Jump to content

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు - దంపూరు నరసయ్య/అర్ధ సత్యాలు - అసమగ్ర ప్రయత్నాలు

వికీసోర్స్ నుండి

1

అర్ధ సత్యాలు

అసమగ్ర ప్రయత్నాలు


నరుచేతను నా చేతను

వరమడిగిన కుంతిచేత వాసవుచేతన్

ధరచేత శల్యుచేతను

నరయంగాఁగర్ణుఁ డీల్లె నార్గురచేతన్

(ఒక చాటుపద్యం)

నరసయ్య దురదృష్టవంతుడు. బతికినంతకాలం కష్టాలను కొనితెచ్చుకొని బతికాడు. దురదృష్టం చావు తర్వాత కూడా ఆయనను వెంటాడుతూనే వచ్చింది. జీవించినన్ని రోజులు ప్రజాశ్రేయస్సు కోసం పత్రికలు నిర్వహించిన ఆయన పేరు మద్రాసు జర్నలిజం చరిత్రలో ఎవరూ ప్రస్తావించలేదు. ఆయన కృషి కాలగర్భంలో కలిసిపోయింది. చివరకు ఆయన మరణవార్తను ఏ పత్రికా ప్రచురించినట్లు లేదు. వీరేశలింగం స్వీయచరిత్రలో “సంస్కరణాభిమాన షట్చక్రవర్తులు' అని వర్ణించిన ఆరుగురిలో నరసయ్య పేరు పేర్కొనకుండా ఉండి ఉంటే, లోకానికి ఆయన పేరు అసలు తెలిసేదే కాదు. గురజాడ ఒంగోలు మునిసుబ్రహ్మణ్యానికి రాసిన లేఖలో నరసయ్యను గురించి ప్రస్తావించడం వల్ల, పరిశోధకులు ఆయన మీద ఆసక్తి ప్రదర్శించారు. ఒంగోలు వెంకటరంగయ్య మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో చదువుతున్న కాలంలో సామాజిక ఉద్యమాలలో పాల్గొన్నాడు. ఆయనకు మద్రాసులోనే నరసయ్య పరిచయం అయినట్లుంది. నరసయ్య నెల్లూరు వచ్చి, స్థిరపడిన తర్వాత ఈ పరిచయం స్నేహంగా మారింది. “నా ప్లీడరు ఓ.వి.ఆర్” అని నరసయ్య దినచర్యలో రాసుకొన్నాడు. నెల్లూరులో నరసయ్య కోర్టు కేసులన్నీ వెంకటరంగయ్య వాదించాడు. నరసయ్య జీవిత చరమాంకాన్ని సన్నిహితంగా ఉండి పరిశీలించాడు. “కొందరు నెల్లూరు గొప్పవారు' శీర్షిక పేరుతో కొంతమంది పెద్దల జీవితాలను, కృషిని గ్రంథస్థం చేసిన ఆయన, తన పుస్తకరచనా ప్రణాళికలో నరసయ్యను చేర్చుకోలేదు. “కొందరు నెల్లూరు గొప్పవారు” లో నరసయ్య జీవితాన్ని గ్రంథస్థం చేసి ఉంటే, మనకు ఒక సాధికారికమైన జీవితచరిత్ర మిగిలి ఉండేది. నరసయ్య చనిపోయిన పదమూడు సంవత్సరాల తర్వాత, వెంకటరంగయ్య ఆంధ్రసాహిత్య పరిషత్పత్రికలో నెల్లూరుమండల పత్రికల చరిత్ర వివరిస్తూ వ్యాసం రాశాడు.1 ఈ వ్యాసంలో నరసయ్య జీవితవివరాలను, కృషిని సంగ్రహంగా, పదివాక్యాలలో వివరించాడు. ఈ నాలుగు మాటలే నరసయ్యను గురించి పరిశోధించడానికి దారిచూపాయి. అది వేరే సంగతి.

