ఆముక్తమాల్యద/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

ఆముక్తమాల్యద

చతుర్థాశ్వాసము

క.

శ్రీమందిరభుజమధ్యమ
గోమండలకర్షి వేణుగుంభన దృప్య
ద్భౌమాహృతసురజనయి
త్రీమణితాటంక వృషగిరిస్థ ఖగాంకా.

1


వ.

అవధరింపు మాసమయంబున.

2

విష్ణుచిత్తుని విజయము

మ.

బలిమిం ద్రెంపఁగఁ బోలెఁ బాయవడుచుం బర్యాయభంగంబుగాఁ
గలనూ లెల్లను నంటు మోవఁ దెగి రాఁగా, గొంతసే పుండి, తాఁ
బెలుచ న్గంటు పుటుక్కునం దునిపి వే పృధ్విం బడె న్జాలె, మి
న్నుల మ్రోసెన్ సురదుందుభుల్, గురిసె బెన్సోనై విరు ల్బోరునన్.

3


శా.

ఆవేళ న్బతి పారితోషికము లీ నందంద పంపన్, భ్రమ
త్సేవివ్రాతముచే ద్రుతస్ఖలిత యై దీప్యన్మణిస్వర్ణభూ
షావానశ్ఛటజానుదఘ్ని యగుచు న్సంసచ్చతుశ్శాలికా
రైవేశ్మాంతరపద్ధతి న్నెరసె గోత్రాచిత్రమాల్యం బనన్.

4


ఆ.

వేదవేద్య మైన విష్ణుతత్త్వం బిట్లు
వాది గెలిచి, తెలిపి, వసుమతీశు
భక్తి నోలలార్చి, భగవత్ప్రపన్నుఁగాఁ
జేసి, లోకహితము సేయుటయును.

5


శా.

అద్ధావా గ్విబుధం, బహోవచన కవ్యాహార, మాహావచ
స్సిద్ధం, బాః కృతతాం గతః కలి రితి శ్రీసూక్తివిద్యాధరం

బిద్ధౌత్థత్య మగా ల్లయం హి కుధియా మిత్యున్నదత్‌ కిన్నరం
బధ్ధీరాగ్రణి గెల్పుటుత్సవమునం దయ్యెన్‌ నభం బంతయున్‌.

6


సీ.

సెలవులు నాకుచు వెలియరుంగులు సూడ
                   కరిగి పాదూవాహు నరయువారు;
తమమ్రోల నుండునందలముఁ గానక దాఁటి
                   పేరెలుం గిడి బెస్తఁ జీరువారు;
నగరు వెల్వడుదాకఁ దెగి పోయి మఱి నిల్చి
                   తోడివిద్వాంసులఁ గూడువారు;
నెదురైన తమవాని గృహకృత్య మడిగి వాఁ
                   డనునవి తప్ప నూకొనెడివారు;


తే.

'వాద మేమాయె?' నన్న, 'భూవరునిపక్ష
పాత మాదాసరికిఁ గల్గి బ్రతికె, ' ననెడు
వారు; 'నౌ లెం, డిటు విమర్శ దూరమైన
వాకిట వసించు నెవ్వఁ?' డన్వారు నగుచు.

7


తే.

కలిసి యొకకొంతసేపు శృంగాటకముల
నగరిదెసఁ జూచుచునె మంతనంబులాడి,
చనిరి విద్వాంను లిండ్ల, కజ్జనవిభుండు
రూఢి కతని మహాగజారూఢుఁ జేసి.

8


మ.

'పురి యేఁగించి తదీయ మైననగరంబుం జేర్పుఁ' డంచు న్వడిన్
దొరలన్ రాజకుమారులన్ బనుపఁగాఁ, దూర్యస్వనంబు ల్నిరం
తరవందిస్తుతులుం, గజేంద్రహయఘంటావారకాంతాంఘ్రినూ
పురము ల్మ్రోయఁగఁ, గొల్చి వా రిరుగడం బో మార్గమధ్యంబునన్.

9

విష్ణుచిత్తునకు భగవంతుఁడు సాక్షాత్కరించుట

ఉ.

ఇంగిలికంబునం దడిపి యెత్తుకసీసపు రెంటెమో యనన్
నింగి గరుత్పరంపరల నిగ్గున లేఁదొగ రెక్కె; నంత వీ
చెం గలశాబ్ధిమీఁగడల జి డ్డెఱిఁగించెడు కమ్మగాడ్పు; నిం
డెం గడు మ్రోఁత; పెన్దిరువడిం గని రా ఖగరాజు మూఁపునన్.

10

సీ.

చివురుఁబొట్లపుదోయి జెందమ్ము లనఁ దార్క్ష్యు
                   హస్తోదరముల దివ్యాంఘ్రు లమర
నునుఁగప్పుమేనఁ దోఁచిన తదూర్ధ్వచ్ఛాయ
                   లీలఁ దాల్చుపసిండిచేల మెఱయ
వ్రాలిన యోగివర్గము నిర్మలాంతఃక
                   రణములువోలె హారములు దనర,
సిరికిఁ బుట్టింటినెచ్చెలు లౌట మనవికి
                   డాసె మకరకుండలము లమర


తే.

శ్రిత సితచ్ఛద వాత్యాభిహత పరాగ
వలయమండిత కల్పశాఖలొ యనంగ
శంఖచక్రాంచితోరుహస్తములు దనర
దోచె గమలేక్షణుండు చతుర్భుజుండు.

11


క.

ఎప్పుడు హరి గని రమరులు
ముప్పదియును మూఁడుకోట్లు మునిఁ గనుఁగొనునా
రప్పుడు తత్కరములతో
విప్పిన గొడుగులును మించి వేగమ మొగిడెన్.

12


తే.

సమ్మద దిదృక్షు ఖస్థ రక్షః పిశాచ
పుంజ మహిభుక్పతత్త్రప్రభంజనములు
సోఁకఁ వెఱఁ బాఱెఁ కళ్లాన శూర్పవాత
ఘట్టనలఁ బాఱు పెనుఁబొల్లకట్టు వోలె.

13


క.

నీరంధ్రకుసుమధారా
సారచరచ్చంచరీకసంకులకలఝం
కారానుకారి సంస్తవ
కారి మునిస్తోమ సామగానం బెసఁగెన్.

14


తే.

అట్లు ప్రత్యక్ష మైనపద్మాక్షు నంత
రిక్షమునఁ గాంచి ముని ప్రమోదాక్షిజలము
నిగుడఁ బులకించి, కరటిఘంటికలె తాళ
ములుగ నిట్లని యమ్మహాత్ముని నుతించె.

15

విష్ణుచిత్తుఁడు శ్రీమహావిష్ణువును నుతించుట

కవిరాజవిరాజితము.

జయ జయ దానవదారణకారణ శార్‌ఙ్గ రథాంగ గదాసిధరా!
జయ జయ చంద్రదినేంద్రశతాయుత సాంద్రశరీరమహఃప్రసరా!
జయ జయ తామరసోదరసోదర చారుపదోజ్ఝితగాంగఝురా!
జయ జయ కేశవ! కేశినిషూదన! శౌరి! శరజ్జలజాక్ష హరీ!

16

మత్స్యావతారము

మ.

దివిజద్వేషి నుదారవారిచరమూర్తిం జించి చాతుర్య మొ
ప్ప వడిం జౌకపుఁదెల్ల కౌచుగమి దంభం బొంద మైఁ దాల్చి, వే
దవిశుద్ధాక్షర పంక్తిఁ గ్రమ్మఱఁగ వేధం జేర్చెదో నాఁగఁ, ద
ద్భువనం బబ్ధిసితాంబుబిందు లలమం బ్రోద్యద్రుచిన్ దాటవే.

17


చ.

ఎలమి యుగాంతవారి కెదురెక్కుతఱిన్ పడిఁ దాలుగహ్వరం
బులఁ జనునీటివెల్లి బడిఁ బోవు సపక్షనగోరువాశ్చరం
బులు దనుఁ దాఁక, దద్గతత మ్రోయు నజాండమ దైత్యు వేదపం
క్తులు గొని కూల్చినట్టి జయదుందుభిఁ జేసితి కా మురాంతకా.

18


చ.

మితి గడవం దిమింగింల మెయ్మెయిఁ బెంచిన నీదు వాతఁ గు
త్సితపలలాశియైన చిఱుఁజేఁ పది ద్రెళ్లుట నీవు మ్రింగుటే?
శ్రుతు లగునూరుపు ల్మగుడఁ జొచ్చుతఱి న్భవదేధనైధనై
ధితజవశక్తి నీడ్చికొని తెచ్చుటకాక తదల్పతాల్పతన్?

19

కూర్మమూర్తి

మ.

జలపూరప్లవమానమృణ్మయమహీసంరక్షకై గార యీ
బలె ముక్తామణిశుక్తిశంఖనికురంబం బెల్లఁ జూర్ణంబుగా
బలభిద్వజ్రసదృఙ్నిజోపరిపరిభ్రామ్యన్మహామందరా
చలసంఘృష్టిఘరట్ట మైన కమఠస్వామి న్నినుం గొల్చెదన్.

20

వరాహమూర్తి

చ.

ఒకమఱి బుడ్డగింప విలయోదకముల్ పయి కుబ్బి, చిప్ప వ్ర
చ్చుకొని, మహాభ్రవీథిఁ జన, సూకరత న్మెయి వెంచి, వెండి క్రిం

దికిఁ గయివ్రాలు తత్సలిలనిర్మలధార నధఃపరిస్ఫుర
త్ప్రకృతికి నీ యజాండమునె బంగరు ముంగఱఁగా నొనర్పవే!

21

నృసింహమూర్తి

మ.

అసురేంద్రాశయకుండికాచ్ఛరుధిరవ్యాప్తస్వకచ్ఛాయఁ గాం
చి, సముద్యత్ర్పతిసింహమత్సరమిళచ్చేష్టన్ దదుద్ధామదీ
ర్ఘసటాఝాటముఁ బెల్లగించుగతి నాంత్రశ్రేణిఁ గిన్కన్ వెరం
జు సితక్రూర భవన్నఖావళులు ప్రోచు న్మర్త్యపంచాననా!

22


ఉ.

మునుము న్దెల్పును, దూఱదూఱ మఱి కెంపు, న్వెండియుం దూఱఁ గం
దనగాయం గలనల్పుఁ, డోఁప నఖకోణశ్రేణిచే విక్రమం
బున వాఁ డుగ్రతఁ గొన్నయట్టి విలసన్మూర్తిత్రయీతేజముం
గొనులీల న్విదళింపవే యసురవక్షోభిత్తిమిథ్యాహరీ?

23

వామనమూర్తి

మ.

బలిదైతేయ భయాంధకారభరిత బ్రహ్మాండగేహంబులో
పలఁ బై మండెడి తత్ప్రతాపమయదీపజ్వాల డిందన్, గడుం
దలమై మింటికి గ్రక్కున న్నెగయు నుద్యత్తన్మహాచ్ఛాయ నాఁ
గల నీలాంగము శింశుమార మొరయంగాఁ బెంపవే వామనా!

24

పరశురామావతారము

మ.

శమితక్షత్త్రకళత్రనేత్రజలవర్షావేళ నీ కీర్తిహం
సము క్రౌంచస్ఫుటతావకాంబకసుషిం జాఁగంగ నీక్షించి, వ
ర్షము రా నంచలు నంద నేఁడుఁ జను నిచ్చ న్నాటి తచ్చేష్ట వా
యమిఁ; దిర్యక్తతి దా గతానుగతికం బౌఁగా కుఠారీ! హరీ!

25

శ్రీరామావతారము

మ.

పవిధారాపతనంబు గైకొనని యప్పౌలస్త్యు మై సప్తధా
తువులం దూఱు పరిశ్రమంబునకు నుద్యోగించె నా, సప్త సా
ల విభేదం బొనరించి నిల్వక సలీలన్ జన్న యుష్మన్మరు
జ్జవనాస్త్రం బొసగున్ సిరుల్ రఘుకులస్వామీ! రమావల్లభా!

26

సీ.

స్యందనస్థితబిడౌజఃక్షత్తృజాడ్యకృ
                   జ్ఘంఝామరుద్గరుజ్ఝాత్కృతములు
క్రవ్యాశిరాడ్గాత్రకనదసృగ్గాహన
                   స్ఫుటశల్యహవ్యభుక్చూత్కృతములు,
యోధవర్మితహృత్పుటోత్క్రాంత నిజపాత
                   సాలాశ్మకృతముహుష్ఠాత్కృతములు
పతితోగ్రరక్షఃకబంధభారభృశార్తి
                   భుగ్నభోగఫణీంధ్రపూత్కృతములు


తే.

శ్రాంతరథ్య నిరంతర ఛాయదములు,
దివ్యతావక కార్ముకోత్ప్రేరితములు,
కలుషము లడంచుగాత లంకాపురాంగ
ణాంబర చలత్కలంబ కదంబకములు.

27

బలరామావతారము

చ.

'క్షితిహలకృష్టిఁ బుట్టి యడఁగెన్ క్షితియందునెసీత' యంచుఁ ద
త్సతి విరహార్తిఁబాండిమముఁ దాలిచి రామశరీర మెత్తి, యా
క్షితిఖననక్రియ న్మగుడఁ జెందగఁ గాక, కళిందజాతటిన్
క్షితి దున నేటికి న్హలము చేఁగొని నీ కవశాత్మకతన్ హలీ!

28

కృష్ణావతారము

ఉ.

ఆయతయుష్మదాకృతి కరాగ్రనగాంచలవాంత వారిధా
రాయుతచంద్రకాంతఫలకావళిబింబిత యై చెలంగ, నా
రాయణమూర్తి మత్కవచరత్నముచేఁ బరిరక్షఁ గాంచె నా
నో యదువీర! వృష్టిఁ బసి నూఱడఁ బ్రోవవె సప్తరాత్రముల్.

29

బౌద్ధావతారము

మ.

తరుణత్వత్సుతబాణపంచకమునం దైత్యాబలాశ్రేణి త
ద్వరసందోహము యుష్మదాత్మకజరద్బాణం బొకంట న్జెడన్
ద్వరఁ గావించితి వేటికో? యహహ, బుద్ధం బయ్యె నీభావ, మ
తరుణీశీలతనుత్ర మేరికి నసాధ్యం బౌటఁ గా కేశవా!

30

కల్క్యవతారము

శా.

ఘోరాపారమహాఘపంచకముఁ జక్క ల్సేయఁగా నేర్పు నా
ధారాపంచకధావనం జెలగు గంధర్వంబుఁ ద్రొక్కించు బ
ల్బీరంపున్నెఱరౌతుఁ గీకటశరాళీవారవాణీభవ
ద్దోరుద్భ్రాంతకృపాణితాద్వితయవిద్యుద్గ్రంథి నిన్ గొల్చెదన్.

31


చ.

అని వినుతింపఁగా హరి సుధాశనవర్ధకిఁ జూచి 'పాండ్యుఁ డి
చ్చినధన మిమ్మునీశ్వరుఁ డశేషము భాగవతాస్మదీయగే
హనివహసాత్కరించి, యకటాఁ కడు రిక్తత నొందు నేతదీ
యనిలయ మప్పురి న్మణిమయంబును సార్థముఁ జేయు' నావుడున్.

32


తే.

విశ్వకర్మయు నట్ల కావించె; నంత
నఁబుజాక్షుఁడు నమ్ముని నాదరించి,
యీక్షణాగోచరం డయ్యె; ఋషియు నేఁగి
పౌరులు భజింపఁగానె పుత్తూరి కరిగె.

33

విష్ణుచిత్తుని స్వపురప్రవేశము

క.

స్థానికులు దన్ముని దిదృ
తానందితు లగుచుఁ బురము గైసేసి ప్రజ
ల్తోనడువ నాగవాసము
తో నెదురుగ నేఁగి; రంత తూర్యము లులియన్.

34


వ.

