ఎందరో వికీమీడియన్లు/బృహస్పతి
బృహస్పతి
పద్యాలు రాసే పంతులు గారు మా వెంకటరమణ. తెలుగు పంతులు గారు కాదు సుమా... ఫిజిక్సు మేష్టారు. ఓహో సైన్సు వ్యాసాలు రాస్తాడు గామాలు అని అనుకునేరు... చరిత్ర, ఆటలు, రాజకీయాలు, సంస్కృతి... అన్నీ రాస్తాడు. కాదేదీ రమణకనర్హం! రాసిలో పెద్దగా, వాసిలో ఉన్నతంగా, తోటి వారితో మర్యాదగా, చర్చల్లో నిర్ణయాత్మకంగా, నిర్ణయాల్లో నిర్మొహమాటంగా ఉంటాడు మా రమణ. ముక్కు పట్టుకుని తానున్న బిందువు వద్ద బైల్దేరి భూమి చుట్టూ తిరిగి వస్తే ఖచ్చితంగా బైల్దేరిన అదే బిందువు వద్దకు చేరుకునేంతటి సూటి మనిషి మా రమణ. తెవికీలో నియమం, నిబంధన, విధానం, మార్గదర్శకం - ఇవి మాత్రమే ఉంటాయని ఈ మనిషి ఉద్దేశం.
తెవికీ సౌర వ్యవస్థలో గురుగ్రహం (బృహస్పతి) అతను. అతని ఆకర్షణ లోకి వచ్చిన తెవికీయులు అతనిచ్చిన జ్ఞానం అనే గురుత్వాకర్షక స్లింగ్‌షాట్‌తో ఒక్కసారిగా పెనువేగం పుంజుకుంటారు. వ్యాసాల్లో రచనలు చెయ్యడమే కాదు, తెవికీ నిర్వహణలో చాలా చురుగ్గా ఉండే నిర్వాహకుడు రమణ మేష్టారు. నిర్వహణలో ఇతర నిర్వాహకులకు మార్గదర్శకుడు. తప్పులని భరించే సహనం ఆయనకి లేదు, వాటిని సరిదిద్దే ఓపిక మాత్రం పుష్కలంగా ఉంది. ఇతర వాడుకరులు తొలగించాలని ప్రతిపాదించిన వ్యాసాలలో అవసరమైన సవరణలు చేసి, అనేక వ్యాసాలను కాపాడినవాడు రమణ సార్. "నేను రాసిన వ్యాసాలలో తప్పులు పట్టేంత మొనగాడివా" అని హుంకరించినవారికి దండం పెట్టి, ఆ తప్పేమిటో వివరించి, వారి చేతనే “అవును మాస్టారూ, తప్పే” అని ఒప్పించగల సహనశీలి, సమర్థుడు. బయట ఎవరినీ కలవని సిగ్గరి. తెవికీలో మాత్రం కలుపుగోలుగా పనిచేసే నేర్పరి. దోషాలను చాకచక్యంగా వివరిస్తాడు. వాటిని తానే సవరించి ఆదర్శంగా నిలుస్తాడు. విచక్షణా రహితంగా వికీలింకులు ఇస్తున్నవారి పట్ల రమణ మాస్టారు వెలిబుచ్చిన ధర్మాగ్రహం చూడండి:
అగ్గిపుల్ల నందు అగ్గి, పుల్లకు నిచ్చు
చెరకు కిచ్చు వంటచెరకు నందు
లింకులిచ్చువారి లీలలు చూడరా
లుప్తమయ్యె పదము లింకులందు