Jump to content

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు - దంపూరు నరసయ్య/చెన్నపట్నం అనుభవాలూ - ప్రభావాలు

వికీసోర్స్ నుండి

2

చెన్నపట్నం

అనుభవాలూ - ప్రభావాలు

తుమ్మగుంట ద్రావిడ బ్రాహ్మణులు

నరసయ్య తుమ్మగుంట ద్రావిడ బ్రాహ్మణుడు. ఈ శాఖవారు వందలనంవత్సరాల కిందట తమిళదేశంలోని 'మళైనాడు’ నుంచి నెల్లూరు మండలానికి వలసవచ్చారు.1 నెల్లూరుకు తూర్పుగా, సముద్రతీరానికి సమీపంలో ఉన్న తుమ్మగుంట గ్రామంలో స్థిరపడడం వల్ల, వీరికి తుమ్మగుంట ద్రావిడులనే పేరు వచ్చింది. కొన్ని ద్రావిడ కుటుంబాలు తమిళ దేశం నుంచి వచ్చి నెల్లూరు మండలంలో పుదూరుగ్రామంలో మొదట స్థిరపడ్డారు. వారికి పుదూరు ద్రావిడ బ్రాహ్మణులనే పేరు వచ్చింది. తుమ్మగుంట ద్రావిడులు తమిళాన్ని విడిచి పెట్టి, తెలుగు మాతృభాషగా స్వీకరించినా, తెలుగువారి సాంస్కృతిక జీవనాన్ని అంగీకరించి, తెలుగు వారిలో కలిసి పోయినా, మతాచార వ్యవహారాలలో మాత్రం తమిళదేశపు సంప్రదాయాలనే అనునరిస్తూ వచ్చారు. ఇరవయ్యో శతాబ్ది నగబడేవరకూ, వీరిలో అధిక సంఖ్యాకులు వ్యవసాయంచేసి, జీవనం కొనసాగించారు. స్వయంగా పొలాలు దున్ని, శరీరకష్టంచేసి, పంటలు పండించారు. ఈ ద్రావిడ కుటుంబాలలో ఎంతోమంది మహావిద్వాంసులు జన్మించారు.

దుబాసీలు

రెండు మూడు వందల సంవత్సరాల కిందటే, తుమ్మగుంట ద్రావిడులు నెల్లూరు మండలం నుంచి తమిళ, కన్నడ దేశాలకు వలసవెళ్ళారు. కొందరు చెన్నపట్నంలో, తమిళదేశంలోని ఇతర ప్రాంతాలలో స్థిరపడ్డారు. ఆ ప్రదేశాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేశారు. మద్రాసు పగడాలసెట్టి వీధిలో సూరంవారు, కృష్ణప్ప నాయకన్ వీధిలో గుర్రంవారు ప్రఖ్యాతి పొందారు, వీళ్ళకు ఓడ వర్తకంతో సంబంధం ఉండేది.2 ఎక్కడఉన్నా నెల్లూరుతో సంబంధ బాంధవ్యాలు సాగిస్తూ, నెల్లూరు వారుగానే వ్యవహరించబడుతూ వచ్చారు.

ఇంగ్లీషువారికి, ఇతర యూరపు దేశస్థులకు స్థానిక వ్యాపారపద్ధతులు, కొలతలు, చట్టాలు తెలియకపోవడంవల్ల దుబాసీల అవసరం ఏర్పడింది. ఈస్టిండియా కంపెనీ, ఇతర వర్తకసంస్థలు దుబాసీలను నియమించుకొన్నాయి. తెలుగుదేశం నుంచి మద్రాసు తరలి వచ్చిన కోమట్లు, ఇతర కులాలవారిలో కొందరు దుబాసీలుగా మారారు. పాశ్చాత్య వాణిజ్యవర్గాలకు, భారతీయులకు మధ్య వారధిగా నిలిచారు. ఆనందరంగపిళ్ళై, పచ్చయ్యప్ప మొదలియారు దుబాసీ వృత్తిలో మహా సంపన్నులయ్యారు.

పద్దెనిమిదోశతాబ్ది ముగింపుకు వచ్చేసరికి, బ్రిటిష్ వారు ఈదేశంలో తమ అధికారాన్ని స్థిరపరచుకొన్నారు. దుబాసీల మీద ఆధారపడే పరిస్థితి క్రమంగా తొలగిపోవడంవల్ల, ఈ వ్యవస్థ బలహీనపడింది. 1830 ప్రాంతాలకు దుబాసీలు చిల్లర ఉద్యోగులుగా మార్పు చెందారు. వీరు నాలుగురాళ్ళు వెనక వేసుకోడానికి ఇంగ్లీషు నేర్చుకొన్నారే తప్ప, ఆభాష ద్వారా నూతన భావజాలాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యలేదు. ఇంగ్లీషు వ్యవహార జ్ఞానం దుబాసీల కుటుంబాలలో వారసత్వంగా కొనసాగినట్లుంది.