ఇ ట్లెదుర్కొని పట్టపవిత్రభగవత్ప్రసాదతీర్థంబు లుపాయనంబులుగాఁ
బ్రణామంబు లాచరించి లేచి, ప్రాంజలులై, భర్మపరికర్మవర్మితంబగు బ్రహ్మ
రథంబున నబ్భాగవతవతంసంబు నునుచుకొని పోవుసమయంబున, బర
స్పరసమేతంబులగు పౌరజానపదజనంబులు గలసి మెలసి నడచునెడ;
మృదంగం బుపాంగం బావజంబు దండెతాళంబు రుమ కిన్నెర సన్నగాళె
వీణ ముఖవీణె వాసెగ్రోలు డోలు మౌరి భేరి గౌరు గుమ్మెట తమ్మెటంబు
డుక్క డక్కి చక్కి చుయ్యంకి లోనగు నసంఖ్యాకవాదిత్రత్రితయపరం
పరలు మొరయ; నెడనెడఁ బడఁతుకలు మలఁపుగొనఁ బట్టణాగతగజ
ధట్టఘోట్టాణఘోట్టాకఘంటాకదంబఘర్ఘరఘోషంబుల కనుప్రాసంబులై, విలా
సినీమంజుమంజీరంబు లెలుంగియ్య నల్లనల్లనం జాఁగుతఱిఁ; గెలంకులఁ

గవచితకుథాకర్బరులగు కరివరకరేణుకంధరలం గనకాంకుశంబులు కేలం
బూని సేవించి పోవు సామంతభూకాంతకుమారధట్టంబులం బిట్టు గాంచి,
యొండొరుఁ గడవ సంభ్రమించుచు, మ్రొక్కి నిక్కి చేయెత్తి యొత్తిలి
నేత్రంబు లుత్తానతరళతారకంబులుగా మగిడి మగిడి పొగడుచుం బోవు తఱిఁ;
దద్రాజకదంబకం బచ్చటిపడంతుకలకుం దమకుం బురికిం జనుదెంచునప్పు
డెల్ల నెడకాం డ్రగుట మేలమాడఁబోలు నాప్రోలిమేళంపుఁ గళావతుల
వైచు నెపంబునం గ్రామగ్రామగ్రామణు లొసంగు నారంగ మాతులుంగ జంబీర
కుంద కందుకాదులం బూర్వానుభుక్త లగునక్తంకరముఖుల వైవ; ధళధళ
త్తరళతాటంకంబును నంకురితవిస్మయంబునుగా, నాతన్ముఖప్రేంఖోళితస్ఫీత
సాకూతవిభ్రమాకేకరాపాంగవిలోకనంబును నాచలితధమ్మిల్లంబునుంగా,
మొగంబులు తివిచికొని సమ్మర్దంబునం జను మార్దంగికుల మూఁపుల మఱుఁ
గులం డాఁగి, యన్నాగవాసంబులు నాగరకవిలోకనంబునం జెలరేగి, మొగం
బులు బిగించుకొని, వేదు రెత్తినగతి నరిదియెత్తఁ బ్రతిపదంబును మర్దల
ముఖావమర్దనకు గ్రుంగుటయు, బయటఁబడి చేయునది లేక యాకడకు మగిడి
తుఱుము దిద్దుచుఁ దద్వారణాభినయనవత్పరానీనకరాబ్జలై సుడివడునెడం
బొడము కర్ణకుసుమావతంసకపోలఖురళీకించిచ్చలనోపలక్ష్యవైలక్ష్యహాస
కుందంబులు సాంద్రతరచంద్రికాకదంబంబులం దీటు కొలుపఁ; జాటూక్తివాచాజ
లగుజరఠవనితలు తమకు మ్రొక్కం దారు మ్రొక్క కొక్కించుక యోర
మోమిడి, వారి యిరుపక్కియల నొదిఁగి తొంటియంటుఁ దలంచి తలవాంచిన,
వంచనం గటాక్షించి యెకసక్కెంబునకుఁ దమచేత మ్రొక్కించుకొనువేడ్క
నక్కడం బుడమిఱేడు లేమి సామాన్యమానవులం గైకొనక, సుమాళంబు
వేద్యంబుగా విద్యావయోవృద్ధుల రగుమీరు మ్రొక్కం దారు మ్రొక్కమి
యెట్లు మ్రొక్కింపుం డనుటయు; గ్రక్కనం బొడము మొలకనగవుల మోముఁ
దమ్ములకు వేఱొక్కవింత తెలివి యెక్క, మ్రొక్క కక్కడఁ గెడఁగూడి
నడచు తోడి చేడియల కద్దొరలకుఁ దమకుం దద్దయుం బొందుగల దను పెద్ద
ఱికం బెఱుకపఱుపఁ గెమ్మోవులు మలంచి లోలోన నొయ్యనొయ్యన నుచు
క్కన నక్కీలెఱింగి దక్కె సొ మ్మని తమ్ము నమ్ముదుసళ్ళు ముందఱికి నూకి
'యక్కక్క, మ్రొక్కవే మనపాలి వేలు'పని బుజ్జగించియు బొమలుగొని
జంకించియు నెట్టకేలకు నొడంబఱచినఁ; ద్రపాతరళనయనలై విరళవిరళాంగు

ళాంజలి బంధంబుగా మ్రొక్కి, కక్కసాన నిట్లు మ్రొక్కించి, హెచ్చి, యచ్చ
య్యాట మెడపడకయుండఁగాఁ జిగురుగుండెలువోలె నల్లుకొని గొల్లన నగు
నల్లోలాంగనల గల్లకోపంబునం గొట్టి కసరుజూపు నారాజసంఘంబుమీఁద
నిగుడ, మగుడ మఱుపడు కొమిరెహరిణలోచనల చలితకంకణసంకులక్రేంకా
రంబు లాననామోదమేదురాళిఝంకారంబుల బింకంబు లడంపఁ; జెవులసంకులు
లోవంకభుజంబులు కొంకిసిగలు గావిదుప్పటులు నొప్ప, నిమ్ము దెప్పరంబై
ముప్పున నప్పురంబుఁ జేరి, రసికజనబాంధవంబున బంధుజనవియోగంబు మఱచి,
గంధకలనాకుసుమస్రగ్గ్రధనాదుల నాంధ్యంబు లే కలరు నంధ్రదేశీయు లగు
గంధకారులు పాటిపాటి పద్యంపుమ్రొక్కులతో వెఱ్ఱివెఱ్ఱి కైవారంబులు
గౌరుతత్తడులపై వచ్చు రాచవారిపై నాఁడువారిపై నాళువారిపైఁ జల్లగాఁ
జల్లఁ, బెల్లెగసి సృష్టియెల్లను ముష్టీకరించుచు, నస్పష్టభేదయగు పరిమళసమష్టిం
బెట్టు పిష్టాతకంబు నభోమండలికిం జండాంతకంబై చండకరకిరణంబుల మాటు
పఱుపఁ, బన్నీరు నించిన తన్నీరుతిత్తులొత్త; వియత్తలంబునం బాఱి కై
వ్రాలు ధారల వాద్యంబులు దడిసిన విద్యోపజీవులు పుష్కరంబులు గ్రాఁప
నగ్గిరోయుచుండ; నమ్మొత్త మత్తఱి నృత్తంబుఁ జూడ నిలిచి మెత్తమెత్తన
నడుచుచుండు మిండతండంబునుం దారు నప్పిండు పుండరీకాస్య లవకాశంబు
గాంచి కాశకుసుమప్రతిఫలనపాండురంబులై పద్యాతిహృద్యపార్శ్వద్వయో
ద్యానపాదపంబులకుం బాఱు చెంగలువకాలువలకుం డిగ్గి కాసరీదధిమండ
మాసరంబులుగా బిసికి యారంబెట్టిన నారంగశృంగబేరభంగంబులతోఁ
గట్టిన కలమాన్నంపుఁజలిది పోకపొత్తులం గుడువఁ గూర్చుండ వీక్షించి;
కుక్షింభరత్వంబున క్షుత్క్షాములై తిరిగితిరిగి వేసారి యోసరిలిన దాసరిగుంపు వారి
పాల గోపాలభిక్ష బిక్షించి భక్షింపఁ దీరక్షోణుల నిలిపిన తోరంపు దివెదారికోలల
రంధ్రగోళంబుల నుత్కీలంబులై మండు ధగధగని జగజ్జ్యోతిదీపజాలంబుల
మధ్య ధూపకుండికాంగారముల నీరాఱఁ గ్రాఁచి, నాదుఁ బరికింప వాయించు
ధిమిధిమిధ్వానంబులకుం బెదరి యీవలి యుపవనశుకంబు లావలి కావలి యుపవన
శుకంబు లీవలికి దట్టంబుగాఁ గట్టనితోరణంబులై పఱవఁ, దలలు విసరుటయు
నోరు దెఱచుటయుఁ గేలు సఱచుటయుఁ దక్క మిక్కుటంబగు నక్కోలా
హలంబున నేపాటియుం బాట వినరాక మూకగట్టిన భాగవతజాతంబు లేతేర;
నూరూరి నంతనంతకుం దిరుగఁ బెద్ద లింటింట సంతరించిన పిలుకువాటుగోడి

గల జావడంబులకుం బుట్టి కాల్గట్టి విడువ నెత్తంబున మెత్తని గఱిక మేసి
పోసరించి మాపుమాపున మేపు సజ్జకవణంపు మేపునఁ బిడుక గొఱసంబు తోమ
కంబునఁ బుటపుటనై కఱియకంబడిప్రాఁకఁ గనియైన నీడం గనియైనం బెదరు
కొదమతట్టువగుంపు కాలికొలందికి వ్రేలు లాలుకుంచెలు గీలించిన గవ్వదంటల
గంటల నలంకరించి మోలుగుమడ్డిం దోఁచి మూర కొక్కడును జేన కొక్కండు
నుగాఁ గుట్టిన డొల్లుటుల్లారు లుల్లసిల్లం బల్లించిన పల్లంబులపైఁ జిల్లతైలం
బును వాసనకొడుపులం బూసిన మణుంగుఁ జంద్రికచేలలె రవణంబులుగా
నెదురుగా వేడుకం జూడవచ్చిన యవ్వీటి మేటిసాలె యగసాలె పటుసాలె
వానెవై జాతి సాఁతు లేతులకొమరులు తుములమై వచ్చు తచ్చమూసామజం
బులం జూచి యేచిన వెఱం దమ యెక్కిరింత లెక్కికొని వాగె లిరుగేలం
గుదియంబట్టిన నిలువ కయ్యుత్సవం బీక్షింప వచ్చినప్రజలం ద్రొక్కుచుం
బోవఁ; తన్మధ్యవృద్ధవధ్వాతురాదులు దిట్ట నిట్టట్టనలేక ప్రాణంబులు పిడి
కిటం బట్టుకొనిపోవుచు, నవీనసవిధకేదారంబులం ద్రెళ్ళి చట్టలు దిగంబడి
వెడలలేకుండం దారు దిగ నిమ్ము లేక పిమ్మటఁగొని నలుదెసలఁ జూడం, జూచి
కేలు సఱచి కోహోయని గేలిసేయు గణికాకదంబంబుల చప్పటులు నిబిడ
నిష్కుటవిటపిఝాటంబులం బ్రతిశబ్దంబులు పుట్టింప; లి ట్లనూనవిభవంబు చిగు
రొత్త నత్తిరుపతి సొచ్చి యచ్చక్రధరునగరి మోసల నిలచుటయు, నవ్విష్ణు
చిత్తుండు దద్రథావతరణంబు చేసి, ధరణీధవస్థానికసమూహంబు వెంటరా
నవ్వైకుంఠు సేవించి, తత్ప్రసాదలబ్ధంబగు వరిపట్టంబున నలంకృతుడై,
నానాలంకారసహితంబును రత్నకాంచనమయంబులు నగు నాత్మీయభవనంబుం
గాంచి విస్మితుండై పుండరీకాక్షమహిమాభిలబ్ధవైభవంబుగాఁ దెలిసి, తత్రత్య
ధాత్రీకళత్రవర్గంబుల ననిపి ప్రవేశించి, తొంటికంటె శతగుణంబులుగా భాగవత
పూజాప్రవణుండై యుండె నంత.

35


మ.

ఉలుపా ల్పట్టినయిండ్ల మజ్జన నృపార్హోదారభుక్తిక్రియో
జ్వలులై, రే హరీకొల్వునన్ వివిధలాస్యస్పర్ధి సుభ్రూభ్రుకుం
సులవాదు ల్పరిదేర్చి పుచ్చి, మణివాసోభూషణగ్రామమున్
జలజాతాక్షునకు సమర్పణము నిష్టం జేసి, యవ్వేకువన్.

36


తే.

ప్రభువు అరిగిరి క్రమ్మఱఁ బాండ్యనగరి,
కమ్మునియు నట్లు వైష్ణవాభ్యర్చనంబుఁ

దన చిరంతన తులసికాదామకరణ
దాస్యమును జేసికొనుచుఁ దత్పరత నుండె.

37


వ.

ఒక్కనాడు మధ్యాహ్నసమయమాలికాసమారోపణానంతరంబున మంది
రఁబునకుఁ బోవునతనిఁ బ్రసాదమందస్మితసుందరవళక్షం బగుకటాక్షంబున
వీక్షించి పక్షిపుంగవకేతనుండు పుండరీకనికేతన కి ట్లనియె.

38

యామునాచార్య చరిత్రము

తే.

'యామునాచార్యుఁ డొక్కఁడు నీమహాత్ముఁ
డొక్కఁడును గాదె దర్శనం బుద్ధరించి
రస్మదీయకృపాతిశయమున' ననిన
నిందిరాదేవి తన భర్త కిట్టు లనియె.

39


క.

'ఇతనికథ యెఱిఁగినదె కా,
యతఁడేమి యొనర్చె?' ననిన నబ్జాక్షుం డా
శతపత్త్రనిలయ కిట్లను,
'నతివ కలం డొకఁడు మత్సదాశ్రితుఁ డాదిన్.

40


తే.

అతఁడు చిఱుతనాఁడె యాచార్యకులమున
వేదశాస్త్రముఖ్యవిద్య లభ్య
సించుచుండ, నపుడు చెలువ, యిప్పటి పాండ్య
నృపతి పూర్వవంశ్యుఁడే యొకండు.

41


తే.

వెఱ్ఱిశైవంబు ముదిరి మద్వినుతి వినఁడు
నతి యొనర్పఁడు మామక ప్రతిమలకును,
హరుఁడె పరతత్త్వ మను, మదీయాలయముల
నుత్సవంబుల కులుకు, నెయ్యురును నట్లె.

42


సీ.

అశ్రాంతజంగమార్చాసక్తి వర్తిలు
                   వేదవిద్ద్విజపూజ వీటిఁ గలిపి;
భౌమవారపు వీరభద్రపళ్ళెర మిడు
                   గృహదైవతంబు లిఱ్ఱింకు లింక;
షణ్ణవతిశ్రాద్ధచయ మారఁ బెట్టు సం
                   కరదాస మయ్య భక్తప్రతతికి;

నాద్యంబు లైన దేవాలయంబులు వ్రాల
                   నవని నిరాళ మఠాళి నిలుపుఁ;


తే.

జందె ముత్తరశైవంబుఁ జెంది త్రెంచుఁ;
బతితు లారాధ్యదేవళ్ళె ప్రాప్యు లనుచు
నుపనిషత్తులు వారిచే నుబ్బి వినుచు,
వెండి యే జంగ మెత్తిన వెరఁగుపడును.

43


క.

శివలింగముఁ దాల్చిన జన
నివహం బేమైనఁ జేయనిది పాపము దా
నవుఁ గా దనఁ; డా సమయము
నవు నను విప్రులక యగ్రహారము లిచ్చున్.

44


తే.

అతఁడు రాజ్యంబుఁ బాలించు నవసరమునఁ
దనవశం బైనయట్టియత్తామ్రపర్ణిఁ
గలుగు నలపుట్టరాని ముక్తామణీకు
లంబు మాహేశ్వరుల కందలకునె తీఱె.

45


తే.

అప్పు డిచ్చకులగు బ్రాహ్మణులు కొంద
ఱాత్మజనిభూమి విడువలే కలికభూతి
గడ్డముల నాన రుదురాక లిడ్డనంది
సూతసంహిత లిఱికించి చొరఁ దొడఁగిరి.

46


క.

శీలముఁ బట్టియు గంజా
హాల లుపాంశున భుజించు నధముల బైటం
జాలఁడు వైవన్, విప్ర
స్ఖాలిత్యము బైలుసేసి కనుగిఱపు సభన్.

47


క.

ఆరాజుమహిషి యేని మ
దారాధనపరత నుండు; నట్లుండియు దు
ర్వారవ్యథకుం గానదు
సారము, విభుఁ దస్మదంఘ్రిభక్తుఁడు గామిన్.

48


వ.

మఱియు నప్పురంధ్రీరత్నంబు.

49

సీ.

వింగడం బైనట్టి ముంగిట నెలకొన్న
                   బృందావనికి మ్రుగ్గు పెట్టుఁ దాన;
దశమినాఁ డేకభుక్తము సేసి, యవలినాఁ
                   డోర్చి జాగరముతో నుండు నిట్రు;
బారని పోనీదు, పైనిద్రఁ బాఱుట
                   క్కలుపాడు మత్పుణ్యకథలఁ ద్రోయు;
నేనుంపుమూనాళ్ళు కామింప దధినాథు;
                   మఱునాఁడు కన్నును మనసుఁ దనియ


తే.

నారజపువన్నెఁ బ్రియుసెజ్జ కరుగుఁ గూర్మి;
నరుగుచో నాభిఁ దుడిచి కప్పురపునాభిఁ
బెట్టు; నిట్టుల మద్భక్తి పుట్టియును ని
జేశునెడ భక్తి చెడదు మదిష్ట మగుట.

50


క.

