచ్చి మమ్మల్ని కలుసుకున్నారు.

“గౌరీ మా, యువరాజులు రాలేకపోయారు. వారిలో ఒకరు ఆశ్రమ అతిథేయినితో అన్నారు “చివరి క్షణంలో, వాళ్ళ కార్యక్రమాలు మారిపోయాయి. అందుకు ఎంతో విచారం వెలిబుచ్చారు. అయినా మేము వేరే ఇద్దరు అతిథుల్ని తీసుకొచ్చాం. మేము రైల్లో కలుసుకోగానే, వీళ్ళు కృష్ణభగవానుడి భక్తులుగా నన్ను ఆకర్షించారు.”

“వెళ్ళొస్తాం బాబూ!” అంటూ, మాకు పరిచితులైన ఇద్దరూ గుమ్మం వేపు నడిచారు. “దైవానుగ్రహముంటే మళ్ళీ కలుసుకుందాం.”

“మీ రిక్కడికి రావడం చాలా సంతోషం.” మాతృసహజమైన రీతిలో గౌరీమాత చిరునవ్వు నవ్వారు. “మీరు రావడానికి ఇంతకన్న మంచి రోజు లేదు. ఈ రోజు, ఆశ్రమం రాజపోషకు లిద్దరు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాం. నా వంట మెచ్చుకునేవాళ్ళు లేకపోతే ఎంత విచారించవలసి వచ్చేది?”

మధురమైన ఈ మాటలు జితేంద్ర మీద ఆశ్చర్యకరంగా పనిచేశాయి; కళ్ళ నీళ్ళు పెట్టేసుకున్నాడు. బృందావనంలో తనకు ఎదురవుతుందని భయపడ్డ పరిస్థితి, రాజోచితమైన స్వాగతంగా మారిపోయింది. అందుచేత మానసికంగా సర్దుబాటు చేసుకోడం కష్టమైపోయింది వాడికి. గౌరీమాత వాడివేపు కుతూహలంగా చూశారు; కాని ఏమీ వ్యాఖ్యానించ లేదు. బహుశా, ఇలాటి కుర్రతనపు చేష్టలు ఆవిడకు తెలిసే ఉంటాయి.

భోజనం వేళ అయిందని కబురు అందింది; గౌరీమాత మమ్మల్ని భోజనశాలకు తీసుకువెళ్ళారు. వంటకాల సువాసనలతో ఘుమఘుమ లాడుతూ ఉందక్కడ. పక్కనున్న వంటింట్లోకి అదృశ్యమయా రావిడ.

ఈ క్షణం కోసం నేను ముందునుంచీ ఎదురు చూస్తున్నాను. జితేంద్ర ఒంటిమీద సరయిన చోటు ఒక్కటి చూసి ఒక్క గిల్లు గిల్లాను. వాడు రైల్లో నన్ను, ఎంత నొప్పి పెట్టేలా గిల్లాడో నేనూ అంత నొప్పి పెట్టేలా గిల్లాను.

“ఓయి అనుమానం మనిషీ, దేవుడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు– అదీ తొందరగానే సుమా!” గౌరీమాత ఒక విసినికర్రని పట్టుకొని మళ్ళీ అక్కడికి వచ్చారు. తూర్పు దేశాలవారి సంప్రదాయ పద్ధతిలో మేము ఉన్నితో నేసిన చిత్రాసనాల మీద కూర్చున్న తరవాత, ఆవిడ మెల్లగా విసరడం ప్రారంభించారు. ఆశ్రమ విద్యార్థులు సుమారు ముప్ఫై రకాల వంటకాలతో ఇటూ అటూ తిరిగారు. దీన్ని మామూలు “భోజనం” అనడం కంటె “మృష్టాన్న భోజనం” అనడం సబబు. ఈ భూమి మీద పడ్డాక నేనూ జితేంద్రా అంత రుచిగల వంటకాలు ఎన్నడూ రుచి చూసి ఎరగం.

“రాజభోజనానికి తగ్గ వంటకాలివి, మాతాజీ! మీ రాజపోషకులకు, ఈ విందుకు రావడం కంటె అవసరమైన పని ఏం పడిందో నేను ఊహించలేను. జీవితాంతం మనస్సులో నిలిచే జ్ఞాపకం ప్రసాదించారమ్మా!”

