Jump to content

ఉదయనోదయము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

ఉదయనోదయము

ప్రథమాశ్వాసము

ఇష్టదేవతాప్రార్థనము

ఉ.

శ్రీసతి క్రొమ్మెఱుంగు మణిచిత్రితశే[1]షభుజంగశయ్య యు
ద్భాసితశక్రచాపలత తాన సితాంబుద మంచు శంకఁ బ
ద్మాసనముఖ్యు లెవ్వని సుధాబ్ధిఁ దలంపుదు రట్టిదేవతా
గ్రేసరుఁ డిచ్చుఁగాత జయకీర్తులు లోకయబాచ శౌరికిన్.

1


శా.

శ్రీలక్ష్మీపతి భక్తమౌనిజనసంసేవ్యుండు వేదాంత వి
ద్యాలంకారుఁడు పంకజాక్షుఁడు[2] ప్రసాదాయత్తచిత్తంబుతోఁ
బాలించున్ స్థిరకీర్తి చంద్రకిరణప్రాగ్భారసంఛన్న లో
కాలోకాచలు లోకమంత్రిమణి బాచామాత్యచూడామణిన్.

2


చ.

పరినటనావధి న్నిటలభాగము చెమ్మట యొత్తి శర్వరీ
కరుఁ దిలకించి చారుసితకంజదళంబని మౌళిఁ గ్రమ్మఱం
జెరివి (గళస్థలి న్నెగ[3])డు చిహ్నము తేంట్లని[4] చేమరల్చు[5]
గ్గిరిజ నగన్[6] శివుం డొసఁగుఁ గీర్తులు లోకయబాచమంత్రికిన్.

3


ఉ.

పొక్కిటి కమ్మితేఁటి బలెఁ బొందిన బిడ్డఁడు భారతీసతిం
బుక్కిటఁ గాపురంబిడిన ప్రోడఁడు వెన్నెల వన్నెతేజి వీఁ
పెక్కిన మేటిరౌతు జగమెల్ల సృజింపఁగఁ జాలు వేల్పురా
జెక్కుడు లగ్గ లోకసచివేంద్రుని బాచనిఁ బ్రోచుఁ గావుతన్.

4

చ.

తనుఁ గనుఁబ్రామి పాఱి[7] కరధౌతతటంబున నాత్మబింబముం
గని గజమంచు 2మోద నరుగం[8] గరిగాదు కుమార! నీడరా
యనుచు భవాని గోఁచికొన యాని పిఱిందికిఁ దివ్వఁ గ్రమ్మఱం
బెనఁగు గజాస్యుఁ డీవుత మభీష్టము లోకయబాచమంత్రికిన్.

5


ఉ.

చే యెగఁజాఁచి పూజలిడ[9] సిగ్గునఁ బయ్యెద బాహుమూలముం
బాయక కప్ప మోచి మఱువడ్డయురోజము క్రేవ నొత్తుగో[10]
రాయెడఁ జూచి యల్లనగు నాత్మవిభుం గడకంట జంకెనల్
సేయు భవాని లోకబుధశేఖరు బాచని ధన్యుఁ జేయుతన్.

6


ఉ.

పుట్టిన కూర్మిమచ్చయను పొచ్చెమునం దనదాయఁ[11] బట్టముం
గట్టినవాఁడుగా కురము కప్పునకుం గత మేమి యంచు లో
నిట్టలమైన కింకఁ బతి నెగ్గులు పల్కెడు లక్ష్మి ప్రోచు నా
రట్టడి (వై)రిపోత్రు[12] బుధరంజను లోకయబాచచంద్రునిన్.

7


సీ.

కేల మీటిన దంత్రికిం[13] బ్రవాళమునకుఁ
                గరనఖద్యుతి కోరకముల నీనఁ
గరముల నంటుచోఁ గంగణక్వణనంబు
                చక్రనిర్యత్ననిస్వనము సేయ
గాత్రంబు చూపుచోఁ గంఠంబు తంత్రికా
                పంచమంబునకుఁ దోడ్పాటు నెఱపఁ
జెవిగట్టియల చెంతఁ[14] జెలఁగు లేఁదేఁటుల
                మొరపం[15] బుపాంగంబు మురువు చూప

తే.

సారె వీణావినోదంబు సలుపువాణి
సైకతశ్రేణి జలరుహాసనునిరాణి
మహిమ ముడియము లోకయామాత్యచంద్రు
భాస్కరునిఁ జేయు భాగ్యసంపన్నుఁ గాగ[16].

8


ఉ.

ఎవ్వనియాజ్ఞ మౌళిఁ బ్రియ నెప్పుడుఁ దాల్చినవాఁడు శంకరుం
డెవ్వని మాయఁ జిక్కువడ కెక్కటి నింద్రునకైనఁ దోఁపరా
దెవ్వని పేర్మి వర్ణనల కెక్కు జగత్త్రితయైకధన్వి నా
నవ్వెడవిల్తు గొల్తుఁ గృతి యాదిఁ గవిత్వమహత్వసిద్ధికిన్.

9


వ.

అని యిష్టదేవతాప్రార్థనం బొనరించి.

10

సుకవిస్తుతి

ఉ.

వ్యాసమునీంద్రు భారతకథాంబుధిచంద్రు భజించి ధీరమో
పాసకు నాకుజుం బొగడి బాణుని కౌఁదల వంచి కాళికా
దాసు నుతించి భారవి ముదం బెసఁగం గొనియాడి మాఘునిన్
వాసిగఁ జూచి భామహుని వర్ణన చేసెదఁ గావ్యసిద్ధికిన్.

11


ఉ.

చేతులమోడ్పు నెన్నొసలఁ జేర్చి తలంచెద నన్నపార్యు న
త్యాతతభక్తియుక్తిఁ గొనియాడెదఁ దిక్కన సోమయాజి ను
ద్గీతవచోవిరూఢి వినుతించెద నెఱ్ఱనమంత్రిశేఖరుం
బ్రీతి వహించెదన్[17] హృదయపీఠిక వేములవాడ భీమునిన్.

12

కుకవినింద

చ.

కుఱకుఱ పోకలం బొదలి కోపము గర్వము మున్ను గాఁగఁ దా
నెఱుఁగనిచోటు తప్పనుటయే కడునెమ్మిగఁ జూచు దుర్జనుం
డఱచిన సత్కవీశ్వరున కౌనె కొఱంతయు హాని[18] యీసునన్
మొఱుగద కుక్క గంధగజముం గని కర్ణకఠోరభాంకృతిన్.

13


వ.

అని సుకవి నమస్కరణంబును గుకవి తిరస్కరణంబునుం గావించి.

14

కృతికర్తృ నాత్మప్రజ్ఞ

సీ.

[19]కౌండిన్యగోత్రవిఖ్యాతుండు సత్కవి
                మాన్యుండు నారనమంత్రిమణికి
వనిత యక్కాంబకు వరతనూజుఁడఁ గిసా
                నాఖ్యునకును గూననాహ్వయునకు
గారాపు సయిదోడ నారాయణపదార
                వింద సంసేవనావిమలమతిని
గావ్యనిష్ణాతుఁడ గజరావు బిరుదాంకు
                లగు[20] రాచవారికిఁ దగు హితుండ


తే.

సృష్టి (వాచామగోచర స్నిగ్ధ) వర్త
నాభిరమ్యుండ[21] బంధులోకానుభావ్య
మానవిభవుండ నయకళామందిరుండ
సూరనాఖ్యుండ సత్యసంశోభితుండ.

15


ఉ.

ఆధునికప్రబంధరసహావమనోహరభావరేఖ నీ
మాధురు లేమి తక్కువలె మాన్యచిరంతన కావ్యబంధనో
ద్బోధకహావభావరసపూర్తుల గ్రుచ్చి కలంచిచూడ ను
చ్ఛోధకు[22]లైన భూవిభులు చొప్పడకుండుటగాక యెయ్యెడన్.

16


వ.

అని యీప్రకారంబున విద్యోతితాత్మప్రజ్ఞాధురంధరుండైన మాతండ్రి
సూరనమంత్రి నిర్మించిన యుదయనోదయంబను మహాప్రబంధంబు
తత్సూనుండగు నారనామాత్యవరుం డుపలక్షించి యేతత్కావ్యకన్యక
కుం దగువరుం డెవ్వండు గలఁ డొకో యని తలంచు సమయంబున.

17

కృతిపతిత్వనిర్ణయము

సీ.

తన కీర్తిలతకు నున్మత్తదిగ్వేదండ
                గండమండలి కుడుంగంబు గాఁగఁ
దన కర మక్షుద్రతరరాజ్యలక్ష్మికి
                విహరణప్రాసాదవేది గాఁగఁ
దన కటాక్షము దీనదారిద్ర్యముద్రాంధ
                కారభాస్కరకరోత్కరము గాఁగఁ
దనహేతి రిపురాజవనజాననానేత్ర
                నవబాష్పసలిలప్రణాళి గాఁగఁ


తే.

దనరు మహనీయదానవిద్యావినోద
వంది[23] (వారి)ద మందారవనధిధనద
సోమజీమూతవాహనకామధేను
భానుసూనుండు ముడియము భాస్కరుండు[24].

18


మ.

హరిణాంకోపలజాలకీలితవిశాలాస్థానభద్రాసనో
పరిభాగంబున రాయబారులు సుధీపౌరాణికుల్ మేదినీ
శ్వరులున్ సత్కవులుం బ్రధానులు నటుల్ వారాంగనల్ గొల్వఁగా
హరిశౌర్యుండగు లోకయప్రభుని బాచామాత్యుఁ డత్యున్నతిన్.

19


వ.

పేరోలగంబుండి నన్ను నారనామాత్యుం బిలిపించి బహుమానపురస్స
రంబుగా నర్ధాసనంబునఁ గూర్చుండ నిడుకొని యిట్లనియె.

20


క.

నీజనకుఁ డుదయనోదయ
మోజం గావించె సురుచిరోక్తుల నది సం
యోజింపు నా పేరట
భూజననుత నారధీర పుణ్యవిచారా.

21


వ.

అని సబహుమానంబుగా సారఘనసారామోదమేదురంబగు గంధసారం
బును బసిండికోరఁగర్పూరతాంబూలంబును దివ్యాంబరాభరణంబులు

మొదలుగాఁ గల పదార్ధంబు లొసంగి యనిపిన నేను నట్ల చేసెదనని
మన్నిక దోఁచి మజ్జనకరచితంబగు నీ మహాప్రబంధమునకు
విక్రమక్రమాభిరాముండును నగణ్యపుణ్యప్రావీణ్యుండును సంతతో
దారస్ఫారగుణనిర్భర్త్సితతారాధీశ్వరాంబునిధినీరదుండును గర్ణాటక
సింహాసనసామ్రాజ్యలక్ష్మీసార్వభౌమకారుణ్యలబ్ధకొండవీటిప్రముఖ
నిఖిలదుర్గాధిపత్యాభిరామజయకారారామప్రధానసుత్రానుసర్వసర్వం
సహాభారభరణసందుగణదక్షిణదక్షిణభుజాస్తంభుండును మహిత
మణిప్రభాపూరస్ఫారందకటకాంగుళీయకకంకణకంఠమాలికాభరణ
భాసితుండును ననన్యసామాన్యలావణ్యతృణీకృతపంచబాణుండును
దౌవారికాహూయమానావనినాథరాయబారామాత్యోదగ్రపరస్పరవ్యాహార
సంకులభవనబహిర్ద్వారుండును మదాంధసింధురగండమండల
సృతదానధారాగంధాఘ్రాణాసంహృతాలూన[25]ఖలీనపరిఖాణఖర
విషాణఘోషభీషణమందురోపకంఠుండును రాకాపూర్ణచంద్రాననా
కంకణాలంకారలలితకరతాలవృంతోద్ధూతమారుతచలితహరినీలనీల
కుంతలుండును సస్యసంతానాధీ[26]శ్వరుండును బంధరుతరకులోద్ధా
రకుండును రాయప్రధానాగ్రేసరుండును కసువమాంబాగర్భక్షీరాబ్ధి
మహాహ్లాదకారణసంపూర్ణచంద్రుండును శ్రీవత్సగోత్రపవిత్రుండును
నాశ్వలాయనసూత్రుండును నగు ముడియము భాస్కరామాత్యశేఖరుం
బతిగా నొనర్చి కావ్యాదిమంగళాచారంబుగాఁ దద్వంశావతారం
బభివర్ణించెద.

22

కృతిపతి వంశావతారవర్ణనము

శా.

శ్రీవత్సాఖ్యమహామునీంద్రునిఁ గృపాశిష్టాంతరంగుం దపః
ప్రావీణ్యాదికు నిశ్చలామల[27]మనోరాజీవవిభ్రాజిత
శ్రీవామాధిపుఁ బుణ్యకీర్తనుఁ బ్రశంసింపం దగున్ ధన్యునిన్
దేవేంద్రాదినుతప్రభావమహాధిష్ఠానచారిత్రునిన్.

23

క.

ఆ మునితిలకుని కులమున
భూమీశ్వర[28] దండనాథపురుహూతుఁడు సం
గ్రామార్జునుండు
హేమధరాధరుఁడు[29] నరచురీంద్రుఁడు పుట్టెన్.

24


క.

ఆ మంత్రిశేఖరునకును
శ్రీమంతుఁడు పుట్టె నారసింహామాత్య
గ్రామణి వితరణగుణచిం
తామణి గంభీరతాసుధాజలనిధియై.

25


వ.

ఆ ప్రధానదేవేంద్రున కావాసంబు —

26


సీ.

