ఉపన్యాస పయోనిధి/పీఠిక
పీఠిక
బ్రహ్మశ్రీ. కాశిభట్ట బ్రహ్మయ్య శాస్త్రులుగారిచే నప్పుడప్పుడు పత్రికలలో వాయఁ బడు నుపన్యాసములను జదువుచుండు గొందఱుమిత్రులు వానియందలి విషయ విలక్షణత, భావగాంభీర్యము, యుక్తి మున్నగు ననేక సంవదలచేఁ దులదూగు వారిధోరణికిఁ బ్రీతులై నన్ననేకసారులు వారి వ్యాసముల నన్నిటిని జేర్చి యేకముఖముగాఁ బ్రచురింపుమని కోరుచుండిరి. ఇట్టికోర్కెయే నాకును జిరకాలమునుండి కలిగియుండెను గావున బ). బ్రహ్మయ్య శాస్త్రులవారితోఁ ప్రస్తావించితిని. వా రందుల కంగీకరించిరి గాని తెఱపిలేనికతమున వ్యాసములను బంపలేక పోయిరి. తుదకు నేనే వారితావునకుఁబోయి కొన్ని వ్యాసములను సేకరించి తెచ్చి ప్రస్తుతము మత విషయములకు సంబంధించినవి మాత్రము 472 పుటలలో పట్టినన్ని మాత్రమే ప్రధమ సంపుటముగాఁ బచురించితిని.
మత సంబంధమయిన వన్నియుఁ బచురించుటకు మఱి యొకటిరెండు సంపుటములు పట్టును. అటు పైన ఆంధ్ర భాషావాఙ్మయమును గూర్చినవి 2, 3 సంపుటము లగును. వివిధ విషయములు మఱి రెండు సంపుటము లగును. వాని నన్నిఁటిని వరుసగాఁ బ్రచురించు తలంపుతో నిదిముందుగాఁ బ్రచురించితిని.
ఇప్పటికి రమారమి 25 సంవత్సరముల కంటెఁ బూర్వ మునుండియే బ్ర. బ్రహ్మయ్య శాస్త్రులవారు వ్యాస రచన ఈఁ బ్రారంభించిరని నాతలంపు.
ఆంధ్ర దేశమునందీ కాలము మిక్కిలిముఖ్యమైనది. ఇప్పుడి ప్పుడే రాజమహేంద్రవరమునందు ఇంగ్లీషుకళాశాల స్థాపింపఁ బడియాంధ్రులకింగ్లీషు భాషాభ్యాసమునకవకాశముగలిగెను. ఇప్పుడిప్పుడే రాజకీయ వ్యవస్థయందు హిందూ దేశము నకు శాంతిగలిగెను. చల్లని బ్రిటీషు రాజ్యాంగపు పద్ధతుల యందు సకలజనుల కిప్పుడిప్పుడే విశ్వాసము గలిగెను. హిందూరాజ్య పరిపాలకులగు హూణులును, ఆంధ్రులలోని విద్యాధికులును చేరి సాంఘిక విషయములగూర్చి యోజం చి యుచితములగు కొత్త మార్పులను పెట్టుటకై ప్రయ త్నించిన దిప్పుడిప్పుడే.
దివ్యజ్ఞాన సమాజమువారొక చెంతను, మిషనరీలొక డెం తను, బ్రాహ్మ సామాజికులొక చెంతను తమకు దోచిన విధము గా హిందూమతము ను గూర్చి తెలిసికొనుటకు ప్రారంభించిన దిప్పుడిప్పుడే.
ఈ సమయ మెల్లవిధముల సాంఘిక పరిణామము నకు దగి యుండెను. ఇట్టిసమయమందే మ॥ రా॥ రా॥ శ్రీ రావుబహ ద్దరు కందుకూరి వీరేశలింగం వంతులుగారు తమ వ్రాతల మూలమున విధ్యాధికులచే సమ్మానింపబడుచుండెను. వారు రచించుచుండు హాస్య సంజీవని మున్నగు నూతన ఫక్కిక గ్రంధరచన ఆంధ్ర జనులచే పఠింప బడుచుండెను. వికట కవియనియు, వింత మనుజుడనియు వంతులవారిని పూర్వాచార పరాయణు లనజొచ్చిరి. స్త్రీ పునర్వివాహ ప్రయత్నమునకుఁ బూర్ణాది వేయఁబడిన దీసమయముననే. ఈకాలముననే హిందూ ఆచారములలో ననేకములు వంతులు వారిచే ఖండింపఁబడెను. అనేకాచారములు వెక్కిరింపఁబడెను.
