ఆబ్రహాము లింకను చరిత్ర/పదునాల్గవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పని యెన్నటికిని జేయనని వాగ్దానము సేసి బ్రతికి నంతకాల మది మఱవకుండెను.

పదునాల్గవ ప్రకరణము

అయాచిత గౌరవప్రాప్తి.

బ్లాక్‌హాకు యుద్ధమునకు దరువాత నాబ్రహాము న్యూసేలమునకు దిరిగివచ్చెను. ఉద్యోగ మేమైన దొరకిన బాగుండునని యోచించుచు గమ్మరిపనిపై దృష్టి సారించెను. ఆవిషయమును గొందఱు మిత్రులు గమనించి యతని జట్ట నిర్మాణసభకు బంప నిశ్చయించితిమని చెప్పిరి. అత డందుల కంగీకరించుట గడుదుర్లభ మాయెను. తనకంటె విద్యావంతులును, ధనవంతులును, అనుభవశాలులును అనేకు లుండ దా నెట్లాపదమునకు బెనగ గలననియు దన కావిషయమున నేలాటి కోరికలు లేవనియు బలుక దొడగెను. ఆ పట్టణములోని గొప్పవారందఱు నతని బ్రతినిధిగ నుండుమని యడుగుట కేతెంచిరి. స్నేహితులు దను విశేషము ప్రార్థించుట జేసి యాబ్రహాము తుట్టతుద కియ్యకొనియెను. అతడు తన నియామకులకు నొడివినమాటల వినుడి:

"ఆర్యులార! స్వదేశసోదరులారా! నే నెవ రైనది మీ రెఱుగుదురని తలచెద. నేను బీద ఆబ్రహాము లింకనును చట్టనిర్మాణసభకు బ్రతినిధిగ నియమింపబడ నిలువుమని నన్ను స్నేహితు లనేకులు నిర్బంధపఱచిరి. నా రాజకీయవిషయి కాభిప్రాయములు తక్కువ యై యింపైనవి. జాతీయనిధి యొకటి యుండవలె ననియు, స్వదేశములోపలిపనుల వృద్ధిసేయవలె ననియు, గొప్పసంరక్షణ సుంకముల వేయవలె ననియు గట్టిగ నమ్మువాడను. నా రాజకీయవిషయిక యభిప్రాయములును, న్యాయములు నివి. మీరు నన్ను బ్రతినిధిగా నేర్పఱచిన గృతజ్ఞుడనై యుండెద; నేర్పఱచ కున్నను నా కొక్కటియ."

ఇంతటి చిన్న యుపన్యాసమునకు గారణ మతని నిగర్వ మనియే నుడువ నగును. ఈవిషయ మతని నిర్వాచకు లనగా సమ్మతు లిచ్చువారు గమనింపకుండలేదు. అతడు నియమింప బడకపోయినను విజయమందిన యుద్యోగార్థి కితడు రెండవ వా డాయెను. ఇతనికి వచ్చిన సమ్మతుల సంఖ్యయు నతనికి వచ్చిన వానికంటె గొన్నిమాత్రము దక్కువగా నుండెను. ఆబ్రహాము నెడ నితరులకు గల గౌరవము న్యూసేలములలోని 284 సమ్మతులలో 2.7 సమ్మతు లతడు సంపాదించె ననివని దెల్లము గాగలదు.

ఆబ్రహాము కెదురుపక్షమువా రతని యాకారవేషముల జూచి పరిహసింపుచుందురు. అట్లు పరిహసించుటకు గొన్ని కారణములుగూడ గలవు. అతనివిగ్రహమే యంతసుందర మైనది గాదు. మఱియతని యుడుపులును నవ్వుపుట్టించునవిగ నుండెను. అయిన నతని జూచి యతనిమాటల వినిన వారందఱు నిట్టి యభిప్రాయ మెప్పుడును మనముల జొరనీరైరి. అతని స్వరూపమును, వస్త్రములును నతని నమ్రతకు సాక్షులని కొనియాడుచుందురు.

పతినిధి యుద్యోగపు బనుల జయము గాంచకున్నను నాబ్రహాము మిక్కిలి ప్రసిద్ధిమాత్రము వడసెదు. ముందు సమయము వచ్చినపుడు జయము గలుగు ననుట స్పష్టమాయెను.

