ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 10

వికీసోర్స్ నుండి

అధ్యాయం : 10

గురుదేవులు శ్రీయుక్తేశ్వర్ గారిని

కలుసుకోడం

“దేవుడి మీది ప్రగాఢ విశ్వాసం ఏ అలౌకిక ఘటన నయినా జరిపించ గలదు - చదవకుండా పరీక్ష ప్యాసవడం ఒక్కటి తప్ప.” ఏమీ తోచనప్పుడు ఒకసారి నేను తీసుకొన్న “స్ఫూర్తిదాయకమైన” పుస్తకాన్ని వెంటనే వెగటుపుట్టి మూసేశాను.

“రచయిత చెప్పిన మినహాయింపు చూస్తే, దేవుడిమీద ఆయనగారికి బొత్తిగా విశ్వాసం లేనట్టు కనిపిస్తోంది,” అనుకున్నాను. “పాపం వెర్రివాడు; నడిరాత్రి వెలిగే దీపం చమురు మీదే గొప్ప గౌరవమున్నవాడు!”

నేను హైస్కూలు చదువు పూర్తిచేస్తానని, వెనకే మా నాన్నగారికి మాట ఇచ్చాను. కాని నేను శ్రద్ధపట్టినట్టు నటించలేను. నెలలు గడుస్తున్నకొద్దీ నేను క్లాసులో కనిపించడం మరింత తక్కువయింది; కలకత్తా స్నానాల రేవుల్లో నిర్జన ప్రదేశాలకు వెళ్ళడం ఎక్కువయింది. ఆ రేవుల్నే ఆనుకొని ఉన్నాయి శ్మశానాలు. ముఖ్యంగా రాత్రిపూట భయంకరంగా ఉండే ఈ శ్మశానాలు యోగిని బాగా ఆకట్టుకుంటాయని అంటారు. మరణం లేని మహత్తత్త్వాన్ని అన్వేషించేవాడు. కొన్ని బోడిపుర్రెల్ని చూసి బెదిరిపోగూడదు. రకరకాల ఎముకలు చెల్లాచెదరుగా ఉండే నైరాశ్య నిలయంలోనే, మానవజీవితం ఎంత అపరిపూర్ణమయినదో స్పష్టమవుతుంది. ఈ విధంగా నేను చేసే అర్ధరాత్రి జాగరణలు స్వభావరీత్యా, విద్యార్థులు చేసే జాగరణలకు భిన్నమైనవి.

హిందూ హైస్కూల్లో సంవత్సరాంత పరీక్షలు జరిగేవారం గబగబా దగ్గరపడుతోంది. ఈ పరీక్షాకాలం, శ్మశానవాటికలాగే సుపరిచితమైన భయోత్పాతాన్ని కలిగిస్తుంది. అయినా నా మనస్సు ప్రశాంతంగానే ఉంది. పిశాచాలకు జంకకుండా నేనక్కడ, తరగతి గదుల్లో కంటబడని జ్ఞానాన్ని తవ్వి తీస్తున్నాను. కాని నాకు, ప్రణవానందస్వామివారిలా, ఒకే సమయంలో రెండుచోట్ల సులువుగా కనబడే నేర్పు లేదు. అయితే భగవంతుడు ఆ సంకటస్థితిని గమనించి నన్ను దాంట్లోంచి బయటపడేస్తా డన్నది నా ఆలోచన (దురదృష్టవశాత్తు, కొందరికిది తర్కవిరుద్ధంగా కనిపించవచ్చు). కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడి లీలావిశేషం, వివరించడానికి వీలుకాని విధంగా, వెయ్యి దృష్టాంతాల్లో కళ్ళకు కట్టినప్పుడు వాటిమూలంగా భక్తుడికి హేతురాహిత్యం ఏర్పడుతుంది.

“ఓ ముకుందా! ఈమధ్య బొత్తిగా కనిపించడమే మానేశావు!” ఒకనాడు మధ్యాహ్నం నా సహాధ్యాయి ఒకడు నన్ను గుర్పార్ రోడులో పలకరించాడు.

“అరే, నంటూ! నేను స్కూల్లో కనిపించకపోవడం నన్ను తప్పకుండా ఇరకాటంలో పెట్టేలా ఉందిరా,” అంటూ, స్నేహపూర్వకంగా చూస్తున్న నంటూ దగ్గర నా బాధ వెళ్ళబెట్టుకున్నాను.

నంటూ మంచి తెలివైన విద్యార్థి. వాడు నా మాటకి కులాసాగా నవ్వాడు. నా అవస్థ చూస్తే ఎవరికయినా నవ్వు రాకపోదు.

“చివరి పరీక్షలకి నువ్వు బొత్తిగా తయారుకాకుండా ఉన్నావు!” అన్నాడు వాడు. “నేను నీకు సహాయం చెయ్యాలనుకుంటాను!” ఈ మామూలు మాటలే ఒక దివ్యమైన వాగ్దానాన్ని నా చెవుల్లో వేశాయి; మంచి హుషారుగా మా స్నేహితుడి ఇంటికి వెళ్ళాను. మాస్టర్లు పరీక్షలో ఇవ్వవచ్చునని తన కనిపించిన రకరకాల ప్రశ్నలకు సమాధానాలు, వాడు నాకు స్థూలంగా చెప్పుకొచ్చాడు.

“ఈ ప్రశ్నలు, ఆత్మవిశ్వాసంతో పరీక్షకి వెళ్ళే కురాళ్ళని చాలామందిని, పరీక్షల్లో బోల్తాకొట్టిస్తాయి. నా సమాధానాలు గుర్తుంచుకో; దెబ్బతినకుండా బయటపడతావు నువ్వు.”

నేను అక్కణ్ణించి బయల్దేరేసరికి రాత్రి చాలా గడిచిపోయింది. అప్పటికప్పుడు పట్టించుకున్న పాండిత్యంతో పిటపిటలాడిపోతూ, రాబోయే గడ్డు రోజుల్లో ఆ పాండిత్యం అలాగే నిలిచి ఉండాలని భక్తితో ప్రార్థన చేశాను. నంటూ, నా పరీక్షకున్న అనేక పాఠ్యవిషయాలు నాకు బోధించాడు; కాని ఆ తొందరలో, టైము చాలకపోవడం వల్ల, నా సంస్కృతం కోర్సు సంగతి మరిచిపోయాడు. ఈ పొరపాటును దేవుడికి భక్తిపూర్వకంగా గుర్తుచేశాను.