అవధానం పాపయ్య

అవధానం పాపయ్య నెల్లూరువాడు, తుమ్మగుంట ద్రావిడులలో ప్రసిద్ధుడు. కంపెనీ కొలువులో మామూలు గుమాస్తాగా జీవితం ఆరంభించాడు. మద్రాసు ఓడరేవులో 'సీ కస్టమ్స్ ఆఫీసరు' (Sea Customs Officer) వద్ద 'ఏంకరేజి అకౌంటెంట్' (Anchorage Accountant) ఉద్యోగం చేశాడు. రేవుకు వచ్చిపోయే ఓడలను నమోదు చేసుకోవడం ఆయన వృత్తి కావడం వల్ల 'లంగరు పాపయ్య' అని పేరు స్థిరపడింది. బంధువర్గంలో మాత్రం 'రఘుపతి' అనే పేరుతో పిలవబడేవాడు. పద్దెనిమిదవ శతాబ్ది ముగింపుకు వచ్చే సమయానికి పాపయ్య మద్రాసులో పెద్ద ఆస్తిపాస్తులు సంపాదించి పురప్రముఖులలో ఒకరుగా ప్రసిద్ధి పొందాడు. 1789-90 మధ్యకాలంలో మద్రాసు గవర్నరులుగా పనిచేసిన హాలెండ్ సోదరుల వద్ద (John Holland 7th Feb. to 12th Feb. 1789; Edward John Holland 12th Feb. 1789 to 19th Feb. 1790) దుబాసీగా ఉండి వారి అభిమానాన్ని సంపాదించాడు. వారి ఆంతరంగికుడుగా మసలుకొన్నాడు. ఆ సమయంలోనే హాలిబర్టన్ (Haliburton) అనే ప్రభుత్వ అధికారి ఆగ్రహానికి గురయి, రాజద్రోహనేరం మోపబడి జైలుశిక్ష అనుభవించి 1809లో మరణించాడు. మద్రాసులో చూశైప్రాంతంలో శిక్ష అనుభవించడంవల్ల అక్కడ ఒక వీధి అవధానం పాపయ్యవీధి అని వాడుకపడింది.3 పాపయ్య ప్రభ వెలిగిపోతున్న సమయంలో వెంకటగిరి సంస్థానంవారు సూళ్ళూరుపేట (నెల్లూరుజిల్లా) సమీపంలో ఉన్న సామంతమల్లం గ్రామాన్ని ఆయనకు బహూకరించారు. ఆయన గొప్ప పండితుడు. అనేక భాషలు అనర్గళంగా మాట్లాడేవాడు. స్కాంద పురాణంలో కొంతభాగాన్ని - శంకరసంహితను తెలుగులో పద్యగ్రంథంగా అనువదించాడు.4 సర్ వాల్టర్ స్కాట్ సర్జన్స్ డాటర్ (Sir Walter Scott's Surgeon's Daughter) నవలలో పాపయ్యను ఒక అప్రధాన దుష్టపాత్రగా చిత్రించాడు. ఈ పాపయ్య మనుమరాలు (కూతురు బిడ్డ) అన్నపూర్ణమ్మ నరసయ్య తల్లి. నరసయ్య తండ్రి ఆదినారాయణయ్య మద్రాసులో పుట్టి, అక్కడే స్థిరపడ్డాడు. ఆయన వృత్తేమిటో తెలియదు. ఇంగ్లీషు చదువులు చదివినట్లుంది. ఆయనకు ప్రెస్ వ్యాపారంతో సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది.

మద్రాసులో దంపూరు కుటుంబాలు

క్రైస్తవ మతప్రచారకుల కృషివల్ల దేశభాషలలో పుస్తకప్రచురణ సాధ్యపడింది. వారు మద్రాసు, విశాఖపట్నం, బళ్ళారి మొదలైన ప్రదేశాలలో అచ్చుకూటాలు ప్రారంభించి పుస్తక ప్రచురణ మొదలుపెట్టారు. బైబిలును, ఇతర మత సంబంధమైన పుస్తకాలను, వ్యాకరణ, నిఘంటు గ్రంథాలను ప్రచురించారు. 1820లో మద్రాసు స్కూల్ బుక్ సొసైటీ ఏర్పడింది. మద్రాసులో పుస్తకప్రచురణ వ్యాపారంగా మార్పు చెందుతున్న దశలో 'కోమట్లు', ఇతర కులాల తెలుగువారు ఈ వ్యాపారంలో ప్రవేశించారు. పాఠ్యపుస్తకాలు రాయడం, పరిష్కరించడం, ప్రూఫులు సరిచూడడం, మొదలైన పనులకు పండితులు అవసరం అయ్యారు. నెల్లూరుమండలం నుంచి మద్రాసుకు వలసవచ్చిన పుదూరు, తుమ్మగుంట ద్రావిడ పండితులు ఈ కొత్త అవకాశాన్ని అందిపుచ్చుకొన్నారు.

