Jump to content

ఆముక్తమాల్యద/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

ఆముక్తమాల్యద

పంచమాశ్వాసము

క.

శ్రీనీళాజాంబవతీ
మానసతామరసవిహరమాణమిళిందా
భానద్యుదయకళిందా
నానాంఘ్రిశిరోక్ష శేషనగహర్యక్షా!

1


వ.

అవధరింపు మవ్విష్ణుచిత్తుండు.

2


మహాస్రగ్ధర.

ఒకనాఁ డామ్రాంకు రౌఘం బురు కుసుమ కుడం గోదరక్షోణిఁ దల్ప
ప్రకరం బై కాంక్షచే మున్పతులఁ బదరిపైఁ బ్రౌఢి వాటించి నిట్టూ
ర్పెక దొట్టన్ డస్సి వీరాయిత మఱి మఱి తా రెట్ల ము న్నట్ల యౌనా
యికలం గందర్పుఁ దోటం బెఱిఁగి తఱిమి వీఁ పేసెనా నంటు తోఁటన్.

3

గోదాదేవి

ఉ.

వింగడమైన యొక్కవనవీథిఁ గనుంగొనె నీడ సున్నపున్
రంగుటరంగు పచ్చలయరం గయిపో వెలిదమ్మి బావికిం
జెంగట నుల్లసిల్లు తులసీవనసీమ శుభాంగి నొక్క బా
లం గురువిందకందళదళప్రతిమాంఘ్రికరోదరాధరన్.

4


చ.

కనుఁగొని విస్మయం బొదవఁగాఁ గదియంజని సౌకుమార్యముం
దనురుచియు న్సులక్షణవితానముఁ దేజముఁ జెల్వుఁ గొంత సే
పనిమిషదృష్టిఁ జూచి యహహా!యనపత్యున కమ్ముకుందుఁడే
తనయఁగ నాకు నీ శిశువుఁ దాఁ గృప సేసె నటంచు హృష్టుఁడై.

5

క.

కొనిపోయి ధర్మగేహిని
కనురక్తి నొనంగఁ బొంగి యాయమయును జేఁ
పు నిజస్తన్యంబున లలిఁ
బెనిచె న్గో మొప్ప నిట్లు పెరుఁగఁ గ్రమమునన్.

6


సీ.

వాతెఱ తొంటికైవడి మాట లాడదు
                   కుటిలవృత్తి వహించెఁ గుంతలంబు
లక్షులు సిరులురా నఱగంటఁ గనుఁగొనె
                   నాడించె బొమగొని యాననంబు
సనుగొమ ల్నెగయ వక్ష ముపేక్షఁ గడకొత్తెఁ
                   బాణిపాదము లెఱ్ఱవాఱఁ దొడఁగె
సారెకు మధ్యంబు దారిద్ర్యములె చెప్పె
                   ఱొ చ్చోర్వ కిటు లోఁగఁ జొచ్చె మేను


తే.

వట్టిగాంభీర్య మొక్కఁడు పెట్టుకొనియె
నాభి నానాఁటి కీగతి నాఁటిప్రియము
చవుకయైనట్టి యిచ్చటఁ జనదు నిలువ
ననుచు జాఱినకరణి బాల్యంబు జాఱె.

7


శా.

హేమాభాంగ విభాధరారుణివక్త్రేందుప్రభాశీలఁ ద
ద్భామారత్నము వొంద దయ్యె మును దత్తద్వర్ణ యుక్తాఖ్యలన్
శ్యామాంకం బళి గర్వధూర్వహకచచ్ఛాయాచ్ఛటం గాంచెఁ నౌఁ
గా మున్నుర్వి శిరఃప్రధాన మనువాక్యం బెమ్మెయిం దప్పునే.

8


క.

ఆయత భుజైక చక్రుం
డా యదుపతి దొమ్మి గెలువ నడరు మరుని కా
లాయసచక్రపరంపర
లోయన నుంగరపుఁగురులు యువతికి నమరున్!

9


తే.

సకలసీమంతినీలోక సమతిశాయి
భాగ్యవర్ణావళులు వ్రాసెఁ బద్మగర్భుఁ
డనఁగఁ గర్పూరతిలక రజోవదాత
ఫాలమునఁ గుంతలశ్రేణి పడఁతి కలరు.

10

శా.

సైరంధ్రు ల్పయికెత్తి కజ్జలముఁ బక్ష్మశ్రేణికం దీర్ప వా
లారుం గన్నుల మీఁదు చూచు తరి ఫాలాంచ చ్చతుర్థీనిశా
స్ఫారేందుం గనె వక్త్ర మక్కనుట గాఁ బర్వేందుఁ డాత్మప్రభా
చోరుం డుండఁగఁ దన్నుఁ దద్గతవిభాచోరం బనున్ లోకముల్.

11


చ.

కనుఁగవఁ దన్నుఁ గెల్వఁగ మృగం, బల సూడున కిందురేఁతు నే
నని రుచిదక్కఁ దత్పరిమళాఢ్యత లేమి నతండు గొంకఁ, దా
నినుపఁ జనన్ 'బగం దనదు నెత్తుటఁ బొద్దిడుకొంట కాక వా
సనక?' యన న్మొగం బమరుఁ జానకు ఫాలము పచ్చికస్తురిన్.

12


తే.

కడిఁదివిలు చేఁది గుఱి కీలకఱచి నిలుపు
మరునికువలయశరముకంపములఁ బోలుఁ
దార కడకంటిపై సారె చేరిచేరి
వేగ మగుడ సలజ్జ దృగ్విభ్రమములు.

13


తే.

నవవయస్సీధుమదముచే శ్రవణకూప
ములఁ బడెడు శంక నలువ చాపలము లుడుగ
విడియె శృంఖల లనఁ గాటు కిడిన దీర్ఘ
పక్ష్మరేఖలఁ గనుదోయి పడఁతి కొనరు.

14


చ.

అనయము రాగ మొప్ప సహజాననచంద్రకటాక్షపంక్తి ప
ర్విన నఘశంకఁ గర్ణ మను శ్రీ మఱుపెట్టుఁ జెలంగి చెండుఁ గొ
ట్ట నవనిఁ బడ్డ కమ్మ మగుడం గొను నంతకు నంసపాళి నం
గన యిడి దాఁచు పేరఁ బెర కర్ణము కమ్మ పయిం దళుక్కనన్.

15


శా.

నాసాచంపకత స్సుగంధ మచటన్ రా భృంగముల్ గ్రోల సం
త్రాసం బందియుఁ, బల్కుచో నలము వక్త్రం బేల నా నేటి? కం
దే సౌరభ్యము లేదు. కుందములు గావే దంతము? ల్గానినాఁ
డాసక్తిన్ బ్రతిబింబదంభమున నేలా వ్రాలఁ దజ్జాతికిన్?

16


తే.

శంఖసామ్యంబు రా మున్ను జలజభవుఁడు
సరసిరుహవక్త్రనేత్ర కంధర యొనర్చె,
జవ్వనము వచ్చి వెండి సాక్షాత్కరించు
శంఖమున చేసె నునుగంధసారచర్చ.

17

క.

కమలదళేక్షణ సంగీ
తమున నెగడు మంద్ర మధ్య తార త్రిస్థా
నములకుఁ దీర్చిన రేఖల
క్రమమగు రేఖాత్రయమున గంఠం బమరున్.

18


తే.

లలన మృదుబాహుయుగబిసలతలు గడఁగి
బిసలతాశ్రీల నెల్లను వెస హరించె,
మఱి హరింపంగ నవి నెఱి విఱిగి కాదె
సారెఁ దమయాత్రఁ దంతులఁ జరపుచుండు.

19


మ.

తళుకొత్తు న్భుజకీర్తి వజ్రఘృణి సూత్రస్యూతహారస్ఫుర
త్కళికాచిత్రకుచద్వయోపరిగళాధస్స్వల్పవిస్తారదై
ర్ఘ్యలసత్తిర్యగురస్తబం బను వివాహాంఛ న్మనోజాతపా
టలదంతచ్ఛదబోడబాసికము దండ ల్వోలెఁ గే ళ్లింతికిన్.

20


చ.

ఒదవెడు జవ్వనంబు వెలి కొత్తఁగఁ బయ్యెద సిగ్గుఁ గూడి చి,
ట్టదుమఁగ లేఁత లౌట దిగ నాఁకకు మీఱను లేక పక్షపుం,
జదుమునఁ బ్రక్కల న్మెఱసి చప్పట లై మఱి లావుఁ గూడఁ బైఁ,
[1]బొదలె ననంగఁ బిక్కటిలెఁ బొల్తుక చన్నులు నాఁడు నాఁటికిన్.

21


తే.

