ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 16

వికీసోర్స్ నుండి

అధ్యాయం : 16

గ్రహాల్ని ఓడించడం

“ముకుందా, నువ్వు జ్యోతిష సంబంధమైన [గ్రహదోష నివారకమయిన] దండ కడియం ఒకటి ఎందుకు సంపాదించకూడదూ?

“నేను సంపాదించాలా గురుదేవా? జ్యోతిషశాస్త్రంమీద నాకు నమ్మకం లేదండి.”

“నమ్మకమన్నది కాదిక్కడ ప్రశ్న; ఏ విషయాన్ని గురించి అయినా మనిషి ఏర్పరుచుకోవలసిన శాస్త్రీయ దృక్పథం, ఆ విషయం సత్యమా కాదా అన్నది. గురుత్వాకర్షణ నియమం న్యూటన్ తరవాత ఎంత సమర్థంగా పనిచేస్తోందో ఆయనకు ముందుకూడా అలా పని చేసింది. విశ్వనియమాలు, మానవుడి నమ్మకమనే ఒప్పుదల ఉంటేనేకాని పనిచెయ్యలేకపోయేటట్లయితే ఈ విశ్వం గందరగోళమయిపోతుంది.

“తెలిసీ తెలియని పండితమ్మన్యులు సనాతనమైన ఖగోళశాస్త్రాన్ని అప్రతిష్ఠపాలు చేశారు. జ్యోతిషశాస్త్రం, గణితశాస్త్రీయంగానూ[1] తాత్త్వి కంగానూ కూడా, గాఢమైన అవగాహన ఉన్నవాళ్ళు తప్ప తక్కినవాళ్ళు సరిగా గ్రహించలేనంత విశాలమయినది. అజ్ఞానులు అంతరిక్షలోకాల్ని తప్పుగా గ్రహించి, అక్కడ అక్షరాల బదులు పిచ్చిగీతల్నే చూసినట్లయితే, అపరిపూర్ణమయిన ఈ ప్రపంచంలో అది సహజమే ననిపిస్తుంది. అందుచేత ఇలాటి ‘జ్ఞాను’లతో బాటు జ్ఞానాన్ని కూడా తీసిపారెయ్య కూడదు. “సృష్టిలో భాగాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి; వాటి ప్రభావాల్ని పరస్పరం మార్చుకుంటూ ఉంటాయి. విశ్వానికున్న సంతులిత లయ ఈ పరస్పర ఆదానప్రదానాల్లో నెలకొని ఉంది,” అంటూ మా గురుదేవులు ఇంకా ఇలా అన్నారు: “మనిషి, తన మానవ ప్రకృతినిబట్టి రెండు రకాల శక్తుల్ని ఎదుర్కోవాలి - ఒకటి, పృథివ్యాపస్తేజోవాయు రాకాశా లనే పంచభూతాల కలయికవల్ల తనలో ఏర్పడ్డ కల్లోలాలు; రెండోది, ప్రకృతిలోని బాహ్య విఘటన శక్తులు. మానవుడు తన నశ్వరత్వంతో పెనుగులాడుతూ ఉన్నంతకాలం, భూమ్యాకాశాల్లో జరిగే అసంఖ్యాకమైన పరిణామాలవల్ల ప్రభావితుడవుతూనే ఉంటాడు.

“జ్యోతిష మన్నది, గ్రహాల ఉద్దీపనలకు మనిషిలో కలిగే ప్రతిస్పందనల్ని వివరించే శాస్త్రం. నక్షత్రాలకు ఉద్దేశపూర్వకమైన మిత్రభావంకాని, శత్రుభావంకాని ఉండవు; అవి కేవలం అనుకూల, ప్రతికూల కిరణాల్ని ప్రసరిస్తూ ఉంటాయంతే. వాటంతట అవి మానవులకు మేలూ చెయ్యవు, కీడూ చెయ్యవు; కాని ప్రతి మనిషీ గతంలో తాను గతి కల్పించిన కార్యకారణ సంతులనాల బాహ్య పరిక్రియకు అవి నియమబద్ధమైన ఒక మార్గాన్ని ఏర్పరుస్తాయి.

“ఫలానా రోజున, ఫలానా సమయంలో ఒక పసివాడు పుట్టాడంటే, ఖగోళకిరణాలు గణితశాస్త్రపరంగా అతని వైయక్తిక కర్మకు కచ్చితంగా అనుగుణమై ఉన్న సమయంలో వాడు పుట్టాడన్నమాట. అతని జాతకం, మార్చడానికి వీలులేని గతాన్నీ, సంభావ్యమైన అనాగత ఫలితాల్ని వెల్లడించే నిరాక్షేపణీయమైన ప్రతిరూపమన్నమాట. సహజావబోధం ఉన్నవాళ్ళే జాతక చక్రాన్ని సరిగా అన్వయంచేసి చెప్పగలరు; వీళ్ళు బహుకొద్ది.

“పసివాడు పుట్టిన సమయంలో ఆకాశంలో ప్రస్ఫుటంగా ప్రక టితమయ్యే సందేశం, విధిని – అంటే వెనకటి మంచి చెడ్డల కర్మఫలాన్ని – నొక్కిచెప్పడానికి కాదు; ప్రాపంచిక బంధంనుంచి బయటపడాలన్న ఇచ్ఛ మనిషిలో రగుల్కొల్పడానికే. తాను చేసినదాన్ని తాను మార్చుకోనూ గలడు. అతని జీవితంలో ఇప్పుడు ఏయే ఫలితాలు కనిపిస్తున్నాయో వాటికి మూలకారకుడు అతనే కాని మరెవరూ కాదు. అతను ఏ అవరోధాన్నయినా అధిగమించగలడు; దానికి కారణాలు ఏమిటంటే, అసలు ఆ అవరోధాన్ని కల్పించుకున్నది తానే కావడం ఒకటి, గ్రహాల ఒత్తిళ్ళకు లోబడని ఆధ్యాత్మికశక్తులు అతనికి ఉండడం ఒకటి.

“జ్యోతిషంమీద మూఢభక్తి మనిషిని, యాంత్రిక మార్గదర్శకత్వంమీద గట్టిగా ఆధారపడే మరమనిషిగా తయారుచేస్తుంది. కాని వివేకవంతుడు తన భక్తి ప్రపత్తులను సృష్టిమీదినుంచి సృష్టికర్తమీదికి మళ్ళించి తన గ్రహాల్ని ఓడిస్తాడు. అంటే తన గతాన్ని వమ్ముచేస్తాడు. పరమాత్మతో తనకుగల ఏకత్వాన్ని అతను ఎంత ఎక్కువగా గ్రహిస్తూంటే భౌతిక ప్రపంచం అతనిమీద ప్రాబల్యం వహించడం అంతగా తగ్గుతూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండేదే; దానికి పుట్టుక లేదు; కనక చావూలేదు. గ్రహ నక్షత్రాలు దానిమీద ఆధిపత్యం వహించలేవు.

“మనిషంటే ఆత్మ; దానికో శరీరం ఉంటుంది. అతను తానెవరో సరిగా తెలుసుకొన్నప్పుడు నిర్బంధకాల్ని అన్నిటినీ విడిచిపెట్టేస్తాడు. అతను ఆధ్యాత్మిక విస్మృతి అనే తన సాధారణస్థితిలో గందరగోళంలో పడి ఉన్నంతకాలం పరిసరనియమం తాలూకు సూక్ష్మశృంఖలాల్లో చిక్కుకొనే ఉంటాడు.