అది యేమి చిత్రమోగాని యీ కాలమున పంతులవారు హిందూ ఆచారములను ఖండించుచుండగా దివ్యజ్ఞాన సమా జమువారొక చెంతను, పాశ్చాత్యులలో ననేకు లొక్కమొ గిని హిందూ ధర్మముల ప్రాశస్త్యతను గూర్చి తండోవతం డములుగా గ్రంధములనుఁ బ్రచురింప సాగిరి.
మొత్తముమీద ఆంధ్రులలో హూణ విద్యాధికులకును, హూణ భాషనభ్యసించు విద్యార్ధులకును హిందూమతమన హే ళనగా నుండెను.
విద్యార్థులకు సంధ్యావందన మందు గౌరవము తగ్గెను. జన్నిదము తీసివేయ బడకున్నను చుల్కగా చూడబడెను. హిందూమత సన్న్యాసులయందు నిరసన భావమును వారి ప్రవర్తన యందగౌరవమును నెక్కొల్పబడెను. క్రమముగా జుట్టులు కత్తిరించుకొనుట, మడికట్టుకొనకుండ భుజించుట, వి గ్రహారాధనము దేవాలయములన్న హేళనయు ప్రారంభ మాయెను. ఇట్లు ఆనాటికంటే నానాడు ఇంగ్లీషు భాష నభ్య సించు మన విద్యార్థులకు హిందూమత మందలి గౌరవము క్షీణించెను. పిన్నవయస్కుల హృదయములందు కొంతకా లముదనుక మతము, దైవము లేకుండెను. క్రమముగా నిరీ శ్వరవాదము తలచూపెను.
చెన్నపట్టణము నందలి ద్రావిడహూణ విద్యార్ధులకుమా త్రమీ మార్పులు రుచింపలేదు. బ్ర|| మహా మహోపాధ్యా యులరగు కొక్కొండ వేంకటరత్నము వంతుల వారు మా త్రము ఆంధ్ర దేశమందలి విద్యార్ధి సంఘములో గలిగిన నీ మార్పులను హర్షించక తమ పత్రిక యందు ఖండింప జొచ్చిరి. ఆపత్త్రిక వీరేశలింగము వంతులవారి పత్త్రికవలె వ్యాప్తి లేనిదగుటచేతను, భాషాశైలి కఠినముగా నుండుట చేతను కొ లఁది మంది చేతమాత్రమే వరింపబడుచు తాను పూనిన కార్య మును సంపూర్ణముగా నిర్వహింప జాలకుండెను.
అప్పటి నుండి రమారమి ఏడు ఎనిమిది సంవత్సరముల క్రిందటి వఱకును ప్రతివిద్యార్ధియు తాను సంఘసంస్కర్త గావనిన నొకతప్పుగా తలంచుచుండెను.
రావు బహద్దరు వీరేశలింగము వంతులవారు స్త్రీవున ర్వివాహమును జేయుటకు దీక్షబూని వానినిర్వహించుటతో నాంధ్ర దేశమున నూతనశకము ప్రారంభమయ్యెను. విద్యా ధికులలో కొందఱు చీలి సంఘసంస్కార మలజడిలేని దే శీయ పద్ధతితో నడుపవలెనని నవీన శాఖ వారూహించిరి.
పంతులవారంతట హాస్యప్రసంగములు మాని మత విష యికమగు వ్రాఁతలు వ్రాయఁ జొచ్చిరి. వీరి యాంధ్ర భాషా పాండిత్యమును మెచ్చుకొన్న వారుఁగూడ వీరి మతపద్ధతుల తో నేకీభవింపరైరి. రానురాను వంతులవా రేగ్రంధమును రచియించినను ఎక్కడనూ హిందూమత ధర్మనిరసనము దగులుచునేవచ్చెను.
