ఆముక్తమాల్యద
ద్వితీయాశ్వాసము
క. |
శ్రీనయన కువలయుగళా
నూనజ్యోత్స్నాయితస్మితోజ్జ్వలముఖ దై
త్యానీతసురశ్రీ పున
రానయన క్రమణ వేంకటాచలరమణా.
| 1
|
వ. |
అవధరింపు మాసమయంబునఁ బాండ్యమండలంబున.
| 2
|
మధురాపురవర్ణన
సీ. |
ఏవీట సతులపాలిండ్లపై గంబూర
నవహారములచిప్ప కవుచు మాన్పు
మలయజం బేవీటఁ దొలుచెక్క డులిచి మే
డలకిడ్డ మిగుల భూములకు డిగ్గుఁ
గలఁచు నేవీటి సింహళగజంబుల గాలి
చైత్రవేళ నుదగ్దిశాగజంబుఁ
దాల్తు రేవీటి ప్రాక్తనభూపనిర్మాల్య
మరకతంబులు పెఱధరణిపతులు.
|
|
తే. |
కపివర నియుక్త గిరిసదృ గ్గహననిలయ
గాత్రగాహితకనకముక్తాకవాట
గోపురావేదితోచ్చతాక్షోభ్యవప్ర
దనరు దక్షిణమధుర సాంద్ర ద్రుమ ధుర.
| 3
|
క. |
శమనరిపుత్రిపురభిదో
ద్యమవద్దోర్వర్జ్యవలయిత స్వర్ణగిరి
|
|
|
భ్రమదంబై కాంచనవ
ప్రము దీప్రం బగుచు నప్పురంబున నొప్పున్.
| 4
|
తే. |
సొరిదిఁ గనుపట్టు హేమరశ్ములు సెలంగఁ
బొడవుకతమున సూక్షమై పొల్చుఁ జూడఁ
బట్టణము కోటకొమ్మలపంక్తి గగన
మండలశ్రీకి సంపంగిదండవోలె.
| 5
|
మ. |
పరిఖం దత్పురకామినీజనము లంభఃకేళి సల్పంగఁ ద
ద్గురువక్షోరుహలిప్తసంకుమదకస్తూరీమిళచ్చందనా
గురుపంకంబుల సౌరభంబులఁ జుమీ కుంభీనసావాస ని
ర్జరకల్లోలిని కందు భోగవతి నాఁ జన్సంజ్ఞ గల్గె న్దగన్.
| 6
|
తే. |
కాద్రవేయులు భూమియుఁ గైకొనంగ
నురగలోకంబు వెడలి తత్పరిఖనీట
నెగసి తోడనె క్రుంకుదు ర్నిలువ లేక
తత్తటాబద్ధగారుత్మతముల కులికి.
| 7
|
తే. |
తరుణశైవాల జలజపత్త్రముల వొదువ
మరకతచ్ఛాయఁ బొల్చుఁ దత్పరిఖజలము
కోట బంగారు సేయుటకొఱకు మున్ను
బ్రహ్మ పిడిచిన మందాకు పస రనంగ.
| 8
|
చ. |
అడుగున నుండియు న్బదిలమై చద లంటెడుకోట నొప్పు ప్రో
ల్చెడనికడంక దంచనపుఁ జేతుల గంగను కాసెఁ దూఱఁగా
నడుమన యున్కిఁజేసి యల నాకపురిన్ సరికై పెనంగి లా
వెడలఁగఁ బట్టివ్రేయుటకు నెత్తె నన న్జను మల్లుపోరిలోన్.
| 9
|
తే. |
ఉదుటుగబ్బలు గలతల్పుటురము సూచి
గందపట్టెలు సూచి బంగరు సూచి
వీటివాకిటిచోటనే విడువ కెపుడు
నుట్లు వెట్టుచు నుందురు సోమరపులు.
| 10
|
మ. |
స్థిరసౌధాగ్రవిహారియౌవతరతిచ్ఛిన్నాచ్ఛహారస్ఫుర
ద్గురుముక్తావళిఁజేటిక ల్విరులతోఁ గూడంగఁ ద్రోయ, న్నిజో
|
|
|
దరలగ్నం బగుదాని, నెమ్మొగి లధస్స్థంబై తఱిన్ రాల్ప, నా
కర మభ్రం బని యండ్రుగా కుదధిఁ దక్క న్బుట్టునే ముత్తెముల్.
| 11
|
మ. |
ఘనసౌధాళి వియద్ధునీజలధి వీఁక న్నావలై నీడదోఁ
ప నెలంత ల్వణిగాకృతి న్సరకు మార్పన్గోలల న్గట్టి యి
చ్చు నిజద్వీపవిచిత్రపట్టవసనస్తోమంబు నాఁ బొల్చుఁ బె
ల్లనిలాన్యోన్యవిమర్శితన్నగగనాకానేకకేతుచ్ఛటల్.
| 12
|
ఉ. |
సోరణగండ్ల రాఁ గొదమచుక్కలు పట్ట సతు ల్కవాటము
ల్చేరుప మౌక్తికంబు లని చిల్లులు వుత్తురు ద మ్మటంచుఁ బొ
ల్పారువితానహారములయం దొగి హారత వ్రేలి ప్రొద్దు వోఁ
గా రతి డస్సి గాడ్పులకుఁగాఁ దెఱవ న్జను విచ్చి మేడలన్.
| 13
|
ఉ. |
ఆపురి సౌధవీథి నధరాధరభూముల గర్జ మున్నుగా
నాపయికి న్వినంబడనియట్లుగ వ్రాలుఘనాళిఁ దార్చి లీ
లాపరతన్ ఘటింపుదురు లాస్యము సేయఁగ మేఘరంజి నా
లాపము సేసి పోషితకలాపిఁ గలాపికలాపకుంతలల్.
| 14
|
చ. |
అనిమిషపట్టణంబు పురహర్మ్యపతాకలు మువ్వమ్రోఁతతోఁ
నాపయికి న్వినంబడనియట్లుగ వ్రాలుఘనాళిఁ దార్చి లీ
లాపరతన్ ఘటింపుదురు లాస్యము సేయఁగ మేఘరూపనా
లాపము సేసి పోషితకలాపిఁ గలాపికలాపకుంతలల్.
