ఆముక్తమాల్యద/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

ఆముక్తమాల్యద

తృతీయాశ్వాసము

క.

శ్రీక్షితినీళా వర! దను
జోక్షప్రాణహర! దంష్ట్రికోత్కృత్తహిర
ణ్యాక్షక్షపాచర! కృపా
వీక్షాదృతబాహులేయ! వేంకటరాయా!

1


అవధరింపు. మ ట్లరిగి విష్ణుచిత్తుండు.

2

విష్ణుచిత్తుఁడు రాజసభ కేఁగుట

శా.

నిత్యంబున్ బ్రతిహారివాద మగుటన్ విజ్ఞప్తి లే కంపఁ, దా
నత్యూర్జస్వలుఁ డౌట భూపతియు సభ్యవ్రాతమున్ శంకమైఁ
బ్రత్యుత్థానముఁ జేసి నిల్వఁగ, సభాభాగంబు సొత్తెంచి యౌ
న్నత్యప్రోజ్జ్వలరాజదత్తవరరత్నస్వర్ణపీఠస్థుఁడై.

3


క.

ఆతిథ్యము గొని, హరి తన
చేతోగతి నొలయ, రంతు సేయని విద్వద్‌
వ్రాతంబుఁ జూచి “లాఁతుల
మా తరవా యుడుగ? మాటలాడుం” డనుచున్‌.

4


తే.

కతిపయోక్తులలోనె తత్ప్రతిభఁ దెలిపిఁ
నగవు దళుకొత్త రాజు నెమ్మొగముఁ జూచి
‘యీవు మాధ్యస్థ్యమున నున్న నేము గొన్ని
నొడివెదము మాట’ లని తదనుజ్ఞ వడసి.

5

విష్ణుచిత్తుల వాదము

సీ.

అందులో నొకమేటి కభిముఖుండై యాతఁ
                   డనిన వన్నియును ము న్ననువదించి;
తొడఁగి యన్నిటి కన్ని దూషణంబులు వేగ
                   పడక తత్సభ యొడఁబడఁగఁ బల్కి
ప్రక్కమాటల నెన్న కొక్కొకమాటనె
                   నిగ్రహస్థాన మనుగ్రహించి;
క్రందుగా రేఁగినం గలఁగ కందఱఁ దీర్చి
                   నిలిపి; యమ్మొదలి వానికినె మగిడి;


తే.

మఱి శ్రుతి స్మృతి సూత్ర సమాజమునకు
నైకకంఠ్యంబు గల్పించి, యాత్మమతము
జగ మెఱుంగఁగ రాద్ధాంతముగ నొనర్చి;
విజితుఁగావించి దయ వాని విడిచి పెట్టి.

6


క.

‘నీ వే మంటివి ర’ మ్మం
చావలివానికిని మగిడి యట్లనె వానిం
గావించి; యొకఁ డొకఁడు రా
నా విప్రుఁడు వాదసరణి నందఱ గెలిచెన్.

7

అన్యమతఖండన

సీ.

'జగదుద్గతికిని బీజము ప్రధాన' మన నీ
                   క్షత్యాది' వీశు నశబ్దవాదిఁ
బొరి 'నీశుఁ డేన' నా భోగమాత్రేత్యాద్యు
                   దాహృతిస్ఫూర్తి మాయావివాది,
'ఫలియించుఁ గ్రియయ' నా ఫలమత యిత్యాది
                   సర్వేశుఁ గొనని యపూర్వవాది,
'శాస్త్రయోనిత్వాది' సరణి ‘నీశ్వరునిఁ దె
                   ల్పెడు ననుమాన' మన్పీలువాది


తే.

'నిత్యులందెల్ల నిత్యు'డన్ శ్రుత్యురూక్తి
'క్షణిక సర్వజ్ఞ తేషి' సౌగత వివాది,

'ననుపవత్తేర్న' యను సూత్ర మాదియైన
వాణి నృపతీశు బ్రత్యక్షవాది గెలిచె.

8


శా.

విద్వద్వందితుఁ డాత డిట్లు సుఖసంవిత్తత్త్వబోధైకచుం
చుద్వైపాయనసూత్రసచ్ఛ్రుతుల నీశున్ మున్ నిరూపించి, పైఁ
దద్విష్ణుత్వము దాని కన్య దివిషద్వ్యావర్తనంబున్ విశి
ష్టాద్వైతంబును దేటగాఁ దెలుప మాటాడెన్ బ్రమాణంబులన్.

9


సీ.

ఆదినారాయణుం డాయె నొక్కఁడ, బ్రహ్మ
                   లేఁడు, మహేశుండు లేఁడు, లేదు
రోదసి, లేఁడు సూర్యుఁఢు, లేఁడు చంద్రుండు,
                   లేవు నక్షత్రముల్, లేవు నీళ్లు,
లే దగ్ని; యట్లుండ 'లీల నేకాకిత
                   చనదు; పెక్కయ్యెద ననుచు నయ్యెఁ
జిదచిద్ద్వయంబు సొచ్చి' యని ఛాందోగ్యంబు
                   దెలిపెడు; నంతరాదిత్యవిద్య


తే.

నర్కులోఁ బుండరీకాక్షుఁ డతఁడ యగుట
కక్షిణీయని యష్టదృక్ త్ర్యక్ష దశ శ
తాక్ష విధి రుద్ర శక్రాదులందు నొకఁడు
కామి కాశ్రుతియే విలక్షణతఁ దెలిపె.

10


మ.

తుల లేకుండు స్వరూపరూపగుణభూతు ల్దోఁచు నేతచ్చ్రుతిన్;
దల మై లో వెలిఁ దానె యున్కిఁ దేలిపె న్నారాయణం; బారుణం
బుల సామాన్యవిశేషరీతి నిఖిలంబు న్శబ్దజాలంబు ని
ర్మలనారాయణశబ్దమందునె తుద న్పర్యాప్త మయ్యె న్శ్రుతిన్.

11


క.

వా 'దవహతపాప్మా ది
వ్యో దేవ' యనంగఁ బరఁగు నూక్తులమీఁదం
నా దగు నారాయణపద
మే దేవాంతరము లేమి కీ శ్రుతిఁ దీర్చెన్.

12


వ.

