ఆముక్తమాల్యద/సప్తమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

ఆముక్తమాల్యద

సప్తమాశ్వాసము

శ్రీమదుమాసులభాంగక
సామజహర నక్ర దళన చక్ర సదాళీ
క్షేమంకర చరణాంబుజ
హైమోజ్జ్వలవాస! వేంకటాచలరమణా!

1

బ్రహ్మరాక్షసుని వృత్తాంతము

వ.

అవధరింపు మప్పొలనుదిండి దుఃఖార్తుండై యిట్లనియె.

2


ఉ.

ఉండుదుఁ జోళభూమి నొకయూరఁ గళల్ పదునాల్గు నేర్చి వా
క్చండిమఁ జర్చ గెల్తు ఘటశాసుల, శ్రౌతులఁ దప్పు పట్టుదున్,
ఖండలముష్టి విప్పఁ గని నవ్వుచు, వెండి ప్రయోక్తలన్ సుధీ
మండలి గ్రాంథికత్వ మవమానము సేయుదు జల్పవాడినై.

3


వ.

ఇన్నడవడిం బ్రభిన్నగండం బగువేదండంబునుంబోలె మదాంధుండనై,
యల్పవిద్యాలబ్ధి విడువ ముకువ వేసరని వీసంబు గల రెడ్డియుంబోలె, నచ్చ
దువె పరబ్రహ్మంబై, పెద్దలంజెనకి యోడియు సరియైతిననియును, సరిపోయి
జయించితి ననియు, నబద్ధంబు లాడి చిల్లరప్రభుపుల భ్రమియించుచుండి,
దీక్షితులం జూచి యియక్షవొడమి ద్రవ్యభిక్షార్థినై మధురకుం బోయి
యప్పురంబున.

4


సీ.

బహిపడ్డద్విజున కల్పపుఁ బాచితం బిడి,
                   పసిఁడికై తా వాని బంతిఁ గుడిచి,
కలసి వణిక్పురోథలతోడఁ బుణ్యాహ
                   ముల బియ్యమునకు నై మొత్తులాడి,

శశి రవి గ్రహ జపస్నానాదికము లెల్ల
                   దొరలవాకిండ్ల కే దొద్ద యిచ్చి,
పచ్చిఱ్ఱితో ల్బఱ్ఱె చు చ్చాలమె ట్లంది
                   కొనఁ దాన యూరెల్ల గుత్తపట్టి,


తే.

దర్భపోటులఁ దీని, లేని తఱుల మైత్త్రి
నంటి పితృశేషము భుజించి, యదియు నెడల,
నక్కవాడల నరకూళ్లు మెక్కి, మీఁద
వీనిశేఖర మొక తులార్త్విజ్యము కొని.

5


ఉ.

ఇ ట్టొనఁ గూర్చి వైశ్యునకు నిచ్చి, చన న్మఱి పుచ్చి, చౌకము
ల్వెట్టుచు, వడ్డిలెక్క లటు వెట్టుచు, ధారణవానికై కొదల్
పెట్టుచు, వాఁడు రేఁగి మఱి 'పెట్టుదుఁ బెట్ట' ననంగ, మిట్టఁ గూ
పెట్టుచు, నిట్టు పోరఁ, గనిపెట్టుచు, నొక్కరుఁ డుండి వెండియున్.

6


సీ.

వెలివాడఁ బనిక్రొత్త మలకడా ల్గొని నూనె
                   యిడి తంగెడాకు గట్టెడు తహతహ
కూర్పంబు గొరిగించుకొని యజ్ఞతోయంపు
                   టంగడిఁ దలగడగాడు తడవు,
వంట పూఁటింటి కెప్పంటికంటెను బాలు
                   పెరుఁగు నే గూర లంపెడు తెగువలు,
సంబెళ విదలించి తాంబూలదళ పూగ
                   నివహంబుఁ జాలఁగ నించు నుబ్బు,


తే.

బ్రహ్మచారిభుజంబు మాత్రకు సడింపుఁ
బ్రాలు, నాలికి మేలుచీరలు, గొనియెడు
సంభ్రమంబును, బెఱపాంథజనులఁ బయన
మడుగు ప్రశ్నలుఁ, గని మత్ప్రయాణ మెఱిఁగి.

7


క.

హత్తుకొని యొక్క కొందఱ
నత్తెరువుం గట్టఁ బనిచి, యందఱక్రియఁ దాఁ
దిత్తి యొకటి, గొని త్రేణి మ
ఱుత్తర ముత్తర మటంచు నొకప్రొద్దుకడన్.

8

తే.

లేచి పోవంగఁ దత్తఱ మేచి తోడి
వారు సన నేను ముడెమోపు వటున కెత్తి
పోవ వాఁ డిందు రండని త్రోవ యడవిఁ
బెట్టి యొకవాఁగు డిగ నీల వెట్టుటయును.

9


క.

అఱచేత వ్రాలు గను న
త్తఱిఁ ఒడె నొకయంపకట్టె, దానికి నిలువం,
బిఱుబిఱ్ఱున ఱాలుపడెం
దెఱపియుఁ గనలేమి సాతు దిరుగుడువడియెన్.

10


మహాస్రగ్ధర.

కవిసె న్గల్పాంతజంతు గ్రసన భృశ బుభుక్షా త్వర త్ర్యక్ష పార్శ్వ
ప్లవమానోత్పాత[1]బేతాలరుల పటిమ హాలాహల స్పర్ధి హేతి
చ్ఛవి రేఖానేకరాహూ చ్చలిత రవులు రక్షశ్చమూజి త్పుళింద
ప్లవబృందఁబు ల్వనిన్బల్వడిఁ బొడుపొడు మన్పల్కులు న్ముల్కులు న్రాన్.

11


వ.

ఇట్లు చెట్లు వెడలి విండ్లువంచుకొని ముంచుకొను నన్నల్లవ్రజం జూచి
హల్లకల్లోలంబై విఱుగంబడు నెడ.

