Jump to content

ఆబ్రహాము లింకను చరిత్ర/పదునెనిమిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

దైవముం దలంచి ప్రార్థించుచుండును. అప్పుడు జరుగు యుద్ధమున న్యాయము జరుగుగాకనియు వేడుచుండెను.

రెండవకుమారుడు మెల్లమెల్ల నారోగ్యము నందెను. యుద్ధమునందును రాజ్యాంగ మల్ల నల్లన జయించుచు వచ్చెను.

లింకను దన రాష్ట్రపు సైనికులయందలి దురభ్యాసముల మాన్ప మిక్కిలి పాటుపడెను. త్రాగుబోతుతనము బట్టిడు కొనుట యను నీరెండు విషయములగుఱించి చక్కగ నుపన్యసించి వాని రెంటిని నణచుట కుత్తరువులుసేసి వానినెల్ల గట్టిగ జెల్లించుచువచ్చెను.

లింకను యుద్ధభటులయెడ గనుపఱచిన బ్రేమాతిశయ విషయములును, నతడు బానిసలకు ముక్తినొసంగి వారి నాదరించిన తెఱంగును నొక్కొక్క టొక్కొక్కప్రకరణమున కర్హమైనది గాన నిచట బొందుపఱప బడవయ్యెను.

_______

పదునెనిమిదవ ప్రకరణము

యుద్ధభటులయం దనురాగము.

ఇంతకు బూర్వ మొకప్రకరణమున లింకను బ్లాకుహాకు యుద్ధమునకు సైనికుడుగ వెళ్లెనని వ్రాసితిమిగదా. అతడపు డనుభవించిన కష్టసుఖములు మనమున నుండెగాన

దేశాధ్యక్షత వహించినతరవాత నతఁడు యుద్ధభటులపై ననురాగము సూపుటకుఁ బ్రారంభించెను. అతని దయామయత్వసౌజన్యము లీ విషయమున మిక్కిలి ప్రోద్బల మొసంగెను. అప్పటి యుద్ధమును గుఱించి మాటలాడుచు లింకను, "ఈ ఘోరయుద్ధము దేశమునందలి జనులెల్లరఁ గొప్ప తొందరపాలు చేయుచున్నది. అయిన నిది దుర్భరముగ వేధించుట సైనికులనుమాత్రమె. 'బ్రతికియుండిని శుభములఁ బడయవచ్చు'ననుట సర్వసామాన్యజనసమ్మతముగ నున్నను యుద్ధభటులు దేశోపకారమునకై తమ ప్రాణములనె తృణీకరించి నిలిచి యుసురులఁ దొఱఁగుచుందురు. కావున వారిద యుత్తమధర్మము; వారె సంపూర్ణ గారవమునకుఁ బాత్రుల"ని నుడివి తదనుగణముగ వారియెడఁ బ్రవర్తించుచుండెను. అతడు యుద్ధభటులఁ దన కుమారులఁబోలె గణించుచుఁ బుత్రవాత్సల్యము సూపి "గుఱ్ఱలారా" యని పిలుచుచుండును. వారును 'తండ్రి లింక న'ని యతనిఁ బ్రేమించుచుందురు.

అధికారు లనేకులు యుద్ధభటులవిషయమై లింకను మాటిమాటికిఁ జూడఁగూడదని కట్టు సేయఁ బూనిరి. అయిన నతం డట్టియేర్పాటుల కంగీకరింపఁడయ్యెను. తన కుటుంబమునకుఁ జేరిన బిడ్డలు దమతమ సుఖదు:ఖములఁ జెప్పికొన

ననర్గళవిధిగ రావచ్చునని యత డుత్తరువు సేసెను. అధికారు లడ్డగింప బ్రయత్నించుటకు గూడ గారణము లేకపోలేదు. దేశాధ్యక్షత పనులె లెక్కకుమీరి లింకను కాలమంతయు నాక్రమించుకొని యతని నలయించుచుండును. ఈదిగువ గనుపఱచిన లింకను దినకృత్యముల బఠించినచో నత డీయుద్ధభటుల నెప్పుడు దనియించుచుండెనో యను నాశ్చర్యము మనకుబుట్టకపోదు.

