ఆబ్రహాము లింకను చరిత్ర/పదమూడవ ప్రకరణము
ఆపుట్టు కొన్ని యందరాని మ్రానిపండ్ల కఱ్ఱులుసాచి నష్టముల పాలయ్యెను. తిరుగలి యంత్రపు వ్యాపారమున నతనికంత సొమ్ము దొరకదాయెను. ఇతరవ్యాపారములగూడ నతని సంచి యుత్తదగుచు వచ్చెను. లక్ష్మీకటాక్షము లతనిపై బ్రసరించుట రానురాను దగ్గుచువచ్చెను. దినదిన మతని కష్టము లినుమడింప దొడగె. తుట్టతుద కతని వ్యాపారశక్తియే యడంగిపోయెను. అంగడి మూసివేయవలసి వచ్చెను. తిరుగలి యంత్రము నిలుపవలసి వచ్చెను. లింకనును దీసివేయవలసి వచ్చెను.
పదమూడవ ప్రకరణము
యుద్ధమునకు బోవుట.
న్యూసేలమున మల్లయుద్ధమున నపజయమంది లింకను స్నేహమునకు బాత్రుడై వర్తించుచు వచ్చిన జాకును అతని మిత్రులును లింకను నాధిపత్యముక్రింద యుద్ధమునకు దరలుట ప్రాప్తించెను.
బ్లాక్ హాకను నొక "ఎఱ్ఱ ఇందియను" మహాఘోరముగ దెల్లవారితో బోరుచుండెను. వాని నెదుర్చుటకు దండు నాయత్తపఱచుటకై గ్రామగ్రామమునకు వార్త లంపబడెను. జనులంద ఱావిషయమున మిక్కిలి యుత్సుకు లై యుండుట చేత బ్రతి పల్లియయందును నొక పటాలము చేరుచుండెను. న్యూసేలములో బలవంతు లగువార లనేకు లుందురని యది వఱకే నుడువబడియెను. వారి దుర్మార్గముల బాపి సన్మార్గమున బ్రవర్తింపజేసిన లింకను దన బలౌన్నత్యముచె వారి కందఱకు నాయకుడు గాదగి యుండెను. వారివారి శౌర్యధైర్యముల జూపి దేశము గాపాడికొన సమయ మిదెయని లింకను ప్రోత్సాహమున నచట నొక పటాలము సిద్ధమాయెను. నాయక నియామకముమాత్ర మచట జరగలేదు. అయిన నీవిషయమున గొప్పచర్చ ప్రారంభమాయెను. ఫిట్జుపాట్రిక్కను మఱియొక డాబ్రాహముతో నాయకత్వమునకు బెనగుచుండెను. జనరంజకత్వము గలవాడే యైనను ఆబ్రహాము నెదుట నిలువలేకపోయెను. నిర్ణీతస్థానమున నా యుద్ధభటులు నాయకుని గోరుకొన సెలవొసంగ బడిరి.
లింక నొకప్రక్కన పాట్రిక్కతనికెదురుగ నిలుచుండిరి. యుద్ధభటులలో బ్రతివాడును దా గోరుకొను నాయకుని జేరి నిలువవలసినదని యుత్తరువు సేసిరి. వెంటనె ముప్పాతిక మంది లింకను జేరిరి. గొప్పసంఖ్య లింకనుప్రక్క కుఱుకుట జూచి తక్కినవారు దామును అతనియండకు మఱలిరి. పాట్రి --------------- అతని జూచిన జాలి వేయుచుండె నని కొందఱు పరిహసించిరి. మఱికొందఱు లింకనకు వ్యతిరిక్తముగ నిలచుట కితనికి బుద్ధిమాంద్యము గాదా యని పలికిరి.