దంపూరువారు

దంపూరువారిది పండితకుటుంబం. దంపూరు నెల్లూరుకు తూర్పున, తుమ్మగుంటకు, వావిళ్ళకు సమీపంలో ఉన్న గ్రామం. ఊరి పేరే ఇంటి పేరయింది. పందొమ్మిదోశతాబ్ది మొదలయ్యే వేళకు కొన్ని దంపూరు కుటుంబాలు మద్రాసులో స్థిరపడ్డాయి. కొంతమంది దంపూరువారు అచ్చాఫీసు పనులలో స్థిరపడ్డారు. దంపూరు వేంకటసుబ్బాశాస్త్రి పర్యవేక్షణ, సంపాదకత్వంలో తెలుగు, సంస్కృత గ్రంథాలు అచ్చయ్యాయి. ఈయన గొప్ప పండితుడని ప్రసిద్ది.5 నరసయ్య తండ్రి ఆదినారాయణయ్య ఈయన సమకాలికుడు. ఇద్దరూ రక్తసంబంధీకులయి ఉంటారు. ఆదినారాయణయ్య తన ముగ్గురు కుమారులకు ఇంగ్లీషు చదువు చెప్పించాడు. మహాపండితులని పేరుపడ్డ గుర్రం అప్పన్నశాస్త్రి, వెంకన్నశాస్త్రి సోదరులు ఈయనకు దగ్గర బంధువులు. పందొమ్మిదో శతాబ్ది ఉత్తరార్ధంలో ఇంగ్లీషుచదువులు చదువుకొని, పరీక్షలు పాసై, ప్రభుత్వోద్యోగాలు చేసిన దంపూరువారు మరికొంతమంది ఉన్నారు.6 ఈ శతాబ్దంలో ఇంగ్లీషుచదువులు చదివినవారిలో ఎక్కువమంది బ్రాహ్మణులే అయినా, తెలుగుదేశంలో నియోగులు, దేశస్థులు, మాధ్వులు ముందుగా ఇంగ్లీషుచదువు 'విలువ' ను గ్రహించారు.

నరసయ్యకు ఇద్దరు అక్కలు. ఒకరు మీనాక్షమ్మ, నరసయ్యకన్న ఆరేళ్ళు పెద్దది. చదువుకొన్న స్త్రీ. పదిహేనేళ్ళకే భర్త చనిపోయాడు. రెండోఆమె వివరాలు తెలియవు. నరసయ్య పెద్దన్న 'పార్ధసారథయ్య' లేక పార్ధసారధిశాస్త్రి మద్రాసు అకౌంటెంట్ జనరలు ఆఫీసులో క్లర్కుగా పనిచేసినట్లు ఫోర్టు సెంటుజార్జి గెజిటు ప్రకటనవల్ల తెలుస్తూంది. రెండవ అన్న కృష్ణయ్య పచ్చయ్యప్ప ఉన్నత పాఠశాలలో 'టీచరు'. ఇద్దరూ 1869-70 సంవత్సరానికి మద్రాసులో 'క్రౌను ఆఫీసు'కు స్పెషల్ జూరర్లుగా నియమించబడ్డారు. ఈ 'గౌరవ' పదవికి ఇంగ్లీషు భాషాజ్ఞానం, మూడువేలరూపాయల ఆస్తి ఉండడం అర్హత. పార్థసారథిశాస్త్రి ట్రిప్లికేన్‌లో, కృష్ణయ్య బ్లాక్ టౌన్‌లో నివాసం ఉంటూ, ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.7 అవధానం పాపయ్య తరంనుంచి నరసయ్య వరకు అందరికీ ఇంగ్లీషు వారసత్వంగా సంక్రమించింది.

నరసయ్య జననం, విద్యాభ్యాసం

నరసయ్య మద్రాసులో పుట్టి పెరిగినట్లు ఒంగోలు వెంకటరంగయ్య రాశాడు. 1849 సెప్టెంబరు 25న జన్మించినట్లు పెన్నేపల్లి గోపాలకృష్ణ నిరూపించాడు. నరసయ్య 1896 దినచర్యలో సెప్టెంబరు 25వ తారీకున తన 48వ పుట్టినదినమని, తెలుగు తిథుల ప్రకారం మహర్నవమినాడు తన పుట్టినదినం వస్తుందని రాసుకున్నట్లు ఆధారం చూపాడు8. ఆ దినచర్య ఇప్పుడు లభించడం లేదు. 1906 సెప్టెంబరు 25వ తారీకు, మంగళవారం దినచర్యలో నరసయ్య ఈ విధంగా రాశాడు.