అనంతుడు పెట్టిన షరతు మూలంగా నోరు మూసుకొని ఉండవలసిన మేము, మా ధన్యవాదాలకు రెండు రకాల ప్రాముఖ్యం ఉందన్న సంగతి ఆ దయామయికి వివరించలేకపోయాం. కనీసం మా చిత్తశుద్ధి వెల్లడి అయింది. ఆవిడ ఆశీస్సుతోబాటు, ఆశ్రమానికి మళ్ళీ రమ్మన్న ఆహ్వానం కూడా అందుకొని మేము బయటికి వచ్చాం.

బయట వేడి దారుణంగా ఉంది. నేనూ నా స్నేహితుడూ ఆశ్రమం గేటు దగ్గరున్న పెద్ద కడిమిచెట్టు నీడలో తలదాచుకున్నాం. తరవాత ఘాటు ఘాటుగా సంభాషణ జరిగింది; జితేంద్ర మళ్ళీ అనుమానాల్లో పడ్డాడు.

“నువ్వు నన్ను పెద్ద చిక్కులోకి లాగావు! మధ్యాహ్న భోజనం మనకి కాకతాళీయంగా దొరికింది! కాని ఊళ్ళో చూడదగ్గ చోట్లు ఎలా చూస్తాం, మన దగ్గర ఒక్క పైస లేకుండా? మళ్ళీ నువ్వు అనంతుడి ఇంటికి ఎలా తీసుకు వెళ్తావు నన్ను?” “ఇప్పుడు నీ కడుపు నిండింది కనక, దేవుణ్ణి ఇట్టే మరిచిపోయావు,” నా మాటలు కటువుగా అయితే లేవుగాని నింద మోపుతున్నట్టుగా ఉన్నాయి. దేవుడి దయను మనుషులు ఎంత తొందరగా మరిచిపోతారు! తన ప్రార్థనల్లో కొన్నయినా ఫలించగా చూడని మనిషంటూ ఉండడు.”

“నీలాంటి పిచ్చివాడితో కలిసి రావడం ఎంత బుద్ధితక్కువో నేను మరిచిపోను!”

“నిబ్బరంగా ఉండు జితేంద్రా! మనకు తిండి పెట్టిన ఆ భగవంతుడే బృందావనం చూపించి ఆగ్రాకు తిరిగి పంపిస్తాడు.”

ముచ్చట గొలిపే ముఖ కవళికలుగల సన్నటి యువకు డొకడు గబ గబా నడుస్తూ మా దగ్గరికి వచ్చాడు. చెట్టు దగ్గర ఆగిపోయి, నా ముందు వంగి నమస్కరించాడు.

“ప్రియమిత్రమా, మీరూ మీ స్నేహితుడూ ఈ ఊరికి కొత్త అయి ఉండాలి. మీకు ఆతిథ్యం ఇవ్వడానికి ఊరు చూపించడానికి నాకు అనుమతి ఇవ్వండి.”

భారతీయుడి ముఖం పాలిపోవడమన్నది చాలా అరుదు; కాని జితేంద్రుడి ముఖంలో కత్తివాటుకు నెత్తుటి చుక్క లేదు. అతను చెయ్యదలిచిన సహాయాన్ని నేమ మర్యాదగా తిరస్కరించాను.

“మీరు నన్ను నిజంగా వెళ్ళగొట్టడం లేదు కదూ?” మరే పరిస్థితిలోనో అయితే ఆ అపరిచితుడి వ్యాకులతకు మాకు నవ్వు వచ్చి ఉండేది.

“ఎందుక్కాదు?”

“మీరు నా గురువులు.” విశ్వాసాన్ని నింపుకొన్న అతని కళ్ళు నా కళ్ళలోకి చూశాయి. మధ్యాహ్నం ధ్యానంచేసుకొనే వేళ, శ్రీకృష్ణ భగవానుడు నాకు దర్శనమిచ్చి సరిగా ఈ చెట్టు కిందే ఇద్దరు పరిత్యక్త వ్యక్తుల ఆకారాల్ని నాకు చూపించాడు. వాటిలో ఒకటి మీది – అంటే, నా గురువులది! నేను ధ్యాన సనుయంలో తరచుగా మీ మూర్తినే చూస్తుండేవాణ్ణి. మీరు, సవినయంగా నే నందిచ్చే సేవల్ని స్వీకరిస్తే ఎంతో ఆనందిస్తాను!”

