Jump to content

ఆబ్రహాము లింకను చరిత్ర/పదునొకండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునొకండవ ప్రకరణము

న్యూ ఆర్లియన్సుకు రెండవ యాత్ర.

1831 వ సంవత్సర ప్రారంభమున ఫిబ్రేవరిలో నొకనాడు డెంటను ఆఫుట్టను వ్యాపారి యొక్కడు దనసరకుల న్యూ ఆర్లియన్సుకు గొనిపోవ 'నావికుడు' గావలెనని వెతకుచు జాన్‌ను గాంచి నీవు నాకార్యము నెఱవేఱ్పవలె ననియెను. అత డందులకు వెనుదీసి యాబ్రహామైన నాపనికి జాలునని పలికి వర్తకుని నొడంబఱచి వేతనముల నిష్కర్ష చేసికొని లింకను మాఱుదమ్ము డగు జాన్‌స్టనునుగూడ జేర్చుకొనున ట్లేర్పఱచి వారిద్దఱితో గలసి మాట్లాడ వెడలెను.

ఆపుట్టాప్రదేశమున నెల్ల నుదారబుద్ధి గలవా డని ప్రసిద్ధి జెంది యుండెను. ఆతని యీగి కొన్నిసమయముల నతనికే హానికరముగ నుండునంత యెక్కు డనియు వదంతి గలదు. ఇది యెట్లుండినను ఆబ్రహాము జాన్‌స్టనుల కతడియ్య నంగీకరించిన వేతనపు మొత్తముమాత్రము మిక్కిలి యౌదార్యమును సూచించుచుండెను. అంతటి కూలి వారదివఱకు గడించినది లేదు. కావున నాబ్రహాము జాన్‌స్టను లిందున కానందంబున నొప్పుకొనిరి. ఆ మార్చినెల మొదటిదినముల నిర్ణీతస్థలమున నాపుట్టును జూచుటకు నీ త్రిమూర్తులు వెడలి యతని గాంచిరి. అతదు ప్రథమమున నాబ్రహామును జూచి వెఱ గందెను. జాన్ చెప్పినమాటలవలన లింక నందఱకంటె బొడవు గలవాడుగ నుండునని యతడు దలంచెనేగాని భీమబలు నెదుట గాంచెదనని యొకనాడును ననుకొన డయ్యెను. గాన నాజానుబాహు నాబ్రహాము గని విస్మయ మందెను. అయిన గొంతసేపటి కా యాశ్చర్యపు ననలు సంక్షిప్తములై స్నేహాంకురములు బయలు వెడలెను. అంతట దనపనివారల గలయజూచి "మనరేవున నేటికి పడవ సిద్ధముగ నుండు ననుకొంటిని. అది యింకను నాయత్తము గాలేదు. ఏమిచేయుటకును దోచకున్న యది" యనియెను.

అందు కాబ్రహాము "పడవ నొకదాని నిర్మింతుముగా" కని స్ఫుటముగ బల్కెను.

ఆపుట్టు ముదమున "నిర్మింప నెఱుగుదువే" యని యడిగెను.

"మూడువారములలోపల మేముముగ్గురమును నాపనిని దీర్చెదముగాక. నా కోడలగట్టుట చక్కగ దెలియు" నని ప్రత్యుత్తర మొసగెను. అడవియందలి చెట్లనఱకి దూలములు మొదలగు నుపకరణముల నాతత్తము చేసికొని నాలువారములలో నాబ్రహామును అతని స్నేహితులును బడవ సిద్ధముచేసిరి. ఆ పుట్టు వారితో నడవియందు గొన్నిదినములుండి వారు చేయుపనుల జూచుచుండెను. అప్పుడతనికి నాబ్రహాము సామర్థ్య మెఱుంగ వీలుగల్గెను. రుచ్యముగ భోజనము వండిపెట్టుట మొదలు, ఉపన్యాసము లిచ్చుచు రాజకీయవిషయముల చర్చించి సిద్ధాంతములు చేయుటవఱకు ననన్యసామాన్యశక్తి యాబ్రహామునందు గాన నగుచుండెను.

పడవ సిద్ధమైనవెంటనే దానిపై బరువులనెత్తి యది క్రిందివైపునకు నడప బ్రారంభించిరి. అచటనచట వ్యాపారము సేసికొనుటకై యాపుట్టును ఆపడవతో జనెను. న్యూసేలము పట్టణము దాటి జనినతరువాత రట్లడ్జి యానకట్టతాకి యా పడవ వెనుకటిభాగము నీటిలోనికి దిగెను. ముందఱిభాగము మాత్రము కట్టపై లేచియుండెను. ఇట్లొక్కరాత్రియంతయు నుండ కొంత పగలుగూడ గడచెను.