వనజజరుద్రాదులు మ
తనువులె; తత్పూజనంబు తథ్యము మత్పూ
జనమె;. తదీప్సితఫలదా
తను నేనె; యట్లైనఁ గలవు తరతమవృత్తుల్.

51


క.

కేవలశరీరదృష్టిన
దేవతల న్వేఱ కలుగఁ దెలిసినజడులన్
నా వానుదేవతాస్థితి
భావింపని పూజ సాంతఫలమై త్రిప్పున్.

52


వ.

మఱియు నీరహస్యంబుఁ దెలియ కబ్భూపతి తామసుండై మామకీనంబులగు
జనంబుల సామాన్యబుద్ధిం జూచుచుఁ దద్వృత్తుల కగునుపద్రవంబుల నుపే
క్షించుచు, రక్షావిముఖుండై యుండ వీక్షించి; కలియుగంబున ద్రావిడమండ
లంబునఁ గృతమాలాతామ్రపర్ణీతటంబుల మద్భక్తులు తఱచగుటను, దద్దే
శంబున కొడయం డతండగుటను, రక్షణశిక్షణంబులు రాజముఖంబునం
గాక నేన సాక్షాత్కరించి చేయమియుఁ, దద్రక్షణేచ్ఛ యస్మదాభిముఖ్యంబునం
గాక పొడమమియు, నాయాభిముఖ్యంబు సంవాదంబునం గాని పుట్టమియు,
నే విచారించి; తదాభిముఖ్యకరణార్థంబుగ నాస్థానం బెక్కి వాదిజయంబు

సేయవలయు నను తలం పవ్విప్రకుమారునకుం బుట్టింప; నతం డేఁగి నానా
దేశాగతదీనానాథవృద్ధభూసురకుటుంబంబులకు ధాన్యాజినపటాదులు, వటువు
లకుం బెండ్లిండ్ల, కనుపనీతుల కుపనయనంబులకుఁ, బంగ్వంధబధిరాదులకు
సౌరభేయాదియానంబులు; మఱియుఁ జెఱువు గడమపడియె ననియు, బేద
గుడులకుఁ బూజ నడువ దనియు, నెడవునం జలిపంది రిడియెద మనియుఁ,
దిథి చిక్కు ననియుఁ, తీర్థయాత్రఁ జనియెద మనియను, వ్రతోద్యాపన కని
యును, వ్యాధి మన్పుకో ననియును, జెప్పి పంప, నారాణివాసంబు గుప్తాగుప్త
ప్రకారంబులం బంపుద్రవ్యంబుఁ దెచ్చి యిచ్చు ముదుస ళ్ళగువర్షధరులచేతు
లకుం గ్రందుకొని చే సాఁచిన సందిటితోరణంబులై తోఁచు నేకదండి త్రి
దండి బ్రహ్మచారుల యున్నమితదండంబుల నిండారు కాషాయకద్రువస్త్ర
కౌపీనపరంపరలం గ్రమ్మి, కావళ్ళవడగలజాడఁ గొని, కార్పణ్యంబ విద్యగాఁ
దక్కినవిద్య లెఱుంగక వేఁడు నీదృగ్విధానేకప్రాణుల కాధారంబగు పడ
మటిద్వారంబుఁ జేరి, ప్రతిదినాస్మత్పాదభజన కథాశ్రుతపూర్వ యగు నా
యుర్వీధవుదేవి కాశీర్వచనాక్షతంబులు దౌవారికమఖంబునం బంపి: 'వైదేశీ
కుండ, వైష్ణవవటుండ, వాది గలిగిన విష్ణుతత్త్వంబె పరతత్త్వం బని
వాదించి గెలిచెద, వసుధావరుండు విష్ణుభక్తివిముఖుండు, గావున వైష్ణ
వునిమనవి విన్నవింప నెవ్వారు వెఱతురు; నీవుభక్తిపరాయణవు, పతి
హితాచారవుం గావున నీకు విన్నవించి పంపితి; నీవిభుఁడు నీకు విధేయుండు,
విన్నవించి నన్ను రప్పించి వాదంబు సేయింప నోపుదేని వాదించి గెల్చి,
నీదుభర్తకు భగవద్భక్తి బుట్టించి కృతార్థుం గావించెద' నని విన్నవింపం
బంచిన.

53


తే.

గ్రీష్మసమయనిరుత్సాహకేకిరమణి
నవఘనధ్వని కలరుచందమున నలరి,
యేకతమ నర్మగోష్ఠిఁ బ్రాణేశుతోడ
నతని విధ మెఱిఁగింప, నిట్టట్టు వడుచు.

54


క.

భూవల్లభుఁ "డెట్టెట్టూ!
తా వాదము సేసి శివమతంబు జయింపం
గా వచ్చెనొ? చూతముగా,
రావింపు" మటన్న నాఁటిరాత్రి చనంగన్.

55

వ.

ప్రభావంబునం బరిమితజనం బగు నాస్థానంబునం గొలువున్న భర్త మ్రోలఁ
దా నుండి యయ్యిందువదన యతనియనుమతిం బ్రతిహారిచేతఁ బిలువఁబంచిన,
నబ్భూనిలింపకుమారుండు.

56

యామునాచార్యుఁడు పాండ్యుసభం జేరుట

క.

ద్వారంబు సొచ్చి, కీలిత
గారుడమహి వజ్రవేదికం జివురులఁ గెం
పారు నొక పిప్పలముఁ గని
యా రావిన్ వాదసాక్షికై వలగొనుచున్.

57


సీ.

పసిడిఁగ చ్చమర సోపానముల్ మూఁటఁ దుం
                   గిత విశాలితయుఁ జిత్రితయు నైన
నభ మహాకుథముపై శార్దూలచర్మఖం
                   డావృతుల్ జటిలులు నైన జరఠ
మాహేశ్వరులు చుట్టుఠా, హారసంధి రు
                   ద్రాక్షాయుతముఁ దాల్చి యళికభూతి
సురటిగాడ్పుల రాల, నరుణాయతాక్షుఁడై
                   కుఱుగద్దె బిల్లఁ బ్రకోష్ఠ మునిచి,
నంది ముద్రితపాణియందుఁ జెక్కూఁది యీ
                   గమములు వినుచు, హేమము పొదివిన


తే.

యలఁతి రుద్రాక్షగమి కుట్టులందు మెఱయ,
వెలితపారంబు మించ దువ్వలువ గప్పి,
యడపమును వాఁడివా లొక్కయతివ దాల్ప
భార్య వింజామ రిడ, నొప్పుపాండ్యుఁ గనియె.

58


వ.

కని వినీతుండై చేర నరిగి యజ్ఞోపవీతంబు గాను కిచ్చి కూర్చున్న నాదరిం
పక సంరంభియై యవ్విశ్వంభరాభర్త యిట్లనియె.

59


తే.

సంగతియె యోయి? యిసుమంత ఠింగణావు!
తత్త్వనిర్ణయవాదంబు దరమె నీకు?
నోడితేనియుఁ బట్టి మొఱ్ఱో అనంగ
లింగమును గట్ట కుడుగ మెఱింగి నొడువు!

60

తే.

వాదుల మటంచుఁ జెప్పించి వత్తు; రోట
మైన దయ నీరె యేమైన నని విలజ్ఞ
జూటుఁదనమున సభ లెక్కు చొరవకాండ్రు;
పాఱువారల సుద్ది సెప్పంగ నేల?

61


వ.

అని పలికి దరహాసంబుతో దేవిదెసఁ జూచి యి ట్లనియె.

62


క.

'అస్మన్మతస్థుఁ డోడిన
భన్మము రుద్రాక్షములును బాసి యితనిచే
విస్మయముగ నాప్తము ముర
మస్మరచక్రాంకితుండఁ గాఁ గలవాఁడన్.

63


తే.

ఉవిద, యీనీదువిద్వాంసుఁ డోఁడెనేని
నీకు నితని కే నన్నపూనికయ' యన్న,
‘నొప్పితిమి దేవ రానతి దప్పకున్నఁ
జాలు మఱి పంచభూతము ల్సాక్షిగాఁగ.

64


వ.

అని పలుకు నయ్యిరువుర ప్రతిజ్ఞ లాకర్ణించి.

65


తే.

అతఁడు మృగకృత్తి పెళపెళ యనఁగ, బసుపు
గోచి కట్టిన మోదుగుఁగోల నెగయఁ,
బ్రాంజలి వినీతుఁడై విన్నపం బటంచు
నర్ధముక్తాసనత నిట్టు లనియె ధృతిని.

66


క.

"దేవా, యిట్లని యానతి
యీ వల, దేఁ గడుపుఁగూటి కిట రా, నా డ
బ్బేవారిఁ బ్రోవ? భిక్షా
జీవిక వర్ణికిని విధి సృజించెనె గాదే?"

67


తే.

ఎవ్వఁడే సర్వభూతస్థుఁ డిత్తెఱంగు
నకును బ్రేరేఁచె, నతనియానతియె తెచ్చె,
నెఱిఁగినవి నాల్గు నొడువ నేమయిన లెస్స;
యతఁడ బొంకిన నేమి సేయంగ వచ్చు?

68


తే.

పంతమైనను గానిమ్ము పార్థివేంద్ర,
యుక్తులను నిగ్రహస్థాన మొదవెనేని,

యమ్మ దెచ్చినవిద్వాంసుఁ డనఁగ వలవ,
దెట్లు గావింపవలయు, నట్లట్ల చేయు.

69


వ.

అని యులుకు విడిచి పలికి, మగుడం గూర్చుండి, యతని యనుమతి వాదం
బునకుం దొడంగి.

70

అన్యమతఖండనము

సీ.

అందులో నొకమేటి కభిముఖుండై యాతఁ
                   డనిన వన్నియును ము న్ననువదించి;
తొడఁగి యన్నిటి కన్నిదూషణంబులు వేగ
                   పడక తత్సభ యొడఁబడఁగఁ బల్కి;
ప్రక్కమాటల నెన్న కొక్కొకమాటనె
                   నిగ్రహస్థాన మనుగ్రహించి;
క్రందుగా రేగినఁ గలఁగ కందఱఁ దీర్చి
                   నిలిపి; యమ్మొదలివానికినె మగిడి;


తే.

మఱి శ్రుతిస్మృతిసూత్రసమాజమునకు
నైకకంఠ్యంబు గల్పించి, యాత్మమతము
జగ మెఱుంగఁగ రాద్ధాంతముగ నొనర్చి;
విజితుఁ గావించి దయ వాని విడిచిపెట్టి.

71


క.

'నీ వేమంటివి రమ్మం',
చావలివానికిని మగిడి యట్లనె వానిం
గావించి, యొకఁడొకఁడు రా
నావిప్రుఁడు వాదసరణి నందఱఁ గెలిచెన్.

72


వ.

ఇట్లు జయించి విష్ణుదేవుండె పరతత్త్వం బనియు విశిష్టాద్వైతంబ మతంబు
నగుటయుం బ్రతిష్ఠించిన.

73


క.

ఆయెడను నొక్కపలు కెదు
రై యుండెడు పిప్పలమున నాయెను విన "నో
హో, యిది నిక్కము, నృప, నా
రాయణుఁడె పరంబు, కొల్వు మతని" నటంచున్.

74

వ.

అప్పలుకులు విని ఖిన్నంబై యక్కూడినపాషండషండంబు దలవంచుకొని
పోయిన, నాయుర్వీధవుండు నతని మాహాత్మ్యంబునకు సంతోషించి సా
ష్టాంగ మెఱఁగి, హర్షామృతరసోత్తరంగితాంతరంగుండై, భుజగశయన
చరణకుశేశయభక్తి వొడమి కృతార్థతం బొంది, పాండ్యమండలమునకు
భాగినేయుండ పట్టార్హుండు గావునఁ బాత్రంబని బ్రహ్మచారి యగునతనికిఁ
దన కడగొట్టు చెలియలిం బరిణయంబు సేసి, యరణంబుగ నమ్మహాత్మునకు
ధారాపూర్వకంబుగా నర్ధరాజ్యం బిచ్చి, యువరాజుం జేసి, యధీతసాంగవే
దుండగునతనికి నథర్వశిరినస్సభ్యస్తం బని యెఱింగి, యందు దివ్యాస్త్ర
మంత్రంబుల కలిమియుం దెలిసి, యమ్మహాత్మున కెచ్చరించి దుస్సాధం
బగువిరోధియూధంబు సాధింపు మని దండయాత్రం బనిచిన, నయ్యాము
నుండును సన్నద్ధుం డగుతఱిఁ తత్పురోహితప్రధానమంత్రివర్గంబు సన్నిహి
తంబు లగునివ్వార్షికదినంబులు గడపి శరత్సమయంబున విద్విషత్సంహారం
బునకు విజయంబు సేయు మనుటయు, నత్తెఱంగు రాజున కెఱింగించి తత్స
మ్మతంబున నిలిచె నంత.

75

వర్షాకాలవర్ణనము

ఉ.

కర్కశుఁ డంట కోర్వ, కుదకంబులు వాఃపతి గూర్చినట్లు న
య్యర్కుఁడుఁ దానుఁ గూర్చి మణి యాసలిలాధిపచిహ్నవాహతం
బేర్కల గంగ నాతఁ డెలమి న్మకరస్థితిఁ గన్ననీర్ష్య, దాఁ
కర్కటకస్థుఁ డయ్యెనన, గర్కటకస్థితిఁ గాంచె నత్తఱిన్.

76


తే.

వనతతివరాహవాహారివాయుభుగ్వి
రోధివారణవర్షాభు లాధిఁ దొఱఁగె
నెండ్రి రవి చేర; మూఁడవయెడకుఁ జేరు,
తరణి ధరణిం బ్రమోదసంధాయి గాఁడె?

77


తే.

వనధిగమనజగర్భార్కజనితఘృణులు
మఱి ప్రసూతికి నతనిధామంబుఁ జేరె;
ఘనతఁ జొచ్చినయిండ్లను దనుజ లుండి
కాన్పునకుఁ బుట్టిని ల్చేరుక్రమము గనమె?

78

తే.

ఉర్విఁ గాదంబినుల యలయుమ్మనీరు
దొరుఁగఁ గేకులు కేకలు తోన సేసె,
ద్విజత నారణ్యకధ్వని వినఁగఁ జేసి
గర్భము సుఖచ్యుతము సేయఁ గడఁగె ననఁగ.

79


మ.

అలపర్జన్యుఁడు భానుఁ డన్కొలిమిలో నభ్రంపుఁ బెన్గొప్పెరన్
జల మాఁగన్ బిడుగుక్కుజాత్యపుటయస్కాంతంపు నత్తున్క లో
పంలఁ జూప న్మహిమీఁదిలోహరజముల్ పైఁ బర్వె నా లేచె వా
త్యలఁ బ్రాగ్దావమషు ల్మొగి ల్మొదల గ్రద్దంతై దివిన్ లేచినన్.

80


తే.

ఇలకు డిగి, చుట్టిచుట్టి దు మ్మెత్తి, యెగసి,
పోయి, తము ముంచుసుడిగాలిపుష్కరములఁ
గడలినీ రభ్రకలభము ల్గ్రాసె, ధరణి
నభ్రకరిశిక్ష దినిఁ గాంచినట్టికరణి.

81


తే.

కృతపయఃపాననవమేఘపృథుకములకు
రాలె నొయ్యన వడగండ్ల పాలపండ్లు;
మఱి బలాకాద్విజాళిసంప్రాప్తి గలిగెఁ
బెరుఁగఁ బెరుఁగంగ ధ్వనియు గంభీరమయ్యె.

82


మ.

తనతోయం బినరశ్ము లెత్త, నిల వాత్యారేణుమూర్తిన్ మహేం
ద్రునకుం జెప్పగ, మ్రుచ్చుఁ బట్ట దివమందు న్విల్ఘటింపం, భయం
బునఁ దద్రశ్మిసహస్రము న్వెస డిగెం బో డాఁగి వే గ్రుమ్మరిం
ప, ననం ధారలు దోఁచె మించు వెలిఁగింప న్మబ్పుల న్వెల్లిపై.

83


చ.

తొలితొలి వచ్చుధారల నెదుర్కొని, తచ్చటఁ దీఁగచుట్టుగా
నలముచు ధాత్రి లేచి, పొలుపారే మలీమనబాష్పవల్లు; ల
త్తొలితొలిధారకే వెఱచి; తోన ఘనౌఘము వానకాళ్ళకుం
బలరిపుఁ డాలయాభ్రముల భంగినె సంకెల లూన్చెనో యనన్.

84


చ.

ఎడపక మున్ను మింటిపయి నేతగులంబును లేక మూకతన్
వెడలెడుచోఁ గఠోరఘనబృందము లడ్డము వడ్డ, వానిమే
యిడియ జవోష్మఁ బాఱెడు రవీందులదట్టపుబండికండ్ల చ
ప్పుడుగతి, మ్రోసె రేపగలు భూరిభయంకరగర్జ లత్తఱిన్.

85

చ.