| 15
|
చ. |
ఘనగతశంపఁ గంచ మిడి కాటుకఁ దీర్చి, పునుం గినోష్మ ద
ట్టినది యలంది, కైశికము ఠేవఁ బ్రభాతశశాంకుం మోప వి
చ్చిన నవహల్లకాళిఁ గయిసేసి, సతు ల్పతితో రమింతు, ర
మ్మునిజరరాంగన ల్కరహము ల్కృప నేడ్వురుఁ దీర్ప మేడలన్.
| 16
|
చ. |
రవి యనుదివ్వెఁ గేతువు చెఱంగున మూసి ధుతోర్ధ్వయంత్రవా
రవిరళఘర్మ యై కలరవాల్పరవోక్తుల వాంతధూపరా
జివరనిశ న్గనన్మదనచేతులఁ జాతురి నెయ్యపుంగురుం
జువిదలు దార్ప విష్ణుపద మొత్తుఁ బురీగృహలక్ష్మి నూత్న నాన్.
| 17
|
చ. |
గిఱికొనుగోపురాగ్రపరికీలితపంకజరాగరశ్మిఁ గ
ట్టెఱ యగుచాయఁ బొల్చు దివసేంద్రుఁడు సక్కన మింటఁ బోవుచో
|
|
|
మఱచి విధాత పాటలిమ మధ్యమసంధ్యకుఁ జేయ లేనియా
కొఱఁతయుఁ దీర్చుకోఁ దొగరు కొల్పినకైవడిఁ బట్టణంబునన్.
| 18
|
పుష్పలావికలు
సీ. |
వెలఁది! యీ నీదండ వెల యెంత?
నాదండకును వెలఁబెట్ట నెవ్వని తరంబు
కలువ తావులు గాన మలికదంబకవేణి!
కలువతావులు వాడకయ కలుగునె?
కడివోదు నాకిమ్ము పడఁతి! యీ గేదంగి
నన కడివోమి ముందఱికిఁ జూడు
జాతు లే వంబుజేక్షణ! పద్మినులుసైతమును
నున్న యెడ జాతులునికి యరుదె?
|
|
తే. |
యనుచుఁ దొలినుడి నభిలాష లెనయ మూఁగి
పలుకుతోడనె నర్మగర్భంబుగాఁగ
నుత్తరము పల్లవశ్రేణి కొసఁగు చలరు
లమ్ముదురు పుష్పలావిక లప్పురమున.
| 19
|
చ. |
సరసులనర్మ మింపుల నొసంగఁ గదంబపుదండఁ గట్టుచోఁ
గరఁగుటఁ దెల్పు దృక్తరళకాంతులు నుత్తర మిచ్చునంతరాం
తరముల నవ్వులు న్గలువతండము మొల్లలు నంచు మిన్ను గ్రు
చ్చి రహిని రిత్తనూ లొసఁగి సిగ్గు వహింతురు పుష్పలావికల్.
| 20
|
సీ. |
పద్మాస్య, పురి ననుభవితకు నీవ యె
త్తులు వెట్టె దనఁగ రావలసె నిటకుఁ;
దెలుపుమా, జాముండు నల రింపొ ఘటికాద్వ
యం బుండు నల రింపొ కంబుకంఠి?
యే వేఁడుటకు నీవు ఋతు వేల చెప్పెద?
వువిద, మే మందాఁక నోర్వఁగలమె?
చేరఁగా రాదె, బాసికము గేఁల్సోఁకిన,
యంతనే చెడునె యేణాయతాక్షి?
|
|
తే. |
యనుఁచు, బరిభాషఁ బోలెఁ ద మ్మాస దొరల
నాడ, మోవిఁ జెఱం గిడి, యాఁగు నవ్వు
కంట నిగుడ, విరు ల్నాల్చుకరణిఁ జల్లు
సరసపుజలంబె జాణల మరులు కొల్పు.
| 21
|
సీ. |
ఇంద మస్తఱి దంతకుందాభ గూడి ని
చ్చలపుఁజూపులు మున్న సంభ్రమింప,
వెల యొప్ప కవలఁ బో విఱుచు మోవియుఁ గోప
మొదవెడుచూపు మోమోటఁ ద్రిప్పఁ
దిరిగిన సస్మితోక్తియుఁ జూపుటొయ్యార
ములు నగుఁ గాదను పలుకు లుడుప,
నవి గాని కావొ నీకను పరసాపత్న్య
సంపాదనం బుబ్బు నింపుఁ బెనుపఁ
|
|
తే. |
జతురవచనవిలాసాంగసౌష్ఠవములఁ
బసిఁడిఁ దా నిచ్చినట్టి యప్పణఁతి మఱవఁ
బతికిఁ గైదువు లందిచ్చు రతి విధమున
విటుల కిత్తురు మఱి వారు విరులు పురిని.
| 22
|
చ. |
దలమగు చంద్రఖండములు దారలు, సాంకవ మొప్పు పాణి పా
టలమగు దంతపుంగరవటంబు శశాంకుఁడు , గుంకుమైన చీ
రల జిగి కెంపుగా బయటి రథ్యల నొప్పుదు రిందుకాంతవే
దులపయి సంధ్యయే బహుతఁ దోఁచెననన్ బురి గట్టివాల్సతుల్.
| 23
|
సీ. |
ఉపరిస్థజనవారణోక్తికిఁ జెవి దార్చి
యమ్మొగంబై బయ ల్చిమ్మి చిమ్మి,
గవను వెన్నొరయ మి న్నవియ దట్టించు తో
ద్రథరు బందపుదాంట్లఁ దఱిమి తఱిమి,
చలువచే ద్వారవేదు లెఱింగి నిల్చి త
జ్జనజిఘృక్షకుఁ గేలు సాఁచి సాఁచి,
డిండిమంబుల కుబ్బ గండాల్పదాన మే
ఱులుగఁ దద్వహు ఱాల ఱువ్వి ఱువ్వి,
|
|
తే. |
వేణుకాహతులకు వీడు వెడలి వెడలి
పరపథగజధ్వనికిఁ బోక తిరిగి తిరిగి
దృక్పుటలు వైరులకుఁ బంపు కృత్య లన ప
శానుగతిఁ జేరు వెలిఁ గరు లగ్గలికల.