"లింకను వేకువజామున లేచువా డగుట ప్రతిదినమును దన స్వంత లేఖన ప్రతిలేఖనమునకు రెండుమూడు గంటలబుచ్చును. అంతలోపలన నేదో యొక వార్తాపత్రిక జదువును. తొమ్మిదిగంట లగుడు బ్రాత:కాల భోజన మాచరించి యుద్ధ కార్యస్థానమున కేగి యట వృత్తాంతము లరసికొని యచ్చటి సేనానాయకునితో గొంత ముచ్చటించును. అచ్చటినుండి "సితగృహము"నకు వెడలి యొక్క కార్యదర్శి సాయముతో నుదయపు దపాలు జూచుకొనును. కొన్ని జాబులకు బ్రత్యుత్తరాంశములు గార్యదర్శి వ్రాసికొనును. తక్కినవి లింకన యుంచుకొని తరువాత వానికి దాన బదులు వ్రాయును. ప్రతి జాబును జక్కగ గమనింపబడును. చిక్కుల కిక్కలైనను బ్రత్యుత్తరముల నంద దగు జాబులెల్ల బ్రత్యుత్తరము లందుచుండును. మంగళ శుక్రవారములు మాత్రము మంత్రా లోచనదినములు; తక్కుంగలదినముల దేశాధ్యక్షుం జూడగోరు వారు ప్రక్కగదిజేరి తమపేరుగల చీటీలంప బ్రార్థితులు. కొన్ని సమయముల లింకను దపాలు చూచుకొనుట ముగించులోపల సేవకు డీచీటీల నొకకట్టగ బట్టుకొని యుంట గూడ దటస్థించు చుండును. ఆచీటీలవరుసన లింకనును జూడగోరువా రతని గది ప్రవేశింతురు. సాధారణముగా మూడునాలుగు గంటల కాలము వీరు వచ్చుచునే యుందురు. అందు బదిమందిలో దొమ్మిదిగు రుద్యోగార్థులు. వారి కందఱకును మిక్కిలి యాదరణతో లింకను బదులు చెప్పుచుండును. నయస్వభావంబునను, మృదువాక్యములను నతడు చూడబోవువారల కెల్ల హృదయ భాంధవుడో యన జూపట్టు చుండును. నాలుగు గంటలమీద లింక నీకార్యమునుండిలేచి భార్యతో సహా విహారార్థమేగును. ఆఱుగంటలకు సాయంకాలభోజనంబు గుడుచు. అతని పంక్తికి మిత్రు లొక్కరును లేని దినమే యుండదు. వారి సాంగత్యమున నుద్యోగపు జింతలనెల్ల మాని యతడు గెంటకీ సీమ యందువలె మెలగుచుండును."

"లింకను రాత్రి పది మొదలు పండ్రెండుగంటలవఱకు జుట్టివచ్చు చుండును. దగ్గర గల్గుకార్యదర్శుల కందఱకు దర్శన మిచ్చి వారితో బలువిషయములగూర్చి సంభాషించుచుండును. అతని పద్దతి నెఱిగినవా రతని రాత్రి జూడవలెనెన్న బయట వెతకుచు నెక్కడలేకున్న సేనానాయకు నింటికడ గాంతురు. యుద్ధవిషయము లంతరాత్రివఱకు నట దెలిసి యుండును. గాన లింక నచటికి బోయి వినుచుండును. తక్కుం గలవారెల్ల నిద్రించుచున్నను దేశాధ్యక్షుడుమాత్రము జాగరూకు డై ప్రవర్తించుచుండును."

ఇన్ని కార్యముల నిర్వహించుచు లింకను యుద్ధభటుల స్నేహితులవిన్నపము లాలకించి వానిని నెమ్మదిగ బరామర్శించి వారికి దగు సాయ మొనర్చుటకును, వైద్యశాలలకు వెడలి పరీక్షించుటకును, సైన్యము లుండుశిబిరంబులకు బోయి తన కుఱ్ఱల మేలుకీ ళ్లెఱుంగుటకును గాల మెట్లు గడించుచుండెనో దెలియ లేక యాశ్చర్యజలధి మునిగి తేలవలసి యున్నది. ఈ విషయ మతని మనము సొచ్చినంత మఱి యే విషయమును జొరలేదనుట కనేక నిదర్శనము లున్నవి. దేశక్షేమము యుద్ధభటుల సామర్థ్యమువల్లనె కలుగుననుట యతడు బాగుగ గ్రహించి "వారిద యుత్తమ ధర్మము; వారే సంపూర్ణ గారవమున కర్హుల"నియెను. అతడు దనకడపటి దినమువఱకును యుద్ధభటులను ప్రభువులకంటె బ్రజాపతినిధులకంటె నెక్కుడు సమ్మానించుచుండెను.