ధృత రఘూత్తమ శాప మొక్కింత విడిచి
విడిచి కడకేగ నప్పు డప్పుడ కలిసెడు
చక్రయుగ మన ఱొమ్మెయ్యనాక్రమించెఁ
గొమిరె చన్నులు [2]లేఁగప్పు కొనల నలర.

22


క.

తా రె ట్లట్లుగఁ దమ్ముం
జేరిన ముత్తెంపుసరులఁ జేడియచన్నుల్
లోరెంట లుడిపె ఘన మగు
వారు నిజార్జవముఁ జేరువారికి నీరే.

23


తే.

విరహితతిమీఁదఁ గోపాన మరుఁడు దివియ
వేగమై పైఁడి యొఱతోన విసరఁ, గుట్లు

దునిసి బైటికి నసిధార దోఁచె ననఁగఁ
కనకరుచి మధ్యలత నారు కాంత కలరు.

24


క.

అండజగామిని యూరుపుఁ
బిండువలపు లాన నాభిబిలము వెడలి చ
న్గొండల నడుముగఁ బ్రాకెఁడు
కుండలియో యనఁగ నారు కొమరొప్పారున్.

25


క.

అంగన నిలిచిన బాహువు
లుం గౌనును నేఱుపఱుచు లోకమునకు ర
త్నాంగద కాంచీభేదము
లుం గెళవుల నడుమ నునికియు న్నూఁగారున్.

26


క.

తనుమధ్య వళీభంగము
లనుగూర్పఁగ నవియుఁ దత్కులముల యగుటఁ గం
తుని యిడినపత్తిఱే కనఁ
జను నొడ్డాణమునఁ గౌను చామకు నమరున్.

27


క.

లేఁ గౌఁ దీఁగ నితంబము
వ్రేగునఁ ద్రెంపుటయుఁ గని విరించి బిగింపన్
లోఁగి ముడి యిడియె వదలుగ
నాఁ గోకస్తని గభీర నాభి చెలంగున్.

28


క.

వెలఁది కటిపేర నిల నొక
పులినము డిగఁబడియె సింధు పులినపు పంక్తిన్
నలువ యది వడఁగఁగాదే
తెలియుట కం దంచపదము దిరముగ నిలిపెన్.

29


తే.

కదళి దివియించె నాగ్రాంఘ్రికంబు తొడల
పెనుపు నె ట్లన్నఁ బొరల సోదన నడంచు
కొన్న యాఁదోఁకపాటును గొప్పు విప్ప
మెఱయు గోర్మ్రుచ్చులును గెంపు గుఱులు గావె.

30


తే.

వసుధలో నెట్టి శ్రీ గల వారివేని
కరభములు దాస్యములు సేయు సరసిజాక్షి

యూరువుల కెట్ల టన్నఁ బైఁ దారు మోచు
గొడుగులును నల్ల కలశముల్ గుఱులు గావె.

31


క.

వలరాజు కుటుంబము న
గ్గలముగఁ బోషించు కలమగర్భము లయ్యెన్
బొలఁతుక జంఘ లతిశ్యా
మలమంజీరస్థనిబిడమరకతకాంతిన్.

32


తే.

ఉవిద నిద్దంపుజంఘల సవతుఁ గోరి
కలమగర్భంబు లడఁచు లోఁ గంటకములు,
చాతురుల మించి మఱి దివసక్రమమున
నిలువ కవి బాహిరము లైనఁ దలలు వంచు.

33


చ.

ఇలఁగల వస్తుసంతతుల కెల్లను గచ్చిడు మాస్వభావ పా
టలరుచి కేమొ వేఱ యొకడా లిఁక వచ్చునె? లక్కనీట మ
మ్మలమిన దెంత ముగ్ధ యిది యంచుఁ బదాబ్జము లంగుళీముఖం
బుల నగు నట్లు మించునఖము ల్మెఱయన్ గొమరారు నింతికిన్.

34


క.

లలనోపరిపదకచ్చప
ములు బలిమిమెయిన్ గజప్రభూతగతి శ్రీ
విలసనముఁ గొనఁగఁగాదే
కలిగిన్ గజకచ్ఛపోగ్రకలహం బుర్విన్.

35


తే.

తరుణి తనుకాంతియెదుట నూతనహరిద్ర
తులకు రాలేక యత్యంతమలిన యయ్యె;
నౌటఁగా రాత్రియన నిశ యనఁ దమిస్ర
యన నిశీథిని యన క్షప యనఁగఁ బరిగె.

36


సీ.

అయ్యిందువదన ధరాంగన గావునఁ
                   బ్రాఙ్మైత్రిఁ బొరుగుల భాగవతుల
గృహములందు మరాళికైకావళీహరి
                   ణీమనోజ్ఞాస్రగ్విణీసమాఖ్య
లమర జనించి వయస్య లై నాగక
                   న్యలు పుత్త్రికావివాహములయందుఁ

బాడు పద్మాలయాపరిణయామేయగే
                   యముల ననంతు కళ్యాణగుణము,


తే.

అద్భుతం బొప్ప విని విని యతనిఁ గవయు
బుద్ధి ప్రాగ్జన్మసంస్కారమున జనింపఁ
దదవతారానుమేయ కథాసుధాను
కలితలీలానుకృతుల వర్తిలుచు నుండి.

37


సీ.

తమ తండ్రి శ్రీశ దత్తశ్రీలు గృహమున
                   ద్రవ్వి తండములయ్యుఁ దనదు తొంటి
స్రగ్వి నిర్మాణదాస్యం బనుత్సేకత
                   జరపుచుఁ బ్రజ్ఞ వైష్ణవపురాణ
సంహితావ్యాఖ్యారచనఁ బ్రొద్దుఁ గడుపుచుఁ
                   గట్టెడు కమ్మ చెంగలువ విరుల
తోమాలె లలకలు దువ్వి కంతునకు [3]బా
                   ర్హనిబద్ధఖేటకం బనఁగ నీల


తే.

వృషక కుద్రేఖ నెడమకొక్కింత యొఱుగ
నిడిన ధమిల్లవలయంబు నడుగునందుఁ
గొంతసే పర్ధిఁ గీలించి కూపవారి
నీడ వీక్షించి క్రమ్మఱ గూడ నునుచు.

38


ఉ.

ఆ నవలా యలంతి పసుపాడి దుకూలముఁ దాల్చి గుబ్బచన్
గోనలఁ దావు లుప్పతిలఁ గుంకుమ తేటల నిగ్గు దేరఁ గ
ప్రానన నాభిఁ దీర్చి పితృబద్ధ లతాంతము లర్ధిఁ గొప్పునన్
బూని యొకింత సే పునిచి పుచ్చి చెలిం గని వెచ్చ నూర్చుచున్.

39


క.

మీ పాడిన హరిచందము,
లే పాడిగఁ దలఁపవచ్చు? నితఁ డేసతులం
గాపాడినవాఁ డనుఁగై
త్రోపాడినఁ దన్ను వలచి, తొయ్యలులారా?

40

తే.

తాను సురమౌని నృపతనుల్ దాల్చి యకట
కామినీతతి నుడికించుకంటె నట్టె
గండెయును నల్లదాసరిగాఁడు కిరియు
హరియు నై పోవుటయ మంచి దనుయుగంబు.

41


క.

ఆ తనువుల లేరు గదా
నాతులు; మఱి కాక కలిగిన, న్వగఁ దిర్య
గ్జాతికి నీజాతికిఁ గల
యీతీవ్రత గలదె? యెఱుఁగ కి ట్లే లంటిన్?

42


తే.

“ఆత్మవ త్సర్వభూతాని" యనుట బొంకె?
ముద్దియల కైన వలవంత ముచ్చటలను
నాటపాటలఁ గతలఁ గొం తడఁగుఁ గాని
నోరు లేని జంతువులకె నొప్పి ఘనము.

43


మ.

ధరఫై నీతఁడు పూర్వకల్పములు సక్తశ్రీవిశాలాంబ కాం
బురుహశ్రేణి జలంబు మైఁ బులకలున్ బూరించుచున్ వేఁచు దు
ర్భరకర్మం బలమంగ వచ్చు జలజత్వస్తబ్ధరోమత్వకే
సరిత ల్భూర్యవతారదంభమున నాచ్ఛాదించుఁ దా బ్రౌఢిమై.

44


క.

అనిమిష ముని మనుజాధిప
జననంబుల నీతఁ డెట్లు జలజాక్షులఁ గూ
ర్చిన వారి నేఁచె దయలే
కనిక వినుఁడు మీదుపాట లంద తెలిపెదన్.

45


చ.

మొదల నుపేంద్రుఁడై యితఁ డమోఘహతిన్ భృగుపత్నిఁ ద్రుంచి, య
మ్ముదుసలి 'గేహినీవిరహముం దనయట్లన పొందు' మన్న, నా
కదియును దేవకార్యమున కయ్యెడు నంచు వహించి, త్రోఁచు లా
గెద వటువయ్యు లచ్చి మది కెన్నఁడుఁ బాయని జాలి నింపఁడే?

