ఆబ్రహాము లింకను చరిత్ర/పందొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పందొమ్మిదవ ప్రకరణము

బానిసలకై పడినపాట్లు.

లోకములోన ననేకులు దమ జాతివారల, దమ మతము వారల దమ దేశీయుల నిడుమలనుండి విడిపించి మహా గౌరవం బందియున్నారు. గాని యితరజాతివారల నితరమతస్థుల దమకంటె హీనజన్ములుగ బరిగణింపబడువారల దమ దాసుల లేవనెత్తజూచినవారు గడు దక్కువ. గ్రీసు దేశమునందు బ్రజ లుత్తమ నాగరికమున నుండుతఱి నాగరిక స్వభావము దయ నంకురింపజేయ గొందఱు ప్రభువులు దమదాసుల బిడ్డలవలె బరిగణింపుచు వారికి సేచ్ఛనొసంగుచు వచ్చిరి. అయిన నది "మనుష్యులెల్లరు నొక్కటియ. అందఱు విశృంఖలలీల పనిచేసినంగాని లోకము సుఖంబున నుండదు. ఒకరికొకరు సాహాయ్యులు గావలసినదనియే గాని యొకరు మఱియొకరి యాత్మదేహముల రెంటింగొని తమ స్వలాభమున కుపయోగించుకొన గూడదనుట దైవికాజ్ఞా" యను జ్ఞానము వొడముటవలన జరుగుచు వచ్చినదిగాదు. అట్టి జ్ఞాన మంకురించి వృద్ధిపొందుట కారంభించినది పదు నెనిమిదియవ శతాబ్దమున గడపటి సంవత్సరములయందు. దానికి దారిసూపినవా రమెరికనులు * దాని పరిపాకమును గనబఱచిన వారును వారె. లోకాద్భుతంబును లోకోపకారంబును నగువారికార్యము బానిసజాతిగ నేర్పఱుపబడి యున్న నీగ్రోల దాస్యమునుండి విముక్తుల జేయుటయ. అక్కార్యమునకు ముఖ్యకారకుడు లింకను. అతడు మొదట బానిసల జూచుటయు వారి స్థితినిగుఱించి దయార్ద్రహృదయంబున బిన్ననాటనె యుపన్యసించుటయు మన మెఱుగుదుము. అతడు గ్రమక్రమముగ వృద్ధినొందిన కాలమున గూడ సమయము దొరకినయెడల నెల్ల బానిసమును ఖండించుచు వచ్చుటయు మనకు దెలిసినవిషయమే ఆతడు దేశాధ్యక్షతవహించి స్వదేశోద్ధారకు డగుటయెగాక దాస్యజాతికి ముక్తిదాయకుడుగ నయ్యెను. రాష్ట్రపు సమ్యోగము నిలుప నెప్పుడు పాటుపడియెనో న్యాయపరిపాలనం బెప్పుడు దలపెట్టెనో యప్పుడు లింకను దాసుల వర వుడముల జెండాడ నిశ్చయింపవలసి వచ్చెను. అంతర్యుద్ధము మూడు సంవత్సరములు జరిగినతరువాత నతడు నిరంకుశసరణి నిర్భయముగ నిస్సంశయముగ నీరీతి బల్కెను:

"స్వభావమువలననే నేను దాస్యమునకు వైరిని. దాస్యము నిస్సందేహముగా భూమియందలి యన్యాయములలో మొద ______________________________________________________________