రచితాగ్ర[30]సంచంద్రజాననాస్నేహ
                సిక్తసిద్ధాంగనాసముదయంబు
గోపురప్రాకారకుడ్యకీలిత రత్న
                కిరణారుణీకృతాంబరతలంబు
నందీశవచనప్రణాళీగళద్వారి
                సంవర్ధమానసస్యవ్రజంబు
చముడేశ్వరీశిరశ్చంద్రమః కందళీ
                చంద్రికాంసధౌతసౌధవీథి


తే.

లకుచపిచుమందమాకందవకుళకుంద
చందనాశోకశమ్యాకసరళతిలక
నీపఖర్జూరికారామనిందనీయ
నందనోద్యానవాటంబు నందవరము.[31]

27


క.

ఆ నందవరపురంబున
నానందితబంధుమిత్రులై గుణధనులై
యేనూరిండ్ల గృహస్థులు
దీవిదు లుండుదురు కాకతీపతివిభుడై.

28

క.

వీరు త్రయోదశగోత్రో
ద్ధారకు లన్యోన్యబంధుతావిస్రంభో
దారులు పారావారగ
భీరులు వెలయుదురు పాపభీరులు ఘనులై.

29


క.

వారలలో వసుధాస్థలిఁ[32]
బేరుం బెంపును వహించి పృథుసంబంధో
దారులు శ్రీవత్సముని
స్ఫారాన్వయజాతసదనశతకం బమరున్.

30


శా.

ఆనూఱిండ్ల సగోత్రజుల్ బుధులు నిత్యంబుం దనుం బ్రేమ స
న్మానింపంగను నారసింహమహిభృన్మంత్రీశుఁ డత్యంతముం
దీనాళిన్[33] సకలార్థసంపదలలోఁ దేలింపుచున్[34] దాన కా
నీనుండై కడు మంతు కెక్కె ధర నిర్ణిద్రోరుసత్కీర్తియై.

31


క.

ఆనారసింహునకు ల
క్ష్మీనాథస్మృతి సనాథ చిత్తాబ్జునకున్
భూనాథమాన్యుఁ డురు స
న్మానాధికుఁ డగుచు లక్కమంత్రి జనించెన్.

32


క.

పొందుగ లక్కనకును బెం
పొందిన సతి బేచమాంబ కుదయించిరి సం
క్రందననిభ విభవులు గో
విందుఁడు నన్నప్ప బాచవిభుఁడును నెలమిన్.

33


సీ.

శేషాహిమూర్థాభిషిక్తాంగనిర్మోక
                కలితఖండముల కంచులిక దొడివి
దిక్కుంభికుంభసందీప్త[35][36]దేశంబుల
                మహితతాండవవిభ్రమంబు చూపి

భూతేశ్వరోదగ్రభూమీధరోత్తుంగ
                శృంగాగ్రముల జిల్లజీర్కు లాడి[37]
శుభ్రశోభాదభ్రసురవాహినీలురో
                ర్మికల మీఁదట జలక్రీడ సలిపి


తే.

మెఱసి యేమంత్రికీర్తిభామిని చెలంగు
నట్టి మహనీయరూపమోహనవిలాస
భాసురశ్రీ పరాభూతపంచశరుఁడు
విభవవిజితబలారి గోవిందశౌరి.

34


క.

కులిశాయుధగజ శంకర
కలశపయోనిధి సమాన ఘనకీర్తులచే[38]
విలసిల్లె నఖిలజగమున
సలలితబలశాలి యన్నసచివుఁడు మహిమన్.

35


క.

ఖేచరతుహినమరీచిద
ధీచిప్రతిమానదానధిక్కరుఁడై రా
కాచంద్రముఖీసుమనా
రాచుఁడు బాచప్రధానరత్నము వెలసెన్.

36


క.

అం దగ్రసంభువుఁడు గో
విందుఁడు బృందారకేంద్రవిభవాఢ్యుఁడు గో
విందుఁడు రమ నరియించిన[39]
యందమున వరించె గంగమాంబను వేడ్కన్.

37


గీ.

అట్టి గంగాంబ నిత్యశీలావలంబ
లోకలోచనవిభుఁ డైన లోకవిభుని
నారదండాధినాథుని నాగవిభుని
ముగురుగొడుకులఁ గనియె సమ్మోదమునను.

38

సీ.

అలమె దిక్చక్రవాళాచలప్రాచీన
                మతులితగుణశాలితాప్తిచేత
విరియించె శాత్రవోర్వీనాథనీహార
                ముగ్రాసి నవవసంతోదయమున
వాసించె బ్రహ్మాండభవనపేటికలను
                సత్కీర్తికర్పూరనారమహిమ
నలరించె నాప్తమిత్రాననాంభోజముల్
                ప్రచలితైశ్వర్య[40]ప్రభాతములను


తే.

నతని వర్ణింపఁధగు మహోదాత్తపటహ[41]
భేరిభాంకారరవధావి తారినృపతి[42]
కామినీవేష్టితాహార్యగహ్వరుండు
ఘనుఁడు గోవిందమంత్రి నాగప్రభుండు.

39


సీ.

ఆరసాతలగభీరాంబుపూరములుగాఁ[43]
                గట్టించెఁ జెఱువు లుత్కంఠతోడ
నందనోద్యానకాననమున కెనగాఁగ
                నొప్పుగా నిర్మించె నుపవనములు
గగనకూలంకషాకారశృంగములుగా
                నిలిపించె దేవతానిలయసమితి
పక్వశాకాపూపపాయసాన్నంబులఁ
                దనిపె ధాత్రీసురోత్తముల భుక్తి


తే.

ననఁగఁ గొనియాడఁదగు సమస్తావనీశ
సభల సత్కీర్తి లక్ష్మీవిశాలుఁ డగుట
మహిమ గోవిందమంత్రి కుమారవరుఁడు
మారగుణహారి నారనామాత్యశౌరి.

40

వ.

అం దగ్రజుండు.

41


సీ.

తూలించె యీచకస్తోమదౌర్గత్యాంధ
                కారంబు దానభాస్కర గభస్తిఁ
దేలించె మదవతీదృక్చకోరంబుల
                సౌందర్యచంద్రికానిరసంబెఁ
బాలించె నాచక్రవాకసర్వంసహా
                భరణంబునకు నిజబాహుశక్తి
వ్రాలించె దశదిశా ననజాకరంబుల
                నిజకీర్తిహంసికానివహములను


తే.

వేడ్క విరియించె శాత్రవోర్వీకళత్ర
పట్టణంబులఁ బటహోగ్ర1భాంకరణము
లనఁగ[44] వెలుఁగొందు దండనాథాత్మజుండు
లోకనుతదానజితసౌరి లోకశౌరి.

42


క.

ఆ లోకదండనాథుఁడు
బాలేందుకళాధరుండు పార్వతిఁ బోలెన్
లీలం బరిణయమయ్యెను
బాలామణి కసువమాంబఁ పద్మదళాక్షిన్.

43


సీ.

ఆత్మేశుఁ డొక్కచో నాగ్రహించినచోటఁ
                గూర్మి యంతంత కెక్కుడుగ నడచుఁ
బని చెప్పునప్పుడు పతిమాట కడ్డంబు
                కలలోన నైనను బలుక దింత
యలవోకకైనను నాడ దెన్నఁ డసత్య
                భాషణంబుల నెంత పనికి నైన
నెమ్మితో భర్త మన్నించిన మదిలోన
                గర్వింపనేరదు కడఁక మీఱి

తే.

ఉభయవంశపవిత్ర శ్రీయుతచరిత్ర
ధరణి ముడియములోకప్రధానవరున
కభిమతప్రీతిఁ జేయు నర్ధాంగలక్ష్మి
కలితసద్గుణనికురుంబ కసువమాంబ.

44


క.

ఆ కాంతామణియందును
లోకేశ్వరమంత్రి కీర్తిలోలుఁడు గనియెన్
లోకోత్తరచరితుల సు
శ్లోకుల నెనమండ్రుసుతుల సురుచిరమతులన్.

45


సీ.

మదవతీమదనుండు పెదతిమ్మనార్యుండు
                భైరవశౌర్యుండు భైరవుండు
శ్రీకరాకారుండు చినతిమ్మధీరుండు
                నాగేంద్రనిభకీర్తి నాగవిభుఁడు
భాస్కరతేజోవిభాసి భాస్కరమంత్రి
                వినయధన్యుండు గోవిందశౌరి
హిమభూమిధరధైర్యుఁ డెల్లప్రధానుండు
                ధీవిశాలుఁడు పాపదీయఘనుఁడు


తే.

వీర లెనమండ్రు దిగ్గజాకారు లగుచు
వైభవంబున వెలసిరి వసుధలోన
లోకనుతమూర్తి ముడియములోకదండ
నాథగర్భసుధాబ్ధిమందారతరులు.

46


క.

ఈదండనాథమణుల స
హోదరులై పుణ్యలక్షణోజ్జ్వలమూర్తుల్
మాదాంబయు గంగాంబయు
భూదుగ్ధపయోధిసుతలఁ బోలిరి జగతిన్.

47


మ.

తనసత్కీర్తిలతామతల్లికలు దిగ్దంతావళోదగ్రకుం
భనికుంజంబులు తాఁక శౌర్యము రిపుప్రాణప్రయాణార్థిగా
ఘనదోఃస్తంభము కూర్మశేషమహిభృత్కౌతూహలాపాదిగాఁ
దనరెన్ లోకయపాపదీయన సురేంద్రప్రాభవప్రక్రియన్.

48

సీ.

వెలుచు నెవ్వని కీర్తి
                గళమిళద్గరళోగ్రకల్మషంబుఁ
దొలఁచు నెవ్వనికీర్తి తుహినాంశుమండలి
                లగ్నీభవద్గాఢలాంఛనంబు
దుడుచు నెవ్వనికీర్తి దుగ్ధాబ్ధిమధ్యస్థ
                కైటభాంతకు[45]దేహకాళిమంబుఁ
గలఁచు నెవ్వనికీర్తి కకుబంతవేదండ
                గండసరద్దానకర్దమంబు


తే.

వాఁడు నుతిసేయఁగాఁదగు వైరివీర
నృపకులాధీశ[46] సీమంతినీలరామ
హారిసీమంతసిందూరహారి శౌర్య
ధనుఁడు లోకయయెల్లప్రధానఘనుఁడు.

49


మ.

వితతప్రక్రియ లోకమంత్రిమణి గోవిందప్రధానోత్తమో
ద్ధితధాటీసమయోగ్రఘోటకధురోద్యద్ధారుణీరేణుశో
షితపాథోధికి సంతరించు సుజనక్షేమంబు గంధేభసం
తతిభూత్కారవినిర్గతాంబువిలసత్కల్లోలినీవ్రాతముల్.

50


ఉ.

అన్నలు దమ్ములుం దను మహానిధిగా గణుతింప నిత్యసం
పన్నత భోగభాగ్యముల భాస్కరమంత్రి ప్రసిద్ధి కెక్కె న
త్యున్నతకీర్తి వల్లిక[47] సముత్సుకతం దశదిక్తటంబులన్
సన్నుతిఁ బ్రాఁకు వేఁకువఁ దుషారమరీచి మహాఫలంబుగన్.

51


సీ.

ఏమంత్రి కిలువేల్పు సోమశేఖరుపత్ని
                చముడేశ్వరీ పూర్ణచంద్రవదన
యేమంత్రి హృద్దివ్య[48]హేమపీఠంబున
                భాసిల్లు శ్రీరామభద్రమూర్తి

యేమంత్రి హస్తంబు హితపురోహితమిత్ర
                కవిరాజకోటికిఁ గల్పశాలి
యేమంత్రి కైశ్వర్యహేతువుల్ ముడివేము
                లాగ్రవారశతోత్తరాస్త్యుపాస్తు[49]


తే.

లతనిఁ గొనయాడఁ దగు ననారతనితీర్ణ
మతివిశేషప్రతాపసామ్రాజ్యభోగ
విజితరాధేయజీవారవిందబృంద
బాంధవేంద్రుండు లోకయభాస్కరుండు.

52


మ.

మహితత్యాగధురీణతాపహసితామర్త్యాగ రత్నాకర
గ్రహరాజాత్మజ రాజరాజశిబిరాకాచంద్రజీమూతుఁడై
వహితో లోకయనాగఁ డిచ్చును మనోవాంఛానుకూలార్థముల్
బహుమానంబుగ సత్కవీశ్వరులకుం బ్రఖ్యాతచారిత్రుఁడై.

53


మ.

స్మరసంకాశుఁడు లోకమంత్రి చినతిమ్మయ్యప్రధానేంద్రు స
త్వరధాటీపటహారవశ్రవణధావద్వైరికాంతాళికా
భరణాంగప్రకటప్రభాకరరజోభాతిం[50] బ్రతీప్సించు బం
ధురతన్ ఘోటకఘోటికాఖురపుటోద్ధూతోర్వరారేణువుల్.

54


మ.

బహుథారీతులఁ బ్రస్తుతింతురు బుధుల్ భాషావిశేషాహిపున్
మహిళామన్మథు భైరవేశ్వరు మహామంత్రీశు సంధ్యాముహు
ర్ముహురానర్తితశర్వరీశ్వరకళామూర్ధావతంసాపగా
లహరీ(జా)త ఘుమంఘుమారవిశాలప్రౌఢవాగ్వైఖరిన్.

55


సీ.

కావించె నెవ్వండు కట్టుమెట్టుగ హస్త
                తలను సంతతదాతృతాసురభికిఁ
బాటించె నెవ్వండు వల్వలంబుగ మాన
                సంబు గోవిందాంఘ్రిజలజమునకుఁ

జేయు నెవ్వఁడు రంగసీమంబుగా జిహ్వ
                కాంచలం బఖిలవిద్యానటికిని
బ్రకటించు నెవ్వఁడు పాదుగాఁ గడకంటి
                వలఁతిచూపులు కృపావల్లికలకు


తే.