అదివఱకే హూణభాష నభ్యసించుచు, హిందూ మతము నుగూర్చి శాస్త్ర శోధనము నిరంతరము చేయు చుండు బ్రహ్మయ్య శాస్త్రులవారు హిందూమత ధర్మములను విద్యా ర్ధులకు బోధింప మొదలిడిరి. పత్రికల కుపన్యాసముల వ్రా యజొచ్చిరి. అప్పుడు కాకినాడ యందుఁ బ్రచురింపఁ బడు చున్న రాజయోగి పత్త్రిక యందు వీరి వ్యాసములు ప్రచు రింపఁబడుచుండెను. కొందఱు శ్రీ శాస్త్రులవారి వ్రాతల నత్యాదరముతోఁ జదువఁ జొచ్చిరి. బ్రహ్మయ్య శాస్త్రిగారు హిందూ మత ప్రాశస్త్యము వెల్లడించుటకుఁ బూనుకొనిరి. అందులకై వీరామతమును ఖండించుచుండు బ్రాహ్మసామాజి కులయొక్కయు క్రీస్తుమతప్రచారములు యొక్కయువ్రా తలను కఠినముగా మొగమోటమిలేక ఖండించుటకుఁ బ్రా రంభించిరి. ప్రాచీన హిందూమత ధర్మములను గ్రంథ రూ పముగా విస్తారము ఖండించినవారు శ్రీరావుబహద్దరు వీరే శలింగము పంతులుగారగుట చేతను, వారి గ్రంధము లప్పుడు విస్తారముగాఁ బఠింపఁబడుట చేతను వానిని యధోచితముగా ఖండించుట తప్పనిపనియయ్యెను. ఇందువలననే బ్రహ్మ య్యశాస్త్రులవారికి వీరేశలింగము పంతులవారి వ్రాతలు ఖండించుటతప్ప వేరేమియుఁ బని లేదనియు, ఇంత బద్ధవైర ము పూనుట తగదనియు హూణవిద్యాధికు లపవాదమును బ్రకటించిరి.
అంతేగాని ఒక్కరును పంతులవా రవసరానవసరముల ను పాటింపక హిందూమతము నొక్క పెట్టుగా నేలనిందిం చిరి? పాశ్చాత్య పండితులలో లనేకులును , దివ్యజ్ఞాన సమా జికులలో లనేకులును గనిపెట్టిన హిందూమత ప్రాశస్త్యము ను వీరేలగనరైరి? అని విమర్శించువారు చాల కాలముదా క లేకపోయిరి. పంతులవారి గ్రంథములలో స్వాములవా రు వచ్చినచో తప్పక వారికి విధవా సంపర్కమును గలిగిం చుచు వచ్చిరి. ఇది ధర్మమా? సన్న్యాసులలో మంచివా రు మాత్రము లేరా? ఉండినచో నొక్కరి సచ్చరిత్రము నైన యేల పాటించి ఒక్క గ్రంధమును వ్రాయించినారు కా రు అని విచారించరైరి ?
పంతులవారు గ్రమముగా మతవిషయము నందుఁ బ్రవే శించి తమకు తోచినట్లెల్లవ్రాయుట చేతను వారివ్రాతల ను ఖండించి నంతమాత్రమున క్రైస్తవమిషనెరీల వ్రాత లును , బ్రాహ్మ సామాజికులవ్రాతలును గూడఖండింపఁ బడు చుండుట వలనను శాస్త్రులవారు వారు ప్రచురించిన గ్రంధ సంపుటముల నన్నిటిని మిక్కిలి జాగ్రతతో పరిశీలించి ఖండ నకు ప్రారంభించిరి.