"తొల్లి జామదగ్న్యభయంబునం బరిత్యక్తరాజ్యుం డై వైరాగ్యంబున దివో
దాసాత్మజుం డగు వ్రతర్దనుండు జనార్దను నెఱుంగక యపవర్గకాంక్ష నింద్రు

నారాధించిన నతండు సన్నిహితుండై 'మా ము పా స్వ' యనుటయు; ముందు
గర్భమునందుండియు నఖండితతపస్తులితవామదేవుం డగు వామదేవుండు
'సూర్యో౽హం మనురహం కక్షీవానహ'మ్మని శరీరవాచకశబ్దంబు శరీరపర్యం
తంబు పోవుటంజేసి చిదచిచ్చరీరకుం డగు నప్పరమాత్ముంగూర్చి యను
సంధించెననియుఁ దెలిపి; చేతనుండైన తా జగత్కారణంబు గామి విబుధులం
దెల్ల విజ్ఞానవృద్ధుం డగు నా వృద్ధశ్రవుండు తదనుసంధానన్యాయంబున
నుపదేశించె నని శ్రుతిస్తూత్రముఖంబుల నిగమాంతశాస్త్రఫక్కికఁ జాల
వక్కాణింపంపడు; నాత్మయు నవనియు ననల పవన గగన కాల మృత్యు
ప్రభృ త్యఖిలచిదచిత్ప్రపంచంబు లతనిశరీరంబు లనియు నందె వినబడు;
నట్లగుట నశేషదివిషచ్ఛరీరంబు లన్నారాయణశరీరంబులే కదా, యని
ముముక్షువున కప్పుండరీకాక్షుఁదక్క నేవ్యక్తి నైన నుపాసింపవచ్చునే?
విష్ణునకుఁ దత్తత్కాలవిగ్రహంబు లగుటం బ్రహ్మ రుద్రార్జున వ్యాస
భాను భార్గవాది భజనంబు త్రైవర్గికునకుం గాక యపవర్గకాంక్షుల
కయుక్తం బని స్మృతి చెప్పు; నదియునుంగాక, యీశ్వరునకుఁ జేతనునకు
నిత్యసంబంధంబు 'మాతా పితా భ్రాతా నివాస శ్శరణం సహృ ద్గతి ర్పారా
యణ", యని సమస్తంబునకుఁ బఠాయణంబుగా, నతనిం ప్రతిపాదించు
శ్రుత్యంతరంబు గల; దట్టి పరమేశ్వరుం గనుటకుం దగిన యోగంబుఁ
జెప్పెద; ఖాండిక్య కేశిధ్వజ సంవాదంబు విను మని యిట్లనియె.

13

ఖాండిక్య కేశిధ్వజ సంవాదము

మ.

జనకాఖ్యాఖిలరాజ మొప్పు నిమివంశం; బందు ధర్మధ్వజుం
డను భూజాని మితధ్వజాఖ్య వసుధాధ్యక్షుం జగద్రక్షణా
వనజాతాక్షుఁ గృతధ్వజాఖ్యుఁ గనియె; న్వారిద్దఱు న్గర్మఠున్
ఘనవిజ్ఞానుఁ గ్రమంబునం గనిరి తత్ఖాండిక్యుఁ గేశిధ్వజున్.

14


క.

వారివురు దమలోపల
వేరము గొని, రాజ్యకాంక్ష విజిగీషువు లై
హోరాహోరిగఁ బోరిరి
బారాదిదినంబు లవని ప్రజలు దలంకన్.

15


చ.

పలవల వేగ నిచ్చలును బౌఁజులు దీర్చి యతండు నాతఁడున్
వెలువడి వచ్చి, యిక్షుమతివేణిక యేపిరిగాఁగ నీఁగుచున్

దలపడుచుం బెనంగఁగఁ, గృతధ్వజనందన సైనికావళీ
హళహళికిం జెడ న్విఱిగె నార్తి మితధ్వజనందనుం డనిన్.

16


క.

చెడ విఱిఁగి యడవిఁ బడి, యెడ
నెడుఁ గట్టులతుదలఁ గోటి యిడి, లోఁగడకున్
దడుకు వొడిపించి, యాకుల
గుడిసెల వసియించె మంత్రిగురుభటయుతుఁ డై.

17


శా.

ఆ కేశీధ్వజుఁ డంత నా నృపునిరాజ్యం బెల్లఁ జేర, న్ఫలం
బాకాంక్షింపక 'గెల్తు మృత్యువు నవిద్య న్బుట్టకుందుం దుదన్
జాకుందు న్వడి' నంచు యోగనియతిం జ్ఞానాశ్రయుం డై మఖా
నీకంబుల్ రచియించు చం దొకటికిం దీక్షించి తా నున్న చోన్.

18


చ.

పులు మఖశాలికానికటభూముల మేయుచు నేటి వెంటఁ బె
ల్లల మెడునీఱముం దఱిపి యామ్యపతాకన ఘర్మధేను వా
కెళవున నాడువాల భుజగిం గని గోండ్రని యంగలార్చుచున్
గళగతఘంటమ్రోయ నుఱుకం బిడుగుం బలె దాఁకి యుద్ధతిన్.

19


ఉ.

గబ్బు నమక్షికం బయి మొగం బడువ, న్దరుపర్ణము ల్పడన్
ద్రొబ్బుచుఁ, గార్మొగిళ్ల రొదతోఁ జెఱలాడెడు బొబ్బరింత గా
డ్పుబ్బి విసంజ్ఞగాఁగఁ జెవు లూఁదిన, వల్లవుఁ డుర్విఁ గూలఁగా
బెబ్బులి గొంతుక్రో ల్గఱచి పెల్లున మార్మెడ ద్రెళ్ల దాఁటుచున్.

20


ఆ.

తనువుఁ గొమ్ము గొరిజ గొనకుంఢ మలఁపుచుఁ
జప్పు డెసఁగఁ దోఁక నప్పళించి,
శోణితంబు గ్రోలుచునె నేర్పుమై ఘర్మ
గవిని గవికి నీడ్చు నవసరమున.

21


చ.

పొలమరు లంది కూఁత లిడ, భూసురు లన్నదిలోన వార్చి, మ్రాఁ
కుల తుద లెక్కి, చప్పటలు గొట్టి యదల్పఁగ, సాహిణీలు మా
వులఁ బఱపంగ, వైచి సెలవు ల్వెస నాకుచుఁ బోయె వృక్షమం
డలికయి తేలుచున్ గుటగుటధ్వని సారె మలంగి చూచుచున్.