సరకులు వెనుకకు జరగుచుండెను. తీరమున జనులు గుంపులుచేరి "జాగ్రత పడుడి. లేకున్న మీ పడవ నడిమికి విఱిగినను విఱుగు నీట మునిగినను మునుగు" నని కేక లిడుచుండిరి. ఆపుట్టు కలత జెంది యీ యాపద దప్పించుకొను టకు మార్గము గన నెన్నివారములు పట్టునో యని కుందు చుండెను. ఆబ్రహాము మాత్రము ధైర్యమున దనపని దా జేయ దొడగెను. ఆపుట్టున కభయమిచ్చి తమ పడవలోని సరకుల నింకొక పడవలోనికి దీయింపించెను. తరువాత నానకట్టమీది కెగసిన యోడభాగపు టడుగున నొకబిల మొనర్చి యాబిలద్వారమున లోపలినీరు వెలువడువఱకు నీటిలోనిభాగమును గొంచెముగొంచెముగ గదలించుటకు దగు కొన్ని యుక్తుల బన్నెను. పడవలోనిజలమంతయు గ్రుమ్మరించిన పిదప నా బిల మొక్కనిమిషమున మూయబడియెను. పడవ యెప్పటి యట్ల నీట దేల నారంభించెను. సరకులనెల్ల మరల నెక్కించుకొని ప్రయాణము సాగింప మొదలిడిరి. ఆపుట్టు సంతోషమునకు మితి లేకుండెను. చూచువారల యాశ్చర్యమును దట్టమై సంతోషారావముల వెలువడియెను. ఎచ్చట జూచిన నాబ్రహాము బుద్ధికుశలతకు మెచ్చి జనులు గొట్టు చప్పట్లధ్వని యాపుట్టు వీనుల విందుచేసెను. అతడు మిక్కిలి యుత్సాహమునకు లోనై "నే నిలుసేరినతోడనె నొక పొగ యోడ గట్టించి దానికి నాబ్రహాము నధ్యక్షుని జేసెద"నని యఱచెను.

ఈ యపాయకర మగు ననుభవ మాబ్రహాము మనమున బనిచేయ బ్రారంభించెను. ఇట్టి కష్టములపాలుగాక పడవలు రాకపోకలు సల్పు శక్తి వాని కొసంగుట లెస్స యని యతనికి దోచెను. యోచించియోచించి తుదకు న్యాయవాదిగ నుండునప్పు డత డొక యుపకరణములతో బొమ్మ యోడను నిర్మించి యావిధి నోడల నిర్మింప నూతన కల్పనాధికారపత్రిక గొనుటకై యుచితస్థానమునకు బంపెను. దాని నిర్మాణమందలి పన్నుగడ లెల్లరకు సులభముగ దెలియుచుండు ననియు నాబ్రహాము సూక్ష్మబుద్ధిని వెల్లడి చయుచుండుననియు నొకానొకరు వ్రాసియున్నారు.. అయిన నధికారపత్రిక తీసికొని యుప యోగించుకొనకుండుటకు గారణము లెవ్వియో మన మెఱుగము. నావికుల ప్రయాసల దగ్గించునిమిత్తము బహుకాల మీ లింకను శ్రమ జేసెననుటమాత్రము విదితము.

ఇక న్యూఆర్లియన్సు యాత్రకు మఱలుదము. అట్లా గట్టు తగులుకోలు దప్పించుకొని మన ప్రయాణికులు సాల్టు క్రీకను ప్రదేశము సేరిరి. అచట నాపుట్టు సూకరముల గొన్నిటి గొనెను. అవి పడవచేరుట యసాధ్యమాయెను. అత డెన్నియో యుపాయముల వెదకెగాని యవన్నియు నిష్ఫలము లాయెను. కడపట నాబ్రహాము వానికండ్ల గుట్టి కాళ్ల గట్టివైచిన నవి కదలమెదల లేక పడియుండునని సూచించెను. ఆపుట్ట దివిని మనమున నలరి వల్లె యనియె. అంత నాజంతువుల జాన్ చెవులచే నీడ్చిపట్ట నాబ్రహాము గండ్ల గుట్టివైచెను. పిదప దానినెల్ల గాళ్లు గట్టి యొకబండిలో వైచికొనిపోయి యొకదానితరువాత నొకదాని నెత్తిపడవలో నుంచెను. ఇదంతయు గ్రౌర్యమే యై గను పట్టినను బందులతో బెనగునెడ వానికి దగువిధముననే నడవ వలయునుగదాయని యాబ్రహాము సమాధానపఱచుకొనెను.

అటనుండి తఱలునపుడు పడవ వేగము హెచ్చుచేయుట కతడు పలకలతోను ముతకగుడ్డతోను ఒకవిధమగు నోడ చాపల నేర్పఱచెను. చూచువారల కది వింత యై నవ్వు పుట్టించినను శీఘ్రయానమునకు గడు తోడ్పడెను.