"Thankful-This day is my birthday according to English Calender.

NB : This is my 58th Birthday. ie. I Completed 57 Years.

My Birthday was Tuesday 25th September 1849." మరుసటి రోజు 26వ తారీకు బుధవారం మహర్నవమినాడు ఇట్లా రాశాడు.

"According to native calender this is my 58th birthday."

వీరేశలింగంకన్న నరసయ్య ఏడాది చిన్న, మద్రాసు పచ్చయ్యప్ప సెంట్రల్ స్కూల్లో ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో చదువు కొనసాగించాడు. పనప్పాకం అనంతాచార్యులు నరసయ్య సహాధ్యాయి. అనంతాచార్యులు నరసయ్యకన్న ఆరేళ్ళు పెద్ద. ఇద్దరూ 1864లో జరిగిన మెట్రిక్యులేషన్ పరీక్ష రెండవ తరగతిలో పాసయ్యారు.9 నరసయ్య పచ్చయ్యప్ప ఉన్నత పాఠశాలలో “అసిస్టెంట్ టీచరు” ఉద్యోగంలో ఎప్పుడు చేరాడో తెలియదు. 1867 మార్చి నాటికి ఆ ఉద్యోగం చేస్తున్నాడు. అప్పటికి మైనారిటీ కూడా తీరలేదు. ఆయన సహాధ్యాయి అనంతాచార్యులు 1867లో ఎఫ్.ఏ పాసయి, ఆ పాఠశాలలోనే అధ్యాపకవృత్తిలో కొంతకాలం ఉన్నాడు. 10

నరసయ్య బి.ఏ. పాసయినట్లు ఒకరు అన్నారు. ఆయన బి.ఏ. అని ఎక్కడా చెప్పుకోలేదు. 1872వ సంవత్సరం ఆరంభంలో ఆయన డెప్యూటీ స్కూల్ ఇన్‌స్పెక్టరు ఉద్యోగానికి ఎంపిక అయ్యా డు. "... Graduates and under Graduates who have had experience as teachers and have good knowledge of Telugu" అని ఆ ఉద్యోగానికి అర్హతలు నిర్దేశించారు.11 ఆ ఉద్యోగానికి అర్హత ఉత్త మెట్రిక్యులేషన్ కాదని అనిపిస్తుంది. నరసయ్య మెట్రిక్యులేషన్ పాసయిన మూడేళ్ళకు పచ్చయ్యప్ప ఉన్నత పాఠశాలలో అధ్యాపకుడుగా చేరాడు. ఈ వ్యవధిలో ఆయన ఎఫ్.ఎ. పాసయి ఉంటాడనిపిస్తుంది. 1876లో పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డైరెక్టరు కల్నల్ ఆర్.ఎం.మెక్‌డొనాల్ట్ (Col. Mac Donald) రాజమండ్రి ప్రభుత్వ కళాశాల స్థాయి పెంచవలసిన అవసరాన్ని పై అధికారుల దృష్టికి తీసుకొనివస్తూ, తనవాదనకు బలమిచ్చే రెండు అంశాలను పేర్కొన్నాడు. మొదటిది విద్యకు ఉపాధికి మధ్య ఉన్న సంబంధం. తెలుగుభాష వ్యవహారంలో ఉన్న ప్రదేశాలలో ఎక్కడా కళాశాల లేదని, అందువల్ల ప్రభుత్వోద్యోగాలలో నియమించడానికి, అర్హులైన అభ్యర్థులు లభించడం కష్టంగా ఉందంటాడు. “డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్సు హోదాలో గానీ, ఒక ముఖ్యమైన స్కూల్లో ఉపాధ్యాయుడుగా గానీ తెలుగువాడు లేడు” అని ఇంకోవాస్తవాన్ని పేర్కొన్నాడు.12 ఇందువల్ల డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఉద్యోగానికి కళాశాల చదువు అవసరమని స్పష్టమవుతూంది. గెజిటు ప్రకటనలో "Graduates and under Graduates" అని ఉండడంవల్ల నరసయ్య ఎఫ్.ఏ. పాసయినట్లు భావిస్తున్నాను. ఆ రోజుల్లో ఆంగ్లో వర్నాక్యులర్ స్కూళ్ళల్లో (Anglo vernacular Schools) ఉపాధ్యాయుడుగా నియమించబడడానికి మెట్రిక్యులేషన్ పాసయి ఉండాలి. కాబట్టి నా ఊహ సరి అయినదే అని తోస్తూంది. ఆ రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయడానికి రకరకాల పరీక్షలు నిర్వహించేవారు. నరసయ్య హయ్యరు గ్రేడు ట్రాన్సులేటరు పరీక్ష పాసయి “హుజూరు ట్రాన్సులేటరు” ఉద్యోగానికి అవసరమైన అర్హతలు సంపాదించాడు.13