వాఁడు నుతిసేయఁగాఁదగు వైరివీర
మానవాధీశమేఘఝంఝానిలుండు
మహిమ ముడియములోకయామాత్యసుతుఁడు
మానధన్యుండు పెదతిమ్మమంత్రి ఘనుఁడు.

56


క.

వీరలలోఁ గృతినాథుఁడు
ధారాధరవాహ(నేందు)[51] ధారాధరమం
దారసమదానశూరుఁడు
ధీరాగ్రేసరుఁడు బాచధీమణి వెలసెన్.

57


సీ.

పాలించఁ బ్రజలెల్లఁ బ్రస్తుతింపఁగ నబ్ధి
                వేష్టితాశేషపృథ్వీతలంబు
నిలిపె నిశ్చలమనోనీరజాసనమున
                పద్మలోచనపాదపద్మయుగళి
సదనముల్ గావించె శక్తి ధాత్రీపాలి
                కహిసింహశార్దులసహితగుహలు
విడియించె సత్కీర్తి విమలేందుముఖి సప్త
                జలధిమధ్యక్షితి[52]వలయసీమ


తే.

నతఁడు బయకారరామదండాధినాథ
రాజ్యలక్ష్మీశుకీపద్మరాగరత్న
పంజరాయితఫణిసార్వభౌమదీర్ఘ
బాహుపీఠుండు లోకేంద్రుభాస్కరుండు.

58

సీ.

కుంభినీధరకుంభికుంబీనసములకు
                నేమంత్రి భుజదండ మేడుగడయ
రాజభానుజరాజరాజఖేచరులకు
                నేమంత్రి వితరణం బీడుజోడు
సాహిత్యసౌహిత్యసత్యసంపదలకు
                నేమంత్రి ముఖపద్మ మిక్కపట్టు
నలకూబరజయంతనలవసంతాదుల
                కేమంత్రిసౌందర్య మింతె[53] వాసి


తే.

మందరాచలసురసానుమంతములకు
మహిమ నెయ్యంపుఁ జుట్ట మేమంత్రి ధైర్య
మతఁడు రిపుయూధకుధరవజ్రాయుధుండు
ధర్మగుణశాలి బాచప్రధానమౌళి.

59


సీ.

అభయంబు వేఁడఁ గృతాపరాధులనైన
                దయఁబ్రోచు నాత్మబాంధవులఁ బనిచి
యలవోకనైనను హాస్యంబునకునైనఁ
                బాత్రుఁ నాడఁడు నోరఁ బరుషభాష
యర్థిమూఢత్వంబు నర్థలుబ్ధత్వంబు
                నెఱుఁగండు మదిలోన నిచ్చుచోటఁ
జిత్తంబులో నన్యవిత్తంబు చూచుచో
                గాజు రత్నము నొండుగాఁ దలంచుఁ


తే.

బేటనైనను జేపట్టి ప్రిదులనీక
యాత్మ నూహించుకార్యంబు హరిహరాదు
లడ్డునిలిచిన[54]చోనైన నదియ[55] చేయు
మంత్రిమాత్రుండె భాస్కరామాత్యవరుఁడు.

60

క.

ఆ భాస్కరార్యవర్యుఁడు
ప్రాభవమునఁ గోనమాంబఁ బరిణయమయ్యెన్
శ్రీభామామణి నంబుజ
నాభుఁడు శంకరుఁడు శైలనందనఁ బోలెన్.

61


క.

కరుణామణి కోనాంబయు
హరిశౌర్యుఁడు భాస్కరుండు నద్రికుమారీ
హరిణాంకధరుల విధమున
సురుచిరదాంపత్యమహిమ శోభిల్లి రిలన్[56].

62


సీ.

గురుతరమె నటి పరమపాతివ్రత్య
                గరిమచేఁ బార్వతీకాంతఁ బోలి
పాలితానూనసంపద్భాగ్యమహిమచేఁ
                గమలావధూటితోఁ గలసిమెలసి
విపులమాధుర్యోక్తివిభ్రమంబులఁ బల్కు
                జవరాలితోడ బాంధవ మొనర్చి
లావణ్యరూపరేఖావిలాసప్రౌఢి
                రతిదేవితోడఁ బోరామిసేసి


తే.

వెలసె నేరీతి ధాత్రి సాధ్వీలలామ
బంధుసురశాఖి లోకయబాచమంత్రి
మౌళి యర్ధాంగలక్ష్మి సమస్తలోక
మానితోరుగుణాలంబ కోనమాంబ.

63


సుగంధి[57].

కోనమాంబ కీర్తిఁ గాంచెఁ గోవిదార్థి కామధు
గ్ధేనువై ముఖప్రభవధీరితేందురేఖయై[58]
శ్రీనగేంద్రకన్యకాశచీసమాన శీ
లానుకూల భాగ్యవైభవాభిరామమూర్తియై.

64

క.

ఏవంవిధకోనాంబా
సేవాపరితుష్టశుద్ధచిత్తాంబుజుఁడై
కోవిదవినుతోభయకుల
పావనుఁడై లోకమంత్రిభాస్కరుఁ డలరెన్.

65


క.

ఏవంవిధగుణసుభగం
భావునకును నిత్యకలితభావునకుం జే
తోవనరుహలక్ష్మీసం
భావితరామునకు బాహుబలభీమునకున్.

66


క.

కసువాంబావరపుత్త్రున
కసిధారాదళితమదవదరిగోత్రునకున్
బిసరుహదళనేత్రునకును
రసికకవిస్తుతవికస్వరచరిత్రునకున్.

67


క.

నాకాధిపగజరాజని
శాకరకోటీరనిభయశస్సాంద్రునకున్
లోకామాత్యాన్వయ ర
త్నాకరచంద్రునకు మతిజితాహీంద్రునకున్.

68


క.

కుటిలాలకాళినూత్న
స్ఫుటకటకఝణన్నినాదశోభితకరసం
పుటతాళవృంతజ[59]మరు
న్నటదురుకుంతలున కధికనయవంతునకున్.

69


క.

భీమభుజాసారునకున్
హేమాచలధీరునకును హృదయోద్దామ
ప్రేమవసంతోల్లాసిత
రామారామునకు శౌర్యరఘురామునకున్.

70

క.

శరణాగతజనరక్షా
కరణవిధా[60] జాగరూకకారుణ్యగుణా
భరణునకు నిత్యసత్యా
చరణునకును విమలకమలసమచరణునకున్.

71


క.

అక్షయభాషాశిక్షిత
చక్షుఃకర్ణునకు భాగ్యసముదీర్ణున కా
ర్యక్షేమంకరవితరణ
సాక్షాత్కర్ణునకు వినయసంపూర్ణునకున్.

72


క.

కోనాంబావల్లభునకు
నానమితనుదారనృపమహత్తరకృతికిన్[61]
భూనాథమంత్రిమౌళికి
శ్రీనాథధ్యానచతురచిత్తాబ్జునకున్.

73


క.

అతులితమధ్వాచార్యో
దితమతసిద్ధాంతపటుమతి వ్యాసమహా
యతిరాయగురుకృపాసం
తతవర్ధితవిష్ణుభక్తితాత్పర్యునకున్.

74


క.

సారతరకొండవీటిమ
హాసామ్రాజ్యప్రాజ్యవైభవైశ్వర్యకళా
ధౌరంధర్యనిరూఢ
శ్రీరామప్రభుకృపావిశేషోన్నతికిన్.

75


క.

ధీచతురవచోవర్తికి
నాచంద్రార్కస్థకీర్తి[62] కభనవసుమనా
రాచమనోహరమూర్తికిఁ
బాచామాత్యునకు సరసపాండిత్యునకున్.

76

వ.

అభ్యుదయపరంపరాభివృద్ధియు నభిమతార్థసిద్ధియుంగా నాయొనర్పం
బూనిన యుదయనోదయంబను మహాప్రబంధంబునకుం గథాప్రారంభం
బెట్టి దనిన—

77

కథాప్రారంభము

సీ.

కమలాస్తరధరధ్యగమనఖేదవిదారి
                గోపానసీలసద్గోపురంబు
ఘనసౌధశిఖరాగ్రగతసతాకాశాటి
                కాచపేటోద్ధూతకంధరంబు
గంధవారణఘటాకటగళన్మదవారి
                కర్దమీభూతశృంగాటకంబు
సవిధోపవనవికస్వరపుష్పసౌరభా
                వర్జితామరపూరీవనమదాళి


తే.

యగుచు రాజిల్లుఁ గ్రీడాచలాగ్రఖచిత
మరకతాంభోజరాగోరుమణి శశాంక[63]
కాంతకాంతిచ్ఛటా(నేక)కల్పితేంద్ర[64]
చాపవిభవంబు కౌశాంబికాపురంబు.

78

పురవర్ణనము

ఉ.

అన్నగరంబుమేడల రతాంతపరిశ్రమఖేదఖిన్నలై
యున్న సమున్నతస్తనల కొయ్యనఁ[65] జెమ్మట లారవీచు నా
సన్నవియన్నదీజనితసారసరోరుహభూరిసౌరభ
చ్ఛన్నమరందబిందుపరిషత్సముపేత[66]సమీరపోతముల్.

79

ఉ.

వీనులనించి వాద[67] మొదవింతురు భేదము సేయలేమినో
యానగరంబులోని మణిహర్మ్యతలంబున నాడుచేడియల్
మానితనందనోపవనమద్యచరన్మరుదంబుజాననా
గానవిశేషఘోషకలకంఠవధూకులకంఠనాదముల్.

80


ఉ.

ఉన్నతసౌధశృంగములనుండి చెరంగులు మెట్టి వంగి యా
సన్నవియన్నదీసలిలసంహతి నీడలు చూచి చేడియల్
చన్నులు జక్కవల్ కురులు షట్పదముల్ వదనంబు లబ్జముల్
కన్నులు గండుమీ లని తలంతురు మాటికి మానసంబులన్.

81


ఉ.

వంచన మస్తరించుఁ బ్రతివారము బాహ్యవిహారకేళి కుం
కించన వేళ నాకపతి గేరుకొనంగఁ[68] బురంబుమేడలం
దంచుల గండరించినయుదగ్రకరిద్విషదాననంబులం[69]
గాంచి భయంబునం బరచు గంధకరిన్ శిర మప్పళించుచున్.

82


ఉ.

అన్నగరోపకంఠముల నారఁగఁ బండిన రాజనంబు కా
పున్న జఘన్నరాజముఖు లుబ్బున చన్నులయున్నతిం గరం
బన్నువకౌనుఁ దీఁగె లసియాడ శుకంబులఁ దోలు లీల లా
సన్నమహీచరత్పథికసంతతి కాత్మల నింపు[70] నింపులన్.

83


చ.

చఱపఁగరాదు చప్పటలు చన్నుల యున్నతి నూని వేగమై[71]
పఱవఁగరాదు వింతకటిభారము పెంపున మోవి విచ్చి తాఁ
జఱవఁగరాదు కీరముల సంతతి నిచ్చట నేల యంచుఁ గ్ర
మ్మఱుదురు చేలకావలులు మాని జఘన్యజభామ లిండ్లకున్.

84


చ.

వెడలురసంబుతోఁ దొడిమ[72] వీడి రసాలఫలోత్కరంబుపైఁ
బడినఁ దునుంగునిక్షువులఁ బాయక క్రమ్మురసంబు వాగులై
బడి బడిఁ[73] బాఱఁగాఁ బెరుఁగు ప్రాసఁగు[74]చేలకు సారెసారెఁ గ
ప్పిడుదురు పౌరపామరమృగేక్షణ లంబురుహోత్పలంబులన్.

85

గీ.

కలమసస్యవనంబులు గాచు దంట
వెలఁదుకల[75] సోయగంబులే ములుకులుగను
గూర్చి తరుణాధ్వనీనుల[76] గుండె లవియ
వ్రేయు మరుఁడను తక్కరివింటిజోదు[77].

86


సీ.

పండ్లవ్రేఁగున వీఁగఁబడుమాదిఫలముల
                కలిమి కప్రంబుల చెలిమి దడవ
నిండంగఁ బండిన నిమ్మల సామగ్రి
                శృంగబేరమ్ముల చెలువు మెఱయ
ముదిరినయనఁటులఁ బొదలు[78] సారస్యంబు
                ఖండశర్కరల చక్కటులు వెదుకఁ
గావు తట్టినను నీకడుములవిభవంబు
                భోజనోత్సవముల పొందు లరయ


తే.

దింప బరువైన పోఁకబోదియల పెంపు
వెల్ల[79]నాకుల సేమంబు [80]విరికొనంగ
వఱలుఁ దద్దయు నప్పురవరము చుట్టు
కొని తనర్చెడు నందనవనచయంబు.

87


చ.

రవి యుదయించి యెత్తి పయిరాకకు బెగ్గిలి యిర్లు మన్కికై[81]
యవనిజముల్[82] శరణ్యమని యాడిన లో నెడ మిచ్చి[83] నిల్పె నా
(రవి)[84]కిరణాళికిం దఱిసిరా నవకాశము నీక చీఁకటుల్
గవియఁగ నుండు నెంతయుఁ బగళ్ళును[85] నప్పురి నందనావళుల్.

88


చ.

పలుకుల నేర్పు చిల్కలకుఁ బాటల తిన్నదనంబు గండుఁగో
యిలలకు మందయానముల యెత్తు నెమిళ్ళకు వేణియొప్పిదం
బలులకుఁ బంచి వెట్టఁదగు నౌఁ బురిలేమలు కానినాటికిం
గలుగవె యన్యమైన విహగంబులయందుల నివ్విలాసముల్.

