ఆబ్రహాము లింకను చరిత్ర/పదునేడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునేడవ ప్రకరణము

"పితగృహా" లంకరణము.

ఉత్తమోద్యోగమున లింకను సూపిన యౌదార్యాది గుణసంపత్తినిగుఱించి తెలుపుటయె మనకు గర్తవ్యము గాన నతడు దేశాధ్యక్షుడుగ నున్నంతకాలము ప్రబలుచుండిన "దిరుగుబాటు" నణచుటలో నతడు సేసిన యేర్పాటులను గనుపఱచిన శక్తియు వర్ణించుట యనవసరము. రెండుకోట్ల సంఖ్యగల "సంయోగపు" సేననుదీర్చుటయందును, దేశము నందలి యపాయకరంబులగు కక్షల నదపున నుంచుటయందును, దేశభక్తిపూర్ణుడగు బ్రతిమనుజుని గౌరవ విశ్వాసముల సంపాదించుటయందును, వేనవేలుయుద్ధరంగముల జయమందుటయందును, మహాశక్తియుత మగు నావిక సైన్యము నిర్మించుటయందును, యుద్ధమునకై మూడువేలకోట్ల డాలర్లు సేర్చుటయందును, రాజకీయ వ్యవహారముల జనులకు నమ్మిక గలుగ జేయుటయందును, నాలుగుకోట్ల బానిసలకు స్వచ్ఛంద వృత్తి నొసంగుటయందును, ము న్నెన్నటికంటె నెక్కుడుగ దేశమునకు నెమ్మది దెచ్చుటయందును లింకను వెల్లడించిన శక్తి సామర్థ్యంబు లత్యద్భుతములు. వీని నన్నిటింగూర్చి వ్రాయగడంగిన నొక్కొకదాని కొక్కొక సంపుటమైనం జాలదు. రోమక రాజ్యమును మహోన్నతపదవికి దెచ్చి లోకమునందలి నాయకశిఖామణుల శ్రేష్ఠుడని పేరు వడసిన సీజరునకంటె లింకను గొప్పవాడని యొకానొక పెద్దసభ యందు నుడువబడియెననిన మన కిక్కార్యముల నిశ్చయపరిమాణము స్ఫురింపగలదు. ఇంత మహాద్భుతవ్యాపకము గల విషయముల జర్చించుటలో లింకను స్వభావము సంపూర్ణముగ బయలుపడక పోవచ్చును. గొప్ప రాష్ట్రాధిపతియై కోట్లతో నెన్నదగు బ్రజల బరిపాలించుచు నతడు సర్వ సాధారణకార్యముల నెట్లు మెలగెనో విశదీకరించిన నతని గొప్పతనమునకు దారిసూపిన గుణపుంజములు దెల్లము గా గలవు. ఉపన్యాస సహస్రములకంటె గొన్నియుదాహరణము లాతని సామర్థ్యము, న్యాయబుద్ధి, దేశభక్తి, ప్రయత్నశక్తి, దయాళుత్వము, స్వబలసాహాయ్యపరత్వము, మనోదార్ఢ్యము, చాతుర్యము, వివేచన, ప్రతిభ, యౌదార్యము, ప్రాబల్యము మున్నగువాని జక్కగ జూపగలవు. ఈకారణము బట్టి "సిత గృహము" *[1]న లింకను గడపిన సంవత్సరముల నాతని చరిత్ర యందలి బోధకవిషయముల నెత్తివ్రాయుచు వచ్చెదము. 1861 వ సంవత్సరము మార్చి నెల 4 వ తేది లింకను దేశాధ్యక్షత వహించు నుత్సవము జరుపబడియెను. ఆ యానందము చూచుటకు లక్షలకొలది జనులు వాషింగ్టను పట్టణమునకు వచ్చిచేరిరి. అల్లరుల కారంభించి దేశాధ్యక్షుని బొడిచివేయ బ్రయత్నములు గాగల వేమో యనుభయమున జనరల్ స్కా ట్టా పట్టణమును గాపాడుటకు దగిన దండు నాయత్తపఱచి యుండెను. లింకను దన ప్రథమోపన్యాసము నీ క్రిందిపదములతో రాజ్యవైరుల హృదయములకు నాట బల్కి ముగించెను.

