Jump to content

ఉషాపరిణయము/పీఠిక

వికీసోర్స్ నుండి

ఉషస్సుషమ

రంగాజమ్మ

ఉషాపరిణయ పీఠిక

.

ఆంధ్రవాఙ్మయ చరిత్రమున దక్షిణాంధ్రయుగము కాలపరిమితిని (క్రీ. శ. 1600–1775) బట్టి సుదీర్ఘము, కవితాపరిణతిని బట్టి కడు విలక్షణము నైనది. ప్రక్రియావైవిధ్యము, కళావతుల కవితాకేళి, రసికశేఖరు లైన రాజుకవుల పరంపర, శృంగారరసాధిదేవతారంగస్థలములు లలితకళాఫలభూములు నగు వారి యాస్థానములు నా యుగవిశిష్టతలు. అట్టి దక్షిణాంధ్రయుగ సాహిత్యవాహినీ తీరమునందు తీర్థభూతము లైన ఘట్టములు తంజావూరు, మధుర, పుదుక్కోట, మైసూరు సంస్థానములు. అందు, తంజావూ రా విశిష్టతల కెల్ల నెల్ల యైనది. అస లా యుగమున కుగాదిపండుగ జరిగినది తంజావూరిలోనే. నాయకరాజులకోవకు నాయకమణి యైన రఘునాథరాయ లా యుగావిష్కర్త. కాని యంతటి వాని యాస్థానకవయిత్రులు (రామభద్రాంబ, మధురవాణి) నేలకో గీర్వాణముతో నూరకుండిరి గాని యాంధ్రమున గ్రంథరచన గావింపరైరి. తరువాత నాతని కౌరసుఁడు, నంతకంటె సరసుఁడు నైన విజయరాఘవనాయకుని రాజ్యకాలమున (క్రీ. శ. 1633-1673) నాంధ్రగ్రంథరచన చేసిన కవయిత్రు లనేకులు బయలుదేఱిరి. వారిలోఁ బేరుప్రతిష్ఠలు గలవారు పసుపులేటి రంగాజి, రావినూతల కృష్ణాజి. కృష్ణాజి యాంధ్రకవితానిష్ణాత యని వినుకలియే గాని యామె కృతుల కనుకలి యబ్బలేదు.

ఇఁక రంగాజిచరిత్ర రసికుల కొక ముచ్చట. ఆమె తండ్రి వేంకటాద్రి; తల్లి మంగమాంబ. ఇష్టదైవతము రాజగోపాలుఁడు, 'ఉరఫు' రాజమన్నారు. ఆ మన్నారుదాసుఁడు విజయరాఘవభూపాలుఁ డసలు తన పతి యనియే రంగాజమ్మ బడాయి కొట్టుకొన్నది గాని యది వట్టి మాటవరుస. ఆతఁ డామె కభీష్టకృతిపతి. అతని యాస్థానమున నామెకు పట్టమహిషులకును బట్టని యోగము పట్టినది. అది యొక గాథ. పత్రికాలేఖనము నందు, పదకవిత్వమునందు, రాజనీతియందు, బహుభాషావైదుషియందు నందెవేసిన చేయి యామెది. రంగాజి రాజసభలో నెప్పుడైన గజ్జె కట్టినదో లేదో గాని యభినయసంగీతాదికళామర్మములు నామె క చుంబితములు గావు. వెన్నతోఁ బెట్టిన విద్యలు సరేసరి. మన్నారుదాసవిలాసనాటకమున సాగిన శాస్త్రప్రసంగములనుబట్టి యామె వ్యాకరణజ్యోతిశ్శాస్త్రవిత్త్వమును విశద మైనది. ఇన్నిమాట లెందుకు — ఆమె విద్యల గజ్జెలగుఱ్ఱము, కళల కాణాచి. ఆమెయు నా దక్షిణాధీశు[1] ముత్యాలశాల దీనారటంకాలఁ దీర్థ మాడించినది. ఇతర పూర్వాంధ్రకవయిత్రు లెవ్వరు నింత పాండిత్యము గలవారు కారు; ఇన్ని కృతులు రచించినవారును గారు.