దినముల వెంబడిం జడనిధి న్మును గ్రోలిన నీరిలోనఁ బే
రిన లవణంపుఘట్టముల దృప్యదిరమ్మదదావముల్ దవు
ల్కొని పెటిలించు నార్భటు లొకో యన నౌ సతటిద్భయంకర
స్తవితములన్ సృజించె నతిసాంద్రఘనాఘనగర్భగోళముల్.

86


మ.

ఇనరశ్ము ల్తృష వార్ధిఁ జేరి జల మొక్కిం తాన, నాత్మోష్మఁ జు
య్యని వెంటం బొగ ముంచికో నెగసి, వాతాధూతతత్సంధులం
గన నౌచుం గళదశ్రులై వడకురేఖం దిక్తటప్రోత్థిత
స్తనయిత్నుచ్చటఁ జంచల ల్మెఱసె నాసారంబు దోరంబుగన్.

87


మ.

ఇలనుం గల్గిన జీవనంబుల నిజానిష్టోగ్రమార్తండమం
డల మానం, దయ వైరివైరి సఖుఁ డౌటం దద్రవిం బీల్చి, య
య్యిల కొక్కుమ్మడిఁ గుమ్మరింపఁ దగుఁ దా నెంతైన, నంతైన మం
డలమున్ రాహు పొసంగఁ దాల్చుగతి మింటం బర్వెఁ గాలాభ్రముల్.

88


తే.

పుట్ట వదలి నభోభిత్తిఁ బట్టు శక్ర
కార్ముకపుఁ బెద్ద పలువన్నె కట్లజెఱ్ఱి
దైన నడచెడు కాళ్ళగుం పనఁగ గాలిఁ
గార్కొని దిగంతముల వానకాళ్లు నడచె.

89


చ.

ఒకచినుకు న్ససస్య యగు నుర్వికి డిగ్గఁగ నీవు మూఁగి చా
తకము, లటంచుఁ లోఁ గనలి దట్టముగా నలమేఘుఁ డాడుచుం
డక చన నూఁదఁగాఁ దొరఁగు నాళపుటుండలు వోలె రాలెఁ ద
క్కక పడువర్షధారల ముఖస్థము లై కదకానికాయముల్.

90


సీ.

ఎలగోలుజల్లు మున్ పెళపెళ నేటవా
                   ల్పడి గాలి నట్టిండ్లఁ దడిపి చనఁగ
నట్టె తో వడగండ్ల కట్టావులు దుమార
                   మావుల రేఁచి రెండవదియుఁ జన
మఱి మూఁడవది నిల్చి మెఱసి బిట్టుఱిమి శీ
                   కరవారి సృష్టిఁ జీకటిగ నలమ
నుయ్యెలచేరుల యోజఁ బై పై వెండి
                   జల్లుపైజల్లు పె ల్లల్లుకొనఁగ

తే.

భూభిదాపాది దుర్భరాంభోభరంపు
వడి మరుజ్ఝంఝఁ దెరలక కడవ వంచి
నట్లు హోరని ధారౌఘ మైక్య మొంది
విన్ను మన్నును నొకటిగా వృష్టి బలపె.

91


మ.

అల పర్జన్యుఁడు కేకిపాత్రముల గుం పాడించుచో మేఘమం
డలపున్ మద్దెళ గ్రుంగ లేవను, మరున్మార్దంగికుం డర్థి నొ
త్త లలిన్ నేలకు వ్రాలుచు న్నెగయుచుం దారాడు న త్తెల్ల జ
ల్లులుఁ గెంగ్రుచ్చులు నయ్యె ధారలును దల్లోలేంద్రగోపంబులున్.

92


ఉ.

ఓహరిసాహరిం బ్రథమ మొల్కెడుధారల గాడ్పు లేటవా
ల్గా హతి నీడ్చి, వీఁగు ప్రజలం గలఁప న్మొగి లొందె నంబుభృ
ద్వాహచలద్రథత్వము, మొద ల్మెఱుఁగన్ ధ్వజ మెత్త నౌటగాఁ
నాహదనం జెలంగుజన మాంతము నూరట వోవ రామియున్.

93


తే.

మిగుల నామనిఁ బచ్చ చాంపేయకముల
నమ్మి, కడపటఁ దము వైచి, నాఁడు మగడ
నాసపడువారి నవ్వున ట్లల్ల విచ్చెఁ
గలయ, మూతులు కేతకీగహనతతులు.

94


చ.

అనయము నందనంబు దివియందునె యుండి ప్రసూనవాసనల్
గని పఱతెంచిపోవు నలకారుమెఱుంగులె పోవ రాక చి
క్కెనొ నవగంధలుబ్ధభుజగీపరివేష్టన నా మొగళ్ళ పిం
డునఁ జెలగెం బసిండితగడుం దెగడుం బువురేకు మొత్తముల్.

95


చ.

బలుసెక నించువి ల్లడుగుఁ బట్టినదే యిపు డాకుబూది గెం
పులఁ ద్రిరుచిత్వ మూఁది, మరుముష్టిబిగిన్ దివిఁ గ్రాయు మౌక్తికం
బులజడి జుమ్మనం దొరఁగఁ బో; యిది యింద్రునిదేని, పుట్టరాఁ
గెలసమొ నాఁగ బో ల్విలుజిగిం గరకాస్రుతి నొప్పె మేఘముల్.

96


చ.

అతిజల మబ్ధిఁ గ్రోలెఁ నితఁ, డంతయు రా నతివృష్టి దోష మౌ;
మితి నిపు డబ్దతం బరిణమించినతోయమె చాలుఁ బంట; క
న్మతి నలధాత గట్ట గగనంబున, వర్తులత న్సమంతతో
వృతి యగు సేతుమండలము శ్రీ పరివేషము సుట్టె భానునిన్.

97

తే.

గగనరంగస్థలంబున మిగులఁ బ్రౌఢి
మమునఁ గాళిక నీలికోలము నటింపఁ
బొరి మొగంబున రాలు నిప్పుక లనంగ
గుంపులై రాలె మహి నింద్రగోపకములు.

98


క.

ద్యుమణికరాళి మొగి ళ్లయి
యమవస శశి గలయఁ గూర్చి హద నౌటయు, న
య్యమృతపుబిందులె క్రమ్మఱ
నుమిసెడు ననఁ గలయఁ గరక లుడుగక రాలెన్.

99


చ.

స్ఫురణ మొగిళ్ళపై మొదలఁ బొల్చిఁ జలస్రుతి నాఁడునాఁటికిం
గరఁగుచుఁ బుట్టుచుండుమణికార్ముకరక్తిమ యెల్ల వెల్లిఁ గె
న్నురుపులు గట్టినట్టులు గనుంగొన నొప్పెఁ దదింద్రగోపముల్
గరఁగినవిండ్ల య ప్పసరుకైవడిఁ దెట్టువగట్టు పచ్చికన్.

100


చ.

పెళపెళ మబ్బు బిట్టుఱుమ భీతి విదూరశిలాంకుర చ్ఛటో
త్పులకినియై ప్రియు న్నిదురవోవు హరి న్వడిఁ గౌఁగిలింపఁగాఁ,
దలరి ధరిత్రి సాఁచు గఱు దాలుపుఁగేళ్ళనఁ గంకణంపుమ్రోఁ
తలఁ బులు దేల వండు పయిఁ దాల్చి నదు ల్వెసఁ జొచ్చె వారిధిన్.

101


తే.

కేకిషడ్జంబె దక్కఁ గోకిలపుఁబంచ
మం బఱుటఁ, దోయిపదరులు మఱి పొసఁగమి,
నదియుఁ బ్రియుఁ గూర్ప నదులచో నమృత మయ్యెఁ
బ్రోషితల చేరువకు నంపుబోటివోలె.

102


తే.

రతతనువు రాహు సోమామృతంబు మ్రింగఁ
జక్రి దునిమినమెడగంటిచాయఁ బొలిచె,
నసితమేఘస్థమణిధను వాసుదర్శ
నం బనఁగ నింగిఁ బ్రతిసూర్యబింబ మలరె.

103


చ.

స్వరుఖరతాబ్రసాహిరిపుజాలమదాచిరరుక్శిఖిప్రభా
కరకబకాచ్ఛవాస్ప్రుతులకై లవణేక్షుసురాజ్యదధ్యుదా
కరములు దుగ్ధశుద్ధజలకంధులు నాఁ గలయట్టి సప్తసా
గరములు మేఘుఁ డానెనొకొ కా యనఁగాఁ గనుపట్టె వీనిచేన్.

104

మ.

తనిమం బచ్చ మెఱుంగుగోచియు మణీధన్వోజ్జ్వలాషాఢముం
గొని పుట్టం గొడు గబ్బ నెమ్మిపురియాకు ల్విప్పి శబ్దంబు మిం
చ, నతస్ఫారరజోబలిత్వమున నచ్ఛస్ఫూర్తి మిం దన్ని వే
ఘననీలాంగఁడు గాంచెఁ బాదపతితౌఘంబున్ మరుత్సృష్టమున్.

105


క.

ఘనవృష్టి కతన ఫణు లే
పున నల వల్మీకరంధ్రములు మూయఁగ నె
త్తినగొడుగు లనఁగ ఛత్త్రా
కవికాయం బవని నెల్లకడలం బొడమెన్.

106


ఉ.

సారెకు మింట మేఘుఁడు నిజస్ఫురణం బఱఁ గ్రూరమౌ పురోం
గారకయోగ మూఁది తిరుగ, న్సకుటుంబముఁ దద్గ్రహంబు నెం
తే రుష ద్రొబ్బ నంతలును నింతలునై పడు తన్నభశ్చ్యుతాం
గారశిశుప్రతానములకైవడి రాలె సురేంద్రగోపముల్.

107


క.

కాకోదరాహితుల వ
ల్మీకంబులఁ దూర్చె మెఱసి మేఘుం, డని గుం
పై కనుఁగొని పొగడె ననన్
భేకధ్వను లెసఁగె వృత్త భేదానుకృతిన్.

108


తే.

మొగిలు మైచీకటుల నెక్కు జిగిమెఱుఁగులఁ
బగలు రాతిరి రాతిరి పగలు చేసె;
సకలమును నిద్రపుచ్చు కేశవుని నిద్ర
పుచ్చుఘనునకు నిట్టి దద్భుతమె తలఁప?

109


తే.

ధూళి యడఁగిన మఱి మింటఁ దోఁచె శంప,
జలధరద్రోణి మన్ను పర్జన్యుఁ డెత్తి
ఖనది ఖశ్రీవిభూషేచ్ఛఁ గడుగ మెఱయు
మృదుమహీగతవసురజోరేఖ యనఁగ.

110


తే.

స్థూలపరిపక్వకాననోదుంబరాగ్ర
రంధ్రముల వాననీరు సొరంగ వెడలె
మశకపంక్తులు దావధూమంబు లణఁగ
రచ్చ సేయంగ వెడలె విశ్రాంతి కనఁగ.

111

స్రగ్ధర.

గ్రావాలం గేతకీకోరకకుటజరజోరాజి దూర్వాంకురశ్రీ
తో వీక్షింపన్ దిశానుత్రుటి మఱుపడుచుం దోఁచు, చిట్లొ తిరో
వావిర్భావంబులం బాయక పొరయ నభస్యాభ్రము ల్గప్పి, పై నెం
తే విప్పై పింఛికల్ బర్హిణులు దిరుగఁ, బెల్లింద్రజాలంబుఁ జూపెన్.

112


తే.

గిరులఁ దటజంబుతరువులఁ దొరగ పండ్లఁ
బుట్టె జంబూనదులు; గానఁ బొదవు మొగిలు
మేన నవి సోఁకునెడలు గామితఁ దటిచ్ఛ
లంబునను శుద్ధజాంబూనదంబు లయ్యె.

113


తే.

సురభిబడిఁ జన్న సప్తలాశోకకమల
కువలయామ్రాళికిఁ గదంబ కుటజ నీప
కకుభయూథిక లను సాయకములు మరున
కేను గల్గి గేదఁగిసురె యెక్కు డయ్యె.

114


క.

నటనపరకేకిపాత్ర
స్ఫుటయవనిక లన మొగిళ్లు పొదవెన్ భూభృ
త్తటుల, నవి యాకు దిను చిట
పొటరవము సెలంగెఁ దాళముల చప్పుడు నాన్.

115


చ.

జలధర ముప్పుతోఁ బులు పొసంగు రసం బని యప్పయోధి నిం
పొలయఁగఁ గ్రోలి, పై దధిపయోధియుఁ గ్రోలఁగఁ, బ్రాఁచి దౌటఁ బె
న్బులుసుఁ గరుళ్లు గ్రాయ, నవివో వడగండ్లన రాలెఁ, గానిచో
నిలఁ బడ వానిఁ దిన్నయపుడే చలిపండ్లు వడంగ నేటికిన్?

116


తే.

అపు డనళ్లకు డిగక మేఘాళి పొదువు
నచలములపైనె దొడ్డిక ట్టగుమృగాళి
జాడ చూపట్టె మీఁదిపర్జన్యధన్వి
నృపున కగుతెరవేఁటయాయిత మనంగ.

117


చ.

తడి తల డిగ్గి ముంప, జడతం దుదఱెప్పలఁ గన్ను వీడి, పు
ల్పొడచుచు నీరు ముంగఱల పోలిక ముక్కులఁ గూడ, నోరఁ గొం
తొడియుచు గూఁటికఱ్ఱ సగ మొత్తుచు ఱెక్క విదుర్పు మున్నుగా
వడఁకుటె కాక చేష్ట డిగె వక్షము పక్షులు జానువుల్ చొరన్.

118

క.

చెందు నెఱసంజ కుంకుమ
క్రందునఁ గెంపెక్కుదివికిఁ గాశ్మీరత రా,
నిందుశిలాత్వము రవి గని
యెం; దోయముఁ గురియ నేల యిటు గాకున్నన్?

119


చ.

అలజలరాశినీటఁ బగ లర్కకరావళి చూలు దాల్పఁగా,
నెలమిన యీర్ష్య రాత్రి ధవళాంశుకరాళులు తాము దాల్ప, ద
జ్జలముల నాన మూఁగికొనుచాడ్పున నాడి వహించెఁ జూలు మ
బ్బుల నిల ముంచునీలఘనపుంజమువల్ల బలాకమాలికల్.

120


క.

ఉఱుము విని యలకకై దివి
వెఱఁ బఱచుమరాళపటలి విడిచినఁ బడున
క్కఱచిన బిసలవవిసరము
తెఱఁగున వడగండ్లు ధవళదీధితి రాలెన్.

121


క.

తటిదుత్సారితఫణభృ
త్పటలి నిరన్నంబు లయ్యఁ దక్కపు బర్హుల్
నటన; మతిహర్షహేతూ
త్కటలాభం బిడునె మది క్షుభ న్నీర్వట్టున్?

122


సీ.

రవిఁ జూచి కుడుచువారలకును గృకలాస
                   ములకును దృష్టి మిన్నులనె నిలిచె;
సంధ్యార్ఘ్యదాయిద్విజశ్రేణి కిలు సేరు
                   మొదవులకును భ్రాంతి మది జనించె;
హలజీవినందోహములకు బలాకికా
                   విసరంబులకు మంచి వెదలు దొరకె;
నెలమిఁ బొల్పగుయూఠికలకు సంతలకూట
                   ములకును మఱి విచ్చుమొగ్గ లొదవె;


తే.

నతిథిసంఘంబునకు నీనినట్టియెనువ
కదువులేఁగలగుమికి వాకట్టు లెసఁగె;
మట్టిమిద్దెలవారికి మరువనులకు
నెలఁతఁ బాసినవారికి నిదుర చెడియె.

123

ఉ.

కాలునిదున్న నంది నయి గంటలు దున్నక మంటి నా, మహా
కాలుని నంది దున్ననయి కర్దమమగ్నత లేక మంటి నా,
హాలికు లెన్నఁడుం దెగని యౌరులచేలును జాకుమళ్ళునుం
గా లలి నేరు సాఁగి రిలఁ గల్గుపసిం గొని పేద మున్నుగన్.

124


క.

వరఁజుబడి రొంపిఁ ద్రొక్కం
జరణంబులఁ జుట్టి పసిఁడి చాయకడుపులం
బొరి నీరుకట్టె లమరెను
బిరుదులు హాలికులు దున్నఁ బెట్టిరొ యనఁగన్.

125


క.

నాని శిఖి వంటచెఱకుల
చే నఱ, నవి వెండి వంటచెఱకులె యగుటం
బోనంబు ప్రజకు జక్కుల
బోనంబులె యయ్యెఁ బ్రొయ్యి పొగయమి వృష్టిన్.

126


సీ.