12


సీ.

పసలేదు నిలరోయి పాతకులా రని
                   దేవాయుధంబులు ఱూవు వారు
పైఁడిబాసము జెట్లఁ బడవైచి దుడ్డు పె
                   ట్లకుఁ బాఱుచునె యొలెల్‌ వైచువారు
బరువు డించి కటారి పరుఁ జించి నిల్చి యిం
                   దెందు వచ్చెద రని యెదురువారు
వస్త్రంబుఁ గొండు దేవర యోయి యిది చన్నఁ
                   బస్తని దయపుట్టఁ పలుకువారు


తే.

కలవి మామూఁక నిప్పింతుఁ, దొలఁగుఁ, డొకటి,
యాఁడుదాని జే నంటకుఁ డనుచుఁ బెద్ద

తనము నభిమానమును దెంపు గనఁగఁ బలికి
నిలిపి దోఁపిచ్చువారు నై తొలఁగి రపుడు.

13


సీ.

తొడువింటివాఁడు సన్త్రోవ బోవక యెడు
                   ర్పడుజాండ్రఁ దొడిఁబడఁ బదరి పొడిచి,
పినుఁ గీక పెనఁగినఁ బెద్ద నొంపక యెఱ్ఱఁ
                   బాఱించి చేఁ గలవాని నాఁచి,
యాయితంబై చించి యరిగెడువాఁ డేటు
                   నకు మీఱి చన్న వెన్ దవులు టుడిగి,
పొదువు చే లేకయ పుటపుటయను నైన
                   వాని శోధింప నవ్వలికిఁ బనిచి,


తే.

పొదలఁ దూఱిన నీఁటె చాఁపుల వెడల్చిఁ,
గట్టుబట్టలు గొని ప్రాఁతబట్ట దయను
గోఁచులకు నిచ్చి, గనసరాకులు నిగిడ్చి,
చెప్పుటట్టలు శోధించి సిగలు విప్పి.

14


వ.

ఇట్లు పాదచ్చరులు పెచ్చుపెరిగి విచ్చలవిడి నుచ్చావచంబులగు సార్థంబు
నర్థంబు లపహరించు సంకులంబున.

15


సీ.

కటి నుండి చనుమఱ గడిగాఁగ బిగియించి
                   కట్టిన నిడు నీలికాసె మెఱయఁ,
బిల్లిగడ్డము మించఁ బెరిఁగి మీసలు కుక్షి
                   గోళంబుమీఁద నుయ్యాల లూఁగ,
బూఁది బ్రుంగిన మొగంబున గౌదకిట్టు మై
                   నవుమైల ప్రాఁజాతు నాఁజెలంగఁ,
జిటివ్రేలి పూసపై ఘటియిల్లు వెడఁబట్టు
                   చిమ్ముల సురియ డా ల్ముమ్మరముగ,


తే.

నూరనుండియుఁ గనుపెట్టుచున్నవాఁడు
దప్పిపో నన్ను డబ్పాటు దాఁ బొడగని
యట్టివేళఁ గాకశ్మశ్రు వనెడు నొక ప్ర
చండ చండాల చోరభటుండు దఱిమి.

16

చ.

కవ వటు డించి యేఁ గునుఁకఁగాఁ, సురెఁ గొంకులఁ దార్చి, కూలుడు,
న్నివిడిన బొజ్జపై మిగులు నిద్దపు దోవతి దట్టి డొల్లిరాఁ,
దివిచి, పెనంగ వల్లువముఁ ద్రెంచి, యనంతుని గంట్ల కూనపుం
జెవులుగ గౌదకట్టు గసెచేరుల టెక్కియు దోఁపు నొల్చి పోన్.

17


క.

నోరిసని నుండ, కే 'నో
రోరి, యకట! మా సమీప వూరనె మనియుం,
దూరము వోయితివే! సొ
మ్మేరీతిని నీకు దక్కునే కానీరా.’

18


తే.

అనిన లాఁతుగఁ గోల్పోక యతఁడు రడ్డు
రాజుఁ గను నని కొదయుఁ దీర్చంగ మగిడి
యంత పరియును జై ప్రజ కలికి పాఱి
పోవ వాఁడును వెడపోట్లు పొడిచి చనియె.

19


ఉ.

అంతట బొంతఁ బెన్దెరువునం దరుదెంచు పిఱిందిమంది మ
త్కాంత సహోదరుండును నొకం డరుదెంచుచు సాతు వడ్డ వృ
త్తాంత మెఱింగి నన్నరసి తాఁ గని యార్తి నొకండు దా నతి
శ్రాంతుని నన్నుఁ గాసట దిసంతులు గొట్టుచు మోదు చేఁగుచోన్.

20


సీ.

కొంగవా ల్నఱకు లంగుళులఁ బట్టుచు జబ్బ
                   లంటఁ గుట్టిద వెజ్జు నరయువారు,
తలఁ బడ్డ డుదియ ప్రప్పులఁబ్రాఁత మసి యిడి
                   యంజలి గం జిండ్ల నడుగువారు,
తమసేగిఁ జెప్ప లో దయమీఱ విని చీరఁ
                   జించి యియ్యంగ దీవించువారు,
నొలఁబడ్డ నెపమునఁ గలలేని సిరిఁ జెప్పి
                   చుట్టలపై దాడి వెట్టువారు,


తే.

నైన పాంథులచేతఁ గ్రందైన యూళ్ళ
జాడగా నిటఁ దెచ్చి యన్నీడ డించి,
పాఱు నీ రానఁ బోవ నూర్పాఱి మగిడి
వచ్చునాలోన నీరూపు వచ్చె నాకు.

21

వ.

