ఆబ్రహాము లింకను చరిత్ర/ఐదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సించి నిత్యు, నిర్మలు గరుణాసముద్రు, ననన్యసామాన్యు సర్వేశ్వరు మనోవాక్కాయకర్మంబులచే దెల్పు గురుజనంబుల నరయు బ్రయత్నింపుడి.

ఐదవ ప్రకరణము

ఉల్లాసతర దినములు.

మృత్యువురాక గృహంబున గలుగజేసిన మార్పులకు వగచి యాబ్రహాము బహుకాలము దైన్యావలోకనముల బ్రసరింప జేయుచు ఖిన్నవదనుం డై యుండెను. మధ్యకాలమున మిక్కిలి యానందదాయి యగు విషయ మొక్కటి తటస్థింపకున్న నత డా స్థితియంద యుండియుండునేమో యని తోచుచున్నది. అతనితండ్రి యిరువదిమైళ్ల దవ్వున నుండు నొకానొక స్నేహితునింట 'పిల్గ్రిమ్సుప్రోగ్రెస్స'ను నొక పుస్తకము గని దాని దనకొమరున కియ్యదెచ్చెను. ఆబ్రహామా గ్రంథము గాన్పించినతోడనె చాల సంతసించి తండ్రి కద్దానిపేరును జదివి చెప్పెను. తండ్రియు నాపుస్తకపువిషయ మెన్నడో వినియున్నవాడు గాన దనపుత్రునకు సుగ్రంథ మలవడె నని పొంగి 'అబ్బాయీ! నీ వా పుస్తకమును జక్కగ జదువుము. అందలి విషయము మంచిది. నీకు మేలగు'నని కొడుకుచేతి కిచ్చెను. సామాన్యబాలురకు మంచిభోజన మనిన నెంతప్రీతియో యాబ్రహామునకు మంచి పుస్తుక మన్న నంత ప్రీతి. బహుకాలము దన మూడుపుస్తకములె చదువుచుండు నితని కీ పుస్తుక మొక నూతన సంతోష మొసంగెను. పట్టినది విడువక దాని నొక్కమారు చదివి రెండవమారు చదువునప్పటికి మఱొండు గ్రంథ మతనికి బ్రాప్తించెను. అది 'ఈసాఫ్స్ ఫేభిల్స'ను నీతికథామంజరి. దీని నతడు పలుమారు చదివెను. చదివిన యనేకభాగము లతని శిరోపేటికయం దట్టె నిలిచి పోయెను. కథల జదివి నీతుల స్మరించుటయం దతని మనము సంపూర్ణముగ మునిగి యుండెను. ఆ నీతుల నతడు ప్రాణమున్నంతకాలము జ్ఞాపక ముంచుకొని తదనుగుణముగ బ్రవర్తించుచుండెను.

ఇంతయానంద మిచ్చు పుస్తుకద్వయంబు చేదొరకిన బని పాటలమీద నతనికి దృష్టి గొంచము దక్కు వాయె ననిన నేమి వింత. తెలియనివా రీ లోపమును సోమరితన మని తలతురు. ఆప్రకారము యతని తండ్రి తలచి యతని పై గోపము సూపుచు వచ్చెను. విద్యావంతులు గాక విద్యవలని ప్రయోజనముల సంపూర్ణముగ నెఱుంగని మోటువారి కిది సహజము గదా. మన దేశమున నిక్కాలమున ననేకులు దలిదండ్రులు దమ పుత్రులకు బుత్రికలకు: జదు వనవసర మనియు జదువ నారంభించినవారు సోమరు లగుదురనియు నెన్నుచుందురు. ఇదెల్లయు దురభిప్రాయము. విద్య గడించుట యొకపనియనియు, దాన బుద్ధి సొరజేసి పాటుపడెడువారు సోమరులుగాక మహా గొప్పవా రనియు మనము నమ్మవలెను. విద్యయొక్క యావస్యకత నిట వ్రాయుటకు వీలుగాదు. ఆబ్రహాము లింకనె దీనికి దార్కాణ మగుగాక. విద్యాధికత హీనజన్ముల ననేకుల కలవడి యున్నది. అలవడ గలదు. సమర్ధతకును జన్మమునకును సంబంధము లేదు. ఎవ్వడు పాటపడునొ వాడు గొప్పవాడు గాగలడు. పరమేశ్వరుడు నిష్పక్షపాతి. తన సృజించిన జనులంద ఱతని కొక్కొటియ. ఎవడు గష్టించి సుగుణసంపత్తి జేర్చుకొని తన పాదారవిందముల గాంచు నతడ దనకు బ్రియపుత్రు డని దైవము ప్రసన్ను డగును.