ఇల్లిల్లు దిరుగ నొక్కింతబ్బు శిఖి యబ్బె
                   నే నింటిలోఁ బూరి యిడి విసరక
రాఁజదు రాఁజిన రవులుకోల్ వాసాలఁ
                   గాని కల్గదు మఱి దానఁ గలిగె
నేని కూడగుట మందైన బెన్పొగ సుఖ
                   భుక్తి సేకూర దా భుక్తి కిడినఁ
బ్రాగ్భోక్తలకె తీఱు బహుజనాన్నము దీఱ
                   నారుల కొదవుఁ బునఃప్రయత్న


తే.

మాజ్యపటముఖ్య లయ మెన్న రాలయాంగ
దారులయ మెన్నరంతిక కారజనిక
పచన నాంధోగృహిణి రామిఁ బడుక మరుఁడు
వెడవెడనె యార్ప నొగిలి రజ్జడిని గృహులు.

127


చ.

పిడుగుల కల్కి లోఁ దొలఁచి భీరులు కంచముఁ, జల్లుదీధితు
ల్గడపల వెళ్ళిరాఁ బొగలకావిరి బ్రుంగిన పుల్గృహంబు లె
ల్లెడఁ గనుపట్టె నీళ్ళ నిలయెల్లను ముంచి రసాతలంబుపై
విడియఁగ దండు డిగ్గినసవిద్యుదురుస్తనయిత్నులో యనన్.

128

చ.

గొడుగుల గాలిఁ గూల్చి, మఱి కోలలతోడనె పాఱ, నాన్చెఁ జె
డ్వడ జడి మేఘుఁ; డ ట్లకట పాంథులపైఁ దన కెంతవైరమో!
తడిసిన మేన నింకి యది దారవియోగజవహ్నిఁ గొంత కొం
తుడిసె, విధాతరక్ష విష మొక్కొకమా టమృతంబు సేయఁగన్.

129


తే.

దవులఁ జల్లని తూఱ నంతక మునుపటి
జల్లునీ రూని వచ్చునాజల్లు, మొదలి
గాలి యెలగోలుచేఁ గొమ్మగదలి జల్లు
దలపడకమున్న వంగుళ్ళఁ దడిపెఁ దరులు.

130


చ.

రయమున వృష్టికై యొదిఁగి రచ్చలపై, విధియింతు రుగ్రతన్
హయపతిమీఁద దంతపతి నాతనిపై నృపతిం, గజాదిని
ర్ణయముల మొత్తులాడుదురు, మ్ర బ్బొక యింతయు విప్ప, విచ్చుమొ
గ్గయి మఱి పాసిపోదురు సమస్తదిశాగతులైన యధ్వగుల్.

131


క.

తనరె బలిభుక్తతులు నిం
డిన గ్రామశ్రీల కఱితి నీలము లగుటం
గనియెఁ దృణగ్రాహిత ననఁ
గొను కసవులఁ జైత్యతరుల గూం డ్లిడుభ్రమణన్.

132


మ.

వసతు ల్వెల్వడి వానకై గుడిసె మోవన్ రాక తా నాని యే
వసగా నిల్చిన జమ్ముగూడఁ బొల మంబ ళ్ళ్మోచుచుం బట్టి పె
న్ముసురు న్నీఁగెడు కాఁపు గుబ్బెతల పెన్గుబ్బ ల్పునాస ల్వెలిం
బిసికిళ్ళు బిసికిళ్ళు హాలికుల కర్పించె న్నభ్యస్యంబునన్.

133


మ.

గురుగుం జెంచలిఁ దుమ్మి లేఁదగిరిసాకుం దింత్రిణీపల్లవో
త్కరముం గూడఁ బొరంటి నూనియలతోఁ గట్టావికుట్టారికో
గిరము ల్మెక్కి తమిం బసు ల్పొలము వో గ్రేఁపు ల్మెయి న్నాక మేఁ
కెరువుం గుంపటి మంచ మెక్కిరి ప్రభుత్త్వైకాప్తి రెడ్లజ్జడిన్.

134


సీ.

మణియష్టిఁ గేలిబర్హిణషడ్జసుధ వీను
                   లోలాడఁ బ్రొ ద్దెక్కి మేలుకాంచి,
గమగమవ త్సుమగంధరాజాంగమ
                   ర్దనపైఁ జిరోష్ణమజ్జనము లాడి,

మిసిమిదువ్వలువ బన్నసరంబు మొగలిఱే
                   కులు దాల్చి జామెక్కి కొలు వొసంగి,
జాంగలామిషముతో శాల్యన్న మధికహై
                   యంగవీనంబుగా నారగించి


తే.

మృగమదము మించుతములంపుటిరులు మోవి
దళముగా సాగరుహసంతి వెలుఁగ, సౌధ
శిఖరవాతాయనాగతాచిరరుగంశు
నతదృగవరోధములతోడ నగిరి నృపులు.

135


వ.

ఇట్లు సాంద్రసలిలధారాసారమాసరంబు లగు వార్షికవాసరంబులు ప్రశాంతం
బగుటయుఁ; దదనంతరంబ.

136

శరదృతువర్ణన

ఉ.

రాజమరాళలబ్ధగిరిరంధ్రము, శాలివనీశరావలీ
వైజననంబు, యజ్వహుతవాజహుతాళము, భాస్వదిందిరాం
భోజసమాగమం, బుదితబోధభుజంగశయోపచారనీ
రాజనపుల్లహల్లకసరం, బుదయించె శరద్దినం బిలన్.

137


క.

కరము పొగ రెక్కె నంబర,
మురువిద్యుద్దీపకళిక లుమిసిన ధూమ
స్ఫురణఁ బొగచూరె ననఁగా
హరిమణిజంబూఫలసితామలరుచులన్.

138


ఆ.

సాంధ్యరాగలహరి సామిరంజితములై
తిరిగె మింట నిదుర దెలిసినట్టి
యిందిరాధిపతికి నెత్తు కర్పూరనీ
రాజనము లన శరద్ఘనములు.

139


మ.

అళిగరుదంచలామల తదంతరబింబిత మయ్యెఁ బాకని
ర్దళితమహాఫలౌఘహరితచ్ఛదకర్కటికావనాలి నాఁ,
గలమవనభ్రమచ్ఛుకనికాయము లోపల సాంధ్యరక్తిమం
బలఁతిగఁ దాల్చి మింటఁ గన నయ్యె విపాండుపయోదఖండముల్.

140

క.

ఘుణగణవిహరణఁ జివికిన
మణిధనువువఁ దొరుఁగు నుసి సమానము లై ద
ర్పణనిభనభమునఁ బరిణత
శణకణహరిణములు పాండుజలదము లొలసెన్.

141


క.

రవిశశిముకురములు శర
ద్యువతి మెఱుఁగుఁబెట్టుభూతియో యనఁ బర్వెన్
బవనాహతసప్తచ్ఛద
నివహపరాగంబు దివికి నిర్మలకాంతిన్.

142


స్రగ్ధర.

సంభూతజ్ఞప్తివాతాశనశయనము విశ్వంభరుం డూఁది దేవం,
గంభీరప్రక్రియామగ్నత డిగు జగతిం గ్రందుగాఁ బోఁచువర్షా
దంభోళిస్తూలరంధ్రోద్గతసితపృథుపాతాళజాతాంబుధారా
స్తంభంబు ల్పోలె నెన్ను ల్ధవళరుచి శరస్తంభపంక్తిం జనించెన్.

143


తే.

నీరజేక్షణుఁ డవ్వేళ నిద్ర దెలిసి
యడుగుఁ దనమీఁద మోపనో యవనిరమణి
కంటకితగాత్రి యయ్యె నాఁగా విపాక
పరుషకంటకశాలి మంజరులు వొలిచె.

144


మ.

స్ఫుటభూయోహృతిశంక వార్ధి నినరశ్ము ల్మిన్ను చేర్పం, దటి
చ్ఛట లౌర్వంబుగఁ గారుకొంచు, ఘనమై, క్ష్మాఁ దీఱ వర్షింప, న
చ్చొటనుం దోఁచి గ్రసింపఁ బోలుఁ గలశీసూనుండు! గాకున్న నా
క్కొటఁ దారాగ్రహభాస్కరేందుమణిశుకు ల్వ్యక్తమై తోఁచునే?

145


చ.

అలమలయాద్రి కుంభభవుఁ డన్కతకంబు శరత్తు కుండమం
కలి ప్రతిబింబ కైతవమునం దమ కిచ్చిన వారిదేవత
ల్తొలఁకులకేలఁ దాఁప నిడి తోమఁ గలం కడఁగెం, దదీయత
త్ఫలతకు హ్రస్వమౌటె కరి, తారక లంబువుఁ దేర్చునే యనన్.

146


చ.

ఇలకు సుధాసమత్వము రహింప శరజ్జలజాక్షి కుండమం
డలి సలిలంబుఁ గల్మష మడంగ మొగి ల్విరియెండఁ గాఁచుచోఁ
జిలుకు నిశారజఃపటలి చెన్ను వహించె దరంగపంక్తిపై
దళదరవింద కైరవ కదంబ కడార పరాగపూరముల్.

147

ఉ.

హెచ్చినమైత్రిఁ బద్మినుల కెల్ల ఘనాత్యయకారుకుండు సొ
మ్మచ్చుపడంగఁ జేయుటకునై యలక్రౌంచనగంబు పెరిక
మ్మచ్చున నీడ్చుశర్వగిరియందలి వెండిశలాక పిండు నా
వచ్చి మరాళమాలికలు వ్రాలెఁ గొలంకులఁ జక్రచంకృతిన్.

148


తే.

కుంభజుఁడు వార్ధితోఁ గ్రోలి కుక్షి నున్న
మించుముక్తాచ్చటలె క్రుమ్మరించె ననఁగ
జలజదళములఁ దేటలుఁ జవులు నయిన
యంబుకణములు వొలిచెఁ బద్మాకరములు.

149


చ.

కెరలు స్రవంతిఁ బై యిసుక క్రిం దగువేళ నినుండు మేఘపుం
దెర సనఁ జల్లఁగా, విరహదీప్తకరప్లుత మౌ సజీరకో
త్కరగడ మట్ల పద్మినులఁ గ్రమ్ముఁ సకేసరమాధ్వి పొల్చెఁ, బైఁ
గర మరుదారెఁ దేంట్లు సెకఁ గందినముత్తెపుసేసలో యనన్.

150


చ.

జలజదళస్థతోయములు సందులఁ గ్రందుగఁ దోఁచుమింటినీ
డలుఁ గనుపట్టె నత్తఱిఁ దటారముల న్లఘిమంబు రెంటిలోఁ
దెలియఁ దరంగ బై కెగయు తేఁటులఁచేరులఁ దూన్పఁ దోయము
ల్పలుచనఁ దేలె; మిన్నడుగుబట్టెఁ గడుం దళమౌటనో యనన్.

151


మ.

ఇలకు న్వ్రేఁగుగఁ బండి తీరవనపుండ్రేక్షుచ్చట ల్దీవు ల
గ్గలమై వాల, నురుస్వసంబు లెసఁగంగాఁ ద్రిప్పు రాట్నంపు గుం
డ్రలు నాఁ దేనెకొలంకులం బొరలి పాఱ న్విచ్చు పంకేరుహం
బుల నాడెం దొలుసంజఁ దేఁటివలయంబు ల్తారఝంకారముల్.

152


సీ.

హలనమత్కదళకందాభతిర్యఙ్నతా
                   న్యమునఁ గొ మ్మొకటి మో ననఁగఁ గ్రుంగఁ;
గటముల డిగి చిబుకమున రే పేరిన
                   మదమంజనగ్రంథమాడ్కి మెఱయ;
చిద్రోత్థహతవలత్కద్రూజ మనఁ జుట్టు
                   తో విప్పుతోఁ దరిఁ దొండ మాడ;
జెల్లుఁబెళ్ళలు నీటఁ ద్రెళ్ళి ఫేనము వండు
                   నయి పునఃప్రావృడాశయము నొనఁగ;

తే.

ఘనరజోవృష్టి కై మీఁదికన్ను మొగుడఁ
గటిదెసలు నిక్క, బరితోలు గదలఁ, గీలు
మదముతిక్తత నదుల కీఁ, దదనుకృద్వృ
షాళితోఁ దేంట్లు పఱవఁ, గోరాడెఁ గరులు.

153


శా.

గండద్వంద్వగళత్కరాళమదరేఖల్ ఫుల్లసప్తచ్ఛదా
ఖండక్షోదసిత ల్స్రకీర్ణకములై కర్ణద్వయి న్మించఁగాఁ,
గొండల్ద్రవ్వినమన్ను కత్తులగతిం గొమ్ముంగొన ల్ముంప, వే
దండంబు ల్చవుదంతు లౌటఁ దెలిపెం దండెత్త భూపాలికిన్.

154


తే.

అప్పు డన్యోన్యవిజిగీషు లైనదొరల
కవ దొనలనుండి లబ్దలక్ష్యతఁ బడసిన
స్వకులశరపాళిచేఁ గీర్తి చాలఁ గనెనొ
యన వనాళిఁ బ్రఫుల్లశరాళి మెఱసె.

155


తే.

దరులతడిపండు పొదువుమూఁపురము లంటు
ఱెల్లుగంటల నాఁట్రోకుబోతు లుల్లసిల్లె,
గిరుల మోరుల నవి సముద్గీర్ణసలిల
జలదరచ్ఛేదములు వ్రాలఁ మెలఁగుకరణి.

156


తే.

గగనలక్ష్మి నిజోరు నక్షత్రమాలి
కలు, వియన్నది జలముల గడుగఁ బిసుక
నెఱయు కుంకుడుబండుల నుఱువులనఁగఁ
బలపలని పాండురాంబుదపంక్తు లమరె.

157


శా.

అప్పు ల్వారిధి చేతఁ బుచ్చికొని, కార్యంబైన మున్గొన్న య
య్యప్పు ల్దౌ చనియు న్సవృద్ధికముగా నవ్వార్థికే తీర్పగా
నప్పుణ్యాతివిశుద్ధజీవులు నిజాచ్ఛాంగంబులం దోఁచు న
ట్లొప్పారె న్శశిబింబగర్భితములై ద్యోచారిశుభ్రాభ్రముల్.

158


చ.

విశదపయోదపుంబొరలవేష్టనచే నొకమై నభోమణిన్
లశునపటంబు వొందుట మనంబున నారసి, కాంచి, విష్ణుఁ డ
య్యశివతకై పదంబు వలయంబునఁ బాపి, యవస్తులోభక
త్కశతఁ బ్రబోధ మొంది, సిరిఁ గాంచి చెలంగెఁ బయఃపయోనిధిన్.

159

ఉ.

అంబరవాసు లగ్నిఁగ్రియకై ద్యుమణిస్ఫటికోపలంబునం
దుం బడయ న్శరజ్జలదతూలపరంపరఁ గొంత పై ఘటిం
పం, బెలుచం జనించి, యొకమట్టున నిల్వక యాక్రమించెఁ గాఁ
కం బరితాప మూన ననఁ గాసె మొగి ల్విరియెండ లత్తఱిన్.

160


క.

కంజహితాస్తోదయముల
సంజకడల, నడుముఁ గప్పు, సంధిల, మి న్నొ
ప్పెం జూడఁ బ్రకృతిశబరీ
గుంజానాసావిభూష కొమరు భజింపన్.

161


తే.

గూండ్లకై శాలిమంజరు ల్గొనుచు, మూఁగి,
యంబరంబునఁ బఱచు కీరాళు లొప్పెఁ,
బసరుటొండొంటియాకుతోఁ బండఁ బాఱి
ఛేదభయమున నెగసిన చే లనంగ.

162


సీ.

శ్రీలు దా రౌట నాశ్రితపద్మకర్ణికా
                   కృతిఁ జెవుల్కమలకర్ణికల మెఱయ;
నతనుసారథ్యకృదతిరేఖ మంచెపై
                   నగలించు రొద చిల్క పదువుఁ బఱవ;
దోగమొగ్గలను వైవ దూర మేగమిఁ బెట్టు
                   చప్పట్లఁ జన్నులు జడలు గదల;
పెడత్రోవ మును చెప్పి, వడి నవ్వ, దిరుగు న
                   ధ్వగుకొలందినె యపత్రపయు మరల;


తే.

నధరరదనప్రసాదంబు నడుగ నోరు
దెఱచె ననఁ బండి వ్రీలి ముత్తెములు తోఁచు
చెఱకు జంఘలఁ బోలమి శిరసు వాల్చు
రాజసముఁ గాచు గోపికారాజి వొలిచె.

163


తే.

నింగి యత్తఱిఁ దా మహానీల మైన
గరిమకుం దగ బహుతృణగ్రాహి యయ్యె
ననఁగఁ బరిణత కలమాది యవసరాశి
తతులు గిరు లన నభ్రంకషతఁ జెలంగె.

164

మ.

అయనిష్ఠన్ ధవళాతపత్రి దగు నయ్యాగంబు సాగంగ, నం
దు, యమిశ్రేణులు రాఁగఁ బుంగవకకుత్స్థుం డల్ల వర్షాదినా
త్యయరాముండు సలక్ష్మణుం డినున కోజోవాప్తిగా, విల్లు ని
ర్దయతం ద్రుంప బ్రభగ్నశాల్యవని సీతాలబ్ధి గాకుండునే.