కయ్యంబునఁ బాఱఁ బాఱ గాయంబు సేసి వెఱవేఁకిగొలిపిన కాకశ్మశ్రునామ
ధేయచండాలు కరాళవేషంబు గన్నులం గట్టినట్లుండఁ గడఁ గనుట నిట్టి
కరాళవేషంబు గలిగెఁ; గైశికీగానఫలదానంబున దీని మానుపవే? అనిన
నతం డేను ఫలంబెఱుంగ, ఫలంబు పరమేశముఖోల్లాసంబ, యాజ్ఞాకైంక
ర్యంబులకు ననుమతి కైంకర్యంబులకు ఫలపరిమాణగణన ప్రపన్నుల
కెక్కడియది? కాన బంధకంబగుట ఫలం బింతంత యందుఁ గొంతఁ
గొమ్మనవెఱతు, భగవతుండ రక్షించు, నూఱడిలు మన్న నన్నోరిమాట నోరన
యుండ నతండు.

22


సీ.

స్నిగ్ధత్రిభాగముండితశరశ్శిఖతోడ,
                   హిమధవళోపవీతములతోడఁ,
బుణ్యషడ్డ్వితయోర్ధ్వపుండ్రవల్లులతోడఁ,
                   దులసికాబ్జస్రగావళులఁతోడఁ,
గౌపీనకటిసూత్రకాషాయయగితోడఁ,
                   జలపూర్ణశుభకమండలువుతోడఁ,
బాణిస్థదివ్యప్రబంధసంపుటితోడ,
                   నుత్తరవాక్పూర్వకోక్తితోడఁ,


తే.

బసిఁడిజిగితోడ బ్రహ్మవర్చసము వొల్చు
భాగవతలక్ష్మితో ధూమపటలినుండి
వెడలు శిఖవోలె నమ్మేను వెడలి చూడఁ
జూడ వైష్ణవుఁ డై నిల్చె సోమశర్మ.

23


వ.

ఇట్లు భాగవతపరిచయప్రభావంబున బ్రాహ్మణ్యంబెకాక భాగవతశ్రీయునుం
గలిగి యుప్పు చెంది యిరుమడియగు చందంబునం బరమహర్షభరితుఁడై
స్వరూపానురూపంబుగా నతనికిఁ బూజఁ గావించి.

24


సీ.

జయ దురుత్తరణసంసరణాబ్జదళనీర,
                   జయజయ గాయకసార్వభౌమ,
జయ శౌరిగాథారసజ్ఞపుణ్యరసజ్ఞ,
                   జయజయ తత్వసంచయపవిత్ర,

జయ జనార్వాచీనజనిసంగవంచక
                   జయజయ దేశికచరణశరణ,
జయ యుక్తవాక్ప్రతిష్ఠాతృణీకృతదేహ,
                   జయజయ భగవదాజ్ఞాకృతిస్థ,


తే.

జయ సకలజంతుసమచిత్త జయ దయార్ద్ర,
జయ ముకుందాన్యదేవతాశాస్త్రబధిర
జయ చతుర్ద్వయభక్తిలక్షణచితాంగ
జయ మురారిప్రపన్నాంఘ్రిజలజమధుప.

25


వ.

అని ప్రస్తుతించి ప్రదక్షిణంబు గావించి పునర్భవభయంబున భవనభార్యా
ప్రముఖసుఖవిముఖుండై బదరీవనాదిపురుషోత్తమాధిష్ఠితపుణ్యభూములఁ
బౌనఃపున్యంబుగం దీర్థయాత్రఁ జరించుచుఁ బరమనిర్వృతం బౌందె, నిప్పుణ్య
కథ వహనసమయంబునఁ గుహనావరాహంబువలన మహీమహిళ మదీయ
పూజోచితోపచారంబుల విశేషఫలదంబు గానంబ యన విని వైష్ణవియుం దాఁ
గావున దదాకలనకుతూహలంబునం గూఁతురై నీ కొదవి యహరహంబును
విప్రలంభదంభసమీరితాగాధగాథార్థసమేతగీతరసంబునం బ్రొద్దుపుచ్చుటగాని
వేఱొండుగా దేమి తపంబు నేయుచున్నదియో యం టింతకంటెఁ బరమ
తపం బున్నదే? యన్నియును మేలయ్యెడు. శ్రీరంగంబునకు రంగేశు సేవింపఁ
దోడుకొనిపోయి రమ్మనుటయుఁ, బ్రసాదమ్మని ప్రణామమ్ము సేసి పసిండిపల్లకి
నబ్బాలికారత్నంబు నునిచి పరిచారికాశతంబును భాగవతపరిషత్తునుం గొలువఁ
బ్రయాణపర్యాయంబులఁ బరమానురాగంబునం బోయి.

26

గోదాదేవి శ్రీరంగమున రంగనాథుని సేవించుట

మ.

చని కాంచె న్విరజాభిధాంతర వపు స్సహ్యోద్భవాతీర నం
దన వాటీవలయద్రుమావళి దళాంతర్దృశ్య పాపాళి భం
జన చాంపేయసుమాయమాన విషమ స్వర్ణావృతివ్రాత ర
శ్మి నభస్స్పృక్ఛిఖరాళి దీపకళికాశృంగంబు శ్రీరంగమున్.

23


క.

చోళీహల్లకచితకచ
పాళీ పాళీభవద్విపంచీస్వన భృం

గాళీ కవేరదుహితృ మ
రాళీధ్వను లెసఁగుగాడ్పు వ్రతివడ యుడిపెన్.

28


తే.

అతఁ డఘమర్షణస్నాన మమ్మరుద్వృ
తాంబువుల నాడి, మాధ్యాహ్నికాదిఁ దీర్చి,
స్నాతయు నలంకృతయు నౌ తనయను
దోడుకొనుచు వైష్ణవపరిషత్తు గొలువ నరిగి.

29


సీ.

చరణంపుసరపణి మొరవంబు విన్నదం
                   తులకట్ల యెదురు నింతులకుఁ దొలఁగి,
యిడినట్టి మణిముష్టి గృహుల యారతి కెంపు
                   రాలనే కలయ ద్వారాలఁ జల్లి,
ప్రసవాది తావికిఁ బ్రతిగృహేశార్చభ
                   క్ష్యపువల్పునకె పోలె శ్వాస ముడిపి,
నృత్తగీతోత్థశౌరిస్తుతిఁ గీర శా
                   రిజయట్ల యర్ధోరరీకృతి విని,


తే.