మర్నాడు పొద్దున, లయబద్ధంగా కదంతొక్కుతూ నడుస్తూ, కొత్తగా గడించిన జ్ఞానాన్ని ఒంటబట్టించుకుంటూ షికారుకు బయల్దేరాను. నేను అడ్డదారి పట్టి, ఒక మూల ఒత్తుగా పెరిగిన గడ్డిమొక్కల్లో పడి పోతూ ఉండగా విడివిడిగా పడిఉన్న కొన్ని అచ్చుకాయితాల మీద నా కళ్ళు పడ్డాయి. విజేతలా గబుక్కున ముందుకు దూకాను; సంస్కృత శ్లోకాలు నా చేతికి చిక్కాయి! వాటికి విడమరిచి అర్థాలు చెప్పించుకోడానికి ఒక పండితుణ్ణి వెతికిపట్టుకున్నాను. ఆయన గంభీరస్వరం, ఆ ప్రాచీన భాషకున్న అపరిమిత మాధుర్యంతో గాలిని నింపేసింది.[1] “అసాధారణమైన ఈ శ్లోకాలు నీ సంస్కృత పరీక్షకి పనికొచ్చే అవకాశం లేదు. ఆ పండితుడు, అపనమ్మకంగా అన్నాడు.

అయితే, ఆ కవిత్వంతో ఏర్పడ్డ పరిచయమే, ఆ మర్నాడు జరిగే సంస్కృత పరీక్షలో నేను ప్యాసవడానికి సాయపడింది. వివేచనాత్మకంగా నంటూ చేసిన సహాయంవల్ల నేను తక్కిన పాఠ్యవిషయాల్లో కూడా అత్తెసరు మార్కులు తెచ్చుకుని పరీక్ష గట్టెక్కాను.

ఇచ్చినమాట నిలబెట్టుకుని నేను సెకండరీ స్కూల్ కోర్సు పూర్తి చేసినందుకు నాన్న గారు సంతోషించారు. నంటూ ఇంటికి వెళ్ళడం విషయంలోనూ, చెత్తకుప్ప పక్కనుంచి అలవాటు లేని దారిలో నడిచివెళ్ళడం విషయంలోనూ నా కొక దారి చూపించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకొన్నాను. నన్ను ఆదుకోడానికి సమయోచితంగా తాను వేసిన పథకాన్ని ఆయన సరదాగా రెండు రకాలుగా వ్యక్తంచేశాడు.

పరీక్ష హాళ్ళలో దేవుడి ప్రాముఖ్యాన్ని నిరసించిన రచయితగారి పుస్తకం- వెనక నేను చదవకుండా విడిచిపెట్టేసినది-- మళ్ళీ నా కంట బడింది. నిశ్శబ్దంగా నాలో నేను చేసుకున్న వ్యాఖ్యానానికి ముసిముసి నవ్వు ఆపుకోలేకపోయాను:

“పీనుగుల మధ్య కూర్చుని దైవప్రార్థన చెయ్యడం, హైస్కూలు డిప్లమా సంపాయించడానికి అడ్డదారి అని కనక నే నీయనకి చెప్పవలసి వస్తే, ఈయనగారి మనస్సులో గందరగోళం ఇంకా పెరిగిపోయేది!” నా కొత్త ఘనత కారణంగా ఇప్పుడు, ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి బాహాటంగానే పథకం వేస్తున్నాను. జితేంద్ర మజుందార్[2] అనే స్నేహితుడితో కలిసి వెళ్ళి, కాశీలో ఉన్న శ్రీ భారత్ ధర్మ మహామండల్ వాళ్ళ ఆశ్రమంలో చేరి, ఆధ్మాత్మికమైన శిక్షణ పొందాలని నిశ్చయించుకున్నాను.

మా కుటుంబంతో ఎడబాటు వస్తుందన్న ఆలోచనతో ఒకనాడు నేను బెంగపడిపోయాను. అమ్మ పోయినతరవాత ఇంట్లోవాళ్ళమీద, ముఖ్యంగా మా తమ్ముళ్ళు- సనందుడి మీదా విష్ణు మీదా- మా చివరి చెల్లెలు తామూ మీదా నా ఆప్యాయత గాఢంగా పెరిగింది. వెంటనే నా ఏకాంత స్థలానికి పరిగెత్తాను. ఒడుదుడుకులతో కూడిన నా ఆధ్యాత్మిక సాధన[3]లోని అనేక దృశ్యాలకు ఆ అటకే ప్రత్యక్ష సాక్షి. రెండు గంటల సేపు నా కన్నీరు వరదలై పారిన తరవాత, అన్నిటినీ క్షాళనం చేసే ఒకానొక అజ్ఞాతశక్తి వల్ల నాలో ఒక విలక్షణమైన పరివర్తన వచ్చినట్టు అనిపించింది. అనుబంధాలన్నీ[4] అదృశ్యమయిపోయాయి; స్నేహితులందరినీ మించిన స్నేహితుడైన భగవంతుణ్ణి అన్వేషించాలన్న నిర్ణయం బాగా బలపడింది. “చివరిసారిగా ఒక్క కోరిక కోరుతున్నాను. నన్నూ, నీకోసం తపించే అన్నదమ్ముల్నీ అక్కచెల్లెళ్ళనీ విడిచిపెట్టి వెళ్ళకు.” నాన్నగారి దీవెన కోసం నేను ఆయన ఎదుట నించునేసరికి ఆయన దిగాలుపడి ఇలా అన్నారు.

“నాన్నగారూ, మీ మీద నా కెంత ప్రేమ ఉందో ఎలా చెప్పగలను? కాని ఈ భూమిమీద నాకు పరిపూర్ణులైన తండ్రిని ప్రసాదించిన జగత్పిత మీదున్న ప్రేమ ఇంకా ఎక్కువయినది. ఇంతకంటే ఎక్కువ దివ్యమైన జ్ఞానం పొంది, ఎప్పుడో ఒకనాడు మళ్ళీ తిరిగిరావడానికి నన్నిప్పుడు వెళ్ళనియ్యండి.”

నాన్నగారు అనిష్టంగా ఇచ్చిన అనుమతితో, అప్పటికే కాశీలో ఆశ్రమంలో ఉన్న జితేంద్రని కలుసుకోడానికి బయల్దేరాను. నేను వెళ్ళగానే, ఆశ్రమాధిపతి అయిన స్వాములవారు - దయానందులు నన్ను సాదరంగా పలకరించారు. ఆయన పడుచుప్రాయంలో ఉన్నవారు. పొడుగ్గా, సన్నగా, ఆలోచనాపరులుగా కనిపించే ఆ స్వామివారి మీద నాకు సదభిప్రాయం కలిగింది. అందమైన ఆయన ముఖంలో, బుద్ధుడిలో ఉన్న మాదిరి ప్రశాంతత ఉండేది.