"అతృప్తులగు నో దేశీయసోదరులారా! నావలన నెంత మాత్రమును నంతర్యుద్ధప్రాప్తి గా జాలదు. అట్టి ఘోరకృత్యము జరుగవలసివచ్చిన దానికి మీర యావశ్యకత గలుగ జేయువా రగుదురు. రాజ్యనిర్వాహకు లెప్పటికిని మీపై బడరు. మీరు ముందుపడి పోరాడకున్న మీ కెట్టి పెనంగుటయు దటస్థింపదు. మీ రీ రాజ్యాంగము నశింప జేయుద మని దేవుని యెదుట బ్రమాణము సేసియుండలేదు; అయిన నేనో నాయోపినంత రాజ్యాంగమును నిలిపి, సంరక్షించి, స్థాపింప సంపూర్ణ మనస్కుడ నై శపథ మంగీకరించి యున్నాను. ముగింపుసేయ నా మన సొప్పకున్నది. మనము శత్రువులము గాము. స్నేహితులమె యగుదుము. ద్వేషము మన మొకరిపై నొకరము పూనుటయు దగదు. తామస మొక్కతఱి మనల లోబఱచుకొనినను నీ యనురాగబంధముల ద్రుంప నీయ గూడదు. అనేకయుద్ధరంగములనుండియు, ననేక దేశభుక్తుల సమాధులనుండియు నీదేశములోని ప్రతిమనుష్యుని హృదయ కమలమువఱకును బ్రతిమందిరమునందలి సభాస్థానము వఱకును వ్యాపించియుండు గుప్తస్మరణతంత్రీస్పర్శంబున మన సాత్విక గుణరాజంబుల ప్రదర్శంబునకంటె నెక్కుడుగ సంయోగకీర్తనాస్వనము ప్రబలజేయ గల్గుదుముగాక!"

నాటి ప్రాత:కాలమున లింకను దన ప్రథమోపన్యాసము నింట భార్యాదులకు జదివి వినిపించి తన్నొక్కటిగ విడిచిపొండనివేడెను. కవాట మట్లె తెఱచియుండిరి. అతడు దన్ను దనపుత్రకళత్రంబుల దనదేశంబును సర్వేశ్వరున కప్పగించుకొని యాతని దయామయత్వంబు దమనెల్ల సంరక్షించును గాత యని భక్తిరసానుగుణస్వనమున బ్రార్థించుచుంట యాతని మిత్రులెల్ల వినిరి. అతనిపై నిడబడిన భారము మానవశక్తికి మించి దైవసాహాయ్యములేక మోయ నలవి గాకుండెను.

లింకనునకు బూర్వ ముండిన రాజకీయోద్యోగస్థులు దక్షిణసీమలవారై రాజ్యమును మహా హీనపదవికి దెచ్చి యుండిరి. అంతర్యుద్ధమున కెన్ని మార్గములు వలయునో యన్ని మార్గము లేర్పఱచి యుండిరి. బొక్కసమున నొక్క కాసై నను లేకుండ జేయుటయె గాక రాజ్యాంగమునందలి నమ్మకమును జెఱచి యప్పు పుట్టించుకొనుటయె దుస్సాధ్యము జేసి యుండిరి. దొరకిన ద్రవ్యమున విశేషభాగమును లంచములిచ్చి యల్లకల్లోలమునకు జనుల రేపజూచిరనియు బ్రవాద మొకటి యుండెను. ఉత్తరసీమల యందలి గిడ్డంగులలోని మందు మొదలగు యుద్ధోపకరణముల నన్నింటిని దక్షిణసీమల ముఖ్యస్థానముల కనిపి వాని బలపఱచి యుత్తరసీమల నిరాధారముల జేసియుంచిరి. ఇక నౌకాసేన గతి జూతురేని దొంబది యుద్ధ నావ లుండుటకు మారుగ లింకను దేశాధ్యక్షత పూనునప్పటికి రెండుమాత్రమ సిద్ధముగ రాజ్యవహుల కక్కరకు వచ్చునట్లుండెను. ఇట్టి తరుణమున దక్షిణసీమలు దిరుగబడిన రాజ్యాంగమునకు బరాజయము తప్పక గలుగునటుల నుండెను.