ఈ పరిశ్రమ దీరినపిదప నాబ్రహాముబొక్కసమున నొక్క కాసైన లేకుండెను. న్యూసేలమున నతని కనేకులు స్నేహితు లుండిరి. గ్రీ నతని న్యాయపరీక్షకు జదువుమని కోరెను. అతడు దనకు యోగ్యత చాలదనియు, నావృత్తి యం దనృత మాడవలసి వచ్చుననియు, దా నాకార్యమును జేయ నెన్నటికిని సమ్మతింప ననియు, బలువిధముల నాస్నేహితునికి బదులుచెప్పుచువచ్చెను.

న్యాయవాదిగ నుండుటకు లింకనున కిష్టము లేకుండెను. ఆ వృత్తికి వలయు శక్తి దనకు జాలదని యతడు జంకుచుండును. గొప్పవారల కెంతటి నమ్రతయో గనుడి. తన్ను బోలె పెంచబడిన చిన్నవా డే ప్రకార మా వృత్తియం దడుగువెట్టునని యతనికి సందేహము. అయిన దన కొక్క జీవనాధార వ్యాపారము లేక యటునిటు తిరుగుచుంట నతడు సహింపలేకుండెను. పసితనముననే యేదో యొక వృత్తి నిశ్చయించుకొని విడువక పాటుపడ కున్న మనుజుడు వాంఛాసిద్ధి వొందలేడని తర్కించి తా నట్లు చేయు మార్గ మరయు. అరసి కానలేక బహువెతల దగులు. తా నెద్దానికి బనికి రా డని తలంచెనో దానిన దన స్నేహితులు ప్రయత్నింపు మనుచుండు టతని కింక నెక్కుడు వ్యసనకారి యాయెను. తన శక్తిని దాను గొద్దిగ దలంచుకొని యితరులు తన కెక్కుడుశక్తి నారోపించిరని వగచు. ఇది యతనియం దొకలోపమే యైనను మిక్కిలి మంచిలోపము. ఈవిధముగ లోపముగల పసివారి సంఖ్య చాల తక్కువ. తమ శక్తి సామర్థ్యములు ముల్లోకముల మించునని భ్రమసి తప్పుదారుల బట్టువా రనేకులు గలరు. కొందఱు పనికిమాలిన వెడగులు లోకము దమకు లోకువ యనుకొనుచుందురు.

ఆ.వె. అల్పు డెపుడు పల్కు నాడంబరముగాను
     సజ్జనుండు పల్కు జల్లగాను
     గంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
     విశ్వదాభిరామ వినరవేమ."

అనిన విధమున గొప్పతనమునకు నిగర్వమే యానవాలు గదా? కావుననే లింక నితరుల దృష్టికి దా గనుపడినంత శక్తిసామర్థ్యములు గలవాడుగ దనకంటి కగుపడ కుండెను.

కమ్మరి యగుట మాని యాబ్రహాము వ్యాపారి యాయెను. బెఱ్ఱియను వానితో జేరి యొక యంగడి నడపసాగెను. అయిన బెఱ్ఱి జ్ఞానహీనుడై త్రాగుబోతుతనమున నప్పుల కుప్పయై నష్టముల దెచ్చిపెట్టి దివాలా యెత్తెను. అతని దివాలతో నంగడి ముగిసి పోయెను. గొప్ప యప్పుమాత్రము నిలిచెను. గ్రీనువద్ద గొంతధనము పుచ్చుకొని యాబ్రహా మాయప్పును దీర్చివేసెను. తా న్యాయవాది యైన తరువాత గ్రీనుకు గడపటి కాసుతో జెల్లించెను.