89

చ.

తిరిపెపుఁ గాని పొందొకటి[86] దేహమునం గొద యొక్కటయ్యు ద
గ్గఱు నను నంచుఁ దా మ[87][88]కరకచ్ఛపపద్మవరాంగలక్ష్మి ని
ర్భరతరరాగ మొప్పఁ బురి బాహ్యవనంబుల నిల్చె నట్ల యౌ
సరసులఁ జేరు కమ్మవిరి చాలదె[89] యొక్కదినంబు లెక్కకున్.

90


శా.

మాకందీసమనోమరందముల తేమల్ సోఁకుచుం బుష్పితా
శోకానోకహవాటముల్ దఱియుచున్ శుంభత్తమాలాటవీ
ప్రాకామ్యంబులు సూచుచుం బొలయు నొప్పనే వీటిపై నందనా
నీకాంతర్వసుధానిరంతరచరన్నిస్సంద్ర[90]వాతూలముల్.

91


సీ.

వేదవేదాంతాది విద్యావిశేషత
                వనజాతసంభవు వినిమయములొ
భాసురభోగసౌభాగ్యభాగ్యోన్నతి[91]
                వృత్రారి మాఱట విగ్రహములొ
బహుధనరత్నసంపాదనాసంపత్తి
                యక్షనాయకుని ప్రత్యక్షతనులొ
ప్రకటబాహాబలప్రాభవప్రౌఢిమ
                బలభద్రు సంబంధ బాంధవములొ


ఆ.

యనఁగఁ దత్పురంబునను ధరామరులును
క్షత్రవరులు నూరుసంభవులును
సరవి సవరవర్ణజనులు మహోన్నతిఁ
బొలుతు రనుపమానభూతిఁ దనర.

92


చ.

క్రతుశతకంబు శాస్త్రవిధి గైకొని సేయని బ్రాహ్మణుండు సం
తతమును శస్త్రనైపుణి నుదారత నొందని పార్థివుండు నీ
హితమతిఁ గోటికిం బడగ యెత్తని వైశ్యుఁడు బాహువిక్రమ
ప్రతిభ దొఱంగు శూద్రుఁడును బన్నిదమాడిన లేఁడు వీటిలోన్.

93

చ.

మగఁటిమి నింద్రనందనుని మాఱటరూపులు నిక్కువంపు సో
యగమునఁ బుష్పసాయకునియన్నలుఁ దమ్ములు ధైర్యసంపదన్
నగపతి జోడుకోడెలు ఘనంబగు నీవులఁ జందమామ లై
తెగువ లనం బురంబు నరదేవకుమారులు వొల్తు రున్నతిన్.

94


చ.

చిలుకలయొప్పు క్రొమ్మెఱుఁగు చెన్ను పికప్రకరంబు చెల్వ మం
చల గరువంబు తుమ్మెదల చక్కదనంబును గూర్చి తెచ్చి యి
ప్పలుకులు మేనుఁదీగెలును బాటలు నాటలు గుంతలంబులున్
నలువ సృజించెనాఁ బురమునం గనుపట్టుదు రబ్జలోచనల్.

95


ఉ.

కన్నులు గండుమీలకును గౌనులు సింహకిశోరరాజికిం
జన్నులు చక్రవాకఖగసంతతికిన్ నడయాడు టంచకుం[92]
జెన్నులు చిత్రరూపులకుఁ జేర్తురుపో యల సంయమంబుతో[93]
నన్నగరీవిలాసినులు హారి[94]మనోహరరూపవైఖరిన్.

96


ఉ.

పెట్టనిసొమ్ము మోములకుఁ బిన్నట నవ్వులు మాటనేరుపుల్
పుట్టిన యిండ్లు తీపులకుఁ బుష్పశరాసను నూఁతపట్టు లే
పట్టునఁ గల్కి[95] కన్గొనలు బావమునం బరికించి చూడ న
ప్పట్టణభూమి రోచెలుల వాటిక[96] లేఁజిగురాకుఁబోండ్లకున్.

97


సీ.

మవ్వంపుఁ గ్రొవ్విరి మల్లెలకాంతికిఁ
                గలికిలేనవ్వులు గలు పమరిచి[97]
విచ్చిన చెంగల్వవిరుల నెత్తావికి
                నిట్టూర్పు వలపులు నెలవుకొలిపి
మిగులంగఁ జవియైనపొగడపూఁ[98]దేనియ
                కచ్చంపుఁ పలుకుతీ పప్పలించి
పురణించు[99] మించు లేఁబొఱల రాగమునకుఁ
                జేతులకెంజాయఁ జేరఁద్రోసి[100]

తే.

కొసరు టెలుఁగులుగా[101] నిత్తు రెసక మెసఁగ[102]
విలుచుచోఁబూలఁ[103] దనియాడు విటజనాళి
కింపు సేఁతలఁ దనివి రెట్టింపుఁ జేయ[104]
విరులయంగళ్ళ పుష్ప[105]లావీజనములు.

98


మ.

మదధారల్ జలధారంట్ల దొరుఁగన్ మత్తిల్లి లోహార్గళా
స్పదపాదంబులతోఁ బురోపవనికాభాగంబులం బొల్చు ను
న్మదనాగంబులు నందనోపవనికామధ్యంబులన్ శృంఖలా
స్పదబంధంబులతోడ నొప్పు విలయాభ్రశ్రేణిచందంబునన్.

99


ఉ.

గండగళన్మదాంబువులు గ్రమ్మెడునేఱులు కుంభపీఠికల్
గండశిలల్ రజించిన మొగంబులఁ జేగుఱు జేగుఱుల్గ నా[106]
ఖండలుచేతఁ జెట్టుపలు గ్రాఁగక తప్పిననాఁటి నీలపుం
గొండలొకో యనంగఁ బురిఁ గ్రుమ్మరు నెల్లెడ భద్రనాగముల్.

100


గీ.

శాలిహోత్రునిశక్తిఁ బక్షములు దునిసి
పోక మృష యని చూపఱు వొగడుచుండఁ
బక్కెరలతోడ వాహ్యాళి బయలుపడు(చు)[107]
గవి దగం బాఱు నగరి పాగాచయములు.

101


మ.

వరణాభోగవిహారవాటములపై వర్తించు దేవాంగనల్
పరిశానీరములోనఁ గానఁబడు వప్రస్థాపితప్రస్ఫుర
ద్వర[108]రత్నంబులనీడు లోలిఁ గని తద్భావంబులన్[109] సంఘటిం
తురు దర్వీకరరాజమస్తకమణిస్తోమానురూపంబులన్.

102

క.

పరిబింబితవప్రోపరి
పరికీలితవివిధరత్నపంక్తులు వెలయం
బరిఖకు సాక్షాద్రత్నా
కర మను నుత్ప్రేక్ష నిజముగా నొనరించున్.

103

సహస్రానీకవర్ణనము

క.

ఈ కరణి నసమవైభవ
శ్రీకరమై యొప్పు నప్పురీతిలకంబును
లోకోత్తరుఁడు సహస్రా
నీకుం డనెడుపతి యేలు నిత్యవిభూతిన్.

104


సీ.

ఎవ్వాని పటుహేతి కెదిరి పాఱక
                పోరురాజన్యులు బారిగొఱియ
లెవ్వాని భుజశక్తి కిభకిరిఫణితతుల్[110]
                ప్రా పాసవడియున్న బంధువర్గ
మెవ్వాని దాతృతాహేవాకమున కింద్రు
                పట్టణద్రుమములు బడిసివాటు[111]
లెవ్వాని సత్కీర్తి కీరేడుజగములు
                కేళీనివాసనికేతనములు


తే.

వాఁడు నుతిసేయఁదగు నిత్యవైభవుండు
చంద్రవంశాబ్ధిచంద్రుండు సవ్యసాచి
మనుమసంతాన మంగనాజనమనోహ
రాతిశయరూపవిభ్రమాయతనమూర్తి.

105


శా.

నానానేకపగండమండలవతానస్యందిదానోదక
స్నానక్లిన్నసభాంగణస్థలుఁడు విశ్వక్షోణిదోర్విక్రమ
శ్రీనిష్ణాతనిరూఢిఁ గైకొని మహోత్సేకప్రపూర్తిన్ సహ
స్రానీకక్షితిపాలుఁ డేలె ననివర్యాఖర్వగర్వోన్నతిన్.

106

శా.

ఏలెన్ సజ్జనసాధురక్షణకళాహేలన్[112] మహీమండలిం
బోలెం బూర్వనృపాలురన్ నృగు దిలీపున్[113] రాము నాభాగునిం
దోలెన్ వైరుల దిగ్వటంకములకనున్[114] దోర్విక్రమప్రౌఢిచే
నా లీలావిభవాతిలోకుఁడు సహస్రానీకుఁ డత్యున్నతిన్.

107


సీ.

వలెనన్న యప్పుడ వర్షంబు హర్షంబు
                గొనసాఁగ మేఘంబు గురియుచుండఁ
గాఁపుపాలిటి కామగవియై వసుంధర
                దండిమై ముక్కారుఁ బండుచుండఁ
బాలువెన్నలకు వ్రేపల్లె[115]వాడలఁబోలె
                నవటుగాఁ బసులు చన్నవిసి పిదుక
జనములు తనపేరు వినినయంతనె మోడ్పుఁ
                జేతు లౌఁదలలకుఁ జేరఁదిగువఁ


తే.

గాలగతు లనుమాట లోకంబువారు
వినియు నెఱుఁగకయుండ నజ్జనవిభుండు
మెఱసి భుజశక్తి వారిధుల్ మేరగాఁగ
ధాత్రిఁ బాలించె నేకాతపత్రముగను.

108


సీ.

వెండియుఁ బైడియు వీడ్వడ[116] నిండ్లలో
                నెమ్మది[117] నుండిరి నిఖిలజనులు
పుడమిమో పెడలించి భుజగాధినాథుండు
                వేడ్కతో హాయిని విశ్రమించెఁ

బాదముల్ నాలుగు పదిలంబుగా మోపి
                విహరించె ధర్మంబు వెఱపు దొఱఁగి
కలికాలకృత్యముల్ కడలకు విచ్చేసె
                నుర్విలో నెచటఁ గా లూఁద రాక


తే.

సేతువుననుండి మేరువు సీమగాఁగఁ
గలుగుదేశాధిపతు లరిగాఁపులైరి
యతఁడు సింహాసనం బెక్కి యతులభూతి
నవనిభారంబు భరియించు టాదిగాఁగ.

109


వ.

మఱియును.

110


గీ.

కలితవరనీతిశాలి యుగంధరుండు
మంత్రి రిపువాహినీవార్ధిమంధశిఖరి
సుప్రతీకుండు సేనాని సుభగహాస్య
హారి శాస్త్రార్థకుండుఁ దోడై[118] చరింప.

111


సీ.

కస్తూరిరేఖలకైవడి మీసముల్
                వదనేందునకు నంగపదవిఁ జేయ
వెలిదామరలవోలె[119] వెడఁదకన్నులు కృపా
                లక్ష్మి కావాసస్థలములు గాఁగ
మేరువుచెలిమాడ్కి పేరురంబు వయోని
                ధానంబునకు గుప్తితలము గాఁగఁ
గులమహీధరశృంగముల భాతి భుజములు
                ధరణికి విహరణస్థానములుగ


తే.

మిమ్మటంబగు[120] కండగర్వమ్ముతోడ
నతఁడు దక్కిన వ్యసనంబులందు జిత్త
మడిక భూపాలనము నందె యిడి కడంక
నుర్విఁ బాలింపుచుండంగ నొక్కనాఁడు.

112

మాతలి యాగమనము

ఉ.

దివ్యవిమానదీప్తి నలుదిక్కుల దీఁటుకొనంగఁ గింకిణుల్
శ్రావ్యములై చెలంగఁ బృధులధ్వజలాంఛన మొప్ప శక్ర సం
భావ్యగుణుండు మాతలి నభంబున వెల్వడి సాద్భుతేక్షణా
భివ్యసనంబునం దవిలి పెల్లుగఁ[121] బౌరులు దన్నుఁ జూడఁగన్.

113


వ.

వచ్చి మొగసాల ముందటిచాయ వినువీధి విమానంబు నిలిపి యవనీతలంబున కవతరించి.

114


సీ.

అమితప్రవాహంబులై యామ[122]వేదండ
                దానధారాంబువుల్ తళ్కు[123](లొలయఁ)[124]
దఱచైన పల్లకి దండెల యెడ మాటు
                మానికంబులు[125] కాంతు లీనుకొనఁగఁ
గడచూరు ముత్యాలగొడుగులపైఁ బైడి
                కుండలదీప్తులు గొండ్లియాడ
మురువైన తేజీల ముఖపేనఖండముల్
                క్రొత్తముత్తెపుమ్రుగ్గు కొమరు నీన


తే.

మూఁపుమూఁపున రాయంగ మూఁగి నిలిచి
యవసరము గోరు వివిధదేశావనీశ
సంఘముల సందడులతోడ జానుమిగులు
ననుఁగుమొగసాలకడ డాసియుండఁ గడచి.

115


వ.

ప్రతీహారోపదిష్టమార్గంబున నడచి కక్ష్యాంతరంబులు గడచి
ముందట.

116

సీ.

సింహాసనమునకుఁ జెంతల నిరుగడ
                బిసలతాకరలు సీవిరులు వీవఁ[126]
గొలువనేతెంచురాజులఁ బేరుపేరున[127]
                వేత్రహస్తులు విన్నవించి పలుకఁ
దమమీఁద నలవోక తలకొను[128] చూడ్కికి
                జనపతుల్ మౌళి నంజలులు సేర్ప
దిగ్దేశపతులు పుత్తెంచిన కానుక
                లానతిఁ బనివార లందుకొనఁగఁ


తే.