“మీరు నన్ను కనుక్కున్నందుకు నాక్కూడా సంతోషంగానే ఉంది. దేవుడుగాని, మనుషులుకాని మమ్మల్ని పరిత్యజించలేదు!” నేను, నా ఎదుట ఆత్రంగా చూస్తున్న వ్యక్తి ముఖంలోకి చూసి చిరునవ్వు నవ్వుతూ నిశ్చలంగా ఉన్నప్పటికీ, మనస్సులోనే భగవంతుడి దివ్య చరణాలకు మొక్కుకున్నాను.

‘‘మిత్రులారా, ఒక్కసారి మీరు మా ఇంటిని పావనం చెయ్యరూ?”

“మీరు దయగలవారే; కాని అలా చెయ్యడానికి కుదరదు. ఇప్పటికే మేము, ఆగ్రాలో మా అన్నయ్యకి అతిథులుగా ఉన్నాం.”

“పోనీ కనీసం, మీతో కలిసి బృందావనంలో తిరిగానన్న జ్ఞాపకాలన్నా నాకు మిగిలేటట్టు అనుగ్రహించండి.”

నేను సంతోషంగా ఒప్పుకొన్నాను. ఆ యువకుడి పేరు ప్రతాప్ ఛటర్జీ అని చెప్పాడు. ఒక గుర్రబ్బండిని పిలిచాడు. మేము మదనమోహన ఆలయమూ తక్కిన కృష్ణాలయాలూ దర్శించాం. మా ఆలయ సేవలు పూర్తి అయేసరికి చీకటి పడింది.

“నేను ‘సందేశ్’ తీసుకొచ్చే దాకా ఆగండి.” ప్రతాప్, రైలు స్టేషను దగ్గర ఒక దుకాణంలోకి వెళ్ళాడు. వెనకటికన్న ఇప్పుడు చల్లగా, జనసమ్మర్దంగా ఉన్న విశాలమైన వీధిలో నేనూ జితేంద్ర పచార్లు చేశాం. కొంతసేపటి దాకా మా స్నేహితుడు తిరిగి రాలేదు; చివరికి బోలెడు మిఠాయిలు మాకు కానుకగా తెచ్చాడు.

“ఈమాత్రం పుణ్యం చేసుకోడానికి దయతో నన్ను అనుగ్రహించండి.” కొన్ని రూపాయల కట్ట, ఆగ్రాకి అప్పుడే కొన్న రెండు టిక్కెట్లు చూపిస్తూ బతిమాలుతున్నట్టుగా చిరునవ్వు నవ్వాడు ప్రతాప్.

నేను వాటిని తీసుకొన్నది, భగవంతుడి అదృశ్య హస్తం మీదున్న భక్తి ప్రపత్తులతోనే, అనంతుడు ఎంత ఎగతాళి చేసినప్పటికీ, దాని ఔదార్యం, అవసరాన్ని ఎంతో మించిపోలేదా?

స్టేషనుకు దగ్గరిలో ఒక ఏకాంత ప్రదేశం చూసుకున్నాం.

“ప్రతాప్, మీకు క్రియాయోగం నేర్పుతాను; ఆధునిక కాలంలో అందరికన్న మహాయోగి అయిన లాహిరీ మహాశయుల దిది. ఆయన యోగవిద్యే మీకు గురువు.”

ఒక్క అరగంటలో దీక్ష ముగిసింది. “ ‘క్రియ’ నీకు చింతామణి[3],” అన్నాను కొత్త శిష్యుడితో. “పద్ధతి సులువైందని నువ్వు గమనించే ఉంటావు. మనిషి ఆధ్యాత్మిక పరిణామాన్ని త్వరితం చేసే నేర్పు దీనికి ఉంది. దేహధారణ చేసే అహంకారం, మాయ నుంచి విముక్తి పొందడానికి పది లక్షల సంవత్సరాలు పడుతుందని భారతీయ పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. క్రియాయోగం ద్వారా, సహజమైన ఈ కాలావధి చాలా వరకు తగ్గిపోతుంది. జగదీశ్‌చంద్ర బోసు మన కళ్ళకు కట్టించినట్టు, మొక్క పెరుగుదలను మామూలు రేటుకు మించి త్వరితం చెయ్యడానికి, వీలున్నట్టు, మనిషి మానసిక వికాసాన్ని కూడా శాస్త్రీయ సాధనల ద్వారా త్వరితం చేయ్యవచ్చు. నీ సాధనలో నిష్ఠగా ఉండు , గురువులందరికీ గురువయినవాణ్ణి చేరతావు నువ్వు.”