దుకాణ మదృశ్య మగుడు నుద్యోగహీనత్వ మాబ్రహామున కాసన్నమాయెను. పనిలేనికాలమున నత డనేక గ్రంథముల బఠించెను. అందు 'పూర్వకాలపు జరిత్రము,' 'రోమక రాజ్యప్రవృద్ధినాశములు' మొదలగునవి సర్వోత్తమములు. అతడు చదివిన విషయముల నన్నిటిని సంగ్రహముగ వ్రాసియుంచుకొనును. తరువాత వానిని సులభముగ శిరోపేటిక జేర్చుచుండును. అతనికి జిక్కులు విడదీసి యుదాహరణ బాహుళ్యము సూపి మనోరంజకముగ నుపన్యసించు శక్తి నొసంగిన దిదియ గాబోలును. కొంతకాలమునకు దరువాత హటాత్తుగ నొకనా డతడు జాన్ కాట్‌హానను భూములు కొలుచువానిని (సరవేయరును) గలసెను. అత డాబ్రహామును గొల్తపనికి (సరవేపనికి) బూనుమని ప్రోత్సాహపఱచెను. కొంత యోచించి యాబ్రహా మతనిదగ్గర నాఱువారములలో బనినంతయు నేర్చుకొనెను. అతడు సేయగల్గినంతపనియు దాని కనుగుణమగు జీతమును రా బ్రారంభించెను. ఆపనియం దతడు సంపాదించిన బ్రావీణ్యమున నెట్టివివాదములు వచ్చిన నతనిని మధ్యస్థిగ బిలుచు చుందురు. ఎచ్చట నున్నను సింగపుబుడుత సింగపుబుడుతయే గదా.

తనకు దీఱికయున్నపుడంతయు నాబ్రహా మితరుల కుపకార మొనరించుచుండును. దురదృష్టము పాలబడిన వారికిని. కష్టముల గుడుచువారికి, బీదసాదలకును నతడు సాయ మొసంగ బ్రయత్నించుట రానురాను వృద్ధిపొందుచు వచ్చెను.

చలి దట్టముగ గ్రమ్మినకాలమున నొకనా డాబ్‌ట్రెం ఱనువాడు హిల్లనునతనికై పాడుపడిన యొకకొయ్యయింటిని గట్టెల నిమిత్తము గొట్టి యిచ్చుచుండెను. ట్రెంటు పాదరక్షలు లేక చలిలో గడగడ వడకుచుండెను.

దాని జూచి 'ఈపనికి నీ కేమికూలి' యని యాబ్రహా అడిగెను. "ఒక్క డాలరు పాదరక్షలకై పాటుపడుచున్నా"నని ప్రత్యుత్తర మిచ్చుచు జలిచే రాయిగట్టిన పాదముల జూపెను.

అంత నాబ్రహాము "ఆ గొడ్డలి నిటందిమ్ము. వెచ్చగ నుండుచోటికి బోయి చలికాచుకొని రమ్మ"ని వాని బంపివేసి త్వరితగతి నా యింటినంతయు క్షణములో గొట్టిపెట్టెను. ఆ యింటి యజమానుడును ట్రెంటును ఈతని శక్తి కాశ్చర్యముం బొందిరి.

ఇక నిట్టివిషయము లెన్నియైన జెప్పవచ్చును. అయిన గ్రంథవిస్తరభీతిచే జెప్పనొల్ల.

1833 వ సంవత్సర మాబ్రహాము న్యూసేలము పోస్టు మాస్టరుగ నియమింపబడెను.. ఆ పట్టణమున నతనికంటె నెక్కుడు తగినవారు గానరానందున నతనికే యాపని నిచ్చిరి. అచ్చటను నతడు దన సౌజన్యము గనుపఱచెను. చదువు రానివారలకెల్ల నుత్తరముల జదివిచెప్పుటయు, ననేకులను సభగ జేర్చి వారికి వార్తాపత్రికల బిగ్గరగ జదివి వినిపించుటయు నతనికి మిక్కిలి సహజములాయెను. అతడు వచ్చిన యుత్తరముల దనటోపిలో నుంచుకొని తా బయలు వెడలునప్పుడు పంచి పెట్టుచుండెననికూడ గొందఱు చెప్పుచున్నారు.

చట్టనిర్మాణ సభయందు బ్రతినిధులు రెండుసంవత్సరముల కొకమాఱు నియమింప బడు చుందురు. కావున 1834 వ సంవత్సరము 1376 సమ్మతులవలన ననగా నిందఱు జనుల కోరిక ననుసరించి యాబ్రహాము సంపూర్ణగౌరవమున బ్రతినిధిగ బేర్కొన బడియెను. నిర్వాచకులకు ననగా సమ్మతి నిచ్చువారికి నాకాలమున సారాయితో బండుగలు సేయుట యాచారమైనను నాబ్రహా మట్టిపని దలంచినవాడుగూడ గాడు.