ఆమె కృతులు గ్రంథాంతగద్యలను బట్టి మన కెఱుక పడినవి యాఱు. అవి రామాయణ భారతభాగవతకథాసంగ్రహములు, మన్నారుదాసవిలాసము పేరిట నొక ప్రబంధము, నొకయక్షగాననాటకము, నీ యుషాపరిణయము. అందు మొదటి మూఁడు నిపు డుపలబ్థములు గావు. మన్నారుదాసవిలాస నాటక మాంధ్రసాహిత్యపరిషత్తుచేఁ బ్రచురింపఁబడినది. అంతకు ముందే రచింపఁబడినను నా పేరిటి ప్రబంధ మిప్పు డప్పుడే తంజావూరి తాఁటితోఁపు దాటి వచ్చునట్లు లేదు. ఆ రెంటికి నడుమ రచింపఁబడిన యుషాపరిణయ మిదిగో యిన్నాళ్ళ కచ్చుమొగము జూడ నోచుకొన్నది. అదియు గ్రంథము సమగ్రముగా లభింపలేదు. కాని కథ తుదముట్ట వచ్చినది; అట్టే లోపించి యుండదు, అసమగ్ర మని ముద్రింపక యుపేక్షించినచో నున్నదియు నుత్సన్నము కావచ్చును. అదియుఁగాక మనకున్న కవయిత్రుల కృతులే తక్కువాయె. అందును రంగాజికృతులందు నాయకరాజులకు సంబంధించిన చారిత్రకాంశములు గలవు. అందుచే మన్నారుదాసవిలాస ప్రబంధమును వెంటనే ప్రకటింపఁదగినది.

ఉషాపరిణయ రచనాకాలనిర్ణయమున కూహము వినా మఱి యుపాయము లేదు. మన్నారుదాసవిలాసనాటకమే రంగాజమ్మ చరమరచన. అందుఁ బై కృతు లన్నియుఁ బేర్కొనఁబడినవి. ఆ నాటకరచనా కాలమును గచ్చితముగాఁ జెప్పఁబడలేదు. కాని యేదే నొక కథాసందర్భమును బురస్కరించుకొని యే వివాహాదికసంకల్పపరముగనో, యనఁగాఁ బరోక్షపద్ధతిని, రచనాకాలమును సూచించుటయు నొక శిల్పవిన్యాసమే గనుక నాఁటి కవు లా పరిపాటిఁ బాటించిరి. రంగాజమ్మయు రాజగోపాలస్వామి ఫాల్గునోత్సవ శ్రీ ముఖమున (నాయకరాజులు తమ యిలువేల్పగు రాజమన్నారునకు 'పంగుని తిరునాళ్లు' జరిపించుట యాచారమై యుండెడిది) 'శుభకృ'త్సంవత్సరమును బేర్కొన్నది. అది విజయరాఘవుని రాజ్యపాలనకాలమున, క్రీ. శ. 1664 వ సం॥గా గుర్తింపఁబడినది. అదే మన్నారుదాసవిలాస నాటకరచనాకాలము గావచ్చును. ఉషాపరిణయము తత్పూర్వరచన కావున, క్రీ. శ. 1664 నకు ముందే రచింపఁబడియుండు ననిమాత్రము చెప్పవచ్చును.

