ఆబ్రహాము లింకను చరిత్ర/పండ్రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

జేసెను. అంతట వాడు "నీవు నను బడవైచిన వైచితివిగాక. ముష్టియుద్ధమున నాకు నిలువగలవే యని" గర్వోక్తులాడెను.

"నాచేనైనను నిను ముష్టిపొడుపుల బొడువ నే నిష్టపడన"ని గంభీరభావమున బ్రత్యుత్తర మిచ్చుచు హాస్యోక్తిగ "నీ ముష్టిపోటులు నా కనవసరమ" యనియెను.

ఆ మల్లుడు లింకనును విడువక తొందర పెట్ట సాగెను. ఎంత చెప్పినను విననందున నాబ్రహాము "ఇదె నీకొఱకై నిను మర్దించెద"నని లేవబోవ నతడు సమయము గుర్తించి తప్పించుకొనిన జాలునని యూరకుండ నియ్యకొని యాబహాము సౌజన్యతకు మెచ్చి యతని స్నేహము గోరెను.

పండ్రెండవ ప్రకరణము

క్రొత్తయంగడి గుమస్తా.

ఏర్పఱచుకొనినవిధమున లింకను దన యజమానుని న్యూసేలమున గలసెను. సామగ్రి యా పట్టణము జేరు టాలస్యమైనందున లింకను గార్యరాహిత్యమున దిరుగుచుండెను. నిర్వాచన దినమున నొక లేకరికై యధికారులు వెదకుచుండి యెదుటనుండు లింకనునుగాంచి యతనిని నియమించుకొనిరి. అతడు దనశక్తికొలది పనిచేసెద నని నమ్రతతో నియ్యకొ నెను. ఆకాలమున నాదేశమున వ్రాయ గలుగువారే యరుదు. గాన వెదకుచువచ్చి యుద్యోగము లిచ్చుచుందురు. నాడు గార్యము దీర్చుటయందు లింకను మిక్కిలి సమర్ధత సూపెననుట కతని సహోద్యోగి యగు గ్రేహమను నుపాధ్యాయుడే "లింకను పనులెల్ల మిక్కిలి సౌలభ్యముతో న్యాయానుసరణముగ బక్షపాతరాహిత్యముతో సల్పెను. రాజకీయోద్యోగముల నతని కిదియె మొదటిది. నాటి పత్రము లిప్పటికిని స్ఫ్రింగుఫీల్డునం దున్నవి. చూడ గోరువారెల్లరును జూడ నగు" నని సాక్ష్యమిచ్చుచున్నాడు.

న్యూసేలము జనులు లింకనును రట్లడ్జి యానకట్టమీద జిక్కినపడవను జక్కచేసిన బుద్ధిశాలి వీడె యని గుర్తించి యుండిరి. నెల్స నాపట్టణమును విడువదలచి యప్పుడు సంపూర్ణముగ నొడ్డు లొరసికొని ప్రవహించుచుండిన నదిపై దమ్ము రక్షించుకొనిపోవువా డెవ్వడని యరయుచుండ నంద ఱాబ్రహామును జూపిరి. ఆ సూచనానుసరణముగ లింకను గర్ణధారుడుగ జేకొనబడియెను. ఓడను సురక్షితముగ నడపి రేవు జేర్చి తన వేతనమును గొని యతడు న్యూసేలమునకు వచ్చిచేరెను.

ఆపుట్టు సరకులు దిగినతోడనె యా గ్రామస్తు లీ నవీనాగతుని యుద్యోగము నెఱింగికొనిరి. లింక నొక్కొకవస్తువుం దీసి కొట్టున నుచితస్థలమున నుంచ నారంభించెను. గాజుపాత్రలు, మట్టిపాత్రలు, పింగాణిపాత్రలు, కాపీ విత్తులు, తేయాకు, పంచదార, కత్తులు, గుండీలు, కత్తెరలు, పలువిధములగు పాదరక్షలు, పొగాకు, వెన్న, తుపాకిమందు, ఇవి మొదలుగా గల యనేకవస్తువు లాయాస్థలమున గంటి కింపగువిధమున నిలుపబడెను. కొద్దికాలములోనే క్రొత్త సామానులు గ్రొత్తగిడ్డంగిదారుడును లోకులకన్నుల కానంద మొనర్ప దొడగెను. లింకను మర్యాదచేష్టలును, అతని జనప్రియత్వమును నంగడి కనేకుల నాకర్షింప మొదలిడెను.