ఈ కొత్త నివాసంలో ఒక అటక ఉన్నందుకు నేను సంతోషించాను. ఉదయ సంధ్య వేళా పొద్దుటి పూటా అక్కడ గడపడానికి వీలు కల్పించుకున్నాను. ధ్యాన సాధన గురించి ఏమీ తెలియని ఆ ఆశ్రమవాసులు, నాకున్న సమయమంతా ఆశ్రమ నిర్వహణ విధులు నిర్వర్తించడానికే వినియోగించాలని అనుకునేవారు. మధ్యాహ్నంపూట నేను వాళ్ళ ఆఫీసులో చేసే పనికి మెచ్చుకునేవారు.

“దేవుణ్ణి అంత తొందరగా పట్టుకోడానికి ప్రయత్నించకు!” ఒకనాడు పొద్దున నేను అటకమీదికి వెళ్తూ ఉండగా నా వెంట వచ్చిన ఆశ్రమ సహవాసి చేసిన పరిహాసం ఇది. నేను దయానందగారి దగ్గరికి వెళ్ళాను; గంగానదివేపు ఉన్న తమ చిన్న గదిలో ఏదో పనిలో మునిగి ఉన్నారాయన.

“స్వామీజీ, ఇక్కడ నేను చెయ్యవలసింది ఏమిటో నాకు తెలియకుండా ఉంది. దేవుడి ప్రత్యక్ష దర్శనం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన లేనిదే, సాంగత్యంతోకాని, ధర్మంతోకాని, సత్కార్యాలతోకాని నాకు తృప్తి కలగదు.”

కాషాయవస్త్రధారి అయిన ఆ స్వాములవారు ఆప్యాయంగా నా వెన్ను తట్టారు. ఉత్తుత్తి కోపం నటిస్తూ, పక్కనున్న శిష్యుల్ని కొందర్ని మందలించారు. “ముకుందుణ్ణి ఇబ్బంది పెట్టకండి. మన పద్ధతులు క్రమంగా నేర్చుకుంటాడు లెండి.”

నేను మర్యాదగా నా సంశయాన్ని మరుగుపరిచాను. విద్యార్థులు గదిలోంచి వెళ్ళిపోయారు; ఆయన మందలింపుకి వాళ్ళేమీ కుంగిపోయినట్టు కనిపించలేదు. దయానందులు, ఆ తరవాత ఇంకా చెప్పారు నాకు.

“ముకుందా, మీ నాన్నగారు ప్రతినెలా వరస తప్పకుండా నీకు డబ్బు పంపిస్తున్నట్టున్నారు. ఆ డబ్బు ఆయనకి తిప్పి పంపెయ్యి; నీ కిక్కడ ఏమీ అక్కర్లేదు. ఇంక నీ క్రమశిక్షణ కోసం రెండో సూచన; అది నీ భోజనం గురించి. నీకు ఆకలి వేస్తున్నప్పుడు కూడా, ఆ సంగతి చెప్పకు.”

నా కంట్లో ఆకలి మిలమిల్లాడిందేమో నాకయితే తెలియదు. నాకు ఆకలిగా ఉందన్న సంగతిమట్టుకు బాగా తెలుసు. కాని ఆశ్రమంలో వేళ తప్పకుండా మొదటిసారి భోజనం పెట్టే సమయం మాత్రం మధ్యాహ్నం పన్నెండు గంటలు. మా ఇంట్లో అయితే తొమ్మిదిగంటల వేళకి సుష్టుగా ఫలహారం చెయ్యడం నాకు అలవాటు. ప్రతిరోజూ ఈ మూడు గంటల వ్యవధి మాత్రం మరింత దుర్భరమవుతోంది. కలకత్తాలో అయితే, ఒక్క పది నిమిషాల ఆలస్యానికి మా వంటవాణ్ణి తిట్టేసేవాణ్ణి; ఇప్పుడా రోజులు గతించాయి. ఇక ఆకలి అదుపులో పెట్టడానికి ప్రయత్నించాను; ఇరవై నాలుగు గంటల ఉపవాసం పూర్తి చేశాను. మర్నాడు మధ్యాహ్నం ఎప్పుడవుతుందా అని రెట్టింపు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాను.

“దయానందుల బండి ఆలస్యంగా వస్తుంది; ఆయన వచ్చేదాక మన మెవళ్ళం భోంచెయ్యం.” జితేంద్ర ఘోరమయిన ఈ వార్త తెచ్చాడు. రెండు వారాలపాటు ఊళ్ళోలేని స్వాములవారికి స్వాగత సూచకంగా రుచికరమైన వంటకాలెన్నో సిద్ధంగా ఉన్నాయి. ఆకలి పుట్టించే వాసన ఆశ్రమమంతటా నిండి ఉంది. వేరే ఏమీ దొరకనప్పుడు, నిన్నటిరోజు ఉపవాసమున్నానన్న గర్వం తప్ప, మరేముంటుంది మింగడానికి?

“దేవుడా, బండి తొందరగా రప్పించు!” దయానందులు నా నోరు కట్టెయ్యడానికి విధించిన నియమంతో, దివ్యప్రదాత అయిన భగవంతుడికి ఏమీ ప్రమేయం లేదని అనుకున్నాను. భగవంతుడి దృష్టి మరో చోట ఉంది. కుంటుకుంటూ నడుస్తున్న గోడ గడియారం గంటలు గడిపేసింది. మా స్వాములవారు గుమ్మంలో అడుగుపెట్టే వేళకి చీకటి పడుతోంది. నేను పట్టరాని సంతోషంతో ఆయనకి స్వాగతం చెప్పాను.

“దయానందులు ముందు స్నానంచేసి ధ్యానం చేసుకుంటారు; ఆ తరవాతే మనం వడ్డన చేసేది.” జితేంద్రుడు అపశకునపు పక్షిలా మళ్ళీ నా దగ్గరికి తయారయాడు.

నేను దాదాపు స్పృహ తప్పిపోయే స్థితిలో ఉన్నాను. ఖాళీగా ఉండడం కొత్త అయిన నా చిన్నారి కడుపు, ఆవురావురుమంటూ టొకా యిస్తోంది. నేను చూసిన క్షామబాధితుల చిత్రాలు, నా ముందు పిశాచాల్లా అల్లాడుతున్నాయి.