| 24
|
ఉ. |
పై ననిశంబు సల్లుకొను పాంసువుపై ఖగతుండఖండితా
లానమహామహీరుహఫలచ్యుతబీజము లుత్‌క్షిపత్కరాం
భోనిబిడాఫ్లుతి న్మొలవఁ బొల్చు నగమ్యతఁ దూలుచు న్బురో
ద్యానముల న్మదేభములు ప్రాణముతోడినగంబులో యనన్.
| 25
|
శా. |
మౌనిక్రోధవిధూతపత్త్రములమౌ మాతో సపత్త్ర ల్గదా
కానీ రం డని కేకరాక్షిరుచి మొక్క ల్ప్రక్కల న్శార్‌ఙ్గతూ
ణానల్పాహిపకల్పకాండతతులం దారం బురిం బొల్చు నా
జానేయంబులు ఫేనహాస మిడి కైజామోర లల్లార్చుచున్.
| 26
|
చ. |
చలమున సింగణీతరకసంబులఁ గట్టక మాన, రంపవె
న్సెలగతి మాగతి న్వెనుకఁ జిక్కక మానదు, తప్పిదారి వె
న్నొలసినఁ దారు ము న్నెఱుఁగకుండుట యొచ్చెము సాదికోటి కం
చలమినచింతఁ ద్రవ్వికొను నంఘ్రితుద న్బురిలోని వాహముల్.
| 27
|
ఉ. |
అంజ సమానవాయుగణ మంతయు ఖంజతఁ జిక్క, నాజవో
ష్మం జని యుబ్బి చిక్కనిసమానపువాయువులో నొకండు గ
ల్మిం జనియించు దుర్యశము మేల్కొని లేహనవేళ వాజు లూ
ర్పం జెడుమాణిబంధముకురంబుల కాళిమపేరఁ గార్కొనన్.
| 28
|
మ. |
ఇలఁ బాదద్వయి రాయ నల్కొసఁగు నెంతేఁ బాఱుచో, నంకెవ
న్నెలు రెండై లఘువం దకీర్తియిడు మున్నే యెక్కుచో, నిందు నెం
దుల కే మౌదు మటంచు సాదు లలయన్, దూర్ణోచ్చము ల్వాజు లం
దలరున్ బాహ్లికపారసీకశకథట్టారట్ట ఘోట్టాణముల్.
| 29
|
పణ్యయువతులు
సీ. |
ముడివిప్ప నడుగుఁ దమ్ములనె వ్రాలుటఁ దేంట్లు
నెఱికురు లగుట సందియము గలదె?
|
|
|
కన నెంతవాని లోఁగొనుట నాదర్శంబు
నెమ్మొగం బగుట సందియము గలదె?
ఇఱిగౌను మింటిపై మెఱయుటఁ జక్రద్వి
తయి చన్ను లగుట సందియము గలదె?
పొలసు దొర్లఁగఁ జూచు కలికిచూపులమీటు
దెలికన్ను లగుట సందియము గలదె?
|
|
తే. |
పొలసిననె తావి బుగులుకో నలరుఁదీఁగ
తిన్ననిశరీర మగుట సందియము గలదె?
యనఁగఁ జెలువొంది సురతవైయాత్యవనిధులు
పణ్యయువతులు పొలుతు రప్పట్టణమున.
| 30
|
మ. |
ప్రతతప్రాంతపిశంగకుంకుమజటాపాళీకురంగీమదా
సితవీణాళికలస్వనంబు లెసఁగం జెన్నారు కర్పూరపుం
జతతు ల్కంటికి నారదత్వమున మించ న్గామినీకామిసం
తతి కేలా యెడత్రెచ్చుఁ గంతుకలహోన్మాదంబు లాప్రోలునన్.
| 31
|
తే. |
నిం గిటు త్రిశంకుకతన మాతంగవాటి
యయ్యె నిఁక నుండఁ దగ దని యవని కరిగి
నట్టి నక్షత్రతారాగ్రహాలి యనఁగఁ
గాంత నవరత్నరాసు లంగళ్ళఁ బొలుచు.
| 32
|
చ. |
చిరసముపార్జితాగ్ని తడిఁ జెంది నశించు నటంచునో, కృతా
ధ్వరతఁ దదగ్ని మై నునికి దాన నొకంగము తాఁచుచేతనో,
పుర ధరణీసురు ల్నిగమభూధరము ల్జపయజ్ఞశీలు రా
హరిధనదాదులైన వలహస్తము సాఁపరు దానధారకున్.
| 33
|
చ. |
ఉరవడిఁ బోరికై కవచ మొల్లరు మంత్రములందుఁ దక్క, సు
స్థిరభుజశక్తి నైదుపది సేయరు దత్తిన తక్క, మంటికై
పొరల రధీశుడీ కమలబుద్ధి ఖళూరికఁ దక్క, వజ్రదోః
పరఘవశీకృతాన్యనరపాలకు లప్పురి రాకుమారకుల్.
| 34
|
శా. |
దంభాపేతవితీర్ణితోయములు రథ్యం దొట్టి హట్టస్ధిత
స్తంభంబు ల్చిగిరించుచున్నవి యనన్ ధర్మైకనిత్యార్జనన్
|
|
|
సంభూతం బగుపైఁడికోటి కొకటై నానాఁటికిన్ హెచ్చు చ
య్యంభోదావళి గప్పఁ గేతువులు వైశ్యశ్రేణి పొల్చున్ బురిన్.
| 35
|
తే. |
నృపులపదహలరేఖల కెల్ల మా భు
జాగ్రహరేఖలే మూల మనుచుఁ గోటి
కొండలుగ ధాన్యరాసులు పండువీట
సుజనభజనైకవిఖ్యాతి శూద్రజాతి.
| 36
|
చ. |
ఉమియఁగఁ దన్న నవ్వ నన నొచ్చెము గాంచిన కొన్నిమ్రాఁకు లా
ప్రమదల నప్పగింపుఁ డని రంజిలు సేఁతలు గన్న చెట్లకున్
దమ కళిశృంఖలన్ బెనఁచి నమ్మక ముట్టెఁ బురంబుఁ గంతుసై
న్యముఁ గొని నా వెలిన్ శుకపికాదులఁ గేళివనాళి పొల్పగున్.