ఇట్లు సమ్మతులవలన నాయకుడుగ నేమింపబడిన లింక నుపన్యాస మియ్యవలసినదని యతని శిష్యులు వేడిరి. దానికి బ్రత్యుత్తరముగ దనకు వారు చూపిన గారవమునకు వారికి వందనము లాచరింపుచు నమ్రతతో దనశక్తికొలదిదా దనధర్మముల దీర్ప నుద్యుక్తు డై యున్నవాడ నని నుడివెను.
ఈ పటాలము బహుకాలము నిలువలేదు. ఈ యుద్ధ భటులును విశేష కార్య మొక్కటియు జేయలేదు. ముప్పది దినములు వీరు పనిసేయవలసినదిగ నేమింపబడి యుండెను. ఆ స్వల్పకాలమున జరగిన సంగతులలో నొకటి విస్తరింపదగినది.
ఒకనాడు 'ఎఱ్ఱ యిందియ' ను డొకడు వడవడంకు ముదుసలి యీ దండు విడిది ప్రవేశించి తా వారి మైత్రి గోరి వచ్చినవాడ నని నుడువుచు శరణ మడిగెను.
"మే మిందియనుల బరిమార్ప వచ్చితి"మని యొక డఱచెను.
"నీకు దయగాదు; సీసపుగుండే గతి యగు న"ని మఱి యొకడు గద్దించె.
"చంపుడు, చంప డ"ని యనేకులు కేక లిడిరి. "పరపక్షపు వేగులవాడు, వేగులవా డ"ని యితరులు గర్జించిరి.
ఈ రావములచే దిగ్భ్రమజెంది యావృద్ధుడు దనచేత నున్న యొక కాగితపు ముక్క దిగ విడచి చదువుకొను డనెను. నాయకమణి లింక నది చదివి సేనా నాయకుడు క్యా సిచ్చిన యోగ్యతా పత్రిక యగుట దెలియ జేసెను.
"సృష్టింపబడిన యసత్యపులేఖ"యను నఱపులు దట్టమాయె.
"ఇట్టి మాయలు మము గలంచునే" యని కోపమున బలుకుచు బిల్లి తుపాకి నెత్తి ముసలివాని గాలువ జంకించెను.
వా రెల్లరు 'ఇందియను' జీవము గొన బట్టువట్టిరి. అందఱు గుమిగూడి వానిపై బడ బోవుచుండిరి. అపుడు దటాలున లింకను వారిముందఱికి దుమికి తన దేహముచే నిందియనును గప్పి "సేనాధ్యక్షుని యుత్తరు వాలించి తీరవలయును. వాని మీరు దాక గూడదు. నిలుం డని" యాగ్రహమున వారింప జూచెను.
అందులో నొక దుర్మార్గుడు "మే మిదె వాని యుసుఱుల దీయ నిశ్చయించితి" మనెను.
లింకను గనలి భీకరాకారమున నిలచి వారిం దృణీకరించుచు "నను గాల్చినం గాని వాని జేరలే"రని మహారావమున ననియెను. పట్టుదలతో నేకాగ్రచిత్తమున దన మాట నడప నుపక్రమించిన యతని భయదాకృతికి వెఱచి వారెల్లరు సూటివెట్టిన గుండు బాఱనీక మఱలిపోయిరి. కొందఱు గొణగొణ యను కొనుచుండిరి. ఒకడు మాత్రము లింకనునకు "ఇది నీ పిఱికి తనమునకు దార్కాణ" మనెను.
త్రొక్కుడు వడిన భుజంగపతిలీల విజృంభించి లింకను "నే బిఱికి ననువాడవు నాతో బెనగి తెలిసికొందువుగాక. రమ్మ"ని కదనమునకు జేరెను.
అం దొకడు "నీవు మా యందఱకంటె దళమగు వాడవే" యనియెను.
భయ లేశమును దోపని ముఖకాంతితో "మీ యిష్టమునకు వచ్చిన యాయుధముల గొని పోరు డ" ని ప్రత్యుత్తర మొసగెను.