లింకను దేశాధ్యక్షత వహించినవెంటనె సీమప్రతినిధి యొక్క డతని కీ విషయముల విశదీకరించి యునైటెడ్ స్టేట్స్ సంయుక్త రాష్ట్రపు దండ్రి యగు వాషింగ్టను సేనానాయకత్వమున కియ్యకొనినపు డెంత కఠినకాలముగ నుండునో యప్పుడు నంత కఠినకాలంబ యనియు నతని కెంతసాధన సూన్యత గల్గెనో లింకనున కంత సాధన సూన్యతగల దనియు జింతాసూచనముగ బల్కెను. దానికి బ్రత్యుత్తరముగ లింకను,

"మీరు జెప్పునది గొంత నిజమ. అయిన వాషింగ్టనున కంటె నాకు బరికరము లెక్కుడు గలవు. రాజ్యహితులగు లోకులు స్వదేశాభిమానులు నా పక్షమున నుండ నా కేమియు లోపము గలుగద"ని దీర్ఘాలోచన పరత్వమున దన మనో నైర్మల్యంబును గనుబఱచుచు నుడివెను. దురభిమాన మతని కెప్పుడును లేదు. జనులలో మెలగి వారి యభిప్రాయముల నెఱింగికొని యనుభవముచే జ్ఞానము సంపాదింపకున్న దనశక్తివల్లన జయమందలే నని యతడు చక్కగ గ్రహించెను. సర్వజనానుకూలం బగునారాజ్యాంగముపై దన దేశీయు లందఱకు ననురాగము గలదనియు, నవినీతు లొక్కరిద్దఱెంత పాటువడినను జయమందజాలరనియు గట్టిగ నమ్మియుండెను. ఇట్లు జనుల నాదరించి కించిత్తైన ననుమానభయములు లేక వారిం దనవారిగ బ్రథమమునుండి జేకొనుటయె యట్టి మహోపద్రవకాలమున గర్తవ్యాంశమని యతడు గని పెట్టుట మిక్కిలిశ్లాఘనీయము. కొంచె మటునిటు గొంకు వాడయి యుండిన నాపదవి కత డనర్హు డయి యుండును.

గతప్రకరణమున యునైటెడ్ స్టేట్సులో మూడుకక్ష లుండె నని చెప్పితిమి. అందు లింకను రిపబ్లి కను గక్షకు జేరినవాడు. దానితో ననేక విషయముల నంగీకరించునది మఱియొండు కక్ష గలదు. అందు ప్రముఖుడు డగ్లసను నత డుండెను. అతనితో ననేకపర్యాయములు లింకను పోరాడి జయ మందియుండెను. అయిన దేశోద్ధారణ కార్యమునకై డగ్లసు స్నేహితు లతనిని లింకనుతో జేరమని వేడిరి. అతడును జక్కగ యోచించి యిట్టి యుత్పాతముల కాలమున వెనుదీసిన గార్యము సెడుననుట పరికించి లింకనుస్నేహముగోరి "సితగృహమున"కు జని యట లింకనును దర్శించి,