“దేవుడంటే సామరస్యం; దేవుడితో ఐక్యానుసంధానం పొందిన భక్తుడు ఏ పనీ తప్పుగా చెయ్యడు. అతని కార్యకలాపాలు జ్యోతిష నియమానుసారంగా సరిగా, సహజంగా జరగవలసిన సమయంలోనే జరుగుతాయి. గాఢంగా ప్రార్థన, ధ్యానం చేసిన తరవాత అతనికి దివ్య చైతన్యంతో సంపర్కమేర్పడుతుంది; ఆంతరికమైన ఆ రక్షణశక్తిని మించిన గొప్ప శక్తి మరొకటి ఏదీ లేదు.”

“అయితే, గురుదేవా, నన్ను జ్యోతిష సంబంధమైన దండకడియం వేసుకోమని ఎందుకంటున్నారు?” చాలాసేపు మౌనం వహించిన తరవాత నేను ఈ ప్రశ్న వెయ్యడానికి సాహసించాను; అంతవరకు నేను శ్రీ యుక్తేశ్వర్‌గారి గంభీరమైన వ్యాఖ్యానాన్ని ఒంటబట్టించుకోడానికి ప్రయత్నించాను, అందులో భావాలన్నీ నాకు చాలా కొత్త.”

“ప్రయాణికుడు తన గమ్యం చేరుకున్నప్పుడు మాత్రమే తన మ్యాప్‌లు తీసిపారెయ్యడం సబబు. ప్రయాణంలో సదుపాయంగా ఉండే ఏ అడ్డదారివల్ల నయినా, అతను లాభం పొందుతాడు. మానవుడు మాయలో ప్రవాసముండే కాలాన్ని తగ్గించడానికి సనాతన ఋషులు అనేక మార్గాలు కనిపెట్టారు. జ్ఞానసాధనంతో నేర్పుగా సర్దుబాటు చెయ్యగల కొన్నికొన్ని యాంత్రిక లక్షణాలు కర్మసూత్రంలో ఉన్నాయి.

“ఏదో ఒక విశ్వనియమోల్లంఘనవల్లనే మానవులకు కష్టాలు వస్తూంటాయి. మనిషి ఈశ్వరుడి సర్వశక్తిమత్వాన్ని నిరాదరించకుండానే ప్రకృతి నియమాల్ని పాటించాలని పవిత్రగ్రంథాలు సూచిస్తున్నాయి. ‘ప్రభూ, నిన్నే నమ్ముకున్నాను. నువ్వు నాకు సహాయం చెయ్యగలవని నాకు తెలుసు; అయినా నేను చేసింది ఏ తప్పయినా సరిదిద్దుకోడానికి నేను కూడా శాయశక్తులా, ప్రయత్నం చేస్తాను.’ అని చెప్పాలతను. ప్రార్థనవల్ల, సంకల్పశక్తి వల్ల, ధ్యానయోగంవల్ల, సాధుసత్పురుషులతో సంప్రదింపువల్ల , జ్యోతిషసంబంధమైన కడియాలు వేసుకోడంవల్ల అనేక సాధనాల ద్వారా, వెనకటి తప్పులవల్ల కలిగిన దుష్ఫలితాల్ని చాలావరకు తగ్గించుకోవచ్చు, లేదా నశింపు చేసుకోవచ్చు.

“పిడుగుపాటువల్ల తగిలే అదురుదెబ్బకు తట్టుకోడానికి ఇంటికి రాగితీగ అమర్చినట్లుగానే దేహమనే దేవాలయాన్ని కూడా కొన్ని పద్ధతుల్లో కాపాడుకోవచ్చు.”

“విద్యుత్, అయస్కాంత వికిరణాలు ఈ విశ్వంలో అవిచ్ఛిన్నంగా ప్రసరిస్తూ ఉన్నాయి; మనిషి శరీరానికి అవి మంచీ చెయ్యవచ్చు, చెరుపూ చెయ్యవచ్చు. అనేక యుగాల కిందట మన ఋషులు, సూక్ష్మమైన విశ్వవికిరణ ప్రభావాల దుష్ఫలితాల్ని పోగొట్టే సమస్యనుగురించి ఆలోచన చేశారు. స్వచ్ఛమైన లోహాలు గ్రహాల ప్రతికూలాకర్షణలకు శక్తిమంతమైన ప్రతిక్రియ చేసే సూక్ష్మకాంతిని విడుదలచేస్తాయని కనిపెట్టారు. కొన్ని ఓషధుల మేళనాలు కూడా సహాయకరంగా ఉంటాయని తేలింది. అన్నిటికన్న బాగా పనిచేసేవి, రెండు క్యారెట్లకు, తక్కువ బరువులేని నిఖార్సయిన రత్నాలు.

“జ్యోతిషశాస్త్రానికి వ్యవహారానుకూలంగా, దుష్ప్రభావాల్ని నిరోధించే ఉపయోగాలు ఉన్నాయి; కాని వాటినిగురించి భారతదేశానికి వెలుపల జరిగిన పరిశీలన మాత్రం చాలా తక్కువ. చాలామందికి తెలియని యథార్థం ఒకటి ఏమిటంటే, సరయిన రత్నాలు, లోహాలు, ఓషధులు, కావలసిన బరువు ఉంటేను, వాటిని ధరించినప్పుడు అవి చర్మాన్ని తాకుతూ ఉంటేను తప్ప వాటివల్ల ప్రయోజనం ఉండదు.”

“గురుదేవా, నేను తప్పకుండా మీ సలహా పాటించి ఒక కడియం సంపాదిస్తాను. గ్రహాన్ని ఓడించడమన్న ఆలోచన నన్ను ముగ్ధుణ్ణి చేస్తోంది!” “సాధారణ ప్రయోజనాలకయితే నేను, బంగారం, వెండి, రాగితో చేసిన కడియం వేసుకోమంటాను. కాని ఒక నిర్దిష్ట ప్రయోజనంకోసం నువ్వు వెండి, సీసంతో చేసింది సంపాదించాలి,” అని చెప్తూ శ్రీ యుక్తేశ్వర్‌గారు జాగ్రత్తకోసం కొన్ని సూచనలు కూడా చేశారు.

“గురుదేవా, ‘నిర్దిష్ట ప్రయోజనం’ అనడంలో మీ అబిప్రాయం ఏమిటి?”

“గ్రహాలు త్వరలో నీ మీద ‘అమిత్ర’ భావం చూపించబోతున్నాయి ముకుందా, భయపడకు; నీకు కాపుదల ఉంటుంది. సుమారు ఒక నెల్లాళ్ళలో నీ కాలేయం నిన్ను చాలా బాధపెడుతుంది. లెక్క ప్రకారం ఆ జబ్బు ఆర్నెల్లపాటు ఉండాలి. కాని నువ్వు వేసుకొనే జ్యోతిష సంబంధమైన కడియం, ఆ కాలాన్ని ఇరవైనాలుగు రోజులకు తగ్గించేస్తుంది.”

ఆ మర్నాడు నేనొక కంసాలిని పట్టుకుని, త్వరలోనే కడియం సంపాదించి వేసేసుకున్నాను. నా ఆరోగ్యం అద్భుతంగా ఉంది; గురుదేవుల జోస్యం నా మనస్సులోంచి ఎప్పుడో తొలగిపోయింది. గురువుగారు శ్రీరాంపూర్ నుంచి కాశీ వెళ్ళారు. మా సంభాషణ జరిగిన తరవాత ముప్ఫై రోజులకి, నా కడుపులో కాలేయందగ్గర హఠాత్తుగా నొప్పి వచ్చింది. అప్పటినించి కొన్ని వారాలపాటు యమబాధ పడ్డాను. గురువుగారిని తొందరపెట్టడం ఇష్టంలేక, ఈ పరీక్షకు ఒంటరిగానే తట్టుకోవాలనుకున్నాను.