వలభి రత్నాంశువులఁ గట్టు తెలుపు చిత్ర
మగుట కోర్వక దిగదిగ నరిగి ధాన్య
మడిగెడు విరక్తభాగవతాళి వలన
వెల్లదీవిని బోని యవ్వీడు సొచ్చి.

30


ఉ.

గోపురకందరాశికడకు న్శశిపుష్కరిణీకణార్ద్రసం
తాపహరానిలంబులు విమానరణన్మణికింకిణీకలా
లాపముల న్సుఖం బడుగ లాలనఁ జొచ్చి యకాండగాహనా
చాపలకృన్మరుద్గణముఁ జండుఁ డదల్చెడు లోనివాకిలిన్.

31


ఉ.

వేత్రముఁ గేలఁ బూని మణివేదిఁ గుథంబుపయి న్వితాంబురు
ణ్ణేతుని ముద్రవ్రే ల్మెఱయ నిశ్చలు లై యిరుమై మనాఙ్నమ
ద్గాత్రుల దంతివక్త్రులకతంబు వినీతి భజింప నొప్పు త
త్సూత్రవతీశు వందనముతోఁ గని యాతఁడు భక్తి సేయఁగన్.

32


తే.

అవిదితపురందరాయుధం బైన కనక
శిఖరియును బోలె నెఱకల జిగులు దెసల

నింగి నీరెండఁ గాయు వేదాంగు వినత
సుతుని నతిఁ గాంచి మగుడఁ దన్నతియుఁ గాంచి.

33


వ.

అతనిచే విజ్ఞాపనంబు నేయించి యనుమతింగాంచి చతుర్భుజులు జలధర
శ్యాములు శతపత్త్రలోచనులు చపలాపిశంగవసనులు వనమాలికాబద్ధబాహు
మధ్యులు నైన మధుమథనప్రతిబింబంబులం బోని పారిపార్శ్వికులఁ బరాంకుశ
ప్రభృతిముక్తుల సేవించుచుఁ దదభినందితు లై చని మహావకాశంబును మణి
మయస్తంభసంభృతంబును శాతకుంభకుంభశోభితశేఖరంబునునై చిత్రనేత్ర
వితానలంబమాననానాప్రసూనదామముక్తాగుళుచ్చాచ్చచామరంబును నుద్వేల
కాలాగరుధూపధూపితంబు నగు మహావిమానమధ్యవిధుకాంతవితర్ధికాతలం
బునఁ జరణముఖతతత్ప్రతీకాధిష్ఠితధర్మాధిసూరిపరిషదాత్మకంబును దేజోమ
యంబును నగు విపులవిమలపీఠంబునఁ బరిమళాలోలరోలంబజాలంబగు నంబు
రుహంబు జాంబూనదత్విడుత్తమర్ణవిస్తీర్ణకర్ణికోపరివీథి నూధన్యపాథోని
ధానంబునకుఁ బ్రథమహేతుభూతం బగు భూతతన్మాత్రయుం బోలెఁ బారద
స్ఫటికబటీరపాండురుచి పుండరీకంబుల పసకు మసమసక లెనకొల్పు మిసిమి
గల భోగిభోగభాగంబునకుం బరభాగఁబు మిగులఁ దదాత్మకంబ యగు నుప
బర్హంబున మహార్హకేయూరమణికర్బురంబగు కూర్పరం బూని మననపర
మునిమనోరాగరస మార్జనంజేసి మిగులు నరుణిమ వహించెనోయనఁ జాలు
కెంగేలు కపోలంబునం గదియం ద్రిదశతరుకుసుమకంచుకితకంచుకికంచు
కాత్మకం బగు దుకూలనిచోళంబున నొత్తిగిలియున్నవానిం, గరిం గఱకఱిం
బెట్టి బిట్టు దనచేతి చక్రంబునం దేగిన నక్రంబు పూజ్యం బగు సాయుజ్యంబు
నొందేనో యన నుపరిపరిదృశ్యమానగండస్థలస్థమణిమకరకుండలప్రతి
బింబరుచిడంబరంబునం బరమసౌందర్యమకరందనిష్యంది యగు
ముఖారవిందంబున నందంబగువాని నిర్నిమేషదృష్టి నెట్టుకొని చూచుతఱి
నీలావదాతయు ఱెప్పపట్టు తఱి బిట్టెదుర్కొను కలధౌత గౌరగౌర మహా
మహఃపూరంబున మునింగి దుర్నిరీక్షయు నగు నిజరుచిరమూర్తివలనఁ
దనదు సాకారనిరాకారతలు వారికిఁ జూపు రూపున దీపించువానిఁ, గళత్రంబు
లగు శ్యామాచ్ఛాయలచేతఁ బ్రేముడిం బొదువఁబడిన యట్లు కప్పులు దొంగలు
నగు పక్ష్మకాలికల నొప్పు సోమసూర్యాత్మకంబు లగు వెడంద నిడువాలు
టెఱ్ఱసెరలకన్నులం గెందమ్మిఱేకుల వెదఁజల్లువాని, మంకెనవిరిబింకంబు