22


క.

జుఱుజుఱుకని నెత్తురు వెలి
కుఱుకుచు రొదసేయ, నఱితి యొడపినె యూర్పుల్

పఱవ, మిడిగ్రుడ్ల వణఁకుచుఁ
గొఱప్రాణముతోడఁ దన్నుకొను నమ్మొదవున్.

23


సీ.

విన్నవించుటయు ఋత్విజులఁ బ్రాయశ్చిత్త
                   మడిగె రా: జడిగిన నడుగు మనిరి
వారు కసేరువుఁ దా రెఱుంగక పోయి;
                   యతఁడును శునకుని నడుగు మనియె;
నతఁడు దాను నెఱుంగ నని పల్కి, 'నృప, విను;
                   మా ఋత్విజులపిండు నాకసేరు
వేను నెఱుంగ లే: మిఁక నొక్క యేమే కా,
                   దిల మఱి యెవ్వాఁడు నెఱుఁగఁ; డెవ్వఁ


తే.

డేని సప్తాంగములు నీకు నిచ్చి చెట్లు
వట్టి పెన్రాలతివ్పలు వట్టి తిరుగు
నట్టిఖాండిక్యుఁ డొక్కఁడ యరయ నెఱిఁగె
నే నెఱుఁగు; వేఁడు మది కర్జమేని' యనిన.

24


చ.

నరపతి పల్కె 'మౌనివర, నారిపు నిష్కృతి వేఁడఁబోయిన
న్ధర హతుఁ జేసెనేని సవనంపుఫలం బొడఁగూడుఁ; గా కమ
త్సరగతిఁ జెప్పె నేని మఖతంత్ర మతంత్రముఁ గాక పూర్ణ మౌ
నిఱుదెఱఁగు న్మదీప్సితమె, యేఁగెద'నంచు రథాధిరూఁఢు డై.

25


క.

హరిణాజినోత్తరీయుఁడు
నిరాయుధుఁడు నగుచు నతని నెల వగు నడవిన్
జొరఁ, గొట్టికాండ్రు డెక్కెముఁ
బరికించి, యెఱిఁగి, కలయఁబడి, కూఁత లిడన్.

26


ఆ.

వలస బెదర, నృపతి కలఁగక ప్రజవగ
లార్పఁ బనిచి, కనుము లందు నిలువ
వేఱు వేఱ యేర్చి విలుమందిఁ బనిచి, తాఁ
దడుకు పెండె మలుక వొడమ వెడలి.

27


క.

వచ్చు రిపుఁ జూపులనె చుఱ
పుచ్చుచు, సిరిఁ గొనుట మగుడఁ బొడముట రుష ము

చ్చిచ్చున లావెచ్చఁగ వి
ద్యుచ్చలచాపమునఁ దూపు దొడుగుచుఁ బలికెన్.

28


మ.

'ధనధాన్యద్విరదాశ్వగోగణసమేతం బెల్లసామ్రాజ్యమున్
గొనియుం జాలక తాటకేయ పలభు క్కూటాకృతిం జింకతో
లున నాచ్ఛన్నుఁడ వై ప్రశాంతుగతి మాలోఁ జొచ్చి ప్రాణంబులున్
గొన నేతెంచెదె? దుర్మతీ, కెడపెద న్గ్రూరంపుభల్లంబునన్.'

29


మహాస్రగ్ధర.

అనినం, జేయెత్తి, "యోహో,
                   యలుగక విను; కా నాతతాయి: న్ప్రమాదం
బున వైకల్యంబు యాగం
                   బునకుఁ బొడమ, నే భూసురశ్రేణి వేఁడ
నిను నావేదించి పంపెన్:
                   'నృప, యతఁ నెఱుఁగు న్నిష్కృతి; న్వేడు పోపొ'
మ్మని, కోప మ్మైన రోస
                   మ్మయిన విడువు; మె ట్లైన మే లింక"న్ననన్.

30


వ.

అనిన, నతండు తరుషండంబు సొచ్చి, మంత్రిపురోహితప్రభృతిసుహృ
జనంబులకుఁ దద్వృత్తాంతం బంతయుం జెప్ప, మంతనంబునకుం జొచ్చిన
మంత్రు లి ట్లనిరి.

31


క.

పాలు గలవాఁడు మన కొక
జాలి యిడక తానె తారసానకు వచ్చెన్;
వేళ యిదె, లెమ్ము, నృప! కృప
చాలున్, గారాకు మేపి చంపకు ప్రజలన్.

32


ఉ.

అంటలు గట్టి చెల్కలకు నాండ్రును బిడ్డలుఁ గూరఁగోయఁ బో,
గంటకము ల్పదాబ్జములఁ గాఁడ నొదర్చిన నొప్పిఁ గూయిడన్
గంటికినిద్ర గాన కౌదుఁగంబడి వేఁగెద మిందు; నొక్కమా
కంటయ కాదు; నీవు పడునట్టియవస్థ వచింప శక్యమే?

33


తే.

స్వామ్యమాత్యసుహృత్కోశజనపదబల
దుర్గములు స్వామి గలిగినఁ దొలుతఁ గలవు,

అంగి సుఖియైన నంగంబు లటకు మునుపె
చాల సుఖు లౌట మనకు దృష్టంబు గాదె?

34


క.

అతనిపనిఁ దీర్ప రాజ్య
ద్వితయము నినుఁ జేరు; నెట్టినెరవున నైనన్
క్షితిపుల కరిజయము ధనో
న్నతియుఁ బ్రజాసదయరక్షణము ధర్మంబుల్.

35


క.

అన్యాయంబున దుస్సహ
మన్యుం డగు ప్రబలరిపుని మడియించిన ధ
ర్మన్యక్కృతి కగు నిష్కృతి
సన్యాయంబుగఁ బ్రజాళి సంరక్షింపన్.

36


క.

తనరాష్ట్రము చెడ వచ్చిన
ననిమిషపతి విప్రుఁ డనక యాచార్యుఁ ద్రిశీ
ర్షునిఁ దునుమఁడె? విడువుము దయ;
నిను నమ్మిన ప్రజలు నవయ నీ దయ యేలా?

37


క.

శిష్టు నిను నింతఁ జేసిన
దుష్టాత్మునిఁ బిలుకు మార్చి, దురితము పిదపన్
నష్టంబుగ, భూవల్లభ,
యిష్టాపూర్తములు నేసి యెసఁగఁగ రాదే!