46


మ.

ప్రళయార్కోగ్రకురారకోణము నృపత్త్రైవిధ్యవత్పీఠికా
ఖ్యల త్రిస్థానము లేడుమార్లు వరుసన్ ఘట్టించు దోశ్శక్తిఁ గీ
ర్తిల నద్వల్లకి మ్రోయ రక్తయయి యెం తే వశ్యయౌ భూ సతీ
తిలకంబుం దుదిఁ ద్రోవఁ గశ్యపున కార్తిం బిడ్డ యైపోవదే?

47

మ.

తన సౌందర్యము చెప్పఁగాఁ గరఁగి పద్మాకాంత రప్పించి మో
హనకంజంబున వైచి తియ్య మిడు నెయ్యం బొప్పఁ బైకొన్న, మీ
ఱి నృశంసత్వమునం దొఱంగి వని వెఱ్ఱిం జేసెఁ, గాకుత్స్థుఁ డై
న నిలింపారివిడారిచందములు డెం దాన న్విచారింపుఁడా.

48


చ.

చెలువముఁ దాల్చి త న్గవయఁ జేరిన రాగిణి రావణస్వసన్
నలువురు నవ్వ నత్తెఱఁ గొనర్పక యేలిన, వియ్య మై యతం
డలుగఁడ, సీత కిట్టి తలఁ పాత్మఁ దలంపక యాయమ న్వృథా
కలహమునం దనుం దొఱఁగు కాఁకకు నాఁకకు లోను సేయఁడే.

49


శా.

ఫీట్కారస్రపదస్రమై పెదవి గంపింప, న్మొఱ ల్గిట్టి ప్రా
వృట్కాలాంబుదగర్జ గెల్వఁగ వలచ్ఛ్రీఖండశాఖాసిత
త్విట్కుంభీనసరేఖఁ గే లసిలతాధృద్భాహు వేష్టింప, మున్
రాట్కంఠీరవ మై యొనర్చె వడి సోణా లంట ఘోణాచ్ఛిధన్.

50


తే.

ఒల్లఁ బొమ్మన్నఁ బోదె, తా నుల్లసముల
నేప? నది రక్కసియ యౌట యెగ్గె ?వలచి
స్త్రీలు దలవంపఁ దాన వచ్చె, నది చాల
కాటదాని బజీతు సేయఁగవలయునె?

51


మ.

తను నంటన్ సతు లౌట గోరు మునిబృందంబుం దదాపాది ప
ద్వనజక్షోదము గల్గియు, న్పెఱజనిరి చా వల్లవస్త్రీలుగా
జననం బందఁగఁ జేసి కూడియు, స్వసంసక్తాత్మలం గాంచె నీ
తనయప్రేరణఁ బాసె భోజపురయాత్రాదంభసంరంభి యై.

52


చ.

హతల నొనర్చె మోహితల నల్ల యయోముఖి నాపులస్త్యభూ
సుతను, విరూప లౌట ననుచో, ముసలి న్బెను నిట్ట తాటిమై
యతివ రమించెఁ దా ముసలి యయ్యు, రహి న్మఱుగుజ్జుప్రేష్యకై
ధృతిసెడి యుగ్రసేనునకుఁ బ్రేష్యత నొందియు దిద్ది యేలఁడే?

53


తే.

తనకు నందఱుఁ గూర్ప బృందావనమున,
నొకతె రతిఁ దేల్చి, కాఁక నొం డొకతె బ్రేల్చి,
యంత రాధకు మేలువాఁడై మురారి
యెల్లసతులకు నెద నుడు కే యిడండె.

54

వ.

అని యిట్లు త్రపాభరంబున నుపాలంభదంభంబుగాఁ జేయు పునఃపునస్స్మ
రణంబున నంతఃకరణరాగంబు దేటపడం దెలిసి బోటు లీబోటి కైటభారియెడ
నాటుకొన్న కన్నెకూర్మి లజ్జావశంవదయై వెలివిరియంగానీక పుటపాక
నికాశం బగుకాఁకఁ జీకాకుపడి నాఁడునాఁటికి నగుచున్నట్ల గిటగిటనగుచున్న
దింత నియ్యింతి యెరవు మాన్చి మనలను గుట్టెఱుంగనీయని యింగితం
బెఱుకపఱుచుకొని చింతాపనోదనంబు సేయకున్నం బ్రమాదం బని నవ్వుచు
నర్మగర్భంబుగా నిట్లనిరి.

55


ఉ.

ఎవ్వరు నట్లపో నెరసు లెన్నకమానరు ప్రాణభర్తలం
దవ్వుల నున్నఁ గాఁక కతన, న్మఱి వారలు వశ్యు లైనఁ దా
రెవ్వరి నొల్ల కొక్కటయి యింద్రుఁడు చంద్రుఁ డటండ్రు బోటి దా
నివ్వలఁ దేరకత్తె యగు నిట్టివి నీతల వేగెనే చెలీ.

56


క.

అనుటయు నెలనగ వడఁచుచుఁ
గన లించుక తెచ్చి యౌడు గఱరుచు నయ్యం
గనలన్ కందుకనికరముఁ
గొని వ్రేయుచుఁ గెలను చూచుకొనుచుం బలికెన్.

57


క.

విడువక మీ గానము సొగ
సిడుటయు, మఱి పాడుఁ డనుట యెగ్గే? పాసెం
బడిగిన వారే పేదలె?
కొడిమెలు గట్టకుఁడి యతనిఁ గొని పని యేలా?

58


శా.

పోనిం డన్న, వయస్య లిట్లని, రగుం బో నిక్క, మిం కిప్పుడే
కాని, మ్మిం కొకకొంతసేవటికి నే కానీ, సఖీ, యెల్లియే
కానీ, నీనుడిఁ దన్మనోజ్ఞగుణము ల్రానీ, తదన్యాయము
ల్రానీ, చిందినఁ జింత నీ కతనిపైఁ గా కెవ్వరిం దేల్చెదే?

59


సీ.

నఖముఖోజ్ఝితపరాఙ్ముఖముక్తబాష్పాంబు
                   పటిమ దీపపుఁజిటబిటలు దెలుపఁ,
బొరి నుపాంశూత్సృష్టపూత్కృతు ల్కృశమధ్య
                   పార్శ్వముహుఃప్రకంపములు దెలుప,

నొదవెడు గాద్గద్య మదిరిపాటునఁ బల్క
                   రింపఁ బుట్టెడు కేకరింత దెలుప,
వలవంత విసువు కాంతల పుట్టు దూషించు
                   కారణంబుల తొంటికతలు దెలుప,


తే.

నలఁతఁ బానుపుపైఁ బొరలాట దెలుపఁ,
దెగువ లోలోననే నవ్వు నగపు దెలుపఁ,
గలఁక భూమీఁదిపనిలేని కసరుదెలుపఁ,
బొలఁతి రేలు నీయున్కియే పులుగుగాదె.

60


చ.

ఎఱుఁగరుగా యొకద్భుతము, నీ చెలి దీర్ఘికఁ దీర్థమాడ నా
యఱుతఁ దగిల్చి పోవుఁ దన హారము వోయిన నేనుఁ బోవుదున్
మఱవక వెంటఁ బోవ జలమగ్నత నౌ నది సున్నమైనఁ దాఁ
గఱకరిఁ బెట్టి సొమ్ముడుగుఁ గాని నిజార్తి యొఱుంగదే మియున్.

61


చ.

అనిన మరాళి పల్కు, వినవా హరిణీ, యొకనాఁడు కస్తురిం
గొని యిడు బొట్టు నా కనుచుఁ గూర్మి నొసంగిన?, బెట్టుచుండఁ, జు
ఱ్ఱనుచు మొగంబు వ్రేసినటు లౌ తనయూర్పుల నింకి యింకి పో
యిన పలుబేంట్లు గోరఁ గొని యెత్తనె పట్టెను మాటిమాటికిన్.

62


మ.

అనిన స్రగ్విణి పల్కెఁ, దన్నుఁ జెలులారా, నే లతాడోలఁ జి
క్కన నూఁపం దెగి వ్రాల, దీని చనువ్రేకం బేక్రియఁ దాల్తునో
యని పట్టం, దినమధ్యమార్కరుచి శీర్యన్మంజరు ల్వోని వా
డిన పాలిండ్లను బెండుబొమ్మగతి నుండె న్సందిటం జుల్కనై.

63


వ.

అని తనయవస్థఁ దోఁప నాడిన ననాదరయుంబోలె వారల కిట్లనియె.

64


క.

ఆర్పఁగఁ దీర్పఁగ మిక్కిలి
నేర్పు గల వయస్య లట్లు నెలఁతలు మీ మీ
నేర్పునఁ బలికెద రక్కఱ
యేర్పడ మీ కీ విచార మేటికిఁ జెపుఁడీ.