మద్రాసులో సాంస్కృతిక పునరుజ్జీవనం

పందొమ్మిదో శతాబ్దం ఆరంభమయ్యేసరికి, మద్రాసు ప్రపంచనగరాలలో ఒకటిగా ప్రసిద్ధికెక్కింది. ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక కార్యాలయాలు, ఆస్పత్రులు, మార్కెట్ ప్రదేశాలు ఏర్పడ్డాయి. మద్రాసు పెద్ద వాణిజ్యకేంద్రంగా ఎదిగింది. వ్యాపారవర్గాలు పెద్ద ఎత్తున మద్రాసుకు వలసవచ్చాయి. తెలుగుదేశం నుంచి 'కోమట్లు', ఇతర కులాలవారు తరలివచ్చారు.

1820 నాటికి మద్రాసులో ప్రతిసందులో ఒకవీధిబడి ఉండేది. సాధారణంగా తెలుగువారే ఈ బళ్ళు నిర్వహించేవారు. వీటిలో తెలుగు, తమిళం, లెక్కలు నేర్పేవారు. 1830 ప్రాంతంలో మద్రాసులో హిందూ లిటరరీ సొసైటీ ప్రారంభమైంది. ఈ సమాజంలో బ్రాహ్మణులు, ఇతర కులాలవారు సభ్యులు. చరిత్ర, సాహిత్యం, ఇతర సమకాలీన సమస్యలమీద ఉపన్యాసాలు, చర్చలు నిర్వహించేవారు. ఇదే సమయంలో వ్యాపారాలు, కులవృత్తులు కాపాడుకోడానికి కులసంఘాలు ఏర్పాటు అయ్యాయి. హిందువుల సాంఘికజీవనంలో అనేకమార్పులు వచ్చాయి. వాణిజ్య వ్యాపారాల్లో ధనం గడించి కొత్తగా సంపన్నులైనవారు ధర్మకార్యాలు చెయ్యడం మొదలుపెట్టారు. సత్రాలు పెట్టించారు, గుళ్ళు కట్టించారు, సంస్కృత పాఠశాలల నిర్వహణకు డబ్బు కర్చు చేశారు. పచ్చయ్యప్ప మొదలియారు ధర్మనిధి స్థాపన ఇందుకు ఒక ఉదాహరణ.

మొదట తటస్థంగా ఉన్న బ్రిటిష్ పాలకులు హిందూమత విశ్వాసాలలో జోక్యం చేసుకొన్నారు. క్రైస్తవ మిషనరీలను ప్రోత్సహించారు. మిషనరీలు మద్రాసు ప్రెసిడెన్సీలో అనేక ప్రదేశాల్లో చర్చిలు, పాఠశాలలు, అచ్చాఫీసులు పెట్టి మతప్రచారం చేశారు. విద్య వారి ప్రధాన కార్యరంగం అయింది. బ్రిటిష్ వారి అధికారం స్థిరపడుతున్న కాలంలోనే, మిషనరీల కార్యక్రమాలు ఉధృతమయ్యాయి. వారు హిందువులను సంస్కరించడానికి మతాంతరీకరణ మార్గమని విశ్వసించారు. మతమార్పిడులు ఎక్కువ కావడంతో హిందువులకు, క్రైస్తవులకు నడుమ పెద్ద అఘాతం ఏర్పడింది.

1841లో మిషనరీలు మద్రాసులో కొంతమంది విద్యార్థులను క్రైస్తవమతంలోకి మార్చారు. ఈ సంఘటనతో హిందువుల అసమ్మతి తీవ్రరూపం ధరించింది. తమ బిడ్డలకు క్రైస్తవమతం ఇప్పిస్తారనే భయంతో, హిందువులు సొంత పాఠశాలలు స్థాపించుకోడానికి కృషిచేశారు. ఈ నేపథ్యంలోనే 1842లో మద్రాసు నగరంలో పచ్చయ్యప్ప పాఠశాల ప్రారంభం అయింది. హిందువులకు మిషనరీల ప్రచారాన్ని ఎదుర్కోడానికి పత్రిక అవసరం అయింది. సి. నారాయణస్వామినాయుడు అచ్చాఫీసు నెలకొల్పి, నేటివ్ ఇంటర్‌ప్రిటర్ (Native Interpretor) పత్రికను ప్రారంభించాడు. గాజుల లక్ష్మీనరసుసెట్టి తండ్రి నెలకొల్పిన సిద్ధులు అండ్ కో లో ఈయన భాగస్వామి. హిందూసమాజానికి పనికివచ్చే విజ్ఞానదాయకమైన విషయాలు ప్రచురించడం, హిందువుల మనోభావాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొనిరావడం పత్రిక లక్ష్యాలుగా నిర్దేశించుకొన్నాడు. మిషనరీల ప్రచారాన్ని ఈ పత్రిక ద్వారా సమర్ధవంతంగా తిప్పికొట్టి, తీవ్రంగా రాస్తూ వచ్చాడు.