జేరి సేవించు మూర్ధాభిషిక్తవితతి
నడుమఁ గులపర్వతంబుల నడుమఁ దనరు
మేరుగిరివోలెఁ గొలువిచ్చి మెఱసియున్న
ధారుణీవల్లభునిఁ గాంచి చేరఁబోయి.

117


వ.

వినయోత్థానపూర్వకంబుగా విభుం డాచరించునాతిథేయసపర్యల నాద
రించి యుండునంత నమ్మహీకాంతుండు మాతలి నవలోకించి.

118


క.

అనఘాత్మ నీవు వచ్చిన
పనిఁ దెలియఁగఁ బలుకు దేవపతికిన్ సుఖమే
దనుజావళి క్రొంగోల్తల[129]
పని గలిగెనొ మమ్ముఁ బంచి పనిగొనుటలకున్.

119


క.

అనవుడు మాతలి వినయం
బున జననాథా సుఖంబ పురుహూతునకుం
బని యొండు లేదు నందన
వనలీలాసక్తుఁ డగుచు వాసవుఁ డొప్పెన్[130].

120

గీ.

నిన్నుఁ దోడ్కొని రమ్మన[131] నెమ్మి నాదు
రాక విచ్చేయు మనవుడు రాజు నొప్పి[132]
చనఁగ సమకట్టి మంత్రుల సమ్మతమున[133]
మాతలియుఁ దాను దివ్యవిమాన మెక్కి.

121


వ.

ఉత్తరాభిముఖుండై వియత్తలంబునం బోవుచు నెడనెడం గడచు
నదీనదంబులు జనపదంబులు గిరికాననంబులు నవలోకించి తత్ సృష్టి
విశేషంబులు మాతలి నడుగుచు వచ్చివచ్చి యమరావతీపురంబు చేరం
జనుదెంచి తదుపకంఠంబున—

122


శా.

అంగంబుల్ పులకింపఁ గన్గొనియె వత్సాధీశుఁ డంత న్నభో
గంగన్ మంగళనాదమేదురతరంగం గేళిలోలాభ్రమా
తంగన్ మంధరగంధవాహవిచలత్పద్మోల్లసచ్చారుసా
రంగన్ మంజుల భూరివంజుల[134] వనీరమ్యాంతరంగం దగన్.

123


ఉ.

బంధురలీలఁ గర్ణపుటపర్వముగాఁగ మదాంధభూరి పు
ష్పంధయగానముల్ వినుచు సమ్మతితోఁ జనుదెంచి భూమిభృ
త్సింధురు సేద దేర్చె[135] నెడసేయక నిర్జరసింధుజాతసౌ
గంధికకంజపుంజవనగంధలసత్తనుగంధవాహముల్[136].

124


సీ.

వెన్నెల పూఁదాల్చు వేలుపునౌఁదల
                మల్లెపూదండ యే మంజులాంగి[137]
బొడ్డున ముదివేల్పుఁ బుట్టించుహరిపాద
                కమలంబుపట్టి యే కలువకంటి
మహివధూమణికటీమణిసూత్రమగు వార్ధి
                పట్టంపురాణి యే పద్మగంధి
కపిలుచేఁ గ్రాగిన నృపకోటి మీఁదికిఁ
                బోవునిశ్రేణి యే పూవుఁబోణి

తే.

ముజ్జగంబులు పావనంబులుగఁ జేయు
దేహ మెత్తిన తల్లి యే దివ్యమూర్తి
యట్టిగంగకు సాష్టాంగ మాచరించెఁ
గేలు ఫాలంబుఁ జేర్చి భూపాలవరుఁడు.

125


చ.

కడలికి రాణివాస మనఁ గైటభవైరికిఁ గూర్మిపట్టి నా
మృడునకుఁ బూవుదండ యన మేటి నుతుల్ గని ముజ్జగంబు లి
ట్లెడపక శుద్ధి సేయఁ దను వెత్తిన తల్లివి నిస్తరింతు రే
ర్పడ[138] భవవార్ధి నార్యులు నభస్స్రవదాపగ నీవు దేపగన్[139].

126


వ.

అని కొనియాడుచు.

127


సీ.

ఎసకంపుఁ బసిడి చిట్టిసుకతిప్పలమీఁదఁ
                గవగూడియాడు జక్కవకవలును
గమ్మని పైఁడికెందమ్మిమాడువుటిండ్లఁ
                గ్రీడించు నెలదేఁటి చేడియలును
దఱచైన నిద్దంపుఁ దరగయూయెలలను
                దూఁగు బెగ్గురురాచతొయ్యలులును
బంగారుటెలదూండ్లఁ బట్టి చంచులఁ ద్రుంచి
                మెసఁగు చక్కని హంసమిథునములను


తే.

దరుల సురపాదపముల చెంతల నెమిళ్ళు
పెట్టు కొకరిక గుట్టల[140] తట్టియలును
గాంచి సంతోషరసవార్ధి గడలుకొనఁగ
నుత్తరాపగ దాఁటి నృపోత్తముండు.

128


సీ.

తలఁపురామానికంబులఁ గట్టు సోరణ
                గండ్లఁ జెన్నగు మాడుటిండ్లతోడఁ
బండి నేలకు వ్రేల[141] బడువేల్పు మ్రాఁకులఁ
                దనరు పెందోటల తఱచుతోడ

నెదురుగాఁ బిరికొని[142] పొదుగులు వ్రేల నొ
                ప్పెసఁగ నిల్చిన పాడిపసులతోడ
రసరసాయనసిద్ధరససుధారసముల
                లలి నొప్పు తమ్మికొలఁకులతోడ


తే.

వయసువేలుపుఁగొమ్మలపైఁ దలంపు
మరలిరామిని నిండ్లఁ గాఁపురములకును
జాలి వర్తించు నప్సరఃస్త్రీలతోడ
వఱలు నమరావతీపురవరము డాసి.

129


సీ.

ప్రోలెల్ల[143] మందారభూరుహంబుల యన్న
                నెలదోఁటల విశేష మెన్న నేల
శిల్ప[144]కృత్యము లెల్ల చింతామణులె యన్న
                మచ్చుటిండుల యొప్పు[145] మెచ్చ నేల
వీడెల్ల నచ్చరవెలచేడియలె యన్న
                నలరుఁబోఁడులచెల్వ మడుగ నేల
ధేనులెల్లను గామధేనువులే యన్న
                పాఁడిసౌభాగ్యంబు వేఁడ నేల


తే.

రాజు దేవేంద్రుఁ డన నేల తేజ మడుగఁ
జెంతఁ బ్రవహించునది సిద్ధసింధు వనినఁ
బావనత వేఱ కొనియాడఁబోవ నేల
సురపురికి నీడె తక్కిన పురవరములు.

130


సీ.

ఈపురిచేడెల యిఱుగౌఁగిళులు గోరి
                కాదె పోరుల నిల్పు ఘనులపూన్కి
యీపురికాపురం బెద నాసపడి కాదె
                పాయక జన్నముల్ సేయుపనులు

నీపురివసతి[146] యూహించి కాదె సమస్త
                ధర్మశాస్త్రములకుఁ దనరె శంక[147]
యీపురి కేపురు లీడురామినిఁ గాదె
                యిది పూర్వదిశ యంచు నెన్నఁబడుట[148]


తే.

యితరపురముల వర్ణించునెడలఁ గవుల
కిప్పురమ కాదె యుపమయై యొప్పుచూపు
సకలధర్మార్థకామమోక్షముల కెల్ల
పుట్టినిల్లు తలంప నీపురమ కాదె.

131


మ.

అని డెందంబున కద్భుతంబును బ్రమోదావేశముం జేయ నూ
తనవస్తుప్రకరంబు గాంచుచును నుద్యచ్చాటువాక్యంబులన్
వినుతుల్ సేయుచు వచ్చి భాసురసురోర్వీజాతజాతప్రసూ
ననవీనాయత[149]వాసనాయుతమనం దన్నందనాగారమున్[150].

132


వ.

చేరి తద్ద్వారప్రదేశంబున విమానావతరణంబు గావించి మాతలియుం
దాను నభ్యంతరంబు ప్రవేశించి నడచునప్పుడు—

133


సీ.

తలిరు లొత్తిన కల్పతరువుల పొరువులఁ
                గొసరి కూయిడు మత్తకోకిలములు
ననిచిన హరిచందనంబుల చేరువఁ
                గెరలి పల్కెడు రాజకీరములును
బూచిన మందారభూరుహంబుల పొంత
                దొమ్ములాడెడు గండుతుమ్మెదలును
జాదుకో విరిసిన సంతానముల చెంత
                దుమ్ము రేఁపెడి నాలితెమ్మెరలును

తే.

దనియ బరువైన పారిజాతముల నీడఁ
బొదలియాడెడు నెడ కేకిపోతకంబు[151]
నంతకంతకు నగ్గలం బగుచు వచ్చు
వేడ్కఁ దేలించె నమ్మహీవిభు మనంబు.

134


చ.

అలితతి నీలముల్ ముదురుటాకులు పచ్చలు లేఁజిగుళ్ళు కెం
పులు దళరాజి వజ్రచయముల్ కలికావళు లాణిముత్తియం
బులుగఁ బొసంగు చంగజుని బొక్కసమో యన[152] నాత్మలోన నిం
పులు పొదలించె రాజునకుఁ బూచి బెడంగగు పొన్న లున్నతిన్.

135


చ.

జలధులనీరు ద్రావునెడ సారెకు నీరునఁ గూడి వచ్చు కెం
పులు నునుగెంపు బిందియలఁ[153] బోసి దృఢంబుగఁ బక్వదాడిమీ
ఫలముల పేర నిల్పి బహుభంగులఁ గావలులున్న వారిదం[154]
బులొ యనఁ జూడ్కి కింపొసఁగఁ బొల్పగు దోహదధూపధూమముల్.

136


ఉ.

గుత్తపుఁ జన్నుదోయి పువుగుత్తులు చేతులు పల్లవంబు లు
ద్యత్తరవాసనల్[155] విరులతావులు మోవులు తేనియల్ కురుల్
మత్తమధువ్రతంబులయి మానుగ రాజిలు తీవ లోలి భూ[156]
పోత్తమునాత్మ కింపొసఁగె నొక్కట నవ్వనలక్ష్ములో యనన్.

137


ఉ.

పూవులతేనియన్ మధుపపోతములన్ జిగురాకుమేఁతలం
గోవ పికవ్రజంబులను గ్రొత్తఫలంబులఁ గల్కిచిల్కలం
జేవదలిర్ప మన్పుచును జేరికలం దని గాలి నిల్పుచున్
భావజునీడలై పొదలు ప్రాయపుమావు లొనర్చె నింపులన్.[157]

138

ఉ.

సారెకుసారె కామ్రతరుశాఖలఁ బ్రాకి తనర్చు మాధవీ
వీరుధు లర్థిఁ జేరువుల వెల్వడు భూవరు మీదఁ గ్రొవ్విరుల్
బోరన రాల్చు టొప్పె నళిపోత గరుత్ప్రవిచాలనంబులం
గోరి వనాంతలక్ష్మి యొసగుం గుసుమాంజలి చంద మందమై.

139


గీ.

ఈడ పండుల[158] సామగ్రి యీడఁదక్క
నొండు వనముల లేవు సుండో యటన్న
యట్లు పికరాజి పెంగూఁక లాడుచుండఁ
బొల్చునీడలఁ జూచు నాభూవిభుండు.

140


గీ.

అక్కఱకుఁ బూవు లొదవని యపుడు చెలుల
చేతఁ దన్నింప మరుని దాసియును బోలెఁ[159]
గరము రాజిల్లుచుండు నీతరు వటంచు
నగుచుఁ గంకేలిఁ జూచె భూనాయకుండు.

141


సీ.

ఆరఁబండిన క్రొత్తయల్లొనేరెడుపండ్లు
                కుంతలంబుల యొప్పు సంతరింపఁ
గమియఁబండిన పెద్దగజనిమ్మపండులు
                పాలిండ్ల చెలువంబు ప్రస్తరింప
ముదురఁబండిన మంచిమాతులుంగపుఁబండు
                లంగంబు కాంతి చె న్నవధరింపఁ
దనియఁబండిన తీయద్రాక్షాఫలంబులు
                కలికివాతెఱ సోయగంబునాఁగఁ


తే.

బలుచఁ బాఱిన లతవికాపల్లవములు
గండసాళుల విభవంబు గమ్మిరింపఁ[160]
బొలుచు వనలక్ష్మి యవయవంబులునుబోని
వనవిశేషంబు వీక్షించె మనుజవిభుఁడు.

142

వ.

ఇ ట్లనన్యవననిర్విశేషంబు లగు నవ్వనవిశేషంబు లన్నియు విలోకించుచు వచ్చి వచ్చి ముందట—

143

సహస్రానీకుఁడు సుధర్మసభయందుఁ బ్రవేశించుట

చ.

హరిమణిసాలభంజికల హారి విధూవల కుట్టిమింబులన్
మరకతభిత్తిభాగముల మానితవజ్రమయైకవేదులన్
సరసిజరాగజాలములఁ జారుతరంబయి యంబరంబుతో
నొరసి సుధర్మయన్ సభ సమున్నతసన్నుతశృంగభాతిగన్.

144


వ.

కనుంగొని—

145


క.

చేరఁజని తత్సమీప
ద్వారంబున నిల్చి యింద్రువచనమునఁ బ్రతీ
హారుఁడు దను దోడ్కొని పో
నారాజవరుండు తత్సభాంతరభూమిన్.

146


సీ.

