ఆముక్తమాల్యద/షష్ఠాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

ఆముక్తమాల్యద

షష్ఠాశ్వాసము

క.

శ్రీకారి కృపార్ద్రేక్షణ
వైకుంఠ యకుంఠ భక్తివరదపదాబ్జా
స్తోక మరందాయిత గం
గా కాకోదర నగోదయస్థ పతంగా.

1


వ.

అవధరింపు మనంతరవృత్తాంతంబు.

2

మాలదాసరి

చ.

కలఁ డొకరుండు పేరుకొనఁగాని కులంబు మదీయ భక్తుఁ డి
య్యిల మును వాఁడు వామనత నే వసియింపనౌ పుణ్యభూమినం
దు లకొక యోజనత్రయపు దూరపుటూర వసించి బ్రహ్మవే
ళలఁ జనుదెంచి పాడు మము లాలస మంగళకైశికిన్.

3


వ.

అహరహంబు నమ్మహాత్ముండు.

4


క.

జాత్యుచితచరిత్రను
మత్ప్రీత్యర్థం బూఁది తనదు హృదయము శుచితా
నిత్యంబుగఁ దత్తనుసాం
గత్యము మసిపాఁత మానితంబై యొదుఁగన్.

5


సీ.

చమురైన తోల్కుబుసంబు టెక్కియును ని
                   త్తడిశంఖ చక్రకుండలము లమర
దివెదారికొమ్ముఁ దోల్తిత్తియు జోడమ్ము
                   మెడమీఁది మొగలాకు గొడుగుఁ దనర

మత్పాదరక్షయ మావు పెన్వెఱకఁ గు
                   ట్టిన యోటి తిపిరిదండెయును మెఱయఁ
జిటితాళములు సంకపుటిక నొక్కొకమాటు
                   గతిరయంబున దాకి కలసి మెరయ


తే.

వలుద వనమాలకంటెయు మలిన తనువుఁ
బట్టె తిరుమన్ను బెదురు గెంబుట్టుఁజూపుఁ
బసుపు బొడితోలువల్లంబు నెసకమెసఁగ
వచ్చు సేవింప సురియాళు వైష్ణవుండు.

6


శా.

గండాభోగముల న్ముదశ్రులహరు ల్గప్ప న్నుతు ల్పాడి యా
దండ న్వ్రేఁగులు డించి భక్తిజనితోద్యత్తాండవం బాడు, నా
చండాలేతరశీలుఁ డుత్సలకుడై చాండాలిక న్మీఁటుచున్,
గుండు ల్నీరుగ, నెండ గాలి పసి తాఁకుం జూడ, కాప్రాహ్ణమున్.

7


తే.

అట్లు దడపుగఁ గోల్చి సాష్టాంగ మెఱఁగ
గర్భమంటపిఁ గడిగిన కలఁకజలము
లోని ఱాతొట్టి నిండి కాలువగఁ జాఁగి
గుడి వెడలి వచ్చునది శూద్రుఁ డిడఁగ గ్రోలి.

8


ఉ.

ఆతఁడు ముఖ్యజాతిఁ గని సంతన పాయుచు, నెండ గాలి నెం
తో తడవుం ప్రసాదవినియోగము వార్చి వసించుచుం, ద్రిద
ర్ణేతరజాతి మెచ్చి దయ నిడ్డ ప్రసాదము దండె సాఁచి శ్ర
ద్ధాతిశయంబునన్ వినతి నంది, భుజించుఁ, గొనుం దదంబువున్.

9


వ.

ఇట్లు దన దివాకీర్తి జని నగు పరమార్తి నైచ్యంబు సకలజనశోచ్యంబుగా
గుడి లాఁపరాతూపరాణి కడ నిలిచి బహిరావరణప్రదక్షిణంబ కావించి '
ప్రొద్దెక్క నిజపక్కణంబునకుం బోవుచుండు, నిట్లుండి యొక్కనాఁడు.

10


క.

అద్దమరే యద్దాసరి
యద్దండ బిడాలగాహితాలయకృకవా
కూద్దండరవము విని చను
ప్రొద్దాయె నటంచు బాడఁబోవుచుఁ ద్రోవన్.

11

ఆ.

మరులుఁ దీఁగ మెట్టి యిరు లన్న నో యని
యెడు తమిస్రఁ గాడుపడి పొలంబు
లెల్లఁ దిరిగి తూర్పు దెల్ల నౌతఱి నొక్క
శూన్యగహనవాటిఁ జొచ్చి చనుచు.

12


సీ.

ఇడిసిన యిడుపుల యెడలఁ బొట్రే నుత్త
                   రేను గసెంద కోరింద పొదలఁ,
గెడసిన గరిసెల క్రింద లాఁగలఁ గ్రుస్సి
                   యదవకాఁపురముండు నాఖుతతుల,
సగము దుమ్మునఁ బూడి చిగురింత వామూయఁ
                   బెరిఁగిన నూతిపాఁతర బొఱియలఁ,
జీమలు ప్రాలీడ్వఁ జివికిన వెలుగు ప
                   ట్టునఁ బండి యెండి క్రుంగిన గునుకులఁ,


తే.