“కాశీలో మరుసటి ఆకలిచావు, ఈ క్షణంలోనే ఈ ఆశ్రమంలో సంభవించబోతోంది,” అనుకున్నాను. ఆ ప్రమాదం, తొమ్మిదిగంటల వేళకి తప్పిపోయింది. అమృతతుల్యమైన తియ్యని పిలుపు! ఆ రాత్రి భోజనం, నా జీవితంలో లోకల్లా పరిపూర్ణమైన ఘడియ మాదిరిగా స్పష్టంగా జ్ఞాపకాల్లో నిలిచిపోయింది.

నేను భోజనంలో ఎంత గాఢంగా మునిగిపోయినప్పటికీ, దయానందులు పరధ్యానంగా భోంచేస్తున్నారన్న సంగతి గమనించకపోలేదు. నేను కోరే మాదిరి భౌతిక సుఖాలకు ఆయన అతీతులయినట్టున్నారు.

“స్వామీజీ, మీకు ఆకలి వెయ్యలేదా?” నేను సుష్టుగా భోంచేసినందుకు సంతోషపడుతూ, పఠన మందిరంలో ఆయనతోబాటు ఒంటరిగాఉన్నాను.

“వేసింది!” అన్నారు. “గత నాలుగు రోజులూ తిండీ తీర్థం లేకుండా గడిపాను. రైలు ప్రయాణాల్లో నే నెన్నడూ తినను; ఐహిక వాంఛలతో కూడిన ప్రజలనుంచి వెలువడే విభిన్న స్పందనలతో నిండి ఉంటాయి రైళ్ళు. మాబోటి సన్యాసులకు విధించిన శాస్త్రనియమాల్ని నేను తూచా తప్పకుండా పాటిస్తాను.

“వ్యవస్థాపరమైన పనికి సంబంధించిన సమస్యలు కొన్ని నా మనస్సులో ఉన్నాయి. అంచేత ఈ రాత్రి భోజనం మీద మనస్సు పెట్టలేదు. తొందరేముంది? రేపు గుర్తు పెట్టుకొని సరిగా భోంచేస్తాలే,” అంటూ ఉల్లాసంగా నవ్వారాయన. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లుగా నాలో లజ్జ వ్యాపించింది. కాని గడిచిన రోజంతా నేను అనుభవించిన హింస, అంత సులువుగా మరిచిపోలేకపోయాను. నేను మరో ప్రశ్న అడగడానికి పూనుకొన్నాను.

“స్వామీజీ, మీ ఆదేశం నాకు గందరగోళం కలిగిస్తోంది. అన్నం పెట్టమని నేను ఎన్నడూ అడగననుకోండి, నా కెవరూ ఏం పెట్టరనుకోండి. నేను ఆకలితో మాడి చావవలసిందే.”

“అయితే చావు!” ఈ భయంకరమైన సలహా, గాలిని చీల్చుకుంటూ వినవచ్చింది. “చావవలసే ఉంటే, చావు ముకుందా! దైవబలం వల్లనే కాని తిండిబలం వల్ల బతుకుతానని ఎన్నడూ నమ్మకు! పుష్టినిచ్చే పదార్థాలన్నీ సృష్టించినవాడు ఆయన. ఆకలి పుట్టించినవాడు ఆయన. తన భక్తుడి పాలనా పోషణా ఆయన తప్పకుండా చూసుకుంటాడు. అన్నం నిన్ను బతికిస్తోందని కాని, డబ్బు పోషిస్తోందని కాని మనుషులు పోషిస్తున్నారని కాని అనుకోకు. ఆ ప్రభువు నీ ఊపిరి కాస్తా దిగలాగేస్తే అవేమన్నా నీకు సాయపడతాయా? అవి కేవలం ఆయన ఉపకరణాలు మాత్రమే. నీ కడుపులో ఆహారం జీర్ణమవుతున్నది ఏదో నీ నేర్పువల్లనా? నీ విచక్షణా ఖడ్గాన్ని ఉపయోగించు ముకుందా! ఉపకరణ బంధాల్ని ఛేదించి, ఏకైక కారణమైన భగవంతుణ్ణి దర్శించు!”

నిశితమైన ఆయన మాటలు నాలో, మూలుగలోతుల్లోకి, దూసుకు పోవడం గమనించాను. దైహికావసరాలు ఆత్మను పరాజితం చేస్తాయన్న పాతకాలపు భ్రమ పటాపంచలైంది. పరమాత్మ సర్వసమృద్ధిని అప్పటికప్పుడే ఆకళించుకొన్నాను. వారణాసి ఆశ్రమంలో నేర్చుకొన్న ఈ గుణపాఠం ఉపయోగాన్ని రుజువుచేసే సందర్భం, అనంత యాత్రగాసాగిన నా అనంతర జీవితంలో, ఎన్ని అపరిచిత నగరాల్లో వచ్చిందో!

కలకత్తా నుంచి వచ్చేటప్పుడు నాతో వచ్చిన ఒకేఒక విలువైన వస్తువు, మా అమ్మ దగ్గర్నించి నాకు సంక్రమించిన వెండి రక్ష రేకు- నా చిన్నప్పుడు మా అమ్మకి ఒక సాధువు ఇచ్చినది. కొన్నేళ్ళుగా దాన్ని నేను కాపాడుకుంటూ, ఇప్పుడు ఆశ్రమంలో నా గదిలో జాగ్రత్తగా దాచిపెట్టాను. ఒకనాడు పొద్దున నేను, రక్షరేకును మళ్ళీ ఒకసారి చూసుకొని ఆనందిద్దామని తాళంవేసిన పెట్టె తెరిచాను, సీలు వేసిన కవరును ఎవరూ తాకనయినా లేదు; కాని రక్షరేకు మాయమయింది! అది పోయినందుకు ఎంతో బాధపడుతూ, కవరు చింపి చూసుకొని, నేను పొరపాటు పడ్డానికి అవకాశం లేదని రూఢి చేసుకున్నాను. ఆ సాధువు జోస్యం చెప్పిన ప్రకారమే, ఆయన శూన్యంలోంచి తెప్పించి ఇచ్చినది తిరిగి శూన్యంలోనే కలిసి పోయింది.

దయానందుల అనుయాయులతో నా సంబంధం క్రమంగా చెడిపోతూ వచ్చింది. కావాలని నేను వాళ్ళకి దూరంగా ఉంటున్నందువల్ల నొచ్చుకొని, వాళ్ళూ నాకు దూరమయారు. ఏ ఆశయంతో నేను ఇంటినీ, ప్రాపంచికమయిన ఆశల్నీ అన్నిటినీ వదులుకుని దైవధ్యాన నిష్ఠకు కట్టుబడి ఉన్నానో ఆ ఆశయమే అన్ని వేపులనించీ నిస్సారమైన విమర్శకు గురిఅవుతూ వచ్చింది.