| 37
|
సీ. |
మదగంధతారతమ్యము యామ్యకరికిఁ ద
త్కరులకుం గనబలెఁ గటము లొరసి,
సురతశ్రమజ మౌటఁ జూపోపకయుబలెఁ
గామినీమృదుగండఘర్మ ముడిపి,
పరిమళవాహేచ్ఛఁ బ్రాణమీబలెఁ జించు
మృగనాభిచర్మభస్త్రికలు దూఱి,
యహితపన్నగభేదు లనిబలె గృహవిటం
కపుఁగలాపుల నొయ్య గఱులు నిమిరి,
|
|
తే. |
వీటిసామగ్రిఁ గనుఁగొన వేగపడక
నడవఁ దనదిక్కు పుష్పదంతద్విపంబు
నెక్కెనో యన జడగతి నెపుడుఁ బొలయు
నందుఁ జందనశిఖరి మందానిలుండు.
| 38
|
మత్స్యధ్వజుఁడు
సీ. |
ద్విద్వయోపాయ ధీవిద్వద్వతంసంబు,
షాడ్గుణ్యచాతురీచక్రవర్తి
క్రీడాచలీకృత శ్రీఖండగిరిరాజు,
కనకాద్రిముద్రణ గ్రంథకర్త
|
|
|
యందూనిబద్ధాభ్రబృందవేదండాళి,
వననిధిస్తంభ నాధునిక రఘువు
తామ్రపర్ణ్యమలపాథః కేళిహంసంబు,
లంకేశమైత్రీ ప్రియంకరుండు
|
|
తే. |
స్వస్తికృద్వాస్తవస్తుత్యగస్తి, మఘవ
మకుటమోటన శరకోటి మంత్రభృత్య
భూతభూతాత్తశాంభవ భూమికుండు
దత్పురం బేలుఁ బాండ్య మత్స్యధ్వజుండు.
| 39
|
ఉ. |
ఇందుకులావతంస మతఁ డేతఱి నేతరిగాఁ; డరిం బ్రజ
ల్కందఁ గొనం; డొరుం డొరుతల న్వినిపించినమాట డెందముం
జెంద ముదంబు దక్కి చెడఁ జేయఁ డొరు; న్వినతాస్యుఁ డౌ నుతిం
పం దనుఁ; బందనుం గొఱత వల్కఁడు శూరతఁ దానుమించియున్.
| 40
|
సీ. |
పాటీరగిరివనీవాటిఁ గ్రీడించియు
నహిభయం బెఱుఁగఁ డావంతయైన;
నత్యంతమితభాష నవికత్థనుం డయ్యుఁ
బరులఁ గేరడమున భంగపఱుచుఁ;
బ్రేమఁ దాఁ దామ్రపర్ణికి నాథుఁ డయ్యును
సద్గోష్ఠిచే ననంజనత మెలఁగు;
మహనీయమహిమఁ దా మధురాస్పదుం డయ్యు
లావణ్యకలన నుల్లాస మొందు;
|
|
తే. |
విషధిలహరిభిదోత్పతత్పృషతజటిల
వలదురుక్రమతిమివరవాలపతన
తులితపరబలకరిశిరస్స్థలసముత్థ
బహుళముక్తావిముక్తాసిపాతుఁ డతఁడు.
| 41
|
శా. |
దానత్యాగపతత్త్రమై తొలుపతత్త్రం బంబుధార న్సదా
నానం, దత్సితకీర్తిహంసి చనుమింటం; గ్రొత్త నా నేల,నా
నానీరార్ద్రపతత్త్ర యయ్యు వడి మింటం బాఱు తజ్జాతి కే
లా నిల్చున్గతి యన్యపత్త్రిగతిఁ బత్త్రైకప్రదేశాఫ్లుతిన్?
| 42
|
సీ. |
శుకకదంబము గొలుసులచే నిబద్ధమై
వారాంగనాగారకారఁ బడఁగ;
గిరికానికాయంబు లరిశూన్యబహుపుర
హర్మ్యవాటికలఁ జెడాడుచుండఁ;
గ్రందుగా నితరేతరంబు రాయిడి సేయు
రాజులు దననూపురమున నొదుఁగ;
నెగడు ననావృష్టి నిజబరేభస్పర్ధి
సమదాన్యకరటి గండములఁ జేర;
|
|
తే. |
దానవేళల నతివృష్టి తనకు హస్త
గతము గాఁగఁ బ్రతాపాగ్నిఁ గ్రాఁగిపోవు
కందకులయందు శలభత గలయ నడఁగ
నేలు నాపాండ్యుఁడు మహి నిరీతి గాఁగ.
| 43
|
వ. |
అమ్మహీవల్లభుం డివ్విధంబున సామ్రాజ్యవైభవంబు లనుభవించుచుండఁ
గొంతకాలంబున.
| 44
|
గ్రీష్మము
తే. |
పాటలవసుంధరారుహభాగధేయ
మాతతమరీచికాంబువర్షాగమంబు
ధరణిఁ బొడసూపె నంత నిదాఘసమయ
మదుటుతో శాల్మలీఫలవిదళనంబు.
| 45
|
సీ. |
నిర్ఝరప్రబలవేణిక లింకఁ జట్రాలఁ
బేరిన ప్రాఁచి పెన్పేటు లెగసె
నెఱుకులు పడియనీ రివుర గువ్వలఁ బట్టఁ
బోయునీ రాడదఁ బొలము నెఱసె
సురగాలి దవదగ్ధతరుపర్ణతతి రేఁపఁ
బావురా లని డేగపదుపు దూఱె
నిద్రితద్రుచ్ఛాయ నిలువక జరగ వెం
బడిన యధ్వగపంక్తి పొరలుపెట్టె
|
|
తే. |
క్షేత్రపాలున కుదికినచీర లాఱు
చాకిరేవుల గము లయ్యె సకలదిశలుఁ
దెలుపులుగఁ దోఁచు నెండమావుల బయళ్ళఁ
గందె నివి యెండ నన దిఙ్ముఖములు రాఁజె.
