ఉద్భటారాధ్యచరిత్రము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీ

ఉద్భటాచార్యచరిత్రము

ప్రథమాశ్వాసము

శా. (శ్రీవక్షః కమలాసనాది దివిజశ్రేణి శిరోమణ్య భి
ఖ్యావృద్ధి ప్రదశాణవన్నఖర) పాదాంభోజుఁ డధ్యాత్మవి
ద్యావిశ్రాంతుఁడు చంద్రశేఖ(రుఁడు నిత్యశ్రీ)యుతుం జేయు భ
ద్రావాసుండగు నూరదేచవిభు (నిత్యశ్రీయుతుం జేయుతన్.) 1

మ. (కమనీయంబగు నాథుమోమున నపాంగక్రీడ గావించి క)
ర్ణ మరుద్భుక్ఫణరత్నదీప్తిలహరీ రక్తాంకగండస్థ రే
ఖ మృగాక్ష్యంతరదత్తనూతన నఖాంకంబంచు నంకించు నా
హిమశైలాత్మజ (యూరదేచవిభు నెంతేఁబ్రోచు నశ్రాంతమున్.) 2

ఉ. (స్వీకృత తల్పరూపుఁడగు శేషు ఫ)ణామణికాంతి పర్వి ని
త్యాకరరత్నగైరిక మహాద్యుతిఁ బొల్పగు నీలశైలముం
జీకొనుమేను మేటిజగతీధరధారి మరా(ళవాహనున్
సాకిన బొడ్డతమ్మిగల శౌరి యలర్చుత దేచ ధీనిధిన్.) 3

ఉ. అంచితపక్షపాతగతి నారయఁ గూరుట గల్గి శారదా
చంచలనేత్ర! హంసిక్రియఁ జారు నిజాననపద్మమందు గ్రీ
డించ సుఖించు ప్రో(డ ప్రకటీకృత సృష్టికిఁ దోడునీడ యా
కాంచన గర్భుండేలు నొడి)కంబుగ నన్నయమంత్రిదేచనిన్. 4

సీ. సజలవలాహక శ్యామమోహనమూర్తి
భద్రకాళికి నేత్రపర్వమొసఁగ
వీరరసాం(పగా వీచీలసద్వీక్ష
ణములు భువన రక్షణమును దెలుప)
(నసదృశ మందహాసాంశు జా)లంబులు
నెలపూవు నమృతంపుఁ గలిమిఁ బోల్పఁ
దరళదంష్ట్రాధాళ ధళ్యంబులును భూష
ణప్రభాంకురము లున్నతిఁ దలిర్పఁ
గీ. గొండవీటి (కనకపీఠిఁ గొలువుదీరు
భక్తమానస చాతకవార వార్ష
సమయవిస్ఫూర్తి) శ్రీవీరశరభమూర్తి
ప్రోచు నూరన్నధీమణి దేచమంత్రి. 5

చ. అమృతకరావతంసు తలయందలి యేటిజలంబుఁ గ్రోలి తుం
డము గొ(నితోడుతోఁగు ధరనాథ తనూభవ మ్రోల స్తన్య పా
నమున నెసంగి యిర్వురు పెనంగొని ముద్దిడుకొన్న) యుగ్మవి
భ్రమము వహించు హస్తిముఖుఁ బ్రార్థన చేసెద నిష్టసిద్ధికిన్. 6

ఉ. అధ్వరకర్మకౌశలసమంచితు మానసపద్మకీలితో
క్షధ్వజ(భక్తిసౌరభు నఖండషడధ్వ రహస్యపారగున్
మధ్వతి శాయివాణి శ్రిత మానస గుప్తతమోనభోమ)ణిన్
సాధ్వనుభావు మద్గురుఁ బ్రసన్ను భజించెద నైలనాహ్వయున్. 7

మ. కలశాంభోనిధి యాఁడుబిడ్డ, శశికిం గారాబుతోఁబుట్టు, (వి
ద్యల దేవేరికి నత్త, యజ్ఞపురుషుండౌ విష్ణు నిల్లాలు, శ్రీ
జలజాతేక్షణ ప్రోచుఁగాత) నిరతైశ్వర్యం బవార్యంబుగా
నలఘుప్రాభవు నూరయన్నవిభు దేచామాత్యు నిత్యోన్నతున్. 8

సీ. సింహా(సనీకృత చిరయశః కవిచిత్త
యుపవనీకృతరసాభ్యుదితరచన
లీలాపదీకృత కీలితాచ్ఛాం)భోజ
సైంధవీకృత మదస్ఫారహంసి
ప్రియసఖీకృతమనఃప్రియద పాండురకీరి
సరసీకృతాంభోజ జాతవ(దన
విహృతస్థలీకృత వేధాః పరిష్వంగ
విహృతిస్థలీకృత వేదవీధి
గీ. అనవరత కరుణాఝరీ కనదపాంగ
ధ్వ)రణిత మణిమయవీణా వితతఝంక్రి
యా సమాకర్ణన ప్రహృష్టాంతరంగ,
శారదాదేవి మతిఁ గృతీశ్వరున కొసఁగు. 9

శా. సంసా(రాహ్వయసింధు)పోతము జగత్సంబోధదీపాంకురున్
కంసారాతిపదాబ్జభంభరము సాక్షాత్పద్మగర్భున్ బుధో
త్తంసంబున్ శ్రుతిసంకరోద్దళన పాథఃక్షీర భేదక్రియా
హంసంబున్ బరిశీలితస్మృతిరసున్ వ్యాసున్ బ్రశంసించెదన్. 10

క. శ్రీరామాయణదుగ్ధాం
భోరాశిసుధామయూఖు బుధవినుత[1]గుణో
దారు నఘమత్తవారణ
వారణరిపుఁ బ్రస్తుతింతు వాల్మీకిమునిన్. 11

ఉ. గ్రాంథిక సన్నుతప్రతిభఁ గాంచి రసజ్ఞత మించి యాదిమ
గ్రంథము లుగ్గడించి ఫణి రాట్పరికల్పిత శాస్త్రవీధికిన్
బంధువులైన సత్కవులఁ బ్రార్థన చేసెద దుష్ప్రబంధ సం
బంధమహాంధకార ఖరభాను గభీరవచోమచర్చికన్. 12

వ. అని యిష్టదేవతాప్రార్థనంబును విశిష్టసత్కవికీర్తనంబును బరిఢవించి యొక్కప్రసిద్ధప్రబంధరచనాకౌతూహలంబు మనంబునం బెనంగొని యుండు నవసరంబున. 13