ఆధ్యాత్మికమైన పరివేదనతో మనస్సు కకావికలై, ఒకనాడు తెల్లవారగట్ల నేను అటకమీదికి వెళ్ళి, భగవంతుడు నా నొక సమాధానం అనుగ్రహించే వరకు ప్రార్థన చేయ్యాలని నిశ్చయించుకున్నాను.

“దయామయి జగన్మాతా, దివ్యదర్శనాల ద్వారా నువ్వయినా నాకు జ్ఞానబోధ చెయ్యి; లేకపోతే నువ్వు పంపే గురువుద్వారా నయినా బోధించు!”

గంటల తరబడిగా నేను వెక్కి వెక్కి ఏడుస్తూ పెట్టుకొన్న మొరకు సమాధానం రాలేదు. ఇంతలో హఠాత్తుగా, అనంతమైన ఒక వలయాకార మండలంలోకి నన్ను సశరీరంగా లేవనెత్తినట్టు అనిపించింది. “నీ గురువు ఈరోజునే వస్తున్నాడు!” దివ్యమైన ఒక స్త్రీ కంఠస్వరం అన్నివేపులనుంచీ అవ్యక్తంలోంచి వినవచ్చింది.

ఇంతలో ఒక నిర్దిష్ట ప్రదేశంనుంచి కేక వినిపించడంతో నా అతీంద్రియానుభూతి పటాపంచలైంది. వంటింట్లోంచి, హాబు అనే మారు పేరుగల యువ పురోహితుడు పిలుస్తున్నాడు నన్ను.

“ముకుందా, ఇంక ధ్యానం చాలు! నువ్వో పనిమీద వెళ్ళాలి!”

మరోనాడయితే నేను ఓర్పు పట్టకుండా జవాబు ఇచ్చి ఉండేవాణ్ణి; ఇప్పుడు మాత్రం కన్నీళ్ళతో ఉబ్బిన మొహం తుడుచుకుని అణకువగా అతని మాట మన్నించాను. హాబుతో కలిసి, ఎక్కడో దూరంగా బెంగాలీ బస్తీలో ఉన్న బజారుకు బయల్దేరాను. బజారులో మేము సరుకులు కొనడం పూర్తి అయేసరికి సూర్యుడింకా నడినెత్తికి రాలేదు. ఇల్లాళ్ళు, గైడ్లు, పురోహితులు, సాదాబట్టలు కట్టుకున్న వితంతువులు, హుందాగా ఉండే బ్రాహ్మలు, ఎక్కడపడితే అక్కడ కనిపించే ఆంబోతులతోను మంచి రద్దీగా ఉన్న వీధిలో ముందుకు చొచ్చుకుంటూ వెళ్ళాం, నేనూ హాబూ ఆలా సాగిపోతూ ఉండగా, అతిసాధారణమైన ఒక సన్నటి సందువేపు తల తిప్పి చూశాను.

ఆ సందు చివర, స్వాములవారి మాదిరిగా కాషాయవస్త్రాలు ధరించిన క్రీస్తువంటి మహాపురుషు లొకరు నిశ్చలంగా నిలబడి ఉన్నారు. ఆ క్షణంలోనే కాక, యుగయుగాలుగా కూడా నాకు తెలిసినవారిలా కనిపించారాయన. ఒక్క క్షణం, నా చూపు ఆబగా ఆయన మీదే నిలిచింది. కాని ఇంతలోనే మళ్ళీ మనస్సులో ఒక శంక పుట్టింది.

“దేశాటనం చేసే ఈ సన్యాసిని చూసి, ఎవరో నీకు తెలిసినాయన అనుకొని పొరపడుతున్నావు.” అనుకున్నాను. “కలలు కనేవాడా, ముందుకు నడు.”

పది నిమిషాలయేసరికి నా పాదాలు బాగా తిమ్మిరెక్కేసినట్టు అనిపించింది. కాళ్ళు రాళ్ళయిపోయినట్టయి, అడుగు ముందుకు పడనియ్యలేదు. ఎంతో శ్రమపడి వెనక్కి తిరిగాను; వెంటనే నా పాదాలు మళ్ళీ మామూలుగా అయిపోయాయి. తరవాత మళ్ళీ ఇటు తిరిగాను; విచిత్రమైన బరువు నన్ను అణిచేసింది.

“ఆ సాధువుగారు అయస్కాంత శక్తితో నన్ను దగ్గరికి లాక్కుంటున్నారు!” ఇలా అనిపించేసరికి నా దగ్గరున్న పొట్లాలు హాబూ చేతుల్లో పెట్టేశాను. అతను నేను వేసే తప్పటడుగులు ఆశ్చర్యంగా గమనిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు విరగబడి నవ్వాడు.

“ఏమయింది నీకు? పిచ్చెక్కిందా?”

నాలో పొంగిపొర్లే భావావేశం, అతనికి ఎదురుదెబ్బ కొట్టనియ్యకుండా అటకాయించింది. మారు పలక్కుండా అక్కణ్ణించి పరిగెత్తాను.

పాదాలకు రెక్కలు మొలిచినవాడి మాదిరిగా, అడుగులు గాలిలో తేలిపోతూ ఉండగా ఆ సన్నటి సందు దగ్గరికి చేరాను. నేనున్న వేపే నిలకడగా చూస్తున్న ప్రశాంతమూర్తి చటుక్కున నా కంట బడ్డారు. ఆత్రంగా కొన్ని అడుగులు వేసేసరికి ఆయన పాదాల దగ్గరున్నాను.

“గురుదేవా!” వెయ్యి దివ్యదర్శనాల్లో నా కళ్ళకు కట్టిన దివ్య ముఖబింబం ఇదే. కొనదేరిన గడ్డంతో, గిరజాల జుట్టుతో సింహాన్ని తలపించే తల! శుభదృష్టి ప్రసరించే ఈ కళ్ళు, రాత్రివేళల్లో నేను అస్తవ్యస్తమైన ఆలోచనలతో విషాదంలో మునిగి ఉన్నప్పుడు నా వేపు గుచ్చిగుచ్చి చూస్తూండేవి; వాటిలో నాకు, పూర్తిగా అర్థంకాని ఆశాభావ మేదో పొడగడుతూ ఉండేది.