నరసయ్య పోయేనాటికి, ఆయన కుమారుడు రామకృష్ణయ్య ఇరవై రెండేళ్ళవాడు. యుక్త వయస్సు వచ్చేదాకా, బడికి పోకుండానే తండ్రి శిక్షణలో విద్యాబుద్ధులు నేర్చుకొని సమర్దుడయ్యాడు. తండ్రి తదనంతరం పీపుల్స్ ఫ్రెండ్ ముద్రణాలయాన్ని నిర్వహించాడు. ఇరవైనాలుగోఏట ఒక నవల రాసి ప్రచురించాడు. తండ్రి జీవితం, కృషి, కష్టాలు అన్నీ తనకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచీ తండ్రి ఉత్తరప్రత్యుత్తరాలు, రాతకోతలు, అన్నీ తానే చూచాడు. తండ్రితోపాటు తానూ కష్టాలు అనుభవించాడు. వెంకటగిరిలో ఉపాధ్యాయవృత్తిలో ఉంటూ రెండు మూడు పత్రికలకు విలేకరిగా పనిచేశాడు. తండ్రిని గురించి ఇంత బాగా తెలిసినా, తాను జర్నలిస్టు, రచయిత అయిఉండీ, ఆయనను గురించి ఒక్కమాట కూడా రాయలేదు. విషాదం అంతా ఇక్కడే ఉంది.

రామకృష్ణయ్య తన హయాంలో నరసయ్య వ్యక్తిగత గ్రంథాలయం, పత్రికల సంపుటాలు వగైరా రికార్డంతా భట్టారంవారి కండ్రికలోని (నెల్లూరుజిల్లా) సొంత ఇంట్లో జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాడు. తండ్రి పుస్తకసంచయంలో కొంతభాగాన్ని వెంకటగిరి ఆర్.వి.ఎం. హైస్కూలుకు బహూకరించాడు.2 రామకృష్ణయ్య మరణించిన తర్వాత, ఆయన కుమారులు (నరసయ్య మనుమలు) నెల్లూరులో బాడుగఇళ్ళలో కాపురం ఉన్నారు. ఇల్లు మారినపుడల్లా పాత పుస్తకాలు, రికార్డు 'పడేస్తూ వచ్చారు. ఆ విధంగా నరసయ్యకు సంబంధించిన ఆధారాలన్నీ కనిపించకుండా పోయాయి.

నరసయ్య తన జీవితచరిత్రను సంగ్రహంగా అరవై పేజీల పుస్తకంగా రాసిపెట్టాడు. ఆ రాతప్రతిని కూడా ఆయన వారసులు కాపాడుకోలేకపోయారు.3 నరసయ్య క్రమశిక్షణతో మెలిగే వ్యక్తి. ఎవరికి జాబురాసినా, కార్డుముక్క రాసినా 'లెటర్ బుక్' లో కాపీ చేస్తే తప్ప, పోస్టుచేసేవాడు కాదు. కాపీ చెయ్యడానికి కుమారుడు అందుబాటులో లేకపోతే, ఉత్తరాలు పోస్టు చెయ్యకుండానే నిలిపి ఉంచిన వైనం దినచర్యలో రాసుకున్నాడు.4 తను అందుకున్న ప్రతి ఉత్తరానికి, పోస్టుకార్డుకు నంబరు వేసి భద్రపరచేవాడు. ఈ కరస్పాండెన్సు ఇప్పుడు లభించడం లేదు.

నరసయ్య మనుమలు వెంకటగిరి విడిచిపెట్టి నెల్లూరు కాపురం వచ్చినప్పుడు నరసయ్య పుస్తకాలలో కొంతభాగాన్ని పెద్ద భోషాణంపెట్టెలో పెట్టి, జాగ్రత్త చేసి బంధువుల అధీనంలో ఉంచారు. అవి తలా ఒకటి పట్టుకొనిపోయారు. పోయినవిపోగా మిగిలిన రికార్లు, పుస్తకాలు, లేఖలు, డైరీలు, నరసయ్య మనుమలు పత్రికలవారికి, పరిశోధకులకు ఇచ్చి రాయమని కోరుతూ వచ్చారు. పనప్పాకం అనంతాచారి, వీరేశలింగం మొదలైన ప్రముఖులు రాసిన లేఖలు, రికార్డు ఎవరెవరి చేతుల్లోనోపడి అదృశ్యమయ్యాయి.