ఆపు ట్టితరకార్యముల దగిలి న్యూసేలమున నుండలే కుండెను. కావున నచ్చటి తిరుగలియంత్రపు బై విచారణయు నంగడియందలి సర్వాధికారమును లింకను కప్పగించి విల్లియం గ్రీను అనువాని నతనికి సాయ మిచ్చెను.

ఆపుట్టు పలుమాటలవాడు లింకనును బొగడుటయందతనికి దనివియే లేదు. ఒక్కొకమాఱు "యునైటెడ్‌రాష్ట్రమున నుండినవారలలో జ్ఞానసంపత్తికి లింక నగ్రగణ్యు డ"నును. ఒక్కొకమారు "నే జెప్పునది జ్ఞాపక ముంచుకొనుడు. లింక నికముందు దేశాధ్యక్షత వహింప గలడ"నును. ఇట్టి సంకీర్తనములచేతను రట్లడ్జి యానకట్టమీద జూపిన బుద్ధి కౌశల్యము చేతను లింకననిన నాగ్రామమున గొప్ప మర్యాదతో జూచుచుండిరి. గొప్పవారి కితరులు సేయు మర్యాద లెల్లపుడు నమ్రత వుట్టించి ఘనతర కార్యముల జేయ నుత్సాహము గలుగ జేయును. ఒకరు మనయెడల గారవము సూపిన మన మింతవార మైతిమిని విఱ్ఱవీగుట మాని యీ గారవమునకు దగు నర్హత మనకు గలదే యని తర్కించి యట్టియర్హత సంపాదింప బాటుపడుట గదా సుజనుని లక్షణము.

లింకను దననయప్రవర్తనచేత గలుపుగోలుదనముచేత, సుస్వభావము చేత, నెల్లర యుల్లముల రంజిల్ల జేయుచుండును. అతని సత్ప్రవర్తనకు బట్టణవాసులెల్ల సంతసింపుచుందురు.

ఒకనాడు డంకను సతికి రెండున్నఱ డాలరుల వస్తువుల నమ్మెను. సాయంకాలము లెక్కజూచుకొన నామె యఱడాల రెక్కు డిచ్చినట్లు తేలెను. వెంటనే యంగడి రాత్రికి మూసివేసి తలుపుబిగించి యఱడాలరు చేతగొని రెండుమైళ్లు నడచిపోయి దాని నాపె కిచ్చి యిలుసేరి సుఖనిద్రవోయెను.

మఱియొకనా డొక యబల సంధ్యాకాలమున బ్రొద్దు గడచినతరువాత నంగడి మూయుసమయమున వచ్చి యఱపౌను తేయాకిమ్మని యడిగెను. వెలపుచ్చుకొని తేయాకిచ్చిన వాలుము బంధించుకొని లింకనింటికి బోయెను. మఱునా డుదయమున వచ్చినతోడనె తక్కెడయందు కాలుపౌను రాయి యుండ గాంచి రాత్రి యాస్త్రీకి గాలుపౌను దక్కువ యిచ్చుట గుర్తించి యొక కాలుపౌను తూచి యంగడి తలుపువేసి యా నెలత యింటికఱగి తేయాకు నిచ్చివచ్చి తన యుద్యోగమునకు బూనెను.

ఇట్టి సన్మార్గ ప్రవర్తన లింకనునకు గౌరవస్నేహముల వృద్ధి పఱచినదేగాక యా యంగడి కనేకుల బేరగాండ్ల రప్పించి యాపుట్టుకు లాభము మెండుగ గలుగ జేసెను.

గిడ్డంగిదారు డనిన నాగ్రామమున మిక్కిలి యాదరణ. అందున నుత్తమ గుణసంపత్తిచే నొప్పి విద్యాదికములచే నలంకరింపబడిన లింకనును గారవించనివా డెవడు? ఆగ్రామమ నందలి కలహముల దీర్ప నీతడె న్యాయాధిపతిగ గణింప బడుచుండెను. నిష్పక్షపాతముగ నేకార్యము జరగవలసినను నిరువాగులవారును దమదమ దు:ఖముల నితనికి జెప్పుకొని యితని తీర్మానముల నడపుచుందురు.