1840-68 మధ్యకాలంలో మద్రాసు పౌరజీవితంలో గాజుల లక్ష్మీనరసుసెట్టి ప్రముఖపాత్ర వహించాడు. ప్రభుత్వం ప్రదర్శిస్తున్న మత పక్షపాతాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. హిందువుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడంలో గొప్ప కృషి చేశాడు. నారాయణస్వామినాయుడునుంచి నేటివ్ ఇంటర్‌ప్రిటర్ పత్రికను కొని క్రెసెంట్ (Crescent) పేరుతో దాన్ని కొనసాగించాడు. ఈ పత్రికకు ఎడ్వర్డ్ హార్లీ (Edward Harley) ని సంపాదకుడుగా నియమించాడు. హార్లీ మద్రాసు వైపేరీలో ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. విదేశీయుడైనా భారతీయులంటే అభిమానం ఉండేది. మిషనరీల కార్యక్రమాల వల్ల హిందూసమాజానికి ప్రమాదం పొంచిఉందని క్రెసెంట్ రాస్తూ వచ్చింది.

లక్ష్మీనరసుసెట్టి పదిసంవత్సరాలు మిషనరీల మతాంతరీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపాడు. ఆధునిక పద్ధతులలో, అనేక రూపాలలో ప్రజల నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన సాగించాడు. ఈయన ఆధ్వర్యంలో కలకత్తాలో స్థాపించబడిన బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్‌కు అనుబంధంగా ఒక సంస్థ నెలకొల్పబడింది. కొంతకాలానికి ఇది మద్రాసు నేటివ్ అసోసియేషన్ (Madras Native Association) పేరుతో స్వతంత్ర సంస్థగా రూపొందింది. లక్ష్మీనరసుసెట్టి, ఈయన మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళె ఈ సంస్థ తరపున బ్రిటిష్ పార్లమెంటుకు ఒక మహజరు తయారు చేశారు.

మద్రాసు తెలుగువారిలో కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళె ప్రముఖుడు. ఇంగ్లీషు చదువుకోకపోయినా, విచక్షణాజ్ఞానం, ఉదారస్వభావం ఉన్నవాడు. సంపన్నకుటుంబంలో జన్మించాడు. తన కాలాన్ని, సంపదను ప్రజల హితంకోసం వినియోగించాడు. భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పాశ్చాత్య విద్య దోహదపడుతుందని గ్రహించాడు. ఈయనకు స్త్రీవిద్యమిద అభిమానం ఉండేది. మద్రాసు ప్రముఖులు ఏనుగుల వీరాస్వామి, వెన్నెలగంటి సుబ్బారావు, వెంబాకం రాఘవాచారి మొదలైన ఆయన మిత్రులు కూడా ఉదారస్వభావులు. పాశ్చాత్యుల పరిచయాలు, జార్జి నార్టన్ (George Norton) స్నేహం వీరి ఆలోచనలలో మార్పు తెచ్చింది. నార్టన్ మద్రాసు సుప్రీంకోర్టులో అడ్వొకేట్ జనరల్‌గా ఉండేవాడు. మార్పును అభిలషించే హిందువులతో సంబంధాలు పెట్టుకొన్నాడు. ఆయన ఇంట్లో జరిగే గోష్ఠులు, చర్చలు ఈ హిందూ మిత్రులమీద ప్రభావం చూపాయి. పాశ్చాత్య విద్య అభ్యసించడం వల్ల హిందువులు ఉన్నతోద్యోగాలు పొందగలరని, రాజకీయ ప్రయోజనాలు సాధించుకోగలరని నార్టన్ భావించాడు.14 ఆయన ప్రోత్సాహంతో శ్రీనివాసపిళ్ళె, ఇతర మిత్రులు మద్రాసు హిందూ లిటరరీ సొసైటీ (Madras Hindu Literary Society) ప్రారంభించారు. ఆ సొసైటీ సమావేశాలలో నార్టన్, మరికొందరు యూరోపియన్ మేధావులు - చరిత్ర, రాజకీయశాస్త్రం, సాహిత్యం మొదలైన అనేక విషయాల మీద ఉపన్యసించేవారు. ఈ ఉపన్యాసాలు విద్యావంతులైన యువకుల ఆలోచనల్లో మార్పును తీసుకొచ్చాయి. ప్రజలు ఆధునిక విద్య అవసరాన్ని గుర్తించారు. హిందూ లిటరరీ సొసైటీ పర్యవేక్షణలో మద్రాసులో ఒక ఇంగ్లీషు బోధించే స్కూలు ప్రారంభం అయింది. “గౌరవప్రదమైన” కులాల విద్యార్థులు ఈ స్కూలుకు వెళ్ళి చదువుకోవడం మొదలు పెట్టారు. నార్టన్, శ్రీనివాసపిళ్ళె మొదలైన వారి కృషివల్ల 1841లో మద్రాసు యూనివర్సిటీ హైస్కూలు ప్రారంభమయింది. ఈ స్కూలు ప్రెసిడెన్సీ కాలేజీగా అభివృద్ధి చెందింది.

