ఆబ్రహాము లింకను చరిత్ర/పదియవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదియవ ప్రకరణము

కొన్ని విషయములు, ఇల్లినాయి సేరుట.

ఆబ్రహాము దనంతకు దా బనిచేసికొని బ్రతుక బ్రయత్నములు సేయదోడగెను. అదివఱ కత డొకపడవ నిర్మించుకొని దాని నడుపుచు గొంతధనము సంపాదించినట్లు నిదర్శనము లున్నవి. ఒకతఱి తన పడవ చక్కబఱచుకొన జూచుచుండెనట. అప్పు డిద్దఱు ప్రయాణీకు లేతెంచి తమ్ము బొగయోడ జేర్పవలసిన దని యతని నేమించికొనిరట. వారి సామగ్రి యంతయు నెక్కించుకొని యాబి నిర్ణీతస్థలము సేరి వారి పెట్టెల నెత్తి పొగయోడపై నిడి తన పడవ చేరి కూలికాసుల కై వేచి యుండెనట. అంత వారు తలా యొక యరడాలరు (అనగా మన ర్పు 1-4-0) అతనిచేత వేసిరట. దాని కత డొందిన సంతసమునకు మేరయే లేకపోయెనట.

ఈవిషయము దా దేశాధ్యక్షతకు వచ్చినతరువాత జెప్పుకొని 'యీవిధమున నే మొదటిడాలరు గడించితిని. అప్పటి కదియ మహా నిధానము గనినతెఱంగున నుండె'నని చెప్పుచుండును.

న్యూఆర్లియన్సు యాత్ర ముగిసినతరువాత నతడు సంపాదనపరుడై కుతూహలమున నుడ్డుగారిని జేరి తన్ను యోడపు బని కెచటనైన నియమింపవలసినదని వేడెను. "నీ తండ్రిగారి కీవు సాయ మొనర్పక యిట్లువెడలుట తగునే" యనిన "నే నీవిధమున యతని కెక్కుడు సహకారిగా గల్గుదు" నని ప్రత్యుత్తర మొసగెను. అయిన ను డ్డావిషయమున శ్రద్ధ తీసికొన నంగీకరింపనందున నాబ్రహా మింటికి దరలెను.

స్తన్యరోగము దాడికి నిలువలేక యనేకులు "ఇల్లినాయి" సీమకు జనియుండిరి. థామసుగూడ నీప్రకార మొనరింతమా యని యోచించుచుండెను.

మధ్యకాలమున నాబ్రహాము 'ఇందియానా చట్టదిట్టము' ల నొక స్నేహితు నింట గని యతడు సదువని వేళల దా జదువుకొనియెను. చట్టదిట్టముల జదువు టందఱ కానంద దాయిగాదు. క్రొత్త యూహల బుట్టించి నూతనచర్చల కెడమిచ్చినందున నవి యాబికి మిక్కిలి రుచ్యము లయ్యెను. భావికాలమున నవి యతని కెంత తోడ్పడినది మన కెఱుక పడగలదు. తాత్కాలిక ఫలమొం డిచట వివరింతము.

ఆబికి న్యాయస్థానమున నేమిసేయుదురో వ్యాజ్యము లేలాగు విచారింతురో చూడవలె ననుయభిలాష పొడమెను. బూన్విల్లను గ్రామమునకు బదునైదుమైళ్లు నడిచి న్యాయస్థాము సేరెను. అచ్చటి విచిత్రవిధు లతని నాకర్షించి పలుమాఱచటికి బో జేసెను. ఒకానొకతఱి ఒక "హత్య" విషయ మై చర్చ జరుగుచుండెను. అచ్చటిన్యాయవాదులలో నగ్రగణ్యు డగునతడు మిక్కిలిసమర్థతతో నుపన్యసించుచుండెను. దానిం గని తా నెన్న డట్టి వక్త యగుదునను చింత యతని బాధించెను. సొంపుగుల్కుమాటలకు మిక్కిలి యలరి తన దీనస్థితిని మఱచి యాన్యాయవాది వెడలునెడ నతని జేరి "నే వినినయుపన్యాసములలో మీది యుత్తమ" మనియెను. ఈ మోటుబాలుని జూచి విస్మయమంది యతడు మాఱు మాటాడక తనత్రోవన బోయెను.