165


క.

మొగిలువిరియెండవేఁడిమి
నిగుడ, శుకశ్రేణి పనరు నింగి న్నిండన్,
బెగడెఁ బ్రజ హరితవాజుల
గగనమణిస్యందనంబు గదిసెనె యనుచున్.

166


తే.

భువి నరఃకైరవశ్రేణి పోవఁదోల,
దీవిఁ గనద్గ్రహనక్షత్రదీప్తి దఱుముఁ,
గృష్ణపక్షపువాసి లే కిరులు దనదు
నలుపునను గూడె నన నైల్య మొలసె నభము.

167


క.ౖో

క్రేపుఁ దలఁచి పని మేయుచుఁ
జేపినపాల్గలయ నెండచేఁ బాంథజనుల్
దూపింపమి కజుఁ డంపిన
యాపాగా యనఁగ నదుల నంచలు మెఱసెన్.

168


తే.

వెద మొదవు కూడఁ బోలేనివెచ్చ గ్రొవ్వు
కల్ప మెడచాఁప వెడలెనో యనఁగ, నెట్ట
కేలకును గ్రుంగి తెచ్చు ఱంకెలు నిగుడఁగ
మందగతి గున్కె వృషభము ల్మందపిఱుఁద.

169


తే.

శరధిజల మెల్ల రిత్తగాఁ గురియ, నుప్పు
డొక్కఁ బేరిన, నత్తెల్పె చిక్కి మీఁద
గాన నగుచున్న దచ్ఛతచే, ననంగఁ
బఱచు శరదభ్రములమేని పాండు వమరె.

170


క.

శరనిధి మును గ్రోలిన ని
ర్భరజలములు గురిసి, మేఘభావం బఱి, య
క్కరములు కరములె కా, జిగి
నొరిమె, ననన్ రవియు మెఱసె, నుడిగెను మొయిలున్.

171

క.

ప్రాశించిననీ రంతయుఁ
బో, శరదభ్రములు మగుడఁ బూరింపఁగ, నా
వేశించెఁ గొలంకుల ననఁ,
గాశప్రతిబింబపటలి కడు నొప్పారెన్.

172


తే.

కొలనఁ గరిదంపతులు పద్మకళిక లొకటి
కొకటి యీ నెత్త, మకరంద మొలుక, నమరె
నల శరత్పద్మనిలయకు నెలమితోడఁ
గవగ నభిషేకమున కెత్తు కడవ లనఁగ.

173


తే.

పంక మడుగంటి తేఱిన బావు లెల్లఁ
బంకములె చేసెఁ గ్రమ్మఱఁ బంకజములు
గళితమకరందయుతరజఃకర్దమమునఁ;
గారణగుణంబు గలుగదే కార్యమునను.

174


క.

ఒసఁగి రగస్త్యార్ఘ్యములం
గొనరి జను, ల్వార్ధి నీరు గ్రోలితి వీనీ
ర్ససికై మా కి మ్మని క
న్కిస రుడుగం గావ నప్పగించెడు కరణిన్.

175


క.

పరుషాతపతప్తంబగు
ధరణీపాత్రమునఁ బడుట దళమయ్యెఁ జుమీ
పరిపక్వంబై, యనఁగా
శరదిందుజ్యోత్స్న రేల సాంద్రతఁ గాసెన్.

176


తే.

వృష్టితఱి నిడ్డజెనఁ ద్రావఁ గ్రిందనుండి
తేట నదినీటఁ దనవెంటఁ దేలుమీల
తరుకుతో నాఁచులత దోఁచె వెలికి, జమిడి
వెండి మీ లెక్కు వెండ్రుకవిల్లువోలె.

177


క.

హంసము క్రౌంచము తొలి రా,
మాంసలరుచి వచ్చెఁ దాను మలయము శిఖఁ; బాల్
హంస విఱువ, నీ ర్విఱిచెను,
హంసమున కగస్తి పరమహంసం బగుటన్.

178

తే.

క్రౌంచ మొకకొన్ని గ్రుడ్డులు గాంచె మింట
నవి యహంసచ్చదాచ్ఛాదనానుభూతి
హంసతతు లయ్యెఁ, గా దన్న, నరుణ చూడ
గుప్తభుజగాశనాండము ల్గుఱులు గావె?

179


చ.

కలయఁగ వారిదేవతలు గాంచు సరోవరదంభదర్పణం
బులపయి దట్టపుంజిలుము వోలఁగఁ దారలకంచు గీయఁగా
బలె నలువంకలం గలయఁ బాయక తేలుచుఁ బద్మరేణువు
ల్కెలఁకులఁ బాసి పోఁ జెలగి గ్రెంకృతు లిచ్చె మరాళమాలికల్.

180


సీ.

అర్కమండలి కభ్ర మడ్డ మైనంతనె
                   యెఱ మాని మోము బి ట్టెత్తి చూచి
ఘుమఘుమధ్వని గాలి గుహఁ జొరఁ, బురి యొకం
                   చుక యెత్తి కని తలంచుకొని వంచి;
నిష్పుష్పకేతకి నేత్రాంబు వొత్తి, భే
                   కపుఁడెంకి పడియచోఁ గర్జ మొగ్గి;
కేకకుఁ ద్ర్యవనతగ్రీవ మై రాక యొ
                   క్కిం తార్చి, వాత నేమేమొ కమిచి;


తే.

వెడలు బీఱెండకును శరద్వృక్ష మీఁగి,
వార్షికమె యెక్కి, త్రోటి నిర్వంకఁ బక్ష
తులను నివురుచు, వెఱ్ఱిచూపుల నురంబు
కెలఁకులఁ గనుంగొనుచుఁ గానఁ గేకు లుండె.

181


క.

వెలుతు రస లంటి యెండియు,
లలి, విప్పమిఁ, జెడక, శిఖికలాపము వని వ
ర్తిలెఁ, బర్జన్యుఁడు నటన
మ్ముల మెచ్చి మెఱుంగుఁగాసె ముద్రించి ననన్.

182


సీ.

చక్రస్తనప్రకాశమునకు ఫేనంపుఁ
                   గొర గిడి గొనగొనఁ గోళ్ళ గొణఁగి;
యశ్మనితంబులు హంసహారమును బ
                   రాగరేఖాస్వర్ణరశనముగను

జలశాటిపులినంపుజఘనంబుపై జాఱ
                   వ్యస్తవేతనభుజస్వస్తిక మిడి,
తనిమితో వెచ్చనై తటశరప్రతిబింబ
                   హాసాళి బాష్ప లుచ్ఛ్వాసములకు


తే.

 నగుచుఁ, జెందొవకంటను నలిగి, త
లంటు కై యొత్తు పదనతి నలరి, కువల
మధులహరి నబ్ధిపైఁ జెంది మగతనముల
నొక్కెడలఁ గూడుచు స్రవంతు లుబ్బు పెనిచె.

183

యామునప్రభుని దిగ్విజయము

వ.

ఇట్లు శరత్సమయం బెసంగిన నంగీకృతక్షత్త్రధర్ముండు గావున దిగ్విజయ
యాత్ర ధర్మం బని యానీతబలషట్కంబుగా నాకృష్ణసామంతరాట్కంబుగా
వెడలి.

184


మహాస్రగ్ధర.

గజఘోటస్యందనాళీకబళితధరణిం గాద్రవేయాధిరాణ్మూ
ర్ధజరత్నశ్రేణు లంతర్మణులసవతులై మ్రగ్గఁ బాదాతకుంత
ధ్వజవాతాఘాతఘూర్ణద్వనధులరవము ల్వాద్యము ల్మీఱఁగాఁ, ద
ద్ద్విజరాజస్యుండు విద్విడ్విదళన మనిఁ గావించె దిగ్జైత్రయాత్రన్.

185


క.

జన్నములు చేసి, దానము
ల న్నానాదేశవిప్రులం దనుపుచు, సం
పన్నత ననిశము బహుభో
గోన్నతుఁ డై యాదమఱచి యుండె నశంకన్.

186


వ.

మఱియు నతని రాజ్యంబునఁ గసవుఁ గఱచి చేయెత్తి మొఱపెట్టుట కరుల
యంద; యట్లట్లువడ మెడఁ బట్టి త్రోయుట వెడవెడం బోవుపల్లవులం
బండువతలంటులకు నింటికిం దెచ్చుపణ్యాంగనాభ్రాతల పరిహాసచేష్టలయంద;
సున్న మెత్తుటయుం బట్టుకారులం బట్టుటయు సౌధసౌవర్ణభూషాదినిర్మాణంబుల
యంద; కాసెకట్టుటయుఁ గత్తి దాల్చుటయుఁ గృకవాకుల కలహంబులయంద;
యతుల్యతులనాదిఘర్షణాదోషంబులు జాంబూనదపరీక్షాదులయంద;
యేదేనియుం గన్నువేయుట మృదంగాదివాదిత్రంబులయంద; ధాతువాదంబులు

తఱ చగుట శాబ్దికులయంద; కాక, యితరస్థలంబుల లేకుండ రాజ్యపరిపాల
నంబు సేయుచుండె.

187


తే.

తత్పితామహుఁ డైన నాథముని శిష్యుఁ
డైన శ్రీపుండరీకాక్షు ననుఁగుశిష్యుఁ
డైన శ్రీరామమిశ్రాఖ్యుఁ డార్తిఁ దనదు
పరమగురు పౌత్త్రునకు నిట్టి బంధ మెట్లు?

188


వ.

యోగసామ్రాజ్యంబు మఱచి సామ్రాజ్యంబునం దాసక్తుఁ డయ్యె; నట్టి
మహాత్మువంశంబునం బుట్టినట్టి యితం డి ట్లగుట యతివ్యతిక్రమంబు.

189


సీ.

వృషశైలఝరవారిఁ ద్రిషవణస్నానంబు
                   నిష్ఠఁ గావించి, యాహ్నికముఁ దీర్చి,
యేకాంతగుహతత్తటీకుశాసనమున
                   నుండి, లక్ష్మీశాంఘ్రిపుండరీక
మంకురత్పులకహర్షాశ్రువై దహరపు
                   ష్కరమున భావించి, సవిత దిరుగ
యజ్ఞోపవీతపద్మాక్షమాలికలతో
                   యోగపట్టికఁ గూడి యురము మెఱయ,


తే.

శౌరిఁ దద్ధరణీధ్రవాస్తవ్యుఁ గొలిచి,
సతియు నాలర్కశాక మంచితము వండ,
ని ల్ముకుందున కర్పించి. వేల్మిఁ దీర్చి,
యిట్లు తనుయాత్ర నడపు ము న్నితనితాత.

190


క.

తొడిఁబడి విషయాతురు నవి
విడు మనియెడు కంటెఁ గలదె వేఱే పగ? నే
ర్పడరఁ గథాదుల నొక వెం
బడి దోఁపం బలికి మైత్రిఁ బాపుట యొప్పున్.

191


క.

వసుధం బుత్రాదికదు
ర్వ్యసనముసైతమును దండ్రి వారించుటకున్
వసపడ దఁట; మఱి రాజ్య
వ్యసనము వారింపఁ నెంతవాఁ డెవ్వాఁడున్?

192

ఆ.

నల్లగ్రోల నిచ్చి మెల్లనె చివ్వంగి
నోటి జింకఁ దివియు నేరు పొదవు
వేటకాఁడు వోలె విషయాళి వలనఁ ద
త్తృష్ణఁ దీఱనిచ్చి త్రిప్పు టొప్పు.

193


వ.

కావున, నట్లయిన నితని నింక నుపేక్షింపరా; దుపాయంబునఁ జొచ్చి యొక్క
రీతిం ద్రిప్పవలయు, నుర్వి నాహారదోషంబు విజ్ఞాననాశంబునకు మూల
కారణం; బని వితర్కించి.

194


క.

ముల్లు దలకొనని నవకపుఁ
బల్లవములతోడ ముక్తిభామ చెవులకుం
బల్లేరుఁబువ్వులగు పువు
లుల్లసిలు నలర్కశాక మొదుగుగఁ గొనుచున్.

195


తే.

తెచ్చి, యొకవైష్ణవుఁడు గానుకిచ్చె, ననుచు
బానసపు బాడబులచేతఁ బంపుటయును,
నతఁడు ప్రియపడి వండించి యారగింపఁ
దెచ్చు నిచ్చఁ, గొన్నాళ్లిట్లు తెచ్చుచుండ.

196


వ.

ఒక్కనాఁ డతండు భోజనసమయంబున నలర్కశాకాస్వాదనంబు సేయుచువచ్చి,
తచ్ఛాకంబు నంజుచుం దలంచుకొని, 'యేత దానేతయగు భాగవతు భోజనా
నంతరంబ మమ్ముం గాన్పింపు' డని పలికి, పాణిపాదప్రక్షాళనాచమనానంత
రంబ గాన్పించుకొని, నమస్కరించి, వచ్చిన ప్రయోజనం బడుగుటయు, నతం
డిట్లనియె.

197


క.

మీ పెద్దలు గూర్చిన ని
క్షేప మొకటి సహ్యజాతసింధుజలాంత
ర్ద్వీపమున నుండ నీకుం
జూపంగా వచ్చితిని వసుమతీనాథా!

198


క.

నా కేటికి నిక్షేపము
నాకు, నిధియు నాకరంబు నరనాథుల సొ
మ్మే కాన విన్నవించెద,
నాకర్ణింపుము తదీయ మగువిధ మెల్లన్.

199

సీ.

స్ఫటల మణుల్ గ్రాల శాంతమై శ్వేతమై
                   నట్టి త్రాఁ చొక్కటి చుట్టియుండు
రక్షోగృహీతమన్ ప్రథ తొల్లి గల దది
                   పొలయ దందేడాఱు నెలలు గాని
యేపాటి బలియైనఁ జేపడుఁ బ్రాణిహిం
                   సాది పూజనముల కాసపడదు
తన వెలుంగొగి నిరంజనదృష్టికినె లక్ష్య
                   మై యుండు నయ్యు నింతంత గాదు


తే.

రత్నమొక్కటి పై ననర్ఘంబు మెఱయు
గలదు పద్మంబు శంఖంబు, పలుకు లేటి
కక్షయ మనంత మాద్య మేకాంతమందు
భూప! నీకొక్కనికె కాక చూపరాదు.

200


వ.

అని విన్నవించిన సంతసించి, సేనాసమేతుండై యతండు మున్నుగా శ్రీరం
గంబున కరిగి కావేరీచంద్రపుష్కరిణులఁ దీర్థం బాడి రంగనాథుని సేవించి
సాభిప్రాయంబుగా నతనిం గటాక్షించిన నతం డిట్లనియె.

201


క.

"మీ పెద్దలు గూర్చిన ని
క్షేప మ్మిది గొ"మ్మంచు శ్రీరంగపతి
శ్రీపదయుగ్మముఁ జూపిన
నాపృథ్వీపతియు హఠనిరస్తభ్రముఁడై.

202


వ.

గ్రక్కునఁ దనపూర్వదశఁ తలంచి యిన్నాళ్ళు దనప్రమాదంబునకుఁ బరమ
నిర్వేదన నొంది 'నీ వెవ్వండ ?' వనుటయు, 'నే మీ పితామహుం డగు నాథ
ముని ప్రశిష్యుండ; నయ్యోగివరుండు భావి భవజ్జన్మం బెఱింగి భాగవతవతం
సంబ వగునీచేత నివ్విశిష్టాద్వైతంబు సకలభూతహితంబుగా వెలయంగలయది
యని నిశ్చయించి, నీకు ద్వయం బుపదేశింపు మని, తన శిష్యుఁడగు పుండరీ
కాక్షున కుపదేశించిన, నతండు భోగాసక్తుండ వైన ని న్నుపాయంబున దెలిపి,
నీ కుపదేశింపు మనుటయుఁ, బనివింటి,' ననిన, సాష్టాంగంబుగాఁ బ్రణ
మిల్లి, యతనిచేతఁ బంచసంస్కారసంస్కృతుండై, యంత నిలువక తురీ
యాశ్రమంబునకు రాఁగలవాఁడై స్కంధావారంబునకు మగిడి వచ్చి, కుమారునందు

రాజ్యభారంబుఁ బెట్టి, బంధుమిత్త్రామాత్యసమేతం బగు బలచతుష్టయంబును
బ్రకృతివర్గంబును నతని కొప్పగించి యిట్లనియె.

203

రాజనీతి

క.

'ఏపట్టున నిసువక ర
క్షాపరుఁడవు గమ్ము వ్రజలచక్కి; విపన్ను
ల్గూపెట్టిన విని తీర్పుము
కావురుషులమీఁద విడకు కార్యభరంబుల్.

204


తే.