“నా తండ్రీ! వచ్చేశావా!” అంటూ గురుదేవులు, ఆనందంతో తబ్బిబ్బయి వణుకుతున్న గొంతుతో, బెంగాలీ భాషలో మళ్ళీమళ్ళీ అన్నారు. “ఎన్నేళ్ళు కాచుకొని ఉన్నాను బాబూ నీ కోసం!”

మే మిద్దరం మౌనంలో ఐక్యమయాం. మాటలు బొత్తిగా అనవసర మనిపించాయి. అనర్గళ వాగ్ఝరి, నిశ్శబ్ద మంత్రరూపంలో గురుదేవుల గుండెలోంచి నేరుగా శిష్యుడిలోకి ప్రవహించింది. నా గురుదేవులు దైవసాక్షాత్కారం పొందినవారనీ నన్ను వారు దైవసన్నిధికి చేరుస్తారని నిరాక్షేపమైన అంతర్దృష్టివల్ల తెలుసుకున్నాను. ఈ జీవితంలో అలుముకున్న చీకటి, గతజన్మల జ్ఞాపకాలనే చిరు పొద్దుపొడుపుతో అదృశ్యమయిపోయింది. నాటకీయం కాలం! చక్రగతిలో ఆవృత్తమయే గతం, వర్తమానం, భవిష్యత్తు దాని దృశ్యాలు. ఈ పవిత్ర పాదసన్నిధిలో నన్ను గమనించిన తొలిపొద్దు ఇది కాదు!

గురుదేవులు నా చెయ్యి పట్టుకుని, ఆ ఊళ్ళో రాణామహల్ బస్తీలో ఉన్న ఒక ఇంటికి తీసుకువెళ్ళారు. క్రీడాకారుడి మాదిరిగా బలిష్ఠదేహు లయిన ఆయన నడక దృఢగతిలో సాగింది. పొడుగ్గా, నిటారుగా ఉన్న ఆయనకి అప్పటికి ఏభై ఐదేళ్ళున్నప్పటికీ యువకుడిలా మంచి చురుగ్గా, సత్తువలో ఉన్నారు. ఆయన కళ్ళు నల్లగా, విశాలంగా, ప్రగాఢమైన జ్ఞానంతో నిండి, అందంగా ఉన్నాయి. కొద్దిగా వంకులు తిరిగిన జుట్టు, ఆయన ముఖగాంభీర్యానికి మార్దవం చేకూర్చింది. బలం సాధుత్వంతో సూక్ష్మరూపంలో మేళవించింది.

గంగకు ఎదురుగా ఉన్న, ఆ ఇంటి రాతి బాల్కనీలోకి మేము వెడుతూ ఉండగా, ఆయన ఆప్యాయంగా ఇలా అన్నారు: “నా ఆశ్రమాలూ, నా సర్వస్వమూ నీ కిచ్చేస్తాను.”

“స్వామీ, నేను వచ్చింది. కేవలం జ్ఞానంకోసం, దైవసాక్షాత్కారం కోసం, నేను మీ దగ్గర పొందగోరే నిధులు అవీ!”

మా గురుదేవులు మళ్ళీ మాట్లాడేలోగా, భారతదేశ సాయం సంధ్య చటుక్కున అరతెర జార్చింది. ఆయన కళ్ళలో లోతు అందని ఆర్ద్రత నిండి ఉంది.

“నీకు బేషరతుగా నా ప్రేమ అందిస్తాను.”

ఆమూల్యమైన వాక్కులు! ఆయన ప్రేమకు రుజువు, మళ్ళీ నా చెవిని పడ్డానికి, తరవాత పావు శతాబ్ది పట్టింది. ఆయన పెదవులు భావోద్రేకాన్ని ఎరగవుచ మహా సముద్రంలాంటి ఆయన హృదయానికి ఒప్పినది మౌనమే.

“నువ్వు కూడా అలాగే బేషరతుగా నాకు ప్రేమ అందిస్తావా?” శిశుసహజమైన నమ్మకం నింపుకొన్న కళ్ళతో ఆయన నా కేసి చూశారు.

“మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను, గురుదేవా!”

“మామూలు ప్రేమ స్వార్థంతో కూడుకున్నది; తామస ప్రధాన మైన కోరికల్లోకీ తృప్తుల్లోకి దాని వేళ్ళు పారి ఉంటాయి. కాని దివ్య ప్రేమ షరతులు లేనిదీ, ఎల్లలు లేనిదీ, మార్పు లేనిదీ. భేదకమైన విశుద్ధ ప్రేమ స్పర్శతో, మానవ హృదయానికి చాపల్యం మటుమాయమయిపోతుంది.” నమ్రతతో, ఆయన ఇంకా ఇలా అన్నారు: “నే నేప్పుడైనా దైవ సాక్షాత్కార స్థితినించి దిగజారుతున్నట్టు కనక నీకు కనిపిస్తే, నువ్వు నా తల ఒళ్ళో పెట్టుకొని, మనమిద్దరం కొలిచే విశ్వప్రేమయుడైన భగవంతుడి సన్నిధికి మళ్ళీ నన్ను తీసుకువస్తానని మాట ఇయ్యి.

చీకటి ముసురుతూ ఉండగా ఆయన లేచి, నన్ను లోపలి గదిలోకి తీసుకువెళ్ళారు. మే మిద్దరం మామిడిపళ్ళూ బాదం మిఠాయి తింటూ ఉండగా, నా స్వభావం తమకు బాగా సన్నిహితంగా తెలుసునన్న సంగతి ఆయన మా సంభాషణ క్రమంలో అలవోకగా తెలియజేశారు. సహజమైన నమ్రతలో అద్భుతంగా మేళవించిన ఆయన జ్ఞానసంపత్తికి విస్మితుణ్ణి అయాను.

"నీ రక్షరేకు కోసం విచారించకు. దాని అవసరం తీరిపోయింది.” గురుదేవులు, దివ్యదర్పణం మాదిరిగా నా యావజ్జీవిత ప్రతిబింబాన్ని ఆకట్టుకున్నారు.

“గురుదేవా, ప్రత్యక్ష వాస్తవముయిన మీ సన్నిధి ఇచ్చే ఆనందం ఏ సంకేతం ఇస్తుంది?”

“ఆశ్రమంలో నువ్వు సుఖంగా లేవు కాబట్టి అక్కణ్ణించి మారి పోవలసిన సమయం వచ్చింది.”

అంతవరకు నా జీవితానికి సంబంధించిన సంగతులేవీ నేను ఆయన దగ్గర ప్రస్తావించలేదు; ఇప్పుడవి అనావశ్యకాలనిపించాయి. ఆయన సహజమైన, సరళవైఖరిని బట్టి, తమ దివ్యదృష్టికి నేను ఆశ్చర్యం వెలిబుచ్చాలని ఆయన కోరడంలేదని గ్రహించాను.