తండ్రిగోపము సూచించినను ఆబ్రహాము వినయమున 'నిదె వచ్చితిని. త్వరితగతి బ్రయత్నించి యెంతపని యున్నను దీర్చెదను. త్రుటికాలమున నా చదువు ముగించి వచ్చెద' నని తండ్రిని కొంత యోదార్చుచుండును. తండ్రి దన గుమారుడు విద్యాపేక్షచే దన యుత్తరవుల నెరవేర్చుటయం దలసత సూపుచుండె నని తెలిసికొనలేక యాగ్రహము పూనినను బ్రేమాతిశయంబున నా యాగ్రహ మంత వెలువడ జేయుచుంట లేదు. ఆబ్రహా మింటెతలుపులమీదను గోడలమీ దను వ్రాయుచుండును. తండ్రి దీని జూచి కొంత కనలెను. అయిన గుమారు సామర్థ్యమువల్ల నగు సంతోష మాకోపము నణచివేయుచుండెను.

కొన్నిదినములమీదట నొక పొలమున నాబియు నతని తండ్రియు దున్నుచుండ నచటి కొక స్నేహితు డేతెంచెను. ఏతెంచి మట్టిలో జెక్కిన కొన్ని యక్షరముల గాంచి యవి యెవరు వ్రాసిరని యడిగెను. ఆబ్రహాము చిఱునగవున నూరకుండెను. అతని తండ్రి 'యాబి కార్యమై యుండును, మరే మున్న' దనియెను. అట వచ్చినమిత్రుడు 'ఆబి వ్రాయ లేదు గాబోలు'నని శంకించుచుండ నాబ్రహాము 'నేన వ్రాసితిని. కఱ్ఱదీసికొని యక్షరముల దీర్చితిని. ఆబి నాసంతకము' అని నుడువుచు నొకకఱ్ఱ దీసికొని మరల వ్రాయనారంభించెను. చదువుట విని వ్రాయుట కని యాగతుడు చాల ముదమంది 'ఆబి! చక్కగ వ్రాసితివి శబాస'ని యాబ్రహామును బుజ్జగించెను.

ఇందియానా నేలన ఆబ్రహాము నాడు వ్రాసినది చూడ ముందు నాతడు యునైటెడ్ స్టేట్స్ చరిత్రములో జెఱుపరాని దివ్యాక్షరముల దన నామము లిఖించుననుటకు సూచనగ నుండె నని మనకు గోచరింపక మానదు.

ఈప్రకారము పుస్తుక పఠనము పై దృష్టినిలిపి యాబ్రహాము గ్రొత్త పుస్తుకములు దనచేతి కబ్బినవి. బహు జాగ రూకతతో జదువుచు వచ్చెను. నీతికథామంజరి యతనికి దొరకిన రెండుసంవత్సరములలోపల మరి రెండుపుస్తుకములు లభించెను.