65


వ.

అని మేలంబు సేసికొని తేలి పోఁబలికి పుటపాకప్రకారంబగు వియోగ దవధు
భరం బవ్వధూరత్నం బడంచికొని యుండియు నుండలేక నిశాసమయంబుల
నొక్కొకమాటు తనలోన.

66

సీ.

అభినవకువలయశ్యామకోమలమైన
                   డామూఁపు మకరకుండలముఁ దాల్చ,
నిస్తులాస్యశ్రీవయఃస్తంభనిక్షిప్త
                   నింబచ్ఛదభ్రూవు నిక్కసుంత,
పరువంపుమంకెనవిరివంపు నరవంపు
                   వాతెఱ చంద్రంపువాన గురియ,
నడ్డంపుమెఱుఁగు వాలారు కన్గవచూడ్కి
                   శ్రవణకుండలకాంతి సవతుగాఁగ,


తే.

సప్తభువనాంగనానురంజనకు సప్త
విధపరీవాహముగ గానసుధ వెలార్చు
మాడ్కి వేణువుపై వ్రేళ్ళు మార్చి మార్చి
మరులు కొలిపితె గోవింద మందసతుల.

67


ఉ.

అక్కట ఠాధ నీకుఁ దరవా మగవారల నత్తమామలం
దక్కి ముకుంద వేణు కలనాదపు టీలకు లేటిమొత్తమై
త్రెక్కొనుకాఁకమై నడికి రే లరుదెంచిన గోపికావళిన్
బొక్కఁగ జేసి తద్రుచిరభోగము గుత్తగ నీవ కైకొనన్.

68


ఉ.

అక్కమలాక్షుఁ డొక్కతె నిజాంసమునం దిడి కుంజపుంజపుం
జక్కికిఁ గొంచుఁ బోవఁ బెఱ చానలినాత్మజవెంట వ్రేఁగుట
న్మిక్కిలి డిగ్గు పాదసరణిం జని రోయుదు రట్టె! రోసి తా
రక్కడఁ గాంచు టేమి! వలదా యభిమాన మొకింత యింతికిన్.

69


చ.

ఇలు గలనైన వెల్వడని యీలుపుటాండ్రకుఁ దాఁపికత్తెవై
యులు కెకలించి శౌరి తమ యోగపు వాచవిఁ జూపి మీఁదఁ బె
ల్లలము వియోగవహ్ని భవదంతరసైకతపంక్తిపొంత వం
తలఁ బొరలించి తౌదు శమనస్వన వుగ్రమయూఖనందనీ!

70


వ.

అని యొంటిపాటునం దనలోనం బలుకు పలుకు లాలించి పొంచియున్న
వయస్య లాస్యంబు లపహాస్యచంద్రికాతుందిలంబులుగాఁ దోఁచి 'భామ,
యే మేమి? నీ మనం బెఱింగియే కదా మును మున్న యతనిమాటలు మానలే
వంటి' మని మూదలించినం గించి దవనతాననయై నెమ్మొగంబు వెలవెల

పాటు లేనగవున నడంచి మఱి మొఱంగ ననువుపడక యందంబు గూడుకొని
వారి కిట్లనియె.

71


తే.

'నాఁడు మన మున్న నెట్లొ పూఁబోఁడులార,'
యనిన, వారలు మగుడ నా యమకు ననిరి
'యింతి, నాఁ డుండ కెందుఁ బోయితివి నీ?' వ
టన్న నచ్చెరువడి వారి కతివ పలికె.

72


తే.

'సకియలార, త్రైకాలికజ్ఞానవంతు
లైన ఋషులట్ల పలికెద, రంత యెఱుక
యెదఁ గలిగెనేని యెఱిఁగింపుఁ, డేను మొదలు
నెవ్వతె' మున్న; మఱి వార లిట్టు లనిరి.

73


మ.

“దివిజద్రుప్రసవంబుఁ గాంచిన సపత్నిం జూచి, చూ పోవ కిం
తవుజిల్గుంబని యంత సేసి, మది నీర్ష్యాక్రోధము ల్సందడిం
ప, విరిం బోక, ద్రుమంబు కైకొని, పతి న్మందన్న మ్రా నెల్లఁ దే
నవధిం బెట్టిన సత్య నీ వహహ; కావా భామినీ!" నావుడున్.

74


వ.

గ్రక్కునం బ్రత్యుత్పన్నవిజ్ఞానయై, గృహదీపికారోపణంబునం గృహగతపదా
ర్థంబు లొక్కమాటె దృగ్గోచరంబు లగునట్లు, జన్మాంతరంబున నయ్యనంతుని
తోడి క్రీడాప్రపంచంబు సద్యస్సమనుభూతం బైన తెఱంగునం దోఁచిన.

75


ఉ.

వాలిక కన్నులం బొడము వారి సకజ్జల మాశ్రితశ్రవో
గోళక మై తదంతికపుఁ గుంతలవల్లికిఁ దల్లితోడుగా
మైలవలి న్నన ల్నిగుడు మైఁబులక ల్నిగుడన్ శ్లథాంగియై
సోలినఁ జూచి డెందములు సుఱ్ఱన హాయని బోటు లర్మిలిన్.

76


ఉ.

ఎంతకుఁ దెచ్చెనే సరసిజేక్షణ చెయ్దము; లిందుమీఁద జ
న్మాంతరవర్తనంబు హృదయంబున కిత్తఱి నెచ్చరించి గో
రంతలు గొండలంత లగు నట్లుగఁ జేసితి, మంచుఁ గూపికో
ద్వాంతసతాళవృంతమృదువాతహిమాంబుకణాళిఁ దేర్చినన్.

77


క.

తెలిసి కను దెఱచి వెండియు
జలజేక్షణ తన్ముకుందచరణస్మృతిని

శ్చలతఁ గను మొగిచి మఱి య
శ్రులు ఱెప్పలఁ ద్రోపఁ దెఱచి జూచి సఖులతోన్.

78


క.

మీ రెవ్వ రనుటయును, శృం
గారిణి, మే మురగకన్యకల, మింతకు ము
న్ధారుణి కేతెంచితి; మన
నారామలఁ గౌఁగిలించి, యార్తి న్బలికెన్.

79


ఉ.

అట్టి మురారి కప్పు డనుగై మఱి యీకలి వేళఁ గ్రమ్మఱం
బుట్టి వియోగవేదనలఁ బొక్కెడు నీ తను వేల తండ్రి దా
నిట్టగు నన్ను నిం కొకని కియ్యక తొల్తన యోగశక్తిఁ బో
బెట్టెద దీని వెండియు నుపేంద్రపదాంబురుహంబు పట్టెదన్.

80


క.

అది యెండె భక్తి, యెవతే
నెద విశ్లేషైకభీరువృత్తిఁ బ్రియాలా
భదశ న్మెయిఁ దొరఁగించిన
హదనన యదిగాక యున్న యవి వైశికముల్.

81


తే.

అనిన వారలు పల్కి రా యదువతంస
మెందు జన్నాఁడు విను రంగ మంద నిల్చె
వెగపా టేల? యతఁడ నీ విభుఁ డగుటకు
నర్చనాదుల నివ్వీటి హరి భజింపు.

82


చ.

అలుకకు" మన్నఁ దేఱె మఱి యంతటనుండియు వేళవేళ నె
చ్చెలు లిడు తెల్వులు న్మగుడఁ జింతల సంతమసంబులు న్సమా
కలితత మించె సొమ్మిడని కార్శ్యమునన్ హృదయంబున న్సదా
పలపల గాఁగ నీలముల బన్నసరం బయి నిర్మలాంగికిన్.

83


తే.

ఎలసి యేప్రొద్దుఁ గనువొందనీక మరుఁడు
కలహమున కంకకాఁడయి కాలు ద్రవ్వఁ,
బాండుబహుళక్షపాపరంపరలు వెడల
కింటిలో నేదుము ల్లయ్యె నిందుముఖికి.

84


మ.

తలిరుంగైదుపుజోదునానతి వధూధైర్యంపుఁ బెన్గోటఁ గం
దళితాహర్ముఖయంత్రకారుఁ డలుక న్నానాఁటికిం ద్రెళ్ళఁ గో

మలమార్తండమరీచిదీపకళికోష్మం జూడి యే యుం దళ
ర్దళపాథోరుహలోహనాళకుహరోద్యచ్చంచరీకాశ్మముల్.

85


తే.

పొంత ఘటయంత్రసరముఁ ద్రిప్పుచు జపించు
మగువధృతి దూల మధ్యాహ్నమంత్రవాది,
సురుచిరవితానదంభకౌసుంభధారి
తుహినధారాగృహాంగి బిందువులు సెదర.

86


ఉ.