రంగాజమ్మ రచనలలోఁ గ్రమమును బట్టి యైదవ దైనను (మొదటి నాల్గు నందు పేర్కొనఁబడినవి) గవితాగౌరవమును బట్టి యుషాపరిణయమే ప్రథమగణ్య మైనది. మన్నారుదాసవిలాసనాటకమును యక్షగానవాఙ్మయమున మిగుల విశిష్టమైనదే. విజయరాఘవున కతిప్రియమైన సాహిత్యప్రక్రియ యక్షగానమగుటచే నాఁడు ప్రబంధరచన వెనుకఁబడినది[2]. మన కిపుడు లభించు ప్రబంధము లతని నాఁటివి మూఁడే — చెంగల్వకాళకవి రాజగోపాలవిలాస మొకటి, రంగాజమ్మవి రెండు. ఆ కొలఁదిపాటి ప్రబంధములలో రంగాజమ్మ యుషాపరిణయ మొక నిక్కంపు మంచి నీలమని చెప్పవచ్చును. కథావస్తువు, యథాప్రాబంధికమైన వర్ణనాఫక్కికయుఁ బరిచితపూర్వము లనుట తప్ప తత్సంవిధానమునఁ గాని రచనావైచిత్రియందు కాని యామె యొకరి ననుకరింపలేదు; ఆమె నొక రనుకరింపలేదు.

ఆమె కవితా చాతుర్యమునకు నికషప్రాయములగు కొన్ని సందర్భముములు: కలవలని కలవరమునఁ జెలులచే శైత్యోపచారములు స్వీకరించుచున్న యుష యొకపరి కలఁ గలసినవాఁడు కట్టెదుటఁ గనఁబడినట్లు భ్రమపడును. ఆ భ్రమ ద్వితీయాశ్వాసమున సుదీర్ఘముగా నాఱు సీసములలోఁ జెప్పబడినది. చిత్రపటములో నుష కనిరుద్దుఁడు చిక్కినాఁడు. కాని చిత్రరేఖ యామె 'మనం బరయుటకై ' అబ్బో దవ్వులనున్న ద్వారకనుండి యనిరుద్ధునిఁ దెచ్చుట నావల్ల కాదనును; ఉష యుస్సు రనును. ఆ భ్రమలో నా యసురుసురులో భావోద్విగ్నమై యుషారమణి ముగ్ధత్వము మూర్తికట్టినది. ఉషా నిరుద్ధుల సరసము రసోత్తరముగా సాగినది; అందు ప్రణయకలహఘట్టమే పదిపద్యములు పట్టినది. అనిరుద్ధుఁ డదృశ్యుఁ డైనప్పుడు రాణివాసమునఁ గలకలము పుట్టిన పట్టును రక్తి కట్టినది. యుద్ధఘట్టము నొక యాశ్వాసమున కాశ్వాస ముదాత్తముగా నడచినది. కొస కొఱవడినది గాని పరిణయఘట్టమును సరసముగా నడచియుండును. (రంగాజమ్మ పెండ్లిలో నాడుటయే గాని పెండ్లాడి యెఱుఁగక పోవచ్చును. కాని యామె కావ్యమునఁ బెండ్లిండ్లు వర్ణించుటయందు మిగుల నేర్పరి. ఆ విషయము మన్నారుదాసవిలాస నాటకమువలన ఋజువైనది). పలకబారిన పదబంధములతో హృదయ మూ కొట్టు భావవ్యక్తులతో నుషాపరిణయమున, ప్రత్యేకముగా నుదాహరింపఁ బని లేదు, పద్యము లెక్కడ పట్టినను మార్దవ ముట్టిపడుచుండును. ఆమె శయ్యాసౌభాగ్య మట్టిది. రంగాజమ్మ శృంగారరసాభిజ్ఞత యనుభవాత్మక మైనది. అసలు దక్షిణాంధ్రకవు లందఱు ననుభవసిద్ధు లైన రసికులు. ముందునాఁటి కవులందు శ్రీనాథ ధూర్జటి ప్రభృతులు కొద్దిమంది తప్పఁ దక్కిన కవుల శృంగారరసాభిజ్ఞత యుపజ్ఞామూలకమైన యూహాగానమే. ఇంకొక విశేషము — తంజావూరి కావ్యములలోఁ దఱచు సమకాలిక జాతీయజీవనప్రతిబింబనము గన్పట్టును. ఉషాపరిణయమునను నట్టి సందర్భములు గలవు. ఉదా:—

1. శ్రీకృష్ణుని కొలువుసింగారము, ననిరుద్ధుని యలంకరణము నాయకరాజుల నగరిముస్తీబుఁ దలపించుచున్నవి, నాఁడు మగవారికిని సిగలో సంపెగలు ముడుచుకొనుట యొక ముచ్చటయఁట!