సీ. మహిత మూలస్థాన మల్లికార్జున శిర
స్స్థలచంద్రచంద్రికా ధవళిమంబు
చెదలువాటీపుర శ్రీరఘూధ్వహభుజా
స్తంభరక్షణవిధాసంభృతంబు
వేదండముఖతడా గోదితపద్మ సౌ
గంధికగంధపాణింధమంబు
రాజబింబాననా రాజిత గంధర్వ
మాధురీ సాధురీతీధరంబు
గీ. కరటికటనిర్గళద్దాన నిరవధిక
మగ్రనూతనవృష్టి జంబాలి తాఖి
లావనీ పాలమందిర ప్రాంగణంబు
గురుసమృద్ధుల సయిదోడు కొండవీడు. 14

మ. పరఁగన్ వారిధివేష్టితాఖిల మహీభాగంబునన్ రెడ్డిభూ
వరసింహాసనమై, శుభాయతనమై, వర్ధిల్లుతత్పట్టణం
బురుబాహాబలసంపదం బెనుచు భద్రోద్యోగి నాదెండ్ల గో
ప రసాధీశుఁడశేషబంధుకుముద ప్రాలేయ ధామాకృతిన్. 15

సీ. భూధురంధరభావమున భోగిపతియయ్యు
విప్రవరాసక్తి వృద్ధిఁ బొంది
వరవిక్రమప్రౌఢి నరసింహుఁడయ్యు నె
పుడు హిరణ్యకశిపు స్ఫురణ గాంచి
దివ్యభోగవ్యాప్తి దేవతావిభుఁడయ్యు
బలపోషణఖ్యాతిఁ బరిఢవిల్లి

ప్రచురకారుణ్యసంపద రాఘవుండయ్యు
శివధర్మపాలన స్థితి వహించి
గీ. బాణ బాణాసనస్ఫూర్తి ద్రోణుఁడయ్యు
నవ్యపాంచాల లక్షణోన్నతి వహించి
జలధివలయిత వసుమతీ స్థలమునందుఁ
గొమరు దీపించు నాదెండ్ల గోపవిభుఁడు. 16

సీ. దరహాసచంద్రికా ధాళధళ్యంబులు
భుజగేంద్రకాంతా కపోలములకు
తారహారచ్ఛటా ధాగధగ్యంబులు
చారణకామినీ స్తనములకును
సంఫుల్లమల్లికా చాకచక్యంబులు
గంధర్వమదవతీ కబరికలకు
నవచందనాలేప నైగనిగ్యంబులు
దివిషన్నితంబినీ దేహములకు
గీ. ధవళధామ సుధాశారదాపటీర
దర సుధావారినిధి సుధాంధఃకరీంద్ర
సాంద్రతర కాంతివిభ్రమ సంగతములు
తిమ్మవిభుగోపమంత్రి సత్కీర్తిరుచులు. 17

సీ. కరవాలకామారి కరివధూనయన క
జ్జలు హాలహలభోజనము గాఁగ
ప్రచురదానాంబుధారాపద్మ కర్థిహ
స్తంబులు వరనీరజములు గాఁగ
అకలంకమతిమరాళికిఁ జతుశ్శ్రుతివీధి
సాంద్రపయఃపూర్ణఁసరసి గాఁగ
గుణమౌక్తికములకుఁ గోవిదశ్రుతిసీమ
ల కుటిలగుప్తి పేటికలు గాఁగ

గీ. భూమ సప్తార్ణవీ సప్తకీమనోజ్ఞ
సర్వసర్వంసహా పూర్ణచంద్రవదన
రాణివాసంబుగా ఖ్యాతి రాసి కెక్కె
గురుయశోహారి నాదెండ్ల గోపశౌరి. 18

సీ. అరిపురజయలక్ష్మి హరునిఁ బోలెనె కాని
తగులండు విషధరత్వంబు నింత
సంపూర్ణతరకాంతిఁ జంద్రుఁ బోలెనె కాని
దోషకరోన్నతి దొరలఁ డెందు
నిజభుజాబలరేఖ విజయుఁ బోలెనె కాని
భీమోన్నతస్ఫూర్తిఁ బెరుఁగ నీఁడు
గాంభీర్యమునఁ బాలకడలిఁ బోలెనె కాని
భంగసాహిత్యంబుఁ బట్టఁ డర్థి
గీ. నఖిలదుర్మంత్రివదనముద్రావతారుఁ
డాత్మపంకజవీథీ విహారశౌరి
కీర్తి గంగాపవిత్రత క్షితితలుండు
గుణమరున్మంత్రి నాదెండ్ల గోపమంత్రి. 19

ఉ. ఆహవకౌశలప్రహసి తార్జునతన్ సముదీర్ణధైర్య రే
ఖా హృతమేరుసారత మహాద్భుతుఁడై గుణనిర్జితేభ ర
క్షోహరుఁ (డై చెలంగు నల) గోపనమంత్రికి రాజకార్య ని
ర్వాహకుఁ డూరదేచసచివప్రవరుండు దలిర్చు నుర్వరన్. 20

సీ. తన దానవిభవంబు ధనదానవద్య వి
శ్రాణనప్రక్రియఁ జౌకపఱప
తన వచశ్శుద్ధి శాంతనవ పౌత్త్రాదు లం
తటివారలకు నద్భుతం బొనర్ప
తన మూర్తి చూచినంతన మూర్ధములు వంచి
దర్పితారాతిబృందములు దలఁక

తన మనస్స్థితి పురాతనమహామునిమృగ్య
మగు శంభుతత్త్వంబుఁ దగిలి ప్రబల
గీ. ప్రబలుఁడై యొప్పు నాదెండ్ల భవ్యవంశ
దీప తిమ్మప్రధానేంద్ర గోపసచివ
రాజ్యసంరక్షణక్రియారబ్ధబుద్ధి
గోచరుండూరయన్నయ దేచమంత్రి. 21

వ. ఇట్లు మహనీయమనీషి మనఃకమలదివాకరుండును వివిధవిరోధిహృదయభీకరుండును, రసనాగ్రజాగ్రదశేష విద్యాసందర్భుండును, నభంగురప్రతిభాపద్మగర్భుండును, విశ్రుతవిశ్రాణనవిజితసముద్రుండును, విశుద్ధస్వాంతవిశ్రాంతవీరభద్రుండును, వనీపకవనోల్లాసనవచైత్రుండును, గౌండిన్యగోత్రుండును, సన్నుతసమున్నతమహభోగసంక్రందనుండును, నిబిడభుజాబలవిడంబితకుమారుండును, గృష్ణమాంబికా కుమారుండును, శాశ్వతైశ్యర్యపురశాసనుండును నగు నా ప్రధానపరమేశ్వరుం డొక్కనాఁడు. 22

మ. కవులున్, బాఠకులున్, బ్రధానులు సుధీగణ్యుల్, పురాణజ్ఞులున్,
వివిధార్థుల్, సఖులున్, బురోహితులు నుర్వీనాథులున్, జోస్యులున్,
ధవళాక్షు ల్గొలువంగ నిండుకొలువై దైవారుహర్షంబుతో
నవధానంబున నుండి శంకరకథావ్యాసక్తి భాసిల్లుచున్. 23

సీ. కౌండిన్యమునిరాజ! మండలేశ్వరవంశ!
పాధోథి నవసుధాభానుమూర్తి!
బాలగుమ్మేలేశ! పదపయోజద్వయీ!
ధ్యానధారణ సముదాత్తచిత్తు!
మానితాయాతయా మా(నామ)భావిత
విపులమహాయజుర్వేదవేది!
రామేశ్వరస్వామి రమణీయకరుణావి
శేషపోషితవిలసితసమగ్ర!