పందొమ్మిదో శతాబ్దిలో మద్రాసు ప్రెసిడెన్సీలో వెలువడిన పత్రికల మీద, ముఖ్యంగా ఇంగ్లీషుపత్రికల మీద విస్తృతపరిశోధనలు జరిగాయి. మద్రాసులో పుట్టి, మద్రాసులో విద్యాభ్యాసంచేసి, అక్కడే అధ్యాపకుడుగా, పత్రికాసంపాదకుడుగా, సంస్కర్తగా జీవించిన నరసయ్య పేరైనా ఈ పరిశోధకులు ప్రస్తావించలేదు. క్రెసెంట్, నేటివ్ పబ్లిక్ ఒపీనియన్, మదరాసీ మాత్రమే వారి దృష్టిలో మైలురాళ్ళు. పీపుల్స్ ఫ్రెండ్ పుట్టుక, అస్తమయం అన్నీ వారి పరిశోధన గ్రంథాల్లో ఒకవాక్యంలో ఇమిడిపోయాయి. కనీసం నరసయ్య పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక సంపాదకుడని కూడా ఎవరూ పేర్కొనలేదు. కొందరు ఈ పత్రిక 1878 కల్లా మూతపడినట్లు రాశారు.

మదరాసు నగరం మూడువందల సంవత్సరాలు పూర్తిచేసుకొన్న సందర్భంలో ఒక ప్రత్యేక సంపుటాన్ని (Tercentenary Commemoration Voltane) వెలువరించారు. అందులో కె.పి. విశ్వనాథఅయ్యరు మద్రాసు జర్నలిజంచరిత్రను రాస్తూ నేటివ్ పబ్లిక్ ఒపీనియన్ (Native Public Opinion) మదరాసీ (Madrassee) లతో పాటుగా పీపుల్స్ ఫ్రెండ్ ను ప్రస్తావించాడు. "Another paper of the time, The People's Friend, suffered similar fate" అని ఒక మాట అన్నాడు. పీపుల్స్ ఫ్రెండ్ ముందు వెలువడిన పత్రికాసంపాదకుల పేర్లను పేర్కొన్నా, నరసయ్య పేరు ప్రస్తావించలేదు.5 The Asylum Press Almanac, Madras 1882 సంపుటం నుంచి 1898 సంపుటం వరకు ప్రతి సంపుటంలోను పీపుల్స్ ఫ్రెండ్ మద్రాసు నుంచి వెలువడే ఇంగ్లీషు వారపత్రిక అని, డి. నరసయ్య ప్రకాశకుడని ఉంది. ఆల్మనాక్ ను సంప్రదించని పరిశోధకులు ఉండరు.

మెయిల్ దినపత్రిక నూరేళ్ళ సంచిక (Centenary Supplement, Mail) లో మాతృభూమి ప్రధాన సంపాదకుడు పి. కేశవమినన్ మద్రాసు జర్నలిజం చరిత్ర వివరించాడు.6 ఈ వ్యాసంలోనూ నరసయ్య పత్రికల ప్రస్తావన లేదు. హిందూ శతజయంతి ప్రత్యేక సంపుటంలో (A Hundred Years of the Hindu) మదరాసీ పత్రిక ఎక్కువరోజులు కొనసాగలేదని పేర్కొంటూ, "Hotel'er it did not live long and another paper of the time, People's Friend suffered the same fate" అని పొడిమాటలు రాశారు.7 పత్రికారచయిత రేండర్ గై (Raider Guy) ఈ మాటలనే కొంచెం మార్పుచేసి "By the 1870's Madras had many Indian run newspapers, like Public Opinion, Madrassee and People's Friend. The going was tough for these national papers and so in 1878, these three publications merged to become "The Hindu" అని రాశాడు.8 హిందూ ప్రారంభమైన రెండున్నర సంవత్సరాల తర్వాతగాని, పీపుల్స్ ఫ్రెండ్ మొదలు కాలేదు. ఈ పత్రిక హిందుకూ సమాంతరంగా పదిహేడేళ్ళు కొనసాగింది. జె.నటరాజన్ తన సుప్రసిద్ధ గ్రంథం భారతదేశ జర్నలిజంచరిత్ర (History of Indian Journalism)లో ఈ పత్రికను 'పీపుల్స్ ఫ్రంట్' గా పేర్కొని, నెల్లూరు నుంచి వెలువడినట్లు చిత్రించాడు. "ఏ.ఏ.నాయర్ పీప్పు ఎట్ ది ప్రెస్ ఇన్ సౌత్ ఇండియా (Peeps at the Press in South India) లో "another paper the People's Friend, also failed for want of public support" అని రాశాడు.10