వారి దుస్తులు : బురుసారుమాలు, బురుసాహిజారు, పసిఁడివ్రాఁత చెఱఁగుదట్టి, దుప్పటివలెవాటు మొ॥

వారి సొమ్ములు : చౌకట్లు, కంటసరులు, చేసరులు, తాళి, వంకి, బిరుదుపెండెము మొ॥

2. ఉష బాల్యక్రీడలు :

గుజ్జనగూళ్లు, బొమ్మలపెండ్లి, దాగిలిమ్రుచ్చులు, చెండుగోరింతము, గుజగుజఱేకులు, పగడసాల, చదరంగము. ఇవియు నాఁటి పిల్లకాయల ఆటలే)

3. ద్వితీయాశ్వాసమున నుషాసఖుల సంగీతమేళ సందర్భమునఁ బేర్కొనఁబడిన వాద్యవిశేషములు :

దండె, తంబుర, స్వరమండలము, రబాబు, వ్రేటుగజ్జెలు,ముఖవీణ, ఢక్క, చెంగు, కామాచి, ఉపాంగము, కిన్నెరవీణ, తాళము, పిల్లఁగ్రోవి, చిటితాళము, రమ, శేషనాదము, రావణహస్తము, చంద్రవలయములు, మురజము.

4. తృతీయాశ్వాసమున - వైతాళీయ గీతములు :

దేవగాంధారి, దేశాక్షి. మలహరి, గుండక్రియ, లలితగుజ్జరి మొదలగు నుదయరాగములలో సాగినవఁట. ఆ వాద్య రాగముల ప్రసక్తిలో నాయకరాజుల కొలువు భోగాల వారి సంగీతసాధనయే స్ఫురించుచున్నది.

5. ఆ మేలుకొలుపులకు లేచిన రాచవారు చూచుకొను శుభశకునములు :

అద్దము, క్షీరకలశములు, అలరుసరులు, కపిలగోవు, విప్రయుగము.

ఆ దర్పణావలోకనాదికము నాయకరాజులకుఁ గర్లాటప్రభువులనుండి సంక్రమించిన సంప్రదాయము[3].

6. గ్రంథమధ్యముసఁ బ్రసక్తు లైన నాఁటి రాజకీయోద్యోగులు :

అన్న గారులు, హెగ్గడికత్తెలు, అవసరాలవారు, గురిదొరలు.

7. 'తుంటవిల్ రాయల దాడి' నాయకరాజుల దండయాత్రల కొక సూచన :

8. చతుర్థాశ్వాసమున గరుడాళ్వారు ప్రశంస మూఁడు పద్యములలోఁ గలదు. గ్రంథారంభమునను గరుడస్తుతి గలదు. దానితోపాటు చెంగమలామన్నారుల, శేషవిష్వక్సేనుల, పన్నిద్దరాళ్వారుల, వేదాంత శ్రీనివాసదేశికుల ప్రశంసలును గలవు. మఱియు విజయరాఘవు నుద్దేశించి 'పరమతంబుల నెల్ల నిరసించి యే మేటి వైష్ణవమతమె శాశ్వతము జేసె' నని గలదు. నాయకరాజులకుఁ గులాచార రాజకీయవ్యవహారములతోపాటు వైష్ణవమును గర్ణాటప్రభువులనుండి వచ్చినదే. రంగాజమ్మ దెట్లును రాజుగారి మతమే.

