ఎందరో వికీమీడియన్లు/మార్గదర్శకుడు
మార్గదర్శకుడు
ఇదిగో వెన్న, రండి ఆస్వాదిద్దాం అని పిలిచి రుచి చూపించినవాడు వైజాసత్య రవి. తెవికీ పుట్టిన కొత్తలో వ్యాసం ఎలా రాయాలి, దాని లక్షణాలు ఏమిటి, అసలు తెవికీ గుణాలేంటి అనేవి దాదాపుగా ఎవరికీ తెలీదు. ఎవరికి తోచినట్టు వాళ్ళు రాస్తుండేవాళ్ళు. ఏ విషయానికి వ్యాసం రాయొచ్చో, దేనికి రాయకూడదో తెలీదు. ఇలాంటివన్నీ తాను నేర్చుకుంటూ తోటివారికి నేర్పిన వ్యక్తి వైజాసత్య.
మూలస్థంభాలూ ముఖద్వారాలూ అంటూ ఏమిటో... తెగ చెబుతూ ఉండేవాడు. విధానాలు మార్గదర్శకాలూ అంటూ విసిగించేవాడు. తాను మాత్రం విసుక్కునేవాడు కాదు. ఇలాకాదు, మనం రాసేదానికి ఆధారాలుండాలి. వాటిని వ్యాసంలో పెట్టాలి, అని చెప్పాడు. చర్చలు ఇలా జరగాలి, నిర్ణయాలు ఇలా చెయ్యాలి అని చెప్పాడు. నిర్వాహకత్వం ఇలా ఉండాలి అని చెప్పి అందుకు ఉదాహరణగా నిలిచాడు. చర్చల్లో తాను మాట్లాడేవాడు, ఇతరుల చేత మాట్లాడింపజేసేవాడు. హేతుబద్ధంగా చర్చించేవాడు. అవతలి వారి వాదనల్లో హేతువును చూసేవాడు. నెమ్మదిగా ఉంటూనే వేగంగా పనిచేసేవాడు. మృదువుగా ఉంటూనే నిష్కర్షగా ఉండేవాడు.
శైశవంలో ఉన్న తెవికీని చెయ్యిపట్టుకుని నడక, నడవడిక నేర్పినవాడు వైజాసత్య. వ్యాసాల్లో వ్యక్తులను ఏకవచనంలోనే ఉదహరించాలి అనేది ప్రతిపాదించి దానికి ఆమోదముద్ర సాధించినవాడతడు. దానికి సమర్ధనగా వివిధ వాదనలు చేస్తూ ఇదివరకటి తెలుగు విజ్ఞాన సర్వస్వాల ఒరవడిని దృష్టాంతంగా చూపించాడు. వైజాసత్య ప్రతిపాదించిన ఆ విధానమే నేటికీ తెవికీ పాటిస్తోంది.
"పదేళ్ల తర్వాత తెలుగు వికీ ఇప్పటికంటే నాణ్యంగా ఉంటుందని నా నమ్మకం. అయితే అభివృద్ధి గణనీయంగా ఉంటుందా, సాధారణంగా ఉంటుందా అనేది వికీ ఇంటా, బయటా ఉద్యమంగా నడిపించగల నాయకత్వంపై ఆధారపడి ఉంటుంది." అన్నాడొకసారి. ఆ తరువాత తెవికీ నుండి తప్పుకుని తన స్వంత పనుల్లో మునిగిపోయాడు. ఈ ముక్క చెప్పి ఎనిమిదిన్నర ఏళ్లయింది. తెవికీ అభివృద్ధి ఎలా ఉందో చెప్పడానికైనా అజ్ఞాతం నుండి తిరిగి రావయ్యా రవివర్యా!