ఎందరో వికీమీడియన్లు/చరిత్రకారుడు
చరిత్రకారుడు
తెలుగు వికీపీడియాలో సాంకేతికపరమైన అనేక పనులు చేసిన వ్యక్తి ఎమ్.ప్రదీప్. తెలుగు వికీపీడియా తొలినాళ్ళ చరిత్రను అక్షరబద్దం చేసిన చరిత్రకారుడతడు. తెవికీలో గణాంకాలు ఎలా ఉన్నాయో చూడడం మొదలుపెట్టిన వ్యక్తి.
వికీపీడియాలో వ్యాసం అనేది ప్రధాన అంశమైతే దానికి అనుబంధంగా, వ్యాసానికి అనేక హంగులు సమకూర్చే మూస, వర్గం వంటి ఇతర రకాలైన పేజీలుంటాయి. ఉదాహరణకు వికీపీడియా వ్యాసాల్లో కుడిపక్కన పైన సమాచారంతో ఒక పెట్టెలాంటిది ఉంటుంది కదా, ‘సమాచార పెట్టె’ అంటారు దాన్ని. అదొక మూస. అన్ని పేజీల్లోనూ ఈ హంగు బావుండాలంటే మూస సరిగ్గా ఉండాలి. వ్యాసాల సంఖ్యకు ఇవి మూణ్ణాలుగు రెట్లు ఉంటాయి. సాధారణంగా వాడుకరులు ఈ అనుబంధ పేజీల్లో తక్కువగా పని చేస్తారు. కానీ ప్రదీప్ అలాకాదు, అతను వ్యాసాల్లో కంటే ఈ అనుబంధ పేజీల్లోనే ఎక్కువ పనిచేసేవాడు. పేజీలకు హంగులు చేకూర్చడంలో ఎక్కువ కృషి చేసేవాడు. తాను చేసిన మొత్తం కృషిలో దాదాపు నాలుగోవంతు వీటి కోసమే కేటాయించాడు. అందుకే 11 వేలకు పైగా దిద్దు బాట్లు చేసినప్పటికీ అతను సృష్టించిన పేజీలు మాత్రం ఆరు వందలే.
ఇంకొకటి...వికీపీడియాలో విధానాల రూపకల్పనకు వికీయుల అభిప్రాయాలు ఎంతో ముఖ్యం. అవును/కాదు, చెయ్యాలి/చెయ్యకూడదు. అని పొడిపొడిగా చెబితే చాలదు, ఎందుకో చెప్పాలి అని వికీ అంటుంది. తెవికీలో ఏకవచనమే వాడాలి అనే ప్రతిపాదన వచ్చినపుడు, ప్రదీప్ తొలుత దాన్ని సమర్ధించాడు. ఎందుకు సమర్థిస్తున్నాడో హేతువూ చూపించాడు. కానీ ఆ తరువాతి కాలంలో అతనికి ఆ పధ్ధతి నచ్చలేదు. తన అభిప్రాయాన్ని మార్చుకుంటూ మళ్ళీ రాసాడు, ఎందుకు నచ్చడంలేదో! ఇక్కడ విషయం ఏమిటంటే... తన అభిప్రాయంలో వచ్చిన మార్పును చక్కటి హేతువుతో వివరించాడు. అంచేతనే అతను అభిప్రాయం మార్చుకున్నా ఎవరూ అభ్యంతర పెట్టలేదు. నువ్వు చెప్పేది బానే ఉందన్నారు. అలా హేతుబద్ధంగా ఆలోచించి చర్చ చేసేవాడు ప్రదీప్.