గీ. సహజసాహిత్యమాధురీసంయుతాత్ము
లక్కమాంబకు ఘనయశోలక్ష్మి వెలయు
రామధీమణికిని బుత్త్రు రామలింగ
నామ్యవిఖ్యాతుఁ గావ్యనిర్ణయధురీణు. 24

వ. నన్ను సబహుమానంబుగా రావించి సమున్నతాసనబునఁ గూర్చుండ నియమించి కర్పూరతాంబూలంబు జాంబూనదపాత్రంబున నొసంగి తారహారాంగుళీయకంకణకర్ణభూషణపట్టమాంజిష్ఠాది విశిష్టవస్తుప్రదానపురస్సరంబుగా నిట్లనియె. 25

చ. విలసదయాతయామబహువేదవివేకపవిత్రభావసం
కలితములైన వాక్యములఁ గావ్యముఁ జెప్పఁగ నేర్తు వాదికా
వ్యులకవితానిగుంభనసమున్నతిఁ గాంచినవాఁడ వౌదు నీ
వలఘువచోవిలాససుగుణాకర రామయలింగసత్కవీ! 26

మ. భవపాశత్రుటనక్షమంబులగు నా ఫాలాక్షుగాథావలుల్
చెవులారన్ వినుచుండు నెవ్వఁ డతఁ డీక్షింపన్ మహాభాగుఁ డ
ట్లవుటన్ మామకబుద్ధి యెల్లపుడు దీవ్యచ్ఛైవశాస్త్రార్థసం
భవసాంద్రామృతసేవఁ దృప్తిఁ గనుచున్ భాసిల్లు నిస్తంద్రమై. 27

గీ. హరునికంటెను దద్భక్తు లధికు లనుచు
వేదవేదులు వివరింప విందు మెపుడుఁ
గాన తద్భక్తసత్కథాఖ్యాతమైన
భవ్యచరితంబు వినువారు ప్రాజ్ఞతములు. 28

క. హరభక్తులందు నుద్భట
గురుఁ డధికుఁడు తత్ప్రసిద్ధగుణమణిగణవి
స్ఫురణాభిరామమును నీ
వ రచింపుము కావ్య మొకటి వర్ణన కెక్కన్. 29

మ. అని ప్రార్ధించిన దేచధీమణికి నిష్టావాప్తియుం గీర్తిఖే
లనయున్ భాగ్యసమృద్ధియున్ జయముఁ దుల్యస్ఫూర్తి వర్తిల్ల స
జ్జనతావర్ణితరీతి నాంధ్రమగు భాషాపద్ధతిన్ బల్కితిన్
వినుత శ్రీభరితోద్భటస్ఫుటకథావిఖ్యాతసత్కావ్యమున్. 30

వ. ఇమ్మహాప్రారంభమునకు మంగళాచరణంబుగాఁ గృతీశ్వరు వంశావతారం బభివర్ణించెద. 31

కృతిపతి వంశావతారవర్ణనము

ఉ. ధన్యవివేకశాలి, ప్రమథప్రభుపాదపయోజయుగ్మమూ
ర్ధన్యమనోద్విరేఫపతి, ప్రౌఢవచఃపరిభూతపండితం
మన్యుఁడు, మాన్యకీర్తినిధి, మన్యువిదూరుఁడునైన యట్టి కౌం
డిన్యమహామునీంద్రుఁడు మనీషికులాగ్రణి యొప్పునెప్పుడున్. 32

శా. ఆవిర్భావము నొందెఁ దత్కులమునం దక్షుకీర్త్యావృత
ద్యావాపృథ్వ్యవకాశుఁ డీశపదపద్మధ్యానంసం(ధానవి
ద్యావిశ్రాం)తుఁడు సత్కృపాభరితశాంతస్వాంతుఁ డూరాగ్రహా
రావాసుండు పెదన్నమంత్రిమణి కొమ్మాంబామనోభర్తయై. 33

క. ఆ జంపతులకుఁ గలిగిరి
భూజనకల్పద్రుమములు పురహరపూజా
బ్రాజిష్ణు లైలమంత్రియుఁ
దేజోనిధి తిప్పువిభుఁడు దేచప్రభుఁడున్. 34

క. వారలలోఁ గవిజనమం
దూరుఁ డుదారుండు కీర్తిధగధగితదిశా
వారణదంతాచలుఁ డగ
ధీరుఁడు ధీరుచిరమూర్తి తిప్పన వెలయున్. 35

గీ. చెప్పఁ జిత్రంబు శ్రీయూర తిప్పమంత్రి
యర్థులకు ధారవోయుట కఖిలనదులు

వెచ్చ పెట్టంగ నీక్షించి వృషభకేతుఁ
డభ్రనది నాఁచికొనియుండు నాత్మమౌళి. 36

చ. బిసరుహపత్రనేత్రయగు పేరమకున్ బ్రతివాసరార్చిత
ప్రసవశిలీముఖారి పదపద్మయుగుండగు తిప్పమంత్రికిన్
మసృణయయశోవిభూషితసమస్తదిశావదనుండు నిర్జరేం
ద్రసముఁడు సంభవించె జితతామసుఁ డన్నవిభుండు సొంపునన్. 37

సీ. సింహికాసుతుదంష్ట్రఁ జిక్కి నొవ్వని నాఁటి
సంపూర్ణపూర్ణిమాచంద్రకాంతి
పెలుచఁ గవ్వపుఁగొండ గలఁచి యాడని నాఁటి
క్షీరవారాశి గంభీరగుణము
దారుణతరవజ్రధార యంటని నాఁటి
దైవతాహార్యంబు ధైర్యమహిమ
వితతభైరవకరాహతిఁ దలంకని నాఁటి
పద్మగర్భుని ప్రతిభాభరంబు
గీ. సత్యభామాధిపతిచేతఁ జలన మొంది
బలిమి దింపని నాఁటి కల్పద్రుమంబు
వితరణంబును దన యంద వెలయ వెలయు
నూరయన్న ప్రధానకంఠీరవుండు. 38