కానీ ఇరవైమూడు రోజుల యమయాతన నా పట్టుదలని సడలించేసింది. కాశీకి రైలెక్కాను. అక్కడ శ్రీ యుక్తేశ్వర్‌గారు అసాధారణమైన ఆప్యాయతతో నన్ను పలకరించారే కాని, అంతరంగికంగా నా బాధలు చెప్పుకోడానికి అవకాశం ఇవ్వలేదు. ఆనాడు కేవలం ఆయన దర్శనం[2]కోసం చాలమంది భక్తులు వచ్చారు. జబ్బుతో బాధపడుతూ, నా సంగతి పట్టించుకునేవాళ్ళు లేక, అలా ఒక మూల కూర్చున్నాను. రాత్రి భోజనాలు అయాక కాని అతిథులు వెళ్ళలేదు. అప్పుడు మా గురుదేవులు, ఆ ఇంటికి అష్టభుజాకారంలో ఉన్న బాల్కనీలోకి రమ్మని పిలిచారు.

“నీ కాలేయం జబ్బుగురించి వచ్చి ఉంటావు.” శ్రీయుక్తేశ్వర్ గారి చూపు నన్ను తప్పించుకుంది; ఆయన అడపాతడపా, పడుతున్న వెన్నెలకు అడ్డువస్తూ, ఇటూ అటూ పచార్లు చేస్తున్నారు. “ఏది, ఇలా చూణ్ణియ్యి; నువ్వు ఇరవై నాలుగు రోజుల్నించి బాధపడుతున్నావుకదూ?”

“ఔనండి.”

“పొట్టకు సంబంధించి నేన్నీకు నేర్పిన వ్యాయామం చెయ్యి.”

“నే నెంత విపరీతంగా బాధపడుతున్నానో తెలిస్తే మీరు నన్నా వ్యాయామం చెయ్యమని అనేవారు కాదు. గురుదేవా!” అయినప్పటికీ ఆయన మాట మన్నించడానికి కొద్దిగా ప్రయత్నించాను.

“నొప్పి ఉందంటున్నావు నువ్వు, నీ కేమీ లేదంటున్నాను నేను. అటువంటి వైరుద్ధ్యాలు ఎలా ఉంటాయి?” మా గురుదేవులు నావేపు గుచ్చి గుచ్చి చూశారు.

నేను అప్రతిభుణ్ణయాను; నొప్పి మాయమయేసరికి ఆనందం పట్టలేకపోయాను. కొన్ని వారాలపాటు దాదాపు కంటికి కునుకు లేకుండా చేసిన ఎడతెగని యమబాధ మటుమాయమయిందని అనుభవమయింది. అటువంటి బాధ నా కెన్నడూ రానేలేదన్నట్టుగా, ఆయన మాటలతోనే మాయమయింది. కృతజ్ఞతాబద్ధుణ్ణయి నేను ఆయన పాదాలముందు వాలబోతున్నాను. చటుక్కున ఆయన నన్ను ఆపారు.

“మరీ పసిపిల్లాడివయిపోకు. లేచి, గంగమీద పడుతున్న వెన్నెల అందం చూసి ఆనందించు,” అన్నా రాయన. కాని ఆయన పక్కన నేను మౌనంగా నించుని ఉన్నప్పుడు, గురుదేవుల కళ్ళు సంతోషంతో మిలమిల్లాడాయి. నాకు స్వస్థత చేకూర్చినవాడు భగవంతుడే కాని తాము కారన్న అనుభూతి నాకు కలగాలని ఆయన ఆశిస్తున్నట్టుగా, ఆయన వైఖరినిబట్టి గ్రహించాను.

నేను నిజంగా, ఒకానొక మానవాతీత స్వరూపులతో కలిసి జీవించానన్న చిరకాలగతమైన, చిరవాంఛితమైన ఆనాటి అనుభవానికి జ్ఞాపక చిహ్నంగా నే నిప్పటికీ, సీసంతో కలిపి చేసిన ఆ వెండి కడియాన్ని ధరిస్తూనే ఉన్నాను. తరవాత కొన్ని సందర్భాల్లో నేను, రోగ విముక్తి కోసం నా స్నేహితుల్ని శ్రీ యుక్తేశ్వర్‌గారి దగ్గరికి తీసుకు వెళ్ళినప్పుడు ఆయన, రత్నాలు ధరించమనికాని కడియం[3] వేసుకోమనికాని తప్పకుండా చేప్పేవారు; వాటిని వాడడం జ్యోతిషశాస్త్రజ్ఞానంవల్ల కలిగిన లాభమంటూ మెచ్చుకునేవారు.

జ్యోతిషశాస్త్రాన్ని గురించి నాకు చిన్నప్పటినించీ వ్యతిరేకాభిప్రాయం ఉండేది. దానికి కారణం కొంతవరకు, చాలామంది దాన్ని గుడ్డిగా అనుసరిస్తున్నారన్న సంగతి నేను గమనించడం ఒకటి, “నువ్వు మూడుసార్లు పెళ్ళి చేసుకుంటావు; రెండుసార్లు భార్యను పోగొట్టుకుంటావు,” అంటూ మా ఇంటి సిద్ధాంతిగారు జోస్యం చెప్పడం ఒకటి. వివాహత్రయానికి బలికాబోయే మేకలా బాధపడుతూ ఈ విషయాన్ని గురించి నేను తీవ్రంగా ఆలోచించాను. “నీ రాత ఎలా ఉంటే అలా జరుగుతుందని సరిపెట్టుకోడం మంచిది,” అని వ్యాఖ్యానించారు మా అనంతు అన్నయ్య. “నువ్వు చిన్నతనంలో మూడుసార్లు ఇల్లు విడిచి హిమాలయాలవేపు పారిపోతావనీ కాని బలవంతంమీద నిన్ను తిరిగి తీసుకొస్తారనీ నీ జాతకంలో రాసి ఉంది. సరిగా అలాగే జరిగింది. నీ పెళ్ళి విషయంలో చెప్పిన జోస్యం కూడా అలాగే నిజమయి తీరుతుంది,” అన్నాడు.

ఈ జోస్యం పూర్తిగా అబద్ధమని, ఒకనాటి రాత్రి నాకు స్పష్టంగా అంతస్ఫురణ కలిగింది. నా జాతకం రాసిన కాగితంచుట్టను కాల్చేసి, దాని బూడిద ఎత్తి, ఒక కాగితం సంచిలో పోసి, దానిమీద ఇలా రాశాను: “పూర్వకర్మ బీజాల్ని దివ్యజ్ఞానాగ్నిలో కాలిస్తే కనక అవి మళ్ళీ మొలకెత్తలేవు.” ఆ సంచీ, స్పష్టంగా కంటబడేచోట పెట్టాను. అనంతుడు వెంటనే నా ప్రతిఘటన వ్యాఖ్యను చదివాడు.

“నువ్వు జాతకం కాయితాన్ని కాల్చినంత సులువుగా సత్యాన్ని నాశనం చెయ్యలేవు.” అంటూ వెటకారంగా నవ్వాడు మా అన్నయ్య.

నేను పెద్దవాణ్ణి కాకముందు, మా వాళ్ళు నాకు పెళ్ళి చేయ్యడానికి మూడుసార్లు ప్రయత్నంచెయ్యడం యథార్థమే. దేవుడిమీద నాకున్న ప్రేమ, గతాన్ని బట్టి జ్యోతిషం ఇచ్చే ప్రోత్సాహంకన్న చాలా ఎక్కువన్న సంగతి తెలిసి నేను, ప్రతిసారీ వాళ్ళ పథకాలకు[4] లోబడకుండా తప్పుకున్నాను. “మానవుడి ఆత్మసాక్షాత్కారం ఎంత ఎక్కువ గాఢమైతే అంత ఎక్కువగా అతడు తన సూక్ష్మ ఆధ్యాత్మిక స్పందనలతో విశ్వాన్నంతనీ ప్రభావితం చేస్తాడు; తాను మాత్రం దృగ్విషయిక చాంచల్యానికి అంత తక్కువగా ప్రభావితుడవుతాడు.” గురుదేవులు చెప్పిన ఈ మాటలు తరచుగా జ్ఞప్తికి వస్తూ నాకు ఉత్తేజం కలిగిస్తూ ఉంటాయి.