బెంటదొగ్గళ్లలోఁ గడు వంటి శ్మశ్రు.
చలనములఁ గ్రుక్కు జీర్ణోతువులఁ బొలంబు
దుండుగల మళ్ళ యౌరులఁ దూలి రాడు
చిక్కునేతాల పాడఱు సీమఁ జనుచు.

13


క.

అపమార్గత నరుగుచు మా
ర్గపు ధామార్గావపుఁ గంటకంబులఁ గాళ్ళు
విపరీతత నూడ్చుచు నే
రుపున న్బల్లేరు లీడ్చి త్రోయుచుఁ జనుచన్.

14


శా.

కాంచె న్వైష్ణవు డర్ధయోజనజటాఘటోత్థశాఖోపశా
ఖాంచజ్ఝాటచరున్మరుద్రయదవీయఃప్రేషితోద్యచ్ఛదో
దంచత్కీటకృతవ్రణచ్ఛలనలిప్యాపాదితాధ్వన్యని
స్సంచారాత్తమహా ఫలోపమఫలస్ఫాయద్వటక్ష్మాదమున్.

15


ఆ.

కాంచి యాతఁ డొక్క కాలిత్రోవయు నంతఁ
గాంచి యందుఁ దెరువు గాంచినదియ
పరమలబ్ధి గానఁ ద్వరితంపుగతి నవ్వ
టావనీజ మంత నంతఁ గదిసి.

16

సీ.

ఎలనీటి బొండలంబులువోలె
                   మెదడెల్ల జుఱ్ఱి వైచిన డొల్లు పుఱ్ఱె గములు
నెఱచి గీఱిన జీర లేర్పడఁ దుదముట్టఁ
                   జీఁకిన నులిపచ్చి కీకసములు
దొనదొన యను నీఁగెతుట్టెల రూ పేఱు
                   పడక క్రంపలను వ్రేలెడు గరుసులు
దూళ్ళ మక్కెక్కి మంగళ్ళతిప్పలు రేఁగు
                   వడువున గాలి నాడెడు నెఱకలుఁ


తే.

దునిసిన నరాంగకములఁ బొత్తులను గమిచి
పోక యొండొంటితోఁ బోరి పీకులాడు
శ్వాపదంబులుఁ, బదహతి వ్రస్సి వలుచు
పరుగు దఱచగు ముఱుత్రోవ నరిగి యెదుట.

17


సీ.

ముంగాళ్ళఁ జాగి పై మ్రుచ్చుఁజూపులు పర్వ
                   బొమిక లెత్తుచుఁ బాఱిపోవు శునులఁ,
బలలతోరణములు వట్టి బిట్టెగయ శా
                   ఖాధూతి నెగయు కంఠములరొదల,
నడ్డంబు దిరిగి తలాహతిఁ బడి రొండి
                   హస్తంబు లిడి యంగ లార్చుకపుల,
డబ్బాటుమై నొక్కెడలు సూపి యవి మాయ
                   నడగఁ వేఱెడఁ జూపు వ్యాపృతులను,


తే.

కని యెవఁడొ యొక్కరుం డిందుఁ గలఁడు, వాఁడు
నరుఁడు గాఁ, డింధనాదికాహరణమునకు
వేళయును గాదు, పొలగాలి వీచెఁ, దెరువు
నెడ, పనుచు జాలిగొని సంశయించువేళ.

18


సీ.

మృతమర్త్యు రెంటాన నిడ్డఁ జాలక నెత్రు
                   రంజిల్లు పెనుపొట్ట ముంజివానిఁ,
బల్లచీమల వక్రభల్లాతకియుఁబోలె
                   నెఱ్ఱదుప్పటి నొప్పు కఱ్ఱివాని,

వ్యత్యస్త హస్తిమస్తాభఁ బాయగు గడ్డ
                   మును దంష్ట్రికలుఁ బొల్చు మొగమువానిఁ,
గడుఁదుర్ల నిడుత్రుట్టెగతిఁ జొంగలోఁ బాండు
                   రత మించు కపిలకూర్చంబువాని,


తే.

నెఱకుఁదెరువరిఁ గన శాఖ లెక్క జాఱు
ప్రేవుజందెంబుఁ గసరి పైఁ బెట్టువాని
వ్రేలు డగుబొజ్జ గల బూరగాలి వానిఁ
జెంబుదలవాని నవటుకచంబువాని.

19


తే.

కండకన్నులవాని, నాఁకటను బండు
తిట్ల బేతాళికల సారెఁ దిట్టువాని,
నగగరిమవాని, నన్వర్థ నాముఁ, గుంభ
జాను వనునొక్కద్విజనిశాచరునిఁ గనియె.

20


ఉ.

వాఁడును గంటిఁ బోకుమని వ్రాలె మహి న్విదపాళి నుగ్గుగా
వీఁడును మున్ను రేపగటి వేళకు మానిసియౌటఁ బోరిలో
వాఁడిమిఁ గొంతకాల మిల వ్రాలుట లావరి యౌట నిల్చి యా
వాఁడిశరంబుచే నడువ వాఁ డది ద్రుంపుడు వీఁడు నుద్ధతిన్.

21


సీ.

