ఆబ్రహాము లింకను చరిత్ర/ఆఱవ ప్రకరణము
గొంత శాంతపఱచెను. తుట్టతుద కా పుస్తుకపు వెలగ నాబ్రహాము జోషియా పంట గోయవలసి వచ్చెను. అనేక యకరముల విరివిగలిగి మనుష్యు నెత్తుగ బెఱిగిన పైరు గోయుట కాబ్రహా మియ్యకొని సాధారణముగ నొక మనుష్యు డైదు దినములలో జేయగలుగునంత పనిని మూడురోజులలో సంపూర్తి సేసి పెట్టెను. "ఇంతకష్టపడిన బడితిని గాక. నా కొక క్రొత్త గ్రంథ మబ్బెనే" యని యత డెల్లపుడు హర్ష మొందుచుండెను.
- ________
ఆఱవ ప్రకరణము
క్రొత్త తల్లి, క్రొత్త విద్యాలయములు.
1819 వ సంవత్సరమువఱకు థామసు ద్వితీయ వివాహ ప్రయత్నములు సేయలేదు. ఈ మధ్యకాలమునంత సారాగృహకృత్యముల నెరవేర్చుచుండెను. ఆబ్రహాము దన సోదరికి సాయ మొనర్చ నియమింపబడి యుండెను. గొప్పవా డెచ్చటను గొప్పవాడె గదా. ఇంటి పనుల నెరవేర్చుటయందతడు ప్రవీణు డాయెను. తరువాత నిరుగుపొరుగువారి గేహముల నతడు పనిసేయుచున్నెడ మిక్కిలి మెప్పు వడయుట కిదియె కారణ మాయెను. స్త్రీయాజమాన్యములేని గృహము శ్రీ దక్కియుండు ననుటకు సందియము వలదు. బిడ్డల యుడుపులు చినిగి వ్రేలాడుటకు బ్రారంభించెను. ఇంట వస్తువులుచూడ నింపులు గురుపించువిధమున నుండుట దూర మాయెను. పూరిగుడిసె నైనను వైకుంఠము చేయగల్గు నారీరత్నము లేమిజేసి యిల్లే యడవి యాయెను. కావున థామసులింకను భార్యాన్వేషణార్థము వెడలెను. కెంటకీ సీమసొచ్చి పూర్వము దన్ను వరించుటకు మారుగ జాన్‌సన్ అను నతని వరించి విధవ యై యుండిన "సాలీబుష్" అను నామెను వివాహ మాడెను. ఆమె కప్పటికి ముగ్గురు బిడ్డలు: జాన్, సారా, మటిల్డా. ఆ కాలమున కామె ధనవంతురాలు. మూడుకాండ్ల గట్టి యామె సామాను, ఆఱు కుర్చీలు, ఒకబీరువ, కొన్ని పెట్టెలు, బల్లలు, పరుపులు మొదలగునవి, ఇందియానాకు సాగింపబడెను. ఆబ్రహామున కివన్నియు నద్భుతము గలుగజేసెను. అదివఱకెన్నడు నంత సామాను దా జూచియెఱుగడు. మాఱుదల్లి పై నతని కప్పుడ ప్రేమాంకురంబులు చూపట్టెను.
"సాలీ", "నాంసీ" కంటె విశేషము విద్యాపరిశ్రమ గలది. దేహము గృహము మిక్కిలి యింపుగను శుభ్రముగను ఉంచుకొన బ్రయత్నించుచుండును. కావున దా లింకను కుటీరము సేరినవెంటనె దాని జక్క బెట్ట మొదలిడెను. నడు భూమి చదునుచేసి కవాటములును గవాక్షములును దీయించి కుర్చీలు బల్లలు దగువిధముగ నిలిపి యాగృహమునకు గ్రొత్త వన్నెదెచ్చెను. కొద్దిదినములలోపల నామె తెచ్చిన కాంతి జూచిన నామె సమర్థతయు, కార్య నిర్వాహకత్వమును దేట పడియెను.
ఇంతటిబుద్ధికౌశల్యమును, విద్యాసంపత్తియు, గల మాఱుదల్లి యింటి నలంకరించిన దిన మాబ్రహామునకు మహా సుదినము. ఆమె రాక యతనికి దల్లి మరణ మాదిగ నెప్పుడు లేని హర్ష మొసగెను. ఆమెను, ఆమె బిడ్డలను సంతోషముతో జేర్చుకొని వారిని మిక్కిలి యాదరణ ప్రేమతో స్వంతతల్లి సోదరుల తెఱగుననే గణింప దొడగెను. మొదట వచ్చినప్పు డా బిడ్డల యుడుపులు ముద్దుగ నుండెను. ఆబ్రహా ముడుపులును మాఱుదల్లి రాకచే నాప్రకారము సవరింపబడెను. ఆ బిడ్డ లాబ్రహామునకు సంపూర్ణ సోదరభావము చూపుటయేగాక యతని ప్రౌఢిమ కద్భుత మంది యతని గౌరవిచుచుందురు.