38


తే.

ఇంక రెన్నాళ్ళు సూచి, నీవంకఁ దెగువ
గలుగకుండినఁ బ్రజ లూళ్ళు దలఁచి పోవ
మౌని వగుటయె యొండె, విహీనసంధి
నతనిఁ గను టొండె గా కొండు మతము గలదె?

39


క.

జనవర, తపమునకుం జొ
చ్చినఁ గన్నులు మూసికొంటె సెల; వింతియకా
క నిధిధ్యాసకు బ్రహ్మం
బెనయునె పరిభవపుశల్య మెదలో మెఱమన్?

40


క.

అవమతిఁ బితృఘ్ను లగు భూ
ధవుల వెదకి పిల్లపిల్లతరము దునిమి భా

ర్గవుఁడు ముని యయ్యె: మఱి వై
భవము వలదు, శాంతి కైనఁ బగ దెగ కగునే?

41


తే.

పగయు వగయును లేక యేపాటి గన్న
నలరు సామాన్యసంసారి యగుట మేలు;
మఱి తగిలెనేని శాంతిచే మఱవఁదగదు
రాజ్యభూమికఁ దాల్చిన రాజునకును.

42


క.

పులి మల డిగి యూళ్ళకు న
క్షులరుజ రా జనము మాన్పుకోఁ బనిచి, గవిన్
నెలకొన సురియలు గొని చని
పొలియునొ? యూరఁ గుయిరేఁగి పొడుచునొ? చెపుమా?

43


క.

ఈవేళ బలియు నతనిం
బో విడిచితి పొమ్ము పాడిఁ, బోయినరాజ్యం
బేవిధిఁ గ్రమ్మఱు? నాపెర
వీవెర వని వ్రేలు మడిచి యేర్పడఁ జెపుమా.

44


తే.

అలసతఁ బరున్న మనుజుండు కలియుగంబు;
ద్వాపరం బెన్నఁ కూర్చున్నవాఁడు; త్రేత
యుత్థితుఁడు; యాయి మఱి కృతయుగ; మ టన్న
నముచిదమనోక్తి ఋగ్బ్రాహ్మణమున వినమె?

45


క.

ఛిద్రప్రహారి, రాష్ట్రా
పద్రవపరిహారి, యాప్తభాషణరుచి, వే
ళోద్రిక్తుఁ డన్యవేళా
నుద్రిక్తుఁ, డనల్సకాల ముర్వి భుజించున్.

46


వ.

లే లెమ్మనుటయుఁ బ్రధానులకు భూనాథుం డిట్లనియె.

47


క.

మీ నొడివినయది కార్యం
బౌ; నిప్పని సేయ రాజ్య మంతయు మనకున్,
వానికిఁ బరలోకము జిత
మౌ నొక్కట; నిందు వాసు లరయఁగ వలయున్.

48

క.

పరలోకసుఖము శాశ్వత
మరయ; మహీరాజ్యసౌఖ్య మల్పానేహః
పరిభోగ్యం; బిందులకై
దురితము కావించి తొలఁగుదునె పరమునకున్?

49


క.

"బద్ధాంజలిపుటు దీనున్
గ్రుద్ధుండై శరణు చొరఁగఁ గూల్చుట కడుఁ గీ,
డుద్ధతి పరలోకార్జన
బుద్ధికి" నను కణ్వవాక్యములు దలఁప రొకో!

50


ఆ.

అనుచు వెడలి వచ్చి, యారాజు నడిగి, త
ద్ఘర్మనైచికీపథక్రమంబు
దెలిసి, తగిన నిష్కృతి వచింప నాతండు
మగుడఁ గ్రతువు సాంగముగ నొనర్చి.

51


ఆ.

అవభృథాప్లుతోత్తమాంగుఁడై : ఋత్విక్స
దస్యగణముఁ బూజఁ దనిపి, పిదప
సూతమగధవందివైతాళికప్రభృ
త్యర్థికోటి కభిమతార్థ మొసఁగి.

52


తే.

మఱియుఁ గోరినవారి యక్కఱలు తీర్చి
యును మన:పూర్తి చాల కొయ్యనఁ దలంచి,
'యకట గురుదక్షిణ యొసంగ నయితి' నంచు
మగుడఁ జని, శంక నతఁడు సంభ్రమపడంగ.

53


క.

వారించి, 'నీకు నెయ్యది
కోరిక? యేతెంచినాఁడ గురుదక్షిణ యీ,
భూరమణ, వేఁడు' మనుటయు,
నారాజన్యుండు మఱియు నాప్తులతోడన్.

54


క.

'గురుదక్షిణ యిచ్చుట కీ
నరవరుఁ డేతెంచె; మీరు నా కనురక్తుల్;
పరికించి పదింబదిగా
నరయుఁడు మది నెద్ది మేలు ప్రార్ధించుటకున్.'

55

ఉ.

నావుఁడు, వార లమ్మనుజనాథున కిట్లని రుబ్బి: "నేఁడుగా
దైవము గల్గె; వేగ గురుదక్షిణగాఁ జతురర్ణవీవృతో
ర్వీవలయం బశేషమును వేఁడుము, భూవర; మమ్ము నందఱన్
బ్రోవుము; బాంధవాప్తజనపోషణకన్నను బుణ్య మున్నదే!

56


ఉ.

ఎన్నఁడు లావుగూడు మన? కెన్నఁ డగున్ దఱి? యయ్యెనేని పో
రెన్నిక యౌనె? పోరిన జయింపనె చెప్పిరె? నీదు భాగ్యసం
పన్నతఁ జేరెఁ గార్య మిటు; బంధు సుహృత్తతి కొక్కకీడు రా
కున్నటు లుండఁగానె; సిరు లూరక చావక నోవ కబ్బునే?"

57


చ.

అనవుడు నల్ల నవ్వి మనుజాధిపుఁ డిట్లను:- " మీర లర్థసా
ధనపరతంత్రకోవిదులు దక్క, మహాసుఖదాయి మోక్షమా
ర్గ నయ విచారకోవిదులు గా, రతిచంచల రాజ్యలక్ష్మి నే
మని చని వేఁడువాఁడఁ బరమార్ధము వేఁడక యమ్మహామతిన్?

58


క.