అకడమిక్ పరిశోధకుడు సి.జె. నిర్మల్ పరిశోధన “ది ప్రెస్ ఇన్ మద్రాసు 1785-1900" (The Press in Madras) లో, డాక్టరు నడిర్ కృష్ణమూర్తి “ఇండియన్ జర్నలిజం” (Indian Journalism) పరిశోధన గ్రంథంలోను నరసయ్య ప్రస్తావన కనిపించదు.11 పీపుల్స్ ఫ్రెండ్, నేటివ్ అడ్వొకేట్లను పేర్కొన్న మొట్టమొదటి అకడమిక్ పరిశోధకుడు ఆర్. సుందరలింగం. 1881లో పీపుల్స్ ఫ్రెండ్ ప్రారంభమైనట్లు స్పష్టంగా రాసినా, ఆయన కూడా నరసయ్య పేరు ప్రస్తావించలేదు.12 డి. సదాశివన్ తన పరిశోధన గ్రంథంలో "Another paper came to be founded was People's Friend. But all these papers disappeared in course of time" అని ముగించాడు.13

ఈ రచనలను అట్లా ఉంచితే, తెలుగు పరిశోధకుడు, విద్వాంసుడు ఆరుద్ర 1980 తర్వాత, “ఇంగ్లీషు జర్నలిజంలో తెలుగువారి ఘనత” అనే శీర్షికతో పెద్ద వ్యాసమే రాశాడు.14 అప్పటికి ఆయనకు నరసయ్యను గురించి, నరసయ్య పత్రికలను గురించి తెలుసు. తెలుగు పరిశోధకులు అడపా దడపా ఏదో ఒక సందర్భంలో నరసయ్య పేరు ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఇంత అవగాహన ఉండీ, ఏ కారణంచేతో నరసయ్య కృషిని తన వ్యాసంలో ప్రస్తావించలేదు.

విశాలాంధ్ర ప్రచురణ సంస్థ మొదట గురజాడ ఇంగ్లీషు లేఖలను అవసరాల సూర్యారావుచేత అనువదింపచేసి ప్రకటించింది.15 ఆ పుస్తకంలో ఒంగోలు మునిసుబ్రహ్మణ్యానికి రాసిన ఒక లేఖలో నరసయ్య ప్రస్తావన ఉంది. ఈ సంస్థ గురజాడ ఇంగ్లీషు లేఖలను రెండో పర్యాయం సెట్టి ఈశ్వరరావుచేత తెలుగులోకి అనువదింపచేసి “గురజాడ జాబులు” పేరుతో ప్రచురించింది.16

“వొక తెలుగు పుస్తకాన్ని ఎలా రెవ్యూ చెయ్యాలో తెలిసున్న వ్యక్తి నా ఎరికలో ఎవడూ లేడు. అన్నట్టు శ్రీ డి. నరసయ్య అనే పండితుడు వొకాయన “పీపుల్స్ ఫ్రెండ్” అనే వొక వారపత్రికను నడుపుతూ ఉండేవాడు. ఆ పత్రిక ఇప్పుడు వెలువడడం లేదు; ఆయన నెల్లూరు వాస్తవ్యుడు. ఇప్పుడు వున్నారూ? వుంటే ఆయన చిరునామా నాకు పంపించు. ఆంగ్ల భాషలో ఆయన గట్టివాడు. వొకసారి ఆయన్ని కలుసుకో” అని సూర్యారావు అనువాదంలో ఉన్న ఈ భాగాన్ని ఈశ్వరరావు అనువదించకుండా విడిచిపెట్టాడు.