ప్రతినిధిగ బేర్కొనబడి సభకు బోవుటకు దగు నుడుపులు లేనివాడగుట నొక స్నేహితునివద్ద కొంతధన మప్పు పుచ్చుకొని తగువేషము ధరించెను. సభయం దతడు దన నియామకుల విషయముల నెల్ల జక్కగ జర్చించుటకు దత్పూర్వమే మిక్కిలి శ్రద్ధజేసి వానిని సంపూర్ణముగ నరసి తెలిసికొనెను. సభయం దతిశయముగ మాటలాడకున్నను గొప్ప యల్లకల్లోలములు జరుగు సమయముల వాని నాపుటయం దిత డనన్యసామాన్యు డాయెను.

ఈ తరుణమున నాబ్రహాము స్టూఅర్టను నొక గొప్ప న్యాయవాదితో గలసిమెలసి దిరుగుచుండెను. అత డీ చిన్నవానిశక్తి యపారమని గ్రహించి 'నీ వేల న్యాయవిద్య నభ్యసింపరా దని' యడిగెను. ఆబ్రహా మెప్పటివలె వెనుదీసెను. అయిన స్టూఅర్టు మిక్కిలి ప్రోత్సాహపఱచి తా బుస్తుకము లిచ్చెదననిచెప్పి యాబ్రహామును సంమ్మతింప జేసెను. న్యూసే లమునం దాబి స్నేహితులెల్లరు నానందం బందిరి. అందఱు నతనికి సాహాయ్య మొనర్ప సిద్ధపడిరి. అతని వా గమృతంబున నోలలాడు మిత్రు లనేకు లతని విద్యాపరిశ్రమ దమ సౌఖ్యము జెఱచునని తలంచిరి. కొల్తపని జూచుకొనుచు న్యాయవిద్య గడించుట యనిన నెంత పరిశ్రమ, పట్టుదల, సౌఖ్యనిరసనములు గావలయునో వా రెఱు గరైరి. అయినను

శా. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాససంతప్తులై
   యారంభించి పరిత్యజింతు రురువిఘ్నా యత్తులైమధ్యముల్
   ధీరుల్విఘ్ననిహన్యమానులగుచున్ధృత్యున్న తోత్సాహులై
   ప్రారబ్ధార్థములుజ్జగింపరుసుమీప్రజ్ఞానిధుల్ గావునన్."

లింకను స్నేహితులతో వినోదప్రసంగముల నుండుట మాని వేసెను. ప్రతిసాయంకాలమును దేహపరిశ్రమ సేయుచుండు వాడు.. అద్దానినిగూడ వదలవలసినవా డయ్యె.పుస్తుకములకై యప్పుడప్పుడు స్ప్రింగుఫీల్డుకు నిరువదిమైళ్లు నడచిపోయి పెద్దపెద్ద గ్రంథముల నవలీలగ మోసికొనివచ్చుచు మార్గము నందె గొంతభాగము పఠింప దొడగెను. కొల్తపనుల బగలంతయు నొక్కొకతఱి గడపవలసి యుండును. అపుడు రాత్రి వేళల బహుకాలము చదువును. ఈవిధమున బట్టినపట్టు వదలక యనేకులు తరుణవయస్కులు వినోదముల నాటలు బాటల బుచ్చు ప్రొద్దెల్ల నితడు విద్యాభివృద్ధికై వెచ్చించెను. పగలు కొల్తపనిలో నుండునపుడుగూడ నతని మనము పుస్తుకములపై నుండును. తత్కారణముగ రాత్రి జదివినది పగలు పున:పఠనము గావించుచుండెను. కాయపుష్టి పూర్తిగ గలవాడు గాన నత డెంతపరిశ్రమ జేసిన నంతంత యనురక్తి దానియం దతనికి బుట్టుచుండెను.