అందొకటి 'వాషింగ్టను' జీవితము. అతడు యునైటెడ్ స్టేట్సు మొదటి దేశాధ్యక్షుడు. స్వాతంత్ర్యార్థ యుద్ధమం దతడు ప్రధాన సేనానాయకుడుగ నుండెను. అతడు "యునైటెడ్‌స్టేట్స్‌తండ్రి" యని ప్రసిద్ధిగాంచెను. అతని చరిత్రము మా చదువరులు శీఘ్రకాలములోనె చదువ గలుగుదురు గాక. ఆబ్రహాములింకను బాలుడుగ నుండగ నా జీతమును మాటిమాటికి జదువుచుండెను. దాని ప్రతులు సంపాదించుట కై యాబ్రహాము పడినపా ట్లనేకములు గలవు. వీ మను నతడు వ్రాసిన చరిత్ర మొకటి యా ప్రాంతముల జోషియా వద్ద నున్నదని విని యతని దర్శించి దాని గొనితేబోయెను. పుస్తుకము పెరవుగొనువారు వాని మరల నియ్య కుండుట పలుమారు తటస్థించుచుండును. ఇచ్చినను విరూప మొందజేసి యుండుట సర్వసాధారణము. ఇతరుల సొత్తు దమసొత్తుంబోలె చూచుకొని జాగ్రత్త పుచ్చుకొనకుండుట యిద్దానికి గారణ మగుచున్నది. ఇట్టి యజాగ్రత్తవలన ననేకవిద్యాశాలలును, బుస్తుక భాండాగారములును, అనేకగ్రంథముల గోలు పోయినవి. అయిన నాబ్రహాము మేమరుపాటునకు లోబడు వాడు గాడు. తన ప్రాణముల గాపాడుకొనుతెఱంగున బుస్తుకముల గాపాడుకొనుచుండును. కావున నతడు జోషియాకు "అయ్యా! మీగ్రంథము నుపేక్షసేయక దాచి మంచి స్థితియందు గొద్దిదినములలో దెచ్చియిచ్చెద" ననిచెప్పి చాల సంతసమున నాపుస్తుకముం దీసికొని పోయెను. తనపని యంతయు నైనపిదప బ్రతి సాయంకాలము సంపూర్ణ మగ్నతతో నాగ్రంథము చదువుచు వచ్చెను. మధ్యకాలమున నెప్పుడొకనిమిష మవకాశమున్న నాపుస్తుక మవలోకించుటయంద దాని గడపుచుండెను. ఒకనాడు గాలివాన విశేషమైయుండి పని లేనందున దినమంతయు జదువుచునే యుండెను. పరుండ బోవు సమయమున దా జదువుపొత్తమును రెండుమొద్దుల మధ్యభాగమున దాచెను. రాత్రియందు గాలి ప్రబలి జల్లు గొట్టి యా పుస్తుక మంతయు దడిసిపోయెను. తెల్లవారి లేచి తన ప్రియవస్తు వా స్థితి నుండుటకు జాల చింతిల్లి జోషియాకు మొగముసూప సి గ్గగు గదాయని దు:ఖించి యత డేమిపని యడిగిన నాపనిచేసి యతని సంతోష పెట్టుద మని నిశ్చయించుకొని యతని జూడ వెడలెను. జోషియా యీవార్త వినినతోడనె మండిపడ జొచ్చెను. మధు పానపు మత్తు సహజ హృదయ కాఠిన్యమునకు సహకారి యాయెను. అయిన నాబ్రహామునుండి పనిదీసుకొను నాశ యతని గొంత శాంతపఱచెను. తుట్టతుద కా పుస్తుకపు వెలగ నాబ్రహాము జోషియా పంట గోయవలసి వచ్చెను. అనేక యకరముల విరివిగలిగి మనుష్యు నెత్తుగ బెఱిగిన పైరు గోయుట కాబ్రహా మియ్యకొని సాధారణముగ నొక మనుష్యు డైదు దినములలో జేయగలుగునంత పనిని మూడురోజులలో సంపూర్తి సేసి పెట్టెను. "ఇంతకష్టపడిన బడితిని గాక. నా కొక క్రొత్త గ్రంథ మబ్బెనే" యని యత డెల్లపుడు హర్ష మొందుచుండెను.

________

ఆఱవ ప్రకరణము

క్రొత్త తల్లి, క్రొత్త విద్యాలయములు.

1819 వ సంవత్సరమువఱకు థామసు ద్వితీయ వివాహ ప్రయత్నములు సేయలేదు. ఈ మధ్యకాలమునంత సారాగృహకృత్యముల నెరవేర్చుచుండెను. ఆబ్రహాము దన సోదరికి సాయ మొనర్చ నియమింపబడి యుండెను. గొప్పవా డెచ్చటను గొప్పవాడె గదా. ఇంటి పనుల నెరవేర్చుటయందతడు ప్రవీణు డాయెను. తరువాత నిరుగుపొరుగువారి గేహముల నతడు పనిసేయుచున్నెడ మిక్కిలి మెప్పు వడయుట కిదియె కారణ మాయెను.