ఉపాధ్యాయుదు గ్రేహము లింకనును బ్రాణస్నేతుడుగ జూచుచుండును. అతనియొద్ద లింక నింగ్లీషువ్యాకరణ మభ్యసించుటకు బూనెను. వ్యాకరణపాఠమనిన ననేకులకు విద్యార్థులకు దలకంటగించును. లింక నిద్దాని నొప్పుకొనినను విద్య సంపాదింప నుద్యమించు ధీరుడుగాన నెట్టి కాఠిన్యమును నతని నెదుర్చలేకుండెను.

శిధిల వ్యాకరణగ్రంధ మొకదాని నెచటనో సంపాదించుకొని సమయము వేచి యొక నిమిషమాత్రము కాలము దొరకినను దానిన వల్లించుచుండెను. పని తొందరలేనపుడు దుకాణపు బల్లపై బరుండి చదువుచుండును. కొన్ని వేళల నంగడిముందఱి చెట్లనీడన బరుండి పఠించుచుండును. మఱి కొన్ని వేళలల గ్రామము వెలువడిపోయి యేరికి నెఱుకరాని యేకాంతస్థలమున గూర్చుండి పరిశ్రమ సేయుచుండును. రాత్రివేళల జాలసేపు మేలుకొనియుండి పీపాలు సేయువాని కుంపటిలో నచటి చెత్తవైచి దానివెలుగున జదువుచుండును.

తెలియని విషయముల గ్రేహము నడిగి తెలిసికొనును. విద్యాపారీణు లనిపించుకొని యా పట్టణము సొచ్చినవారంద ఱతనిచే బ్రశ్నింపబడకపోవుటలేదు.

ఇట్లెంతో పాటుపడి లింకను వ్యాకరణమునందు ప్రౌఢిమ గాంచెను. ఇతర విద్యల బ్రవీణత వడసెను. ముందు కతని కత్యంత సహకారు లగుసాధనము లన్నిటి నతడు దైవికాజ్ఞానుసారముగ నాయత్తపఱచుకొనుచుండెను. ఇట మఱియొక విషయము గూడ నుడువవలసియున్నది.

న్యూసేలముపట్టణములోనికి గ్రొత్తవా డెవడు వచ్చిన నతని బలుకష్టముల బెట్టు దుర్మార్గులసంఘ మొకటి యచ్చట నుండెను. వారు నూతనాగతుండు గాన్పించినతోడనె యతనిని బరుగెత్తుట, కుస్తీ, మొదలగుపందెములకు బిలుతురు. అత డందుల కంగీరింపకున్న బలువిధముల నవమానపఱతురు. ముక్కు బట్టిగుంజుదురు. ముఖమున బొగాకునీరు జల్లుదురు. ఇవన్నియు నోర్చుకొనిన నేటికి గొనిపోయి ముంచుదురు; లేకున్న ననేకు లొక్కరీతి గాలుసేతుల దన్ని గ్రామము వెడల జేతురు. అతడు దమలో నొకరితో బెనగ నియ్యకొనియెనా యన్యాయపుబోకల బోయి యతని వేధింతురు. దానికి వెనుదీయక వారి నోడించెనా వాని దమవానిగ జేకొందురు.