నిమివంశోత్పన్నులమఁట
మముబోఁటుల కకట రాజ్యమా లక్ష్యము? వాఁ
డమలిన యోగాశ్రయుఁ; డు
త్తమయోగము గొనుట యురవొ, ధరఁ గొను టురవో?

59


సీ.

విడుఁ." డని వీడు వెల్వడి వచ్చి ఖాండిక్యుఁ,
                   డారాజుఁ గనుఁగొని గారవమున,
'గురునిష్క్రయంబు నిక్కువముగా నొసఁగెదే?'
                   యని పల్కి, 'యిత్తుఁ దథ్యముగ' నన్న;
'నవనీతలేంద్ర, వీ వధ్యాత్మరతుఁడవు ;
                   దక్షిణ గురున కీఁ దలఁచితేని,
సకలభవక్లేశసంక్షయం బెయ్యది
                   'యవ్విద్య బోధింపు' మనిన నవ్వి,


తే.

'యహహ! నిష్కంటకాన్మదీయాధిరాజ్య
మడుగ నొల్లక యిది యేటి కడిగి తిపుడు?
క్షత్త్రియుల కెల్ల రాజ్యంబు కంటె మఱి ప్రి
యంబు గలదె? యటన్న ని ట్లనియె నతఁడు.

60

మ.

'విను కేశిధ్వజ, ధాత్రి వేఁడమికి నా వేదించెదన్ హేతు: వ
జ్ఞునకుంగాక వివేకి కేల జనియించున్ లౌల్య మెందున్? రణం
బునఁ బాడిన్ రిపుఁ గూల్చువాఁడియుఁ బ్రజాపోషంబు ధర్మంబు రా
జున కౌ; నైన నశక్తుఁ ద్వద్విజితరాజ్యు న్న న్నఘంబంటునే?

61


సీ.

నరనాథ, యీ రాజ్యపరిపాలనారాతి
                   హననాదికృతరూప యగు నవిద్య
యనధికారికి విసర్జనముఁ గావింపంగఁ
                   గలుషంబు రా; దధికారియైన
వాఁడు విసర్జింప వచ్చు వర్ణాచార
                   లోపంబుచే నగు పాపలేప;
మైన నేనిత్తుఁ గొమ్మనఁ గొను ధరణి భో
                   గమునకుఁ గాక ధర్మమున కగునె?


తే.

కాన సత్క్షత్త్రియులకు భైక్ష్యంబు కీడు;
మత్ప్రధానులు వేఁడు సామ్రాజ్య మనెడు
పలుకు ధర్మచ్ఛలంపు లోభం బయుక్త
మిది యెఱిఁగి రాజ్య మడుగ నే నిచ్చగింప.

62


తే.

ఆస పడుదురె బుధులు, రాజ్యంబు, మమత
మానని జడాత్ముల? ట్లహం మాన పాన
మత్తులకుఁ గాక యది యేల మాదృశులకు?"
ననిన హర్షించి మెచ్చి యజ్జనకుఁ డనియె.

63


ఆ.

"ఏ నవిద్యవలన మృత్యువుఁ దరియింప,
ననఘ, రాజ్యములు మఖాదికములుఁ
జేయుచున్నవాఁడ, క్షీణింపఁజేయుదుఁ
బుణ్యఫలము భోగభుక్తిచేత.

64


క.

మన యీ నిమివంశము పా
వన మగుభాగ్యమున, మనుజవర, తత్త్వవివే
చనచింత నీకుఁ బొడమెను ;
విను మిఁక వినిపింతు నే నవిద్యావిధమున్.

65

ఆ.

ఆత్మకాని మేన నాత్మబుద్ధియును న
స్వంబునందు మిగుల స్వత్వమతియు
నవనివర, యవిద్య యను మహాతరువు ను
త్పత్తి కీద్వయంబు విత్తు మొదలు.

66


క.

నరనాథ, పాంచభౌతిక
శరీరమున దేహి మోహసాంద్రతమతమః
పరివృతుఁ డై, 'యే నిది నా
పరికర' మని యవధి లేనిభ్రమఁ బడి తిరుగున్.

67


క.

జలవసుధాంబరపవన
జ్వలనంబులకంటెఁ దా నజస్రంబు వెలిన్
వెలుగొందు నాత్మ యుండఁగఁ
గళేబరము నెవ్వఁ డాత్మగాఁ దలపోయున్?

68


సీ.

వపు రుపభోగ్యముల్ నృప గృహక్షేత్రాదు;
                   లవి బొందివౌఁగాక, యాత్మ నగునె;
య ట్లన పుత్త్రపౌత్త్రాదికములు నాత్మ
                   కాని మైఁ బుట్టుటఁ, గావు తనవి;
గాన మృత్యువుఁ గను కాయంబున జనించు
                   పుత్త్రాదులేక స్వత్వబుద్ధి దగదు;
ఎపుడేని యాత్మ వేఱే యనునప్పుడె
                   యడరు భోగంబు లీయాత్మకంట;


తే.

వట్లుగా కీయొడలె యాత్మ యన్న నంటు;
మద్గృహము నిల్చు నెట్లల్కు మృజ్జలాది
నట్లు భౌతికభోగాశనాదిభౌతి
కాంగములు నిల్చు; భోగ మిం దాత్మ కెద్ది?

69


మ.

జని సాహస్రబహుప్రయాణ మగు సంసారంపుఁ ద్రోవన్ సదా
చనుచుండున్ ఘన మోహఖేద మలమన్ సంసారిపాంథుండు, వా
సన లన్ ధూళి ముసుంగు గాఁగ: నెపుడేన్ జ్ఞానంపు టుష్ణోదకం
బునఁ దత్క్షాళన సేయు వాని కపు డమ్మోహశ్రమంబున్ జనున్.

70

తే.

అట్టి మోహశ్రమం బాఱ నా శరీరి
స్వస్థుఁ డై తా ననన్యాతిశయ మబాధ
మనఁగ విలసిల్లు నిర్వాణమును భజించు
ననఘ తొల్లియు నిర్వాణ ఖనియ కాన.

71


వ.