సూక్ష్మ దృష్టిచే జదువువారు శాస్త్రుల వారి వ్యాసముల న్నియు పంతులవారు గాని మఱియొకరు గాని హిందూమ తమును దూషించగా దానిని సమర్ధించుటకు వ్రాసినవేగాని యూరక కూర్చుని కొత్తగా నూతన సిద్ధాంతములను బ్ర కటించుటకు వ్రాసినవి కావని తెలిసికోగలరు.
వీరేశలింగము వంతులవారు సంఘము నున్నతికి దెచ్చు టకై తాము విరుద్ధములను ననర్ధదాయకములని నమ్మినవా నిని ఖండించుట యెట్లవసరమని తలంచిరో యట్లే బ్రహ్మ య్యశాస్త్రుల వారును హిందూ సంఘము నున్నతికి దెచ్చుట కై యేయేవ్రాత లనర్ధదాయకములని నమ్మిరో వానినే ఖండించి వ్రాసిరి.
బ్రహ్మశ్రీ కొక్కొండ వేంకటరత్నము పంతుల వారి వ్రాతలను, వీరేశలింగము పంతులవారి ఖండనలను జూచి న వారిద్దరు బద్ధ వైరము గలవారని తలంచుచుండిరి. వారిరు వురెప్పుడును కలిసిమెలసిమాట్లాడుకొనుచు నొకరియందొకరు గౌరవము గలవారుగా నున్నారు. అయినను వారియభిప్రా యముల మాత్రము పరస్పర విరుద్ధముగా నుండును. అట్లే బ్ర. బ్రహ్మయ్యశాస్త్రులవారికి పంతులవారియందెంతో గౌర వముగలదు. ఎవరికిలేదు? అభిప్రాయములు భిన్నములై యుం డునంతమాత్రమున ఒకరినొకరు ద్వేషించువారనితలంపరాదు.
శ్రీపంతులవారి స్త్రీ పునర్వివాహపుస్తకముని చెన్నపట్టణ ము, నెల్లూరు, విశాఖపట్టణము మున్నగు ప్రదేశములలోనివార నేకులు ఖండించిరి.అంత మాత్రముచే వారెల్లరు ద్వేషులా కారు,
బ్రహ్మయ్యశాస్త్రిగారు యుత్తమమగు సదుద్దేశ్యముతోనే యీవ్యాసములు వ్రాసిరనినాతలంపు. అంతేగాక పంతులవా రితరులను ఖండించునప్పుడు వ్రాసినవాతలకంటె బ్రహ్మయ్య గారు పంతులవారిని ఖండించినప్పుడు వ్రాసిన వ్రాత లెక్కు వ తీక్ష్ణముగాలేవు. ఈవిషయమును విమర్శించువారు వీరే శలింగము పంతులవారు కొక్కొండ వేంకటరత్నము పంతు లవారి నీతిచంద్రికను గూర్చి వ్రాసిన ఖండనమును జూచిన బోధపడును.
పంతులుగారు హిందూమతమును గూర్చి గాని శ్రీకృష్ణు నిగూర్చి గాని వ్రాసినప్పటికంటె నిప్పుడు దేశకాలముల యందు మాఱ్పులు జరిగినవి. శ్రీకృష్ణుని పవిత్రచారిత్రమును విమర్శించుటకు బమ్మెరపోతనామాత్యుని తెలుగు భాగవత ము చాలదని విద్యాధికుల నేకులు తెలిసికొనిరి.
శ్రీకృష్ణుని గోపికలు సంస్కృతమున కుచద్వయీ భార వహలుగారు. ఈ స్వల్ప విషయమును శ్రీపంతులవారేల గ్ర హింపరైరి. సంస్కృత పాండిత్యము లేకనా, కాదు, కా దు. వారికి మొట్టమొదట శ్రీకృష్ణ చారిత్రము పవిత్రముగా దని తోచినది. ఆయూహను బలపఱచుకొనుటకైయే యత్నించిరి. అంతకంటె వేఱు కారణము లేదు.