తామరసాప్తతామ్రముఖి దంష్ట్రితవిస్ఫుటమల్లి హల్లక
స్తోమరజశ్చటాంగక మధుద్యుతితార, వియద్ద్రుచంక్రమో
ద్దామ పితృప్రసూప్లవగి దైన్యరుతోత్థరథాంగపోత చిం
తామయ నిద్రలం బొలసి తాపము సేయఁ దొడంగె నింతికిన్.

87


వ.

ఇత్తెఱంగున సకలకాలంబుల నారటంబునకు నూరటఁ గానకుండియు
నప్పుండరీకాక్షి యందుండు నప్పుండరీకాక్షు నారాధనంబున నా రాధారమణుం
గ్రమ్మఱఁ జెంద డెందంబునన్ దలంచి.

88


సీ.

పద్మాస్య ప్రతిదినప్రత్యూషమును మౌన
                   నియతి మేల్కని, సఖీచయము మ్రోల
హేమపాత్రిక హరిగ్రామలక్యాదిక
                   స్నానీయవస్తువ్రజంబుఁ గొనుచు,
ధౌతాంశుకంబులు తడియొత్తులును దేర?
                   నంతఃపథంబున నరిగి, నిజగృ
హారామదీర్ఘిక ననుసంహిత ద్రావి
                   డామ్నాయయై స్నాన మాచరించి,


తే.

పర్జనీలేశ పూర్ణసౌభాగ్యదాంగ
ధూతి చకచక లీరెండతోడ మాఱు
మలయ, నిడువెండ్రుకలగుంపు మలఁచివై చి
వేగ వెడవెడ దడి యొత్తి, విధియుతముగ.

89


ఉ.

కుందరదాగ్ర నెన్నొసల గుమ్మడిగింజ తెఱంగు పాండు మృ
ద్బిందువుఁ దీర్చి చెందిరము పేచకశీర్షముపైఁ బలె న్గటిం

జందుర కావిజీ బమరఁ జల్లని రేయిటి తట్టుపు న్గళు
ల్విందులఁ దేల నూనెముడి వెండ్రుకలున్ దడి తావు లీనఁగన్.

90


తే.

బోటి గట్టిన చెంగల్వ పూవుటెత్తుఁ
దరు పరిణ తోరుకదళమంజరియుఁ గొనుడుఁ
బోయి గుడి నంబి విజనంబుఁ జేయఁ జొచ్చి
మ్రొక్కి వేదికఁ బలువన్నె మ్రుగ్గు వెట్టి.

91


తే.

కపిలగవి సర్పిఁ బృథు దీపకళికఁ దీర్చి
ద్వయముతో వక్షమునఁ గల్వదండ సేర్చి
యగరుధూపంబు లిడి శర్కరాజ్యయుక్త
హృదయకదళీఫలాళి నైవేద్య మొసఁగి.

92


క.

ఖండిత పూగీ నాగర
ఖండంబులు ఘన శశాంక ఖండంబులచే
[4]హిండితమగు తాంబూల మ
ఖండస్థిరభక్తి నొసఁగి కదలి చెలులతోన్.

93


తే.

చెలువ గర్భగృహ ప్రదక్షిణముఁ జేసి
వినతయై మౌళి శఠకోపమును ధరించి
చరణతీర్థముఁ గొని తత్ప్రసాదలబ్ధ
మైన మాల్యముఁ దాల్చి గేహమున కరుగు.

94


క.

ప్రతిదినము నిట్లు చని య
చ్యుతపూజ యొనర్చి వచ్చి సుదతి వియోగ
చ్యుతధైర్య యగుచు నయ్యదు
పతిగుణములు ద్రవిడభాషఁ బాడుచునుండున్.

95


తే.

మొదల నాముక్తమాల్యద మదనతాప
తరణి పెనువెట్ట వేఁగిన దక్షిణాశ
మత్కృతోష్మకుఁ దుదముట్ట మాఁడు ననుచుఁ
దొలఁగె నన నుత్తరాశకు, దొలఁగెఁ దరణి.

96

వసంతర్తువు

చ.

తెలియఁగ వచ్చె నట్టితఱిఁ దిగ్మకరుండు ధనాధిపాశకై
తొలఁగినకారణం, బతివ దుర్వహదీర్ఘవియోగవహ్ని పె
ల్లలమిన తద్దిశం దగిలినట్టి తనూష్మఘనీభవన్మహా
జలమయశంకరశ్వశురశైలమ కోనల చల్వఁ దీర్చుకోన్.

97


తే.

కినిసి వలఱేఁడు దండెత్తఁ గేతు వగుట
మీన మిలఁ దోచు టుచితంబ, మేష, మేమి
పని యనఁగనేల? విరహాఖ్యఁ బాంథయువతి
దాహమున కగ్గి రాఁగఁ, దత్తడియు రాదె?

98


చ.

ప్రియపరిరంభణద్రఢిమపె ల్లిఁక నామని వచ్చి చేయుఁగా
వ్యయ మని సీతునంద చెలువ ల్పెడవు ల్దడువంగ వచ్చెఁ దా
రయమునఁ బేర్చి యా ఋతువురాఁ జలి విచ్చి తొఱంగి ర య్యవ
స్థ యుచితమే కదా 'వివది ధైర్య' మనం జనుమాట యింతకున్.

99


ఉ.

సృష్ట బహువ్రణం బయిన సీతున కల్కి నిజోష్ఠపల్లవో
చ్ఛిష్టముఁ గొన్న దిమ్మధు విసీ యన కింతులు మోవిఁ దన్మధూ
చ్ఛిష్టముఁ గొన్న యొచ్చె మఱఁ జేసిన వారు కృతం బెఱింగి వి
స్పష్టముగా నొనర్చిరి వసంతున కూఱట దోహదంబులన్.

100


మ.

మునుపే చంద్రబలంబు గల్గి మలయంపుంగమ్మలేగాడ్పుఁదే
రున నేతెంచు లతాంతబాణునకు సూర్యుండు న్మహిం గ్రొత్తగా
ననుకూలించె జలంబున న్విరహిణీప్రాణాపహారంబు సే
యన యూహించు విధాత కృత్య మది యేలా మాను నెప్పట్టునన్?


క.

మలయకటకోటజస్థిత
కలశీసుతసేవ నిట్టు గనెనొ తదాశా
నిలుఁ డనఁగ నలసవృత్తిన
మెలఁగుచు నాపోశనించె మిహికాజలధిన్.

102


క.

మలయతరు న్యాయమ యిలఁ
గల తరువులకెల్లఁ జేయగా వలచెఁ జుమీ

యలరించు నెపంబునఁ బరి
మళితములుగ ననఁగ నచటి మారుత మొలసెన్.

103


ఉ.

కుప్పసము ల్వదల్చి, వలిగుబ్బల నొత్తిరి హత్తి వేగుజా
మిప్ప లలర్చు గాడ్పుల కధీశుఁ, గ్రమంబున ఘర్మశంక మై
నుప్పతిలంగ దోమతెర లుప్పర మెత్తిరి; దక్కి రూష్మముల్
దెప్పరమైన లోహశకటీప్రకటీకరణంబుఁ గామినుల్.

104


మ.

అరుణాంశుండు హిమర్తువన్ రజని డీలై క్రుంకి పుష్పర్తు వా
సర కల్యోదితుఁ డౌచు మున్న యిడుటన్శ్యామాకుచాలేపసం
కరసాంద్రాగ్నిశిఖారుణప్రభఁ గొనెన్ గాకున్నఁ గాలజ్ఞప
త్త్రి రుతం బెట్లు చెలంగు మానకుపిత స్త్రీ కర్ణ దంభోళి యై.

105


తే.

మృగమదాలేపమును మాని రగరుకలనఁ
జన్నగవమీఁది కొప్పిరి బన్నసరము,
నొంటి కురువేరు పోఁచకుఁ గంటగింప
రైరి తుఱిమెడు సరపువ్వులం దతివలు.

106


చ.

చిలువసుధారసాధరల చెల్వపుఁ బుక్కిటితావిఁ దీయ నై,
వలపుల నందు తత్ప్రియుల వక్త్రవిషజ్వలనోష్మ నొఱ్ఱ నై,
వెలువడి తద్గుణద్వితయవేధఁ జుమీ యన మ్రాను పట్టుటల్
తలిరులు పుట్టుటల్ గలుగఁ దార్కొనెఁ జందనశైలవాతముల్.

107


మ.

మదనస్యందనతా స్వవృత్తిఁ దెలిపెం, బాటీరభూభృద్వల
న్మృదువాతం బతిపక్వపాదపలతావృంతావళీమూలరం
ధ్రదళత్పంకజకర్ణికాగబహరిద్రాభంగభాభాసుర
చ్ఛదనచ్ఛద్మవివర్తికాంచనకనచ్చత్రిచ్ఛటాచ్ఛీత్కృతిన్.