  • ఈవిషయమున నాంగ్లేయులును సమ్మానమందవలసినవారె. వారును నితరులకు స్వాతంత్ర్యము గలుగజేయ బాటుపడిరి. టిది. అది ఘోరము గాదంటిరేని మఱి యే తప్పుప్రవర్తనయు ఘోరము గా జాలదు. నేను బానిసల నెప్పుడు గనినను, వారి దుర్దశం గుఱించి యెప్పుడు వినినను వారి స్థితినిగుఱించి యెప్పుడు దలపోసినను దాస్య మమానుషం బనుట నా మనసునకు వచ్చుచున్నది. అయిన నా దేశాధ్యక్షపదము నా యిచ్చచొప్పున నీవిషయమున దెగించి నాకు బనిసేయుటకు ననర్గళశక్తి నొసంగలేదనుటయు నే నెఱుగుదును.......... బానిసము మొదలుగా గల్గు చిన్నవిషయముల నిలపుటకై రాజ్యమును, రాజ్యపద్ధతులును, రాజ్యాంగమును నశింప జేసితినేని నేను నా ధర్మము జేసినవాడను గాజాలను....... జరుగు కార్యములకును వాన ఫలములకు నేను గర్తను గాను. అవియ నాకు గర్త లనిచెప్పనొప్పును. మూడుసంవత్సరముల యుద్ధమునకు బిదప నేడు మన రాష్ట్రపు స్థితిజూచిన నొక గక్షచేగాని మనుజునిచేగాని నిర్ణయింపబడినట్లు గనబడదు. దైవమ యిట్లు నడపుచున్నాడు. మనగతి యేమి యగుననుటయు విదితమ. ఈ గొప్ప యన్యాయ ప్రవర్తనంబును లోకమునుండి తుడిచివేయవలె ననియు నా యన్యాయమున కింతకాలము మన యుత్తరదక్షిణసీమలనుండు మనము ప్రోద్బల మిచ్చినందులకు దగువిధమున శిక్ష నొందవలె ననియు దైవము దలంచెనా నిష్పక్షపాతపురుషులు దేవుని న్యాయస్వరూపుడనియు సౌజన్యమూర్తి యనియు బొగడ మఱొం డతని కార్యరాజంబులం గందురుగాత."

లింక నొకానొక స్నేతునకు వ్రాసినజాబు నొకదాని నిట బొందుపఱచెదము.

"ఏరైనను దాస్యమును నిలుపనిదే సంయోగము నిలుప జాలమనిరేని వారితో నే నేకీభవింపను.

"ఏరైనను దాస్యము దుదముట్టించనిదే సంయోగము నిలుపజాలమనిరేని వారితోను నే నేకీభవింపను.

"నాకు గర్తవ్యము సంయోగ సంరక్షణయేగాని దాస్య సంరక్షణగాని దాస్యసంహారముగాని కావు"

"ఒక్క దాసునినైన విముక్తుజేయక సంయోగము నిలుప గల్గుదునేని యట్లె చేయుదు. అందఱ విడిపించిన సంయోగము స్థిర మగునెడ నా త్రోవనె త్రొక్కుదును, కొందఱ విడిచిన గార్యము సరి యగునెడ నట్లె యొనరుతు.

"దాసులకై నే జేయు పనియెల్ల సంయోగము స్థిర పఱచుటకె. నాకెయ్య దీపనికి సహకారి గాదని నమ్మిక గలుగు నద్దాని బరిత్యజింతు.

"నాయందలి లోపముల జూపినపక్షమున నవి తప్పులేయైన దిద్దుకొనియెద. క్రొత్తమార్గముల దెల్పిన సరియగు మార్గము లైన వాని నంగీకరింతు. "నే నిట నాపదమున గర్తవ్య విషయముల నొడివితిని. దీన జేసి సర్వజనులు స్వతంత్రు లై సమాను లై యుండవలెనను మదిచ్ఛ యెంతమాత్రమును మార్పు సెందలేదనుటను వ్యక్తపఱచుచున్నాడను."

