ఎందరో వికీమీడియన్లు/ఆల్‌రౌండర్

వికీసోర్స్ నుండి

ఆల్‌రౌండర్


ఒకే ఆటగాడు అద్భుతమైన బౌలింగూ, బ్రహ్మాండమైన బ్యాటింగూ చేస్తే ఆల్‌రౌండర్ అంటారు. అదే చేత్తో కళ్ళుచెదిరే ఫీల్డింగ్ కూడా చేస్తే ఏమనాలో తెలియక అవాక్కవుతారు. అదే మనిషి కెప్టెన్సీలోనూ రాణిస్తే? ఇన్నీ చేశాకా జట్టుకు అవసరమైనప్పుడు వికెట్ కీపింగ్ కూడా చేయగలిగితే. "అబ్బే! అలా చేయడం అసాధ్యం" అంటారు. కానీ, అలాంటి ఫీటే ఒక దశాబ్దం పైగా తెలుగు వికీపీడియాలో చేస్తున్న మనిషిని తెవికీలో అంతా "చదువరి" అంటారు. చదువరి ఆల్‌రౌండర్ మాత్రమే కాదు తెవికీ ఇన్నింగ్స్ లో అజేయంగా కొనసాగుతున్న ఓపెనింగ్ బ్యాట్స్‌మేన్. అతను వృత్తిరీత్యా ఇంజనీరు. ఏ పని తలకెత్తుకున్నా, దాని బరువు, వైశాల్యమూ, స్వరూపమూ, స్వభావమూ క్షుణ్ణంగా, వేగంగా అంచనా కట్టడం అతనికి వృత్తితో పట్టుబడ్డ విద్య. ఆ పనిని చివరిదాకా తీసుకెళ్ళే పట్టుదల మాత్రం అతనికి పుట్టిపెరిగిన మట్టి నుంచి వచ్చిందని వినికిడి.

తెవికీలో రాసేవారి సంఖ్య ద్విగుణం, త్రిగుణం, బహుళం కావాలనీ, వ్యాసాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగాలనీ అతని కోరిక. ఇదంతా జరిగేప్పుడు నాణ్యతలో ఏమాత్రం రాజీపడకూడదని అతని వ్రతం. చక్కని భాషలో వ్యాసాలన్నీ ఎదగాలని అతని కోరిక. వ్యాసాలు రాయడం ఎంత ముఖ్యమో, చర్చలు చేయడం, విధానాలు రూపొందించడం, అమలుచేయడం అంతే ముఖ్యమని అతని సూత్రం. దారేపోయేవారైనా సరే - తెలుగు వికీపీడియా వ్యాసాల్లో లోటుపాట్లు ఇవీ అని చీల్చిచెండాడి 'ఉన్న తప్పుల'న్నీ ఏకరువు పెట్టారనుకోండి, వాళ్ళు అతనికి పరమ ఆప్తులు అయిపోతారు. ఎందుకంటే, తప్పులేమిటో తెలిస్తే దిద్దుకోవచ్చన్నది అతని నమ్మిక. తెవికీకి అవసరమైనది ఏదైనా తనకు వస్తే చేసేస్తాడు, రాకపోతే నేర్చుకుంటాడు, వీలుకాకపోతే తెలిసినవాళ్ళతో చేయిస్తాడు, కలసివచ్చేవాళ్ళు కనిపిస్తే భుజం కలిపి పనిచేస్తాడు, “మీరన్నది తప్పు” అని చెప్పాల్సివస్తే గౌరవంగా, నిక్కచ్చిగా చెప్తాడు, “నేను చేసింది తప్పు” అని ఒప్పుకోవాల్సి వస్తే నిస్సంకోచంగా ఒప్పుకుంటాడు, నేర్చుకుంటానంటే తనకొచ్చినదంతా నేర్పిస్తాడు, వీలైతే చిన్నవారి భుజాన కండువా వేసి వెనక నిలబడతాడు.

వికీలో జరిగేదంతా ఉమ్మడి కృషి కనుక ఘనత మొత్తం సముదాయానికే చెందాలి తప్ప వ్యక్తిగతంగా ప్రత్యేకతలు ఆపాదించకూడదన్నది చదువరికి ఉన్న నిశ్చితమైన అభిప్రాయాల్లో ఒకటి. తెవికీ అనే నదిలో అంతర్వాహినిలానే తానుండాలని అతని సంకల్పం. కానీ, కృషి, ప్రతిభ, పట్టుదల ఒకచోట రాశిపోసినప్పుడు ఆ వెలుగు జిగేలుమని చుట్టూ ఉన్నవారి దృష్టిని ఆకర్షించనివ్వకుండా ఆపడం ఎవరి తరం!