నింకించు నధరశోణిమ నెపంబున వెలుంగు ముఖజనితహుతాశనుతోఁ
దత్సఖుం డగు గంధవహుం గూర్ప నిక్కెనన నొక్కింత నిక్కి చొక్కపుఁ
బొటమలఁ జూపట్టి తిలకుసుమవిలసనాపహాసి యగు నాస భాసమానుం డగు
వాని, నుదరజాత శవేతధామతామరసంబుఁ గనఁగొని మహదాశ్రయంబు
గనిన పూర్ణిమాశశాంకుడను శంక నాతనికి నాకు వైరంబు మాన్పు మని
తత్సహోదరిగావున రత్నకాంచనంబులు లంచంబులుగా నివేదించి యడుగు
లొత్తు నిందిరకు వరముం బడియున్న రాహు వనం గేయూరికటకమణి
ముద్రికాంకితం బగు దీర్ఘబాహుపరిఘంబు కటితటోత్సంగంబున మెఱయు
వాని, నురఃస్థలన్యస్తనిస్తులాస్తోకకౌస్తుభగభస్తిమండలంబున నిండోల
గంబుండు పుండరీకనికేతనతనుచ్ఛాయ యన నచ్ఛాచ్ఛం బగు శ్రీవత్సంబున
లోచనోత్సవంబుఁ గావించువాని, విజతమృగనాభినాభిసౌరభ్యంబునకు నెగయు
నుత్తుంగభృంగమాలిక యన మెఱయు నసితపేశలతులసీపలాశదామం
బున నభిరామకోమలాలంకృతి యగువానిఁ, గపటకరటివిరోధియై యసుర
యుసుఱుం గొని మగడ మనుజాంగంబు నంగీకరించునెడఁ దలంపఁబడమి
నట్లనయుండె నన బడుగగు నడుముపసఁ గడునొడిక మగువాని, ఘనజఘనచర
మేతరధరాధరాధిత్యకాతలంబునం గాంచనకాంచికామణిమకుటగగనమణి
గాయు నీరెండ మెం డనఁబరఁగు మెఱుంగు పీతాంబరంబునం బొదువంబడి
దాని సన్నదనంబునఁ దన నున్నఁదనంబు వెలువలం బోఁవఁ గనకపుష్య
రాగంపుఁ దెరవారు వైదూర్యమణిస్తంభయుగంబునుంబోలెఁ గించిదామీలిత
నీలిమం బగునూరుయుగళంబువానిఁ, ద్రైవిక్రమం బగు విగ్రహంబుతో
నాగ్రహంబున మీఁదికిం జూఁచు తఱిఁ జంక్రమణరయంబునం దగిలివచ్చిన
మణిమయస్వర్భువనజాంబూనదప్రాకారవలయంబనం దీండ్రించు నుద్దండ
గండపెండెరంబునం బొడము నఖండప్రభామండలంబునం బరిహిండితంబులై
మఱ్ఱిపండుల వడుపుగల మడమల బెడంగుపడి భావినిజకమఠావతార.
సూచకంబులుం బోలెఁ గొదమ తామేళ్ళ మేళ్ళనగు మీఁగాళ్ళతోఁ గోకనద
మృదూదరంబు లమర మెఱుఁగు జుక్కల జిగి మొక్కవఱుచు నఖచక్రవాళ
చంద్రికల భక్తజనమనస్తమోవిదళనంబుఁ గావించుచు హలకులిశకలశ
కమలమకరాంకుశాంకితంబులై లక్ష్మీకుచకుంకుమాకలన నరుణారుణంబు
లగు చరణంబులం దాపత్రయాపహరణంబు సేయువానిఁ, నారాయణుం

బురాణపురుషుఁ బురుషోత్తముఁ బ్రణతార్తిహరు వాసుదేవు హృషీకేశు
నీశనుతు విభీషణవరదు ననంగజనకు రంగరమణుం గాంచి సహసమాగత
భాగవతపరిషత్సమేతంబుగాఁ దానం దనుజాతయుం బ్రమదభయభక్తి
రసమగ్నలై జయజయశబ్దంబులతో సర్వాంగాలింగితక్షోణితలంబు లగు
నమస్కారంబులు గావించి నిలిచి నిటలతటఘటితాంజలియై ఇట్లని నుతి
యించె.

34


తే.

విధిగృహాక్షయవిత్తసేవధికి శరణు
చిరకృతేక్ష్వాకుపుణ్యరాశికిని బ్రణుతి
ధనపతి భ్రాతృకుల దేవతకు జొహారు
నతమృడాదిక సుమనస్సునకు నమస్సు.

35


తే.

కొలుతు సర్వేశు సర్వాత్మకుని ననంతు
నప్రకాశు నభేద్యు సమస్తలోక
సముదయాధారు నణుసమూహములకును న
ణీయు నిన్ను ననాధారు నిత్యు సత్యు.

36


క.

నారాయణు భూప్రభృతిక
గౌరవవద్వస్తువితతికంటె మిగిలి పెం
పారు గరిష్ఠత గల పర
పూరుషు శరణంబు వేఁడి పొగడిన నిన్నున్.

37


తే.

అజశివాదిక మగు నీసమస్తజగము
నెందుఁ బ్రభవించు వర్తించు డిందు నట్టి
మహిమ కిమ్మైన నిత్యు సమస్తభూత
మయుఁ బరులకంటెఁ బరు మహామహునిఁ గొలుతు.

38


సీ.

పరపురుషునికంటెఁ బరుఁడనాఁ జనువానిఁ
                   బరమాత్ము, ముక్తికై పరమయోగి
పరిషత్తుచే సదా భావింపఁబడువాని,
                   నెవ్వనియందుఁ బ్రాకృతము లైన
సత్త్వాదిగుణముల సందడి లే దట్టి
                   విమలుని, సర్వభూతములకంటె

నాద్యుఁడు శుద్ధుండు నగువాని, విభుఁ, గళా,
                   కాష్ఠానిమేషాది కాలసూత్ర


తే.

మయిన యెవ్వానిశక్తి యింద్రియవితతికి గోచరము గాదొ నిర్లేపుఁ డై చెలఁగుట
నతివిశుద్ధుఁడు దానయ్యు నౌపచార
వృత్తిఁ బరమేశుఁ డగు నిన్ను విష్ణుఁ దలఁతు.

39


వ.