మూలంలో కొంతభాగాన్ని ఏ కారణం చేతయినా అనువాదకుడు అనువదించకుండా విడిచి పెట్టినపుడు ఆ సంగతి పాదసూచికలో సూచించాలి. ఈ సంప్రదాయాన్ని ఈశ్వరరావు పాటించలేదు. మహాకవి గురజాడ రాసిన వాక్యాలను అనాలోచితంగా తొలగించి, నరసయ్య కీర్తిమూర్తికి గ్రహణం పట్టించాడు. గురజాడ ఇంగ్లీషు లేఖ మాతృక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్, హైదరాబాదు ఆఫీసులో భద్రపరచబడి ఉంది. గురజాడ రాసిన వాక్యాలు ఇట్లా ఉన్నాయి.

"There was a scholar by name D.V. Narasaiah who used to edit a bright English weekly "The People's Friend". now defunct. He was a native of Nellore. Is he living - If so give me his address. He had a wonderful command on English. Please see him".17

విశాలాంధ్ర ప్రచురణ సంస్థ “ఆంధ్రప్రదేశ్ దర్శిని” పేరుతో ఒక రెఫరెన్సు గ్రంథాన్ని ప్రచురించింది.18 రఘుపతి వెంకటరత్నం సంపాదకత్వంలో పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక వెలువడినట్లు ఈ గ్రంథంలో పేర్కొనబడింది. ఆ సంస్థ దృష్టిలో ఇది చిన్న పొరపాటు కావచ్చేమో కానీ, నరసయ్య విషయంలో పెద్ద అన్యాయమనే చెప్పాలి.

బంగోరె (బండి గోపాలరెడ్డి), ఒంగోలు వెంకటరంగయ్య వ్యాసం స్ఫూర్తితో, నెల్లూరు మండల పత్రికల చరిత్ర పరిశోధించి ఒక వ్యాసం రాశాడు. 19 ఈ రోజుల్లోనే నెల్లూరు వారపత్రిక "యూత్ కాంగ్రెస్” లో “నెల్లూరు మొదటి జర్నలిస్టు దంపూరు నరసయ్య” శీర్షికతో ఇంకో వ్యాసం వెలువడింది.20 నరసయ్య నెల్లూరు జర్నలిజానికి ఆద్యుడని గ్రహించి ఆయన జీవితవిశేషాలు సేకరించడానికి బంగోరె కృషి చేశాడు. వెంకటగిరి వెళ్ళి నరసయ్య పుస్తకాలు పరిశీలించి వచ్చాడు. నరసయ్య మనుమలను కలుసుకొని, ఉత్తరాలు, దినచర్యలు, ఇతర రికార్డు సేకరించాడు. ఈ ఆధారాలతో జమీన్ రైతులో మూడు వ్యాసాలు రాశాడు.21

బంగోరె శ్రీకారంచుట్టిన ఈ పరిశోధన పెన్నేపల్లి గోపాలకృష్ణ కొనసాగించాడు. నరసయ్య వారసుల వద్ద మిగిలిన రికార్డు సేకరించాడు. వెంకటగిరిలో భాస్కర రాఘవన్ వద్ద ఉన్న నరసయ్య పుస్తకాలను చూడడానికి గోపాలకృష్ణ వెంట ఈ రచయిత కూడా వెళ్ళాడు. కరణకమ్మవీధిలో ఒక ఇంటి పంచలో ఉన్న పాత భోషాణం పెట్టెలో వందలకొద్ది పుస్తకాలు పేర్చి ఉన్నాయి. పుస్తకాలన్నీ 1900 ముందు ప్రచురించబడినవే. ప్రతి పుస్తకం మీద “పీపుల్స్ ఫ్రెండ్ లైబ్రరీ” అని రాసి ఉంది. పుస్తకాలన్నీ కేటలాగు చెయ్యబడ్డాయి. ప్రతి పుస్తకం మిద నరసయ్య చేవ్రాలు ఉంది. దాదాపు అన్నీ ఇంగ్లీషు పుస్తకాలే. సాహిత్యం, చరిత్ర, రాజకీయశాస్త్రం, మతం, జీవితచరిత్రలు, బైబిలు కాపీలు, నిఘంటువులు ఇట్లా ఎన్నో విషయాలమీద పుస్తకాలున్నాయి. గోపాలకృష్ణ తను సేకరించిన ఆధారాలతో జమీన్ రైతులో రెండు వ్యాసాలు రాశాడు.22 నరసయ్య దినచర్య సహాయంతో ఆయన జన్మదినాన్ని నిర్దుష్టంగా నిరూపించగలిగాడు. పీపుల్స్ ఫ్రెండ్ ఎంతకాలం వెలువడింది చెప్పగలిగాడు. ఇది పాతికేళ్ళనాటి సంగతి.