ఇట్టినియమములకును నపేక్షలకును లోనై లింకను దాస్య విషయమును దఱిసి యయ్యాసురనిర్మాణమును నిర్మూలించి యదే కారణంబుగ నుద్భవించినయుద్ధమునకు రెండులక్షల నీగ్రోల (బానిస సిద్దీల) భటులుగ నియమించి యాదేశమందలి ప్రతి బానిసకును స్వతంత్రం బొసంగెను. ఇ ట్లొసంగుటయందును నతడు మిక్కిలి జాగరూకత సూపెను. సంయోగపు సైన్యములు 'దిరుగుబాటు' నణచునంతటి గొప్ప జయమందువఱకును దాను బానిసలపరమున జేయు నుత్తరువులు రిత్త యగునని గుర్తించి లింక నెందఱు దాస్యవిమోచనప్రకటనము సేయు మనినను జేయక తరుణము వేచియుండెను. ఆంటీటమను యుద్ధరంగమున దనసేనలు సంపూర్ణజయం బందె ననెడివార్త దిక్కు దిక్కునకు బర్వినతోడనె 1862 వ సంవత్సరము సెప్టంబరు నెల 22 వ దినమున లింక నెల్లర మనము రంజిల్ల జేయు దన విమోచన ప్రకటనపత్ర మమెరికా సీమలయం దన్నిట జదువ బడవలసినదిగ నేర్పఱచెను. 1863 వ సంవత్సర ప్రారంభమున నుండి దిరుగు బడిన సీమలయందలి దాసులెల్లరును స్వతంత్ర పౌరుల బలె బరిగణింప బడుదురుగాక. యునైటెడ్ రాష్ట్రపు నధికారు లీ విషయము గుర్తెఱింగి బానిసలు విడుదలనొందుటకై చేయు ప్రయత్నములం దెల్ల దోడ్పదురుగాక. వారి కేలాటి యభ్యంతరములును జేయకుందురు గాక" అను సారాంశములు గలప్రకటన యారాష్ట్రమం దంతయు బ్రజ్వరిల్లెను. ఈ విమోచన ప్రకటనపత్రంబె యమెరికనుల స్వాతంత్ర్య గౌరమున కనూనతార్కాణంబై నేటికిని ఇకముందెప్పటికిని వారి రాజ్యాంగమునకు నుత్తమాలంకరణముగ నొప్పెడిని.

ఈ విమోచనపత్రము వెలువడినతోడనె దక్షిణసీమల వారు పలువిధముల లింకనుకు జంకుపుట్టింపజూచిరి. అయిన ప్రయత్నములెల్ల వృథ యయ్యెను. 1863 వ సంవత్సరము ప్రారంభ మగుటయు విమోచనపత్రము సంపూర్ణముగ జెల్లింపబడియెను.

కొంద ఱుత్తరసీమలవారు దాస్యనిరాసకులుగూడ నీపత్రమునకు గినిసిరి. లింక నొక్క పెట్టున నందఱకు స్వేచ్ఛ గలుగ జేయలే దనియు ననేక నిబంధనల జేర్చెననియు వా రసంతృప్తులైరి. సంయోగము జేరగోరిన దాస్యము వదలుట ముఖ్యమైయుండెను. కావుననే తిరుగుబాటుసీమయేని నిర్ణీతదినమునకు మున్ను సంయోగము జేరెనా ముక్తసీమ దనంతట దాన యగు. దాస్యము వలయుసీమలు తిరుగుబాటుసీమలుగ నుండు. తిరుగుబాటున నుండుటంజేసి వానియందలి దాసులకు నీపత్రపు నధికార ముపయోగింపబడును. ఏవిధమునైన నీగ్రోలు ముక్తి గాంతురనుటను లింకను గ్రహించి యుండెను. కావున నతని మార్గమే కాలోచితముగ నుండె ననుటకు సందియము లేదు.

ఇక లింకను నీగ్రోలకు జూపిన దయానురాగంబులును వా రతనికి గనుపఱచిన గారవప్రేమలును వెల్లడిసేయు విషయముల గొన్నిటిం దెల్పెదము.

సొజర్న డనునొక నీగ్రోస్త్రీ ముదుసలి మిషిగను నుండి గడుదూరము లింకనును జూడ నేతెంచెను. లింకను దన కుర్చీనుండి లేచి మన:పూర్వకంబుగ నాపెకు స్వాగతమిచ్చి "మిము గాంచి మిక్కిలి సంతోషించితి"నని నుదువుచు నాసనంబున గూర్చుండుడని సమ్మానించెను.

"దేశాధ్యక్షా! తాము మొదట నీపదవి నందినతోడనె మిము నసురులు సించివైతు రని నామనము భయం బందెను. అట్లు జరుగకుండ దైవము మిము గాపాడుం గాత మని వేడి, నను నతడు సజీవిగ నుంచిన మీ దర్శనము సేసికొందునని నిర్ణయించితిని. నా యిచ్ఛ దేవు డిప్పటివఱకు నాలుగు సంవత్సరములు నెఱవేర్చి యున్నాడు. నా కోరిక దీర్చుకొనుదము గా కని వచ్చితి" నని యా యబల పల్కెను. "నేటివఱకు మీ కీశ్వరు డాయు వొసంగుటకు నే నెంతయు సంతసించుచున్నాడ" నని లింకను ప్రత్యుత్తర మిచ్చెను.