అప్పుడప్పుడు నేను, గ్రహస్థితుల్ని బట్టి నా జీవితంలో అత్యంత దుష్కాలాలేవో గ్రహించి చెప్పమని జ్యోతిష్కుల్ని అడుగుతూండేవాణ్ణి. అయినా ఆ కాలాల్లో నేను ఏ పని తల పెట్టినప్పటికీ దాన్ని నెరవేరుస్తూ ఉండేవాణ్ణి. అటువంటి సమయాల్లో అసాధారణమైన కష్టాల్ని ఎదుర్కొంటేనే కాని, ఆ తరవాత విజయం సిద్ధించేదికాదన్నమాట నిజం. కాని నా ప్రగాఢ విశ్వాసం సమర్థనీయమైనదేనని ఎప్పుడూ రుజువవుతూ ఉండేది; దైవరక్షణమీద విశ్వాసం, మానవుడికి దేవుడిచ్చిన సంకల్పబలాన్ని సరిగా ఉపయోగించుకోడం అన్నవి రెండూ గ్రహస్థితుల ప్రభావాలకన్న ఎక్కువ బలిష్ఠమైనవి.

ఒకడి జననకాలంలో ఉన్న గ్రహస్థితికి అర్థం, మానవుడు తన గతం చేతిలో కీలుబొమ్మ అని కాదని నేను తెలుసుకున్నాను. నిజాని కది అతడు గర్వించదగ్గ సాధనం; మానవుడు ప్రతి ఒక్క బంధాన్నీ తెంచుకొని స్వేచ్ఛ పొందాలన్న సంకల్పం అతనిలో రగుల్కొల్పడమే దాని ఉద్దేశం. భగవంతుడు ప్రతి మనిషినీ ఆత్మగా సృష్టించాడు; ప్రత్యేక వ్యక్తిత్వం ప్రసాదించారు. కాబట్టి స్తంభంగానో పరాన్న భుక్కు గానో తాత్కాలిక పాత్ర నిర్వహిస్తున్నప్పటికీ విశ్వవ్యవస్థ కది ఆవశ్యకమైనది. అతడు సంకల్పించినట్లయితే వెంటనే అంతిమస్వేచ్ఛ సంపాదించ గలడు; ఇది ఆంతరిక విజయాలమీదనే కాని బాహ్య విజయాలమీద ఆధారపడదు. శ్రీ యుక్తేశ్వర్‌గారు ఇప్పటి యుగానికి[5] 24,000 సంవత్సరాల అయనచక్రాన్ని అన్వయింపజేసే గణితశాస్త్ర విధానాన్ని కనిపెట్టారు. ఈ చక్రాన్ని రెండుగా విభజించి ఒకటి ఆరోహణ చాపంగాను, రెండోది అవరోహణ చాపంగాను పేర్కొన్నాను. ఒక్కొక్క చాపం కాలపరిమితి 12,000 సంవత్సరాలు. ప్రతి చాపంలోనూ ‘కలి, ద్వాపర, త్రేతా, సత్య’ యుగాలనే నాలుగు యుగా లుంటాయి. ఈ నాలుగు యుగాల్నీ గ్రీకుల మతానుసారంగా లోహ, కాంస్య, రజత, స్వర్ణయుగాలని అంటారు.

మా గురుదేవులు రకరకాల లెక్కలు కట్టి, ఆరోహణచాపంలోని కడపటి ‘కలియుగం’ అంటే లోహయుగం, క్రీ. శ. 500 ప్రాంతంలో మొదలయిందని నిర్ధారణ చేశారు. 1200 సంవత్సరాల కాలపరిమితిగల ఈ లోహయుగం, భౌతిక వాద ప్రధానమైన కాలం. ఇది క్రీ. శ. 1700 ప్రాంతలో ముగిసింది. ఆ సంవత్సరం ‘ద్వాపరయుగం’ ఆరంభమయింది. దీని కాలపరిమితి 2,400 సంవత్సరాలు. ఈ యుగం విద్యుచ్ఛక్తి అణుశక్తుల వికాసానికి టెలిగ్రాఫ్, రేడియో, విమానాలవంటి దేశ వ్యవధానాన్ని హరింపజేసే యంత్రాలకూ ప్రాముఖ్యం వహించే యుగం.

3,600 సంవత్సరాల కాలంగల ‘త్రేతాయుగం’ క్రీ.శ. 4,100 లో మొదలవుతుంది. టెలిపతీ (మానసిక ప్రసారం) ప్రసారాలగురించి, కాల వ్యవధానాన్ని హరింపజేసే ఇతర సాధనాలగురించి జనసామాన్యానికి తెలిసి ఉండడం ఈ యుగ లక్షణం. ఆరోహణచాపంలో కడపటి యుగమైన ‘సత్యయుగం’ కాలపరిమితి 4,800 సంవత్సరాలు. ఈ యుగంలో మానవమేధ సర్వోత్కృష్టంగా వికాసం చెందుతుంది, మానవుడు దైవనిర్ణీత పథకానికి అనుకూలంగా పనిచేస్తాడు.

ప్రపంచానికి అప్పుడు, 4800 సంవత్సరాల అవరోహణ స్వర్ణ యుగంతో ఆరంభమయే 12,000 సంవత్సరాల అవరోహణచాపం మొదలవుతుంది (క్రీ. శ. 12,500); క్రమశః మానవుడు, అజ్ఞానంలోకి దిగజారి పోతాడు. ఈ కాల చక్రభ్రమణాలు, దృగ్గోచర విశ్వం తాలూకు వైషమ్య సాపేక్షతారూపకమైన ‘మాయ’ ప్రదర్శించే శాశ్వత ఆవృత్తులు.[6] మాన వుల్లో, సృష్టికర్తతో తమకున్న విడదీయరాని దివ్య ఏకత్వాన్ని గురించిన స్పృహ పెరిగినకొద్దీ, వాళ్ళలో ఒకరి తరవాత ఒకరు మాయాద్వంద్వం నుంచి విముక్తి పొందుతారు.

గురుదేవులు, జ్యోతిషశాస్త్రవిషయంలోనే కాక, ప్రపంచ ధార్మిక గ్రంథాల విషయంలో కూడా నా అవగాహనను విస్తృతం చేశారు. పవిత్ర గ్రంథాల్ని ఆయన, మనస్సనే నిర్మల ఫలకం మీద పెట్టి, సహజావబోధ యుక్తమైన తర్కమనే శస్త్రంతో విశ్లేషిస్తూ ఉండేవారు; ప్రవక్తలు మౌలికంగా వ్యక్తంచేసిన సత్యాల్లోంచి పండితుల దోషాల్నీ ప్రక్షిప్తాల్నీ ఏరేస్తూ ఉండేవారు.

“చూపును ముక్కుకొన మీద నిలపాలి.” భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకానికి[7] తప్పుడు వ్యాఖ్యానమిది. ప్రాచ్య పండితులూ పాశ్చాత్య అనువాదకులూ చాలామంది దీన్ని అంగీకరించారు. గురుదేవులు దీన్ని వేళాకోళంగా విమర్శిస్తూ ఉండేవారు.