చ. హిమగిరిధైర్యుఁడన్న విభుఁ డీశ్వరప్రెగ్గడమల్లనార్యు గౌ
రమకుఁ గుమారియై, రమకు నద్భుతసంపదసాటియై, మనో
రమకులయుగ్మహారమయి, ప్రౌఢి వహించిన కృష్ణమాంబ నె
య్యమున వరించి మించె శివుఁ డద్రిసుతన్ వరియించుకైవడిన్. 39

సీ. సర్వసర్వంసహాదుర్వారతరభార
నిర్వాహకభుజుండు పర్వతయ్య

నీలకంధరహిమనాళీకరిపుహార
కైలాసనిభకీర్తి యైలమంత్రి
శ్రీచంద్రశేఖరవాచంయమేంద్రసే
వాచారుతరబుద్ధి దేచమంత్రి
కుండలిమండలాఖండదోర్దండాసి
మండాలహృతవైరి కొండశౌరి
గీ. యనఁగ గల్గిరి సత్పుత్రు లన్ననార్యు
భార్య కృష్ణాంబకును నిత్యభాగ్యనిధికి
బ్రణతభూపాలకోటీరమణిమయూఖ
రాజినీరాజితాంఘ్రినిరేజు లగుచు. 40

క. భూభాగజంభభేదను
నాభాగ దిలీపతుల్య నరవరమాన్య
శ్రీభరితు నూరపర్వతుఁ
బ్రాభవనిధిఁ బ్రస్తుతింతుఁ బటుతరఫణితిన్. 41

సీ. నిటలలోచనజటాపటలాంతరమునకు
భాగీరథీపయోభారధార
జంభభంజనపురీ కుంభివల్లభ కర్ణ
సీమకు నభిరామచామరంబు
జలజాతభవవధూస్తనకుంభపాళికి
ననవద్యతరహృద్యహారయష్టి
సంపూర్ణపూర్ణిమాచంద్రబింబమునకు
విసృమరచంద్రికావిలసనంబు
గీ. నగుచు జగముల విహరించు నహరహంబు
నిర్నిరోధవిహారమానితవిభూతి
హత్తి యూరయ్య సుప్రథానోత్తమ ప్ర
వృద్ధసుస్నిగ్ధనవయశోవిశదకాంతి. 42

ఉ. యాచనకామరద్రుమ ముదగ్రతరాంతరరాతివిక్రియా
మోచనకారణం బ(ఖిలభూజనసంత)తసత్కృపాలస
ల్లోచనపద్మపత్రుఁ డతిలోకగుణాఢ్యుఁడునై వసుంధరన్
దేచనమంత్రి యొప్పు జగతీధరకార్ముకదత్తచిత్తుఁడై. 43

క. ఖండపరశుపదసేవా
ఖండలనందనుఁడు కీర్తి గర్భీకృత ది
ఙ్మండలుఁ డూరన్నయవిభు
కొండన ధైర్యమునఁ బసిఁడి కొండన వెలయున్. 44

వ. వారిలోన. 45

మ. ప్రణుతప్రాభవుఁ డూరదేచవిభుఁ డభ్యర్చించు హస్తాగ్రసం
కణఝంకారము లంకురింప విరులన్, గంధంబునన్, బత్తిరిన్,
మణిహారంబులఁ, గాంచనాక్షతల శుంభద్వర్ణపంచాక్షరిన్
బ్రణవాత్మున్, బరమప్రకాశు గిరిజాప్రాణేశు నశ్రాంతమున్. 46

షష్ఠ్యంతములు

క. ఏతాదృశకులమణికిని
మాతాపితృభక్తియుక్తి మహిమాఢ్యునకున్
కాతరజనసురశాఖికి
వాతాశనసార్వభౌమ వాగ్వైఖరికిన్. 47

క. శ్రీకరనిజగుణ మాణి
క్యాకీర్ణపయోజసంభవాండ కరం డా
స్తోకాచ్ఛాదన సిత వ
స్త్రీకృత సత్కీర్తినిధికి ధీసన్నిధికిన్. 48

క. గీష్పతి నిభమతికిని వా
స్తోష్పతివిభవునకు నాత్మదోఃఖడ్గలతా

ర్చిష్పతి విపులజ్వాలా
నిష్పీడిత నిఖిలవిమత నృపసచివునకున్. 49

క. అలఘుతర హరిద్దంతా
వళ కర్ణోద్భూతగంధవాహభర ప్ర
జ్వలితచటులప్రతాపా
నలునకు నసమాన(ధైర్య)నయధుర్యునకున్. 50

క. శ్రీచంద్రశేఖరాహ్వయ
వాచంయమచంద్రపాద వనరుహసేవా
శ్రీచతురాత్మన కన్నయ
దేచామాత్యునకు సత్యధీనిత్యునకున్. 51

వ. అభ్యుదయపరంపరాభివృద్ధిగా నా యనర్పంబూనిన యీ మహాప్రబంధంబునకుఁ గథాక్రమం బెట్టి దనిన. 52

కథాప్రారంభము

ఉ. గణ్యము దండకప్రముఖకాననకోటులయందు సర్వవై
గుణ్యనివారణక్షమ మకుంఠితవైభవశోభితంబు స
త్పుణ్యఫలాదికారణము భూనుతిపాత్రమునైన నైమిశా
రణ్యము (తేజరిల్లు) మునిరాజనికేతనభాసమానమై. 53

సీ. అచలసుతాభర్త కర్పించి మఱి కాని
మృగములు లేఁబూరి మేయ వచట
అసమలోచనునకు నర్పించి మఱి కాని
యళులు క్రొవ్విరితేనె లాన వచట
అంధకధ్వంసికి నర్పించి మఱి కాని
కోయిల లిగురాకుఁ గొఱుక వచట
అంగజారాతికి నర్పించి మఱి కాని
చిలుకలు పండ్లు భుజింప వచట

గీ. తక్కుఁగల జంతువులు శంభుఁ దలఁచి కాని
యుచితవర్తనములఁ గోరి యుండ వచట
వదనములు వేయుఁ గలయంత వానికైన
నా యరణ్యంబుఁ గొనియాడ నలవి యగునె. 54

మ. హరిణంబున్ బులివెంచు సింగ మొగి సయ్యాటంబు లాడున్ గరిన్
బురినీడన్ ఫణిడింభజాలములు నిల్పుం గేకి చిట్టెల్కలం
గరుణన్ బిల్లులజాలముల్ పెనుచుఁ గాకంబుల్ నిశావేళ భీ
కరమూకంబులపొంతఁ గన్ను మొగుచున్ గాక్షించి తద్భూములన్. 55