| 46
|
చ. |
సరి యగు నిట్టివెట్ట నివి సర్వము నం చటమీఁదిసృష్టికై
శరధిపదిఙ్మరుజ్జ్వలితచండతరాతపవహ్నిఁ గాలఁగాఁ
గరువు లజుండు వీనిపయిఁ గట్టె ననన్ గనుపట్టె వెచ్చల
న్గరి కిరి కాసరాంగములఁ గప్పిన ఱొంపులు నంద యాఱఁగన్.
| 47
|
మ. |
దవధూమంపుఁదమంబులోఁ దమరసద్రవ్యంబుఁ బంకేజబాం
ధవభానుప్రతతుల్ హరింపఁ గుయివెంట న్వెళ్లు శూన్యోరుకూ
పవితానం బనఁ జూడఁజూడఁ బుడమిన్ బాటిల్లి పై విప్పులై
యవసం బంచుల నాడఁగా నెగసె వాత్యాళి న్రజశ్చక్రముల్.
| 48
|
చ. |
పడమర వెట్టు నయ్యుడుకుప్రాశన మొల్లక కూటిపేదలై
బడలిక నూడు నచ్చిలువ ప్రగ్గములన్ రవియాజ్ఞ మాటికిన్
ముడియిడఁ బిచ్చుగుంటు రథము న్నిలుపన్ పయనంబు సాగమిన్
జడను వహించె నాఁగ దివసంబులు దీర్ఘము లయ్యె నత్తఱిన్.
| 49
|
క. |
తరణిఖరకిరణశిఖి జగ
మెరియింపఁగఁ బొడమి గాలి నెగసిన భసితో
త్కర మనఁగ శాల్మలీతరు
పరిణతఫలతూల మర్కపథమున నెరసెన్.
| 50
|
చ. |
భరితనిజాంబుబింబితవిభాకరబింబవిజృంభితప్రభాం
కురముల నధ్వనీనకృతకూపకపంక్తులు వొల్చె నబ్ధిరా
డ్విరహభరంబున న్బొడమువెచ్చకు శాంతి యొనర్ప వాహినీ
తరుణులు మేన దట్టముగఁ దాల్చిన ముత్తెపుఁబేరులో యనన్.
| 51
|
మ. |
అతివృష్టిన్ మును వార్ధిఁ గూర్చు నెడకాఁ డౌటం దమిం గూర్చునన్
మతి లంచంబుగ హేమటంకములు మింటం బొల్చు పర్జన్యదే
వత కీ నెత్తిన కేలనాఁ బొలిచె నిర్వారిస్రవంతిన్ బయ
శ్చ్యుతి నమ్రచ్ఛదదృశ్యకర్ణికములై యున్నాళనాళీకముల్.
| 52
|
సీ. |
నులివాడునాఁచువల్లుల గొం తొగర్చి లేఁ
బొల పల్చుగాలి వే పోక నెఱిఁగి,
కడకు వెళ్ళఁగ నొక్కకడనుండి త్రొక్కుచు
నులుచలుఁ జిఱుతగుల్లల నమలుచు,
నెండ్రి కా లిఱికిన నెగసి యొక్కించుక
తొలఁగి శితత్రోటిఁ దూఁటి తినుచుఁ,
దడి యింకునిలఁ జేమమడివోని తమ్మిగుం
పులును జీలుగుల నెండలు గడపుచు
|
|
తే. |
దనరు బకపంక్తులకు జానుదఘ్న మయ్యెఁ
జెరువుగమి; యుడుము లన రే ల్దిరిగెఁ గుక్క
పసికి బావులఁ బడుటకు బసులయెరువు
టెఱలకు మొసళ్లు; మలుఁగుమీ న్బొఱియఁ దూఱె.
| 53
|
ఉ. |
మీ టగు మీలనెల్ల మును మ్రింగి క్రమంబున నానె నెండ పె
న్నీటిక వెంటఁ దోఁచుతొగవేరుబడి న్గొడుపై చెలంగఁగా
ద్రోటికఁ గర్దమద్రవముతో నెనయించిన బొమ్మిడాయ డా
త్కూటకులంపులేజెన బకోటకులంబు జలహ్రదంబులన్.
| 54
|
శా. |
ప్రాతర్వేళల నట్టివెట్ట సొగసై పాటిల్లెఁ గుంభోంభనో
ద్భూతాంబుధ్వని వాద్యమై మరుదధఃపుంజీభవత్పాటల
వ్రాతామ్రేడితసిక్తభూసురభిళారామాంబుకుల్యాబహు
స్రోతస్సంధుల నంధుయంత్రనతికృత్ప్రోద్గీతగేయౌఘముల్.
| 55
|
తే. |
మెండుమీఱిన పగటి బీఱెండ దాఁకి
యొల్లఁబోయిన లేబొండుమల్లెపొదల
తుదలఁ జప్పటలై కడుదొడ్డ లగుచుఁ
బొడమె మొగ్గలగము లగ్గిబొబ్బలట్ల.
| 56
|
మ. |
నుడి నాభిచ్ఛలన, న్సరోజములు చక్షుఃప్రక్రియ, న్నాఁచు క్రొ
మ్ముడి దంభంబునఁ, జక్రఫేనపటలంబు ల్చన్నులు న్నవ్వుఁగా,
నడరంజేసి నిదాఘభీతి సలిలం బాగామిబీజార్థ మై
కడనం బెట్టిన వారిదేవతలు నాఁ గాంతాళి యొప్పు న్స్రపన్.
| 57
|
సి. |
సెగ కుల్కి మఱుఁగుఁ జొచ్చినజహ్నురవిజుల
సరణి మల్లెలతొడిజడలు మెఱయ,
వలిచన్నుకొమరు మ్రుచ్చిలిన ది మ్మనుతెఱం
గున ముంచుగరిక కాఁగుల మునుంగ,
దారలోఁ దోఁచు కన్దళుకులు వాసితో
త్పలపత్త్రపతనసంభ్రాంతి నొసఁగ,
దెలిమోమువన మెచ్చి తలయూఁచు టెఱిఁగి మా
నక నవ్వునేర్పు డెందములఁ గరఁపఁ
|
|
తే. |
దెఱవ లిటు నీరు వోయుపందిరియ చేరి .