తిగిచిన నడుగులు దెమలక ఱొ మ్మప్ప
                   ళించి యవ్వలికిఁ జండించి దాఁటి,
చఱచిన వంచించి చరమభాగమునకై
                   తిరిగి, తత్క్రియ కగు దృష్టి నిలిపి,
పైబడ్డఁ జనుమర పట్ల కొడ్డుచునుండు
                   పిడికిళ్ళ బలిమి లోఁబడక నిలిచి,
చొరఁజూడ గ్రుంగి ముష్టులబిగి కోటగాఁ
                   జొరవీక తిరిగెడుచోన తిరిగి,


తే.

యసురవధసాధనము రోయు నపుడు గ్రుద్ది
రాచి తిరిగినఁ గృతముష్టి దండ నిలిచి

యెడకొలఁది [1]వెన్కనడ నొయ్య నడిచి యడిచి
మత్పదస్మృతి యాత్మ నేమఱక యతఁడు.

22


తే.

తాఁచి పోఁజూడఁ దన రాక్షసీచయంబు
నెల్లఁ జీరిన డిగ్గి వా రేఁగుదేరఁ,
బోయే నదె వాఁడు రారె రారే యటంచుఁ
బాఱి వారును దానును బట్టికొనుఁడు.

23


క.

బంబో తద్దాసరి య
ప్డుం బదహతులను గపోణి పోటుల నిరుమై
లం బొడుచుచుఁ బెనఁగుచుఁ బో
వం, బట్టి వటంబుఁ జేర్చి వాఁ డిట్లనియెన్.

24


శా.

సారాస్వాదనఁ బ్రాణపంచకము తృష్ణం బాసి సంతర్పణ
న్మూరింబో నసిఁ ద్రుంచి పొంగెడు భవన్ముండంబు ధారోష్మ మిం
పారం గ్రోలి పిశాచి నీదు కఱకు ట్లందీ నదస్తాలకాం
తారాంతర్నృకపాలకుండవిగళ న్మై రేయముం ద్రాగెదన్.

25


క.

నన్నిం తలయించిన ఖలు
నిన్నున్ ఋజువిధి వధింతునే యని యార్పుల్
విన్నందఁగ బుసకొట్టుచు
నన్నీచుఁడు దగ వెలువడు నవ్యక్తోక్తిన్.

26


తే.

ఆసియుఁ బాత్రియుఁ దేఁ బంచి యాంత్రవల్లిఁ
గోలఁగగ్గెరఁ ద్రోయ నక్కుజముతోడ
నొరగి రక్కసుతో దైన్యవిరహితముగ
ధర్మ మెఱిఁగించు సూక్తి నాతండు వలికె.

27


చ.

విను మొకమాట రాత్రిచర! వేగిర మేటికి? నిన్ జయింతురే
యనిమిషులైన? భాజనగతాన్నను నే నిఁక నెందుఁ బోయెదన్?
బెనఁగక ప్రాణరక్షణ ముపేక్ష యొనర్చుట పాప మిందు కై
కనలకు నాకు మేనియెడఁ గాంక్షయు లే దిది వోవుటే యురున్.

28

ఆ.

హీనజన్మ మఱుట యెవ్వఁడే నొకప్రాణి
సంతసిలుట ముక్తి పొంత గనుట
మేలె కాదె శిబియ మేల్బంతి గాఁడె న
శ్వరపుదేహ మమ్మి పరము గొనుట.

29


చ.

తెవు లయినం, గ్రహం బయిన, దే లయినం, గర మైన, నాత్మ పెం
దెవు లయినన్, జలం బయినఁ, దెక్కలి యైన, మృగాగ్ను లైన, మే
ల్తవు లయిన, న్వ్రణం బయిన, ద్రాఁ చయినన్, బిడుఁ గైనఁ దీర్చు పే
లవ తను వూర కే చెడ కిలన్ గృశు నొక్కనిఁ బ్రోచు టొప్పదే.

30


వ.