మఱికొన్ని విశేషములు : గ్రంథము నందు సీసపద్యప్రాచుర్య మగుపించును. దక్షిణాంధ్రకవులకు సీస మన్న వల్లమాలిన మక్కువ[4]. 'అచ్చుత' శబ్ద మొకటి యిందుఁ బ్రాసఘటితముగాఁ బ్రయోగింపఁబడినది. అదియు నా కవుల కభిమతమైన యొక వైకృతరూపము[5]. బీగముద్రలు బిక్కుబీగములు, వద్దికి మొ॥ ప్రయోగములును గమనింపఁదగినవి.

ఆంధ్రవాఙ్మయమున నుషాపరిణయకథ ప్రచురప్రచారము గల కావ్యవస్తువులలో నొకటి. అట్లగుట కా కథయందు మధురోదాత్త రసరాజములగు శృంగారవీరములు రెంటికిని విశేషప్రసక్తి గల్గుటయే కారణము. ఆ కథకు సంస్కృతమూలములు హరివంశము, భాగవతము. అవియుఁ దెనుఁగునకు దిగినవి. అవి యెఱ్ఱన సోమనల హరివంశములు, పోతన భాగవతము. అందు సోమన యుషాపరిణయ ఘట్టముపైఁ బ్రత్యేకశ్రద్ధ చూపినాఁడు. అది రసబంధురమై ప్రబంధపాకమునఁ బడినది. పింగళి సూరనార్యుఁడును నుషాపరిణయగాథను మనస్సు నందుంచుకొనియే ప్రభావతీప్రద్యుమ్నమును రచించెనని యభియుక్తుల యభిప్రాయము, అదిగాక యాంధ్రమునఁ గేవల మా గాథ నితివృత్తముగా గ్రహించిన గ్రంథములు పదికిఁ బై గా నున్న యాధునిక నాటకములు గాక పూర్వకవులవే నాలుగు ప్రబంధములు, నొక ద్విపద, యక్షగానము లొక 'దస్కము' నగుపించుచున్నవి. అందు ప్రబంధములలోఁ జెప్పుకోదగినవి రంగాజమ్మ కృతియు, కనుపర్తి యబ్బయామాత్యుని యనిరుద్ధచరిత్రమును.

రంగాజమ్మ హరివంశకథానుసారముగ రచించెను. అబ్బయ భాగవతకథాసంవాదిగాఁ బ్రపంచించెను. రెండింటికిఁ గల భేద మిటఁ బ్రసక్తము. హరివంశమున నీ కథ విపులముగను, భాగవతమున సంగ్రహముగను గలదు. హరివంశమున నున్న శాంకరీవరప్రసక్తియు, ననిరుద్ధహరణోద్యోగమున నున్న చిత్ర రేఖ నారదునితో మంతన మాడుటయు భాగవతమున లేవు. ఉషాస్వప్న మన్నిట నున్నవిషయమే కాని యెఱ్ఱన హరివంశమున మాత్ర మనిరుద్ధుఁడు కూడ నుషవలెఁ గలఁ గాంచుట గలదు. రంగాజమ్మయు భాగ్యంతరమున నీ విషయము నుట్టంకించినది. హరివంశభాగవతములకుఁ గల యాయా భేదములే రంగాజమ్మ, అబ్బయల కృతులకును గలవు. కథైక్యఘటనమున రంగాజమ్మయుఁ, గవితాప్రౌఢియం దబ్బయయు నధికులు. అబ్బయ రంగాజమ్మ కర్వాచీనుఁడే కాని యా కాలమునఁ దక్కిన యుత్తరాంధ్రకవుల వలె దక్షిణాంధ్రకృతుల నెఱుఁగఁ డనుకొందును. శ్రీ కురుగంటి సీతారామయ్యగారు రంగాజమ్మ కృతిని బ్రశంసించుచు నది 'అబ్బయామాత్యుని యనిరుద్ధచరిత్ర కంటె సర్వవిధముల మే లని చెప్పుటకుఁ దగినదై యున్న' దని వక్కాణించిరి. రంగాజమ్మ కృతి ముక్కుమొగ మెఱుఁగకయే మఱియొకరు, సందు దొరకినఁ జాలు మగకవుల నెగతాళి చేయువా రా మాట పట్టుకొని, యింకను నొక్కి వక్కాణించినారు. ఎవరి ప్రవృత్తికి సన్నిహితమైన కథపట్టున వా రొకరి నొక రతిశియించిరి. అంతమాత్రమున నట్లు 'సర్వవిధముల మే' లనుట వట్టి ముధావాదము. కనుపర్తికవియు, 'చతురకవిత్వతత్త్వపటుసంపద యొక్కరి సొమ్ము గా' దని పంతము పట్టి వ్రాసినాఁ డనిరుద్ధచరిత్ర. అదిగాక, వసుచరిత్ర కొక మానసపుత్రి యైన పురూరవశ్చరిత్రను 'గవిరాజమనోరంజనము'గా రచించిన జాణఁడతఁడు. కాని యొక్కమాట — నాయిక పేరఁ ప్రసిద్ధమైన కావ్యవస్తువును గ్రహించి, నాయకనామ ముంచుట యంత సమంజసము గాదు.