యవలఁ గొఱగాక పిచ్చుగుం టై యనంగుఁ
డనువు గొనఁ జొచ్చెఁ గల్లగు ట్టమర వారి
కధ్వగులు లాఁచి యిడు విడియములపేర.
| 58
|
చ. |
తొడిఁబడ నమ్మ లక్క లని తూలుచు దీనత దోయి లొగ్గుచున్,
వడ మఱి తేరఁదేర, సలవాక్యము లెన్నక, మోము గుబ్బలున్
గడుకొనుకక్షదీప్తులు నెగాదిగఁ గన్గొనుచిట్టకంపుఁద్రాఁ
గుడుఁ గని సన్నల న్నగిరి క్రోల్పక పాంథుఁ బ్రపాప్రపాలికల్.
| 59
|
తే. |
ఎసఁగు కట్టావిక్రియ నావి రెగయఁ బగటి
యెండ యుడుకాఱకుండు భూమండలమునఁ
బొలిచె మాపటఁ బండువెన్నెల చకోర
పోతవితతికిఁ జాఁపట్టు వోసినట్టు.
| 60
|
సీ. |
పవలెల్ల దీర్ఘికాంబువు చల్లుపోరాట
నలసి, మృణాళికాజడము లైన
బాహువు ల్తమదుకూర్పరముల కెదురుగా
నలసి మూఁపులఁ గరతలము లునిచి,
ప్రాల్మాలి మిగుల నార్పని కమ్మ క్రొమ్ముడిఁ
దనిమొగ్గవిరవాదిదండ విరియ,
ధౌతగంధామోదిశీతలస్తనములు
వొందఁ గౌఁగిళ్ళతో బోరగిల్లి,
|
|
తే. |
నారికేళాసవపుఁదీఁపుటూరు పొలయ,
వలిపెయొంటొల్లెతో నురస్స్థలులఁ గూర్కు
ప్రియల వేకువఁ దొడ నెచ్చరించి కలసి
రెలమి ధన్యులు దఱపివెన్నెలబయళ్ళ.
| 61
|
చ. |
హృదయము లెప్పుడు న్గలయకే తఱచౌ వెడకౌఁగిలింతలున్
గదిరెడు మేలుకార్యములఁ గల్గక మాటలయందె కల్గుపె
న్జదురులు వట్టిశైత్యములుఁ జాల ఘనం బయి మండు వేసవిన్
బొదలఁగ నిల్చె దంపతుల పొందు లనార్యుల పొందుకైవడిన్.
| 62
|
ఉ. |
తీలగు కంతువెంబడినె తెమ్మెరలు న్రవిదీప్తి కల్కి పా
తాళముఁ బట్టుచుండఁ దమతావులు మ్రుచ్చిలఁ బట్టి యోషధీ
పాలున కప్పగించె ననఁ బై సురభిశ్వననంబు నించెఁ గాం
తాలసవక్త్రసీమ విటు లార్చు నుశీరపుఁదాళవృంతముల్.
| 63
|
చ. |
సమసి కథావశిష్టమగు చందనశైలసమీరణంబుఁ గృ
త్రిమగతి నింద్రజాలమునఁ దేఁ దొడఁగెన్ భువిఁ దాలవృంతజా
లము; లది మాయ యౌటకుఁ దలంపఁ దదీయమయూరపింఛికా
భ్రమణమె సాక్షిగాదె, నగరంబున నట్టికడిందివేసవిన్.
| 64
|
తే. |
అట్టివేసవి బెడిదంపు వెట్టకతన
హస్తము సెమర్చి సారెకు లస్తకంబు
దుసికిలఁగఁ గాదె సవరింప వసము గాక
పుష్పబాణుని చెఱకువి ల్పుడమిఁ బడియె!
| 65
|
మ. |
తరుణు ల్దల్లియొఱ న్కుచంబు లునుపం దచ్ఛైత్యము ల్దీములై
పెరరేపం జనుదెంచెఁగాక! రవిదీప్తిం గ్రుంగి పాతాళగ
హ్వరముల్ తూఱిన వారి నీయదుకుఁద్రాళ్ళా తెచ్చు?' నా దీర్ఘత
చ్చిరకృష్టిం గనునీటిశైత్య మలరించె న్నూతులం దత్తఱిన్.
| 66
|
మ. |
స్వనిదానోగ్రనిదాఘవైఖరినె యూష్మన్మల్లిక ల్కామినీ
కనదానీలకచాగ్రపంక్తి నెఱియల్గాఁ బాపఁగాఁ, బాటల
న్ఘనతం దేనియసోనఁ గూర్చె; నది యౌఁగాఁ నాభియు న్నిర్నిషం
బును దోఁబుట్టవులయ్యు వేర్పడ గుణంబు ల్సూపఁగా జూడమే?
|
|
శా. |
తారుణ్యాతిగ చూతనూత్నఫలయుక్తైలాభిఘారస్వన
ద్ధారాధూపితశుష్కదంబుహృతమాత్స్యచ్ఛేదపాకోద్గతో
ద్గారంపుం గన రార్చు భోగులకు సంధ్యావేళలం గేళికాం
తారాభ్యంతరవాలుకాస్థితహిమాంతర్నారికేళాంబువుల్.
| 68
|
క. |
గ్రామగ్రామంబున నౌక
సామంతున కిడినచలువ చప్పరములు త
న్పై మేదినిఁ గుంపటిలోఁ
దామరలుంబోలె నట్టితఱి నొప్పారెన్.
| 69
|
తే. |
తోఁటఁ బగ లుండి, మల్లెలు దుఱిమి, కావు
లమర మాపైన నిక్షుయంత్రముల కొయ్యఁ
జేరుప్రజ వొల్చె భావివృష్టికిని గ్రుడ్డు
తో మధురిమేచ్చ దిగు నెఱ్ఱచీమ లనఁగ.
| 70
|
పరదేశివిప్రుఁడు
క. |
అప్పెను వేసవి విభవము
విప్పుగఁ దన్నగరనికటవృషగిరి హరికిం
దెప్పతిరునాళ్ళ రా, ముద
మొప్పన్ బరదేశి విప్రు డొఁక్కఁడు భక్తిన్.