ఇంటికి మరలివచ్చి వాగ్ధోరణి యనర్గళముగ వృద్ధిచేసి కొన నెంచి యాబ్రహాము సభల నేర్పఱచి యట సంభాషించుట, యుపన్యసించుట, చర్చించుట మొదలగుపనులకు బూనెను. ఆప్రాంతముల బసివా రంద ఱికార్యముల శ్రద్ధ జేయ నారంభించిరి. అనేకు లతని చుట్టు జేరి యతడు వక్కాణించునదంతయు నేకాగ్రచిత్తులై వినుచుందురు. అతని చమత్కారమునకు మెచ్చి యాబాలవృద్ధు లెప్పుడతని వాక్యామృతవర్షంబునకు జంద్రకిరణములకు జాత కపోతంబులువోలె వేచియుందురు. ఈ సందర్భముల నాబికి దా కంఠోక్తిగ నేర్చినవిషయము లన్నియు నుపయోగకారు లాయెను.

అతడు చర్చించుచు వచ్చిన విషయముల నొకటి "నీగ్రోల బెక్కు డన్యాయము జరుగుచున్నదా? ఇందియనులకా?" యను నంశము. విశేషము పాటుపడి యీవిషయమునకు వలయు సాధనముల సమకూర్చుకొని యుండెను. ఇందియను లనిన నతనికి మిక్కిలి వైరము. వారు దన పూర్వికుల గాసి బెట్టిరే యనుకిన్క యతని మనమున నాటియుండినను ఇందియనుల నన్యాయముగ బాధపెట్టుచుందు రనిమాత్రము నొక్కి చెప్పుచుండును.

అయిన నీగ్రోల దుర్దశ దుర్భరమని యతడు చక్కగ గ్రహించెను. కావున వారి గష్టముల మాన్పి వారికి స్వేచ్ఛా విహార మొసంగవలె నని నాడు మొదటి యుపన్యాసము చేసెను.

ఈ యుపన్యాసమల వినుచుండిన ముదుకలి యొకతె మిక్కిలి యుత్సాహముతో "నాబి యునైటెడ్ రాష్ట్రపు దేశాధ్యక్షు డగున" నెనట!

1830 వ సంవత్సరము జనవరినెల ప్రారంభ మగునప్పటికి థామసు 'ఇల్లినాయి' సీమకు వెడల నిశ్చయించుకొనెను. ప్రయాణ ప్రయత్నములు సేయబడెను.

ఆబి యప్పటి కిరువదియొకసంవత్సరములవాడు. తల్లి దండ్రులనిన నతనికి గడు ప్రీతి. కాన నా యాత్రకు దా లేనిది వారు పూనుట తగదని తోప దానును వారితోడన పోవ నిశ్చయించుకొనెను. ఎంత --------------------రులకై పనిసేసి యుండనోపడు. తండ్రి కతడ పెద్దకుమారుడు. ప్రయాణములాకాలమున మిక్కిలి ప్రయాసకారులు. అనేక విషయముల నపాయకారులను. నూతన గృహనిర్మాణమును కష్టతమంబె. కాన దన మాతాపితరులు, తన యక్క సెల్లెండ్రు, తనవా రెల్లరు సురక్షితముగ 'నిల్లినాయి' సేరి యచట కాపురము గుదురువఱకు వారివెంట నుండుట కతడు గర్తవ్యముగ జేకొనెను.

ఇట్లు నిర్ధారణ చేసికొని వెడలి యెట్టికష్టము లెట్టియాపదలు దమ్మెదిరించినను సరకుచేయక దమవారికెల్ల ప్రోత్సాహ మొసగుచు బహుదినములు ప్రయాణముసేసి నూతననివాస ప్రదేశము జేరిరి.