"సాలీ" యాబ్రహాముపై మిక్కిలి దయగల్గి ప్రేమతో బెంచుచుండెను. అతని విద్యాభ్యాసమున కామె మిక్కిలి తోడ్పడెను. అతడును జీవించినంతకాల మామెయం దనురాగము గనుపఱచుచుండును. ఆపె బిడ్డలును ఆబియు గలసి మెలసి చదువుచుందురు. లింకనుగూడ దగువిధమున విద్య గఱపిన నాబి గొప్పవా డగునని గుర్తింప నారంభించెను.
1819-20 వ సంవత్సరమునందు బ్రాప్తించిన గొప్పలాభ మాబికి మాఱుదల్లిరాక యొక్కటియగాదు. క్రొత్తబడి యొకటి దమ కుటీరమునకు రెండుమైళ్ల దూరమున నుంచబడెను. తల్లిదండ్రు లిద్దఱు నాబీని నచటికి బంప నిశ్చయించిరి.
జనులు విశేషముగ వచ్చి చేరియుండిరి. వారి బిడ్డల కొక విద్యాలయము గావలసివచ్చెను. కావున వా రొక పూరి గుడిసె నిర్మించి యుంచిరి. చక్కగ మనుష్యుడు నిలిచిన నాగుడిసె కప్పు దలదాకుచుండును. గోడ కన్నములే గవాక్షము లాయెను. మంట సేసికొనుట కొక ప్రక్కన ప్రొయి యొకటి సిద్ధముగ నుండెను. ఇట్టి సరస్వతీ సదనమున నాబ్రహాము గణితము నేర్చుకొనుటకు బంపబడెను. అతనితండ్రి వెదకివెదకి యొక ప్రాత గణిత పుస్తుకము నొకదానిని దెచ్చి యిచ్చెను. తల్లి క్రొత్త యుడుపుల గుట్టి యా బ్రహామునకు దొడగ నిచ్చెను.
అచట నాబి గణితమున బ్రవీణు డాయెను. వర్ణక్రమమున నద్భుతశక్తి సంపాదించెను. అయిన నప్పటి విద్యాలయము లన్నిటివలె నదియును గొన్ని వారములలోపల నగోచర మాయెను. ఆబ్రహా మిక రెండుతరుణముల మాత్రమె పాఠశాలల ముఖము సూచెను. మొత్తముమీద నతడు విద్యాలయములలోనుండినకాల మొక సంవత్సరమునకు మించదు. ఏ బడికి బోయినను, ఏయుపాధ్యాయునివద్ద నభ్యసించినను, ఆబ్రహా మచ్చట గల్గువిద్య నంతయు సంగ్రహింపక మరలినది లేదు. గురువుకు బ్రియత్వ మింత పెనచినవారును లేరు. అతని గుణాధిక్యము వెల్లడిసేయు నంశములు గిన్ని యిట వివరించెదము.
ఆబి క్రాఫొర్డు గారి బడిలో జదువుచుండెను. అచట నొక గోడకు బంధింపబడిన దుప్పికొ మ్మొకనాడు విఱిగిపడి యుండెను. పంతులవా రదిచూచి బాలురలో నొక్కరు డాపని సేసియుండనోపు నని తలంచి మఱునాడు వా రందఱు చేరినతరువాత 'ఎవ రీకొమ్ము విఱచి'రని యడిగెను. దానికి బ్రత్యుత్తరముగ నాబ్రహాము "అయ్యా! నే విఱచితిని. తెలియక దాని బట్టి యూగితిని. అది విరిగె. నే తప్పుసేయ నెంచ నైతి"" నని నిజము పలికి యుపాధ్యాయుని మెప్పు వడసెను. ఆత డెప్పు డనృత మాడినది లేదు. తన త ప్పితరుల పై నిడ జూచినది లేదు.
కూర్మము బట్టి వేధించుట యా బడిపిల్లలకు సర్వసాధారణము. దాని నణచివేయ నాబ్రహా మెన్నోప్రయత్నములు చేసెను. ఉపన్యాసములు వ్రాయుట యాపాఠశాలయం దాచా రము గాకున్నను 'జంతుహింస' ఖండించుచు జిన్న వాక్యములు మొదటమొదట వ్రాసి తరువాత నొక పెద్ద యుపన్యాసము వ్రాసి చదివెను. అతని జ్ఞాపకశక్తియు ననన్య సామాన్యము. చదివినభాగము లనేకము లొక్కవిధమున గథనము సేయుచుండును. అతనివాగ్ధోరణియు నపారముగ వృద్ధిబొంద దొడగెను. కవిత్వమునగూడ నతడు గొంచెముగొంచెము పరిశ్రమ సేయుచుండెను.