“యోగి అనుసరించే మార్గమే వింత మార్గం. దానికి తోడు అతన్ని మెల్లకన్ను తెప్పించుకోమని కూడా సలహా ఇవ్వడమెందుకు?” అనేవారు. ‘నాసికాగ్రం’ అన్న దానికి సరయిన అర్థం, ‘ముక్కుకు మూలమైన స్థానం’ అనే కాని ‘ముక్కుకొస’ అని కాదు. కనుబొమల మధ్య ఆధ్యాత్మిక దృష్టికి స్థానమైన చోట ముక్కు మొదలవుతుంది.”[8] సాంఖ్యయోగం[9]లో ఒక సూత్రంలో ఇలా ఉంది: “ఈశ్వరాసిద్ధేః ”[10] ( “సృష్టికి అధినేత, అనుమాన ప్రమాణంచేత కనుక్కోడానికి వీలయినవాడు కాడు!” లేదా “ఈశ్వరుణ్ణి నిరూపించడానికి ప్రమాణం లేదు”). ముఖ్యంగా ఈ సూత్రం మీద ఆధారపడి చాలామంది విద్వాంసులు, దర్శన శాస్త్రాన్నంతనీ నాస్తికవాదం అనేస్తున్నారు.

“ఈ శ్లోకంలో నాస్తికగుణం లేదు,” అని వివరించారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “అందులో సూచించేదల్లా, తుదినిర్ణయాలన్నిటికీ ఇంద్రియ జ్ఞానం మీదే ఆధారపడి ఉండే అజ్ఞానికీ, ఈశ్వరుణ్ణి నిరూపించే ప్రమాణం అజ్ఞాతంగానే ఉంటుందని; కాబట్టి దానికి అస్తిత్వంలేదని, ధ్యానోత్పన్న మైన అచంచల అంతర్దృష్టిగల నిజమైన సాంఖ్య దర్శనానుయాయులు, ఈశ్వరుడు ఉన్నాడనీ, తెలుసుకోడానికి వీలయినవాడనీ కూడా గ్రహిస్తారు.”

మా గురుదేవులు క్రైస్తవుల బైబిలును చక్కని స్పష్టతతో వ్యాఖ్యానించేవారు. బైబిలులోని అమృతతత్త్వాన్ని దర్శించగలగడం, “స్వర్గం, భూమి గతించిపోతాయి కాని నా మాటలు మట్టుకు గతించిపోవు" [11]అంటూ ముందెవ్వరూ పలకనంత నిష్కర్షగా, అత్యంత హర్షదాయకంగా క్రీస్తు చేసిన ప్రవచనంలోని సత్యాన్ని అవగాహన చేసుకోడం నేను నేర్చుకున్నది, క్రైస్తవమత సభ్యత్వంతో ప్రమేయంలేని మా హైందవ గురుదేవుల దగ్గర. భారతదేశపు మహాగురువులు, క్రీస్తుకు ఉత్తేజం కలిగించిన దివ్యాదర్శాల్నే అనుసరించి తమ జీవితాల్ని మలుచుకున్నారు: ఈ మహాపురుషులు. ఆయన తనవాళ్ళుగా చాటుకొన్న ఆత్మబంధువులు: “స్వర్గంలో ఉన్న నా తండ్రి ఇచ్ఛను అనుసరించే ప్రతివ్యక్తి నాకు సోదరుడు, సోదరి, తల్లి , "[12] క్రీస్తు ఇంకా ఇలా అన్నాడు: “నా మాట ననుసరించి మీరు ముందుకు సాగితేనే మీరు నిజంగా నాకు శిష్యులు; అప్పుడు మీకు సత్యం అవగతమవుతుంది; ఆ సత్యం మీకు విముక్తి కలిగిస్తుంది.”[13] అందాకా స్వేచ్ఛాజీవులయి, తమకు తామే ప్రభువులయి ఏకైక జగత్పితనుగురించి ముక్తిదాయకమైన జ్ఞానాన్ని ఆర్జించుకొన్న, క్రీస్తువంటి, భారతీయ యోగిపుంగవులు అమరబంధుకోటిలో అంతర్భాగమే:

“ఆదాము, అవ్వల కథ నాకు కొరుకుడు పడకుండా ఉందండి!” అన్నా నొక రోజున. వ్యంగ్యాత్మక కథలతో సతమతమవుతున్న తొలి కాలంలో కొంత ఉద్రేకంతోనే అన్నాను. “నేరం చేసిన జంటనే కాకుండా అప్పటికింకా పుట్టని ముందుతరాల అమాయకుల్ని కూడా ఎందుకు శిక్షించాడు దేవుడు?”

గురుదేవులకు నా అజ్ఞానంకంటె కూడా నా మాటల్లో తీవ్రతకే నవ్వు వచ్చింది. “సృష్టి ప్రకరణం (జెనిసిస్) చాలా గహనమైన ప్రతీకలతో కూడి ఉన్నది. కేవలం శబ్దార్ద వివరణవల్ల అవగాహన కాదు,” అని వివరించారు. “దాంట్లో చెప్పిన ‘జీవనవృక్షం’ మానవదేహం. వెనుబాము, తలకిందులుగా ఉండే చెట్టులాంటిది. మనిషి తలవెంట్రుకలు దానికి వేళ్ళు; అంతర్వాహక బహిర్వాహక నాడులు దానికి కొమ్మలు. నాడీమండలమనే వృక్షానికి మనం అనుభవించి ఆనందించదగ్గ ఫలాలు చాలా కాస్తాయి. శబ్దస్పర్శరూప రసగంధాలనే ఇంద్రియ జ్ఞానాలే ఆ ఫలాలు. మనిషి వీటిని హక్కుభుక్తం చేసుకోవచ్చు. కాని అతనికి, దేహోద్యానం ‘మధ్యలో’ ఉన్న ‘ఆపిల్’ పండు, అంటే లైంగికానుభవం, నిషిద్ధం.[14]

“అందులో చెప్పిన ‘సర్పం’, లైంగికనాడుల్ని ఉద్రేకపరిచే కుండలినీశక్తిని, సూచిస్తుంది. ‘ఆదాము’ వివేకానికి సంకేతం; ‘అవ్వ’ అనుభూతికి సంకేతం. ఏ మనిషిలోనయినా భావోద్రేకాన్ని అంటే స్త్రైణ స్పృహను, కామవాంఛ లోబరుచుకున్నట్లయితే అతని వివేకం, అంటే ఆదాము, నశించక తప్పదు.[15]

“దేవుడు తన సంకల్పబలంతో స్త్రీ పురుష శరీరాల్ని రూపొందించి మానవజాతిని సృష్టించాడు. ఈ కొత్తజాతికి ఆయన, తన మాదిరి ‘నిష్కళంక’ రీతిలో, లేదా దివ్యరీతిలో పిల్లల్ని సృష్టించే శక్తి ప్రసాదించాడు.[16] అంతవరకు వ్యష్టిగా పరమాత్మ ఆవిర్భావం సహజాతబద్ధమై, సంపూర్ణ తార్కిక వివేకశక్తులు లేని జంతువులకే పరిమితమై ఉంది. అందువల్ల భగవంతుడు మొట్టమొదటి మానవశరీరాన్ని సృష్టించి, వాటికి సాంకేతికంగా ఆదాము, అవ్వ (ఏడమ్ ఆండ్ ఈవ్) అని పేర్లు పెట్టాడు. ఊర్ధ్వగతిలో లాభకరమైన పరిణామం కోసం రెండు జంతువుల ఆత్మల్ని లేదా దివ్యసారాన్ని వాళ్ళలోకి ప్రవేశపెట్టాడు.[17]

ఆదాములో, అంటే పురుషుడిలో, వివేకం ప్రాధాన్యం వహించింది. అవ్వలో, అంటే స్త్రీలో, అనుభూతి ప్రాధాన్యం వహించింది. ఆ ప్రకారంగా భౌతిక లోకాలకు ఆధారభూతమై ద్వంద్వం లేదా ధ్రువత్వం అభివ్యక్తమయింది. పశుప్రవృత్తిపరమైన కుండలినీశక్తి మానవ మనస్సును ఏమార్చనంతకాలం వివేకం, అనుభూతి పరస్పర సహకారంతో ఆనంద స్వర్గధామంలో విహరిస్తాయి.