“నువ్వు తిరిగి కలకత్తా వెళ్ళాలి. నీ సర్వమానవ ప్రేమ పరిధిలోంచి చుట్టాల్నెందుకూ మినహాయించడం?”

ఆయన సూచనకు నాకు దిగులు కలిగింది, మావాళ్ళు నన్ను తిరిగి రమ్మంటూ ఉత్తరాల్లో అనేకసార్లు వెల్లడించిన కోరికను నేను మన్నించ నప్పుటికీ నేను తిరిగి వస్తాననే, వాళ్ళు జోస్యం పలుకుతూ వచ్చారు. “పిల్లపక్షిని అధిభౌతిక ఆకాశంలో విహరించనియ్యండి,” అని వ్యాఖ్యానించా డొకసారి అనంతన్నయ్య. “ఆ దట్టమయిన వాతావరణంలో, వాడి రెక్కలు అలిసిపోతాయి. మళ్ళీ ఇంటివేపు దిగివచ్చి, రెక్కలు ముడుచుకొని అణకువగా ఇంటిపట్టున విశ్రాంతి తీసుకోడం చూడకపోము.” నన్ను నిరుత్సాహపరిచే ఈ ఉపమానం ఇంకా నా మనస్సులో ఉన్నందువల్ల ఏమయినా సరే, కలకత్తా వేపు పోనేకూడదని నిర్ధారణ చేసుకున్నాను.

“స్వామీ, నేను ఇంటికి మాత్రం తిరిగి వెళ్ళనండి. కానీ మీ వెంట ఎక్కడయినా సరే వస్తాను. మీ పేరూ ఎడ్రస్సూ చెప్పండి.”

“స్వామి శ్రీయుక్తేశ్వర్‌గిరి. నా ముఖ్యమైన ఆశ్రమం శ్రీరాం పూర్‌లో రాయ్‌ఘాట్ సందులో ఉంది. మా అమ్మని చూసి కొన్నాళ్ళిక్కడ ఉండి వెళ్దామని వచ్చాను.”

దేవుడు తన భక్తులతో ఆడే ఆట ఎంత తికమకగా ఉంటుందోనని ఆశ్చర్యపోయాను. శ్రీరాంపూర్ కలకత్తాకి పన్నెండుమైళ్ళలో ఉంది. కాని ఆ ప్రాంతాల్లో ఎక్కడా మా గురువుగారు నాకు అగదగల్లేదు. మేము కలుసుకోడానికి, లాహిరీ మహాశయుల జ్ఞాపకాలతో పావనమైన ప్రాచీన కాశీ (వారణాసి) నగరానికి ప్రయాణం కట్టవలసి వచ్చింది. బుద్ధుడు, శంకరాచార్యులు,[5] ఆ తదితర యోగీశ్వరుల పాదస్పర్శతో పవిత్రమైంది ఈ నేల. “నువ్వు నాలుగు వారాల్లో నా దగ్గరికి వస్తావు.” మొట్టమొదటి సారిగా, శ్రీయుక్తేశ్వర్‌గారి కంఠస్వరం కఠినంగా వినిపించింది. “నీ మీద నాకున్న అనంతమైన ఆప్యాయతను గురించి నీ కిప్పుడు చెప్పాను కనక, నిన్ను చూసినందుకు నా సంతోషం కనబరిచాను కనక, కావాలంటే నా కోరికను నువ్వు స్వేచ్ఛగా తిరస్కరించవచ్చు. మళ్ళీసారి మనం కలుసుకున్నప్పుడు, నువ్వే నాకు తిరిగి ఆసక్తి కలిగించవలసి ఉంటుంది. నిన్నంత సులువుగా శిష్యుడిగా చేర్చుకోను; నా కఠిన శిక్షణకు విధేయుడవై పూర్తిగా తల ఒగ్గాలి.”

నేను మొండిపట్టు మీద మౌనంగా ఉన్నాను. గురుదేవులు నా కష్టాన్ని, తొందరగానే కనిపెట్టారు.

“మీ చుట్టాలు నిన్ను చూసి నవ్వుతారంటావా?”

“నేను తిరిగి వెళ్ళను.”

“నువ్వు ముప్ఫై రోజుల్లో తిరిగి వెడతావు.”

“ఎన్నడూ జరగదు.”

మా వివాదంలో బింకం సడలకపోవడంతో, నేను ఆయన పాదాలకు భక్తి పురస్సరంగా ప్రణామం చేసి అక్కణ్ణించి వెళ్ళిపోయాను. అర్ధరాత్రి చీకట్లో ఆశ్రమం వేపు నడిచి వెళ్తూ, అలౌకిక ఘటనగా జరిగిన ఈ సమాగమం ఇలా విరసంగా ఎందుకు మగిసిందా అని వితర్కించుకున్నాను. మాయ అనే తక్కెడ సిబ్బులు రెండూ ప్రతి సంతోషాన్ని ఒక దుఃఖంతో సమానంచేసి తూస్తాయి. పరివర్తన కారకాలయిన, గురుదేవుల చేతివేళ్ళకు నా కిశోర హృదయం ఇంకా మెదువు కాలేదు.

మర్నాడు పొద్దున, ఆశ్రమవాసుల్లో నా మీద పెడసరిభావం మరింత పెరగడం గమనించాను. అక్కడున్నన్నాళ్ళూ నన్ను సూటిపోటి మాటలతో పొడిచి వేధించారు. మూడు వారాలు గడిచాయి. బొంబాయిలో జరిగే ఒక సమావేశం నిమిత్తం దయానందులు ఆశ్రమం విడిచి వెళ్ళారు. అప్పుడు దురదృష్టవశాత్తు అంతా నా మీద విరుచుకుపడ్డారు.

“ముకుందుడు తేరగా తిని కూర్చుంటాడు. ఆశ్రమంలో పడి తినే దానికి తగ్గంత పని చెయ్యనే చెయ్యడు. ఈ వ్యాఖ్యానం చాటునుంచి విని నా డబ్బు నాన్నగారికి తిప్పి పంపెయ్యమన్న సలహా పాటించినందుకు మొట్టమొదటి సారిగా విచారించాను. గుండె బరువెక్కి పోవడంతో నాకున్న ఒకే ఒక స్నేహితుడు – జితేంద్ర దగ్గరికి వెళ్ళాను.

“నేను వెళ్ళిపోతున్నాను. దయానందులు తిరిగి వచ్చిన తరవాత ఆయనకి నా క్షమాపణలు తెలియుజెయ్యి.”