"తండ్రి! లింకను! ఈ రాష్ట్రమునకెల్ల దేశాధ్యక్షుడవగు నీవు నాకును దేశాధ్యక్షుడవె" యని చే యిచ్చెను. లింకను మనము కరగి మిక్కిలి సంతసమున నా కరంబు స్వీకరించి యతని దేశభక్తికి మెచ్చి వందనము లాచరించెను. ఈ విధమున మహా ప్రసిద్ధివడిన యిద్దఱు ప్రతి కక్షయందలి ప్రాముఖ్యులు దేశక్షేమమునకై యేకీభవించిరి. తరువాత లింకను డగ్లసునకు దన యుద్దేశ పత్రమును జదివి చెప్పెను. అం దతడు డెబ్బదియైదువేల సైనికుల జేర్ప నిశ్చయించి యుండెను. డగ్లసు దక్కినవిషయము నెల్ల లింకనుతో నంగీకరించి యీవిషయమునమాత్రము "రెండులక్షల సేనకూర్చిన బాగుండును. మీ శత్రువుల టక్కరితనంబుల నే నెఱిగినంత చక్కగ మీ రెఱుంగర"ని తెల్పి యాదేశ పటముపై రక్షింపబడవలసిన స్థలములనెల్ల జూపి రాజ్యాధికారు లిప్పటి తిరుగుబాటు నట్టె యణచివేయ గట్టి యేర్పాటుల జేసి తీరవలెనని చెప్పి ముగించెను.

మరునాడె లింకను డగ్లసు లొక్కటై రనుట దేశ మంతయు దెలిసిపోయెను. నాడు మొదలు డగ్లసు పరలోక ప్రాప్తి జెందువఱకు లింక నతని యాప్తస్నేహితుడుగ గణించు చుండెను. అతడును లింకనుకు శత్రువుల మాయోపాయముల దెలుపుచు మహోపకార మొనరించుచుండెను. అతను దివి కేగ నాతని మరణము దేశమునకంతకు నష్టమనుట లింకను వెల్లడిచేసెను.

లింకను దన ప్రథమోపన్యాసమున జేసిన వాగ్దానములకు భేదముగ నెన్నడును నడచినది లేదు. "మీరు ముందు యుద్ధమునకు జొరబడకున్న మీ కెట్టి పెనంగుటయు దటస్థింప ద"ని తన ప్రతికక్షవారికి జెప్పినవాక్కు నట్లె పాలించెను. దక్షిణరాష్ట్రముల సంఘమువారు 1861 వ సంవత్సరము ఏప్రిల్ నెల 12 వ తేదిన దిరుగబడి సంటరుకోటపై ఫిరంగి పేల్చి ముందు యుద్ధమును బ్రారంభించినవా రైరి. నాటి మధ్యాహ్నము "తిరుగుబాటు" సేనాని యాకోట సేనానిని లోబడు మని యనియెను. అందుమీద నతడు "రాజ్యాంగముపరమున నీకోట గాపాడుట నాకు ధర్మమై, యున్నద"ని ప్రత్యుత్తర మిచ్చెను.

"అట్లయిన నీపట్టణమువారు మా వైరులని యెంచెదమ"ని "తిరుగుబాటు" సేన యాపట్టణమును ముట్టడించెను.

లింక నాపట్టణమునందలి సేనకు భోజనపదార్థముల యుద్ధనావయందు బంపుటమాని సాధారణ నావయందు బంపెను.శత్రు లద్దానిబట్టి యాపివేసిరి. ఈవిషయము లింక నెంతస్నేహముగోరి కలహమునకు గారణ మొసంగ నయిచ్ఛ గలవాడో విశదము సేయుచున్నది.

తమ శక్తికొలది బోరాడి ఫలముగానక యా పట్టణపు సేన శత్రువులకు బదుమూడవ తేది లోబడియెను.