“కనక, మానవ శరీరం, కేవలం జంతువులనుంచి పరిణామ ఫలితంగా ఏర్పడ్డది కాదు; దేవుడి విశిష్ట సృష్టిద్వారా ఉత్పన్నమయినది. జంతురూపాలు సంపూర్ణ దివ్యత్వాన్ని వ్యక్తం చెయ్యలేనంత స్థూలమైనవి. మూలపురుషుడికీ మూలస్త్రీకీ అత్యద్భుతమైన మానసిక శక్తి - అంటే మెదడులో సర్వజ్ఞతా శక్తిసంపన్నమైన ‘సహస్రారకమలం’, వెన్నులో సున్నితంగా జాగృతమైన షట్చక్రాలు-విశిష్టంగా ప్రసాదించడం జరిగింది.

“తొలుత సృష్టించిన జంటలో నెలకొన్న దేవుడు, లేదా దివ్యచేతన, మానవ ఇంద్రియానుభూతు లన్నిటినీ అనుభవించమని చెప్పడం జరిగింది. ఒక్క కామవాసనల్ని తప్ప.[18] వంశవృద్ధికోసం మానవుల్ని హీనస్థాయి జంతుపద్ధతికి బందీని చేసే జననేంద్రియాల ఉపయోగాన్ని తొలగించడానికే వీటిని నిషేధించడం జరిగింది. అవచేతన మనస్సులో పశుప్రవృత్తి సంబంధమైన వాసనలు మళ్ళీ తలఎత్తకుండా చెయ్యడంకోసం దేవుడు చేసిన హెచ్చరికను మనిషి చెవిని పెట్టలేదు. ఆదాము, అవ్వ సంతానోత్పత్తి కోసం జంతు సహజమైన మార్గాన్ని అనుసరించి, పరిపూర్ణ మూల మానవుడికి సహజమైన స్వర్గానందస్థితినుంచి పతనమయారు. “తాము నగ్నంగా ఉన్నామని తెలిసి”నప్పుడు, దేవుడు హెచ్చరించినట్టుగానే, వాళ్ళలో అమరత్వబోధ నశించింది. శారీరకమైన పుట్టుక తరవాత శారీరకమైన గిట్టుక రావాలన్న భౌతికశాస్త్ర నియమానికి వాళ్ళు బానిస లయిపోయారు.

“అవ్వకు ‘సర్పం’ ఇవ్వజూపిన ‘మంచి-చెడ్డ’ల జ్ఞానం మాయలో మర్త్యులు అనుభవించి తీరవలసిన ద్వంద్వ భావాత్మకమైన, లేదా పరస్పర విరుద్ధమైన అనుభవాల్ని సూచిస్తుంది. మానవుడు, స్త్రీపురుష చైతన్యమనే అనుభూతి వివేకాల్ని దుర్వినియోగం చేసినందువల్ల భ్రాంతిలో పడి, దివ్య సృయంసమృద్ధి అనే స్వర్గవాటికలోకి ప్రవేశించే హక్కు కోల్పోయాడు.[19] తన ‘తల్లి దండ్రుల్ని’, అంటే ద్వంద్వప్రకృతిని ఏకీకృత సామరస్యానికి, అంటే ఈడెన్ వాటికకు, చేర్చి అక్కడ పునఃప్రతిష్ఠ చెయ్యవలసిన వ్యక్తిగతమైన బాధ్యత ప్రతి మానవుడి మీదా ఉంది.

శ్రీ యుక్తేశ్వర్‌గారు తమ ప్రసంగాన్ని ముగించగానే నేను, జెనిసిస్ గ్రంథం పుటలవేపు కొత్త గౌరవంతో చూశాను.

“పూజ్య గురుదేవా, ఆదాము అవ్వల సంతానంగా వారిపట్ల నెరవేర్చవలసిన సముచితమైన కర్తవ్యం నా హృదయంలో ఇప్పుడు మొట్ట మొదటిసారిగా స్పందిస్తోంది."[20]