“నేనూ వచ్చేస్తాను. ఇక్కడ ధ్యానంచేసుకోడానికి నేను చేసే ప్రయత్నాలన్నీ నీ వాటికి మించి ఫలించడం లేదు.” జితేంద్రుడు దృఢనిశ్చయంతో అన్నాడు.

“ఈమధ్య నేను క్రీస్తులాటి యోగీశ్వరుల్ని కలుసుకున్నాను- శ్రీరాంపూర్‌లో ఆయన దర్శనం చేసుకుందాం.”

ఈ విధంగా “పక్షి”, ప్రమాదకరమైన రీతిలో కలకత్తాకి దగ్గరలో “దిగడానికి” తయారయింది.

  1. “సంస్కృత” మంటే, “మెరుగు దిద్దినది, సంపూర్ణమైనది” అని అర్థం. ఇండో యూరోపియన్ భాషలన్నిటికి సంస్కృతం పెద్దక్క. దీని అక్షర లిపిని “దేవనాగరి” అంటారు; అంటే “దేవతానిలయం” అని వాచ్యార్థం. ప్రాచీన భారతదేశపు భాషాశాస్త్రవేత్త పాణిని, గణితశాస్త్రీయంగానూ మనోవైజ్ఞానికంగానూ సంస్కృతానికున్న పరిపూర్ణతను ప్రశంసిస్తూ, “నా వ్యాకరణం తెలిసినవాడు దేవుణ్ణి తెలుసుకుంటాడు,” అన్నాడు. నిజానికి, భాషోత్పత్తిక్రమానికి మూలం కనుక్కొనేవాడు చివరికి సర్వజ్ఞుడవుతాడు.
  2. సమయం వచ్చేసరికి పులులమీద రోత పుట్టిన జతీన్‌దా (జోతీన్ ఘోష్) కా డితను.
  3. దేవుణ్ణి చేరే దారి, ప్రాథమికమైన మార్గం.
  4. ప్రేమించే బంధువులతోబాటు మనకు వరాలన్నీ ప్రసాదించే– ఆ మాటకు వస్తే, ఈ జీవితాన్నే ప్రసాదించిన- దేవుణ్ణి అన్వేషించడానికి భక్తుడికి, సంసారబంధం అవరోధం కలిగించేటట్లయితే, అటువంటి అనుబంధం ‘మాయ’ అని హిందువుల పవిత్ర గ్రంథాలు ఉద్బోధిస్తున్నాయి. ఏసుక్రీస్తు కూడా అలాగే చెప్పాడు; “నాకంటె తన తల్లినిగాని తండ్రినిగాని ఎక్కువగా ప్రేమించేవాడు నావాడు కావడానికి అర్హుడు కాడు.” - మత్తయి 10 : 37 (బైబిలు).
  5. భారతదేశపు దార్శనికులందరిలోకీ గొప్పవాడయిన శంకరాచార్యులవారు (శంకరులు) గోవిందయతి శిష్యులు; గోవిందయతి గౌడపాదులవారి శిష్యులు, గౌడపాదాచార్యుల ‘మాండూక్య కారిక’కు శంకరులు రాసిన వ్యాఖ్యానం సుప్రసిద్ధమైనది. తిరుగులేని తర్కంతోనూ రమ్యమైన ప్రసన్న శైలిలోనూ శంకరులు, వేదాంత తత్త్వాన్ని కచ్చితంగా అద్వైత (రెండు కానటువంటి, ఏకేశ్వరతత్త్వ) పరంగా వ్యాఖ్యానించారు. ఈ మహాద్వైతి భక్తిపరమైన స్తోత్రాలు కూడా రచించారు. అమ్మవారిని ఉద్దేశించి వీరు చెప్పిన ‘దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం’లో మకుటం ఇలా ఉంటుంది. “కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి”: దుర్మార్గులైన కొడుకులు ఎందరో ఉన్నప్పటికీ దుర్మార్గురాలైన తల్లి ఎక్కడాఉండదు. శంకరుల శిష్యుడైన సనందనుడు ‘బ్రహ్మ సూత్రా’ లకు (వేదాంత తత్త్వం) భాష్యం రాశాడు. దాని రాతప్రతి అగ్నికి ఆహుతి అయిపోతే (దాన్ని ఒక్కసారి తిలకించిన) శంకరులు, దాంట్లో ఉన్న ప్రతిమాటా తిరిగి శిష్యుడికి అప్పజెప్పారు. ‘పంచపాదిక’ అన్న పేర ప్రసిద్ధమైన ఈ గ్రంథాన్ని ఈ నాటికీ పండితులు, అధ్యయనం చేస్తూ ఉంటారు. సనందనుడనే ఈ శిష్యుడికి మరో కొత్తపేరు రావడానికి చక్కని సంఘటన. ఒకటి జరిగింది. ఒకనాడు ఏటి ఒడ్డున కూర్చుని ఉన్న సనందనుడికి, అవతలి ఒడ్డునుంచి శంకరులు తనను పిలుస్తూ ఉండటం వినిపించింది. వెంటనే అతను నీళ్ళలోకి దిగాడు. అతని విశ్వాసానికీ పాదాలకూ కూడా ఊతగా శంకరులు తమ సంకల్పబలంతో, సుళ్ళు తిరిగే ఆ ఏటిలో తామరపూల బాదు ఒకటి సృష్టించారు; అతను వాటి మీంచి నడుచుకుంటూ వెళ్ళి, అవతలి ఒడ్డుకు చేరాడు. అప్పటినుంచీ ఆ శిష్యుడికి ‘పద్మపాదు’డనే పేరు వచ్చింది. ‘పంచపాదిక’లో పద్మపాదుడు తన గురుదేవులకు భక్తి ప్రపత్తులతో బహుదా జోహార్లు అర్పించాడు. శంకరులే స్వయంగా చక్కగా ఇలా రాశారు: “సద్గురువును పోల్చదగినది ఈ మూడు లోకాల్లోనూ మరొకటి లేదు. చింతామణి అన్నది నిజంగా ఉందనే అనుకున్నప్పటికీ, అది ఇనుమును బంగారంగా మార్చగలదే కాని మరో చింతామణిగా మార్చలేదు. కాని పరమపూజనీయుడైన గురువు, అలా కాకుండా, తన పాదాల్ని ఆశ్రయించిన శిష్యుణ్ణి తనంతవాణ్ణి చేస్తాడు- అంచేత సద్గురువు, సాటిలేనివాడే కాదు, లోకాతీతుడు.