| 71
|
క. |
సేవించి పోవుతఱి మథు
రావిభవముఁ జూడ వచ్చి శ్రాంతిమెయిన్ మా
పా వైఘనీటఁ గృతసం
ధ్యావిధి యై నృపపురోహితావాసమునన్.
| 72
|
సీ. |
పరిపక్వసురభిరంభాఫలంబులతోడ,
దళమెక్కు పనస పెందొలలతోడ,
ఘృతపిండనిభకర్కరీఖండములతోడ,
బలుదెఱంగుల మావిపండ్లతోడ,
గోస్తనీమృదుగుళుచ్ఛస్తోమములతోడ,
గప్పులేఱిన వడప్రప్పుతోడ,
|
|
|
సుమధురస్థూలదాడిమబీజములతోడ,
దనుపారు రసదాడిగనెలతోడ,
|
|
తే. |
బానకం బతిథుల కిడ్డఁ, దానుఁ గ్రోలి
యర్చనాదత్తచందనచర్చఁ దేలి,
విరులు సిగఁ దాల్చి కర్పూరవీటిఁ జౌరు
కొట్టుచు ద్విజుండు వెన్నెల బిట్టుగాయ.
| 73
|
తే. |
మాత్రసంచి తలాడగా, మార్గవేది
నొక్కఁ డార్యలు, గీత లొండొకఁడు, దా సు
భాషితంబులుగాఁ, దోడి బ్రాహ్మణౌఘ
ముబుసుపోకకుఁ జదువఁ బరున్నవేళ.
| 74
|
రాజు భోగినికడకుం బోవుట
సీ. |
పన్నీటితోఁ గదంబము సేసి పూసిన
మృగనాభివస రాచనగరు దెలుపఁ,
బాటలానిలము లార్పఁగఁ దపారపుఁజుంగు
లలరుఁదావికి మూఁగు నళులఁ జోఁప,
గర్ణడోలామౌక్తికచ్ఛాయ లెగఁబ్రాఁకు
మురుహారరుచులఁ ద్రన్తరికిఁ దన్న,
శశికాంతి చెంగావి దశ మలంచిన కేల
స్వర్ణత్సరువు వాఁడి వాలు మెఱయ,
|
|
తే. |
మెలఁత యడపముఁ దేఁ, జరన్మేరు వనఁగ,
దలవరులు గొంద ఱొలసి ముంగలఁ జనంగ;
నర్థి రథ్యాంతరాంతఃపురాంతరమున
భోగినీసంగతికి రాజు వోవుచుండి.
| 75
|
చ. |
వినియె, "నెలల్ చతుర్ద్వయిని వృష్టి దినాళికి, రాత్రికై దివం
బున, జరకై వయస్సునను, బూని పరంబున కిప్పు డుద్యమం
బనువుగఁ జేయఁగా వలయు" నంచు బురోహితధర్మ మాత్మ గీ
ల్కొన నల విప్రుఁ డాద్విజులలోన సుభాషితమున్ బఠింపగన్.
| 76
|
క. |
విని, తద్గ్రంథార్థము నె
మ్మనమున నూహించి, తెలిసి, మ్రాన్పడి, కడకుం
దన మోసమునకు భయపడి,
జనపతి యటు చనక నిలిచి, సంతాపమునన్.
| 77
|
ఉ. |
ఎక్కడి రాజ్యవైభవము? లెక్కడి భోగము? లేటి సంభ్రమం?
బక్కట! బుద్బుదప్రతిమమైన శరీరము నమ్మి మోక్షపుం
జక్కి గణింపకుంటి; యుగసంధుల నిల్చియు గాలుచేతి బల్
త్రొక్కుల నమ్మనుప్రభృతులున్ దుద రూపఱకుండ నేర్చిరే?
| 78
|
క. |
ఉన్నట్ల యుండ నద్దరి
కి న్నరులను నావ చేర్చు క్రియ వెసఁ దా బో
కున్నట్ల యుండి కాలం
బు న్నరులకు వయసు బుచ్చి మోసము దెచ్చున్.
| 79
|
చ. |
సగరు, నలుం, బురూరవుఁ, ద్రిశంకుసుతున్, బురుకుత్సుఁ, గార్తవీ
ర్యు, గయుఁ, బృథుం, భగీరథు, సుహోత్రు, శిబిం, భరతుం, దిలీపునిన్,
భృగుకులు, యౌవనాశ్వు, శశిబిందు, ననంగుని, నంబరీషుఁ, బూ
రుగురుని, రంతి, రాఘవు, మరుత్తునిఁ గాలము కోలుపుచ్చదే?
| 80
|
క. |
కానఁ దటిచ్చల మగు రా
జ్యానందము మరగి యింద్రియారాముఁడ నై
పో; వింతనుండి పరలో
కానందంబునకె యత్న మాపాదింతున్.
| 81
|
క. |
వర్గత్రయపరత ముహు
స్స్వర్గక్ష్మామధ్యమాధ్వజఙ్ఘాలికతా
దుర్గతియు నొల్ల, మఱి యప
వర్గదుఁ డేవే ల్పెఱింగి వాని భజింతున్.
| 82
|
క. |
అని తలఁచి మెచ్చి, యవ్వి
పునకు న్వీటికరండమున ముద్రిత మై
యునిచిన యొక ముడు పార
క్షునిచే నిప్పించి, నగరు సొచ్చి, చనన్.
| 83
|
క. |
కొలువై బహునమయంబుల
మెలఁగెడు కోవిదులఁ గూర్చి 'మీ మీ శాస్త్రం
బులలో నెవ్వఁడు మోక్షం
బెలయించునొ చూచి నిశ్చయింపుఁ' డటంచున్.
| 84
|
తే. |
వాద మొనరించి గెలిచి తత్త్వంబు దెలుపు
వాని కని బీరపువ్వులఁ బోని టంక
సాలవాటులు నించి యాస్థానిఁ గట్టఁ
గాలసర్పముగతి వ్రేలుజాలెఁ జూచి.