  1. సనాతన హిందూ గ్రంథాల్లో ఉన్న ఖగోళశాస్త్ర సంబంధమైన ప్రస్తావనల్ని బట్టి పండితులు, గ్రంథకర్తల కాలాన్ని నిర్ధారణ చెయ్యగలుగుతున్నారు. ఋషుల శాస్త్రీయవిజ్ఞానం ఎంతో మహత్తరమైనది. జ్యోతిష సంబంధమైన వ్రతాదికాలు జరిపేందుకు శుభలగ్నాలు నిర్ణయించడానికి వీలైన, ఔపయోగికమైన విలువగల ఖగోళశాస్త్ర పరిజ్ఞానంలో హిందువులు క్రీ. పూ. 3100 నాటికే ఎంతో అభివృద్ధి సాధించారు. ఈ సంగతి సూచించే సునిశితమైన ఖగోళశాస్త్ర విషయాలు మనకు కౌషీల్‌కి బ్రాహ్మణంలో కనిపిస్తాయి. 1934 ఫిబ్రవరినెల ‘ఈస్ట్ వెస్ట్’ పత్రికలో ప్రచురించిన ఒక వ్యాసంలో జ్యోతిషాన్ని గురించి లేదా వైదిక ఖగోళశాస్త్ర గ్రంథావళిగురించి ఇలా ఉంది: “భారతదేశాన్ని ప్రాచీన దేశాలన్నిటికీ అగ్రస్థానంలో నిలిపి, విజ్ఞానాన్వేషకులకు దాన్ని పవిత్ర యాత్రాస్థలంగా చేసిన శాస్త్రీయ విజ్ఞానం దాంట్లో ఉంది. “బ్రహ్మగుప్త” అనే పేరుతో ఖగోళశాస్త్ర గ్రంథం ఒకటి ఉంది. ఇందులో, మన సూర్యమండలంలో ఉన్న గ్రహాల సూర్యకేంద్రక చలనం, భూభ్రమణమార్గ కక్ష్య, భూమికున్న గోళాకృతి, చంద్రుడి పరావర్తన కాంతి, ప్రతిరోజూ భూమి తన అక్షంమీద చేసే పరిభ్రమణం, పాలపుంతలో స్థిరనక్షత్రాల ఉనికి, గురుత్వాకర్షణ నియమంవంటివే కాక, కోపర్నికస్, న్యూటన్‌ల కాలం వరకు పాశ్చాత్య ప్రపంచానికి తెలియని వైజ్ఞానిక యథార్థాల్ని ఎన్నిటినో ఈ గ్రంథంలో చర్చించడం జరిగింది. “పాశ్చాత్య గణితశాస్త్రాభివృద్ధికి అమూల్యంగా ఉపకరించిన “అరబ్బీ అంకెలు” అనేవి భారతదేశం నుంచి అరబ్బుల ద్వారా యూరప్‌కు తొమ్మిదో శతాబ్దంలో వచ్చాయి. భారతదేశంలో ఈ అంకలేఖన ప్రణాళిక ప్రాచీనకాలంలోనే రూపొందింది. భారతదేశపు అపార వైజ్ఞానిక వారసత్వాన్ని గురించి మరికొంత సమాచారం ఈ కింది గ్రంథాల్లో కనిపిస్తుంది; సర్ పి. సి. రాయ్ రాసిన ‘హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ’లో, బి. ఎస్. సీల్ రాసిన ‘పాజిటివ్ సైన్సెస్ ఆఫ్ ఏన్షెంట్ హిందూస్’లో, బి. కె. సర్కార్ రాసిన ‘హిందూ ఎచీవ్‌మెంట్స్ ఇన్ ఎగ్జాక్ట్ సైన్స్’లో, ఆయనే రాసిన ‘ది పాజిటివ్ బాక్ గ్రౌండ్ ఆఫ్ హిందూ సోషియాలజీ’లో, యు. సి. దత్ రాసిన ‘మెటీరియా మెడికా ఆఫ్ ది హిందూస్’ లోను.
  2. ఒక సాధువును కేవలం చూసినంతమాత్రాన్నే లభించే అనుగ్రహం.
  3. అధ్యాయం : 25 చివరి అధోజ్ఞాపిక చూడండి.
  4. మావాళ్ళు నా కిచ్చి పెళ్ళిచెయ్యాలని చూసిన పెళ్ళికూతుళ్ళలో ఒకమ్మాయికి, ఆ తరవాత మా పినతండ్రిగారి అబ్బాయితో పెళ్ళి అయింది. అతని పేరు ప్రధాన్‌చంద్ర ఘోష్. శ్రీ ఘోష్ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు ఉపాధ్యక్షులుగా సేవచేస్తూ 1975 జనవరి 24 న కన్ను మూశారు (ప్రచురణకర్త గమనిక).
  5. ఈ ఆయన చక్రాన్నిగురించి శ్రీ యుక్తేశ్వర్‌స్వామివారు ‘కైవల్య దర్శనం’ (ది హోలీ సైన్స్) అనే పుస్తకంలో వివరించడం జరిగింది (యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, 21, యు. ఎన్. ముఖర్జీ రోడ్డు, దక్షిణేశ్వరం, పశ్చిమబెంగాలు, భారతదేశం.)
  6. ఇప్పటి ప్రపంచం ఆయుర్దాయం, శ్రీ యుక్తేశ్వర్‌గారు చెప్పిన 24,000 సంవత్సరాల అయనచక్రం కన్న చాలా దీర్ఘమైన విశ్వచంద్రంలోని కలియుగంలో ఒక అంతర్భాగంగా హిందువుల శాస్త్రగ్రంథాలు నిర్ణయించాయి. ఈ గ్రంథాల్లో చెప్పిన విశ్వచక్రం కాలవిస్తృతి 450,05,60,000 సంవత్సరాలు. ఇది ఒక సృష్టికల్పంగా లెక్కకు వస్తుంది; అంటే సృష్టికి ఒక దినం. ఇది ఇప్పటిరూపంలో మన గ్రహమండలానికి నిర్ధారణ చేసిన ఆయుఃప్రమాణ మన్న మాట. ఋషులు ఇచ్చిన ఇంత పెద్దసంఖ్య సౌరసంవత్సరం పొడుగుకూ ‘పై’ (అంటే, ఒక వృత్తం చుట్టుకొలతకూ వ్యాసానికీ ఉండే అనుపాతం ఈ ; 1.1416) గుణిజానికి ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉంది. ప్రాచీన ద్రష్టల దృష్టిలో అఖండ బ్రహ్మాండం ఆయుర్దాయం 514, 15900, 00, 00, 000 సౌరసంవత్సరాలు; అంటే “ఒక బ్రహ్మయుగం” హిందూ పవిత్ర గ్రంథాల్లో, మనం నివసించే భూమిలాంటి గ్రహం లయం కావడానికి కారణాలు రెండు చెప్పారు: లోకంలో ఉండేవాళ్ళు మొత్తమంతా పూర్తిగా మంచివాళ్ళయినా అయిపోవడం, లేదా పూర్తిగా చెడ్డవాళ్ళయినా అయిపోవడం. ఈ రెండింటిలో ఏ ఒక్కదానివల్లనయినా ప్రళయం సంభవించవచ్చునన్నారు. ఈ విధంగా లోకమానసం ఒకానొక శక్తిని ఉద్భూతం చేస్తుంది; ఆ శక్తి, భూమ్యాకారంలో సంఘటితమై ఉన్న బంధితాణువుల్ని విడుడల చేస్తుంది. ఇదుగో, ప్రపంచ ప్రళయం రాబోతోందంటూ అప్పుడప్పుడు భయంకరమైన ప్రకటనలు ప్రచురిస్తూ ఉంటారు. అయినప్పటికీ గ్రహచక్రభ్రమణాలు ఒకక్రమబద్ధమైన దివ్య ప్రణాళిక ప్రకారం కొనసాగుతూనే ఉన్నాయి. భూప్రళయ మేదీ కనుచూపుమేరలో లేదు; ప్రస్తుత రూపంలో మన గ్రహానికి ఇంకా అనేకమైన ఆరోహణ, అవరోహణ అయనచక్రాలు గడవవలసి ఉన్నాయి.
  7. అధ్యాయం 4 : 13.
  8. “ఒంటికి వెలుతురు కన్ను : కనక నీది ఒక్కటే కన్నయితే నీ ఒళ్ళంతా వెలుతురుతో నిండినవే అవుతుంది; కాని నీ కన్ను చెరుపయితే నీ ఒళ్ళు కూడా అంతా చీకటితో నిండి ఉంటుంది. కనక నీలో ఉన్న వెలుతురు చీకటి అయిపోకుండా చూసుకో.” లూకా 11: 34-35.
  9. హిందూ తత్త్వశాస్త్రంలోని షడ్దర్శనాల్లో ఒకటి. ప్రకృతితో మొదలుకొని పురుషుడి (ఆత్మ) వరకు ఉండే ఇరవైఐదు తత్త్వాల పరిజ్ఞానం ద్వారా విముక్తి పొందవచ్చునని సాంఖ్యం ప్రబోధిస్తుంది.
  10. సాంఖ్యదర్శన సూత్రాలు, 1 : 92,
  11. మత్తయి 24 : 25.
  12. మత్తయి 12 : 50.
  13. యోహాను 8 : 31-32. సెంట్ జాన్ ఇలా ధ్రువపరిచాడు: “తనను స్వీకరించిన వాళ్ళందరికీ ఆయన, దేవుడి కుమాళ్ళు కాగల శక్తి ఇచ్చాడు; తన పేరు మీద విశ్వాసముంచినవాళ్ళకి సైతం ఇచ్చాడు (సర్వవ్యాపక కూటస్థ చైతన్యంలో స్థిరపడ్డవాళ్ళకి సైతం ఇచ్చాడు).” - యోహాను 1 : 12.
  14. “మనం తోటలో ఉన్న చెట్ల పండ్లు తినవచ్చు; కాని తోట మధ్యలో ఉన్న చెట్టు పండుమాత్రం మీరు తినగూడదనీ, మీలో ఏ ఒక్కరూ కూడా దాన్ని ముట్టుకోగూడదని లేకపోతే చనిపోతారనీ దేవుడు చెప్పాడు.” - జెనిసిస్ 3 : 2-3.
  15. “నాకు తోడుగా ఉండడానికి నువ్విచ్చిన ఆడది ఆ చెట్టుపండు నాకు ఇచ్చింది; నేను తిన్నాను. ఆ పాము నన్ను మభ్య పెట్టింది, నేను తిన్నాను అందా ఆడది.” - జెనిసిన్ 3:1 2-13.
  16. ఆ ప్రకారంగా దేవుడు మనిషిని తనకు ప్రతిరూపంగా సృష్టించాడు; దేవుడి రూపంలోనే అతన్ని సృష్టించాడు; స్త్రీపురుషుల్ని సృష్టించాడు. దేవుడు వాళ్ళని దీవించాడు; వాళ్ళతో ఇలా చెప్పాడు; ఫలవంతులై వంశాభివృద్ధి చెయ్యండి. భూమిని సుసంపన్నం చెయ్యండి; దాన్ని లోబరుచుకోండి.” - జెనిసిన్ 1: 27-28.
  17. “దేవుడు నేలమీద మట్టితో మనిషిని తయారుచేశాడు; అతని ముక్కు రంధ్రాల్లోకి ఊపిరి ఊదాడు, అప్పుడు మనిషి జీవించే ఆత్మ అయాడు.” -జెనిసిన్ 3 :7.
  18. “అప్పుడు సర్పం (లైంగిక శక్తి), భూమి మీదున్న జంతువులన్నిటి కన్న (శరీరంలోని ఇంద్రియాలన్నిటికన్న) చాలా సూక్ష్మంగా (చతురంగా, ధూర్తంగా) తయారయింది.” - జెనిసిస్ 3 : 1.
  19. ప్రభువైన దేవుడు ఈడెన్‌లో తూర్పువైపున ఒక తోట పెంచాడు. తాను రూపొందించిన మానవుణ్ణి అక్కడ ఉంచాడు. - జెనిసిస్ 2-8. “అందువల్ల ప్రభువైన దేవుడు, ఏ నేలమీది మట్టితో అతన్ని చేశాడో ఆ నేలనే తవ్వుకోమని వెంటనే అతన్ని ఈడెన్ తోటలోంచి పంపేశాడు.” - జెనిసిస్ 3 : 23. దేవుడు మొదట సృష్టించిన దివ్యమానవుడికి అతని నుదుటిమీది (తూర్పు వైపు) సర్వశక్తిమంతమైన ఒంటికంటిలోనే అతని చైతన్యం కేంద్రీకృతమై ఉండేది. మనిషి తన భౌతిక ప్రకృతి అనే “నేలను తవ్వడం” మొదలు పెట్టినప్పుడు, ఆ బిందువుమీద కేంద్రీకృతమైన అతని సర్వసృజనాత్మక శక్తులు విచ్ఛిన్నమయాయి.
  20. హిందువుల “ఆదాము.అవ్వల” కథ శ్రీమద్భాగవతమనే సనాతన పురాణ గ్రంథంలో వర్ణించడం జరిగింది. మొట్టమొదటి పురుషుణ్ణీ స్త్రీని (భౌతిక రూపంలో ఉండడం వల్ల) స్వాయంభువ మనువు (“సృష్టికర్తలోంచి పుట్టిన మనిషి”) అనీ, అతని భార్య శతరూప అనీ పిలిచేవారు.