నేను 1972 నుంచి మిత్రులు పెన్నేపల్లి గోపాలకృష్ణను కలుసుకోడానికి తరచుగా జమీన్ రైతు ఆఫీసుకు వెళ్ళేవాణ్ణి. ఆయన ప్రోత్సాహంతో ఆ పత్రికలో అప్పుడప్పుడు ఏదో ఒక వ్యాసం రాస్తూ ఉండేవాణ్ణి. ఆయన సేకరించిపెట్టిన, నరసయ్యకు సంబంధించిన కాగితాలు సంవత్సరాల తరబడి అక్కడే టేబులుమిద దుమ్ముపట్టి పడిఉన్నా, అవి ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం నాలో ఎన్నడూ కలగలేదు. 1989 జనవరిలో తెలుగు విశ్వవిద్యాలయం ఆతిథ్యంలో శ్రీశైలంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రసభలు జరిగాయి. ఆ సభల్లో నరసయ్య మీద ఒక పరిశోధన పత్రం చదవమని, గోపాలకృష్ణ తన వద్ద ఉన్న రికార్డంతా ఇచ్చి నన్ను ప్రోత్సహించాడు. అప్పటికే ఆ రికార్డులో కొంతభాగం పోయింది.

నరసయ్య మీద రాసిన వారెవరూ ఆయన నడిపిన పత్రికలు చూడలేదు. నా మిత్రుడు ఎం. మునిరత్నం ద్వారా మద్రాసు తమిళనాడు ఆర్కైవ్స్ (Tamil Nadu Archives) లో పీపుల్స్ ఫ్రెండ్ రెండు సంచికలు భద్రపరచబడి ఉన్నాయని తెలుసుకొని, అక్కడ వాటి కోసం అన్వేషించాను.23 మునిరత్నం ఇచ్చిన భోగట్టా ప్రకారం ఆ జి.ఓ నంబర్లు కలిగిన ఫైళ్ళు, ఆ జి.ఓలకు అనుబంధంగా జతచేయబడిన పీపుల్స్ ఫ్రెండ్ సంచికలు కన్పించలేదు. అవి ఏమయ్యాయో, ఎక్కడ మిస్ ప్లేస్ అయ్యాయో ఎవరూ సంతృప్తికరంగా సమాధానం ఇవ్వలేకపోయారు. నా ఉత్సాహం అంతా చల్లబడిపోయింది. అయినా ఓపికగా, పట్టుదలతో ఆర్కైవ్స్లో నా అన్వేషణ కొనసాగించాను. చివరకు పబ్లిక్ జి.ఓ నంబరు 2402 ఫైల్లో పీపుల్స్ ఫ్రెండ్ సంచిక ఒకటి కనిపించింది. పుటలు విప్పి చదవడానికి ప్రయత్నిస్తే, పేజీలు పెళ పెళమని విరిగి ముక్కలు కావడంతో నా ప్రయత్నం విరమించుకొన్నాను. నూట అయిదు సంవత్సరాలనాటి పత్రికను నాలుగు రోజుల వ్యవధిలో, ఆర్కైవ్స్ ఉద్యోగులు చదవడానికి అనువుగా 'మెండ్' చేసి ఇచ్చారు. ఆర్కైవ్స్లో నా పరిశోధనలో పీపుల్స్ ఫ్రెండ్ సంపాదకుడు, పత్రికాధిపతిగా నరసయ్య ప్రభుత్వానికి రాసిన కొన్ని ఉత్తరాలు, 'నేటివ్ అడ్వొకేట్' పత్రిక ప్రారంభించినపుడు సంపాదకులు ప్రభుత్వానికి పంపుకొన్న ఉత్తరం కనుగొన్నాను. అక్కడే నరసయ్య నడిపిన ఆంధ్రభాషా గ్రామవర్తమానిలో ప్రచురించబడ్డ వార్తలకు, వ్యాసాలకు ఇంగ్లీషు అనువాదాలను నేటివ్ న్యూస్ పేపరు రిపోర్టు నుంచి వెదికి పట్టుకోగలిగాను. ఈ సమాచారాన్ని విశ్లేషించి, నరసయ్య మిద శ్రీశైలం చరిత్ర సభలలో ఒక పరిశోధనాపత్రం సమర్పించాను. అప్పుడు నాకు నరసయ్య మీద చిన్న పుస్తకం రాయడానికి అవసరమైన సమాచారం ఉందని తట్టింది. ఇందుకోసం నరసయ్య తాలూకు బంధువుల ఆచూకి తెలుసుకోడానికి ప్రయత్నించాను. మద్రాసు, వెంకటగిరి, నెల్లూరు, కోడూరు మొదలైన ఊళ్ళు తిరిగి, నరసయ్య తర్వాత తరాలవారిని, బంధువులను, పరిచయస్తులను కలిసి మౌఖికచరిత్ర సేకరించాను. 1989-90 సంవత్సరంలో ఎంతమందినో కలుసుకొని విచారించాను. నరసయ్య ముగ్గురు మనుమలలో పెద్దవాడు ఆదిశేషయ్య ఉద్యోగవిరమణ చేసిన తర్వాత చనిపోయాడు. ఆయన భార్య కమలమ్మ తనకు తెలిసిన సంగతులు స్పష్టంగా చెప్పింది. నరసయ్య రెండవ మనుమడు కృష్ణమూర్తి, మూడవ మనుమడు రామచంద్రయ్య, కృష్ణమూర్తి కుమార్తె భారతి చాలా విషయాలు చెప్పారు. నరసయ్య అన్న (పార్ధసారధిశాస్త్రి) మనుమరాలు మద్రాసులో ఉందని తెలుసుకొని ఆమెను విచారించాను.