ఆబ్రహాము బాల్యమునుండి దయామయుడు. కొందఱు బాలు రొకతా బేటివీపున నగ్గినిడి దాని వేధించుచుండిరి. ఆ యగ్గి దనవీపున నిడిన నెంతబాధ గలుగునో యంతబాధ నొంది యతడు.
"అటు చేయకు మటుచేయకు" మని యఱచెను. అందొకడు "ఎటుచేయకు మెటుచేయకు" మని వెక్కిరించుచు నా తాబేటి నొక కఱ్ఱతో నడచెను.
"అంత శౌర్యము వలదు. నీ వీపున జిచ్చిడిన నీ వేలాగుందువో యోచింపు" మని యాబి నుడివెను.
దానికి మఱియొక:డు "ప్రయత్నించి చూడు" మని కేక లిడెను.
"ఆప్రకార మాజంతువు నలయించుట దౌర్జన్యంబును నీచత్వము నగు" నని యాబ్రహాము గట్టిగ బల్కెను. "కూర్మమాత్రమున కింతేల యఱచెదరని" యొక్కండు నివారింప జూచెను. అయిన నాబ్రహా మొక కొయ్యతో నా తా బేటిపై నగ్గిని ద్రోసివేసి పిడికిలిబట్టి ధిక్కరించుచు నా దెబ్బకు దాళజాలితివేని దాని నలయింప సమకట్టుమని యా బాలు నట్టె నెట్టివైచెను. కరుణా విహీను డగు బాలుడు "ఆహా! నీవంటి భీరు వీ జగంబున లేడు. నీ కా కచ్ఛపము సోదరుడు గా బోలు" నని హేళన మొనర్ప దొడగెను. "సోదరుడైన నగుగాక. నాయెదుట నీ విట్టి క్రూరకృత్యంబులు గావింపకుండు" మని యాబ్రహాము శాసించెను. ఇంతలో నొక కొందఱు బాలు రాతనితో నేకీభవించుటయు నా తా బేటి వేదన తీరిపోయెను.
ఒకానొకరోజు బడి తీరి విద్యార్థు లెల్లరును దమతమ యిండ్లకు వెడలుచుండిరి. అం దిద్దఱకు వర్ణక్రమ విషయమున నొక పోట్లాట ప్రారంభ మాయెను. కొంచెపుమాటలు పోయి కఠినోక్తులకు దిగి కఠినోక్తులుపోయి ముష్టియుద్ధము ప్రారంభ మగుగాల మాసన్న మాయెను. ఇది గమనించి యాబ్రహాము వా రిద్దఱి మధ్యజేరి వారి భుజములపై జేతులునిచి యందొక్కరుని "ఈపనికిమాలిన విషయమున కింత పోర నేటికి? రా రమ్మ"నియెను. వాడు "న న్నన్యాయముగ గల్లరి యననేల? నిన్ననిన నీ వూర కుందువే?" యనెను. తరువాత గొంత సంభాషణ జరిగినమీద నాబ్రహాము "మన మితరుల యారోపముల గైకొని యాగ్రహింపకున్న వా రూర కుందుర" ని బుద్ధి చెప్పెను. ఈ లోపల నా బాలులు ప్రశాంతులైరి. దుడుకుతనమున గల్లరి యనిన వా డాపదప్రయోగమునకు జింతించుట సూచింప నాబ్రహాము వానిని గొని యాడి మరల వారి నెప్పటివలె స్నేహితుల జేసెను.
ఏడవ ప్రకరణము
కృషి, సంపాదనలు.
ఆబ్రహాము లింకనున కిరుగుపొరుగున నుండు జనులెల్ల మిక్కిలి మూడులు. మన దేశమున గొందఱబలె మంత్ర తంత్రములయు దత్యాదరము గలవారు. మంత్రకారులు మంత్రకత్తెలు మనల దమ వశము చేసికొందు రనియు, నందులకు బ్రతిక్రియ వారి ప్రతిమల జేసి యవ్వాని వెండిగుండునం గాల్చుటయే యగుననియు నమ్ముచుందురు. ఎవడైన వేట వెడలునప్పుడు దారిని గుక్క యడ్డుపడిన మిక్కిలి కష్టసూచక మనియు, నద్దాని నివారణార్థము నడిమి వ్రేళ్ల బెనవేసి యా కుక్క కనుమఱగువఱకు లాగుకొనుచుందురు. కొందఱు మాంత్రికులు మంత్రపూరితదండముల గొని భూమిలోని ప్రజల ద్రవ్య సముదాయముల జూపెదమని జనుల భ్రమింప