విను జనేశ్వర! జలం బస్పృష్టదహనం బయ్యుఁ దదీయయోగంబునఁ గల
శోదరంబున నునికిం దా నతిశీతలం బయ్యు నుడికి; శబ్దోద్రేకాదిధర్మంబులం
బొందున, ట్లాత్మయుం బ్రకృతిసంబంధంబున నహమ్మానాదిదూషితుండై
ప్రాకృతంబు లగు ధర్మంబులం బొందు; వీని కత్యంతవిలక్షణుండు నక్ష
యుండు నాత్మ; య ట్లగుట నింత యనర్థమూలం బగు నీ యవిద్యాబీజంబు
నీ కెఱింగించితి. నేవం విధంబు లగు సకలక్లేశంబులకును సంక్షయకరంబు
యోగంబుదక్క మఱియొం డుపాయము లే." దనుటయుఁ బ్రీతుండై
ఖాండిక్యుండును “మహాత్మా, యిన్నిమివంశంబున విజ్ఞాతయోగశాస్త్రార్థుండ
వీవు; నాకు నయ్యోగంబు సమస్తంబు విస్తరింపవలయు." ననినఁ గేశి
ధ్వజుండు కృపాళుండై, "మహీపాలా, విను మెందేని సంస్థితుండై ముని
మఱి పునర్భవంబునకు రాక బ్రహ్మసాధర్మ్యంబుఁ బొందు నట్టి యోగంబుఁ
జెప్పెద, సావధానుండవై విను." మని యిట్లనియె.

72


ఆ.

ప్రాణికోటి కెల్ల బంధంబు మోక్షంబు
చేరుటకును మనసు కారణంబు;
విషయసంగి యైన , విను బంధకారి; ని
ర్విషయ మైన, ముక్తి విభవకారి.

73


సీ.

విజ్ఞానమునఁ జేసి విషయాదివలన నె
                   మ్మన మాహరించి బ్రహ్మముఁ బరేశుఁ
జింతింపవలయు నిశ్శ్రేయనంబున; కట్లు
                   చింతింప నతఁడు తచ్చింతకునకు
నాత్మభావం బిచ్చు, నాకర్షకము వికా
                   ర్యశ్మసారముఁ దార్చునట్టి; యోగ
మన, యమాదివిషయమైనది యాత్మ ప్ర
                   యత్నంబున కధీన యైన సాత్త్వి

తే.

కపుమనోగతి యెయ్యది గలదు దాని
బ్రహ్మసంబంధినిఁగఁ జేయు ప్రౌఢి సూవె;
యిట్టి వైశిష్ట్యధర్మ మెందేని గలుగు,
నట్టి యోగంబు గలిగిన యతఁడె యోగి.

74


వ.

మఱియు, బ్రహ్మచర్యాదులగు యమంబు లేనును, స్వాధ్యాయాదులగు నియ
మంబు లేనును, నిష్కాముండై యోగి యగువాడు, మనోనైర్మల్యసంపా
దనకు నాచరింపవలయు; నివి కామ్యంబు లైన, విశిష్టఫలదంబులు; నిష్కాము
లకు ముక్తిదంబు లగు, నట్టి యమనియమంబులు వదలక భద్రాసనాదులందు
నొకటి నవలంబించి ప్రాణాభిదానం బగు పవనంబు నభ్యాసవశంబున వశ్యంబు
సేయవలయు; నదియె ప్రాణాయామ మనంబడు; నట్టి ప్రాణాయామంబు
సబీజనిర్బీజసంజ్ఞలం బరఁగు; నదియె ప్రాణాపానంబుల మిథోనురోధంబుల
నుభయనిరోధనంబున, రేచకాదిత్రైవిధ్యంబునుం బొందు: మొదల నా
చెప్పిన సబీజనిర్మీజసంజ్ఞలందు నంతస్స్థూలరూపావలంబి యగునదియ
సబీజం, బితరం బబీజంబు; మఱి శబ్దాదివిషయంబులం బ్రవణంబులగు నింద్రి
యంబులం ద్రిప్సి మానసంబున కధీనంబులు సేయుట ప్రత్యాహారం; బిట్టి
బ్రత్యాహారంబు ముముక్షున కవశ్యకర్తవ్యంబు; దీనివలన నతిచంచలంబు
లగు నింద్రియంబులకు నాత్మవశ్యత గలుగు; నివి గన వశ్యంబులు గాకుండిన
నాయోగి యోగసాధకుండు గానేరండు; ప్రాణాయామంబునఁ బవనంబులు,
ప్రత్యాహారంబున నింద్రియంబులు, వశంబులైన పిమ్మటఁ జిత్తంబు శుభా
శ్రయంబునం దిడునది." యనుటయు ఖాండిక్యుఁ డిట్లనియె.

75


క.

మనమున కెద్ది శుభాశ్రయ,
మనఘ! యెఱింగింపు, మఱి సమస్తాధారం
బనఁ జను యద్వస్తువు? య
న్మనన మశేషోరుదుఃఖ మండలిఁ జెఱుచున్?

76


తే.

అనినఁ గేశిధ్వజుఁడు వాని కనియె; 'బ్రహ్మ
మాశ్రయంబు మనంబున; కదియ పరము
నపరము ననంగఁ బొలుచు; నం దపర మనగ
మూర్తము, పరం బనంగ నమూర్త మనఘ.

77

మ.

మును నాచెప్పిన రెంటిలోఁ బర మనన్ ముక్తాత్మ దూరం బుపా
సనఁ గావింప నమూర్త; మింక పదసంజం బబ్జగర్భాదిబ
ద్ధనికాయం బది మూర్త మైనను బరిత్యాజ్యంబు శశ్వత్త్రిభా
వనలం గూడుట నారురుక్షున కసేవ్యం బీద్వయంబు న్దుదన్.

78


వ.