ఒకతఱి నీయనకు స్వాగత మిచ్చుట కనేకులు గుమిగూడి, యొకరివెంట నొక రతనిసమ్ముఖమునకు వచ్చి మన్నన వడయు చుండిరి. రాజకీయోద్యోగస్థులకును, దేశీయసభాజనులకును, ప్రభువులకును గొందఱికి హస్త మొసగి, విసిగి, తరువాత దలయూచుట చేతనే సమ్మానించుచుండెను. తుట్టతుద కొక గాయముతగిలిన సైనికుడు నామమాత్రము వస్తధారియగు దన ముసలితల్లితో, బ్రవేశించుట గని లింకను దనస్థానము నుండి వేగముగ బోయి వారి కత్యాదరముతో హస్త మొసగి యతిసంతసంబున స్వాగత మిచ్చి ముదుసలినిగూర్చి "తల్లీ! నీకడుపు చల్లనయ్యె. ఇట్టి దేశాభిమాని యగు గుమారుని గన్న నీవు ధన్యురాలవు. నీ పుత్రునిస్థితికి నే నెంతయు దు:ఖించు చున్నాను" అని చెప్పెను.

ఒకానొకదినమున లింకను, దన గదినుండి ప్రక్కగా బోవు త్రోవన దేనీళ్లు పుచ్చుకొని వచ్చుటకు బోవుచు, మార్గముమధ్యమున నొక పాపని యాక్రందన ధ్వని విని వెనుకకు దిరిగి యుద్యోగస్థానమున కేతెంచి సేవకుని బిలిచి,

"ఓయీ! ప్రక్కన నెవరైన నొకస్త్రీ వేచియున్నదా" యని యడిగెను. "అవును మహాప్రభూ! మూడురోజుల నుండి యామె యున్నద"ని వా డనెను. అట్టి యాలస్యమునకు జింతిల్లుచు నాయమ నిచ్చటికి దక్షణమే తీసికొని రమ్మని యానతిచ్చెను. చంటిపిల్ల నెత్తుకొని, యొకస్త్రీ శీఘ్రకాలములో బ్రవేశించి సేననుండి పాఱిపోయినందుకు దన బర్తను దలదీయ నిశ్చయించిరని చెప్పి యాకఠినశిక్ష మాన్పి తనకు పతిభిక్ష నిడవలె నని వేడెను. వెంటనే దేశాధ్యక్షుడు మన్ననపత్ర మొకటి వ్రాసి యామె కిచ్చి తగు నధికారుల యొద్దకు బోవ నియమించి యామెభర్తను గాపాడెను.

కృశించి సన్నగిల్లి వికారకారుడగు నొకపిల్లకాయ దేశాధ్యక్షుని జూడవచ్చిన గుంపులో నిల్చియుండెను. వాని జూచి, "నాయనా! నీకేమి కావలయు"నని లింక నడిగెను. "ప్రభూ! మీ పటాలములలో నొకదానియందు నేను రెండేండ్లు నగారా వాయించుచుంటిని. కర్నల్ కొకనాడు నాపై నాగ్రహమువచ్చి నన్ను దఱిమి వేసెను. రోగపీడితుడనై యౌషధశాల జేరి చాలకాల మైనతరువాత, స్వస్థతజెంది మరల మీకృపాకటాక్షములపాలుగా నిట్లు వచ్చితి" ననెను. అది విని వానిస్థితిగతుల విచారించి, బంధుమిత్రాదు లెవ్వరును లేక యేకాకియై పనిచేయు దార్ఢ్యములేని యాదిక్కుమాలిన మానిసి వృత్తాంతమునకు జాలిగొని, కండ్ల నీళ్లు నించి మాటలాడ నోరాడక యొక కాగితముపై "నీబాలుని జాగ్రత్తగ గాపాడు డ"ని వ్రాసి తగునధికారులయొద్దకు బంపి యా బాలుని సంతసింపజేసెను.