సంస్కరణ విషయంలో లక్ష్మీనరసుసెట్టి, శ్రీనివాసపిళ్ళెల మధ్య అభిప్రాయభేదాలు తలఎత్తాయి. లక్ష్మీనరసుసెట్టి పాశ్చాత్యీకరణను వ్యతిరేకించాడు. మార్పు హిందూసమాజం అంతర్గతంగా రావాలని, వెలుపలినుంచి కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. బాలికలకు చదువులేకపోవడం, వారికి ఆస్తిహక్కు లేకపోవడం, అతి బాల్యవివాహాలు, వితంతు వివాహాల నిషేధం, సముద్రయానం మీద నిషేధం మొదలైన దురాచారాలు, మూఢనమ్మకాలు రద్దుకావడానికి ప్రభుత్వజోక్యం తప్పనిసరి అని శ్రీనివాసపిళ్ళె భావించాడు. ఈ అభిప్రాయ భేదాలవల్ల శ్రీనివాసపిళ్ళె, లక్ష్మీనరసుసెట్టితో విడిపోయి, 1852లో హిందూ ప్రోగ్రెసివ్ ఇంప్రూవ్‌మెంట్ సొసైటి (Hindtu Progressive Improvenient Society)ని స్థాపించాడు. ఈ సొసైటీ తరపున స్త్రీ విద్యను ప్రోత్సహించాలని, వితంతువివాహాలను నిర్వహించాలని, అణగారిన బడుగువర్గాల అభివృద్ధికి కృషిచెయ్యాలని తలపెట్టాడు. ఈ కార్యక్రమంలో సదర్ కోర్టు (Sadar Court) లో ప్లీడరయిన ఎం.వెంకటరాయులునాయుడు ఆయనకు అండగా నిలబడ్డాడు. భారతీయ పునరుజ్జీవనం విషయంలో ఇద్దరి ఆలోచనలలో ఏకీభావం కుదిరింది. వెంకటరాయులునాయుడు పత్రికలలో సంస్కరణకు, వితంతువివాహాలకు అనుకూలంగా రాస్తూ వచ్చాడు. 1853లో 'రైసింగ్ సన్' (Rising Sun) పత్రిక స్థాపించి, హిందువుల సాంఘికసమస్యల మీద చర్చ లేవదీశాడు. ఆనాటి ఇతర స్థానిక పత్రికలలో కూడా సంఘ సంస్కరణకు సంబంధించిన విషయాల మీద, వివాహాలలో మితవ్యయాన్ని గురించి, వితంతువివాహాలను గురించి, శుభకార్యాలలో కళావంతుల నృత్య, గాన కార్యక్రమాలను ఏర్పాటుచేయడం గురించి చర్చలు కొనసాగుతూ వచ్చాయి.