వా రిది విని భయకంపితు లయి మాఱు మాటాడక 'ఇందియను' నకు వే లైన జూపనోడి యూరకుండిరి. ఆమీద నెప్పుడును లింకనునకు బిఱికితన మారోపింప జూచిన వారు లేరు.
ఈ విషయమున లింకను ప్రాణము లపాయస్థితియం దుండెను. తన యుద్ధభటుల కూరకుండు డని యుత్తరువు సేసి యుండిన దిరుగబడి యుందురు. వారిని దండించుట యనిన దుస్సాధ్యము. పౌరుల నొక కట్టుగ జేర్చినందునను వారికి యుద్ధభటత్వమును సంప్రాప్త మయి యుండినందునను వారు లాభనష్టముల నెఱుంగునంతటి స్థితిలో నుండరైరి. వారి నిర్ణీతకాలమును నంతమందుచుండెను. కావున వారినేరములు పైవారికి దెలియ జేయుట దన గార్యనిర్వాహశక్తి కే లోపముగ గన్పట్టు. అందువలన నతడు దన స్వశక్తి స్థైర్యంబుల జూపుటయె యతని గాపాడెను.
ఈ పటాలము ముప్పదిదినము లైనతోడనే విడదీయ బడెను. ఎవరింటికి వారు వెడలిరి.. అయిన లింకను మఱిరెండు పటాలముల నుద్యోగముల గొనెను గాని యెచ్చటను అతడు దన యోధశక్తి జూపినదిలేదు. ఈ విషయమునుగుఱించి లింకను మిక్కిలి చమత్కారముగ బలికియున్నాడు. దేశాధ్యక్షత కతడును జనరల్ క్యాసును బ్రయత్నించుచుండిరి. క్యాసు పక్షపువా రత డీయుద్ధమున మిక్కిలి పాటుపడెనని యొక్కవిధమున జాటుచుండిరి. దానినిగుఱించి దేశీయ మహాసభలో ముచ్చటించుచు లింక నీవిధముగ నుడివి యున్నాదు.
అయ్యలారా నేను వీరాగ్రేసరు డైనది మీ రెఱుగరా? వినుడి నేనగుదు. బ్లాక్‌హాక్ యుద్ధమపుడు నే సమర మొనర్చి నా రక్తము గొంత యర్పించి యిలువచ్చి చేరితిని. జనరల్ క్యాసి గారి కార్యముల జర్చించునెడ నా కార్యము లును స్మరణకు వచ్చుచున్నవి. 'హల్లు' గారు పట్టువడిన స్థలమునకు సమీపమున 'క్యాసు' గా రుండిరట. అదేరీతి నేనును స్టిల్లుమన్ పరాజితు డయినచోట లేకున్నను అతనికి సమీపముననె యుంటిని. కార్యమైనతరువాత నేనును అతనివలె గార్యరంగమును బొడగాంచితిని. నావద్దఖడ్గము లేనందున నది విఱిగిపొవునంతటి దెబ్బ తిననైతిని;అయినను నా తుపాకి వంకర పోవునంతటి తరుణ మొక్కటిమాత్రము సంప్రాప్త మాయెను.
"జనరల్ క్యాసుగారు నాకంటె ముందు గెనుసుగడ్డల నెదుర్చుచు నేగినది వాస్తపమే; అయిన నుల్లిగడ్డల బోరునందునే నతని మించితిని. అత డిందియనుల యుద్ధభటుల గాంచుట నాకంటె నెక్కుడు పనిసేయుటయ; అయిన నాపెంపు మఱొండు గలదు. నే నెన్నియో దోమలతో నుగ్రసంగ్రామ మొనర్చినాడను; నే నెప్పుడును రక్తనష్టమున సోలలేదు గాని పలుమా రాకలికి బడలినాడను. నే ని కిప్పుడైన డేమొ క్రాటిక్ పక్షము (అప్పటికి క్యాసుపక్షము) చేరి దేశాధ్యక్షతకు నిలిచినను నిట్టి యుద్ధవీరుడుగ మాత్రము నాపక్షపువారు వర్ణించి నా హక్కు స్థిరపఱుప జూడ కుందురుగాత."