ఇట్లు దక్షిణమునందలి బద్ధసీమలు రాజ్యాంగముపై దాడివెడలుట సిద్ధమాయెను. రాజ్యాధికారు లవలంబింపవలసిన మార్గమును వార తెలియ జేసిరి. ఎట్లయినను బ్రయత్నించి యల్లకల్లోలములనడుగంట జేసి బద్ధసీమల బరాజితుల జేసి తీరవలెననుట విశద మాయెను. దానికి యుద్ధముదక్క వేరొండుపాయము లేకుండుటయు బయల్పడెను. అందువలననే లింకను డెబ్బదియైదువేల సైనికుల నియమింప నిశ్చయించెను. నాటినుండి యతడు శత్రువుల నడంపదగు నుపకరణముల సేకరించుట యందును సేనావిషయముల నెఱింగికొనుట యందును మగ్ను డయ్యెను. అన్నివిషయముల నందఱి యభిప్రాయముల విని తనపభిప్రాయముల మార్చుకొనుచుండినను లింక నితరులకు భయపడి తాను మంచిదని నమ్మినది వదలువాడు గాడు.

దక్షిణసీమలయందలి బానిసలకు నాయుధములిచ్చి వారిసాయము గొనినయెడల లెస్స యని యొక కార్యదర్శి వ్రాసెను. దానికి లింకను "ఇది యెన్నటికిం దగదు. ఈవిధమున గార్యదర్శి స్వతంత్రింపగూడదు. ఆపని తనదిగాదు. నాదె యగు" ననెను.

శత్రువులచేత బడిన రాజ్యాంగసైనికుల వారు బహుక్రూరముగ జూచుచువచ్చిరి. దేశపు జనులెల్లరును గొన్ని ఘోరకృత్యముల విని కోపోద్దీపితులై యుండిరి. కావున గొందఱు లింకనుం డాసి "మనచే బడినశత్రుజనుల బాధించి ప్రతీకార మొనరింపుడ"ని నుడివిరి. అదివిని యత డాగ్రహము సూచించి,

"ఆవిధమున నేనొక్కనాడును మనుష్యుల బీడింప జాలను. ఎవ్వ రేమియాడిన నాడుదురు గాక, ఏమి చేసినను జేయుదురుగాక, నేనట్టి యమానుష కార్యముల సహింప జాల" నని ప్రత్యుత్తర మిచ్చెను.

లింకను కక్షవా రనేకులు కామేరనను కార్యదర్శిపై నిష్టము లేనివారై యతని నాపదవినుండి దీయింప సమకట్టి కొందఱు ప్రతినిధుల నేర్చి లింకనువద్దకు బంపిరి. వారు సెప్పున దంతయు విని లింకను,

"అయ్యలారా! మీ రేమో చెప్పుచున్నారు. అయినను నాకు నమ్మకము దట్టదయ్యెను. అతనిపై నొక్క సత్యమగునేరము సూపితిరేని నే నాతనిశిరంబు మీ కప్పగించెదను. అయిన నిశ్చయ మావంతయైన లేని వెడగుమాటల నమ్మి నేబనిబూనువాడను గా" నని నిర్భయముగ బలికి వారిని బంపివేసెను.

ఫిరంగి యొక్కటి క్రొత్తగ జేయబడెను. దాని బరీక్షించుటకుగా నొక కొందఱు సీమప్రతినిధి సభ్యులు నియమింపబడిరి. వా రావిషయమును విపులముగ నేబదిపుటలు నింపి వ్రాసిపంపిరి. లింక నాగ్రంథముం జూచి "వీ రిందుల గొంచెము జ్ఞాన ముపయోగించి విషయముల సంక్షిప్తముగ దెలుపవలదే? గుఱ్ఱమును బరీక్షింపుడనిన దాని రోమముల లెక్కించునట్టి బుద్ధిమంతులుగ నున్నారు. నే నిది సదుపుకొన మఱియొకజన్మ మెత్తవలసినదే" యనుచు దాని బల్లపై బాఱవైచెను.