కురుగంటి వారు మరి యొక మాటయు ననియున్నారు. రంగాజమ్మ కృతి రాధికాసాంత్వనము (ముద్దుపళని కృతియని వారి యుద్దేశమనుకొందును) కంటె సహృదయహృదయాహ్లాదకరమై,సభ్యమై యొప్పారుచున్న'దని. అంతకంటె సభ్యమై యున్నదనుట కభ్యంతరము లేదు. విషయాంతరతరప్రత్యయమునకే విప్రతిపత్తి. ముద్దుపళని కవిత్వమున నెంత యెంగిలిపడినను రసికత్వమున రంగాజమ్మకుఁ దీసిపోదు. అస లిరువురు నొక్కకోవ లోని వారు - రసప్రసన్నకవనలు, రాజభోగైకజీవనలు. పళని కృతికిని గొంత ప్రత్యేకత కలదు. తరతరాలుగా రసికహృదయముల నూరించుచుండుటయే తార్కాణ. ఈ యుషాపరిణయమునకును - తాళపత్త్రజీవితకాళరాత్రి గడచినది. ముద్రణ మను యుషఃస్ఫురణ గల్గినది. ఇఁక రసికప్రశంసోదయరాగరమణీయ మగుటయే తరువాయి. అదియు ననతికాలమునఁ దీరునుగాక.

య స్వీ జోగారావు,
బి. ఏ. (ఆనర్సు)

ఆంధ్ర విశ్వకళాపరిషత్
పరిశోధనశాఖ, వాల్తేరు
1- నవంబరు, 1953.

  1. మ. దా. వి. నాటకము 49 వ పుటలో విజయరాఘవపరముగ 'దక్షిణరాయ'యను సంబుద్ధి గలదు.
  2. ప్రబంధములును, యక్షగానములుగాఁ బరివర్తింపఁ బడినవి నాఁడు. రంగాజమ్మ మన్నారుదాసవిలాసము, విజయరాఘవుని రఘునాథనాయకాభ్యుదయము నట్టివే.
  3. చూ. రాయవాచకము (ఆం. సా. ప. పచురణ)-2వ పుట
  4. పద్యసంఖ్యను బట్టి శతకప్రాయ మైన సముఖము వేంకట కృష్ణప్పనాయకుని రాధికాసాంత్వనము పాతిక పద్యములు సీసములే.
  5. 2. ప్రాసఘటితముగనే “ఆచ్చుత" శబ్దమునకుఁ బ్రయోగాంతములు :
    అ. సముఖము రాధికాసాంత్వనము (ఆం. సా. ప. ప్రచురణ) - 8వ పద్యము
    ఆ. రఘునాథనాయకాభ్యుదయము (తంజావూరు సరస్వతీమహలు ప్రచురణ) లో నైదు పర్యాయములు ప్రాసఘటితముగానే ప్రయుక్తమైనది. శ్రీ మల్లంపల్లివారి పీఠికలో నవి యెత్తి చూపఁబడినవి.