"మీ గుణంబుల నెంతయు మెచ్చితిని. ఇదివఱకుం గల దేశాధ్యక్షులలో మీర యుత్తములని" యా వృద్ధనారి లింకనునకు దన మనంబు వెల్లడిసేసెను.

"మీజాతి విముక్తిగుఱించి తల పెట్టుచున్నారు గా బోలు" నని దేశాధ్యక్షుడు ప్రతిపల్కెను.

తరువాత నొక యఱగంటకాలము లింక నామెతో సంభాషణ సల్పెను. ఆమె కతడు సూపిన మర్యాదయు స్నేహమును నాపట్టణమందలి స్వేత స్త్రీలలో నుత్తమురాలికైనను జూపియుండ డనిన నతిశయోక్తి గానేరదు.

ఫ్రెడరిక్కు డగ్లసను ముక్తబానిస యొకరుడు వాషింగ్టనున కేతెంచెను. ఆసంగతి విని లింక నతని బసకు దనబండినంపి "వచ్చి నా గృహమున దేనీళ్లు స్వీకరించి పోవలె" నని * వేడెను. డగ్ల సా యాథిత్య మంగీకరించె దేశాధ్యక్షుని గేహమునకు నల్లమానిసి విందారగింప నేతెంచిన దిదియ ప్రథమతరుణము. లింకను దన యతిథి నతిగారవమున ______________________________________________________________

  • మనము భోజనమునకు బిలిచి గౌరవించు తెఱంగున నిది పాశ్చాత్యులలో నొక గౌరవసూచక సాంప్రదాయము. జూచుచు నతని లోకువను స్మరింపజేయ నెడమియ్యకుండెనని డగ్లసు నుడివియున్నాడు.

ఒకనాడు వాషింగ్టను పౌరు డొకడు దేశాధ్యక్షుని కార్యస్థానముం జేరి యత డాదేశపు నోట్ల గొన్నిటి లెక్కపెట్టుచుంట గాంచెను. లింక నాతనిం గాంచి "ఈ పని నాదేశాధ్యక్షతకు సంబంధించిన సాధారణపు గార్యములలోనిది గాదు. రాజాంగపు జట్టదిట్టములచే విధింపబడని పను లనేకములు దేశాధ్యక్షుడు సేయవలసి యుండు" ననియెను.

ఆ పెద్దమనుష్యు డుచితవిధి నంగీకారము సూచించి యా కార్యమున నెట్టి విశేషముగలదో యెఱుగ నిచ్ఛ గాన్పింపజేసెను.

"ఈ ద్రవ్యము కోశప్రకరణమునకు జేరిన యొక పేదనీగ్రో ద్వారపాలకునిది. అత డిప్పుడు మశూచికముచే మిక్కిలి వంతలందుచు వైద్యశాలయం దున్నాడు. చేవ్రాలు సేయ నశక్తు డగుట నతడు జీతము గొన ననర్హు డయ్యెను. కావుననే నాయిక్కట్టుం దీర్ప మిక్కిలి శ్రమపడి తుట్టతుదకు బారిభాషిక గష్టముల దరింప నతని వేతనముం గొనగంటిని. ప్రస్తుతము దాని నాతని యిచ్చచొప్పున బంచిపెట్టు చున్నాను. అం దొక్కభాగమును నాచేతన నొక సంచియందుంచి పైన పేరువ్రాసి దాచవలె నని యాతని కోరిక యై యున్నది. దానిప్రకారమ యొనర్చుచున్నాన"ని దయామయత్వంబున నీ మహనీయుడు దన పదవి కార్యముల నుపేక్షింపరాని వాని వదలి రోగపీడితు డై దు:ఖమున మున్గిన హీనమానవునికి సాయ మొనర్చి యోదార్ప సమకట్టి యుండుట వెల్లడి పఱచెను.

"తిరుగుబాటు" పరిపాలకులు నీగ్రోయుద్ధభటులు చేజిక్కినచో దయ యనుమాటయే తల పెట్టక వారిని నాసుర ప్రవర్తనంబుచే నలయించి పొలియించుచుండిరి. ఆ ఘోర వృత్తాంతము దన చెవి బడినతోడనె లింకను నీగ్రో సైనికుల సంరక్షణార్థమై యీక్రింది యుత్తరువు ప్రకటించెను.