ఆభావనాత్రయం బెద్ది యనినఁ చెప్పెద:- బ్రహ్మభావనయుం గర్మభావనయు
బ్రహ్మకర్మోభయభావనయు; నందు బ్రహ్మభావనాయుతులు సనందనాదులు.
దేవాదిస్థావరావరులగు ప్రాణు లందఱు కర్మభావనాభావకులు, హిరణ్యగర్భాదు
లుభయభావనాపరు; లీమూఁడుతెఱఁగులవారు భావనాత్రయాన్వితులు గావున
నీత్రివిధాత్మకరూపంబ సేవ్యంబు; సనందనాదులునుం బ్రాగ్బ్రహ్మకల్పంబుల
సంసరించుట భావనాబద్ధులె; యిబ్భావనాత్మకంబగు విశ్వంబుసంస్థితికి నవధి
దేవమనుష్యాదివిశేషజ్ఞానకర్మంబులు క్షీణించుటయ; యట్టి విశ్వంబై
తోఁచు హిరణ్యగర్భాదులకంటె నన్యంబు పరాఖ్యం; బిది ముక్తరూపం
బమూర్తంబై యుండునని మొదలు సూచించితిం గదా; తదాకారంబుఁ దేట
పఱిచెద; పూర్వోక్తదేవాదిభేదరహితంబై తద్భేదరాహిత్యంబున నిట్టి దట్టి
దని వచించుటకు గోచరంబుగాక యపక్షయాదిరహితంబును సచ్ఛబ్దవాచ్యం
బును నాత్మసంవేద్యంబునునై, జ్ఞానైకనిరూపణీయం బగుచు జ్ఞానశబ్ద
వాచ్యంబునుం దానయై, బ్రహ్మాత్మకం బగుట బ్రహ్మసంజ్ఞయం గాంచి
యొప్పు; మఱి భావనాత్రయాత్మకవిశ్వవైలక్షణ్యంబె లక్షణంబుగాఁగల యీ
రూపం బభ్యస్యమానయోగుండగు యోగికిం జింతింప నశక్యంబు; మఱి
యపరంబని చెప్పంబడిన హిరణ్యగర్బుండు వాసవుండు ప్రజాపతులు మరు
త్తులు వసువులు రుద్రులు ఆదిత్యులు తారకంబులు గ్రహంబులు గంధర్వ
యక్షరక్షోదైత్యాదిసమస్తదేవయోనులు మనుష్యులు పశువులు అద్రులు
సముద్రంబులు ద్రుమంబులు వెండియు నేకపాద ద్విపాద బహుపా దాపాదంబు
లగు నితరభూతంబులుం దదుత్పత్తిహేతువులుగా విలసిల్లునట్టి ప్రధానాది
విశేషాంతచేతనాచేతనాత్మకప్రపంచభావం బగు స్థూలరూపం బుపక్రాంత
యోగునకుఁ జింతింప శక్యంబు. శక్యమేనియుఁ దద్భావనాత్రయాత్మకం
బగుట నశుభాశ్రయంబు గావున ముక్తిసాధనంబు గా; దీ చెప్పఁబడిన సకల

ప్రపంచంబును విష్ణుశక్తిసమన్వితంబై యతనికి శరీరంబునునై యుండు; నట్టి
విష్ణుశక్తులు మొదల నేఁజెప్పిన పరాపరాఖ్యలను దదతిరిక్తయగు కర్మాఖ్యనుం
త్రివిధములై యండు; నందుఁ గర్మాఖ్యశ క్తిచేత వేష్టితయై యపరాఖ్య యగు
క్షేత్రజ్ఞశక్తి జన్మజరామరణాద్యనేకసంసారతాపంబు లనుభవించుచుఁ దత్త
త్కర్మానుగుణశరీరంబు లెత్తి విజ్ఞానతారతమ్యంబుల నొందుఁ; దత్ప్ర
కారం బాకర్ణింపుము.

79


సీ.

ఉండు నప్రాణులం దొక్కించు కాశక్తి;
                   స్థావరశ్రేణిఁ దజ్జాతికంటె;
నెఱ్ఱ రోఁకటిబండ జెఱ్ఱి మన్దిండి ము
                   న్నగు సరీసృపములం దంతకంటె;
ఖగములయం దంతకంటె మృగావలి
                   యందు నూహింపంగ నంతకంటె;
దంతి గోముఖ పశుతతి నంతకంటె, మ
                   ర్త్యకదంబకములయం దంతకంటె;


తే.

యక్ష గంధర్వ నాగాళి నంతకంటె
నంతకంటె నిలింపులం, దంతకంటె
హరిహయునియందు, దక్షునం దంతకంటె,
నాద్యుఁడు హిరణ్యగర్భునం దంతకంటె.

80


ఆ.

ఇట్టిరూపకోటు లెల్ల నవ్విష్ణుని
తనుచయంబు సుమ్ము ధరణినాథ
యతఁ డచింత్యశక్తి నఖిలభూతముల నా
కసమువోలె నిండి యొసగుఁ గాన.

81


సీ.

ము న్నెన్నిన పరాఖ్యమునకు ద్వితీయమై
                   విష్ణుసంజ్ఞునకు నుర్వీతలేశ
యోగిహృద్ధ్యేయ మై యొప్పు నమూర్తరూ
                   పం బొండు సత్సంజ్ఞఁ బ్రాజ్ఞకోటి

దాని వచించు; నేతద్రూపమె సమస్త
                   శక్తుల కెల్ల నాశ్రయతఁ బొంది,
ప్రాగుక్తవిశ్వరూపవిలక్షణతఁ గాంచి,
                   కల్యాణగుణభూతి గరిమఁ దనరి,


తే.

యతిమహత్త్వంబుచే వెల్గు; నట్టి శక్తి
నలరు బ్రహ్మంబు దేవతిర్యఙ్మనుష్య
నామచేష్టావదవతరణముల నాత్మ
లీల జగదుపకృతికిఁ గల్పించుచుండు.

82


ఆ.

కర్మభుక్తికొఱకుఁ గా దిట్టి తల్లీల;
యతఁడు సకలజాతులందుఁ బుట్టుఁ;
బుట్టినట్టి యతని భూరిచేష్టితము ల
వ్యాహతములు రావణాదివలన.

83


వ.

అట్టి పరమేశ్వరునకు బద్ధముక్తాదిరూపంబు లనేకంబులు గలిగిన ముముక్షునకు
జ్ఞానసిద్ధికిఁ బరమవ్యూహవిభవాదిరూపంబులే చింతనీయంబులు; ప్రజ్వలిత
శిఖుండగు పవనసఖుండు నీరసనికుంజంబు నెట్లు దహించు. నట్లు చిత్తస్ధుం
డగు నవ్విష్ణుండు యోగిజనంబుల సకలకిల్పిషంబులు నిర్దహించుఁ గావున
సకలశక్త్యాశ్రయుం డైన యప్పరమాత్మునియందుఁ జిత్తంబు నిల్పుట
విశుద్ధయగు ధారణ యనంబడు: సర్వసంగంబునఁ జలాత్మకం బగు చిత్తంబు
నకుఁ ద్రిభావభావనాతీతుం డగు నద్దేవుండు శుభాశ్రయుండై ముక్తికరుండగు;
నేతద్వ్యతిరిక్తులగు బ్రహ్మాదిదేవతలు కర్మయోనులగుట నశుద్దులు గావునఁ
జిత్తంబున కవలంబనీయులుగారు; మఱి నిరవలంబధ్యానంబు పొందుపడదు
గావున, ధారణాధ్యానవిషయంబై శుద్ధంబగు స్థూలరూపాంతరం బయ్యనం
తునకుం గలదు, దాని సవిస్తరంబుగాఁ జెప్పెద నాకర్ణింపుము.