గీ. తబిసిమొత్తంబు రేపాడి తానమాడి
దిగ్గియలచేరువలను (బూదియలలందు)
కాలమునఁ బల్కును “ద్రియంబకం యజామ
హే” యటంచును జలపక్షు లెల్లయెడల. 56

ఉ. సామగుణంబుఁ గొల్చుఁ బికశాబకపంక్తులు శైవధర్మముల్
ప్రేమ నుపన్యసించు శుకబృందము లీశ్వరయోగశాస్త్రముల్
కోమలరీతి శారికలు గూడి పఠించు వినోదలీలలన్
గామవిరోధిఁబాడు నధికంబుగ ముచ్చట భృంగపోతముల్. 57

ఉ. పూచినక్రోవులుం దొరుఁగుపుప్పొడిఁ జెల్వగుమావులుం దగన్
గాచినమోవులున్ శుకనికాయసమప్రభమించు జూవులున్
వాచవియైనఁ బంచజనవాంఛలు తీర్చుననంట్ల ప్రోవులున్
జూచి ముదంబునన్ నిలువఁజూతురు తద్వనవీధి దేవతల్. 58

ఉ. నాలుగువేదముల్ గడచనంగఁ బఠించి సమస్తశాస్త్రముల్
మూలము ముట్టఁగాఁ దెలిసి మోహముఖాహితులం జయించి సం
శీలితశైవధర్మగతిచేఁ దనరారుచు నద్భుతస్థితిన్
గాలము ద్రోచియుందురు రఖర్వతపోనిధు లవ్వనంబునన్. 59

క. ద్వాదశవార్షికమగు క్రతు
వాదరమునఁ జేయుచున్న యమ్మౌనుల సం
పాదితపుణ్యఫలము దా
నై దైవికఘటన సూతుఁ డట కేతెంచెన్. 60

క. ఏతెంచిన సూతుం గని
యా తాపసముఖ్యులెల్ల నతనికి వినయో
పేతమతి నుక్తవిధిచే
నాతిథ్యము చేసి రప్పు డధికప్రీతిన్. 61

సీ. అంతట నర్హాసనాసీనుఁడైయున్న
సూతు సద్వినయసమేతుఁ జూచి
యప్పుణ్యకుశలంబు నడి యాయన దమ్ము
నడిగినఁ దమసేమ మర్థిఁ జెప్పి
యుచితభాషణముల నొక్కింతవడి కాల
యాపనం బొనరించి యనఘచరిత!
యఖిలపురాణరహస్యంబు గరతలా
మలకమై యుండు నీమదికి నెపుడు
గీ. శైవధర్మసదాచారసరణి మిగుల
వినఁ బ్రియంబగుఁ జెప్పవే విశదఫణితి
ననుచుఁ దన్నట్లు ప్రార్థించి యడుగు శౌన
కాదిమౌనుల కిట్లను నతఁడు ప్రీతి. 62

చ. అనఘవిచారులార! వినుఁ డాగమతత్త్వమునందు మీ యెఱుం
గనియది లేదు నన్నుఁ ద్రిజగన్వినుతోదయుఁ జేయఁగాఁ దలం
చినపని కాదె యే నొకటి చెప్పఁగ విందు మటంచు నిట్లు మీ
యునికి భవత్కృపాగరిమ నొందితిఁ జెందితి భాగ్యసంపదన్. 63

ఉ. వాలుక లెన్నవచ్చు నుడువర్గము లెన్నఁగవచ్చు భూరజో
జాలము లెన్నవచ్చు నతిచంచలవార్ధివికీర్ణవీచికా
మాలిక లెన్నవచ్చు బుధమండలకర్ణపుటామృతంబు తా
బాలశశాంకశేఖరుని భవ్యచరిత్రము లెన్నవచ్చునే? 64

ఉ. అంగదయోగసిద్ధికిఁ బ్రయాసముఁ బొందఁగ నేల సంశయా
బ్ధిం గడు ముంపుచున్న బహుభిన్నపథంబులఁ బోవనేల? భ
క్తిం గనఁజాల (కావృషభకేతను)ను బ్రస్తుతి సేయుచుండినన్
దంగెటిజున్ను గాదె హిమధామకిరీటుఁడు భక్తకోటికిన్. 65

ఉ. ఆకులఁ గందమూలముల నంబుఫలంబులఁ గూరగాయలం
జేకొని ప్రాణరక్షణముఁ జేసి మహాటవిలోనఁ దీవ్రని
ష్ఠకలనన్ శరీరము గృశంబుగ నుండిన ముక్తి గల్గునే?
ప్రాకటమైన భక్తిఁ బురభంజనుఁ బూజ యొనర్పకుండినన్. 66

సీ. మ్రొక్కు నెవ్వాఁ డష్టమూర్తికి నలవోక
బలె నాతఁ డమరులప్రణతియందుఁ
జల్లు నెవ్వాఁడు ధూర్జటిమీఁదఁ బుడిసెడు
జలము లాతఁడు సుధాజలధిఁ దేలు
నుతియించు నెవ్వాఁడు శితికంఠు నేకవా
రం బాతఁ డల వచోరమణి నేలు
నిలుపు నెవ్వాఁ డీశు నిమిషమాత్రము మనం
బున నాతఁ డామీఁది పొడవుఁ దెలియుఁ
గీ. గాన మ్రొక్కఁగ నభిషిక్తుఁగా నొనర్ప
వినుతిసేయంగఁ దవిలి భావింప నెందుఁ
దగిన దేవాదిదేవుఁ డాతండు సూవె
భుక్తిముక్తు లపేక్షించు భక్తులకును. 67

ఉ. వాసన లేనిపూవు, రసవర్ణనలేని కవిత్వరేఖ, య
భ్యాసము లేనివిద్య, జలజాప్తుఁడు లేనిదినంబు, చంద్రికో
ల్లాసము లేనిరాత్రి, కమలస్థితి లేనికొలంకు చూవె కై
లాసనివాసు నాత్మఁ దలంపని మూఢులజన్మ మారయన్. 68

గీ. చూడఁదగదే వివేకించి సుజనులకును
జంద్రరేఖావతంసుని చరణయుగళి
యెంతచక్కనిదో? రమాకాంతుఁ డంత
వాఁడు నందును దన కన్ను వైచె మున్ను. 69

గీ. శైవులగువారు చెప్పినజాడయందు
నడువనేరదు మూఢుల గడుసుబుద్ధి
వానపై వాన గురిసిన నానునొక్కొ?
సహజకాఠిన్య ముడిగి పాషాణకులము. 70