నాభాగమాంధాతృనలదుంధుమారాది
                నృపకోటి యొక్కచో నిలిచి కొలువ
నతిరాత్రవాజపేయాది మహాక్రతు
                పారగు లొక్కచో బలసి కొలువ
నారదకౌండిన్యనాగదంతశుకాది
                మునిముఖ్యు లొక్కచో మొనసి కొలువఁ
జిత్రలేఖాఘృతాచీమేనకాద్యప్స
                రోంగన లొక్కచో హత్తి కొలువ


ఆ.

సప్తమాతృకలును సప్తదిక్పాలురు
సప్తమునిగణంబు సాధ్యసిద్ధ
యక్షరాక్షసోరగామరప్రవరులు[161]
నలరి రంత నింద్రు[162] నలమి కొలువ.

147


వ.

మఱియును—

148

సీ.

మంద్రమధ్యమతారమానసంశ్రుతుల గం
                ధర్వకామినులు గీతములు పాడ
రత్నకంకణఝణారావంబు లులియంగ
                సురవిలాసినులు నీచోపు లిడఁగ
మేనకాద్యప్సరోమృగనేత్ర లాయాయి
                యుడిగంపుఁ బనులకు నోలి నడువ
నఖిలపురాణేతిహాసగోష్ఠీవినో
                దంబుల మునిజనుల్ దనరియుండ


ఆ.

నున్నతాసనమున నున్న వాని సురేంద్రుఁ
గాంచి యాత్మ వేడ్క గడలుకొనఁగ
యవనిజాని మ్రొక్కి యప్పురందరు నాజ్ఞ
నుచితపీఠ మెక్కి యుండు నంత.

149


వ.

శతమఖుండును నతని కభిముఖుండై కుశలం బడిగి కాలోచితంబులగు
కథాకలాపంబులు నడుపుచుండునంత మధ్యాహ్నం బగుటయు నమ్మహీ
కాంతున కవ్వనాంతరంబున నొక్కమణిసౌధంబు విడిదల యిడి
మజ్జనభోజనంబు(లు) నడుపునట్లుగా మాతలిని నియోగించి
తానునుం గొలువు విడిసి యభ్యంతరంబునకుం జని సముచితవ
ర్తనంబుల నద్దివసంపు గడపి మఱునాఁడు మొదలుకొని—

150


క.

ప్రీతాంతరంగుఁడై పురు
హూతుం డచ్చరులుఁ దాను నుద్యా
జాతసురపాదపములకు
జాతర గావించి కేళి సలుపుచు[163] నుండన్.

151


వ.

వత్సాధీశ్వరుండును నమ్మహోత్సవంబు గనుంగొనుచు డెందంబునఁ బర
మానందంబు గందళింప నుండునంత నొక్కనాఁ డప్పురందరుం డొక్క
యెడ సుఖాసీనుండై సముచితసల్లాపంబులు జరుపుచు నంత[164] నమ్మహీ
విభునకు భావిశుభం బెఱింగించువాఁడై ప్రసంగవశంబున నతనితో
ని ట్లనియె.

152

పురందరుండు వత్సాధీశునకు భావిశుభం బెఱింగించుట

మ.

క్షితినాథోత్తమ చెప్పెదన్ వినుము సాకేతప్రభుండైన యా
కృతవర్ముం డను రాజుపుత్త్రి విలసద్రేఖాకలాపన్ మృగా
వతియన్ కన్యకఁ జెప్పనొప్పు దరుణీవర్యాలలామంబుతోఁ[165]
బ్రతిసేయన్ మఱి లేరు ముజ్జగములన్ రాజీవప్రత్యేక్షణల్.

153


ఉ.

మోహరసాబ్ధికిం దరఁగ మోహనబాణుని యాజికేలి స
న్నాహము యౌవనోద్గమధనంబునకున్ నిధి లోకలోచనో
త్సాహనవాంకురంబునకు శంబరపూరము బంధురాగసం
దోహమహామహంబునకు దోహల మయ్యెలనాగ చూడఁగన్.

154


క.

భూమి నలంబుస యను సుర
భామిని యుదయించి మనుజభామిని యగుచున్
భూమీశతిలక నీ కా
కామిని యికమీఁద భార్య గాఁగలదు సుమీ.

155


వ.

ఆవృత్తాంతం బాకర్ణింపుము.

156


సీ.

ఒక్కనాఁ డక్కరభోరువు పరమేష్ఠి
                యోలగంబున కేఁగియున్న తఱిని
వాయువశంబున వనితాలలామకు
                నూరుమూలము దాఁక చీర తొలఁగ
నచ్చట నున్నవా రందఱు వదనముల్
                వాంచి నిల్చిరి ప్రత్యవాయభీతి
వారిలో నొక్కఁడు వసువు విధూముఁ డన్
                వాఁ డింతిఁ జెఱవెట్టు వాంఛఁ జూచెఁ

తే.

జీర దొలఁగుట యెఱుఁగమి జేసి యతివ[166]
వాంఛ జూచుటఁ చేసి యవ్వసుని మర్త్య
యోని జనియింపుఁ డనుచుఁ బయోజగర్భుఁ
డిరువురకుఁ గోపమున శాప మిచ్చుటయును.

157


క.

బిసరుహభవునాజ్ఞ నలం
బుస యి ట్లుదయించె వసువు భూవర నీవై
వసుధ జనియించి తనవుడు
వసుధేశుఁడు కౌతుకార్ణవము నడ లెసఁగన్.

158


ఉ.

ఆ లలితాంగిఁ జూచుటకునై యురియాడెడునెమ్మనంబుతో
వాలుమగండు కంతుఁ డనివారణ నిల్గులఁ బెట్టి యచ్చటం
గాలుకొనంగ నీమికి వగం దురపిల్లుచు నింద్రుఁ డంప భూ
పాలుఁడు ధాత్రికిన్ విరహభారమునం జనుచుండ ముందఱన్.

159

తిలోత్తమ సహస్రానీకుని శపించుట

సీ.

కబరిపైఁ జెరివిన కమ్మని చెంగల్వ
                విరులతావికిఁ దేంట్లు వెనుకొనంగఁ
దారహారంబుతోఁ బారిజాతపుదండ
                కుదురుఁబాలిండ్లపై గొండ్లియాడఁ
బదపల్లవంబులపై జాఱఁగట్టిన
                చీనాంబరము వింతచెలువు చూప
నిర్జరాధిపుఁ డిడ్డ నెలవంక యొత్తులు
                చెక్కుటద్దములకు సిరిఘటింప


తే.

గతులు రాయంచమురిపంపు గతులఁ దెగడ
నెదురు చనుదెంచుచున్న రాకేందువదన
నాకపురిమెట్టు చెంతఁ జిన్నారిచేడె
నల్లఁ జూచెఁ దిలోత్తమ నప్సరసను[167].

160

క.

చూచియుఁ జూడని[168]విధమున
నాచిగురుంబోఁడి మాటలాడింపక హృ
ద్గోచరమై తరి దీకొల్పెడు
రాచకుమారితఁ గనం బరాకునఁ[169] జనంగన్.

161


చ.

ఒదవిన కోపమున్ నిలువ గోరని శాపము నిచ్చె నోరి నీ
హృదయములోన నున్నయది యెవ్వతె యచ్చిగురాకుఁబోఁడితో
బదియును నాలుగేండ్లు బెడఁబాయునుగా కని యామృగాక్షి హా
మది నభిరీమరామల కమాన్యత కోపము సేయకుండునే.

162


క.

కోపంబున ని ట్లాసతి
శాపం బిచ్చుటయు నాత్మ సరకుగొనక సం
దీపితచింతావశుఁడై
భూపాలకసుతుఁడు వేగఁ బురవరమునకున్.

163


వ.

వచ్చి త న్ననుపవచ్చిన మాతలి నుచితప్రకారంబున వీడ్కొలిపి యనంత
రంబ యభ్యంతరంబునకుం జని యేకాంతం బిందుమణిసౌధం బెక్కి
చింతాభరంబున—

164


ఉ.

కోలుకొనంగలేనిధృతి గూరిన యుల్లము దల్లడింప నే
నేల విరాళిఁగొంటి విబుధేశ్వరు మాటలు నమ్మి యమ్మహీ
పాలతనూజ చేకుఱు నుపాయము నాకిది యెద్ది యొక్కొ యీ
జాలి యడంచి పుణ్యములజాడఁ జనంగ దయాళుఁ డెవ్వఁడో.

165


మ.

అని చిత్తంబున నంతకంతకుఁ గడున్ హత్తించు చింతాభరం
బున మేనన్ విరహజ్వరానలశిఖల్ పుట్టింపఁ బూవింటిజో
దనుకంపాగుణశూన్యుఁడై తొడరి చేయం జాలకృత్యంబులన్
జననాథుం డడుగూది యొక్కెడ[170] నిజేచ్ఛన్ నిల్వరా కెంతయున్.

166

క.

వెనుకఁ బడియున్న[171] పరిచర
జనవర్గము కన్నుమొఱఁగి సదనారామం[172]
బున కేఁగి యచట నొక్కఁడు
మనసిజదోదూయమానమానసుఁ డగుచున్.

167


సీ.

కోయిల లెలుఁగిచ్చు ప్రాయంపుటెలమావి
                మోఁకలన్నను మోము ముడిచికొనుచుఁ
గొదమతేఁటుల గముల్ గూడి వినోదించు
                పసిఁడి బొన్నన్నను[173] గసరికొనుచుఁ
దెంకిపట్లనకయ[174] తెమ్మెరల్ విహరించు
                తీవెయిం డ్లనినను దిట్టుకొనుచు
లేచి కీరసమితి లీలఁ బ్రవర్తించు
                ననఁటు లన్నను జాలఁ గినిసికొనచు[175]


ఆ.

జాలిఁబొంది మిగుల దోలాయమానుఁడై
క్రమ్ముకొన్న విరహ ముమ్మలింప[176]
నున్నచోట నుండ నుల్లంబు గొలుపక
వచ్చి వచ్చి రాజవల్లభుండు.

168


మ.

కలయం బూచిన మాధవీనవలతాగారంబులో నైందవో
పలలీలామణివేదికాంతరమునన్ భ్రామ్యన్మిళిందాంగనా
వలిగానంబున కోడుచుం బయి పయిన్[177] వర్తించు పూఁదేనె సో
నలకున్ లోఁగుచుఁ బవ్వడించె మదనోన్మాదంబు రెట్టింపఁగన్.

169

వ.

తలపోఁతలకుం జొచ్చి తనమనంబున—

170


సీ.

నెమ్మది నుండంగ నిర్జరాధిపుఁడు మా
                తలిచేత న న్నేల పిలువఁ బంపెఁ
బంపి యేటికిఁ జెప్పె బలభేది నాతోడ
                సాకేతపతిపుత్రి జననవృత్తిఁ
జెప్పిన నే నేల చెవియొగ్గి వింటి త
                త్పరబుద్ధి[178] నాలతాతన్వివరిత[179]
విన్న నేమిటి కుండె విద్రుమాధరరూపు
                నేల నాయాత్మ నిర్మించినట్ల[180]


ఆ.

యదియ[181] సందుగాఁగ నసమాస్త్రుఁ డత్యుగ్ర
సాయకములపాలు సేయఁదొడఁగె
నేమి సేయువాఁడ నీ తనూతాపంబు
....మెట్లు మాన్పువాఁడ నొక్కొ.

171


సీ.

ఆరాజముఖి ముఖాంభోరుహం బెన్నఁడు
                కనుబండువుగఁ జూడఁ గలుగునొక్కొ
యాయింతి బిగిచన్నుదోయి కౌఁగిటికిని
                గూర్ప నా కెన్నఁడు గూడునొక్కొ
యాలేమ నునుమోవియమృతంబు తనివార
                గ్రోల నెన్నండు చేకూరునొక్కొ
యాకొమ్మ మధురోక్తు లాలించి యెన్నఁడు
                వీనుల విన సంభవించునొక్కొ

ఆ.

యాలతాంగితోడ ననువాసరంబును
గూడిమాడి వేడ్క[182] గొనలుసాఁగఁ
గడవ నెఱుఁగ[183]రాని కడ లొత్తు రతివార్ధి
నెలమి నోలలాడు టెన్నఁడొక్కొ.

172


శా.

ప్రాలంబంబుల చిక్కెడల్చు[184] కపటోపాయంబునం జొక్కపుం
బాలిం డ్లల్లనఁ గేల నంటునెడలం బ్రాపించురోమాంచముల్
బాలారత్నము భావరత్యనుమతం బైపై నెఱింగింపఁగా[185]
నాలీలావతిఁ గౌఁగిటన్ మెలపుమై హత్తించు టిం కెన్నఁడో.

173


ఉ.

అద్దములోన మాటికి నిజాధరపాళిక మీటి నెయ్యపుం
దిద్దులు చూచుచున్నతఱి నేఁ జిఱునవ్వునఁ జేరవచ్చినన్
ముద్దియ సిగ్గునం జిగురుమోవికిఁ గే లెడ మాటుసేయుచుం
దద్దయుఁ గన్నుఁగోనల నదల్పఁగ నెన్నఁడు చూడఁగల్గునో.

174


ఉ.

చేతివిలాసపద్మమునఁ జేడియ వ్రేసినఁ గంటిలోనఁ గం
జాతపరాగ మొల్కె నని సారెకు మాయలు సేసి చేరి య
న్నాతి నిజాననానిలమునన్ నయనాంబుజ మూఁద నవ్వుచున్
వాతెఱ ముద్దువెట్టుకొను వైభవ మెన్నఁడు నాకుఁ గల్గునో.

175


ఉ.