అచట నొక కొయ్యగుడిసె ఆబ్రహాము దాన పూని నిర్మించియిచ్చెను. లింకనులు నివసించిన గుడిసెలలో నిదియ యుత్తమము.

తరువాత నితడు దన మఱదియగు జాన్ సాయము గొని పదునై దెకరములభూమి దున్ని కంచెవేసి సిద్ధము చేసి యుంచెను.

ఆ శీతకాలమున నెప్పుడును మూడడుగుల దట్టముగ మంచు గప్పియుండెను. ఆబ్రహాముయొక్క పట్టుదలయు సామర్థ్యంబును దోడుపడకుండిన లింకనుల కనేకసౌఖ్యములు గల లోనివై యుండుననుటకు సందియములేదు. అంతచలియం దతడు దుపాకి మోసుకొని వేటకు బోయి భోజనమునకు బలలముదెచ్చి పెట్టుచుండును. పంటలేమియు బండజాలని యా ఋతువుల నీ 'మార్గదర్శికు' లింతకంటె వేఱుమార్గము గానలేరు గదా!

ఇంట నింతపని సేయుచు నాబ్రహాము బయట జీతమునకు గుదిరి యజమానుల సంతృప్తిపఱచుచుండును. విద్యాభివృద్ధికి బాటుపడుటయు మానడయ్యెను. ఈ యంశమునకు దృష్టాంత మిదె. బ్రౌనుసతి యాబ్రహాము లింకను మరణానంతరము నొడివిన మాటల వినుడి:

"లింకనును నే నెఱుగుదును. మా ముసలాయనకై యతడు పనిసేయుచుండును. మాపొరుగుననె యతడు నివసించుచుండును. ఆకాలమున బాటసారులకు మార్గముల విశ్రమించుటకు సత్రము లుండలేదు. అందువలన వా రెవ్వరైన యిల్లుగలవారి సత్కారములకు లోనై యుందురు. ఒక సాయంకాలమున దరుణవయస్కు డొక్కరుడు మాకంచెయొద్ద గుఱ్ఱము నాపి మా ముసలాయనను రాత్రి విశ్రమింప స్థల మిచ్చెదరే యని వేడెను. దాని కతడ "మీ పశువునకును మీకును నాకలి దీర్ప గల్గుదును. మీకు బరుండుటకుమాత్రము నాసేవకుని ప్రక్క దక్క స్థలము లేదు. మీ యిచ్చ వచ్చిన నతని జూడవచ్చు" నని ప్రత్యుత్తర మిచ్చెను. ఆ పాంథుడు దిగిరా మా ముసలాయన యతని నింటివసారకు దీసికొనిపోయెను. అచట నేలపై నాబ్రహాము చేత నొక పుస్తుకము పట్టుకొని కాళ్లు చాచుకొని పఱుండి యుండెను. అతని "నదె నాసేవకు" డని యాతడు సూపెను. బాటసారియు నాబ్రహాము స్నేహమున కంగీకరించి నాటిరాత్రి యునైటెడ్ స్టేట్సు దేశాధ్యక్షునితో నిదురించెను."

ఆసంవత్సర మాకురాలుకాలమున నాప్రాంతముల జలి జ్వరములు విస్తారమాయెను. లింకనులందఱు నొకరివెనుక నొకరు వాని ననుభవించిరి. ఆబ్రహాముగూడ వానికి లోబడియెను. గాని కొద్దికాలములోనె వాని బారినుండి తప్పించు కొనియెను.

ఇట్టిరోగములకు బుట్టినిల్లగు నా సీమ వదలి మఱియొక సీమకు బోయి యచ్చటినుండి థామసు లింకను కోల్సు సీమ చేరెను. అచట నతడు 1831 వ సంవత్సరమున జనవరి 17 వ తేదిన బరలోకప్రాప్తి జెందెను.

ఇక ముందు 'లింకను' అనిన ఆబ్రహా మని చదువరులు గ్రహించ వలయును.


______