Jump to content

ఎందరో వికీమీడియన్లు/క్షేత్రపాలకుడు

వికీసోర్స్ నుండి

క్షేత్రపాలకుడు

యర్రా రామారావు గారు ఎక్కడుంటారండీ? మొన్నటిదాకా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవారండి. నిన్నటి నుంచీ తెవికీలో ఉంటున్నారండి. ఇప్పుడెక్కడున్నారండీ? ఇప్పుడే కాదు, ఎప్పుడూ అక్కడే ఉంటారండి.

ప్రజలు గ్రామంలో నివసిస్తారు, మా రామారావు గారు గ్రామం పేజీలో నివసిస్తారు.

గ్రామం నుండి మండలం దాకా, ఆపై జిల్లా దాకా - తెవికీలో గ్రామాల పేజీలను సమాచార భరితం చేసిన అతి కొద్దిమందిలో రామారావు గారు అగ్రగణ్యుడు. కుండపోతగా వానలొచ్చి తెప్పలుగా ఊరి చెరువు నిండినట్టు, రామారావు గారు కురిపించిన సమాచార వర్షాలతో ఊళ్ళ పేజీలు నిండిపోయాయి. ఆంధ్ర తెలంగాణల్లో ఏ గ్రామం ఏ జిల్లాలో/ఏ మండలంలో ఉంది, కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు ఎక్కడ ఉండేది, దాని భౌగోళిక మ్యాపు ఏమిటీ... ఇలాంటి సమాచారం తెవికీలో దొరికినంతగా మరెక్కడా - ఒకే చోట - దొరకదు. దీని కోసం ప్రత్యేకంగా ఒక వికీప్రాజెక్టును సృష్టించి, ఒక ప్రణాళిక వేసి, సమాచారం చేర్చేదుకు కృషి చేసి సాకారం చేసిన కొద్దిమంది తెవికీయుల సమూహానికి మా రామారావు గారు గ్యాంగులీడరు.

ప్రభుత్వ ఉద్యోగంలో రిటైరై, అరవై ఏళ్ళ వయసులో కంప్యూటరు పట్టి, తెవికీలో దూకి, లక్షల్లో దిద్దుబాట్లూ కోట్లలో బైట్లూ చేర్చగలిగిన సమర్థత, పట్టుదల రామారావు గారిది. వయసులో పెద్దవారైనా, తన మనవళ్ళ వయసున్న కుర్రాళ్ళ దగ్గర వినయంగా చేతులు కట్టుకుని నేర్చుకోడానికి వెనకాడని జిజ్ఞాసువు.