ఈ యుద్ధమునకు వెడలుటకుముం దొకసంగతి జరిగెను. దాని గమనింపవలెను. న్యూసేలమున గ్రీనునకును మఱియొకనికిని ఆబ్రహాము బలమును గుఱించి వివాద మాయెను. గ్రీను "లింకను సారా పీపా నెత్తి దానిలోని రంధ్రమునుండి జారు ద్రావకము నాస్థితియంద త్రాగు" ననెను. వివాదకు లిరువురు పందెములు వైచికొని లింకను దగ్గరకు వచ్చిరి. లింకను దన మిత్రుమాట సెల్లింప నతడు సెప్పినట్లు లఘువుగ బీపాయినెత్తి ద్రావకము నోట బోసికొనెను. గ్రీను పరపక్షపు టతనికి 'జూచితివే' యని సంతసింపుచుజూపి, లింకను జూచి "నీవు త్రాగువాడవు గావే" యనుచుండ నోటనుండిన హాలారసమును నేల నుమిసి "నే నెప్పటికిని ద్రాగను, ఇప్పుడును ద్రాగలేదు. నీమాట నడపుట కింతమాత్రమునకైన నియ్య కొంటి" నని నుడువుచు బీపాయి గ్రింద దింపెను. ఆ మూడవవా డట్టి యాశ్చర్య మెన్నడును జూడలే దని వెఱగుపడి చూచుచుండెను.
చదువరులారా! మనము ముఖ్యముగ గమనింపవలసినది యాబ్రహాము మనస్థైర్యము, దుష్టవస్తువును దూరముగ నుంచు దిట్టతనము. సురాపానము నత డెంత నిరసించినదియు గల గరే. ఇంతటితో నతడు నిలువలేదు. సాయంకాలమున గ్రీను నేకాంత స్థలమునకు బిలిచి పందెములు వేసికొనుట జూదముతో సమానమని చీకొట్టి యా దురభ్యాసము నికముందు వదలివేయుమని బోధించెను. లింకనుపన్యసించిన విని ------------ యపరాధము ------------పని యెన్నటికిని జేయనని వాగ్దానము సేసి బ్రతికి నంతకాల మది మఱవకుండెను.
పదునాల్గవ ప్రకరణము
అయాచిత గౌరవప్రాప్తి.
బ్లాక్‌హాకు యుద్ధమునకు దరువాత నాబ్రహాము న్యూసేలమునకు దిరిగివచ్చెను. ఉద్యోగ మేమైన దొరకిన బాగుండునని యోచించుచు గమ్మరిపనిపై దృష్టి సారించెను. ఆవిషయమును గొందఱు మిత్రులు గమనించి యతని జట్ట నిర్మాణసభకు బంప నిశ్చయించితిమని చెప్పిరి. అత డందుల కంగీకరించుట గడుదుర్లభ మాయెను. తనకంటె విద్యావంతులును, ధనవంతులును, అనుభవశాలులును అనేకు లుండ దా నెట్లాపదమునకు బెనగ గలననియు దన కావిషయమున నేలాటి కోరికలు లేవనియు బలుక దొడగెను. ఆ పట్టణములోని గొప్పవారందఱు నతని బ్రతినిధిగ నుండుమని యడుగుట కేతెంచిరి. స్నేహితులు దను విశేషము ప్రార్థించుట జేసి యాబ్రహాము తుట్టతుద కియ్యకొనియెను. అతడు తన నియామకులకు నొడివినమాటల వినుడి:
"ఆర్యులార! స్వదేశసోదరులారా! నే నెవ రైనది మీ రెఱుగుదురని తలచెద. నేను బీద ఆబ్రహాము లింకనును