84


సీ.

శరదిందు చకచకస్మయజి త్ర్పసన్నాస్యు,
                   దొడ్డకెందమ్మి కన్దోయివాని,
నతికమ్ర గల్లభాగాభోగ ఫాలాఢ్యు,
                   మకరాంక రత్నకర్ణికలవానిఁ,

గాంబవోద్యచ్చ్రీవిడంబి వృత్త శీరోధి,
                   సిరిపొల్చుమచ్చ పేరురమువాని
నతనాభియుత వళిత్రితయ శాతోదరు,
                   జానులంబి చతుర్భుజములవానిఁ


తే.

గరివరకరోరు, రుచిరజంఘామనోజ్ఞు
సమతబొందిన పదపల్లవములవాని
హైమవసనుఁ గిరీటహారాంగదాది
కలితు, శంఖరథాంగాదు లలరువాని.

85


సీ.

శ్రీవిష్ణు నీగతిఁ జింతింప వలయుఁ ద
                   న్మయుఁ డయి యోగి క్రమంబుతోడ;
నొక్కయంగమె మున్ను చిక్క లోభావించి,
                   యది దృఢంబగుటయు నవలియంగ
కము మఱి చింతింపఁ గాఁ దగు; నట్టి య
                   భ్యాసంబువలన నయ్యవయవి మఱి
నడచిన నున్న మానక యెద్దియేనియుఁ
                   జేయుచున్నను మదిఁ బాయఁడేని


తే.

యతనిసామ్యంబు గని ముక్తుఁ డగు; సురాది
భేదసంజనకాజ్ఞాన మేదఁ బిదప
నలము కల్యాణగుణముల హరికిఁ దనకుఁ
లేని భేద మెవ్వాఁడు కల్పింపఁగలఁడు?

86


క.

నరవర! యిటు బంధచ్యుతి
కొఱ కగు నంగాష్టకాఖ్య ఘనయోగము వి
స్తరముగఁ జెప్పితి, నింకన్
గరణీయం బెద్ది నాకుఁ గల్పింపు' మనన్.

87


తే.

'నృప, కృతార్థుండ నైతి; నా కింతకంటె
నర్థనీయంబు మఱి యెద్ది?' యనుచు నతని
కర్చఁ గావించి వల దన్న నతఁ డొసంగు
తనదు తొంటిరాజ్యంబునఁ దనయు నిలిపి.

88

వ.

పురోహిత ప్రధానుల నప్రాప్తయౌవనుం డగు నతని వినీతుఁగా మెలసి
కొం డని నియోగించి; వారల దానసమ్మానాదులం బ్రోపు మని కుమారు
నకు నప్పగించి; గోవిందచరణారవిందవిన్యస్తమానసుండై ఖాండ్యిక్యుం
డుభయకర్మంబు లుడివి; యవ్వనంబ తపోవనంబుగాఁ గొంతకాలంబు
కేశిధ్వజోపదిష్టభక్తియోగాసంధానంబున మధుమథనసాధర్మ్యంబు నొందెఁ..
గేశిధ్వజుఁడును దత్పుత్త్రునిఁ దత్ప్రధానులఁ దదీయరాజ్యపరిపాలన కనిచి,
మగిడి మిథిలాపురంబు ప్రవేశించి, యోగాశ్రయుఁడై భోగంబులం బుణ్యం
బులు, తదితరంబులు దురితంబులు, ప్రక్షీణంబులుగా క్షోణితలం బేలుచుండెం;
గావున ముముక్షున కుపాశ్రయణీయుం డధోక్షజుండు; పాండ్యక్షితీశా, నీ
వతని భజియింపు, మిదియె భక్తియోగంబు. దీనియందు నొక్క కొఱఁతగల
దంతరాయంబు నొందినఁ బునర్భవంబుఁ బొందించి మఱి ముక్తిఁ జేర్చు.
నట్లగుట నింతకంటే సులభోపాయం బాయోధనంబున నయ్యధోక్షజుండు
గాండీవి కుపదేశించిన శరణాగతధర్మంబ నిరపాయధర్మం.” బని పరిణతాంతః
కరణుం డగు నతనికి మూలమంత్రపూర్వకంబుగా ద్వయము ప్రసాదించి
భాగవతప్రధానుం గావించిన.

89


మ.

వకుళాలంకృతయోగిహృల్నిలయ, భాస్వత్పాండుభాస్వన్మయాం
బక, నాభీజలజాతనూత విధి సంప్రాప్తస్మరారిష్ట, ము
ష్టికఠోరార్పణ కర్కటీఫలిత కేశి క్రూర రక్షోంగకా,
కృకవాకుధ్వజ దీర్షికాప్లవ తప క్రీడోత్సవాద్యత్సుకా.

90


క.

ఊరీకృతపాండవరథ
సారథ్య! సయూథ్యగోపశాబకసహ కే
లీరత! భక్తప్రహ్లా
దారచితస్తోత్రపులకితాంచితగాత్రా!

91


స్రగ్విణి.

ఆస్థితాహీంద్రశయ్యా, దవీయస్తర
ప్రస్థితాంఘ్రీ, శ్రితవ్రాతచేతోఘదా
కస్థలప్రస్పృశత్కాళియక్ష్వేళమూ
ర్ధస్థలీనృత్తమత్తల్లిహల్లీసకా!

92

మ.

ఇది పాత్రప్రహరేశ్వరప్రభృతి బంహిష్ఠోత్కలానీక గు
ప్తదివిస్పృక్పటుయంత్రకొండపలి హృద్బాహాసి కద్రూజ దీ
వ్యదుదారోద్యమ కృష్ణరాయనృప సంజ్ఞాస్మత్కృతాముక్తమా
ల్యద నాశ్వాసము హృద్యపద్యము తృతీయంబై మహిం బొల్పగున్.

93

తృతీయాశ్వాసము సమాప్తము

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.