ఆబ్రహాము దననియామకుల యోగక్షేమమును గుఱించి చట్టనిర్మాణసభలో సంపూర్ణహృదయముతో బనిచేసినందున వారు మరల 1836 వ సంవత్సరమున నతనినే నియమించు కొనిరి. ఇప్పటికతడు మిక్కిలి యభివృద్ధి జెందియుండెను. అతని యుపన్యాసము లుత్తమపదవి జేర నారంభించెను. అప్పటిసభయందలి నియమితసభ్యులును గొప్పవారేయై యుండిరి. బానిసలవిషయము చర్చ కేతెంచెను.

బానిసతనము నిర్మూలము చేయగోరువారు పత్రికల వ్రాసి యన్నిదిశలకు బంపుచు, ముక్తసీమలయందు బానిసపు బాపములగుఱించి యుపన్యసించుచు, నెచ్చట జూచిన బానిసలగష్టముల వర్ణించుచు బలువిధముల బాటుపడుచుండిరి. 'సీమదొరతనము' వారుగూడ వీరి నణప జూచుచుండిరి. ఇల్లినాయియందును వీరి జూచిన నల్లకల్లోలము గావించు చుందురు. వీరిలో ముఖ్యుడగు 'లవ్జాయి' యను నతడు 'బానిసము మానుద' మని యొక పత్రిక ప్రచురించి నందులకు గుండు దెబ్బ గుడిచి లోకాంతర గతు డై యుండెను.

ఇట్టి సమయమున జట్టనిర్మాణసభయందు దాస్యపరులైన కొందఱు దాస్యనిర్మూలకులకు వ్యతిరిక్తముగ గొన్నిచట్టముల నిర్మింప గట్టిగ బ్రయత్నంచిరి. బానిసతనము ప్రవృద్ధియగుటకు వలయుసాధనముల నేర్పఱుప జూచిరి. ఈ కార్యములు మిక్కిలి హేయములై యెట్టికట్టడీ బానిససీమకును నపకీర్తి తే గలిగియుండెను. అయిన దాస్యనిర్మూలకుల జడిపించి తమ కార్యము నెరవేర్ప బూనిరి. అనేకుల నాప్రకారము దమ వశుల జేసికొనిరి. ఆబ్రహాము మాత్రము లోబడకుండెను. మిక్కిలి కోపోద్దీపితు డై యా చట్టములనెల్ల సంపూర్ణముగ ఖండించెను. దాస్యపరులను వారికార్యములను బట్టరాని యుగ్రతతో నిరాకరించెను. దాస్యనిర్మూలకులలో నొక్కడు డాను స్టోను మాత్ర మతని జేరును. వీ రిరువురును జాగరూకతతో నొక విరుద్ధాబిప్రాయపత్రిక వ్రాసి యాచట్టము లన్యాయము లనియు లసంగతము లనియు ఖండించి యాసభ జర్చావిషయిక సంగ్రహపట్టికల లిఖింపించిరి.

1836 మొదలు 1838 వఱకు నా సభయందు స్వాతంత్ర్యమునకై వాదించుటం జేసి లింకను నిర్భయముగ మహా సామర్థ్యముతో న్యాయముకొఱకు బెనగువా డని దేశమునం దంతయు గీర్తిప్రఖ్యాతుల వడసెను.

1837 వ సంవత్సరమున లింకను న్యాయవాది యాయెను. ఆవృత్తియం దతడు సూపిన బుద్ధిచాతుర్యములును అతడు గడించిన కీర్తిప్రసిద్ధులును ముందు ప్రకరణమున వర్ణింప బడెడిని.

చట్టనర్మాణసభకు నతడు మఱి రెండుమారులు 1838-1840 లలో జయపరంపరలతో నియమింపబడెను. 1840 వ సంవత్సరము నియమింపబడినపు డా సభలో వాబాషుసీమ ప్రతినిధి యొకడు విధానలోపములని యనేక గష్టముల దెచ్చుచుండును. అందఱు నతని నణపలేక వెనుకముందు ద్రొక్కుచుందురు. లింకనునియామకులకు సంబంధించిన యొకానొక విషయము చర్చింపబడుచుండెను. వాబాషు ప్రతినిధి వెంటనే లేచి యిది విధానలోపకలితమని ఖండింప బ్రారంభించెను. దానికి బ్రత్యుత్తరముగ లింకను లేచి యీ ప్రకారము చెప్పదొడగెను.