సీ. శివపదాంభోరుహప్రవిమలోదకపాన
సిద్ధి నాలుకవిఁ జెలఁగదేని
శంభుదాసాంగైకసంస్పర్శనంబున
నెమ్మేను పులకల నిలుపదేని
త్రిపురదానవవైరి దివ్యలింగస్ఫూర్తి
కన్నులారఁగఁ జూడఁ గలుగదేని
దర్పకధ్వంసియౌ దలనిడ్డ పూవుల
తావిపై నాసిక దవులదేని
గీ. కాలకంధరు సత్కథాకర్ణనంబు
కర్ణపుటవీధి నందంద కదియదేని
వాని జన్మంబు జన్మమే వాని బ్రతుకు
బ్రతుకె హరదూరుఁడగువాఁడు పశువు దెలియ. 71

క. శివలింగదర్శనంబును
శివపూజావైభవంబు శివసద్గుణసం
శ్రవణంబును మానవులకు
భవనీరదపటలచటులపవమానంబుల్. 72

సీ. ఏ వేల్పు పదముల కిందిరావల్లభు
వలకన్ను పూజనావారిజాత?
మే వేల్పుకటిసీమ కిభదైత్యనాయకు
బలితంపుఁ జర్మంబు పట్టుచేల?
మే వేల్పుతనువున కిక్షుబాణాసను
గరువంపు నెమ్మేను కమ్మబూది?
యే వేల్పు కెంజాయ నేపారుజడలకు
విధి కపాలశ్రేణి విరులదండ?
గీ. యట్టి భువనాధినాథున కాదిదేవు
నకును మానసపుత్త్రుఁడై ప్రకటమహిమ
వెలయ నుద్భటగురుమూర్తి గలఁ డొకండు
సకలభవపాశలుంఠక చతురబుద్ధి. 73

గీ. అతులదుర్మతకరటిపంచాననుండు
నిఖిలశైవాగమజ్ఞానసఖమనీషుఁ
డాశ్రితేప్సితదానదివ్యద్రుమంబు
నైన యుద్భటుచరిత నెయ్యమున వినుఁడు. 74

వ. మహాత్ములారా! ఇది మీ యడిగినప్రశ్నంబునకు సదుత్తరంబై యుండు నీ చరిత్రంబు భవలతాలవిత్రంబు, నిశ్శ్రేయసక్షేత్రంబునునై వెలయునని యక్కథకుండు కథాకథనోన్ముఖుండై మహర్షుల కిట్లనియె. 75

చ. విలసదుదారనాగకులవిశ్రుత మాశ్రితసర్వమంగళం
బలఘుగణేశ్వరంబు హరిదంబరసంకలితంబునున్ మహో
జ్జ్వలము మృగాంకశేఖరము సాంద్రసితద్యుతిభాసురంబునై
పొలుపు వహించు తారగిరి భూతపతిం దన భర్తఁ బోలుచున్. 76

ఉ. వాలిన కన్నులున్ వలుదవట్రువచన్నులుఁ దీయమోవులున్
నీలపురంగులం దెగడ నేర్చినకొప్పులు నిండుచందురుం
బోలిన ముద్దుమోములును బుత్తడిబొమ్మల గెల్చు పూన్కికిం
జాలినమేనులున్ గలుగు సాధ్యసుమధ్యలు వొల్తు రగ్గిరిన్. 77

చ. సమములుగాని పాదములజాడలు వామపదంబు చొప్పునం
దమరిన క్రొత్తలత్తుకలయంకములుంగల తన్నగేంద్రకూ
టములు ప్రియంబునం గని కడంక నుతింతురు సిద్ధదంపతుల్
ప్రమథవిభుండు శాంకరియుఁ బాయక యొక్కట నున్న చందముల్. 78

ఉ. కిన్నరకామినుల్ పసిఁడికిన్నరలంది యభిన్నరీతులన్
దిన్ననిపాటఁ గూర్చి జగతీధరకార్ముకపాణిఁ బాడఁగా
మిన్నక యాలకింపుచు నమేయగతిం బులకించియున్న రే
ఖ న్నగమొప్పు వజ్రకలికాకలితాఖిలసానుభాగమై. 79

సీ. చిగురుజొంపంబుల నిగుడిన కెంజాయ
రుచిరజటాచ్ఛటారోచి గాఁగ
కలయంగఁ గప్పిన కమ్మపుప్పొడిదుమ్ము
పొలుపొందు భసితంపుఁబూఁత గాఁగ
సోలుచుఁ బూఁదేనెఁ గ్రోలురోలంబ బా
లిక లంచితాక్షమాలికలు గాఁగ
తఱచు కొమ్మలవెంటఁదగిలి ప్రాఁకిన నవ్య
లత లహిభూషణతతులు గాఁగ

గీ. ఇసుక చల్లిన రాలక పసరుడాలు
నాకు దళసరి హస్తిచర్మాంబరముగ
నలరి సాక్షాత్కరించిన హరునిఁ బోలి
పాదుకొనియుండు నక్కొండఁబాదపములు. 80

సీ. వరయోగశక్తి శంకరు మనఃపద్మంబు
పై జేర్చి మోదించు పాశుపతులు
హరసమారాధనాయత్తులై సందడి
గా విహారము సల్పు దేవముఖ్యు
లఖిలదర్శనములయందు నిందుధరుండె
పరతత్త్వమని చూచు పరమమునులు
నిటలలోచనుని తొల్లిటివిజయాంకంబు
లమరఁబాడుచు నాడు ప్రమథవరులు
గీ. పావడంబులు గెల్చి ప్రాభవము దాల్చి
భవునిసారూప్యమున నుండు భక్తజనులు
గలిగి జగదేకకల్యాణకరవిభూతి
లక్షణంబుల మించుఁ గైలాసశిఖరి. 81

చ. గుహగణమాతృకావలులు కుంజరవక్త్రుఁడు భృంగియున్ మహా
మహిమయుతుండు నందియు సమంచితభక్తి సమృద్ధిఁ గొల్వ న
య్యహివలయుండు శంభుఁడు హిమాద్రిసుతారమణుండు తద్గిరిన్
రహి వహియించియుండు సురరాజముఖామరపూజితాంఘ్రియై. 82

క. చిగురులఁ గ్రొవ్విరిగుత్తుల
నగజాధిపుఁ బూజసేయ నరుదెంచె ననన్
దగి యొక్కకాలమున నా
జగతీధరవనములన్ వసంతము దోఁచెన్. 83