పంతులవారి యూహలలో మార్పుచెందదగిన వనేకము లుగలవు. స్థాలీపులాక న్యాయమునపై విషయ ముదాహరణ ముగా జూపఁబడెను. ఇట్లే నూతనవిషయ పరిశోధనలవల నను, హిందూ దేశమందును, ఖండాతరములయందును నీమ ధ్య జఱిగిన శాస్త్ర శోధనలవలనసు హిందూమత ` విషయ మై మనము తెలిసికోదగిన విషయము లనేకము లియుప న్యాసములయందు గలిగి యుండుట చేత నేనీ గ్రంధమును ప్రచురించితిని.
విద్యాధికులీ వ్యాసములను జదివి యిందు ఖండనీయాంశ ములు గలపట్ల ఖండించి, యామోదించదగినపట్ల నామోదిం చి, సంఘమునకు మేలు చేయవలెనని ప్రార్ధించుచున్నాడను.
ఈ “ఉపన్యాసపయోనిధి” యందు మనదేశమందలి హూణవిద్యా ప్రగల్భులగు నాంధ్రులలో సాంఘిక, నీతి, మతములయందు గలిగిన చిత్రవిచిత్రములగు మార్పులనేక ములు దిక్ప్రదర్శనముగా జూపబడినవి. మన యాంధ్రదేశ మందలి విద్యాధికులదృష్టి నాకర్షించిన బ్రహ్మసమాజమత మునుగూర్చియు, ఇండియా, జపాను, ఇంగ్లాండు, అమెరికా మున్నగు దేశములయందు గలుగుచున్న మత వేదాంత ప్ర చారమునుగూర్చియు, సాంఘిక నీతి మతవిషయములలో గొప్ప మార్పులను గలిగించి కొంతవఱకు మనజిల్లాలనుఱ్ఱూత లూపిన రావు బహద్దరు వీరేశలింగము వంతులుగారి సాం ఘికాదిమతధర్మములనుగూర్చియు, హిందూమతమును ఖం డాంతరములయందు నాటి ప్రాచీన మహర్షుల పవిత్రవాక్య ములను పునఃప్రతిష్ఠించిన శ్రీవివేకానంద, అభేదానంద, స్వ రూపానందాది స్వాముల మహిమలను గూర్చియు, పశ్చిమ ఖండపు నాగరకతను హిందూదేశమున గొన్ని మార్పులతో స్థాపించిన శ్రీ రాజా రామమోహనరాయులు, ప్రతాపచం ద్ర ముజుందారు, పండిత శివనాధశాస్త్రి, కాశినాథత్య్రంబ కటిలాంగు, అనీబీసాంటు, సీతానాథ తత్త్వ భూషణులవా రు, జోగీంద్రచంద్రఘోషు , కేశవచంద్రసేనులు, రాయిసాలి గ్రామసాహేబుబహద్దర్, గోకులాజీగౌరీశంకరులు, పండిత గోస్వామి, బాబు నురేంద్రనాధ్ బెనర్జీ, రమేశచంద్రదత్తు, లాలా లజపతిరాయలు, బాల గంగాధరతిలక్కు, మహర్షి దేవేంద్రనాధఠాగూరు, యమ్. యే. రామానుజాచార్యులు గారు, రఘుపతి వేంకటరత్నము నాయుడుగారు, మున్నగు దేశభక్తులనుగూర్చియు ననేక విషయములిందు సమయోచి తముగా పేర్కొనఁబడినవి.
హిందూ దేశమునందు సంఘసంస్కారదీక్ష మిక్కిలిప ట్టుదలతో నెరవేర్పఁబడు సమయమున వ్రాయబడిన పూర్వ పక్ష సిద్ధాంతము లిందువిషయాను సారముగా గై గొనబడెను.
ఇదిగాక, నిష్పక్ష పాతబుద్ధితో మనదేశపు మత సాంఘి కవిషయములను గూర్చి పశ్చిమఖండ పండితులగు మోక్ష మూలరు, నెస్లీ, వెయిను, హేజల్, ప్రోపెసరు కాల్డువెల్, మోనియరు విల్లియమ్సు' అబీడూబొయి, బెంజిమెన్ కిడ్డు, హక్సిలీ, ప్లేటో, ఎమికార్మసు, ప్లామారియన్, కోలుబ్రూ కు , సాక్రటీసు, జనఫను, గ్రాంటు, వారన్ హేస్టింగ్సు, హంబోల్టు, లాసెన్ , నెయిల్ అలెగ్జాండరు, డాక్టరు నికాల్ సన్, ఆర్చిబిషప్పు ట్రెంచి, మెగాస్తనీసు, మున్నగువారు చేసి న కృషియు, తేల్చిన సిద్ధాంతము లిందుదాహరింప బడియెను.