హారము లెవ్వరైన వెలయాడఁగఁ బిల్చిరె[186] నిన్ను నీదు వా
లారునఖంబు చూచి వెఱ పయ్యెడు నిప్పటినుండి చాలు[187] నీ
బేరము లట్ల యుండు మని బింకపుఁజన్ను లలంతి నవ్వుతోఁ
జీరచెఱంగునం బొదువు చేడియ నెన్నఁడు చూఁచువాఁడనో.

176

ఉ.

నిక్కము నిద్రవోయె నని నేఁ గనుమోడ్చినఁ జేరి మక్కువం
జెక్కిలి ముద్దువెట్టికొని చేడియ నాపులకించుచందమున్
గ్రక్కునఁ జూచి సిగ్గువడి కన్నుల ఱెప్పల వ్రేలవైవ నే
నక్కలి[188]నవ్వుతో సరసిజాననఁ గౌఁగిటఁ జేర్చు టెన్నఁడో.

177


మ.

అని కోర్కుల్ బహురీతులన్ మనములో నంతంత కెక్కించుచున్
వనితారత్నము మ్రోల లీల మెఱయన్ వర్తించునట్లైనఁ బై
కొని పట్టం జని మిథ్యయైన వగలం గుందున్ భయం బందు న
జ్జననాథుం[189] డురియాడుడెందమున హృజ్జాతోదితోన్మాదుఁడై.

178


సీ.

కనుమూసి కల నిశిఁ గనుగొన్నయట్లైనఁ
                జేరి సంభాషింపఁ జిత్తగించు
మేల్కాంచి సతిమ్రోల మెలఁగినయట్లైనఁ
                గడఁగి సారెకు బయల్ గౌఁగిలించుఁ
జెలువ మిన్నక దన్నుఁ జీరినయట్లైన
                విను నప్రమత్తుఁడై వీను లొగ్గి
కొమ్మ కౌఁగిటఁ దన్ను గూర్చినయట్లైనఁ
                బరవశంబున మ్రానుపడుచు నుండు


ఆ.

లలన దన్నుఁ గేళి కెలయించినట్లైనఁ
జాల నెమ్మనమున సంతసించు
మనుజవల్లభుండు మగువపై వలనంత
నంతరంగతాప మగ్గలింప.

179


సీ.

నెలఁత చిత్తంబులోనికిఁ జేరఁదిగువఁ[190] జే
                తులు సాఁచినట్లు చింతలు నిగుడ్చు
వెడ నిందుముఖి ఱెప్పవిధము (మెచ్చుటఁ) బోలెఁ
                బ్రమదబాష్పములు నేత్రముల నించు

వెక్కపంబగు వెచ్చవేదనఁబాకం(బుఁ)[191]
                బూనగ నోపమిఁ బోలెఁ మార్చు
మదినిండి తొలఁకు కోమలిమీఁది ప్రేమ న
                ల్గుల కొర్తుగతిఁ జాదుకొనఁ జెమర్చు


తే.

మనసు గుఱిసేసి మరుఁ డేయు మార్గణంబు
లచట వర్తించు సతిఁ దాఁకు ననెడు భీతి
మాటిమాటికి మాటిడుమాడ్కిఁ గేలు
డెందమునఁ జేర్చు నారాజనందనుండు.

180


మ.

తను నిద్రాసుఖసక్తుగా నెఱిఁగినం దన్వంగి భూపాలనం
దన కోపాతిశయమ్మున న్నిజమనోధామంబులో నిల్ప కేఁ
గునొ యెందేనియు నన్నభీతిఁబలె గూర్కుం గంటికిం జేర నీ
క నృపాలుండు[192] చలించు నాత్మ సుమనఃకాండప్రకాండాహతిన్.

181


వ.

ఇవ్విధంబున నుల్లంబున నతిశయిల్లు నాయల్లకాంబుధిం బడి తల్లడిల్లుచు
భూవల్లభుం డుండె వంత నంతఃపురపరిచారికాజనంబు భూకాంతుం
గేళిసౌధంబులోనం గానక యచ్చెరుపడి యచ్చేరువ విలాసవనంబులోనికి
నొకరుండు[193] చనిన హలకలశకులిశాంకితంబులగు పదంబుల చొప్పుం
దప్పక వనంబుం గలయవెదకుచు వచ్చి మాకందతరుమధ్యంబునం
బ్రకాశించు మాధవీలతామండపమున—

182


సీ.

సంకల్పభవశాత[194]శరపాతహతిఁ బోలెఁ
                దటతట నదరు[195] డెందమ్మువాని
శిత[196]మారమార్గణచ్యుతమకరందంబు
                గతిఁ గ్రమ్ము ఘర్మోదకంబువానిఁ

బుష్పసాయకరజఃపుంజంబుక్రియ మోము
                దమ్మి నొప్పెడు వెల్లఁదనమువానిఁ
బూఁబోఁడిఁ నేకాగ్రబుద్ధి లో నీక్షించు
                నోజ కన్నులు మూసియున్నవానిఁ


తే.

దొడరి గుఱిసేసి మరుఁ డేయుతూపులకును
దప్పఁ గ్రుంకెడి విధమునఁ దాపవశతఁ
బూవుఁబాన్పున నిట్టట్టుఁ బొరలువి
జనవరాగ్రణిఁ గాంచి ససంభ్రమముగ.

183


వ.

చేర నేతెంచి శుభలక్షణలక్షితుండగు విశ్వక్షమాధ్యక్ష తనుతాప
లక్షణం బుపలక్షించి పక్ష్మలాక్షు లాక్షణంబ యక్కుమారోత్తము
చిత్తము చిత్తజాశుగాయత్తం బగుట చిత్తంబుల నెఱింగి తత్తరం
బునం దత్తనుతాపంబు మరలించుటకునై శిశిరోపచారంబులు
సేయం దలంచి—

184

శిశిరోపచారములు

మ.

కచభారంబులఁ గ్రొత్తచెంగలువలం గైసేసి పూఁబయ్యెదల్
కుచకుంభంబులపై మృణాలలతలం గూడం బ్రతిష్ఠించి[197] లేఁ
తచిగు ళ్ళంతటఁ గావిపుట్టముల మీఁదం జేర్చి లీలావతీ
ప్రచయం బల్లన వచ్చి రాజసుమనోబాణానలం బార్పఁగన్.

185


వ.

సమకట్టి.

186


సీ.

మానితాకృతి యని మామహీపాలుపైఁ
                గుచ్చితంబులు మాను కుసుమబాణ
భాషావిశేషాహిపతి యని నవమాన
                మాను మారాజుపై మత్సరంబు

రామసన్నిభుఁ డని రాయిళ్ళఁ బెట్టకుం
                దలుక మావిచుని గోకిలములార
భువి వినిర్మలకీర్తిఁ[198] బోలు నిన్నని చంద్ర
                విడువు మారాజుపై విరసబుద్ధి


ఆ.

ధన్యులార మీకుఁ దప్పేమి సేసె మా
ధరణివిభుని నింత తవిలినొంప[199]
ననుచు చయము ప్పియము ననలారఁ గ్రొంబూవు[200]
టెత్తు రోలి[201] మీఁడులెత్తి మ్రొక్కి.

187


సీ.

మొగమోడి నిలువుఁడీ మొగమెత్తఁ జేయక
                కీరంబులార మ్రొక్కెదము మీకు
దయలాత్మఁ బెనుపులు దాంట్లు వేయక యెల
                దేంటులార మీ కిదే జోహారు
వల్లదెల్లనక మన్నన సేయుఁడీ[202] మీకు
                నంజలు లివె కలహంసలార
పక్షీకరింపుఁడీ పలుమాఱుఁ గూయక
                ప్రియభాష లివె మీకుఁ బికములార


ఆ.

అయ్యలార మీర లతనురాజ్యమునకు
వేడుగడయు లోక మెల్ల నెఱుఁగ
మీరు కలిమి గాదె మేనితోఁ బాసియు
శంబరాంతకుండు సబలుఁ డగుట.

188


వ.

అని యనేకప్రకారంబులం బ్రియములు వలికి యనంతరంబ—

189

సీ.

మంచునఁ జేరిచి[203] మలయజద్రవ మొక్క
                తరళాక్షి మేన నంతట నలందెఁ
దోడ్తోనఁ బూఁదేనెఁ దోఁచి[204] యల్లనఁ ద్రిప్పె[205]
                వెలఁది యొక్కతె వట్టివేళ్ళసురటి
వడిగొన్న పన్నీటఁ దడిపి పుప్పొడి మెత్తె
                నడుగుఁదమ్ముల నొక్కయలరుఁబోఁడి
కరపుటంబులఁ బచ్చకర్పూరము నలంచి
                కాంత యొక్కతె మస్తకమున నించెఁ


తే.

బేరురంబున నొక చంద్రబింబవదన
కమలినీబిసకాండహారములు చేర్చెఁ
గలువక్రొవ్విరి[206]మొగ్గలకంకణంబు
బాల యొక్కతె దొడిగె భూపాలుకేల.

190


ఉ.

భారపుఁబయ్యెదం జిగురుఁబయ్యెద మాటి మృణాలవల్లరీ
హారములం ఘటించి ధవళాయతలోచన యోర్తు రాజబృం
దారకభర్త పాదనలినంబున మెల్లనె యొత్తిపట్టె వి
స్ఫారనవప్రవాళములఁ బాణిపుటంబుల కెత్తు సేయుచున్.

191


చ.

కువలయనేత్ర యోర్తు నృపకుంజరుముందట నిల్చి భస్త్రికా
వివరముఖంబునం దనదువ్రేలు గదల్చుచుఁ బట్టె[207] మోముపై
నవిహితలీల మంచు గురియం బృధులస్తని యోర్తు నూత్న ప
ల్లవముల నీజనంబు పటలబుగఁ గేలఁ దెమల్చి త్రిప్పఁగన్.

192


వ.

మఱియును.

193

సీ.

మెత్తంగఁ దోడ్తోన మృగమదాకృతి నొందఁ
                జందనం బెలదూండ్ల జార్చికొనుచు
జిలుక గొజ్జగనీరు చివ్వునఁ బొగలెత్తు[208]
                సెగలకు మొగ మోర సేసికొనుచుఁ
బూఁదేనెఁ దోఁచి లేఁబొఱ చుయ్యిచుయ్యన
                సారెసారెకు మేనఁ జమరికొనుచుఁ
జిటపొట నుడుకుచోఁ జెదరిపైఁ బడు ఘర్మ
                బిందుసంహతికిఁ దప్పించుకొనుచు


తే.

సోఁకుచో వేఁడిమికి వ్రేళ్ళు చుఱుకులీన
విద్రిచికొని[209] భీతి నాకులు వెదకికొనుచు
వేసటలువాసి మఱపును వెఱపులేక
చెలులు శిశిరోపవిధు లట్లు[210] సేయునపుడు.

194


సీ.

చిగురున మొగమింత సేసియు లోఁదాల్చు
వనిత హస్తతలంబువంటి దనుచుఁ
బుష్పమంజరు లన బొమ ముడించియు మానుఁ
బూఁబోఁడి పాలిండ్లఁ బోలు మనుచు
నలరు లన్నను జివ్వుమని యంత నేతేఱు
నువిద మైమెలుపున కుపమ యనుచుఁ
గెందమ్ము లనఁ గంటగించియు సైరించుఁ
దరుణిమోమున కన్నదమ్ము లనుచుఁ


ఆ.

దీవ లన్నఁ గ్రోధదృష్టిఁ జూచియుఁ దోన
మనసు తిరుగఁబట్టు మదమరాళ
యాన మెఱుఁగుమేని కనుఁగుఁజుట్టము లన
విభున కేల యందు ద్వేష మగును[211].

195

వ.

అంతం గాంతాజనంబు భూకాంతుమేని కావంతయుం దెలివిగాన కంతరంగంబుల నెంతయు సంతాపం బగ్గలింపం దమసేయు శైత్యకృత్యంబు భసితంబునకు బ్రహితంబగు ఘృతంబునుం బోలె నిరర్థకంబై చనుటకుం గటకటపడి—

196


సీ.

పరికింప నెల లాఱుఁ బాయని పలుగాకి[212]
                క్రించుఁగోయిల కేల ప్రియముఁ జెప్ప
మంచిమాటలె కాని మరఁగ దెన్నటికైనఁ
                గీరంబునకు నేల క్రిందవడఁగ
గతి దీలువడి యల్లఁగడలఁ బ్రవర్తించు[213]
                నీ మరాళంబున కేల వెఱవ
మధుపాయి మెయి మలీమస మళిపోతంబు[214]
                మేటీఁగ దీని[215] నేమిటికిఁ జూడఁ


ఆ.

బోఁడి మెడలఁగాను బూతమై తిరుగు నీ
విషమశరుని నేల వేఁడికొనఁగఁ
బాదములను బడుట మీఁద మిక్కిలి గాక
యీవిహీనమతుల కేడ కరుణ.

197


చ.

తను నవయంబు రా జనుచు దత్పరతం గొని యుంట[216] మౌళి మం
డనముగ నాచరించు హరు నాఁ డసమాయుధుతోడఁ గూడి నొం
చిన బలితంపు[217]దోసమునఁ జేసియు గాసిలు[218]చున్నవాఁడు నేఁ
డును గుముదాప్తుఁ డేటికిఁ గడుంగడు వేఁడఁగ నిద్దురాత్మునిన్.

198

వ.

అని నిందించుచు నిందీవరాక్షు లందఱుం జేయునది లేక డెందంబులం గొందలించి బలు సందేహించుచున్న సమయంబున—

199

సహస్రానీకుని కడకు నారదుఁ డేతెంచుట

సీ.