మేనెల యగునప్పటికి న్యూఆర్లియన్సు చేరిరి. అచ్చటన బానిస లనుభవించుకష్టముల నాబ్రహాము సూచినది. సంకెళ్లతో బంధించి కొరడాదెబ్బల దీయుచు జూచువారల మనమున నాగ్రహఖేదముల బుట్టించుచు నీగ్రోల దోలుకొనిపోవుట ప్రథమమున లింకను కంటబడి హృదయమునకు శరవేగమున దిగి నాటుకొనిన దచ్చటయ.

డైవ మేరికి దెలియనివిధముల బాటుపడుచుండును గాదే! ఆబ్రహాము నిటకు దెచ్చి యీ ఘోరకృత్యముల గనజేసి వాని నట్లె యడంప బ్రయత్నములు సేయ నుత్సుక మొసంగిన యాకరుణాంభోనిధి మహిమ గొనియాడ దరంబె?

జూన్‌నెలలో నాపుట్టును అతని ముగ్గురు పనివారును గృహోన్ముఖు లైరి. యజమానుడు దా మందఱు స్టీమరు నెక్కిపోవ నేర్పఱచెను. కొంతదూర మరిగినతరువాత నాపుట్టు లింకనును న్యూసేలమున నుండు దన యంగడిలో గిడ్డంగిదారుడుగా నుండవలె నని యడిగెను. అందు కతడు దన కాపనికి వలయుశక్తి లేదనియు శక్తి యుండిన సంతసమున జేసి యుండుదుననియు బ్రత్యుత్తర మిచ్చెను. ఆపుట్టు లింకను శక్తిసామర్థ్యంబు లెఱిగినవాడు గావునను అతనియందు దన యందువలె నమ్మకము గలవాడు గావునను "నీ కదియెల్ల మిక్కిలిసులభసాధ్యము. నీ వొక్కమాట నుడివితివేని నేను నీ కచట సర్వాధికార మిచ్చెదను. నాకు నీవలన నెంతటిపనియైన గాగల దమనిశ్చయము గలదు. ఇయ్యకొను" మని పలికి యతని యంగీకారమున గొని తల్లిని దో బుట్టువులను జూచివచ్చుట కత డింటికి వెంటనే పోయిరా సెలవిచ్చెను.

ఆబ్రహా మిలు సేరిన కొన్ని దినముల కతనితో బోర నిచ్చ యొడమి యొక మల్లు డచటి కేతెంచి భుజాస్ఫాలనంబుసేసి కుస్తీకి రమ్మని పిలిచెను. లింకను దనకంత పరిశ్రమ లేదనియు బోర నుద్యమింపననియు జవాబు చెప్పెను. చెప్పినను విడువక యాజెట్టి యాబ్రహామును వెన్నంటెను. తుట్టతుద కత డియ్యకొని నిర్ణీతస్థలమున వానినెదిరి సునాయాసముగ రెండుమాఱులు సంపూర్ణజయము గొనెను. ఆయోదుని ---- మిక్కిలియవమానకారియై కోపానలంబును బ్రజ్వరిల్ల జేసెను. అంతట వాడు "నీవు నను బడవైచిన వైచితివిగాక. ముష్టియుద్ధమున నాకు నిలువగలవే యని" గర్వోక్తులాడెను.

"నాచేనైనను నిను ముష్టిపొడుపుల బొడువ నే నిష్టపడన"ని గంభీరభావమున బ్రత్యుత్తర మిచ్చుచు హాస్యోక్తిగ "నీ ముష్టిపోటులు నా కనవసరమ" యనియెను.

ఆ మల్లుడు లింకనును విడువక తొందర పెట్ట సాగెను. ఎంత చెప్పినను విననందున నాబ్రహాము "ఇదె నీకొఱకై నిను మర్దించెద"నని లేవబోవ నతడు సమయము గుర్తించి తప్పించుకొనిన జాలునని యూరకుండ నియ్యకొని యాబహాము సౌజన్యతకు మెచ్చి యతని స్నేహము గోరెను.

పండ్రెండవ ప్రకరణము

క్రొత్తయంగడి గుమస్తా.

ఏర్పఱచుకొనినవిధమున లింకను దన యజమానుని న్యూసేలమున గలసెను. సామగ్రి యా పట్టణము జేరు టాలస్యమైనందున లింకను గార్యరాహిత్యమున దిరుగుచుండెను. నిర్వాచన దినమున నొక లేకరికై యధికారులు వెదకుచుండి యెదుటనుండు లింకనునుగాంచి యతనిని నియమించుకొనిరి. అతడు దనశక్తికొలది పనిచేసెద నని నమ్రతతో నియ్యకొ