“ఎంతో కాలంగా నేను వెతుకుతున్న యోగప్రక్రియను కనుక్కోడానికే నన్నిక్కడికి పంపించినట్టుంది,” అన్నాడు ప్రతాప్ సాలోచనగా. “ఈ ప్రక్రియ, ఇంద్రియ బంధనాల నుంచి నుంచి విముక్తి కలిగించి, ఉచ్చస్థితులకు తీసుకువెడుతుంది. ఈనాడు శ్రీకృష్ణ భగవానుడి దర్శనం కావడం నాకు అన్నిటికన్న గొప్ప మేలయింది.”

మేము కొంతసేపు మౌనంగా అవగాహన చేసుకొంటూ కూర్చున్నాం. ఆ తరవాత స్టేషన్‌లోకి వెళ్ళాం. రైలు ఎక్కుతూ ఉండగా, నా కెంతో ఆనందం కలిగింది. కాని జితేంద్రుడికి ఈ రోజు కన్నీళ్ళ రోజు. ప్రతాప్‌కు నేను ఆప్యాయంగా వీడ్కోలు చెబుతూ ఉండగా నా మిత్రు లిద్దరికీ మధ్య మధ్య ఎక్కెక్కి ఏడుపులు వచ్చాయి. ప్రయాణంలో మళ్ళీ మరోసారి జితేంద్రుడు దుఃఖంలో మునిగాడు. ఈసారి తనకోసం కాదు. తన పరిస్థితి గురించి.

“భగవంతుడి మీద నా విశ్వాసం, గాఢతలేకుండా ఎంత పై పైన ఉంది! నా గుండె బండబారింది! ఇక ముందెప్పుడూ దేవుడి రక్షణను శంకించను!”

అర్ధరాత్రి కావస్తోంది. చేతిలో పైస లేకుండా వెళ్ళిన “సిండ రెల్లాలు” ఇద్దరూ అనంతుడి పడగ్గదిలోకి ప్రవేశించారు. తను తేలికగా ఊహించి ఉన్నందువల్ల, అప్పుడు అతని ముఖంలో కనిపించిన ఆశ్చర్యం చూసి తీరవలసిందే. నేను మాట్లాడకుండా, బల్లమీద రూపాయి కాయితాలు కురిపించాను.

“జితేంద్రా, నిజం చెప్పు.” అనంతుడి గొంతులో వేళాకోళం ఉంది. “ఈ కుర్రవాడు ఎక్కడా దారి దోపిడీకి దిగలేదు కదా?” కాని కథ విడివడుతున్న కొద్దీ మా అన్నయ్య, శాంతపడుతూ వచ్చి తరవాత గాంభీర్యం వహించాడు.

“అవసరాన్ని బట్టి లబ్ధి ఉంటుందనే సూత్రం (డిమాండ్ – సప్లయిసూత్రం) నే ననుకున్న దానికన్న సూక్ష్మమైన స్తరాల్లో కూడా పనిచేస్తుంది.” ఇంతకు ముందెన్నడూ పొడగట్టని ఆధ్యాత్మిక ఉత్సాహంతో అన్నాడు అనంతు అన్నయ్య. “ప్రాపంచికమైన ధనసంపదలన్నా, అసభ్యంగా కూడబెట్టడాలన్నా నీ కుండే ఉపేక్షాభావం మొదటిసారిగా నా కిప్పుడు అర్థమైంది.”

అంత అపరాత్రి వేళ కూడా, అప్పటికప్పుడు తనకి క్రియాయోగ దీక్ష[4] ఇమ్మని మా అన్నయ్య పట్టుబట్టాడు. “గురు” ముకుందుడు, ఒకే రాత్రి, ఇద్దరు అయాచిత “శిష్యు”ల బాధ్యత వహించవలసి వచ్చింది.

మర్నాడు పొద్దున సామరస్య పూర్వకమైన వాతావరణంలో ఫలహారాలు చేశాం; ఇది ముందటి రోజున కరువైంది.