108


వ.

తదనంతరబ.

109


సీ.

క్ష్మావశారక్తరాంకవ, మరణ్యానీమ
                   ధూది తరుణిమ, వల్ల్యురగరసని
కోద్గతి, తరుగరుత్మ ద్గరుద్గణము, క్రీ
                   డాహార్యజీమూతరోహిఠఁబు

నవమిళిందస్రాహుణకనిమంత్రణ శోభ
                   నాక్షతప్రతతి, వాయన విభక్త
పరభృతౌఘప్రాప్త పత్త్రిక, మాలతీ
                   త్రాసామయావహార్ద్రక్షతజము,


తే.

ప్రమదవన వనదేవతా సముదయాంగ
రాగ మినజ హరిజ్జగత్ప్రాణ శాణ
కషణదళితదళాంతసంక్రాంతకాంతి
ఘనమణిశలాక, చిగురాకు గలయ మొలిచె.

110


తే.

శరవిధుల మాఘ్యములు దీఱె మరున, కిట్టి
యనరున జయింతు మని కదా యద్దినాళిఁ
గ్రూరతిథిఁ గృష్ణరజనిఁ దద్వ్వైరి గనియుఁ
బెద్ద లివురాకుఁ బట్టెన పెట్టు వడిరి.

111


తే.

అవని నపుడు నవోదితుం డైన యట్టి
మరునకుం గుసుమర్తు వ న్మంత్రసాని
బొడ్డుగోసిన కొడవలి వోలె విరహి
దారకం బయ్యెఁ గింశుక గోరకంబు.

112


చ.

కుసుమములెల్లఁ గామినుల కొప్పుల నుండ నటుండ లేమి సి
గ్గెసఁగఁగ వంగినట్లు జనియించె నన ల్మఱి వంగి, జీవితే
శ సమితి గొమ్ములం గరఁచి చల్లఁ గుచక్షణికాంగరాగ మౌ
యసదె యటంచు రాగిలినయట్టులు రాగిలి విచ్చెఁ గింశుడిన్.

113


ఉ.

నైపుణిఁ జందనాద్రి గహనద్రుమసౌరభవీచిఁ దామ్రప
ర్ణీపరిలబ్ధమౌక్తికమణి ప్రకరంబులు దోఁచి దక్షిణా
శాపవనుండు సల్లు వెదఁ జల్ల జనించెన కాక వీనికే
లా పొడమంగ నప్పొలస మప్పుడు నావని దోఁచెఁ గ్రొన్ననల్.

114


క.

వీరుద్ద్రుమిథునమేళన
కై రతిపతి యేయ డుస్సి హరితద్యుతిఁ బై
నా రెగయఁ బొటమరించిన
నారసముల తుద లనంగ ననలవి మించెన్.

115

చ.

తనయుదరంబునం బొడమి తామ్రరుచిచ్ఛట లుల్లసిల్లఁ గో
ల్కొను ధరణీజ సంతతికిఁ గోరకదంతము లించుకంత ని
క్కినయది యాదిగాఁగఁ జెలగెన్ వనలక్ష్మి గడుం జెలంగఁగాఁ
జనుఁ బ్రియుఁడైన మాధవుని సంగతి మీఁదటఁ జాలఁ గల్గుటన్.

116


సీ.

మును ననల్దమిఁ బట్టి ముంగాళ్ళ ముక్కుజో
                   డనలఁ బీలిచి పసర్కొనిన విడిచి
పరువంపువిరిగొందు లరసి చాలై త్రోవఁ
                   బెట్టి యీరము లీఁగు పిండుఁ దగిలి
క్రొవ్విరిఁ దొలుత నొక్కఁడు కని యది వ్రాలు
                   తరి దాని నిలఁబడఁ దాఁకి క్రోలి
యాకురాలుపుగండ్ల నానెడు నాస నిం
                   తడుగూది బం కంటి యంగలార్చి


తే.

యెట్టకేలకు నొకఁ డబ్బఁ బొట్టనిండఁ
గ్రోలి యది గాలిఁ గదలినఁ గూలు నగుచు
బ్రమదవనపాలికలు వేడ్కఁ బట్ట నగుచు
మధుదినాది క్షుధాభ్రమ న్మధుపచయము.

117


సీ.

మరుదూఢమలయాహిగరధూమ్య లనుగళ
                   న్మనసిజరథపదాంజనకళికలు
త్రాస ధావ చ్చిశిరత్యక్తబాష్పముల్
                   పికపంచమస్వరోద్భేద వీణ
లబ్ధాగమన్మరందాసారజంబువుల్
                   హింధోశసాక్షాన్ముకుందరోచు
లభిసారికాంశుకోద్యన్నీలగుళికలు
                   జాత్యనుల్లసనాత్తశాపతతులు


తే.

చైత్రసంజీవనౌషధీజాతచేత
నాత్మజనిహేతుతరుపునర్యాయి యువతి
కరవిధూత హసంతికేంగాలచయము
లళుల పంక్తులు వనఃల నఱ్ఱాడఁ దొడఁగె.

118

తే.

ద్విజతఁ గాంచియు మధుసేవ విడువలేక
జాతి బాపిన తేంట్లనిస్వనము గూడు
కొనుటనో యనఁ గోకిలస్వనము సెలఁగెఁ
దనకు మఱి పంచమత్వంబు దప్పకుండ.

119


ఉ.

పూచినమావులం దవిలి పూవిలుజోదున కమ్మె మాధవుం
డేచిన శంక; నాతఁ డవియే కొనియే పథికావళీజయ
శ్రీచణుఁ డయ్యె; నట్టిద; యకృత్యముచే నగునట్టి పీడయుం
గోచర మౌనె, దైవ మనుకూలము నై, పరుమేలుఁ దీఱినన్.

120


మ.

ఉరుశక్తి న్మధుమాసదోగ్ధ పిదుకన్ జ్యోత్స్నీగవీచంద్రమన్
స్ఫుర దూధః ప్రవిముక్త మైన నిబిడజ్యోత్స్నావయఃపూరమన్
విరియంబాఱినగొజ్జెఁగ ల్గురియ మున్నీరైన యక్కమ్మనీ
రు రహిం గూడిన నేర్పరించు గములై రోలంబకాదంబముల్.

121


ఉ.

దిగ్గియ నంచ దూఁడు గొని తీర వనేక్షువువంకమీఁదుగా
నగ్గెడ పుల్లకేసరమునఁదు వసింపఁగ నెక్కుసూలి ను
న్ప్రగ్గము నందఁగాఁ దరుమరందసరోమకరందగోష్ఠికిన్
వెగ్గల మాడు తేంట్లు మరువింటికి బూనె గుణద్వయత్వమున్.

122


చ.

నిడుద మధూళిక ల్నడుమనే కొని తీఁగలు సాఁగఁ జుట్టుకొం
చదరి కడార కాచకటకాకృతి సుళ్ళ మెలంగె గాడుపుల్
జడగతి నధ్వనీనపరిషత్పటునిశ్వసితానలం బెదు
ర్పడ మఱి సార్చులై చుర చురం దుద సుళ్లుగ స్రుక్కెనో యనన్.

123


చ.

కురిసినక్రిందిపుప్పొడులఁ గొంచు నగంబుల మీఁదికై పిశం
గరుచులఁ గొన్ని పెల్లెగసె గాడ్పులసుళ్ళ్పతి మాధవుండు రా
నెరవుఁగఁ బూపు సొ మ్మిడి వనేందిర భూమికి వెండి మెట్టదా
మరరవణంబు తాఁ గొన భ్రమద్గతులౌ మలుచుట్టులో యనన్.

124


చ.

తరుణు లదోనిదాన మధుధార నన ల్వకుళాళి నింపఁగాఁ,
డరుణుల మేము గామే యన తద్గతలౌ వనదేవత ల్సురన్
ధర వకుళౌఘ మెల్లను నన లనఁ గ్రాయఁగ నించుబుగ్గలన్
దొరసె మధుప్రపూర్ణత మధూకములం బృథుపాండుపుష్పముల్.

125

చ.

తరుణల కౌఁగిట న్ననుచు తమ్ము వృథా విరు లెత్తఁ జేసె మో
పరులుగఁ జైత్రుఁ డంచుఁ దదభావమనోభవవహ్ని వెచ్చి నీ
ర్భరమధుపాళిధూమము పరాగపుఁనీఱును దేనెగట్టెచాఁ
దరుదుగఁ దాల్పఁగాఁ గొరవు లై యెఱుగంబడెఁ గొన్నిభూజముల్.

126


ఆ.

ఫలశలాటు లురుల, నళులకై తమకూడు
చెఱుప, మావు లంటి చెలువ పిండు
మగుడ ననలు నింప, మొగముఁ గన్నులు నెఱ్ఱ
బాఱె మిగుల శౌకపైకములకు.

127


మ.