"దేశమందలి ప్రజలకెల్లరకును జాతిమతాది భేదము లెంచక సంరక్షణ యొసంగుట ప్రతి ప్రభుత్వమువారికిని ధర్మమయి యున్నది. అందునను సైనికులుగ గ్రహింపబడినవారికి శరణ మొసంగుట ముఖ్యతమము. రాష్ట్రముల చట్టము ననుసరించియు సభ్యజాతుల యుద్ధ నిర్వహణ కార్యముల యనాది మర్యాదలం బట్టియు బట్టువడిన పరజాతి బందాల నాదరించుటయందు దెల్లవారు నల్లవారను తారతమ్య మెంచగూడ దనుట విదితము. చిక్కిన యేమనుజుని నైనను నీగ్రో యనికాని యకారణముగ గాని బానిసగ నమ్ముట యమానుషంబును నిప్పటి నాగరిక జనుల కొక పెద్ద యప రాధమును నగు. యునైటెడ్‌స్టేట్సు సంయుక్త ప్రభుత్వమువారు దమ సైనికుల కందఱ కొకవిధమగు సంరక్షణయె యొసంగు చున్నారు. ఇందుకు వ్యతిరేకించి మాశత్రువు లేరినైన రంగు పాపమున దాస్యమున కమ్మిన దానికి దగిన ప్రతికృతి మావశమున నుండు వారి సైనికుల కొనర్తుమనుట గ్రహింపవలసినది. కావున యుద్ధపుచట్టములకు వ్యతిరిక్తముగ మాసైనికు డొకడు చంపబడిన నెదురుసైనికుడొకడు మాచే హతు డగుననుట యెఱుంగునది; మాసైనికుడొకడు దాస్యమున కమ్మబడిన బరసైనికుడు మఱియొకడు మాదేశమునందలి జనోపయోగ కార్యములకు నేమింపబడి మావాడు విడుదల చెందువఱకు గష్టతమవృత్తి నుంచబడు ననుటయు దెలియునది.

ఆబ్రహాములింకను."

లింక నెపుడును గష్టతమంబగు ప్రతికృతి గావింప నొల్లడు. పట్టువడిన సైనికుల బస్తువెట్టి చంపు టతనికి స్వభావ విరుద్ధము. కాని శత్రువులవల్ల జరుగు నాసుర కర్మల గడ తేర్ప మఱొం డుపాయము లేమి లింకను ప్రాణమునకు బ్రాణము గొన సిద్ధపడియెను.

ఒక బానిసవ్యాపారికి నైదుసంవత్సరములు గారాగృహనివాసమును నొక వేయిడాలరుల యపరాధమును విధింప బడియెను. ఆతడు కారాగృహవాసము పూర్తిగ సలిపియుం డెను. అపరాధ మియ్యలేనందున నాతని నట్టె పట్టియుంచిరి. కావున నతనిపరముగ గొంగఱు లింకనుం డాసి యతని మన్నించి విడుదలసేయుమని వేడుచు నతనినుండి గుండె గఱిగించుబత్రము నొక్కదానిని దెచ్చిరి. ఆజాలి వుట్టించు జాబు చదివి లింకను "ఈలేఖ నాభావముల నాకర్షించుచున్నయది. శరణుసొచ్చి దయకు బాత్రులమని విన్నవించువారల కేను లోబడుట నాలోపమని యెఱుగుదు. ఈయపరాధి మనుష్యు డెప్పుడు సేయనట్టి క్రూరహత్య చేసియుండినను నీమొ ఱాలకించి విడుతును. అయిన నితడు నాలుగు డాలర్ల కాశించి దక్షిణాఫ్రికా కదేపనిగ వెడలి యాదేశపు గన్నులుదెఱవని కూనల దొంగిలించి వారినెల్ల నంత్యములేని వరవుడమున కమ్మ సాహసించిన మహాహతకుడు; గారాగృహంబున గుళ్లి ప్రాణములు విడిచిన విడుచునుగాక, నాక్షమాపణ నెన్నటికి నందజాల డనుట నిత్యము నిస్సంశయము నిర్ధారితము." అనెను.