వాషింగ్టన్ పురవాసి యొక్క డీకథ జెప్పుచున్నాడు: ఒకనాడు నే దేశాధ్యక్షుని జూచుటకు బోయియుంటిని. అప్పు డొకవృద్ధస్త్రీ ఖిన్నవదనయై యాతనిజూడ గాచియుండెను. అతడు తనకు స్వాభావికమగు నాదరముతో నామెను దగ్గర జేరి వృత్తాంతంబడిగెను. ఆయమ "అయ్యా! నావిభుడును, ముగ్గురు కుమారులును సైనికులైరి. గడచిన యుడ్ఢమున నా మగడు పరలోకగతుడాయెను. అప్పటినుండి యేకాకినై బహుదు:ఖముల జెంది కష్టజీవి నై యున్నదానను. నాపెద్ద కుమారు నాకప్పగింప వేడుదమని వచ్చితి న"నెను. ఆమె ముఖమువైపు కొంతకాలము చూచి, మిక్కిలి మృదుపదంబుల "తల్లీ! నీవు మా కెల్లరనిచ్చి, నీయేడుగడ గోలుపోయితివి. కావున నీపుత్రులనొక్కని నీ కిచ్చుట ధర్మమే" యని చెప్పుచు, వెంటనే యుత్తరువు వ్రాసియిచ్చెను.

ఆ యుత్తరువుం గొని యామె స్వయముగ సేనవిడిదికి గుమారు గొనిరా వెడలెను. అయిన నతడు యుద్ధమున జావుదెబ్బదిని వైద్యశాలకు దీసికొనపోబడి యుండెను. ఈ సమాచారమువిని యా మాత మిక్కిలి తత్తరమున నచటికి బోయెను. ఆమె పుత్రుని గండ్ల జూడకమున్నె యతడు ప్రాణములు విడిచెను. పట్టరాని శోకము నట్టె యణచుకొని యక్కడి వైద్యుడు వ్రాసియిచ్చిన పత్రముంగొని యామె మరల లింకనును జూడ వేచియుండెను. నాడును నే నచటికి గార్యార్థి నై వెడలి యుంటిని. ఆమె విషయమే నాకు జ్ఞాపక ముండలేదు. అయిన నాపెను గాంచినతక్షణమ లింక నామెవార్తనంతయు విని "అమ్మా! నీవు వేరుగ న న్నడుగుట యనవసరము. నీకు గావలసినవస్తువు నీ కిప్పించెద. నీద్వితీయపుత్రుని సైన్యమునుండి విడిపించెద" నని యుత్తరువు లిఖింపజొచ్చెను.

అత డట్లు వ్రాయుచుండ నావృద్ధురాలు దల్లికుమారుంబోలె లింకను దల నిమురుచు నశ్రువుల రాల్చుచుండెను. లింకను ముగించి యార్ద్రచక్షువులతో గద్గదస్వనంబున "నిదె కొమ్ము. నిలచినయిరువురలో నీ కొక్కడును నా కొక్కం డును నయ్యె" ననుచు బత్ర మందిచ్చెను. ఆయవ్వ దానింబుచ్చుకొని కనుల నీళ్లు నిలిపి మరల నొకమా రతని శిరంబుదడవి "నాయనా! లింకను! దేవుడు నీకు మేలు సేయుగాత. నీవు చిరాయు వగుదువుగాక. నీవె యెల్లపు డీరాష్ట్రధిపత్యము వహింతువుగాక" యని దీవించిపోయెను.