బంగోరె చనిపోయిన తర్వాత, ఆయన సేకరించిన పుస్తకాలు, రాసి పెట్టుకొన్న నోట్సులు ఆయన శ్రీమతి సుమిత్ర కొంతమంది సాహితీపరులకు ఇచ్చింది. బంగోరె నరసయ్య మీద రాసిపెట్టుకున్న నోట్సు లభిస్తుందేమో అని ప్రయత్నించాను. చివరకు బంగోరె దూరపుచుట్టం వేమూరు రవీంద్రరెడ్డి పరిచయం అయింది. ఆయనకు చరిత్ర అంటే శ్రద్ద, అభిమానం ఉంది. సుమిత్ర వద్ద మిగిలిన పుస్తకాలు, నోట్సులు సేకరించి జాగ్రత్త చేశాడు. నరసయ్య రచించిన లెటర్స్ ఆన్ హిందూ మేరేజస్ పుస్తకం, 1906 దినచర్య, పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక ఫోటోలు, కొన్ని ఉత్తరాలు, నరసయ్య మెయిల్ పత్రికకు రాసిన లేఖ ఇచ్చాడు. రవీంద్రరెడ్డి బంగోరె ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా సేకరించి పెట్టాడు. బంగోరె నార్లకు రాసిన ఉత్తరాల్లో నరసయ్య ప్రస్తావన ఉన్న ఉత్తరాలను ఇచ్చి సహకరించాడు.