రాష్ట్రవర్ధన మెదఁ గోరు రాజు మేలు
రాష్ట్రమును గోరు; దానఁ గార్యమె యనంగ
రాదు; బ్రహ్మోత్తరములైన ప్రజల యేక
ముఖపుఁ గోర్కి దదంతరాత్ముం డొసఁగడె?

205


ఆ.

ఆజ్ఞవలయు నృపతి, కాభీరభిల్లాది
కంపకోల నూల నాజ్ఞ చెల్లు
నంట; సార్వభౌముఁ డైన భూపతి యాజ్ఞ
కెల్లవారుఁ దల్లడిల్లవలదె?

206


క.

దుర్గము లాప్తద్విజవర
వర్గమునకె యిమ్ము; దుర్గవత్తత్తతి క
త్యర్గళ ధరాధిరాజ్య వి
నిర్గత సాధ్వసత పొడమ నిలుపకు కొలఁదిన్.

207


ఆ.

మొదలఁ బెనిచి, పిదప గురియింప, నెవ్వాఁడుఁ
దనదు తొంటిహీనదశఁ దలంపఁ,
డలుగుఁ; గాన శీల మరయుచుఁ గ్రమవృద్ధిఁ
బెనిచి, వేళవేళఁ బనులు గొనుము.

208


ఆ.

అనభిజాతుఁ, గీకటాలయు, నశ్రుతు
నలుకు మాని బొంకు పలుకువాని,
నాతతాయి, గడుసు, నన్యదేశ్యు, నధర్ము,
విడుము విప్రు నేల వేఁడితేని.

209

క.

తక్కుము మిగులఁ బథిచ్యుత
పక్కణవర్ధితులఁ; దొల్లి భ్రష్టగు విప్రుం
డొక్కం డలుగఁడె ప్రోచిన
కొక్కెరపై నొక్కపూఁట కూటికిఁ గాఁగన్?

210


చ.

చదివి యధర్మభీతి నృపశాస్త్రవిధిజ్ఞతల న్వయస్సు డె
బ్బదిటికి లోను నేఁబదికి బాహ్యము నై యరుజస్వపూర్వులై,
మదమఱి రాజు ప్రార్థన నమాత్యతఁ గైకొని తీర్చు పాఱువా
రొదవిన నంగము ల్మిగులనూర్జిత మౌటకుఁ బూఁట సాలదే.

211


వ.

అట్టి మంత్రివర్గంబు దొరకదేని.

212


శా.

నీతిన్ దాన తలంచి చేయఁ బని గానీ కాకపోనీ బల
వ్రాతార్థాఢ్యత నెమ్మి నుండ కొరుఁ బ్రోవన్మంత్రి యంచుం గుణా
తీతున్ గుమ్మడికాయ యంత యగుముత్తెం బై మనం బేర్ప న
ట్లే తా నాతనిచేతిలో బ్రదుకువాఁడే యౌఁ జుమీ మీఁదటన్.

213


క.

ఒక్కనివిరివికినె దొర
ల్పెక్కండ్రే, నొక్కనొకని వెంబడి ననుఁగు
ల్పెక్కండ్రు నిలువఁ బను లగుఁ;
గక్కసము గుదింపఁ; బెంపఁగాఁ గాకుండున్.

214


క.

ధనముఖ్యము కేవల మే
వనియుం గా, దాస్ఠ గలిగి పలువురు ప్రభువుల్
పనిసేయక, తద్వశ్యం
బునకు నలోభానృశంస్యముల్ ఋతముఁ జెలుల్.

215


క.

భాండాగారహయాద్యము
లుండియు నను వగు మనుష్యు లొదవమి నవియున్;
మండలి నవయ నరి కొదిఁగి
యుండిన సింహాసనంబు లుర్వి న్వినమే?

216


తే.

బాహుజాంఘ్రిజముఖవిడంబనకు నయినఁ
గొలిచి మనువిప్రధర్మంబు దెలిసి యైనఁ

బూని సంకటముల నిల్చుఁ గానఁ దఱచు
బ్రాహ్మణునిఁ బ్రభుఁ జేయుట పతికి హితము.

217


ఉ.

ఆయతికాని కీకు మమరాలయముఖ్యము, లాతఁ డర్థతృ
ష్ణాయతుఁ డై నిజోర్వి నగునష్టికిఁ దద్ధనముం దొరల్చి, రా
జాయితనంబుఁ జేర్చు; మఱి యట్టి దపథ్యము, కాన నొంటిగాఁ
డే యధికారి గావలయు, నించుక తిన్నను వాఁడె రూపఱున్.

218


చ.

మును దనసీమ చేసికొని, ముల్లిడి, గుద్దట వెండి చేనిమె
త్తనకయి వేరు వెల్లఁకియుఁ ద్రవ్వెడు కర్షకునట్లు, శత్రుతో
నెనసియ యైన దుర్గబలమే కొని యైన, నిజాత్మ చింత లే
క నెగడఁజేసి, లోన మఱి కంటకశోధనఁ జేయు టొప్పగున్.

219


క.

మొదలనె యెరుదలకానిం
జెదరంగా నాడ కాత్మఁ జింతింపు; పదిం
బదిగ మృష యేని మఱి విడు
ముదస్తుఁగాఁ గాక యుండ నొక్కమతమునన్.

220


క.

ధరణి నసాధ్యనగాటవు
లిరవుగ భూపీడ సేయు నెఱుకుల పొరుగూ
ళ్లెర వగు నస్థితిశూరుల
కెరవుగ నిచ్చునది, మిథము నెట్లయిన నురున్.

221


వ.

విశేషించియు నప్పార్వతీయబలంబు లోనం గూడకయున్న రాజునకుఁ బ్రజా
బాధ దఱుఁగ; దెట్లేని - బెదరు వాపి వారలం జేకూర్చుకొనవలయు; నవిశ్వా
సంబును విశ్వాసంబును, నలుకయు నెలమియు, నతివైరంబును నత్యానుకూ
ల్యంబును, నల్పులగుట నల్పంబునన యగు; నె ట్లంటేని.

222


శా.

విల్లుం దానును భిల్లుఁ డొక్కఁ డరుగ, న్విం దింట దుగ్ధాన్నమున్
భిల్లుం డన్యుఁడు వెట్ట, నార యుడుక న్వీక్షించి,దొబ్బంచు వాఁ
డెల్ల న్వమ్ముగఁ జేసి, త న్ననువ రా, నెందేఁ దెగం జూడఁగా
నుల్లంబై, "చన నంపు, నార చెడు" నా, నూహించి పో నంపఁడే.

223


క.

ఆపాలకూటనే నిజ
మేపాటియుఁ దప్ప రాడిరే; నెరనునఁ గొం

తేపాటి గన్న నలుగుదు;
రీపని యెం తనక వెడఁగుటెద నాటవికుల్.

224


తే.

ఆటవికవశ్యకలన సత్యమున, వైరి
మనుజపతిమైత్రి దూతసమ్మానమునను,
గూర్మి దఱి భృతిఁ గాల్వురకును, నపారి
తోషికపుసేవ నెలమి రౌతులకుఁ గలుగు.

225


క.

మేలగు ఘోటకమును శుం
డాలంబును నాప్తసుభటునకె యిమ్ము; తఱి
న్మేలగు మెలపున మందురఁ
బాలింపుము; దొరలపాలు పఱుపకు మెపుడున్.

226


తే.

కార్య మొక్కఁడు గనిన మాత్సర్యమున నొ
కండు గా దని ఖండించుఁ; గ న్నెఱింగి,
యిరువురను గా దనక కొల్వు విరిసి, మీఁద
నల్లవాఁ డెన్నినది సేయ నగు శుభంబు.

227


క.

పగ వెలిఁ గొని, లో దస్యులఁ
జిగిరింపఁగఁ జేసి, నృపతి చిక్కుపడఁ బను
ల్దెగి సేయక, తారే ది
క్కుగ నడతు రశంక నల్లుకొని దుస్సచివుల్.

228


క.

ఇప్పింతు రాత్మవశులకుఁ
దప్పింతురు పరుల, కార్చి తప్పింతురు, 'రా
జిప్పగిదివాఁడె' యని వే
చెప్పినఁ బెరవారు నమ్మి చేరకయుండన్.

229


ఆ.

వాఁడిఁబొదలు జఠరవైశ్వానరుఁడు గఫ
ప్రముఖదోషయుక్తి బలిమి చెడిన,
వెలి మహౌషధంబు బల మిచ్చు గతిఁ , బ్రతి
సేయ, వారిమదముఁ జెఱుచుఁ బరుఁడు.

230


వ.

వారిమిగిలి ప్రతిసేయనెట్లం టేని,

231

క.

భండారముతో హయమద
శుండాలఘటాళి దనదు సొమ్మై పాగా
నుండిన, నాతడ వాయదె
పండితుఁడును బిరుదునైన పతికిని బయలై.

232


క.

కడుపున నొకకడి దఱిఁగినఁ
జెడఁ జూచుటె కాక పతికిఁ జెలియుం గలఁడే?
ఒడి దంద విడువఁజెల్లునె?
నడపవలయు నేర్చినట్లు నమ్మకయె కృపన్.

233


చ.

ఒకటికి రోయకుంట గను మున్నవియుం, ద్రుపదుండు మారణే
ష్టికిఁ బసిఁ జూపి వేఁడ మునిసింహుఁ డొకండు తమన్న వేల్చుఁ? బం
డొకఁ డపవిత్రభూమిఁ గని యొల్లక యేఁ జనఁ దా గ్రహించె రో
యకనియెఁ దాన న ట్లెఱుఁగ నౌఁ, జనుసర్వముఁ గాన శక్యమే?

234


క.

వీఁ డెడరునఁ గీ డెన్నిన
వాఁ డని, జయ మైన, హింస వదలి కొనుము శ్రీ
పోఁడి; యహి యేమి గొఱ బ
ల్వాడి సెడిన, నట్టిదయకు వైరియు నమ్మున్.

235


తే.

దేశవైశాల్య మర్థసిద్ధికిని మూల
మిల యొకింతైన గుంటకాల్వలు రచించి
నయము పేదకు నరిఁ గోరునను నొసంగి
ప్రబలఁ జేసిన నర్థధర్మములు పెరుఁగు.

236


తే.

ప్రజ లవసి చన్నఁ బిలువ, కప్పసులఁ గొలుచు
నమ్మి, యిండ్లింధనంబుల కాయె, ననెడి
కలని నక్కైన యధికారిగల నృపతికి
నేడు దీవులు గొన్న సమృద్ధి లేదు.

237


మహాస్రగ్ధర.

ఉరవౌ చాగంబు భోగం బుభయము నొకపా లుగ్రసేనావనార్ధం
బిరువా ల్నిండారుబండారిలు చొర నొకపా లిట్లుగా నాయ మొప్పం,

జరదృష్టి న్వైరిపక్షేక్షణము సచివషష్ఠస్వపక్షేక్షణంబుం
ధరణీనాథుం డొనర్పం దగుఁ, దగుఁ దున మం దస్కరాళి న్నిజోర్విన్.

238


క.

లాలన నారక్షులగమి
నేలి, తెలిసి మ్రుచ్చు, నాజ్ఞ యిడ కతఁడు చెఱం
బో, లాఁతి నిడ, నయశ మెం
తే లేవదె శూలపృథువణిఙ్న్యాయమునన్.

239


చ.

ఎఱుఁగ నగున్ స్వశక్తి నవనీశుఁడు నాలుగుపాళ్ళ మూఁడుపా,
ళ్లెఱుఁగక మోచినట్టిపని కిష్టసుహృత్తతి దెల్ప నొక్కపా,
లెఱుఁగ నగు న్నయాఢ్యమతి, నిట్లు నిరాగ్రహుడైనఁ జేయు నె
త్తఱివిపదుగ్రదండపరతంత్రుఁడు గాక చిరంబు రాజ్యమున్.

240


తే.

క న్నొకటి నిద్ర వోఁ బెఱకంట జాగ
రంబు గావించు భూరుహాగ్రంబు మీఁది
యచ్చభల్లంబు గతి భోగ మనుభవించు
నెడను బహిరంతరరులపై దృష్టి వలయు.

241


ఉ.

అక్షర పక్షపాతమున నర్థము నూళ్ళ నొసంగి, నుబ్బునన్
భిక్షుజటాధరాదికులు భిన్న నిజవ్రతులౌదు; రైన దు
ర్భిక్షరుజా శిశుచ్యుతులు పెక్కగు; భక్తియు చాలు, దానఁ ద
త్ప్రక్షుభితత్వ మేయఘముఁ దార్పదు, శంకఁ దలంగు మియ్యెడన్.

242


క.

మును వారత్రయవిజ్ఞా
పన కోర్వుము వధ్యకోటిపట్టునఁ, జెదరం
దన కప్పుడె కీ డగు నను
జనముం బట్టుటకు మునుపె శస్త్రమ చాలున్.

243


క.

శూరాలాపములకు నతి
శూరుఁడు దా నయ్యు నృపతి సోఁ కోర్వఁ దగున్;
వా రుబ్బుదు రందున, నిజ
శూరత దొరలందుఁ గనుట సూ కార్య మిలన్.

244


శా.

రేవు ల్మావు మతంగజంబును మణిశ్రీఖండముక్తాదియున్
రా, వాణిజ్యము పెంచి యేలఁగ నగు; న్వర్షంపు టెవ్వన్ రుజన్

హావళ్ళన్ దిగు నన్యభూప్రజల రా జాయాయిజాత్యౌచితిన్
బ్రోవంగాఁదగుఁ; దోఁట దొడ్డి గను లాప్తుల్చూడఁ బంపందగున్.

245


ఆ.

హదను వచ్చుదాఁక నపరాధిపై రోష
మాఁగి చెఱుపవలయు హదను వేచి,
లక్ష్యసిద్ధి దాఁక లావున శర మాఁగి
కాఁడ విడుచు నంపకాఁడువోలె.

246


శా.

పోవం బోలు లఘుప్రయాణత దినంబు ల్గొన్ని, యొండొంట నే
కా వైరిక్షితి, కంబువు ల్వఱద రాఁగా నిల్చు జాలుంబలెం,
ద్రోవన్ సైన్యము గూడ; వైరి బలసాంద్రుం డైనఁ బూజాదులం
బోవం బోలుఁ, జరోక్తిచేత నసదేఁ బో కావరింపం దగున్.

247


చ.

ద్రవిణము నొవ్వఁ గౌంట, నొఱ ద్రాబలతో నిడుచుంట, భూమి గొం
తవలికి విచ్చుచుంటఁ బ్రథమాప్తతఁ జూడక శంక నుంట, లోఁ
బొవయు నృపాళికై యభయము న్మణిభూషలు గుప్తిఁ బంపిఁ, భూ
ధవుఁ డరియం దిడం దగు భిదం, ధనయం దివి మాన్పుకోఁ దగున్.

248


క.

అహితుఁడు వేఁడిన నేలెడు
మహి సగ మే నిచ్చి తెగని మైత్రిగొని విభుం
డహిభయము మాన్పుకోఁదగు
నహిభయ మహిభయముకంటె నధికము గాదే!

249


చ.

పలుకులు వేయు నేమిటికిఁ? బార్థివుఁ డాత్మభుజాభృతక్షమా
తలమున [1]గుట్టుకీడు బహుధా యరయించి, యడంది చంచలా
క్షులగమిలో మెలంగు పురుషుండును బోలె నశంక నించుచున్
మెలఁగఁడ యేని, రాజ్యఫలమే యది? రాజ్యము దుఃఖలబ్ధికే?

250


తే.

బెదరి చేరని బలియుని బిగియఁ బట్ట
కతనిమైవడినే వచ్చి హత్తఁ జేత
క్రమము, పెనఁగెడు బలుమీను త్రాటఁ జేఁదు
నొడ్డుగాలంపువేటకాఁ డుపమ గాఁడె?

251

సీ.

దండపారుష్యంబు, కొండెంబున నతర్క
                   మరి సంధి కెడయీక మరలఁ బడుట
యవలి తప్పెన్ని కన్న విదేశ్యుఁ జెరుచుట
                   ప్రతి ప్రవర్తకున కేర్పఁడగఁ జేఁత
జను నవిశ్వాసంబు గనుఁగొని మెలఁగుట
                   విశ్వసనీయుని వేర్పఱుచుట
మోమోట మంత్రంబుచో మిక్కిలిడుకొంట
                   మంత్రభేత్తకు నాజ్ఞ మరచియుంట


తే.

వింత పుట్టినఁ గనుగల్గి చింతసేయు
కుంట, మాన్యుల పట్టున నొక్క చూపె
చూడకుంట, విహీనులఁ గూడుకొంట
వ్యసనియై యుంట, చలముంట వలదు పతికి.

252


క.

త్రివిధోత్పాతము లొదవిన,
నవనివిభుఁడు విడువవలయు నధికద్రవ్యం
బవనీసురముఖ సురముఖ
పవనసఖముఖముల భుక్తిబలిహోమవిధిన్.

253


ఉ.

