ఎందరో వికీమీడియన్లు/వెయ్యిళ్ళ పూజారి

వికీసోర్స్ నుండి

వెయ్యిళ్ళ పూజారి

వెన్నా నాగార్జున గారి పద్మ పరికరాన్ని చూసి ఆహా తెలుగులో రాయడం ఇంత తేలికా అని అందరూ అనుకుంటూంటే... అక్కడెక్కడో మూలన కూచున్న ఒకాయన, అంత కాదు, అంతకంటే తేలిక అన్నాడు. ఎవర్నువ్వు అన్నారు… నేను వీవెన్ని అన్నాడు. ఏదీ ఎంత తేలికో చూపించూ అన్నారు... ఇదిగో ఇం...థ తేలిక అంటూ లేఖిని ని రూపించి, చూపించి, నిరూపించాడు. నాగార్జున గారి పద్మ పరికరం చేసే పనే లేఖిని కూడా చేసేది, కాకపోతే వాడుకోడానికి మరింత తేలిగ్గా ఉండేది. మనం ఇలా ఇంగ్లీషులో రాస్తూంటే అది అలా తెలుగులో రాస్తుంది. "నిజమే వీవెన్ గారూ, చాలా తేలికే సుమండీ" అన్నారందరూ!

నిజానికి ఇవ్వాళ్టికి కూడా లేఖిని అంటే అనేక మందికి అక్షరాలు దిద్దుకునే పలక లాంటిది. ఈనాటికి కూడా లేఖిని సృష్టికర్త అనగానే చాలామంది ఆయన ముక్కుమొహం తెలీనివాళ్ళు కూడా “ఆహా! లేఖిని ఉండబట్టే నెట్టింట తెలుగులో రాయడం మొదలుపెట్టగలిగామని” దణ్ణవెట్టుకుంటారు. వీవెన్ అక్కడితో ఆగలేదు, తెలుగు వికీపీడియాలో తెలుగులో రాసే సౌలభ్యాన్ని అమర్చేందుకు వికీపీడియా డెవలపర్లతో కలిసి పనిచేస్తూ, వికీలోనే తెలుగు ఎడిటింగు టూల్సును చేర్చేలా కృషి చేసాడు.

ఇవ్వాళ తెవికీలో రాయాలంటే పద్మ, లేఖిని లాంటి బయటి పరికరాలు అక్కర్లేదు, ఆరేడు రకాల పద్ధతులను వికీలోనే అమర్చారు. అందుకు కృషి చేసినవారిలో వీవెన్ ఒకడు. తెవికీలో యాపిల్ కీబోర్డు లేఔటు లేకపోవడం వలన ఇబ్బంది పడుతున్నాం అన్నారు ఒకరెవరో. ఆ మరుసటి రోజునే ఒక లేఔట్ తయారుచేసి "ఇది పరీక్షించి బాగుందో లేదో చెప్పండి" అన్నాడు. వీవెన్. గట్లుంటది వీవెన్ తోని.

ఆవీరవెంకటవీవెన్‌అలాఅలా... వీరలెవెల్లో విజృంభించాడు. అంతర్జాలంలో తెలుగు అన్నాడు. బ్లాగుల కోసం కూడలి అన్నాడు. ఈ-తెలుగన్నాడు, ఆ తెలుగన్నాడు. తెలుగు ఫాంట్లన్నాడు, కీబోర్డులన్నాడు, తప్పొప్పులన్నాడు. కొత్త పదాలన్నాడు. నిషిద్ధాక్షరన్నాడు. లేఖిన్ని తిరగేసి నిఖిలే అన్నాడు. తెలుగోళ్ళ మొహాన ఇంగ్లీషు కొట్టే సంస్థల్ని “#తెలుగులోకావాలి” అన్నాడు. ఇలా వెయ్యిళ్ళకు పూజారయ్యాడు. దాంతో వికీ ఇంట నల్లపూసయ్యాడు.

అన్నట్టు... ఆమధ్య ఒకసారి... "ఇంకా ఈ లేఖిని వాడతారేమిటి, పుస్తకాలు వచ్చినై, కంప్యూటర్లొచ్చినై, ఇంకా ఈ పలక వాడడం ఏమిటి... ఇక తీసేస్తా దీన్ని" అన్నాడు. వెంటనే జనం గద్దించారు, "నువ్వెవరివి లేఖిన్ని తీసెయ్యడానికి, అది నీది కాదు మా అందరిదీ" అన్నారు. సరే సరే అని ఒప్పేసుకున్నాడు వీవెన్.