సీ. భవుఁ గొల్చువారల పాతకంబులరీతి
రమణఁ గారాకులు రాలెఁ దరులఁ
బార్వతీపతిమీఁదఁ బ్రాజ్ఞుల కనురాగ
మునుబోలె నిగురెత్తె భూరుహములు
నీశానభక్తులయిండ్ల సంపదలీలఁ
గలయంగ ననుచుట గలిగెఁ జెట్ల
శశిమౌళిదాసుల సంకల్పములభంగి
ఫలియించె నందంద పాదపములు
గీ. సకలపాదపవికసితస్వచ్ఛగుచ్ఛ
సాంద్రమకరందరససమాస్వాద ముదిత
మత్తమధుకర జేగీయమాన మగుచు
మించి మధుమాస మావిర్భవించె నపుడు. 84

క. కుసుమితరక్తాశోక
ప్రసక్తిచేఁ బొలుపు మిగులు బంభరగణముల్
కుసుమాయుధ (ప్రేమసరా?)
గ్ని సముద్ధితధూమవితతికిని బోలికయై. 85

గీ. బాలచంద్రకళాకలాపమునఁ బొల్చి
గమియఁ గరితోలు నెమ్మేనఁ గప్పుకొన్న
హరుని నడకించె మొగ్గల నతిశయిల్లి
నీలరుచి మీఱు మునిధారుణీరుహములు. 86

క. కురివిందకమ్మఁదీగెలు
నరవిందము ననఁగి పెనఁగ సహకారంబుల్
గిరివరతనయాలింగిత
హరమూర్తిం దలఁపఁజేసె నామనివేళన్. 87

వ. ఇవ్విధంబునఁ జిగురులకుం జిగియును, గ్రొన్ననలకుం జెన్నును, విరులకు మురిపెమ్మును, బిందెలకు నందమ్మును, గాయలకు సోయగంబును, దోరలకు గౌరవంబును, బండులకు మెండును గలిగించి పలాయితహేమంతంబుగ వసంతం బయ్యె నయ్యెడ. 88

ఉ. చల్లనిగాడ్పులన్ సొబగు చల్లెడు వెన్నెలఁబువ్వుఁదావులన్
బల్లవవిభ్రమస్ఫురణఁ బ్రౌఢపికాళిశుకాలిపల్కులన్
బల్లిదుఁడైన యట్టిగణభర్త భవానియుఁ దాను వేడ్క వ
ర్ధిల్లఁగ నెల్లచోట విహరింపఁగ నొప్పె సఖీపరీతుఁడై. 89

సీ. కలకంఠకులకుహూకారాంతరములైన
మావిమోకలజాడ మరలి మరలి
సొలయునెత్తావులు చోడుముట్టెడు పువ్వుఁ
బొదరిండ్లనెలవులఁ బొదలి పొదలి
అలిబాలికామనోహరఝంక్రియలఁ బొల్చు
దీర్ఘికాతటములఁ దిరిగి తిరిగి
మకరిందపంకిలమంజుమార్గంబుల
నీడల నీడల కేఁగి యేఁగి
గీ. చంద్రికాధౌతనిర్మలచంద్రకాంత
నిచితనవపుష్పశయ్యల నిలిచి నిలిచి
కలికిబాగునఁ బొదలలోఁ గలసి తిరిగి
రటుల దంపతు లా వనాభ్యంతరమున. 90

క. విరులం బుప్పొడి రేఁపుచుఁ
దరఁగలు గదలించి కొలఁకు తండంబులలోఁ
దిరుగు మందసమీరణ
మరయుచు మురిపెమునఁ దిరిగె నభవునిమీఁదన్. 91

సీ. కమలకర్ణికలు బంగారంపుదుద్దుల
మురువు సూపఁగఁ గర్ణముల ఘటించి
పొగడఁ జోటగుకమ్మ పొగడపూవులచీరఁ
గమనీముగఁ గూర్చి కటి నమర్చి
సింధువారశ్రేణి సీమంతవీథికి
సొబగుముత్యాలచేర్చుక్కఁ జేసి
పొలుపొందు పూఁదేనెఁ బోసి మేదించిన
పొన్నక్రొవ్విరులపుప్పొడి యలంది
గీ. కలయ నవకంపు మెఱుఁగులు దొలుకరించు
చంపకావలి పతకంబుసరణిఁ జూపి
శంకరుఁడు పార్వతికి నిట్లు సలిపి వేడ్క
శంబరారాతి మదిలోనిశంక యుడిపె. 92

ఉ. అల్లన మావికొమ్మచిగురాకు నిజాంచితచంచుధారచేఁ
జిల్లులు వుచ్చి తద్రసవిశేషము నాలుక సోఁకఁ జొక్కుచున్
ద్రుళ్ళుపికంబుఁ జూడిమని ధూర్జటి చూపినఁ జూచి పార్వతీ
హల్లకగంధి వంచె వదనాబ్జము కన్నుల నవ్వు దేరఁగాన్. 93

సీ. తరుణశశాంకశేఖరమరాళమునకు
సారగంభీరకాసార మగుచు
కైలాసగిరినాథకలకంఠభర్తకుఁ
గొమరారు లేమావికొమ్మ యగుచు
సురలోకవాహినీధరషట్పదమునకుఁ
బ్రాతరుద్బుద్ధకంజాత మగుచు
రాజరాజప్రియరాజకీరమునకు
మానితపంజరస్థాన మగుచు
గీ. నురగవల్లభహీరమయూరమునకుఁ
జెన్నుమీఱిన భూధరశిఖర మగుచు

లలితసౌభాగ్లక్షణలక్షితాంగి
యద్రినందన వొల్చె విహారవేళ. 94

క. అలకాంతకలికముఖి యగు
కులకాంతయుఁ దానుఁ గూడి గోపతిగమనుం
దలకాంత కలధౌతా
చలకాంతస్థలులఁ గ్రీడ సలుపుచునుండెన్. 95

వ. ఇట్లు సాక్షాత్కరించిన పంచశరసామ్రాజ్యలక్ష్మియుంబోలెఁ బ్రేక్షణీయ యగు దాక్షాయణిం గూడి క్రీడాపరాయణుండై నారాయణసఖుం డఖండితానందకందళితహృదయారవిందుండై యుండు నవసరంబున. 96

సీ. తేటవెన్నెలమించుఁ దెఱచిరా జనిపించు
నకలంకహారవల్లికలతోడ
ఠేవఁ గాంతుల పెల్లుగా వసంతము చల్లు
కటకాంగదకిరీటములతోడ
తివుట నెత్తావుల దిక్కగుఠావుల
నలమి వాసించు మాల్యములతోడ
ప్రకటితంబుగ జూపులకు విస్మయముఁ జూపు
రమణీయచిత్రవస్త్రములతోడ
గీ. ప్రమదసల్లాపకోలాహలముతోడఁ
గాంతులొలుకంగఁ దొడసిరాఁ జెంత రాలు
పుప్పొడులతోడ గంధర్వముఖ్యు లటకు
నురువిమానంబు లెక్కి వచ్చిరి ప్రియమున. 97