ఒకానొక సైనికుడు మూడుమాఱులు సేనవిడిచి పాఱిపోయియుండెను. ఒక తూరి రక్షకభటుల గొందఱిని విషము పెట్టి చంప బ్రయత్నించెను. కావున వాని నురిదీయవలసినదిగా దండనవిధించి యురిదీయబడుటకు నతని గారాగృహమునందుంచిరి. అయిన నతడుచేసిన కార్యము లున్మాదజనితములని సీమప్రతినిధి హారిసునకు దెలియవచ్చెను. కార్యదర్శి మొదలగువారిని బతిమాలి యాసైనికుని మిత్రులు విఫలము నొందిరి. తరువాత హారిసు దేశాధ్యక్షుని దగ్గరకు వెళ్ల నిశ్చయించుకొనెను. బృహస్పతివారము ప్రాత:కాలము సైనికుని నురిదీయ నిశ్చయించిరి. బుధవారమురాత్రి పండ్రెండుగంటలకు హారిసు లింకను గృహము సేరెను. అప్పుడు లింకను నిదురబోవుచుండెను. హారిసు వేచియున్నాడను వార్త చేరి చేరకమున్నె యతడుమేల్కొని లేచి రాసెలవిచ్చెను. హారిసాయనప్రక్కన గూరుచుండి యాసైనికునికి నిశ్చయముగా మనోవైకల్యమే యనియు నతనిశిక్ష యతడు వైద్యులచే బరీక్షింప బడువఱకు నాపబడవలెననియు వేడెను. వెంటనే లింక నాసైనికునికి విధించిన దండన యాపివేయ బడవలసినదని యొక తంత్రీవార్త బంప నుత్తరువుచేసెను. ప్రొద్దున లేచి మఱియొక తంత్రీవార్త బంపెను. సరియగుకాలమున నీవార్తలు చేరునో లేదోయను భయమున నాలుగువయిపుల నాలుగు వార్తలు నియమితకాలములో బంపెను.

మఱియొకసారి యొకపసిసైనికునకు బహరా కాచువేళ నిద్రవోయినందునకు గాల్పబడవలయు నను శిక్షవిధించిరి. అయిన నేదియో యొక కారణమున, నాతనిశిక్షుంచుట కొన్ని రోజులవఱకు నాపియుంచిరి. అప్పుడతడు తండ్రికి మిక్కిలిధైర్య మొసగుచు గంభీరోర్తుల, దానొక స్నేహితునితల్లికి జేసిన వాగ్దానమునకై యాస్నేహితుడు బడలియుండినందున నతని మూటలు మోయుటవలనను గడుదూరము నడుచుటవలనను అలసియుండినను, అతనిధర్మము దానెరవేర్ప నియ్యకొనె ననియు, బాపపునిదుర తన్ను మోసపుచ్చుట నెఱుగ డాయె ననియు, దనయధికారి స్వధర్మ మాచరింపవలసినందున దనకు సాయమియ్యజాల ననియె గావునను, దనమిత్రుడు దనకు బదులు ప్రాణము లర్పింప సిద్ధపడియుండుటను, వా రిరువురును నిందనీయులుగా రనియు, దైవము తన్ను గరుణించి, పైకి గొనిపోవుచున్నాడనియు వ్రాసి యొకలేఖ బంపెను. అతనిచెలియలు దేశాధ్యక్షుని దయాళుత్వ మెఱిగినది గావున నాజాబు దీసికొని లింకనుగారి యొద్దకు బోయి తనసోదరుని రక్షింప వేడి యాజాబు చేతికిచ్చెను. ఆయన దానిని జదివి, గుండెకరిగి యశ్రువులు చింద నాపడుచున కభయమిచ్చిపంపి, విడుదలయుత్తరువు వ్రాసి తానె దానిని దీసికొనిపోయి తగునధికారుల కిచ్చెను.

సందర్భవశమున నిదివఱ కొకపర్యాయము లింక నొక గొప్ప వైద్యశాలను దర్శించి రా వెడలుట దెలుపబడెను. దాని నిచట విపులముగ వర్ణింతుముగాత. ఒకతఱి సిట్టీపాయింటు నందలి వైద్యసాలలనెల్ల దా జూచి యుద్ధభటుల కందఱకు జేయి యిచ్చి గారవించి రా గోరి లింక నచటి ముఖ్యవైద్యునకు వార్త బంపెను. అతడు లింకనుగడ కేతెంచి, "దేశాధ్యక్షా! తా మెంతకార్యమునకు గడగితిరో యెఱుంగుదురే?' యనెను.

