ఎందరో వికీమీడియన్లు/సైన్సు మాస్టారు

వికీసోర్స్ నుండి

సైన్సు మాస్టారు

పాలగిరి రామకృష్ణారెడ్డి గారిది సైన్సు సాంకేతిక నేపథ్యం. ఆ రంగంలో ఉన్నత ఉద్యోగంచేసారు. ఆ నేపథ్యం నుండి తెవికీకి వచ్చారు. తన రంగానికి సంబంధించి అనేక వ్యాసాలు రాస్తూనే ఇతర రంగాలకు సంబంధించిన వ్యాసాలు కూడా రాసారు. నూనెలు, రాకెట్లు, ఉపగ్రహాలు, సాహిత్యం మొదలైనవాటి మీద అనేక వ్యాసాలు రాసారు.

ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో ఉండే సమాచారమంతా ఇంగ్లీషు లోనే ఉంటుంది. పాలగిరి గారు పనిచేసే ఆయిల్ టెక్నాలజీ రంగం కూడా అంతే. కానీ ఆ రంగంలో పనిచేసేవాళ్లలో సింహభాగం ఇంగ్లీషు రానివాళ్ళు. వారి సౌలభ్యం కోసం ఆయా సాంకేతిక విషయాలను తెలుగులో రాసి వాళ్ళకు ఇస్తూండేవారు. కొందరి కోసం మొదలైన ఆ అలవాటును అందరి కోసం తెవికీ లోకి పట్టుకొచ్చారు. అనేక సైన్సు, సాంకేతిక విషయాలపై వ్యాసాలు రాసారు. అనేక వ్యాసాలను విస్తరించారు.

తెలుగు లోనే కాదు, కన్నడ వికీపీడియాలో కూడా విస్తారంగా రాసారు. తెలుగు విక్షనరీ, తెలుగు వికీసోర్సు, కన్నడ విక్షనరీ, ఇంగ్లీషు వికీపీడియాల్లో కూడా కృషి చేసారు. అది కూడా ఎంత చక్కగా అంటే - ఆయన కృషి తెలిసిన కన్నడ వికీపీడియన్లు మాతో “మీ పాలగిరి మావాడు” అనేంతలా. ఒక సందర్భంలో ఒక వ్యాసం విషయంలో ఆయనకు మరొక వికీపీడియనుతో చర్చ కొంచెం వేడిగా జరిగింది. అది ముగిసాక కొన్నాళ్ళకు, పాలగిరి గారు ఆ వికీపీడియను ఇంటికివెళ్ళి ఆయన్ను కలిసి వచ్చారు. అదీ పాలగిరి గారి వ్యక్తిత్వ విశేషం.