ఉ. పొచ్చెము గాని నేమమునఁ బోఁడిమికిం దము మెచ్చి ధాత ము
న్నిచ్చిన తద్వస్ఫురణ నెచ్చటఁ గొంకొక యింతలేక క
న్నిచ్చకు వచ్చినట్టుల చరించెడువారలు గాన వారు వా
రచ్చటఁ గేలికై నిలిచి రాత్మవిమానము లోలి డిగ్గుచున్. 98

క. ఇది రజతాచల మిందున్
మదనారి వసించు విబుధమానితమని నె
మ్మదిఁ దలఁపక గంధర్వులు
తదద్రిపై విడిసి రధికదర్పం బెసఁగన్. 99

క. గంధర్వులు మోహనమృదు
గాంధర్వము గలుగు పుష్పగంధులతో గ
ర్వాంధత నీప్సితమతి కలి
బంధరులై తన్నగేంద్రపాదస్థలులన్. 100

సీ. కాంచీకలాపంబు కటిమండలముమీఁద
నొక్కింత సడలినఁ జక్క నిలిపి
వలుదపాలిండ్లక్రేవల జాఱి వెలిగొన్న
యాణిముత్తెములపే రనువుపఱిచి
కలికిచెక్కులమీఁదఁ దొలకరించిన ఘర్మ
జలకణంబులఁ గాంతు లొలుకఁదుడిచి
రాలుపుప్పొడిధూసరములైన చూర్ణాల
కంబులు కొనగోళ్ళఁ గలయ దువ్వి
గీ. అతులపుష్పాపచయఘనాయాస ముడుగ
నంకపీఠిక శాంకరి నావరించు
త్రిపురమర్దనుపుష్పమంటపసమీప
వసుధ నిలిచిరి గంధర్వవర్యు లంత. 101

చ. చిలుకలకొల్కులైన సరసీరుహనేత్రలఁ గూడి వేడుకన్
గొలకొలమంచుఁ దత్ఖచరకోటులు వ్రాలుడు నందికేశ్వరుం
డలికవిలోచనానుచరుఁ డద్భుతమై దివి నిండఁ బర్వు త
త్కలకల మోర్వఁజాలక యఖండితరోషకషాయితాక్షుఁడై. 102

ఉ. భీకరరేఖతోఁ బసిఁడిబెత్తముఁ ద్రిప్పుచు ఘర్మబిందు జా
లాకరమౌ మొగంబు తరుణారుణతేజము లీనఁ గన్ను లు
ల్కాకళలన్ జ్వలింపఁ దమకంబున శంకరుపువ్వుటింటి య
వ్వాకిట నిల్చి యిట్లనియె వారలతోఁ ద్వరమాణవాణియై. 103

క. చీకులరె మీర? లీశుఁడు
లోకేశ్వరుఁ డీవనం(బులో నీశ్వరితో)
నేకాంతంబున నుండఁగ
నీ కాంతలు మీరు వచ్చు టిది తగ వగునే? 104

క. అని తము నిరసించిన నం
దినిఁ జీరికిఁగొనక వారు దిగ్గన మౌర్ఖ్యం
బునఁ బువ్వుఁజప్పరము డా
సిన నవ్విధ మా(త్మ నెఱిఁగి శివుఁడు కుపితుఁడై). 105

గీ. పులుఁగరంబునఁ బూని మీరలు పిశాచ
రూపమున నుండుఁడని వైవ రూపరేఖ
దప్పి వికటాంగులైరి గంధర్వనాథు
లెంతవారికిఁ దప్పునే యీశ్వరాజ్ఞ? 106

క. ఆ యందము లా చందము
లా య(ద్భుతరూపరే)ఖ లా మంజుసుధా
ప్రాయోక్తులు మిడివోయెను
గాయజహరు కినుకకతన గంధర్వులకున్. 107

క. కొఱకును బోవం బడి క
ల్లుఱక పయిం బడినకరణి నొకపనికై రా
నుఱుమని పిడుగై వారి(కిఁ
గఱకంఠునిచేత) నీచగతి వాటిల్లెన్. 108

గీ. చంప నలిగియు నొక్కింత చలము మాని
విషమనయనుండు పులి నాకి విడిచినట్లు
చావుతోడుత జోడైన చటులఘోర
కష్టరూపంబు వారికిఁ (గలుగఁ జే)య. 109

సీ. ఎఱసంజ కెంజాయ నెక్కసక్కెంబాడు
చికిచికిపల్లవెండ్రుకలవారు
గమకంబులగు గ్రచ్చకాయలఁ దలపించు
క్రూరంబులగు మిట్టగ్రుడ్లవారు
ముడిబొమ్మలును బెద్దమిడిగ్రుడ్లు వెడఁ గోర
దౌడలు గల్గు వక్త్రములవారు
పెనుబీరనరములు పెనఁగి పైఁ బ్రాకుటఁ
గనుపట్టుపొట్ట పొంకములవారు
గీ. కుఱుచలగు హస్తపాదముల్ గుదియఁబొడిచి
నట్లు బలసినమెడలతో నరయ నూచ
లైన యూరులతో వికటాంగు లైన
వారు నై రిట్లు గంధర్వవరులు పెలుచ.110

చ. పెదవుల నెత్తు రుండియును బేడులువారు బరళ్ళమేనులన్
గదిశి పిశంగరోమములు గ్రమ్ముకొనన్ నిశితోగ్రదంష్ట్రలన్
జెదరినవిస్ఫులింగములు చిందఱవందఱ గాఁగ రూపముల్
మదనవిరోధిశాపమున మార్పడియెన్ ఖచరేంద్రపంక్తికిన్. 111

మ. చటులోదగ్రతరాట్టహాసములుఁ గేశచ్ఛన్నఘోరాస్యముల్
కుటిలక్రూరవిలోచనంబులు మెఱుంగుల్ గ్రాయుఫూత్కారముల్
పటుభీమోద్భటదంతపీడనము లస్పష్టాంగసంధుల్ మహా
ఘటపీనోన్నతకుక్షిభస్త్రికలు వేగం దాల్చి రాఖేచరుల్. 112

పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/261 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/262 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/263 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/264 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/265 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/266 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/267 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/268 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/269 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/270 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/271 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/272 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/273 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/274 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/275 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/276 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/277 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/278 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/279 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/280 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/281 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/282 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/283 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/284 పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/285
  1. గుణాధారు. పా.అం.