అతులప్రేమరసార్ద్ర యోర్తు ప్రియహాస్యక్రీడ సంకేతవం
చిత యై తత్క్షణజాంగజజ్వరమిళచ్ఛితభ్రమం బూన్ప నా
పతి నోవృక్షమ కావవే యన సపుష్పం బయ్యఁ గోఁ గంతలో
నతఁడు న్దోఁచిన నవ్వుడు న్విరిసెఁ బ్రాంతాంచన్నమేరుద్రుపున్.

128


తే.

స్థాయి నొక్కండు మగవాఁడు దలఁక కమియ
ఫల మొసఁగె నట్టె కినియక పద్మవదన
వదనసురఁ గూర్మి నొసఁగ నీవలదె పుష్ప
మైన ననుమాడ్కి నుమిసిన నలరెఁ బొగడ.

129


తే.

మధువు గాంతలఁపుక్కిటిమధువుఁ బేళ్ళ
యీర్ష్యఁ, బస సూపఁ, బొగడపై నెలయ, దాన
విరినెఁ దొల్లిటి దళములు, విరులు జడిసె
దీన, నగ్గెల్సునకు నుబ్బి తేఁటు లార్చె.

130


ఉ.

మేకొని తాఁచినం భృగువు మెచ్చిన వానికి మర్త్య భార్య లౌ
శ్రీకి నివాస మై చెలిమి సేయుట నిట్టిప్రశాంతి గల్గెనో
కా కన; నాతి దన్నిన వికాసము నొంది, వనస్థలస్థితా
కోకము సేసె మెచ్చునఁ బ్రసూనఁరజఃకనకాభిషేకమున్.

131


మ.

అళు లేతద్వదనేందురాగమిళనాప్రాదుర్భవత్కోరకం
బుల తేనె ల్సుధ లంచు రా, నొకతె నెమ్మో మెత్తఁ, జైత్రంపుఁబు
ప్వులలోఁ దద్గుణు లయ్యె గఁఢఫలిఁ బువ్వు ల్వుట్టి, పోఁదోలె నొ
చ్చెల చేఁదై, తఱచెందుఁ దల్లిబడికో ల్సెట్టౌటయేకా మహిన్.

132

చ.

అలరెఁ బ్రియాళు వోర్తు ప్రియ మౌట వసంతముఁ బాడ, నప్పు డ
వ్వెలఁది సపత్ని 'భక్తికిని వేల్పులు మెత్తురు గాన రాగమున్
చలమునఁ దన్నుఁ బాడఁగ వసంతుఁడు దా దయచేసెఁ గాక, యా
యలె నిజశక్తి నా' యనుచు నాపసకుం గొదవెట్టె నీసునన్.

133


తే.

అధరసుధఁ ద్రాణిజతఁ బ్రాణి యగుచు మౌక్తి
కాండమాలిక నిడెను నాసాగ్రమౌక్తి
కంబ యనఁ జాలు నన లిచ్చె గతజరత్సు
మంపు వావిలి మొగ మూర్పు నింప నోర్తు.

134


చ.

ఘన మగు నాకు రాలి, తిలకం బతిరిక్తత నున్న, నోర్తు, లోఁ
గనికర మూని, కన్నుఁగవ గాయజుఁ డిల్లడ యిడ్డ తూపులే
యనువుగఁ నించెఁగాక, మఱి యంటక ముట్టక యొక్క చేష్టలే
క నెగడఁ జేసె నంట యిది కల్లనఁగా, నలరించెఁ జూపులన్.

135


తే.

సాంద్రమకరందవృష్టి రసాతలంబుఁ
దొరఁగు పువ్వుల భువియుఁ, బూధూళి నభము
నీక్రమత్రయి మాధవుఁ డాక్రమించె
నురువిరోచనజనితమహోష్మ మడఁగ.

136


క.

ఊడకొనఁ బడు మధూళిక
యోడికలకుఁ గ్రిందఁ గ్రమ్మి యుండెడు తేంట్లన్
నీడలు దిరిగియుఁ దిరుగని
జాడఁ దరు ల్వొలిచె నవ్వసంతపు వేళన్.

137


చ.

శతదశమంజరీధవళచైత్రనిశామలచంద్రికౌఘముల్
ధృతవియదంతకేశి వనవృక్షలతాంతరజశ్ఛట న్గళం
కితఁ గని కామినీకమనకేళియఁ బోఁ జెడవా నగాటవీ
కతక పరాగ మొక్కదెసఁ గ్రమ్మి యనచ్ఛత మాన్పకుండినన్.

138


సీ.

శైత్యపాండిములు దుషారాంతమునఁ జేరె
                   నిరులుకౌ న్ద్రాక్షపందిరుల విరుల,
వలయ గానము లయుక్తల కార్శ్యమునఁ జేరె
                   మలయంపుఁ గమ్మ వీవలుల నలుల,

సౌరభోల్లాసము ల్జాతి గ్రుంగఁగ జేరె
                   నలరారు గొదమక్రోవులను నెలను,
స్ఫుటజటామస్కరంబులు ప్రతిచ్యుతిఁ జేరే
                   నందనప్లక్షసంతతుల వృతుల,


తే.

స్వభృతపరభృతవినుతరసాలపరిష
దహరహఃక్లుప్తబహురహఃప్రహరవిహర
మాణమానవతీపరిమ్లాని మాని
వారి వారిజవనగంధవాహ మొలసె.

139


ఉ.

సారెకు గీరము ల్ఫలరసాలము శాఖలలోనఁ ద్రిమ్మరం
గా రహిఁ ధన్మధూళికకుఁ గా నళిపంక్తులు వెంట గ్రుమ్మరం
గా రొద మించె నందుఁ జిలుక ల్వనలక్ష్మియుఁ దద్వచస్సుధాం
ధోరుచు లానఁగా సరపణు ల్జనుల ట్లిడి పెంపఁగా బలెన్.

140


సీ.

ప్రతిహంతృతాత్తకీటత చన్న భృంగసం
                   ఘపుటంగములచేతఁ గాయమెత్తి,
యమదిశాగతమరుత్ప్రాణియై దదళి రం
                   గస్థలాబ్ధినిఁ దమ్మికన్ను దెఱచి,
ప్రాంతపుల్లామ్రసంశ్రయితచ్ఛటాహఠో
                   ద్దతి లేచి చెలిఁ జైత్రుఁ గౌఁగిలించి,
యురుపరాగపుశాటి నుద్దండవాప్యుత్ప
                   లస్రవత్సీధు రత్యస్ర ముడిపి,


తే.

క్రమ్మఱఁ బలాశ కటకాముఖమునఁ గీర
చలితశాఖాస్పుటాశోకశరముఁ గూర్చెఁ
దద్రతికిఁ గాఁగఁ జలికాలఁ దన్ని మంచు
పాండురాంగండు విడిచిపో బ్రదికి మరుఁడు.

141


చ.

చిగురుఁ బికాళికి, న్ఫలముఁ జిల్కలగుంపునకు. న్మధూళిఁ దేఁ
టిగమికిఁ, దావి గాలికి, విటీవిటకోటికిఁ బువ్వులుం, దలం
బునఁ గృప నీవియు స్సురభి పుంస్త్వముఁ బాంథులచోటఁ బూనె; న
ట్లగుఁ బ్రజ కోర్కు లిచ్చుతన కాత్మఁ దలంచిన దబ్బ దే యనన్.

సీ.

సహకారఫలరససౌరభ్యములఁ గూడి
                   మాధ్విమోపులఁ గదంబముగ వలవ,
మలయజోదరత జంభలఫలత్వగత
                   శ్రీ మించుచెవులఁ గొజ్జెఁగలు మెఱయ,
శశికదళోదర చ్ఛదపుఁ బావడ లూరు
                   చకచకఁ బట్టి పాలికిఁ బెనంగఁ,
ద్రొక్కు తేంట్లకుఁ గాఁక లెక్కింపఁ జెరివిన
                   గంధఫలీపంక్తిఁ గబరు లలరఁ,


తే.

గేలఁ గలవంటకపుఁదావికిని బులిమిన
ఘుసృణములు మించ, నసలఁ బేరెసఁగ పవప
ములు నమేరురజోవృష్టిఁ బూదిఁ జఱవ
నింతు లెనసిరి పూఁబొదరిండ్లఁ బతుల.

143


వ.

అట్టి సమయంబున.

144


ఉ.

కామిని మేఘరంజి మధుగర్వ మడంతు నడంచు, లో నిజ
క్షేమముఁ గోరి, పాడి, మణిచిత్రమరుత్తృణతాచిరద్యుతి
స్తోమవలాహకానలులు దోఁచి, ప్రఫుల్లకదంబకేతకో
ద్దామసమీరణాహతులఁ దాపము నీ నొఱగు న్విచేష్టతన్.

145


తే.

