ఉషాపరిణయము/సంపాదకీయ భూమిక

వికీసోర్స్ నుండి

ఉషాపరిణయము

సంపాదకీయ భూమిక

ఈ కావ్యమును రచించినది రంగాజమ్మ. ఇంటిపేరు పసుపులేటి. తండ్రి వెంకటాద్రి . తల్లి మంగమాంబ.

ఈమె తంజవూరాంధ్రనాయకరాజు విజయరాఘవుని యాస్థానకవయిత్రి. సంగీతసాహిత్యము లొకటిగ రూపెత్తిన విదూషి. విజయరాఘవనాయకాంకిత జీవిత ప్రణయ కావ్య.

విజయరాఘవుని పాలనము. క్రీ. శ. 1633 నుండి 1673 వఱకు నని చరిత్ర. ఇతని రాజ్యత్వమున నాంధ్రభాష యొకవెల్గు వెల్గినది. ఎందరో సంగీతసాహిత్యసరస్వతుల కితని కొలువుకూట మాటపట్టు. వారిలో రంగాజమ్మది యగ్రతాంబూలము.

ఒకనాఁడు కొలువు దీఱియుండఁగా విజయరాఘవుఁడు దన్ను హరివంశములోని యుషాపరిణయకథఁ దెనుఁగు గావింపుమని కోరినాఁడఁట. ఈ ప్రస్తావమున నీమె పూర్వగ్రంథ ప్రశంస కూడ నున్నది. మన్నారుదాసవిలాస ప్రబంధము; రామాయణ భారత భాగవత సంగ్రహములు; ఇవిగాక కొన్ని యితర మధురపదములు, దీనిని బట్టి యీ గ్రంథ మైదవ రచన యని తేలుచున్నది. మన్నారు దాస విలాస నాటకము కడపటిది. ఉషాపరిణయము దానికి ముందటిది.

మన్నారుదాసవిలాస నాటక మింతకు ముందే యాంధ్రసాహిత్యపరిషత్తు ముద్రించినది. దాని పీఠికలో శ్రీ జయంతి రామయ్య పంతులుగారు, 'ఈనాటకము 1660 ప్రాంతమునఁ బుట్టియుండు నేమో' యని తమయూహ వెలిబుచ్చిరి. ఈ యుషాపరిణయ పీఠికాకారులు శ్రీ యస్వీ జోగారావు గారి నిర్ణయచమత్కారమునకుఁ బైయూహకు నెంతయో యంతరము లేదు. తన్ను నుషాపరిణయము వ్రాయఁ బ్రస్తావించిన నాఁటి కొలువుకూటమున విజయరాఘవ పుత్రుఁడు మన్నారు దేవుఁడు, మన్నారుదేవుని పుత్రుఁడు చెంగమలదాసు గూడ నున్నట్లు రంగాజమ్మ వర్ణించినది. చెంగమలదాసు గూడ కొలువుదీఱి కూర్చుండు నంతటి వాఁడై యుండఁగా విజయరాఘవుని వయస్సు తృతీయపాదమున బడియుండును. ఒకవేళ చెంగమలదాసు పుత్రుఁ డన్న వాదము సరి యైనను జిక్కు లేదు. 'నిరవద్య చరిత్రులగు పౌత్రులును' అని పౌత్రు లెందఱో వాకొనఁబడిరి. వీరి విశేషణము గమనింపఁదగినది. చరిత్రప్రశంస వీరు బొత్తిగా బాలురు కాదనుటకు సాక్ష్యము. కావున నీకృతి 1650 పైనఁ బుట్టి యుండవలెను.

పై సందర్భముననే శతక్రతు చతుర్వేది శ్రీనివాస తాతాచార్యులను, దండనాథుఁడు విజయవెంకటపతిని, తోటి కవయత్రి కృష్ణాజమ్మను బేర్కొన్నది. అవతారికను, షష్ఠ్యంతములను బట్టి చూచిన, శ్రీనివాస తాతయాచార్యు లనిన విజయరాఘవ రంగాజమ్మలకుఁ బరమభ క్తి యని తెల్ల మగుచున్నది. రాజగోపాలస్వామి సరేసరి. వారి కులదైవము. విజయరాఘవుఁడు మన్నారు దాసుఁడు; కొడుకు మన్నారుదేవుఁడు; మనుమఁడు చెంగమలదాసు; గోత్రము మన్నారు. సభాభవనము రాజగోపాలవిలాసము.

రంగాజమ్మ కృతిభర్త వంశావళిని మన్నారుదాసవిలాస ప్రబంధములో వివరముగా విశేషించి యిచ్చుటచే నిందుఁ గ్లుప్తముగా నిచ్చుచుంటి నని, కృష్ణప్ప, తిమ్మ, తిమ్మప్ప, చెవ్వ, అచ్యుత, రఘునాథ, విజయరాఘవ నాయకుల వరుస నొక టిచ్చినది. ఇది పూర్వము నుండి యుత్తరోత్తరము పితృపుత్ర న్యాయముగ గ్రహింపవలెను. చివర విజయరాఘవనాయకుని పుట్టుకను జాలఁ జమత్కరించి యల్లినది. రఘునాథనాయకుఁడు వసుదేవనందుల యాత్మ లఁట. చెంజి లక్ష్మి దేవకియుఁ, గళావతమ్మ యశోదయు నఁట. కస్తూరి రంగఁడు చెంజిలక్ష్మి కలలోఁ గన్పడి యా నాఁడు దేవకి కడుపునఁ బుట్టి యశోద యొడిలోఁ బెరిగితిని. ఈనాఁడు కళావతమ్మ కడుపునఁ బుట్టి నీ యొడిలోఁ బెరిగెదను; స్వీకరింపుము' అని మాయమైనాఁ డఁట. ఆ కృష్ణుఁడే విజయ రాఘవుఁ డఁట.