శ్రీనివాసపిళ్ళె మరణంతో మద్రాసు సంస్కరణవాదులకు పెద్ద నష్టం జరిగింది. వెంకటరాయులునాయుడు హిందూ ప్రోగ్రెసివ్ ఇంప్రూవ్‌మెంట్ సొసైటి నిర్వహణ బాధ్యతను తలకెత్తుకొని, శ్రీనివాసపిళ్ళె ఆలోచనలను, ఆకాంక్షలను ముందుకు తీసుకొని వెళ్ళాడు. దళితవర్గాల శిశువులకు పాఠశాలలు పెట్టడం, అర్హులైన విద్యార్థులకు ఉపకారవేతనం అందించడం, సంస్కరణను ముందుకు తీసుకొని వెళ్ళే 1856 విడో మేరేజి యాక్టు (Widow Marriage Act) వంటి చట్టాల అమలుకు కృషి మొదలైన కార్యక్రమాలు చేపట్టాడు. హిందూ రీడింగ్ రూం, (Hindu Reading Room) హిందూ డిబేటింగ్ సొసైటీ (Hindu Debating Society) లను స్థాపించి, వాటి కార్యక్రమాల ద్వారా మద్రాసులోని యువకులను, విద్యార్థులను ఆకర్షించాడు. ప్రభుత్వ ప్రచురణలన్నీ ఉచితంగా ఈ రీడింగ్ రూంకు అందేవి. మద్రాసు ప్రముఖులు ఈ సమాజ వేదికమీద ఉపన్యసించేవారు. యువకులలో ఉపన్యాసకళ, చర్చానైపుణ్యం అభివృద్ధి కావడానికి తరచుగా చర్చలు, గోష్ఠులు నిర్వహించబడేవి. ఈ కార్యక్రమాలవల్ల యువకుల్లో ప్రశ్నించేగుణం పెంపొందుతుందని వెంకటరాయులునాయుడు విశ్వసించాడు. మితవాద హిందూవర్గాలు ఈ కార్యక్రమాలను అంతగా ప్రోత్సహించలేదు. 1863లో వెంకటరాయులునాయుడు మరణంతో, ఆయన స్థాపించిన సంస్థలు, పత్రిక ఆయనతోనేపోయాయి.

మద్రాసు యూనివర్సిటీ హైస్కూలులో ఫీజులు ఎక్కువగా ఉండడంవల్ల, పై వర్గాల విద్యార్థులకు మాత్రమే అందులో చదివే అవకాశం కలిగింది. పావెల్ (Eyre Burton Powell) ఈ స్కూలు అధిపతి. ఆయన ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దాడు. టి.మాధవరావు, సి.వి. రంగనాథశాస్త్రి మొదలైన విద్యార్థులు యూరోపియన్ అధ్యాపకుల ఆలోచనలతో ప్రభావితులయ్యారు. జీవితంలో అభివృద్ధికి వచ్చి గొప్ప ప్రభుత్వోద్యోగాలు చేశారు. ఆధునిక విద్యావిధానం వారికి కొత్త చూపునిచ్చింది. నిర్జీవమైన సాంస్కృతిక విలువలు, నియంతలైన పాలకుల పరిపాలన హిందువుల వెనుకబాటుతనానికి కారణాలని మాధవరావు భావించాడు. సాంఘిక దురాచారాలను విడిచిపెట్టిననాడే జాతి పురోగమించగలదని ఆయన నమ్మాడు. పశ్చిమదేశాల విలువలను స్వీకరించి, పాశ్చాత్యుల శాస్త్రాలను, సాహిత్యాన్ని అధ్యయనం చెయ్యడంవల్ల భారతీయులు ఉన్నతస్థితికి చేరుకోగలరని గ్రహించాడు. పాశ్చాత్య విద్యను అభ్యసించిన ఆనాటి మేధావులు ఇటువంటి

భావాలు వ్యక్తంచేస్తూ వచ్చారు.

1858లో మద్రాసు, కలకత్తా, బొంబాయి విశ్వవిద్యాలయాలు ఆరంభమయ్యాయి. పాశ్చాత్య విద్యను ఇంగ్లీషుమాధ్యమంలో బోధించడం ప్రారంభమయింది. ఇంగ్లీషు విద్యావ్యాప్తి, పాశ్చాత్యుల సంసర్గం, సంస్కరణభావాలకు స్ఫూర్తినిచ్చాయి. ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్దడంలో పత్రికలు తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించాయి. మద్రాసు వేదసమాజ ప్రభావంవల్ల బాలికావిద్య ప్రచారంలోకి వచ్చింది. పురుషులు ఉపాధ్యాయులుగా ఉండడంవల్ల తల్లిదండ్రులు బాలికలను బడులకు పంపడానికి ఇష్టపడని రోజుల్లో, 1866లో మేరీ కార్పెంటర్ (Mary Carpenter), మద్రాసు వచ్చి, స్త్రీ విద్యకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలచడానికి కృషిచేసింది. పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డైరెక్టరు పావెల్ చొరవతో స్త్రీలకోసం ప్రత్యేకంగా నార్మల్ స్కూలు (Female Normal School - ఉపాధ్యాయ శిక్షణ పాఠశాల) అవసరాన్ని ఆమె మద్రాసు హిందూ సమాజానికి నచ్చచెప్పింది. రంగనాథశాస్త్రి, రామయ్యంగారు ఆమె అభిప్రాయాలను సమర్థించారు. ప్రభుత్వం స్త్రీలకోసం ప్రత్యేకంగా నార్మల్ స్కూలు ప్రారంభించింది.