అతివ పూర్ణేందుభీతిఁ దదశ్మశాలఁ
దెండి యతఁ డందు వినుమడి తీండ్రఁ దోఁప
మింటిపయి నుంట గా దీని యింటిపైకిఁ
దెచ్చుకొంటి నటంచు బెన్ ఱిచ్చ వెడలు.

146


తే.

భ్రమరగీతిక మాయ విపంచి మీట,
దాన శ్రుతిఁ గూడి మిగులఁ దద్రక్తి హెచ్చ,
వే నివారించి లేచి, 'దైవికము నెదుట
యుక్తులు ఫలింప' వనుచు బి ట్టూర్చి నవ్వు.

147


తే.

వెలఁది కతితాపదం బయ్యె విరులపాన్పు;
మును దదంఘ్రిహతాదిభర్త్సనలు గన్న

తరుల, బొడమిన వూఱట దన కొసఁగునె,
పొంచి తఱివేచి మిగులనొప్పించుఁ గాక?

148


శా.

పూజాదంభమన న్బరాకుమెయి ము న్పూఁబోఁడి నేర్పూఁది చే
తోజాతానల మార్ప శాస్త్రసరణిన్ దూలి న్హరి న్వ్రాపి ల
జ్జాజాడ్యాకులదృష్టిఁ బ్రత్యవయవేక్షం జేయుచో వెండి వ
క్షోజాగ్రద్రమఁ గాంచి తల్లడిలు నీసు న్దాపమున్ మీఱఁగన్.

149


చ.

కుముదరసస్తటస్ఫటిక కూల నవోత్సలశయ్య వ్రాలి, పూ
ర్ణిమలఁ బికాళిఁ గుట్టునురు త్రెక్కొన ధర్మపుదార పట్టు శే
షము రెయి మల్లికాళిరుతి చక్కగఁ జేయకయుండ నిల్పు, నా
యమ మఱునాఁటికిం గలుగ, నాంతగళచ్ఛ్రుతగుంబితాశ్రువుల్.

150


తే.

నెలఁతఁ గుచకుంభయుగళ ముండియు వియోగ
జలధి యీఁదింప లే దయ్యె; సఖులు పంచు
చున్న పన్నీటివెల్లి లోఁగొన్నకతన,
ముంప కది లాఘవమునఁ దేలింపఁగలదె.

151


ఉ.

చంచలనేత్ర దాల్చు జలజాతమృణాలసరంబు వేగ స
ళ్ళించినఁ, బాఱుతెంచి కబళించి తదూష్మకు నంగలార్చు రా
యంచ కుచేష్టఁ గాంచి, యిఁకనైనను గందుమొ యంచు మోమె వీ
క్షించినఁ, దోఁచు లేనగవు నేరుచు బోట్ల కొకింతప్రాణమున్.

152


ఉ.

శ్రీపతిమీఁది గీభముల ప్రేమ విపంచిక నంటఁ, బాణి సం
తాపము సోఁకి మెట్లమయినంబు గరంగిన, డించి, పాడు నా
లాపినిఁ దాల్చి, పెన్జెమటల న్మఱి తంత్రులు జజ్జుకోఁ; గలా
లాపిని దాన పాడును, గళంబును గద్గద మైన, మ్రాన్పడున్.

153


తే.

ప్రతికుసుమతల్పమునఁ జాతి పడిన తప్త
వలయమలినాంకయుగము వర్తులతఁ బొలిచెఁ,
జూడ నిఁక మానధైర్యము ల్సున్న లనుచు
సుదతి బోట్లకుఁ ద్రప వ్రాసి చూపె ననఁగ.

154


ఉ.

ఆ వనజాక్షి కాఁకఁ బొర లాడ నలగిన సొమ్ముఁ జీరలున్
వే వెస నూడ్చి యూడ్చి మఱి వేఱ వహించుట వారికౢప్తముల్

గా వనమాలి సేవయెడఁ గాంక్ష నొదుంగక కల్లతెల్వితో
నే వలపంత దాఁగఁ జరియించిన దాఁగమిఁ జూచి నెవ్వగన్.

155


క.

పుత్త్రియుఁ దాఁ గామిని నొక
పుత్త్రియు నట్లుండుటకు నబుద్ధేక్షు ధనుః
పత్త్రియగు విష్ణుచిత్తుఁ డ
పత్త్రప లే కదియు నేతపంబో యనుచున్.

156


వ.

తలపోసి దినదినప్రవర్ధమానతనయాతనుగ్లాని కత్యంతదుఃఖితుండై
తత్కారణం బెఱుంగక వల దాని మౌగ్ధ్యంబున వారించి చూచి యంత కంత
కగ్గలం బగుడు గుడికిం జని పూజాంతిమనమస్కరణానంతరంబున, దన
మనోనిర్వేచనం బన్నగరి వెన్నునకు విన్నవింపం బునర్నమస్కృతిం జేసి
"దేవా దేవరదాసి యగు మదీయపుత్త్రి యేమి గుఱించియో విచిత్రంబగు
ప్రతిచర్యం గాత్రశోషంబు సేయుచున్నది. వల దన్న విన, దపుత్త్రకుండ
నగునాకుఁ బుత్త్రియైనను బుత్త్రకుఁడైనను దాన, యే నేమి సేయుదు; మఱి
తన తపశ్చర్యతెఱంగు మా తపశ్చర్యతెఱంగు గాదు, ఏము భవద్దివస భవ
జ్జనిదివస రాత్రులం దక్క గణరాత్రజాగరంబు లెఱుంగ, మేము బిసబీజాక్ష
వలయంబులు దక్క బిసవలయంబు లెఱుంగ, మేము ప్రసాదకుసుమంబుఁ
జెవిఁ జెరుపుటఁ దక్క నవి గప్పుకొన నందు శయనింప నెఱుంగ, మేము
చెంబుల భవత్తీర్థఁబు గ్రోలినఁ దా నంగంబులు దడిపికొను, మేము చాంద్రా
యజంబులఁ జంద్రవృద్ధిఁ బడిఁ గడియెక్కించినఁ దా డించు, నేము నిదిధ్యాన
నిశ్వాస నిరోధంబు నేవనం దాఁ దనదశ వెలికి నిగిడించు, నేను చిన్ముద్రకై
హృదయంబునం గేలు సేర్చినం దాఁ గపోలంబునం జేర్చు. వల్కలోత్త
రీయంబు లేము వహించినం దాఁ గిసలయోత్తరీయంబులు వహించు, నేము
సితపక్షనూత్నేందుఁ గీర్తించినం దాఁ బూర్ణేందు నుపాలంభించు; నిట్లుగా
బ్రవర్తిల్లుచున్నయది; యిది యేటితరం బున్మాదంబు గానోపు, నెంత భవదీయ
భక్తి గలిగిన మాదృశులకుఁ బ్రకృతిసంబంధంబు విడువ; దంతర్యామివి
నీ వెఱుంగని యది లేదు; దీని తెఱంగెఱింగింపవే;" యనపుడు, ననుకంపా
తిశయంబునఁ దచ్ఛాందసంబునకు మందస్మితంబు సేసి మందరధరుం
డిట్లనియె.

157

ఆశ్వాసాంతము

ఉ.

కంధర నీలవర్ణ మధుకైటభ నాగ సుపర్ణ యోగిహృ
ద్గ్రంథిబిదోత్థ భోగివనితా స్వనవచ్ఛ్వస నస్రవచ్ఛిర
స్సంధి వస న్నిశాపతి రసస్రుతి దుగ్ధపయోధివీచికా
మంథరకేళికాదర సమాశ్రిత పంక్తిశిరోధిసోదరా.

158


క.

ప్రపదానిశ నతిచర్యా
త్రిపదావనపర్య, నాకదేవాద్యమర
ద్విప, దానవాహితోదిత
విపులాత్మభవా, భవారివిశ్రుతనామా.

159


తోటకవృత్తము.

ద్రుహిణాండకరండకధూర్వహగ
ర్భ, హరార్భకదుర్భరపక్వతపః
కుహనార్భక, వార్భృతకోనిరిహా
రి హిరణ్మయహర్మ్యచరిష్ణుపదా.

160


మ.

ఇది యంధ్రోక్తి యథార్థనామ యవనాసృక్పూర్ణ కెంబావి వా
రిద పద్ధ త్యవరోధి వప్రవలయశ్రేణీవిఘాతక్రియా
స్పద సేనాగ్రగ కృష్ణరాయ మహిభృ త్సంజ్ఞాస్మదాముక్తమా
ల్యద నాశ్వాసము పంచమం బమరు హృద్యంబైన పద్యంబులన్.

161

పంచమాశ్వాసము సమాప్తము

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.

 
  1. పొదివె
  2. పృథుచూచుకముల నమరె
  3. కూర్పరబద్ధఖేటకం
  4. హిండితములు గావించి య