"మీవైద్యశాలలయం దెందఱున్నా రని" లింక నడిగె. "ఐదాఱువేల భటు లున్నారు. మీ రందఱకు దర్శన మిచ్చునప్పటికి మిక్కిలి యలసెదర"ని యా వైద్యుడు ప్రత్యుత్తర మిచ్చెను.

అదివిని లింకను దరహసిత వదనుండై "ఆపని కేను బూర్ణముగ దగియున్నానని నమ్ముచున్నాను. ఎట్లైనను బ్రయత్నించి నా యోపినంత చేసెద. నా 'కుఱ్ఱల' నే నిక జూడను గాబోలు. కావున వారు దేశక్షేమమునకై పడినపాట్లేనెంత మెచ్చితినొ వారి కిప్పుడె వెల్లడిపఱచెద" నని వైద్యశాలకు బ్రయాణమై పోయెను.

ముఖ్యవైద్యుడు త్రోవసూప లింకను ప్రతిమంచముకడ నిలచి ప్రతిభటుని విషయము లారసి కొందఱస్థికి హర్ష మందుచు, గొందఱగతికి వగచుచు, గొందఱ జీరుచు, గొందఱ గరుణించుచు నందఱ సమ్మానించి హస్తం బొసంగు చుండెను.

ఇట్లతడు గౌరవించుచు నొక తిరుగుబాటు సేనా భటుడు పట్టువడినవాడు పరుండిన శయ్య దరియుచుండెను. అతడు చేసాచుటకుమున్ను వాడు హస్తము ముందిడి "ప్రభూ! లింకను. నేను రాజ్యాంగమునకు వ్యతిరేకముగ బోరాడిన తప్పిదమునకై క్షమింపుమని వేడ జాలకాలము వేచియున్నాడ"నని కన్నీరుగార్చుచు బల్కెను.

లింకను వాని యునికికి వ్యసనపడి ప్రత్యశ్రువులు వ్రాల్చి వాని మన్నించి యభయహస్తంబిచ్చి సంతసింపజేసెను. ఇట నాతడు దనకు లోబడిన శత్రువుల క్షమింప జేసిన యుత్తరవు స్మరణకు వచ్చుచున్నది. "తన దుష్ప్రవర్తన కెవ్వడు పరిపూర్ణమనమున బరితపించి దానిం దగువిధమున గనుపఱచునో వాని నిర్భయముగ క్షమింపవచ్చును. అట్టివా రేరైనను సరియె. భిన్నాభిప్రాయము వలదు." ఈకడపటి మాటలనేక యుపన్యాసములకంటె స్ఫుటముగ క్షమాపరిపాకంబుం బ్రకటింపవే!

వైద్యశాల చుట్టుం దిరిగి పనిముగిసె ననుకొని లింక నా సీనుడై యుండెను. అప్పు డాశాలయం దొక్కభాగమునకు వారు పోలేదనియు, నచ్చటి 'కుఱ్ఱలు' లింకనును జూడ గోరెద రనియు దెలియనాయెను. అంత నావైద్యు డతని జూచి,

"మీరు మిక్కిలియలసితిరి. నేనును డస్సితిని. పోకున్నను దొందరలేదు. మీరు వెడలకు డ"నియెను. "నేను వెడలియే తీరవలెను. నాకు దెలియునంతవఱ కొక్కనినైనను విడిచిపోను. నా 'కుఱ్ఱలు' నను జూడకున్న మిక్కిలి యసంతుష్ట హృదయ లగుదురని" లింకను మరలబోయి నిలువయున్న భటుల నాదరించి మనస్సంతోషమున బలుగంటల మీద నింటికి దరలెను.