యుద్ధము సంపూర్తి యయినతరువాత లింకను నీగ్రోలకు దెల్ల వారలతో సమానముగ రాజ్యాంగ విషయముల సమ్మతు లిచ్చు నధికార మిచ్చుటకు దీర్మానించె ననుటయు వారియెడ నతనికి గల యాదరణ దెల్లమగుచున్నది.

లింకనున కొకతఱి గొప్ప స్వాగతమీబడెను. తెల్లవారంద ఱతని దర్శించి చనినపిదప నీగ్రో లొకరితరువాత నొకరు లింకనును భయమున డాయుచుండిరి. అత డదిగుర్తెఱిగి చిఱునగవుతో వారిం జేరి చేయిచ్చెను. అంత వారిహర్షంబునకు మితిలేకపోయె. కొందఱు వెఱ్ఱిగ నవ్వసాగిరి. మఱి కొంద ఱేడ్వసాగిరి. అనేకులు గొంత నవ్వుచు గొంత యేడ్చు చుండిరి. అందఱును "తండ్రీ లింకను! దేవుడు నీన్నెప్పుడు గాపాడుగాత. నీ కెప్పుడు సుఖంబు లొడగూర్చుగాత" మని పలువిధముల దీవింప దొడగిరి.

ఇట్లు లింకనునకు నీగ్రోలు గనుపఱచిన గౌరవ మంతింత యని వర్ణింపనేరము. వర్ణించుటయు ననవసరము. అనేకులతని జూచిన సంతోష మను మహాసముద్రమున మునిగి యొడలెఱుగక హర్షాశ్రువులు రాల్చుచుందురు. కొంద ఱాతని దీవించుటయంద తమకాలమెల్ల బుత్తురు. అందఱును నతని దమ విమోచనకారు డని దైవముం బోలె దమతమ యిండ్ల బూజించుచుందురు.

లోకమున బూర్వపద్ధతులెల్ల నశించి బూర్వపు రాజ్యములెల్ల దారుమారై, ప్రజాపరిపాలనంబె న్యాయపరిపాలనంబని నెగడి, సర్వజనులు స్వాతంత్ర్య రాజ్యముల సుఖంబు డునప్పటికి గూడ నమెరికాయందలి యే మార్పులు దృష్టిపథంబు నుండి దొలగిపోయినను, లింకను దేశాధ్యక్షతయందలి యే యుద్ధము లేకార్యము లేసంస్కరణములు మనుష్యుల మన ములనుండి సెలవు గైకొనినను నతడు చేసిన దాస్యవిమోచనమును దాసులకై యత దోనర్చిన మేలును లోకమెప్పటికిని మఱవకుండు ననుటకు సందేహము లదు.

ఇరువదియవ ప్రకరణము

ద్వితీయ నిర్వచనము, యుద్ధసమాప్తి.

లింకను దేశాధ్యక్షత వహించి నాలుగుసంవత్సరములు గావచ్చెను. ఆ పదవికి మరల నతనినే యనేకులు పేర్కొనుచువచ్చిరి. కొందఱు పౌరు లడ్డువలుక జూచిరిగాని వారిమొఱ్ఱ లరణ్యరోదనము లయ్యె. బాల్టిమోరునందు దేశీయ మహాసభ జరుగుటయు లింకనె తమపాలకు డౌ గాతమను నిత్సుకుల సంఖ్య వీచికలపై వీచికలువోలె బొరలి ప్రతికూల శేషమునట్టె నెట్టి దట్టమగు నోటుగుట్టతిట్టల బట్టించె. యుద్ధరంగమునుండి లింకననుంగులు దమ యయ్య నెయ్యంబున మరల దేశాధ్యక్షుడై తమ్మధ్యక్షింపివలసిన దని తెల్లముగ వెల్లడించిరి. కాన దేశీయ మహాసభలయం దొక్కసీమవారు దక్క దక్కినవారెల్ల నొక్కపట్టున దమ సమ్మతుల లింకనున కచ్చుపడ నిచ్చుటయు నవ్వారును నివ్వెఱం దమ సమ్మతుల నతనికె క్రమ్మఱించిరి. ఇవ్విధమున నతడాసభవా రందఱచే బేర్కొనబడియెను.