బంగోరె నార్లకు రాసిన ఉత్తరంలో “ఈ రోజు అనుకోకుండా మద్రాసు ఆర్కైవ్స్లో ప్రవేశానికి పర్మిషన్ లభించింది. ఎన్నాళ్ళ నుంచో నేను తపిస్తూ వచ్చిన మా నెల్లూరు జర్నలిజం జనకుడు దంపూరు నరసయ్య edit చేసిన People's Friend పత్రిక సంచికలు రెండింటిని కళ్ళారా చూసే భాగ్యం లభించింది. వాటిలో కొన్ని ముఖ్య Editorial items చదివిన మీదట దంపూరు నరసయ్య నిస్సందేహంగా గొప్ప జర్నలిస్టు అనే అభిప్రాయం సాక్ష్యాధారాలతో సహా నేడు మరింత ధృవపడిందే తప్ప అది తగ్గలేదు..” అని అభిప్రాయం వ్యక్తం చేశాడు.24 రెండు నెలల తర్వాత మళ్ళీ నార్లకు ఉత్తరం రాస్తూ “దంపూరు నరసయ్య (నెల్లూరు జర్నలిజం జనకుడు) - ఆయన edit చేసిన 'People's Friend' రెండు సంచికలను ముందరి పుటలను ఫోటో తీయించాను. ఆయన edit చేసిన నాలుగు పత్రికల్లో కనీసం ఒకటైనా original రూపంలో చూడగలిగినందుకు నేను ఎంత పరవశం చెందానో, దాదాపు తొమ్మిదేళ్ళ తపస్సు ఫలించింది. ఆయనను గురించి ఒక చిన్న గ్రంథం రాయడానికి ఆత్మవిశ్వాసం కలుగుతున్నది” అని తన ఆనందాన్ని పంచుకొన్నాడు.25 ఆయన సంకల్పం ఏ కారణం వల్లనో నెరవేరలేదు. ఆ రెండు సంచికలు చదివి ఆయన రాసుకొన్న నోట్సు కూడా నాకు లభించలేదు.

1990 వేసవిలో ముగ్గురు మిత్రులం - మధ్వపతి జయరామారావు, మాచవోలు శివరామప్రసాద్, నేను కలిసి నరసయ్య దినచర్యలు చదవడానికి ప్రయత్నించాము. 1898, 1906 దినచర్యలు దాదాపు సమగ్రంగా చదవగలిగాము. 1905 దినచర్య చదవడం మాకు సాధ్యం కాలేదు.

నరసయ్య మీద పుస్తకం రాయడానికి ప్రయత్నం చేస్తున్న రోజుల్లో నేను సేకరించుకొన్న నోట్సులు, కాగితాలు మొత్తం ఫైలు కన్పించకుండా పోయింది. ఆ తర్వాత, పదేళ్ళకు యాదృచ్చికంగా ఆ ఫైలు బయటపడింది. నేను రాసుకొన్న నోట్సులు, కాగితాలు చివికి చినిగిపోయాయి. కొన్ని పుటలు కన్పించలేదు. పోయినవిపోగా మిగిలిన నోట్సులు, కాగితాలు దగ్గర పెట్టుకొని నా ప్రయత్నం మళ్ళీ కొనసాగించాను. 1905 దినచర్య 'scan' చేసి, కంప్యూటరు స్క్రీన్ మీద చదవడం సాధ్యమయింది. ఈ సమాచారంతో పుస్తకం తయారుచేశాను. పుస్తకాన్ని ముద్రణకు సన్నద్ధం చేస్తున్న తరుణంలో, పద్దెనిమిదేళ్ళ తర్వాత, మళ్ళీ ఒకసారి చెన్నై తమిళనాడు ఆర్కైవ్స్ లో నరసయ్యకు సంబంధించి కన్పించకుండా పోయిన ఫైళ్ళ కోసం ‘దింపుడుకళ్ళం' ఆశగా అన్వేషించాను. అదృష్టవశాత్తు జి.ఓ నంబరు 455 ఫైలు బయట పడింది. ఇందులో 1888 ఫిబ్రవరి 25 పీపుల్స్ ఫ్రెండ్ సంచిక, ఇతర పత్రాలు ఉన్నాయి. ఈ సమాచారం కూడా పుస్తకంలో చేర్చాను. . |

నరసయ్య బతికినదినాల్లో, పోయినతర్వాత 'చంపబడుతూనే' ఉన్నాడని అనిపించింది. మన చారిత్రక స్పృహకు, దేశశ్రేయస్సు కోసం పాటుపడిన మహనీయుల ఎడల మనం ప్రదర్శించే ఉపేక్షకు నరసయ్య ఉదంతం సాక్ష్యంగా నిలుస్తూంది. ఈ సందర్భంలో నరసయ్య దినచర్యలో రాసుకొన్న మాటలను ఉదాహరించడం అనౌచిత్యం కాదనుకొంటాను.

"Lord ! when will all this cease and will a quiet life (begin) free of anxiety and trouble from creditors, enemies and false friends".

(11th September 1905)