అని పరస్వరూపసురసేవ్యభవ్యదివ్యావతారలీలలం బ్రస్తుతించినఁ గౌస్తు
బాభరణుండు కరుణాతరంగితంబు లగు నపాంగంబుల నమ్మునిం గనుంగొని
కుశలప్రశ్నంబుఁ గావించి కంకణాలంకారక్రేంకారంబు లంకురింపఁ బదపంక
జంబులకు, గుసుమాంజలులు సమర్పించు సకలసీమంతినీసీమంతముక్తామణి
యగు నాముక్తమాల్యదరూపు నెలఁబ్రాయంబు సాభిప్రాయంబుగాఁ జూచి
తనలోన.

40


సీ.

దీనిచూ పుదుటెక్కఁ గానెకా సిరిపట్టి
                   కిని బోర బిరుదుఁడెక్కెంబు గలిగె,
దీనికౌ నల్లాడఁ గానెకా గర్వించి
                   యుర్విఁ జైత్రునకుఁ గాలూఁద గలిగె,
దీనిపాలిం డ్లుబ్బఁ గానెకా రతి చేతి
                   కిన్నెరమ్రోఁతకు వన్నె గలిగె,
దీనిమో మొప్పారఁ గానౌకా వాణి రా
                   యంచలేమకుఁ గలాయంబు గలిగె,


తే.

దీని పెన్నెఱు లేపారఁ గానెకా పిర
పోషితమయూరికి విరాలి పొందఁ గలిగె
దీనియడుగులు రంజిల్లఁ గానెకా పి
పానఁ బడుతేఁటులకు మెట్టపంట గలిగె.

41


తే.

అనుచు నువ్విళులూరి మురారి తమక
మాఁపలే కాత్మ దివ్యశుద్ధాంతసీమ
కన్నెలఁతఁ దార్చి యొక్కమాయావధూటి
నట్ల కావించి వారున్నదనియ యుండ.

42

వ.

పూజకులచేఁ బాదతీర్థప్రసాదపరివేష్టనంబు లిప్పించి విడిది కనిపిన గుడి వెడలి
శాంబరీతనుసంభవం బాలకిం బెట్టి గృహంబునకుం జని పంజరంబు సడలించి
యచ్చంచలాక్షిం గానక.

43


శా.

అబ్రహ్మణ్యము! లోన వైచికొనె నన్యాయంబున న్మత్సుతం
దా బ్రహ్మాదుల మేర నిల్పియుఁ బ్రభుత్వం బూఁదియుం దోఁతురే
యీ బ్రక్కన్ ద్విజుఁ జూడ రయ్య నభవా రీరంగభృత్త౦చు దుః
ఖాబ్రాశిం బడి భాష్పకంఠుఁడు సముద్యద్ధోఃపలాలుండు నై.

44


శా.

అంతే వేడుకయైనఁ బెండ్లగుట కీ నా, దేహము న్బ్రాణమున్
సంతానంబు నిశాంతము న్ధనము సస్యంబు ల్పశుశ్రేణు లే
కాంతస్వస్వజనార్చనంబునక కాదా కూర్చుటే, మీ, కయో
వింతే, యీ బుడు తెంత. న న్గుఱుచఁ గావింపం దను న్మెత్తురే?

45


చ.

శివుఁడు విరించి వాసవుఁడుఁ జెప్ప నశక్తులు గొల్చినట్టి వా
రవుట నిరంకుశుండ నని యక్కట పాడిఁ దొఱంగఁ జెల్లునే?
భువనము లెల్ల నీవయినఁ బొంత దయానిధి యమ్మ లేదె? భా
గవతులు లేరె? నా కొఱకుఁ గాఁగ వహించుకొనంగఁ గేశవా!

46


ఉ.

నెట్టన యల్ల లచ్చి యల నీళయు భూసతి యుండ నీకు నీ
నెట్టిక సీలపై మనసునిల్చుట కేమనవచ్చు? వెఱ్ఱి యౌ
నట్టుగఁ బేద నన్నుఁ బరిహాసము సేఁతకుఁ దక్క వింతచూ
పెట్టిది? దిద్దు నెవ్వఁ డిల నేఱులవంకలు వారిడొంకలున్.

47


వ.

అని యిట్లు ధరణీసురుం డదవెట్ట భాగవతక్షోభంబునకు భువనభర్తయు
భయంపడి తచ్ఛాందసంబునకుఁ గేలిసేయుచున్నవాఁ డను భావం బతనికిఁ
దోఁప మకరకుండలమండితంబు లగు గండదర్పణంబులం జిఱున వ్వెలర్ప
నిట్లనియె.

48


చ.

ముది మదిఁదప్పితోటు మునిముఖ్య! భవత్తనయ న్గృహంబునన్
బదిలము చేసి వచ్చి మఱి బట్టబయ ల్వెడదూరు దూరె, దా
సదన మిఁ కొక్కమా టరసి చంచలలోచనఁ గాన కున్న రూ
రెదు మఱి కాని బుద్ధివివరీతతఁ బొందక పోయిచూడుమా.

49

తే.

అనిన నాతండ్రియాయెనే యనియె నే మె
ఱుంగమే యార్తిఁగడువు చల్లంగఁ బలికి
కరుణచేసితి విజయివి గమ్మటంచు
బాష్పజల మాఁగి యింటికి, బరువు వాఱి.

50


ఆ.

మ్రొక్కినట్టి తనయ మూర్ధంబు మూర్కొని
ప్రమదభాష్ప మురుల బ్రాహ్మణుండు
చేత వెన్ను నిమిరి నాతల్లి నినుఁ గంటిఁ
గా యటంచు నింటి కడ వసింప.

51


తే.

రంగపతి బ్రహ్మ రుద్రుల బ్రాహ్మి గౌరిఁ
దనకుఁ నక్కన్య నడిగింపఁ బనుపుటయును
వారు సేనేశసహితులై వచ్చుటయును
విష్ణుచిత్తుఁడు సంభ్రమాన్వీతుఁ డగుచు.

52


వ.