"సభాద్యక్షా! ఈప్రతినిధిగారి యాక్షేపణవినిన నా పూర్వస్నేహితు డొక్కరుడు జ్ఞప్తికి వచ్చుచున్నాడు. అతడు వింతచూపుల ముసలివాడు. కనుబొమలు మిక్కిలి దట్టములై కనుల నావరించికొన జూచుచుండును. వాని క్రింద నాసికపై సులోచనముల జత యతని కలంకారముగ నొప్పుచుండును" (ఈవర్ణన విని ప్రతిసభ్యుడును వాబాషు ప్రతినిధింజూచి వర్ణితాంశములు సూటిపడుట గమనించెను) "ఆ ముదుకడు ఒకనాడు ప్రాత:కాలమున నిదుర లేచి బయటికివచ్చి యింటిముందఱి చెట్టుమీద నొక యుడుతంగాంచితి ననుకొనియెను. కావున దన చేతితుపాకి గొని దాని గాల్చెను. ఆయుడుత దీనికి లక్ష్యపెట్టినట్లు గనుపించ దాయె. అతడు మరల నొకమారు గాల్చె. ఫలంబు మొదటియ ట్లె యుండె. కాన నావృద్ధు మఱిమఱి గాల్చుచుండె. పండ్రెండుమాఱులు గాల్చి వేసవి ఫలసిద్ధి మార్గము గానక తుపాకి గ్రిందిడి ప్రక్కన నిలిచి చూచుచుండిన తన కుమారునితో "అబ్బాయీ! ఈ తుపాకి చెడినట్లున్నది" యనెను. వాడు తుపాకి బరీక్షించి చూచి "ఇం దేమియు దోషము గానరాదే. మీ యుడుత యెక్కడ" నని ప్రతిప్రశ్న సేసెను. దాని కా ముసలివాడు సులోచనముల దృష్టిసారించి చూచుచు "నీకు గనుపించ లేదా? చెట్టునడిమి కెగ బ్రాకినదే" యనెను. "లేదు నా కగుపడలే ద"నుచు నా బాలుడు దనతండ్రి ముఖముసూచి "ఓహో! తెలిసె. మీ ముక్కద్దముపై నుండు నొక పేనుం జూచి చెట్టుమీది యుడుత యనికాల్చుచున్నా ర"నియెను ఇదివిని యచ్చటి సభ్యులందఱు ప్రక్కలు వక్కలగునట్లు నవ్వ నారంభించిరి. అటుతరువాత నెప్పుడును వాబాషు ప్రతినిధి విధానలోపములని యాక్షేపించినవాడు కాడు.

లింకను దన కట్టెగుడిసె వదలిన పదిసంవత్సరములలో నిల్లినాయిలో మహాప్రసిద్ధి వడసెను. ఇచ్చట న్యాయవాదులలో బ్రాముఖ్యు డెవ్వడనిన నాసీమ జనులెల్ల రతనిన చూపుదురు.

1842 వ సంవత్సరమున ముప్పదిమూడు సంవత్సరముల వయస్సున నతడు హానరబిల్ రాబర్టు యస్. టాడ్ కూతురగు మేరి టాడును బెండ్లియాడెను. ఈవివాహమువలన నతనికి రాబర్టు, ఎడ్వార్డుసు, విల్లియము, థామసులను నలుగురు కుమారులు గలిగిరి. ఎడ్వార్డు బిడ్డగా నున్నపుడె చనిపోయె. విల్లియము పండ్రెండు సంవత్సరములవాడై వాషింగుటను పట్టణమున మృతినొందె. థామ నిరువదేండ్లవాడయి యిల్లినాయిలో బరలోక ప్రాప్తి జెందె. రాబర్టుమాత్రము తరువాత వాషింగనులో యుద్ధవిషయిక కార్యదర్శి యయ్యెను.

పదునైదవ ప్రకరణము

న్యాయవాదిత్వము.

లింకను న్యాయవాది యుద్యోగము ప్రారంభించినపు దతనియొద్ద నొక కాసైనను లేకుండెను. స్వారిసేయుటకు