| 85
|
క. |
హరు నొకఁ డన, నుమ నొకఁ డన
హరి నొకఁ డన, శిఖి నొకఁ డన, నర్కు నొకఁ డనన్,
గరిముఖు నొకఁ డన, రజనీ
శ్వరు నొకఁ డన, నజు నొకఁ డన, వాదైనతఱిన్.
| 86
|
తే. |
విల్లిపుత్తూరిలో నల్ల విష్ణుచిత్తుఁ
డతులతులసీసుగంధిమాల్యమును మూల
మంత్రమున నక్కుఁ సేర్పఁబో మన్ననా రు
దారమధురోక్తి నవ్విధ మానతిచ్చి.
| 87
|
ఉ. |
నేఁడు మహామతీ! మథుర నీవు రయంబునఁ జొచ్చి యందుఁ బాం
డీఁడు దివాణము న్నెఱయ నించినఁ బ్రేలెడు దుర్మదాంధులన్
బోఁడిమి మాన్చి మన్మహిమముం బ్రకటించి హరింపు శుల్కమున్
వాఁడును రోసినాఁ డిహము వైష్ణవుఁగా నొనరింపు సత్కృపన్.
| 88
|
తే. |
అనిన వడవడ వడఁకి సాష్టాంగ మెఱఁగి
సమ్మదాశ్రులు పులకలు ముమ్మరింప
వినయవినమితగాత్రుఁడై విప్రవరుఁడు
వెన్నునకు భక్తి నిట్లని విన్నవించె.
| 89
|
శా. |
స్వామీ! నన్ను నితఃపురాపఠితశాస్త్రగ్రంథజాత్యంధు, నా
రామక్ష్మాఖననక్రియాఖరఖనిత్రగ్రాహితోద్యత్కిణ
స్తోమాస్నిగ్ధకరున్, భవద్భవనదాసు, న్వాదిఁగాఁ బంపుచో
భూమీభృత్సభ నోట మైన నయశంబు ల్మీకుఁ గాకుండునే?
| 90
|
మ. |
గృహసమ్మార్జనమో, జలాహరణమో, శృంగారపల్యంకికా
వహనంబో, వనమాలికాకరణమో, వాల్లభ్యలభ్యధ్వజ
గ్రహణంబో, వ్యజనాతపత్రధృతియో, ద్రాగ్దీపికారోపమో,
నృహరీ వాదము లేల? లేరె యితరు ల్నీ లీలకుం బాత్రముల్?
| 91
|
మన్ననారు విష్ణుచిత్తు ననుగ్రహించుట
తే. |
అనినఁ దద్భక్తి కెద మెచ్చి యచ్యుతుండు
మొలకనగ వొప్ప శ్రీదేవి మోము సూచి
'వా దితనిచేనె గెలిపింతు; నాదుమహిమ
మువిద కను' మని ప్రాభవం బొప్పఁ బలికి.
| 92
|
క. |
నీయిచ్చయె? మిన్నక పో
వోయి, మునిప్రవర! నిన్ను నొప్పింతును భూ
నాయకసభ, నిందులకై
యేయడ్డము వలవ దవల నే నున్నాఁడన్.
| 93
|
విష్ణుచిత్తుఁడు మథుర కేఁగుట
క. |
ఆనతిఁ బడి, శ్రీభండా
రాన న్సంబడముఁ దనదు ప్రాఁతందలమున్
స్థానికుఁ డొసంగి పనుపం
గా, నానతిబడిన నిమితకాండ్రు వహింపన్.
| 94
|
క. |
లావు గల యద్దెగుఱ్ఱపుఁ
జావడములమీఁద మాత్రసంచులు దూలన్,
గ్రేవల నేకాంగులు రా,
వీవధముల నఱిసె లవనివిభునకుఁ గొనుచున్.
| 95
|
సీ. |
భక్తిఁ ద్రోవకు సాధ్వి పరికరంబులు వెట్టి
కట్టిన పొరివిళంగాయ గమియు
నెసటిపోఁతలు గాఁగ నేర్పరించిన చిరం
తనపు శాలిక్షేమతండులములు
వడిఁబెట్టి లోఁ జెఱకడము సాఁబా లూన్పఁ
జెలఁగు సంబారంపుఁ జింతపండు
పెల్లు లోహండికావళ్ల కొమ్ముల వ్రేలు
గిడ్డిమొత్తపు నేతిలడ్డిగలును
|
|
తే. |
బెరుఁగువడియంబులును, బచ్చివరుగు, బేడ,
లురుతరాచ్యుతపూజోపకరణపేటి
కలును, సాత్తిన సాత్తనికులము బలసి
విధినిషేధము లెఱిఁగి తే మధుర కరిగె.
| 97
|
ద్వితీయాశ్వాసాంతము
చ. |
యమనియమాదిలభ్య, ద్రుహిణాది జరన్మరుదిభ్య, సంసృతి
శ్రమహరనామకీర్తన, మురప్రవికర్తన, పాతకావలీ
దమన, రమాంగనాకమన, తామరసాయతనేత్ర, భక్త హృ
ద్ర్భుమతృణదాత్ర, భూయువతి రంజన, వర్ణ జితాభ్రఖంజనా!
| 98
|
క. |
దోర్ధూర్ధృతదుర్ధరగో
వర్ధన, రాధానురాగవర్ధన, లీలా
వార్ధుషికా, యిషికాకృత
వార్ధశ్రవసైకనేత్ర వైకృతినిపుణా.
| 99
|
మాలిని. |
ద్రుహిణజముఖమౌనిస్తోమనిస్తంద్రభాస్వ
ద్దహరవిహరమాణాతామ్రపాదాంబుజాతా
బహిరబహిరపారప్రాణికోటిప్రపూర్ణా!
మహిమవినుతవాణీమాధురీవేద్యపర్ణా.
| 100
|
మ. |
ఇది భూమండనకొండవీడుధరణీభృద్దుర్గపూర్వాద్రిభా
స్వదిభేశాత్మజవీరభద్రజనజీవగ్రాహరాహూయమా
ణ దృఢాంచద్భుజ కృష్ణరాయమహిభృన్నామాస్మదాముక్తమా
ల్యద నాశ్వాసము హృద్యపద్యము ద్వితీయంబై మహిం బొల్పగున్.
| 101
|