విష్వక్సేనపూర్వకంబుఁగా వినయంబున నాతిథ్యం బొసంగి యుచితాసనం
బుల నాసీనులై యున్నవారి యాగమనప్రయోజనం బడిగి తెలిసి ప్రమదరస
భరితాంతరంగుండై యిట్లనియె.

53

గోదాదేవి శ్రీరంగనాథుల వివాహము

క.

ధన్యుఁడ నైతిం దన కీ
కన్యక నీఁగాంచి భృగువు గౌరవముఁ బయో
ధిన్యాయము నొదవె నిటే
నన్యాయంబే? చమూప హర విధులారా.

54


క.

వినుఁ డీఁ దగు సంబంధవు
టెనయికఁ గని మోచి తెచ్చి యిచ్చె ననరె చు
ల్కని నరులు; గాన మాపుర
మునకు న్విజయంబు చేయఁ బుత్త్రిక నిత్తున్.

55


తే.

ప్రభుతఁ బరమేశ్వరుం డైనఁ బత్ప్రపన్న
జనమున కొసంగు మీకు నీ చనవు శౌరి

తానె కట్టిన భూమికఁ దాల్చు మాకు
ఘనత యిది మమ్ముఁ జేయుట తనదు ఘనత.

56


తే.

అనినఁ జని విన్నవింప దయారసార్ద్ర
చిత్తుఁడై విశ్వభర్త పక్షిప్రధాన
పౌపవాహ్యంబు నెక్కి బ్రహ్మాదిసురలు
బలసి తమతత్తడుల నెక్కి కొలిచి రాఁగ.

57


క.

నాసీనుఁ డగుచు సూత్రవ
తీసఖుఁ డుడువీథిఁ బౌఁజుఁ దీర్చిన ప్రజ భూ
షాసి శతకోటి శతకో
టీ సవితృప్రభలు దిశల డెప్పర మలమన్.

58


వ.

శ్రీవిల్లిపుత్తూరికింజని విశ్వకర్మ మణిమయంబుగాఁ గట్టిన విడిదిపట్టున విడిసి
యయ్యాదిమవరుండు దివ్యాప్సరసలు హరిద్రాదికస్నానీయమంగళద్రవ్య
మండనం బొనర్పఁ బెండిలికొడుకై దివ్యవాదిత్రంబులు నారదాది దివ్యముని
గానంబులు వెలయం గలధౌతధవళధారాధరంబులు గురియు సుధాధారల
నభిషిక్తుండై ముక్తావళీకౌస్తుభాముక్తకంబుకంధరుండును గేయూరకంకణా
లంకృతుండును మకరకుండలమకుటాది భూషావిభూషితుండును దివ్యాంగ
రాగరూషితుండును బీతాంబరసంవీతుండును దులసీకల్పతరుప్రసవన్ర
గాశ్రితోరస్కుండునై యుండు నంత, నక్కడ నటకు మునుప గృహప్రవే
శంబు సేసి సంభ్రమాయత్తుండు విష్ణుచిత్తుప్రయత్నంబున.

59


క.

శర్వాణీవాణీముఖ
గీర్వాణీకోటి జానకీరఘుకులరా
ట్పూర్వాచరిత వివాహా
ఖర్వసుగీతములు పాడఁగా విభవమునన్.

60


తే.

నెమ్మి నేకావళియు స్రగ్విణియును జామ
రంబు లిరుగెడ నిడ హరిద్రాద్రవమునఁ
బెట్టిరి నలుంగు లక్కన్యఁ బెండ్లికూఁతుఁ
జేయ ఋషిపత్ను లర్థి నాశీర్యుతముగ.

61

తే.

అట్లు వైవాహికపుదీక్ష యమరఁ గమ్మ
నూనెఁ దలయంటి నెఱులు గందానఁ బులుమ
స్వర్ణమణికుంభహిమవారి జలక మాడి
నట్టి జగదీశ్వరికి వేల్పుటబలయోర్తు.

62


క.

తడియొత్తి నన్నవలిపం
బిడి మణిపీఠస్థయైన యింతి మెఱుఁగు పె
న్నిడుదకురు లార్చి ధూపం
బిడి తుఱుము ఘటించె నొకమృగేక్షణ నెమ్మిన్.

63


సీ.

యావకద్రవమున నరుణాంఘ్రి నఖపంక్తు
                   లభ్యక్తములు సేసె నతివయోర్తు
నయకల వ్రేళ్ళమట్టియలుఁ బిల్లాం డ్లిడి
                   పాయపట్టముఁ బెట్టెఁ బై నొకర్తు
నెఱికపట్టి పసిండి నీటివ్రాత చెఱంగు
                   వెలిపట్టు రహిఁ గట్టె వెలఁదియోర్తు
కటిసీమఁ గనకమేఖలఁ జేర్చి తారహా
                   రములు గీలించెఁ గంఠమున నోర్తు


తే.

కటకములు హస్తసరము లంగదము లంగు
ళీయకములును బాహువల్లికల వ్రేళ్ళ
నిలిపి తాటంకనాసామణుల నమర్చి
చొనిపె సీమంతవీథిఁ జేర్చుక్క యోర్తు.

64


క.

కలికి తెలిగన్నుఁగవఁ గ
జ్జలరేఖలు దీర్చి మేన సారంగమదం
బలఁది లలామక మిడి చెం
గలువలు క్రొవ్వెదకు వేఱొకర్తు ఘటించెన్.

65


వ.