అది యట్లుండె, నింకొక్క హితంబు సెప్పెద, నదియును బ్రాణభయంబున
నాడు కార్యవశంపు మాటగాఁ దెలియక, మాధ్యస్థ్యంబకాఁ దెలిసి, వినుము.
వినకున్న భూతహితంబుఁ గోరి యుచ్చరించు మాట కీశ్వరుండైన మెచ్చుఁ
గదా? వ్యాఘ్రసింహవరాహవృకజంబుకాది శరారువులయం దొక్క తిర్య
క్కవుగావు; దేవయోనివి, నీకును మాకుంబలెఁ గరచరణముఖాపఘనం,
బులు గలవు; మాటలను మాయట్ల యకర్తవ్యతావిచారంబులు సమానంబ;
హా మఱచి యంటి; స్థావరంబులకంటె గీటాదులకు, వానికంటె మఱి
మృగాదులకు, వానికంటె మఱి పశుపతంగాదులకు, వానికంటెను మాకును,
మాకంటెను మీకును, గరణకళేబరాదిపాటకం బెక్కుడు, విజ్ఞానంబును,
ఘనం; బిట్టి నీ కేకాంత కుత్సావహంబు బీభత్సవధ్యావధ్య పథ్యాపథ్య
భక్ష్యాభక్ష్య పేయాపేయ వివేకంబులు లేకునికి యుక్తమే? రుచి గాదు,
శుచిగా దీదురాహారం; బిదియు సకలదురితావతంస యగు హింస నొనఁగూడు
నది. హింస పరలోకంబునం గదా బాధకంబు, పరలోకంబు ప్రాణాంతంబునం
గదా; చిరస్థిరప్రాణులమగు మాకేల హింసాభయం బనవలదు; ప్రాణ
భయంబు మనుషుల మగుమాకు నేఁడైన, మీకు మఱునాఁడైన నవలి
నాఁడైనఁ దుద యుగాంతంబునందైన నిడువు గుఱుచల నెప్పుడుఁ దప్ప,
దంతవత్త్వంబునకుఁ దారతమ్యం బేమి; మున్నీటనైనను మునుంగుట సరి
యగుటఁ బర్వతంబునకుం బరమాణువునకు నేమి యంతరంబు? మీఁదు
విచారింపవలవదే? తపోలబ్ధవరాదులం బూర్వంబునం గీర్వాణుల మదం
బడించి హెచ్చిన హిరణ్యకశిపు దశముఖాదులు శతసహస్రసంఖ్యాకసంవత్స
రంబులు జీవించియుం బంచత్వంబుఁ బొంది తారు మున్ను జయించిన జము

చేతనే చిక్కరే? యిక్కడికి వీరు ప్రబలులరైన నక్కడికి వాఁడు ప్రబ
లుండు, సకలభూతతారతమ్యంబును నిజనిజస్థానవిశేషంబునన వచ్చు,
నచ్చండాంశుసుతునివీట మేరఁ దప్పిన మాకుం దప్పనియట్ల బాధ మీకుం
దప్పదు. మీరు నాసౌరిముఖ బర్హిర్ముఖులు జాతిఁ దలపోయ భ్రాత; లట్లయ్యుం
బరంబున మీరు వారు బాధ్యబాధకతల నొందుచున్నా రీతైజసంబగు తార
తమ్యంబునకుం దనుస్సత్త్వంబులు హేతువులు, వాని కాహృతులు హేతు
వులు, వ్యాహృతులం గ్రతువుల చరుపురోడాశాపవతుల భుక్తులం బవిత్రులై
యమర్త్యత మీకంటె నతిదీర్ఘకాలఁబు వారు జీవించెద. రప్పావనత చూచి
కదా చతుర్ముఖాంశజుం డగుసుధాంశుండు గరంగి సకలరసముల కవధి
యగు సుధారసంబున నాప్యాయనం బొనరించుచున్నవాఁ. డేతదర్థంబు మా
కుచ్చరించరాదుగాని వేదఁబు ప్రథమకళ యనలుండు తావు నని చెప్పు
మఱియు నాయాకళ లాయావేల్పులకుం గ్రమంబునం జెప్పు. నింత విచా
రించి రుచించినట్లు నడువు; మనఁ, గహకహ నవ్వి యద్దాసరికి సురద్రోహి
యిట్లనియె.

31


క.

చంపకు చదువుల, మేము ప
ఠింపని శాస్త్రములె? మాపఠింపని శ్రుతులే?
యింప నవి నమ్మవేఁ 'బ్రథమాం
పిబతే వహ్ని' యనెడుమాటవుఁ గాదే.

32


మ.

నిలు మోహోమము వారి భ్రాత లనుచున్ నీవంటి; వార ల్సుధా
శు లపూతాశులు గా రటంటి, ప్రతిపత్సోమాంశము న్గ్రోలు మున్
జ్వలనుం డం, టిఁక నొండు ని న్నడిగెదన్? సర్వాశి గాఁడా, యతం
డిలఁ దన్న్యాయము చాలు, మాకు నఘమే? వృద్ధానుచారం బిఁకన్.

33


తే.

హరికి సఖుఁడును రథమును నగు గరుడుఁడు
దొరకి నమృతంబు సురలకు మరల నిచ్చి
యహులు గూడుగ వరమున నడిగికొనఁడె?
యమృత మైనను జవుల జాత్యన్నసమమె?

34


చ.

నిదురయుఁ గూడుఁ బోఁ జదివి, నే నిటఁ గన్నది యేమి? యెవ్వఁ డీ
చదువుల యర్థవాదపు మృష ల్విని బేల్పడు, నీవు మాయెడం

జదువులమాట లాడి కనఁ జాల వొకానొక మెచ్చు, నొక్కఁ 'డీ
చదివిన కూర వింతచవి, చాలఁగఁ, దె' మ్మను మెచ్చు దక్కఁగన్.

35


వ.