వారి సంతానం ఐదుగురికీ ప్రజాపతులతో (స్థూల శరీరరూప ధారణకు సమర్థులైన పూర్ణజీవులు) అంతర్వివాహం జరిగింది. ఈ ప్రథమ దివ్య కుటుంబాల నుంచి మానవజాతి ఉద్భవించింది. క్రైస్తవ పవిత్ర గ్రంథాల్ని అత్యంత గాఢమైన ఆధ్యాత్మిక అంతర్దృష్టితో శ్రీ యుక్తేశ్వర్‌గారు వ్యాఖ్యానించినట్టుగా, ప్రాచ్యదేశాల్లోకాని పాశ్చాత్య దేశాల్లో కాని మరొకరు వ్యాఖ్యానించినట్టుగా నే నెన్నడూ వినలేదు. “ ‘నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం; నా ద్వారానే తప్ప మరొక విధంగా ఎవ్వడూ తండ్రి దగ్గరికి చేరడు.’ (యోహాను 14 : 6) వంటి వాక్యాల్లో క్రీస్తు చెప్పిన మాటలకు దైవశాస్త్రజ్ఞులు తప్పుడు వ్యాఖ్యానాలు చేశారు.” అని చెప్పారు మా గురుదేవులు. “తా నొక్కడే దేవుడి కుమారుడన్న అభిప్రాయం క్రీస్తుకు ఎన్నడూ లేదు; కాని మానవుడు ఎవడైనా సరే మొట్టమొదట ‘కుమార’ తత్త్వంగా రూపుగట్టక పోతే, అంటే సృష్టిలో కార్యప్రేరకమైన కూటస్థ చైతన్యంగా రూపుదాల్చకపోతే, నిర్గుణ పరబ్రహ్మను, అంటే సృష్టికి ‘అతీతంగా’ ఉన్న పరమపితను చేరుకోలేడు. కూటస్థ చైతన్యంతో సంపూర్ణ ఏకీభావం సాధించిన ఏసు, అంతకు చాలా కాలం క్రితమే అతని అహంభావం కరిగిపోయినందువల్ల, ఆ చైతన్యంతో తాదాత్మ్యం చెందాడు.” “దేవుడు .... ఏసుక్రీస్తు ద్వారా సమస్త వస్తువులూ సృష్టించాడు” (ఎఫేసియన్స్ 3 : 9) అని పాల్ రాసినప్పుడూ, “అబ్రహాం కన్న ముందు కూడా నే నున్నాను” (యోహాను 8 : 58) అని ఏసుక్రీస్తు అన్నప్పుడూ, ఆ మాటల్లో సారాంశం, వ్యక్తిత్వలయమే. కర్మ సిద్ధాంతాన్ని గురించి, దానికి పర్యవసానమైన పునర్జన్మ సిద్ధాంతాన్ని గురించి అవగాహన బైబిలులో అనేక సందర్భాల్లో కనబరచడం జరిగింది; ఉదా: “ఒకడి నెత్తురు పారించినవాడు, ఆ మనిషివల్లనే తన నెత్తురు ఓడుస్తాడు” (జెనిసిస్ 9 : 6) ప్రతి హంతకుడూ “మనిషివల్లనే” తను చావాలంటే, ఈ ప్రతి క్రియా ప్రక్రియకు సహజంగా, అనేక సందర్భాల్లో, ఒక జీవితంకన్న ఎక్కువ కాలం అవసరం. ఈ కాలపు పోలీసువాళ్ళు అంత చురుకుగా లేరు!

క్రైస్తవ జ్ఞేయవాదులూ (నాస్టిక్స్), క్లీ మెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా, సుప్రసిద్ధుడైన ఒరిజెన్ (ఇద్దరూ 3వ శతాబ్దివారే), సెంట్ జెరోమ్ (5వ శతాబ్ది) లతో సహా అసంఖ్యాకులైన క్రైస్తవ ధర్మ ప్రచారకులూ ప్రతిపాదించిన పునర్జన్మ సిద్ధాంతాన్ని తొలికాలపు క్రైస్తవ ధర్మ సంప్రదాయవాదులు అంగీకరించారు. ఈ సిద్ధాంతాన్ని ధర్మవిరుద్ధమని మొట్టమొదట ప్రకటించినది, క్రీ. శ. 553 లో కాన్‌స్టాంటినోపిల్‌లో ఏర్పాటయిన రెండో పరిషత్తు. ఈ పునర్జన్మ సిద్ధాంతం, మనిషి తక్షణ మోక్షం పొందేందుకు కృషి చెయ్యాలని ప్రోత్సహించడానికి అలవికానంత ఎక్కువ దేశ, కాల వ్యవధి ఇస్తోందని ఆ రోజుల్లో క్రైస్తవులు భావించారు. కాని సత్యాల్ని అణిచిపెట్టడంవల్ల అనేకమైన పొరపాట్లు జరిగి చిరాకుపెడతాయి. ఎంతో విశిష్టంగా సంపాదించి, ఎంతో త్వరగా శాశ్వతంగా పోగొట్టుకొనే “ఒక జీవిత కాలాన్ని” లక్షలాది జనం, ప్రపంచంలో తాము సుఖించడానికి వినియోగించుకున్నారే కాని, దేవుణ్ణి అన్వేషించడానికి వినియోగించుకోలేదు: మానవుడు దేవుడి కుమారుడిగా తన హోదాను తిరిగి సప్రయత్నంగా, సాధించేవరకు ఈ భూమి మీద మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండవలసిందే. ఇది సత్యం.