తెరువిచ్చి యంతంత దివి దేవసంఘంబు
                మోడ్పుఁజేతులు ఫాలముల ఘటింపఁ
దనుపాండురప్రభాధాళధళ్యంబులు
                పరిపూర్ణచంద్రఃప్రభలఁ జెనక
వీడి నల్గడఁ దూలియాడు[219] పాటలజటా
                నటలు[220] నూతనవికాసంబు చేయ
వ్రేల నంటకమున్నఁ కేలఁ బట్టిన వీణె
                హరినామకీర్తనం బాచరింప


తే.

నఱుతఁ బునుకపేరులు[221] భుజంగాధిరాజ
హారములు దాల్చు శివునిపెం పలవరింప
వేడ్క నేతెంచె నాకాశవీథి డస్సి
నారదుఁడు తత్త్వవిద్యావిశారదుండు.

200


శా.

గోకర్ణాంక దయాపయోనిధి[222] మరుద్గోకర్ణధారాపురీ
గోకర్ణాభరణాప్త వారరథికా[223] (?) గోభూజ విశ్రాణమా
లోకామాత్యకుమారశేఖల కృపాలోకావలోకాంచలా
లోకాలోకపరీత విశ్వవసుధాలోకావలోకాననా[224].

201


క.

భాసురకీర్తినటీహ
ల్లీసక భవనాయమాన లేఖాహి నరా
వాస విలాసమనోభవ
వాసవసమభోగ భోగివచనాభోగా[225].

202

స్రగ్విణి.

దీనరక్షాపరాధీనహృత్పంజకా
దానపాండిత్యబృందారకానోకహా
మౌనముద్రా కురుక్ష్మాతలాధీశ్వరా
గానవిద్యాకళా గంధవాహాత్మజా.

203

గద్యము
ఇది శ్రీమదింద్రేశ్వరవరప్రసాదలబ్ధకవితాసార నారనామాత్యపుత్త్ర
సూరిజనవిధేయ సూరననామధేయప్రణీతంబైనయుదయ
నోదయం బను మహాప్రబంధంబునందుఁ
బ్రథమాశ్వాసము.

  1. చిత్రితశే తా.ప్ర.లో లేదు. వ్రా.ప్ర.లోని పాఠము
  2. వినాయకుండు-తా.వ్రా.ప్ర.
  3. ప్రా.పూర.-జెరివి వినీలకాంతు లి-సా.ప.పూర
  4. ప్రా.సవ. చిన్నము తంటని-తా.వ్రా.ప్ర., చిన్నముతేఁటని-సా.ప.
  5. వ్రా.ప్ర.-చెమరల్చు-తా.వ్రా.ప్ర.
  6. సా.ప.-నగున్-తా.ప్ర.
  7. పాలి
  8. మోదునరగా
  9. పూజలెద
  10. క్రేవయొత్తుగో
  11. (దల)కాయ
  12. నా రట్టజ(హా)రిపత్రు, నారట్టడి( )రిపోత్రు
  13. కిలబిటినదత్నికి, కీలఘట్టితతంత్రికిఁ బ్రవాళమునకు
  14. జీవగఱయచంత్ర, జెవికర్ణికకుఁ జెంత
  15. మాణపం
  16. భాస్కరుని భాగ్యసంపన్ను జేయుగాత
  17. వచించెదన్, ఖచించెదన్
  18. వలాని
  19. కవి తన ఇంటిపేరు, ఊరిపేరు, కావ్యరచనాకాలం చెప్పుకోలేదు. కాని ఆశ్వాసాంతగద్యప్రకారం ఇంద్రేశ్వరాలయం కడపమండలంలో చింతలపాట్టూరనే గ్రామంలో ఉంది. ఈ కడపమండలంలోనే భాస్కరమంత్రి నివాసగ్రామం ముడియం అగ్రహారం ఉండడం వలన, గ్రామంపేరే ఇంటిపేరుగా స్థిరపడి ఉంటుంది. కవికూడ కడపమండలనివాసి అయి ఉండాలి.
  20. బిరుదాంకుఁడగు
  21. వక్రనాభిరామ్యుండ
  22. కచ్చోధికు, కుచ్చోధకు
  23. వంద
  24. భాస్కరుడు సంస్థానాధీశ్వరు డనడానికి ఆధారాలు కనపడటం లేదు. అతిశయోక్తులు వ్రాయటం ఆంధ్రకవులకు అలవాటు కాబట్టి కృతిపతి వంశవర్ణనలో చాలావిషయాలు అతిశయోక్తులై యుండవచ్చు. అమాత్యపదం గౌరవపదంగా (వంశపారంపర్యంగా వచ్చే బిరుదులాగ) పెట్టుకొనే ఆచారం చాలా పురాతన మైనది. కాబట్టి ఈతడు దండనాథుడై ఉండాలి.
  25. సంహృతతంటాన
  26. నిస్వనంకానాటీ
  27. నిశలామన్రా
  28. భూమాశర
  29. హిమధరధరుఁడు
  30. రజతాద్రి
  31. ఈనందవర మెక్కడిదో స్పష్టంగా తెలియటం లేదు. సముద్రతీరాంధ్రదేశంలో (విశాఖపట్టణ పరిసరాల్లో) ఒక నందవరం ఉన్నట్లు తెలుస్తోంది. ముడియం అగ్రహారం మాత్రం కడప మండలంలో జమ్మలమడక తాలూకాలో ఉంది.
  32. సరి
  33. దీనాళిం
  34. నానందింపుచున్
  35. చిటార్తు
  36. దిక్కుంభినీకుంభదీప్త
  37. చిల్కజీర్కు లాడి
  38. కీర్తులచేతన్
  39. విందుఁడు డురరమ రచియించిన
  40. ప్రచాతతరైశ్వర్య
  41. మహోదారు
  42. ధావదరి నృపాల
  43. పూరములుగాఁగ
  44. భాంకరముల ననగ
  45. దుగ్ధాబ్ధిమధ్యసత్కైటభాంతకు
  46. ధారుణికులాధీశ
  47. వనిత
  48. చాటదివ్య
  49. శతోత్తర పెద్దఆత్తు
  50. గవిరి ప్రకృత కరజోభాతిన్
  51. ధారాధర రాజ ( )
  52. మద్వేష్టిత
  53. మెంతొ
  54. పద్మనించిన
  55. ననియు
  56. శోభిదివిలను
  57. మత్తకోకిల
  58. గ్ధేనుప్రముఖప్రభావనింశరేఖాను
  59. మృదంగ
  60. పదా
  61. నానమితదురారి నృపమనోహరకృతికిన్
  62. నాచంద్రార్కస్థాయికీర్తి; నాచంద్రస్థాయికీర్తి
  63. నితాంత విటంక
  64. కార్విక్రింద; కారితేంద్ర
  65. స్తనల (కొల్వన)
  66. సవిషత్సముపేత
  67. మోద
  68. నొక్కసతి శేరగొనంగ
  69. కరిఁటిషదాననంబులన్
  70. బెంపు
  71. (సానిరేగమై)
  72. మొడమ
  73. బడి(పరి) పారఁగా
  74. ప్రాసుగు
  75. పంట వేవిమెతల
  76. కరుణి ధనినుల
  77. శక్కవి వింటివెవిది
  78. బోదెల
  79. వెల
  80. వినికొనంగ
  81. యుం
  82. బవిసితముల్
  83. మిచ్చ
  84. పూర
  85. న(గ)
  86. జొనిహదూకలు
  87. ద గరునకునంచు దా(వా)మ
  88. “తిరపెవు జోగిహామికల దేహమునం గొద యొక్కటయ్యె సాగరునకు నంచుఁ దామ”
  89. చాపదె
  90. న్నీరంధ్ర; నిర్తంధ్ర
  91. భోగోన్నతి
  92. నంచకున్
  93. సయరీంబుతో
  94. హార
  95. పట్టునంగరి
  96. పట్టునళూలు రోచెలుల వట్టిమచూ
  97. పరిరీచి
  98. యైనబొగడపూ
  99. పురదించు
  100. జరద్రోసి
  101. టలుగులు
  102. రెసఁగరాసఁగ
  103. విలుచుచొఁబుల
  104. శాంకలందిని విరాట్టంపుంజయ
  105. పువ్వు
  106. జెంగురులనా
  107. బయటపడు
  108. ద్ధర
  109. విగనిల్చుద్భావందులున్
  110. కిభకిరినిదిదతుల్; కినకరనివహముల్
  111. రాటు
  112. సాధుక్షణతకతిరిన్ చెలంన్
  113. నుగుటి విభున్
  114. తోలెన్ వ్రేఱురులటిన్ని టంకములకున్
  115. పాడియత్నదల రెపల్లె; బాఁడి యెల్లెడెల రేపల్లె
  116. విడాడ
  117. నెయిది; నెమ్మిమై
  118. కుండుం చోటియ్యె
  119. వెవిఁదాయిరల విశిద; వెలిడాలు గదిసిన
  120. మిమ్మిటంబగు
  121. భౌవ్యనినంబునం దనిరి పెల్ముగ
  122. అయితప్రవాహంబు ద్వయామ; అసితప్రవాహంబులౌ
  123. తళు తూళట్మ
  124. తళ్కులొత్త
  125. మానికంబుల
  126. కిసలయాధరలు సీవిరులు వీవ
  127. కొలువ నేతెంచురాజులు వేరవేరన
  128. కలకూన
  129. కొంగోలల
  130. డట్లెన్; డప్పెన్
  131. రయన
  132. నొస్సి
  133. సయతమున
  134. భూవిదరన్జుల
  135. స్సింధురసిదందేర్చ
  136. గంధణతుముల్
  137. మాటినంగ; మానితాంగి
  138. నీతశృంకలేర్పడ
  139. నభస్రతదాపగ నీవు దంపగన్
  140. కుట్టల
  141. కల్పుతూకుల
  142. నెదురుగాంచిరికొని
  143. పోయెల్ల; పొలయెల్ల
  144. శిత్వి
  145. మచ్చుటిండ్లయొప్ప
  146. ఈవు పరపతి
  147. ధర్మశాస్త్రమ్ము లుద్భవము నొందె; ధర్మశాస్త్రమ్ములు దడవికొంట
  148. యాడు యున్నబడుట; యాడుయని యెన్నబడుట
  149. ననిలీనాయత
  150. యుమగుందన్నంద నాగారమున్
  151. యడకెక్కి పోదకంబు
  152. లాఁడిముత్తియంబులుగ హసంగు చంగజుని బొక్కస మెల్లన
  153. వచకిం పులుకున కెంపు బింటియల
  154. గానళులన్ను వాలిదం
  155. ద్యత్తరువాసకముల్
  156. లోవి భూ
  157. పూవులతేనియల్ మధుపపోతములున్ పికురాకు మేతలున్; గోవపికవ్రజంబులును గ్రొత్తఫలంబులు గల్గి నిల్కలున్; జేవదలేక మన్పుచును చేవికలన్ దనుగాని నిల్పుచున్; భావజుని డండై పొదలు ప్రాయపు మాపు లొనర్చె నింపులన్.
  158. ఈడపండ్లు
  159. పురుడుని దానియునుబోలె
  160. గమ్మురింప
  161. సోరగాదురద్రివరులు
  162. నలలుసాత సంక్ర
  163. గావించెఁ గేళి సలుపుచు
  164. జరుపుచుండి రంత
  165. దరుణీవత్వాలలమంబుతో; దరుణిన్ వామాలలామంబుతో
  166. తిమ; యీమె
  167. దిలోత్తమాప్సరసను
  168. చూచింజూడని
  169. కుమారితగనూ పరాకున
  170. జననాథుఁడు గూఁటి యెక్కడ; జననాథుండు కలంగి యొక్కడ
  171. వెనున్ బడియుచున్ నుంచు
  172. సరి నారామం
  173. పసిడిపొన్నెన్నను
  174. తెంకి పట్లకయ
  175. నిఱిన్ని కొనుచు
  176. ముమ్మరింప
  177. మనితులు లీననోడుచు పైపైయిన్
  178. తత్సరఁబుట్ట
  179. జరియ
  180. విరించినట్ల
  181. అవియ
  182. గూడి రూఢి లెడ్డ; గూడి కూర్మియెడ్డ
  183. కడవఱంగ
  184. చిక్కెడల్చి
  185. బైపై నిరూపింపంగా
  186. లెవ్వడైన వెలయాడగ బిర్విరె
  187. నప్పుడు నుండి చాట
  188. నక్కడి
  189. నీ జననాథుం
  190. చెరఁ విగుర
  191. వెక్కసంబగు లేమచ్చశందనఁబాకం
  192. మేల్కని పాలుండు
  193. మాకెదుండు
  194. పాత
  195. నలరు
  196. సిత
  197. బ్రతింపించి
  198. భూవినిర్మలకీర్తి
  199. దనరిదొంప
  200. నసలార గ్రొత్తపూ
  201. లోరి
  202. నల్లదెల్ల తనుసన్నసేయుడి
  203. జెరివిడి
  204. తోరోతనంబూఁదెనందొంచి
  205. త్రిప్పి
  206. కమల గ్రొల్పిరి
  207. బట్టి
  208. జిలుకగొజ్జిగినరు చ్చివనఁ బొగతిత్తు
  209. విట్టిచికొని
  210. శిశిరోపచారముల్
  211. విభున కుళయేలయందు ద్వేషియగును
  212. బయెని పలుగాకి
  213. యల్లఁ గదల ప్రివర్తించు
  214. మఱిమఱి మసమరిపోతంబు
  215. మోటీఁగటిని
  216. గొనితంట; గొనికంట
  217. వలితంపు
  218. నాసెలు
  219. వీజనలడఁ దూలియాడు
  220. తటలు
  221. యంతియు పడిశములు
  222. రియః పయోనిధి
  223. నారరధికా
  224. లోకాగ లోకావనా
  225. భోనితనుభోగా; భోగివచనసుభోగా