ఇట్లలంకృతయై యుండ లగ్నం బాసన్నంబయ్యె నని విన్నవించుటయుఁ బన్నగ
శయనుండు మార్తండమండలంబులు పండ్రెండును దివియలై వెలుంగఁ
దారకలగుంపు జగజంపుగా శతపత్త్రశత్రుం డాతపత్త్రత యంగీకరింప,
సింధువతి సౌగంధికదళోపహారసహితంబుగా విపణిఁ గలయంపిఁ జిలికింపఁ

బ్రకృతికాంత క్రంత సురకాంతలం గూడుకొని సంతరింప, హుతవహుం
డగరుధూపంబు రేఁపఁ, బర్జన్యుం డుల్లెడయిడఁ, బ్రాచీనపాఠంబులు పాఠ
కౌఘంబులయి బిరుదప్రబంధంబులు పఠియింప, విధినందనసనందనాదులు
సంగీతమాంగల్యంబున నంతరంగంబున కింపొసంగ, విహంగవుంగవుండు
మత్తమాతంగంబై ఖచితమణికల్యాణం బగు పల్యాణం బంగీకరింప,
నప్రాకృతవైభవంబునం జని, పరమసంభ్రమంబున భాగవతవతంసంబు
భక్తికలితబహుప్రణామపూర్వకంబుగా నెదుర్కొన నెక్కిరింత డిగ్గి విష్వ
క్సేను కరం బవలంబించి కక్ష్యాంతరంబులం జంచలాక్షులు గడుగు నడుగుల
జలంబులకుం బయిపయిం బడి గీర్వాణసిద్ధసంఘంబు లహంపూర్వి నుర్వి
నిఠ్వారిగా నూర్చికొని ప్రాశింపఁ బ్రవేశించి తదీయనిర్దిష్టం బగు జాంబూనద
పీఠంబున నుపవిష్టుండై యతండు వెండియు బంగారభృంగారుకంబులఁ గనక
భాజననిక్షిప్తంబు లగు కుశేశయపేశలపదకిసలయంబులు గడిగి షోడశోప
చారసహితంబును సపరిష్క్రియంబు నగు మధుపర్కంబు నొసంగం
గొని యయ్యాళ్వారు దేవేరియుం దానును ధారవోయ నా కన్యకారత్నంబుఁ
బరిగ్రహించె ననంతరంబ.

66


మ.

కలధౌతద్రవచిత్రము ల్మెఱయ ముక్తాన్యూత మౌ మేచకాం
చలపుం బెందెఱ వారి లగ్నము సమాసన్నంబుగా వేల్పుఁబె
ద్దలు పంపన్ గుడ జీరకంబులు సముద్యత్ప్రేమ నన్యోన్యమం
జులమస్తంబుల నుంచి రర్థిఁ గనుమించు ల్చిఱ్ఱుము ఱ్ఱాడఁగన్.

67


చ.

మణి వనమాలి చూడమున మానిని ముత్తెపుఁబ్రాలు వోయుచో
మెఱయుఁ దదంగుళీకిసల మేళనఁ జక్రి చెమర్ప రాలి మై
నఱిమఱి ఘర్మబిందువులు నమ్మణులు న్మొగిలందునుండి డా
ల్గిఱిగొన జాఱు ధారల బలె న్వడగండ్లబలె న్గనుంగొనన్.

68


తే.

ఇంతి దోయిట సేసఁబ్రా లెత్తుచోట
గుబ్బపాలిండ్లక్రేవ గ్రక్కున మురారి
కన్నువేయుటఁ గని లజ్జ గదుర బాహు
లెత్తక కరాగ్రములన పై కెగురఁజల్లె.

69


క.

గళమునఁ గట్టెను హరి మం
గళసూత్రము పులక లతివ గాత్రముఁ బొదువన్
నెలఁతయుఁ బతియును గరముల
నలవఱిచిరి కంకణంబు లన్యోన్యంబున్.

70

సీ.

లలనచే నిష్ఠతో లాజలు వేల్పించి
                   శార్ఙ్గి మెట్టించెను సప్తపదులు
తెఱవఁ గూడి యరుంధతీదర్శనముఁ జేసె
                   బ్రహ్మరుద్రాది గీర్వాణకోటి
యర్పించు నుడుగుర లనుకంపఁ గైకొని
                   యనిచెఁ బ్రసాదభాజనుల జేసి
[2]యాత్మపట్టణమున కతివఁదోడ్కొని విజ
                   యంబు సేసెను మహాహర్ష మొప్ప


తే.

సహ్యకన్యాతటోద్యానచందనద్రు
కుంజముల నీలకుంతలఁ గుస్తరించి
కంతుసామ్రాజ్య మేలించి కరుణఁ జిత్త
మొలయ జగములఁ బాలించుచున్నవాఁడు.

71


ఉ.

స్కందసరస్తటీరమణ కందర చందన కుందవాటికా
మందసమీరలోల వనమాలిక! నిర్మలదివ్యవిగ్రహా
స్పందివిభాధరీకృత నభస్స్ఫుటకాళిక! వల్లవాంగనా
బృందమనోభిమాన ధృతి భేదన! పేశలవంశవాదనా!

72


క.

అరిధారాఖండిత మరు దరిసంఘ, విహంగవాహనా, యుదరమహాం
బురుహ పుటభరిత మధుశం, బర భర జలమానుషాయమాణద్రుహిణా.

73


స్రగ్విణి.

వాలినిర్భేదనా! వారిజాతేక్షణా!
శైలకన్యాస్తుతా! శార్ఙ్గ చంచద్భుజా!
ఫాలద్రుక్పద్మభూపాకభేదిస్ఫుర
న్మౌళిమాణిక్యరుఙ్మండితాంఘ్రిద్వయా!

74


మ.

ఇది నీలాచల నీలచేలక సుభద్రేందీవరాభాక్షి కో
ణ దృగంచత్‌ భుజ వీర్య ధుర్య జయ సన్నాహార్భటీ వాద్య భీ
త్యుదితేభేశ్వర కృష్ణరాయ మహిజా న్యుత్పాదితాముక్తమా
ల్యద నాశ్వాసము సప్తమంబలరు హృద్యంబైన పద్యంబులన్‌.

75


సంపూర్ణము

శ్రీకృష్ణార్పణమస్తు

ఓం తత్ సత్

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.

 
  1. భూతప్రకర
  2. యాత్మపట్టణమున కతివైభవంబున / నతివఁదోడ్కొని విజయంబుచేసి