నేను జితేంద్రుడి వేపు చూసి చిన్నగా నవ్వాను. “నువ్వు తాజ్ చూడకుండా వెళ్ళకూడదు. శ్రీరాంపూర్‌కు బయల్దేరేలోగా చూద్దాం.”

అనంతుకు వీడ్కోలు చెప్పి నేనూ నా స్నేహితుడూ ఆగ్రాకు ఘనత చేకూర్చిన తాజ్‌మహల్‌కు వచ్చి ఎదురుగా నించున్నాం. ఎండలో కళ్ళు మిరుమిట్లు గొలిపే తెల్లటి ఆ పాలరాతి కట్టడం, సంపూర్ణ సౌష్ఠవానికి నిదర్శనంగా నిలిచింది. నల్లని తమాల వృక్షాలు, మిలమిల మెరిసే పసరిక నేల, ప్రశాంతమైన నీటి మడుగు, దానికి చక్కని దృశ్యం సమ కూర్చాయి. విలువైన రాళ్ళు పొదిగి లతలు చెక్కి ఉన్న భాగాలు, లోపల అద్భుతంగా ఉన్నాయి. గోధుమ, ఊదారంగుల పాలరాళ్ళలోంచి సున్నితమైన పూలగుత్తులు, కాయితం చుట్టల్లాంటివి బయటికి వస్తున్నట్టుగా చెక్కడం జరిగింది. గుమ్మటంనుంచి వచ్చే దీపకాంతి షాజహాన్ చక్రవర్తి సమాధి మీదా, ఆయన రాజ్యానికి హృదయానికి కూడా రాణి అయిన ముంతాజ్-ఇ-మహల్ సమాధి మీదా ప్రసరిస్తోంది.

దృశ్యాలు చూడటం ఇక చాలు! నేను నా గురువుగారికోసం తహ తహలాడుతున్నాను. కాసేపటికి నేనూ జితేంద్రుడూ దక్షిణదిశగా బెంగాల్ వేపు సాగే రైల్లో ప్రయాణం చేస్తున్నాం.

“ముకుందా, కొన్ని నెలలుగా నేను మావాళ్ళని చూడలేదు. నా మనస్సు మార్చుకున్నాను, బహుశా తరవాత ఎప్పుడో నేను శ్రీరాంపూర్‌లో మీ గురువుగారి దర్శనం చేసుకుంటాను.

కొంచెం సున్నితంగా చెప్పాలంటే, ఊగిసలాట మనస్తత్వం గల నా స్నేహితుడు నన్ను కలకత్తాలో వదిలి పెట్టి పోయాడు. నేను లోకల్ ట్రెయిన్‌లో, ఉత్తరదిశగా పన్నెండు మైళ్ళ దూరంలో ఉన్న శ్రీరాంపూర్ వెళ్ళాను.

కాశీలో గురువుగారిని కలిసి అప్పటికి సరిగా, ఇరవై ఎనిమిది రోజులయిందన్న సంగతి గ్రహించేసరికి ఆశ్చర్యం వేసింది. “నువ్వు నాలుగు వారాల్లో వస్తావు నా దగ్గరికి!”, ప్రశాంతంగా ఉన్న రాయ్‌ఘాట్ సందులో వారి ఆశ్రమం ముంగిట్లో అడుగుపెట్టాను. గుండె దడదడలాడుతోంది. భారతదేశపు జ్ఞానావతారుల సన్నిధిలో, తరవాతి పదేళ్ళలో మంచి రోజులని చెప్పదగ్గకాలం గడపడానికి నేను మొట్టమొదటి సారిగా ఆ ఆశ్రమంలో అడుగుపెట్టాను.

  1. చూడండి అధ్యాయం : 25.
  2. హరి; భక్తులకు ప్రియమైన శ్రీకృష్ణుడి పేరు.
  3. కోరికలు తీర్చే శక్తిగల పురాణ ప్రసిద్ధమైన మణి, భగవన్నామాలలో ఇదొకటి.
  4. ఆధ్యాత్మిక ఉపదేశం; సంస్కృతంలో ‘దీక్ష్’ అనే ధాతువునుంచి వచ్చింది; తాను అంకితం కావడం అని దీనికి అర్థం.