ఇట్టి యిక్కట్టులు లింకనుకు బ్రథమమున దటస్థింప వయ్యెను. అతనిశక్తిని నానకట్టమీద జూచినవా రగుటనో యాపుట్టు పల్కు లాలకించి జడిసినవా రగుటనో యా దుర్మార్గులు లింకనును జెనకకుండిరి. అయిన నొకనాడు వారిలో నొకడగు బిల్లి యనువానికిని ఆపుట్టునకును సంవాదము గలిగి యొకరినొకరు దూషించుకొని తమతమ మల్లుల యదు రొడ్డిరి. బిల్లి తమజాకుతో లింకను పోరవలెనని కోరెను. లింకను సమ్మతింపడాయెను. అందుపైని నాదుష్టులు లింకను ముక్కుబట్టి గుంజి యతని నవమానపఱచిరి. అతడు వారిని హెచ్చరించెను. వా రది లెక్కకు గొనక నతని నలయించిరి. తుట్టతుద కతడు జాకుతో మల్లయుద్ధమున కంగీకరింపవలసి వచ్చెను. ఎన్ని మాయోపాయములు సేసినను లింకను జయమున కడ్డు లేకపోయెను. జాకు నోడించి చక్కగ జే జాచి వాని మెడబట్టి పై కెత్తి నిలుపుట గాంచి యాదుష్టు లతని శరణు జొచ్చిరి. నాటినుండి యట్టి దుర్మార్గప్రవర్తనము గూడదని ఖండించి లింకను వారినెల్ల మంచిపౌరుల జేసెను. నవీనాగతుల కష్టము లంతటితో దీరిపోయెను. సత్పౌరులసంఖ్యయు నెక్కుడాయెను. సంస్కరింపబడిన జాకు మొదలగువారు లింకను నెడ భక్తిగలిగి యతనికి శిష్యభావమున మెలగుచుండిరి. దీనికి దార్కాణ మొండు గలదు. ఒకదినము పరదేశీయు డొక డాగ్రామమునకు వచ్చెను. అతడు ధూర్తుండై జాకుతో గలహమునకు సమకట్టెను. అంత జాకు గోపమున "నీవు పేలవు కల్లరి" వని యతనినో నాడెను. అత డాగ్రహమున నొకకొయ్యతో వాని నడచెను. ఇద్దఱును పెనగ నడుము గట్టుచుండిరి. దీని నాబ్రహాము గాంచి యచటి కేతెంచి విషయము విచారించి జాకునకు దప్పు జూపెట్ట వా డంగీకరించెను. తరువాత వారిరువురకును సంధి జేసి మైత్రి గలిపెను.

ఆపుట్టు గిడ్డంగిదారుగా నున్నపుడు లింక ననేక లాభముల బొందెను. మైళ్లుమైళ్లు నడచి సభలకు బోయి రాజకీయోపన్యాసము లొసగుచు జర్చ లుపక్రమించుచు వాక్పాటవదోరణుల సంపాదించెను. ఉడుపులకైన వెచ్చపెట్టక ధనము గూర్చి యొకవార్తాపత్రిక దెప్పించుకొని చదువుచుండును. అంగడిపని లేనప్పుడంతయు విద్యాసంపాదనపరుడై యతడు కాలము గడపెను. ఆపుట్టు కొన్ని యందరాని మ్రానిపండ్ల కఱ్ఱులుసాచి నష్టముల పాలయ్యెను. తిరుగలి యంత్రపు వ్యాపారమున నతనికంత సొమ్ము దొరకదాయెను. ఇతరవ్యాపారములగూడ నతని సంచి యుత్తదగుచు వచ్చెను. లక్ష్మీకటాక్షము లతనిపై బ్రసరించుట రానురాను దగ్గుచువచ్చెను. దినదిన మతని కష్టము లినుమడింప దొడగె. తుట్టతుద కతని వ్యాపారశక్తియే యడంగిపోయెను. అంగడి మూసివేయవలసి వచ్చెను. తిరుగలి యంత్రము నిలుపవలసి వచ్చెను. లింకనును దీసివేయవలసి వచ్చెను.

పదమూడవ ప్రకరణము

యుద్ధమునకు బోవుట.

న్యూసేలమున మల్లయుద్ధమున నపజయమంది లింకను స్నేహమునకు బాత్రుడై వర్తించుచు వచ్చిన జాకును అతని మిత్రులును లింకను నాధిపత్యముక్రింద యుద్ధమునకు దరలుట ప్రాప్తించెను.

బ్లాక్ హాకను నొక "ఎఱ్ఱ ఇందియను" మహాఘోరముగ దెల్లవారితో బోరుచుండెను. వాని నెదుర్చుటకు దండు నాయత్తపఱచుటకై గ్రామగ్రామమునకు వార్త లంపబడెను.