యుద్ధమున నెచటనేని యనేకులు హతులై రని లింకను వినిన మిక్కిలి కుందు. "ఘోరము, ఘోరమ"ని పలుకుచు బలుమాఱు భోజనాధులపై దృష్టియే సారింపకుండు. జయ వార్తలు వచ్చిన నితరులు దను బొగడిన దాను యుద్ధభటుల చేతన యాజయం బొదవెనని వారిని గొనియాడు. వారిపై నెల్లప్పుడు బ్రాణము లుంచుకొని వారి కేహాని వచ్చినను దానె యనుభవించినట్లు దు:ఖించుచు గొంత తనదేహ దార్ఢ్యముగూడ గోలుపోవుచుండు. సైనికుల త్యాగంబున కతడు మిక్కిలి యలరి వా రొక విధమున దనకంటె గొప్పవారని తలంచు. అ ట్లగుట వారి సౌఖ్యాభివృద్ధికి జేయబడు ప్రయత్నములనెల్ల నత డామోదించుచుండును.

సైనికులకు సాయ మొనర్ప ద్రవ్యము సేర్చుటకు గొన్ని గొప్ప సంతలు జరుపబడియెను. అచ్చోటులనెల్ల లింక నగ్రస్థానము వహించుచువచ్చెను. ఫిలడెల్పియా పట్టణమున జరిగిన సంతలో 50 లక్షల డాలర్లు దొరకె నని విని లింకను "దేశాభిమానమునను న్యూగిన్‌దేశమునుబోలిన దేశము మఱొం డున్నదే? ధైర్యవంతులగు నా 'కుఱ్ఱల' కిది యెంత సౌఖ్యం బిచ్చుచున్నదో చూడుడి"యని యుప్పొంగి పలికెను.

'తిరుగుబాటు' సేనయందలి యుద్ధభటులు చే జిక్కినపుడు వారి కాహారాదులు లేకుండ జేసిచంపుట కత డెప్పటికిని నియ్యకొనకుండుటయేగాక వారిని గష్టములపాలు సేయుటకుగూడ నంగీకరింపకుండును. ప్రతికృతి యొనరింపవలసివచ్చినను మఱియేవిధముననైన నొనరింపవలసినదేగాని యుద్ధభటుల నిడుమలు గుడిపించుటమాత్రము దగదు. లింకను దిరుగ బడిన సైనికులయెడ గూడ నితరులయెడంబోలె దన దయామయత్వము జూపుచుండును.

ఒకతఱి ననేకులు గాయపడిన 'తిరుగు బాటు' సైనికులుంచబడిన గృహమునకు లింకను వెడలెను. వా రందఱి గలయజూచి యతడు,

"మీరాటంకము వలుకకున్న మీ కెల్లర కేను హస్త బొసగగోరుచున్నాను. మన దేశమునకై నడపి తీరవలసిన ధర్మముంబట్టి యీ యుద్ధము జరపవలసియున్నది. మీ శక్తికి మీరినకారణములచే మీలో ననేకులు నాకు వైరులుగ గన్పట్టుచున్నా రనుట నిజమ. అయిన మీపై నాకెట్టి క్రోధమును లేదు. మీ మేల కోరుచు స్నేహభావమున హస్తం బొసగెద" ననియెను. వారును గొంచెము వెనుదీసియు గొంత తడవునకు దేశాధ్యక్షుని చేయిగొన ముందు కేతెంచిరి. అయిన నందనేకులు లేవనేరని యంత దుర్భలు లయియుండిరి. కావున లింకను వారికడకేగి కై యొసగి "కుఱ్ఱలారా! ధైర్యము విడనాడ కుడి. ఉల్లాసమున నుండుడి. మా యోపినంత జాగ్రత్తతో మిము గాపాడెదము గాక. దైవము మీకు మేలుసేయును గాత" యని ప్రోత్సాహపఱచెను.

ఈ ప్రసంగము చూపరుల మనంబు నట్లె కొల్లగొనియెను. అచట నున్నవారల నొక్కరును గంటినీరు విడువని వారు లేరు. 'తిరుగుబాటు' సైనికుల ననేకులు గొల్లని యేడ్వసాగిరి. వారి కెప్పుడు నిట్టి యాదరణ దటస్థించునని వారు గలనైన దలపరైరిగదా!

ఇట్టి యుపకృతియెగదా లింక నొనరింప వేచియుండును!

కం. "ఉపకారికి నుపకారము
     విపరీతము గాదు చేయ వివరింపంగా
     నపకారికి నుపకారము
     నెప మెన్నక చేయువాదు నేర్పరి సుమతీ."

_______