ఈయువన్యాసములయందొక విశేషముగలదు. ఎవరిను ద్దేశించి వ్రాయఁబడునో వారివాక్యములును, తదాప్తవా క్యములును విమర్శించబడి సిద్ధాంతము చేయబడును,
ఇండలి యువన్యాసరచన విద్యాధికులదృష్టి నాకర్షించ దగియున్నది. యుక్తి ప్రధానముగాను, పశ్చిమ ఖండవా సుల యభిప్రాయములు రెండవప్రమాణముగాను, వేదము లు, ఉపనిషత్తులు, పురాణములు, బైబిలుమున్నగు ప్రాచీ న గ్రంధదృష్టాంతములు మూడవ యాధారముగా గైకొనఁ బడి, ఔచిత్యము సర్వత్ర పాటింపబడుచు వ్రాయబడినట్లు కాన్పించుచున్నది.
ఇవిగాక హిందూ దేశమందును, ఖండాంతరములయందు ను ప్రచురింపఁబడుచుండు సత్యవాదిని, ఆంధ్ర కేసరి, ఇండి యను మెసింజరు, సాటరుడేరివ్యూ, బ్రహ్మవాదిని, సోషలు రిఫారుమరు మున్నగు పత్రికలలో వ్రాయఁబడిన వ్రాతలు సందర్భోచితముగా విమర్శింపఁబడియున్నవి.
బ్రిటీషు ప్రభుత్వ మహిమచే సులభ లభ్యములు గావింవ బడిన సకల ప్రపంచమందలి యభిప్రాయములును యధో చితముగా గైకొనబడియెను.
ఇట్టియనేక విషయములతో నొప్పారు నీయుపన్యాసములు సంఘ సంస్కరణమునం దభిలాష గలిగి దేశసేవ చేయు చున్న వారిచే జదువ దగినవిగా నున్నవి. గ్రంధ విస్తర భీతిచే నిందు గైకొనబడిన ఆంగ్లేయ, సంస్కృత, హూణగ్రంధముల పేర్లుదాహరించలేదు. వాని నిపాఠకులాయా సందర్భములం జదువునప్పుడుచూడగలరు.
గ్రంథకర్తను గూర్చి యొకటి రెండుమాటలతో నీయు పోద్ఘాతము ముగించెదను.
బ్రహ్మయ్య శాస్త్రులవారు కేవల గ్రంధరచనతో నూ రుకొనక ఆర్య మతధర్మములను గూర్చి యనేక స్థలముల యందు మహోపన్యాసములిచ్చుచు ననేకస్థలములయందు సభలను స్థాపించుచు, ఆర్యమతబోధిని యను మాసపత్త్రి కలో దమయభిప్రాయములను వెల్లడించుచు మిక్కిలి పాటు పడుచున్నారు. దైవము వీరికి చిరాయుర్నిరామయంబులిచ్చి రక్షించుగాక !
బ్రహ్మశ్రీ బ్రహ్మయ్య శాస్త్రులవారి ఛాయాపట మిందు ముద్రించవ లెనని ప్రయత్నించితిని గాని వారి కొన్ని సారులు వ్రాసినను పంపకుండుటచేత నదివిడిచి పెట్టవలసి వచ్చినందు లకు చింతిలుచున్నాను.
క్రమముగావారి ఉపన్యాసము లన్నియు గ్రంధసంపుట ములుగా ప్రచురించు నాతలంపునిర్విఘ్నముగా పరమేశ్వరుఁ డు కొనసాగించుగాక.
ఇట్లు విధేయుఁడు,
నందిరాజు చలపతిరావు,
సంపాదకుఁడు.