అని గీష్పతి మతం బవలంబించి నిజాలాపహేళనపరుఁడైన రక్కసు కుత
ర్కోక్తులకుం గృష్టస్మరణంబు సేసి యిందులఁ బొందుపడు ప్రత్యుత్త
రంబుల వీనిఁ గెలఁకిన బుద్ధి క్షోభంబుగా, నింతకంటే నేమి యబద్ధంబులు
వినంబడునో, మీఁదఁ గార్యంబు గల మాకు దీనిఁ గాదనం బని లే, దని
యందంబుఁ గూడ కొని, ఛందోనువర్తనపరుండై, నీచసంస్మృతికి రోసి,
తన్ముఖోల్లాసంబునకు శబ్దచ్ఛలంబున నంతర్గతంబున సుగతు నిడుకొని నీవు
సర్వజ్ఞుడ, వేను నరుఁడ, హీనకులుండ, ననభ్యస్తశాస్త్రుండ, నీ
కుత్తరం బీ శక్తుండనే, మద్వచనస్థాలిత్యంబులు సహించి దయచేసి నమ్మి
మత్ ప్రార్థనంబు గావింపుము.

36


శా.

ప్రఖ్యాతుండవు దైత్యులందు మును, పా పైనొక్క నీకా యశో
భిఖ్య న్నేనును జేర్తు, మే యొసఁగుఁ దప్పింప, న్వ్రతం బొక్కఁడే
ముఖ్యంబై యొనరింతు, దాని సఫలంబు న్సేయఁగా లేవుఁగా,
‘సఖ్యం సాప్తపదీన” మ న్మన మిథ స్సాంగత్య మూహించుచున్.

37


వ.

అది యెద్ది యంటేని.

38

దాసరి యొట్టుపెట్టి తప్పించుకొని కైశికసేవకు పోవుట

క.

ఈకుఱఁగటి యీ కుఱుఁగుడి
వైకుంఠనిఁ బాడి వత్తు వ్రతముగఁ, దత్సే
వాకృతికడవట నశనము
నీ కౌదు; న్ముఖ్య మిదియ నేఁ డగు దుదకున్.

39


ఉ.

అంచు నతండు పల్క, దరహాసితఁ జెక్కిలిఁగొట్టి లెస్స పం
డించితి వోయి దాసరి, వనిం దెరవాటులు గొట్టికొట్టి మే
న్వెంచి విరక్తి దాసరివి, నిన్నఁ గదా యయినాఁడ, వీ మమున్
గొంచెముఁ జేసి త్రాడ్గొఱికికోఁ దలపోసెదు, మెచ్చితి న్నినున్.

40


శా.

ఏరాజ్యఁబు నరుండు నోరి కడివో నీబోధ మాలించు? నిం
కేరాజ్యంబు నరుండు బాసకయి మే నీఁ దాన యేతెంచుఁ? దీ

పార న్నేఁ జననీమియు న్మగిడి నీవా రామియుం దెల్ల; మే
లా రంతు, ల్పలుపల్కు లంత్యకుల, యేలా చింత, లేలా వగల్.

41


తే.

అనిన జెవిఁ మూసి నారాయణా యటంచు
నతఁడు నను నమ్మవే బిశితాశి? యొక్క
శపథమున నమ్ము మని వాఁడు సమ్మతింప
వేనవే ల్సత్యములు వల్కి వినకయున్న.

42


ఉ.

"ఎవ్వని చూడ్కిఁ చేసి జనియించు జగంబు, వసించు నిజ్జగం
బెవ్వని యందు, డిందు మఱి యెవ్వనియం దిది, యట్టి విష్ణుతో
నివ్వల నొక్కవేల్పు గణియించిన పాతకి నౌదు నేఁడ నే
నెవ్విధినైన నిన్గదియనేని," యన న్విని బంధ మూడ్చినన్‌.

43

దాసరి మరలుట

చ.

అతఁడు తదల్పపాపఫల మందుట సుంకము దీఱి పోయి, త
చ్ఛతదళపత్త్రనేత్రునకుఁ జాఁగిలి మ్రొక్కి, రణద్విపంచి యై,
స్తుతికలితప్రబంధములఁ జొక్కఁగఁ బాడి, యసత్యభీభర
ద్రుతగతి వచ్చి, రాత్రిచరుతో వ్రతపూర్తి గతార్తి నిట్లనున్.

44


ఉ.

నీ చెఱఁ బాసి, పోయి, రజనీచర, చక్రి భజింప, ముక్తి పొం
దేచెర, యే చెఱం దవుల నే, నిఁక నుండఁగ జూడు, పంచుచో
నేచరణంబు లేయుదర మేయుర వేశిర మేకరంబు, లీ
నా చరణంబు లాయుదర మాయుర మాశిర మాకరంబులున్.

45


తే.

అనిన దత్సత్యమునకు నేత్రాంబు లురులఁ
బ్రమదపులకితగాత్రుఁడై పాఱు టసుర
యినుని మధ్యందినపుటెండ దనదు పెద్ద
బట్టతల మిందఁ బ్లవుఁ జేరఁ బాఱుతెంచి.

46

దాసరి బ్రహ్మరక్షస్సు ననుగ్రహించుట

ఉ.

కొండయుఁబోలె భక్తి వల గొంచునె, వాఁడు నిజద్రుమభ్రమీ
హిండన వ్రాలుపాకలపుటేనుఁగుఁబోలె, నొస లదంఘ్రులం

దుండ, రొద న్మహాగిరులు హోరనఁ, బ్రస్తుతి వ్రాలి, దంష్ట్రి కా
దండము లెత్తి పట్టిన పదం, బొకఁ డొక్కఁడ నెత్తి జేర్చుచున్.