స్పర్ధ పరస్పరంబు దొరపట్టున యోధునిపట్టున న్నృపుల్
వర్ధన మొందఁ జేయఁ దగు; వారిహితాహితచర్య లొంద వం
తర్ధి; మిథోవ్యథావహహితప్రథమానసమానతాప్రథా
ధూర్ధరతాదులం దగిలి ద్రోహపుఁజింతఁ దలంప రేమియున్.

254


చ.

ధరణిపుఁ డెందునేఁ దగదు తాఁ జన నూఱట కొక్కనిం దగుం
దొర నొనరించి వంప నరి దుర్బలుచేఁ జెడఁ డాతఁ డర్థభూ
కరితురగర్థి లేక కొఱ గాఁడటు సేయ ద్విజాన్యుఁ డల్క కౌ
నెరపు నతండునున్ వలయు నిండిన దుర్గబలోర్వి యీఁ దగున్.

255


క.

అడవులు గడిదేశము లవి
దడములుగాఁ బెంపు; మాత్మ ధరణీస్థలికిన్
నడుము లవి పొళ్ళుపొళ్ళుగఁ
బొడిపింపుము దస్యుబాధ పొందక యుండన్.

256

చ.

క్షమఁ గుఱుమన్నెపుం గహనచారి జనంబెడ దోషదృష్టి కు
డ్యము గడుంగంగఁ బూన్కి; దెగ దల్గిన సర్వము; బాస నీగి వ
శ్యముగ నొనర్ప దాడి కగు; నౌ గడి కొల్లలకు; న్శతాపరా
ధమును సహస్రదండము నతర్క్యము సర్వము నేలువానికిన్.

257


తే.

సింధుర మహాశ్వముఖ్యము ల్చేర్చు దౌల
దీవి వణిజుల కూళ్ళు సద్గృహములు పురిఁ
గొలుపుఁ దేజంబు వెల మేలు గలుగఁ బ్రాఁత
వారిఁగాఁ జేయు మరి నవి చేరకుండ.

258


తే.

గడి నృపులరాయబారులయెడఁ గొలువున
సరసల్లావములు రాజు సలుపవలయుఁ;
గార్యఖడ్గము లనుచరు ల్గానఁ బలుక
వలయు; నవి మైత్రిఁ దాఁ దేలఁ బలుకవలయు.

259


తే.

తా నవంబుగ దొరఁజేయువాని మంత్ర
మునకు వేగమె లోఁజేయఁ జనదు; వాఁడు
క్రొత్తమన్నన రహి ననుఁగులకుఁ జెప్ప,
నయిన నది చెడు, మఱి వాఁడు నడఁగుఁ గాన.

260


సీ.

హితబహుశ్రుతధర్మరతశూరతాన్వపూ
                   ర్వతల మన్ద్విజుల దుర్గముల నిలిపి,
పులిజున్ను మొదలుగాఁ బురుషాయుషావధి
                   కం దుండ సవరణ ల్పొందుపఱిచి,
చీమంత యైనను సామంతకోటికి
                   మిత్రము దప్పక యుండ క్షితు లొసంగి,
యాయాధికవ్యయా నధికంబునుం బ్రజా
                   విరుజంబుఁ గాఁగ బండరువుఁ గూర్చి


తే.

క్షీణరిపుధాత్రిఁ జరదృష్టిచేతఁ జూచి,
బకహఠగతి గ్రహించి, తాఁ బ్రజయు నొవ్వ
కయ పగఱగాత్రములనె చీకాకుపఱుచు
నృపతి డెంచానఁ జేయిడి నిద్రవోవు.

261

క.

ఎచ్చో గజఘోటక్రయ
తచ్చర్వణసుభటజీవి తద్విజసురపూ
జోచ్చనిజభోగముల కగు
వెచ్చము వెచ్చంబు గాదు విత్తంబునకున్.

262


ఆ.

ప్రతిన వలదు వైరిపట్టున నృపతికి,
దండువెడలఁ దీఱకుండుఁ దీఱుఁ;
గాక యుండియుండి కాలాంతరమున నౌఁ;
గార్యకాఁడొ యంకకాఁడొ నృపుఁడు.

263


క.

పోరానిపట్లఁ బొడుచుట
వైరిబలము దిరుగ జయమొ స్వర్గమొ యగు; నా
నారూపయంత్రతత్ప్రా
కారాదులపట్లఁ బ్రజనె కవియింప నగున్.

264


చ.

మనమున కొండు రెండు మఱుమంత్రముల న్సరిపోవఁ జెప్పినం
జనపతు లాతనిం బిలువ సాగదు; రాగతి సారెఁ బిల్చున
చ్చనువునకే ధనాదిఁ గొని సంగతి గానివి క్రొవ్వి చేయఁ జె
ప్పు; నృవతి దద్బహిశ్చరితముం జరుచేఁ బరికింపఁగా దగున్.

265


క.

గడివాఁడు చెడునయేఁ దగుఁ
జెడఁ జేయుట; చెడఁడయేని చెల్మియె తగుఁ; బై
గడివాఁడే పనికగుఁ దన
గడి వాఁ డరియైనఁ, దనకె గడి కావఁబడున్.

266


తే.

రాష్ట్ర మెరియింపు, కొనుము దుర్గములు, తదవ
రోధ మగపడ్డఁ బుట్టింటిరూఢి నెరపు,
పరుసములు తద్రిపులరాయబారు లెదుటఁ
బలుకకుము, సంధి యొకవేళ వలసియుండు.

267


ఆ.

ఆభిచారి ఘనగరాంబుదూషితరుఙ్ని
రంతరాద్రిగహనదంతురోగ్ర
కీకటోర్వి మేరుగిరిసమార్థము వచ్చు
నేనిఁ జొరకు, పంపె యిడుము కొనఁగ.

268

క.

రాణింపఁ బలి తనపని
జాణై కొనుఁ, గొలుచు సంతసపుఁదఱిఁ, దొలఁగుం
దాణ చెడఁ గపుడు మానిషి;
నాణె మెఱుఁగ బచ్చు గాఁగ నరపతికిఁ దగున్.

269


సీ.

తద్‌జ్ఞమండలిఁ గూర్చి ధాతువుల్ దెలిసి హే
                   మాదులఁ గొని ప్రకృత్యనుగుణాల్ప
జీవనాహృతులచేఁ జెలఁగి మహాబలో
                   ద్రేకంబు మర్దన రిత్తఁ జేసి
స్నేహార్ద్రుఁ డగుచు నశేషంబుఁ బోషించి,
                   నరవర్ణముల తప్పుసరణు లుడిపి
సతతద్విజప్రతిష్ఠాశాలియై బలి
                   యించుపట్టులు బలియించి పలుచఁ


తే.

జేయు పట్టులు పలుచఁగాఁ జేసి తేజ
మెసఁగ శోధన మఱవక యెసఁగ వలయు
సాంగ రాజ్య మొకెత్తుగ స్వాంగ రాజ్య
మొక్క యెత్తుగ నృపతి యాయుష్యపరత.

270


సీ.

సౌఖశాయనిక భిషక్పూర్వకము కల్య
                   వేళఁ గార్తాంతిక ద్విజుల గోష్ఠి
జామువోవ నమాత్య సామంత పూర్వకం
                   బర్థార్జనస్థ కాయస్థ గోష్ఠి
దిన మధ్యమమున మర్దనమల్లపూర్వకం
                   బగు సూదసూపకృన్మృగయు గోష్ఠి
యపరాహ్ణమున దేవతార్చనాపూర్వకం
                   బార్యధర్మాది కృద్యతుల గోష్ఠి


తే.

భక్తిమీఁద విదూషక పూర్వకము పు
రాణ కవిగోష్ఠి, చారపూర్వకము సంజ
జాము గాయక గోష్ఠి, నిశన్ సుషుప్తి
పూర్వకము ప్రేయసీ గోష్ఠి పొసఁగుఁ బతికి.

271

క.

హితులు హితాహితులు సదా
హితులునునై రాజునెడల నిటు త్రివిధమునన్
క్షితి ననుచరు లుందురు సం
తతమున్; మఱి వారిఁ దెల్పెదన్ విను మనఘా.

272


చ.

హితులు భిషగ్గ్రహజ్ఞబుధబృంద కవీంద్రపురోహితుల్హితా
హితులు ధనార్జనాదినృపకృత్యనియుక్తులు వెండి కేవలా
హితులు దశావశార్పితసమృద్ధరమాహరణేచ్ఛు; లౌట నా,
హితమును నట్లకాఁ జతుర వృత్తిఁ జరించుట నీతి ఱేనికిన్.

273


ఆ.

పాత్రభూతు లెస్స బరికించి యతఁ డడు
గకయు నొకఁడు సెప్పకయు మునుపుగఁ
బనసపండ్లు దిగిన పరిగ, స్వప్నము గన్న
నెఱిగ, నొసఁగి వెఱఁగుపఱుచు టొప్పు.

274


క.

పితృదేవక్రియలను విధి
బితృక్రియలె సూక్ష్మ లగుటఁ బితృభక్తుఁడ వై
శ్రుతిశీలతపశ్శాంతా
చ్యుతభక్తుల కొసఁగి పనుపు మున్నతగతికిన్.

275


క.

దానము ద్విజరక్షణకును
జ్ఞానము నిజరక్షణకుఁగ శరణము చొరు మెం
తే నారాయణు 'రాజ్యా
న్తే నరకం ధ్రువ' మటంట దీఱునె యొంటన్.

276


తే.

ఆలిపతిభక్తి, స్త్రీపుంసపాళి వావి,
యతివశిత్వము, దిగుజాతు లగ్రజాతి
ననుసరించుట, హితవృత్తి నధిపుపనికి
భృత్యుఁ డొదవుట, నృపదండభీతిఁ జుమ్ము.

277


ఆ.

చంపి ధార్మికుండు సతిఁ బొంది మఱి బ్రహ్మ
చారి బొంకి సత్యశాలి యార
గించి సదుపవాసి కేడించి శూరుఁడు
చింది ధనియు నగు విచిత్రసరణి.

278

ఆ.

ప్రణిధి స్వపురగృహియు, భాషావిదుఁడు ప్రణి
ధ్యంతరావిదుండు నగు; నతండు
లింగమాత్రకృశుఁడు లిప్పాతిగ ద్రవ్య
ధానధనియుఁ గాక తఱియఁ జొరఁడు.

279


క.

తనుభృశ దమనజ సుకృతము
ధన దత్తిన కొనఁగ వలయుఁ దత్త దృతుకమ
ర్దన మజ్జన భోజన లే
పన వసన ప్రసవ వహన పరతం బతికిన్.

280


క.

నానావిధషాడబముల
నాను నృపాహార మెపుడు, నపరాహ్ణమునం
గాని మఱి శుద్ధకోష్ఠతఁ
గాని తమి న్భుక్తి యెపుడుఁ గడుఁ బథ్యమగున్.

281


క.

విను వర్గసమత నృపుఁ డు
న్నను ధర్మాంశంబె హెచ్చెనా, పెఱమడి కె
త్తిన నీరును దెగి యలరా
జనపుమడికి నెక్కినట్లు చను ముద మందన్.

282


క.

వెలయించు నట్టి యొకమణి
వెలుఁగాశం గొనుము, ధరణి వెండి సువేషో
జ్జ్వలతకు వలదే వాసర
ముల మణులవిభూషణములు భూపతి దాల్పన్?

283


క.

చేయునది రాజ్యమఁట, యఘ
మే యవధిగ నీఁగువార మే మనఁ జన; దా
మ్నాయంబు నశక్యాను
ష్ఠేయముఁ జెప్పదు; స్వశక్తిఁ జేయఁగఁ జెప్పున్.

284


వ.

మనుదండధరాదులు విశేషించి దోషం బెఱింగి దండించియె ధర్మవరు లనఁ
బరఁగిరి; ప్రజాపాలనంబు పనిగాఁ ప్రజానాథుండు బహుముఖంబులం బుట్టిం
పం బుట్టి విరాట్సమ్రాట్ప్రభృతి వేదోదితశబ్దవాచ్యుం డై దేవసదృశుం డగు
మూర్థాభిషిక్తుఁడు సోఁకోర్చి యిలకు నగునలజళ్ళు తీర్చినంగాక జన్మంబు సఫ

లం బగునె; కేవలేంద్రియప్రీతి బందీకృతపరకళత్రపథికపరిషత్ప్రహరణ
ప్రాప్తవిత్తమ్ములఁ బాటచ్చర ప్రభులకు జరగదే? యింత లాంపట్య మేమి
పని యని యవనియెడ నవనవైముఖ్యంబు చెల్ల; దెట్లనినఁ దొల్లి కృత
యుగఁబునఁ గృతవీర్యనందనుండగు సహస్రబాహుం డాత్మీయదోస్స్తంభ
సంభృత యగు నీవిశ్వంభర నేద్వీపంబున నేనాఁట నేవీట నేత్రోవ నేక్రేవ
నేవేళ నెవ్వఁ డేమి సేయం దలంచు నప్పు డందందు నసిముసలచాపాది
శస్త్రాస్త్రధారియై తోఁచి యాజ్ఞ యిడు; నట్లాజ్ఞ యిడ నంతిమం బగు నీయుగం
బున యుగానుసారంబుగా మితసారం బగు రాజలోకంబునకు శక్యంబుగాదు
గదా? యొక్కరాజలోకంబున కన నేల? యిక్కాలంబునందలి భూసురులకు
నక్కాలఁబునందలి భూమిదివిజులకుఁ గల శక్తి యున్నదే? యొక్కబాడ
బుండు కడలినీరు గ్రుక్కం గొనియె, నొక్కవిప్రుఁడు స్రష్టసృష్టికిఁ బ్రతిస్రష్ట
యయ్యె, నొక్కబ్రాహ్మణుండు బ్రహ్మదండంబున బ్రహ్మాస్త్రంబు వారించె,
నట్టియనుస్ఠానంబు మాకు లే దిందేమి ప్రయోజనం, బని శక్త్యవస్థానంబు
వీరికి విడువవచ్చునే? వీ రితరుల కుపాసనీయులు గాకవోయిరె? కావున సావ
ధానుండపై శక్తికొలఁది శ్రుతదృష్టంబు లుపేక్షింపక రక్షణశిక్షణంబు లాచ
రించుచు నశక్యంబున కార్తశరణాగతరక్షకుం డగు పుండరీకాక్షుమీఁద భారం
బిడి యనహంకృతిఁ బ్రవర్తిల్ల నెల్ల సంసిద్ధులు కరస్థంబులగు. నది యట్లుండె,
నట్లయిన పట్టబద్ధుండగు రాజు ధర్మంబునంద దృష్టి యిడి నడవవలయు; వరుణ
వైశ్రవణవాయువైశ్వానరవాసవాదులజన్మంబులును బహుభవారబ్ధక్రియా
లబ్ధంబుల భూర్భువస్స్వరాదులగు నిజ్జగంబులును ధర్మప్రతిష్ఠితంబులు
కావునఁ దదాచరణచణుండవై ఋణత్రయంబును నీఁగి సమానులం దుత్తమ
శ్లోకుండవై రాజ్యపరిపాలనంబు సేయు మని యభిషిక్తుం జేనె. నిది మదీయ
భక్తిప్రభావం" బని యంబుజాలయ కానతిచ్చె.

285

ఆశ్వాసాంతము

శా.

దుగ్ధాంభోధిమహాగృహోత్సుక, సురాంధోబృందచూడామణీ
రుగ్ధారాశబలీకృతాంఘ్రియుగ, కారుణ్యాంబుసింధూభవ
దృగ్ధామా, ధృతమంథ, సింధురవరార్తిక్షేసిదోశ్చక్ర, శ్రీ
ముగ్ధలాపరసాదరా, కృతపలాన్మూర్ఛన్వనోద్యద్దరా.

286

క.

కరధృతదరారివితరణ
పరిపాలిత తొండమాన్నృపాలక, పునరు
త్తరిత సరసప్తృబాలక,
శరణాగతసేవధీ, భుజంగాశరధీ.

287


మత్తకోకిల.

కుండలిడ్విషమదగ్రకేతన, గోత్రభిద్ధ్రుమహారిదో
శ్చండిమోత్పులకీకృతాంగకసత్య, దౌత్యకురూక్తవా
క్పండితత్వ, యశోవిధీకృతపాండవేయ, కపర్దికో
దండఖండనపాటవాంచదుదారదారసమాగమా.

288


శా.

ఇది సింహాచలదంభకేసరిపదాభీష్టార్చనాపుణ్యల
బ్ధదురుట్టంకణ పొట్టునూరివిజయస్తంభోవలోట్టంకితాం
కదృఢేష్టాక్షర కృష్ణరాయనృపసంజ్ఞాస్మత్కృతాముక్తమా
ల్యద నాశ్వాసవరంబు నాలవది హృద్యంబై మహిం బొల్పగన్.

289

చతుర్థాశ్వాసము సమాప్తము

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.

 
  1. గుట్టు పేడు