విజయరాఘవుఁడు బహు గ్రంథకర్త. బహు కృతి భర్త. సంగీత సాహిత్య రసబ్రహ్మ.

దక్షిణాంధ్రయుగము తెల్గుభాషకు నొక యపూర్వ ఘట్టము. ప్రబంధములు గాక పదములు, యక్షగానములు, వచనములు నను విశిష్టతలతో నీ నాఁటి తెల్గుసాహితి త్రిస్రోతస్సుగాఁ బ్రవహించినది. త ద్రసగంగాధరుఁడు విజయరాఘవుడు.

తొలిదొల్త దక్షిణాంధ్రసాహిత్యమును గుఱించి యాంధ్రలోకమునకుఁ దెలియఁజేసిన దాంధ్రసాహిత్యపరిషత్తే. ఈ యశస్సు శ్రీ జయంతి రామయ్యపంతులుగారిది. కాలక్రమమున నాంధ్రసాహిత్యపరిషత్తు మధురాతంజావూరాంధ్రకవుల రచనలు - వచన జైమినీభారతము, మన్నారుదాసవిలాస నాటకము, కవిజనోజ్జీవని, రఘునాథరామాయణము నిటీవల రాధికాసాంత్వనమును బ్రచురణ చేసినది

ఈ గ్రంథముద్రణకు నాంధ్రసాహిత్యపరిషత్తున నొక వ్రాతప్రతి మాత్ర మున్నది. ఇది తంజావూరి సరస్వతీమహలు నందలి 283 సంఖ్యగల తాళపత్త్రమునుండి వ్రాయఁబడినది. ఈ తాళపత్త్రమున 110 పుట లున్నవి. తప్పులు లేవు. వ్రాత మంచిది. శైథిల్యము హెచ్చు. గ్రంథాంతమునఁ గొన్ని పత్రము లత్యంత జీర్ణములు. మూఁ డాశ్వాసములు మాత్రము సమగ్రముగ నున్నవి. నాల్గవ యాశ్వాసము గొంతవఱ కున్నది. గ్రంథపాత మున్నది. పరిషత్తున నున్న ప్రతి దీనికి యథాతథమే. దీని లేఖకు లిద్దరు. శ్రీ పి. బాలసుబ్రహ్మణ్యం, టి. ఎస్. వెంకట రామయ్యరు. ప్రథములు ప్రారంభము నుండి 99 పుటలు వఱకు వ్రాసిరి. శేషమును ద్వితీయులు పూర్తిచేసిరి. సుబ్రహ్మణ్యంగారి లేఖనవైఖరి చాలఁ జక్కనిది. మన్నారుదాసవిలాస నాటకమును గూడ నాంధ్రసాహిత్యపరిషత్తునకు వ్రాసి యిచ్చినది వీరే. ఈ రెండు వ్రాత ప్రతుల ముఖపత్రమున నిట్లు వ్రాసియున్నది.

'నళనామసంవత్సర చైత్రశుద్ధ ౧ (ప్రతిపద్) భానువాసరం మధ్యస్థనేనాధురంధర రాజశ్రీ రామయ్య వరాహప్పయ్య దీక్షితులవారి ఆజ్ఞా ప్రకారం, పద్యకావ్యం'

తర్వాతఁ బ్రతి స్థితి వివరణ లివ్వఁబడినవి. ఆంధ్రనాయకరాజ్య మంతరించిన పిమ్మట, మహారాష్ట్ర పరిపాలనములో శరఫోజీ ఫౌజుదారైన రామయ్య వరాహప్పయ్య దీక్షితులచేఁ గొన్ని తాళపత్త్ర గ్రంథములు సంపాదింపఁబడినట్లు శ్రీ జయంతి రామయ్యపంతులుగారు 'ఆంధ్రచరిత్ర పరిశోధనమండలి' పత్త్రికలో (సంపుటి 2 పుట 174) బ్రకటించిరి. ఈయన వేఁగినాఁటి బ్రాహ్మణుఁ డఁట. ఆయనయే యీయన యేమో.

ఇప్పు డీ యుషాపరిణయ ప్రబంధమును బ్రచురించి సహృదయుల కందఁజేయుచున్న పరిషత్కార్యదర్శులు బ్రహ్మశ్రీ చతుర్వేదుల సత్యనారాయణశాస్త్రిగారికి శ్రీమాన్ ప్రతివాద భయంకర పార్థసారధిగారికి, నితర సహృదయపారిషదులకుఁ, బీఠిక వ్రాసియిచ్చిన శ్రీ యస్వీ జోగారావు గారికి నా యభినందనములు.

ఆంధ్రసాహిత్యపరిషత్తు -

కాకినాడ

1 - నవంబరు, 1953

వద్దిపర్తి చలపతిరావు.

మేనేజరు.