47


శా.

“ఈ సర్వంసహ దేవదానవమహీభృన్మౌనివాచాతప
శ్శ్రీసర్వస్వము నేతదన్యకృతులం జెప్పంబడు, న్ఘోర మౌ
నీసత్యం బురరీకృతాంత, మిల నెం తే వృద్ధనై మంటినే,
నాసత్యం బిఁక నిన్నుఁబోలు కృతసంధా ధూర్వహు ల్లేమికిన్.

48


చ.

ఇతరులు నీకు నీడె మఱి? యీధృతి, నీస్మృతి, నీఋతేరిత
స్థితిగతి, నీమురారిపదసేవన జీవనవన్మతిన్, సమా
దృతకలగానసింధులహరీప్లవనప్లవభావభాగురు
శ్రుతితతబద్ధతుంబికిఁ గురుంగుడినంబి కృపావలంబికిన్."

49


తే.

అనిన నాతనిఁ గౌఁగిట నునిచి పలికె,
వ్రత మొనర్పించి తని భాగవతవతంన
"మోయి రజనీచరేంద్ర నీ యురుకృపాక
టాక్షమునఁ జేసి ధన్యుఁడ నైతి ననఘ.

50


ఉ.

బాసలు బండికండ్లు, మఱి ప్రాణభయంబున లక్ష సేసినం,
గ్రాసము కృచ్ఛ్రలబ్ధ, ముడుగ న్వసమే? యిది నీక చెల్లె, నో
భూసురవంశ్య పుణ్యజన పుణ్యజనాంకము దావకీనమే
పో, సమకూరెడిం గులము పొత్తున దైత్యులకెల్ల నంకతన్.

51


చ.

కడుపు మహాక్షుధ న్నకనకంబడ న స్మృతకృత్యుఁ జేయఁ బో
విడిచితి, వేము జాత్యముగ వేధ విధించిన కూడు మీకు, నీ
యెడ నొకకీడు గల్గ, దిఁక నే మనిన, న్మఱి నీకు నాన నూ,
బడలిక దీఱ నిత్తనువుఁ బారణసేయుము మైత్త్రి గల్గినన్.

52


క.

ఈమాట న్బొరపొచ్చెము
లేమికి నీశ్వరుఁడ కరి నిలింపనిరోధీ,
నామెయి మేదోమయ దృ
ప్తామిషములు మెసవు" మన్న, నతఁ తను నార్తిన్.

53


శా.

"ఎట్టూ? యిట్టగనయ్య పల్క దయలే? కిన్నాళ్లు నీకూడె యీ
పొట్టం బెట్టి, మహాఘలబ్ధిఁ దనువుం బోషించి యెన్నాళ్ళ కే

నట్టే నొక్కతపస్వి యొక్కప్రతి రాఁడే, చూడఁడే, తత్కృపన్
బుట్టు న్నీఁగెద దీని, నా నొదవి, యో పుణ్యాత్మ యిట్లంటివే?

54


క.

మీవంటి భాగవతులుం
బావనులుగఁ జేయరేని మఱిగతి యేదీ
మావంటివారి కిఁక మా
యేవము వెనుకటిది చూడ కీక్షింపు కృపన్.

55


తే.

స్వధితియైనను ద్విజుఁ దిన్న శస్త్ర మైన
సరియకాఁ గాంచనమ చేయుఁ బరుసవేది,
యీయసాధారణన్యాయ మెన్నవలదె
మాదృశులచోటఁ గదియు భవాదృశులకు?"

56


తే.

అనిన దేహార్పణము నొల్ల కార్తిఁ బలుకు
కృపణత కతఁ డభిప్రాయ మెద్ది యనిన,
"నిత్తుఁ దను వంట యనుకంప యే? మదాత్మ
కసటుఁ బావుటయే యనుకంప గాక.

57


శా.

ఘంటాకర్ణుని మించుకర్మ మొకొ నాకర్మంబు? మౌనీంద్రులం
దుంట ల్సేయఁడె? మాన్పి యీఁడె భగవంతుం డట్టి శ్రీ? యట్టి శ్రీ
కంటె న్భాగవతుఁడు మించ నొసఁగంగా లేఁడె? యా మేలు నా
కంటింప న్మఱి రాదె? పూజనము గాదా ప్రాణిమే ల్చక్రికిన్."

58


వ.

అనిన విని మాతంగుం డాతెఱం గేతెఱంగైన సంగతం బగు ననిన, నాతం —
"డే నొక్క బ్రహ్మరాక్షసుండఁ, గుంభజానుసంజ్ఞుండ, నుగ్రకర్ముండనై,
యీన్యగ్రోధం బాశ్రయించి వంచనం బథికపంచజనచర్వణంబు సేయు
చుండుదు. పూర్వంబున సోమకర్మ యను భూబర్హిర్ముఖుండఁ, బ్రాగ్జని
ద్విజుండఁ గాన దయనీయుండన; యొక్కదుష్కర్మంబున ని ట్లైతి. నీవు కైట
భారిం బాడిన నేఁటి పాట ఫలంబు సజలంబుగా నాకిచ్చి తేని బీభత్సకుత్సార్హం
బగు నీజన్మంబు వేఁగు. నీకు నా రరక్షణంబున నగు సుకృతం బనంతంబు
సిద్ధించు, నత్యంతధర్మసాధనం బగు నిమ్మేను నిల్లుసేరు;" ననిన, నమ్మేని
మాటలకుఁ గల కల నవ్వి యవ్విష్ణదాసుం డిట్లనియె.