నౌకా సేనాధికారు లిద్దఱు వ్యాపారుల నన్నదమ్ముల రాజ్యాంగపు ధన మపహరించిరని వారిపై నేరముమోపి కారాగృహమున నుంచి నెలలకొలది పీడించుచుండిరి. లింక నావ్యాజ్యెమును బరిశీలించి యన్నదమ్ము లిరువురును నిరపరాధు లని తెలిసికొని తానే యధికారము పూని,

"ఈ యిరువురును నౌకా సేనవిషయమున లక్షయిరువది యైదువేల వ్యాపారము జరుపు చుండిరి. అం దిరువదియైదువే లపహరింప వారి కెడ ముండెను. వారిపై నేరము మోపినది రెండువేల యిన్నూరింటికె. అందు నిప్పుడు సంశయించుచుండు నది నూటివిషయమె. నే నత డొక్క కాసైన నపహరించెనని నమ్ముట లేదు. కావున నిదివఱకు జేయబడిన తీర్పు లన్నియు నే నంగీకరించుటలేదు. అవియెల్ల నిందుమూలమున రద్దుపఱుపబడి ప్రతివాదులకు స్వేచ్ఛ యొసగబడినద"ని యుత్తరువు చేసెను.

ఈ విషయములన్నియు లింకను మెత్తనివా డైనను దగిన యెడ ధైర్యము సూపుచు వచ్చె ననుటను స్థిరపఱచుచున్నవి. అతడు దానే స్వయముగ యోచించి పనుల దీర్చుచుండె ననుటగూడ విశద మగుచున్నది.

లింకను దేశాధ్యక్షత వహించిన రెండవయే డతని కనేక దు:ఖములు సంభవించెను. యుద్ధపువార్త లొక్కటియెగాక యతని కుమారు డొక్కడు మృతినొందెను. రెండవవాడు పరలోకప్రాప్తి జెంద సిద్ధపడెను. లింకను వానిని గాచుచు బహుకాల మిలువెడలి బయటికి వచ్చిన దెఱుగడు. పుత్ర వియోగ మతనికి మిక్కిలి యసహ్య మాయెను. ఎంత పని పాటుల నున్నను 'నాయనా' యని ముద్దులొలుకు బల్కుల దగ్గర జేరు కుమారుడు మరణావస్థయందు బఱుండుట జూచిచూచి యెల్లపుడు దు:ఖించు చుండెను. కుమారునిపై నెనరున విలపించుచు గడు నమ్రహృదయు డై పలుమాఱు దైవముం దలంచి ప్రార్థించుచుండును. అప్పుడు జరుగు యుద్ధమున న్యాయము జరుగుగాకనియు వేడుచుండెను.

రెండవకుమారుడు మెల్లమెల్ల నారోగ్యము నందెను. యుద్ధమునందును రాజ్యాంగ మల్ల నల్లన జయించుచు వచ్చెను.

లింకను దన రాష్ట్రపు సైనికులయందలి దురభ్యాసముల మాన్ప మిక్కిలి పాటుపడెను. త్రాగుబోతుతనము బట్టిడు కొనుట యను నీరెండు విషయములగుఱించి చక్కగ నుపన్యసించి వాని రెంటిని నణచుట కుత్తరువులుసేసి వానినెల్ల గట్టిగ జెల్లించుచువచ్చెను.

లింకను యుద్ధభటులయెడ గనుపఱచిన బ్రేమాతిశయ విషయములును, నతడు బానిసలకు ముక్తినొసంగి వారి నాదరించిన తెఱంగును నొక్కొక్క టొక్కొక్కప్రకరణమున కర్హమైనది గాన నిచట బొందుపఱప బడవయ్యెను.

_______

పదునెనిమిదవ ప్రకరణము

యుద్ధభటులయం దనురాగము.

ఇంతకు బూర్వ మొకప్రకరణమున లింకను బ్లాకుహాకు యుద్ధమునకు సైనికుడుగ వెళ్లెనని వ్రాసితిమిగదా. అతడపు డనుభవించిన కష్టసుఖములు మనమున నుండెగాన

  1. * అమెరికాదేశమందలి సంయుక్త రాష్ట్రముయొక్క రాజధాని యగు వాషింగ్‌టన్ పట్టణములో దేశాధ్యక్షు లుండుటకు నిర్మింపబడిన రాజ మందిరముకు "సితగృహ" మని పేరు.