59

క.

"ఇటువంటివి యిట కెక్కుడు
నిట దిగుడువి యొంద నెన్ని యే, నిదియును నొ
క్కటి యొకనాఁటిద కా దొక
త్రుటి గీతఫలంబు నొసఁగుదునె యిమ్మెయికిన్?

60


సీ.

దిక్పాలతను వెత్తి తిరిపతనవుఁదోన
                   యెన్నిమా ర్లెత్త మీ యేను నీవుఁ?
గేసరితను వెత్తి కీటతనువుఁ దోన
                   యెన్నిమా ర్లెత్త మీ యేను నీవు?
మాతంగతను వెత్తి మశకతనువుఁ దోన
                   యెన్నిమా ర్లెత్త మీ యేను నీవు?
ధరణీశతను వెత్తి దానతనువుఁ దోన
                   యెనిమా ర్లెత్త మీ యేను నీవు?


తే.

సోమయాజుల మెన్నిమార్ల గాము, శ్వపచ
ఖగకులుల మెన్నిమాఱులు గాము, పాము
గాములము నెన్ని మాఱులు గాము వెండి
కంసరిపుభక్తుల మొకండె కాము గాని.

61


ఆ.

ఊఁతనీరు చెలఁది నేఁతమూటాయిటి
దూది యెండపసువు దొఱ్ఱియక్క
రంబు మేను, దీని రహిఁ బుణ్య మమ్ముట
కప్పురంబు వెట్టి యుప్పు గొనుట."

62


వ.

అనిన దనుజుం డిట్లనియె.

63


క.

“సంగీతఫలంబునఁ గో
సంగీ సగమైనఁ దయ పొసఁగ నీవే; మీన్
మ్రింగినగ్రుక్క న్వారిధి
కిం గొఱఁతయె? కొదయె విష్ణుకీర్తన" కనినన్?

54


శా.

"ఏలా నొంచెద దేహ మిట్లడిగి? యెం తే బాస మేనం బలం
బో, లీలాపటు గీతకీర్తనఫలం బో, నీయెడ న్మున్ను? పా(బే)

తాళప్రశ్నలు మాని, మే న్గొనుడు; బేతాళ చ్ఛలోక్తిన్ రుషం
దూలింపం దలఁతేని, పుట్టు మఱి నూతు ల్ద్రవ్వ బేతాళముల్."

65


వ.

అనిన సాలకటంకటేయుండు సాలఁ గటకటంబడి, కార్యేచ్ఛం గన్నీరు గ్రుక్కు
కొని, “కటకటా! కైటభారి కనుంగు లగు డింగరీలు దయాళువులు గావలవదే?
తొల్లి దర్శనప్రవర్తకుండై వైయాసికంబు లగు సూత్రంబులు వివరించి విష్ట
రశ్రువు నద్వైతవైశిష్ట్యంబుఁ బ్రతిష్ఠించిన లక్ష్మణాఖ్య యోగీంద్రుండు, చిర
కాలసేవాసంతుష్టుఁడై నిజదేశికం తగు పూర్ణాహ్వయుం డనధికారుల కీకు మని
విధియుక్తంబుగాఁ దనకుఁ బ్రసాదించిన గీతాచరమార్థంబుఁ, గృపాతరంగి
తుండై రంగేశధామ దామోదరనామ చామీకరగోపురం బెక్కి, యుచ్చైస్స్వ
నంబున నుచ్చరించినఁ గురుం ఉలిగిన, 'దేవా! దేవరయాజ్ఞ మీఱి యే
నొక్కరుండ రౌరవంబునం బడుట మేలో? భాగవతపరిషత్తునకుఁ బరమపద
మగపడుట మేలో? యని వితర్కించి నీ వుచ్చరించుట గా నుచ్చరించితి' నని
తదభినందింతుం డయ్యె. నతండ నిజచ్ఛాత్రసత్త్రంబునకుఁ బ్రత్యహంబును
గల్యంబున మూల్యం బొల్లక గవ్యంబు సమర్పించి వేఁడిన వల్లవీవల్లవులకుఁ
బరమపదంబుఁ బ్రసాదించె; నతండ బంధముక్తుండయ్యు నవతారాంతరంబునఁ
గాలాంతరంబున సంకుచితజ్ఞానులై విషయపరులగు నరులకుం బరమునందలి
తీపొదవ సుందరజామాతృ నామంబున నర్చిరాదిగతి విశదీకరించె; నతండ
యిటమీఁద యాదవగిరిటెంకణంబు పాషండసంకులంబుగా వచ్చినఁ దచ్చ్యు
తికి శఠకోపసమాఖ్య సంభవించి నీరంధ్రవాదంబున నంధ్రాదివిషయ విద్వ
జ్జనంబుల నధోక్షజవిజయవాదభిక్ష వేఁడి దిగ్విజయంబు సేసి గరుడకుధర
గుహాకుంఠనృకంఠీరవంబు కుహనాత్రిదండియై బ్రుసీకుసుంభాంబరాంభః
కుండిక లొసంగ నంగీకృతాంతిమాశ్రయుండై, ఫణిప కణభు గక్షపాద బాద
రాయణ కపిల జైమిని శాసనంబులు మఠ మహానస మహీసురులు మున్నుగా
నెంతేవాసి నంతేవాసులకుఁ దెలివి పఱుపం బరమహంసానుష్ఠానపరకాష్ఠయై,
పదయుగప్రసన్నభువనప్రపంచపంచజనహృదయభవనంబులం బద్మాచద్మా
క్షులు పల్లేర్లు దుడిచి పాడెక్క భక్తి భోధించి భూతలంబుఁ బావనంబు సేయం
గలవాఁడు. మఱియు హయవదనపదారాధకుండై వేంకటేశుండను నింకొక్క
మనీషి మధుమథనమతప్రతిపాదకం బగు ప్రబంధశతంబు రచించి శిలోంఛ
వర్తనంబునం దపంబు సేయం దనకు జరచ్ఛదనశాకాదానంబు సేయు నగ

స్త్యోర్వీరుహంబునకు నిర్వాణంబొసంగం గలం; డిట్టి యేష్యంబులు మదీయ
దివ్యబోధనంబున నెఱింగియుందు, నేతాదృశం బగుత్రైకాలికజ్ఞానంబు కలిమి
నిమ్మేను మాననీయంబుగదా యంటేని యది జాత్యంబు దక్క దపస్సత్యశమద
మాదిలబ్ధంబుగాదు; నిషాది భవిష్యదర్థంబులఁ జెప్పుచున్నది. అది శుచియే?
కౌశికంబు డబ్బగాటి గబ్బులుఁగు గౌళి కనుంబెంటి పైఁడికంటి లోనగు
తిర్యక్కులు భావిప్రయోజనసూచకంబు లై యున్నయవి; యవి తపస్వులే?
యట్ల మావిజ్ఞానంబును; నెట్లనిన, నాస్తిక్యంబువలన శాస్త్రంబులెడ నధీతి
బోధంబులు దక్క నాచరణప్రచారంబులు లేమి ధర్మంబు దూరం, బది
నిమిత్తంబుగా నిత్తెఱం గెఱుంగక భవోత్తారకంబుగాదు, గావునఁ గలుష
రహితకాయంబునంగాని కల్యాణంబు లబ్ధంబుగాదు. గాఁబట్టి యివ్విరూవ
విగ్రహం బనుగ్రహంబున నుడిపి కృతార్జుం జేయు; మని పాదంబుల వ్రాలి
పాటం బాతికపాలేని యీవే యనిన, నతం డదియును నీలేనన్నఁ "బోని
మ్మీప్రభాతసమయంబునం బాడిన చరమగీతంబైన నిచ్చి ప్రసన్నుండ వగు న
న్న విపన్నుంజేయు" మని లేవకున్నం బరమదయార్ద్రుండై, 'యట్ల కానిమ్ము లె'
మ్మని యతని లేవనెత్తి, యత్తనుప్రాప్తిప్రకారంబు సవిస్తరంబుగాఁ జెప్పు
మనిన నవధరింపుమని యప్పొలదిండి దుఃఖార్తుండై యిట్లనియె.

ఆశ్వాసాంతము

మ.

అజ చౌర్యాపహృతాత్మతోకసముదాయాభీరకాంతామణీ
వ్రజగోరాజిమనఃప్రమోదకర తద్వత్ప్రాప్తరూపానురూ
పజనిప్రాభవ, ద్రౌణిజోదరకనద్బాణాగ్నివృత్తిప్రకో
పజలాసార, సరోజబాంధవ శశి ప్రాంచద్విశాలాంబకా!

67


క.

అనవరత నవరతాదృత
వినుతప్రేమాత్తవల్లవీజనజాలా,
మననపరమౌనిమానస
వనవసితృమరాళవర, సువాసితమూర్తీ.

68


ఉత్సాహ.

నలముఖాది చక్రవర్తి నాథ వనసమర్పితా
త్యలఘుమకుట ముఖ్య హా ర్యుపాయనా, యనావిలా

జిల సురారిహరణ నిజవశీకృతాభిలాండ ని
ర్మలగుణా! యమేయరూప రంజితార్యపోషణా.

69


మ.

ఇది నైఠామనయావనావనిధవాహీనాభ్రచుంబిస్ఫుర
ద్విదితాభీలమణీగృహాళిదళనోద్వేలోగ్రహస్తివ్రజో
ద్యదనీకాగ్రగ కృష్ణతాయమహిభృ త్సంజ్ఞాన్మదాముక్తమా
ల్యద నాశ్వాసవరేణ్య మాఱవది హృద్యంబైన పద్యంబులన్.

70

షష్ఠాశ్వాసము సమాప్తము

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.

 
  1. వెనుక నడు మొయ్య